Facebook Twitter
మానవుడే అన్నింటికీ ప్రమాణం!

కమ్యూనిస్ట్‌లు, కాంగ్రెస్‌వారూ భారతీయులంతా బ్రిటిష్‌ వారితో పోరాడి స్వాతంత్య్రం సాధిస్తే, స్వతంత్ర పోరాటంలో సంబంధంలేనివారు ఈ రోజు జాతీయత పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు.

- తీస్తా సెతల్వాద్‌, పౌరహక్కుల కార్యకర్త

ఒక లాయరు నలభైఆరు మంది దోషుల్ని ఉరిశిక్ష నుండి విడుదల చేయించాలని కోర్టులో సీరియస్‌గా వాదిస్తున్నారు. లాయర్‌గారి అసిస్టెంట్‌ చిన్న చీటి తీసుకొచ్చి ఇచ్చాడు. అదిచూసుకుని లాయర్‌గారు దాన్ని జేబులో పెట్టుకుని, తన వాదన కొనసాగించారు. ఇంతలో లంచ్‌టైం అయ్యింది. వాదిస్తుండగా మధ్యలో వచ్చిన చీటిఏమిటని న్యాయమూర్తి లాయర్‌ను అడిగాడు. ''నా భార్య చనిపోయింది జడ్జిగారూ...'' అని చెప్పాడు లాయరు దీనంగా. జడ్జిగారు ఆశ్చర్యపోయి ''ఇంకా ఇక్కడేం చేస్తున్నారూ? ముందు వెళ్ళండి. ఇంటికి వెళ్ళండి!'' అని అరిచినంత పనిచేశాడు జడ్జి.
''అయ్యా! నేను వెళ్ళినా భార్య ప్రాణాలు తీసుకురాలేను. ఇక్కడ ఉండి వాదించి, నలభై ఆరు మందిని ఉరిశిక్ష నుండి రక్షించగలనేమో కదా?'' అని అన్నాడు లాయర్‌ ఆశగా...
అది విన్న బ్రిటిష్‌ జడ్జి నలభైఆరుమందిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
ఆ నలభై ఆరు మందీ స్వాతంత్య్ర సమరయోధులు! ఆ లాయరు మరెవరో కాదు, డాక్టర్‌ బీమ్‌రావ్‌ అంబేద్కర్‌!

ఈ స్థాయి దేశభక్తి ఉంటుందని నేటి ఈ కాలపు ఈ ''దేశభక్తుల''కు కనీసం అర్థమవుతుందా? ఏమో? అనుమానమే... అంబేద్కర్‌ సాక్షిగా ఆలోచనా పరులు మొదలు పెట్టిన శాంతి ఉద్యమ కాగడాను ప్రజలు అంది పుచ్చుకోవాల్సి ఉంది.

''బలవంతంగా ప్రపంచ దేశాల అధినేతల్ని కౌగలించు కోవడం వల్ల, ఫారెన్‌ పాలసీ నిర్ణయాలు సఫలం కావని ఈ పాటికి మన ప్రస్థుత భారత ప్రధానికి అర్థమై ఉండాలి! ఆహ్వానం లేకుండానే బిర్యానీ విందులకు దూసుకు వెళ్ళడం వల్ల దేశాల మధ్య సుహృద్భావం పెరగదు. కనీసం దేశానికి ఇప్పటి వరకు ఉన్న గౌరవమైనా ఉండదు'' అని తీవ్రంగా విమర్శించారు భారత మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌. ఇటు దేశ అంతర్గత సమస్యల మీద, అటు విదేశాంగ విధానాల మీద కనీస పరిజ్ఞానంలేని నేతలు ప్రచారానికి, ప్రాచుర్యానికే తెగ ప్రయత్నిస్తుంటారు మరి!

