కాకి-చిలుక-పిచ్చుకల కథ

కాకి-చిలుక-పిచ్చుకల కథ     అనగనగా ఒక అడవిలో ఒక కాకి, పిచ్చుక, చిలుక ఉండేవి. కాకి, పిచ్చుక చాలా మంచి స్నేహితులు- కానీ చిలుక మాత్రం కాకిని చూసి ఊరికే అసహ్యించుకుంటూ ఉండేది. ఒకరోజు కాకి, పిచ్చుక రెండూ ఎందుకనో చాలా వాదించుకున్నాయి. చిలుక ముందుకొచ్చి, కాకిని మరింత తిట్టి, పిచ్చుకను వెంటబెట్టుకొని పోయింది.   అయితే అదే రోజున నక్క ఒకటి, చిలుకని తినేద్దామని పథకం వేసింది. "చిలుక పడుకున్న సమయం చూసుకొని, మెల్లగా- చప్పుడు కాకుండా- చెట్టు ఎక్కి దాన్ని తినేస్తా" అని ప్లాన్‌ చేసింది.   ఆ రోజు రాత్రి చిలుక పడుకోగానే నక్క వచ్చి, గుట్టు చప్పుడు కాకుండా చెట్టెక్కబోయింది. అయితే అక్కడే ఉన్న కాకి దాన్ని చూసింది. ఇంకేముంది? ఒక్క సారిగా నక్క మీదికి దూకింది- ఎక్కడ పడితే అక్కడ పొడవటం మొదలు పెట్టింది.  కాకి ధాటికి తట్టుకోలేని నక్క మూలుగుతూ పోరాటం మొదలు పెట్టింది. వాటి ఆ అరుపులకి మేల్కొన్నది చిలుక. తన చుట్టూ ఏం జరుగుతున్నదో చూసి, అది గబగబా లేచి ఎగిరిపోయింది. అటు నక్క కూడా 'బ్రతుకు జీవుడా' అని తోచిన దారిన పరుగు పెట్టింది. ఇప్పుడు చిలుక చాలా మారిపోయింది. కాకి మంచితనాన్ని అర్థం చేసుకున్నది. దానికి ధన్యవాదాలు చెప్పింది. అప్పటి నుంచి కాకి-చిలుక-పిచ్చుక మూడూ మంచి స్నేహితులైపోయాయి. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

చదువుల తల్లి

చదువుల తల్లి...!   పోరుబండలో సుధా విద్యాలయాన్ని నడిపే సోమప్పగారిది మంచి మనసు. తన బడిలో డబ్బున్న పిల్లలతో బాటు కొందరు పేద పిల్లల్ని కూడా, ఫీజు లేకుండా చేర్చుకునేవాడాయన. ఆ బడిలో సుప్రీత్‌ , జనార్ధన్ అనే ఇద్దరు పిల్లలు, బాగా చదివేవాళ్ళు. సుప్రీత్‌ బాగా డబ్బులు ఉన్న కుటుంబం వాడు; జనార్దన్‌ పేద కుటుంబంవాడు. సుప్రీత్‌కు తెలివి తేటలతోబాటు, డబ్బులు తెచ్చిన అహంకారం కూడా బాగా ఉండేది. ఎప్పుడూ జనార్దన్‌ని "మీకు డబ్బు లేదురా! మా డబ్బున్న వాళ్ళ పక్కన కూర్చోకు!" అని వెటకరిస్తూ ఉండేవాడు. అయితే జనార్దన్‌కి చదువు మీద ఉన్న ఇష్టాన్ని ఏ అవమానాలూ తగ్గించలేక పోయాయి. వాడు మనసు పెట్టి చదివి, అన్ని పరీక్షలలోనూ సుప్రీత్‌కంటే ఎక్కువ మార్కులే తెచ్చుకునేవాడు; పైపెచ్చు అందరితోటీ మర్యాదగా మెలిగేవాడు.   ఒకసారి సుప్రీత్‌ పుట్టిన రోజు వచ్చింది. ఆ రోజున వాడు క్లాసులో అందరికీ తినుబండారాలు పంచి, చాలా గొప్పగా పండుగ జరుపుకొన్నాడు. కొన్ని రోజుల తరువాత జనార్దన్‌ పుట్టిన రోజు. వాడి దగ్గర డబ్బులు ఏమాత్రం లేవు. అయినా తమ టీచర్లు చెప్పిన దేశనాయకులని తలచుకొని, కథల్లో చదివినట్లు, తన పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్కని నాటి సంతోషపడ్డాడు వాడు. వాళ్ళ బడిలో ఆటలు ఆడాలంటే "షూస్" తప్పకుండా ఉండాలి. డబ్బులున్న పిల్లలంతా "షూస్" కొనుక్కున్నారు. కానీ జనార్ధన్‌కి అవి ఎక్కడినుండి వస్తాయి? వాళ్ళ అమ్మ-నాన్న ఇద్దరూ కూలి పని చేసుకొని బ్రతుకుతారు. ఒక్క రోజున కూలికి వెళ్ళకపోయినా పూటగడవదు. దాంతో వాడు ఆలోచించి, స్కూల్లో ఎవరో పారేసిన పాడైపోయిన "షూస్"ని తీసుకెళ్ళి, సొంతగా రిపేరు చేసుకొని వేసుకున్నాడు. అది చూసిన సుప్రీత్, ఇతర పిల్లలు వాడిని ఒకటే ఆట పట్టించారు. అయినా జనార్దన్ పట్టువదలకుండా ఆడి, పెద్దలందరినీ మెప్పించాడు.   ఆ రోజుల్లో జనార్దన్‌కి వ్యాపారం చేయాలని ఉండేది. సోమప్పగారు వాడిని అడిగారు ఒకసారి- "జనార్దన్! నువ్వు పెద్దయినాక ఎవరవుతావు?" అని. "సార్! నేను సుప్రీత్ వాళ్ళ నాన్న మాదిరి గొప్ప వ్యాపారిని అవుతాను సార్!" టక్కున జవాబిచ్చాడు జనార్దన్. "ఎందుకు, అట్లా ఎందుకు అనుకుంటున్నావు?" అడిగారు సోమప్ప, ఆశ్చర్యంగా. "వ్యాపారి ఐతే డబ్బులు బాగా సంపాదించచ్చు సార్; హాయిగా బ్రతకచ్చు; మీలాగా పదిమందికి సాయం కూడా చేయచ్చు" చెప్పాడు జనార్దన్. ఆయన నవ్వి "బాగుందిరా. అయినా నేనో సంగతి చెబుతాను వింటావా? నీలాంటి తెలివైన మంచి పిల్లలు ఊరికే పది మందికి సాయం చేయటంతో ఆగిపోకూడదు- ఉన్నత ఉద్యోగాలమీద దృష్టి పెట్టి, ఏ కలెక్టర్లో అయి, వందలాది మందికి దిశానిర్దేశం చేయాలి. లక్ష్యాలంటూ ఉంటే అవి సమున్నతంగా ఉండాలి. వాటికోసం నిరంతరంగా కృషి చేయాలి. నువ్వు ముందు చక్కగా రాయటం సాధన చెయ్యి. మన దేశంలోనూ, బయటా ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటూ‌ ఉండు. రోజూ కనీసం ఒక అరగంటసేపు వార్తాపత్రికలు చదువు" అన్నాడు.   ఆయన మాటలు జనార్దన్ మనసులో చెరగని ముద్ర వేసాయి. ఇక ఆరోజునుండి వాడు సమయాన్ని ఇంకా చక్కగా వినియోగించుకున్నాడు. రోజూ ఉదయాన్నే పేపరు వేస్తూ అలా పాఠ్య పుస్తకాలతోబాటు పేపరు కూడా చదివే అలవాటు చేసుకున్నాడు. వ్యాసాలు చదవటం, సొంతగా రాయటం, వక్తృత్వ పోటీల్లో పాల్గొనటం మొదలు పెట్టాడు. చక్కని మార్కులతో పదవ తరగతి పాసయ్యాడు. వాడు ఇంటర్మీడియట్లో‌ ఉండగా వాళ్ళ నాన్నకి జబ్బుచేసి చనిపోయాడు. అటుపైన జనార్దన్ ప్రొద్దునంతా చదువుకొని, రాత్రిపూట హోటల్‌లో పనిచేసాడు. ఆ డబ్బులతోటే ఇల్లు నడిపాడు; చెల్లినీ చదివించాడు. ఎన్ని కష్టాలొచ్చినా తన లక్ష్యాన్ని మరచిపోని జనార్దన్ చివరికి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి, ఐయేయస్ అధికారి అయ్యాడు. ఎన్ని పదవులు అధిరోహించినా తన మూలాల్ని మర్చిపోలేదు జనార్దన్. నిజాయితీ, కార్యశుద్ధి గల అధికారిగాను, దయగల మంచి మనిషిగాను పేరుతెచ్చుకున్నాడు. తనలాగా కష్టాల్లో ఉన్న వందలాది మందికి సరైన దారి చూపిస్తూ వచ్చాడు. వ్యాపారంలోను, ఇతర రంగాలలోను రాణించి కూడా స్వార్థ చింతనలోంచి బయటికి రాలేని మిత్రుల్ని చూసినప్పుడల్లా సోమప్పగారు చెప్పింది గుర్తు చేసుకునేవాడు జనార్దన్: "డబ్బు సుఖాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ చదువుల తల్లి మనకు మంచితనాన్ని ఇచ్చి, పదిమందికి సాయపడేలా చేస్తుంది" అని. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

