నామకరణం

నామకరణం (కథ)   మునిమాణిక్యం పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేవి కాంతం కథలు. తెలుగువారికి కాంతాన్ని పరిచయం చేసిన మహానుభావుడు ఆయన. మధ్య తరగతి జీవితాల్లోని బంధాల్ని సున్నితమైన హాస్యంతో కథలుగా అందించారు. మునిమాణిక్యం భార్య ప్రేరణతోనే ఈ కథలు రాశారు. ఇందులో ప్రతి కథ ఓ మణిపూసలా, జీవితాల్లోని అనేక మధురమైన అనుభూతుల్ని పంచుతుంది. అసలు కాంతం ప్రస్తావన మునిమాణిక్యం నరసింహరావు రాసిన టీ కప్పులో తుఫాను నవలలోనే కనిపిస్తుంది. తర్వాతే తన కథల ద్వారా తెలుగువారికి కాంతాన్ని పరిచయం చేశారు నరసింహారావు. వాటిలోని ఓ కథే నామకరణం. ఈ కథలో పాపకు పేరు పెట్టడంలో భార్యా, భర్తల మధ్య జరిగే చర్చను చమత్కారంగా చెప్పారు.        కథలోకి వెళ్తే- పండంటి పాపతో కాంతం పురిటిమంచం మీద  పడుకుని ఉంటుంది. ఆ గదికి పక్కగదిలో రచయిత మరో మంచం మీద పడుకుని ఉంటాడు. కొంత దూరంగా బావమరిది కూడా పడుకొని ఉంటాడు. కాంతం భర్తను ఉద్దేశించి- 'ఈ చిట్టి తల్లికి ఏ పేరు పెడదాం. రేపే కదా బారసాల. మీకిష్టమైన పేరు పెట్టండి' అని అడుగుతుంది. 'ఒకప్పుడు మీ తాతల పేర్లు, నాయనమ్మల  పేర్లు లేదా మా తండ్రుల పేర్లు, తల్లుల పేర్లు పెట్టేవాళ్లం. ఇప్పుడు అలా కాదుగా...' అని చివరకు 'జానకి పేరు పెడదాం' అంటాడు. దానికి భార్య కాంతం 'జానకి వద్దండి. జానకి అంటే సీత. సీత పడిన కష్టాలన్నీ గుర్తొస్తాయి' అంటుంది. తర్వాత రచయిత 'సుగుణ పేరు పెడదాం' అంటాడు. దానికి భార్య 'సుగుణ, వివేకం లాంటివి కిరస్తాని పేర్లు అలాంటివి వద్దు' అంటుంది. దానికి భర్త 'అంటే నీకులాగా పెంకితనం, మెగుడ్ని లెక్కచేయని తనం వంటివి అలవడితే ఆ పేరు వ్యర్థమై పోతుంది. మా నాన్నకు శేషగిరి అనే పేరు చాలా ఇష్టం, ఆ పేరు పెడదాం' అంటారు. అందుకు కాంతం 'శేషాచలం, వింధ్యాచలం, కృష్ణ, గోదావరి ఇలాంటి పేర్లు మా మేస్టారు పెట్టేవాడు. అయినా అలాంటి పేర్లు వద్దు' అంటుంది.             చివరికి రచయిత 'మనకు ఇక పిల్లలు వద్దు అనుకుంటున్నాం కాబట్టి సంపూర్ణం అనే పేరు పెడదాం' అంటాడు. అందుకు బావమరిది 'మీరు వద్దునుకుంటే సరిపోతుందా... మరో పిల్ల పుడితే ఏం పేరు పెడతారు' అని చమత్కారంగా అడుగుతాడు. రచయిత కోపంతో 'మంగళహారతి అని పెడతాను' అంటాడు. కాంతం విసుక్కొంటుంది. రచయిత 'ఊర్వశి' అనే పేరు చెప్తే... 'రంభ, ఊర్వశి, తిలోత్తమ లాంటి భోగంముండల  పేర్లు మన కూతురుకు వద్దు' అంటుంది. మళ్లీ 'నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టు' అని భర్తను అడుగుతుంది. కానీ చివరకు కాంతమే 'శుక్రవారం పుట్టింది కాబట్టి లక్ష్మి అని పేరు పడెదాం' అంటుంది. భావమరిది మాత్రం 'హిందూస్థానంలో వాళ్లు కమలాబాయి, నెహ్రూ , కుసమ కోమలి లాంటి పేర్లు పెడతారు, అవి బాగుంటాయి' అని చెప్పినా చివరకు లక్ష్మి పేరును ఖరారు చేస్తారు.              బారసాల రోజు పళ్లెంలో సన్నబియ్యం పోసి ఉంగరంతో  'ఏం పేరు రాయమంటావు' అని భార్యను అడుగుతాడు రచయిత. అప్పుడు కాంతం 'సుబ్బలక్ష్మి' అని రాయమంటుంది. పైగా 'మా నాయనమ్మ వచ్చి తన పేరు కలపమంది' అని చెప్తుంది. అంతలో రచయిత వాళ్ల నాన్న వచ్చి 'మన ఇలవేల్పు వెంకటేశ్వర్లు కాబట్టి వెంకటసుబ్బలక్ష్మి' అని రాయమంటాడు. అలా చివరకు రచయిత వెంకటసుబ్బలక్ష్మి అని కూతురుకు నామకరణం చేస్తాడు.             ఎనిమిది నెలల తర్వాత బావమరిది పాపకు బంగారు వత్తులు తీసుకొని చూడడానికి వచ్చి 'సుబ్బలక్ష్మి ఎలా ఉంది' అని అడుగుతాడు. కాంతం 'సుబ్బలక్ష్మి ఎవరు' అని అడుగుతుంది. 'పాప పేరు పద్మావతి' అని చెప్తుంది. తను అలానే పిలుచుకుంటున్నాను అని అంటుంది. రచయిత దగ్గరకెళ్తే 'పద్మావతి కాదు సరోజిని' అని చెప్తాడు. దాంతో బావమరిదికి తిక్కలేస్తుంది. 'ఇక నుంచి తను కూడా సరోజిని అని పిలుస్తాన'ని రచయితకు మాట ఇస్తాడు. కానీ కాంతం దగ్గరకు వెళ్లగానే పద్మావతి అని పిలుస్తాడు. బంగారు వత్తులతో మిసమిస లాడుతున్న పాపను చూసి అందరూ సంతోషిస్తారు.              ఇలా కథంతా హాస్యంతో, భార్యాభర్తల మధ్య జరిగే చమత్కారమైన సంభాషణలతో సాగుతుంది. కథ చదువుతుంటే- పేరు పెట్టటం భర్త ఇష్టమని చెప్పిన భార్య, భర్త సూచించిన ప్రతి పేరును కాదంటూ, కారణాలు చెప్తుంటే... ఆయనలో వచ్చే కోపాన్ని, చివరకు కాంతమే లక్ష్మి అని పేరు పెట్టడాన్ని కథలో చాలా ఆసక్తిగా చెప్పాడు రచయిత. పేరు పెట్టడంలో భార్యల మనస్తత్వాన్ని సూచించాడు. ఇలాంటివి ప్రతి ఇంటిలో జరిగే సన్నివేశాలే, కానీ మునిమాణిక్యం మాత్రం చిక్కటి హాస్యంతో రాశారు. చివరకు పాపను 'వెంకట సుబ్బలక్ష్మి' అని కాకుండా భార్య 'పద్మావతి', భర్త 'సరోజిని' అని పిలవడం మంచి ట్విస్టు. కథ ఎక్కువభాగం సంభాషణాత్మకంగా సాగుతుంది. భాష విషయానికి వస్తే-  మధ్యతరగతి బ్రహ్మణ ఇళ్లల్లోని సహజమైన మాటలు కనిపిస్తాయి.             అందుకే మునిమాణిక్యం రాసిన కాంతం కథలు  ఇప్పుడు చదివినా మనసకు ప్రశాంతతని, గిలిగింతల్ని కలిగిస్తాయి. - డా. ఎ.రవీంద్రబాబు

వృత్తికథలకు మూల శిల్పి అందె నారాయణస్వామి

వృత్తికథలకు మూల శిల్పి అందె నారాయణస్వామి         నేడు వస్తున్న అనేక వృత్తికథలకు మూల శిల్పి అందె నారాయణశిల్పి. గుంటూరు జిల్లా మంగళగిరిలో జన్మించాడు.  బహుశా తెలుగులో వృత్తికళాకారుల గురించి పూర్తికథను రాసింది వీరేనేమో. చేనేత కుటుంబంలో పుట్టిన నారాయణస్వామి ఆ వృత్తి వాళ్లు పడుతున్న కష్టాలను, వారి కన్నీళ్లను కథలో చెప్పే ప్రయత్నం చేశారు. సుమారు వంద కథలు రాసిన నారాయణస్వామిని తొలి వృత్తికథా కథకుడిగా చెప్పుకోవాలి. విమర్శకులు ఇతనిని ఆంధ్ర మొపాసా అంటారు. ఇతర కళల్లో కూడా ప్రవేశమున్న నారాయణ స్వామి రచించిన శిల్పి కథలోకి వెళ్తే-        శివయ్య, సీతమ్మ భార్యాభర్తలు, వారికి ఇద్దరు కూతుళ్లు. చేేనేత కుటీర పరిశ్రమల్లోకి యంత్రాలు అడుగుపెట్టేక రోజూవారి మగ్గాలమీద బట్టలు నేసే వారికి పనిలేకుండా పోయింది. పనిలేకపోయే సరికి వారి కుటుంబాలు పడుగుపేకల్లా కూలిపోయి, తిండిగింజలకు కూడా జరగక పస్తులు ఉండాల్సి వస్తుంది. అదే పరిస్థితిలో శివయ్య కుటంబం ఉంది. అస్థిపజరంలా ఖాళీమగ్గం,  ఆకలితో యేడ్చియేడ్చి శోష వచ్చి నిద్రపోయిన కూతుర్ని చూసిన శివయ్య ఎక్కడన్నా నాలుగు తిండిగింజలు అప్పు తెమ్మంటాడు భార్యని. అప్పటికే ఇళ్ల పక్కన మానెడు, తవ్వ అప్పులు చేసిన సీతమ్మ ఇక తేవడం తన వల్ల కాదంటుంది. షావుకారు శాల్తీ (నేయించిన బట్టలు) అమ్ముడుపోకపోయే సరికి ఇంకా నేయించడానికి పడుగులు (నేయడానికి నూలు) ఇవ్వడం మానేస్తాడు.            శివయ్య ఇంటి సూర్లోనుంచి ఎలుకలు కొట్టేసిన ఓ ఉత్తరం కిందపడుతుంది. అది 1940లో మద్రాసు ఖాదీ కాన్ఫరెన్సువాళ్లు నేతలో గాంధీ విగ్రహాన్ని నేసినందుకు శివయ్యకు బహుమతిగా ఇచ్చింది. నేతపనిలో అద్భుతాలు సృష్టించగల శివయ్యకు ప్రస్తుతం పనిలేకుండా పోయింది. ఇలా ఆలోచిస్తున్న శివయ్య ఇంటికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రావు వస్తాడు. మిల్లు బట్ట మా పరిశ్రమను కూలదోసింది అని శివయ్య అతనితో వాదనకు దిగుతాడు. అతను మాత్రం చీరెలు ధోవతలు ప్రభుత్వం వారు మీకు కేటాయించే పనిలో ఉన్నారని కబుర్లు చెప్తాడు. చివరకు శివయ్య బ్రిటీషు వాళ్ల పాలనలో ఉన్నప్పుడు యిటువంటి పరిశ్రమలన్నీ నాశనమయ్యాయని వాపొయ్యాం. ఇప్పుడు స్వంత ప్రభుత్వం వచ్చిమాత్రం యేంచేసింది అని ఆవేదనతో మాట్లాడతాడు. రావు నూరు చిలప కావాలని అడిగితే, ఉరిపోసుకొని చనిపోడానికి ఒక పోగుకూడా లేదని ఆక్రందనతో సమాధానం చెప్తాడు.                   రావు వెళ్లిపొయ్యాక శివయ్య తమ్ముడు రాఘవయ్య వస్తాడు. అతను ఆ గ్రామానికి పదికోసుల దూరంలో మరో గ్రామంలో ఉంటాడు. రాఘవయ్య  చేనేత పనులు లేక అక్కడి వాళ్లందరూ వలసలు పోతున్నారని, తను ఈ గ్రామానికి వస్తే ఎలా ఉంటదని శివయ్యను అడగుతాడు. ఇక్కడి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని చెప్పి, తమ్ముడికి తిండిపెట్టాడానికి ఇంట్లో ఏమీ లేవు కదా... అని, షావుకారును ఓ రూపాయన్నా అడుగుదామని వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి, షావుకారుతో నూలు ఆసామి నూలు తీసుకెళ్లి ఇంతకాలమైనా డబ్బు ఇవ్వలేదని గొడవ పెట్టుకుంటుంటాడు. షావుకారు సరుకు నిల్వ ఉంది అమ్ముడు పోలేదని అతనికి నచ్చజెప్తుంటాడు. అది విన్న శివయ్య రూపాయి అడగలేక ఇంటికి తిరిగి వస్తాడు. రాఘవయ్య వెళ్లిపోయి ఉంటాడు. మరో కూతురు కూడా తిండిలేక శోషతో పడిపోతుంది. అది చూసి  సీతమ్మ ఎవరి కాళ్లైనా పట్టుకొని గింజలు తెస్తాను అని బయటకెళ్లి కొంగున మూటతో తిరిగి వస్తుంది. కానీ అవి గింజలు కాదు- నాలుగిళ్ల దగ్గర మాదాకవళం అడిగితెచ్చిన అన్నం. అది తెలుసుకున్న శివయ్య తొట్రుపాటుతో- వీడి శరీరం మంటలో కాలి భస్మం కాకముందే నువ్వు జోలి కట్టావా... అవును. నీ తప్పేముంది. వీడు బ్రతికి వుండీ చచ్చిన వాళ్లలో జమే అయ్యాడు. అని ఆక్రేశించాడు.     ఈ కథలోని చేనేత కార్మికుల జీవితాలు ఇప్పటికీ మారలేదు. వారి వాస్తవ జీవితాల్ని గుండెపిడచకట్టేలా చెప్పారు నారాయణస్వామి. ప్రభుత్వం తీరును ఎండగడుతూనే చేనేత కార్మికుల శ్రమలోని గొప్పతనాన్ని, సౌందర్యాన్ని వర్ణించాడు. పాలితులు మారినా, వారి బతుకులు మారలేదన్న కఠోర సత్యానికి ఈ కథ ఓ సాక్ష్యం. ఇక శిల్పపరంగా ఈ కథ-  ఆకలితో ప్రారంభమవుతుంది. చివరికి ఆ బాధను తట్టుకోలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని మాదాకవళం ఎత్తుకోవడంతో ముగుస్తుంది. మగ్గాన్ని అస్థిపంజరంతో పోల్చడం- చేనేతవృత్తి కళాకారుల జీవితానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అలానే రావు నూలు చిలపకోసం రావడం,  రాజకీయ నాయకుల ప్రవర్తనను కళ్లకు కడుతుంది. శివయ్య తమ్ముడి పాత్రను చేనేత కార్మికుల స్థితి దేశంలో అన్నిచోట్లా అలానే ఉందని చెప్పడానికి ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. ఇలా పాత్రలన్నీ కథను మరింత రక్తి కట్టించే విధంగా తీర్చి దిద్దాడు రచయిత. అలానే కథ చివరిలో తనను తాను చచ్చిన వాడిగా భావించుకున్న శివయ్య మాటలు కథకు మణిరత్నాలు వంటివి.               అందుకే ఇలాంటి కథలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. సార్వజనీన, సార్వకాలిక కథలుగా పాఠకుల్లో కళ్లపై నీటిపొరల్లా కదలాడుతుంటాయి.  - డా. ఎ. రవీంద్రబాబు

తెలుగువారి తక్షణ కర్తవ్యం

తెలుగువారి తక్షణ కర్తవ్యం   “ఒకానొక సమయంబున, వైకుంఠవాసుని నాభి కమలోద్భవుండు, వాగ్దేవి వల్లభుండు, సృష్టికర్త యైన బ్రహ్మదేవుని మనంబున నొక చింత పొడసూపె. అదేమన --'అహం' అనే దేహాభిమానంబుగల మోహము, భోగేఛ్ఛలు, క్రోధము, తామిస్రము, చిత్త విభ్రమంబను అవిద్యాపంచక మిశ్రమముగా దాను సర్వభూతంబుల సృష్టించిన  పాపకార్యంబు వలన, పశ్చాత్తాప మానసుండై చింతా క్రాంతుడయ్యె . ఆపాప నివృత్తికై చిర కాలంబు మహా తపంబున మునింగి పవిత్ర మానసుండై ఉండ, నా సమయంబున నల్గురు మానస పుత్రులుదయించ, వారు ధీర జనోత్త ములు, పవిత్ర మానసులు, ఊర్ధ్వరేతస్కులు, పరమ పవిత్రులు, సత్వగుణ బద్ధులైన- సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాత మహర్షులు. వారు జనించగనే పితృదేవుండైన బ్రహ్మకు నమస్క రించ, బ్రహ్మవారితో "కుమారులారా! మీరు నల్గురునూ మీ అంశలచే సృష్టి కార్యము జేసి నాకు సహకరింపగలరు" అన, దానికి వారు "పితృదేవా ! మాకు సృష్టి కార్యంబుతో బనిలేదు. అది నీ విధి. నీవు నిరంతర భగవత్ ధ్యానంబున మునింగి ఆధ్యానామృతంబు నుండీ మమ్ము సృష్టించితివి. మేము మోక్ష ధర్ము లము, భగవత్ ధ్యానమే మా విధి విధాయకముగావున మేము జనలోకంబుల కేగి, కామరూపులమై , సర్వ లోకంబులందిరుగుచూ, హరిధ్యాన తత్పరులమై ఉందుము. మమ్ము తలంచి నంతనే నీ చెంతకు రాగలము." అని సెలవు గొని జనిరి.----“ అంటూ పురాణం చదివి ---    ‘ ఓంకృష్ణాయన్నమః, సర్వం శ్రీకృష్ణపాదార్పణమస్తు, హరిః ఓం శాంతి శాంతి శాంతిః" అని పురాణ పారాయణం ముగించి హరికి నమస్కరించింది నాగాంబ బామ్మ. శ్రోతలంతా నాగాంబ బామ్మకు నమస్కరించి "నాగాంబ గారూ! మీ ఋణం తీర్చుకోలేనిదండీ! ఇలాంటి తెలుగు భాష విని ఎంత కాలమైందండీ ! స్వఛ్ఛమైన  భాష . గొప్ప గ్రంథాన్ని సంపాదించి మాకు చదివి వినిపించి నందుకు మీకు ధన్యవాదాలు." అని ఒక శ్రోత శ్రావణి అనగా, "ఈ భాష నాకసలు అర్ధమే కాందే! ఇంత కఠినమైన భాషలో గ్రంథాలు రాస్తే ఎవరు చదువుతారు?" అని మరో శ్రోత  అమల అంది . "కష్టమనుకుంటూ తెలుగుభాష లోని 56 అక్షరాలను కుదించి కుదించి , ప్రస్తుతం వాడుకలో 12 అచ్చులు,  31 హల్లులు, మొత్తం 43 అక్షరాలున్నాయంటారు, కానీ వీటిలోనూ, తెలుగు మాతృభాషగా వున్న ఒక్కరు కూడా స, శ, ష అక్షరాలను సరిగా వాడరు, మూడింటినీ ఒక్క అక్షరంతోనే సరిపెడతారు- ‘షారద [శారద], షర్వాణి [శర్వాణి], షరస్వతి [సరస్వతి], షాలిని [శాలిని], సన్ముక [ఖ] ఇలా వాడుతున్నారు. క్ష-అసలు పలకటం రాదు, క్షమ కు షమ, ణ నోరు తిరగదు, గణపతికి- గనపతి, పెళ్ళికి- పెల్లి, ధ, థ లకు భేదం తెలీదు, ‘భేధం’ అంటారు. భర్త, అని ఒక్కరూ పలకలేరు బర్త. అని తప్ప. వత్తులు పలకను నోరు తిరగదు. ఇహ భాష  ఏమాత్రం బ్రతుకుతుంది చెప్పండీ! పలకడం చేతకాదని తగ్గించుకుంటూ వెళ్ళి తెలుగు భాషనే చంపేస్తున్నాం. అందు కే ఇలాంటి స్వఛ్ఛ తెలుగు భాషాగ్రంథాలు చదువుతూ వింటూ ఉంటేనన్నా కాస్తంత తెలుగును బ్రతికించుకున్నవారమవుతాం. ఆంగ్లభాష మనందరికీ ఎలా వచ్చిందీ? అభ్యసిస్తేనే కదా! దానిమీద ఉన్న ఆసక్తి స్వంత భాషమీద లేక పోడమే దీనికి కారణం. మీరు రోజూ చదవండి, మేము ఆ ముగింపులేని  టీ.వీ సీరియల్స్ బారిన పడకుండా ఇలా సత్కాలక్షేపమైనా చేస్తాం. నాగాంబ గారూ!" అని అనసూయమ్మ సుదీర్ఘంగా తన అభిప్రాయం వెలిబుచ్చింది.   తమిళనాడు [చెన్నై]లో ముఖ్యభాష తమిళం. ఇద్దరు తమిళులు చేరితే చక్కగా వారి భాషలోనే మాట్లాడుకుంటారు అందరి ముందూనూ. అదే భాషాభిమానం.” “నిజంమరి. మన తెలుగువారు పదిమంది చేరి ఆంగ్లంలో మాట్లాడుకోడం మనం చూస్తాం మాతృభాషలో మాట్లాడటం తలవంపు." "కాదు కాదు భాష రాదు. చిన్నతనం నుండీ కాన్వెంట్లలో  చదువుతూ మాతృభాష మరచిపోయి మాట్లాడితే తప్పులు దొర్లుతాయని ఆంగ్లంలోనే మాట్లాడుతున్నారు. చదవక ముందు ‘పెసల’న్నవాడు చదివాక ‘పిసల’న్నట్లు’ ఉంటుందనివారి భయం." "తెలుగులో మాట్లాడారని ఆంగ్లం నేర్పుతామనే కాన్వెంట్స్‌లో పిల్లల్ని విచక్షణారహితంగా శిక్షించడం పత్రికల్లో, వార్తల్లోచూస్తున్నాం కదా!  ఈ రోజుల్లో ఆంగ్ల భాషా ప్రాధాన్యత ఎక్కువే ఐనా మాతృభాషను చంపేంతగా మనం రుద్దుకోడం మంచిదంటారా!". " విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినంత వరకూ నేర్చుకోవలసిందే. ఒక్కవిషయం గమనించండి. ఆంగ్లభాషకు 26 అక్షరాలున్నాయి, మన తెలుగుతో పోల్చుకుంటే పూర్వం మనకున్న 56తో మనకు 30 అక్షరాలు ఎక్కువ! ఆంగ్లంలోని 26లో ఒక్క అక్షరం తగ్గించకపోగా ఆంగ్ల నిఘంటువులు రోజు రోజుకూ పెరిగి పోతున్నై. తెలుగు నిఘంటువు కోసం  మేము పుస్తకాల షాపులన్నీ గాలించాం . దొరకడమే లేదు. తగ్గి పోతున్నై. నేడు గ్రంథాలయాల్లోనూ నిఘంటువుల కొరత ఉంది . కాదంటారా!" "అసలు తెలుగు బళ్ళలో సైతం ఒక్క శతకం కూడా చెప్పట్లేదు, ఐదు క్లాసులు చదివినా ఒక్క పది తెలుగు పద్యాలు కంఠతా రావు కదా!".  “అంతెందుకండీ! పదో తరగతి విద్యార్థిని తప్పుల్లేకుండా ఒక్క తెలుగు పద్య వ్రాయమనండి చూద్దాం. రామాయణమంటే తెలీదు. భారతమంటే తెలీదు. ఏవో సినిమాలు చూసిన వారు కాస్త పేర్లు మాత్రం తెల్సుకుంటున్నారు." "అసలు  తెలుగు బళ్ళేవండీ!"                                                              " మేము గత సంవత్సరం అమెరికా మా పిల్లవాడి దగ్గర కెళ్ళినపుడు ‘టార్గెట్‘కెళ్తే అక్కడ తెలుగు మాట్లాడుతున్నవారిని చూస్తే విని ప్రాణం లేచొచ్చిందంటే నమ్మండి. మనస్సుల్లో ఉన్న భాషాభిమానాన్నీ, ప్రేమనూ, దాన్ని  బ్రతికించడంలో మన వంతు కృషి చేయకపోడం మన బలహీనత కాదంటారా?"  “విదేశాల్లోని తెలుగు వారు తమ మాతృభాషకు సేవ చేయటం చూస్తుంటే సిగ్గేయటం లేదూ! తెలుగు బళ్ళు పెట్టి పిల్లలకు తెలుగు నేర్పి స్తున్నారు. తెలుగు వెబ్ పత్రికలు నడుపుతున్నారు. ఉగాది పండుగ ఘనంగా చేసుకుంటున్నారు, ‘పాడుతా తీయగా’  అనే బాలసుబ్రహ్మణ్యం గారి  ప్రోగ్రాంకు ఎందరు తెలుగువారు వచ్చి, తెలుగు పాటలు పాడారో చూస్తున్నాం కదా! మనం మాత్రం ఆంగ్లం మాత్రమే మట్లాడమని మన పిల్లల్ని బలవంతపెడుతున్నాం” "చక్కగా చెప్పారు. అంతెందుకండీ! మొన్నమా బాబాయ్ గారింటి కెళ్తేవాళ్ళ మనవలకి తెలుగులోమాట్లాడితే అర్ధంకాలేదు. ఏమం టారు?"                " ఇది కాస్మోపాలిటన్ సిటీ కదండీ! ఆంగ్లం తప్పని సరి."                                                            "నిజమే కానీ మాతృభాష కొంతైనా రాకపోతే ఎలా గండీ! ‘మీ నాన్నగారున్నారా ‘ఇంట్లో? అనే మాట కూడా తెలీకపోతే ఎలాగండీ! "       "మన తెలుగు దేశంలో-- పార్టీ కాదండీ బాబూ ! ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది మంచి తెలుగు మాట్లాడుతున్నారో చెప్పండి!” "సరి సరి , ఇహ మన కర్తవ్యం గురించీ మాట్లాడండి."                                                                "మనం మన ఇళ్ళలో ఆంగ్లంలో కాకుండా తెలుగులో మాట్లాడటం ముందుగా అలవరచుకోవాలి.." “అందరి ఇళ్ళలో మూల పడేసి ఉన్న తెలుగు పుస్తకాలు పూర్వకాలపు చందమామ బాలమిత్ర, బొమ్మరిల్లు వంటి బాలల పుస్తకాలు, పురాణ గ్రంథాలు కూడా సేకరించి ఒక గ్రంథాలయం ఏర్పరుద్దాం."           " మా ఇంట్లో నా ఈ పెద్ద గది ఖాళీనే, మీకంతా ఇష్టమైతే ఇక్కడే ఆ గ్రంథాలయం ఏర్పర్చవచ్చు. "అంది నాగమ్మ.  "ఇలా గ్రంధపఠనాలు, సత్కాలక్షేపాలు, సత్సంగాలు అచ్చతెలుగులో జరగాలండీ! మన కాలనీ అంతాతిరిగి అందర్నీపోగేద్దాం. ఉగాదికి తెలుగు శతక పద్యాలు, భాగవత పద్యాలు,నీతి పద్యాల పోటీలు పెడదాం.ఉచిత తెలుగు తరగతులు అమెరికా సిలికానాంధ్రలో లాగా నిర్వహిద్దాం. మంచి బహుమతులు ఏర్పరుద్దాం,ఉడతాభక్తిగా మాతృభాష సేవచేద్దాం. మంచి తెలుగు వక్తలను పిలిపిద్దాం. తెలుగు గురించిన అవగాహన, అవసరం తెలియ పరుద్దాం. విశ్రాంత కాలంలో మన మాతృభాషకు కొంతైనా సేవ చేసి తరిద్దాం. మాతృ భాషఇంకి పోకుండా చూడ్డం మన బాధ్యతగా, కర్తవ్యంగా భావిద్దాం. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృ దేశాన్నీ మరచిన వాడికి నరకం తప్పదని చాటి చెపుదాం." ఆవేశంగా అంటున్న ఆనందరావును కరతాళధ్వనులతో అంతా అభినందించారు.   అంతా గట్టి నిర్ణయం తీసుకుని కర్తవ్యోన్ముఖులై ఇళ్ళదారి పట్టారు .      -ఆదూరి హైమవతి

