దరిద్రులను
ఆదుకున్నవారు
ధరణిలో దరిద్రులౌతారా..?
అనాధలను
ఆదుకున్న వారు
అవనిలో అనాధలైపోతారా..?
ఔనంటుంది చరిత్ర
కాదనకుంది కాలం
అంతులేని దయాగుణంతో
దానకర్ణులుగా కీర్తి గడించిన...
తెలుగు వెండితెర మీద
ఒక వెలుగు వెలిగిన
చేతికి ఎముకలేని
మరపురాని మహానటి సావిత్రి...
అవసానదశలో దిక్కులేని
ధీన స్థితికి దిగజారిపోవడమేమిటి..?
రాత్రంతా కన్నీళ్ళతో స్నానం చేసి
ఉదయం షూటింగ్ లో పాల్గొని
అనేక చిత్రాలలో నటించిన
ధియేటర్లలో ప్రేక్షకుల్ని
కడుపుబ్బ నవ్వించిన
హాస్య చక్రవర్తి రాజబాబు
(పుణ్యమూర్తుల అప్పారావు)
కట్టుకుపోయిన పుణ్యమేమిటి?
అయ్యో పాపమంటూ వారు
ఆర్జించినదంతా పరులకు పంచి
కుటుంబాలకు దూరమై
కుమిలిపోయి
త్రాగుడుకు బానిసలై
తనువును చాలించడమేమిటి?
ఇదేనా తనకు మాలిన ధర్మం
మొదలు చెడ్డ బేరమంటే...?
ఆకలికి అలమటించే అనాధలమీద
నిరుపేదలమీద నిస్సహాయులమీద
అతి జాలిని ...అతి ప్రేమను...
అతి దయను చూపడం..?
కష్టాల్లో ఉన్నవారిని
కన్నీరు కార్చేవారిని చూసి
కరుణతో కరిగిపోవడం ఒక పాపమా..?
అదే వారు చేసిన ఘోరమైన నేరమా..?
ఇది వారి స్వపరాధమా...?
లేక ఏదైనా శక్తి శాపమా...?
ఎవరికి తెలుసు...?
సృష్టి స్థితి లయలకు
కారణభూతుడైన ఆ పరమాత్మకు తప్ప..!