మట్టి పాత్ర

మట్టి పాత్ర   అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. "ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి" అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు. ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. "స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా?" అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ.   శివుడు నవ్వి, "దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది" అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. "ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా; ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి" అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు.   మొదట 'ఇదేదో అద్భుతమైన కల' అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ఓ మట్టిపాత్ర కనిపించింది శంకరశాస్త్రికి. ఆయన చాలా భక్తిగా ఆ మట్టిపాత్రను తాకి చూసాడు: అది రంగు మారలేదు! అయితే స్వతహాగా మంచివాడైన శంకరశాస్త్రి అందుకు బాధపడలేదు. "నేను ఇంకా పుణ్యం‌ సాధించాలి అని తెలియజేసేందుకుగాను భగవంతుడు ఇచ్చిన కానుక ఇది! ఇప్పుడిక దీన్ని కొలమానంగా వాడి, ఆలయానికి వచ్చేవాళ్ళలో అసలైన పుణ్యాత్ములెవరో గుర్తిస్తాను. వాళ్ళ అడుగుజాడల్లో నడచి, నేనూ పవిత్రుడినౌతాను" అనుకున్నాడు. ఆ రోజునుండీ గుడికి వచ్చే భక్తులందరిచేతా ఆ మట్టి పాత్రను తాకించేవాడు ఆయన. చుట్టుపక్కల గ్రామాల్లో అన్నదానాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి పేరెన్నిక గన్న భక్తులు ఎందరో వచ్చి మట్టిపాత్రను తాకారు. ఎంతమంది తాకినా అది మట్టి పాత్రగానే ఉండింది తప్ప, రంగు ఏ కొంచెం కూడా తిరగలేదు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి, మహా శివరాత్రి సందర్భంగా గుడిలో వేడుకలు జరుగుతున్న సమయంలో, ఎవరో ఒక బాటసారి అటుగా వచ్చాడు- మాసిన గడ్డంతో, మురికి పట్టిన వస్త్రాలతో- దైవదర్శనం కోరి వచ్చాడు.   చలి బాగా ఉన్నది. ఆ సమయంలో మెట్ల దగ్గర అడుక్కుంటూన్న ముసలాయన ఒకడు చలికి వణికిపోవటం మొదలెట్టాడు. భక్తులందరూ ఎవరి తొందరలో వాళ్ళు ఉడ్న్నారు- అతన్ని ఎవరూ గమనించలేదు; గమనించినా పట్టించుకోలేదు. పూజారి శంకరశాస్త్రి కూడా ముసలాయన్ని చూసి; జాలి పడ్డాడు- కానీ "ఇంత రద్దీ ఉన్న సమయంలో నేను ఏం చేయగలను?" అనుకొని ఊరుకున్నాడు. అయితే వచ్చిన ఆ బాటసారి మటుకు ముసలాయన దగ్గర ఆగాడు. తన భుజం మీద ఉన్న కంబళిని తీసి అతనికి కప్పాడు. ఆ పైన తన చొక్కా కూడా తీసి అతనికి తొడిగాడు. బయటికి వెళ్ళి, వేడి వేడి టీ తెచ్చి అతని చేత త్రాగించాడు. భగవంతుడికి అర్పించేందుకుగాను తను తెచ్చిన పండును కూడా ముసలాయనకు ఇచ్చివేసాడు. ఆ తర్వాత ఒట్టి చేతులతో గుడిలోకి వచ్చాడు.   గమనించిన శంకరశాస్త్రి ఆలోచనలో పడ్డాడు. "ఈ ముసలతన్ని నేను రోజూ చూస్తుంటాను; పలకరిస్తుంటాను- అయినా అతనికి సాయం అవసరమైనప్పుడు నేను ముందుకు రాలేదు. ఈ బాటసారి ఎవరో నిజంగానే పుణ్యాత్ముడు- తను కప్పుకున్న చొక్కాని కూడా కరుణతో ఇచ్చేసాడు. పరోపకారాన్ని మించిన ధర్మం లేదు అని శాస్త్రం ఘోషించటంలేదా? నేను నా ధర్మాన్ని విస్మరించాను. ఇక ఎప్పుడూ అలా చేయను. ఇతరుల కష్టాల్ని తీర్చేందుకు నావంతుగా కృషి చేస్తాను!" అనుకుంటూ సిగ్గుపడ్డాడు.   ఇన్నాళ్ళుగా లేనిది, ఆ రోజున ఆయన చేయి సోకగానే మట్టి పాత్ర కొద్దిగా బంగారు వర్ణంలోకి మారినట్లు తోచింది- బాటసారి చేయి సోకే సరికి అది నిజంగానే వెలుగులు చిమ్మింది! ఆనందాతిశయంతో కళ్ళు మూసుకున్న పూజారి శంకరశాస్త్రి కళ్ళు తెరిచి చూసే సరికి ఎదురుగా బాటసారి లేడు! 'సాక్షాత్తూ శివుడే ఈ రూపంలో తనకు మార్గం చూపించాడు' అనిపించింది, ఆశ్చర్యంతో నోరు తెరిచిన శంకరశాస్త్రికి. అటుపైన "ఏలాంటి ప్రయోజనాన్నీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలి అందరం- అదే పుణ్యం అంటే!" అని ఆచరణలో చూపిస్తూ చరితార్థుడైనాడాయన. కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తూ, శివాలయాలు తిరిగేటప్పుడు ఈ కథలోని స్ఫూర్తిని గుర్తుచేసుకుంటారు కదూ?  కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