రిక్షావాలా

  రిక్షావాలా   సామ్యవాద భావాలతో రచనలు చేసిన అలనాటి మేటి రచయిత్రుల్లో వట్టికొండ విశాలాక్షి ఒకరు. అభ్యుదయ సాహిత్య పంథాలో జీవితాన్ని, సాహిత్య జీవితాన్ని గడిపారు. గుంటూరు జిల్లాకు చెందిన విశాలాక్షి రాసిన భారతనారి నవల అప్పట్లో గొప్ప పేరు పొందింది. ఆమె రాసిన గీతాలు ప్రజాసభల్లో మారుమ్రోగేవి. నీతితో, నిబద్ధతతో ప్రజల పక్షాన పోరాడిన వనిత విశాలాక్షి. అందుకే ఈమె రచనలు కూడా వాస్తవపరిస్థితులకు అతి దగ్గరగా ఉంటాయి. అలాంటి కథే రిక్షావాలా. ఈ కథను విశాలాక్షి బహుశా 1950లలో ప్రచురించి ఉండవచ్చు. కథలోకి వెళ్తే- బక్కచిక్కిన ఓ పేదవాని జీవిత పోరాటమే రిక్షావాలా కథ. మంచి ఎండాకాలం కావడం వల్ల రోడ్లమీద జనాలు కనపడరు. కానీ ఓ రిక్షా  అతను మాత్రం ఏదన్నా బేరం దొరక్కపోతుందా... అని, ఎదురు చూస్తూ ఉంటాడు. అతనిని చూస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది... పాపం ఆకలికి తాలలేక, నీరసించి పోయున్నాడని. అతనే కాదు, అతని భార్యాపిల్లల పరిస్థితి కూడా అంతే. అతనికి ఆ వూరుకూడా కొత్తే. ఎవరైనా ఏదైనా చోటుకు తీసుకెళ్లమంటే, సొంతగా ఎటూ తీసుకెళ్లలేడు. ఎక్కిన వాళ్లే జాగ్రత్తగా చూసుకుంటూ సరైన స్థలానికి వెళ్లాలి. అతని వాలకం చూసిన ఎవరూ అతని రిక్షా ఎక్కరు. ఒకవేళ ఎక్కినా మరోసారి మాత్రం ఎక్కరు. ఎండిపోయిన డొక్కలతో ఉన్న అతన్ని ఒకామె పిలుస్తుంది. ఆ పిలుపుకు అతను ఆశతో "ఎక్కడికమ్మా?" అని అడుగుతాడు. "బ్రాడీపేట. ఎంత తీసుకుంటావ?"ని అడుగుతుంది. "ఎంతో మీదయ" అని అంటాడు. ఆమె రిక్షా ఎక్కుతుంది. ఆకలితో మాడిపోతున్న అతను కొంతదూరం లాగి. "కాళ్లు కాలుతున్నా యమ్మా" అంటాడు. అతని కాళ్లకు చెప్పులు లేవని గమనించి ఆమె అడుగుతుంది. "చెప్పులు వెసుకోడానికి కాళ్లు ఇంకా అలవాటు పడలేదు. కొత్త చెప్పులు కొనుక్కునే డబ్బు లేదు" అని బదులిస్తాడు. కొంత దూరం వెళ్లాక వేరే దారిలో వెళ్తున్నాడని ఆమె తెలుసుకుంటుంది. "ఇలా తీసుకొచ్చావు?. అటు వెళ్లుంటే తక్కువ సమయంలో వెళ్లే వాళ్లం కదా" అంటే, "ఇఫ్పుడిప్పుడే దారి గురుతులు పెట్టుకుంటున్నానమ్మా" అంటాడు. కొంతదూరం వెళ్లాక. చెట్టునీడన రిక్షా ఆపి "తర్వాత తీసుకెళ్తానమ్మ" అంటాడు. ఆ ఎండలో అతను రిక్షాలాగుతుంటే అతని కన్నీళ్లు, చెమట కలిసి పాదాలముందు కాలుతున్న నేలపై పడతాయి. అతని బాధ చూడలేక ఆమె కూడా తల పక్కకు తిప్పుకుంటుంది. అంతలో అటుగా జడ్కా వస్తుంది. ఆమె "రిక్షా బ్రాడీపేట పోవడానకి ఎంత తీసుకుంటావో చెప్పు, అంత ఇచ్చి నేను జడ్కాలో వెళ్తాను" అంటుంది. కానీ అందుకు రిక్షావాలా ఒప్పుకోడు. జడ్కాబండి అతను కూడా "బాడెగ ఒప్పకున్నాను" అని చెప్తాడు. రిక్షావాలా మాత్రం "నేను తీసుకెళ్తాను. మీరు వూరికే డబ్బులిస్తే, మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తే నేను సుఖంగా ఉండను" అని చెప్పి మళ్లీ రిక్షాలాగటం మొదలు పెడతాడు. ఆమె తన దగ్గరున్న డబ్బులు లెక్కచూసుకుంటుంది. కేవలం మూడు పావలాలు ఉంటాయి. ఆమె ఇంకా రెండు మూడు చోట్లకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు ఆ డబ్బులు సరిపోతాయా, లేదా అని ఆలోచిస్తుంది. కానీ రిక్షా దిగిన తర్వాత ఆమె తన దగ్గరున్న మూడు పావలాలు అతనికి ఇచ్చేస్తుంది. అతను "దయగల తల్లి" అని ఉత్సాహంతో రిక్షాని చూడ్చుకుంటూ వెళ్లిపోతాడు. కథలో ఒకవైపు ఆకలితో అలమటిస్తున్నా శ్రమచేయకుండా డబ్బు తీసుకోకూడదనే రుక్షావాలా నిజాయితీ... తనకు సరిపడా డబ్బులు లేకపోయినా అతని దీన స్థితిని చూసి మొత్తం ఇచ్చేసిన ఆమె నిజమైన మానవీత మనల్ని కదిలిస్తాయి.  అనుక్షణం అతని కష్టాలకు చెలించిపోతూ "ఏమీ చేయాలా" అని ఆలోచిస్తూంది ఆమె. ఈ కథ మొత్తం ఆర్ద్రంగా నడుస్తుంది. ఒకప్పటి నగరజీవితాల్లోని రిక్షావాలాల నిజజీవితాన్ని దగ్గర నుండి చూస్తున్నట్లు ఉంటుందీ కథ చదువుతుంటే. కథ ఉత్తమ పురుషలో రచయిత్రే చెప్పినట్లు నడుస్తుంది. అందుకే రిక్షావాళ్ళ చరిత్రకు సాక్షిగా ఈ కథను గుర్తించాల్సిన అవసరం ఉంది. - డా. ఎ.రవీంద్రబాబు

పడగనీడ

  పడగనీడ     రజియా కొంత ఆందోళనకు గురయ్యింది. ఏమిటీ ప్రభాకర్‌! ఇంతదూ రమూ వచ్చి మరల వెనకడుగు వేస్తున్నాడా? కాకపోతే 'పెళ్ళి' అనగానే ఎగిరి గంతెయ్యవద్దూ? ఓసి పిచ్చిపిల్లా! నిజానికి ప్రభాకర్‌ మనసు ఎగిరి గంతు వెయ్యనేవేసింది. అయితే అది ప్రదర్శింపబడలేదు.  ప్రాంగణంలోకి వచ్చిన పిట్టలను లోపలికి రాకుండా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పిట్ట ఎగి రిపోదూ.ప్రక్కనుండి పిట్టను గమనిస్తూంటుంటే అది లోపలికి రానే వస్తుంది. లోపలికి రాగానే అది ఎంత గింజుకున్నా వల పట్టుమరింత బిగిసిపోతుంది...!     ఆ మర్నాడు రజియా గట్టిపట్టు పట్టాలని నిర్ణయించుకుంది. తాడోపేడో తేల్చుకోవాలి...     ''ప్రభాకర్‌! మన ఇద్దరం ఒకరికొకరం ఇష్టపడుతున్నాం కదా? దానికి ముగింపు పెళ్ళే కదా?? అది అసాధ్యం అంటున్నావే, ఎందుకని??''     ''మళ్ళీ అడిగిందే అడుగుతున్నారు. పెళ్ళంటే యువతీయువకులు  ఆవేశంతో తీసుకునే నిర్ణయం కాకూడదు. పూర్వాపరాలు బాగా ఆలోచించాలి''     ''పెద్ద ఆరిందాలాగా మాట్లాడావు. సంతోషించాంకానీ మనిద్దరి పెళ్ళికి అడ్డంకి ఏమిటీ?''     ''మన ఇద్దరిమధ్యే అడ్డంకి''     ''అంటే?''     ''అంటే ఏముంది? పెళ్ళి సమాన స్థాయిలో వున్నవాళ్ళు చేసుకోవాలి కానీ...'' పూర్తిచెయ్యనీయలేదు రజియా.     ''సమాన స్థాయంటే ఏమిటీ?''     ''మీ స్టేటస్‌ ఏమిటీ? నా పరిస్థితి ఏమిటీ? దీన్ని తెలిసికోవడానికి వివరణ కావాలా?''     ''కావాలి''     ''అయితే వినండి. మీ నాన్నగారు ప్రస్తుతం పదవిలోవున్న ఒక పెద్ద బ్యాంకు మేనేజర్‌. మీరు వారి ఏకైక కూతురు. నేను యాక్సిడెంట్‌లో చనిపోయిన ఒక పేద లారీ డ్రైవర్‌ కొడుకుని... ప్రస్తుతం పొట్టపోసుకోవడానికి ఒక పాత ఆటోను, అదీ ఎవరో ధర్మాత్ములు నామీద జాలితో ఇచ్చింది''     ''నువ్వు చెప్పివన్నీ అబద్ధాలు కాదు. పెళ్ళికి ప్రధానం అమ్మాయి అబ్బాయిల మనస్సులు కలవడం. మిగిలినవన్నీ కృత్రిమమైన అడ్డంకులు''     ''అలా చెప్పడం చాలా తేలిక మేడమ్‌. వీటితో ప్రాక్టికల్‌ ప్రాబ్లమ్స్‌ చాలా వస్తాయి''     ''పెద్ద అనుభవజ్ఞుడిలాగా చెబుతు న్నావే. వీటన్నింటినీ ఫేస్‌ చేసినవాడిలాగా...''     ''ప్రతీది అనుభవంమీదే తెలిసికోనక్కర్లేదు. కొన్ని ఇతరులను చూసి, మరి కొన్ని పుస్తకాలు చదివి.. ఇంకా కొన్ని సినిమాలు, టి.వీలు చూసి''     ''సినిమాలు, టీవీలు చూసి అన్నావు ఒప్పుకుంటాను. నువ్వు పుస్తకాలూ చదువుతావా?''     ''డ్యూటీ ముగించాక నేను పుస్తకాలే చదువుతాను. ముఖ్యంగా మన తెలుగు రచయిత్రులు రాసినవి. మీకు నమ్మకం లేకపోతే ఒకసారి నా రూమ్‌కు రండి చూద్దురుగాని''     ''చాల్లే, అదొకటా మళ్ళీ? ఇక్కడిలా మాట్లాడుకోవడానికే భయపడి చస్తుంటే, ఇంకా నీ రూముకి వస్తే  అందరి మాటా ఎలాగున్నా నువ్వే భయపడి పారిపోతావ్‌!'' అంటూ నవ్వడం మొదలు పెట్టింది.     ''ఓసి పిచ్చిపిల్లా! ఇదంతా నటన  అని నీకు  తెలిసేసరికి సమయం మించిపోతుంది'' అని అనుకుంటూ మౌనముద్ర దాల్చాడు.     రజియా కొనసాగించింది.  ఇవ్వాళ తేల్చుకోవాలని నిర్ణయించింది కదామరి.     ''నేను మా నాన్నగారిని ఒప్పించగలననే ధైర్యం నాకుంది''.     ''రజియా మేడమ్‌! మీ ఇంటిలో తుపాకి ఉందా?''     ''అదేంటి? తుపాకీ ఊసిప్పుడెం దుకొచ్చింది?''     ''చెబుతాను వినండి మీరు మీ నాన్నగారికి చెప్పి మన పెళ్ళికి ఒప్పిస్తానన్నారుకదా?''     ''అవునూ!''     ''ఆ సంగతి ఆయనకు మీరు చెప్పగానే తుపాకీ (ఉంటే) తీసుకొని సరాసరి నన్ను గురిచూసి కాలుస్తారు. ఎవరైనా అంతే. నేను మీ నాన్నగారి పాత్రలో ఉన్నా ఈ ప్రభాకర్‌గాడిని కాల్చి చంపేస్తాను. తరువాత జరిగే పరిణామాల గురించి ఆలోచించకుండా... ! ఇంకా వినండి, మీరు ఆయనకీవిషయం  చెప్పగానే నా దగ్గరకొచ్చి గదిలోంచి బయటికి పిలుస్తారు. ''ఓరి నీచుడా! ఏదో బ్రతుకుతెరువుకోసం నన్ను బ్రతిమాలితే మా అమ్మాయిని నీ ఆటోలో పంపిస్తుంటే ఇదా నువ్వు చేసేది? అదీ మా మాస్టారు లక్ష్మీనారాయణగారి మాటమీద. నిన్ను స్పేర్‌ చేయకూడదు. ఇంకా ఎన్ని కొంపలు ముంచుతావో అంటూ తుపాకీ గుండుని నా ఛాతీపైకి వదులుతారు. అంటే నాకు పారిపోవడానికి కూడా సమయం ఇవ్వరు. సరాసరి పైకే...''     రజియా నిశ్చేష్టురాలయిపోయింది. అవున్నిజం. లక్ష్మీనారాయణగారి మాటమీదే నన్ను ఈ ఆటోలో పంపడానికి అంగీకరించారుకానీ ఈ ముక్కూ ముఖం తెలియనివాడిఆటోలో పంపేవారా? కొంతసేపు ఇద్దరూ మాట్లాడలేదు. - కొట్టి రామారావు సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

యాత్ర

  యాత్ర      ఏడేళ్ళు! తను పదవీవిరమణ చేసి అన్నేళ్ళయినా ఈ మధ్యనే ఉద్యోగ బాధ్యతలనుంచి తప్పుకున్నట్టుంది ప్రకాశరావ్‌కు. కాలం ఎంత వడివడిగా పరుగెడుతోంది? కృష్ణానదీతీరంలో బాలకుటీర్‌లో ఉన్న, మామూలుగా ఎవరూ పట్టించుకోని పిల్లలకు ఆంగ్లపాఠాలు నైతిక విలువల గురించి బోధించి అతను అప్పుడే ఇంటికి వచ్చాడు. పెరట్లో పడక్కుర్చీలో తేనీరు సేవిస్తూ సేదతీరుతున్నాడు. నగరంలో చాలావరకు అపార్ట్‌మెంట్‌లు, బహుళ అంతస్తుల భవనాలు, పచ్చదనాన్ని నిర్దాక్షిణ్యంగా ఆక్రమించుకుంటుంటే సత్యనారాయణపురంలోని  తన ఇంటి ప్రాంతంలో పరిసరాలు మాత్రం చెట్లు చేమలతో, ఉద్యానవనాలతో కళకళలాడుతూ అతనికి శేషజీవితం మీద ఆశను కోల్పోకుండా చేస్తున్నాయి.     బాదంచెట్టుమీద రెండు పకక్షులేవో ఊసులాడుకుంటున్నాయి. ఇంటిచుట్టూ చెట్లుండటంవల్ల బయటికంటే కాస్త  చల్లగానేవుంది. వేప, జామ చెట్ల ఆకుల సందుల్లోంచి  దొంగలాగా ఇంట్లోకి చొరబడ్డానికి సూర్యుడు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. హాల్లో గోడకు వేళ్ళాడుతున్న సీత ఫొటో బయటినుంచి వీస్తున్న గాలికి కొద్దిగా కదిలింది. ఆమె తననుంచి దూరమై మూడేళ్ళు పూర్తయ్యాయి. ఎవరు తనతోవున్నా, లేకపోయినా ఆమె సహచర్యంలో సేదతీరేవాడు. కన్నీళ్ళు, కష్టాలు, ఈతిబాధలు ఎన్నొచ్చినా ఒకరికొకరు  ధైర్యం చెప్పుకుంటూ ఇరుసుకటూఇటూ చక్రాల్లా జీవన సమీకరణాన్ని  సమతుల్యం చేసుకుంటూ క్షణక్షణాన్ని ఆస్వాదించేవాళ్ళు. కానీ రొమ్ముభాగంలో పుట్టిన రాచపుండు ఆమెను గద్దలా తనదగ్గర్నుంచి తన్నుకుసోయింది. --------------     ఇంట్లోని ఫోన్‌మోగడంతో అతను లోపలికి వచ్చాడు. శ్రీనివాస్‌ యు.ఎస్‌ నుంచి. ''నాన్నా ఎలా వున్నారు? ఏ ఇబ్బందీ లేదుకదా!'' అన్నాడు. ''లేదు శ్రీను, నేను సంతోషంగానే వున్నాను. ఆరోగ్యం కూడా పరవాలేదు'' అన్నాడు ప్రకాశరావ్‌. ''ఇంకా ఎన్నాళ్ళు నాన్నా ఒక్కడివే అక్కడుంటావ్‌? ప్లీజ్‌ కమ్‌ అండ్‌ స్టే విత్‌ అజ్‌ '' అన్నాడు శ్రీను. ''చూద్దాంలే అప్పుడే తొందరేముంది. నేను బ్రతకలేననుకున్నప్పుడు తప్పకుండా వస్తాలే'' అన్నాడు ప్రకాశరావ్‌. ''నువ్వెప్పుడూ ఇలాగే అంటావ్‌ నాన్నా'' అంటూ ఇంకాసేపు మాట్లాడాడు. సంభాషణ ముగిసిన తర్వాత అతను బ్రెడ్‌ టోస్ట్‌ చేసుకున్నాడు. నెస్కఫీతో అల్పాహారాన్ని ఆరగిస్తూ ఐప్యాడ్‌లో పాత హిందీ పాటలు వింటున్నాడు.  ఆ గానలహరిలో అతను ఈ లోకాన్ని మరచిపోయాడు. --------------     పక్కరోజు  బాలకుటీర్‌లో ఒక కొత్త పరిస్థితి ఎదురయ్యింది. వెళ్ళగానే అక్కడి మేనేజర్‌ మనోజ్‌ ''సార్‌ మీరు పిల్లలమీద మరింత శ్రద్ధ పెట్టాలి. వాళ్ళలో కొందరి భద్రతాభావం  బాగా పెరిగిపోయింది.  మన ఆలనాపాలనా  బాగావుందికాబట్టి ఎల్లకాలం ఇలాగే వుంటుందని, తమ జీవితానికి ఏ ఢోకా లేదని  ధీమా పెరిగిపోయింది. చదువు సరిగ్గా సాగడంలేదు. పైగా కొందరిలో పొగత్రాగడంలాంటి అలవాట్లు మొదలయ్యాయి. వీళ్ళు తాచెడ్డకోతుల్లాగా మిగతావారిని కూడా పాడుచేస్తున్నారు. ఈ పరిస్థితిని మనం తొందరగా చక్కదిద్దాలి'' అన్నాడు.      ప్రకాశరావ్‌ ఆ రోజు క్లాస్‌లో, యువత స్వతంత్రంగా ఆలోచించడం గురించి అట్టడుగు స్థాయినుంచి స్వశక్తితో పైకెదిగిన కొందరి  జీవిత కథలను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించాడు. తర్వాత అభియోగాన్నెదుర్కొంటున్న కృష్ణఅనే అబ్బాయికి  వేరేగదిలో కౌన్సిలింగ్‌   మొదలెట్టాడు.  ఆ బాబుకి ఐదేళ్ళ వయసులో   రైల్వేస్టేషన్‌ దగ్గర అనాథగా తచ్చాడుతుంటే  బాలకుటీర్‌  కార్యకర్తలు తీసుకొచ్చారు. ''కృష్ణా ఎలావున్నావ్‌? అంతాబాగానేవుందా ఇక్కడ?'' ఎదురుగా కూర్చున్న అతనిని అడిగాడు ప్రకాశరావ్‌. ''చాలా బాగుంది సార్‌ ఏ విధమైన ఇబ్బంది లేదు''. ''మరినువ్వు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావ్‌?'' ''ఆ విషయం గురించి ఆలోచించడంలేదు సర్‌. ఇప్పుడే దాని గురించి తొందరేముంది?'' ఎదురు ప్రశ్నించాడు వాడు. అతనిప్పుడు కుటీర్‌వాళ్ళు నడుపుతున్న స్కూల్లోనే పదవతరగతిలో వున్నాడు.     ''కాదు కృష్ణా నువ్వెప్పుడూ ఇక్కడే వుండిపోవు. పై చదువులు చదవాలి. నీ అంతట నువ్వు స్వతంత్రంగా బతుకుతూ పదిమందికి సహాయపడే స్థితిలోవుండాలి''.    అంటూ చాలాసేపు ఓపిగ్గా చెప్పాడు. అయినా వాడిలో అప్పుడే పెనుమార్పునాశించడం అత్యాశ అవుతుంది. నెమ్మదిగా అతన్నీ, అతని ద్వారా ప్రభావితమవుతున్న ఇతరులను గాడిలో పెట్టాలనుకున్నాడు ప్రకాశరావ్‌. ఇలాంటి ఒత్తిళ్ళనెదుర్కోవడం అతనికి సవాల్‌గా వుంది. కానీ అందులో చాలా తృప్తి, అర్ధంకూడా ఉన్నాయి. ----------     ప్రకాష్‌ ఆంగ్ల ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం ఆరంభించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పదవీవిరమణ పొందాడు. ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు. కొన్ని చేదువి మరికొన్ని తీయనైనవి. తన అదృష్టం సీత భార్యగా దొరకటం. ఆమె... శ్రీను, లక్ష్మి పుట్టాక  అంతకు ముందుదాకాచేస్తున్న ఉద్యోగం వదిలేసి పూర్తిసమయం వాళ్ళకు కేటాయించింది.  ఆమెది తనకులం కాదు. అయినా ఇద్దరూ భావుకులు. తను తెలుగు సాహిత్యంలో పరిశోధనకూడా చేసింది. గుంటూరులో అతను పని చేస్తున్నప్పుడు పరిచయం అయింది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నట్లు  ఇంట్లో చెప్పినప్పుడు పెద్దయుద్ధమే జరిగింది. '' ఏరా మన సాంప్రదాయం ఏం కావాలి? నేను నీ పెళ్ళికి ఒప్పుకుంటే మన బంధువర్గంలో తలెత్తుకు తిరగ్గలనా'' అన్నాడు నాన్న. అమ్మయితే కళ్ళనిండా నీరుకుక్కుకుంది.     అనూహ్యంగా బామ్మ మాత్రం నాన్నతో ''ఒరేయ్‌ రాఘవా అమ్మాయి చక్కగా సాంప్రదాయబద్ధంగా బుద్ధిగా వున్నట్టుంది. కులం మనది కాకపోయినంతమాత్రాన వచ్చే నష్టం ఏముంటుంది'' అంటూ ప్రకాశ్‌కి నైతిక ఆసరా ఇచ్చింది. అయితే సీతావాళ్ళనాన్న ససేమీరా ఒప్పుకోలేదు. ప్రకాశరావ్‌ సీతను పెళ్ళి చేసుకోవడం మానలేదు. అందుమూలంగా ఇద్దరికీ అతనింట్లో ఆ తర్వాత ప్రవేశం దొరకలేదు. కానీ వాళ్ళిద్దరూ అధైర్య పడలేదు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ బ్రతుకు పండించుకున్నారు. అయితే ఇప్పుడు అన్నీ జ్ఞాపకాలే మిగిలాయి. ఎవరో మహానుభావుడన్నట్లు జీవితమంటే కొన్ని జ్ఞాపకాల శకలాల సమాహారం కదా! అని తరచుగా అతననుకుంటూంటాడు. తను కులాంతర వివాహం చేసుకున్నందుకు అభినందించిన వాళ్ళూ లేకపోలేదు. ---------     శ్రీను, లక్ష్మి రెండేళ్ళ వ్యవధిలో ప్రకాశరావ్‌ సీతల జీవితంలోకి రావడం కొంత ఊరట కలిగించింది. కానీ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళేకులానికి  చెందుతారన్న ఆసక్తి, ఆరా వాళ్ళు పాఠశాలలో ప్రవేశించేటప్పుడు మళ్ళీ తెరమీదికొచ్చింది. అక్కడి అధికారిణి '' సార్‌ మీరు పిల్లల్ని చేర్చినప్పుడు ఏ కులానికి చెందుతారో వ్రాయలేదు'' అంది.  ''కులవ్యవస్థపోవాలని అంటున్నారు కదా! అలాంటప్పుడు దాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందంటారా?'' అన్నాడు ప్రకాశరావ్‌. ''లేదు సార్‌ మేము ప్రభుత్వానికి ఈ వివరాలు తప్పకుండా అందజేయాలి. కాబట్టి ఇవ్వక తప్పదు'' అందామె. అతను తప్పని పరిస్థితులలో ఆ వివరాలు చెప్పాడు కానీ చాలా రోజులు అతన్ని ఆలోచనలు మాత్రం వెంటాడాయి. వేదికలమీద అందరూ సమానత్వం కావాలంటారు. కానీ ప్రాంతీయ, కుల, మత, గోత్ర, శాఖ, నక్షత్రాల్లాంటి సవాలక్ష విభేదాలు చాలామందిలో వేళ్ళూనుకునిపోయాయి. అమ్మాయో, అబ్బాయో మన కులంవాళ్ళు కాకపోతే  తల్లిదండ్రులు ఆ వివాహానికంగీకరించరు. ఇక సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని అంశాల్లో అంగీకారం కుదిరినా సగోత్రికులన్న ఒకేఒక కారణంతో అవివిఫలమవ్వడం ఎన్నోసార్లు చూశాడు. తనుగానీ సీతగానీ ఎదుటివారిని మీరెవరనీ మీదేకులమనీ అడిగిన సందర్భాలులేవు. ఎంతో మంది విద్యార్థులను వాళ్ళేవర్గానికి చెందినవారైనా అక్కున చేర్చుకున్నారు. నిబంధనలు లేని ప్రేమను వాళ్ళకు పంచారు. -----------------     ఓ రోజు సాయంత్రం ప్రకాశరావ్‌కు తన ఈడువాడే ఐన సన్నిహిత మిత్రుడు రామారావు పార్కులో కనిపించాడు. అతను అరవైఐదేళ్ళ వాడే ఐనా మరో ఐదు సంవత్సరాలు మీద అనిపిస్తున్నాడు. నిర్వేదంగా కూడా వున్నాడు. కొంచెంసేపు  పిచ్చాపాటి మాట్లాడుకున్న తరువాత అతను బేలగా ''నాకు చచ్చిపోవాలనుంది ప్రకాశ్‌'' అన్నాడు. రామారావు కొడుకు కోడలితో పాటు గాంధీనగర్‌లో వుంటున్నాడు. తనే మళ్ళీ ''చాలా ఒంటరితనం అనుభవిస్తున్నాను. నేను ఎవరికీ అక్కర్లేదు. భార్య పోయాక  నాకిక బతకడంలో అర్ధలేదనిపిస్తూంది. అబ్బాయి కుటుంబానికి నేను  గుదిబండలాగా అయ్యానేమో?'' అన్నాడు. ''నీకు పింఛను వస్తోందికదా'' అన్నాడు ప్రకాశరావ్‌. ''డబ్బుఒక్కటే సమస్య కాదు. వాళ్ళు నాతో ఇమడలేకపోతున్నారు. నా కొడుకు పైకి చెప్పలేక బాధపడుతున్నాడు'' అన్నాడు.     రామారావు కొడుకు అనిల్‌ తనకి బాగానే తెలుసు. స్వార్ధపరుడు కాదు. ఈ రోజుల్లో అందరి జీవితాలూ సహజంగానే వేగవంతమయ్యాయి. అతను, భార్య ఇద్దరూ ప్రైవేట్‌ సంస్థల్లోనే పనిచేస్తున్నారు. వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకుంటాయి. రామారావుకి, తనకి పెద్దతేడా ఏమీ లేదు. తాను స్వతంత్రంగా బతుకున్నాడంతే. తను పిల్లలకు జంఝాటంకాదు. శ్రీను అమెరికాలో, లక్ష్మి బెంగుళూరులోవుంటున్నారు. తను వాళ్ళదగ్గర శాశ్వతంగా  వుండలేడు. కొన్నేళ్ళ క్రితం తను, సీత అమెరికాలోని మాడిసన్‌కు దగ్గరలో వాసా అనే చిన్న ఊరిలో పని చేస్తున్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళతోవున్నారు. అక్కడ విపరీతమైన చలి.  పక్కింటికో, ఉద్యానవనానికో వెళ్దామన్నా వీల్లేనిపరిస్థితి. అప్పటికీ కొద్దిదూరంలో వున్న గ్రంథాలయంలో సమయం గడపటానికి ప్రయత్నించారు. తన కొడుకు, కోడలు ఉదయాన్నే కార్యాలయాలకి వెళ్ళి సాయంత్రానికిగానీ  తిరిగిరారు. అలా నెలన్నర పోయాక వుండలేక విజయవాడకు తిరిగొచ్చారు.     ఇప్పుడు సీత లేదు. ఆమెలేనిలోటు తప్ప  అతనికి ఇక్కడే హాయిగావుంది. ఎండలెక్కువే ఐనా ఇతరత్రా బాగానేవుంది. చుట్టూతా కొండలు. ఎక్కడికెళ్ళినా అవిమనతోనే ఉన్నట్లుంటాయి. రోజూ ఎక్కడో ఓ చోట సంగీత, సాహిత్య, నాటక కార్యక్రమాలు జరుగుతూంటాయి.   తను ఖాళీ దొరికితే ఏదోకటి చదువుతూ ఉంటాడు. కవితల్ని వ్రాసుకుంటూంటాడు. ఎలాగూ బాలకుటీర్‌కు చాలా సమయమే కేటాయించాలి. ఇన్ని వ్యాపకాలతో తనకు ఉన్న సమయమే సరిపోవడంలేదు.     తన ఆలోచనలు తెగాక ''నీ సమస్యకు చావు పరిష్కారం కానేకాదు రామారావు. ఖాళీ సమయాల్లో కేవలం టి.వి. సీరియళ్ళు చూడటం కాక మంచి వ్యాపకాలనలవరచుకుంటే  సమయం సద్వినియోగమవుతుంది. కావాలంటే నాతోపాటు బాలకుటీర్‌కు రా. అక్కడి పిల్లలకు నీ అవసరం కూడా ఉంది. ఐతే నేను చేసినవన్నీ నిన్ను చేయమనడంలేదు. నీకిష్టమైన వ్యాపకాలను గుర్తించి కొనసాగించు'' అన్నాడు. అందుకు రామారావు ''నా భార్య పోయినదగ్గర్నుంచి నాకు జీవితం మరీ నిస్సారంగా అనిపిస్తోంది. బ్రతుక్కర్ధం కనిపించడంలేదు'' అన్నాడు.     ''నిజమే! సీత పోయాక నాక్కూడా అలాగే ఉండేది. కానీ ఏం చేస్తాం? భూమ్మీద ఏవరూ శాశ్వతం కాదు. మనమందరం రైలు ప్రయాణికులం. ఎప్పుడు ఎవరి స్టేషన్‌ వస్తే వాళ్ళు దిగిపోవలసిందే. ఐతే అదెప్పుడో ఎవరికీ తెలియదు. మిగతావాళ్ళు తమ గమ్యం చేరుకునేదాకా ప్రయాణాన్ని  కొనసాగించవలసిందే. అలాగని నేనేదో పెద్ద వేదాంతిని కాదు. కొన్ని విషయాల్లో మనం తామరాకుమీద నీటి బొట్టులావుండాలి. ఇది నా స్వానుభవం. అంతేగాక సమాజంలో మనకన్నా ఎన్నో కష్టాలు భరిస్తున్నవాళ్ళు చాలామందే వున్నారు. మన మిత్రుడు శంకర్రావు విషయమే చూడు. ఉన్న ఇద్దరు కొడుకులూ ఆస్తి అంతా వ్రాయించుకుని ఇప్పుడు అతన్ని వృద్ధ శరణాలయంలో విడిచిపెట్టారు. డబ్బులుండీ, పిల్లలకి ఆస్తులిచ్చి అతనికా కర్మేంటి? ఇంకా చాలామంది వృద్ధులు ఎవరి ప్రేమకూ నోచుకోక బ్రతుకు గడుపుతున్నారు. వీళ్ళందరితో పోలిస్తే నీ పరిస్థితి చాలా మెరుగు. ఐనా పెద్దవాళ్ళు ఏ దేశానికైనా జాతీయ సంపదలు. వాళ్ళనుంచి యువతరం, పిల్లలు గ్రహించవలసినవి,  నేర్చుకోదగ్గవి చాలా విషయాలుంటాయి. ఆలోచించి చూడు'' అన్నాడు ఆప్యాయంగా ప్రకాశరావ్‌. రామారావుకు తనెప్పుడో చదివిన స్వామి వివేకానంద 'డిటాచ్డ్‌ అటాచ్మెంట్‌' జ్ఞాపకం వచ్చింది. ----------------     కొన్నిరోజులు పోయాక బాలకుటీర్‌లో పరిస్థితి మెరుగయ్యింది. కృష్ణ చిన్నతరగతి పిల్లలకి వాళ్ళకర్ధంకాని పాఠాలను వివరించి చెపుతున్నాడు. మరింత బాధ్యతతో కుటీర్‌కు సంబంధించిన విషయాల్లో సహాయమందిస్తున్నాడు. రామారావు కూడా బాలకుటీర్‌లోనూ ,ఊర్లోవున్న వృద్ధ మరియు అనాథ శరణాలయాల్లో తనవంతు సేవలందిస్తున్నాడు. ఆ రోజు పౌర్ణమి.  వెన్నెల భూమ్మీద వెండి దుప్పటి కప్పినట్టు ఆవరించి వుంది. ప్రకాశరావు రాత్రి భోజనం ముగించి పడక్కుర్చీలోనే వెన్నెల విహారం చేస్తున్నాడు. రేడియోలోంచి మంద్రస్వరాన  ముఖేష్‌ 'జీనాయహా మర్నాయహా' అంటూ ఆత్మతో పాడుతున్నాడు. తను క్షణక్షణాన్ని ఆస్వాదిస్తున్నాడు. భౌతికంగా సీత అతనితో లేకపోయినా తను పెద్దగా ఒంటరి కాలేదు. ఆమె జ్ఞాపకాలు అతని వెన్నంటే వుంటూ సర్వదా ఉత్తేజ పరుస్తూ ఉన్నాయి. ప్రకాశరావ్‌ అర్ధవంతంగా  బ్రతుకుతున్నాడు. ఈ జీవనయాత్ర తనంతగాతాను సహజంగా అంతమయ్యేవరకూ నిరంతరం సాగిపోతూనే వుండాలి.  'కష్టాల్‌ నష్టాల్‌, కోపాల్‌ తాపాల్‌' అని శ్రీశ్రీ అన్నట్లు ఈ యాత్ర కొనసాగ వలసిందే అని అనుకున్నాడు ప్రకాశరావ్‌. - బి.వి. శివప్రసాద్‌ సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

