“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 19 వ భాగం
posted on Oct 29, 2015
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 19 వ భాగం
అద్దంకి పట్టణం..
ప్రోలయ వేమారెడ్డి ప్రభువు సాహిత్య సభ..
ఎర్రాప్రగడ మహాభారత కావ్యాన్ని సంపూర్ణంగా తయారు చేసి తీసుకుని వచ్చాడు.
సభలో తను వ్రాసిన అరణ్యపర్వ శేషంలోని కొంత భాగాన్నివివరించి కొన్ని పద్యాలను చదివి వినిపించాడు. కవుల సమావేశం అది. అక్కడున్న వారి పాండిత్యం సర్వజనామోదం. వారి విద్వత్తుకి దీటుగా ఉండాలి తాను ఎంచుకున్న భాగము.
అందులకే ’యక్షప్రశ్నలు’ ఘట్టాన్ని ఎన్నుకున్నాడు. ధర్మరాజు సమయస్ఫూర్తి, తెలివి, సోదర ప్రేమ అందులో ప్రతిబింబిస్తాయి.
ఎర్రన చెప్పసాగాడు..
"ధర్మరాజు ధార్మికత అందరూ ఎరిగినదే. అతడికి తమ్ముల ఎడ ఎంతటి ప్రేమ ఉందో అందరికీ ఎరికే.
ఒక రోజు దాహార్తుడై తమ్ముడు నకులుడిని పంపుతే, అతడొక జలాశయములో దిగి, ఆ జలాశాయము తనదనీ, ఆ నీటిని త్రాగ వలదనీ వారిస్తున్న యక్షుని మాటలను పెడచెవిని పెట్టి, దోసిట పట్టి నీటిని తాగి అశువులు బాస్తాడు.
ఒకరిని వెతుకుతూ ఇంకొకకరు.. అందరూ అట్లే, యక్షుని మాట వినక ఆ జలమును త్రావి నలువురు తమ్ములూ ప్రాణాలు కోల్పోతారు.
తమ్ముళ్ళ జాడ తెలియక, వెదకుతూ జలాశయం వద్దకు వచ్చిన ధర్మజుడు, అసువులు బాసి అవనిపై పడి ఉన్న తమ్ముళ్ళను చూశాడు.
వారిని ఆ అచేతన స్థితిలో చూసిన ధర్మరాజు గట్టిగా విలపిస్తాడు. పేరు పేరునా ఒక్కొక్కరినీ పిలుస్తూ రోదిస్తాడు.
"కుమారా! తమ్ముళ్ళతో కలిసి కానలకేగిన నీవు ఒక్కడివే వచ్చావు.. అనుజులేరి.." అని తల్లి అడుగుతే ఏమి చెప్పవలయును, ఏమని ఊరడించగలను.. అంటూ విలపిస్తాడు ధర్మజుడు..
మా తల్లి, ఆ పాండు మహిషి, ‘.. ఇప్పుడయ్యనుజులెందు
జనిరి నీవొక్కండ చనుదెంచి తిది యేమి’
యనిన నాయమతోడ నకట యేమి యనగ నేర్చువాడ..”
ఇది "యక్ష ప్రశ్నలు" ఘట్టము లోని ఒక సంఘటనము. ఎర్రాప్రగడ పద్యం వినిపించి, వివరణ పూర్తి చేసి సభలోని వారందరినీ పరికించాడు, కుతూహలంతో.
మరికొన్ని, మరి కొన్ని.. శ్రోతల వీనులకు ఎంత విన్ననూ తృప్తి లేదు..
తేట తెలుగులో వ్రాసిన ఆంధ్ర మహా భారతములోని ఎర్రాప్రగడ విరచితమైన పద్యాలలోని అందాలను ఆస్వాదించిన పెద్దలు మనస్ఫూర్తిగా అభినందించారు.
తన భాగముకూడా నన్నయగారు వ్రాసినట్లుగనే వ్రాసి, రాజరాజ నరేంద్రునకే అంకితమిచ్చానన్నాడు ఎర్రన. అది ఆదికవికి తాను అందించిన కృతజ్ఞతాంజలి అని చెప్పాడు.
