రెండో బాల్యం (కథ)

  రెండో బాల్యం     “అమ్మా, మెల్లగా దిగు...” కారు దిగి, తిరిగి వచ్చి, తల్లి కూర్చున్న వైపు డోర్ తెరచి పట్టుకున్నాడు శ్రీకర్. అతని చేయి అందుకొని కారు దిగిన అంబుజమ్మ, ఆ పెద్ద చెరువునూ, దాని ఒడ్డున శాఖోపశాఖలుగా ఊడలతో విస్తరించి ఉన్న మఱ్ఱి చెట్టునూ చూసి, మనసు పులకరించగా ఆ గాలిని గుండెల నిండుగా పీల్చుకుంది. “సిరీ, చూసావురా ఎంత బాగుందో? మా అమ్మా వాళ్ళు ఈ చెరువుకి మంచినీళ్ళకు వస్తే, వాళ్ళ వెంట వచ్చిన పిల్లలమంతా ఈ చెరువు గట్టున ఆడుకునే వాళ్ళం. ఈ చెట్టు కిందే కూర్చుని కథలు, కబుర్లూ చెప్పుకునే వాళ్ళం. సెలవులకి వచ్చినప్పుడు దీపూ గాడిని ఇక్కడికే తీసుకు వచ్చి ఆడించే దాన్ని. పెళ్ళయ్యాక, మీ నాన్నా నేనూ అదిగో, ఆ రేవులో కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం. చిన్నప్పుడు నేను ఈ నీటిలో దిగి ఈత కొట్టేదాన్ని తెలుసా? ఇప్పుడు తగ్గిపోయాయి కాని, కలువలూ, తామరలూ నిండా విరగబూసి ఉండేవనుకో!” తన్మయత్వంతో చెప్పుకుపోతోంది. ఆమె కనురెప్పల యవనికలపై ఎన్ని దృశ్యాలో... “అమ్మా, బాగా  ఎండగా ఉంది కదా... ఇంకా చాలా ప్రదేశాలు తిరగాలి అన్నావుగా?” “అవునురా... పద పద....అరేయ్ సిరీ... నా మనసు నిండా నింపేసుకుంటానురా ఈ తీయదనాన్ని...” కారును మెలమెల్లగా పోనిస్తూ, తల్లి చూపిన చోట్ల ఆపుతున్నాడు శ్రీకర్. “ఇదిగోరా ఇదే మా బడి! దీన్ని సత్రం బడి అనే వాళ్ళు. మాకు బెంచీలు ఉండేవి కాదు. అదిగో, ఆ చెట్ల కింద కూర్చుని చదువు నేర్చుకున్నాం. ఆ...ఆ... దిగో చూడు... ఇది వేణుగోపాలస్వామి ఆలయం... శిథిలావస్థలో ఉందిరా నాలాగానే... ఆ, అదిగో అల్లక్కడ పెద్ద బజారు అని ఉండేది, అక్కడికి పోనీరా చిన్నా...” పెద్ద బజారు చేరగానే, అక్కడి పూల దుకాణాల దగ్గరకు వెళ్లి, “ఇక్కడ ఆదెమ్మ అనే ఆవిడ ఉండేది కదా?” అని అడిగింది అంబుజమ్మ, పూలు మాల కడుతున్న ఓ పాతికేళ్ళ యువతిని. “అవునమ్మా, ఆమె మా అమ్మమ్మే... మీరు?” “నేను ప్రతీరోజూ ఆవిడ దగ్గరే పూలు కొనుక్కునే దాన్ని తల్లీ... అబ్బో, నలభై సంవత్సరాల పైమాట! ఇంతకూ ఆవిడ ఎలా ఉంది, ఎక్కడ ఉందీ?” “అమ్మమ్మ చనిపోయి అది సంవత్సరాలు దాటిపోయిందమ్మా...” ఎంతో నమ్రతగా చెప్పిందా అమ్మాయి. “అయ్యో, అలాగా? నీ పేరేమిటి తల్లీ?” “కాళింది అమ్మా...” “ఇదిగోమ్మా ఈ డబ్బు తీసుకుని పండక్కి కొత్తచీర కొనుక్కో...” కాళింది వద్దు వద్దని అంటున్నా వినకుండా ఆమె చేతిలో ఐదు వందల రూపాయల్ నోటు పెట్టి కారెక్కింది అంబుజమ్మ. “అమ్మా, ఇక మనం వెళదామా?” మృదువుగా అడిగాడు శ్రీకర్. “ఒక్కసారి నేను చిన్నప్పుడు ఉన్న ఇంటికి వెళదాం సిరీ...” “అలాగేమ్మా...” తల్లి చెబుతున్న గుర్తుల ప్రకారం కారు నడిపిస్తున్న శ్రీకర్ కి పదిరోజుల క్రితం తన ఇంట్లో జరిగిన సంభాషణ గుర్తు వచ్చింది. *** “ఆనందపురమా? అబ్బా... ఇప్పుడు అక్కడికెందుకమ్మా?” అనుకోకుండా కించిత్ విసుగ్గా అన్నాడు శ్రీకర్. “నేను పుట్టి పెరిగిన ఊర్రా అది. మీ నాన్నని అక్కడే పెళ్ళి  చేసుకున్నాను. ఆయన దగ్గరకి వెళ్ళిపోయేలోగా ఒక్కసారి ఆ ఊరు చూసి రావాలిరా...” ఆయాసంగా ఆగింది, అంబుజమ్మ. “ఓకే ఓకే... ఇంద, మంచినీళ్ళు తాగి కాసేపు పడుకోమ్మా... మందులు వేసుకున్నావ్ గా? నెమ్మదిగా వెళదాంలే...” అనునయించాడు. నీరసంగా కళ్ళు మూసుకుంది అంబుజమ్మ. ఫాన్ వేసి, స్పీడు తగ్గించి, పలుచని దుప్పటి కప్పి, గదిలోంచి బయటకు నడిచాడు. “ఏమిటండీ ఆవిడ చాదస్తం?” విసుగుతో కూడిన కోపంతో అంది పల్లవి, శ్రీకర్ కి మజ్జిగ గ్లాసు అందిస్తూ. “ఎందుకు పల్లవీ, అంత కోపం? ఇప్పుడేమైంది?” నిశితంగా ఆమె ముఖం లోకే చూస్తూ అన్నాడు శ్రీకర్. పల్లవి కొద్దిగా కంగారు పడుతూ, “అబ్బే, ఆవిడకి ఆరోగ్యం బాగుండలేదు కదా... ఇప్పుడు ఊరికి...” నసిగింది. “కొన్ని కోరికలు ప్రగాఢంగా ఉండిపోతాయి గుండెల్లో... కొడుకుగా వాటిని తీర్చడమే నా ధర్మం. తను కొంచెం కోలుకోగానే తీసుకు వెళతాను...” “ఎందుకూ, అక్కడేం ఉందని?” “ఆవిడ బాల్యపు తీపి గురుతులు... యవ్వనపు సంబరాలు... నవ వధువు కొత్త కాపురం... అసలు ఆవిడ మనసంతా అక్కడే ఉంది... మనకి అర్థం కావులే...” నిట్టూర్చాడు శ్రీకర్. అతని వైపు అదోలా చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది పల్లవి. మజ్జిగ తాగేసి, ఆ గ్లాసును వంటింటి సింక్ లో తొలిచి పక్కగా పెట్టేసి, హాల్లోకి వచ్చి కూర్చుని ఆలోచనలో పడ్డాడు శ్రీకర్. గత నాలుగు సంవత్సరాలుగా అంబుజమ్మ ఆరోగ్యం ఏమంత బాగుండటం లేదు. భర్త పోయినప్పటి నుండీ ఆ బెంగతో కొంతా, ఒంటరితనం వలన కొంతా మరింత దిగులు. శ్రీకర్ ఉద్యోగానికీ, పిల్లలు స్కూలుకీ వెళ్ళిపోతే ఇంట్లో తను, కోడలూ మాత్రమే ఉంటారు. పల్లవికి టీవీ ఛానల్సూ, సీరియల్సూ, అందులోని పాత్రలూ, యాంకర్లు, వాళ్ళు పెట్టుకున్న నగలూ, చీరాల కబుర్లూ తప్ప వేరే ప్రపంచమే లేదు. అత్తగారితో మాట్లాడే తీరిక ఆమెకి లేదు. పిల్లలకి బామ్మ చెప్పే కథలూ, కబుర్లూ వినటానికి ఆసక్తి లేదు. వాళ్ళ చదువులూ, వీడియో గేమ్స్, కార్టూన్ ఛానల్స్ ఇవి చాలు. పెద్దరికంగా ఏదైనా చెప్పబోతే కసురుకుంటారు. అసలు పల్లవి పిల్లలతో మాట్లాడనీయదు. ఆమెకి అత్తగారంటే ఉన్న చిన్న చూపు పిల్లలకీ ఉంది. దాంతో తనకిష్టమైన పుస్తకాలు చదువుకుంటూ కాలం గడిపేస్తోంది అంబుజమ్మ. సంగీతమన్నా, పాటలన్నా తగని ప్రీతి కనుక, రేడియో చిన్న సౌండ్ తో పెట్టుకుని వింటూ ఉంటుంది. సమయానికి కావలసినవి అన్నీ యాంత్రికంగా అమరుస్తుందే కాని, ఏనాడు పల్లవి ఆమెతో మనసు విప్పి మాట్లాడదు. శ్రీకర్ ఎన్ని సార్లు చెప్పినా అంతే. “ఆవిడతో కబుర్లు ఏముంటాయండీ నాకు? ఆవిడ టీవీ చూడరు, నేను పుస్తకాలు చదవను...” అని ఒక్క ముక్కలో తేల్చేస్తుంది. అంతర్లీనంగా తల్లి మనసులో ‘వాడు’ కూడా మెదులుతూ ఉంటాడని తెలుసు శ్రీకర్ కి. *** “నాన్నా సిరీ...” “ఏమిటమ్మా, ఇంకా పడుకోలేదూ?” తల్లి మంచం మీద పక్కగా కూర్చుంటూ మార్దవంగా అడిగాడు శ్రీకర్. “రేపు ఐదో తారీఖే కదా, ఇది మార్చి నెలే కదురా?” ఆరాటం గొంతు నిండా... “అవును...” “రేపేరా వాడి పుట్టినరోజు!” ఉద్వేగంతో అంది అంబుజమ్మ. “తెలుసమ్మా, బావ ప్రదీప్ పుట్టినరోజు రేపే...” “సిరీ, వాడి నంబరు సంపాదించరా ఎలాగైనా... మనం ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాలి...” బ్రతిమాలుతున్నట్టు చెప్పింది అంబుజమ్మ. “అమ్మా, నువ్వు పిచ్చి అమ్మవి... బావ ఇంకా నీ చిన్నారి దీపూ కాడు...” శ్రీకర్ మాటలకు దిగులుగా చూసింది. “ఇక పడుకోమ్మా, చాలా రాత్రి అయింది. పోనీ, నేను కూడా ఇక్కడే పడుకోనా?” పక్కనే ఉన్న దివాన్ కాట్ మీద నడుము వాల్చాడు, శ్రీకర్. “అమ్మా, వచ్చే నెలలో వెళదామా మన ఊరికి? అక్కడి విశేషాలు చెప్పు...” అనడంతో ఉత్సాహంగా చెప్పటం మొదలు పెట్టింది. కాసేపు విన్నాక, “అమ్మా, చాలా రాత్రైంది కదా, ఇక పడుకుందామా?” అన్నాడు శ్రీకర్. “సరేరా, దీపు గాడి అడ్రెస్, ఫోన్ నంబర్ కనుక్కోవడం మరచిపోకు...” అంది కళ్ళు మూసుకుంటూ... *** అంబుజమ్మ ‘అంబుజ’ గా ఉన్నప్పుడు వాళ్ళన్నయ్యకి పెళ్లై కొడుకు పుట్టాడు. వాడే దీపూ అనబడే ప్రదీప్. వాడిని తన పెళ్లి అయ్యేంత వరకూ కళ్ళల్లో పెట్టి పెంచింది అంబుజ. తల్లి దగ్గర కన్నా మేనత్త దగ్గరే ఎక్కువ చేరిక ఉండేది ప్రదీప్ కి. వాడితో ఆడుకుంటూ, వాడికి అన్నం తినిపిస్తూ, కథలు చెబుతూ, తన ప్రపంచమంతా దీపు చుట్టూ నిర్మించుకుంది అంబుజ. వాడు స్కూలుకు వెళ్ళటం మొదలయ్యాక, అంబుజకి పెళ్లి అయింది. భర్తకి కూడా ఆనందపురంలోనే ఉద్యోగం అవటంతో తన పుట్టింటికి దగ్గరగా ఉండవచ్చనీ, దీపూని ఇక మిస్ కాననీ చాలా సంబరపడిపోయింది ఆ పిచ్చి తల్లి. ప్రతీ ఆదివారం పుట్టింటికి వెళ్లి వాడితో గడిపి వచ్చేది. తన కొడుకు తనకు దూరమౌతున్నాడని, ఆడపడుచుకు దగ్గర అవుతున్నాడని అసూయతో రగిలిపోయిన ఆమె వదిన మెల్లగా కొడుకును, అంబుజకు దూరం చేయటం మొదలు పెట్టింది. “అత్తా వాళ్ళు పేద వాళ్ళు... మనం ఆస్తి పరులం... వాళ్ళతో నువ్వు ఎక్కువగా చనువుగా ఉండకు...” అని తరచుగా చెప్పేది. ఎప్పుడైనా దీపూ అత్తా వాళ్ళ ఇంటికి వెళదామని పేచీ పెట్టినా, తమ ఇంట్లో ఉండే సౌకర్యాలు అక్కడ ఉండవనీ, వద్దనీ చెప్పి, మానిపించేసేది. అంబుజకు నెలతప్పి శ్రీకర్ కు జన్మనిచ్చినా, దీపు మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. పుట్టింటి ఆదరణ అంతంత మాత్రమే అయినా, ఆదివారాలు అక్కడికి వెళ్లి అరగంటైనా గడిపి వచ్చేది. శ్రీకర్ పుట్టిన ఆరు నెలలకే అన్నయ్యా, వదినా చెన్నై వెళ్ళిపోవటం, అంబుజ భర్త సుధాకరానికి కూడా కాకినాడ బదిలీ అవటంతో పుట్టింటికి పూర్తిగా దూరమైపోయింది అంబుజ. అమ్మానాన్నలు చనిపోయాక మళ్ళీ ఆనందపురంలో అడుగు పెట్టలేదు. దీపూ పుట్టినరోజును గుర్తు పెట్టుకుని, భర్త ఎంత వారిస్తున్నా వినకుండా ప్రతీ సంవత్సరం వాడికి బట్టలో, బహుమతులో పంపిస్తూ ఉండేది. “అంబుజా, ఊరికే అలా మమతలు పెంచుకోకు. దీపూ నీ అన్న బిడ్డ... ఇదుగో, ఈ శ్రీకర్ నీ కన్నబిడ్డ...” అంటూ సుధాకరం భార్యకి నచ్చజెప్పినా ఆమె వినేది కాదు. దీపూ పై చదువులకు అమెరికా వెళ్ళాడని, తర్వాత డాక్టర్ అయ్యాడని తెలిసి ఎంతగానో సంబరపడిపోయిన అంబుజ ఆ సంబరాలలో తనకు స్థానం కల్పించని అన్నా వదినల ప్రవర్తనకు చాలా దుఃఖించింది. శ్రీకర్ పెద్దవాడై, చదువు పూర్తి చేసి, ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి చేసుకున్నాక, సుధాకరం మరణించాడు. అప్పటినుంచే అంబుజకు అనారోగ్యం మొదలైంది. *** “బావా, నేను శ్రీకర్ ను...” “శ్రీకరా? ఎవరు??” “నేను మీ అత్తయ్య అంబుజ గారి అబ్బాయిని. అమ్మకి ఆరోగ్యం బాగుండటం లేదు. ఎప్పుడూ నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంటుంది బావా...” “ఓ... ఆ విషయం చెప్పటానికి ఈ అర్థరాత్రి పూటే వీలైందా నీకు?” దీపూ గొంతులో విసుగు. “అయామ్ సారీ... ఉదయం నుంచీ చాలా సార్లు చేసాను. మీరు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారని చెప్పారు...” “సరే, సరే, ఏమైంది ఆవిడకి?” “హార్ట్ ప్రాబ్లెం...” సమస్య వివరించాడు శ్రీకర్. “మిమ్మల్ని చూడాలని కలవరిస్తోంది...” “సారీ, నాకు తీరిక ఉండదు...” “మీరు రావద్దు, నేనే మీ దగ్గరకు...” “వద్దు...” ఫోన్ కట్ అయిపోయింది. మ్రాన్పడిపోయాడు, శ్రీకర్. మిత్రుల ద్వారా తెల్సింది, ప్రదీప్ ఆనందపురంలోనే హాస్పిటల్ కట్టుకుని స్థిరపడ్డాడని. కాని తల్లికి చెప్పకుండా, అతను అమెరికా లోనే ఉండిపోయాడని అబద్ధం చెప్పాడు. *** “సిరీ, ఇదిగో ఈ ఎడమ వైపు వీధిలోకి తిప్పు... ఆ... అదిగో ఆ చివరి ఇంటి దగ్గర ఆపు...” తల్లి మాటలతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు శ్రీకర్. అప్పట్లో అది అమ్మానాన్నలతో తాము చిన్నప్పుడు ఉన్న ఇల్లనీ, ఆ తర్వాత తామది అమ్మేసామని చెప్పింది ఇద్దరూ కారు దిగిన తరువాత. పక్కింట్లోకి తొంగి చూస్తూ, “సరోజినీ...” అని పిలిచింది అంబుజమ్మ. “ఎవరండీ? రండి... లోపలికి...” ఒక ముప్పై ఐదేళ్ళ స్త్రీ లోపలినుంచి వచ్చి సాదరంగా ఆహ్వానించింది. “అమ్మా, ఇక్కడ సరోజినీ...” “ఆవిడ మా అత్తగారేనండి... రండమ్మా, కూర్చోండి... “ ఆమె కుర్చీలు చూపించి, లోపలికి వెళ్లి అత్తగారిని తీసుకు వచ్చింది. “ఎవరూ? ఎవరదీ? అంబుజం... నువ్వా... నువ్వేనా? ఇలా అయిపోయావేమిటే...” అంబుజమ్మ వయసే ఉన్న సరోజిని ఆదరంగా చేయి పట్టుకుంది. “బాగున్నావా సరూ? ఇదిగో వీడే నా కొడుకు శ్రీకర్. నువ్వు చూడలేదు కదూ? సుధాకర్ నన్ను విడచి వెళ్ళిపోయారు...” అంబుజమ్మ కన్నీరు పెట్టుకుంది... ఆప్యాయంగా ఆమె తలను గుండెకు చేర్చుకుంది, సరోజిని. “అమ్మా, మంచి నీళ్ళు తీసుకోండి...” చల్లని మంచి నీళ్ళు అందించింది కోడలు. “ఇదిగో, ఇది నా కోడలు విజయ... విజ్జీ, ఈమె అంబుజ...నా ఫ్రెండ్.... చెప్పాగా చాలా సార్లు?” నవ్వింది సరోజిని. “నమస్తే అమ్మా, అత్తయ్య మాటల్లో వినటమే కాని ఎప్పుడూ చూడలేదు... సరే, లేవండి... కాళ్ళూ చేతులూ కడుక్కుని వస్తే భోజనాలు వడ్డించేస్తాను...” నవ్వుతూ చెప్పింది విజయ. “అయ్యో, వద్దండీ, ఫర్వాలేదు...” మొహమాటంగా అన్నాడు శ్రీకర్. “తమ్ముడూ, అలా అనొచ్చా? మేము పరాయి వాళ్ళం కాదుగా? ఆ స్నేహితురాళ్ళు ఇద్దరూ ఇన్ని దశాబ్దాల తరువాత కలుసుకున్నారు కదా... కలబోసుకుని చెప్పుకోవటానికి ఎన్ని కబుర్లుంటాయి? సిటీ నుంచి కారులో వచ్చినట్టున్నారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకుంటే, మళ్ళీ సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోవచ్చులే...” ఆప్యాయంగా చెప్పింది విజయ. తల్లి వైపు చూసాడు శ్రీకర్. ఆమె నవ్వుతూ తలపంకించింది... “మీ అక్క చెప్పింది కదా అల్లుడూ? దాని మాటంటే మాటే మరి!” కోడలిని బలపరుస్తూ చెప్పింది సరోజిని. “కానీ అక్కయ్యా, మీకు అనవసరమైన శ్రమ...” వినీ వినబడనట్టు అన్నాడు. “శ్రమేమీ లేదు... ఒక్క పది నిమిషాలు అంతే... ఈలోగా మీరు ఫ్రెష్ అవండి...” అని పక్కనే ఉన్న గది చూపించింది విజయ. అంబుజమ్మ, సరోజిని కూర్చున్న చోటు నుండి కదలక ఏవేవో కబుర్లు చెప్పుకోసాగారు. ఆప్యాయత, అనురాగం కలగలసిన మృష్టాన్న భోజనం చేసిన తరువాత శ్రీకర్ కళ్ళు వాలిపోవటం మొదలైంది. కాసేపు మొహమాటంగా కూర్చున్నా, విజయ మరీ మరీ చెప్పటంతో నిద్రను జయించలేక, గదిలోకి వెళ్లి మంచం మీద పడుకున్నాడు. తల్లి ముఖంలో చిందులేస్తున్న ఉత్సాహం, ఉల్లాసం చూస్తుంటే తనింట్లో ఆమెకి ఏమి కొరవడిందో స్పష్టంగా గోచరించింది, శ్రీకర్ కి. *** ఒక గంటన్నర విశ్రాంతి తరువాత నిద్ర లేచేసరికి హాలంతా ఒకటే సందడి... అంబుజ, సరోజినిలతో పాటుగా మరో ఇద్దరు ఆంటీలు, ఒక అంకుల్ ఉన్నారు. ఒకటే నవ్వులూ, జోకులూ... వంటింట్లోంచి బజ్జీల ఘుమఘుమలు! శ్రీకర్ వచ్చి తల్లి పక్కనే కూర్చున్నాడు. “శ్రీకర్, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ నాన్నా... ఇదిగో ఇది శారద... ఇక్కడే పిల్లలకి వీణ నేర్పిస్తోందిట. ఇది భారతి... చదువురాని స్త్రీలకోసం రాత్రి బడి పెట్టిందిట... వీడు రాఘవరావు... భారతి మొగుడు... సారీ ‘వీడు’ అని ఎందుకన్నానంటే, చిన్నప్పుడు మంచి దోస్త్ నాకు... వీడే నాకు ఈత నేర్పించాడు. వీళ్లిద్దరూ గవర్నమెంటు బడిలో పంతులమ్మ, పంతుళ్ళుగా ఉద్యోగాలు వెలగబెట్టి రిటైర్ అయారట!” అంబుజ చకచకా పరిచయాలు చేసేసింది. ఆమె గొంతులో సిరిమువ్వల నాదంలా చిందులేస్తున్న సంతోష తరంగాలు. మళ్ళీ అందరూ కలిసి ఎవరినీ పట్టించుకోకుండా కబుర్లూ, నవ్వులూ... విజయ వచ్చి అందరికీ బజ్జీలు, పకోడీలు ఉన్న ప్లేట్స్ ఇచ్చి, వెళ్ళింది. “అక్కయ్యా, నాకూ ఏమైనా పనులు చెప్పండి...” వంటింట్లోకి వెళ్ళాడు శ్రీకర్. “సరే శ్రీ, ఇంద... ఈ మంచినీళ్ళు అందరికీ ఇచ్చిరా... ఈలోగా నేను టీ తయారు చేస్తాను...” అంది విజయ. “అమ్మా, ఒక గంటలో బయలుదేరుదామా?” పదినిమిషాల తరువాత అడిగాడు శ్రీకర్. “అప్పుడేనా?” ముఖం నిరాశగా పెట్టింది అంబుజమ్మ. “శ్రీ బాబూ, మీ అమ్మని మాకు అచ్చంగా ఇచ్చేయరా...” అంది సరోజిని. “అవునురా బాబూ, మీ అమ్మ మా దగ్గరికి వస్తే మళ్ళీ మా జీవితాల్లోకి వసంతం వచ్చినట్టే అనిపిస్తోంది...” అన్నాడు రాఘవరావు. “మేము పువ్వులా చూసుకుంటామురా మీ అమ్మని...” చెప్పింది భారతి. “అవునురా సిరీ... నాకూ ఇక్కడే ఉండిపోవాలని ఉందిరా... శారద స్కూల్లో నేను పిల్లలకి ఇంచక్కా అన్నమయ్య కీర్తనలు నేర్పిస్తా... భారతీ వాళ్ళతో కలిసి చదువు చెబుతాను... సరోజినత్త తో కలిసి గుడి సేవా కార్యకలాపాల్లో పాల్గొంటాను...” ఆశగా అంది అంబుజమ్మ. అయోమయంగా చూసాడు, శ్రీకర్... “అమ్మా, మరి నీ ఆరోగ్యం?” “అన్నీ చక్కబడతాయి నాన్నా... మీ అమ్మకి ఎటువంటి అనారోగ్యమూ లేదు... ఒక వేళ ఉన్నా, ఇక్కడ మాతో కలిసి ఉంటే, ఈ కాలుష్యము లేని గాలికీ, స్వచ్ఛమైన నీటికీ అన్నీ పోతాయి... ఆలోచించరా సిరీ... మేమంతా అమ్మని ఇక్కడ ఉంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాము...” చెప్పింది శారద. “సరే... ముందు ఊరికెళ్ళి, ఆలోచించుకుని అక్కడి పనులు చూసుకుని, అమ్మను తీసుకొస్తాను అత్తా...” చెప్పాడు శ్రీకర్. *** తిరుగు ప్రయాణంలో కొడుకుతో ఆపకుండా గలగలా మాట్లాడుతూనే ఉంది అంబుజమ్మ. “అరేయ్ సిరీ, నీకో విషయం తెలుసా కన్నా? సరోజత్త మేము చిన్నప్పుడు ఆడుకున్న వామన గుంటల పీట, గవ్వలు, గచ్చకాయలు, బొంగరాలు దాచి ఉంచింది తెలుసా? అవన్నీ చూపించింది నాకు... సిరీ, ఎందుకురా నా నేస్తాలతో గడపనీయకుండా అప్పుడే తీసుకువెళ్ళి పోతున్నావ్?” తల్లి గొంతులో మారానికి శ్రీకర్ కి నవ్వొచ్చింది. అవును... తన దగ్గరున్న తల్లికి ఎలాంటి ఆనందమూ లేదు... ప్రశాంతత అంతకన్నా లేదు... పలకరించే మనిషి లేడు. అమ్మని చూడాలనిపించినపుడు, తానే వారం వారం ఇక్కడికి రావచ్చు, అత్తయ్యా వాళ్ళతో కలిసి గడపవచ్చు... పిల్లల్ని, ఇష్టపడితే పల్లవినీ ఇక్కడికి తీసుకురావచ్చు. ఒక నిర్ణయానికి వచ్చాడు, శ్రీకర్. “అవునురా, శ్రీ, మన దీపు గాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడట... పెద్ద ఆస్పత్రి కట్టించాడుట. నేను ఇక్కడికి వచ్చేసినా వాడి దగ్గరికి వెళ్ళనురా... వాడికి ఇష్టమైతే ఎప్పుడో వాడే వస్తాడు... అయినా నాకు మణిపూసలాంటి నువ్వుండగా వాడి మీద అనవసరమైన భ్రాంతి ఎందుకూ? సారీరా... నిన్ను చాలా సార్లు బాధ పెట్టాను కదూ?” అంది అంబుజమ్మ పశ్చాత్తాపంతో. ఆమె కళ్ళలోని కాంతులు, అవ్యాజమైన అనురాగధార చూస్తుంటే, ఆమె తనకు తల్లిలా కాక, కూతురిలా అనిపించింది శ్రీకర్ కి. ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతూ మరో చేత్తో తల్లి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకున్నాడు, శ్రీకర్. *** (సమాప్తం)   --- నండూరి సుందరీ నాగమణి