తులసి

తులసి   రంగన్నది పేద కుటుంబం. వాళ్ళ నాన్న చెడు అలవాట్లకు బానిసై, ఇల్లంతా గుల్ల చేసి, చివరికి చనిపోయాడు. అమ్మ ఒక్కతే పిల్లల్ని నలుగురినీ పెంచలేక తంటాలు పడసాగింది. ఇంట్లో రంగన్నే పెద్ద పిల్లవాడు. దాంతో వాడే ఇంటి బాధ్యతంతా నెత్తిన వేసుకున్నాడు. కూలికి పోయాడు; చదువుకు స్వస్తి చెప్పాడు. చెల్లెలినీ, తమ్ముళ్ళిద్దర్నీ చదివించాడు. ఆలోగా వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. తమ్ముళ్లిద్దరూ అన్న చదివించిన చదువు సహాయంతో మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. రంగన్నే ఇద్దరు తమ్ముళ్ళకూ పెళ్ళి చేశాడు. పెళ్ళి అవ్వగానే వాళ్ళిద్దరూ వేరుపడ్డారు. ఎవరికి వాళ్ళు సుఖంగా బ్రతకటం మొదలు పెట్టారు. చెల్లెలి చదువు పూర్తయిందిగానీ, ఆ సరికి ఇక రంగన్న దగ్గర ఏమీ లేకుండా అయ్యింది. రంగన్నే ఆ పిల్లకు ఏదో‌ ఉద్యోగం తెప్పించి, తగిన కుర్రాడిని చూసి పెళ్ళి చేసాడు.   తర్వాత రంగన్నను ఇంక ఎవరూ పట్టించుకోలేదు. రంగన్న కూలి పని ఆపి, గుజిరి వ్యాపారం (పాత సామాన్లు అమ్మే వ్యాపారం) లోకి దిగాడు. పనిలో పరిచయమైన సరోజను పెళ్ళి చేసుకున్నాడు. సరోజకూ వేరే ఎవ్వరూ లేరు. భార్యాభర్తలిద్దరూ కలిసి వ్యాపారాన్ని నడిపిస్తూ వచ్చారు. కొద్ది రోజులకు వాళ్ళకో కూతురు పుట్టింది, అమ్మాయికి తులసి అని పేరు పెట్టారు. ఊహ తెలిసిన నాటినుండి తులసి తల్లి దండ్రులకు సహాయంగా ఉండేది. బడి ముగిసిన తరువాత ఆ పాప కూడా గుజిరి అంగడి దగ్గరే గడిపేది. అక్కడంతా కూర్చొని పాత పుస్తకాలు, పేపర్లు చదువుతూ వచ్చింది. గుజరీ దుకాణం ద్వారానే ఆ పాపకు విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు అనేకం పరిచయమైనాయి. గొప్ప గొప్ప వాళ్ల జీవిత చరిత్రలు దొరికాయి; రకరకాల కథలు, నవలలు, సాంఘిక శాస్త్ర గ్రంధాలు అందాయి.  అలా ఆ పాపకు చక్కని సామాజిక దృష్టి ఒకటి ఏర్పడింది.   గుజరీ దుకాణం‌ పుణ్యాన తులసి రకరకాల విషయాలు తెలుసుకొన్నది; ఉద్యమాలలో పాలు పంచుకున్నది; పోటీ పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది; మంచి ఉద్యోగం కూడా తెచ్చుకున్నది. రంగన్న శ్రమ జీవన సౌందర్యాన్ని, తులసి తెలివితేటలను, పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. శ్రమించేందుకు భయపడని రంగన్న, సమస్యలను జ్ఞాన సముపార్జనకు సాధనాలుగా మార్చుకున్న తులసి అనేకమందికి స్ఫూర్తి నిచ్చారు. అటు తర్వాత రంగన్న తమ్ముళ్ళు, చెల్లెలు అందరూ మళ్ళీ కలిసారు. రంగన్న వాళ్లను, వాళ్ళ పిల్లల్ని ఎప్పటి మాదిరే ఆదరించాడు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