విహారంలో వినోదం

  విహారంలో వినోదం       ''మేడమ్‌, మీరు రాకపోతే మేం వెళ్లం మేడమ్‌. మీరు మమ్మల్ని తీసుకెడుతున్నారని చెప్తేనే మా వాళ్ళు పంపిస్తానన్నారు'' అంది ఉష సీతా మేడమ్‌ ఇంట్లో సోఫాలో కూర్చొని.     అది కాలేజీ నుంచి వెళ్ళే టూర్‌. ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌ లెక్చరర్లు టూరు ప్రోగ్రామ్‌ వేయటం అంతా అయింది. స్టూడెంట్‌ అడ్వైజర్‌గా ఉండే సీతామేడమ్‌ తప్పకుండా రావాలని కోరారు స్టూడెంట్స్‌. ఇంకో లెక్చరర్‌, స్టూడెంట్‌ అడ్వైజర్‌ వెళుతోంది. తనెందుకూ? సీత ఉష మాటల్ని వింటోంది.     ''చూడు ఉషా నీ ఫ్రెండ్స్‌, నా మేడమ్స్‌ ఉన్నారు కదా! నాకు రావాలనిలేదు. మీరంతా సరదాగా వెళ్ళిరండి'' అంది స్వెటర్‌ అల్లుతూ సీత.     ''సరే మేడమ్‌, అసలు ఈ టూర్‌ కాన్సిల్‌ చేయించేస్తాములెండి మీరు లేకుండా  నేను వెళ్ళను'' అంది చిన్నపిల్ల్లలా ఏడుపు మొహం పెట్టి.     సీతకు ఒకటే భయం. ఒకసారి ఒక లెక్చరర్‌ చెప్పింది. ''బాబోయ్‌! ఇంకెప్పుడూ పిల్ల్లల్ని తీసుకెళ్ళను. ఇప్పుడిలా మంచిపిల్లల్లా ఉంటారా, ఒక్కసారి బస్సు దిగగానే ఇక మనమాట వినరు'' అని. ఆ మాట గుర్తొచ్చింది సీతకి.     మళ్ళీ అనుకుంది. తన కాలేజీ పిల్లల్ని తను కంట్రోల్‌ చేయలేకపోవటమేమిటీ?  అంతగా అడుగుతుంటే రానని మొండికేసి ఉష మనసు బాధపెట్టడమేగా. -----------     బస్సు బయలుదేరింది. అమ్మాయిలంతా ఎంతో హుషారుగా పాటలు పాడటం, అంత్యాక్షరి ఆడుకోవటం, జోక్స్‌ చెప్పుకోవటం. ఆ ఆనందం చూస్తూ సీత అనుకుంది. రాకపోతే  ఈ ఆనంద ఘడియలు పోగొట్టుకునేదాన్నేగా! సీత కూడా స్టూడెంట్స్‌తో కలిసిపోయింది.     ''వాళ్ళతో అంతగా కలిసిపోకు. మనల్ని లెక్కచేయరు తరువాత'' రహస్యంగా చెప్పింది లెక్చరర్‌ విజయ. సీత నవ్వి ఊరుకుంది. ----------     బస్సు దిగారంతా. అమ్మాయిలు రకరకాల రంగుల డ్రస్సులతో, ఎర్రటి లిప్‌స్టిక్‌ పెదాలతో, జుట్టు విరబోసుకుని, రబ్బరు బ్యాండ్లు పెట్టుకొని, జీన్స్‌, చూడిదార్‌ పైజమాలతో ఎంత అందగానో కనిపించారు సీతకి. పైగా యవ్వనమే ఒక  అందం కదా!     సీత అలా చూస్తుండగానే మరో బస్సు పక్కనే ఆగింది. దాంట్లోంచి బిలాబిలా దిగారు కుర్రాళ్ళు. ఏ కాలేజీ వాళ్ళో ఏమో! క్షణంలో అబ్బాయిలు, అమ్మాయిలూ 'హాయ్‌' అంటూ పలకరించుకున్నారు.  ''మీరు మీ మేడమ్‌ని వెంటబెట్టుకొస్తే, మా దోవని మేమే పిక్నిక్‌ వేసుకున్నాం'' అంటూ సీత, విజయ మేడమ్స్‌ని చూసి, నమస్తే మేడమ్‌ అన్నారు కొందరు. అబ్బాయిలు ఎందుకు రావాలి ఇప్పుడు? సీతకనుబొమ్మలు ముడిపడ్డాయి.     ఇది సీత ఊహించనిది. మేడమ్స్‌ అమ్మాయిల్ని ఎక్కడికి తీసుకెడితే అబ్బాయిలూ అక్కడికొచ్చారు. మేడమ్‌ కొన్ని ప్రత్యేకంగా వివరంగా చెప్తుంటే అబ్బాయిలూ పక్కనే నిలబడి తలలూపుతున్నారు.     సీతకి మాత్రం లోపల ఏదో భయంభయంగానే వుంది. అసలు ఆ కుర్రాళ్ళకి, ఈ కాలేజీ అమ్మాయిలు ఇక్కడికొస్తున్నారని ఎలా తెలుసో అనుకుంది మనసులో. అంతలో ''కొందరమ్మాయిలు వాళ్ళ బాయ్‌ఫ్రెండ్స్‌కి ముందే చెబుతారు మేం వెడుతున్నామని. అదంతా వాళ్ళ వాళ్ళ స్నేహాల్లే. నీవు కంగారుపడకు.  కాకపోతే, ఓ కన్నేసివుంచు'' అంది విజయ.     సీత అలా చూస్తుండగానే అబ్బాయిలూ, అమ్మాయిలు గ్రూపులుగ్రూపులుగా అయి తలో వైపుకి వెళ్ళడం, ఫోటోలు తీయించుకోవడం. క్రికెట్‌ ఆట|| అబ్బాయిలతో పాటు స్టంప్స్‌, బ్యాట్‌, బాల్స్‌, చేతి గ్లౌజులు ఇలా ఇకటొకటే బస్సులోంచిదించారు.      ''మేడమ్‌ సరదాగానే ఇది అంతే, ఇలా చూస్తుండగానే అలా అయిపోతుంది మేడమ్‌'' అంటూ అక్కడున్న ఖాళీ స్థలంవైపు అబ్బాయిలూ అమ్మాయిలూ వెళ్ళిపోతుంటే విజయ నవ్వింది. సీత బెదిరింది.     ''అసలు టూర్‌లో నేర్చుకోవటం, తెలుసుకోవటం తక్కువ, ఈ వినోదం ఎక్కువ'' అని ఇప్పటికి పిల్లలతో టూర్లకొచ్చి బాగా అనుభవం వచ్చేసిందిలే'' అంది విజయ. విజయ, సీత అక్కడున్న చెట్టునీడన కూర్చొని ఆట చూస్తున్నారు.     ''ఇక రండి'' అంది సీత. అప్పటికి అమ్మాయిలంతా గబగబా వచ్చేశారు. చీకటి పడుతోంది.     అందరిలో ప్రవీణ గడియారం చూసుకుంటూనే వుంది. సీతకి అర్ధంకాలేదు. భోజనం పైనకన్నా గడియారం పైనే దృష్టి ప్రవీణకి.     ''మేడమ్‌! సరిగ్గా ఎనిమిదన్నరకి టివీలో సీరియల్‌ వస్తుందండీ. అది మేమిద్దరం చూసితీరాలి. ఎక్కడున్నా సీరియల్‌ మిస్‌కాము మేడమ్‌'' అలా ప్రవీణ చెప్తుంటే, సీత నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ ''ఎక్కడికెళ్ళి చూస్తారీ సీరియల్‌'' అన్నారు సీతామేడమ్‌.     ''మా మామయ్య అత్తయ్య వచ్చి తీసుకెళతారు మేడమ్‌, మళ్ళీ తీసుకొచ్చి దించేస్తారు. మీరేం కంగారు పడకండి''     ''ఏమిటిది? టూరుకొచ్చి సీరియల్‌ చూడాలని, సినిమా చూడాలని అంటే ఎలా? ఐ యామ్‌ సారీ. వెళ్ళడానికి వీల్లేదంతే'' అంది సీత.     '' మరిచిపోయా మేడమ్‌, రేపు మార్నింగ్‌ షోకి వెళదామని ప్లాన్‌ చేసుకున్నాం'' అంది ప్రవీణ. ప్రవీణ తండ్రి పెద్ద కాంట్రాక్టర్‌. చాలామందితో గొప్ప స్నేహాలు. ప్రవీణ గర్వమంతా అదే.     ''ప్రవీణా! రేపుకూడా మనం చూడాల్సినవివున్నాయి. ప్లాన్‌ చేసింది మేము. స్టూడెంట్స్‌ కాదు. మన ఊరి నిండా సినిమాలేగా ఉంది'' అంది సీతా మేడమ్‌. ''ప్రవీణా నువ్వు సీిరియల్‌ చూడ్డానికి, సినిమా చూడ్డానికి వీల్లేదు. అందరిపిల్ల్లలతోపాటే నువ్వూ'' అంది గట్టిగా విజయ.     అంతలోనే లోపలికొచ్చాడు ప్రవీణ మామయ్య. ''ఆ సీరియల్‌ అవగానే తీసుకొచ్చి దించేస్తా కంగారు పడకండి'' అని తన విజిటింగ్‌ కార్డు సీతకిచ్చాడు. అతను పెద్ద ప్రభుత్వ ఉద్యోగి.     నిజంగా మామయ్యేనా? అలా పంపటం పొరపాటా? ఈ పిల్లలతో టూర్లంటేనే సీతకిష్టంవుండదు. ''విజయా, నిజంగా మామయ్యే అంటావా'' అంది చాలా ఆవేదనతో సీత.     ''మామయ్యే, మామయ్య కాకపోతే మామయ్యలాంటివాడు. పిల్లల్ని ఇలా రకరకాల టూర్లకి తెచ్చి తెచ్చి అనుభవంతో పండిపోయా'' అంది విజయ చాలా నిర్లిప్తంగా సెల్‌ చెవి దగ్గర పెట్టుకొని. ------------     ''ఎన్ని చూస్తాం మేడమ్‌, మేమింక ఏమీ చూడం'' అంది ప్రవీణ. ''మేమిద్దరమే కాదు, ఇంకా కొందరు మాతో సినిమాకొస్తున్నారు. అయినా విహారమైనా వినోదం  కావాలిగా'' అన్నాడు ప్రవీణ పక్కన నిలబడ్డ నల్ల మీసాలు, ఎర్ర షర్టు, నొక్కుల జుట్టు అందంగా కనిపిస్తున్న ఇంజనీరింగ్‌ చదివే కుర్రాడు. సీత నోట మాటరాలేదు. అంతా సినిమాకని వెళ్ళిపోతుంటే, సినిమాకో మరెక్కడికో? అంత అమాయకంగా వుండే అమ్మాయిలు ఒక్కసారి ఇంత ధైర్యం-బాబోయ్‌! ఇంకెప్పుడూ ఇలా రాను'' సీత చాలా బాధపడిపోయింది. విద్యార్ధినుల క్రమశిక్షణారాహిత్యాన్ని తల్చుకుంటే విద్యార్ధి థ ఇంతేనేమో? నాకర్థకాదు నిట్టూర్చింది సీత.     టూర్‌నించి అందరూ క్షేమంగా కాలేజీముందు బస్సుదిగాక సీత ఊపిరితీసుకుంది హాయిగా. ---------------     సీత, రవీంద్ర కాఫీ తాగుతుంటే ''సీతా! ప్రవీణ అనే అమ్మాయి మీతో వచ్చిందికదూ'' అన్నాడు రవీంద్ర. ఉలిక్కిపడింది సీత. ప్రవీణ బాయ్‌ఫ్రెండ్‌తో సినిమాకి వెళ్ళడం గుర్తొచ్చి ప్రవీణ చాలా బుద్ధిమంతురాలని, మేడమ్స్‌ అంటే చాలా భయం, గౌరవం అని, సీతామేడమ్‌ వస్తున్నారు కనుకే ప్రవీణ తల్లిదండ్రులు పంపారని ప్రవీణ బాబాయ్‌ మా కొలీగ్‌ ఆ విషయం చెప్పాడు'' అని రవీంద్ర అంటుంటే ఆఁ చాలా మంచి పిల్ల, మేడమ్స్‌ అంటే చాలా భయం అంది సీత వచ్చే నవ్వు ఆపుకుంటూ.     -------------     నెలరోజులయ్యేసరికి ఓ సాయంత్రం ఇంటిముందు పెద్ద కారు, కారులోంచి ప్రవీణ, ఆ రోజు టూరులో కనిపించిన అబ్బాయి దిగారు. ''మేడమ్‌ మీరు అంకుల్‌ తప్పకుండా రావాలి'' అంటూ శుభలేఖ చేతికందించాడాఅబ్బాయి.     విహారంలో వినోదం, ప్రేమ - ఇప్పుడీ పెళ్ళి శుభలేఖ! సీత చేతిలో శుభలేఖ కదులుదోంది. అమ్మాయిలు ఫాస్ట్‌ అని, అబ్బాయిలు ఫాస్ట్‌ అని వింటున్న సీత అనుకుంది కాలమే ఫాస్ట్‌ అని. డా||ముక్తేవి భారతి సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

