Facebook Twitter
రక్షా బంధన్ ...రక్త సంబంధం

అన్నాతమ్ముళ్లుగా అక్కచెల్లెలుగా ఓ చల్లనితల్లి
గర్భాన జనియించడమే పూర్వజన్మసుకృతం

ఆ చిన్ననాటి
ఆ అల్లరిచేష్టలు ఆ కోపతాపాలు
ఆ కిల్లికజ్జాలు ఆ కొట్లాటలు 
ఆ అలకలు ఆ బుజ్జగింపులు
ఆ ఏడ్పులు ఆ ఊరడింపులు
ఆ కిలకిలా నవ్వులు ఎన్నటికీ
ఎప్పటికీ మరిచిపోలేని మధురజ్ఞాపకాలే అందరికీ

కాలచక్రం గిర్రున తిరగ్గానే
వయసురాగానే‌ ఆ రక్తసంబంధాలే
అంతులేని ప్రేమానురాగాలుగా
ఆప్యాయతలుగా అభిమానాలుగా మారి
విడిపోని అనుబంధాలౌతాయి
చెరిగిపోని ఆత్మీయబంధాలౌతాయి
... అదే అదే నిజమైన రక్తసంబంధం

రాఖీ పౌర్ణమినాడు బంగారురంగు దారాలతో
అల్లిన రాఖీలు చేతికికట్టగానే అన్నాతమ్ము ళ్ల
ముఖాలు వెయ్యి ట్యూబ్ లైట్లుగా వెలిగిపోతుంటే
రాఖీసాక్షిగా ప్రమాణం చేస్తారు దీవిస్తారు
ఓ అక్కా ఓ చెల్లీ ! ఓ మా బంగారు తల్లులారా ! భయపడకండి ! ఈ రాఖీహస్తాలే!  మీకు రక్షణకవచాలని !

రాఖీ పౌర్ణమినాడు అన్నాతమ్ముళ్లు పెట్టే నూతన వస్త్రాలు
ఇచ్చే ఖరీదైన బహుమతులు చూడగానే అక్కాచెల్లెళ్ల
ముఖాలు నింగిలోని చంద్రబింబాల్లా వెలిగిపోతువుంటే
మనసులో ముక్కోటి దేవుళ్ళకు మొక్కి ప్రార్థిస్తారు
ఒరే అన్నయ్యాలూ ! ఒరే తమ్ముళ్ళూ !
మీరు విజయశిఖరాలను చేరుకోవాలిరా!
మీరు తలపెట్టిన ప్రతికార్యం సఫలమవ్వాలిరా...అని
...అదే అదే నిజమైన రక్షాబంధన్