మహాకాలుని గాథ

మహాకాలుని గాథ   బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో సేతవ్యం అనే పట్టణం ఒకటి ఉండేది. చూలకాలుడు, మహాకాలుడు అనే ఇద్దరు సోదరులు ఆ పట్టణ పరిసరాలలో వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. ఒకనాడు వాళ్లిద్దరూ సరుకులు తీసుకొని వస్తూ ఉండగా దారిలో ఒక గ్రామంలో చాలా మంది ఒకచోట గుమిగూడి ఉండటం కనిపించింది. సోదరులు ఇద్దరూ ఉత్సుకత కొద్దీ అక్కడికి వెళ్లి చూసారు. ఆ సమయంలో బుద్ధుడు అక్కడ ప్రవచనం ఇస్తున్నాడు: “ఈ శరీరం, ఇంద్రియాలు, మనస్సు- అన్నీ క్షణికాలే! అన్నీ నశించేవే! భావనలు అన్నీ అనిత్యాలే!!” అని తార్కికంగా, అందరికీ అర్థమయ్యేట్లు వివరిస్తున్నాడు బుద్ధుడు. ఆ ప్రవచనం మహాకాళుడిని లోతుగా కదిలించింది. ప్రవచనం పూర్తయ్యేసరికి మహాకాలుడు బుద్ధుడిని చేరుకొని, తనను కూడా శిష్యునిగా స్వీకరించమని వేడుకున్నాడు. చూలకాలుడు అతనిని వారించేందుకు చాలా ప్రయత్నించాడు. 'లాభదాయకమైన వ్యాపారాన్ని వదులుకోవడం ఎందుకు?' అని అనేక విధాలుగా చెప్పి చూసాడు. అయినా మహాకాలుడు తన పట్టు వీడలేదు. సన్యాస దీక్ష తీసుకోనే తీసుకున్నాడు.   చూలకాలుడు కొద్ది సేపు ఆలోచించాడు. 'ఇతన్ని వెనక్కి తీసుకుపోవాలంటే మార్గం ఏంటి?' అని. ఆ వెంటనే అతను కూడా బుద్ధున్ని సమీపించి సన్యాస దీక్ష తీసేసుకున్నాడు. 'ఏదో ఒక సమయంలో తను మహాకాలుడిని కూడా ఒప్పించి అతనితో బాటూ సన్యాసాశ్రమం నుండి వెనక్కి మరలిపోవచ్చు' అని ఆశించాడు చూలకాలుడు. అటు మహాకాలుడు బుద్ధుడు చూపిన మార్గంలో చాలా వేగంగా ముందుకుపోయాడు. తాను తీవ్రంగా కృషి చేస్తూ, తనలోని ప్రజ్ఞను మేల్కొలుపుకొని, 'అరిహంతుడు' అయ్యాడు. చూలకాలుడు మాత్రం అతనిని వెనక్కి లాగేందుకు కొనసాగిస్తూనే ఉన్నాడు. కొన్నాళ్లకు బుద్ధుడు తనతోటి భిక్షవులతో సహా సేతవ్యం చేరుకున్నాడు. నగరం బయట ఉన్న శింశుపా వనంలో వాళ్లందరికీ బస ఏర్పాటు చేయబడింది. నగరంలోని ప్రముఖులంతా ఒకరొకరుగా బుద్ధుడిని, భిక్షువులను తమ ఇళ్లలో భిక్షకు ఆహ్వానిస్తూ వచ్చారు. చూలకాలుడు వదిలేసిన కుటుంబ సభ్యులు కూడా ఒకనాడు ఆయన్ని శిష్యులతో సహా తమ ఇంటికి భిక్షకు రమ్మని ఆహ్వానించారు! ఆ రోజు ఇంకా తెల్లవారకనే చూలకాలుడు ముందుగా బయలుదేరి ఇంటికిపోయాడు. భోజనానికి ఏర్పాట్లు పర్యవేక్షించటం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులకు దగ్గరగా మెలిగాడు. వారి కష్ట సుఖాలు అన్నీ తనవిగా స్వీకరించాడు. ఆ రోజు సాయంత్రం భోజనాలు ముగిసేసరికి చూలకాలుడు సన్యాసాన్ని వదిలి యథా ప్రకారం గృహస్తు వేసుకునే బట్టలు ధరించేసాడు! బుద్ధుడు మిగిలిన శిష్యులతో పాటు శింశుపా వనం చేరుకున్నాడు. తరువాతి రోజున మహాకాలుడి భార్యలు కూడా బుద్ధుడిని శిష్య సహితంగా తమ ఇంటికి భిక్షకు రమ్మని ప్రార్థించారు. 'చూలకాలుడి భార్యల మాదిరే తాము కూడా మహాకాలుడిని వెనక్కి లాక్కోవచ్చు' అని ఆశించారు వాళ్లు. బుద్ధుడు 'సరే'నని శిష్య సమేతంగా వాళ్ల ఇంటికీ వెళ్ళాడు. భోజనాలు అయిన తర్వాత 'కొద్ది సేపు మహాకాలుడిని మాతో వదిలి వెళ్లండి. మాతోపాటు 'అనుమోదన' చేసేంతవరకు అతన్ని ఉండనివ్వండి' అని మహాకాలుడి భార్యలు బుద్ధుడిని ప్రార్థించారు. బుద్ధుడు ఏమాత్రం సంకోచించక, సరేనన్నాడు. మిగిలిన శిష్యులతోపాటు శింశుపావనం బయలు దేరాడు. పట్టణ పొలిమేరలు దాటుతుండగానే భిక్షువర్గంలో కలవరం మొదలైంది.   అనేక మంది భిక్షువులు బుద్ధుని నిర్ణయం పట్ల అసంతృప్తిని, భయాన్ని వ్యక్తం చేసారు. తన సోదరుడు చూలకారుడి లాగే మహాకాలుడు కూడా భార్యలకు లోబడతాడని, భిక్షు సంఘాన్ని వదిలి వేస్తాడనీ వాళ్లంతా అభిప్రాయపడ్డారు. వారిలో కొందరు బుద్ధునితో తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసారు కూడా.  బుద్ధుడు నవ్వి ఇట్లా చెప్పాడు:- "చూలకాలుడు ఇంద్రియములకు లోబడే రకం- బద్ధకస్తుడు; బలహీనుడు; లోపలినుండి కుళ్లిపోయిన చెట్టులాంటి వాడు. కానీ మహాకాలుడు శ్రద్ధ, స్థైర్యం, శక్తి విశ్వాసాలు ఉన్నవాడు- పర్వతంలాగా ఏమాత్రం చలించని హృదయం అతనిది.   సుభానుపస్సిం విహరంతం ఇంద్రియేసు అసంవుతం  భోజనం హి చామత్తన్నుం కు సీతం హీన వీరియం  తం వే పసహతి మారో, వాతో రుక్ఖం వ దుబ్బలం  అసుభానుపస్సిం విహరంతం, ఇంద్రియేసు సుసంవుతం  భోజనం హి చ మత్తన్నుం సద్భం ఆరధ్గవీరియం  తం వే నప్పసహతి మారో, వాతో సేలం వ పబ్బతం  "ఎవరైతే తమ మనసుని కేవలం సుఖాన్నిచ్చే వస్తువుల మీద ఉంచుతారో, ఎవరైతే తమ ఇంద్రియాలని వశంలో ఉంచుకోరో, ఎవరైతే ఆహారాన్ని అమితంగా భుజిస్తూ బద్ధకంగా, శక్తి హీనంగా ఉంటారో- అటువంటి వాళ్లు బలహీనమైన వృక్షం గాలికి కూకటి వేళ్లతో పెకలించి వేయబడినట్లు, తప్పక మారునికి లోబడతారు"    "అలా కాక, ఎవరైతే మనస్సును తనలోని కల్మషాలపై నిలుపుతారో, ఎవరైతే ఇంద్రియాలను తమ ఆధీనంలో ఉంచుకుంటారో, శ్రద్ధ శక్తులు ఎవరిలో అయితే దండిగా ఉంటాయో- అటు వంటి వారు గండ శిలలలో కూడిన పర్వతం గాలికి చలించనట్లు నిశ్చలంగా ఉంటారు; మారునికి ఏమాత్రం లోబడరు” అని వివరించాడు బుద్ధుడు. ఆలోగా మహాకాలుడి కుటుంబ సభ్యులంతా అతన్ని చుట్టుముట్టి, బలవంతంగా గృహస్తు ధరించే వస్త్రాలను ధరింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ అరహంతుడైన 'మహాకాల ధేరుడు' వారి ఉద్ద్యేశాన్ని గ్రహించాడు; అద్భుతమైన ధ్యాన శక్తితో తక్షణమే అక్కడి నుండి మాయమై వచ్చి, బుద్ధుని పాదాలపై వ్రాలాడు. అతని శ్రద్ధా శక్తులను గ్రహించి, అంతకు ముందు బుద్ధుని నిర్ణయాన్ని తప్పుపట్టిన భిక్షువులంతా కూడా 'ధమ్మ శ్రోతస్సు'లో టక్కున నెలకొన్నారు! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

