Facebook Twitter
ఆర్జిస్తే ఆస్తి - నిద్ర నాస్తి

పచ్చడిమెతుకులు తింటేనేమి
అర్దాకలితో ఉంటేనేమి
గుడ్డిదీపం వెలుగులో
గురకలుపెట్టి హాయిగా
ప్రశాంతంగా నిద్రపోతున్నాడు 
పూరిగుడిసెలో నిశిరాత్రి వేళ ఓ నిరుపేద !

ఇంటికి కాపలా కాసే
కుక్కసైతం పీకలదాకా మెక్కి
కాసేపు కునుకు తీస్తుంది

కానీ ఖర్మకాలి అదిగో ఆ
ఏడంతస్తుల ఇంద్రభవనంలో
కళ్ళముందే నోరూరించే
కమ్మని పదార్థాలెన్ని ఉన్నా
అన్నీ తినాలనిపిస్తున్నా
ఏమీ తినలేక ఏంచెయ్యాలో
అర్థంకాక ఎవరికీ చెప్పుకోలేక
ఆకలికి అలమటిస్తున్నాడు
నిరాశతో నిట్టూరుస్తున్నాడు

సుఖనిద్రను...
సంపూర్ణ ఆరోగ్యాన్ని...
ప్రశాంతమైన జీవితాన్ని...
కోట్లున్నా సరే కొనలేక
కంటిమీద కునుకులేక
కుమిలిపోతున్నాడు ఓ అపరకుబేరుడు !

కారణం ఒక్కటే
అక్రమంగా ఆర్జించి
పట్టు పరుపుల కింద
దాచుకున్న ఆ ధనాన్ని
పరులెవరైనా కాజేస్తారేమో ?
దొంగలెవరైనా దోచుకుంటారేమో?
అన్న ఒకేఒక్క,"చోరభయంతో"... ఔనిది
నిజమే దొంగల్ని దోచుకునే దొంగలుంటారుగా !