ఎవరి అభిప్రాయాలు వారివే
posted on Nov 28, 2014
ఎవరి అభిప్రాయాలు వారివే
ఒక గ్రామ శివారులో ఒక చెట్టు కింద ఒక యోగి ధ్యానంలో ఉన్నాడు. ఆయన చుట్టూ ఏం జరిగినా తెలిసే స్థితిలో లేరు అప్పుడు ఆ దారిలో మద్యం మత్తులో తూగుతూ తూలుతూ ఒకడు వచ్చాడు ధ్యానంలో ఉన్న యోగిని చూసి "ఇతను కూడా నాలాగా మహా మత్తులో ఉన్నట్టున్నాడు" అనుకుని దగ్గరకు వెళ్లి చూశాడు. కానీ యోగి పట్టించుకునే స్థితిలో లేడు. అప్పుడు ఆ తాగుబోతు "బహుశా ఈ రోజు ఇతను నాలాగా తప్పతాగి ఉంటాడు. అందుకే ఈ లోకంలో లేడు. చుట్టూ ఏం జరిగినా తెలిసే స్థితిలో లేడు" అనుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక దొంగ వచ్చాడు ఆ దారిలో. అతను యోగిని చూసి "ఇతను నాలా ఒక దొంగ కాబోలు. రాత్రంతా దొంగతనాలు చేసి అలసిపోయి కూర్చునే నిద్రపోతున్నట్టున్నాడు, పాపం..." అని అనుకుని ముందుకు వెళ్ళిపోయాడు. అనంతరం జ్ఞాని ఒకరు వచ్చారు. ఆయన "ఈయన కూడా నాలాగా ఒక జ్ఞాని అయి ఉంటాడు... ధ్యానంలో ఉన్న ఆయనను ఇబ్బంది పెట్టకూడదు" అనుకుని ఆ జ్ఞాని అక్కడినుంచి ముందుకు వెళ్ళిపోయాడు. ఈ లోకంలో మంచి వాళ్ళు తమలాగే ఎదుటివారిని మంచిగానే అనుకుంటారు...చూస్తారు. చెడ్డవారేమో తమలాగే చెడ్డ వారిగా చూస్తారు. అంతే తప్ప ఎదుటివారి అభిప్రాయాలను తెలుసుకోరు. వారికేమీ తెలియదనే అనుకుంటారు. కానీ ఎవరికి వారు వారు వారుగానే ఉండిపోతున్నారు.
- యామిజాల జగదీశ్