మంచి మనసు

మంచి మనసు     శంకర్‌ వారానికి ఒకరోజు అడవికి పోతుంటాడు- కట్టెలకోసం. ఒకసారి అట్లా కట్టె పుల్లలు ఏరుకొచ్చేందుకు అడవికి వెళ్లాడు. దారిలో ఒక ముసలివాడు ఎదురయ్యాడు. "బాగా ఆకలిగా ఉంది నాయనా, నీ దగ్గర ఏమైనా ఉందా, తినేందుకు?" అని అడిగాడు. శంకర్‌కి అతన్ని చూస్తే జాలి వేసింది. కానీ అతనికి ఇచ్చేందుకు శంకర్‌ దగ్గర ఏమీ లేదు. నిరుత్సాహంగా తల ఆడించి ముందుకు సాగాడు అతను. అడవి అంచుల్లోనే అతనికి ఒక జింక ఎదురైంది.   దాహంతో ఆ చుట్టు ప్రక్కల అంతా వెతుకుతున్నది అది నీళ్ల కోసం. శంకర్‌కి దాన్ని చూసి జాలి వేసింది. కానీ తన దగ్గర కూడా నీళ్లు లేవు- ఏం చేయగలడిక? అట్లానే ముందుకెళ్ళి, తనకు దొరికినన్ని కట్టె పుల్లలు ఏరుకొని మూటకట్టుకున్నాడు. వెనక్కి తిరిగి వెళ్తుంటే ఒక గుడ్డాయన ఎదురయ్యాడు. "నాయనా! వంటకు బొత్తిగా కట్టెలు లేవు. కొన్ని కట్టెలు ఇవ్వగలవా? నేను వండింది నీకు కూడా కొంచెం పెడతాను" అన్నాడు. శంకర్‌కి అతన్ని చూస్తే జాలి వేసింది. "సరే, ఇవి నువ్వు తీసుకో. నేను మరిన్ని ఏరుకొచ్చుకుంటాను" అని తను ఏరిక కట్టెలు అతనికి ఇచ్చేసి, ఆ చుట్టుప్రక్కల దొరికిన కట్టెలన్నీ తనకోసం జమ చేసుకున్నాడు. ఆలోగా వంట పూర్తయింది. గుడ్డాయన తనకు ఇచ్చిన అన్నం మూట కట్టుకొని, కొన్ని నీళ్ళు కూడా తీసుకొని వెనక్కి తిరిగాడు శంకర్.    జింకకు నీళ్ళు, ముసలాయనకు అన్నం ఇచ్చి, తృప్తిగా ఇంటిదారి పట్టాడు. అంతలోనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు శంకర్ ముందు. "ఇంతకు ముందు కనిపించిన జింక, ముసలాయన, గ్రుడ్డాయన అన్నీ నేను సృష్టించినవే. నువ్వు చాలా మంచి పని చేశావు. నీ ఈ సాయం వృధా పోదు" అని అభినందించి మాయం అయ్యాడు! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