“అజ్ఞాతకులశీలస్య..” పార్ట్ - 1

             “అజ్ఞాతకులశీలస్య..”  పార్ట్ - 1                                                                                                         ఉపోద్ఘాతం                                                                               సీ.   జనమమెత్తినదాది జగతిలో మనుజుండు                                     జాతి పోరులనెన్నొ జరుప గాను;                            జంతు జాలములనే చాల చంపెను నాడు                                    మార్గమదియె గాన మనువు కొఱకు;                            ఆహారమున కైన యాహార్యమున కైన                                    యన్వేషణముచేసె నంత తాను,                            ఆశ తీరనె లేదు యన్నియమరిననూ                                     వెదకులాటను నింక వేగ పఱచె.                       ఆ.వె. ఆడువారి కొరకొ నాట గెలుచుటకో                                దేవుని కొరకో నదె ధనమునకొ                                రాజ్యవిస్తరణకొ రాజ్య మేలుటకునో                                పురజనుల తరుముతు పోరు సలుపు.       అనాదిగా మానవుని అనేక విధములైన కోరికలు, ఇంకా ఇంకా ఏదో కావాలనే ఆశ, జాతి మనుగడకే ప్రమాదం కల్పిస్తున్నాయి. ఆ కోరికలనే నియంత్రించుకోగలుగుతే మానవుడే మహనీయుడు కాలేడా?    సాటి మనుషులనూ, తోటి జీవులనూ, పొరుగు దేశాలనూ, పర మతాలనూ ఆదరించ గలుగుతే.. భూతలమే స్వర్గం కాదా!    అటువంటి ఆలోచనే అత్యాశా?    పదిహేనవ శతాబ్దంలో, భారత దేశ చరిత్ర అనేక మార్పులకు లోనయింది. పరదేశ పాలనని నిరోధించే, ప్రతిఘటించే.. అనేక మంది రాజులు, దేశమాత గౌరవాన్నీ, ఉనికినీ కాపాడాలని శతవిధాల పాటుపడ్డారు.    ఆ శతాబ్దిలో.. రెండవ దశాబ్దంలో వంగ దేశంలో జన్మించి, మూడవ దశాబ్దంనుండీ, పది సంవత్సరాల పసి వయసులో.. కళింగ దేశానికి వలస వెళ్లి, ఒంటరి జీవన పోరాటాన్ని సాగించిన అజ్ఞాత కులశీలుని కథ ఇది.    పసితనం నుంచే అనేక విపత్కర పరిస్థితులను అధిగమించిన ఆ చిన్నారి, తనకు ఎదురైన అవరోధాలను, ఏ విధంగా ఎదుర్కొంటాడు? అతని పయనం సాగే వైనమేది?                                     ………………..                                                      తొలి ప్రస్థానం                          ఆ అరణ్యంలో గుర్రం గిట్టల శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు! గుర్రం మీద ప్రయాణిస్తున్న ఇద్దరి గుండెలూ ఆ గిట్టల శబ్దంతో సమంగా కొట్టుకుంటున్నాయి.    వెనుక నుంచి ఎవరో తరుముకొస్తున్నట్లు పరుగెడుతోంది గుర్రం.    “అమ్మా! ఒక ప్రశ్న అడగనా? కాదు కాదు.. రెండు ప్రశ్నలు.”    మాధవుడి పిలుపు విని, కళ్ళెం గట్టిగా పట్టుకుని కొద్దిగా తల వెనక్కి తిప్పింది దుర్గాదేవి. వాళ్ళనెక్కించుకున్న గుర్రం మాత్రం తనపని తాను చేసుకుపోతోంది, కొంచెం కూడా వేగం తగ్గించకుండా.    మాధవుడికి పది సంవత్సరాలు. గుర్రపుస్వారీ, కత్తి యుద్ధం, విలువిద్య ఆరు వత్సరాలనుండీ నేర్చుకుంటున్నాడు. వంశపారంపర్యంగా వచ్చిన తెలివి, మెలకువలు అతన్ని ఆ విద్యల్లో రాణించేలాగ చేశాయి.    “ఒకటి, మనం ఎక్కడికెళ్తున్నాం? రెండు, హిందూ మతమైతేనేం ఇస్లామ్ మతమైతేనేం?”    చుట్టూ పరికించింది దుర్గాదేవి. నింగి కనిపించకుండా ఎగసిన చెట్లు, వాటినల్లుకున్న లతలు, కనుచూపు మేరలో ఏ ప్రాణీ ఆనటం లేదు. మనుషుల అలికిడికి ఎక్కడెక్కడో పొదల్లో దాక్కోడం వాటికలవాటే. సన్నని బాట మెలికలు తిరుగుతూ సాగిపోతోంది.    లయ బద్దంగా హయం పరుగిడుతుంటే, రౌతు *నింజిలి కాసింత నెమ్మదించ సాగింది.    అలసటను ఆవేదనను మరపించి మనసును ఊరడింప జేసింది. దుర్గాదేవి వీపు సాగదీసి, అటూ ఇటూ కదలి.. గుండె నిండుగా గాలి పీల్చి వదిలింది. మాధవుడు కూడా సర్దుకుని కూర్చున్నాడు.                   కం. చల్లని గాలులు వనమున                                   మెల్లగ వీచగ పుడమిని మిగుల ముదంబున్                       కొల్లగ యలసిన మేనికి                       యల్లన కలుగును నవరతి హాయిగ తాకన్.                  వంగ, ఉత్కళ దేశాల మధ్య నున్న అడవి అది. ఎడమ పక్కన కొన్ని యోజనాల దూరంలో సముద్రం, కుడి వైపున కొండలు, మైదానాలూ ఉన్నాయని తెలుసు దుర్గాదేవికి.. ఉత్కళ సరిహద్దు దాటి కళింగ దేశం చేరుకుంటే అక్కడ ఏదో విధంగా, కత్తిసాము నేర్పి ఐనా జీవనం కొనసాగించవచ్చు.    “మనం వెళ్తున్నది కళింగదేశం. రెండవ ప్రశ్నకి జవాబు పెద్దయ్యాక నీకే తెలుస్తుంది”    “ఇంక ఆ దేశంలోనే ఉండిపోతాము కదూ!  స్నేహితులని, బంధువులనీ ఎన్నటికీ కలవము కదా!”    దుర్గాదేవి వామహస్తం వెనుకకి తిప్పి, తన వీపుకి కట్టుకున్న కుమారుడిని మరింత హత్తుకుంది, కన్నులలో నీరు చిప్పిల్లుతుండగా.    మాధవుడు రెండు చేతులతో మరింత బిగించి పట్టుకున్నాడు అమ్మని.    “ఎక్కడైనా ఆగుదామా? ఆకలిగా ఉందమ్మా!”    కన్నతల్లి కడుపు మెలితిప్పినట్లయింది. మాధవుడి వీపుకి కట్టిన మూటలో తిండిపదార్ధాలు ఉన్నాయి. అనువైన ప్రదేశం చూసుకుని ఆకలి తీర్చుకోవచ్చు. దూరాన పొగ కనిపిస్తోంది. ఏదైనా గ్రామం ఉందేమో!    కళ్ళాన్ని కొద్దిగా బిగించింది.. గుర్రం వేగాన్నిపెంచింది.    తమ పట్టణం నుండి బయలుదేరి పన్నెండు ఘడియల పైనే అయుంటుంది. గుర్రానికి కూడ విశ్రాంతి అవసరమే! యజమానురాలి నిస్సహాయతని అర్ధం చేసుకుని పరుగు పెడుతోంది అంతే.    దుర్గాదేవి ఆలోచనల్లో ఉండగానే, గుర్రం వేగం తగ్గించి చదునుగా ఉన్న చోట ఆగింది. అక్కడినుంచి వచ్చిన పొగనే దుర్గాదేవి గమనించింది. ఆరీ ఆరని నెగడులోనుంచి వస్తున్న పొగ అది. రెండుమూడు ఘడియలకి మునుపే ఎవరో అక్కడి నుంచి వెడలినట్లున్నారు. ఆ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. వంట చేసుకున్న గుర్తులు.. మంచినీటి కుండలు, మట్టి పిడతలు, మిగిలి పోయిన కట్టెలు.    మాధవుడి కట్టును విప్పి, తను కిందికి దూకి, చేయి అందించింది.    ఇద్దరూ, గాఢంగా ఊపిరి పీల్చి, నడుం సాగదీసు కున్నారు. కాళ్ళూ చేతులూ కూడా ఝాడించి, శరీరాన్ని స్వాధీన పరచుకుంది దుర్గాదేవి. గుర్రాన్ని చెట్టుకి కట్టేసి, దాని వీపు కాళ్ళు నిమరసాగింది.    మాధవుడు ఒక వస్త్రంలో గుగ్గిళ్ళు తీసుకుని గుర్రానికి తినిపిస్తున్నాడు..    “హయరాజా.. మనం మూడు నాలుగురోజుల్లో కటకం చేరుకోవాలి. తెలుసు కదా?” దుర్గాదేవి గుర్రంతో మాట్లాడసాగింది.    గుగ్గిళ్ళు భక్షిస్తూనే నిలువుగా తలూపింది గుర్రం.    మాధవుడు మరింత ఆనందంగా దాని మెడ సవరిస్తూ నిలుచున్నాడు. దుర్గాదేవి గుర్రాన్ని నిమురుతూనే.. కటకం వెళ్ళాక తమకు కావలసిన ధైర్య సాహసముల గురించి చెప్పసాగింది.          తే.గీ. కన్నుల నెపుడు స్థిరతయు కాన వలెను                  కలత కలిగిన నాడు వికలము వలదు                  బలిమి కల రాచ బిడ్డవు బాగ  ఎరుగు                  కాళి మాత నీ వెనువెంట కలదు నిజము.     అశ్వానికి చెప్తున్నా అదంతా మాధవుడు వినాలనే.  కుండలో నీళ్ళు తీసుకుని చేతులు కడుగుకుని.. సంచీలోనుండి భక్ష్యాలు, పులిహోర తీసింది.     మాధవుడు కూడా, చేతులు కడుక్కునొచ్చి, కొంచెం దూరంలో ఉన్న బాదం చెట్టు కిందికెళ్ళి ఆకులు, పుల్లలు ఏరుకొచ్చాడు. చకచకా నాలుగేసి ఆకులు కలిపి విస్తర్లు కుట్టి, శుభ్రంగా కడిగి తీసుకొచ్చాడు.    ఒక్కొక్క భక్ష్యం, రెండు కుడకలు పులిహోర మాత్రం వేసింది వాటిల్లో దుర్గాదేవి.    మాధవుడు తింటూనే తనకి వచ్చిన సందేహాలు అడిగి తీర్చుకున్నాడు. ఆకలి, సంశయాలు.. రెండూ తీరాక, లేచి ఆకు పారేసి.. అంతా సర్దేసి, గుర్రాన్ని మాలిష్ చెయ్యసాగాడు.. దానితో సంభాషిస్తూ.    కళ్లలో నీళ్లు బైటికి కనిపించకుండా తను కూడా లేచి, చల్లని నీళ్లతో మొహం తొల్చుకుని వచ్చింది దుర్గాదేవి. మాధవుడు మామూలుగా మూడు రెట్లు తినగలడు.. అర్ధాకలితో లేపెయ్యవలసి వచ్చింది. తన వంటి స్థితి ప్రపంచంలో ఏ తల్లికీ రాకూడదు.    ఆహార పదార్ధాలు జాగ్రత్తగా వాడుకోవాలి.. ఎప్పటికి అనుకున్న చోటికి చేరగలుగుతారో! అప్పటి వరకూ ప్రాణాలు నిలుపుకోవాల్సి ఉంది.    “ఇంకొక మాట మాధవా!” మాధవుడు తల్లి చేయి పట్టుకున్నాడు. ఆవిడ గొంతులో ఆవేదన అర్ధం చేసుకున్నట్లుగా.    “మన పెద్దలొక మాట చెప్తారు.. ‘అజ్ఞాతకులశీలస్య వాసో దేయో న కస్యచిత్.’ ఊరూ, పేరు, కులము, శీలము తెలియని వారికి తమ గృహములందు స్థానమియ్యకూడదని, ఇచ్చినచో ప్రమాదమనీ!     భవిష్యత్తులో నీకు సంకట స్థితి ఏర్పడ వచ్చు. నిజం చెప్తే చారులకు దొరికిపోతాము. అంచేత *అనృతం ఆడక తప్పదు. నీకు ఎవరి ఆశ్రయం దొరుకుతే వారి కులమేనని చెప్పాలి. వారికి అనుగుణంగా మసలుకోవాలి సుమా!”    “జై కాళీ..” అంటూ గుర్రాన్ని చెట్టునుంచి విడిపించింది.  ఆ కాళీ మాత దయ ఏ విధంగా ఉందో అనుకుంటూ.    నిజంగా ఆ మాత తమ దీనావస్థని చూస్తోందా? దుర్గాదేవి తల విదిలించి మనసును సర్ది పుచ్చుకుంది. ఇప్పుడు ఏదైనా చింతించడానికి సమయం లేదు.. సాగి పోవలసిందే!    మాధవుడు రికాబు మీద కాలేసి, ఒక్క గెంతుతో జీను మీద కూర్చున్నాడు. దుర్గాదేవి ఒక కాలు ఎత్తబోయింది. సరిగ్గా ఆ సమయంలో ఒక బాణం రివ్వున వచ్చి ఆమె గుండెలో దిగింది.    ఆమె నోటినుండి కేక బైటికి వచ్చేలోగా గుర్రాల గిట్టల చప్పుడు వినిపించింది.    “మాధవా! నువ్వు వెళ్ళిపో! నీకు చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకో. నా కోసం ఆగద్దు. గణేశుల రాజ వంశంలో హిందూత్వ చిహ్నంలా నువ్వైనా నిలిచి ఉండాలి, చరిత్ర చెప్పడానికైనా! ధైర్యంగా బ్రతుకు. రాజ్యాల కోసం పోరాటం వద్దు. మన వంశం నిలుపు.. జై కాళీ..” గుర్రం జీను మీద ఒక్క దెబ్బకొట్టి, ఒరలోంచి కత్తి తీసి వెనక్కి తిరిగింది దుర్గాదేవి కాళికావతారం ఎత్తి.     మాధవుడు గుర్రం కళ్ళెం పట్టుకుని ముందుకు వంగాడు. వెంటనే గుర్రం పరుగు తీసింది వాయువేగంతో.    దుర్గాదేవి బాణం బైటికి లాగకుండా కత్తి ఝళిపించింది. రెండు గుర్రాల మీద ఇద్దరు వంగ సైనికులు దగ్గరగా వస్తున్నారు. వారిని ముందుకు సాగనీయకుండా ఒక ఘడియ సేపు ఆపి, వారి అశ్వాలు ఒక పూట మాత్రం కదలకుండా వాటి కాళ్ళకి గాయాలు చేసి.. నేలకొరిగింది, వంగ బెబ్బులి దుర్గాదేవి.. వంగ దేశాన్నేలిన గణేశుల రాజవంశంలో మిగిలిన హిందూ స్త్రీ..    ఆ సమయం చాలు.. మాధవుని గుర్రం ఆ సైనికులకి అందనంత దూరం వెళ్ళడానికి, అతడు మనుగడకై మార్గాలు వెతుక్కొనడానికి.                                         ……………… (నింజిలి = దిగులు;   అనృతము = అసత్యము)   “అజ్ఞాత కులశీలశ్య….” 2వ భాగం ......మంథా భానుమతి

మాటకచ్చేరి (కథానిక )

    మాటకచ్చేరి (కథానిక )          భీమశంకరానికి అసహనం పెరిగిపోతూంది.. ఇంట్లోంచీ బైటికీ, బైటినుంచీ ఇంట్లోకీ ఇప్పటికి ముప్ఫై నలభై సార్లకు పైగానే నడిచి వుంటాడు. షుగర్ కూడా ఉంది కదా తనకి....నీరసం వస్తూంది కూడా! తలచుకున్న కొద్దీ సాంబయ్యమీద కోపం కూడా వస్తూంది. ఇప్పటికే అరగంట లేటయింది. అసలింతకీ అవెన్యు  ఆఫీసర్ కు చెప్పాడా.. తాను ఆలస్యంగా  వచ్చేందుకెమైనా పర్మిషన్ తీసుకున్నాడా?  యెంతకీ రాడేమిటి?  అసలేమైఉంటుంది ఆ సాంబయ్యకు ? రోజూ యీ టైం కల్లా  వచ్చేసేవాడు.  యేదొ అక్కడే గోడదగ్గర పెట్టుకున్న దేవుని పటాలకు  కాలనీలో దొరికే పూలనే పెట్టి, అగరొత్తి వెలిగించి కాస్త రెండు నిమిషలు యేమి ప్రార్థన చేసుకుంటాడొ  లేదో  కాని, అదైనప్పటినుంచీ, ఇక మొదలు అతని ఆక్టివిటీ. ..కొంపదిసి యెవరితోనైనా గొడవ పెట్టుకుని మాటా మాటా అనుకుంటూ యెక్కడొ ఉన్నాడా? అతనలాంటివాడె మరి..ఇక్కడే చూస్తుంటాడుగా రోజూ! గేట్ దగ్గరికి యెవరైన వచ్చిన అలికిడైతే చాలు..యెక్కడున్నా అతని చూపునుంచీ తప్పించుకుని పోలేరెవరైనా! గట్టిగా అరుస్తూ, గేట్ దగ్గరే ఆపేస్తాడు. సవా లక్ష  ప్రశ్నలు  వెసి, ఆరా తీసి మరీ భయపెడతాడు.    లోపలెవరైనా  పిలిపించే వుంటే వదులుతాడు. లెదంటే, అంతే, అక్కడినుంచే వాళ్ళు తిరుగుమొహం పట్టక తప్పదు. ఒక్కోసారి, యేమిటబ్బా  ఇంత హడావిడి చేస్తాడు అనిపించినా, అతని డ్యూటి మైండెడ్ నెస్ కి ముచ్చటేస్తుంది కూడా! ఒక్కొకప్పుడు మరీ ఓవరాక్షన్  అనిపిస్తుంది కూడా! అతగానికో  యునిఫారం, చేతిలో పోలీస్ లాఠీ లాంటి  ఆయుధమూ ఉన్నాయి  మరి..  ఆమాత్రం దర్పం ప్రదర్శించకపోతే యెలా  మరి? యేదో సెంట్రల్  గవర్న్ మెంట్ ఆఫీస్ లోనే సెక్యూరిటీ  గార్డ్  గా చేసి రెటైర్  అయిన తరువాత , ఇలా ప్రైవేట్  కంపెనీ ద్వరా వాచ్ మన్ గా వచ్చాడు. అ దర్పమూ అదీ  తగ్గలేదింతవరకూ!    యీరోజు ఇంతవరకూ రాలెదంటే  కారణమేమైఉంటుంది?  ఆరోగ్యం బాగా లేదోయేమిటో వున్నట్టుండి పాపం?  వూహూ..నిన్ననేగా రాత్రి  తొమ్మిది వరకూ వుండి గుడ్ నైట్  కూడా చెప్పి వెళ్ళాడు. యీ ఫది, పదకొండు గంటల్లో యేమవుతుంది?    ఆలోచించి  ఆలోచించి, భీమశంకరానికి  తలనొప్పి వచ్చినట్టనిపించింది. ఇంట్లోకెళ్ళి కూర్చున్నా, దృష్టంతా, గేట్ వైపే!        ఇంతకూ యెవరీ సాంబయ్య, మన భీమశంకరానికీ  అతనికీ యేమిటీ అవినాభావ  సంబంధం అంటే..మన భీమశంకరం, ఆరునెలల  క్రితమే ఒకానొక  సెంట్రల్ గవర్న్మెంట్ అఫీస్ లో డిప్యూటి డైరెక్టర్   హోదాలో రెటైర్ అయ్యాడు.. భర్య, వున్న ఒక్కగానొక్క  కూతురు డెలివరీకోసం, అమెరికా  వెళ్ళింది. ఇద్దరూ వెళ్దామంటే,   'అబ్బెబ్బే, నాకు  పొద్దుపోదక్కడ, డెలివరీ తరువాత  మనుమణ్ణి చూసేందుకొస్తా'ననేశాడు. దీనికి కారణం లేకపోలేదు. అమ్మాయీ, అల్లుడూ ఉద్యోగాలకు వెళ్తే, ఇంట్లో, తామిద్దరూ హౌస్ అరెస్టే!   వీకెండ్స్ లో యెటైనా వెళ్ళి సరదాగా తిరిగి రావటం, అ తరువాత , మళ్ళి ఇంట్లోనె ఆ  టీ'. వీ చూస్తూ  కాలం గడపాలంతే! రెండు నెలలుండేసరికి, భీమశంకరానికి  చాలైంది. అందుకే  మొండికేశాడు రానని!   ఇటీవలే, ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో   సొంత ఇల్లూ తీసుకున్నారు.    ఇరుగూ పొరుగూతో ఆట్టే పరిచయాలూ  లేవు.  ఆమాటకొస్తే ఆఫీసులోనూ భీమశంకరం అందరితోనూ గలగలా మాట్లాడే  రకం కాదు. తన పనేమిటో,  తానేమిటో ! ఠంచంగా టైం  కి ఆఫీస్  కు వెళ్ళటం పని చేసుకోవటం.  ఠంచన్ గా టైం చూసుకుని ఇంటికి వచ్చేయటం.  ఇంట్లో, భార్య  సరస్వతి, మొగుడు వింటున్నాడా లేదా అన్న పట్టింపులు లేకుండా, తన సంగతులన్నీ కీ  ఇచ్చినట్టు వినిపిస్తూనే  ఉంటుంది. ఆమె యేదో  డిగ్రిదాక చదువుకుంది కాబట్టి,  ఇంటికి కావలసిన  సరుకులూ అవీ ఆవిడే తెచ్చుకుంటూ వుంటుంది. వున్న ఒక్క కూతురూ, బీ టెక్  తరువాత  అమెరికా లో ఎమ్మెస్ చేస్తూనే,  చక్కటి సంబంధం రావటంతో   పెళ్ళీ కుదిరింది.  పెళ్ళవగానే  న్యూయార్క్ దగ్గరే వాళ్ళీద్దరూ  ఉద్యొగాలు  చేస్తూ ఉండటం..ఇలా..రోజులు ఆనందంగా   గడిచి పొతున్నాయి.     యే ఆఫీసబ్బా  భీమశంకరానిది   అన్న విచికిత్స ఇప్ప్పుడు  అవసరం లేదు కానీ,  ప్రస్తుతం, మన భీమశంకరం,  ఆలోచనలేమిటి?     ముందేచెప్పినట్టు, భీమశంకరానికి ఆఫీస్ లోనూ, రిటైర్ ఐన అతని యోగ క్షేమాలు  ఫోన్ చేసి మరీ తెలుసుకునేంత  ఆత్మీయ సహోద్యోగులెవరూ లేరు.  ఇంట్లో కూడా,  తానొకడే కొడుకు.  వాళ్ళ తండ్రి గారి బాంక్ ఉద్యోగరీత్యా నార్త్ లోనే  యెక్కువగా పెరగటం వల్లా, బంధువులతోనూ యెక్కువ సంబంధాలు లేవు.  వున్నదంతా, సరస్వతి వైపు వాళ్ళే! అప్పుడప్పుడూ  వాళ్లు మాట్లాడుతున్నా, రోజంతా ఒంటరిగా  పొద్దు గడపటంలోని కష్టం ఇప్పుడు తెలిసొచ్చిందతనికి! సరస్వతి వస పిట్టలా వాగుతూ వుంటే,  ఆవిడ మాటల్ని వినీ విననట్టే  వుండే భీమశంకరానికి  భార్య లేని  లోటు భరించలేనంతగా  తెలిసింది. ఇక్కడ పగలూ, అక్కడ రాత్రీ!  యీ తేడాతో ఫోన్లో మాట్లాడటానికీ నిబంధనలే యీ పరిస్థితిలో సాంబయ్య  తగిలాడు భీమశంకరానికి ఆపద్బాంధవుడిలా!           పెద్ద కుటుంబం సాంబయ్యది.  నలుగురు ఆడపిల్లలూ, ఇద్దరు కొడుకులూ! ముగ్గురు కూతుర్ల తరువాత ఒక కొడుకూ,  మళ్ళీ కూతురూ, ఆఖరున  కొసరుగా మరో కొడుకూ!  ముగ్గురాడపిలలకూ పెళ్ళిళ్ళు చేసేశాదు. ఒక కొడుకు ఉద్యోగంలో ఉన్నాడు. కూతురేదో మాల్ లొ పనిచేస్తూంది టెంత్ తరువాత..అఖరి కొడుకు  తొమ్మిదో క్లాస్.  సాంబయ్యకి ఇద్దరు అన్నలు. వాళ్ళు యితనికి తండ్రి  వైపునుంచీ వచ్చే ఆస్తిని రానీకుండా చేసేశారు, మోసంతో!  రెక్కల కష్టంతొనే బతకాలి..పిన్నమ్మ పిల్లలూ, వాళ్ళ  మనుమళ్ళూ, మనుమరాళ్ళూ, భార్య  పుట్టింటివాళ్ళూ, అమ్మ వైపునుంచీ మామయ్యా, వాళ్ళ పిల్లా  పీచూ..అ మధ్య యెవరికో బాగా  జబ్బు చెసి ఆసుపత్రిలో చేరిస్తే,  రక్తం కూడా ఇచ్చి వచ్చాడట డ్యూటీ కి! అన్నట్టు, వాళ్ళ అన్నలతో చెడినా, వాళ్ళ కొడుకుల  గురించీ, ఆస్ట్రేలియాలోనూ,  అమెరికాలోనూ  వాళ్ళ ఉద్యొగాలగురించీ బాగానే సమాచారం  రాబడుతుంటాడు యెవరి ద్వారానో!  అడపా దడపా  అతనికీ ఫోన్లు వస్తూనే  వుంటాయి మరి!    ఇంతకీ సాంబయ్య కుటుంబ జీవితానికి సంబంధించిన ఇన్ని సంగతులు మన భీమశంకరానికెలా  తెలిశాయబ్బా? యేముందీ..సాంబయ్య గేట్ దగ్గర కూర్చుని ఘట్టిగా, సెల్ ఫోన్లో ఉదయం నుంచీ సాయంత్రం దాకా మాట్లాడుతూనే ఉంటాడు మరి!       సాంబయ్యకు  యెప్పుడూ మాటలు కావాలి. సెల్ లో పలుకరించి మరీ బంధువులతో మాట్లాడుతుంటాడు. ఈ లెక్ఖన ఫోన్ కు నెలకు యెంతవుతుందో తెలీదు కానీ, భీమశంకరానికి మొదట్లో, ఇతని ధోరణి చాలా కోపం తెప్పించింది. భార్య అమెరికాకు వెళ్ళగానే, ఉదయం పేపర్ చూస్తుంటే మొదలయ్యేది  సాంబయ్య మాటకచ్చేరి. తమ ఇంటి ముందే  అతని సీట్. ఘట్టిగా, యెవరో యెదురుగా ఉన్నట్టే మాట్లాడుతుండేవాడు.   విసుక్కునేవాడు  భీమశంకరం. టిఫిన్  తింటూ, టీ వీ చూస్తూ, అతని మాటలు వినటం   విసుగై, కమ్యూనిటికి  ఫిర్యాదు కూడా చేశాడోసారి! తన  పేరు బయటికి రానీయకూడదన్నాడు. వాళ్ళూ అతన్ని అదిలించారు. కొన్నాళ్ళు వూరుకున్నాడు. మళ్ళీ మొదలు! వేరే సెక్యూరిటీ గార్డ్ కొసం ప్రయత్నించినా, యెవరూ దొరకలేదనేశారు. ఓవర్ గా మాట్లాట్టం తప్ప డ్యూటీలో యే లోపమూ వుండేది కాదు మరి!  యీ లోగా,  రాను రాను అలవాటైపోయింది  భీమశంకరానికి!  పైగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా  ఉండటం మొదలైంది.   యెంతైనా పొరుగింటి పుల్లగూర రుచేకదా! సరస్వతికూడా వూర్లో  లేదు!  సాంబయ్య సంగతులన్నీ తెలుస్తుంటే, తనకింతవరకూ తెలియని ప్రపంచం ముందు సాక్షాత్కరిస్తున్నట్టనిపించేది! సాంబయ్య తక్కువ వాడేంకాదు. మాటల్లొ, అప్పుడప్పుడూ జోకులూ,  లకార, మకారాలతో  కూడిన బూతులూ,  యెత్తిపొడవటాలూ,  యెగతాళి  మాటలూ, కోపమూ, ప్రేమా..ఇన్నీ ధ్వనించేవి. తమది  అసలే గేటెడ్ కమ్యూనిటీ. అందరూ ఉద్యొగస్తులే ఉన్నట్టున్నారు కూడా! భీమశంకరానిది కూడా కల్పించుకుని యెవరితోనూ మాట్లాడే  స్వభావం కాదుకాబట్టి, ఇంట్లో కూర్చుని వుండగానె చేతికి అందివచ్చే యీ పరోక్షానందం తెగ నచ్చేసిందతనికి! మొత్తానికి, ఆ  రోజు,  భీమశంకరం తపస్సు ఫలించి, సాంబయ్య కాస్త ఆలస్యంగా డ్యూటీకి వచ్చి, అతన్ని ఫుల్లుగా యెంటర్టైన్ చేసెశాడు.          చెప్పొద్దూ..సరస్వతి కూడా మాట్లాడ్డంలో నేర్పరే!  బంధువులందరితోనూ, చక్కగా మాట్లాడుతూ, వాళ్ళ పిల్లల విషయాలు తెలుసుకుంటుంది. పిల్లలతోనూ తనూ కలిసిపొయి మాట్లాడుతుంది. సినిమాలూ, కథలూ, కాకరకాయలూ, వంటలూ, జోకులూ..అబ్బో..యెన్ని సంగతులో! తనకా వైపు యేమాత్రమూ ఇంట్రెష్టే లేదెందుకో!  ఒక్కసారి మారాలంటే కష్టం కానీ, కొన్ని రొజులు ప్రయోగం చెసి చూస్తే? తనకూ కాలక్షేపం కదా!   అనుకున్నదే తడవు, భీమశంకరం  సరస్వతి మేనమామతొ   ఓ అరగంట మాట్లాడాడు. వాళ్ళ విషయాలు  అడిగి తెలుసుకున్నాడు. తన సంగతీ బాగానే చెప్పాడు. ఇలాగే  మరో చుట్టం ఫోన్ చేస్తే కూడా, తన అలవాటుకు  భిన్నంగా యెక్కువసేపే  మాట్లాడాడు. వాళ్ళు తనపై జోక్ కూడా వేశారు-రెటైర్  తరువాత కాలక్షెపం  లెదేమో బావగారికి ? అని..కాస్త  నొచ్చుకున్నా, మనసులోంచీ తుడిచేశాడు.         ముఖ్యంగా,   సాంబయ్య ఫోన్ లా  తన సెల్లూ యెప్పుడూ బిజీగా వుంటే యెంత బాగుంటుందో అనిపించటం మొదలైంది. నిజానికి  భీమశంకరానికి సెల్లంటే ఇన్నిరోజులూ అంతగా పడేది కాదుకూడా!  ఇప్పుడు భార్యా వూర్లో లెకపోవటం, రిటైర్ అవటమూ-యెప్పుడూ టీ. వీ చూస్తూ కూర్చోలేకపోవటమూ  ఇవన్నీ కారణాలయ్యాయి అతనిలోని యీ మార్పుకు!        మరుసటిరోజు, భీమశంకరం భోజనానికి కూర్చోబోతున్నాడు. సెల్ మోగింది. ఈ టైంలో చేసేవాళ్ళెవరూ లేరు మరి! కూర్చోబోతున్నవాడల్లా,  చటుక్కున లేచాడు-తన ఇప్పటి ఇంట్రెష్ట్ గుర్తొచ్చి!     .హలో ! యెవరు?     హలో ...ఇది భీమశంకరంగారి నంబరేనాండీ?     ఆఆ అవును..మీరెవరు?     మీతో ఓ రెండు నిమిషాలు మాట్లాడవొచ్చునా సార్?' యెవరో అమ్మాయి. చాలా మర్యదగా మాట్లాడుతోంది. భీమశంకరం కాస్త మెత్తబడ్డాడు.     'యేంటి   విషయం?'    'సార్! నేను ప్రైం హోంస్  వెంచర్  నుంచీ మాట్లాడుతున్నానండీ..షమ్షాబాద్నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో మా వెంచర్ వుందండీ . గజం పదిహేనువేల రూపాయలు.  మీకు ఇంట్రెస్ట్ ఉంటే! ' అని  ఆ అమ్మాయి ఇంకా ఇంకా వివరాలేవో చెబుతూనే ఉంది.       భీమశంకరం ఆలోచనలు అలా కొనసాగుతూనే ఉన్నాయి.  వీళ్ళకిలా అందరి నంబర్లెలా దొరుకుతాయసలు? యేర్ టెల్ వాళ్ళతోనూ, బీ.యెస్.ఎన్.ఎల్ , అందరికీ యేదో పాకేజ్  లా చెల్లించి, ఇలా అందరి నంబర్లూ తీసుకుంటారట! ఇలా ఫోన్లు చేసి విసిగిస్తుంటారట! సరస్వతి ఇలాంటి ఫోన్లకు, చాలా విసురుగా సమాధానం చెప్పటం చాలాసార్లే  విన్నాడు. కానీ,  ఇప్పుడు ఇలాంటి  ఫోన్లు అవసరమేననిపించింది.  పైగా, అలా ఫోన్ నంబర్లు తీసుకుని కష్టమర్లను ఇబ్బందిపెట్టేవాళ్ళనిలా కాసేపు యేడిపించవచ్చు కదా! అన్న చిలిపి ఆలోచన వచ్చింది భీమశంకరానికి  విచిత్రంగా !    'చూడమ్మా! నీ పేరేంటన్నావ్?'    'చంద్రికండీ..'    ' నాకవసరం లేదు కానీ, మా బంధువులొకరు ప్లాట్  వాళ్ళబ్బాయి కోసం కొనాలని  చూస్తున్నారు.  వాళ్ళతో మాట్లాడి  చెబుతాను. మీ వెబ్ సైట్ యేదైనా  వుందా?'    'ఆఆ..వుంది సార్! వాళ్ళ నంబర్ ఇస్తే, నేనూ వాళ్ళతో మాట్లాడుతాను సార్..పైగా, మీలా మాకు  కష్టమర్లను చూపించేవారికి సర్ ప్రైస్ గిఫ్ట్ కూడా ఉందండీ మా దగ్గర!'     'ఆ..ఆ గిఫ్ట్లూ  అవీ తరువాత కానీ, వాళ్ళిప్పుడు వూళ్ళో లేరు. రెండు రోజుల్లో వస్తారు. ఓపని చెయ్..యెల్లుండి ఇదే టైం కి ఫోన్ చేస్తావా?'  ' తప్పకుండానండీ. చాలా థాంక్సండీ..'   'ఆఆ... సరే సరే ఉంటానమ్మా!'   ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసింది. .   రెండురోజులెలానో గడిచిపొయాయి. భీమశంకరం సెల్ యెప్పుడు మోగుతుందా అని యెదురు చూస్తూ!   యెంతకీ మోగదేంటబ్బా?  పోనీ తనే  చేస్తే? చీ చీ..అలా చేస్తే మరీ లోకువైపోడూ? భోజనమైపోయి, అన్యమనస్కంగానే కాస్త నడుమూ వల్చాడు. ఫోను మోగ నే లేదు.  సాయంత్రం మెడికల్ షాప్ కు వెళ్ళి మందులు  కొంటుండగా, సెల్ మోగింది.    హలో హలో!    యెవరు?   నేనేసార్! చంద్రికను..సారీ సార్.. అనుకోకుండా నా డ్యూటీ  మారింది. నాలుగ్గంటలకు  రావలసి వచ్చిందండీ! మా కొలీగ్ కి చెప్పానప్పాటికీ,  చేయలేదాండీ?    మెడికల్ షాప్లోనుండి కాస్త బయటికి వచ్చి మాట్లాడటం  మొదలెట్టాడు.    లేదమ్మా!  ఐనా వాళ్ళింకా  వూరినుంచీ రాలేదు. రేపేమైనా  వస్తారేమో చూడాలి మరి..    థాంక్ గాడ్..ఐతే రేపు నేను ఈ టైం కి  చేయనాండీ?    సరేలేమ్మా!      భీమశంకరానికి, తన నటన బాగా నచ్చింది. ఇలాగే  మరో రెండు రోజులా   అమ్మాయి తో మాట్లాడి, అప్పుడు,  వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదట  అని చెప్పేయవచ్చుననీ,  వాళ్ళు కష్టమర్లతొ ఆడుకోనగా  లేనిది  మనకేంటి అని కూడా  సరిపెట్టుకున్నాడు.    ఆ రోజు తరువాత, ఆ హోంస్ వాళ్ళనుంచే మళ్ళీ  యెవరో కూడా రెండు సార్లు చేశారు కానీ,  అప్పుడూ, మన శంకరం యేవో మాటలు చెప్పి దాటేశాడు.  కానీ లోపల్లొపల విసుగొచ్చేసింది.  ఓ సారి బాత్ రూంలో ఉండగా, మరోసారి మాల్ లో ఉండగా, ఇంకోసారి బంధువులెవరో మాట్లాడుతుంటే అక్కడినుంచే ఫోన్.. విసుగొచ్చేసింది. నిజం చెప్పేసి, యీ బెడదనుండీ బయట పడాలనుకున్నాడు కానీ యేదో బలహీనత!    అ రోజు, భీమశంకరానికి,  అనుకోకుండా, మోషన్స్ పట్టుకున్నాయి. ఆఘమేఘాలమీద, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు తెలిసొచ్చింది సరస్వతి లేని లోటూ, ఇరుగూ పొరుగూతో పరిచయాలు పెంచుకోవలసిన అవసరం కూడా!   బాత్ రూంకి పదిసార్లకు పైగా వేళ్ళాడారోజు!  నీరసం యెక్కువైంది. ఫోన్లో కూతురూ, అల్లుడూ అన్ని జాగ్రత్తలూ  చెబుతూనే ఉన్నారు. సరస్వతి పిన్ని కొడుకు, దగ్గరే వుండేవాడు వూర్లో లేడు అనుకోకుండా! ఒంటరిగానే  తంటాలు పడుతుండగా,  అప్పుడు మోగింది సెల్లు! నీరసంగా  హలో అన్నాడు..   'సార్, నేను  చంద్రిక ఫ్రెండ్ దీపక్  నండీ..మీరేదో మా వెంచర్ కొసం'.. అప్పటికే నీరసంగా వున్న భీమశంకరానికి  సహనం చచ్చి పొయింది.    'చూడు  దీపక్!  మీకు మా నంబర్లెలా వస్తాయోకానీ,  ఇలా  మీకిష్టమైనప్పుడు ఫోన్లు చేసి విసిగిస్తారెందుకయ్యా?  అసలు మీలాంటి  వెంచర్లన్నీ ఇలాగే  చేస్తాయా? కష్టమర్లసంగతేమోకానీ, అనవసరంగా, మమ్మల్నందరినీ  యెందుకిలా ఇబ్బంది పెడతారయ్యా బాబూ?'   'సర్..స ర్..అదీ..నేనండి. .ప్రైం హోంస్ నుండి చంద్రిక ఇచ్చిందండి మీ నంబర్..మీరెవరిగురించో చెబుతారని..'   'ఆఆ అవునయ్యా ..చెప్పాను. .ఇప్పుడు చెబుతున్నా విను..యెవరూ లేరు.  ఊరికే మిమ్మల్నో ఆటాడించాలని చెప్పా అంతే! ఇలా అందరినీ వేళ  కాని  వేళల్లో ఫోన్  చేసి  విసింగించకండి నాయనా!'    అవతల ఆ అబ్బాయి  కోపంతో అంటున్నాడు..'ముందే మమ్మల్ని వదిలించుకోవచ్చుగా మీరు? ఇన్నిరోజులూ  ఫోన్లు చేయించుకుని  ఇప్పుడిలా మాట్లాడటం బాగుందా మీకు.?ఐనా మేమా కంపెనీలో పనిచేస్తున్నామండీ! మా ఆఫీసర్ యెలాచేయమంటే అలా చేస్తాంకానీ మా తప్పేముందిందులో? మా  ఆఫీస్ వాళ్ళతో  మాట్లాడాలి  మీరిదంతా!'    'ఆఆ..ఔనయ్యా..నువ్వూ, లేకపోతే మరొకడూ..మీలాంటివాళ్ళకు బుద్ధి రావాలంటే....'    'మాకు నువ్వేం బుద్ధి చెబుతావయ్యా? యేదో పెద్దమనిషని మర్యాదిచ్చి మాట్లాడుతూంటే, యేదేదో   మాట్లాడుతున్నావ్? పేద్ద మగాడివనుకుంటున్నావా!'  ఇంకా ఆ అబ్బాయి తిట్లకు కూడా  లకించుకునేసరికి, భీమశంకరం తట్టుకోలేక ఫోన్ కట్  చేసేశాదు. ఇంకెప్పుడూ  ఇలాంటి  చిన్న చిన్న  ప్రలోభాలకు లొంగకూడదని  నీరసంగానే  ఒట్టు పెట్టుకుంటూ! ఇంతకూ మన భీమశంకరంగారికీ  అనుభవం యేమి  నేర్పింది?  సరస్వతిలా,  సాంబయ్యలా  ప్రతిరొజూ మాటకచ్చేరి చేయటమంటే మాటలు కాదని!!! అసలు మాట్లడటం  ఒక కళే! నొప్పించక తానొవ్వక,  యెదుటివారి మనసెరిగినట్టు మాట్లాడటం-అమ్మో, నిజంగా చాలా కష్టమే! ఇదివరకైతే జీవితాలెంతో సింపుల్ గా కూడా వుండేవి..మనుషుల అభిరుచులూ ఆలోచనలూ పరిమితంగానే వుండేవి..మరి ఇప్పుడో...మాట మాటకూ చాలా ఆలోచించి మాటలు పేర్చాలి మరి! అమ్మో! నా వల్ల కాదీ మాటకచ్చేరి  చేయటం! తన పరాజయాన్ని ఇంత తొందరగా ఒప్పుకోవలసి వస్తుందనుకోలేదు !  భీమశంకరం తలపట్టుకుని కూర్చున్నాడు నిశ్శ్శబ్దంగా! సాంబయ్య కంఠం మాత్రం  కంచులా మోగుతూనే ఉంది బైట! అదే  సమయానికి భీమశంకరం సెల్లూ ట్రింగ్ ట్రింగ్ అనటం   మొదలెట్టింది! -  పద్మిని -హర్ష