ప్రభువులకు, కావ్యములో నొక భాగము కాక, ఒక కావ్యమే రచించి ఇవ్వాలని ఉంది అని కూడా చెప్పాడు.
“కవి వర్యా! మీరు అద్దంకి వచ్చి, మా సమక్షంలో కొత్త కావ్యం రచించాలి. అందులకు అన్ని ఏర్పాట్లు చేసెదము. మిమ్ములను మా ఆస్థాన కవిగా ఆహ్వానిస్తున్నాము" ప్రోలయ వేమారెడ్డి ఎర్రాప్రగడని కోరాడు.
ఆంధ్ర భారతము ప్రతులు వ్రాయుటకు కొందరిని కోరి, సంతృప్తుడై చదలవాడకు పయనమయ్యాడు ఎర్రాప్రగడ.
………………….
15
"మరల మార్పా?" పోతమాంబ ఉదాసీనంగా అంది.
ఇంక ఇల్లు కదలి తరలుటకు తనువంగీకరించుట లేదు.
తల నిలువుగా ఊపాడు ఎర్రన.
"అవునమ్మా! వేమారెడ్డి ప్రభువులు అద్దంకి వచ్చెయ్యమన్నారు. అక్కడ సకల సౌకర్యములు కల్పించెదమన్నారు."
"అవునవును.. ఎర్రనని ఆస్థాన కవిగా ఆహ్వానించారు ప్రోలయ వేమారెడ్డి. కొండవీడులో కోట నిర్మాణం జరుగుతోంది. త్వరలో రాజధాని అక్కడికి మారుతుంది. ఈ సమయంలో కొంత రాజ్య పాలనలో కూడ సలహాలు కావాలి. నాకునూ చెప్పారు" సూరనార్యుడు భార్యతో అన్నాడు.
“రెడ్డిరాజు కట్టడాలకు ప్రణాలికలు బాగుగా వేస్తున్నాడు. శ్రీశైలములో పాతాళగంగనుండి ఆలయమునకు, అహోబిలములోనూ సోపానములు నిర్మించవలేనని రాజుగారి ఆకాంక్ష. జన సామాన్యము భయం వదలి, భక్తి అలవరచుకుంటున్నారు. ఈ సమయమున రాజుగారికి చేయూత నిచ్చుట మన కర్తవ్యము" ఎర్రన తల్లికి, భార్యకు వివరిస్తున్నాడు.
కాకతీయ సామ్రాజ్య పతనం అయ్యాక, వేమారెడ్డి ఇతర నాయంకరులతో కలిసి హిందూ రాజ్య స్థాపన చేస్తున్నపుడు సూరనాదులు పరిపాలన చూసుకునేవారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగించుకోవాలని.. అందులకు వారు రాజధానిలో ఉంటే వెసులుబాటుగా ఉంటుందనీ.. రాజు వేమారెడ్డి, తండ్రీ కొడుకులను అద్దంకి వచ్చెయ్యమని కోరారు.
కోరికే కానీ.. అది ఆనతికి సమమే కదా!
“మరి ఇక్కడ ఇల్లు.. పాడి పంటలూ.."
"అక్కడ ఇంకా పెద్ద ఇల్లు.. ఎక్కువ సౌకర్యాలు, రాజభటుల సేవలు.. మడి మాన్యాలు ఉంటాయి. ఇంక చుట్టాలు పక్కాలు మాటా.. ఇక్కడా ఎవరూ లేరు, అక్కడా ఎవరూ ఉండరు. దాయాదు లంతా వేగినాడులోనే ఉండిపోయారు కద.. పయనానికి సిద్ధం అవుదామా మరి.." ఎర్రన తల్లిని ఊరడించాడు.
నిజమే ఎక్కడయితేనేం.. ఇంట్లో పనిపాటలు చేసుకునేవారికి..
రాజాస్థానం.. రాజ గౌరవం. ఇంకేం కావాలి!
