Facebook Twitter
ప్రజలు నిజాన్ని మార్చలేరు.. నిజమే ప్రజల్ని మారుస్తుంది!

నేను నమ్మినట్టు నమ్ము లేకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు అంటూ ఇవ్వాళ నిన్ను భయపెట్టేవాడు రేపు  నేను నమ్మినట్టు నమ్ము లేకపోతే నేను నిన్ను చంపేస్తాను  అని తప్పక బెదిరిస్తాడు. అందుకు అతను ఏమాత్రం వెనుకాడడు' అని అన్నాడు భావ విప్లవ జ్వాలలు రగిలించిన  వోల్టేర్‌

''మనకు లభించిన మత గ్రంథాలన్నీ ఎవరెవరో వేలమంది రాసినవి. విడగొట్టబడి, జోడించబడి, అనువదించబడి, చెడగొట్టబడి.. ఒక్కోసారి సరి చేయబడి - ఒకరికి ఒకరు తెలియకుండా శతాబ్దాల కాలంలో మార్పులు, చేర్పులు చేయబడుతూ, కాపీ చేసేవారి తప్పుడు రాతలతో భద్రపరచబడుతూ మనదాకా వచ్చాయన్న మాట! విజ్ఞాన శాస్త్రాల గ్రంథాలకున్న ప్రామాణికత వీటికి ఉండదు. దేవుడు ఒక నమ్మకం ఎలాగో, అతని చుట్టూ తిరుగుతూ వచ్చిన అతని లీలలనుకునే మత గ్రంథాలు కూడా నమ్మకాలే!'' అని అన్నారు విశ్వ విఖ్యాత వైజ్ఞానిక రచయిత రిచర్డ్‌ డాకిన్స్‌. ''మూర్ఖత్వాన్ని మహౌన్నతంగా చిత్రించడం నన్ను చాలా బాధిస్తుంది!'' అని అన్నారు మరో విశ్వ విఖ్యాత వైజ్ఞానికుడు, రచయిత కార్ల్‌ సాగన్‌. ఒకసారి ''మతాన్ని నేనెందుకు నమ్మాలీ?'' అని అమాయకంగా అడిగాడు ఒక భక్తుడు. అందుకు మత బోధకుడు ప్రశాంతంగా జవాబిచ్చాడు..

''మతం భయం మీద కాదు నాయనా! ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది'' అని అన్నాడు. భక్తుడికి నమ్మకం కుదరక మళ్లీ అడిగాడు. ''అయినా సరే! నేను మతాన్ని నమ్మకపోతే ఏమవుతుందీ? అని. మత బోధకుడికి చిర్రెత్తుకొచ్చింది. అయినా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ప్రశాంతంగా జవాబిచ్చాడు.

''నరకంలో నిట్టనిలువుగా కాల్చివేయబడతావు నాయనా!'' అన్నాడు. ధైర్యంగా ప్రశ్నించిన భక్తుడి మెదడులో భయం తిష్టవేసింది. అయోమయమై పోయి, గందరగోళంగా దిక్కులు చూశాడు. అరమోడ్పు కన్నులతో మత బోధకుడు తన విజయ గర్వాన్ని ప్రసన్నంగా జారవిడిచాడు. అలా మత బోధకులు జనాన్ని భయపెట్టి వశపరుచుకుంటారు.

 ఇక్కడ వేదాలు, పురాణాలలోని అంశాలు కొన్ని నిశితంగా పరిశీలిద్దాం!