కుడి ఎడమైతే

  కుడి ఎడమైతే     అనగనగా ఓ నగరం!     అందులో ఓ మధ్యతరగతి గృహం. ఆ గృహంలో ఓ భర్త, ఓ భార్య. వారికో బా(ం)బు.     భర్త ఓ బ్యాంకులో క్యాషియర్‌. అంటే డబ్బు లెక్కపెట్టి ఇచ్చిపుచ్చుకునే యంత్రం.     భార్య హౌస్‌వైఫ్‌. అంటే వంటింట్లో కూరగాయల్ని యధేచ్ఛగా నైఫ్‌తో ముక్కలుముక్కలు చేసి కసిగా ఉడకబెట్టేది.     బాబుకు  ఏడాది వయస్సు. వాడిని చంటి అని పిలుస్తుంటారు. పుట్టినప్పటినుంచి వారిద్దరికీ రెస్టులేకుండా తన అల్లరితో ఆరెస్ట్‌చేసి నవ్విస్తూ, ఏడ్పిస్తూప్రాణాలు తోడేస్తున్న జీవి.     ఇక ప్రతి ఇంట్లో ఉన్నట్టే ఆ ఇంట్లోనూ రోజూ ఆలుమగల కీచులాటలు డైలీ సీరియల్‌లా సాగుతూవుంటాయి.     బ్యాంకులో నోట్లు లెక్కపెట్టి లెక్కపెట్టి అలసిపోయి ఇంటికి వచ్చి  భర్త, ఇంట్లో వంటలతో, చంటిగాడితో అలసి,సొలసి సొమ్మసిల్లిన భార్య తమ అలసటను తీర్చుకోవటానికి తమ ఎనర్జీని రీ జెనరేట్‌ చేసుకోవడానికి తీరిగ్గా పోట్లాడుతూవుంటారు.  ఈ పోట్లాటను వారి బాబు చాలా ఆసక్తిగా చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటాడు.  వాళ్ళు పోట్లాట ఆపగానే గుక్కపట్టి ఏడుస్తాడు.     ఇంతకీ ఈ భార్యా భర్తల పేర్లు మీకు చెప్పలేదు కదూ. వింటే నవ్వి పోతారు. భర్త పేరు సన్యాసిరావ్‌, భార్యపేరు సత్యభామ. నమ్మశక్యంగా లేదుకదూ. పేర్లకు, ప్రవర్తనకు బత్తిగా పొంతన కుదరదు. ఇది టూకీగా ఆ సగటు మధ్యతరగతి కుటుంబం. ఇక ప్రస్తుత కథలోకి దిగితే-     రాత్రి ఎనిమిది గంటల సమయం. సన్యాసిరావ్‌ భోజనానికి  కూర్చున్నాడు. సత్య వడ్డిస్తోంది. సన్యాసి అన్నంముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోతుండగా పక్కనున్న సెల్‌ ఒళ్ళు రaల్లుమనేలా మోగింది. సన్యాసి ఎడంచేత్తో సెల్‌ అందుకొని ‘‘హలో’’ అంటూ ముద్దనోట్లో వేసుకున్నాడు.     అంతే! బాంబు పేలినట్టు సెల్‌ పక్కన పడేసి నోట్లోని ముద్దను ఉమ్మేసి గట్టిగా అరిచాడు.     ‘‘అబ్బబ్బ! ఇదేంకూర? కూరలో కారం వేశావా? లేక కారంలో కూర వేశావా?’’     సత్య నవ్వుతూ ‘‘భలేవారే, ఏది దేన్లో వేయాలో నాకుతెలియదా? కూరలో కారం సరిగ్గానే వేశాను. మీ నోరే బాగా చెడిపోయినట్టుంది.         ఆ పాడు సిగిరెట్లు మానెయ్యండి అంది.     ‘‘ నీ తప్పును సిగరెట్ల మీదికి తోయకు. వంటరానిదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు?’’ సన్యాసి కస్సుమన్నాడు.     ‘‘ఆ మాటకొస్తే మీరు కరెక్టుగా ఉద్యోగం వెలగబెడుతున్నారా? మొన్న క్యాష్‌లో  పదివేలు తేడా వస్తే చేతినుంచి కట్టలేదా?’’ సత్య వెటకారంగా అంది.     ఆమె ఎత్తిపొడుపుకు సన్యాసికి మండిపోయింది.     ‘‘అలా కట్టింది నా డబ్బే. నీ బాబు డబ్బేం కాదు. అయినా ఆ టీ.వీ. చూస్తూ కాలక్షేపంచేసే  నీకు  ఉద్యోగంలో ఉండే బాధలు, టెన్షన్లు ఏం తెలుస్తాయి?’’ అన్నాడు వెక్కిరింతగా.     ‘‘బోడి ఉద్యోగం. నేనూ చేయగలను’’ అంది సత్య.     ‘‘అయితే చెయ్‌’’ అన్నాడు సన్యాసి.     ‘‘చేస్తా. మీరు చేయగలరా వంట?’’ అంది ఛాలెంజింగ్‌గా.     ‘‘ఓస్‌! వంట చేయడం కూడా ఓ పనేనా? చిటికెలో చేసేస్తాను’’ అన్నాడు సన్యాసి చిటికెలు వేస్తూ.     ‘‘అలాగైతే నేను రేపే ఉద్యోగంలో చేరుతాను. మీరు రేపట్నుంచి వంటచెయ్యండి’’ అంది సత్య విసురుగా.     ‘‘ఉన్నఫళాన నీకు ఉద్యోగం ఎవడిస్తాడు? డిగ్రీ ఉంటే చాలదు. అనుభవం లేనివారికి ఉద్యోగాలివ్వరమ్మా’’ అన్నాడు.     ‘‘నాకాభయంలేదు. ‘భీమాస్‌ రెసిడెన్సీ’ వాళ్ళమ్మాయి నా  క్లాస్‌మేట్‌. మొన్న కనిపించినపుడు ఊరికే ఇంట్లో కూర్చుని ఏం చేస్తావే? ఏదైనా జాబ్‌లో చేరరాదు’’ అంది. మాటల మధ్యలో వాళ్ళ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌ పోస్టు ఖాళీగా ఉందంది. ఇంట్రెస్ట్‌ వుంటే వచ్చి చేరమంది. రేపే వెళ్ళి చేరుతా’’ అంది సత్య.     ‘‘ఓహో! అంతా ముందే ప్లాన్‌ చేసుకున్నావన్నమాట. ఓకే, నేనూ రెడీ. రేపట్నుంచి నేను ఓ నెల రోజులు సెలవు పెడతాను. ఇంట్లోనే వుండి వంట చేసిపెడతాను, బాబుని చూసుకుంటాను. నీకు చేతనయితే ఉద్యోగం చేసి నాలా ఇల్లునడుపు చూద్దాం. సవాల్‌’’ అంటూ సన్యాసి సవాల్‌ విసిరాడు. సత్య జడతిప్పి సై సవాల్‌ అంది.     అలా ఆ దంపతులు పోట్లాట ముగియడంతో ఎడమొహం పెడమొహం పెట్టుకొని మౌనం వహించారు. ఇల్లంతా నిశ్శబ్దం కావటంతో అంతవరకు వాళ్ళ పోట్లాటను ఆసక్తిగా గమనిస్తున్న బాబు ‘‘ఆఆఆఆ...’’ అంటూ ఏడుపు లంకించుకున్నాడు. ుుు         సన్యాసిరావ్‌ మరుసటిరోజు బ్యాంకుకు సెలవుపెట్టి నేరుగా రైల్వేస్టేషన్‌కి వెళ్ళాడు.     అక్కడ బుక్‌స్టాల్‌లో రకరకాల వంటల పుస్తకాలు కొనుక్కొని ఆనందంగా ఇంటికొచ్చాడు. అప్పటికే సత్య ముస్తాబై బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. భర్తను కొరకొరా  చూసింది. సన్యాసి కూడా భార్యను నమిలిమింగేసేలా చూశాడు. గోదాలోకి దిగిన వస్తాదుల్లా ఇద్దరూ ఒకరినొకరు కసిగా చూసుకొని కళ్ళు నొప్పెట్టడంతో చప్పున ముఖాలు పక్కకు తిప్పుకున్నారు.     సత్య ఆటో ఎక్కింది. అది కదలగానే సన్యాసిరావ్‌  ఈల వేసుకుంటూ వంటింట్లోకి అడుగుపెట్టాడు. అప్పటికే అతని కడుపు ఆకలితో కేకలువేస్తోంది. రోజూ తెల్లవారగానే వేడివేడి కాఫీ కడుపులో వేడిగా పడేది. ఈ రోజు నో కాఫీ, నో టిఫిన్‌. వెంటనే ఏదో ఒకటి వండి కడుపునిండా తినాలనుకున్నాడు. చేతిలోని పుస్తకాన్ని తెరిచి  పేజీలు తిరగేశాడు.     ‘ఫలహారాలు శీర్షిక కింద రకరకాల టిఫిన్‌ ఐటమ్స్‌ ఎలా చేయాలో రాసివుంది. చకచకా చదివాడు. చదివాక  వాటికి కావలసిన పదార్ధాలు ముందే సిద్ధం చేసుకోవాలని అర్ధం అయింది. ఇడ్లీలు, దోసెలు చేయాలంటే పిండిని ముందే నానబెట్టి వుంచుకోవాలి. ఇక పూరీలు, వడలు చేయాలంటే బాణలిలో నూనెపోసి బాగా మరిగేదాకా వేడిచేయాలి. ఇప్పుడు తనున్న పరిస్థితిలో సాధ్యంకాదనుకున్నాడు. అయితే ఉప్మా చేయడానికి ఇంత తతంగం అక్కర్లేదని ఉప్మాతయారీకి పూనుకున్నాడు.     వంటింట్లో ఉప్మా రవ్వను వెతకడానికి డబ్బాలన్నీ తెరిచి చూడాల్సివచ్చింది. చివరికి ఉప్మారవ్వ దొరికింది. ‘యురేకా’ అని సంతోషంతో అరవబోయి ఆగాడు. ఇక మిగతా పోపు సామాన్లు ఓ పట్టాన దొరకలేదు. అన్నీ సిద్ధం చేశాక స్టౌ వెలిగించడానికి లైటర్‌కోసం వెతికాడు. వెదికి వెదికీ విసుగొచ్చి చివరికి తన సిగరెట్‌  లైటర్‌తోనే స్టౌ వెలిగించి పుస్తకంలో రాసినట్టుగా పొయ్యిమీద పెట్టిన పాత్రలో ఒక్కో పదార్థాన్ని వేస్తూ , మధ్య మధ్యలో గుటకలు మింగుతూ ఉప్మా తయారుచేశాడు.     కమ్మటి వాసన గుప్పుమనటంతో మత్తుగా కళ్ళుమూసుకున్నాడు. వరల్డ్‌ కప్‌ గెలిచినంత సంతోషం వేసింది. ‘యూ హావ్‌ డన్‌ ఇట్‌ సన్యాసి’’ అంటూ తనను తాను అభినందించుకున్నాడు. ఉప్మాను తలుచుకోగానే అతని నోట్లో నీళ్ళూరాయి. ‘ఆలస్యం అమృతం విషం’ అనుకుని ప్లేట్లోకి వడ్డించుకొని చెంచాతో ఉప్మాతీసుకొని తన్మయంగా కళ్ళుమూసుకొని  నోట్లో పెట్టుకున్నాడు.     ఉప్మా నోట్లో పడగానే అతడి ముఖం మాడిపోయింది. కనుగుడ్లు బయటికి వచ్చాయి తను వండిరది ఉప్మానేగా! మరి ఇదేమిటీ ఇది ఇలా వుంది? ఇందులో ఏదో ఎక్కువయ్యింది. లేదా ఏదో తక్కువయ్యుండాలి.  కాదుకాదు ఏదో వేయటం మరిచిపోయుండాలి. ఆ పుస్తకంలో రాసినట్టే తనుచేశాడు. మరి లోపం ఎక్కడ అని తర్జన భర్జన పడుతూ తలగోక్కున్నాడు. ఎంత గోక్కున్నా పొరపాటు ఎక్కడ జరిగిందో అతనికి అర్ధంకాలేదు. గిన్నెలోని ఉప్మాను తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పారవేయబోతూ ఆగాడు. ఒకవేళ ఇది సత్య కంట పడితే తన విఫలయత్నంమీద  విరగబడి నవ్వుతుంది. ఏంచేయాలా అని ఆలోచించి వీధి తలుపు తీసి ‘జూజూజూ’ అని అరిచాడు.     ఎక్కడినుంచో ఓ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. సన్యాసిరావ్‌ సంతోషంతో నవ్వుతూ దానికి ఉప్మావడ్డించాడు. అది వాసన చూసి గబుక్కున వెనక్కి జరిగి సన్యాసివైపు కోపంగా చూస్తూ ‘భౌభౌ’ అని అరవసాగింది. సన్యాసి చప్పున లోపలికి వచ్చి తలుపులు వేసుకున్నాడు. అసహనంతో అతడికి పిచ్చెక్కేలా ఉంది. ఒకవైపు ఆకలి చంపేస్తోంది. తినడానికి ఏమీలేదు. ఏదో ఒకటి తినకపోతే కళ్ళుతిరిగి పడిపోతాననిపించింది.     అదే సమయంలో చంటిగాడు లేచాడు. లేచి  లేవగానే తల్లి కనిపించకపోవడంతో గుక్కపట్టి ఏడ్వసాగాడు. సన్యాసిరావ్‌ పిల్లవాణ్ని ఎత్తుకుని బుజ్జగించసాగాడు. అయితే వాడు ఏడుపు ఆపటం లేదు.     ‘‘నా చిట్టి కన్నా.... నా బుజ్జినాన్నా... నాబంగారుకొండా...వెధవా ఊరుకో’’ ఇలా మధ్యలో సహనం కోల్పోతూ అంతలోనే శాంతిస్తూ సన్యాసిరావ్‌ సతమతమయిపోయాడు.     ఎన్ని రకాలుగా బుజ్జగించినా బాబు ఏడుపు ఆపలేదు. సన్యాసిరావ్‌కు ఇల్లు నరకం అనిపించింది. ఎక్కడికైనా పారిపోదామా అనుకున్నాడు. అసహనంతో చిటపటలాడాడు. ‘‘వీడొక గాడిదకొడుకు’’... అని తిట్టి వెంటనే నాలిక్కరుచుకున్నాడు.     వాడిగోల వినలేక వాడి నోటికి వేలు అడ్డం పెట్టాడు. బాబు వెంటనే వేలుతీసి నోట్లో పెట్టుకున్నాడు. సన్యాసికి బాబు ఏడుపుకి కారణం తలలో మెరిసింది. తనకులాగే వాడికీ ఆకలి వేస్తోంది. వెంటనే లోపలికి వెళ్ళి ఫ్లాస్క్‌లో చూశాడు. ఫ్లాస్క్‌నిండా పాలున్నాయి. బాబుకు మాత్రం పాలుకాచిపెట్టి  తనకు ఏమీ పెట్టని భార్యను తలుచుకొని సన్యాసిరావ్‌ పళ్ళుకొరుక్కున్నాడు.     ఫ్లాస్క్‌లోని పాలు బాటిల్లో పోసి బాబుకు పాలు పట్టించాడు. బాబు బుద్ధిగా  పాలుతాగి కాసేపు ఆడుకొని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. బాబు నిద్రపోగానే సన్యాసికి మళ్ళీ తన ఆకలి గుర్తొచ్చింది. వెంటనే బాబును భుజాన వేసుకొని ఇంటికి తాళం వేసి దగ్గర్లోవున్న హోటల్‌కి వెళ్ళాడు.     బాబును ఒళ్ళో పడుకోబెట్టుకొని  టిఫిన్‌ చేయసాగాడు. అంతలో బాబు అతని ప్యాంట్‌ తడిపేశాడు. చేసేదిలేక టిఫిన్‌ వదిలేసి లేచాడు. రెండు ఫ్రైడ్‌రైస్‌ పార్శిల్‌ కట్టించుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో జనం తడిసిన అతడి ప్యాంట్‌ను చూస్తుంటే సిగ్గుతో బిక్కచచ్చిపోయాడు. ఇంటికి చేరగానే పిల్లవాణ్ని ఉయ్యాల్లో వేసి ప్యాంట్‌ మార్చుకున్నాడు.     సరిగ్గా అప్పుడే సెల్‌ మోగింది. నెంబర్‌ చూశాడు. భార్యది. ఫోన్‌ ఆన్‌ చేసి చెవిదగ్గర పెట్టుకున్నాడు.     అవతల నుంచి చిన్న మూలుగు. దాని అర్ధం ‘ఎలా అఘోరిస్తున్నావు?’ అని. దానికి జవాబుగా సన్యాసి కొంచెం గట్టిగా మూలిగాడు. ‘నీకన్నా బాగానే అఘోరిస్తున్నానని’ దానర్ధం. అవతల సత్య అసహనంగా నిట్టూర్చింది. ‘ఇదంతా నీ కర్మ’ అని అర్ధం. దానికి జవాబుగా సన్యాసి ముక్కుపుటాలు అదిరేలా  నిట్టూర్చాడు. అంటే భార్యకు శాపనార్థాలు పెట్టాడన్నమాట.     అలా ఆ భార్యాభర్తల మూగపలకరింపులు ముగిశాయి.     స్నానం ముగించి హోటల్‌ నుంచి తెచ్చిన ఫ్రైడ్‌రైస్‌  పార్శిల్‌విప్పి ఓ పాత్రలో వేశాడు. భార్య తిరిగొచ్చాక అది తను చేసిన వంట అనుకొని కళ్ళుతిరిగిపడిపోవాలి. అప్పుడే తను గెలిచినట్టు అనుకున్నాడు. అదే సమయంలో కాలింగ్‌బెల్‌మోగింది.     ‘తలుచుకోగానే వచ్చిందే రాక్షసి’ అనుకుంటూ తలుపు తెరిచి చూస్తే ఎదురుగా ఎవరో అపరిచిత స్త్రీ.     సన్యాసిని చూడగానే ‘‘సత్యభామ ఇల్లుఇదేనాండి? మీరు సత్య భర్త అనుకుంటాను’’ అడిగిందామె.     ‘‘కాదు, సత్యనే నా భార్య’’ అన్నాడు సన్యాసి.     ఓ క్షణం తికమకపడి ఫకాల్ననవ్వి, ‘‘మొత్తానికి మగబుద్ధి పోనిచ్చుకున్నారుకాదు. సత్య భర్త అనిపించుకోవటం మీకిష్టంలేదన్నమాట. ఇంతకీ సత్య ఇంట్లో వుందా?’’ అడిగిందామె.     ‘‘లేదు. మీరెవరు?’’     ‘‘నేనామెఫ్రెండ్‌ని. మీ పెళ్ళికి నేను రాలేదు కాబట్టి మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను. మీరు నన్ను గుర్తుపట్టలేదు. ఇంతకీ నన్ను ఇంట్లోకి రానిస్తారా? లేక గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడేస్తారా?’’ అంటూ ఆమె చొరవగా లోపలికి వచ్చేసింది.     ఆమె హడావుడికి బాబు నిద్రలేచాడు. లేవగానే ఏడ్పు కార్యక్రమం మొదలుపెట్టాడు. సన్యాసి కంగారుగా పాలబాటిల్‌ తీసుకొని బాబుకు పాలు పట్టించసాగాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది.     ‘‘అరెరె. ఆడవాళ్ళు చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారే? సత్య ఎక్కడికి వెళ్ళింది?’’ ఆమె అడిగింది.     ‘‘ఇల్లు వదిలిపోయింది.’’ అసహనంగా అన్నాడు సన్యాసిరావ్‌.     ‘‘ఇదంతా చూస్తుంటే సత్య గయ్యాళిగా తయారై మిమ్మల్ని బాగా సాధిస్తోందని అర్ధమవుతోంది. ఇంట్లో పసిబిడ్డను వదిలేసి ఏ తల్లైనా బయటికి వెళ్తుందా? ఇంటికి రానీ, ఆ రాక్షసికి బుద్ధిచెబుతా’’ అంది సానుభూతిగా అతని వైపుచూస్తూ.     ‘‘భర్తమాట వినని స్త్రీ మీ మాట వింటుందా?’’ సన్యాసి నిర్వేదంగా అన్నాడు.     ‘‘నేనెవరో మీకు తెలియదు. నా పేరు భద్రకాళి. వృత్తిరీత్యా నేనొక లాయర్‌ని. సోషల్‌ వర్కర్‌ని. స్త్రీపై మగవాడు జులుం చేసినా, మగవాడిని స్త్రీ సతాయించినా అక్కడ నేను ప్రత్యక్షమవుతాను. మీ భార్య నా ఫ్రెండే కావచ్చు. అయినా సరే. అది దారికి రాకపోతే  విడాకులు ఇప్పించి దానికి గుణపాఠం చెబుతాను’’ ఆవేశంగా అందామె.     ఆమె ఆవేశం చూసి సన్యాసి కంగారుపడ్డాడు. అసలుకే ఎసరు వచ్చేట్టుందనుకుంటూ, ‘‘గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకులేండి. నా భార్య చెడ్డదేమీ కాదు. కాస్త మందలిస్తే అదే దారికొస్తుంది’’ అన్నాడు.     అయినా భద్రకాళి శాంతించలేదు. చీకటిపడేలోగా తిరిగి రాకపోతే ఆమెకు విడాకుల నోటీసు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. ఆమెకు నచ్చజెప్పి పంపేసరికి సన్యాసికి తలప్రాణం కాళ్ళకొచ్చింది. ుుుుుుు     ‘‘హాయ్‌! మీరు ఈ రోజు ఫ్రీయేనా?’’ నవ్వుతూ అడిగాడతను.     కౌంటర్‌ ముందునుంచున్న ఆ వ్యక్తివైపు  చురుగ్గా చూసింది సత్య. అతనలా అడగటం మూడోసారి. ఉదయం రిసెప్షనిస్ట్‌గా జాయిన్‌ అయినప్పటినుంచి గోపాల్‌ అనే కస్టమర్‌ ఆమెను విసిగిస్తున్నాడు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు అవసరంలేకున్నా ఏదో కల్పించుకొని మాట్లాడుతున్నాడు. అతనిపై మేనేజర్‌కు ఫిర్యాదు చేయాలనిపించినా మొదటిరోజే న్యూసెన్స్‌ ఎందుకని మిన్నకుంది.     ‘‘మేడమ్‌! నన్ను అపార్ధం చేసుకోవద్దు. అందమైన వాళ్ళతో స్నేహం చేయటం నా హాబి.  నేను ఊరికి కొత్త. మీకు ఇష్టమైతే సాయంత్రం మీ డ్యూటీ ముగిశాక అలా మీ సిటీ చూపిస్తారా? ఇక్కడ అందమైన ప్రదేశాల్ని నాకు చూపిస్తే మీకు జీవితాంతం ఋణపడి ఉంటాను.’’     ‘‘చూడు మిస్టర్‌, నాకు పెళ్ళయింది. పెళ్ళయిన ఆడవాళ్ళతో ఇలా మాట్లాడవచ్చా?’’ అంది సత్య కోపంగా.     ‘‘హమ్మయ్య. ఇప్పటికైనా నోరు తెరిచారు. కాలం మారింది మేడమ్‌. పెళ్ళయినంతమాత్రాన లైఫ్‌ పార్టనర్‌ కోసం మన అభిరుచుల్ని చంపుకోవాలా? నాకు అమ్మాయిలతో స్నేహాలున్నాయి. నా భార్యకు బాయ్‌ ఫ్రెండ్స్‌ వున్నారు’’ అన్నాడతను.     ‘‘గొప్ప దాంపత్యం! మీరిద్దరూ ఇతరులతో స్నేహం చేయటం మాని మీరు స్నేహంగా ఉండండి’’ ఘాటుగా అంది సత్య.     ‘‘మీరూ మీ చాదస్తపు మాటలు, బీసీనాటి సీతలా వున్నారు. మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటూంటే మీకీ ఉద్యోగం అవసరమా?  కానీ వచ్చారంటే  ఆయనతో మీరు వేగలేకపోతున్నారని అర్ధం. మన ఇద్దరి పరిస్థితి ఒకేలావుంది’’ అన్నాడతను.     అతని మాటలకి సత్యకు చిర్రెత్తుకొచ్చింది. ఊరుకుంటున్నకొద్దీ ఈ మనిషి శృతిమించుతున్నాడని అనిపిందచింది.     ‘‘చూడు మిస్టర్‌. నా భర్తతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఉద్యోగం చేయాలన్నది నా కోరిక. పరాయి మగవాళ్ళతో స్నేహాలు చేయాలన్న కోరిక నాకులేదు. ఇక మీరు దయచేయవచ్చు’’ అంది.     ‘‘మీరు అబద్ధం చెబుతున్నారు. భర్తతో రాజీపడి నిస్సారమైన జీవితాన్ని గడుపుతున్నారు. నాతో స్నేహం చేస్తే...’’     సత్య సహనాన్ని కోల్పోయి ‘‘యూ షెటప్‌ రాస్కెల్‌’’ అని గట్టిగా అరవటంతో అందరి దృష్టి అటువైపు మళ్ళింది. దాంతో ఆ వ్యక్తి తోక ముడిచి గబగబా అక్కడ్నించి మాయమయ్యాడు. సత్య తన ముఖం కనిపించకుండా న్యూస్‌ పేపర్‌ అడ్డుపెట్టుకుంది.     రాత్రి ఏడుగంటల సమయం. ఫోన్‌ మోగింది. సన్యాసి  చప్పున ఫోన్‌ అందుకున్నాడు.     ‘‘ఏమండోయ్‌ సన్యాసిగారు, మీ ఆవిడ ఇంటికి వచ్చిందా?’’ భద్రకాళి అవతల నుంచి ఐదోసారి అడిగింది.     ‘‘సత్యరాలేదు. అయినా ఇది మా వ్యక్తిగత సమస్య. దీన్ని మేమే పరిష్కరించుకుంటాం. ఇందులో మీ జోక్యం అవసరంలేదు’’ అన్నాడు విసురుగా.     ‘‘భలేవారే! ఇది వ్యక్తిగతమెలా అవుతుంది. మనం సంఘంలో ఉన్నాం. ఇది సామాజిక సమస్య. సంసారం బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఈ రాత్రికి సత్య ఇంటికి రాకపోతే నాకు ఫోన్‌ చేయండి. ఆమెమీద భార్యా బాధితుల సంఘానికి ఫిర్యాదు చేద్దాం. అలాగే విడాకుల నోటీస్‌ పంపుదాం ఏమంటారు?’’ అంటూ ఆమె ఉపన్యాసం మొదలు పెట్టింది.     ఆ సోది వినలేక సన్యాసి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు.     సత్య గుండె దడాదడా కొట్టుకుంటోంది. ఆ వ్యక్తి ఆమెను వెంబడిస్తున్నాడు. రెసెప్షన్‌ నుంచి బయటపడి ఆటో ఎక్కుతూంటే ‘‘ఏమండోయ్‌ ఒకమాట’’ అంటూ వెంటపడ్డాడు. సత్య వెంటనే ఆటోను ముందుకుపోనివ్వమంది. కొద్దిదూరం పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అతను మరో ఆటోలో ఫాలో కావటం కనిపించింది. సత్య భయంతో వణికి పోయింది. ఇల్లు చేరగానే దిగి చేతికొచ్చిన నోటు డ్రైవర్‌ చేతికిచ్చి ఒక్క పరుగులో ఇంట్లోకొచ్చి పడిరది.     హాల్లోనే భర్త ఎదురయ్యాడు. సత్య అతన్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. విషయం అర్ధంకాకపోయినా సన్యాసి కూడా వెక్కివెక్కి ఏడ్చాడు. వీరిద్దరి ఏడుపువిని  అప్పటిదాక ఏడుస్తున్న చంటిగాడు ఏడుపాపి కేరింతలు కొట్టాడు.     కాసేపు జంటగా ఏడ్చాక, ఒకరినొకరు కుశలప్రశ్నలు వేసుకున్నారు. ఆ ఆలుమగలు  తమ తప్పులు ఒప్పుకుంటూ సారీలు చెప్పుకుంటుండగా -     ‘‘స్టాప్‌!’’ అన్న అరుపు వినిపించి అరించిందెవరా అని అటు చూశారు.     గుమ్మంలో ఒక స్త్రీ ఒక పురుషుడు.     వాళ్ళిద్దర్నీ చూడగానే ఆలుమగలిద్దరూ గావుకేకలు పెట్టారు.     ‘‘ఇతనేనండీ... ఇతనే నావెంట పడిరది’’ సత్య అతనివైపు వేలు చూపిస్తూ అంది. ‘‘అవును మేమే, ఒకసారి మమ్మల్ని బాగా చూడండి’’ అన్నారు అగంతకులిద్దరూ.     సన్యాసి, సత్య ఇద్దరూ వారిని పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయారు.     ‘‘అరే గోపాల్‌, నువ్వా?’’ అన్నాడు సన్యాసి.    ‘‘ఒసేయ్‌! నువ్వు మా దుర్గవుకదూ’’ అంది సత్య. వారి పరిస్థితి చూసి అగంతకులిద్దరూ నవ్వటం మొదలుపెట్టారు. వారెందుకు నవ్వుతున్నారో సన్యాసి సత్యలకు అర్ధంకాక ఒకరిముఖాలకరు చూసుకున్నారు.     గోపాల్‌ కుర్చీలో కూర్చుంటూ ‘‘ఒరేయ్‌ సన్యాసీ నీ పెళ్ళికి  మేం రాలేకపోయాం. అలాగే మా పెళ్ళికి మీరు రాలేదు. మనం ఎలా క్లాస్‌మేట్లమో వీళ్ళిద్దరూ కూడా క్లాస్‌మేట్లే. మాకిప్పుడు తీరిక దొరకడంతో ఇక్కడికొచ్చి మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేద్దామనుకున్నాం. కానీ నిన్న రాత్రి  మీరిద్దరూ తగవులాడుకొని ఛాలెంజ్‌ చేసుకుంటున్నారు. అది విన్న మాకు మీ ఇంటికి రావడం సబబు అనిపించలేదు.హోటల్‌లో ఉండి ఓ చిన్న డ్రామా ఆడాం. నా భార్య దుర్గ భద్రకాళిగా నిన్ను, నేను సత్యను విసిగించాం. అయితే మేము ఆశించినట్టే మీలో మార్పొచ్చింది అన్నాడు.     ‘‘సంసారంలో భార్యాభర్తలిద్దరూ సమానులే ఎవరి పనులూ తక్కువకాదు. పంతాలకు పోయి ఒకరి పనులకరు మార్చుకునే పద్ధతిని మేము సమర్ధించటంలేదు. మీరు చేస్తున్న ఈ పని ఎలాంటి అనర్ధాలకు దారితీయొచ్చో మీకు తెలిసేలా చేయాలనే ఈ నాటకం ఆడాం. అవసరాన్ని బట్టి మగవాడు వంటచేయొచ్చు, స్త్రీ ఉద్యోగమూ చేయొచ్చు. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటుంటే జీవితం నిత్యనూతనంగా వుంటుంది’’ అంది దుర్గ.     ‘‘మా ఇద్దర్నీ కలిపినందుకు థ్యాంక్స్‌రా గోపీ. మేము పోట్లాడుకున్న సంగతి మీకెలా తెలిసింది’’ అడిగాడు సన్యాసిరావ్‌. గోపాల్‌ చేబులోంచి సెల్‌ తీసిచూపుతూ  ఇదిగో  ఈ మాటల భూతం చెప్పింది. మేము స్టేషన్‌లో దిగగానే నీకు ఫోన్‌ చేశాను. నువ్వు ఫోన్‌ ఆన్‌ చేశావ్‌ నువ్వు ఫోన్‌ ఆన్‌ చేసిన సంగతి కూడా మర్చిపోయి నీ భార్యతో గొడవ పడుతూనే వున్నావు. మొత్తం రన్నింగ్‌ కామెంటరీలా విన్నాం. తరువాత కథ నీకుతెలిసిందే’’ అన్నాడు గోపాల్‌. మీరిద్దరూ కూడబలుక్కొని భలే నాటకం ఆడార్రా అన్నాడు సన్యాసి. ‘కుడిఎడమైతే  పొరపాటులేదోయ్‌’ అన్నాడోయ్‌ సినీకవి. మిమ్మల్ని చూశాక కుడిఎడమైతే పొరపాటేనోయ్‌ అన్నాడు గోపాల్‌ నవ్వుతూ.  అతని మాటలకి అందరూ గొల్లున నవ్వారు. ఒకేసారి అందరూ నవ్వటంతో నిద్రలోంచి లేచిన చంటిగాడు కెవ్వుమని ఏడ్వసాగాడు.   రంగనాథ రామచంద్రరావు సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో  

ప్రాణానికి ప్రాణం

 ప్రాణానికి ప్రాణం       ఈ అమ్మాయి ఎవరూ? అంది సీత. లలితతో పాటు వచ్చిన అమ్మాయిని చూస్తూ. ''మా పక్కింట్లో వుంటుంది మేడమ్‌. ఈ అమ్మాయి పేరు రమ్య. ఈ మధ్యే  అద్దెకొచ్చారు. మిమ్మల్ని చూపిస్తానని తీసుకొచ్చా'' అంది లలిత. రమ్యచూపు సీతావాళ్ళ ముందుగదిలోవున్న లైబ్రరీపై పడింది. అబ్బ! ఎన్ని పుస్తకాలో అంటూ ఆశ్చర్యంగా ఆ లైబ్రరీ ముందు నిలబడి పుస్తకాలు చూడటం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి రమ్యకి అనిపించింది. తన కాలేజీలో వ్యాసరచనపోటీలో తను పాల్గొంటోంది కదా! ఈ పుస్తకాలలో ఓ వ్యాస సంకలనం వుంటుందేమో.... లలిత, సీత ముందుగదిలో కూర్చొనున్నారు. ''త్వరలో కాలేజ్‌డే వస్తున్నది కదా! నీదొక్కటే కూచిపూడి డాన్స్‌ ప్రోగ్రామ్‌. మరి నువ్వు బాగా ప్రాక్టీస్‌ చేయాలి లలితా'' అంది సీత. లలితకి చాలా ఆనందమేసింది కాలేజీలో తాను కూచిపూడి డాన్స్‌ చేయబోతుందని అంతలో రమ్య ఒక పుస్తకం పట్టుకొని ''మేడమ్‌! ఈ పుస్తకం నాకు కావాలి. ఒకటి, రెండు రోజుల్లో మళ్లీ తెచ్చిస్తాను'' అంది సీతతో. సీత ముఖంలో మార్పొచ్చేసింది.  తన లైబ్రరీని ప్రాణంతో సమానంగా చూసుకుంటుంది. పుస్తకాలు ఇవ్వటం, తీసుకున్నవాళ్ళు తిరిగి తెచ్చివ్వకపోవటంతో ఎన్నో విలువైన పుస్తకాలు పోగొట్టుకుంది సీత ఇప్పటికే. ''లేదమ్మా! నా పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వొద్దని నిశ్చయించుకున్నా. ఇక్కడ కూచుని చదువుకో. అంతేకానీ ఇంటికి తీసుకెళ్ళటం అనే విషయం మర్చిపో రమ్యా. షాపులో దొరకొచ్చు కొనుక్కో'' అంది సీత. ''చూసాను మేడమ్‌. ఇప్పుడీపుస్తకం రావటం లేదటండీ. ఈ వ్యాసాలు ఒక్కసారి చదువుకొని మీకు తెచ్చిస్తాగా. నామాట నమ్మండి'' అంటూ బతిమాలింది రమ్య. సీత మనసు కరగలేదు.  ''సీతా'' అంటూ గదిలోంచి రవీంద్ర సీతను పిలిచి ''ఆ అమ్మాయి అంతగా బతిమాలుతుంటే, పైగా రెండురోజుల్లో తెచ్చిస్తానంటోంది. ఇవ్వొచ్చు కదా!'' అన్నాడు రవీంద్ర. ''అబ్బ! మీకు తెలియదు. మీరు కల్పించుకోకండి'' అంది సీత చిరాగ్గా.  ''ఇటు విను. ఒక విద్యార్థి చదువుకొని ఇచ్చేస్తానని వేడుకుంటుంటే అంత నిర్దయగా ఇవ్వనని ఎలా చెప్పగలవ్‌ సీతా? ఆ పిల్లకి ఆ పుస్తకం ఇస్తే  అది ఒక విధంగా పుణ్యకార్యం చేసినట్టే. విద్యాదానఫలం దక్కుతుంది నీకు. అలాంటి పుస్తకం దొరకటంలేదేమో. అయినా అలా షెల్ఫ్‌ల్లో పుస్తకాలు మగ్గిపోవటం కన్నా ఒక దీపం నుంచి ఇంకొక దీపంలాగ, ఒక పుస్తకం నుంచి ఒకమ్మాయి, మరో పుస్తకం నుంచి మరోఅమ్మాయి. పుస్తకం పదిమంది చదువుకుంటే ఎంతోమంచిపని చేసినట్టే సీతా. నా మాటవిని ఆ అమ్మాయికి పుస్తకం ఇవ్వు. నీ అభిమాన స్టూడెంట్‌ లలితకి ఆ పుస్తకాన్ని రెండురోజుల్లో తెచ్చియిచ్చే బాధ్యత అప్పగించు సరేనా'' అన్నాడు రవీంద్ర. ''ఈ మేడమ్‌ అలాగే అంటుంది కానీ తీసుకెళ్ళు. మళ్ళీ తెచ్చియ్యి. లలితా! నీదే బాధ్యత'' అన్నాడు రవీంద్ర. ''థ్యాంక్స్‌ అంకుల్‌'' అంది పుస్తకం తీసుకొని రమ్య. ''థ్యాంక్స్‌ అంకులా''! నవ్వుకుంది సీత. పోన్లే చదువుకొని ఇచ్చేస్తుంది అనుకుంది మనసులో మళ్ళా. þ þ þ þ þ  సీత, రవీంద్ర వేసవిలో పదిరోజులు ఊటీ వెళ్ళిపోయారు. లలిత తన  పిన్నికూతురు పెళ్ళికి చెన్నై వెళ్ళింది. రమ్య కాలేజీలో వ్యాస రచన పోటీలో పాల్గొని ఫస్టు వచ్చింది. ఇలా చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి. þ þ þ þ þ  లలిత ఉలిక్కిపడింది. మేడమ్‌ పుస్తకం? ''రమ్యా! రమ్యా! పిలిచింది లలిత ఫోన్‌లో. ''పుస్తకం..!'' ''ఏ పుస్తకం'' అంది రమ్య. అదే! సీతామేడమ్‌ దగ్గర బతిమాలి, ఇంచుమించుగా ఏడ్చి, పాపం అంకుల్‌ కల్పించుకొని నీకిప్పించలేదా ఏమిటీ? ఆ పుస్తకాన్ని. ఓ... అదా! గుర్తొంచ్చింది. వుందిలే, ఇచ్చేస్తాలే ''ఫోను పెట్టేసింది'' రమ్య. లలితకి చాలా కోపమొచ్చింది. అంత నిర్లక్ష్యమా! అయినా నాదేతప్పు. రమ్యని మేడమ్‌ ఇంటికి తీసుకెళ్ళటం, తీసుకెళ్ళినా లైబ్రరీ చూడనియ్యటం, చూసినా పుస్తకం తీసుకెళ్ళనియ్యటం, మా మేడమ్‌ ఏమనుకుంటున్నారో? రమ్య ఎంత తొందరగా ఆ పుస్తకం తెస్తే అంత త్వరగా మేడమ్‌కి ఆ పుస్తకం ఇచ్చేయాలనుంది లలితకి. ఓరోజు రమ్య పుస్తకం తీసుకొచ్చి పనిమనిషి గదులు వూడుస్తుంటే దాని చేతికిచ్చి లలితకి యిచ్చేయి అని హడావిడిగా వెళ్ళిపోయింది. రెండురోజుల తరువాత అమ్మా! ఇది మీకిమ్మంది అంటూ బట్టలబుట్ట వెనకాలదాచిన పుస్తకం లలితకిచ్చింది రాములమ్మ. þ þ þ þ þ  లలితకళ్ళల్లో నిప్పులు కురిసాయి. ఆ పుస్తకంలోని కాగితాలు చూస్తుంటే. ఆ క్షణంలో రమ్యగొంతు నొక్కేయాలనిపించింది లలితకి. పుస్తకంలో చాలా పేజీలు బ్లేడుతో కట్‌ అయిపోయాయి. ఛీ! అందుకే ఎవరికీ పుస్తకం యియ్యననటం. లలిత గబగబా రమ్య ఇంటికెళ్ళింది. పుస్తకం చూపించింది. ఓ... ఇదా! నేను చూడలేదే. ఎవరీపనిచేసారో? ఆ పుస్తకం తీసుకున్నప్పుడే... ఏదో అనబోయింది రమ్య. లలిత మండిపడిపోతూ ''ఛీ! నీ చదువెందుకు? నాలుగుపేజీలు రాసుకోలేవా? ఇప్పుడీ పుస్తకం మేడమ్‌కిఎలా ఇస్తాను'' అంది వచ్చే ఏడుపును ఆపుకుంటూ. రమ్యకి తెలుసు. తన దగ్గరున్న బ్లేడ్‌ ఆ పని చేసిందని. కానీ ఇప్పుడు ఎదురుతిరిగి దబాయించాలనుకుంది రమ్య. ''ఏమిటీ? పెద్దగోల చేస్తావ్‌. లైబ్రరీలో ఎన్నో పుస్తకాల్లో మధ్యమధ్యలో కాగితాలు చింపేయటం కొత్తవిషయమా? ఎవరుచించారో? ఎందుకు చించారో ఎవరు ఎవర్ని అడుగుతున్నారు? ఏమో? ఎవరు చింపారో? ఈ గోలంతా నీకెందుకు? మేడమ్‌కి ఈ పుస్తకం ఇచ్చెయ్‌. అంతే'' అంది నిర్లక్ష్యంగా రమ్య. ఇలాంటి విద్యార్థులే సమాజానికి చీడపురుగులు అని అనిపించింది లలితకి. ''రమ్యా! ఆ పుస్తకం నువ్వే పట్టుకెళ్ళివ్వు. నేనివ్వను'' అంది బాధగా లలిత. ''ఓకే... అంటూ భుజాలు ఎగరేసుకుంటూ పుస్తకం పట్టుకెళ్ళింది రమ్య.'' ఆపుస్తకం ఇచ్చినప్పుడు మేడమ్‌ ఎంత బాధపడ్డారో ఒక్కసారి కళ్ళముందు కదిలింది లలితకి. పుస్తకం విలువ తెలియని రమ్యలాంటి వాళ్ళెందరో? నాదే తప్పు... నాదే తప్పు. అని అనుకుంటూ లలిత చెంపలేసుకుని దేవునికి దణ్ణం పెట్టుకుంది. మర్నాడు పొద్దున ఆరుగంటలకి రమ్య పుస్తకం పట్టుకెళ్ళి ఇంటిముందు ముగ్గేస్తున్న పనిమనిషికిచ్చి ఇది మీ అమ్మగారికి ఇచ్చెయ్యి. లేకపోతే మీ అమ్మగారి పుస్తకాలున్నాయి కదా! దాంట్లోపెట్టు. నేను తరువాతొచ్చి మీ అమ్మగారితో మాట్లాడతా'' అంది. పనిమనిషి తలూపింది. రమ్య స్కూటర్‌ స్టార్ట్‌ చేసి వెళ్లిపోయింది. లలితకి నిద్రపట్టటం లేదు. ఎలాగైనా పుస్తకం మేడమ్‌కి ఇవ్వాలి. ఎలాగా? ఏ షాపులో ఆపుస్తకం దొరుకుతుంది? ఆరాత్రి లలితపిన్ని లలితకి ఫోన్‌చేసింది. ఒక్కసారిరా, ఇంట్లో నాకిష్టమని కొనుక్కున్న పుస్తకాలు కొన్ని పెయింటిగ్స్‌, కొన్ని ఫ్లవర్‌వాజ్‌లు ఇలా చాలా వున్నాయి. ఎవరెవరికి ఏం కావాలంటే అవి తీసుకెళ్ళమంటున్నా. నీకు తెలుసుగా నేను, బాబాయిగారు అమెరికా వెళ్ళిపోతున్నాం పెద్దబ్బాయి దగ్గరకి. లలితకి పిన్ని అంటే చాలా ఇష్టం. తనకన్నా పెద్దదయినా స్నేహంగా వుంటుంది. విశాఖపట్నంలో వుండే పిన్నిదగ్గర ఓ నెలరోజులు వుండాలని వచ్చింది లలత. లలితకి ఒక ఆశ మదిలో మెదిలింది. పిన్ని దగ్గరున్న పెయింటింగ్స్‌, ఫ్లవర్‌వాజ్‌లు నాకేమీ వద్దు. ఆ పుస్తకం ఒక్కటివుంటే నాకు చాలు. ఏమో ఉండొచ్చేమో. మేడమ్‌కి నా ముఖం చూపించే యోగ్యత ఉందేమో! þ þ þ þ þ  ''అమ్మా! ఆ అమ్మాయి ఎవరో ఇక పుస్తకం తెచ్చింది. మీ పుస్తకాల షెల్ఫ్‌లో పెట్టానమ్మా'' అంది రాములమ్మ గిన్నెలు లోపలపెడుతూ. సరే.. సరే.. అంది సీత ఏదో పనిలో. లలితకళ్ళు ఆనందంతో వెలిసిపోయాయి. హమ్మయ్య. ''లలితా ఇన్నివుంటే ఈ పుస్తకం కావాలంటావేమిటే. పైగా నీకేమో ఇంగ్లీషు, హిందీ తప్ప తెలుగు చదవటం రాదుగా'' అంది పిన్ని పుస్తకాన్ని గుండెలకి హత్తుకుని మురిసిపోతున్న లలితతో. ''ఇది నా ప్రాణానికి ప్రాణం. అంతే పిన్నీ'' అంది కళ్ళలో తిరిగిన నీళ్ళు తుడుచుకుంటూ లలిత. þ þ þ þ þ þ సీత, రవీంద్ర టి.వి. చూస్తున్నారు. ''మీరెన్నన్నా చెప్పండి. శ్రీదేవి అందం శ్రీదేవిదే'' అంది. శ్రీదేవి 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' సినిమా చూస్తూ సీత. ''ఈ ఒక్క విషయంలో మనిద్దరి అభిప్రాయాలూ ఒకటయ్యాయి'' అన్నాడు గలగలానవ్వుతూ రవీంద్ర. అంతలో కాలింగ్‌బెల్‌ మోగింది. కొరియర్‌... విశాఖపట్నం నుంచి. సీత తన కళ్ళని తనే నమ్మలేకపోతుంది. తన లైబ్రరీలో వున్న వ్యాస సంకలనమే. ఇదేమిటీ? రాములమ్మ ఆ అమ్మాయి తెచ్చియిచ్చిందని షెల్ఫ్‌లో పెట్టిందిగా. సీత పుస్తకాన్ని తెరిచింది. ఓ కాగితం కిందపడింది. ''మేడమ్‌! క్షమించండి నన్ను'' చదువుకునే వాళ్ళ చేతిలోనే పుస్తకం వుండాలని మీరనే మాట వాస్తవం. ఆ పుస్తకం తీసి పారేయండి. ఈ పుస్తకం అక్కడ పెట్టండి. నేను పై వారం వస్తున్నాను. నమస్కారాలతో లలిత. సీతకి ఏమీ అర్ధం కాలేదు. ఆ పుస్తకం ఏమిటీ? ఈ పుస్తకం ఏమిటీ? సీత పుస్తకాల షెల్ఫ్‌లోనించి ఆ పుస్తకం తీసింది. అవాక్కయిపోయింది. ఎన్ని కాగితాలు బ్లేడుతో తెగిపోయాయో. లలితా? నువ్వంటావు చూడు. ''ఏలనా హృదయంబు ప్రేమించునిన్ను'' ఇందుకే ఇందుకే. నా ప్రాణానికి ప్రాణం పుస్తకం. నీలాంటి మంచి విద్యార్థి ఎందరికో మార్గదర్శకమయితే నా జన్మధన్యమయినట్టే లలితా!        - డా|| ముక్తేవి భారతి   సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో  