"అద్దంకిలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చి అభిషేకం చేసుకున్నాడట. అక్కడ కూడా గుండ్లకమ్మ నది ఊరిని పావనం చేస్తోంది." సూరన్న అద్దంకి వెళ్ళినప్పుడల్లా ఆ స్వామిని దర్శించుకోకుండా రాడు.
ప్రతి దినమూ అభిషేకం చేసుకునే అవకాశం వచ్చింది.
ఆ రామలింగేశ్వరుడే అనుగ్రహించాడు.
……………..
అద్దంకి..
ప్రోలయ వేమారెడ్డి ప్రభువు రాజ్యానికి రాజధాని.
వలస వెళ్ళుట అలవాటైపోయింది సూరన కుటుంబానికి. ఇంటనున్న వస్తువులన్నింటినీ బండ్ల మీదికి ఎక్కించి, తరలి వెళ్ళారు. రాజుగారు సేవకులను, రాజభటులను పంపారు.. తన ఆస్థాన కవి కుటుంబానికి సాయముగా!
అక్కడికి వెళ్ళాక తెలిసింది ఎర్రనాదులకి, రాజధానిలో నివాసమునకు, ఇతర పల్లెలో నివాసమునకు భేదము.
గుడ్లూరులో కానీ, చదలవాడలో కానీ జీవనము నిదానము.
వీధులన్నీ నిదురవోతున్నట్లుంటాయి. అప్పుడూ అప్పుడూ వినపడే ఎడ్లబళ్ల గంటలు తప్ప ఇంకేమీ ఉండదు.. పక్షుల కిలకిలా రావాలు అదనం.
ఏదయినా పంటపొలాల మీది పనులను బట్టి ఉంటుంది దిన చర్య.
నాట్లు, ఏరువాక, కోతలు, ఊడుపులు.. సంతకి పంట తోలుకెళ్ళడం..
ఆ పనులను బట్టి పూజలు, వ్రతాలు, అభిషేకాలు.. అక్షరాభ్యాసాలు, వివాహాది శుభకార్యాలు. చదువు నేర్చే వారు కూడా తక్కువే.
అద్దంకిలో జీవనము రాజుగారి రాకపోకలమీద ఆధారపడి ఉంటుంది.
రాజ్యపరిపాలన.. సుంకములు వసూలు చెయ్యడం, వర్తకుల బేరసారాలు.
వీధుల్లో సందడి, కోలాహలము తెలతెలవారుతూనే మొదలు.
మల్లారెడ్డి ప్రభువు సోదరునివద్దకు వస్తే అదొక విశేషము. బళ్ళకొలదీ సుగంధ ద్రవ్యములు, చీనిచీనాంబరాలు, సువర్ణాభరణములు.. వజ్ర వైఢూర్యములు వీధుల వెంట వెళ్తుంటాయి.. బళ్ళముందు, వెనుక సైనికులు కవాతు చేస్తుండగా.
వ్యవసాయము కూడా ఉంటుంది కానీ, అది పట్టణమునకు దూరముగా.. నదినుండి కాలువలు, చెరువులు తవ్వి నీటి సదుపాయము చేశారు.
కొత్తగా కట్టే కొండవీటి కోటలోకూడా బావులు తవ్వి నీరు సమృద్ధిగా ఉండేలాగు చేస్తున్నారు. కోట, కొండ మీద ఉంటుంది కనుక బావులు చాలా లోతుగాఉంటాయి. చాలా పొడవాటి తాడు ఉంటే కానీ చేదకి నీరు అందదు.
కోట కట్టేటప్పుడు ఎంత నీరు ఉన్నా సరిపోదు. తోడుతూనే ఉండాలి పొడవాటి తాళ్ళతో.
అందుకే ఏదయినా సాగదీస్తుంటే.. “కొండవీటి చాంతాడులా" అనే నానుడి వచ్చింది.
అప్పుడప్పుడు ఎర్రనకూడా రాజుగారి వెంట వెళ్ళవలసి వస్తుంది.. కావ్యకథా కాలక్షేపానికి.