 ''స్త్రీలు పుత్రుల్నే కనాలి - నారీ! పుత్రుణ్ణి కను! మరొకసారి పుత్రుణ్ణి కను! పుత్రుల్ని కంటూ ఉత్తమ సతివి కా!'' మరి తర్వాత కాలంలో పుత్రుల్ని కనడానికి మరో 'నారి' (స్త్రీ) ఎప్పుడు పుట్టాలో వేదాల్లో లేదు. అయినా సమాజం వైజ్ఞానికంగా ఇంత ప్రగతి సాధించిన తర్వాత - నారీ పుత్రుణ్ణి కను - అనే మాట ఎంత అర్థరహితమో కొంచెం మెదడు ఉపయోగించిన వారికి తెలుస్తుంది. స్త్రీలో ఎక్స్‌ ఎక్స్‌క్రోమోజోములుంటే, పురుషుడిలో ఎక్స్‌వై క్రోమోజోము లుంటాయి. పురుషుడు ఎక్స్‌ క్రోమోజోమ్‌ ఇస్తే అది స్త్రీలోని ఎక్స్‌ క్రోమోజోముతో కలసి ఎక్స్‌ ఎక్స్‌ ఆడ శిశువుకు జన్మనిస్తుంది. అలా కాకుండా పురుషుడు తన వై క్రోమోజోమ్‌నిస్తే అది స్త్రీలోని ఎక్స్‌ క్రోమోజోమ్‌తో కలిసి ఎక్స్‌ వైతో మగ శిశువు పుడుతుంది. పుట్టబోయే శిశువు లింగ నిర్ధారణ పురుషుడి వల్ల జరుగుతుంది. అందువల్ల మగ పిల్లవాణ్ణి కనలేదని కొందరు మూర్ఖులు భార్యల్ని దూషించడం చాలా పొరపాటు. ఇప్పుడు ఆలోచించండి.. వేదాలలో ప్రాథమిక వైజ్ఞానిక అంశాలు కూడా లేనిది అవి మన అత్యాధునిక జీవనానికి ఎలా ప్రామాణికాలవుతాయో?

ఇంకా వేదాలలో ఉన్న మరికొన్ని అంశాలు చూడండి.. 1. స్త్రీల బుద్ధి కొంచెముది 2. బిడ్డల్ని కనని స్త్రీ తన పాపాల వల్ల వంద్యురాలు (గొడ్రాలు) అవుతుంది. మంత్రాల వల్ల ఆమె మళ్ళీ గర్భం దాలుస్తుంది. 3. పురుషుడు స్త్రీ భాగాన్ని సుఖపెడతాడు - ఇందులో తనూ సుఖపడతాడు అనే వాక్యం లేదు. ఏమైనా ఈ హీనమైన ఆలోచనల్ని, అహేతుకమైన భావనల్ని ఆధునిక ఆలోచనాపరులు ఎవరైనా సమర్థిస్తారా? స్త్రీలను కొన్ని శతాబ్దాలుగా విద్యకు, ప్రపంచ జ్ఞానానికి దూరంగా అణిచిపెట్టి, వారి 'బుద్ధి కొంచెముది' అనడంలో ఔచిత్యం ఉందా? ప్రపంచ గతిని మార్చిన ప్రతిభాశాలురలో పురుషులతో పాటు స్త్రీలు కూడా దూసుకొస్తున్న విషయం తెలియని అతి ప్రాచీన యుగాల రాతలు ఇప్పుడెలా ప్రామాణికం అవుతాయి? ''అన్నిటికీ కర్త పురుషుడు. లోకం అంతా పురుషుడిది. పురుషుడి సేవ కోసమే స్త్రీలు ఉన్నారు'' అని వేదాలు ఘోషించాయి. ఇక్కడ పురుషుడి సేవకు ఒక స్త్రీ కాదు. స్త్రీలు ఉన్నారు అని చెప్పబడింది. దీని ప్రభావం వల్లనే చక్రవర్తి, రాజు, జమీందారు, దొర లాంటి వారు వందల మందిని భార్యలుగా చేసుకోవడం చూశాం. బహు భార్యత్వం పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో ఉన్నాడు. పురుషుడు తన ఆధిక్యతను చాటు కోవడానికి అదొక లక్షణంగా కీర్తించబడింది కదా? ఆధునిక, వాస్తవిక సామాజిక జీవనం అలాంటి వాటికి అడ్డుకట్టవేసింది. మారుతున్న జీవనంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పురాణాలలో కూడా మార్పులు వచ్చాయి. శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడు అని రాసుకోవాల్సి వచ్చింది.