బుచ్చమ్మనీతి శ్రమైక జీవనం

  బుచ్చమ్మనీతి శ్రమైక జీవనం   విశ్వనాథరావుకి అరవై అయిదేళ్ల వయస్సు. ఈ వయస్సుకే ఆయన డీలా పడిపోయాడు. కర్ర చేతికొచ్చింది. ఇంటిముందు ఆడంబరానికి వాడుకున్న గుఱ్ఱ, దానితోపాటు బండి అమ్మేశాడు. ఆ వచ్చిన మూడువేల రూపాయలలో నూటయాభైమాత్రం వేరే మనీపర్స్‌లో దాచాడు. ఇంటిముందుకు వచ్చిన వేశ్య వరలక్ష్మిని చూచాడు. ఆమె వయస్సు ఉడిగిపోయింది. యవ్వనంలో ఉన్న శరీర వంపుసొపు కనపట్టం లేదు. విశాలమైన కళ్లు కుంచించుకుపోయాయి. నడుం కొంచెం వంగింది. వక్షోజాలు చాతికి అంటుకుపో యాయి. విశ్వనాథరావు ఆమెను రమ్మని కబురు పెట్టాడు. అంతకురెండు సంవత్సరాల మునుపు తానే గుర్రం బగ్గీలో ఆమె బంగళాకు వెళ్లి ఆమెను చూచి తన ప్రక్కన కూచోబెట్టుకుని, బుగ్గలు పుణికి, ముట్టుకొని వచ్చేవాడు. వరలక్ష్మి ఆయన సొమ్ము, ఆస్తి వాడుకున్నది. అందుకని ఆయన్ను ఈ సడించుకొనేది కాదు. నవ్వి ''మనద్దరి వయస్సు ఉడిగింది. చేతులతో తుడుముకోటంతో తృప్తిపడదాంలే'' అనేది... ఇవ్వాళ చివరిసారి ఆమెను చూడాలని ముచ్చటపడ్డాడు విశ్వనాథరావు. ఆమె వచ్చింది. విశ్వనాథరావు భార్య శాంతమ్మ. ఆ వచ్చిన వేశ్యకాంతను చూచింది. వెంటనే ''రావమ్మా వరలక్ష్మి, నీకోసం మొగం వాచిపోయారు మావారు. అలా లోపలికెళ్ళు. ఆయన ముచ్చట ఎలా తీరుస్తావో నేనేమి అనుకోనులే!'' అని వంట గదిలోకి వెళ్ళింది శాంతమ్మ. శాంతమ్మ పేరుకు తగ్గట్లు శాంతం గలదే. పెళ్లినాడు తనకు పెట్టిన అత్తింటి నగలు పుట్టింటి నగలు ఎన్నుండేయో. తాను కాపురానికొచ్చేటప్పటికే విశ్వనాథరావు వరలక్ష్మి వలలో పడిపోయాడు. కాపురానికొచ్చిన మొదటి అయిదేళ్లలో ఒక్కో నగ తననుంచి దూరమైపోయింది. ఇరుగుపొరుగు ఎల్లమ్మ పుల్లమ్మలు విశ్వనాథరావు శృంగార చేష్టలుచెపుతుంటే ఆమె నోరు తెరిచి చెవులప్పగించి వేచి మగణ్ణి అడిగే, నిలేసే ధైర్యం ఆమెలో లేదు. గ్రామాల్లో వీధిబడులు, అక్కడక్కడ జిల్లా బోర్డు ప్రాథమిక పాఠశాలలు మాత్రమే ఉండేవి. ఆడపిల్లలకు చదువెందుకు ఊళ్లేలతారా? ఉద్యోగాలకు పనికొస్తారా అనే రోజులు. పురుషాధిక్య సమాజం. ఆస్తి హక్కులు, గ్రామపెద్దరికాలు డబ్బు దస్కం పొలంపుట్ర ఉన్నవాళ్లు వెలిగించేవారు. మూఢవిశ్వాసాలు అందునా ఆడవాళ్లల్లో అధికంగా ఉండేవి. మగవాళ్లనెదిరించి మాట్లాడటం తప్పు అనే భావం బలంగా ఉంది. పతియే దైవం. ఆయన ఏమిచేసినా మిన్నకుండ ఉండి, గుట్టుగా సంసారం గడపటం ఆడవాళ్లకు బ్రహ్మగీసిన గీతని భావించే వాళ్లు ఆకాలంలో. ఇక శాంతమ్మ మడిస్నానాలు, వ్రతాలు, ఉపవాసాలు, దేవాలయాలచుట్టూ ప్రదక్షిణలు చేయటం తల్లి తండ్రి నుండి నేర్చుకొన్న ఆనవాయితీలు. ఇంట్లోకి వరలక్ష్మిని 'నీకోసం మావారు మొగం వాచిపోయారు' అన్నదంటే ఆమె పతిభక్తి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆమాటతో వరలక్ష్మిని పిలిచి తాను వంటింట్లోకి వెళ్లేటప్పుడు పనిమనిషి బుచ్చమ్మ 'అమ్మగారూ! ఒక మాట చెపుతా, కోప్పడరుగదా?'' అంది నీమీద నాక్కోపం ఏంటే? ఏంటో చెప్పు' అన్నది శాంతమ్మ. ఏమి లేదమ్మా మీ ఇల్లు పిప్పి చేసిన ఆడోళ్లు ఇంటికొస్తే లోపలకు పో, నీకోసం మొగం వాచి ఉన్నారు మావారు అని అన్నారే. మీరక్తంలో రోసం, నరాల్లో ఉక్రోసం లేదా అమ్మగారూ. ''కోపం, ఉక్రోసాలున్న ఆడవాళ్లు ఏమి చేయగలుగుతారు? ఎదిరించటంవల్ల నిత్యం ఇల్లు రావణకాష్టంలా తయారవటం తప్ప ఫలితమేముంటుంది.'' అని గోడకు తగిలించి ఉన్న శేషపాన్పుపై పరుండి ఉన్న విష్ణుమూర్తి పాదాలను వత్తుతున్న శ్రీమహాలక్ష్మి ఫోటోను చూపించింది శాంతమ్మ''. ఆమెలాంటి వాళ్లే అలా పతిపాదాలను వత్తుతూ ఉంటే కలియుగంలోని ఆడవాళ్లం మనంమగడితో పోట్లాడగలమా! ఎవరినొసట ఎలా బ్రహ్మరాస్తే అలాజరుగక మానుద్దా అన్నది. ''ఏం మాట్లాడుతున్నారు అమ్మగారూ. వంద ఎకరాల పైచిలుకు పంటపొలాలు మీరు కాపురానికి వచ్చేప్పటికి ఉండె, మామూలుగా నూటయాభైఎకరాలుండేదట మీకుటుంబానికి. మీ మామయ్యగారికి మీవారిలాగ ఆడవాళ్ల పిచ్చి ఉండేది కాదట. కాని ఆయన ముగ్గురు కూతుళ్లకి రంగరంగ వైభోగంగా అయిదేసి రోజులు పెళ్లిళ్లు చేశారని మాతాతయ్య చెపుతుంటే విన్నాను. ఇటు చుట్టాలు అటు చుట్టాలు  ఏభై అరవై బళ్లు కట్టుకొని వచ్చేశారంట. బళ్లకు ఎద్దులు వాటికి మెళ్లల్లో గంటల పట్టెళ్లు ఎండతగలకుండా బళ్లమీద గూనెలుతో వచ్చేసి ఆయెద్దుల మేతకు ఇరవైబారల పొడుగున్న చొప్పవాములు రెండు, ఎడ్లమేతకే ఖర్చయిపోయేదంట. వందలమంది ఊరి జనాలు. ఎడ్లబళ్లు తోలుకువచ్చిన వాళ్లకు వీధి పొడవున తాటాకు పందిళ్లు వేసి భోజనాలు పెట్టేరంట. ఇక చుట్టాలకు అ అయిదు దినాలు భోజనాలు, బస్తీలనుంచి తెప్పించిన మడతమంచాలు కొట్టాలలో వేసి, విసనకర్రలు ఇస్తే చుట్టాలు తిని బ్రేవ్‌ బ్రేవ్‌మంటూ విసనకర్రలతో విసురుకుంటూ నిద్రపోయేవారంట. అట్లా పెళ్ళిళ్లు అందరూ ఆడిపిల్లలకు జరిపితే నలభైయాభై ఎకరాల భూమి అప్పుకింద సాహుకార్లకు దాఖలు చేశారు. కాని మన విశ్వనాధంగారు ఏం పెళ్లిళ్లు ఎలగబెట్టారు అమ్మగారు. ఒక్కగానొక్క కొడుకు మీకున్నది. ఆయన్నేమన్నా ఇంగలీసు బళ్లకు పంపి చదివించారా? బేనారసు పంపించి ఏదో సంస్కృతం చదువులకు పంపారు. కాని ఖర్చు కొడుక్కుఖర్చుపెట్టాడా? వడుగు అని ఎప్పుడో జరిపించారు. అదీ అచ్చట ముచ్చట లేకుండా. ఇక ఉన్న పొలం అంతా సానులకోసమే అమ్మి ఆగం చేశారుగా అమ్మా. మీరుగాబట్టి ఊరుకున్నారు. మేం అయితే ఊరుకునే వాళ్లమా'' అన్నది బుచ్చమ్మ. శాంతమ్మ అవాక్కయిపోయింది. పనిమనిషి ఎంత తెగువగా చెప్పింది. అని ఆశ్చర్యపోయింది. మళ్లీ బుచ్చెమ్మ ఏదో చెప్పబోయింది. అంతకుముందే శాంతమ్మ అందుకుంది. ''మీ ఇళ్లల్లో అయితే మగాళ్లు ఇలా ప్రవర్తిసే ఏంచేస్తారే?'' అని అడిగింది. ''ఇనండి అమ్మగారు. నాకు ఇది రెండోపెళ్లి. మొదటి పెళ్ళికొడుకు నావయస్సులో నా అందంచందంచూచి పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. తిరణాలకు మా అక్కోళ్లమ్మటిపోతిని. అతను పసిగట్టాడేమో తిరణాలకు వచ్చాడు. నన్ను చూశాడు. ప్రేమ మాటలు చెప్పటంతో నాకు భయమేసింది. మా అక్కను కేకేసి  పిలిచా. అక్క వచ్చింది. నా చెల్లితో సరసాలాడతావా? చెప్పుతిరగేస్తానంది.''    ''కాదు నేను నిజంగా పెళ్లిచేసుకుంటాను. మీ అమ్మ అయ్యతో వచ్చి మాట్లాడుతాను. ముందు మీ చెల్లిని అడిగిచూద్దామని మాట్లాడాను'' అన్నాడు.    మా అక్క శాంతించింది. నీకేమాస్తి వుంది. మీ ఊరేంది అని వివరాలు అడిగింది. మాది ఫలనా ఊరు. నాలుగు ఎకరాల చలక నాభాగంలోకొచ్చింది. మా అయ్య చనిపోయాడు. నేనే సంబంధాలు వెతుక్కుంటున్నాను. బర్రెల బేరానికి మీ అమ్మగారింటికొచ్చాను. అప్పుడుమీ చెల్లలిని చూశా. చెల్లెలు ఊ అంటే మీయింటి కొచ్చి మాట్లాడతా పెళ్లివిషయం'' అన్నాడు. ''నాలుగెకరాల పొలం ఉంటే ఈపెళ్లి బాగానే ఉంటుంది అనుకుంది అక్క. ఇంకేముంది, తర్వాత మాట్లాడుకోటం పెళ్లి జరిగిపోయింది. యేడాదికి ఒక కొడుకు పుట్టాడు'' అన్నది బుచ్చెమ్మ.    ''అయితే మళ్లీ రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు?'' అని అడిగింది శాంతమ్మ. ''ఇనండమ్మా, వాడికి గత్తరపడ. నామీద మోజు ఒక సంవత్సరంలోనే తీరిపోయిందట వాడికి. బజారు ఆడోళ్ళతో తిరగటం మరిగిండు. నాలుగు ఎకరాల్లో వచ్చే పంట ఖర్చుపెట్టాడు. ఇంతేగాకుండా ఒకరోజు రాత్రి తాగి ఒక గుంటని ఇంట్లోకి తెచ్చాడు. పిల్లగాడిని నన్ను ఇంటిముందుకు పంపించి దానితో ఇంట్లోకి పొయ్యి తలుపేసుకునే. నాకు కోపం నసాళానికంటింది. తలపుకొట్టి ఎవత్తివే నీవు నాచవితివా? ఇంట్లోకి జొరబడ్డావు అని తిట్టటం మొదలెట్టా. నామొగుడు బయటికొచ్చి నాజుట్టు పట్టి ఈడ్చిండు. ఇష్టమొచ్చినట్లు కొట్టిండు. మళ్లీ తలుపేసుకొని లోపలుండిపాయె. నేను పిల్లగాడిని చంకనేసుకొని కులపోళ్లకు చెప్పి మొత్తుకుంటిని. వాళ్లంతా ఇంటిముందు పోగైరి. తలుపు తెరిచి బయటికొచ్చిండు నా మొగుడు. వాడు నామీద నేరాలు మోపిండు. నేను మాఊరు వెళ్లి మాచుట్టాలతో పంచాయితీ పెట్టిస్తిని. వాడితో కాపురం చచ్చినా చేయనన్నా, వాడు తాగుబోతై ఊళ్లో తిరుగుతుంటే నాకీ సంసారం వద్దు. ఈ మొగుడు వద్దు. నాకొడుక్కు పొలంలో భాగం ఇప్పించండి నా తోవన నేను బతుకుతానన్నా. వాడితో విడాకులు రాయించుకొన్నా. రెండెకరాల పొలం నాకొడుక్కు వచ్చేట్టు పంచాయితీ తీర్పు దస్తావేజులు రిజస్టర్‌ చేయించుకున్నా'' అమ్మగారూ అన్నది బుచ్చమ్మ. ''అమ్మో అంత సాహసం చూపించావా? మరి మళ్లీ పెళ్లి చేసుకోవటం ఎందుకంటా? మొదట మొగుడుతో విసిగి పోతివిగదా! మళ్లీ పెళ్లి కోరిక వచ్చిందా?'' అన్నది శాంతమ్మ. ''అమ్మ గారూ! నేను ఒక విషయం చెపుతా. మీ అంత పెద్దోళ్ల కులంకాదు మాది. కష్టపడి పనిచేసుకునే వాళ్లం. నాకొడుకు పుట్టి వాడయ్యతో తెగతెంపు చేసుకొన్నప్పుడు నాకు పద్దెనిమిదేళ్లు. బయట ఏపనికెళ్లినా మొగాళ్ల దొంగ చూపులు నేను అర్థం చేసుకున్నా. ఆడదానికి మగతోడు, మగాడికి ఆడతోడు ఉంటేనే భద్రతగదమ్మా. అందుకని నాకు నచ్చినవాడిని. నా మొదటి మగడితో పుట్టిన నా కొడుకును, బాగా చూచుకొంటానికి ఒప్పుకొన్న వాడిని రెండో మనువాడినాను. ఈమగడితో ఒక ఆడబిడ్డ పుట్టింది. నామొగుడు ఇద్దరినీ మంచిగా చూసుకొంటున్నాడు. ఇప్పుడు నాకొడుక్కు పదిహేనేళ్ళు. బిడ్డపన్నేండేళ్లది'' అన్నది బుచ్చమ్మ. చిన్నకులాల ఇళ్లల్లో ఆడవాళ్లకున్న స్వతంత్రం మాపెద్దకులపు ఆడోళ్లకు ఎక్కడిది? పూజలు, భక్తి, ఉపవాసాలు. రామకోటి రాసుకోటం తప్ప మగవాళ్లను ప్రశ్నించే తెగువ లేనేలేదు.'' అన్నది శాంతమ్మ నిట్టూర్పు వదులుతూ. చిన్నకులపు వాళ్లమని మమ్మల్ని చిన్నచూపు చూస్తారు. పెద్దోళ్లకు మేము శ్రమించి పనులు చేయకుంటే ఒక్క పూటగూడ మాకు గడవదమ్మా! పొలాల్లో పంటపండించి ధాన్యం రాసులుజేసేది మాపేదవాళ్లేనమ్మా.  మా అమ్మ నాట్లు వేసేది. ఊడ్పులు కోతలుకోసేది. మా అయ్య అరకదున్నేవాడు. ఆసాముల ఇళ్ళల్లో పాలేరుగా ఉండి నామొగుడు ఇళ్లుకట్టే తాపీపని చేస్తడు. ఈ విధంగా మేము కష్టపడి పనిచేస్తే  మీపెద్దోరు వైభోగాలు అనుభవిస్తున్నారు. యసనాలకు పాల్పడి ఇల్లు, వళ్లు గుల్ల చేసుకుంటున్నారు'' అని ఇంటికి ''వెళ్లతానమ్మా'' అని చెప్పి బుచ్చమ్మ వెళ్లిపోయింది.  þ þ þ þ þ విశ్వనాథరావు వరలక్ష్మి పాత రాసక్రీడలను గుర్తు చేసుకుంటున్నారు. ఇరువురి మనస్సులు ఆనాటి పడక దృశ్యాలతో ముసిముసినవ్వులతో ఒకరినొకరు పొగడుకుంటున్నారు. వరలక్ష్మి చివరికి విశ్వనాథరావును ప్రశ్నించింది. ''మీరు కాశీయాత్రకు వెళదామనుకుంటున్నట్లు వినికిడిగా తెలిసింది. నిజమా?'' అన్నది. ''అవును వరం, చివరి దినాలు అక్కడ కాశీవిశ్వనాధుని పుణ్యప్రదేశంలో గంగాభవానిలో కలిసిపోదామని ఉంది'' అన్నాడు విశ్వనాథరావు. వరలక్ష్మి ''చేసిన పాపాపలు, పరస్త్రీ సంగమాలు, ఇల్లు వాకిలి పట్టకుండా అడ్డమైన తిరుగుళ్ల వల్ల వచ్చిన పాపం గంగలో మునిగితే పోతాయండీ? గంగమ్మ తల్లికి, ఈ పాప పంకిలం మోసేట్లు చేయటం ఉచితమా!'' అన్నది. ''ఓసి నీవెంత జాణాతనంగ మాట్లాడినావే! నీ అందం చూచేగదే నేనుకట్టుకున్న భార్యను కూడా నిర్లక్ష్యం చేసి అప్పులు చేసి సొమ్ము సొట్రా చేయించాను. ఈపాపం నీకు మాత్రం ఉండదా?'' అన్నాడు విశ్వనాథరావు.  ''ఎందుకుండదు ఉంటుంది. నీబోటి రసికుల సాంగత్యంతో శరీరం అమ్ముకున్న ఫలితం ఇప్పుడు అంటు రోగాలతో అనుభవిస్తున్నాను. చేసిన తప్పుకు దేవుడు వేసిన శిక్ష. మీకులాగ గంగలో దూకితే నాపాపాలు పోతాయా? మీ పిచ్చిగాని నాకు ఆ నమ్మకం లేదు'' అన్నది. ఈ అంటురోగాలతో కుమిలిపోవటమే 'నిజమైన శిక్ష' అన్నది వరలక్ష్మి. చేతిలో ఏదో సంచీతో విశ్వనాథరావు గది నుంచి బయటికి వచ్చింది. శాంతమ్మను చూచి చిరునవ్వు నవ్వింది. వరలక్ష్మి ఆమెను ఇలా  పలకరించింది. ''మీవారు కాశీకి వెళ్లి తన కాయం విశ్వనాధుని సన్నిధిలో గడిపి స్వర్గం పొందాలనుకుంటున్నారు. మీకు చెప్పారా?'' అయ్యో నాకు చెప్పి ప్రతి పనీచేస్తారటమ్మా! మగవాళ్ల చిత్తం ఎలా ప్రవర్తిస్తుందో అలా ఆచరిస్తారు అన్నది శాంతమ్మ. 'అవును కొడుకు పెళ్లి చేసి కాశీకి పోతే బాగుంటుందేమో!'' అన్నది వరలక్ష్మి. ''అది ఆయనగారికి ఉండాలి నేను చెపితే వింటారటమ్మా' అన్నది శాంతమ్మ. అవునండి, పతివ్రతలైన స్త్రీలు పతికి ఎదురురాకూడదు కదా! అందుకే మీరు మౌనంగా ఉండిపోయారనుకుంటాను. సరే ఏదో గతించిన దానికి చింతించిన లాభం లేదు. మీవారు గత ఇరవై సంవత్సరాల నుంచి సానివాళ్ల సహవాసంలో మునిగి తేలారు. నాతోను మంచి పరిచయం నెరిపారు. పొలం పుట్రా అమ్ముకొన్నారు జల్సాలకు ఖర్చుచేశారు. ఎందరాడవాళ్లతో సంబంధాలున్నా నామీద ఎక్కువగానే మక్కువతో ఉండేవారు. నేనుకోరకుండానే డబ్బు తలగడ క్రింద పెట్టేవారు. మీ పుట్టింటి సొమ్ములు, అత్తింటి సొమ్ములు గత పదేళ్లల్లో నా చేతికే ఇచ్చేవారు. ఇవి తన భార్యనడిగే తెచ్చేవాడినని చెప్పేవారు. ఇది ఎంత నిజమో తెలియదు. మీ సొమ్ములు శుక్రవారం పూట ధరించేదాన్ని. అప్పుడు మీరు నాస్మృతిపథంలో మెలిగేవారు. ఇప్పటికి మీ ఆస్తులు హరించుకుపోయినాయి. లంకంత మీ ఇల్లు తాకట్టులో ఉన్నట్లు విన్నాను. మీకు ఒకే అబ్బాయి. పెళ్లి కూడచేయలేకపోయారు. నేను సానిఇంటిలో పుట్టినా నాకూ హృదయమున్నది. భర్తను ఎదిరించలేని మీ స్థితి నాకు బాధ కలిగించింది. మీసొమ్ములు అన్నింటిని జాగ్రత్తపరిచాను. డబ్బు ఖర్చుఅయింది. సాని ఇల్లు అంటే అలంకరణలు, చీరెలు రవికెలు తళుకు బెళుకులు పందిరి మంచాలు, వగైరా ఎంతో ఖర్చుతో కూడి ఉంటుంది. అందువలన డబ్బు దుబారా ఎక్కువే. ఇక ఈ సొమ్ములు మీ విశాల హృదయం, ఎన్ని సొమ్ములు పోయినా భర్తకెదురుతిరగరాదనే మీ నడవడికి విచారం, జాలి కలిగింది. ఈ సొమ్ములు మీవి. మీకు ముట్టచెపుతున్నాను. కొంత పైకం గూడ ఉంది. బ్యాంకులాకర్‌లో దాచిపెట్టినట్టు భావించండి. నేను ఇస్తున్నా మీరు పుచ్చుకుంటున్నట్లు భావించకండి. అడుగో మీ అబ్బాయి వస్తున్నాడు. మీ కడుపున పుట్టినా నేనూ నా కొడుకుగా భావిస్తున్నా, తీసుకోండి అని'' రిక్షాలో వెళ్లిపోయింది వరలక్ష్మి. విశ్వనాధరావు పాపపరిహారార్థం భార్యతో చెప్పకుండా కాశీకి ప్రయాణమై వెళ్లాడు. వరలక్ష్మి భర్త ఒక్కమాటకూడా తనకు చెప్పకుండా కాశీ వెళ్లినందుకు దుఃఖించింది. కొడుకును పిలిచింది. ''బాబూ, వరలక్ష్మి సానిదైనా ఎంతో మంచి మనస్సు కలిగింది. మీనాన్న నా మెడలో సొమ్ములు ఒక్కొక్కటి ఆమెకు ఇచ్చివేసినా ఆమె వాటిని నీపెళ్లికోసం ఉపయోగించమని చెప్పి ఇచ్చి వెళ్లింది. నీవు నాకడుపున పుట్టినా, వరలక్ష్మి నీకు తల్లిలాంటిది. ఈ డబ్బు, సొమ్ము జాగ్రత్త పరుచుకో అన్నది. ''అమ్మా! నాన్న నీకు నాకు చెప్పకుండానే కాశీ వెళ్ళారా?'' అని కొడుకు కామేశం కళ్లనీళ్ళుపెట్టికోవటం చూచింది తల్లి. ఆమె కొడుకుతో ''బాధపడకు. గొప్ప ఇంటిలో పుట్టటం, ధనగర్వంతో జీవితం గడపటం, చెడు వ్యసనాలకు అలవాటుపడటం, కులాధిపత్యంతో విర్రవీగటం నేటి సమాజానికి మంచిదికాదు. కాయకష్టంతో శ్రమించటంలోఉన్న ఆనందం మన పనిమనిషి నాకు బోధించింది'' అని బుచ్చెమ్మ చెప్పిన విషయాలు కొడుక్కు పొల్లుపోకుండా చెప్పింది. ఆమెతో మాట్లాడి ఏకులమైనా తగిన పిల్లను పెళ్లిచేసుకో నాన్నా. ఇక ఈఇల్లు వేలానికి రానుంది. నేను మీనాన్నతో ఏభైఏళ్లు గడిపి ఇప్పుడు ఒంటరిగా ఉండలేను. నాకూ కాశీకి రైలు టిక్కెట్టుకొని మనసారా పంపించు'' అన్నది. కొడుకు తల్లిమాట శిరసావహించాడు.   - రామిశెట్టి రోశయ్య సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