పాడిపంటలకి, గృహ వసతికి, అన్న వస్త్రాలకి లోటు లేకుండా వైభవముగా సాగిపోతోంది జీవనం, వేమారెడ్డి పాలనలో. ఇండ్లలో ఆడవారు వంటి నిండా నగలతో మహలక్ష్ముల్లా తిరుగుతున్నారు నట్టిళ్ళల్లో.
నెమ్మదిగా సూరనగారి కుటుంబంలో అందరూ కొత్త ఊరికి, కొత్త ఇంటికీ అలవాటుపడ్డారు.
ఇంక ఆస్థానకవి కావ్యరచన ప్రారంభించవలసిన సమయము ఆసన్నమయింది.
ఎర్రాప్రగడ మనములో అలజడి ఆరంభమయింది.
ప్రగాఢమైన కోరిక ఆ మనమున ఉదయించింది.
“ఎప్పుడో చిన్నతనమునుండీ వినయముతో నాలుగక్షరములు నేర్చుకొనబట్టి చాపల్యం కలిగింది.. రచన చేయకున్న మనసు నిలకడగా ఉండుట లేదు. ఏమియు తోచదు.. నోట నన్నమెక్కదు. కంటికి నిదుర రాదు" అనుకుంటూ దేవతార్చన అయ్యాక పూజా గృహమున అట్టే కూర్చున్నారు ఎర్రనగారు .
ఆద్యులు, మహాకవులు కావ్యరచన చేసి సంపాదించిన కీర్తి వంటిది తనకి కూడా రావాలను కాంక్షతో కన్నులు మూసి ధ్యానం లోనికి వెళ్ళిపోయాడు.
ఎదుట తాతగారు నిలిచినట్లనిపించింది. ఎప్పటిలాగ తనతో మాటలాడుచూ.. తనకి త్రోవ చూపించడానికి సిద్ధపడి వచ్చినట్లు మఠం వేసికొని కూర్చున్నారు.
“ఎర్రనా! నీవు కావ్యకర్తవై ప్రబంధపరమేశ్వరుడనే బిరుదు పొందావు. నన్నయ భట్టారకుని, తిక్కనకవీంద్రుల కెక్కిన భక్తి పెంపుతో అరణ్యపర్వశేషోన్నయం ఆంధ్రభాషలో సుజనుల మెప్పుపొందునట్లు చక్కగా నిర్వహించావు.
శంభుదాసుడను పేరుతో నీవు పరమేశ్వర భక్తుడవైనా నీకు గోవిందుని గుణాదరణ ఉంది. గురు భక్తి ఉంది. ధర్మశాస్త్ర కథా విస్తరవేదివి. వినయము కలవాడవు. తులలేని అనుభవం ఉన్నవాడివి.
నీకు సహజంగా ప్రబంధరచనా పాటవం అబ్బింది.
అహోబిల నరసింహస్వామి నా ఇష్ట దైవం. ఆతని వైభవం, అవతార మహిమ నీ మధురోక్తి గుంభనతో మనీషులు మెచ్చుకునేట్లు ప్రస్తుతించు."
ఈ మాటలు చెప్పి తాతగారు, ఎర్రపోతసూరి అంతర్ధానమైనారు.
ఎర్రన పరమానంద భరితుడై కనులు తెరిచాడు. తనువు పులకరించింది.
మనసు వికసించింది.
కర్తవ్యం స్ఫురించింది.
"ఇది ఈశ్వరానుశాసనం. నృసింహావతార సంస్తవ సరణిని ప్రబంధం రచిస్తాను" అని నిశ్చయించుకున్నాడా ప్రబంధ పరమేశ్వరుడు.
………………….
"నృసింహ పురాణం"
ఎర్రనగారి తొలి సంపూర్ణ ప్రబంధరచన..
బ్రహ్మాండాది పురాణముల నుండి కథను తీసుకున్నానని పీఠికలో వ్రాశారు ఎర్రన. బ్రహ్మాండ పురాణంలో ఈ కథ నిడివి చాలా చిన్నది. విష్ణుపురాణం కొంత ఆధారమయింది.