రంగు వెలిసిన ఏనుగు ( కథ)

  రంగు వెలిసిన ఏనుగు   అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను, పొదల్లో అటుఇటు గెంతులేస్తున్న కుందేళ్ళను చూశాక ఆ ఏనుగుకు ‘నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను. హంసలు, కుందేళ్ళు తెల్లగా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో!’ అనే ఆలోచన కలిగింది.ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది. కానీ ఎలా మారాలో దానికి తెలియలేదు. ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది. ఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది. స్నేహితుడి కోరిక తీర్చడానికి అది ఒక ఉపాయం ఆలోచించింది. అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్లరంగు డబ్బాలు తెప్పించింది. కోతులతో, ఎలుగుబంట్లతో చెప్పి ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది. నల్లగా ఉన్నది కాస్తా తెల్లగా మారిపోయింది. ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది. తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది. కొన్నిరోజుల తరువాత ఆ అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త ఆ దేశపు రాజుకు తెలిసింది. ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకురమ్మని కొంతమంది భటులను పంపాడు. రాజభటులు గుంపులుగుంపులుగా వచ్చి ఆ అడవంతా జల్లెడపట్టి వెతకసాగారు. వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అతలాకుతలం అయిపోయింది. అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా సంచరించే జంతువులు, పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి. చివరకు తెల్లగా మారిన ఆ ఏనుగును రాజభటులు పట్టుకోగలిగారు. ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్ళతో కట్టి లాక్కుపోసాగారు భటులు. ఇంతలో వర్షం మొదలయ్యింది. చూస్తుండాగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది. ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటి మీద ఉన్న తెల్లరంగు కాస్తా కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది. నల్ల ఏనుగును చూసి రాజభటులు ముందు అవాక్కయ్యి తరువాత దాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది. ఉన్న దానితో సంతృప్తి చెందాలే కాని, లేని దాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది. తన తప్పు తెలుసుకుని గట్టిగా లెంపలు వేసుకుంది. Courtesy.. http://podupukathalu.blogspot.in

ప్రతిభ కు పట్టాభిషేకం (కథ)

ప్రతిభ కు పట్టాభిషేకం                  డల్ గా వున్న తేజ మొహంలోకి చూస్తేనే తెలిసిపోతోంది యివాళ యింటరవ్యు లో ఏమైందన్న విషయం . తేజాని అలా చూస్తూ వుంటే చిన్నగా ఏదో తెలియని ఆనందం కలిగింది రాకేష్  లో . కాఫీ వేడిగా వుండగానే తాగాలని యెప్పుడూ తనకి చెప్పే తేజ యివాళ తన ముందున్న కాఫీ చల్లారిపోతున్నా పట్టించుకోకుండా వుందంటే యెంత దీర్ఘాలోచనలో వుందో తెలుస్తోంది రాకేష్ కి .                " ఏంటి మౌనంగా వున్నావు డియర్ , యింటర్వ్యూ విషయాలు చెప్పు ఈ సారికూడా కాయేనా ? నిన్ను చూస్తే తెలుస్తోందిలే కాయని " . రాకేష్ కి తెలియకుండానే సన్నని వ్యంగ్యం తొంగి చూసింది అతని మాటలలో .           "  వైటర్  కాఫీ వేడిచేసి యిస్తారా ప్లీజ్ " కాఫీ షాప్ వైటర్ని పిలిచి అంది తేజ.            " ఇంక మీ సంగతేమిటి సర్ , బయటికి ఎన్ని కబుర్లు చెప్పినా కడుపులో వున్న కుళ్ళు బయట పడిందిగా?" .          " కుళ్ళా ?  యేది యెక్కడ లేదే , నీకలా వినిపించిందేమో కాని నా వుద్దేశ్యం అదికాదు . కాయా ? పండా ? , అని అడిగేను అంతే డియర్ అన్నాడు రాకేష్ .            " సరే సరే నీ మనసులో వున్న దొంగని పట్టుకోడానికే అలా మొహం వేలాడేసి కూర్చున్నాను మొత్తానికి బయటపడ్డావు " .            " అమ్మ బాబోయ్ ఆడవారి మాటలకే కాదు చేతలకి కుడా అర్ధాలు వేరా ?  నీకు ఈమధ్య పనీ పాటా లేక యేదైనా తెలుగు ఛానల్ చూస్తున్నావా ?  ఇలాంటి పిచ్చి ట్రిక్స్ ప్లే చేస్తున్నావు " .          "   ట్రిక్కులు లేవు ట్రక్కులు లేవు గాని ఏవైనా కబుర్లు చెప్పు " .          " మనకి పరిచయం అయినప్పటి నుంచి వినడమే తప్ప ఎప్పుడైనా మాట్లాడేనా? కాదు కాదు యెప్పుడైనా మాట్లాడనిచ్చేవా ? అంటే సరిపోతుందేమో ? కదూ డియర్ " .          "యూ .....  నిన్నూ .... " అంటూ నెత్తిమీద ముద్దుగా ఓ మొట్టికాయ వేసి గలగలా నవ్వింది తేజ .            రాకేష్ కి తేజ అంటే యిష్ఠం  , దుమికే జలపాతంలా నవ్వే ఆమె నవ్వంటే యింకా యిష్ఠం , ప్రతికూల పరిస్థితులని కూడా తనకి అనుకూలంగా మార్చుకోగలిగే ఆమె ఆత్మ స్థైర్యం అంటే యింకా యిష్ఠం .              రాకేష్ ,తేజ  ఇద్దరూ ఓ పేరున్న మాల్ లో కాఫీ షాప్ లో కూర్చొని వున్నారు. ఈ పాటికే మీరు వుహించే వుంటారు , కరక్టే ...  వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు . యిదేదో సినిమా పేరు అనుకొనేరు కాదండీ నిఝంగా తేజ , రాకేష్ లు ప్రేమించుకున్నారు . వాళ్లిద్దరిది పెద్దలు ఆమోదించిన ప్రేమ , తొందరలోనే కళ్యాణ మండపం చేరబోతోందికుడా.             ప్రేమికులు కలుసుకునే చోట్లలో యిప్పుడు కాఫీ షాప్స్ కుడా చేరేయి.              రాకేష్ , తేజాల పరిచయానికి రెండేళ్ళ వయస్సు . తేజ , రాకేష్ లు డిగ్రీ పూర్తిచేసి విదేశాలలో ఎం.బి.ఎ చెయ్యడానికి వెళ్ళినప్పటి  పరిచయం , ఆ పరిచయం తిరిగి స్వదేశం వచ్చేకా పెద్దల అనుమతి పొందింది .             చదువుకున్న చదువుకు విదేశాలలోనే అవకాశాలెక్కువ అనేది రాకేష్ మాట , సమర్ధతకి మన దేశం లో కుడా అవకాశాలున్నాయి అనేది తేజ వాదన . రాకేష్ ప్రపంచ వ్యాప్తంగా శాఖలు వున్న సాఫ్టవేర్ కంపెనీ లో మంచి వుద్యోగం సంపాదించేడు .తేజ వూ ... అంటే విదేశాలకి యెగిరిపొదాం అని ఎదురు చూస్తున్నాడు  . తేజ ఇంటర్యుకి వెళ్తే తప్పకుండా సెలెక్ట్ అయ్యేదే కాని తేజ వుద్దేశ్యాలు వేరు .              అంతవరకూ చదివిన డిగ్రీలకి ఉద్యోగాలు రాకపోతే  గాలి యెటువీస్తే అటే అన్నట్టు రాకేష్ మరో ఆరునెలలు సాఫ్ట్ వేర్ కి పనికి వచ్చే ఒరాకిల్ కోర్స్ చేసి వుద్యోగం సంపాదించు కున్నాడు . తేజ కుడా అదే దారిలో నడవాలని రాకేష్ , మిగిలిన కుటుంబ సభ్యుల అభిప్రాయం .కాని తేజ ఉద్దేశ్యం వేరు. ఇంత కష్ఠపడి  కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివన డిగ్రీలు తుంగలో తొక్కి సంపాదనకోసం మరేదో చదవడం అన్న మాటే నచ్చలేదు తేజకి . సివిల్ ఇంజనీరింగ్ లో చేరింది ఆ సబ్జెక్టు మీది వున్న మక్కువతోనే , ఇంటీరియర్ డిజైనింగ్ అంటే అదోమోజు ఆమెకి.  ఆ మోజుతోనే  అందులో నిష్ణాతులు రాసిన బుక్స్ చదివి , విదేశం లో వున్నప్పుడు అక్కడ జరిగే ఇంటీరియర్ డిజైనింగ్ పొటీలని లైవ్ ఆడియన్స్ గా చూడడం పొటీలొ పాల్గొనే వాళ్లకి సలహాలు అరుస్తూ చెప్పడం చేసేది వాళ్ళు వాటిని పాటిస్తే చప్పట్లతో స్వాగతించడం చేసేది . ఆ క్షణం ఆమె మనస్సు యేదో తెలీని ఆనందం పొందేది . అదే మనసుకి నచ్చిన పని చెయ్యడం వల్ల కలిగే సంతృప్తి ,ఆ క్షణం లోనే ఆమె వో నిర్ణయానికి వచ్చింది .              అప్పటికే యేడాది వయసున్న తన ప్రేమకి తన ఆశయం చెప్పింది . ఆశయాలు పెట్టుకోవడం వాటిని నెరవేర్చుకోడం కోసం పాటు పడ్డం అనే ఆలోచనలే లేని రాకేష్ కి యిదేదో విచిత్రంగా అనిపించినా తేజ మీద వున్న ప్రేమతో కాదన లేక పోయేడు .               రాకేష్  కి వుద్యోగం వచ్చేక అసలు గొడవ మొదలయ్యిది . ఇద్దరి తల్లితండ్రులు పెళ్లి పెళ్లి అంటూ తొందర పెట్టడం యెక్కువైంది . ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసినా తేజకి నచ్చిన వుద్యోగం రాలేదు . రాకేష్ కి అతని అంగీకారం తో యెప్పుడంటే అప్పుడు విదేశాలకి వెళ్ళే అవకాశం వుంది , తేజాని పెళ్లి చేసుకొని రాకేష్ విదేశాలకి వెళ్ళాలనేది అందరి వుద్దేశ్యం . కాని తేజ ఆశయాలు వేరు . అందుకే  అందరూ కలసి వో  వోప్పందానికి వచ్చేరు . అదేంటంటే తేజకి ముచ్చటగా మూడునెలలు సమయంలో ఆమె మెచ్చిన జాబ్ రాకుంటే రాకేష్ ని పెండ్లి చేసుకొని అతని వెనకాల విదేశాలకి వెళ్లి అక్కడే ఆమె ఆశయాలకి తగ్గ వుద్యోగం వెతుక్కోవడం , లేదు దేవుడు మేలుచేసి ఆమెకు నచ్చిన వుద్యోగం  వస్తే యిద్దరూ యిక్కడే వుండి అవుసరాన్ని బట్టి రాకేష్ విదేశాలకి వెళ్లి వచ్చేటట్లు . ఈ వొప్పందం లో యెవరు గెలిచి ఎవరు వోడినా పెళ్లి మాత్రం తప్పదు కాబట్టి మూడు నెలల తరవాత వచ్చే  వో ముహూర్తం పెట్టుకొని యిద్దరి యిళ్ళల్లోనూ పెళ్లి పనులు జోరుగా, హోరుగా సాగుతున్నాయి .                   మూడు నెలల్లో గెలుపో వోటమో తేలిపోవాలి కాబట్టి ముందుగా దేశంలో పేరున్న కొన్ని పెద్ద కంష్ట్రక్షన్ కంపెనీలని యెంచుకొని వాటి మీద బాగా హొమ్ వర్క్ చేసి వో నోట్ తయారు చేసుకొని వాటికి చెయ్యవలసిన మార్పులు చేర్పులు తయారు చేసుకోడానికి వో నెల ఖర్చయింది . తన CV తో పాటు తను యేమేం మార్పులు చేసి వాళ్ళ సంస్థని ముందుకు తీసుకు వెళ్ళగలదో వివరిస్తూ ఒక నోట్ కూడా పెట్టి పేరున్న సంస్థలకి పంపింది . ముచ్చటగా మూడు సంస్థలనుంచి పిలుపు వచ్చింది . ఇవాళటిది రెండవది  . కారణాలు యేవైనా రెండు చోట్లా సమాధానం ఒకటే అదే ల కి ఏత్తం ద  కి కొమ్ము . అందుకే రాకేష్ తేజని ఆట పట్టించేడు .                    ఇద్దరూ తొమ్మిది గంటల వరకు మాల్ లో గడిపి బాయ్ చెప్పుకున్నారు . రాకేష్ బాయ్ తో పాటు "నీ గడువు ముగియడానికి యింకా యెనిమిది  రోజులే వుంది , గెలుపు నాదే యెలాగూ , నువ్వు కుడా వప్పుకుంటే ...." .            "  అ అ ఆఅ .... యింకా ఎనిమిది రోజులుంది గెలుపో వోటమో తెలియడానికి , దూకుడు తగ్గించు ,గుర్రాన్ని కట్టేయ్ ఎనిమిది రోజుల తరవాత మాట్లాడుదాం వొకే  బాయ్ " రాకేష్ ని మధ్యలోనే అడ్డుకొని అంది తేజ .                   ----          -------               ---------           -------     ---------           " ఇదీ క్లుప్తంగా నా పరచియం " అంటూ ఒక్కమారు హాల్ లో వున్న అందరినీ పరికించి చూసింది  తేజ . దేశం లో వోకటవ స్థానంలో వున్న కంష్ట్రక్షన్ సంస్థకి సంబధించిన కాన్ఫరెన్స్  హాల్ అది . ఆ హాల్ లో వోయిరవై మంది వరకు వున్నారు . నలుగురు తప్ప అందరు ఆ సంస్థలో వున్నత పదవులు నిర్వహిస్తున్నవారే . తేజ తో కలిపి ఆ నలుగురు ఆ సంస్థలో వున్న ఒకే ఒక్క ఖాళీ కోసం పోటీ  పడుతున్నారు . తేజా కి మూడో ఛాన్స్ యిచ్చారు . తేజ చాన్సు రాగానే ముందుగా తన గురించి చెప్పుకొని మధ్య లో చిన్న గాప్ యిచ్చి అందరిని పరికించి చూసింది. ఎవ్వరి ముఖం లోను ఆమె చెప్పబోయే విషయం మీద యేవిధమైన ఆశక్తి కనిపించలేదు . ఇలాంటి బ్లాంక్ మొహాల్లో కుతూహలం పుట్టించగలననే ఆత్మవిశ్వాసం తేజా కి వుంది . అందుకే చిన్నగా గొంతు సవరించుకొని మాట్లాడ్డం మొదలు పెట్టింది .               " ఇప్పడు మనం మాట్లాడుతున్నది మన ఆరువందల ఎకరాల ప్రాజెక్ట్ గురించి . దీన్ని మనం వో టౌన్ షిప్ చేద్దామనేది మన ఆలోచన , ముందు ఈ టౌన్ షిప్ లోకి రావడానికి మన ఫ్రెండ్స్ చెప్పినట్లు రెండు గేట్స్ కాకుండా నాలుగు వైపులా నాలుగు గేట్స్ వుండాలి . రోడ్లు నూరు అడుగులు వెడల్పు వుండి రెండు వైపులా పచ్చని మొక్కలు యిలా వేస్తాం " అంటూ  రకరకాల రంగుల పువ్వులు వరుస వెనుక వరుసగా నాటబడ్డ ఫోటోలు తెరమీద వేసి అందరికి చూపించింది . రోడ్స్ ,రోడ్స్ మీది లైట్స్ , స్విమ్మింగ్ పూల్ అన్నీ ప్రీలాంచ్ కి ముందే తయారుగా వుంటాయి . మోడల్ హౌస్ తయారుగా వుండాలి . రెండు ఇంటర్నేషనల్ స్కూల్స్ , రెండు సూపర్ స్పెషాలిటి హాస్పిటల్స్ , ఆరు ముపైఅంతస్తుల కర్పోరేట్ బిల్డింగ్స్ , రెండు డే కేర్ సెంటర్లు , రెండు ఐదు నక్షత్రాల హోటల్ , నాలుగు అంతస్తుల మాల్ , పై అంతస్తు లో ఫుడ్ కోర్ట్ , మల్టి ప్లెక్స్ యివన్నీ మనం కట్టబోయే ఫ్లాట్స్ కి నడుచుకు వెళ్లేంత దూరంలో వుండేలా ప్లాన్ చెయ్యాలి . ' మీరు వుండేది ఫ్లాట్ లోనే అయినా బంగ్లా లో వున్న అనుభూతినిస్తాం ' అనేది మన కొత్త స్లోగన్ " మాట్లాడుతున్నది అక్కడకి ఆపి గ్లాసులో నీళ్ళు తాగుతూ అందరిని పరికించి చూసింది కొందరి కళ్ళల్లో చిన్న కుతూహలం కనిపించింది . అదే తేజాకి  కావలసింది . రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించింది .            " అంటే మనం కట్టే ఫ్లాట్స్  " T " ఆకారంలో ఇలా వుంటాయి అని మరో బొమ్మ తెరమీద చూపించింది . ఇలా వుండడం వల్ల  అన్ని గదుల కిటికీలు బయటికి వుంటాయి కాబట్టి గాలి వెలుతురు బాగా వస్తాయి . యే ఫ్లాట్స్ కి కుడా కామన్ గోడ వుండదు కాబట్టి మనం ఆ ఫ్లాట్స్ ని బంగ్లా అనికూడా అనవచ్చు అని కొనుగోలుదారులకి చెప్తాం ". దీర్ఘం గా వూపిరి పీల్చుకొని అందరిని వో కంట చూసింది తేజ ఇప్పుడు చుట్టూ వున్న వాళ్ళ కళ్ళల్లో ఆమె ఏం చెప్పబోతోందో అనే కుతూహలంతోపాటు ఆమె మీద వోవిధమైన నమ్మకం కూడా కనిపించింది .             వక్తలు యెప్పుడూ తమ ధోరణి లో చెప్పుకుంటూ పోకూడదు . ఎదుటి వారి ముఖకవళికలు కుడా గమనిస్తూ మధ్య మధ్యలో చిన్న హాస్యం జోడించి చెప్తే వింటున్నవాళ్ళల్లో వినాలనే కుతూహలం  కలుగుతుంది .            వాళ్ళ కళ్ళల్లో కపించిన  భావాలకి తేజకి తన నమ్మకం వమ్ము కాలేదనే  అభిప్రాయాన్ని కలుగ జేసింది . ఆ నమ్మకం ఆమెలో వెయ్యి యేనుగుల బలన్నిచ్చింది .          ఆ బలంతోనే తన ప్రపోజల్ వారిముందు వుంచడానికి సిద్ధ పడింది .              "ఇప్పుడు  నేను కొన్ని ముఖ్యమైన ప్రపోజల్స్ చేస్తున్నాను .వీటిని అమలు చెయ్యడం మనకి ఖర్చులు పెరిగి కొనుగోలు దారుని మీద కొంచెం భారం పడుతుంది  కాని మనం వాళ్ళకిచ్చే సౌకర్యాలకి యిది యెక్కువ కాదని మనం వాళ్లని వొప్పిస్తాం . ప్రకృతికి దగ్గరగా వుండేటట్టు ఫ్లాట్స్ యిస్తాం అనేది  మన మరో స్లోగన్ . ప్రకృతి అంటే గాలి , నీరు , వెలుతురూ , భూమి . మనదగ్గర కావలసినంత నేల వుంది కాబట్టి వేప , మామిడి , పున్నాగ లాంటి వృక్షాలని బాగా ప్లాన్డ్ గా వేస్తాం . తరవాతి అంశం నీరు . మన దేశం మొత్తం ఎదుర్కుంటున్న సమస్య నీటి సమస్యే . ఈ సమస్యకి పరిష్కారం కుడా అందరికి  తెలిసిందే . అదే నీటిని పొదుపుగా వాడుకోవడం . ఆచరణలో మాత్రం యెవ్వరూ అమలు చెయ్యరు . యిక్కడే మనం కొన్ని మార్పులు చెయ్యబోతున్నాం . అవేమిటంటే ప్రతి ఇంటికి వచ్చే నీటి పైపులకి మీటర్స్ పెట్టడం ఇది చాలా బిల్డర్స్ యెప్పుడో చేసేరు , రెండవది వర్షపు నీటిని జాగర్త చేసి మళ్ళా మనం వాడుకోగలిగేటట్లు చెయ్యడం . ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టిన వాళ్ళం కాబట్టి  ఇదేమీ  కష్ఠమైన పనికాదు . మన ఈ ప్రాజెక్ట్ లో సోలార్ పానల్స్ పెట్టి ప్రతి యింటికి వేడినీటి సరఫరా యివ్వాలి  .  కనీసం రెండు బకెట్ల నీళ్ళు వృధాగా వదిలిన తరువాతే వేడినీళ్ళు వస్తాయి . సగటున ఒక యింట్లో నలుగురిని వేసుకున్నా కనీసం ఎనిమిది బకెట్స్ అంటే ఇంచుమించుగా రోజుకి వంద లీటర్ల నీరు వృధా అవుతోంది . దీన్ని మనం అరికట్ట గలిగితే ఎంతో నీటిని ఆదా చెయ్యొచ్చు . దీనికి నాదగ్గర వున్న సూచన యేమిటంటే ప్రతి యింటికి రెండు బాత్రూంలలో వో అయిదు లీటర్ల టేంక్ పెట్టి వెంటిలేటర్ కి సోలార్ పానల్స్ పెడతాం" . అందరిని పరికించి చూస్తూ గ్లాసులో నీళ్ళు తాగి తిరిగి ప్రారంభించింది .         " వీధి దీపాలు , పార్కుల్లోను యిలా అవకాశమున్న చోట సోలార్ దీపాలనే వాడుతాం . కారిడార్స్ లో కదలికలని బట్టి వెలిగి , ఆరే దీపాలని వాడుతాం ,దీనివల్ల విధ్యుత్ శక్తిని కుడా ఆదా చేసిన వాళ్ళ మౌతాం . ప్రతీ బిల్దింగ్ లోను తొంభై ఫ్లేట్స్ వుంటాయి అలాంటి రెండేసి బిల్డింగ్స్ కి కలిపి వొక స్విమ్మింగ్ పూల్ , చిన్న పిల్లలు ఆడుకొనే పార్క్ ఏర్పాటు చేస్తాం . టౌన్ షిప్ మెత్తానికి రెండు టెన్నిస్ కోర్ట్స్ , పెద్ద స్విమ్మింగ్ పూల్ , ఆడిటోరియం , జాగర్స్ పార్క్ ఇలా అన్ని సౌకర్యాలు ఇస్తాం . అంటే ఈ టౌన్ షిప్ లో వుండేవాళ్లకి ఏ అవుసరానికి కుడా గేట్ దాటి బయటికి వెళ్ళనవుసరం లేదు . అలాగే ప్రతీ యింటికి RO సిస్టంని యెలాగూ యిస్తున్నాం కాబట్టి 'మీ RO సిస్టం లో వృధా అయేనీటిని  మాకివ్వండి  ' అని పూల మొక్కలు అర్దిస్తున్నట్లు రాయించిన చిన్న చిన్న అందమైన బోర్డ్ లని అక్కడక్కడ పెడతాం . వీటికి సంబంధించిన వివరాలు యిందులో వున్నాయి . నా ప్రతి పాదనలలో ఏవేనా అనుమానాలు వుంటే ఎవ్వరైనా నన్ను ప్రశ్నించవచ్చు  ". అలా అంటున్నప్పుడు ఆత్మవిశ్వాసం కళ్ళల్లో తొణికిసలాడింది .           మెల్లగా మొదలైన కరాతాళ ధ్వనులు హాలంతా మారుమ్రోగేయి .      ఆ ధ్వనులు ఆగిన తరువాత యేం జరిగిందో చెప్పమంటారా ?     ఛ...ఛ... అఖ్ఖర్లే మీకు తెలుసునని నాకు తెలిసిందిగా ! ---- V LN Murty Karra

తిరిగి వచ్చిన కోయిల (న్యూ ఇయర్ స్పెషల్)