తిక్క రాజు కథ

తిక్క రాజు కథ!     అనగా అనగా ఒక తిక్క రాజు గారు ఉండేవారు. వాళ్ల దేశమేమో చాలా పెద్దది. దేశంలో తలెత్తే సమస్యల్ని అన్నిటినీ ఆయనొక్కడే పరిష్కరించాలంటే చేతకావట్లేదు. అందుకని ఆయన తనకి నచ్చిన సలహాదారుల్ని చాలా మందిని పెట్టుకున్నాడు. వాళ్లందరికీ రాజుగారు ఒక్కటే చెప్పేవాడు: "ప్రతిదాన్నీ కొత్తగా ఆలోచించాలి" అని. ఒకసారి ఆయన నిండుగా కొలువు తీరి, తన సలహాదారులని ఇట్లా అడిగారు:  'అ ఆ ఇ ఈ లన్నీ ఇదే వరుస క్రమంలో ఎందుకుండాలి?!' అని.  "మనం అచ్చుల్ని, హల్లుల్ని వేరు చేసి ఉంచాం ప్రభూ!" చెప్పారు పండితులు.  "మరి అచ్చులే ముందు ఎందుకు నేర్పాలి? ముందు హల్లులు నేర్పుదాం!" అన్నారు రాజావారు.  "ఓ నేర్పచ్చు, దానిదేముంది?!" అన్నాడొక సలహాదారు ఉత్సాహంగా.  "కాదు ప్రభూ! ముందు అచ్చులన్నీ చెబితే తర్వాత హల్లులు, గుణింతాలు సులభంగా అర్థం చేయించచ్చు" అన్నాడొక పండితుడు నీరసంగా ముఖం పెట్టి.  "రాజు వారినే కాదంటారా?!" అడిగాడు సలహాదారు ఆయన్ని, కొంచెం బెదిరిస్తున్నట్లు.  "అబ్బె! అబ్బె! కాదని ఎలాగంటాం?! రాజావారు ఎప్పుడూ సరిగానే సెలవిస్తారు!" అనేశారు పండితులు, వెనక్కి తగ్గి.  "అంతే, ప్రభూ! తమరు చెప్పినట్లు, ఇకపైన హల్లుల్నీ ముందు నేర్పుతాం. అచ్చులు వెనక వస్తాయి" నిర్ణయించేసాడు సలహాదారు.    "అంటే 'క‌ ఖ గ‌ ఘ' తో మొదలౌతాయన్నమాట, అక్షరాలు!" గొణిగాడు పండితుడు.  "లేదు! కొంచెం ఆలోచించండి! అట్లానే ఎందుకు నేర్పాలి?" అడిగారు రాజుగారు, మరి కొంచెం‌ ఆలోచిస్తూ.  "క-ఖ-గ-ఘ -ఇవి కంఠ్యాలు-గొంతునుండి వెలువడతై యీ శబ్దాలు-  "చ ఛ జ ఝ -ఇవి తాలవ్యాలు -దవడలనుండి వెలువడే ధ్వనులు… ఇంకా ముక్కుతో పలికేవి అనునాసికాలు.."  "అంటే మీరు అక్షరాల వరసని వాటిని పలికే తీరును బట్టి నిర్ణయించారా?!"  "అవునండి!"  "అందుకేనన్నమాట, మన పిల్లలకు సరిగ్గా రాయటం రావట్లేదు.." సాలోచనగా అన్నారు రాజుగారు.  "అంటే మరి,..ఎలా ఉండాలండి?" అడిగాడొక పండితుడు, బెదిరిపోతూ.  "ఏవి రాసేందుకు సులభంగా ఉంటాయో, అవి ముందు రావాలి. ఉదాహరణకు సున్న. అది రాయటం చాలా సులభం. అది మొదట రావాలి. అట్లాగే 'ల'- ఎంత సులభం, దీన్ని రాయటం?! 'ఎ'- ఇది కూడాను. 'ప' కూడా సులభమే. ఇవన్నీ ముందు వస్తే, పిల్లవాడు బాగా రాయగల్గుతాడు" చెప్పాడు ఒక సలహాదారు.  "అవును- అవును. అట్లా చేయండి" అన్నారు రాజుగారు ఉత్సాహంగా.  "అవును ప్రభూ! చక్కగా సెలవిచ్చారు" అన్నారు పండితులందరూ తలలూపుతూ.  సభ వెనక వరసలో నిల్చొని ఉన్న పిల్లాడొకడు అరిచాడు-"మరి వరసని ఇట్లా మారిస్తే పిల్లలకి 'రాయటం' వస్తుందేమో గానీ, మరి- అప్పుడిక- 'పలకటం' రాదుగా, మళ్ళీ?! అని.  సలహాదారు కోపంగా అరిచాడు-"ఎవరా సాహసి? పండిత చర్చల్లో పామరులా?!" అని.  అంతలో ఇంకో సలహాదారుకు ఆలోచన వచ్చింది-"ఇంకో పని చేయచ్చు ప్రభూ! అక్షరాలని అదే క్రమంలో ఉంచి, వాటి రూపాన్ని మాత్రం మార్చెయ్యటం! ఉదాహరణకు, 'అ' ని త్రిప్పించి మళ్లించి 'అ' అని రాయకుండా, ఊరికే సులభంగా '.' అని రాయచ్చు. 'ఆ' అనాలంటే ఊరికే సరళంగా ',' అనచ్చు. ఇట్లా అక్షరం స్థానం పెరిగేకొద్దీ వాటిని రాయటం కూడా కఠినమౌతూ పోతుంది!"  "ఇది చాలా చక్కని సూచన!" అన్నారు రాజుగారు.  "అంటే ఇప్పుడింక తెలుగు అక్షరాలే ఉండవన్నమాట..!" గొణిగాడు పిల్లాడు.  "ఎందుకు, ఇవే క్రొత్త తెలుగు అక్షరాలౌతాయి! ఆధునిక తెలుగు లిపి చక్రవర్తి' అని మన రాజువారికి పేరు వస్తుంది!" చెప్పాడు పండితుడు ఉత్సాహంగా.  "ఈ ఆలోచనల్ని మన బళ్లలో వెంటనే అమలు చెయ్యండి!" ఆదేశించారు రాజావారు.  "మన భాషకు సులభమైన అక్షరాలు రాబోతున్నాయ్! ఒక్కో చుక్క ఒక్కో అక్షరం కానున్నది" అని రాజ పత్రికలన్నీ రాయటం మొదలుపెట్టాయి.  అయితే రెండేళ్ల తర్వాత కూడా పిల్లలకెవ్వరికీ యీ కొత్త అక్షరాలు రాలేదు; చాలా మందికి పాతవీ రాలేదు.  'ఎందుకు?' అడిగారు రాజుగారు, అప్పుడు.  'నేర్పే టీచర్లకెవ్వరికీ కొత్తది అంతు పట్టలేదు. అందుకని అందరూ పిల్లలకు నేరుగా ఆంగ్లం నేర్పటం మొదలెట్టారు.'  'ఎందుకు?!' అడిగారు రాజావారు.  "చుక్కకంటే గీత సులభం అని కొందరు, గీతకంటే 'కామా' సులభం అని కొందరు వాదులాడుతున్నారండి. కొత్త వాటిపై ఉపాధ్యాయులకే ఇంకా అవగాహన రాలేదు"  'మరైతే పిల్లలకి పాత అక్షరాలే నేర్పమనండి!' అన్నారు రాజావారు.      పండితులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. టీచర్లంతా, మరి- పాతవాటిని వదిలేసారు గదండీ, ఇప్పుడింక వాటి వరసలూ, గట్రా ఎలా ఉంటాయో వాళ్లూ మర్చిపోయారటండి. ఇప్పుడు అందరూ 'ఆంగ్లమే సులభం' అంటున్నారండి"  తిక్కరాజుగారు తలపట్టుకున్నారు. చూస్తూన్న పిల్లాడు "ఏ బీ సీ డీ యీ యఫ్‌ జీ" అని పాడుతూ కిసుక్కున నవ్వాడు.  బడులు, చదువులు, భాష ఇవన్నీ గొప్ప గందరగోళంలో ఉన్న యీ తరుణంలోనే, కొత్త సాంకేతికతలు, వినూత్న బోధనా పద్దతులు, పెట్టుబడులు పాత వాటిని బయటికి నెట్టేస్తున్నాయి; మరోవైపున 'నూతన మదింపులు, నిరంతర సమగ్ర మూల్యాంకనాలు ఉపాధ్యాయులకు ఊపిరి సలపనివ్వట్లేదు. వీటన్నిటి నడుమా పిల్లలు ఇంకా ఏదో ఒకటి నేర్చుకుంటున్నారంటే, అది వాళ్ల ప్రతిభకు నిలువెత్తు తార్కాణం తప్ప మరొకటి కాదు. ఏమంటారు?!   కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో    