అత్యధిక జనాభా ఉన్నందువల్ల, భారతదేశాన్ని 'హిందూ రాష్ట్ర'గా మార్చడానికి వీల్లేదని సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. అత్యధిక జనాభానే ముఖ్యమయితే... నెమలికి బదులు కాకిని మన జాతీయ పక్షిగా ప్రకటించాలి. అన్యాయాన్ని మనమంతా నిరంతరం ప్రశ్నిస్తూనే ఉండాలని ఆయన అన్నారు. సామాజిక ఉద్యమకారిణి, జర్నలిస్ట్‌ గౌరీలంకేశ్‌ హత్య జరిగిన వెంటనే హంతకులు సంబరాలు చేసుకుంటే ప్రధాని మోడీ ఏం చేస్తున్నట్టూ? పనికిరాని భాషణ్‌లు ఇచ్చే మోడీ, ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారూ? అని ప్రశ్నించారు ప్రకాశ్‌రాజ్‌. భారత్‌ హిందూ దేశంగా మారాలంటే ప్రతి హిందూ దంపతులు నలుగురేసి పిల్లల్ని కనాలనీ, అందులో ఇద్దరిని అరెస్సెస్‌కు దత్తత ఇవ్వాలనీ, వారిని విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలుగా తయారుచేసి దేశానికి అంకితమివ్వాలనీ... అన్నారు సాధ్వీ రితంబర. ఈమె విహెచ్‌పి మహిళా విభాగం 'దుర్గా వాహిని' వ్యవస్థాపకురాలు. అయోధ్య రామమందిరంతో సంబంధాలున్నావిడ. ఈమేకాదు, బెయిల్‌పై ఉన్న నర్సింగానంద్‌ కూడా అదే మాట మళ్ళీ మళ్ళీ చెపుతున్నాడు. యతి నర్సింగానంద్‌ మధురలో ఇవే వ్యాఖ్యలు చేశారు. 2021లో హరిద్వార్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్‌పై బయటికి వచ్చి, మళ్ళీ అవే వ్యాఖ్యలు చేస్తూ ఉండటం చూస్తే... పిచ్చి ఎంత ముదిరిపోయిందో తెలుస్తోంది! అఖిల భారత సంత్‌ పరిషత్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ ఇన్‌ఛార్జి యతి సత్యదేవానంద్‌ కూడా అదే మాట చెప్పాడు. ఊనా జిల్లా ముబారక్‌పూర్‌లో ధర్మసంసద్‌లో ఆయన మాట్లాడుతూ... 'హిందూ దంపతులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని' పిలుపునిచ్చారు. ఒక పథకం ప్రకారం ఈ దేశంలోని ముస్లింలు ఎక్కువ పిల్లల్ని కంటున్నారని అందువల్ల వారి జనాభా పెరిగిపోతూ ఉందని... ఆ పరిస్థితి ఎదుర్కొవడానికి భారత్‌ను హిందూదేశంగా మార్చడానికి హిందూ దంపతులు శ్రద్ధ వహించి... ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తూ ఉండాలని అన్నాడు.