  తిరిగి వచ్చిన కోయిల       అనగా అనగా ఓ వసంతకాలంలో చిట్టి కోయిల ఒకటి కొత్తగా గొంతు విప్పింది. కుహూఁ.. కుహూఁ... అని కూస్తూ పోయింది. చుట్టు ప్రక్కల వాళ్లందరికీ దాని గొంతు చాలా నచ్చింది. మరీ కీచుగా కాకుండా, మరీ మందంగా కాకుండా, సరైన 'పంచమం'లో కూస్తూంటే ఆ సంగీతం ఎవరికి నచ్చదు మరి?! అందరికీ నచ్చింది. ఎవరికి వాళ్ళు, అందరూ రోజూ దాని కూత కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఆసారి మామిడి చిగుర్లు, వేప పూతలు అన్నీ చాలా ఇడిగాయేమో, కోయిలగొంతుకు అన్నీ కలిసి వచ్చి, అది ఇంకా ఇంకా ఇంపుగా కూయటం మొదలు పెట్టింది. రానురాను చుట్టుప్రక్కల వాళ్లంతా ఆ కోయిల కూతకు అలవాటు పడిపోయారు. పిల్లలకైతే ఇప్పుడు రోజూ దాని కూతతోటే మెలకువ! అందరూ దానిలాగానే 'కుహూఁ.. కుహూఁ..." అని కూయటం మొదలెట్టారు. వాళ్లని చూసి చిట్టికోయిల కూడా- వాళ్ళు తనకు తోడు వస్తున్నారనేమో, మరింత ఉత్సాహంతో పాడటం మొదలెట్టింది. ఇట్లా కొన్నాళ్ళు గడిచేసరికి ఊళ్ళో లేత చిగుళ్ళు తగ్గిపోయాయి. చిగుళ్ళన్నీ ఆకులౌతాయి కదా, అందుకని చిట్టికోయిలకు కష్టం అయింది. మెల్లగా అది పాడటం తగ్గించింది. పిల్లలంతా దాన్ని ఉత్సాహపరచారు- వాళ్ళు అరిచినప్పుడు అదీ కూసింది; అయితే వాళ్ళు ఆపగానే అదీ ఆపేయటం మొదలు పెట్టిందిప్పుడు! ఇట్లా కొన్నాళ్ళు గడిచేసరికి చిట్టికోయిల గొంతు మూగపోయింది. ఎటుపోయిందో గానీ, ఇక అది ఎవ్వరికీ కనబడటంకూడా మానేసింది. పిల్లలు దాన్నితలచుకొని 'బలే కూసేది కదా!' అని చెప్పుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు ఏదైనా మంచిపాట విన్నప్పుడు 'మా ఊళ్ళో కోయిల కూడా బలే పాడేది!' అనుకుని నిట్టూర్చేవాళ్ళు. అంతలో ఏమైందో తెలుసుగా, మళ్ళీ వసంత ఋతువు దగ్గరపడింది. వేపలు, మావులు చిగుళ్ళేసాయి. రకరకాల చెట్లు మొగ్గలు తొడిగాయి. వాతావరణం మారింది. మారిన ఆ వాతావరణంలోకి అనుకోకుండానే వచ్చి చేరుకున్నది కోయిల. ఇప్పుడది పెద్దదైంది. గట్టిపడింది. అయినా దాని స్వరం ఇంకా చక్కగానే ఉంది. మామిడి చెట్లో కొమ్మ మీద కూర్చుని అది ఓసారి'కుహూఁ.." అన్నదో లేదో ఊళ్ళోని చిన్నోళ్ళంతా గంతులు వేస్తూ "కుహూఁ..కుహూఁ.."మన్నారు. పిట్టలన్నీ ఆశ్చర్యంగా చూసాయి. కొత్తగా పుట్టిన లేగలు చెవులు రిక్కించి 'ఎవరిదీ..?' అనుకున్నాయి. పిల్లల ఉత్సాహాన్ని చూసి పెద్దవాళ్ళంతా ముసి ముసిగా నవ్వారు. 'ఈసారి కోయిల ఎన్నాళ్ళుంటుందో..?' అన్నాడో తాత. 'దాని ఇష్టం. మనదేముంది?" అంది అమ్మ. 'మన కోయిల బలే పాడుతుంది కదే అమ్మా?!" అంటూనే చిట్టి "కుహూఁ.."మంటూ బయటికి పరుగు తీసింది     .......... kottapalli.in సౌజన్యంతో

మధూషిణి (కథ) పార్ట్ 3

  మధూషిణి  (part-3)         ఆ  ఊళ్ళో ఉంటున్న వీరయ్యకు, రాఘవరావుకు సంబంధాలున్నాయి. ఒకప్పుడు రాఘవరావు పొలం వీరయ్యకు కౌలు కు ఇచ్చారు. అక్కడి వారితో సంబంధాలు తెంచుకున్నందున ఆ పొలం అమ్మేసారు. అయినప్పటికీ రాఘవరావు మీద అభిమానంతో పట్నం వచ్చినపుడల్లా కలుస్తుంటాడు. రాఘవరావు భార్య అరుగు మీద కూర్చొని బియ్యం చెరుగుతుంది. రాఘవరావు సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. ఇంతలో వీరయ్య వచ్చి అసలు విషయం చెప్పాడు. అమ్మాయి గారు మన ఊరు వచ్చారు కదండీ! అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ జగన్నాథం కొడుకుతో చెట్టాపట్టాలేసుకొవి తిరగడం... క్షమించండి ఊర్లో వాళ్ళు అనుకుమటున్న విషయం చెప్పాను. మీరు గానీ వాళ్ళ కుటుంబంతో మళ్ళీ సంబంధాలు పెట్టుకున్నారా ఏమిటీ అని వీరయ్య అంటుండగానే క్షణం ఆలస్యం చేయకుండా రాఘవరావు ఆత్రేయపురం బయలుదేరాడు. జగన్నాథం ఇంట్లో నలుగురూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుండగా కాలితో తలుపు తన్ని లోపలికి వచ్చి, మధూషిణి చెయ్యి పట్టుకొని లాక్కొచ్చాడు. ఆనంద్,జానకమ్మ అడ్డుపడుతున్నా వాళ్ళను పక్కకు తోసేసి మధూషిణిని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకోసారి ఆ ఊళ్ళోకి వెళ్తే కాళ్ళు విరగ్గొడతానని గద్దించాడు. తల్లి బావురుమని ఏడ్చింది. తర్వాత నాన్న సంగతి తెలిసి కూడా ఆ ఊరికి ఎందుకు వెళ్ళావని మందలించింది. " నేను బావను ప్రేమిస్తున్నాను" అన్నది మధూషిణి. తల్లి గుండెల్లో గునపాలు దించినంత పనైంది. ఆమెకి నోటమాటరాలేదు. " మర్చిపోమ్మా అది జరిగే పనికాదు " అని మాత్రం అనగలిగింది. తర్వాత ఒక్కసారి జరిగిన తప్పుకే అందరం శిక్ష అనుభవిస్తున్నాం మళ్ళీ నువ్వు అదే తప్పు చేయెుద్దు అని నిదానంగా చెప్పింది. మధూషిణి ఏడుస్తూ గదిలో తనను తానే బంధించుకుంది. మంచినీళ్ళు కూడా ముట్టడం మానేసింది. తల్లి ఎంత చెప్పినా ఆమె మాట వినటం లేదు. తండ్రి ఇదంతా చూసి మధూషిణికి పెళ్ళి చేస్తే ఈ పరిస్థితి నుంచి కుదుటపడుతుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నెలరోజుల్లో  ఓ సంబంధం ఖాయం చేయనే చేసాడు. పెళ్ళి పనులు సాగుతున్నాయి. ఆనంద్ కు ఏం చేయాలో తోచడం లేదు. పిచ్చివాడయ్యేలా ఉన్నాడు. ఏదైతే అదే జరగనీ అనుకొని పట్నం బయలుదేరాడు. బస్సు దిగి రాఘవరావు ఇంటికి నడుస్తూ ఉండగా పెళ్ళి పత్రికలతో రాఘవరావు ఎదురుగా కనిపించాడు. ఆనంద్ ని చూసి రాఘవరావు కోపంతో ఊగిపోయాడు. కాలర్ పట్టుకొని ఎందుకు వచ్చావురా ఇక్కడికి అంటూృపిడికిలి బిగించి మూతి మీద గుద్దాడు. నోటి నుంచి జలజలా రక్తం కారింది.ఆవేశంలో ఏం చేస్తున్నాడో  రాఘవరావుకు  తెలియట్లేదు. అంతటితో ఆగక పక్కనున్న కర్ర తీసుకొని ఆనంద్ తలపై కొట్టాడు. ఆనంద్ స్పృహ తప్పి పడిపోయాడు. రాఘవరావు ఇంట్లో పని చేసే సైదులు పరిగెత్తుకొచ్చి విషయమంతా రాఘవరావు భార్యకు చెప్పాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. లోపల వీణాపాణియై విషాదంతో చక్రవాకరాగం ఆలపిస్తున్న మధూషిణి ఈ వార్త విని కంట్లోంచి నీరు జలజలా వీణపై కురియగా వేళ్ళ నుంచి రక్తం కారేంత వేగంగా వాయిస్తుంది. వాగ్దేవి శోకసంద్రంలో మునిగినట్టుంది ఆ దృశ్యం. ఆమెకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. కాసేపటికి ఏమీ వినిపించట్లేదు. అచేతనావస్థలో ఆ రాగం మూగవోయింది. చేతుల్లోంచి అసంకల్పితంగా వీణ జారిపడిపోయింది. దుఃఖం నిండిన స్వరంతో ఆనంద్ అంటూ నేలకొరిగింది. (వచ్చే వారం part-4 )     .....సరిత భూపతి

క్రిస్మస్ పండుగ కోలాహలం!

క్రిస్మస్ పండుగ కోలాహలం!   క్రిస్మస్ తాత వస్తాడు.... ఏదో ధ్రువప్రాంతం నుండి, ధ్రువపు జింకలు లాగే స్లెడ్జ్ బండి ఎక్కి, తెల్లటి బరివి గడ్డంతో, నవ్వు నిండిన ముఖంతో, ఎర్రటి ఊలు అంగీతో. ఆ అంగీనిండా లోతైన జేబులు...జేబులునిండా టాఫీలూ, చాక్లెట్లూ, బహుమతులూ! అందరికీ అన్నీ అందిస్తాడు సంతోషంగా, నిర్విరామంగా. ఏ పిల్లలు ఇష్టపడరు ఆయన్ని? ఊరూరా నక్షత్రాలను పోలిన స్వాగత చిహ్నాలూ, వాడవాడలా రంగురంగుల బట్టలూ, పండుగ వాతావరణం. నూతన సంవత్సరానికి ఆహ్వానం, చర్చిల గంటలు, ప్రార్థనాగీతాల సాధనలు. మంచుకురిసే ఉదయాలు. మబ్బుతునకలు లేని ఆకాశంలో కిక్కిరిసిపోయి, ఇక ఎప్పుడు బయటకి ఊడిపడతాయో అనిపించే తారల రాత్రులు. వణికించబోతున్నాను సిద్ధంకండని హెచ్చరించే వెచ్చని చలి. అన్నింటినీ మించి పిల్లల్ని ఊరించే శలవలు. ఇన్ని సంతోషకర విషయాల నడుమ అందరం మరోసారి పరిశుద్ధ ప్రవక్త, దేవుని కుమారుడూ అయిన ఏసు ప్రభువులోని గుణాలను మరోసారి స్మరిద్దాం. కరుణామయుడూ, విస్వాసుల రక్షకుడూ అయిన ఆ ప్రభువు చూపిన సత్యమార్గంలో మనమూ పయనించేందుకు ప్రయత్నిద్దాం. విద్వేష కావేశాలను, మారణకాండల్నీదూరంచేసుకొని మన హృదయాలలోనూ పవిత్రతను నింపుకుందాం. హింస, పరపీడనల్ని దైవం ఏనాటికీ మెచ్చదని మరోసారి గుర్తుచేసుకుందాం. మతం ఉన్నది మనుషుల్ని దూరం చేయటానికి కాదనీ, మనసుల్ని దగ్గర పరచేందుకు ఉద్దేశించినదనీ చాటుదాం. విశ్వాసపు బలాన్ని, ప్రేమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అద్భుత వ్యక్తి ఏసు ప్రభువు. డిసెంబరు నెల 25 న ఆయన జన్మ దినాన్ని పురస్కరించుకొని కొత్తపల్లి బృందం మీకందరికీ శుభాకాంక్షలను అందిస్తున్నది. నవంబరు పధ్నాలుగు సందర్భంగా చెన్నేకొత్తపల్లిలో నిర్వహించిన కథలపోటీల్లో చాలామంది పిల్లలు పాల్గొన్నారు ఉత్సాహంగా. వారి రచనల్లో కొన్ని ఈసారి కొత్తపల్లి పత్రికలో చోటు చేసుకుంటున్నాయి. వీటిలో అధిక భాగం జానపదకథలు. అవీ ఇవీ కలుపుకొని, పిల్లలు సొంతంగా తయారుచేశారని వీటిని చూడగానే తెలుస్తుంది. వారికి స్ఫూర్తినివ్వటం, చదువరులకు చిరునవ్వునందించటం ఈ కథల ప్రచురణ వెనక గల మూలోద్దేశం. ఈ సంచికలో చిత్రాలను సకాలంలో అందించి తోడ్పడిన బి యఫ్ ఎ (జె యన్ టి యు) విద్యార్థులు శివ ప్రసాద్, సాయి కిరణ్, యాదగిరి లకు కొత్తపల్లి బృందం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది. ఇక, ఆదిలాబాదు జిల్లా, చెన్నూరు మండలకేంద్రానికి దగ్గర్లో ఉన్న భావురావు పేటలోని ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్థులు పంపిన పాటలు ఈమాసపు కొత్తపల్లికి ప్రత్యేక ఆకర్షణలు. ఆ విద్యార్థులకు, వారికి స్ఫూర్తినిచ్చిన ఆ పాఠశాల అధ్యాపక వర్గానికి మనందరి తరపున కృతజ్ఞతాభినందనలు. .......... kottapalli.in సౌజన్యంతో

మధూషిణి (కథ) పార్ట్ 2

  మధూషిణి  (part-2)     నేనత్తయ్యా మధూషిణిని రాఘవరావు గారి కూతురుని అన్నది. ఉద్వేగంతో ఆవిడ కళ్ళు చెమర్చాయి. తమాయించుకొని "ఎందుకొచ్చావ్ ఇక్కడికి ?" అన్నదామె. వెంటనే మధూషిణి అదేమిటత్తయ్యా నా అత్తారింటికి నే రాకూడదా అన్నది. జానకమ్మ దుఃఖం నిండిన స్వరంతో "మీ నాన్నేమీ అనలేదా నువ్విటు వస్తుంటే? అసలు మేమిక్కడున్నట్టు నీకెలా తెలుసు?" అన్నది. నేనిక్కడికి వస్తున్నట్టు నాన్నకు తెలీదు. " అమ్మ మీ గురించి అంతా చెప్పింది అన్నది " మధూషిణి.       మధూషిణి వాళ్ళ నాన్న రాఘవరావుకు ఒక్కగానొక్క చెల్లెలు జానకి. ఆమెకి గొప్పింటి అబ్బాయిని భర్తగా తీసుకురావాలని రాఘవరావుకు కోరికుండేది. అనుకోకుండా జానకమ్మ జగన్నాథంను ప్రేమించి పెళ్ళి చేసుకొని రావటంతో రాఘవరావు షాక్ కి గురి అయ్యాడు. ఆ కోపంలో ఈ రోజు నుంచి నాకు చెల్లెలు లేదనుకుంటాను నీ మెుహం నాకు చూపించకు అని ఇంట్లోంచి పంపించేశాడు. అది జరిగిన విషయం. మధూషిణి తల్లి కూడా జానకిని ప్రేమగా చూసుకునేది. ఆ తర్వాత జానకి,జగన్నాథం ను పెళ్ళి చేస్కోవటంలో ఆమెకేమి తప్పు కనిపించలేదు. ప్రతీరోజు ఆమెని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే మధూషిణిని సమానంగా జానకిని చూసుకుందావిడ. జానకి గురించి రోజూ తల్లి చెప్తూ ఉంటే మధూషిణికి తన అత్తయ్యను ఒకసారి కలవాలనిపించింది. సమ్మర్ క్యాంప్ వంకతో ఆ ఊరొచ్చింది.        జానకి అనునయంగా మధూషిణి చేయి పట్టుకొని " ఎప్పుడనగా తిన్నావో వెళ్ళి స్నానం చేసిరామ్మా వడ్డిస్తాను" అన్నది. అతి తక్కువ సమయంలో ఆ ఇంట్లో బాగా కలిసిపోయింది మధూషిణి. అత్తయ్య,మావయ్య చూపించే  ప్రేమానురాగాలు చూస్తుంటే అసలు వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళాలనే లేదు తనకి. ఒక రోజు నిండుగా పండువెన్నెల కురుస్తుండగా చంద్రునికి తానేమీ తీసిపోనన్నట్టుగా అందంగా తెల్లని పరికిణిలో మెరుస్తోందామె. వీణాపాణియై చక్రవాకరాగం ఆలపిస్తుంది. అది కొంచెం విషాదమిళితం. ఎక్కువమందికి నచ్చదు కూడానూ. కానీ మధూషిణి అలా లీనమైపోతూ వీణపై వేళ్ళు కనపడనంత వేగంగా ఆలపిస్తుంటే చూసేవారు ఎవరైనా మంత్రముగ్ధులు అవాల్సిందే. నిర్మలమైన వదనం , ఆమె రాగంలో లీనమై వాయిస్తుంటే తల లయబద్ధంగా ఊగుతోంది. ఆమె చెవికున్న జుంకీ రాగానికి అనుగుణంగా నాట్యమాడుతున్నట్టుంది. అప్పుడే పట్నం నుంచి వచ్చిన ఆనంద్ ఆ దృశ్యం చూస్తూ స్థాణువై నిలబడిపోయాడు. అదంతా ఒక కలగా అనిపిస్తుందతనికి. ఏదో అలజడి అవటంతో ఆపి తలుపువైపుకి తిరిగి చూసింది మధూషిణి. తను సరిగ్గా ఊహించగలిగింది అతను తన బావేనని. అనుకోకుండా అతను అక్కడ కనిపించేసరికి ఆమెకి నోట మాట రాలేదు. "నమస్కారం" అని మర్యాదపూర్వకంగా పలకరించి చెంగున అత్తయ్య దగ్గరికి పరిగెత్తుకెళ్ళి నిలుచుంది. జానకి ఆనంద్ ని చూసి సంతోషంతో "ఒరేయ్ ఎప్పుడొచ్చావురా వస్తున్నట్టు కబురు చేస్తే నాన్నగారు స్టేషన్ కి వచ్చేవారు కదా" అన్నది. " ఫరవాలేదమ్మా నాన్నగారికెందుకు ఇబ్బందనీ..అది సరే.. ఈ అమ్మాయి ఎవరు?" అనడిగాడు ఆనంద్. జరిగినదంతా చెప్పింది జానకి.     ఆ రాత్రంతా తనకు మధూషిణి ఆలోచనలే. ఆమె వీణాపాణియై ముద్దుమోముపై గాలికి ముంగురులు సయ్యాటలాడంగా పరవశిస్తూ రాగాన్ని ఆలపించిన దృశ్యం పదే పదే జ్ఞప్తికి వస్తోందతనికి. మరునాడు ఉదయం మధూషిణి మునుపటంత సిగ్గుపడక ఆనంద్ దగ్గరకొచ్చి " నాకు మీ ఊరు చూపిస్తారా?" అని అడిగింది. " ఓహ్ తప్పకుండా..నేనే అడుగుదామనుకున్నాను. ఈ పల్లెటూరిలో పొలాలు అవ్వీ తిరగటం నీకిష్టముంటుందో లేదోనని అడగలేదు.. పట్నం పిల్లవి కదా" అని ఉడికిస్తున్నట్టుగా చిన్నగా నవ్వాడు. " భలేవారే నాకు ఈ పంటపొలాలన్నా, ఇక్కడి వాతావరణమన్నా నాకు చాలా ఇష్టం" అన్నదామె. (వచ్చే వారం part-3 )     .....సరిత భూపతి

చలి చీమలు (కథ)

  చలి చీమలు     ఒక అడవిలో నల్ల చీమల పుట్ట ఒకటి ఉండేది. నల్లచీమలంటే, గండు చీమలు కావు- కుట్టకుండా ఊరికే మన ఒంటిమీద గబగబా పాకుతాయే, ఆ చీమలన్నమాట. వర్షం పడేముందు అవి గుంపులు గుంపులుగా బయలుదేరి ఒక చోటునుండి ఒక చోటికి మారిపోతుంటాయి- అందుకే వాటిని ’చలి చీమలు’ అంటారు కొందరు. అయితే, ఈ చీమల పుట్ట ఒక చెట్టు నీడన ఉండేది. అందువల్ల దానికి వర్షపు భయం లేదు. చాలా సంవత్సరాలుగా దానిలో చీమలు నివసిస్తూ వచ్చాయి; అందులో చాలా సౌకర్యాలూ అవీ ఏర్పరచుకున్నాయి; చాలా సుఖంగా ఉంటున్నాయి. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సుఖాలే ఎప్పుడూ ఉండాలంటే వీలవదు- కష్టాలూ వస్తాయి; వాటినీ తట్టుకొని నిలబడాలి. ఈ చీమలకు కూడా ఒక కష్టం వచ్చి పడింది- ఎక్కడినుండి వచ్చిందో, ఒక పాము చెట్టు తొర్రలోకి వచ్చి చేరుకున్నది. ఎప్పుడైనా వాన పడిందంటే, ఆ పాము చెట్టుదిగి వచ్చేది; చీమల పుట్టలోకి దూరేది. చీమలు పుట్టను తయారు చేసుకున్నది పాముకోసం కాదుగదా, అందువల్ల దానిలోపల దారులు సన్నగా, ఇరుకుగా ఉండేవి. పాము పుట్టలో దూరి, అటూ ఇటూ దారి చేసుకుంటూ, ఒళ్లు విదిలించుకుంటూ, రుద్దుకుంటూ ముందుకు, వెనక్కు, పక్కలకు తిరుగుతుంటే, పాపం, చీమలు శ్రమపడి కట్టుకున్న గోడలు కూలిపోయేవి, చాలా చీమలు చచ్చిపోయేవి, చాలా చీమలకు గాయాలయ్యేవి, అవి కష్టపడి జమచేసుకున్న ఆహారం మట్టిపాలయ్యేది. చీమలన్నీ కలిసి పాముకు చెప్పి చూశాయి- " అయ్యా, పాము గారూ, మేం ఇన్నాళ్లుగా శ్రమపడి కట్టుకున్న ఈ పుట్టను వదిలి పెట్టండి, మీరు వేరే ఏదైనా మంచి తావును చూసుకోండి, మీరు ఇందులో దూరినప్పుడల్లా మేం చీమలం, వేల సంఖ్యలో చచ్చిపోతున్నాం.. దయచూడండి" అని మళ్లీ మళ్లీ మనవి చేసుకున్నాయి. అయినా ఆ పాము వినలేదు. చలి చీమల బాధను అర్థం చేసుకోలేదు. చీమల గోడును పట్టించుకోలేదు. వర్షం వచ్చిన ప్రతిసారీ కావాలని పుట్టలోనే దూరి నవ్వేది, కావాలని పుట్టలో అన్నివైపులా తిరిగి, ఇంకా ఎక్కువ చీమల్ని చంపటం మొదలు పెట్టింది. చలి చీమల దవడలు ఎర్రచీమల దవడల మాదిరి గట్టిగా ఉండవు. ఎర్రచీమలు కుడితే చాలా నొప్పి పుడుతుంది; కానీ చలిచీమలు కుడితే అంత నొప్పి పుట్టదు. అయినా అవి పాము పెట్టే బాధని భరించలేకపోయాయి. ఒక రోజున కలిసి అనుకున్నాయి- "ఈసారి పాము వస్తే ఊరుకోకూడదు.. కసి తీరా కుట్టాలి, చచ్చిపోయినా పరవాలేదు" అని. ఇంకోసారి పాము పుట్టలోకి దూరగానే చీమలన్నీ కలిసి దాని మీద దాడి చేశాయి. పాము అటూ ఇటూ కొట్టుకున్నది, విదిలించుకున్నది, దొర్లింది, ఏం చేసినా చీమలు మాత్రం దాన్ని వదలలేదు. వేల వేల చీమలు చచ్చిపోయాయి; కానీ వాటి స్థానంలో మరిన్ని చీమలు వచ్చి కుట్టాయి. చివరికి అంత పెద్ద పాము కూడా తట్టుకోలేక చచ్చిపోయింది. కలసి పోరాడి చలిచీమలు తమ కష్టాలనుండి విముక్తి పొందాయి. అందుకే అన్నారు: బలవంతుడ, నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా? బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ’ అని.  నిజమే కదూ?   - kottapalli.in సౌజన్యంతో

మధూషిణి (కథ) పార్ట్ 1

మధూషిణి  (part-1) దారికి ఇరువైపులా పచ్చని పొలాలు.పొలాల చుట్టూ  కాలువ గట్లు,  మధ్యమధ్యలో కొబ్బరిచెట్లు. చీకట్లు ఇంకా బలంగా సంతరించుకోలేదు.పిల్లగాలులకు పచ్చని పైరు అందంగా కదులుతోంది  పదహారణాల కన్నె ఆకుపచ్చ  ఓణీతో ఆనందంగా ఉరకలెత్తుతున్నట్టుంది ఆ దృశ్యం. అక్కడక్కడా వంగి  ఉన్న కొబ్బరిచెట్లు ఆ దృశ్యాన్ని చూడటానికే ఆగాయా అన్నట్టుగా  ఉన్నాయి. నిర్మలమైన ఆకాశంలో అక్కడక్కడా ఆనందంగా విహరిస్తున్న పక్షులు. ఆనందమా? అంటే ఏమిటి ఆ పక్షులకు దుఃఖం లేదా? ఎప్పుడూ సంతోషంగానే ఉంటాయా? ఎందుకుండదు దుఃఖం ఏ ప్రాణికైనా భరించదగినంత కష్టాలే వస్తాయి మరి మనుషులెందుకు కష్టాన్ని భరించలేకున్నాను అని అంటూ ఉంటారు? ఇప్పుడు అనుభవిస్తున్నావు అంటే భరిస్తున్నట్టే లెక్క. శరీరం ఆ భరించే శక్తి కోల్పోయినపుడు దానంతటదే వెళ్ళిపోతుంది. కాబట్టి కష్టాలన్నీ స్థాయికి తగినట్టుగా ఏ ప్రాణి అయినా భరించదగినవే.         సరిగ్గా ఆ సమయానికి ఒక ఎద్దులబండి ఊర్లోకి ప్రవేశిస్తుంది. దాని సవ్వడికి అనుగుణంగా పచ్చని పైరు నాట్యమాడుతున్నట్టుంది. బండి వెనకాల కూర్చొని ఉన్నదామె మోకాళ్ళ మీద గడ్డం ఆన్చుకుని కదులుతున్న ఆ పైర్ల వంక ఎంతో ఉత్సాహంతో చూస్తూ. ఆ ప్రకృతి ఎంతో నిర్మలంగా ఉంది అచ్చంగా ఆమె వదనంలా. ఆమె కళ్ళు చూసి కలువలు కుళ్ళుకుంటాయి. ఆమె చెక్కిలి చిరు దరహాసానికి మల్లెలు మూతి ముడుచుకుంటాయి. ఆమె కురుల నలుపు చూసి నిశిరాత్రి వణికిపోతుంది. అందానికి తగ్గ సంస్కారం ఆమెది. చాలా చిన్న వయసులో చూసిన పల్లెటూరు అది. పదిహేనేళ్ళ తర్వాత మళ్ళీ చూస్తోంది. మనుషులు మారారేమో తెలీదు. ప్రకృతి మాత్రం నాకు వయసే రాదు చూసావా అని గర్వంగా చెప్తున్నట్టుంది. ఆమె బండి దిగి నడిచి వస్తుంటే ప్రతీ ఇంటి వాకిట్లో రకరకాల ముగ్గులు, ఆ పక్కన అందమైన పూల చెట్లు స్వాగతం చెప్తున్నట్టుగా ఉన్నాయి. ఆమె ఒక ఇంటి వద్ద ఆగి అరుగు మీద కూర్చున్న నడి వయసు వ్యక్తిని అడిగింది " జగన్నాథరావు గారి ఇల్లెక్కడండీ " అని. చూపు తిప్పుకోనివ్వకుండా ఉన్న ఆమె అందానికి ఒక్క క్షణం నివ్వెరబోయి ఆమె అడిగిన ఇంటికి దారి చూపించాడతను. కృతజ్ఞతలు తెలిపి ముందుకు నడిచిందామె. ఆ ఊర్లో చూసిన ఇళ్ళల్లోకి అదే పెద్ద భవనం. తెలుగుదనం ఉట్టిపడేలా పసుపు రాసి ముగ్గేసిన గడప, గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు. లోపలికి అడుగు పెట్టగానే ఓంకారం లీలగా వినిపిస్తుంది. ఇరువైపులా పూల చెట్లు. ఆమె లోపలికు ప్రవేశించి అత్తయ్యా అని పిలిచింది. లోపల వంట గదిలోంచి జానకి ఎవరమ్మా అని అడుగుతూ బయటకొచ్చింది నెమ్మది స్వరంతో.  నిండుకట్టుతో, నుదుటన పెద్దగా గుండ్రటి తిలకం బొట్టుతో, విశాల వదనంతో ఆమె నడిచొస్తుంటే ఎంతో హుందాగా కనిపిస్తుంది. ఆమె ఆ అమ్మాయిని ముందు గుర్తు పట్టలేదు. ఆమె నేనత్తయ్యా మధూషిణిని, రాఘవరావు గారి కూతురిని అన్నది. ఉద్వేగంతో జానకి కళ్ళు చెమర్చాయి. ఆవిడ తమాయించుకొని " ఎందుకొచ్చావ్ ఇక్కడికి? " అన్నది. (వచ్చే వారం part-2 )     .....సరిత భూపతి  

జీవిత పయనం... ఓ చిన్న కథ

జీవిత పయనం... ఓ చిన్న కథ ఒక వ్యక్తికి నలుగురు భార్యలు..........నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి... ఆమెకోరిన కోరికలన్నీ తీర్చేవాడు......అపురూపంగా చూసుకునేవాడు... మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితులదగ్గర చెప్పేవాడు కాదు.....తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో....... రెండవ భార్యదగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు...ఆమెకూడా అతని సమస్యను తీర్చి పంపేది..... మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు....ఆమెను అస్సలు పట్టించుకునే వాడే కాదు......ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అతని ఆరోగ్యం క్షీణించిపోయింది.ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు. " నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను......నిన్ను చాలా ప్రేమగా \ చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్.... మరణంలో కూడా నాకు నీతోడే కావాలి " అని అన్నాడు. నాలగవ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది, ఆశ్చర్య చకితుడై తన మూడవ భార్యను ఇదే కోరాడు........ మూడవ భార్య ఇలా అంది. " ఇన్ని రోజులు నీతోనే,,,,,,,,నీ దగ్గరే ఉన్నాను.......నీ అవసరాలన్నీ తోర్చాను ఇక నాకు నీతో పనిలేదు.వేరేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను:" బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే అడిగాడు...... " నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీవెంట ఉంటాను తరువాత నేను వెళ్ళిపో్తాను.....నిన్ను అప్పుడప్పుడు తలచుకోగలను." అంది. ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా అని భావిస్తుండగా....... మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది. " మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం దాకా తప్పక వస్తాను........మీరేమీ బాధపడకండి " అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది.....కాబట్టి మనిషి దేన్నీ..... ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు.......మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు.........పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు. నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యల్తోనే ఉంటున్నాము. అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా??????? నాలుగవ భార్య......... మన శరీరం...... మూడవ భార్య ...............సంపద, ఆస్థిపాస్తులు...... రెండవభార్య.......... నేస్తాలు........బంధువులు....... మొదటి భార్య..............మన ఆత్మ.......... నిజమే కదా! దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి.... పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి........సరేనా! కథ కంచికి మనం ఇంటికి ....................విజయపథం........విజయ,కె.