ట్రాన్స్‌ఫరొచ్చిందోచ్‌

ట్రాన్స్‌ఫరొచ్చిందోచ్‌   రాష్ట్రంలో ఓ మారుమూల ప్రాంతంనుంచి బదిలీఅయింది. ఏ ప్రాంతంనుంచో ఎందుకులేండి ఏడవడం.. డిష్‌ టీవీ తప్ప మరో వినోదం కనబడని పరిస్థితులు మారబోతున్నందుకు ఎగిరిగంతేశాం (లక్కీగా కాళ్ళు, నడుములు ఏం కాలేదు) నిజం చెప్పొద్దూ- పెళ్ళయినప్పంట్నుంచీ అంత సంతోషం (నెక్లస్‌ చేయించిన రోజు కూడా) మా ఆవిడ ముఖంలోనేను చూడలేదు. ఇంతకీ బదిలీ ఎక్కడికీ అనేది చాలా ముఖ్యం. హై...ద...రా...బా...దు కు బందులతో ఎప్పుడూ బిజీబిజీగా వుండే భాగ్యనగరానికి. ఏరోజు ఏ ప్రాంతానికి నీళ్ళు వస్తాయో, ఏ ప్రాంతంలో ఎన్ని గంటల కరెంట్‌ పీకుతారో తెలియని, ఎవరి నోట్లోంచి ఏ భాష ఊడిపడుతుందో తెలియని రాష్ట్ర రాజధానికి. పెద్దసిటీ కనుక స్కూళ్ళకు పిల్లల్ని బస్సులో పంపచ్చు. చూడాలంటే బోలెడన్ని సినిమాలు, షికార్లూ అనో, తినడానికి పిజ్జాలు, బర్గర్లు, చాట్లు అనో తెలియదుగానీ అంతా ఆనందోత్సాహాల్లో తేలిపోవడమైతే జరిగింది. ఎప్పుడో పెళ్ళికో, ఆఫీసు మీటింగుకో తప్ప హైదరాబాదులో మాకు పెద్ద పనేం ఏడుస్తుంది. ఉద్యోగం పురుషలక్షణం కనుక, నేను పురుషుడిని కనుక ఆ లక్షణం కాపాడుకోవడం కోసం నేనూ నాతోబాటు ఫామిలీ హైదరాబాదు బయలుదేరాం. బయలుదేరేముందు- 'ఏమిటండీ నేనూ, పిల్లలు హైదరాబాదు వెడుతున్నందుకు పొంగిన పూరీల్లా వున్నాం. మీరేమిటి గాలి తీసేసిన బెలూన్లా అయ్యారు. కొంపదీసి ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ఏమైనా కేన్సిలైందా? కేన్సిలవుతున్నట్లు వార్తందిందా'' మూతి అష్టవంకర్లు తిప్పుతూ అంది అర్ధాంగి. ''ప్చ్‌'' ''మరి'' ''ఏం చెప్పమంటావు'' నిట్టూర్పు. ''అబ్బా సస్పెన్స్‌ పెట్టి చంపకండి.. అవును చేతిలో ఆ పే-స్లిప్‌ ఏమిటి'' ''ఖర్చులు లెక్కలేశాను. ఇంటి అద్దెకే చాలా పోయేలాగుంది. ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులూ, కూరగాయలూ... అన్నీ..'' '' ఆ ఫేసు మార్చండి బాబూ... మీకొచ్చే జీతమంత వున్నవాళ్ళు హైదరాబాదులో బ్రతకలేరన్నట్లు మాట్లాడతారేం'' ''హైదరాబాదు ఎ-1 సిటీ... బెంగుళూరులో మీ అక్క, చెన్నైలో మీ తంబి, ముంబయిలో మా బహెన్‌.. అస్తమానం ఖర్చులకు తట్టుకోలేక పోతున్నామో అని చలిజ్వరం వచ్చిన వాళ్ళలా పాడిందే పాడుతుంటారు కదా'' ''ఇప్పుడు మనం కూడా వాళ్ళతో గొంతు కలిపి పాడతామని బాధా'' ''కాదు'' ''మరి'' ''ఇప్పుడు ఇంతమంచి క్వార్టర్‌లో వున్నాం. చుట్టూ గార్డెను... కాంపౌండ్‌ వాల్‌.. పెద్ద సిటౌట్‌.. ఎంతో విశాలమైన ఇల్లు... నమ్మకమైన పనివాళ్ళు.. ఇంటిముందు తోటలో తాజా కూరగాయలు.. ఇంటివెనుక పండ్ల చెట్లు... నడిచివెళ్ళగలిగే దూరంలో స్కూలు... చల్లటిగాలి, స్వచ్ఛమైన నీరు... ఆహాఁ...'' ''ఆపండి'' ''ఏం'' ''పాట ఏమన్నా పాడతారేమోనని.. ఇంతకన్నా చిన్నగా వుంటుంది. ఇన్ని సౌకర్యాలుండవు.. అదేగా మీరు చెప్పాలనుకుంటున్నది. ఫరవాలేదులేండి అదే అలవాటవుతుంది. అక్కడ మీ కంపెనీ వాళ్లు బోళ్ళుమంది వుంటారు.'' ''అదే సమస్య. అక్కడ క్వార్టర్స్‌ ఖాళీగా లేవట'' ''అదేమిటి'' ''భువనేశ్వర్‌ నుంచి నాబోటి ఆఫీసర్‌గాళ్ళు ఇద్దరొచ్చి జాయిన్‌ అయ్యారట. ప్రస్తుతానికి ఖాళీలు లేవట'' ''ఎలాగండీ'' ''ఆఫీసు అకామిడేషన్‌ అయితే తట్టుకోగలం. లేకపోతే సిటీకి దూరంగా వెళ్ళాలి. అన్నింటికీ ఇబ్బందే. రోజూ అంతంత ప్రయాణం... పిల్లల స్కూలు... ట్రాఫిక్‌ జాములు...'' ''మరో మార్గం లేదా?'' ''నాతో పనిచేసి వెళ్ళినతను ఓ ఏర్పాటు చేస్తానన్నాడు'' ''ఏమిటో''    ''ఓ కాంపౌండ్‌వాల్‌ లోపల రెండు పాతగెస్ట్‌హౌజ్‌లు వున్నాయట. ప్రస్తుతం వుండేందుకు వీలుగా లేవట. అయితే స్వంత ఖర్చు పెట్టుకుంటే ఏర్పాటు చేసుకోవచ్చునన్నాడు. క్వార్టర్స్‌ ఎలాట్‌మెంట్‌ వచ్చేవరకూ వుండిపోవచ్చు.. లేదా బయట చూసుకోవాలి'' ''వద్దులేండి. ఈ ఐడియా బానే వుంది'' మన జీవితాన్నే మార్చేస్తుందంటావా'' ''వెళ్ళకుండా నేనేమంటాను'' ''...అతనే మరోమాట అన్నాడు.'' ''ఏమిటి'' 'జనరల్‌ మేనేజర్‌కు అభ్యంతరం ఏం లేదట. తన స్టాఫ్‌ సంతోషంగా వుండడమే తనకి కావాలిట'' ''మంచివాడండీ'' ''ఉండు.. ఇప్పుడే ఆకాశానికెత్తేసి సర్టిఫికెట్‌ ఇచ్చేయకు. వాడు నువ్వనుకున్నంత మంచివాడు కాకపోతే అక్కడ్నుంచే పడేస్తావు'' ''వెళ్దామండీ... ఎలాగైనా సర్దుకుంటాం'' దగ్గరగా వచ్చి షర్ట్‌గుండీ సవరించింది. పిల్లలూ గొంతుకలిపారు అమ్మతో. ఎటువంటి అడ్వాన్స్‌లూ యివ్వాల్సిన పనిలేదు. ఓనర్లు పెట్టే కండీషన్లు లేవు.. మంచి సెంటర్‌ 'దిల్‌సుఖ్‌నగర్‌'.. ఇక 'దిల్‌'సుఖంగా వుంటుందో లేదో చూడాలి. అయితే - చాలా పాతగా వుంది గెస్ట్‌హౌజ్‌. శిథిలావస్థలో వున్న ఆ మూడుగదుల పోర్షనులోకి కుడికాళ్ళు పెట్టింది కుటుంబం. వచ్చిన అవకాశం జారవిడుచుకోకూడదు అన్న భార్యారత్నం ఆలోచనకు ఓటు పడింది. మాసిపోయిన గోడలు.. వంటగదిలో ప్లాట్‌ఫామ్‌గానీ, కుళాయిగానీ ఏంలేవు. రెండు గదులకు పాతబడి పెచ్చులూడిన రూఫు... మూడోగదికి రూఫ్‌... వుంది. అయితే బంగాళాపెంకు, కొన్ని పెంకులు ఎవరరిస్తే ఎగిరిపోయాయో ఏమో గానీ మిస్సింగ్‌. ఎండా, వానా ఎంచక్కా లోపల నుంచే చూసే వీలు.. ఒకోసారి ఒకోలా పన్జేసే కుళాయిలు. నేల జిడ్డు పట్టేసివుంది. జారతామేమోగానీ పడతామన్న భయంలేదు. ఎన్ని యాసిడ్‌ బాటిళ్ళు, సోపు ప్యాకెట్లూ వాడాలో అన్నదే అర్ధాంగి ఆలోచన. ఆ ఆలోచనతో పైకిచూసింది. తిరగాలా? వద్దా... అన్నట్లు ప్రభుత్వ ఆఫీసుల్లో పన్జేసేవారిలా తుప్పుపట్టి, గొప్ప చప్పుడు చేసే ఫ్యాన్లు. ఉండడానికి వీలుగా మార్చుకునే మార్గాలను అన్వేషిస్తూ, గంటకు ఒకసారైనా ఉండివచ్చిన ఊరిని, ఇంటిని, అక్కడి మనుషులను తలుచుకుంటూ గడుపుతున్నాం రోజులు. 'దిల్‌' సుఖంగా అనిపించటం లేదు. వచ్చేముందు వున్న ఉత్సాహం లేదు. ''కొన్నాళ్ళు ఓపిక పట్టు పారూ. మనకు సరియైన క్వార్టర్‌ అలాట్‌ అయ్యేవరకే...'' అన్నాను. ముందుప్రక్క జామచెట్టు, వెనకాల మామిడిచెట్టు.. వాటికి అక్కడక్కడా పిందెలు కనిపించాయి. జామకాయలు చూసిన పిల్లలకు నోరూరింది... రాళ్ళు తీశారు. మామిడికాయల్ని చూసిన పారూకి కోరిక కలిగింది. కర్ర తీసింది (ఇంక 'వేరే' విశేషం ఏం లేదులేండి) చిన్న చిన్న సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టరింగ్‌ ఊడిన చోట కవర్‌ చేయడానికి మావద్ద వున్న వాల్‌ హ్యాంగింగ్స్‌, కిటికీ అద్దాలు పగిలిన చోట బయటప్రక్క పూలకుండీలు.. ఇలా అత్యవసర చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టి, ఇల్లు మనుషులు వుండేందుకు అనుకూలంగా మార్చుకోగలిగాం. రెండు నెలలు గడిచిపోయాయి. స్టాక్‌మార్కెట్లు కూలిపోవడంతో బంగారం, వెండి ధరలు పెరగడంతో హైదరాబాదులో సమ్మెలు, బందుల వార్తలతోబాటు దొంగతనాలు దోపిడీ వార్తలకు ప్రచారం వచ్చింది. ''ఇక్కడ ఆఫీసుకు దగ్గరగా వున్నాం. ఆఫీసు సెక్యూరిటీ మనకూ సహాయపడుతోంది'' అని ఆనందిస్తున్న సమయం... ఓ లావుపాటి వ్యక్తి, సన్నగా వున్న ఆయన స్వంత భార్యతో మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటి తలుపు తట్టాడు. .. ఆయన ఆ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌ అని, ఓ ఆర్నెల్లపాటు వుండాల్సి వస్తుందని, ఓ నాలుగురోజుల్లో కొద్ది సామానులతో 'కడప' నుంచి వస్తున్నట్లు 'బాంబు' లాంటి వార్త పేల్చి వెళ్ళిపోయారు. ఆరోజు ఉదయమే హై-టెక్‌ సిటీలో మీటింగుండి రావడం ఆలస్యమవుతుందని చెప్పి వెళ్ళాను ఇంట్లో. రాగానే నా కళ్ళలోకి చూడలేక చూస్తూ, ఆవార్త చెప్పలేక చెప్పింది పారూ. ఈ మధ్యలో అది తలుచుకుని ఎంత కుమిలిపోయిందో వాచిపోయిన ఆ కళ్ళను చూస్తే తెలిసింది. ''ఎక్కడికి పోతాం. ఆ గాడిదకు బుద్ధుందా'' నా చిరాకు తారాస్థాయికి చేరుకుంది. ''అదే అన్నాను'' పారూ. ''ఏమేడిశాడు.'' ''నిజమేనండీ. నాకూ తెలుసు మీ ఇబ్బంది. అందుకే ఆ చిన్నపోర్షనుంది చూడండి అటుపక్క.. దాంట్లోకి మీరు షిఫ్ట్‌ అవ్వండి. నేనూ మాట్లాడాను ఎస్టేట్‌ మేనేజరుతో...'' అన్నాడు. ''ఏమిటి.. దానికి వాడి బోడి రికమండేషను. వాడే తగలడొచ్చుగా అందులోకి... ఓహ్‌ాఁ.. వాడు సీనియర్‌గాడు కదా'' ''మన కర్మ... మంచి బంగళావదిలేసి ఇక్కడికి వచ్చాం. ఛండాలంగా వున్నదానిని శ్రమదానం చేసి, డబ్బుపోసి ఈ స్థితికి తెచ్చుకున్నాం. కన్నుకుట్టింది వాళ్ళకి.'' పిల్లలు వదిలివెళ్ళడానికి ఇష్టపడలేదు. నిరాహారదీక్షకు దిగుతామన్నారు. (భయపడకండి కాస్త టీవీ వార్తల ప్రభావం) అంతా మంచం మీద కూలబడ్డాం.. ఆ తరువాత తీరుబడిగా బాధలో పడ్డాం. ''బాధపడితే ప్రయోజనం వుండదు. కర్తవ్యం ఆలోచించండి'' పారూ ముందుగా కోలుకుంది. కృంగిపోకుండా గుండెల్లో 'దమ్ము' నింపుకున్నాం. అక్కడే వున్న చిన్న పోర్షనుకు మారాం. మళ్ళీ శ్రమతో చమటోడ్చాం. పాత చీరకట్టుకుని పారూ, గళ్ళలుంగీ చుట్టుకుని నేను, అడ్డమీద పోరగాళ్ళలా పిల్లలు... మళ్లీ 'కొంప'ను 'ఇంపు'గా చేసుకునే కసరత్తు. ట్యాంకునుండి వాటర్‌ రావడం లేదు. పైపులో బ్లాకు.. బ్లాకు పీకగానే కుళాయిలు పనిచేయడం లేదని తెలిసింది. స్విచ్‌వేస్తే లైట్లు వెలగలేదు. వైరింగ్‌ ప్రాబ్లమ్‌ (ఒక చోట స్విచ్‌ వేస్తే ఊహించని చోట లైటు వెలుగుతుంది) వర్షాకాలం కొంప కారుతుందనడానికి చారలు పడ్డ గోడలు, నేలను కరచిపెట్టుకునివున్న సున్నం ముద్దలు.. కొంత వదిల్చి, వదల్చలేక వదిలేసిన చోట ఎప్పటిలా వాల్‌ హ్యాంగింగ్స్‌.. దోమలు, పందికొక్కులు, బల్లులు, బొద్దింకలు.. సకల జీవరాశులు స్వైరవిహారం చేస్తున్నాయి. అంతకు పూర్వం ఆ కాంపౌండ్‌వాల్‌ను ఆనుకుని వున్న బిల్డింగులో బిస్కెట్ల ఫ్యాక్టరీ వుండేదన్న నిజం బయటికొచ్చింది. ఏ పురుగులమందు కంపెనీ వున్నా పీడాపోయేది అనుకుంది పారూ. జీవరాశులతో సహజీవనం తప్పించటానికి శ్రీమతి వాటిని తరిమేదిశగా ఆలోచనలు పారించి ఉపాయాలను వెలికితీయడంలో నిమగ్నురాలైంది. రాత్రిపూట కిటికీల బయట కప్పల అరుపులను అణచటానికి తనకిష్టమైన మైఖేల్‌ జాక్సన్‌, రెమోఫెర్నాండేజ్‌ల సి.డీలు ప్లే చేయడం మొదలుపెట్టాడు మాజ్యేష్టుడు నిద్రపోయేవరకు. ఓ ఆరువేలు వదుల్చుకుని కొంపను వుండేందుకు వీలుగా మార్చుకున్నాం. ఇంత చిర్రెత్తించే పరిస్థితుల్లోనూ ఎడారిలో ఎండమావిలా కొన్ని ఆశాజనకంగానూ తోచాయి. అవేమనగా మష్రూమ్స్‌- కుక్క గొడుగులన్నమాట.. వాటంతట అవే బోలెడు టీవీలో 'మా ఊరివంట' 'మా ఫ్లాటు వంట' లాంటి కార్యక్రమాలలో వీటితో రకరకాల (రుచికరమైన అని అనట్లేదు) పదార్థాల తయారీలో 'తల' పెట్టేసిన శ్రీమతి స్టౌమీద బాణలీ పెట్టేసింది. పేరు తెలియని మొక్కల రంగురంగుల పువ్వులు... పెద్ద నిమ్మచెట్టు, దానికి పచ్చటి నిమ్మపండ్లు. చూడగానే 'పచ్చడి పెట్టుకుందాం.. రా' సినిమా ఫక్కీలో అనేసింది పారూ. పిల్లలు కాయలు కోయడానికి కర్రలుచ్చుకుని రడీ అయిపోయారు. నేను ఉప్పుకారాలకోసం బైకు తీస్తుండుగా - ''మీ 'దూకుడు' ఆపండి. ఈవేళప్పుడు కోయకూడదు. తరువాత చూద్దాం'' అంటూనే మొత్తానికి ఈ పోర్షనూ అలవాటు అవుతోందిలేండి. మరో సీనియర్‌గాడు తగలడకుండా వుండాలని ఆ ఏడుకొండలవాడిని ప్రార్దిద్దాం'' అని కేలండరుకేసి తిరిగింది. గాలికి కేలండరు తిరగబడింది. నన్నెందుకు లాగుతారు మీమేటర్‌లోకి అన్నట్లు. అయినా అలాగే అంటూ కళ్ళుమూసుకుని చేతులు జోడించే పోశ్చర్‌లోకి వచ్చేశాను. ''ఇక్కడ కాదు'' అన్నారు అమ్మ మనసు  గ్రహించిన పిల్లలు. ''మరి'' ''గుడిలో'' అర్ధాంగి. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరాం. þ þ þ þ þ þ ఆ రోజున ఎవరో సీనియర్‌ మేనేజర్‌ ఇల్లు చూడడానికి వస్తున్నట్లు వార్త భగ్గుమంది. ''ఇది అన్యాయం'' పిల్లలు అరిచారు. పారూ ముఖంలో ఎక్కడలేని విసుగు.    ''ఏమండీ.. మన జాతకాలు చూపించుకుందామండీ... ఏమైన శాంతి పూజలు అవసరమవుతాయేమో.. పైగా మీరు అష్టమశనిలో వున్నారు. లేకపోతే మనకీ అగ్ని పరీక్షలేమిటండీ..'' ''ఆలోచిద్దాం. ఏదైనా పథకం వేద్దాం.. మనం ఎక్కడికీ వెళ్ళకూడదు., వాళ్ళే పారిపోయేలా చేయాలి'' బాల్‌పెన్నుతో నుదుటిమీద కొట్టుకున్నా, ఆలోచనల 'లింకు' దొరికింది. ఇద్దరు పిల్లలు.. ఇద్దరు పెద్దలు, నాలుగు తలకాయలు ఆల్‌ఖైదాల్లా ఆలోచించాం. మర్నాడు 'అతడు' వస్తాడనగా - ''అమ్మా నువ్వు ఇల్లు శుభ్రం చేయొద్దు. ఛండాలం చేద్దాం. వాల్‌ హ్యాంగింగ్స్‌ తీసిపారేశాం. టేపు వేసి చుట్టిన ఎలక్ట్రిక్‌ వైర్లు లాగి, పీకి అసహ్యంగా వేలాడేటట్టు చేశాం. గోడలపైన క్రేయాన్స్‌తో, బొగ్గుముక్కలతో పుర్రెబొమ్మలు పిచ్చిపిచ్చి రాతలపని పిల్లలకు అప్పజెప్పాం. ప్లాస్టిక్‌ కుళాయిని సింపుల్‌గా 'ఫట్‌' మనిపించాం. డ్రైనేజి మూతను చెట్లలోకి విసిరేశాం... ముక్కులు మూసుకుని ఇవతలకొచ్చేశాం. లోపల్నుంచి బొద్దింకలు కొన్ని పాకేవి. మరికొన్ని ఎగిరేవి. ఎంత దరిద్రంగా వుండాలో- చేయగలమో శక్తివంచన  లేకుండా చేసేశాం. ఒక్కముక్కలో చెప్పాలంటే కొంపకొల్లేరైంది. చూసిన సీనియర్‌ మేనేజర్‌ కళ్ళుతిరిగాయి. అందుకేనేమో ''ఇందులో ఎలా వుంటున్నారు'' అని జాలిగా అడిగాడు. ఆయన భార్యామణి అసహ్యంగా ఫేసు పెట్టింది. ''మేం బయట ఎక్కడన్నా చూసుకుంటాం'' అంటూ వెళ్ళిపోయారు. ''శ్రమయేవ జయతే''- అంతా అందంగా మార్చడంలో మునిగిపోయాం. కొంత చేతి చమురూ వదిలింది. రోజులు గడుస్తున్నాయి. ఎప్పుడూ మధ్యాహ్నం ఇంటికిరాని నేను హడావిడిగా రావడం పగిలిన కిటికీ అద్దంలోంచి చూసింది పారూ. చూసి ఊరుకోలేదు. టీవీ పైనున్న ఫ్లవర్‌ వాజ్‌ను కోపంగా చేతిలోకి తీసుకుంది. కొరకొరా చూసింది. అడుగుపెట్టానో.. లేదో... విసిరికొట్టడానికి సిద్ధమైంది. ''వద్దు... విసరొద్దు... ఈసారి వెరీగుడ్‌న్యూస్‌'' ఎక్కడ బుర్ర పగలకొడుతుందో అని అరిచాను గట్టిగా పెంకులు రాలితేరాలాయి అన్న ధైర్యంతో. ''గుడ్‌న్యూస్‌'' అన్నది సరిగా వినబడలేనట్లుంది. ఫలితం- ''ఫ్లవర్‌వాజ్‌'' గాల్లో ఎగిరింది. జహీర్‌బౌలింగ్‌ను తలపింపజేస్తూ. యువరాజ్‌లా క్యాచ్‌ పట్టుకున్నాను దగ్గరగా వచ్చి. ఒక మేనేజర్‌కు ప్రమోషన్‌ మీద ముంబయి ట్రాన్స్‌ఫరైంది. మనకి చాలా పెద్దది, కొత్తది అయిన క్వార్టర్‌ ఎలాట్‌ చేశారోచ్‌.. ప్లేస్‌ - ''శాంతినగర్‌'' నటరాజ భంగిమలో నిలబడ్డాను చేతిలో ఎలాట్‌మెంట్‌ లెటర్‌తో. నవ్వాలో, ఏడ్వాలో తెలియని అయోమయంలోంచి తేరుకోవడానికి చాలా టైమ్‌ పట్టింది షాకులు మీద షాకులు తిన్న అర్ధాంగికి. వాజ్‌ విసిరేసినందుకు తన మీద తనకు కలిగిన కోపమో, నామీద్‌ పొంగి పొర్లిన ప్రేమో- ఏదైతేనేం నన్ను గట్టిగా కౌగిలించుకొని ''సారీ అండీ'' అంటూ గట్టిగా ఏడ్చేసింది. పిల్లలు చప్పట్లు, కేరింతలు. మ్యాచ్‌ గెలిచిన ఫీలింగ్‌. 'ఠప్‌' మని చప్పుడు... ఏమిటని చూశామంతా... పైన సీలింగ్‌ నుండి ప్రక్కనే రాలిపడిన పెంకు. మంత్రవాది మహేశ్వర్‌ సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

పడగనీడ

  పడగనీడ     హైదరాబాద్‌లో ఎప్పుడూ గొడవలూ సంఘర్షణలే! మార్చ్‌లూ, ఉద్యమాలూ, మతకలహాలూ, అలజడులూ. ఏ అవాంతరం వచ్చినా కంట్రోల్‌ చెయ్యడానికి అక్కడున్న పోలీస్‌ఫోర్స్‌ చాలదు. జిల్లాలనుండి వేలమందిని రప్పిస్తారు. హడావుడయిపోయాక చార్జీలు, ఖర్చులూ, డ్యూటీకిచ్చే డబ్బూ ఇవ్వడానికి ఒకటిరెండు రోజులక్కడే ఉండాలి. అలజడి ఉన్నన్ని రోజులూ రెస్ట్‌లెస్‌ డ్యూటీ, రాత్రీ పగలూ.. అయిపోయాక పోలీసు ప్రాణాలకీ కాస్త 'మార్పు' కావాలని ఉండదా? అదీ యువరక్తం అయితే జల్సా చెయ్యాలనీ ఉంటుంది. రాజారావు, రమణా పోలీసులు, స్నేహితులు. రాజారావు అనుభవజ్ఞుడు. రమణని రెడ్‌లైట్‌ ఏరియాకి తీసుకుని వెళ్లాడు రాత్రికి. (రెడ్‌లైట్‌ ఏరియాలనేవి ముంబయిలోనే కాదు, ప్రతీ ఊళ్లోనూ ఉంటాయ్‌. పేరు మార్పు అంతే. అంచేత హైదరాబాద్‌లో అది, ఆపేరుగల ప్రాంతం లేదనే టెక్నికల్‌ అబ్జెక్షన్‌ తీసుకుని రావద్దు) తెలిసున్న 'ఆ రకం' ఇంటికి తీసుకుని వెళ్లాడు సీనియర్‌ జూనియర్‌ని. రాజారావుకి సెలక్షన్‌ చకచకా జరిగిపోయింది. అమ్మాయిని తీసుకుని గదిలోకి వెళ్లిపోయాడు. 'మోడస్‌ ఆపరండే' అంతా రమణకు చెప్పడంతో కొంచెం ఆలస్యమయినా అమ్మాయిని సెలక్ట్‌ చేశాడు. ఆ అమ్మాయి తనగదిలోకి వెళ్ళిపోయింది. 'సెటిల్‌మెంట్‌' అయిపోయాక నాయకురాలు చెప్పిన నెంబరు గదికి రమణవెళ్లి లోపల తలుపు గడియపెట్టాడు.. అతనికంతా కొత్త. గది అలంకరణ అదిరింది. నీట్‌గా ఉన్న బెడ్‌. అమర్చి ఉన్న డ్రెస్సింగ్‌ టేబుల్‌, నిలువుటద్దం. మత్తెక్కించే సెంటు వాసనలు, పూలపరిమళాలు.. కళ్లు జిగేల్‌మనిపించే లైట్స్‌... తనపాలిటి స్వప్నలోకం... సీనియర్‌ స్నేహితుని సలహామేరకు డ్రెస్సింగ్‌ టేబుల్‌ దగ్గర నిలబడి, కొంచెం ట్రిమ్‌ అయి, చొక్కాతీసి హేంగర్‌కి తగిలించాడు.. అతని వెనుకగా కొంచెం దూరంలో బెడ్‌. బెడ్‌మీద కూర్చుని కుర్రవాడిని చూస్తున్న 'అమ్మాయి' రమణ వీపు చూసి ఒక్కసారి ఉలిక్కి పడింది.. అతడు తనను చేరేలోవులో. ''బాబూ రమణా! ఇలారా!'' అది పిలుపా, వేడుకోలా, ఆవేదానభరిత ఆక్రందనా???      రమణ ఆశ్యర్యంతో తబ్బిబ్బయ్యాడు. తన పేరు ఈమెకేం తెలుసు? అయిదారుగురు అమ్మాయిల్లో తనూ నిలబడింది. నవ్వుతూ! తాను సెలక్ట్‌ చెయ్యగానే ఆమె మెట్లెక్కి వెళ్లిపోయింది. నిర్వాహకులు చెప్పారా? అవకాశం లేదు. తనపేరూ, ఊరు వాళ్లకెందుకు? వాళ్లు అడగలేదు. తను చెప్పలేదు. వాళ్ళక్కావలసింది రేటు ప్రకారం డబ్బు, అదీ ఎడ్వాన్స్‌ పేమెంటు! అది సెటిల్‌ చేసి తాను వాళ్లు చెప్పిన రూంకి చేరుకున్నాడు. అయితే ఈమెకు తన పేరెలా తెలిసింది? అడిగాడు... ''నా పేరు నీకెలా తెలుసు?''     ''తెలుసు! నీవీపుమీదున్న కత్తిపోటు గాయం మానిపోయినా ఆనవాలు పోలేదు, పోదు. ఇంకా కావాలంటే.. మరిన్ని..'' ఆగింది.. ఉద్వేగాన్ని అదిమిపట్టి ''నీ కుడిమోకాలుపైన తొడమీద ఒక పుట్టుమచ్చ. నీ ఎడమ మోకాలు భాగంలో మరో పుట్టుమచ్చ..'' ఇంకా... ''ఆగు.. ఆగండి..'' ఆమె చెప్పేవన్నీ నిజమే. తన వీపు మీద ఫ్రెండ్‌ విసిరిన కత్తి పోటు వాడు కొబ్బరికాయ కొడుతుంటే కత్తిపిడి ఊడి కత్తి తనవీపును తాకిందట. పెద్ద గాయమే అయినా తగ్గిపోయి గాటు మిగిలిపోయింది. ఇక తను ఇంకా పేంటు తియ్యలేదు. ఆమె చెప్పిన పుట్టుమచ్చలు అతను రోజూ చూస్తున్నవే... ''బాబూ, రమణా ఇంకా చెబుతాను విను. నీ పేరు రమణా రావు. 'రమణ' అనే అందరూ పిలుస్తారు. నీతండ్రిపేరు సుబ్బారావు. మీది ఏలూరు పడమర వీధిలో, మీది చిన్న పెంకుటిల్లు. నీకొక నాయనమ్మ ఉంది... నీతల్లి చిన్నప్పుడే ''చనిపోయింది'', అని నీకు చెప్పబడింది..'' ఆగింది. ''ఇంతకీ నువ్వు... మీరెవరు?''    ''నేను నీ కన్నతల్లిని'' రమణ కుప్పకూలిపోయాడు.. ఆమె కూడ తను కూర్చున్న చోటే సొమ్మసిల్లి పడిపోయింది.      రిటైర్డ్‌ లెక్చరర్‌ లక్ష్మీనారాయణ ఊరుకి కొంచెం దూరంగా ఉన్న జూనియర్‌ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాడు. అతను లెక్కల్లో దిట్ట. అతన్ని కోరితీసికుని వెళ్లారు నిర్వాహకులు. రిటైరయినా నెలకు రూ||25వేల జీతం.   లక్ష్మీనారాయణ పనిచేస్తున్న కాలేజి ఊరుకి దూరమే. రోజూ 9.30కి ఇంటిబయట ఆటోస్టాండుకి చేరేసరికి ఒక ఆటో సిద్ధంగా ఉంటున్నది. రెండు మూడు రోజులు అదే ఆటోలో వెళ్లాక దారిమధ్యలో ఆటోవాలాతో సంభాషణ ప్రారంభించాడు.. టైమ్‌పాస్‌కి. ''అబ్బాయ్‌ నీపేరేంటి బాబూ?'' ''ప్రభాకర్‌ సార్‌'' మర్యాదకు ఆనందించాడు లక్ష్మీనారాయణ... '' ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావ్‌!'' ''అవును సార్‌, సిద్దిపేటకు కొత్తే'' ''ఏ ఊరునుండి వచ్చావు?'' ''మాది కాకినాడ, సార్‌'' ''అంత దూరం నుండి ఇక్కడికెందు కొచ్చావ్‌, అక్కడే ఆటో నడుపుకోవచ్చు కదా!'' '   'ప్రభాకర్‌ ఆలోచించాడు. అతనికి సమాధానం చెప్పే అవసరం తప్పింది. ''మీ కాలేజ్‌ వచ్చేసింది, సార్‌! రేపు అన్నీ చెబుతాను'' అవును. లక్ష్మీనారాయణ కాలేజికి చేరవలసిన టైమ్‌ అయింది...''సరే బాబూ'' అంటూ డబ్బులిచ్చి దిగిపోయాడు. ''హమ్మయ్య, ఈరోజుకి గండం గడిచింది'' అనుకుంటూ వెనుదిరిగాడు. రేపటికి రక్తికట్టించే కథ అల్లడం తేలిక... దొరికిన బేరాలు చూసుకొని తిరిగి తానుండే చోటుకి బయలుదేరాడు. అందరి ఆటోవాలాలకన్న తను లక్ష్మీనారాయణ గారిదగ్గర తక్కువే తీసుకుంటుండడంతో ఆయన తన ఆటోకోసం ఎదురుచూస్తుంటాడు... మరునాడు యథాప్రకారం ఆటో ఎక్కగానే లక్ష్మీనారాయణ ప్రభాకర్‌ వివరాలు అడిగాడు. (సశేషం) కొట్టి రామారావు సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