ఇంగ్లీషు అల్లుడు

ఇంగ్లీషు అల్లుడు   నాగ సముద్రంలో నివసించే రామయ్య, లక్ష్మమ్మలకు ఇంగ్లీషు రాదు. ఊళ్ళో చిన్న అంగడితో మొదలు పెట్టుకొని, మెల్ల మెల్లగా ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకున్నారు వాళ్ళు. వాళ్లకు ఒక్కగానొక్క కూతురు రమ్య. రమ్యకూ ఇంగ్లీషు రాదు. "ఇన్ని ఆస్తిపాస్తులు ఉండీ ఏం‌ ప్రయోజనం? మాకెవ్వరికీ ఇంగ్లీషు రాదే? కనీసం ఇంగ్లీషు వచ్చిన అల్లుడు వస్తే కదా, మా ఇంట్లో‌ నాలుగు మంచి ముక్కలు వినిపించేది?" అనుకునేవాళ్ళు వాళ్ళు.  ఇంగ్లీషు వచ్చిన అల్లుడి కోసం వాళ్ళు నాగసముద్రంలో అంతటా గాలించారు- అయితే నాగ సముద్రంలో అసలు చదువుకున్నవాళ్ళే దొరకలేదు! ఒకనాడు భార్యాభర్తలిద్దరూ కూర్చొని "దగ్గరి పల్లెల్లో విచారిద్దాం. మనకు కావలసిన అల్లుడికి ఆస్తి పాస్తులేవీ లేకున్నా పర్లేదు" అని మాట్లాడుకున్నారు. ఆ సమయానికే అటుగా పోతున్న దాసప్ప చెవిన పడ్డాయి ఆ మాటలు. "దొరికింది! గిరాకీ దొరికింది!" అని అతని హృదయం గంతులు పెట్టింది. "వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చెయ్యమన్నారు. ఇప్పుడు నేను చెయ్యబోయే పని చాలా పుణ్య కార్యం" అని అతను మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య, లక్ష్మమ్మ దగ్గరకు వచ్చి, "మీ అమ్మాయికి తగిన పిల్లవాడు ఒకడున్నాడమ్మా! మంచి అందగాడు, చదువుకున్నవాడు, చక్కని కుర్రాడొకడు ఉన్నాడు. మాట్లాడమంటారా?" అన్నాడు. లక్ష్మమ్మ ముఖం విప్పారింది. ఆమె దాసప్పకు ముందు చెంబెడు చక్కెర నీళ్ళూ, అవి తాగాక కప్పు నిండా వేడి వేడి టీ నీళ్ళూ తెచ్చి ఇచ్చి "మీరు ఆ మాత్రం‌ పుణ్యం కట్టుకున్నారంటే, మీ రుణం‌ ఉంచుకోం. ఏమంటే మాకు చదువుకున్న అల్లుడే కావాలి- అదొక్కటీ గుర్తుంచుకోండి చాలు!" అన్నది. "మీరు నిశ్చింతగా ఉండండి- మా మేనల్లుడే ఒకడున్నాడు. చక్కని కుర్రవాడు. వాడు కాకపోతే ఇంకా చాలామంది ఉన్నారు. మీకు తగిన అల్లుడిని నేను తెస్తాగా" అని ఏవేవో చెప్పి పోయాడు దాసప్ప.  అసలు సంగతేంటంటే ప్రక్కనే ఉన్న బసినేపల్లిలో రమేష్ అనే మోసగాడు ఒకడు ఉండేవాడు. వాడికి ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలని మోజు పుట్టింది. అందుకని అతను దాసప్పకు ప్రత్యేకంగా కొన్ని డబ్బులిచ్చి "ఇదిగో మామా, నువ్వేం చేస్తావో తెలీదు- నాకు మంచి సంబంధం చూసి పెట్టు" అన్నాడు. దాసప్ప ఇప్పుడు వాడిని రమ్యకు ముడి-పెడదామనుకున్నాడు. ఆ సంబంధం గురించి చెప్పగానే రమేష్ ఎగిరి గంతు వేసాడు. "కానీ‌ ఒరే, వాళ్ళ అల్లుడికి ఇంగ్లీషు బాగా వచ్చి ఉండాలటరా, నీకు ఇంగ్లీషు వచ్చా?" అని అడిగాడు దాసప్ప.     "ఓఁ ఐదో క్లాసులో నన్ను మించినవాడే లేకుండె!" అన్నాడు రమేష్. "మరి వాళ్ళు కొంచెం‌ బలం ఉన్నవాళ్ళు.." అన్నాడు దాసప్ప. "నాకూ‌ ఉన్నదిలే మామా, బలం!" అన్నాడు రమేష్. మరుసటి రోజున దాసప్ప, రమేష్‌ ఇద్దరూ నాగసముద్రంకి వచ్చారు. రామయ్య, లక్ష్మమ్మ వారిని ఆహ్వానించారు. రమేష్ కొత్త బట్టలు వేసుకొని, రోల్డ్ గోల్డ్ ఉంగరాలు, చైను, వాచి పెట్టుకున్నాడు. ఓ పెద్ద సెల్‌ఫోను కూడా అద్దెకు తెచ్చుకున్నాడు. వాటిని చూసి "అబ్బో! పిల్లవాడిది గొప్ప కుటుంబమే" అన్నది లక్ష్మమ్మ దాసప్పతో గుసగుసగా. "మరేమనుకున్నారు, వాడిదంతా లక్ష్మీ రేఖ" అన్నాడు దాసప్ప, చకచకా వాళ్ళిచ్చిన స్వీటు తింటూ. అంతలో రమేష్ "నాకు ఇంగ్లీషు కూడా వచ్చండీ, మీరు ఇంగ్లీషు వచ్చిన అల్లుడి కోసం‌ చూస్తున్నారటగా, దాసప్ప మామ చెప్పాడు" అన్నాడు.  "ఏది బాబూ! ఒకసారి ఇంగ్లీష్‌లో మాట్లాడు" అన్నది లక్ష్మమ్మ, మురిపెంగా. రమేష్ తడుముకోకుండా వెంటనే ABCDEFGH అన్నాడు. రామయ్య అతనికేసి ఒకలాగా చూసాడు. వెంటనే రమేష్ నవ్వుతూ రామయ్య చేతులు పట్టుకొని, "హౌ ఆర్యూ? హౌడూయుడూ?" అన్నాడు. రామయ్య ముఖం వెలగటం చూసి "ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్- హౌ ఐ వండర్ వాట్యూ ఆర్!" అన్నాడు రమేష్. "భలే భలే- అంటే ఏంటి నాయనా?" అన్నది లక్ష్మమ్మ, ముచ్చట పడుతూ. "స్టార్‌లాగా వెలిగే ముఖం మీది- మరి మీరు నిజంగానే గొప్ప స్టార్ కాదు గద?!" అన్నాడు రమేష్ గొప్పగా ముఖం‌ పెట్టి. "అబ్బ మా కాబోయే అల్లుడికి ఇంగ్లీషే కాదు- తెలుగు కూడా ఎంత బాగా వచ్చో!" అని మురిసిపోయింది లక్ష్మమ్మ. "నువ్వు ఎంతవరకూ చదివావు బాబూ?" అని అడిగాడు రామయ్య, కొంచెం అనుమానంగా. రమేష్ ఏదో అనబోయేంతలో పోస్టుమ్యాన్ వచ్చి 'పోస్టు' అని గట్టిగా అరిచాడు. లక్ష్మమ్మ బయటికి వచ్చి చూస్తే ఓ ఉత్తరం! ఆమె దాన్ని లోనికి తీసుకొచ్చి, అందరికేసీ చూసి, ఏం చెప్పాలి- ఈ ఊళ్లో ఒక్కరికి కూడా చదువు రాదు నాయనా! నువ్వే దీన్ని కాస్త చదివి పెట్టు" అని కాబోయే అల్లుడి చేతికి ఇచ్చింది. రమేష్ ఒక్క క్షణం బిత్తరపోయాడు. ఈ స్థితిని అతను ఊహించలేదు. అతను ఆ ఉత్తరాన్ని పట్టుకొని తిప్పి తిప్పి చూస్తూ గట్టిగా ఏడవటం మొదలు పెట్టాడు. అక్కడున్న వాళ్లందరికీ ఏమీ అర్థం కాలేదు. అయినా మరి కాబోయే అల్లుడు ఏడుస్తున్నాడంటే మరి- 'ఎవరో ఒకరు చనిపోయే ఉంటారు' అనిపించింది అందరికీ. తక్షణం అక్కడ ఉన్న వాళ్లందరూ బిగ్గరగా ఏడవటం‌ మొదలు పెట్టారు. వాళ్ల ఏడుపులు విని చుట్టు ప్రక్కల ఇళ్ళలోంచి అమ్మలక్కలు చాలామంది బిరబిరా వచ్చారు. వీళ్ళ ఏడుపులు విని వాళ్ళూ శోకాలు మొదలు పెట్టారు. ఇట్లా కొంత సేపు జరిగాక, బయటి ఊరినుండి అటుగా వెళ్తున్న యువకుడొకడు "అయ్యా! దూర ప్రయాణంలో ఉన్నాను. త్రాగేందుకు కొంచెం మంచి నీళ్ళిస్తారా?" అన్నాడు బయటినుండి. అంతలోనే వీళ్ళు ఏడవటం చూసి, "ఎందుకమ్మా ఏడుస్తున్నారు?" అని అడిగాడు లక్ష్మమ్మని. లక్ష్మమ్మ గుండెలు బాదుకుంటూనే ఆ ఉత్తరాన్ని అతని చేతుల్లో పెట్టింది. అతను ఆ ఉత్తరాన్ని చదివి, గట్టిగా నవ్వి, "దీనికి మీరంతా ఎందుకేడుస్తున్నారు, సంతోష-పడాలిగాని?! మీ పెద్దబ్బాయికి కొడుకు జన్మించాడట!" అనే సరికి అందరూ నోళ్ళు వెళ్ల బెట్టారు. వెంటనే రామయ్య రమేష్ కాలర్ పట్టుకొని "ఏరా! ఎందుకురా, ఏడ్చావు?! మర్యాదగా ఇప్పుడైనా నిజం చెప్పు!" అన్నాడు. "మరండీ, నాకు అసలు చదవటం రాదు కదండీ, ఆ సంగతి గుర్తొచ్చి ఏడ్చాను- అంతేనండి!" అని కాలర్ విడిపించుకొని పారిపోయాడు రమేష్. దాసప్ప కూడా పంచె సర్దుకుంటున్నవాడు సర్దుకుంటున్నట్లే తటాలున పారిపోయాడు. వాళ్ళ మోసానికి రామయ్య నోరు తెరిచాడు. అంతలో ముందుగా తేరుకున్న లక్ష్మి ఆ వచ్చినతని చెయ్యి పట్టుకొని "బాబూ! నీకు పెళ్లైందా? ఎంత వరకూ చదివావు? ఇంగ్లీషు వచ్చా? మీ వాళ్ళు ఏం చేస్తుంటారు?" అని వరస ప్రశ్నలు కురిపించింది. రమ్య అదృష్టం, అతనికి ఇంకా పెళ్ళి కాలేదు; తగిన సంబంధం‌ కోసం చూస్తున్నాడు; కుటుంబం మంచిది; ఆరోజే చిన్న ఉద్యోగం కూడా దొరికింది- అన్నిటినీ‌ మించి అతనికి రమ్య, వాళ్ల ఊరివాళ్ళు అందరూ నచ్చారు! రమ్యకు కూడా అతను నచ్చేసాడు- ఇంకేముంది? నెల తిరిగే సరికల్లా రమ్య పెళ్ళి ఆ కుర్రాడితో ఘనంగా జరిగింది! ఎట్టకేలకు రామయ్య-లక్ష్మమ్మలకు ఇంగ్లీషు అల్లుడు దొరికాడు!  