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 22వ భాగం

  “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 22వ భాగం    "ఎర్రన భారతంలోని అరణ్యపర్వశేషమునందు ఐదు పద్యాలలో చేసిన శారద రాత్ర వర్ణనకీ, హరివంశంలో పది పద్యాలలో వర్ణించిన శరన్నవసంపదకీ చాలా తేడా ఉంది.    శరత్కాలంలో ఆకాశం రాజ చిహ్నాలతో అమరిందట..    మరొక పద్యంలో సముద్రపు కెరటాలను కౌగలించుకొనడానికి ఏరులు తొందరపడుతున్నాయట..    సూరన రాగయుక్తంగా చదివి వినిపిస్తుంటే ఆ శరత్కాలంలోకి వెళ్ళిపోయి విహరించిన అనుభూతి కలిగింది శ్రోతలందరికీ.    అంత సహజంగా ఉంది వర్ణన.    మధ్యాన్న విరామం..    సభకొచ్చిన వారందరికీ, ప్రాసాదంలోనే భోజనాలు.         ఘాటైన కొరివికారం, కమ్మని నెయ్యి, వరి అన్నం.. కలుపుతుంటే వస్తున్న వాసనలకి వచ్చినవారి ఆకలి రెట్టింపవగా.. మిగిలిన ఆధరువులన్నీ ఒకదాని మించి మరొకటి మరింత రుచిగా..    అలా అలా నాలుకపైనుంచి కిందికి జారి.. అతిథులను సంతృప్తులను చేశాయి.    ఆఖరున కమ్మని పెరుగు కడుపులను చల్లబరచింది.    ఒక ఘడియ అయిన తరువాత అందరు సమావేశమయ్యారు.    "మామూలుగా కావ్యంలో పద్యాలకున్న అందాలు గద్యానికుండవు. ఒక్కొక్కసారి, భావపుష్టి లేక చదువరికి తలనొప్పిగా తయారవుతాయి.    కానీ ఎర్రనగారి వచనం తీరే వేరు.    వచనం కూడా పద్యాలకి దీటుగానే ఉంటుంది.    తెలుగు తనం ఒలికిస్తూ ఉంటాయి గద్యాలు.    వానా కాలంలో గోవులు, గోపాలురూ ఎటువంటి పాట్లు పడతారో వర్ణించిన గద్యం చదువుతుంటే హ్రుదయం డెక్కు పట్టక మానదు..”    ఏక వాక్యంగా సాగిన ఆ గద్యం చదివి ఆపగానే, శ్రోతలందరూ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చారు.    వేల తుమ్మెదలు ఒకేసారి పూలబాలల మీదినుంచి లేస్తుంటే వెలువడిన ఝంకారావంలా ఉంది ఆ శబ్దం. సుష్టుగా భోజనం చేసిన తరువాత వచ్చే కునుకు పారిపోయింది నిలువలేక.    "ఇది పూర్వ భాగం ఏడవ ఆశ్వాసంలో నున్న గద్యం.    ఎర్రయగారి వర్ణనలు చిన్న విషయాలను కూడా వదలవు. ఆసక్తికరంగా సాగుతుంది.    కాళీయుడు కొలనులో చేసే భీభత్సాలను భరించలేని కృష్ణుడు మడుగులోకి ఎలా దూకాడో చేసిన వర్ణన చూస్తే..    మన కళ్ల ముందే కదలుతాడా చిన్ని కృష్ణయ్య..     ‘పొలుచు పింఛపుదండ పుచ్చి వెండ్రుకల నొప్పెడు జడగా నల్లి ముడి యమర్చి      మొలగచ్చగట్టుపై మలగిన పచ్చని నునుగొంగు దిండుగా మనిని చుట్టి..’    ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వలస వెళ్ళడం అలవాటైన ఎర్రయగారు, వ్రేపల్లెనుండి బృందావనానికి వలస వెళ్ళిన గోకులాన్ని బాగా వర్ణించారు.    కవ్వము, కొడవలి, కత్తి, వల్లెత్రాళ్లు.. ఏమీ వదలలేదు గోకులంలోని జనం."    ఈ వర్ణన విన్న ప్రోలయ వేముని మోమున చిరునవ్వు కదలాడింది.    సభలో కొందరు ప్రశ్నార్ధకములతో చూచారు.    ప్రేక్షకుల కుతూహలమును గమనించిన సూరన తమ గురించి చెప్పుకోవలసిన సమయం వచ్చిందని అనుకున్నాడు. కంఠం సవరించుకున్నాడు..    "వేగినాటి నుంచి పాకనాడుకు మేము వలస వచ్చాం.. వచ్చి ఇంతటి వాళ్ళం అయాం.    దీనికి కారణం మన ప్రభువు ప్రోలయ వేమారెడ్డి. హరివంశ కావ్యం మనకందించిన కవి, ఎర్రన అప్పటికి ఇంకా జన్మించలేదు. కరాపర్తి గ్రామమునుండి, మమ్ములను గుడ్లూరు గ్రామమునకు రప్పించినది ప్రభువే..    భటులను, మేనాలను పంపి సగౌరవంగా, సౌకర్యంగా తెప్పించారు.    గుడ్లూరునందే మాకు పుత్రోదయం అయింది.    ప్రభువు సోదరుడు మల్లారెడ్డి ప్రభువు ప్రోద్బలంతో చదవాలడ గ్రామమునకు.. ఆపైని, మరల వేమారెడ్డి ప్రభువు ఆదేశంపై అద్దంకికి వచ్చాం.    వచ్చి ఇపుడు మీ ముందున్నాం."    సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అప్పటికే ఎర్రాప్రగడ కావ్యాలు పలువురు సాహిత్యప్రియుల మన్ననలందుకున్నాయి.    ".. ప్రముఖులు గ్రుప్సియోలాకుపడ నెడనెడం గావలియై తగువారు నడిపింప నవ్విధంబునం జని బృందావనంబు ప్రవేశించి యుచిత ప్రదేశంబులు నివేశంబులుగా నిరూపించి గోపాల ముఖ్యులు నిలువ నాక్షణంబు.." ఈవర్ణనలో తెలుగుదనం ఉట్టిపడుతోంది..    ఇందులో వర్ణించిన విధంగానే మా ప్రయాణములు కూడా సాగాయి.    చిన్ని కృష్ణుడిని తెలుగు ఇళ్లల్లో పసిబిడ్డగా కూడా అంతే చక్కగా చూపించారు.    ".. తండ్రిని గంటి నయ్యగంటి     నిందు రావయ్య విందుల వింద వనుచు     నర్ధిదను బిలువగ నడయాడియాడి     యులసిల్లె గృష్ణుడు శైశవోత్సవముల్."                        అదే విధంగా వెన్న, పాలు యశోద కృష్ణుడికి పెట్టడం చదువుతే.. తెలుగువారింటి ప్రతీ పసిబిడ్డడూ కృష్ణుడి వలెనే గోచరిస్తాడు.    ఈ ఘట్టం అంతా చదివి ఎవరికి వారు ఆనందించి, చుట్టుప్రక్కలవారితో పంచుకోవాలే కానీ ఒకటి రెండు పద్యాలతో తృప్తి కలుగదు.    ఇల్లిల్లు తిరిగి కృష్ణుడు చేసే దుండగాలు ఎర్రయ విపులంగా వర్ణించారు.    కృష్ణయ్య అల్లరికి విసుగెత్తిన గోపికలు యశోద వద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నారు..    ‘ఎక్కడికేనియు బోయెద     మిక్కష్టపు బాటువడగ నేమోర్వము నీ     నొక్కపు గొడుకును నీవును     నొక్కతలయు నొక్క మోరి నుండుడు నెమ్మిన్.’    యశోద నొచ్చుకుని, "వీడిని ఎలా అణిచేస్తానో చూడండి. మీకనుమానం వద్దు.." అంటూ గోపికలకు సర్ది చెప్పి ఇళ్ళకు పంపేస్తుంది.    ఆ తరువాత వాడిని లాలిస్తుంది.    మళ్ళీ ఇళ్లల్లో పాలు పెరుగు త్రావే వాడి అల్లరి గుర్తుకొచ్చి ఉక్రోష పడుతుంది.     "కదలిన మొత్తుదు నెక్కడ     కదలెద వటు గరదులాడ కదలుసమ యేజూ     చెద ననుచుబోయి యిమ్ముల     ముదితనిజకుటుంబకార్యముల దత్పరయై."    కదిలితే మొత్తుతాను. ఎక్కడికెళ్తావు.. కదలు చూస్తాను.. అంటూ ఇంటి పనుల్లో మునిగి పోతుంది.    తెలుగింటి అమ్మల ముచ్చట్లు అన్నీ ఈ కావ్యంలో తేట తెలుగులో చదువుతాం.. చూస్తాం." సూరనార్యుడు కావ్య పఠనం ముగించి, గ్రంధాన్ని సరిది, తల ఎత్తి సభని కలియజూశాడు.    సభ అంతా నిశ్శబ్దంగా ఉంది.    అందరూ, కన్నులు మూసుకుని బాల కృష్ణుని క్రీడలలో తేలియాడుతున్నారు.    ముందుగా ప్రభువే తేరుకున్నాడు.    నెమ్మదిగా.. వున్నాయా లేవా అన్నట్లుగా కరతాళధ్వనులు మొదలయ్యాయి. ఒకటి రెండు క్షణములలోనే ప్రాంగణమతా చప్పట్లతో మారు మ్రోగి పోయింది.    అప్పటికప్పుడు ప్రతులు వ్రాయుటకు వందమంది తయారయ్యారు.    ప్రోలయ వేమారెడ్డి, ఆసనం మీదినుంచి లేచి వచ్చి ఎర్రాప్రగడని ఆలింగనం చేసుకున్నాడు.. ఆనంద భాష్పములు చెక్కిళ్ళని తడిపేస్తుంటే.    ఉద్వేగంతో ఒకింత ఎర్రవడిన మోముతో ఎర్రన బిడియంగా నిలబడి పోయాడు.    ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండటం విజ్ఞుల లక్షణం.    సభలోని పండితులందరూ, ఒక్కొక్కరే వచ్చి తమ అభినందనలు తెలియజేశారు.    సభలో ఉత్సాహమంతా సర్దుకున్నాక ఎర్రన వేమారెడ్డి ప్రభువును పుష్ప మాలాలంకృతుడిని చేశాడు. ఆ పిదప జాగ్రత్తగా తన కావ్యమును తీసుకుని వచ్చి, పరిచారికలందించిన బంగరు పళ్ళెరములో నుంచి కృతిని సమర్పించాడు.    ప్రోలయ వేమారెడ్డి ఆకాంక్ష తీరి సంతుష్టుడైనాడు.                            …………                                  కొండవీటి కోట నిర్మాణము పూర్తి అయినది.    శతృ దుర్భేద్యమయిన కోట.                 రాజ్యం ప్రశాంతంగా ఉందని నమ్మడానికి లేదు.. ఏమరుపాటుగా నుండుటకు అసలే లేదు.    ఏ క్షణమైననూ ఢిల్లీ నుంచి ముసల్మానులు రావచ్చును.. లేదా దక్షిణమునుండి పాండ్యులు, పశ్చిమమునుండి కర్ణాటకులు, తూరుపున కళింగులు..    వీరువారని లేదు.. అందరికీ పరాయి రాజ్యమును ఎప్పుడెప్పుడు కబళిద్దామా అనే ఆశే.    అందువలననే కొండవీడులో కోటని, రాతి కోట గోడలతో, కందకములతో పటిష్ఠంగా నిర్మించారు వేమయ ప్రభువు. రాజధాని అద్దంకి నుండి కొండవీడుకి మార్చబడింది.    అద్దంకి వాస్తవ్యులందరికీ వీడుకోలు చెప్పి వేమారెడ్డి తన పాలనని, వసతిని కొండవీటికి మార్చాడు.    శ్రీశైలములో, అహోబిలములో సోపాన నిర్మాణములు కూడా పూర్తి అయినవి. అనుకున్నపుడు అనుకున్నట్లుగా భక్తులు తమ స్వామిని దర్శించుకుంటున్నారు.    ఎర్రన కుటుంబము కొల్లూరునకు తరలి.. అక్కడే స్థిరనివాసమేర్పరచు కున్నారు.    కొండవీడునకు మారిన పదహారు వత్సరముల వరకూ వేమారెడ్డి ప్రజా రంజకముగా రాజ్యమును పాలించాడు. జ్యేష్ఠ కుమారుడు అనపోతారెడ్డికి రాజ్యమప్పగించి కన్ను మూశాడు.    అనపోతారెడ్డి కాలములో ఇతని తమ్ముడు అనవేమ భూపతి ఎర్రయప్రగడగారికి యాభై పుట్ల చేనును ధారపోసి కొల్లూరును కలిపి, శాసనము వ్రాయించారు.    తాతగారి వలెనే పూర్ణాయుష్మంతులై జీవించారు ఎర్రాప్రగడ. ఈ శంభుదాసుని పేరు మీదనే కొల్లూరు వద్ద చదలవాడ అనే గ్రామం ఏర్పడి.. ఎర్రయగారి సంతతకి చదలవాడవారనే ఇంటి పేరు వచ్చి ఉంటుంది.    ఈ ప్రబంధ పరమేశ్వరుని ఒరవడితోనే తెలుగునాట ప్రబంధముల ఆవిర్భావము జరిగింది. నన్నయ తిక్కనార్యులతో చేరి భారతాన్ని పూరించిన ఎర్రయగారు లేకపోతే ఆంధ్ర మహాభారతము అసంపూర్తిగా మిలిపోయేది. తెనుగు వారికి గర్వకారణమయిన ఈ గ్రంధమునొసగిన కవిత్రయమునకు తెలుగువారు సర్వదా కృతజ్ఞులు.                                              .సమాప్తం.                        *-------------------*       నమస్కారం. నా పేరు మంథా భానుమతి. తెలుగు వన్ డాట్ కాం వారి బహుముఖ రంగాలలో సాహిత్యం  విభాగం లో మొదలైన ధారా వాహిక వచన కావ్యం.. “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” రచయిత్రిని.  ఆంధ్ర మహా భారతం సాహితీ జీవ మహా నది ఐతే.. రెండు వేర్వేరు ఒరవడులు కలిగిన సాహితీ వాహినులను.. వేగంలో, స్వచ్ఛతలో ఎటువంటి కల్తీ లేకుండా కలిపిన జీవ నది, ఎర్రాప్రగడ కవి రచించిన అరణ్య పర్వ భాగం. స్వయంగా మొత్తం కావ్యం రాయడం వేరు.. ఇద్దరు కవుల కావ్యానికి వారధి కట్టడం వేరు.. అందుకే నాకు ఎర్రనగారి జీవిత చరిత్ర మీద కుతూహలం కలిగింది. పది సంవత్సరాల పసి వయసులోనే క్లిష్ట పదాలతో చందో బద్ధంగా పద్యం చెప్పి తాతగారిని ఆశ్చర్య పరిచిన ఎర్రన అంటే ఆరాధన కలిగింది. . ఎర్రాప్రగడ జీవిత విశేషాలన్నీ, “ఎర్రాప్రగడ చరిత్ర” అని రాయచ్చు కదా.. చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు ఏమిటి అని సందేహం రావచ్చు. ఎర్రాప్రగడ జీవిత కాలంలో తెలుగునాట రాజకీయ చరిత్ర అనేక మలుపులు తిరిగింది. తొలి చూలుగా వంశోద్ధారకుడు కావాలనుకునే కాలంలో.. ఎర్రన తల్లి.. “దేవుడా.. నాకు ఆడపిల్లనే ఇవ్వు” అని ప్రార్ధించిన పరిస్థితులు. ఆ చరిత్ర అంతా చెప్తూ, నృసింహ పురాణ కావ్య రచనతో ప్రబంధ పరమేశ్వర బిరుదాంకితుడైన ఎర్రన జీవితం ఆ కాలంలో ఎటువంటి విధానంతో నడిచిందీ అని చెప్పాలని ఈ వచన కావ్యం రాశాను. ఎర్రాప్రగడ వారి ఆరాధ్య దైవం నీలకంఠేశ్వరుని ప్రార్ధిస్తూ.. ఈ సాహసం చేశాను.  నా ప్రయత్నం ఫలించిందా లేదా అనేది పాఠకుల నిర్ణయం. ఈ రచనలో దొర్లిన తప్పులను క్షమించమని పండితులను వినయంగా కోరుతున్నాను. ------------------------------      .....మంథా భానుమతి

చతురస్రం (కథ)

చతురస్రం (కథ)   - నెల్లూరి కేశవస్వామి          తెలంగాణ తొలితరం రచయితల్లో నెల్లూరి కేశవస్వామి ఒకరు. 1920లో హైదరాబాదులో జన్మించారు. ఇంజినీరు అయినా తెలుగు కథలు, వెలుతురులో చీకటి పేరుతో ఒక నవల రాశారు. అలాగే కొన్ని నాటికలు, ప్రేమ్ చంద్ కథలను తెలుగులోకి అనువాదం చేశారు. వీరు రాసిన చార్మినార్ కథల సంపుటి అప్పటి హైదరాబాదు నగర ప్రజల జీవన విధానాన్ని తెలియజేస్తుంది. పైగా ఈ కథల సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది.          చతురస్రం కథలో వెంకట్రావు కథానాయకుడు. అతను జీవితంపై విరక్తి చెంది ఉంటాడు. మానవ సంబంధాలపై విసుగుతో ఉంటాడు. ఒక గదిలో ఒంటరిగా ఉంటుంటాడు. ఒకసారి రైల్లో ప్రయాణిస్తూ ఉంటే హఠాత్తుగా ఎవరో కొరడాతో కొట్టినట్లు మెలుకువ వస్తుంది. లేచేసరికి అతని ఎదురు బర్త్ లో ఉన్న అతను యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని అరుస్తూ ఉఁటాడు. వెంకట్రావుకు అరుపులు, కేకలు, ఏడ్పులుస బొబ్బలూ వినిపిస్తూ ఉంటాయి. వెంకట్రావుకు విషయం అర్థమయ్యి బోగీ తలుపులు తెరిచి బయటకు చూస్తాడు. ఎత్తయిన కట్టపై కంపార్టుమెంటు నిలబడి ఉంటుంది. యాక్సిడెంట్ జరిగిందని నిర్దారణకు వస్తాడు. కొంతమంది అప్పటికే యాక్సిడెంట్ అయిన బోగీల దగ్గరకు వెళ్లి సహాయం చేస్తుంటారు. పైగా యాక్సిడెంట్ అయినది స్త్రీల బోగీలకు అని తెలుస్తుంది వెంకట్రావుకు.           కానీ వెంకట్రావు సహాయం చేయడానికి వెళ్లడు. వాళ్లకు సాయం చేయడానికి  నేనెందుకు వెళ్లాలి అనుకుంటాడు. స్త్రీలందరూ కాళ్లు విరిగి, పసిపిల్లలు తలలు బ్రద్దలై, శనవాలుగా మారిన వాళ్లను చూసి మిగిలిన వాళ్లు రోధిస్తుంటే... వాళ్లను చూసి నేనెందుకు బాధపడాలి. నేనెందుకు సానుభూతి చూపించాలి అనుకుంటాడు. తన జీవితాన్ని గుర్తు చేసుకుంటాడు. బి.ఎ. పరీక్ష రాయకుండా వచ్చినందుకు బంధువులు తనను ఎంతగా బాధపెట్టింది.... ఆ తర్వాత తను బాగా సంపాదిస్తే, ఆ సంపాదన కోసం తన వెంటపడింది, చివరకు లక్ష రూపాయలు ఇచ్చి వాళ్లతో తెగతెంపులు చేసుకుంది... అన్నీ గుర్తుచేసుకుంటాడు. చివరకు ఆ లక్షరూపాయలు పంచుకోడానికి బంధువుల పడిన గొడవలు అన్నీ వెంకట్రావుకు ఆ క్షణాన గుర్తుకు వస్తాయి. రిలాక్స్ కోసం సిగరెట్ తాగుతాడు. ఒంటరి జీవితం నిజంగా హాయి అనుకుంటాడు. ఎదురుగా బోగీలో ఉన్న మనిషి నువ్వు హాయిగా ఉన్నావా... అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోడానికే వెంకట్రావు ప్రయత్నిస్తూ ఉంటాడు.             వెంకట్రావుకు మొండిగోడల మధ్య, గుర్రపు పందాల్లో, క్లబ్బుల్లో, బార్లల్లో, హెలెన్, టెరెసా కౌగిళ్లలో హాయి దొరకదు. చివరకు దేశాటన మొదలు పెట్టి ఎక్కడన్నా హాయి దొరుకుతుందేమోనని వెతుకుతుంటాడు. అలా దేశాటన చెస్తూనే ఇప్పుడు రైలు ప్రమాధాన్ని చూస్తాడు. ఓ పెద్ద మనిషి అంత ప్రమాదం జరిగితే...నువ్వు ఇలా కూర్చున్నావే... అని అడుగుతాడు.  అందుకు వెంకట్రావు నేనేెం చెయ్యాలి... అని అడుగుతాడు. అందుకు అతను-- ఛీ.. ఏం మనుషులో... అని విరక్తిగా వెళ్లిపోతాడు.అసలు ఆ యాక్సిడెంట్ తనున్న బోగీకి అయితే హాయిగా చనిపోయి ఉండేవాడిని అనుకుంటాడు. తన జీవితంలో పద్మ తనను వెంటాడిది, హెలెన్ చనిపోయింది తన కోసమే కదా... అనుకొంటాజడు. అంతలో అక్కడకు పోలీసులు, డాక్టర్లు, నర్సులు వస్తారు. వాళ్లు యాక్సిడెంట్ అయిన వాళ్లందరికీ సాయం చేస్తూ...స్ట్రెచర్ల మీద శవాలను, గాయాలైన వారిని ట్రైన్ ఎక్కిస్తుంటారు. వారిలో ఒకామెను చూడగానే వెంకట్రావుకు ప్రాణం పోయినంత పనవుతుంది. సీతా... సీతా... అని అరుస్తూ వెంటపడతాడు. నర్సులు డాక్టర్లు గాయపడిన ఆమెను రైల్లోకి ఎక్కించి పక్క స్టేషన్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుస్తారు. వెంకట్రావు కూడా ఆమెకోసం అక్కడకు వెళ్తాడు.          డాక్టర్లను ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడతాడు. వెయ్యి రూపాయలు ఇవ్వబోతాడు. కానీ డాక్టరు తీసుకోడు. ఆసుపత్రిలో కంగారుగా అటు ఇటూ తిరుగుతాడు. క్షణమొక యుగంగా గడుపుతాడు. ఒకప్పుడు రాసిన కథను గుర్తుకు తెచ్చుకుంటాడు. అంతలో డాక్టరు వచ్చి వెంకట్రావును లోపలకు తీసుకెళ్తాడు. సీత కళ్లు తెరిచి వెంకట్రావును చూస్తుంది. ఆమె ముఖంలో విషాధరేఖలు కనిపిస్తాయి. కానీ సీత కళ్లు తెరిచి వెంకట్రావును చూసి, అప్రయత్నంగా కళ్లు మూసుకుంటుంది. నర్స్ ఆమె చనిపోయిందని నిర్దారణకు వచ్చి, ముఖంపై తెల్లటి బట్ట కప్పేస్తుంది. వెంకట్రావు పిచ్చిగా, శూన్యంగా రోడ్లంతా తిరిగి, పన్నెండు గంటల తర్వాత శ్మశానానికి వెళ్తాడు. అక్కడ  ఇద్దరు పిల్లలు, ఒక ముసలాయన ఆమె చితి దగ్గర ఏడుస్తూ కనిపిస్తారు. వెంకట్రావు తన జేబులో ఉన్న ప్రేమలేఖను తీసి చితిమంటల్లో వేస్తాడు. వాళ్లిద్దరూ సీత పిల్లలని, సీత భర్త చనిపోయాడని తెలుసుకుంటాడు. తన ఆస్తిని ఆ పిల్లల పేరు మీద రాస్తాడు. రాసిన తర్వాత పూర్తిగా అంతర్ధానమై పోతాడు. ఇక ఎప్పటికీ తిరిగిరాడు.        ఈ కథ సంఘటనాత్మకమైనది. అక్కడక్కడా కవితాత్మకంగా సాగుతుంది. కథంతా వెంకట్రావు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఫిలసాఫికల్ టచ్ కనిపిస్తుంది. మనిషికి హాయి అనేది డబ్బులో, హోదాలో, బార్లలో, గుర్రపు పందాలలో... దొరకదని చెప్తుంది. ప్రేమలో, ఇతరులకు సాయం చేయడంలోనే ఉందని రచయిత చివరకు చెప్తాడు. కథలో వచ్చే ప్లాష్ బ్యాక్ కథనం చదివేవాళ్లకు ఆసక్తిని కలిగిస్తుంది. మానవ సంబంధాలపై విసుగు చెందిన మనిషికి, ఆ మానవ సంబంధాల్లోనే హాయి ఉందని చెప్పడం ఈ కథా వస్తువులోని ప్రత్యేకత.                                                             - డా. ఎ. రవీంద్రబాబు

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 21 వ భాగం

  “చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు" 21 వ భాగం అలంకరించిన ఏనుగుమీద అంబారీలో రామాయణకావ్యాన్నుంచి, ప్రక్కన నడిచి వెళ్ళారు, ఎర్రన, సూరనలు. ఆడవారు, తెరలు కట్టిన బళ్ల మీద కూర్చుని పయనమయ్యారు. వీరు చేరే సరికే కొలువులో అందరూ వారి వారి ఆసనములలో కూర్చుని వేచి ఉన్నారు.    పోతమాంబ కోడలిని తీసుకుని లోనికి.. రాణీగారున్న చోటికి నడిచింది.    ఫణిహారులు దండములు ధరించి, అందందు నిలిచి, వచ్చిన వారిని ఉచితాసనములలో కూర్చుండ బెడుతున్నారు.    అంతలో ప్రభువు, ప్రోలయ వేమారెడ్డి అరుదెంచారు. వారి వెంట మల్లా రెడ్డి కూడా ఉన్నారు. వారు అంతకు ముందురోజే కొండవీటి నుండి వచ్చారు. అక్కడి కోట పూర్తి అయిపోయింది. మంచి ముహుర్తం చూసి రాజధానిని మార్చడమే మిగిలింది.    ఎర్రన ఎదురేగి, కావ్యకన్యను సమర్పించబోయే రాజును సగౌరవంగా తోడ్కొని వచ్చి, సింహాసనం మీద అలంకరింపజేశాడు.    ప్రభువునకు ఉచితోపచారాలు చేసి కావ్యకన్యను సమర్పించారు ఎర్రనగారు.    ప్రోలయ వేమారెడ్డి పరమానంద భరితుడైపోయాడు.    "చదలవాడలో రామాలయ ప్రతిష్ఠనాడు నే కోరిన కోరిక.. ఈ నాడు నెర వేరింది. ఈ రామాయణం చెప్పించి నందువలనే నేను అత్యుత్తమ ఖ్యాతిని పొందుతాను. నా కొలునందు ప్రబంధ పరమేశ్వరుడు ఉండుట నాకెంతయో గర్వకారణము." వేమారెడ్డి సగర్వంగా నిండు పేరోలగంలో ప్రకటించాడు.    అంతే కాదు..    మహాకవిని కాళ్లు కడిగ సవినయంగా పూజించాడు. పన్నీరు చల్లాడు.    ఆ నిండుసభలో వినమ్రుడై ఒక కోరిక కోరాడు.    "కవివర్యా! నీవు సకల భాషా కవిత్వ విశారదుడవు. భవ్యుడవు. సౌమ్యుడవు. నువ్వంటే నాకు మెండు గౌరవం. హరివంశం భరత పరాంశమని పెద్దలు చెప్తారు. ఆ రమ్యమైన కథను తెలుగులో రచించి మాకు తెలుపు" అని అడిగాడు.    అప్పుడు ఎర్రయగారు పులకించి ప్రోలయవిభుని విన్నపమును అంగీకరించారు.    "నన్నయభట్టతిక్క కవినాథులు చూపిన త్రోవ పావనం     బెన్న బరాశరాత్మజమునీంద్రుని వాఙ్మయమాది దేవుడౌ     వెన్నుని వృత్తమీవు కడు వేడుకతో విను నాయకుండ ని     ట్లెన్నియొ సంఘటించె మదభీప్సిత సిద్ధికి రాజపుంగవా.    నా అభీష్టం కూడా నదే. కళ్యాణయుతమగు మహనీయ రచన హరివంశాన్ని తప్పక చెప్పెదను. అవధరింపుము."    ఎర్రయగారి హరివంశ కావ్యావిర్భావానికి బీజం పడిందా విధంగా.                            …………….                                17    "హరివంశం.."    తన రచనలలో నాల్గవది.    అరణ్యపర్వ భాగము రచించినప్పటి సందేహ సంకోచాలేమీ లేవు. వరుస కావ్య రచనలతో బాగుగా పరిణతి సాధించారు ఎర్రయప్రగడ.    మూలకావ్య పఠనము, అనువాదము ఒకే సారి జరిగిపోయినవి. ఆలయమునకు వెళ్లి దర్శనము చేసికొనుట తప్ప, ఇతర కార్యములనుండి విశ్రాంతి తీసుకుంటున్న సూరన ఈ కావ్య రచనమున పూర్తిగా సహకరించారు.    నకలు ప్రతిని కూడా వెనువెంటనే సిద్ధం చేసేశారు ఇరువురూ.    సూరన పండితుని సహకారం ఉండుటతో  కావ్యం అనూహ్య వేగముగా సమాప్తి చేసి పరిపూర్ణులయ్యారు ఎర్రాప్రగడ..    సూరనార్యుని ఆనందమునకు అవధిలేదు.    ప్రోలయ వేమారెడ్డి కోరి వ్రాయించుకున్న ఈ కావ్యాన్ని తన పండిత సభలో విశ్లేషించవలసిదిగా తన ఆస్థాన కవిని వేడుకున్నారు.  సూరనార్యుడు పుత్రోత్సాహముతో వేమయ ప్రభువును ఒక కోరిక కోరారు.    "ఈ కావ్యాన్ని నేను వివరిస్తాను.. మీరు అనుమతిస్తే.."    "ఆచార్యా! మహా ప్రసాదము. మాకు అంతకన్ననూ కావలసినది ఏమున్నది?"    మంచి ముహుర్తము చూసి హరివంశ పఠనం.. విశ్లేషముతో కూడిన వివరణ ప్రారంభించారు.. ప్రోలయ వేమారెడ్డి సాహిత్య సభలో సూరనార్యుడు.    ఆ సంగతి కర్ణాకర్ణిగా విన్న పండితులందరూ.. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి యే కాక, ప్రక్క రాజ్యముల నుండి కూడా అద్దంకికి విచ్చేశారు. వచ్చిన విద్యా వేద విశారదులందరికీ అనుకూలమైన విడిదులు, భోజన వసతి ఏర్పాటు చేశారు వేమయ ప్రభువు.    అనేక సంవత్సరముల బోధనానుభవము, అనేకానేక కావ్యములు తన విద్యార్ధులకు, అరటిపండి వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పగల సామర్ధ్యము..  సూరనార్యునికీ పఠనము మంచినీరు త్రావినంత సులువు.    వయసు మీరిననూ కంఠంలోని ఝుంకారము తగ్గలేదు ఆచార్యునికి.    కంచు కంఠంతో.. వినాయక ప్రార్ధన చేసి ప్రారంభించారు సూరనార్యుడు.. ఎర్రాప్రగడ విరచిత హరివంశ ప్రబంధములోని కొన్ని ఘట్టములను మాత్రమే చెప్పదలచారు.    "అన్ని ఘట్టములనూ వివరిస్తే మరి కావ్యము చదివే వారు ఉండరు. ఈ కావ్యమునకు అనేక నకళ్లు తయారవాలి.. తెలుగు వచ్చిన వారందరునూ ఒక ప్రతిని స్వంతం చేసుకోవాలి.. యుగయుగములకూ ఈ కావ్యము ప్రయాణము చేసి చిర స్థాయిగా నిలవాలి.    అందువలననే కొద్దిగా రుచి మాత్రమే చూపుతాము.. ఆ అమృత ధారని ఆస్వాదించుట మొదలిడితే ఆగుటయే ఉండదు. అందరూ తలకొక ప్రతినీ తీసుకుని వెళతారు. నా ఆశయము నెరవేరినట్లె.."    ప్రోలయ వేమారెడ్డి ప్రభువు నిండు పేరోలగములో చేసిన ప్రకటనకి సభ అంతయూ నవ్వులతో నిండి పోయింది.    ఆ ఆహ్లాద వాతావరణంలో, సూది కింద పడితే వినిపించేటంతటి నిశ్శబ్దముగా నున్న ఆ సభలో కంఠం సవరించుకున్నారు సూరనార్యుడు.    "హరివంశం భారతమునకు పరిశిష్టము.. అనగా శేషము.    హరివంశము లేని భారతము అసంపూర్ణము.    ఆదిపర్వమునుండీ స్వర్గారోహణ పర్వము వరకూ ఉన్నది భారతమైతే, హరివంశము కలిసినది మహాభారతము.    అందుకే.. హరివంశం కూడా వివరిస్తేనే భారతాన్ని పూర్తిచేసిన ఫలితము దక్కుతుంది.    ఈ గ్రంధం భారతమంతా ప్రాముఖ్యమైనది.. ప్రశస్తమైనది.    ఎర్రయప్రగడ హరివంశాన్ని రెండు భాగములుగా రచించారు.. పర్వాలుగా విభజించ లేదు.    పూర్వభాగము మొదటిది. ఉత్తరభాగము రెండవది.    పూర్వభాగంలో తొమ్మిది ఆశ్వాసాలలో రెండువేల నలభై నాలుగు, ఉత్తరభాగంలో పది ఆశ్వాసాలలో రెండువేల ఆరువందల అరవై ఆరు గద్య పద్యాలున్నాయి.    సంస్కృత హరివంశం మూల కావ్యంలో ఉన్న కథలన్నిటినీ వ్రాశారు. విస్తారంగా, వివరంగా, విపులంగా ఉంది ఎర్రన హరివంశం. ఇది మరీమరీ వినాలనిపించే పురాణం.    పూర్వభాగంలో నున్న కొన్ని కథలు మరలా ఉత్తరభాగంలో వ్రాశారు. కొన్ని విష్ణుమూర్తి అవతారాలు రెండు భాగాలలోనూ చెప్పారు.    ఒక్క వామనావతారమే రెండువందల ఎనభైమూడు పద్యాలు ఉంది."    సూరన కన్నకొడుకుని మన్ననతో సంబోధించుట కొందరు మామూలు ప్రేక్షకులకు విడ్డూరంగా అనిపించింది.    సూక్ష్మగ్రాహి అయిన సూరన సభలో కలకలమునకు స్పందించి వివరణ ఇచ్చారు.    "ఒకరి కావ్యమును.. రచనను గురించి చెప్పేటప్పుడు ఆ కవిని సరస్వతీ రూపుని వలే భావించాలి. అతడు కన్న కుమారుడైననూ సరే గౌరముగా చూడాలి."    పండితులందరూ అవునన్నట్లు తలలనూపి సూరనార్యుని మెచ్చుకోలుగా చూశారు.    "ఉత్తర భాగంలో ఎనిమిదవ ఆశ్వాసంతోనే హరివంశం అయిపోతుంది. ఉషా పరిణయం, వరుణుడితో రణం అయాక, శ్రీకృష్ణుడు ఇంద్రాది దేవతలతో ద్వారకకు రావడంతో కథ సమాప్తమవుతుంది. వైశంపాయనుడు ఫలశ్రుతి కూడా చెప్పేస్తాడు.    మిగిలిన రెండు ఆశ్వాసాలు జనమేజయుని సంతానం గురించి చెప్తారు.    వేదవ్యాసుడు, జనమే జయునికి భవిష్యత్తు గురించి చెప్పడం, జనమేజయుడు అశ్వమేధం చెయ్యడం ఉన్నాయి ఆ చివరి ఆశ్వాసాలలో.    పూర్వ భాగంలో సంక్షిప్తంగా చెప్పిన అవతారాలని, వేదవ్యాసుడు జనమే జయుని కోరికపై, విస్తృతంగా చెప్తాడు.    చివరగా మహా భారతాన్ని.. అంటే ఆదిపర్వం నుంచి హరివంశం దాక, నూరుపర్వాలని వింటే ఏ ఫలితాలు వస్తాయో వివరిస్తారు.    హరివంశము భక్తితో విని, విన్నాక సరసఘృత శర్కరాయుత పరమాన్నములు, భక్ష్యపానములతో పరితుష్టులవాలని అంటారు ఎర్రన.    కానీ హరివంశమే తేటతేట తియ్యని పదాలతో నోరుని అనుక్షణం తడుపుతూ ఉంటుంది. ఆ కావ్య పఠనమే లేదా శ్రవణమే చాలు.. నోరు తియ్యనగుటకు..    ఇంక పంచభక్ష్య పరమాన్నములతో పని ఏమి?"    సూరనార్యుని గంభీర కంఠస్వరమే వీనులలో అమృత ధారలొలికిస్తోంది. ఇంటిలోనికి అతిథులు రాగానే నోరు తియ్యన చేసిన ఇల్లాలి ఆదరణ పూర్వకమైన పలకరింపు తలపుకొచ్చింది సభాసదులకి ఆ ఉపోద్ఘాతము వినినంతనే.                                        .....మంథా భానుమతి