ఎవరి అభిప్రాయాలు వారివే

  ఎవరి అభిప్రాయాలు వారివే ఒక గ్రామ శివారులో ఒక చెట్టు కింద ఒక యోగి ధ్యానంలో ఉన్నాడు. ఆయన చుట్టూ ఏం జరిగినా తెలిసే స్థితిలో లేరు  అప్పుడు ఆ దారిలో మద్యం మత్తులో తూగుతూ తూలుతూ ఒకడు వచ్చాడు ధ్యానంలో ఉన్న యోగిని చూసి "ఇతను కూడా నాలాగా మహా మత్తులో ఉన్నట్టున్నాడు" అనుకుని దగ్గరకు వెళ్లి చూశాడు. కానీ యోగి పట్టించుకునే స్థితిలో లేడు.  అప్పుడు ఆ తాగుబోతు "బహుశా ఈ రోజు ఇతను నాలాగా తప్పతాగి ఉంటాడు. అందుకే ఈ లోకంలో లేడు. చుట్టూ ఏం జరిగినా తెలిసే స్థితిలో లేడు" అనుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక దొంగ వచ్చాడు ఆ దారిలో. అతను యోగిని చూసి "ఇతను నాలా ఒక దొంగ కాబోలు. రాత్రంతా దొంగతనాలు చేసి అలసిపోయి కూర్చునే నిద్రపోతున్నట్టున్నాడు, పాపం..."  అని అనుకుని ముందుకు వెళ్ళిపోయాడు. అనంతరం జ్ఞాని ఒకరు వచ్చారు. ఆయన "ఈయన కూడా నాలాగా  ఒక జ్ఞాని అయి ఉంటాడు... ధ్యానంలో ఉన్న ఆయనను ఇబ్బంది పెట్టకూడదు" అనుకుని ఆ జ్ఞాని అక్కడినుంచి ముందుకు వెళ్ళిపోయాడు.  ఈ లోకంలో మంచి వాళ్ళు తమలాగే ఎదుటివారిని మంచిగానే అనుకుంటారు...చూస్తారు. చెడ్డవారేమో  తమలాగే చెడ్డ వారిగా చూస్తారు.  అంతే తప్ప ఎదుటివారి అభిప్రాయాలను తెలుసుకోరు. వారికేమీ తెలియదనే అనుకుంటారు.  కానీ ఎవరికి వారు వారు వారుగానే ఉండిపోతున్నారు. - యామిజాల జగదీశ్

అనిత పార్ట్ - 6

      అనిత పార్ట్ - 5     అనిత సాదించవలసిన పనులు చాలా వున్నాయి. అందులో యేది ముందో యేది వెనుకో ఆలోచించుకుంటొంది.     ముందుగా జానకిని కలుసుకుంది.     జానకి ఆప్యాయంగా అనితను కౌగలించుకుని" బాగున్నావా? రాణి కూడా వచ్చిందా?" అంది.     "ఆ! నాతోకూడా తీసుకువచ్చాను."     "ఎవ్వరూ ఏమీ అనలేదూ?"     "అనకుండా ఎందుకుంటారు?     "ఎలా తట్టుకున్నావ్ మరి! అనలా ఇంట్లోకి ఎలా అడుగు పెట్టగాలిగావ్? రాజారావు అన్నయ్య........"     "మీ రాజారావు అన్నయ్య నన్ను సకల మర్యాదలతో ఆహ్వానించాడు. ఆయన తన బంధువులను ఆదరించి తీరుతాడట!"     తనలో తను చిలిపిగా నవ్వుకుంది అనిత.     "నమ్మలేక పోతున్నాను రాణి సంగతి తెలిశాక నిన్ను యింట్లో ఉండనిచ్చాడా అన్నయ్య"     "నన్ను ఒకరు ఉండనిచ్చేదేమిటి? ఆ ఇంటి కోడల్ని!"     గర్వగా అంది అనిత.     "నీ మాట యథార్ధం కావాలి అనితా! అప్పుడు నా కంటే ఎవరూ ఎక్కువ సంతోషించరు."     ముఖం సంతోషంతో వెలిగి పోతుండగా అంది జానకి.     "నాసంగతి వదిలెయ్యి. నీ  సంగతి ఆలోచించు, అందుకే వచ్చాను. నేనొక ప్రణాళిక ఆలోచించాను."     జానకి ముఖంలో వికాశం ఎగిరిపోయింది.     "మనిద్దరం క్లాస్ మేట్స్ కావటం నా అదృష్టం. అనితా! నీకు నా మీద గల ప్రేమకు ఎంతో పొంగిపోతున్నాను. కానీ, ఏ ప్రణాళికలూ నా అదృష్టాన్ని మార్చలేవు"     "అదిగో! ఆ ఏడుపు ముఖమే నా కిష్టంలేదు భగవంతుడు మనకు జీవితాన్నిచ్చింది నవ్వుతూ త్రుళ్ళుతూ మార్చ లేవు"     "అదిగో! ఆ ఏడుపు ముఖమే నా కిష్టంలేదు భగవంతుడు మనకు జీవితాన్నిచ్చింది నవ్వుతూ త్రుళ్ళుతూ గడవటానికి..."     "అందరికీ ఆ అదృష్టం పట్టదు అనితా!"     "ప్రయత్నం చెయ్యకుండా నిరాశపడితే ఎలా?"     "ఏం చెయ్యమంటావ్?"     "మా ఇంటికి___అదే. మా మేనత్తగారింటికి, రమణరావు ఎప్పుడు వస్తాడో తెలుసుకుని నీకు చెపుతాను. అప్పుడు నువ్వూ సరిగ్గా అక్కడకు రావాలి."     "రాలేను. అలాచేస్తే సుశీలకి, రాజారావు అన్నయ్యకీ కష్టం కలుగుతుంది."     "సుశీలకి కష్టం కలగకుండా నేను వివరిస్తాను. రాజారావు బావా కెందుకు కష్టం కలుగుతుందీ?"     జానకి మాట్లాడకుండా పెదవి వంటితో కొరుక్కుంటూ కన్నీళ్లాపుకుంటూ కూర్చుంది.     అనిత అసహనంగా "బావకు విషయం తెలుసా?" అంది.     "తెలిసే ఉంటుంది,"     "తెలిసే నిన్ను అసహ్యించుకుంటున్నాడా?"     "సంఘంలో పరువు ప్రతిష్ఠలు ముఖ్యం కాదు మరి? నేను అల్లరి పాలయినదానిని....."     "అలా మాట్లాడకు. నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వు నిరపరాధివని  తెలిసే సంఘంలో ప్రతిష్ఠకోసం చెల్లెలిలా అభిమానించే నిన్ను దూరంగా ఉంచాలనుకుంటున్నాడా రాజారావు? అతని మార్చాలని ప్రయత్నించావా నువ్వు"     "లేదు. అన్నయ్య మనసు కష్టపెట్టలేను."     "కష్టపెడుతున్నానేమో ననే భ్రమతో నిన్ను సరిగా అర్థం చేసుకునే అవకాశం బావ కియ్యటంలేదు నువ్వు. కష్ట పెట్టుకుంటే పెట్టుకోనీ! కొన్ని విషయాలు అతనికి తెలిసిరావాలి...."     జానకి గాభరా పడింది.     "వద్దు! వద్దు! సుశీల మనసు వింటోన్న తులశమ్మ కలగించుకొంది.     "ఒకసారి తనను తను రక్షించుకోవాలని ప్రయత్నించి ఇంత ఊబిలోకి దిగింది. ఇంకా ఎందుకమ్మా, ఈ ప్రయత్నాలు? మరే రంగులు పులుముతారో? పోనిలే! అన్యాయాలూ, అపనిందలూ సహించటం మా కలవాటైపోయింది,"     "సహిస్తున్న కొద్దీ అక్రమాలు ఎక్కువవుతాయి గాని తగ్గవు. ఇంకా ఇరవై కూడా నిండని జానకి జీవితం ఇలా నాశనం కావలిసిందేనా? ఏం జానకీ! నువ్వు నా మాట వింటావా లేదా? నేను వెళ్ళిపోనా?"     "వింటాను, కానీ నా కారంణగా సుశీలకు, రాజారావు అన్నయ్యకు ఏ ఇబ్బందీ రానీయకూడదు."     "అలాగే! కానీ బావకు నీస్థితి అర్థమయ్యేలా నువ్వు వివరించి చెప్పు, మరీ అంత మూర్ఖుడు కానే కాడు."     "మా  అన్నయ్య మూర్ఖుడు కానే కాడు."     రోషంగా అంది జానకి....     పకపక నవ్వింది అనిత...     "ఇంత అభిమానం గుండెల్లో దాచుకుని ప్రయోజనం లేదు. కార్యాచరణలో చూపించు, సుశీలను కాపాడాలని లేదా నీకు?"     చివరి మాటతో జానకి ఆలోచనలో పడింది. "సరే! నువ్వెలా చెపితే అలా వింటాను."     అనిత ఉత్సాహంతో తులశమ్మదగ్గిర సెలవు తీసుకుని లేచింది.     స్కూటర్ మీద ఇంటికి వెళుతున్నాడు రాజారావు.         "బావా!" అని పిలిచింది.     రాజారావు ఆగిపోయాడు     "ఎక్కడ్నుంచి వస్తున్నావ్?"     "జానకి దగ్గిర నుంచి!"     "జానకి!! నీకు తెలుసా?"     "తెలుసు. మే మిద్దరం మెడ్రాస్ లో బి. యస్ సి. చదువుకున్నాం...."     "మీరు మెడ్రాస్ లో స్నేహితులయితే అయ్యారు. ఇక్కడ మాత్రం నువ్వా ఇంటికి రాకపోకలు చెయ్యడానికి వీల్లేదు."     "ఎందుకు బావా?"     అమాయకంగా అడిగింది.     "నీకు తెలిసే ఉండాలి...."     "నాకు తెలిసినంతవరకూ జానకి దగ్గిర కెళ్లటం ఏ విధంగానూ లజ్జ పడవలసిన కార్యం కాదు,"     "ఇది మెడ్రాస్ కాదు. ఇక్కడ నీకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. నేను నొక్కి చెపుతున్నాను. నా కుంటుంబంలో వ్యక్తులెవరూ నా మాట కాదనడానికి వీల్లేదు,"     "హమ్మయ్య! అయితే బ్రతికి పోయాను. నేను బంధువుని మాత్రమే! కుటుంబంలోని వ్యక్తిని కాను. భార్య, చెల్లెళ్లు, తమ్ముళ్లు, తల్లి, తండ్రి-వీళ్ళే కుటుంబంలోఅ వ్యక్తులు."     గుర్రుమన్నాడు రాజారావు.     "నువ్వు నా యింట్లో ఉంటున్నంతవరకూ  మా మర్యాదకాపాడాలి."     "తప్పకుండా  కాపాడతాను. ఆ ప్రయంత్నంలోనే రాణిని కూడా తీసుకొచ్చాను."     రాజారావు ముఖం ఎఱ్ఱగా కందిపోయింది రోషంతో,     నవ్వు నాపుకోవటానికి ప్రయత్నిస్తూ పైట చెంగు నోటి కడ్డం పెట్టుకుంది అనిత.     అది చూసిన రాజారావుకు మరింత మండింది.     "నీ కసలు లజ్జ అంటే ఏమిటో తెలుసా?"     "తెలియదు, లజ్జపడవలసిన పనులునే నెప్పుడూ చెయ్యలేదు. నీకు తెలుసా? చెప్పవూ?"     "నువ్వు...నువ్వు..."     కోపంతో పిడికిలిబిగించి మాట పూర్తీ చేయలేకపోతున్నాడు రాజారావు.     "నీ మరదల్ని..."     వమ్రతతో అందించింది అనిత.     కాల్చేసేలా ఒక్కసారి అనితను చూసి తల విసురుగా తిప్పుకొని స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజారావు.     "అబ్బా!" అని క్రింద కూలబడింది అనిత...     రాజారావు స్కూటర్ దిగి గాభరాగా "ఏం జరిగింది?" అన్నాడు.     "క్రింద పడిపోయాను. కాలు నరం పట్టేసింది. అడుగుతీసి అడుగు వెయ్యలేక పోతున్నాను."     "ఏదీ, చూడనీ..."     కాలు మీద చెయ్యివెయ్యబోయాడు రాజారావు.     "అబ్బా!" అని కెవ్వున కేకవేసింది అనిత.     బాధతో విలవిలలాడుతున్న అనిత ముఖం చూస్తోంటే జాలితో నిండిపోయింది రాజారావు మనసు.     "జాగ్రత్తగా స్కూటర్ మీద కూర్చోగలవా? ఇంటికెళ్ళి డాక్టర్ని పిలిపిస్తాను"     "ఎందుకు బావా! నీ కనవసరపు శ్రమ!"     "ఇందులో శ్రమ ఏముంది? లే!"     "వద్దులే! నువ్వెళ్ళు___నా పాట్లు నేను పడతాను. లేనలే కుండా ఉన్నాను."     జాలిగా రాజారావును చూస్తూ అంది అనిత...     రాజారావు అనితను లేవదీసి స్కూటర్ మీదకూర్చో బెట్టాడు.     ఓపిక లేనిదానిలా రాజారావుమీద వరిగి కూర్చుంది అనిత.     స్కూటర్ మీద  యింటికొచ్చిన అనితా రాజారావులను చూసి శారదమ్మ, సుశీల ఆశ్చర్యపోయారు.     ఆ ఆశ్చర్యాన్ని గమనించిన రాజారావు సిగ్గుపడుతూ, సంజాయిషీ ఇచ్చుకొంటున్నట్లు "అనితకు పెద్ద దెబ్బ తగిలిందమ్మా! నడవలేక పోతోంది అందుకే..."  అని ఏదో చెప్పబోతుండగానే అనిత చెంగున గెంతి "అన్నీ  పట్టిది అత్తయ్యా! కొద్దిగా కాలు జారింది అంతే! నేను వద్దు మోఱ్రో అంటున్నా బావే నన్ను  లేవదీసి స్కూటర్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొచ్చాడు. పాపం! నన్ను తన స్కూటర్ మీద తీసుకురావాలని సరదా పడ్డాడు కాబోలు!" అంది.     రాజారావు విస్తుపోయి చూశాడు.     "నువ్వు ఎంతకైనా తగినదానివి!" అన్నాడు కసిగా-     "అయ్యో బావా! పాపం, నీకు నన్ను గురించి ఏమీ తెలియదు కదా!"     రాజారావు మీద జాలి ప్రకటించింది కొంటె నవ్వుతో అనిత.

సహనం ప్రధానం

  సహనం ప్రధానం   ఆయన ఒక సాధువు. రోజూ ఆయన వద్దకు ఎక్కడెక్కడినుంచో జనం వచ్చి వేల్తున్దేవారు. ఎవరికి వారు తమ సమస్యలు చెప్పుకుని వాటికి పరిష్కారం అడిగేవారు. మీరు ఏం చెప్తే అది చేస్తామని చెప్పేవారు. వారు చెప్పేదంతా విని ఆ సాధువు చిన్న నవ్వు నవ్వి ""నేనేమైనా మంత్రాలు మాయలు తెలిసిన వాడినా మీ సమస్యలను పరిష్కరించడానికి?" అన్నట్టుగా వారి వంక చూసేవారు. ఒకరోజు ఓ ప్రభుత్వ అధికారి ఆయన వద్దకు వచ్చి నమస్కరించి తమ కార్యాలయంలో ఉన్న సమస్యలు ఏకరవు పెట్టాడు. ఒకటా రెండా స్వామీ ఎన్నని చెప్పను? లోలోపల రాజకీయాలు, అసూయలు, ద్వేషాలు, కుతంత్రాలు, కుమ్ములాటలు ఇలా రోజూ అనేకానేక సమస్యలతో నలిగిపోతున్నాను. మీరే నాకు వీటన్నింటి నుంచి విడివడే ఓ దారి చూపాలి స్వామీ" అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఎప్పటిలాగే తన సహజ ధోరణిలో ఓ నవ్వు నవ్వి "నా దగ్గర ఒక గాడిద ఉంది" అన్నారు. "ఏమిటీ.....మీ వద్ద గాడిద ఉందా?" అధికారి ప్రశ్న. "అవును....రోజూ నేను ఆ గాడిద వీపు మీద బోలెడంత బరువు పెట్టి సంతకు పంపుతాను" నారు సాధువు. "అవును స్వామీ....గాడిదకూ, నా సమస్యలకూ సంబంధం ఏమిటి?" అని మళ్ళీ ప్రశ్నించాడు అధికారి. "ఆగు..కాస్తంత నన్ను చెప్పనివ్వు....నే చెప్పేది విను. ఇక్కడున్న ఆశ్రమానికి చుట్టుపక్కలంతా మట్టి రోడ్లే. ఎప్పుడైనా వర్షం వచ్చిందంటే చాలు ఈ దారులన్నీబురద మయమే. అప్పుడు దాని పాట్లే పాట్లు. అప్పుడు కొంచం దూరం వెళ్ళిన గాడిద మధ్యలో ఆగిపోయి నన్ను చూసి చస్తున్నా ఈ బురదలో నడవలేక...." అన్నట్టుగా చూస్తుంది. "అవును నిజమే కదండీ....దాని బాధ దానిది...." "ఆరంభంలో నా గాడిద గోల గోల చేసేది. ఒకటే గొణుగుడు. వీపు మీదేమో మోయలేనంత బరువు ...నడిచే దారేమో బురదమయం...చాలా కష్టంగా ఉంది...కాళ్ళన్నీ బురదై అడుగు ముందుకు పడటం లేదని మొత్తుకునేది. అంతేకాదు నా అందమంతా దెబ్బతింటోంది అని బాధ పడేది. కానీ ఇలా ఎంత అరిచి గీపెట్టినా లేదా మొరాయించినా బురదేమీ అప్పటికప్పుడు ఎండిపోదుగా...నా పని నాదే కదా....పరిస్థితి మారిపోదుగా...అని మెల్లగా నడిచి వెళ్లి సంతలో బరువు దించుకుని వెనుతిరిగేది....అదిగో ఇప్పుడు కూడా అలా సంతకు వెళ్లి వచ్చే ఆ చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటోంది చూడు ఆ గాడిద....బహుసా నీకు  ఈ పాటికే నేనెందుకు గాడిద విషయం చెప్పానో అర్ధమై ఉండాలి " అన్నారు సాధువు. మన మనసు ఆ గాడిద లాగానే. జ్ఞానం కోసం వెతకడంలో అప్రమత్తంగా ఉంటే ఏ బురదా మన ప్రయాణానికి అడ్డుగోడ కాబోదు. - యామిజాల జగదీశ్

అనిత పార్ట్ - 5

                  - డా|| సి|| ఆనందారామం  పార్ట్ - 5   "అవునత్తయ్యా!ఇంకా నాకు పెళ్ళి కాలేదు."     తల గిర్రున తిరగసాగింది రాజారావుకు. సుశీల వణికే క్రింది పెదవిని మునిపంటితో నొక్కి పట్టుకుంది.     "మరి....మరి....కూతురెలా పుట్టిందీ?" అయోమయంగా అడిగింది శారదమ్మ.     పకపక నవ్వింది అనిత.     "ఇంత వయసొచ్చి పిల్లలెలా పుట్టారని అడుగుతున్నానా అత్తయ్యా!"     ఆ వయసులో శారదమ్మ సిగ్గుతో చితికిపోయింది. పెళ్ళి కాకుండా తల్లి కావటమే కాక తన సంతానాన్ని చేత్తో పట్టుకుని  నిర్లక్ష్యంగా నవ్వుతోన్న ఆ సుందరమూర్తిని పిచ్చి పట్టిన వాడిలా చూశాడు రాజారావు.     "ఆ పాపకి తండ్రి ఎవరు?"     అతని కంఠంలో పలికింది క్రోధమో, అమాయో, అసహ్యమో సరిగా అర్థంకాలేదు.     "అది చెప్పగలిగేస్థితిలో నేనుంటే నా కింత ప్రయాసదేనికి? సమయం సందర్భం కుదరగానే మీ కందరికీ అన్నీ చెపుతాను, అంత వరకూ నన్నేమీ అడగకండి..."     "మీరీ ఇంట్లో వుండటానికి వీల్లేదు___"     లోపలకు వెళ్ళబోతున్న అనిత రాజారావు కటు స్వరం విని ఆగిపోయింది.     పెంకిగా కవ్విస్తున్నట్లు రాజారావును చూస్తూ "మీ బంధువులను ఆదరించగలిగే సంస్కారం మీకుందన్నారుకదూ ఇప్పుడే. క్షణాని కొక మాటా మీకు?"     రాజారావు తడబడ్డాడు.     "కానీ. కానీ...మీరు..."     "ఊ! నేను?"     నడుం మీద చేతులాన్చి విలాసంగా నవ్వుతూ నిర్లక్ష్యంగా చూస్తోన్న ఆ మధురమూర్తిని క్షణకాలం మైమరచి చూస్తూ నిలబడి పోయాడు రాజారావు.     పకపక నవ్వింది అనిత.     రాజారావు వులికిపడి లజ్జ పడ్డాడు.     "మీ పాపకు ఇక్కడ సరిగా జరగదు."     "రాణికి అయావుంది. ఇంకాసేపట్లో వస్తుంది. ఇక్కడ దాని బంధువు లున్నారట! అక్కడ దిగింది. రోజూ ప్రొద్దున్నే వచ్చి నాయంకాలంవరకూ చూసి నిద్రపుచ్చి వెళ్ళిపోతుంది."     "మీ కారు కిక్కడ షెడ్ లేదు."     "ఆ ఏర్పాటుకూడా చూసుకున్నాను. నా కారు కేశవరావుగారింట్లో ఉంటుంది. డ్రైవరూ అక్కడే వుంటాడు."     కేశవరావంటే, రమణరావు తండ్రి...."     "అవును........."     "ఆయన మీకు తెలుసా?"     "ఇంతకు ముందు తెలియదు. ఈ ఊరు రావాలని నిర్ణయించుకున్నాక తెలుసుకున్నాను."     అనితను చూస్తున్న కొద్దీ  విభ్రమం కలుగసాగింది రాజారావుకి.     "ఆఖరు ఆటంకం కూడా చెప్పండి. నేను ఉండటంవల్ల మీకు ఇబ్బంది....దానికి నా సమాధానం...నా ఖర్చు నేనే  భరించుకుంటాను."     ఈ మాటలు రాజారావు ఆహాన్ని గుచ్చాయి. "ఆఖర్లేదు మీ అంత ఐశ్వర్యవంతులం కాకపోయినా తిండికి లేనివాళ్ళం కాము."     "అయితే నేను వుండటానికి అభ్యంతరం ఏం లేనట్లేగా:"     "ఉంది అప్రతిష్ఠ.........."     "నా వల్ల మీకేం అప్రతిష్ఠ? నేను మీ భార్యను కామగా..." విస్తుపోయి చూస్తోన్న రాజారావును దాటుకుంటూ చిరునవ్వుతో లోపలికి వెళ్ళిపోయింది అనిత................

