జగన్మాత
posted on Nov 29, 2013
జగన్మాత
డా.రాధశ్రీ
కైలాస శిఖరాన కొలువున్న తల్లీ
శంకరుని హృదయాన నెలవున్న దేవి
కరుణించి కాపాడుమో జగజ్జననీ
రక్షించి మము బ్రోవుమో జగన్మాతా !
నీ దివ్య శుభ చరణ మంజీర నాదాలు
భక్త హృదయాలలో కలిగించు మోదాలు
సుందరము సుమధురము నీ దయాదృష్టి
కురిపించు ప్రతి ఇంట సంపదల వృష్టి
నగపతి పుత్రివై, పశుపతికి పత్నివై
గణపతికి జననివై, అల జగజ్జననివై
మహిశాసురని గూల్చి, మహికి మోదము గూర్చి
శాంతి నొసగిన తల్లి శివకంకరీ!
రోషాలు ద్వేషాలు రగిలేటి యుగమందు
నేరాలు ఘోరాలు చలరేగు జగమందు
ఘోర నరకాసుల,క్రూర మహిషాసురుల
దృష్ట దుశ్మాసనుల దునుమాడవమ్మ
నీ పాదపద్మాల నెరనమ్మి యున్నటి
హృదయ వేదిక మీద నిను నిలుపుకున్నట్టి
నిజ భక్త వర్యులను రక్షించవమ్మ
ఆయురారోగ్యాలు అందించి రమ్మా!!