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 20 వ భాగం

  “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 20 వ భాగం   ఎర్రాప్రగడ, తనకి అరణ్యపర్వ రచనలో దొరకని అవకాశం, తదుపరి రచన నృసింహ పురాణంలో పుష్కలంగా వాడుకున్నారు. అదే... పీఠిక.    “అహోబలేశు డతిలోకుడు లోకము కాంచు గావుతన్" అంటూ అహోబల నరసింహుని మహిమను పొగడుటకై తానీ కావ్యమును వ్రాస్తూ, ఇష్ట దేవతా ప్రార్ధన తో కావ్యమారంభించాడు.    అదే విధంగా దేవతలను స్తుతిస్తూ భారతీదేవిని, “భాసురమగు మౌక్తికంపు జపసూత్రము దాల్చుట బ్రహ్మవాదియై” అంటూ చిత్రంగా సన్యాసిని రూపంలో తలచారు.    సరస్వతీదేవి రూపంలో గురువైన శంకరస్వామి గోచరించి ఉండాలి ఆ సమయంలో. అందుకే ఆవిడ జపమాల ధరించింది.    తండ్రికంటెనూ గురువుగారి ప్రమేయం ఎర్రాప్రగడ జీవితంలో అధికం.    “శ్రీ శంకరస్వామి సంయమీశ్వర చరణసరోరుహ ధ్యానంద సౌందర్య ధుర్యుడ” నని చెప్పుకున్నారు ఎర్రన తన గద్యములలో. శ్రీశైల పర్వత ప్రాంతాల శంకరస్వామి వేదోద్ధరణ కార్యములు చేపట్టారు. ఎర్రనగారికి శంభుదాసుడను బిరుదు గురువుగారే ఇచ్చారు.    కావ్యరసము గ్రోలిన మానవకోటికి పశుసమానత మాన్పిన, రాఘవుని కథ చెప్పిన, మునీశ్వరులలో నాతనికి ఎవరూ సాటిలేని వాల్మీకి మహర్షిని కొలిచారు.    ఆదిమపండితుడు, అచ్యుతుడు, వేదములను మానవాళికి ఒసగినవాడు.. పరాశరుని పుత్రుడు అయిన వ్యాసమునిని కొలిచారు.    తన ప్రధమ కావ్యమునకు స్ఫూర్తినిచ్చి, కవిత్రయములో చోటిచ్చిన వారినీ విధంగా స్తుతించారు.    “భాసుర భారతార్ధముల భంగులు నిక్క మెరుంగ నేరమిన్     గాసట బీసటే చదివి గాధలు ద్రవ్వు దెనుంగు వారికిన్     వ్యాసముని ప్రణీత పరమార్ధము తెల్లగ జేసినట్టి య     బ్జాసనకల్పులం దలతు నాద్యులు నన్నయ తిక్కనాదులన్.”    నిత్య శివరాత్రి వ్రతము జేయు గురువు శంకరస్వామి మునీంద్రుని ఆశ్రయిస్తూ ఈ కథ చెపుతానన్నారు.    ఆ పిదప తన వంశ చరిత్రను తెలిపారు.    తాతగారు పేరింటిగాడైన తనను ఎంత ప్రేమగా చూసినదీ, ధ్యానమున తనకి కానిపించి నరసింహుని గాధను రచించమని కోరినదీ చెప్పారు.    చివరగా.. అహోబిల నారసింహునికిన్..    పదునొకండు కంద పద్యములలో అహోబిల నారసింహుని మీద షష్ఠ్యంతములు వ్రాసి, కావ్యరచనలోనికి ప్రవేశించారు.    పురాణమే అయిననూ ఇందులో సమకాలీన విషయాలు జొప్పించి, ఆ నాటి కాలమాన పరిస్థితులను తెలియజేశారు.    వైకుంఠంలో విష్ణుమూర్తిని కొలవడానికి వచ్చిన వాళ్ళను ఫణిహారులు ఎదురేగి సర్ది కూర్చోపెడుతున్నారు.    “హస్తులై ఫణిహారు లందంద నిలువ నధికమై యొప్పె సమ్మర్ధమాదిదేవు..”    నృసింహపురాణ కావ్యం చిన్నదే.. కానీ చిన్నికృష్ణుని బుల్లి నోటిలో అండపిండ బ్రహ్మాండం దాచినట్లు.. భావం అనంతం. కవిత్వం హిమవన్నగం.    ప్రసిద్ధం “అహోబిలం”    ప్రహ్లాదవరద నారసింహుని నిలయం.    ప్రకృతి రమణీయం. ఆస్వామికి    ప్రణామం. ఆతని మహిమ అనన్యం.    శ్రీమహా విష్ణువు లోకసంచారానికి వెళ్ళాడు. సిరికూడా వెనువెంటే..    క్షీరసాగరమున స్వామికి శయ్యగా సేవ చేసుకుంటున్న ఆదిశేషువునకు విశ్రాంతి, కాసింత విరామం దొరికింది. నిశ్చలుడైన ఆయనకి విరామం చలనమే కదా!    చుట్టలు విప్పి విప్పి తోకమీద లేచి నలు ప్రక్కలా చూచాడు. పదునాలుగు లోకాలూ గోచరించాయి. ఎన్నెన్ని అందాలు..    ఆనందంలో ఒడలు విరిచి మెలికలు తిరిగిపోయాడు. సాగరమంతా అల్లకల్లోలమయిపోయింది. వేయిపడగలూ బుసలుకొట్టి విషాన్ని గ్రక్కబోయాయి.    ఆ విషమంతా బయటికి వస్తే.. పదునాలుగు లోకాలూ.. ఆ తలపే భయంకరం.    ఆదిశేషుడు అమ్మో అనుకుని, నాలుకలు కరచుకొని, తలలను కిందికి దించి, ముడుచుకుని ముడుచుకుని, కామరూపుడై మామూలు పాము అయిపోయాడు.    చరచర పాకుతూ సంద్రం బయటికి వచ్చి, జంబూద్వీపే భరతఖండే భరతవర్షే శ్రీశైలప్రదేశే పయనించాడు.    సకలలోకాల పైకీ లేచి వీక్షించి నపుడాయనకి ఆ ప్రాంత ప్రకృతి మానసోల్లాసాన్ని కలిగించింది.    మహోన్నత వృక్షాలన్నీ తీరుగా, తమకి ఎదురే లేదన్నట్లుగా గంభీరంగా నిలిచి ఉన్నాయి. తొణకక బెణకక ఊపిరి మరచి స్థిరంగా నిలిచి ఉన్నాయి. వానినల్లుకుని రంరంగుల పూలున్న తీవెలు, సుగంధ భరితములై కన్నులకింపై స్వాగతిస్తున్నాయి.    చల్లనిగాలికి తలలూపుతున్న కొమ్మలు ప్రకృతి మాత చీర చెరగు వలే వయ్యారాలు పోతున్నాయి.    నందన వనాన్ని మించిన అందాలతో ఉన్న అచ్చోటుని చూసి ఆదిశేషుడు పరవశించి పోయాడు.    క్షీరసాగరంలో కనుచూపుమేర ఏమీ కనిపించదు. సూర్యోదయ అస్తమయాల్లో తప్ప ఎప్పుడూ నీలి ఆకాశం, నీలి సంద్రం. ఎవరికైనా మార్పు స్వాగతమే కదా!    నెమ్మదిగా వృక్షాల మధ్య చోటు చూసుకుని పవళించాడు. శ్రీ మహావిష్ణువునకు తాను కావాలనుకుంటే అక్కడికే వస్తాడు.    అలాగే వచ్చాడు.. మరి ఏం చేస్తాడు! ఆదిదేవునికైననూ, ఎక్కడెక్కడ తిరిగినా, ఎన్ని పనులు చేసినా శయ్యా సుఖం అనివార్యం కదా! ..................... ప్రహ్లాదుడు హరినామస్మరణతోనే పుట్టి, హరినే ధ్యానిస్తూ, తండ్రి అరిని కొలువ వద్దని నయానా, భయానా ఎంత చెప్పిననూ వినకుండా విష్ణు ధ్యానంలో పడిపోయాడు.    తండ్రి అయిన హిరణ్యకశిపుడి ఎదురుగా స్తుతించ సాగాడు.    “విష్ణుమయము వేదంబులు     విష్ణుమయము వర్గ మఖిల విజ్ఞానములున్     విష్ణుమయము జగమంతయు     విష్ణుమయము విష్ణుడొకడ వేద్యుడు బుద్ధిన్.”    హిరణ్యకశిపుడు ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. ఏనుగుల చేత తొక్కించాడు. ఎత్తైన కొండ మీదినుంచి కిందికి విసిరివేయించాడు.. భార్య లీలావతి ఎంత వేడుకున్ననూ కరగలేదు ఆ కఠిన హృదయం.    సముద్రంలోకి పడవేయించాడు. హరి నామస్మరణ ఆ బాలుని కాపాడింది.    తన భక్తుని, బాల ప్రహ్లాదుని పెట్టు కష్టముల చూచి సహించలేని శ్రీ మహావిష్ణువు, స్తంభము లోనుండి వచ్చి, నరహరి రూపుడై అహోబిలం వద్ద హిరణ్యకశిపుడిని ఉదరము  చీల్చి సంహరించాడు. అలసి సొలసిన ఆది విష్ణువు పవళించదలచాడు.    పవళించిన ఆదిశేషుడిని చూసి అహోబిలం వద్ద.. లక్ష్మీ సమేతుడై నారసింహుడు ఆతని నడుముపై స్థిర నివాసమేర్పరచుకున్నాడు. తిరుమల కొండల వద్ద పడగలపై శ్రీనివాసుడు.. శ్రీ శైలము దగ్గర వాలముపై మల్లిఖార్జునుడు వెలిశారు.    లక్ష్మీ నరసింహుని పద సరోజములు కడిగే పాద్యంగా దివినుండి గంగ భు వికి దిగి వచ్చింది., భవనాశిని అనే నామముతో.    “అమ్మహానది కొలు గైకొనియె నా దేవుండు భవనాశినీ సమాహ్వయం బని యభినందించె.”    వాగులతో, ఏరులతో, కొలనులతో    వానిలోని కలహంసలతో,    వటవృక్షములతో వాని మీది తీవెలతో    వాలుకొమ్మలమీద వాలిన పికములతో    వాలముల ఝాడించి కొమ్మలమీద గెంతు    వానరములు వెట్టు కిచకిచలతో    వన్య మృగములు కూడ భక్తితో నడయాడు    వనమదే అహోబలేశు వాసము.    నారసింహుని నుతిస్తూ కొండనెక్కుతున్నారు అద్దంకినుండి తరలి వెళ్ళిన ప్రోలయ వేమారెడ్డి, ఆయన కొలువులోని ప్రముఖులు.    అహోబల నారసింహునికి అంకితమిచ్చుటకు ‘నృసింహపురాణ కావ్యమును’ పట్టుబట్టల చుట్టి, కదంబ మాలతో అలంకరించి తన కుటుంబముతో సహా ఉన్నాడు ఆ ప్రముఖులలోనే ఎర్రాప్రగడ.    నృసింహపురాణమను కావ్యమును పూర్తి చేసితినని చెప్పి, కొన్ని పద్యములు వినిపించాడు ఎర్రన, వేమారెడ్డి సాహిత్య సభలో.    షష్ఠ్యంతములలో అహోబల నారసింహుని నుతించాడు కనుక కృతి కర్త నారసింహుడే.    కావ్యమును చదివిన వేమారెడ్డి ప్రభువు, తన యాస్థానకవి అంతటి ఉద్గ్రంధమును రచించినందున అందరూ కలిసి అహోబిలమునకు వెడలి, ఆ స్వామిని దర్శించి అంకిత మివ్వాలని ఆదేశించాడు.    కాలినడకన ఆ కొండలలో దుర్గమమైన దారిలో, నరసింహ స్తోత్రములు చదువుతూ, ప్రహ్లాదుని చరితమును చెప్పుకుంటూ కొండ ఎక్కి.. నరహరికి పూజలు చేసి.. అంగరంగ వైభవముగా కృతి సమర్పణ చేశారు.    ఆ సమయమున ఎర్రన, రాజునకు రామాయణ కావ్యమును రచించి ఇస్తానని వాగ్దానము చేశాడు.                         ………………….                                  16    ప్రోలయ వేమారెడ్డి బహు సంతుష్టుడై ఉన్నాడు.    కాకతీయ సామ్రాజ్యములో నాయంకరుడిగా నుండి, కప్పము కడుతూ.. యుద్ధములలో పదాతి దళమునూ, తురగ సైన్యమునూ, గజ బలమునూ పోగొట్టుకుని దిన దినమూ భయంతో బ్రతికిన తానూ, తన ప్రజలూ తురుష్కులను గెరిల్లా యుద్ధము చేసి ఓరుగల్లు వరకూ తరిమి కొట్టిన తరువాత స్వతంత్ర రాజ్యమును స్థాపించి ఎనిమిది సంవత్సరములయింది.    ఈ అష్ట వర్షములలో ఎంతో ప్రగతిని సాధించాడు.    గ్రామ గ్రామములో చెరువులు తవ్వించాడు. చెట్లు నాటించాడు.    పాకనాడులో నున్న అడవులను రక్షింప బూనుకున్నాడు.    వంట చెరకుకు కట్టెలు కొడితే.. ఒక చెట్టుకు పది చెట్ల చొప్పున నాటి వాటి సంరక్షణ కూడా వారే తీసుకునేట్లు శాసనం చేశాడు.    అక్షర యజ్ఞం మొదలుపెట్టాడు. ఐదు సంవత్సరముల బాలబాలికలందరూ అక్షరాభ్యాసం చేసుకుని పాఠశాలలకు వెళ్ళాలి.    కనీసం కోమటి లెక్కలు వచ్చే వరకైననూ గణితం అభ్యసించాలి.    వ్యవసాయం వర్తకం.. రెండూ బాగుగా అభివృద్ధి చెందాయి.    పెక్కు దాన ధర్మములు కూడా చేశాడు.    ఆస్థాన కవి ఎర్రాప్రగడ, ప్రోలయ వేముని దాన ధర్మములను ఆశువుగా వర్ణించి తదుపరి కావ్యము హరివంశములో భద్ర పరచాడు.    “అగ్రహారములు విద్యా తపో వృద్ధ విప్రులకిచ్చి యజ్ఞకర్తలుగ బనిచె    గొమరార జెరువులు గుళ్లు ప్రతిష్ఠించి లోకసంభావ్యంబులుగ నొనర్చ    నిధులు నల్లిండ్లును నిలిపె దోటలు సత్రములు చలిపందిళ్లు వెలయబెట్టె    హేమాద్రిపరికీర్తి తామిత వ్రతదాన నివహంబులన్నియు నిర్వహించె           జేసె జేయుచు నున్నాడు సేయనున్న           వాడు పునరుక్త కృతి శుభావలుల నెల్ల           ననగ శ్రీవేమ విభునకు నలరు పేర్మి           వశమె వర్ణింప దద్‍భాగ్య వైభవంబు.”    రాజ్యం సుభిక్షంగా ఉంది. రామరాజ్యంలో వలె సకాలంలో వానలు కురుస్తున్నాయి. కరవు కాటకాలు దరిచేరడం లేదు.    యువతీ యువకులనేకమందికి వివాహములొనర్చి, వారికి ఇండ్లు కట్టించి ఉపాధి కలిపించి నల్లిండ్లు నిలిపారు వేమయ ప్రభువు.    అంతా ఆ నారసింహుని, మల్లిఖార్జునుని కృప అనుకున్నాడు వేమారెడ్డి.    రెడ్డి ప్రభువు దైవభక్తి ఎన్నదగినది.    కొండంత దేవునికి గోరంత పత్రిని ఇవ్వదలచాడు.    అహోబిలంలో, శ్రీశైలంలో సోపానములు కట్టించడానికి నిశ్చయించాడు.    ఈ వార్త విన్న ప్రజలలో సంతోషించని వారు లేరు. శైవులకీ, వైష్ణవులకీ కూడా నోట తేనె త్రావించిన చందమయింది.    ఇష్ట దైవమును సులభముగా చేరుకొన గలుగుట ఒక ఎత్తైతే.. దారి సుగమం చెయ్యడానికీ, మెట్లు కట్టడానికీ, వందలమందికి ఉపాధి దొరుకుతుంది.    కొండవీటి కోట పని పూర్తి కావచ్చింది.    అహోబిలంలో, శ్రీశైలంలో పనులు మొదలయ్యాయి.    ఎర్రాప్రగడ రామాయణ రచనకి కూర్చున్నాడు.    ఒక్కసారి ఆలోచించి పని చెప్పాలే కానీ ఆ గంటం ఆగదు. అందునా ఒక ఒరవడికి అలవాటు పడిపోయిన చేయి అది.    శంభుదాస బిరుదాంకితుడు..    శివభక్తుడు. అనునిత్యం శివాభిషేకం చేసే సూరనార్యుని కుమారుడు. శంకరస్వామి శిష్యుడు. ఏమైననూ.. ఏది జరిగిననూ ఈశ్వరకృప వలననే అని నమ్మినవాడు ఎర్రనార్యుడు.    కానీ అతడి కావ్యాలన్నీ విష్ణు సంబధితాలే!    అందుకు తాతగారు నూరిపోసిన హరిహరాద్వైత సిద్ధాంతం కొంత కారణమైతే.. ఆ శివుడే తన చేత వ్రాయిస్తున్నాడన్న ఎర్రన నమ్మకం మరింత దోహదం చేసింది.    మహాభారత అరణ్యపర్వ భాగంలోనే, రామాయణం మూడువందల పదకొండు గద్యపద్యాలు వ్రాశారు. తన భావాలకు అనుగుణంగా మూల రచనలో కొన్ని మార్పులు చేశారు. ఇది అరణ్యపర్వం లోనున్న రామాయణంలోనే కనిపిస్తుంది.    వాల్మీకి రామాయణంలో రావణుడు, ఇంద్రజిత్తును పిలిచి రామ లక్ష్మణులను సంహరించి రమ్మని చెప్పి నపుడు.. రావణుడు ఇంద్రజిత్తుని పొగడుతాడు. అతని పరాక్రమాన్ని మెచ్చుకుంటాడు.    ఎర్రనగారు మాత్రం ఇంద్రజిత్తు తండ్రిని ఊరడిస్తున్నట్లు వ్రాశారు.    “క్రోతులను కొండ మ్రుచ్చులను చీల్చి చెండాడుతాను. దిఙ్ము ఖుండనై విజృంభిస్తాను. వీర నృత్యము ఆడుతాను. రయంబున బార్ధివ సూనులిద్దరం గ్రీడయపోలె గిట్టి పెడకేళ్ళొగి గట్టెద బట్టి తెచ్చెదన్.”    తండ్రి కొడుకుని పిలిచి తన్ను ఆదుకొమ్మని అడిగినప్పుడు, నీవు నాకు అప్పజెప్పిన పని చేస్తాను అని ఊరడించడం ఎంతో ఉచిత మైన పని.    తెలుగు వారి ఇళ్లల్లో తల్లిదండ్రులు పిల్లలను పొగడుట, మెచ్చుకొనుట ఉండదు. వారికి దిష్టి అనీ, ఆయుక్షీణం అనీ ఒక నమ్మకం.    తెలుగువారి మనోభావాలను, సాంప్రదాయాలను సున్నితంగా తెలియజెప్పారు ఎర్రన.    ఇతర రామాయణాలలో.. ఎంతో ఉదాత్తమైన రాముడి పాత్ర ఒక ఘట్టంలో దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది. ఆక్షణంలో రామ భక్తులకు కూడా కోపం వస్తుంది.    సీతమ్మ అగ్నిప్రవేశానికి ముందు రాముడు చాలా నిర్దయగా మాటలాడుతాడు. అగ్నిప్రరీక్ష అయ్యాక, అందరూ సీతమ్మ శీలాన్ని పొగుడుతే అప్పుడు తేరుకుని అర్ధాంగితో ప్రసన్నంగా పలుకుతాడు. అయితే ఎర్రనగారు మాత్రం, ఆ కఠిన పరీక్షకు కారణం రాముడి చేతనే అగ్నిహోత్రునకు చెప్పిస్తాడు.    “దశానను నంతిపురము నందు పెక్కు దినంబులున్న జనకాత్మజను శోధన చేయక అనార్య విహిత వృత్తిని రఘురాముడు తెచ్చాడని అవని జనంబులెల్లరు ఎంచరా?    భువనములెల్ల నమ్ముటకుబో యిటు చేసితి హవ్య వాహనా.”    ఈ విధంగా రాముడు చెప్పుకుంటే అయ్యో పాపం.. అనిపించదా! అప్పుడా రాముని పాత్రలో ఔచిత్యం కనిపించకుండా ఉంటుందా!    రాముడు తన మనస్సులో సీత పునీత అని నమ్ముతున్నట్లు ఎర్రయగారు వ్రాశారు. నిప్పువంటి మహనీయ చరిత్ర గలది అని రాముడన్నట్లు చెప్పారు.    చదువరికి హృదయానంద కరంగా అనువాద రచనల్లో మార్పులు చెయ్యడం విజ్ఞుల అభిరుచికి నిదర్శనం.    రమణీయమైన రామాయణకావ్యాన్ని అనుకున్న సమయంలోగానే పూర్తి చేశారు ఎర్రాప్రగడ.    ఎర్రాప్రగడగారి ఇంట కోలాహలంగా ఉంది.    ఇంటిలోని వారందరినీ రాజుగారి సభకి తీసుకుని వెళ్తున్నారు ఎర్రన.    ఆ రోజు రామాయణ మహా కావ్యాన్ని వేమారెడ్డి ప్రభువునకు అంకిత మిచ్చే మహోత్సవం.    ప్రభువు, కవీ కూడా ఎన్నినాళ్ళుగనో ఎదురు చూసిన పవిత్రమైన రోజు. కృతి కర్తకీ, కృతి భర్తకీ.. వారి జన్మ నక్షత్రాలకి అనుకూలంగా కుదిరే లాగున ముహుర్తం పెట్టారు సూరనార్యుడు.    ఎర్రాప్రగడగారి గృహము మాత్రమే కాదు..    ఊరు ఊరంతా కొలువుకి తరలి వెళ్ళడానికి తయారవుతున్నారు. ఇల్లు కదలని స్త్రీలకి అదొక అపూర్వ అవకాశము.    ప్రతి దినమూ ధరించే నగలతో తృప్తి లేదు..    చోరుల కందకుండా నేల మాళిగలలో దాచిన కాసులపేర్లు, వడ్డాణాలు బయటికి వచ్చాయి.    పట్టు వస్త్రములు ధరించి, ముక్కుకున్న నత్తులు మెరుస్తుండగా, చంద్రహారాలు, కంటె, అడ్డిక.. అన్ని రకముల నగలూ ధరించి ఆడవారు హడావుడిగా తిరిగేస్తున్నారు.    "అయ్యయ్యో!" ఎర్రనగారి పడక గృహమునుండి విన వచ్చిందొక కేక.    పోతమాంబ వడివడిగా అడుగులు వేస్తూ పరుగిడింది. తండ్రీ కొడుకులు దగ్గరుండి అలంకరించిన, ఏనుగునూ బళ్లనీ తీసుకొని వచ్చుటకు వెళ్ళారు. ఆలస్యం కుదరదు సూరనార్యునికి.    "ఏమిటి తల్లీ! ఏమయింది?" పోతమాంబ ఆదుర్దాగా అడిగింది కోడలిని.    "ఈ పచ్చలపతకం, చంద్రహారం, ముత్యాల హారం చిక్కుపడిపోయాయి. ఎంత ప్రయత్నించిననూ చిక్కులు వదలుట లేదు" కోడలు నిస్సహాయంగా చూస్తూ అంది.    అత్తాకోడళ్ళిద్దరూ కలిసి, జాగ్రత్తగా చిక్కుముళ్లని విప్పారు.    రాణీగారి ప్రక్కన కూర్చుని వేడుక చూడాలి మరి.. తీరుగా లేకపోతే ఎలా! .....మంథా భానుమతి

