మనం మన పిల్లలను
తిట్టరాదు
కొట్టరాదు
భయపెట్టరాదు
వెటకారంగా
వ్యంగంగా
ఎగతాళిగా
వెకిలిగా పిలవరాదు
నలుగురిలో తక్కువచేసి మాట్లాడరాదు
ఉలిక్కిపడేలా
ఉక్కిరి బిక్కిరయ్యేలా
ఊపిరాగిపోయేలా దండించరాదు
నీవు వెర్రివెంగళప్పవు నీవొట్టిశుంఠవు
నీవు ఎందుకూ పనికిరాని ఎద్దువు
తుమ్మ మొద్దువు అంటూ శపించరాదు
అదిరిపోయేలా
బెదిరిపోయేలా
ఆలోచనలన్నీ చెదిరిపోయేలా
గజగజ వణికేలా గద్దించరాదు
దీనంగా దిక్కులు చూసేలా
కుమిలిపోయేలా కృంగిపోయేలా
ముచ్చెమటలు పట్టేలా పారిపోయేలా
హూంకరించి హెచ్చరికలు జారీచేయరాదు
ప్రేమతో పలకరించాలి
బుజ్జగించాలి బుద్దిచెప్పాలి
చేతిలో చెయ్యేసి ధైర్యం చెప్పాలి
చిరునవ్వుతో దగ్గరకు తీసుకోవాలి
భేష్...అంటూ భుజం తట్టాలి
శహభాష్...అంటూ వెన్నుతట్టాలి
కత్తుల్లానూరి పదును పెట్టాలి ముందుకు నెట్టాలి