సంస్కృత నృసింహ పురాణానికీ ఎర్రనగారి పురాణానికీ చాలా భేదముంది. అందుకనే ఎర్రన పీఠికలో ఆ పేరు చెప్పలేదు.
చిన్న కథను తీసుకుని విపులమైన వర్ణనలతో నృసింహ పురాణం వ్రాశారు ఎర్రన. ప్రబంధ లక్షణములలో నది ఒకటి. కావ్యం వర్ణనాత్మకంగా ఉండాలి. వర్ణనల వల్లనే ఎర్రనగారి కావ్యాలకి ఆ పేరు, ఎర్రనకి ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదు వచ్చాయి.
కానీ అనువాద కావ్యానికి ప్రబంధమనే పేరు తగదని, అది స్వతంత్ర రచన అయుండాలని విజ్ఞులు, పండితులు చెప్పారు.
ఆ విధముగా చూస్తే ఎర్రనగారి కావ్యాలు నిజంగా ప్రబంధాలు కావు.
అయిన తిక్కనగారు కూడా తన పదిహేను పర్వాల భారతాన్ని ప్రబంధాల మాల అన్నారు. వారి తరువాతి కాలంలో ప్రబంధ లక్షణాలను నిర్వచించి ఉండవచ్చు.
ఏది ఏమైననూ..
మన ప్రబంధ పరమేశ్వరుని కావ్యము
మనము ప్రబంధమనే అనుకుందాము.
తాత ఎర్రన ఆదేశము ఈశ్వరుని అనుగ్రహము
అహోబలేశుని ఆశీర్వచనము, తెలుగు భాషకు మకుటాయమానము
ఆ నృసింహ పురాణము వాగ్దేవికి నీరాజనము.
ఎర్రాప్రగడవారి నృసింహ పురాణం, పోతనగారి భాగవతం వల్ల ప్రహ్లాదుడు తెలుగింటి పాపడయ్యాడు.
నరసింహావతారం ఆంధ్రులకు, ఆంధ్ర దేశానికి అత్యంత ఆదరణీయము.
స్త్రీలు ఇంటిపనులు చేసుకుంటూ సన్నగా రాగయుక్తంగా ప్రహ్లాదుని విష్ణు స్తుతిని పాడుకుంటారు.
పోతనగారి ప్రశస్తమైన భాగవత పద్యాలకి స్ఫూర్తి ఎర్రనగారి పురాణం.
“కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాధు వర్ణించు జిహ్వజిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
కుంభినీదవు జెప్పెడి గురువు గురువు
తండ్రి హరి జేరుమనియెడి తండ్రి తండ్రి”
ఈ విధంగా శ్రీహరిని ప్రార్ధించుటయే ప్రామాణికముగా చెప్పారు పోతన.
జగత్ప్రసిద్ధమయిన ఈ పద్యమునకు ఎర్రనగారి పద్యం భావ స్ఫూర్తినిచ్చినట్లుంది.
“హరి భక్తుల తపము తపము
హరి భక్తుల జపము జపము హరి భక్తుల భా
సురజన్మము భవసారము
హరి భక్తులు భువన పావనైక విహారుల్."
ఇదే విధంగా నిషేధరూపమైన ఈ పద్యం కూడా ఎర్రనగారు చెప్పారు.
“వాసుదేవుని పాద వనరుహంబుల భక్తి
తగదను తండ్రియు దండ్రి కాడు
వేద చోదితమైన విష్ణు ధర్మమునకు
గోపించు గురుడును గురుడు కాదు
భవ దుఃఖములు మాన్ప బ్రభువైన హరిసేవ
నెడలించు హితుడును హితుడు కాడు
పరయోగ మతమగు వైష్ణవ జ్ఞానంబు
వదలిన చదువును జదువు గాదు
కేశవాకార లీలలు గీలుకొని ముదంబు
బొందని తలపును దలపుగాదు
మాధవస్తోత్ర ఘన సుధా మధుర రుచుల-
జిలుకకుండెడు జిహ్వ జిహ్వ గాదు."