అలాంటి మూర్ఖ గురువుల బోధనలకు కొందరు మూఢ భక్తులు ఎలా స్పందిస్తారో చూడండి! శివం గుప్త, అతని భార్య సౌమ్యగుప్త ఇద్దరూ రాముడి భక్తులు. వారికి పిల్లలు లేరు. పిల్లల కోసం మొక్కులు మొక్కుతూ, తీర్థయాత్రలకు బయలుదేరారు. అందులో భాగంగా ఒక రోజు సరయూ నదికి వెళ్ళారు. ఒడ్డున కూర్చున్న బ్రాహ్మహణులు కొందరు వీరిని బొల్తా కొట్టించి దండిగా డబ్బు లాగారు. ఒక మంత్రం ఉపదేశించారు. అదేమిటంటే... నదిలో దిగి, నీటిలో ఉండగానే ఆ మంత్రం మూడుసార్లు చదవాలి. ఆ తర్వాత ఆ దంపతులు నీటిలో ఉండగానే శారీరకంగా కలవాలి... అలా చేసినట్లయితే తప్పక రాముడిలాంటి కొడుకు పుడతాడని నమ్మించారు. ఎందుకంటే రాముడు సరయూ నదిలో మునిగి ప్రాణం వదిలేశాడని కదా పురాణం చెపుతోంది? దాని ఆధారంగా ఏ దంపతులైతే ఆనదిలోకి దిగి, నీళ్ళలో ఉండగానే శారీరకంగా కలుస్తారో వారికి తప్పక కొడుకు పుడతాడని అక్కడి పురోహితులు ప్రచారం చేయడం వల్ల.. శివం గుప్త - సౌమ్య గుప్తలు వారి మాటలు నమ్మారు. వారు చెప్పిన ప్రకారమే నీటిలోకి దిగారు. నదిలో స్నానం చేస్తున్న ఇతరులు, ఒడ్డున ఉన్నవారు కొందరు ఆ చోద్యం చూసి మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత కేకలేసి గోలచేశారు. ఒడ్డుకు రప్పించారు. మా పవిత్రమైన సరయూనదిలో మీరేం పనిచేస్తున్నారర్రా... అని తిడుతూ దేహశుద్ధి చేశారు. ఈ గోలలో దండిగా డబ్బులాగిన పురోహితులు రాముడి దయతో మాయమయ్యారు. దెబ్బలు తిన్న దంపతులు అర్థనగంగానే పారిపోయారు. మళ్ళీ జన్మలో అయోధ్య పేరెత్తగూడదను కున్నారు. ఈ సంఘటన 2022 జూన్‌ చివరివారంలో జరిగింది. ఏమాత్రం మెదడు ఉపయోగించకుండా, మోసగాళ్ళ మాటలు నమ్మితే ఇలానే ఉంటుంది. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. రోజూ దేశ వ్యాప్తంగా మనువాదులు ఎన్నెన్ని అహేతుకమైన విషయాలు ప్రచారం చేస్తున్నారో కదా? అందుకే, ప్రతివారూ వారి మెదడును ఉపయోగిస్తూ ఉండాలి!
హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని బోధించే మత గురువులు తల్లి స్థానాన్ని గౌరవప్రదంగా ఎందుకు చూడరు? శతాబ్దాల క్రితం జరిగిన తప్పును ఇకనైనా సరిదిద్దాలి కదా? తల్లిని దేవతగా పొగడుతారు కానీ, వెనువెంటనే వివక్షతో తూలనాడుతారు. అదేం న్యాయం? భర్త చనిపోయిన తల్లి ఎదురొస్తే అరిష్టం అని విసుక్కుంటారెందుకూ? తల్లి బిడ్డకు జన్మనిస్తే పురుటిమైల.. అని అంటారెందుకూ? రుతుస్రావం అయితే నెలసరి మైల ఎందుకూ? శరీర ధర్మరీత్యా వచ్చే సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇకనైనా అర్థం చేసుకోరా? హిందూ ధర్మంలోనే కాదు, ఇతర ధర్మాల్లోనూ స్త్రీ పరిస్థితి అలానే ఉంది. బైబిల్‌, ఖురాన్‌ తిరగేయండి. అక్కడా అంతే... పురుషుడి కంటే స్త్రీలది తక్కువ స్థాయి?
భారతదేశంలో మనుషులు మాత్రమే స్వదేశీయులు. మతాలన్నీ విదేశాల నుండి వచ్చినవే. మనుషుల మధ్య ద్వేషం పెంచి, వారిని విడగొట్టేవి, పడగొట్టేవీ ఈ మతాలు! మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే. వారి డి.ఎన్‌.ఎ. ఒక్కటే! అందరూ ఒకటే అయినప్పుడు మత విభజనలెందుకూ? మనిషినే ప్రమాణంగా తీసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోలేమా? భారతదేశంలో హిందువుల్లో ఒకవర్గంవారు ఉల్లిపాయ, ఎల్లిపాయ తినరు. అవి తినడంవల్ల పాపం తగులుతుందని భావిస్తారు. అదివారి ఇష్టం. కానీ అదేమిటో విచిత్రం లంచం, దొంగసొమ్ము, అక్రమంగా దోచుకున్నది తినడం వల్ల పాపం తగులుతుందని అనుకోరు. చిల్లర డబ్బులు కిందపడ్డా ఏరుకుని కళ్ళకు అద్దుకుంటారు. అది 'ధనలక్ష్మి' అని భక్తి ప్రదర్శిస్తారు. అప్పనంగా దోచుకున్నది, లంచంగా తీసుకున్నది కూడా ధనలక్ష్మే కదా? తామూ నైతికంగా దిగజారి, లంచం డబ్బును దేవతా స్వరూపంగా భావిస్తే సరిపోతుందా?

