Facebook Twitter
మూర్ఖుల రాజ్యం..?

అందరూ మెట్లెక్కితే...
తాను మాత్రం లిఫ్ట్ లోనే
వెళ్ళాలని భావించేవాడు...

ఏ కాలక్షేపం లేక
ఏ టీవీకో...ఏ సెల్లుకో 24/7
"లక్కలా" అతుక్కు పోయేవాడు...

తను తప్పులు చేసి
ఇతరులను నిందించేవాడు...
తాను విషం త్రాగి
ఇతరులు మరణించాలనుకునేవాడు...

తానెప్పుడూ సురక్షితమైన
జోన్ లోనే ఉండాలనుకునే వాడు...
తనను చిన్న చీమైనా కుట్టరాదని...
తనపై చిన్న దోమమైనా వాలరాదనేవాడు..

జీవితంలో ఏ లక్ష్యం లేనివాడు...
ఆవగింజంత శ్రమకూడా చేయనివాడు...

ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని...

 అంతరిక్షంలో తిరగాలని ఆశించేవాడు...

పగటి కలలెన్నో కంటూ
క్షణాల్లో అద్భుతాలు జరిగిపోవాలని...

తపించేవాడు...జాతకాలు జపించేవాడు...

అట్టి వాడెవడైనా
ఈ భూమి మీద వుంటే...!
వాడు వెర్రివాడే...
వాడు వెయ్యి తలల నాగరాజే...!
మూర్ఖుల రాజ్యానికి
వాడొక మకుటంలేని మహారాజే...!