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 19 వ భాగం

    “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 19 వ భాగం అద్దంకి పట్టణం..    ప్రోలయ వేమారెడ్డి ప్రభువు సాహిత్య సభ..    ఎర్రాప్రగడ మహాభారత కావ్యాన్ని సంపూర్ణంగా తయారు చేసి తీసుకుని వచ్చాడు.    సభలో తను వ్రాసిన అరణ్యపర్వ శేషంలోని కొంత భాగాన్నివివరించి కొన్ని పద్యాలను చదివి వినిపించాడు. కవుల సమావేశం అది. అక్కడున్న వారి పాండిత్యం సర్వజనామోదం. వారి విద్వత్తుకి దీటుగా ఉండాలి తాను ఎంచుకున్న భాగము.    అందులకే ’యక్షప్రశ్నలు’ ఘట్టాన్ని ఎన్నుకున్నాడు. ధర్మరాజు సమయస్ఫూర్తి, తెలివి, సోదర ప్రేమ అందులో ప్రతిబింబిస్తాయి.    ఎర్రన చెప్పసాగాడు..    "ధర్మరాజు ధార్మికత అందరూ ఎరిగినదే. అతడికి తమ్ముల ఎడ ఎంతటి ప్రేమ ఉందో అందరికీ ఎరికే.    ఒక రోజు దాహార్తుడై తమ్ముడు నకులుడిని పంపుతే, అతడొక జలాశయములో దిగి, ఆ జలాశాయము తనదనీ, ఆ నీటిని త్రాగ వలదనీ వారిస్తున్న యక్షుని మాటలను పెడచెవిని పెట్టి, దోసిట పట్టి నీటిని తాగి అశువులు బాస్తాడు.    ఒకరిని వెతుకుతూ ఇంకొకకరు.. అందరూ అట్లే, యక్షుని మాట వినక ఆ జలమును త్రావి నలువురు తమ్ములూ ప్రాణాలు కోల్పోతారు.    తమ్ముళ్ళ జాడ తెలియక, వెదకుతూ జలాశయం వద్దకు వచ్చిన ధర్మజుడు, అసువులు బాసి అవనిపై పడి ఉన్న తమ్ముళ్ళను చూశాడు.         వారిని ఆ అచేతన స్థితిలో చూసిన ధర్మరాజు గట్టిగా విలపిస్తాడు. పేరు పేరునా ఒక్కొక్కరినీ పిలుస్తూ రోదిస్తాడు.    "కుమారా! తమ్ముళ్ళతో కలిసి కానలకేగిన నీవు ఒక్కడివే వచ్చావు.. అనుజులేరి.." అని తల్లి అడుగుతే ఏమి చెప్పవలయును, ఏమని ఊరడించగలను.. అంటూ విలపిస్తాడు ధర్మజుడు..    మా తల్లి, ఆ పాండు మహిషి, ‘.. ఇప్పుడయ్యనుజులెందు      జనిరి నీవొక్కండ చనుదెంచి తిది యేమి’    యనిన నాయమతోడ నకట యేమి యనగ నేర్చువాడ..”    ఇది "యక్ష ప్రశ్నలు" ఘట్టము లోని ఒక సంఘటనము. ఎర్రాప్రగడ పద్యం వినిపించి, వివరణ పూర్తి చేసి సభలోని వారందరినీ పరికించాడు, కుతూహలంతో.    మరికొన్ని, మరి కొన్ని.. శ్రోతల వీనులకు ఎంత విన్ననూ తృప్తి లేదు..    తేట తెలుగులో వ్రాసిన ఆంధ్ర మహా భారతములోని ఎర్రాప్రగడ విరచితమైన పద్యాలలోని అందాలను ఆస్వాదించిన పెద్దలు మనస్ఫూర్తిగా అభినందించారు.    తన భాగముకూడా నన్నయగారు వ్రాసినట్లుగనే వ్రాసి, రాజరాజ నరేంద్రునకే అంకితమిచ్చానన్నాడు ఎర్రన. అది ఆదికవికి తాను అందించిన కృతజ్ఞతాంజలి అని చెప్పాడు.    ప్రభువులకు, కావ్యములో నొక భాగము కాక, ఒక కావ్యమే రచించి ఇవ్వాలని ఉంది అని కూడా చెప్పాడు.    “కవి వర్యా! మీరు అద్దంకి వచ్చి, మా సమక్షంలో కొత్త కావ్యం రచించాలి. అందులకు అన్ని ఏర్పాట్లు చేసెదము. మిమ్ములను మా ఆస్థాన కవిగా ఆహ్వానిస్తున్నాము" ప్రోలయ వేమారెడ్డి ఎర్రాప్రగడని కోరాడు.    ఆంధ్ర భారతము ప్రతులు వ్రాయుటకు కొందరిని కోరి, సంతృప్తుడై చదలవాడకు పయనమయ్యాడు ఎర్రాప్రగడ.                        ………………….                              15    "మరల మార్పా?" పోతమాంబ ఉదాసీనంగా అంది.    ఇంక ఇల్లు కదలి తరలుటకు తనువంగీకరించుట లేదు.    తల నిలువుగా ఊపాడు ఎర్రన.    "అవునమ్మా! వేమారెడ్డి ప్రభువులు అద్దంకి వచ్చెయ్యమన్నారు. అక్కడ సకల సౌకర్యములు కల్పించెదమన్నారు."    "అవునవును.. ఎర్రనని ఆస్థాన కవిగా ఆహ్వానించారు ప్రోలయ వేమారెడ్డి. కొండవీడులో కోట నిర్మాణం జరుగుతోంది. త్వరలో రాజధాని అక్కడికి మారుతుంది. ఈ సమయంలో కొంత రాజ్య పాలనలో కూడ సలహాలు కావాలి. నాకునూ చెప్పారు" సూరనార్యుడు భార్యతో అన్నాడు.    “రెడ్డిరాజు కట్టడాలకు ప్రణాలికలు బాగుగా వేస్తున్నాడు. శ్రీశైలములో పాతాళగంగనుండి ఆలయమునకు, అహోబిలములోనూ సోపానములు నిర్మించవలేనని రాజుగారి ఆకాంక్ష. జన సామాన్యము భయం వదలి, భక్తి అలవరచుకుంటున్నారు. ఈ సమయమున రాజుగారికి చేయూత నిచ్చుట మన కర్తవ్యము" ఎర్రన తల్లికి, భార్యకు వివరిస్తున్నాడు.    కాకతీయ సామ్రాజ్య పతనం అయ్యాక, వేమారెడ్డి ఇతర నాయంకరులతో కలిసి హిందూ రాజ్య స్థాపన చేస్తున్నపుడు సూరనాదులు పరిపాలన చూసుకునేవారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగించుకోవాలని.. అందులకు వారు రాజధానిలో ఉంటే వెసులుబాటుగా ఉంటుందనీ.. రాజు వేమారెడ్డి, తండ్రీ కొడుకులను అద్దంకి వచ్చెయ్యమని కోరారు.    కోరికే కానీ.. అది ఆనతికి సమమే కదా!    “మరి ఇక్కడ ఇల్లు.. పాడి పంటలూ.."    "అక్కడ ఇంకా పెద్ద ఇల్లు.. ఎక్కువ సౌకర్యాలు, రాజభటుల సేవలు.. మడి మాన్యాలు ఉంటాయి. ఇంక చుట్టాలు పక్కాలు మాటా.. ఇక్కడా ఎవరూ లేరు, అక్కడా ఎవరూ ఉండరు. దాయాదు లంతా వేగినాడులోనే ఉండిపోయారు కద.. పయనానికి సిద్ధం అవుదామా మరి.." ఎర్రన తల్లిని ఊరడించాడు.    నిజమే ఎక్కడయితేనేం.. ఇంట్లో పనిపాటలు చేసుకునేవారికి..    రాజాస్థానం.. రాజ గౌరవం. ఇంకేం కావాలి!    "అద్దంకిలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చి అభిషేకం చేసుకున్నాడట. అక్కడ కూడా గుండ్లకమ్మ నది ఊరిని పావనం చేస్తోంది." సూరన్న అద్దంకి వెళ్ళినప్పుడల్లా ఆ స్వామిని దర్శించుకోకుండా రాడు.    ప్రతి దినమూ అభిషేకం చేసుకునే అవకాశం వచ్చింది.    ఆ రామలింగేశ్వరుడే అనుగ్రహించాడు.                            ……………..    అద్దంకి..    ప్రోలయ వేమారెడ్డి ప్రభువు రాజ్యానికి రాజధాని.    వలస వెళ్ళుట అలవాటైపోయింది సూరన కుటుంబానికి. ఇంటనున్న వస్తువులన్నింటినీ బండ్ల మీదికి ఎక్కించి, తరలి వెళ్ళారు. రాజుగారు సేవకులను, రాజభటులను పంపారు.. తన ఆస్థాన కవి కుటుంబానికి సాయముగా!    అక్కడికి వెళ్ళాక తెలిసింది ఎర్రనాదులకి, రాజధానిలో నివాసమునకు, ఇతర పల్లెలో నివాసమునకు భేదము.    గుడ్లూరులో కానీ, చదలవాడలో కానీ జీవనము నిదానము.    వీధులన్నీ నిదురవోతున్నట్లుంటాయి. అప్పుడూ అప్పుడూ వినపడే ఎడ్లబళ్ల గంటలు తప్ప ఇంకేమీ ఉండదు.. పక్షుల కిలకిలా రావాలు అదనం.    ఏదయినా పంటపొలాల మీది పనులను బట్టి ఉంటుంది దిన చర్య.    నాట్లు, ఏరువాక, కోతలు, ఊడుపులు.. సంతకి పంట తోలుకెళ్ళడం..    ఆ పనులను బట్టి పూజలు, వ్రతాలు, అభిషేకాలు.. అక్షరాభ్యాసాలు, వివాహాది శుభకార్యాలు. చదువు నేర్చే వారు కూడా తక్కువే.    అద్దంకిలో జీవనము రాజుగారి రాకపోకలమీద ఆధారపడి ఉంటుంది.    రాజ్యపరిపాలన.. సుంకములు వసూలు చెయ్యడం, వర్తకుల బేరసారాలు.    వీధుల్లో సందడి, కోలాహలము తెలతెలవారుతూనే మొదలు.    మల్లారెడ్డి ప్రభువు సోదరునివద్దకు వస్తే అదొక విశేషము. బళ్ళకొలదీ సుగంధ ద్రవ్యములు, చీనిచీనాంబరాలు, సువర్ణాభరణములు.. వజ్ర వైఢూర్యములు వీధుల వెంట వెళ్తుంటాయి.. బళ్ళముందు, వెనుక సైనికులు కవాతు చేస్తుండగా.    వ్యవసాయము కూడా ఉంటుంది కానీ, అది పట్టణమునకు దూరముగా.. నదినుండి కాలువలు, చెరువులు తవ్వి నీటి సదుపాయము చేశారు.    కొత్తగా కట్టే కొండవీటి కోటలోకూడా బావులు తవ్వి నీరు సమృద్ధిగా ఉండేలాగు చేస్తున్నారు. కోట, కొండ మీద ఉంటుంది కనుక బావులు చాలా లోతుగాఉంటాయి. చాలా పొడవాటి తాడు ఉంటే కానీ చేదకి నీరు అందదు.    కోట కట్టేటప్పుడు ఎంత నీరు ఉన్నా సరిపోదు. తోడుతూనే ఉండాలి పొడవాటి తాళ్ళతో.    అందుకే ఏదయినా సాగదీస్తుంటే.. “కొండవీటి చాంతాడులా" అనే నానుడి వచ్చింది.    అప్పుడప్పుడు ఎర్రనకూడా రాజుగారి వెంట వెళ్ళవలసి వస్తుంది.. కావ్యకథా కాలక్షేపానికి.    పాడిపంటలకి, గృహ వసతికి, అన్న వస్త్రాలకి లోటు లేకుండా వైభవముగా సాగిపోతోంది జీవనం, వేమారెడ్డి పాలనలో. ఇండ్లలో ఆడవారు వంటి నిండా నగలతో మహలక్ష్ముల్లా తిరుగుతున్నారు నట్టిళ్ళల్లో.    నెమ్మదిగా సూరనగారి కుటుంబంలో అందరూ కొత్త ఊరికి, కొత్త ఇంటికీ అలవాటుపడ్డారు.    ఇంక ఆస్థానకవి కావ్యరచన ప్రారంభించవలసిన సమయము ఆసన్నమయింది.    ఎర్రాప్రగడ మనములో అలజడి ఆరంభమయింది.    ప్రగాఢమైన కోరిక ఆ మనమున ఉదయించింది.    “ఎప్పుడో చిన్నతనమునుండీ వినయముతో నాలుగక్షరములు నేర్చుకొనబట్టి చాపల్యం కలిగింది.. రచన చేయకున్న మనసు నిలకడగా ఉండుట లేదు. ఏమియు తోచదు.. నోట నన్నమెక్కదు. కంటికి నిదుర రాదు" అనుకుంటూ దేవతార్చన అయ్యాక పూజా గృహమున అట్టే కూర్చున్నారు ఎర్రనగారు .    ఆద్యులు, మహాకవులు కావ్యరచన చేసి సంపాదించిన కీర్తి వంటిది తనకి కూడా రావాలను కాంక్షతో కన్నులు మూసి ధ్యానం లోనికి వెళ్ళిపోయాడు.    ఎదుట తాతగారు నిలిచినట్లనిపించింది. ఎప్పటిలాగ తనతో మాటలాడుచూ.. తనకి త్రోవ చూపించడానికి సిద్ధపడి వచ్చినట్లు మఠం వేసికొని కూర్చున్నారు.    “ఎర్రనా! నీవు కావ్యకర్తవై ప్రబంధపరమేశ్వరుడనే బిరుదు పొందావు. నన్నయ భట్టారకుని, తిక్కనకవీంద్రుల కెక్కిన భక్తి పెంపుతో అరణ్యపర్వశేషోన్నయం ఆంధ్రభాషలో సుజనుల మెప్పుపొందునట్లు చక్కగా నిర్వహించావు.    శంభుదాసుడను పేరుతో నీవు పరమేశ్వర భక్తుడవైనా నీకు గోవిందుని గుణాదరణ ఉంది. గురు భక్తి ఉంది. ధర్మశాస్త్ర కథా విస్తరవేదివి. వినయము కలవాడవు. తులలేని అనుభవం ఉన్నవాడివి.    నీకు సహజంగా ప్రబంధరచనా పాటవం అబ్బింది.    అహోబిల నరసింహస్వామి నా ఇష్ట దైవం. ఆతని వైభవం, అవతార మహిమ నీ మధురోక్తి గుంభనతో మనీషులు మెచ్చుకునేట్లు ప్రస్తుతించు."    ఈ మాటలు చెప్పి తాతగారు, ఎర్రపోతసూరి అంతర్ధానమైనారు.              ఎర్రన పరమానంద భరితుడై కనులు తెరిచాడు. తనువు పులకరించింది.    మనసు వికసించింది.    కర్తవ్యం స్ఫురించింది.    "ఇది ఈశ్వరానుశాసనం. నృసింహావతార సంస్తవ సరణిని ప్రబంధం రచిస్తాను" అని నిశ్చయించుకున్నాడా ప్రబంధ పరమేశ్వరుడు.                          ………………….    "నృసింహ పురాణం"    ఎర్రనగారి తొలి సంపూర్ణ ప్రబంధరచన..    బ్రహ్మాండాది పురాణముల నుండి కథను తీసుకున్నానని పీఠికలో వ్రాశారు ఎర్రన. బ్రహ్మాండ పురాణంలో ఈ కథ నిడివి చాలా చిన్నది. విష్ణుపురాణం కొంత ఆధారమయింది.    సంస్కృత నృసింహ పురాణానికీ ఎర్రనగారి పురాణానికీ చాలా భేదముంది. అందుకనే ఎర్రన పీఠికలో ఆ పేరు చెప్పలేదు.    చిన్న కథను తీసుకుని విపులమైన వర్ణనలతో నృసింహ పురాణం వ్రాశారు ఎర్రన. ప్రబంధ లక్షణములలో నది ఒకటి. కావ్యం వర్ణనాత్మకంగా ఉండాలి. వర్ణనల వల్లనే ఎర్రనగారి కావ్యాలకి ఆ పేరు, ఎర్రనకి ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదు వచ్చాయి.    కానీ అనువాద కావ్యానికి ప్రబంధమనే పేరు తగదని, అది స్వతంత్ర రచన అయుండాలని విజ్ఞులు, పండితులు చెప్పారు.    ఆ విధముగా చూస్తే ఎర్రనగారి కావ్యాలు నిజంగా ప్రబంధాలు కావు.    అయిన తిక్కనగారు కూడా తన పదిహేను పర్వాల భారతాన్ని ప్రబంధాల మాల అన్నారు. వారి తరువాతి కాలంలో ప్రబంధ లక్షణాలను నిర్వచించి ఉండవచ్చు.    ఏది ఏమైననూ..    మన ప్రబంధ పరమేశ్వరుని కావ్యము    మనము ప్రబంధమనే అనుకుందాము.    తాత ఎర్రన ఆదేశము ఈశ్వరుని అనుగ్రహము    అహోబలేశుని ఆశీర్వచనము, తెలుగు భాషకు మకుటాయమానము    ఆ నృసింహ పురాణము వాగ్దేవికి నీరాజనము.    ఎర్రాప్రగడవారి నృసింహ పురాణం, పోతనగారి భాగవతం వల్ల ప్రహ్లాదుడు తెలుగింటి పాపడయ్యాడు.    నరసింహావతారం ఆంధ్రులకు, ఆంధ్ర దేశానికి అత్యంత ఆదరణీయము.    స్త్రీలు ఇంటిపనులు చేసుకుంటూ సన్నగా రాగయుక్తంగా  ప్రహ్లాదుని విష్ణు స్తుతిని పాడుకుంటారు.    పోతనగారి ప్రశస్తమైన భాగవత పద్యాలకి స్ఫూర్తి ఎర్రనగారి పురాణం.    “కమలాక్షు నర్చించు కరములు కరములు        శ్రీనాధు వర్ణించు జిహ్వజిహ్వ    సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు         శేషశాయికి మ్రొక్కు శిరము శిరము    కుంభినీదవు జెప్పెడి గురువు గురువు        తండ్రి హరి జేరుమనియెడి తండ్రి తండ్రి”    ఈ విధంగా శ్రీహరిని ప్రార్ధించుటయే ప్రామాణికముగా చెప్పారు పోతన.    జగత్ప్రసిద్ధమయిన ఈ పద్యమునకు ఎర్రనగారి పద్యం భావ స్ఫూర్తినిచ్చినట్లుంది.    “హరి భక్తుల తపము తపము         హరి భక్తుల జపము జపము హరి భక్తుల భా     సురజన్మము భవసారము          హరి భక్తులు భువన పావనైక విహారుల్."    ఇదే విధంగా నిషేధరూపమైన ఈ పద్యం కూడా ఎర్రనగారు చెప్పారు.     “వాసుదేవుని పాద వనరుహంబుల భక్తి           తగదను తండ్రియు దండ్రి కాడు     వేద చోదితమైన విష్ణు ధర్మమునకు          గోపించు గురుడును గురుడు కాదు     భవ దుఃఖములు మాన్ప బ్రభువైన హరిసేవ          నెడలించు హితుడును హితుడు కాడు     పరయోగ మతమగు వైష్ణవ జ్ఞానంబు         వదలిన చదువును జదువు గాదు     కేశవాకార లీలలు గీలుకొని ముదంబు         బొందని తలపును దలపుగాదు     మాధవస్తోత్ర ఘన సుధా మధుర రుచుల-          జిలుకకుండెడు జిహ్వ జిహ్వ గాదు."    ఈ పద్యం హాయిగా పాడుకోవడానికి లయబద్ధంగా ఉంది. అయితే పోతనగారి పద్యం పాడుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది. ఎర్రన గారి ఈ పద్యం కొంచెం ఘాటుగా, నిష్ఠూరంగా ఉంటుంది.    అదే.. "అవును", "కాదు" ల మధ్య భేదము.    ప్రహ్లాదుడు తండ్రికి విష్ణు ద్వేషము తగదని చెప్తూ, విష్ణుని మీద భక్తి పెంచుకోమని బ్రతిమాలడం ఎంతో చక్కగా చెప్పారు ఎర్రన.    నిన్నింత వాని చేసిన ఆ బ్రహ్మకి హరి తండ్రి. ఆతని మీద కోపము వదులు అని చెప్తాడు.. చక్కని కంద పద్యంలో.    అందంగా కందం అల్లడం ఎర్రనకే చెల్లు.     “నిన్నింత వాని జేసిన,     యన్నాలుగు మోములతడు హరిపొక్కిటయం     దున్న వెలి దమ్మియీనిన,     కున్నయగుట తెలిసి విడువు కోపము తండ్రీ.”    అంతే కాదు..     “ఇందుగలడందు లేడని      సందేహము వలదు చక్రి సర్వోపగతుం      డెందెందు వెదకి జూచిన      నందందే గలడు దానవాగ్రణి వింటే.” అనే పోతనగారి ప్రసిద్ధ పద్యము కూడా ఎర్రనగారి భావమే.     ఈ క్రింది పద్యాన్ని చూస్తే పోలిక ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాకపోతే పోతన పద్యంలోని క్లుప్తత దానికి ప్రాచుర్యాన్ని సంపాదించింది.    “కలడు మేదిని యందు కలడుదకంబుల     గలడు వాయువునందు గలడు వహ్ని     గలడు భానుని యందు గలడు సోముని యందు     గలడంబరమున గలడు దిశల     గలడు చరంబుల గల డచరంబుల     గలడు బాహ్యంబున గలడు లోన     గలడు సారంబుల గలడు కాలంబుల     గలడు ధర్మంబుల గలడు క్రియల     గలడు కలవాని యందును గలడు లేని     వాని యందును గలడెల్లవానియందును     ఇంక వేయును నేల సర్వేశ్వరుండు     కలడు నీయందు నాయందు కలడు కలడు."    ప్రచార సాధనములు, ప్రజల రాకపోకలు అధికమవుట వలననో ఏమో గాని, తెలుగింట్లో, తెలుగు వారి వంటింట్లో పోతనగారి భాగవతంలో ప్రహ్లాదునికి ముద్దు మురిపాలు ఎక్కువే. నిరంతరం వారి నాలుకల మీద నడయాడుతూ ఉంటాడు.    ఎర్రనగారి నృసింహపురాణ ప్రహ్లాదునికి అవి తక్కువ.    ఎర్రాప్రగడ శివుని అవతారమని పేరుపొందిన శంకరస్వామి శిష్యుడు. పరమేశ్వరుని భక్తుడు.    ఏ కార్యమున కైననూ ఈశ్వరానుగ్రహము కావాలనుకుంటాడు శంభుదాస బిరుదాంకితుడు. అయిననూ విష్ణువును కీర్తించేటప్పుడు ప్రహ్లాదుని వలెనే మైమరిచిపోతాడు.    ఒక అక్షరంతో ఏ పదమైనా మొదలుపెడితే అదే అక్షరంతో వీలైనంత వరకూ సాగిపోవడం వారి రచనలోని ప్రత్యేకత.    "ఆదిదేవు డంబుజాక్షు డధోక్షజు డక్షనుండు.." అని అరణ్యపర్వంలో వ్రాశారు. అదే పద్ధతి నృసింహపురాణంలో కూడా కనిపిస్తుంది.    కొన్ని ఇష్టమయిన సంక్లిష్ట పదాలు తన రెండు కావ్యాలలోనూ వాడారు.    "స్ఫురదరుణాంశు రాగరుచి.." అనే మధుర పదం రెంటిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.        …………………                               .....మంథా భానుమతి

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 18 వ భాగం

  “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 18 వ భాగం      ఎర్రాప్రగడ చెప్పసాగాడు.    "యమధర్మరాజు సావిత్రికి ప్రసాదించిన వరం వల్ల ద్యుమత్సేనునికి చూపు వచ్చింది. వెంటనే కుమారుడైన సత్యవంతుని చూడాలనిపించింది.    భార్య శైబ్యతో కలిసి వనంలో గాలించాడు. సావిత్రీ సత్యవంతుల జాడ తెలియలేదు.    అంధుడైన ద్యుమత్సేనునికి సత్యవంతుడు తన కన్నులతో లోకాన్ని చూపిస్తున్నాడు. చూపు వస్తుందని ఏ మాత్రం ఆశ లేని సమయంలో ఆశ్చర్యకరంగా దృష్టి వచ్చింది. భార్యాభర్తల ఆనందానికి అవధులు లేవు. జీవితంలో ఊహించని అదృష్టమిది.    ఈ సంతోష సమయంలో ద్యుమత్సేనునికి ఉన్న కోరిక ఒకటే. తనకన్నులే తండ్రి కన్నులుగా చేసి కన్నతండ్రికి సేవ చేసిన పుత్రుడిని కన్నులార చూడడం. మనసారా ఆలింగనం చేసుకోవడం.    కానీ విధి వ్రాత ఎలా ఉన్నదో.. సాయం సంధ్యా సమయానికే  ఇల్లు చేరే తనయుడు, రేయి గడుస్తున్నా ఇంకా ఆశ్రమానికి రాలేదు. కళ్ళు కనిపిస్తున్నందుకు సంతోషించాలో.. కుమారుడు కంట పడనందుకు దుఃఖించాలో పాలుపోవడం లేదు ద్యుమత్సేనునికి.    కళ్ళు వచ్చినా కళ్ళు లేనివాని వలెనే ఉన్నది అతడి స్థితి.    ఇక్కడే నేనొక సంఘటన కల్పించి ఉత్పలమాలలో చెప్పాను. ఇది మూలంలో వ్యాస మునీంద్రులు చెప్పలేదు.     కన్నులు వచ్చి ఎల్లెడలు గన్గొని వృద్ధ నరేంద్రుండాత్మకుం     గన్నులు బోలె నైన తన గాదిలి పుత్రుడు గాననంబులో     నెన్నడు లేని యింత తడ వేటికి జిక్కెనో యంచు నార్తితో     గన్నులు లేనియ ట్లతడు గానక యేడ్చె సతీ సమేతుడై."    ఎర్రన చెప్పిన పద్యం విని, సూరనార్యుడు ఆనందముతో కుమారుని లేపి గాఢముగా ఆలింగనము చేసుకున్నాడు.    పోతమాంబ వడివడిగా ఇంటిలోనికి వెళ్ళి బుట్టెడు ఉప్పు తెచ్చి దిష్టి తీసింది.    "నీ పుత్రుడికి నా దిష్టి తగులుతుందనే.. " సూరన మేలమాడాడు.    "కాదు కాదు.. ముందు ముందు పదుగురి దిష్టీ తగలకుండా.." రెండు చేతులతో లెంపలు వాయించుకుంటూ అని, పతి పాదాలు కళ్ళకద్దుకుంది పోతమాంబ.    ఎర్రన చిరునవ్వుతో తల్లిదండ్రుల ఆనందాన్ని పరికించి తన గ్రంధాన్ని అందుకున్నాడు.    "దుఃఖంతో క్రుంగి పోతున్న ద్యుమత్సేన దంపతులను ఋషులు ఓదార్చారు.    అంతలో వారి వేదనను పోగొడుతూ సావిత్రీ సత్యవంతులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు.    కుమారుని కౌగలించుకుని ఆనంద భాష్పాలు కార్చారు వృద్ధ దంపతులు. సావిత్రిని దగ్గరగా తీసుకుని, తలను మూర్కొని ఆశీర్వదించారు.”    ఎర్రన కంఠం సవరించుకుని మొదలు పెట్టాడు.    "సత్యవంతా! ఎందులకింత ఆలశ్యమయినది" ద్యుమత్సేనుడు తనివితీరా కుమారుడిని చూస్తూ అడిగాడు. పది వత్సరములు వయసు తగ్గినట్లున్నదా దంపతులకి.    సత్యవంతుడు, తనకి సోకిన అనారోగ్యాన్ని, నల్లని వ్యక్తి దర్శనాన్ని వివరించబోయాడు. సావిత్రి భర్తను వారించి, జరిగింది అంతా వివరంగా చెప్పింది.    సత్యవంతుడు కూడా కన్నులు విప్పార్చి విన్నాడు.    నారద మహర్షి వివాహాత్పూర్వము తమకు చెప్పిన సత్యవంతుని మరణ రహస్యాన్ని, దానిని దృష్టిలో పెట్టుకుని తాను నియమంతో ఆచరించిన వ్రతాలని వివరించింది.    అచ్చటనున్న వారందరూ ఎంతగానో విభ్రాంతి చెంది సంతసించారు.    "అమ్మా! సావిత్రీ.. పవిత్రమైన నీ గాధ ప్రశంస నీయము.     కష్టాల కడలిలో మునిగిపోతున్న మా వంశాన్ని తెప్పవై రక్షించావు.. మీ జనకులు అశ్వపతి మహారాజు చెప్పినట్లుగనే." సావిత్రిని ఆశీర్వదించారు అత్తమామలు.    సావిత్రి మదిలో కదిలే ప్రతీ ఆలోచనలోనూ ధర్మమే నిండి ఉంటుంది.    ద్యుమత్సేనుని ఆశ్రమంలో ప్రతి ఒక్కరూ ఆనంద హృదయాలతో తేలిపోతూ, సావిత్రిని అభినందించారు.    సావిత్రి సౌశీల్యమును, సుగుణములను వేనోళ్ల కొనియడారు.    పెద్దలు మనసారా ఆశీర్వదించారు.    ఇంకొక సంతోష పూరితమయిన వార్త రావలసి ఉంది. సావిత్రి ఎక్కువ రోజులు ఎదురు చూడనక్కరలేకుండా వచ్చేసింది.    సాళ్వదేశం నుండి మునులు, నగరవాసులు, సేవకులు, సచివులు చాలా మంది వచ్చి ద్యుమత్సేనునికి నమ్రతతో నమస్కరించారు.    "మహారాజా! మబ్బులు విడిపోయాయి. మిమ్ములను వంచించి మీ రాజ్యాన్ని కాజేసిన శతృరాజులు అంతఃకలహాలతో అంతరించి పోయారు.    మిమ్ములను మరల మహారాజు లాగ చూడాలని ప్రజలందరూ ఉత్సాహ పడుతున్నారు. పట్టపుటేనుగు అంబారీతో కదలి వచ్చింది. వేలాదిమంది మిమ్మల్ని ఆహ్వానించడానికి తరలి వచ్చారు."                  ద్యుమత్సేనుడు సంతోషించి మునులందరికీ చెప్పి బయలుదేరాడు, కుటుంబ సమేతంగా.    ఆశ్రమంలో మునులు వీడ్కోలు పలికారు. నగరంలో ప్రజలు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ద్యుమత్సేనుడు పట్టాభిషిక్తుడయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు.    ఇదంతా సావిత్రీ వైభవమేనని రాజదంపతులు సంతసించారు.    తన మగని నత్తమామల    జననీ జనకులను దన్ను సకలంబును దా    ఘనముగ సముద్ధరించెను    జనవర! సావిత్రి దర్మ చరితము కంటే.    ఇదే సావిత్రి చరిత్ర. ఇది అద్భుత చరిత్ర."    ఎర్రన శ్రోతల వంక చూశాడు.    "అవును. నేను కుమారుని అరణ్యపర్వంలోని సావిత్రి చరిత్రను చదివాను. నూటపది పద్యాలతో ఇదే ఒక చిన్న ప్రబంధము లాగున్నది." సూరనార్యుడు చెప్తుంటే పోతమాంబ, కోడలు ఆనంద భరితులయ్యారు.                              ……………….                                   14    సూరనార్యుడు చెప్పినట్లుగనే, అరణ్య పర్వంలోనే ప్రబంధాల అల్లికలను రచించిన ఎర్రాప్రగడ "ప్రబంధ పరమేశ్వరు" డైనాడు.    మరల ఒక్కసారి తన భారత భాగమును చదువుకున్నాడు.    కన్నబిడ్డను ఎన్ని మారులు చూచుకున్ననూ, మాతృమూర్తికి తనివి తీరదు. రోజు రోజుకూ కొత్త అందాలు కనిపిస్తూనే ఉంటాయి.    పొద్దుపొడవగనే ఊయలలో ఒళ్ళు విరుచుకుంటున్న పాపని ముద్దులాడుతూ, నూనె రాచి, నలుగు పెట్టి వేడి వేడి నీటితో స్నానం చేయిస్తుంది.    ఉహూ.. ఈ నామం పొట్టిగా ఉంది.. మోము మరొక్కసారి కడిగి నామం దిద్దుతుంది.    ఈ ముత్యాలహారం కొద్దిగా మాసినట్లుందే.. పతకం మెరుపు తగ్గిందే..    హారాన్ని శుభ్రం చేసి మెడలో వేస్తుంది.    పీతాంబరం సర్దిందే సర్దుతూ, జారిపోకుండా కడుతుంది. అప్పుడు.. దిష్టి చుక్క పెట్టి చుట్టపక్కాలకి చూపుతుంది.    అదే విధంగా కవి కూడా..    తన కావ్యాన్ని అపురూపంగా తీసి కన్నులార చూసుకుంటాడు. చేతితో తడిమి స్పర్శానందాన్ననుభవిస్తాడు మరల మరల చదువుతాడు. చదివిందే చదువుతూ.. ఇక్కడొక మాత్ర తక్కువయిందే అనిపిస్తుంది, పదోసారి చదువుతుంటే.. మధనపడి మారుస్తాడు.    చదువుతూ అందాలు పరికించి ఆనందిస్తాడు.    ఇందులో అర్ధం అనుకున్నట్లు రాలేదే.. కొంచెం ఈ అలంకారం మారుస్తే.. ఏం ఉపమ చెప్పాలి చెప్మా!    ఆహా.. దొరికింది. అర్ధరాత్రి లేచి మార్చేస్తాడు.    కలలో ఇలలో అదే ధ్యాస. ఇంకే ఆలోచనా దరి రాదు.    ఎర్రన కూడా తన కావ్యాన్ని మరమరల చదివాడు.    చివరి భాగాలలో క్రమంగా తిక్కనగారి శైలి వచ్చినందుకు సంతుష్టుడైనాడు.    క్రమ క్రమంగా సంస్కృత పదాల జోక్యం తగ్గి, తేటతెలుగు పలుకులు ఊపిరి పీలుస్తున్నాయి.    విరాటపర్వంలో ద్రౌపదిని కీచకుడు వేధించినట్లే, అరణ్యపర్వంలో సైంధవుడు వేధిస్తాడు.    ద్రౌపది తన భర్తల పరాక్రమాన్ని విరాటపర్వంలో కీచకునికి చెప్పినట్లే, అరణ్యపర్వంలో సైంధవునికి వివరిస్తుంది.. విస్తృతంగా! కీచకునితో అధికంగా మాటలాడుటకు లేదు.. అజ్ఞాత వాసం కనుక. అందుకే "దుర్వారోద్యమ" అంటూ ఒకే పద్యంలో చెప్తారు తిక్కనసోమయాజి.    అరణ్యపర్వంలో ఆ బాధలేదు.    కావలసినంత సమయము. ఎవరైననూ చూచెదరన్న సంకోచము లేదు.    ఒక్కొక్కరి ప్రతిభను, ప్రతాపాన్ని పేరు పేరునా చెప్పి ఏడు పద్యాలలో చెప్పారు ఎర్రన.    ధర్మరాజు మదపుటేనుగు వంటివాడు. ధర్మసూత్రాలు వివరిస్తూ.. లౌకిక విషయాలు పట్టించుకోనట్లు స్థిరంగా ఉంటాడు. అంకుశంతో కర్తవ్యం చూపుతే చాలు.. ఘీంకరించి..    ’అరి’ మదమడచి పాదాలతో తొక్కి పారేస్తాడు.    భీముడు సింహ సముడు. జూలు విదిలించి, దిక్కులు దద్దరిలేలా గర్జిస్తే..    సమస్త జీవరాసులూ పారిపోవలసిందే. ఎవరైనా ఎర దొరికితే ఎముకలు నుజ్జు నుజ్జే.    అర్జనుడు బెబ్బులి. మౌనముగా ఉన్నట్లే ఉండి, గురి చూసి గాండ్రిస్తూ అత్యంత వేగముగా మీదపడతాడు. శతృవుకి పారిపోవుటకు సమయమే ఉండదు.    నకుల సహదేవులు జంటపాములు. బుసతో పగవాడు పారిపోతుంటే కాటేస్తారు.    ఈ పోలికలు మూలంలో వ్యాసులవారు కూడా చెప్పారు.    ఎర్రనగారు తన అనువాదంలో తెనుగుతనం చూపారు. దానితో ఎంతో హుందాగా ఉంది వర్ణన.     “హిమవత్పాద వనాంత కేలి రతిమై నేపారి కోపారుణ     క్రమ నేత్రాంచలమై ప్రభూతమద రేఖంభైన గంధద్విపేం     ద్రము డాయంజని సిళ్ళు చూపుట సుమీ ధర్మాత్ము సత్యుగ్రవి     క్రము గౌంతేయవరిష్ఠు నీవు దొడరంగా జూచు టూహింపగన్."    ఏనుగుకు సిళ్ళు చూపడం తెలుగువారి జాతీయం. సిడి అంటే అంకుశం అని అర్ధం.    మదించిన ఆంబోతుకు ఎర్రని వస్త్రం చూపుతే బెదిరి చిందులేసి కనిపించినవన్నీ ధ్వంసం చేస్తుంది. అదే విధంగా ఏనుగును అంకుశంతో బెదరగొడితే విజృంభించి, ఎత్తి ఆవల పడేసి, పాదతాడనం చేస్తుంది.    అదే విధంగా సింహం జూలు పట్టుకుని వేళ్ళాడవద్దనీ..    పులిని కోలతో కొట్టి తోసివెయ్యద్దనీ,    బుసకొట్టే పాముల్ని కాళ్లతో రాయద్దనీ ద్రౌపది హితవు చెప్తుంది. ఇవన్నీ తెలుగువారు వాడే నానుళ్ళు. అనువాద రచనలో, చదివే వారి ఆచార వ్యవహారాలనూ, ఆ భాషలోని సామెతలనూ.. జీవన విధానాన్నీ ప్రతిబింబిస్తే ఆ రచనని వారు స్వంతం చేసుకుంటారు.    అదే జరిగింది మహాబారత రచనలో. కథాకాలంనాటి తెలుగువారి పలుకుబళ్ళు, ఆచారాలు అన్నీ కళ్లకు కట్టినట్లు చూపించారు కవిత్రయం. అందుకే అది ఎప్పటికీ తెలుగువారి మూలగ్రంధం. ప్రియమైన గ్రంధం. యుగాలు మారినా ఆ గ్రంధరాజం స్థానం సుస్థిరం.. తెలుగువారి హృదయాలలో!    ద్రౌపది చెప్పిన హితం వినని సైంధవుడు, ‘వృకం’ లాగ పాండవుల నివాసంలో ప్రవేశించాడు.    తిక్కనగారు కీచకుడు నర్తనశాలలో ప్రవేశిస్తుంటే అంతటి సింహబలుడినీ బెదిరిన లేడితో పోల్చారు.    ఎర్రనగారి సైంధవుడు అంతకన్నా హీనుడు. అతగాడిని సింహాగారము జొచ్చే నక్క అనీ, వాడి మీదకు యుద్ధానికి పోయే పాండవులను డేగలతోనూ పోల్చారు.    సైంధవుడు ద్రౌపదిని గొని పోయేటప్పుడు, అడవిలో వేరొక చోట నున్న పాండవులకు అపశకునాలు గోచరిస్తాయి. వాటిని చూడగానే ధర్మరాజు భయపడతాడు. అప్పుడతడు..    “చేయివెట్టి కలచినట్లయ్యెడు చిత్తంబు     తనువు నిస్చేష్టమయ్యె.." అంటాడు.    ఇటువంటి భావాలన్నింటినీ ఈ విధంగా అచ్చ తెలుగులో ప్రకటించాడు ఎర్రన.    విరాటపర్వంలో భీముని ముందు పాండవులని పేరుపేరునా పొగడినట్లే, అరణ్యపర్వంలో సైంధవుని రధం మీద నిలబడి, యుద్ధానికి వస్తున్న పాండవులను రెండేసి పద్యాలతో వర్ణిస్తుంది.    ఇక్కడ మూలంలో భావాలకి గౌరవం ఇస్తూనే తిక్కనగారి శైలిలో నడిపాడు.    ఎనలేని ప్రతిభా సంపత్తులుంటేనే ఇటువంటి అనితర సాధ్యమైన ప్రబంధమును రచింపగలుగుతారు..    నన్నయ తిక్కనలిరువురు తనలో పరకాయప్రవేశం చేసినట్లే అరణ్యపర్వ శేషాన్ని పూర్తిచేశాడు ఎర్రాప్రగడ.                             …………………               .....మంథా భానుమతి

