వెలుగు నీడలు (కవిత)
posted on Feb 2, 2016
వెలుగు నీడలు
మోడైపోయి అమావాస్య కటికత్వాన్ని
పులుముకున్న మ్రాను..చిరు ఆశతో
చిగురుటాకుల వెలుగుల్లో
మళ్ళీ కిలకిలా నవ్వటం
కన్నీళ్ళను విసుక్కున్న నీకు
ఆనందభాష్పాల చెమ్మలా ఎప్పుడూ అంతుపట్టనిదే
నీడ కూడా నిన్ను వెలివేస్తున్నపుడు
అంధకారమైపోయిన నీ రూపు
అంతరంగం హెచ్చరిక ఎప్పుడైనా విన్నావా?
మనసు ప్రతిబింబాల వెలుగునీడలే
నీ జీవితాన్ని నియంత్రిస్తాయని
కాలాన్ని అనుగుణంగా మలుచుకున్న నువ్వు
కాయాన్ని ముందుకు నడపలేవా
ఆనందంలోనూ, దుఃఖంలోనూ నువ్వే ఉన్నపుడు
నీ జీవితానికి నువ్వేగా న్యాయముర్తివి
- సరిత భూపతి