అనిత

                  - డా|| సి|| ఆనందారామం  పార్ట్ - 4       "దివ్యంగా ఉంది, శారదా!! ఒక దివ్యమైన ఆలోచన! మన రాజారావుకే అనిత నిచ్చి పెళ్ళిచేస్తే...."     రాజారావూ, శారదమ్మా ఇద్దరూ తెల్లబోయారు.     "ఇదిగోనయ్యా! మా అనిత ఫోటో చూడు...."     "నిర్లక్ష్యంగా క్రిందపడెయ్యాలనుకున్నా రాజారావూ ఆ ఫోటోమీంచి కొన్ని క్షణాలవరకూ చూపులు తిప్పుకో లేక పోయాడు. అప్రయత్నంగా దానిని జేబులో వేసుకున్నాడు.     "మేనల్లుడని నీకేం లోపం చెయ్యను. వాళ్ళమ్మ తన డబ్బు లక్ష రూపాయలు అనిత పేర బేంక్ లో వేసింది. అది అనిత  కుంటుంబంకోసం తప్ప మరే సందర్భంలోనూ వాడకూడదని గట్టి నియమం చేసింది. ఆలోచించుకుని సమాధానం చెప్పు"     శారదమ్మ కళ్ళు మెరిశాయి. ఆవిడకు అన్నగారంటే మొదటి నుంచీ చాలా ఆపేక్ష ఆ ఆంగ్లో ఇండియన్ వదినగారు పోనే  పోయింది అనితను తన కోడలిగా  చేసుకుంటే రెండు కుటుంబాలూ కలుస్తాయి. తమ కుటుంబానికి ఒక అండ ఏర్పడుతుంది.     కానీ  రాజారావు ముఖం మాత్రం గంభీర మయింది.     "క్షమించండి. మీ అమ్మాయిని నేను చేసుకోలేను." అన్నాడు.     తెల్లపోయాడు దయాశంకర్     "అదేవిటయ్యా! అమ్మాయి నచ్చలేదా? ఫోటో లోకంటె చాలా  బాగుంటుంది."     "అంత అందమైన అమ్మాయిని ఎక్కాడా  చూడలేదు"     "మరి, ఇంకా   కట్నంకావాలా?"  "కట్నానికి నేను ఆశపడటం లేదు."     "ఇంకేమిటి నీ అభ్యంతరం? కొంపతీసి నువ్వెవరినైనా ప్రేమించావా?"     చిన్న తనంలోనే బాధ్యతలన్నీ నెత్తినబడి ప్రేమింపడానికి తీరిక లేకపోయింది మావయ్యా?"     దయాశంకర్ పకపక నవ్వి "మరి, ఎందుకు కాదంటున్నావో కారణం  చెప్పు," అన్నాడు.     "ఒక ఆంగ్లో ఇండియన్ యువతి కూతుర్ని నేను పెళ్ళి చేసుకోలేను" `    ఎగిరి కూర్చున్నాడు దయాశంకర్.     "నాట్? ఇందాకటినుంచి మాటల్లొ అంత సంస్కారం వలక బోసి....."     "సంస్కారం మాటల్లోనే కాదు మావయ్యా! మనసులోనూ ఉంది. ఎవరైనా ఇలాంటి పెళ్ళి చేసుకుంటే మనసారా అభినందిస్తాను."     "భలే సంస్కారం!"     హేళనగా అన్నాడు దయాశంకర్.     "అవును, కొన్ని కొన్ని  సంస్కారాలు భలేగానే ఉంటాయి. ఒక కుంటుంబానికి యజమానిగా  నా బాధ్యతలు గుర్తించే సంస్కారం కూడా  నాకుంది. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా చెల్లెళ్ళకు పెళ్ళి కావటం కష్టం. మన సంఘం  ఈ  నాటికీ కబుర్లలో ముందుకు దూకు తున్నంత కార్యాచరణలో ముందుకు దూకటం లేదు..... ఆగండీ! మీరనబోయేది నాకు తెలుసు. మీ డబ్బూ హొదా సహకరిస్తాయంటారు. కానీ, అది నా కిష్టంలేదు."     దయాశంకర్ ముఖంలో హేళన ఎగిరి పోయింది. వాత్సల్యంగా రాజారావు వీపుతట్టి "శభాష్!" అని శారదమ్మతో" ఆణిముత్యం లాంటి కొడుకుని కన్నావు  శారదా!" అన్నాడు.     ఈ ప్రశంసకు  శారదమ్మ పొంగిపోయినా, రాజారావు అని తను కాదనటం నచ్చలేదు ఆవిడకు. ఆలునా ఎప్పటిలాగే ఏమీ అనలేక పోయింది.     ఆరోజే దయాశంకర్ వెళ్ళిపోయాడు.     ఆనాటి కీనాడు సంవత్సరం తరువాత అనిత దగ్గరనుండి ఈ ఉత్తరం....     అతని చాలా అందంగా ఉంటుందిట! అనిత వచ్చాక........అనిత రాజారావుకి నచ్చితే...వాళ్లిద్దరికీ పెళ్లి జరిగితే....ఇలా తియ్యతియ్యగా సాగిపోయాయి శారదమ్మ ఆలోచనలు .....అటు రాజారావుకీ ఇంచు  మించు ఇలాంటి ఆలోచనలే వచ్చాయి.     అనితను చేసుకోమని మామయ్య తననుఅడిగాడు. తను కాదన్నాడు. అనిత ఫోటో తనకి చూపింఛినట్టే ఫోటో అనితకు చూపించి ఉండవచ్చు. ఆ ఫోటో చూసి తనను ఎలాగైనా  ఆకర్షించాలని వస్తోందా అనిత?             5     స్కూటర్ మీద స్టేషన్ కి వెళ్లిన రాజారావు ఎంతో ఆతృతతో ప్రతి కంపార్ట్ మెంటూ గాలించాడు!     తను ఫోటోలో  చూసిన ఆ సుందరమూర్తి ఎక్కాడా కనిపించలేదు.     ఒక్క క్షణం నిరుత్సాహంతో డీలా అయిపోయాడు.     తనకు కలిగిన నిరుత్సాహానికి తనే ఆశ్చర్యపోయాడు రాజారావు.     తనకు తెలియకుండానే తన మనసు అనిత రాక కోసం ఇంతగా ప్రతీక్షిస్తోందా?     రాజారావు స్కూటర్ చప్పుడు వినగానే ఇంటిల్లి పాదీ  బిల బిల లాడుతూ బయటకు వచ్చారు.     అందరూ ఒక్కసారే "అనిత ఏదీ?" అని అడిగారు.     "రాలేదు,"     అందరి ముఖాల్లోనూ నిరుత్సాహం స్పష్టంగా కనపడింది.     శారదమ్మ మరీ దిగులు పడింది.     "రాలేదా? ఎందుకు రాలేదు?"     "బాగుంది నా కెలా తెలుస్తుంది ?"     చిరాకు పడ్డాడు రాజారావు.     ఆ చిరాకు, ఎదురు చూసిన అనిత రానందుకని తెలియని శారదమ్మ అనిత రావటం రాజారావుకు ఇష్టంలేదని భావించి లోలోపల నొచ్చుకుంది. అంతలోనే ఇంటిముందు కారాగింది.     కారులోంచి దేవలోకం నుండి దిగి వచ్చిన అప్సరసలా అనిత దిగి నిల్చుంది.     అప్రయత్నంగా ముందుకు రెండడుగులువేశాడు రాజారావు.     అనిత ముఖంలో వికాసం శారదమ్మకు ఆశ్చర్యం కలిగించినా సంతృప్తినీ  ఇచ్చింది.     అనిత శారదమ్మ  దగ్గిరకువచ్చి పాదాలకు నమస్కారం చేసింది.     అనిత రూపు రేఖలకే మురిసిపోతున్న శారదమ్మ ఈ చర్యతో మరింత పొంగిపోయింది.     అనితను ఆశీర్వదించి లేవనెత్తింది.     "నువ్వు రాలేదని అనుకుంటున్నాం!" అంది.     "రాకుండా ఏలావుంటాను? మిమ్మల్నందరినీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాటపడుతున్నాను"     ఈ మాటలు అనిత ప్రత్యేకం రాజారావును చూస్తూ అంది,     రాజారావు కాళ్ళు మెరిశాయి, చిరునవ్వులో గర్వరేఖ తొంగి చూసింది.     అనితఅ సుశీలనూ, కన్ననూ పేరున పలకరించింది.     "వదినా! నువ్వు వచ్చినందుకు నాకు చాలాచాలా సంతోషంగా వుంది."     మనసారా అంది సుశీల.     "బావకు మాత్రమే కాస్త కష్టంగా ఉన్నట్లుంది." రాజారావు వంక కొంటెగా  చూస్తూ అంది అనిత.     "లేదు,' లేదు. నాకూ సంతోషంగానే ఉంది. బంధువులు ఇంటికొస్తే ఆదరించగలిగే  సంస్కారం నాకు లేకపోలేదు,"     రాజారావు గంభీరంగా అనడానికి ప్రయత్నించినా అతనా మాటలు ఉప్పొంగే సంతోషంగా అన్నాడని అతని కళ్ళు చెప్పక చెపుతున్నాయి.     "నువ్వు కారులో వచ్చావా?"     కుతూహలంగా అడిగింది కమల.     "అవును. కారులోనే రావలసివచ్చింది. ఏం చెయ్యను? రాణితో టైయిన్ ప్రయాణం చాలా ఇబ్బంది"     "రాణి ఎవరు?"     శారదమ్మ ఆశ్చర్యంగా అడిగింది.     రాజారావు సుశీల కుతూహలంగా చూశారు.     "నా కూతురు. రా రాణీ!"     అనిత డోర్ తెరిచి పట్టుకుంది. నాలుగేళ్ళ పాప అనిత చెయ్యి పట్టుకుని క్రిందకు దిగింది.     శారదమ్మ నెత్తిన పిడుగు పడింది.     రాజారావు కాళ్ళ క్రింది భూమి కంపించింది.     సుశీల ముఖం పాలిపోయింది.     కన్న, కమల చంటీ పాపను చూసిన ఆనరదంతో చప్పట్లు కొట్టారు.     "నీ కూతురా?"     శారదమ్మ మళ్ళీ అడిగింది.         "అవునత్తయ్యా! నా కూతురు, బాగుందికదూ! మా నాన్నగారు ఇది చాలా ముద్దుగా  ఉంటుందంటారు."     "చాలా బాగుంది."     కన్న, కమల ఏక కంఠంతో వప్పుకున్నారు. "ఏం నాన్నగారు నీకు పెళ్ళి కాలేదని చెప్పారు......"కంఠం వణుకుతుండగా అంది శారదమ్మ.      

అనిత

                    - డా|| సి|| ఆనందారామం  పార్ట్ - 3     "కూడూ, గుడ్డా తప్ప జీవితంలో ఇంకేమీ లేవా?"     "ఎందుకు లేవూ? గుఱ్ఱపు పందేలున్నాయి. ఎంత సరదాగా  ఉంటుంది? వస్తే లక్షలోస్తాయి."     "లేకపోతే చిప్ప చేతికొస్తుంది"     "వస్తే వస్తుంది. జీవితంలో కష్టపడి సంపాదించి ఏనాటికి. ఐశ్వర్యవంతులం కాగలం? అదృష్టం  కలిసొస్తే ఇలాగే  రావాలి."     "ఒక్కటి మరిచి పోతున్నారు. అదృష్టమనేది మనసు వెతుక్కుంటూ వచ్చేది. మనం   వెతుక్కుంటే దొరికేది కాదు."     "అదృష్టం సంగతేమో కాని, ఐశ్వర్యం మాత్రం మనం సాధించి పొందవలసిందే!"     ఆ మాటలతో ఆసక్తిలేని సుశీల తిరిగి పుస్తకంలో తలదాచుకుంది.     "నేనూ చదువుతాను పుస్తకాలు. కానీ ఇలాంటి చెత్త పుస్తకాలు చదవను. మంచి మంచి పుస్తకాలు చదువుతాను."     పుస్తకాలలో ఆసక్తిగల సుశీల చిటుక్కున తలెత్తి "ఏం పుస్తకాలు?" అంది.     "ఖాతా పుస్తకాలు. వద్దు పుస్తకాలు, లాటరీ పజిల్స్, చెక్ పుస్తకాలు........"     "పకపక నవ్వింది సుశీల.     అప్పుడే లోపలకు వచ్చిన రాజారావు సుశీల నవ్వు చూసి "ఏవిటి నవ్వుతున్నావ్?" అన్నాడు.     "మీ స్నేహితుడు అత్యంత ఉత్తమ సాహిత్యమంటే ఏమిటా చేపుతాన్నారు. వింటే నవ్వాగలేదు."     "ఏమిటి?"     "ఖాతా పుస్తకాలు!"     రాజారావు పెదవులపైన చిరునవ్వు విరిసింది సుశీల గడియారం చూసుకుని విముక్తిపొందిన దానిలా లేచి "అన్నయ్యా! నేను సంగీతం క్లాసు కెళ్ళాలి. టైమయిపోతోంది." అంది.     "వెళ్ళిరా!" అన్నాడు రాజారావు.     "ఎందుకండీ, ఆడపిలల్లకు సంగీతం? కూడు పెడుతుందా? గుడ్డ పెడుతుందా? అంతకన్న ఇంట్లోపనిపాటలు నేర్చుంకుంటేమేలు!"     రాజారావుముఖం గంభీరం కావటంచూసి తను పొరపాటుగా మాట్లాడానని నొచ్చుకున్నాడు, రమణరావు.     సుశీల సహించలేకపోయింది.     "లాలితకళలు కూడూ, గుడ్డా పెట్టావు. నిజమే! కాని మనసు కొక మధురమైన ఆనందాన్ని కలిగిస్తాయి. గుఱ్ఱపు పందేలూ, లాటరీలు తప్ప మరొకటి తెలియని వాళ్లకి ఆ ఆనందం అర్థం కాకపోవటంలో ఆశ్చర్యం లేదు.   అది వాళ్ల దురదృష్టం !"     "సుశీలా!" అన్నాడు రాజారావు మందలిస్తున్నట్లు _ _     సుశీల మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది.                    4     ఆరోజే అనిత వస్తోంది. శారదమ్మ ఒకటే హడావుడి పడ్తోంది. చాలా రోజుల తర్వాత ఆవిడ  మనసు  ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. శారదమ్మకు దగ్గిర దగ్గిర సంవత్సరం క్రిందట జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.     తలవని తలంపుగా వచ్చిన అన్నను చూసి ఆశ్చర్యపోయింది శారదమ్మ.     పిచ్చిదానిలా చూస్తోన్న శారదమ్మను చూసి ఆప్యాయంగా తల నిమురుతూ "నేనే శారదా! ఏమిటలా చూస్తావ్?" అన్నాడు  దయాశంకర్ నవ్వుతూ.     "అన్నయ్యా! నువ్వేనా? వచ్చావా? ఏన్నాళ్లకు కానీపించావ్ ?"     పెదవులపై చిరునవ్వు, కళ్లలో కన్నీళ్ళు చిందిస్తూ అంది శారదమ్మ.     "ఎప్పుడో వచ్చేవాణ్ణి. మీరు రానిస్తే ......"     శారదమ్మకు కలుక్కుమంది. సమాధానం చెప్పలేని స్థితిలో తల వంచుకుంది.     దయాశంకర్ ఒక ఆంగ్లో ఇండియన్ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజుల్లో అది బంధువర్గంలో పెద్ద దుమారం రేపింది.     భార్యను తీసుకుని  చెల్లెలి ఇంటికి వచ్చాడు దయాశంకర్.     లక్ష్మీపతి వీధి తలుపులు వేసేసి "నేను పరువు ప్రతిష్ఠలతో బ్రతుకుతున్నవాడిని. నీ ఇష్టమొచ్చినట్లు నువ్వు ఊరేగు. నా ఇంట్లో మాత్రం అడుగుపెట్టకు. నా బ్రతుకు బజారుపాలు చెయ్యకు" అన్నాడు.     తనదైన వ్యక్తిత్వం ఏనాడో చంపుకున్న శారదమ్మ బొమ్మలా నిలబడి పోయింది.     తన భార్యతో వీథిలోంచే తిరిగి వెళ్ళిపోయిన దయాశంకర్ ఇరవై ఏళ్ళ తరువాత తిరిగి ఆ ఇంటికి వచ్చాడు.     "వదినను తీసుకొచ్చావా?"     "మీ వదిన నీ కసలు తెలియదు  గనుక ఈ ప్రశ్న అడిగావు. ఆవిడ కెంత ఆత్మాభీమానమో తెలుసా? ఆ కంఠంలో ప్రాణం ఉండగా  తనను  అవమానించిన ఇంట్లో అడుగు పెడుతుందా? ఆవిడను పై లోకానికి సాగనంపాకే ఇక్కడికి వచ్చాను."     ఈ మాటలంటున్నప్పుడు దయశంకర్ కంఠం సన్నగా వణికినా పెదవులు మాత్రం నవ్వుతూనే ఉన్నాయి,     శారదమ్మ ఈ మాటలు విని నిజంగానే నొచ్చుకుంది.     తన  అన్నగారిజుట్టు అంతాగా నెరిసిపోవటానికి, ముఖం బాగా ముడతలు వడటానికీ వృద్దాప్యం కారణం కాదని అప్పుడు అర్థమయింది.     "అయ్యయ్యో! అన్నయ్యా! పాంప, నీకు ...."     దయాశంకర్  చేయెత్తి చెల్లెల్ని వారించాడు.     "శారదా! ఆగాగు ఇప్పుడు నేను వచ్చింది పరామర్శలు చేయించుకోవడానికి కాదు. పెళ్లి సంబందాలు వెతకటానికి....."     శారదమ్మ పిచ్చిపట్టిన దానిలాగా చూపింది.     "ఏవిటి? పెళ్లి సంబంధాలా? నువ్వు మళ్ళీ ఈ వయసులో."     విగబడి నవ్వాడు దయాశంకర్...     "పిల్లనిచ్చేవా డుంటే నేనూ చేసుకుంటాను. కానీ పెళ్ళి సంబంధాలు వెతక వలసింది నాకు కాదు. అనితకి___"     "అనిత ఎవరు?"     "ఓ! నీ కసలు ఏమీ  తెలియదు కదూ! అనిత నా కూతురు. బంగారు బొమ్మ ఫోటో చూడు."     అనిత  ఫోటో శారదమ్మ కిచ్చాడు దయాశంకర్.     "ఎంత బాగుంది! అచ్చు  హిందువుల పిల్లలాగా_" ముచ్చట పడింది శారదమ్మ.     "అవును. దానికి అన్నీ  మన అలావాట్లే వచ్చాయి. నేను రోజాను పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ 'నీకు పిల్లలు పుడితే పెళ్లేలా చేస్తావ్?' అని భయపెట్టారు.     ఆ మాటలు రోజాతో  చెప్తే రోజా నవ్వేసి మనలాగే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు,' అనేసింది అదే బాగుందని ఇన్నాళ్లూ నిశ్చింతగా ఉన్నాను. ఈ అనిత ఉందే. ఇది  నా ప్రాణం తీసింది."     "ఏం? ఎవరిని ప్రేమించింది?"     భయంగా అడిగింది శారదమ్మ.     పకపక నవ్వాడు దయాశంకర్.     "ప్రేమిస్తే బెంగదేనికి? సుఖంగా అది కోరిన వాడికిచ్చి పెళ్ళి చేసే వాడిని. అది ఎవరినీ ప్రేమించలేదు. 'నీ యిష్టం నాన్నా! నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళను చేసుకుంటాను అంది."     "ఎంత మంచి పిల్ల!" మురిసిపోయింది శారదమ్మ     "మంచిదా? రణగోండిరాలుగాయ? ఇప్పుడు  న్నేం చెయ్యమంటావో చెప్పు. చచ్చినట్లు సంబంధాలు వెతుకుతున్నాను. ఈ ఊళ్ళో ఒక సంబంధం ఉందని విని వచ్చాను. పెళ్ళికొడుకు......"     దయాశంకర్ మాట పూర్తీ కాకుండనే రాజారావు వచ్చాడు.     "ఇత నెవరు?" ఆశ్చర్యంగా అడిగాడు దయాశంకర్.     "మా పెద్దబ్బాయి రాజారావు. లా పాపయి ఈ ఊళ్ళోనే లాయరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటు పొలం పనులు కూడా వాడే చూసుకుంటున్నాడు. వీడి తరువాతది సుశీల బి. యస్ సి. చదువుతోంది. దీనికి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాం. సంబంధం ఇంచుమించు కుదిరినట్లే. ఆ తరువాతది కమల పోర్తుఫారం చదువుతోంది. ఆఖరివాడు కన్ని - సెకండ్ ఫారంలో ఉన్నాడు."     "బాగుంది!"     తాజారావునే చూస్తూ ఆలోచిస్తూ అన్నాడు దయాశంకర్.     "రాజా! ఈయన మీ మావయ్య".     "రాజారావు దయాశంకర్ ని ఎన్నాడూ చూడకపోయినా అతని గుఱించి విన్నాడు నమస్కారంచేసి "అత్తయ్యగారిని కూడా తీసుకొచ్చారా?" అన్నాడు మామూలు మర్యాద సూచకంగా_     "ఆహా! పరవాలేదోయ్ ! మా కంటె మీరే నయం. మీ నాన్న మమ్మల్ని వీథిలోంచే వెళ్ళకొట్టాడు. నువ్వు ప్రేమగా అత్తయ్య గారిని గూడా తీసుకు రమ్మంటున్నావ్! ప్చ్! ఈ మార్పు చూసే అదృష్టం ఆవిడికి లేదయ్యా! పై లోకానికి వెళ్ళిపోయింది."     "అయామ్ సారీ!"     "దట్సాల్ రైట్!"     మీ ఆరోగ్యం బాగుందా?"

అనిత

                  - డా|| సి|| ఆనందారామం  పార్ట్ - 2       ఈ రెండు లక్షణాలతో రమణరావు అన్నయ్యకు బాగా నచ్చాడు.     తన అయిష్టం ఎంతగా వ్యక్తపరుస్తోన్నా పట్టించుకోవటం లేదు.     అన్నింటికంటే జానకి మాటలు తలుచుకున్నప్పుడల్లా భయం కలుగుతోంది.     రమణరావు పేరు వింటోనే ఎగిరిపడింది జానకి.     "రమణరావును ఎంతమాత్రం చేసుకోకు. నా మాట విను . బ్రతికినంత కాలం ఏడుస్తూ కూచోవాలి."     "ఏం? ఎందుకు?"     జానకి సమాధానం చెప్పలేదు.     "చెప్పు జానకీ!"     జానకి  భుజాలు కుదుపుతూ అడిగింది.     జానకి సమాధానం చెప్పకపోగా ఏడ్చేసింది.     "నన్ను క్షమించు ఒక వేళ మీ అన్నయ్య నిన్ను ఆ రమణ రావుకే ఇచ్చి  పెళ్ళి చేస్తాడేమో! అప్పుడు నేనేమీ  చెప్పకూడదు, భగవంతుడి దయవల్ల అలా జరుగని పక్షంలో అంతా  చెపుతాను. నీకు కాక  ఎవరికీ చెప్పుకుంటాను?"     ఈ  మాటలన్నీ రాజారావుకు చెప్పెయ్యాలనిపించిందిసుశీలకి.     కానీ చెప్పలేదు.     జానకితో మాట్లాడానని చెపితేనేమండిపడతాడు రాజారావు     ఇంక జానకి మాటలకు విలువ ఇస్తాడా?     వద్దన్నా రహస్యంగా జానకితో మాట్లాడుతున్నందుకు తనను చీవాట్లు పెడుతాడు,     జానకితో ఈ రహస్య సమావేశాలు కూడా కరువవుతాయి.     జానకి తల్లి ఒక్కప్పుడు తమ ఇంట్లో వంట మనిషి, వితంతువు.     ఆ తరువాత ఆవిడ గర్భావతి అయింది. జానకిని ప్రసవించింది.     జానకి తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. ఈ సంగతులు జరిగే నాటికి సుశీల పుట్టలేదు. అయినా ఆ నోటా, ఈ నోటా చాలా కథలు వింది.     జానకి తల్లి తులశమ్మ వంటపని మానేసింది. ఆవిడకు ఎలా   నచ్చిందో ఏమో, వంటలు చేసుకోవలసిన అవసరం లేకుండా నాలుగెకరాల నిక్షేపబలాంటి మాగాణి వచ్చింది.     రాజారావు పసితనమంతా దర్జాగా  గడిపాడు. కానీ తండ్రి కళ్ళు మూసి యాజమాన్యం వచ్చాక తమ సంసారపు దర్జా అంతా మేడిపండు వంటిదని తెలుసుకున్నాడు.     ఆస్తికి మించిన అప్పుల్ని చేసిపోయారు లక్ష్మీపతిగారు.     తల గిర్రున తిరిగింది రాజారావుకు. ఆ అప్పులన్నీ తీర్చి ఆస్తిని సంరక్షించట మెలాగా అన్నదే రాజారావును పట్టుకున్న పెద్ద సమస్య  అయిపోయింది.     ఆ ధ్యేయంతోనే ఎద్దులా కృషి చేస్తున్నాడు. ఇంట్లోదర్జాలు తగ్గించుకోమని నచ్చజెప్పలేక సతమతమవుతున్నాడు.     కొడుకు నోటితో చెప్పకపోయినా అతడి మనసుఅర్థం చేసుకుని వంటమనిషిని మాన్పించింది శారదమ్మ.     శారదమ్మ కేకాస్తనలతగా ఉన్నా, ఎలా తెలుసుకుంటుందో తులశమ్మ రెక్కలు  కట్టుకు వాలి వంటంతా చేసి వెళుతుంది.     ఇది  రాజారావుకు ఏమాత్రం నచ్చకపోయినా తల్లి అనారోగ్యం పరిస్థితీ, ఇంట్లో పసిపిల్లల ఆలనా, పాలనా ఆలోచించి సహించి ఊరుకునే వాడు,     ఒక వితంతువు కూతురిగా పడుతూనే అప్రతిష్ఠ నెత్తిన పెట్టుకు  వుట్టిన  జానకికి  పులిమీది పుట్రలా మరో అనర్థం చుట్టుకొంది.     జానకి నిండు కోర్టులో ముద్దాయిగా నిలబడవలసి వచ్చింది.     డబ్బుకోసం ఎవరినో వలలో వేసుకోవాలని ప్రయత్నించిందనీ అతను అడిగినంత డబ్బు ఇయ్యకపోవడం వలన, పోలీసులను పిలిచి అల్లరి పెట్టాలని ప్రయత్నించిందనీ కేసు     తనను ఎవరో దుండగులు బలాత్కారంగా కారులో లాక్కుని వెళుతోంటే సహాయం కోసం "పోలీస్ పోలీస్!" అని అరిచానని కన్నీళ్ళతో జానకి మొరపెట్టుకున్నా ప్రయోజనం  లేకపోయింది.     జానకిని ఎంత సౌమ్యురాలో బాగా తెలిసిన వాళ్ళు కూడా జానకిని చూడగానే చెవులు కొరుక్కునేవారు.     "ఏమోనమ్మా! ఆ తల్లికి కూతురు కాదూ! ఏం జరిగిందో ఎవరికీ తెలెసు?"     అని సరదాగా చెప్పుకున్నారు.     జానకి నడివీధిలో తల యెత్తుకు నిలబడలేని పరిస్థితి వచ్చేసింది.     సుశీల కన్న జానకి ఒక సంవత్సరమే పెద్ద. ఇద్దరూ చిన్నప్పటి నుండి కలసి చదువుకున్నారు.     ఊళ్ళోగొడవకి వేగలేక జానికి చదువు మానుకొని మెడ్రాస్  వెళ్ళి పోతోంటే వెక్కి వెక్కి ఏడ్చింది సుశీల.     "ఏడవకు సుశీ! మనం అక్కచెల్లెళ్ళలా  కలసిమెలసి తిరిగాం! కొంతకాలం మెడ్రాస్ లో ఉండి అక్కడే చదువుకుని ఈ దుమారం కాస్త తగ్గాక  మళ్ళీ ఇక్కడికి వస్తాను."     బాధగా అంది జానకి.     "అన్నీ మోసాలు! అబద్దాలు ! ఇలా లేనిపోని గాధలు పుట్టించి నీ బ్రతుకు బండలు చేస్తే వాళ్ళకేం వస్తుందని?"     ఉక్రోషంతో అంది సుశీల.     "అబద్దాలని నువ్వూ నేనూ అరిస్తే నిజాన్ని అబద్దంగా మార్చగలిగిన వాళ్లు భయపడతారా? ఆపదలో రక్షకదళాన్ని పిలిచినందుకు వాళ్ళీవిధంగా నన్ను భాక్షించారు."     కన్నీళ్లతో విడిపోయిన జానకి సుశీల మళ్ళీ అయిదేళ్ళకి కలుసుకున్నారు.     జానకి పూర్తిగా మారిపోయింది.     వెనుకటి ఉత్సాహం చిలిపితనం ఎగిరిపోయి పూర్తిగా ఉదాసీనంగా  తాయారయింది.     ఊళ్ళో వెనుకటి ఉధృతం తగ్గినా జానకిని చూడగానే చెవులు కోరుక్కోవటం మానలేదు     రాజారావుకు జానకి పట్ల అర్థ్రభావం లేకపోలేదు.     చిన్నతనంనుంచీ అతను జానకిని సొంత చెల్లెలిలా అభిమానించాడు.      జానకిని దోషిగా  అతని అంతరంగం ఊహించలేకపోతోంది.     కానీ. జానకి అల్లరిపడింది కోర్టులకెక్కి పత్రికలపాలయి నలుగురినోళ్ళలో  నానింది.     అతనికి అన్నింటికంటే తన కుటుంబ క్షేమమూ సమాజంలో ప్రతిష్ఠా ముఖ్యం.     ఆ కారణంచేత జానకితో మాట్లాడటానికి వీల్లేదని సుశీలను కఠినంగా శాపించాడు.     పాపం! జానకి రమణరావును గురించి చెప్పిన మాటలు సుశీల  రాజారావుకు ఎలా చెప్పగలదు ?                  నల్లని చీర కట్టుకుని తాటికాయంతబొట్టు పెట్టుకుని విసుగు నణచుకునే ప్రయత్నంలో చికాకు ఎక్కువ కాగా హాల్లోకి వచ్చింది సుశీల.     "హలో! సుశీలా దేవీ!"     ఎంతో సభ్యతతో పలకరించాడు రమణరావు.     అదేం పాపమో రమణరావు ఏది చేసినా, ఏం మాట్లాడినా కృతకంగానే అనిపిస్తుంది సుశీలకి!     "హలో!" అంది పోడగా.     "నే నిప్పుడే వస్తాను."     కావాలని సుశీలా రమణరావులను వదిలి వెళ్ళిపోయాడు రాజారావు.     సుశీల మనసులో గుర్రుమంది.     రాజారావు ఉద్దేశం అర్థంచేసుకున్న రమణరావు సుశీల వైపు తిరిగి చిరునవ్వు నవ్వాడు.     సుశీల తిరిగి నవ్వలేదు.     ముఖం తిప్పుకుంది.     అన్న దగ్గిరలేడు గనుక తన తిరస్కారాన్ని సాధ్యమయినన్ని విధాల ప్రకటించడానికే సిద్దపడింది సుశీల.     సుశీలలో ఈ సంచలనం రమణరావు అర్థంచేసుకొకపోలేదు.     కానీ సుశీల సౌందర్యం అతడికి పిచ్చెక్కిస్తోంది.     అదీగాక రాజారావు ఆస్తిని గురించే తప్ప అప్పుల గురించి తెలియదు, రాజారావు లాంటి ఐశ్వర్యవంతుడి చెల్లెన్ని - అందాల రాశిని సుశీలని - ఈ తిరస్కారాలకి భయపడి వదులుకోదలచలేదు రమణరావు.     "మీరీ నల్ల చీరలో చాలా అందంగా ఉన్నారు. నాకు నలుపంటే ఇష్టం" అన్నాడు.     ఒళ్ళు మండింది సుశీలకు__     "నాకు నలునంటే అసహ్యం. నాకు ఇష్టంలేని వ్యక్తులదగ్గిరకు విధిగా వెళ్ళాల్సి వస్తే, ఈ నల్ల చీర కట్టుకుంటాను"     తల తిరిగింది రమణరావుకు. ఎంతయినా సుశీల తన  అనిష్టాన్ని ఇంత స్పష్టంగా ప్రకటిస్తుందని అనుకోలేదు.     పాలిపోయిన రమణరావు అంతకూ ఇంతకూ నిరుత్సాహపడే రకం కాదు.     సుశీల కోపాన్నంతమా సరసం క్రింద మారుస్తూ "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే!" అన్నాడు చిలిపి నవ్వుతో ...     నిర్ఘాంతపోయింది సుశీల.     అతనిమీద చీదరింపు మరింత ఎక్కువయింది.     అతని ముఖం చూడటం ఇష్టం లేక చేతి కందిన విశ్వనాథ వారి 'చెలియలికట్ట ' చదువుతూ కూర్చుంది.     "ఏమిటి చదువుతున్నారు?"     "చెలియలికట్ట!"     "ఏం వస్తుంది, ఆ పుస్తకాలు చదివితే? కూడు పెడతాయా గుడ్డ పెడతాయా?