సత్యవ్రతుడు (కథ)

  సత్యవ్రతుడు (కథ) కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె. మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను. "రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు. "సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు. అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు. "రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి. "సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు. ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని. "రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు. 'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు. "రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం. రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు. సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది. రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు. "అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి. అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి. మళ్లీ రాజ్యం కళకళలాడింది. ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు. సత్యాన్ని జీవితంలోకి ఆహ్వానించి, అడుగడుగునా నిజాన్నే ఆయుధంగా మలచుకోవాలని నేర్పిన గాంధీజీని ఓసారి తలచుకొని, ఆ స్ఫూర్తితో మన జీవితాల్లో నిజం పాలు ఇంకొంత పెంచుకుందాం. నిజం చెబుదాం; వాస్తవంగా బ్రతుకుదాం. -ఏమంటారు? Courtesy.. kottapalli.in

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 17 వ భాగం

    “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 17 వ భాగం "స్వామీ! గృహ కృత్యములకు.. అగ్నిదేవునకు, అత్తమామలకు, ఆచార్యులకు ఫల పుష్పాదులు తెచ్చుటకు అడవికి వెళ్తున్న మిమ్మల్ని ఆపలేను. అది మీ కర్తవ్యం. కానీ ఈరోజు మీరు వంటరిగా వెళ్ళవద్దు. నేనుకూడా మీ వెంట వస్తాను. మిమ్ములనొక్కరినీ పంపుటకు ఈ రోజు నామనస్సంగీకరించుట లేదు."    సావిత్రి పలుకులు సత్యవంతుని ఆలోచనలో పడవేశాయి.    "దేవీ! మన వివాహమయి సంవత్సరం కావస్తోంది. ఏ నాడూ నువ్వు ఒంటరిగా అడవిలో తిరగ లేదు. అడవి మార్గం కంటకాలతో రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది. నిటారుగా నడవడానికి చెట్ల కొమ్మలు అడ్డు వస్తాయి. పైగా మూడురోజుల ఉపవాస దీక్ష అనంతరం నీరసించావు. అడవిలో మనలేవు."    "ప్రభూ! ఉపవాసం వల్ల నాకు నీరసం లేదు. ప్రయాణం వల్ల నేను అలసిపోను. మీతో కలసి అరణ్యాలకు రావాలని ఉత్సాహంగా ఉన్నది నాకీవేళ. దయచేసి నా మాట వినండి."    తన పత్ని పట్టుదల తన వివాహమప్పుడే అవగతమయింది సత్యవంతునికి.    "సరే! నాకేమియును అభ్యంతరము లేదు. అత్తమామల అనుమతి తీసుకుని రా."    ద్యుమత్సేనుడి వద్దకు వెళ్ళి అడిగింది సావిత్రి,    "మీరు పెద్దవారు, పూజ్యులు. నా మనస్సు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ రోజు నా పతిని వదిలి ఉండుటకు అంతరాత్మ అంగీకరించుటలేదు. వారితో వనానికి వెళ్ళుదామని నిశ్చయించుకున్నాను. మీ అనుమతికై వచ్చాను."    "వివాహమయిన తదుపరి నీవు కోరిన కోరిక ఇది యొక్కటే. దానిని కాదనే శక్తి మాకు లేదు. అలాగే వెళ్ళిరా తల్లీ. మార్గమధ్యంలో సత్యవంతుని కనిపెడుతూ ఉండు." అన్నాడు ద్యుమత్సేనుడు.    అత్తమామల అనుమతి లభించింది. పుట్టెడు దుఃఖాన్ని గుండెలో దాచుకొని చిరునవ్వుతో భర్త వెంట అడవికి బయలుదేరింది సావిత్రి.    సా జగామ యశస్వినీ,    సహ భర్త్రా హసంతీవ    హృదయేన విదూయతా."    సూరనార్యుడు చిరునవ్వుతో తల పంకించాడు. మరల తేట తెలుగులో సెలవిచ్చాడు ఎర్రన..    "చిత్తంబున బైకొనియెడు    నుత్తలము నడంచి ముఖ పయోరుహమున ద    క్కొత్తెడు వెడ నవ్వున బ్రియు    చిత్తం బిగురొత్త జనియె జెలువు యడవికిన్."                       యెర్రన రాగయుక్తంగా చదివిన కంద పద్యపు సొబగులకు సూరనార్యుని కన్నులు చెమర్చాయి. అందునా ఆపద్యము నందలి భావము మాత్రము సామాన్యమైనదా!    మనస్సును కలచి వేసెడిది కదా..    ఎర్రన తండ్రి మోమును చూచాడు. పోతమాంబ ఆందోళనగా లేవబోయింది.    "ఏమీ లేదు. ఆ కంద పద్యపు అందాలను ఆస్వాదిస్తున్నాను. పద్యంలో భావమునకు ఒడలు గగుర్పొడిచింది." సూరనార్యుడు భార్యకు ధైర్యము నిచ్చాడు.    యెర్రన చిరునవ్వుతో కొనసాగించాడు..    "మనస్సులో పెల్లుబుకి వచ్చే పరితాపాన్ని అణచుకుంటూ, ముఖ కమలంబులో వెలుగొందే చిరునవ్వుతో భర్త మనస్సు చిగురించేలా సుకుమారి సావిత్రి అడవికి వెళ్ళింది.    సావిత్రీ సత్యవంతులు వనమున ప్రవేశించారు.    వివాహానంతరం దంపతులు చేస్తున్న విహారం అదే."    సత్యవంతునకు మహోత్సాహంగా ఉంది. వనములోని విశేషాలను వర్ణిస్తూ, సతీ సాన్నిధ్యాన్ని మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నాడు.    ‘మనోహరమైన వన సౌందర్యం చూడు చెలీ..    కొలనులో.. విరిసిన కమలాలు, నడయాడే రాజహంసలు,    వాటి కదలికల సొంపులు అవిగో!    ఎర్రని చిగురాకులు, రంగు రంగుల పూవులు    చెట్ల మొదళ్ళని కమ్మేసిన తీవెల అందాలు చూడు సావిత్రీ!    ఇంద్రధనుస్సులోని రంగులని మించి యున్న ఈ పూలబాలలందించే మకరందాన్ని గ్రోలుతున్న తుమ్మెదలని చూశావా?    పువ్వు పువ్వుకీ ఎగిరి ఎగిరి పడుతున్న వాని విన్యాసాలు.. మత్తెక్కి అవి చేసే ఝుంకారాలు, లయతో కూడిన వాయులీనపు సవ్వడుల వలె లేవూ!    ఆ చిలుకల వయ్యారాలను చూడు..    పక్వానికొచ్చిన తియ్యని ఫలాలను కడుపారా తిని, అవి చేసే కిలకిలా రావాలని వింటున్నావా?’    సత్యవంతుడు సౌందర్యోపాసన చేస్తూ వర్ణిస్తున్నాడు, రాబోయే ఆపద తెలియక.    కానీ మీద పడనున్న భయంకర విపత్తును గురించి చింతిస్తూ సావిత్రి, నిర్వికారంగా తప్పని సరి సల్లాపం చేస్తూ నడుస్తోంది.    సత్యవంతుడు వచ్చిన పని మీద దృష్టి నిలిపాడు.    చెట్లనుండి మధుర ఫలాలను తెంపి బుట్ట నింపాడు. బుట్టలు నిండాక సమిధల సేకరణ మొదలు పెట్టాడు. గొడ్డలితో కట్టెలను కొడుతూ, బాగా అలసిపోయాడు. గొడ్డలి కింద పడేశాడు.    సత్యవంతుని శరీరమంతా చెమటలు పోశాయి. దేహం వశం తప్పింది. మనస్సులో ఏదో గాభరా..    శూలాలతో పొడిచినట్లు తల నొప్పి.. నిలబడుట కష్టమైపోయింది.    భార్యని పిలిచాడు.. వణుకుతున్న కంఠస్వరంతో.    "సావిత్రీ! శిరోభారం దుర్భరంగా ఉంది. అవయవాలన్నింటినీ ఎవరో కత్తులతో పొడుస్తున్నట్లుగా ఉంది. గుండెలో మంట.. ఈ బాధ భరింప లేకున్నాను. కొద్ది సేపు విశ్రమిస్తాను."    వెంటనే సావిత్రి చెట్టుకింద కూర్చుని, తన ఒడిలో పడుక్కోబెట్టుకుంది పతిని, అంకతలాన్ని తలగడగా చేసి.    నెమ్మదిగా నుదుటి మీద చెయ్యి వేసి వత్త సాగింది. వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు సత్యవంతుడు. ఊపిరి అందుట లేదు.. శ్వాస ఆడుట కష్టమవుతోంది. శరీరం చల్లబడుతోంది.    నారద ముని మాటలు మనస్సులో మెదలుతున్నాయి సావిత్రికి. భయపడినట్లుగానే సత్యవంతుడు చైతన్యరహితుడయ్యాడు.  నిస్సహాయంగా అటూ ఇటూ చూస్తున్న సావిత్రికి కళ్ళముందు ఒక దివ్యపురుషుడు కనిపించాడు. కాటుకవంటి నల్లని దేహం.. మిలమిల మెరిసే అరుణారుణ నేత్రాలు.. శిరమున కిరీటం..    చేత పాశంతో దివ్య తేజస్సుతో ప్రచండ భానుడి వలే ఉన్నాడు. సత్యవంతుని తదేకంగా చూస్తున్నాడు.    ఒడిలో నున్న భర్త శిరస్సును నెమ్మదిగా కింద పెట్టి లేచి నిలబడి, ఆ దివ్య పురుషునికి నమస్కరించింది సావిత్రి.    "మహాత్మా! మీరు దేవతా మూర్తుల వలే ఉన్నారు. మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు విచ్చేశారు? అభ్యంతరం లేకపోతే చెప్పండి స్వామీ!" వినయంగా అంది.    "సావిత్రీ! నీవు మహాపతివ్రతవు. తపస్వినివి. అందుకే సామాన్యులు చూడలేని నన్ను చూడగలుగు తున్నావు. నాతో మాట్లాడగలుగుతున్నావు. నేను యమధర్మరాజును. నీ భర్త సత్యవంతుని ఆయువు తీరిపోయింది. అతడిని పాశముతో బంధించి తీసుకుపోవడానికి వచ్చాను."    ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.    "స్వామీ! మీ భటులు కాకుండా మీరే స్వయంగా వచ్చితిరేమి?"    "అమ్మా! నీవు అన్నది నిజమే. సామాన్యులకు నా భటులు వచ్చెదరు. నీ భర్త సామాన్యుడు కాదు. ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు. మహనీయుడు. అందువలన నేనే స్వయముగా వచ్చితిని."    యమధర్మరాజు పాశాన్ని విసిరి, సత్యవంతుని లోని జీవుడిని బంధించి బయటకు లాగాడు. అతని ఊపిరి ఆగిపోయింది. శరీర కాంతి మారిపోయింది. అవయవాల్లో చలనాలు ఆగిపోయాయి. ఆ జీవుడిని వెంటబెట్టుకుని, యమధర్మరాజు దక్షిణ దిక్కుగా బయలు దేరాడు.    సావిత్రి శోకిస్తూ, భర్త దేహాన్ని అక్కడే విడిచి, తన తపో మహిమతో యమధర్మరాజును వెంబడించింది. తన వెనుక వస్తున్న సావిత్రిని చూసి యముడు ఆశ్చర్య పోయాడు.    సామాన్య జనం మృత్యువు తమ వెంట పడుతుందేమోనని భయపడతారు. సావిత్రి తనే మృత్యువు వెంట పడుతోంది.. నిర్భయంగా.    "అమ్మా! పతివ్రతా శిరోమణీ.. నా వెంట ఎందుకు వస్తున్నావు? వెనుకకు మరలు.. నీ భర్త శరీరానికి అంత్యక్రియలు జరిపించి అతడిని విముక్తుడిని చెయ్యి. పతితో నీ ప్రయాణం ఆగిపోయింది. నీ పతి ఋణం తీర్చుకో.." యమధర్మరాజు అనునయంగా అన్నాడు.    "సమవర్తీ! నా భర్త ఎక్కడికి కొని పోబడతాడో అక్కడికే నేను కూడా పోవాలి. అదే పతివ్రతా ధర్మము. తపస్సు, గురుభక్తి, పతి ప్రేమ, వ్రతమహిమల వల్ల నేను మీ వెంట రాగలుగుతున్నాను. ముఖ్యంగా మీ కృప నా మీద ఉంది. నాకు ఎటువంటి అడ్డంకి ఉండదు.    భగవాన్! ఏడడుగులు కలిసి నడిచినా, ఏడు మాటలు మాట్లాడినా ఇద్దరు వ్యక్తులకు మధ్య స్నేహం సిద్ధిస్తుందని చెప్తారు. ఆవిధంగా మీరు నాకు స్నేహితులు. పవిత్రమైన ఈ స్నేహాన్ని పురస్కరించుకుని నా మాటలు రెండు వినమని మనవి.    అన్నింటి కన్ననూ ధర్మమే శ్రేష్ఠమైనదని అంటారు. ధర్మాన్ని పాటించేవాడు సత్పురుషుడు. కావున ధర్మాచరణకు సత్పురుషుడే ఆధారము.    ఆ ధర్మానికి మారుపేరు నీవు. శ్రేష్ఠుడవు. నీతో ఏడు అడుగులు నడచిన పుణ్యం, ఏడు మాటలు మాటలాడిన భాగ్యం నాకు దక్కాయి. సత్పురుషుల దర్శనం సత్ఫలితాలనిస్తుందంటారు. మీ పవిత్ర దర్శనం పొందగలిగిన నేను ఫలితాన్ని పొందకుండా వెనుకకు ఎలా మరలగలను?" సావిత్రి పలుకులు విని సంతృప్తుడయ్యాడు యముడు. అంతే కాదు ఆశ్చర్యపోయాడు ఆమె వివేకానికి.    ధర్మాన్ని వినడము, ఆచరించడము ఎవరికైననూ సాధ్యమే.. కానీ కళ్ళతో చూడడం అసంభవం.. సత్పురుషులకు తప్ప. ఇది శాస్త్ర వాక్యము.    మూర్తీభవించిన ధర్మమే యమధర్మరాజు. ఆ ధర్మాన్ని జ్ఞాన రూపంలో ప్రత్యక్షంగా చూడగలిగింది భాషించగలిగింది. ఇది యమధర్మరాజే స్వయంగా చెప్పాడు.    ఉత్తమోత్తమమైన ధర్మ మార్గాన్ని అనుసరించే వారికి కూడా సాధ్యంకాని ధర్మమూర్తిని సావిత్రి అనుసరిస్తోంది. వెంట నడువ గలుగుతోంది. తన మార్గంలో అడ్డంకి ఉండదు అని చెప్పింది కూడా. సావిత్రి బుద్ధి కుశలత చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు.    అందుకనే నిశ్శబ్దంగా తనపని తాను చేసుకునిపోయే కాలుడు సావిత్రితో మాటలు కొనసాగించాడు.    "సావిత్రీ! నీ మాటలు నన్ను ఎంతగానో మెప్పించాయి. నన్నలరించాయి. నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కోరుకో. అనుగ్రహిస్తాను."    "యమపురాధీశా! మా మామగారు ద్యుమత్సేనుడు అంధుడై అడవుల పాలయ్యాడు. ఆయనకు దృష్టి ప్రసాదించి, శక్తి సమన్వితుడై, తేజోవంతుడగునట్లు ఆశీర్వదించండి."    "సావిత్రీ! నీ కోరిక నెరవేరుతుంది. ఇంక వెనుకకు తిరుగు. ఇప్పటికే అలసిపోయావు.." ప్రసన్న దృక్కుడై అన్నాడు యముడు.    "మహాత్మా! పతిననుసరిస్తున్న నాకు శ్రమ ఎక్కడుంది? మీకు సర్వధర్మాలు తెలుసు. ధర్మ సూక్ష్మాలు కూడా తెలుసు. అందువలననే తమరు ధర్మమూర్తిగా కీర్తింపబడ్డారు.     సమబుద్ధి తోడ దత్త     త్సముచిత కర్మఫల మఖిల జంతుతతులన్     సమకూర్చుట నీకయ్యెను     సమవర్తి యనంగ బేరు జగదభినుతమై.    సమబుద్ధితో, సముచిత కర్మ ఫలాన్ని సమకూర్చే వారు కనుక మిమ్మల్ని సమవర్తి అని లోకం కీర్తించింది.    మహానుభావా! దీనులకు దానం చెయ్యాలని శాస్త్రం చెపుతుంది. దానం అనేది పూర్ణంగా ఉండాలి కదా! అదియే సమవర్తనము." అంటూ యమధర్మరాజు ఇచ్చిన వరము తనకు పూర్ణ తృప్తినొసగలేదని తెలియ జెప్పింది సావిత్రి.    "అమ్మా! దాహార్తునికి చల్లని నీరు తృప్తినిచ్చినట్లు నీ మాటలు నన్నెంతో సంతృప్తి పరచాయి. నీకు మరొక వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీ భర్త ప్రాణాలు దక్క ఏదైననూ కోరుకో తల్లీ!" ధర్మమూర్తి పలికాడు.    "భగవాన్.. అర్కతనయా! మా మామగారైన ద్యుమత్సేనుని రాజ్యాన్ని శతృ రాజులు అపహరించారు. ఆయన రాజ్యం ఆయనకు దక్కేటట్లు, ద్యుమత్సేనుడు ధర్మము తప్పకుండా జీవించునట్లు వరమివ్వండి." అన్నది సావిత్రి.    "నీ కోరిక నెరవేరుతుంది. ఇంక నువ్వు వెనుతిరగడమొక్కటే మిగిలింది."    "యమధర్మరాజా! మీకు తెలియని ధర్మము లేదు. మీరు ధర్మాధ్యక్షులు. ధర్మాత్ములు ధర్మాన్ని మధ్యలో వదిలిపెట్టరని మీకు తెలుసు. నా పయనం ఆపాలని నాకు అనిపించడం లేదు. ధర్మ మార్గం కుంటుపడటం మీకు సమ్మతమా?" సావిత్రి పట్టుదలకి పేరుపొందింది.    "సావిత్రీ! ధర్మము నందు నీకుగల ఆసక్తి నాకు నచ్చింది. చాలా సంతోషం. మూడవ వరాన్ని కూడా కోరుకో. నీ పతి ప్రాణాలు తప్ప సుమా!"    "ధర్మమూర్తీ! మద్రదేశాధిపతి అయిన అశ్వపతి నా జనకుడు. ఆయనకు నేనొక్కదాన్నే సంతానం. ఆయనకు నూరుగురు పుత్రులను ప్రసాదించండి స్వామీ."    "అటులనే. వందమంది రాకుమారులకు నీవు సోదరివవుతావు. ఇకనైనా.."    "ధర్మప్రభూ! మీరు ధర్మ మార్గాన చరిస్తూ, ప్రజలను ధర్మ మార్గంలో నడిపిస్తూ ధర్మ మూర్తి అయ్యారు. ప్రాణులను ఆయువు తీరాక ఆయా లోకాలకు తీసుకొని పోవుచుండుట చేత యమధర్మరాజులయ్యారు. మీరు ధర్మంలో అసమాన తేజో రూపులయ్యారు. మీవంటి ధర్మప్రభువుల నీడలో ఈ విశ్వమంతయునూ సర్వతో భద్రంగా శోభిస్తోంది." సావిత్రి ధర్మ వచనాలకు యముడు ఆనందాబ్దిలో మునిగి పోయాడు.    "మహా పతివ్రతా శిరోమణీ! మంజుల సుందర సుకుమార శబ్ద భూషితములైన నీ ధర్మప్రవచనాలు వీనులకింపుగా ఉన్నాయి. ఇటువంటి ధర్మప్రసంగం నేనింత వరకూ వినలేదు. బహు సంతుష్టుడనైనాను. మరొక్కవరం కోరుకో! అనుగ్రహిస్తాను." అమందానంద కందళిత హృదయారవిందుడైన యముడు వరమనుగ్రహించాడు.    "మహాత్మా.. ఈ నాల్గవ వరాన్ని మీరు పతి ప్రాణములు తప్ప అనే మాటలు లేకుండా అనుగ్రహించారు.     ఆర్యా! మీ ఆజ్ఞ.. నా భర్త సజీవుడవుగాక..     పతి విరహంబు దుస్సహము: భర్తృవినాకృత యైన కాంత దూ     షిత యగు సర్వ మంగళ  విశేషము లందును గాన మత్ప్రియం     డతులిత కీర్తిశాలి సుగుణాఢ్యుడు సాళ్వసుతుండు లబ్ధజీ     వితుడుగ నిమ్ము ధర్మపదవీ పరిరక్షణ! పుణ్య వీక్షణా!    తండ్రీ! అతులిత యశోవంతుడు, సుగుణ సంపన్నుడు, సాళ్వదేశ ప్రభువైన ద్యుమత్సేనుని కుమారుడు, నా ప్రాణ నాధుడు సత్యవంతుడు. తిరిగి జీవించేటట్లు వరమనుగ్రహించండి." అని ప్రార్ధించింది సావిత్రి.    "తథాస్తు.." అని దీవించి సత్యవంతుని పాశాన్ని తొలగించాడు యమధర్మరాజు.    "సుగుణశీలా! నీ సౌశీల్యము, ధర్మవర్తనము నన్ను తృప్తి పరచాయి. నీ భర్త పునర్జీవితుడవుటయే గాక, సంపూర్ణారోగ్యముతో జీవిస్తాడు. నీకు నూరుగురు పుత్రులు కలుగుతారు." యమధర్మరాజు సావిత్రిని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు."    ఊపిరి బిగపట్టి వింటున్న శ్రోతలు ఉలిక్కిపడి ఎర్రన్నకేసి చూశారు.    అప్పుడే అయిపోయిందా! ఎర్రన తాళపత్రాలను భద్ర పరుస్తున్నాడు.    "అమ్మా! సాయం సమయమవుతోంది.."    ఎర్రన్న పలుకులకు అవునన్నట్లు చూశారు అందరూ. నిజమే.. తాము సర్వం మరచి, మృదు మధుర గంభీర కంఠంతో చెప్తున్న ఎర్రన వచనామృతాన్ని గ్రోలుతున్నారు.    కానీ.. ఇహం ఒకటి ఉంది.. అందులో కార్యక్రమాలు ఉంటాయి. తప్పదు.. పైగా మాటలాడే వారికి అలసట ఉంటుంది కదా!    "మరల రేపు చెప్పుకుందాం." ఎర్రన, సూరన లేచారు.. నదికి వెళ్లి స్నానాదులు, గుడికి వెళ్ళి అర్చనాదులు నెరవేర్చడానికి.    అత్తా కోడళ్ళు కూడా గృహ కృత్యాలకై ఆయత్తమవసాగారు.                           ……………..   మరునాడు మామూలుగా శ్రవణానికై విచ్చేసిన శ్రోతలు సరుదుకుని కూర్చున్నారు.   ఎర్రన మొదలుపెట్టాడు, మృదుమధుర స్వరంతో..   "సావిత్రి యమధర్మరాజు వరమిచ్చి వెళ్ళిన తరువాత వెనుదిరిగింది. ఉపవాస దీక్ష వలన ఏ మాత్రమూ నీరసము లేదు సరికదా నూతనోత్సాహము వచ్చింది.. అడుగులు అతి వేగంగా పడుతున్నాయి. ఎప్పుడెప్పుడు పతి సన్నిధికి చేరుదామా అని ఆతృత..    భర్త పునర్జీవుడైనాడు.. అసాధ్యమును సాధ్యం చేసుకున్నది.. అదియును యముడిని మెప్పించుట వల్ల. ఆ ఉద్వేగంతో అడుగులు తడబడ సాగాయి. అయిననూ వేగం తగ్గలేదు.    సావిత్రి మోము వేయి పున్నమి చంద్రుల కాంతితో వెలుగొందుతోంది.    భర్తను సమీపించి, శిరస్సును ఒడిలో నుంచుకొని కూర్చుంది.    కొంత సేపటికి సత్యవంతుడు సజీవుడై, చేతనంలోకి వచ్చి కళ్ళు తెరిచి సావిత్రిని చూశాడు.    "దేవీ! నాకు గాఢంగా నిద్ర పట్టేసింది. నన్ను ఒక నల్లని ధృఢకాయుడు పట్టుకొని లాగుతూ ఉన్నాడు. అతడు ఎక్కడ? నువ్వు నన్ను నిదుర లేపలేదేమి?"    "నాధా! ఆ విషయాలన్నీ ఆశ్రమానికి వెళ్ళాక తెలుపుతాను. మీ అలసట తీరితే బయలుదేరుదాము. లేదంటే ఈ రాత్రికి అరణ్యంలోనే కాలక్షేపం చేసి, తెల్లవారగనే బయలు దేరుదాము."    "సావిత్రీ! నా బడలిక పూర్తిగా తగ్గి, తల నొప్పి కూడా పోయింది. దేవీ.. నా జననీ జనకులను చూడకుండా నిశి రాత్రి ఉండలేను. ఆశ్రమంలో నా కొరకై తల్లిదండ్రులు ఎంతగా పరితపిస్తున్నారో! ఎంత ఆవేదన చెందుతున్నారో.. నేను నెమ్మదిగా నడుస్తాను. చీకటి పడుతున్ననూ ఈ దారి నాకు కొత్త కాదు. ఆకుల మధ్యనుండి పడే వెన్నెల కాంతిలో దారి చూచుకుంటూ నడిచి వెళ్ళ గలుగుతాము."    సావిత్రి సుకుమారమైన చేతులతో భర్తను కౌగిలించుకుని లేపి నిలబెట్టింది. భర్త శరీరానికి అంటుకున్న దుమ్ము ధూళిలను దులిపింది.    ప్రయాణానికి సిద్ధమయ్యారిరువురూ.    సత్యవంతుడు సేకరించిన ఫలములు, గొడ్డలి ఉన్నాయి. తామిద్దరికీ బరువులు మోసే శక్తిలేదు అప్పుడు. గొడ్డలి రక్షణకి కావాలనిపించి చేత ధరించింది. పండ్ల బుట్టను చెట్టు కొమ్మకు వేళ్ళాడ దీసింది.    ఒక చేత గొడ్డలి, ఇంకొక చేత భర్త చెయ్యి పట్టుకుని ప్రయాణమయింది.    సత్యవంతునికిది పునర్జన్మ. పూర్వజన్మలో సేకరించిన పళ్ళు అవి.. సత్యవంతుడు ఆ పళ్ళబుట్టను చూస్తూ నడిచాడు.    "పళ్ళబుట్టను రేపు తెచ్చుకుందాం" అంది సావిత్రి.    కానీ గత జన్మ బంధాలవి.. వదిలి వెళ్ళవలసిందే.. తప్పదు. ఇదే జీవుల చరిత్ర. ఎంత కష్టపడి సేకరించనవైననూ వదిలి వెళ్ళిపోవలసిందే సమయం వచ్చినప్పుడు. సంసార బంధనాలు ఖండిచుకోవాలి. దానికి కావలసింది గొడ్డలి. అది అసంగశస్త్రము.    అశ్వత్థ మేనం సువిరూఢ మూలం    అసంగ శస్త్రేణ ధృడేన చిత్వా..    అశ్వత్థమనే సంసార వృక్షపు వ్రేళ్ళని అసంగశస్త్రంతో ఖండించాలి.    ఇది జీవన చిత్రాన్ని చూపించే చరిత్ర."    తన కార్యక్రమములు త్వరగా ముగించుకుని, సూరన్న కూడా ప్రొద్దుటే వచ్చేశాడు సావిత్రి చరిత్ర వినడానికి. జనమేజయునికి వైశంపాయనుడు, సూతమహర్షి శౌనకాది మునులకు, మార్కండేయ మహర్షి ధర్మరాజునకు చెప్పిన చరిత్ర.. మహా పతివ్రత గాధ.. ఇప్పుడు ఎర్రాప్రగడ తన కుటుంబ సభ్యులకు చెపుతున్నాడు. ఎన్ని మారులు విన్ననూ మరీ మరీ వినాలనిపించే పుణ్య చరితలు అవి.       .....మంథా భానుమతి