కోయిల తన భాష తను మాట్లాడుతుంది. అందుకే స్వేచ్ఛగా విహరిస్తుంది. అదే చిలుక అయితే ఇతరుల పలుకుల్ని వల్లిస్తుంది. అందుకే అది స్వాతంత్య్రం కోల్పోయి పంజరంలో ఉండాల్సి వస్తుంది. బందీ అయిపోతుంది. ఎవరి బాషను వారు మాట్లాడుతూ ఎవరి ఆలోచనా విధానాన్ని వారు కాపాడుకుంటూ, ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో వారే ముందుకుపోతారు. నిజం మాట్లాడేవారు కష్టాల పాలవుతారేమోగానీ, పరాజితులు కారు. బానిసలుగా మిగలరు. ప్రపంచంలోని ఆనందకర దేశాల జాబితాలో ఫిన్లాండ్‌ మొదటిస్థానంలో ఉంది. ఇది యూరోప్‌లోని ఒక దేశం. అక్కడ నాణ్యమైన విద్య, ఆరోగ్యం లభిస్తుంది. లింగ సమానత్వం, స్వచ్ఛమైన స్వభావం, వ్యక్తిగత స్వేచ్ఛ, బాగా పనిచేయగల వాతావరణం ఉంటుంది. అసమానతలకు తావు ఉండదు గనుక, నేరాలు అతి తక్కువ. ఫిన్లాండ్‌ ప్రధానిగా సన్నామారిన్‌ ఉన్నారు. ఆమె తన ముప్పయి నాలుగేండ్ల వయసులో ఆ పదవి చేపట్టారు. ప్రపంచంలోనే అతి తక్కువ వయసుగల ప్రధాని అయ్యారు. ఇప్పటికైనా పనికిరాని అనుభవానికి ప్రాధాన్యమిస్తూ, ప్రతిభను తొక్కిపెట్టే పనులు మానుకోవాలి! డెబ్భయి రెండేండ్ల ఓ నిండు అబద్ధం మన దేశాన్ని పాలిస్తోంది. దానికి కావల్సినంత అనుభవం ఉంది. కానీ, ఏం లాభం? దేశంలో ఎవరైనా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారా? మనిషిని శత్రువుగా చూసే వాతావరణాన్ని దేశంలో తప్పనిసరిగా మార్చుకోవాల్సి ఉంది. మనిషిని పక్కనపెట్టి లేని దేవుణ్ణీ, మతాన్నీ, ద్వేష వాదాన్ని నెత్తికెత్తుకున్నందువల్ల ఏం జరుగుతూ ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. హత్యలు, నిరసనలు ఫలితంగా కళ్ళముందే ప్రజాస్వామ్యం కుప్పకూలుతూ ఉంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో లక్షలమంది రోజువారీ కూలీల్ని వేలవేల మైళ్ళు కాలినడకన నడిపించిన ఈ ఘనమైన ప్రభుత్వం... మనిషి కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎలా అవుతుందీ? పరిస్థితులు మారాలి! మార్చుకోవాల్సింది బాధ్యతా, వివేకం గల ఈ దేశ పౌరులే!!

- డాక్టర్‌ దేవరాజు మహారాజు
  వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు విజేత,
  జీవశాస్త్రవేత్త