''శత్రువులు! శత్రువులు!! శత్రువులు ఎవరంటే ఆవుల మందల్ని తోలుకుపోయే వాళ్ళు శత్రువులు. యజ్ఞయాగాదుల్ని వ్యతిరేకించేవారు శత్రువులు. అలాగే దేవతల్ని వ్యతిరేకించేవారు కూడా పరమ శత్రువులు. వారే మాయావాదులు'' అని రాసుకున్న వేద రచయితలు. దేవతల్ని తిరస్కరించే మాయావాదులను ఏం చేయాలన్నది కూడా రాసిపెట్టారు. వాళ్ళు మాయావాదులని ఎవరిని అంటున్నారూ? దేవతల్ని తిరస్కరించిన వారిని! దేవతల్ని తిరస్కరించిన వారు ఎవరూ? చార్వాకులు, నిరీశ్వరవాదులు, హేతువాదులు, ప్రశ్నలు సంధించగల ధైర్యవంతులు! ''వీరిని కాలే కర్రలతో కుళ్ళబొడవాలి. రంపంతో నరికినట్టు కుక్కలతో పీకించాలి'' అని వేదాలలో ప్రకటించి ఉంది. అంటే అభిప్రాయ బేధాలుంటే వారిని మట్టుబెట్టాలని స్పష్టంగా ఉంది. అక్కడక్కడా రుషులకు, నాస్తికుల మీద ఉండే క్రోధం వేద సాహిత్యంలో కనిపించడం సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే ఆ రోజుల్లో కూడా యజ్ఞాల్ని, ఇంద్రుణ్ణి, ఇతర దేవతల్ని తిరస్కరించే నిరీశ్వరవాదులైన 'మాయావాదులు' ఉన్నారని తెలుస్తూనే ఉంది. అంటే ప్రశ్నించడం అనేది అప్పటికే ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రశ్నను మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు మనం నిరంతరం కృషి చేస్తుండాలి! రాముడి ఆస్థానంలోనే రాముణ్ణి, వశిష్టుణ్ణి, ఆంజనేయుణ్ణీ అందరినీ కలిపి తీవ్రంగా విమర్శించినవాడు ఓ నాస్తికుడు.. అతనే జాబాలి! మతం దేవుడిపై ఆధారపడుతుంది. ధర్మం - జ్ఞానంపై ఆధారపడుతుంది. ఇప్పుడు - నిజాలు చెప్పే వాస్తవిక వాదిని ద్వేషిస్తున్నారు. అతనిపై రాళ్లు విసురుతున్నారు. కానీ, అదే అబద్ధాలు చెప్పే మత బోధకుణ్ణి, బూర్జువా రాజకీయ నాయకుణ్ణి విశ్వసిస్తున్నారు. అంటే మనమింకా ఏ సమాజంలో ఉన్నాం? - అనేది ఆలోచించుకోవాలి కదా? ఇప్పుడు బుక్కెడు అన్నం పెట్టి ఆకలి తీర్చలేని దేవుడు రేపు స్వర్గం తీసుకుపోతానంటే ఎవరికి కావాలీ?

 రాముడు స్వచ్ఛమైన మద్యము చేతితో తీసుకుని, ఇంద్రుడు శచీదేవికి తాగించినట్టు సీతకు తాగించెను. (రామాయణం, ఉత్తరకాండ: 42-18) మంచి నేర్పుగల సౌందర్యవంతులైన నృత్య సంగీతాలలో నైపుణ్యమున్న స్త్రీ మధుపానమునకు వశులై, రామునితో నృత్యము చేసిరి. (రామాయణం, ఉత్తరకాండ: 42-21).. ఇవి వాల్మీకి రామాయణంలోని సంగతులు. ఇలాంటి అంశాల్ని ఎందుకు కప్పిపెట్టారు? కల్పిత పాత్ర అయిన రాముడి ప్రభ తగ్గిపోతుందని భయపడ్డారా? ఎవరికి వారు విశ్లేషించుకోవాలి!

భార్యల్ని వదిలేసినోళ్ళు చాలా గొప్పవాళ్ళయ్యారు. ఉదాహరణకు రాముడు దేవుడయ్యాడు. మోడీ ప్రధాని అయ్యాడు - ''ఏదీ కానక్కరలేదు మనుషులైతే చాలని'' - మన మంటున్నాం! ''సొంత ఇల్లు చక్కదిద్దుకోలేని వాడెవడూ దేశాన్ని ఉద్ధరించలేడు'' అని స్వయంగా బీజేపీ నాయకుడు నితిన్‌ గడ్కరీయే ప్రకటించారు. ముస్లింల త్రిబుల్‌ తలాక్‌ గురించి మాట్లాడిన దేశ ప్రధాని, వివాహితులైన హిందువులు.. భార్యల్ని వదిలేయడం గురించి కిమ్మనలేదు. మరి ఆయన ఏ సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడుతున్నట్టూ?