ఈ పద్యం హాయిగా పాడుకోవడానికి లయబద్ధంగా ఉంది. అయితే పోతనగారి పద్యం పాడుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది. ఎర్రన గారి ఈ పద్యం కొంచెం ఘాటుగా, నిష్ఠూరంగా ఉంటుంది.
అదే.. "అవును", "కాదు" ల మధ్య భేదము.
ప్రహ్లాదుడు తండ్రికి విష్ణు ద్వేషము తగదని చెప్తూ, విష్ణుని మీద భక్తి పెంచుకోమని బ్రతిమాలడం ఎంతో చక్కగా చెప్పారు ఎర్రన.
నిన్నింత వాని చేసిన ఆ బ్రహ్మకి హరి తండ్రి. ఆతని మీద కోపము వదులు అని చెప్తాడు.. చక్కని కంద పద్యంలో.
అందంగా కందం అల్లడం ఎర్రనకే చెల్లు.
“నిన్నింత వాని జేసిన,
యన్నాలుగు మోములతడు హరిపొక్కిటయం
దున్న వెలి దమ్మియీనిన,
కున్నయగుట తెలిసి విడువు కోపము తండ్రీ.”
అంతే కాదు..
“ఇందుగలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి జూచిన
నందందే గలడు దానవాగ్రణి వింటే.” అనే పోతనగారి ప్రసిద్ధ పద్యము కూడా ఎర్రనగారి భావమే.
ఈ క్రింది పద్యాన్ని చూస్తే పోలిక ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాకపోతే పోతన పద్యంలోని క్లుప్తత దానికి ప్రాచుర్యాన్ని సంపాదించింది.
“కలడు మేదిని యందు కలడుదకంబుల
గలడు వాయువునందు గలడు వహ్ని
గలడు భానుని యందు గలడు సోముని యందు
గలడంబరమున గలడు దిశల
గలడు చరంబుల గల డచరంబుల
గలడు బాహ్యంబున గలడు లోన
గలడు సారంబుల గలడు కాలంబుల
గలడు ధర్మంబుల గలడు క్రియల
గలడు కలవాని యందును గలడు లేని
వాని యందును గలడెల్లవానియందును
ఇంక వేయును నేల సర్వేశ్వరుండు
కలడు నీయందు నాయందు కలడు కలడు."
ప్రచార సాధనములు, ప్రజల రాకపోకలు అధికమవుట వలననో ఏమో గాని, తెలుగింట్లో, తెలుగు వారి వంటింట్లో పోతనగారి భాగవతంలో ప్రహ్లాదునికి ముద్దు మురిపాలు ఎక్కువే. నిరంతరం వారి నాలుకల మీద నడయాడుతూ ఉంటాడు.
ఎర్రనగారి నృసింహపురాణ ప్రహ్లాదునికి అవి తక్కువ.
ఎర్రాప్రగడ శివుని అవతారమని పేరుపొందిన శంకరస్వామి శిష్యుడు. పరమేశ్వరుని భక్తుడు.
ఏ కార్యమున కైననూ ఈశ్వరానుగ్రహము కావాలనుకుంటాడు శంభుదాస బిరుదాంకితుడు. అయిననూ విష్ణువును కీర్తించేటప్పుడు ప్రహ్లాదుని వలెనే మైమరిచిపోతాడు.
ఒక అక్షరంతో ఏ పదమైనా మొదలుపెడితే అదే అక్షరంతో వీలైనంత వరకూ సాగిపోవడం వారి రచనలోని ప్రత్యేకత.
"ఆదిదేవు డంబుజాక్షు డధోక్షజు డక్షనుండు.." అని అరణ్యపర్వంలో వ్రాశారు. అదే పద్ధతి నృసింహపురాణంలో కూడా కనిపిస్తుంది.
కొన్ని ఇష్టమయిన సంక్లిష్ట పదాలు తన రెండు కావ్యాలలోనూ వాడారు.
"స్ఫురదరుణాంశు రాగరుచి.." అనే మధుర పదం రెంటిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
…………………
.....మంథా భానుమతి