వేదాలలో ఉన్న ఒక కథను పరిశీలిద్దాం.. ఈ కథలో ముగ్గురు రుషులు ఉంటారు. వారి పేర్లు ఏకత్రుడు, దిత్రుడు, త్రితుడు. ఈ ముగ్గురు రుషులు అడవిలో ప్రయాణిస్తూ ఉండగా వారిలో ఏవో బేధాభిప్రాయాలు వస్తాయి. ఇద్దరు రుషులు ఒక్కటై, మూడోవాణ్ణి ఓ పాడుబడ్డ బావిలోకి తోసేస్తారు. సులభంగాపైకి రాకుండా బండి చక్రాలతో బావిని మూసేస్తారు. అలా చక్కా పోయిన వారు, ఇక్కడ బావిలో పడి ఉన్నవాడూ అందరికందరూ గొప్ప రుషులే! బావిలో పడ్డవాడికి ఏం పని ఉంటుందీ? తన దురదృష్టానికి బాధపడుతూ కాలం గడుపుతుంటాడు. ఆ బాధ ఎందుకంటే తనను వదిలేసి పోయిన వారిలాగా తను ధనార్జన చేయలేకపోతున్నానని వారిలాగా స్త్రీ సుఖం పొందలేకపోతున్నానని.. ఇక తన బతుకు అలాగే ముగిసిపోతుందేమోనని భయం! చావుకి సిద్ధపడుతూ కూడా ధనం మీద వ్యామోహం. సుఖం మీద మోజు.. మరి వీరు వేటిని జయించి గొప్ప రుషులయ్యారో మనకు మాత్రం అంతుపట్టదు. సరే బావిలో పడ్డ త్రితుడు బృహస్పతిని ప్రార్థించగా ప్రార్థించగా ఆయన అక్కడికి వచ్చి త్రితుణ్ణి బయటికి తీస్తాడు. బయట పడగానే ఏం జరిగిందన్నది వదిలేద్దాం. ధన కామ వ్యామోహాల్లోంచి బయట పడనివారు గొప్ప రుషులెట్లా అయ్యారో.. వారి ఆలోచనలు అంత నీచంగా ఉంటే వారు మహానుభావులెట్టా అయ్యారో వేదాలు విపులంగా చెప్పలేకపోయ్యాయి. ఏ రకంగానూ నేటి ఆలోచనా విధానానికి వేదాలు సమాధానమివ్వలేవు కాబట్టే.. అవి అత్యంత ప్రాథమిక రచనలు కాబట్టి, మానవీయ విలువల్ని ఏ మాత్రం స్థాపించలేకపోయాయి కాబట్టే అవి ప్రామాణికం కావు - అని మన మంటున్నాం. ''పనికి మాలినట్టి పాత శాస్త్రము లెల్ల / ఎంత చదువుకున్న ఏమి ఫలము / ఊక దంచుకున్న నూకలు రాలునా? / నవయుగాల బాట నార్ల మాట'' అని అన్నది ఆధునిక కవి అభిప్రాయం.

 మరి ఆ వేదసారాన్ని వంట బట్టించుకున్న మూర్ఖులు ఈ రోజు ఏం చెపుతున్నారు? వారి ఆలోచనల్ని వ్యతిరేకించే నిరసనకారుల్ని కుక్కల్లా కాల్చేయమంటున్నారు. అసహనం తెలియజేసే వారెవరో, వారు వేసుకున్న దుస్తులే చెపుతాయని సూచన ప్రాయంగా తెలియజేస్తున్నరు. అందువల్ల మానవ సమాజాన్నీ, మానవీయ విలువల్ని ఇప్పుడు అధికారంలో ఉన్న దేశ నాయకులు రక్షించగలరని ఎలా అనుకుందాం? వేదాలు ప్రామాణికం అని చెప్పేవారు, రాముడికి మందిరం కడతామంటున్నావారు తోటి మానవుల్ని మనుషులుగా పరిగణించలేక పోతున్నారే? దేశభక్తి సంస్కృతి, సంప్రదాయం పేర దేశ ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నారే? మోసపూరితంగా అత్యున్నత పదవులు అధిష్టించి జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారే? అయితే ఇది ఎంతో కాలం సాగదు - ఇప్పుడు దేశమంతా ఒక్కటయ్యింది! నిజాన్ని గ్రహించింది!! యువతరం పిడికిలి బిగించింది.

- డాక్టర్‌ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.