దీపావళి

దీపావళి   పూర్వం ప్రాగ్జ్యోతిషం అనే దేశం ఒకటి ఉండేది. 'ప్రాక్ జ్యోతిషం' అంటే 'ముందుగా వెలుగును చూసేది' అని అర్థం. ఆ దేశాన్ని నరకుడు అనే రాజు పరిపాలించేవాడు. నరకుడు మామూలు వాడు కాదు. స్వయానా భూమికి పుత్రుడు. భూమి మీద ఉన్న సమస్త సంపదలు, ఔషధాలు, భూమి లోపల ఉన్న సమస్తమైన ఖనిజాలు- అన్నిటి పైనా అతనిదే అధికారం; వాటి ఫలితాలన్నీ పూర్తిగా అతనికి లోబడినై. నరకుడు తీవ్రమైన తపస్సు చేసి ఈ విషయాలన్నీ కనుక్కోవడంతో పాటు, ఏ పురుషుని చేతా చావులేకుండా వరం కూడా పొందాడు, బ్రహ్మ నుండి. అయితే అట్లా పరిపాలకుడిగా భూమిపైన సర్వ హక్కులూ పొందిన నరకుడు, అవన్నీ 'తన సొంతమే' అనుకున్నాడు. 'తన సొంత వస్తువుల్ని వేరే ఎవరికైనా ఎందుకివ్వాలి?'- అని, అవేవీ ఇతరులెవ్వరికీ దొరకకుండా కట్టడి చేశాడు. అంటే నరకుడు స్వార్థానికి చిహ్నం అనమాట. ఔషధాలూ ఖనిజాలే కాక, ప్రాగ్జ్యోతిషం మీద ప్రథమంగా పడే వెలుగును కూడా ఇతరులకు అందకుండా చేసాడు నరకాసురుడు. 'శబ్దం-స్పర్శ-రూపం-రుచి-వాసన అనే జ్ఞానాలను తెలిపే శక్తులన్నింటీనీ అతను అణచి పెట్టాడు. తన గొప్పతనాన్ని అంగీకరించని ఋషులని, సాధువులను, రాజులను హింసించటం మొదలుపెట్టాడు. పదహారు వేల మంది రాజకుమార్తెలను బందీలుగా చేసి పెట్టాడు. దేవమాత అదితి కర్ణ కుండలాలను, వానలు కురిపించే వరుణుడి గొడుగును కూడా తన కోటలో పెట్టేసుకున్నాడు. నరకుడి భయానికి మనుషులందరూ తమలో తామే కుంచించుకు పోయారు. భూమిపైనే నరకమంటే ఏమిటో రుచి చూసారు. ప్రకాశానికి దూరమైన మానవజాతి అజ్ఞానంలోనూ, పాపంలోనూ, చీకటిలోనూ కూరుకు పోసాగింది. నరకుడి ఆగడాలు మిన్ను ముట్టేసరికి దేవతల రాజు ఇంద్రుడు 'తమ కష్టాలన్నిటినీ తీర్చగలిగే వాడెవడా' అని వెతుక్కున్నాడు. 'నరకుడిని పుట్టించిన తల్లి ప్రకృతి- భూమి తప్ప మరెవ్వరూ వాడిని చంపలేరు' అని కనుక్కున్నాడు. విష్ణువు అవతారమైన కృష్ణుడిని, స్వయంగా భూదేవి అయిన సత్యభామను దర్శించుకొని, నరకాసురుడి భారం తగ్గించమని వేడుకున్నాడు. కృష్ణుడు సత్యభామ ఇద్దరూ గరుడ వాహనం ఎక్కి, ప్రాగ్జ్యోతిషానికి పోయి, నరకునితో యుద్ధం చేసారు. చివరికి సత్యభామ వదిలిన బాణం నరకాసురుడిని తుద ముట్టించింది. తల్లి స్వయంగా తన దుష్ట సంతానాన్ని హరించింది. జ్ఞాన కిరణాలు మళ్లీ ఒకసారి జగత్తు అంతటా నిరాటంకంగా ప్రసరించాయి. అజ్ఞానానికి, చీకటికి ప్రతీకగా నిలచి, భూమి మీద నరకం చూపించిన నరకుడి చావుతో ప్రజలు అందరూ తనివి తీరా దీపాలు వెలిగించారు. బాణాసంచా కాల్చారు. పిండి వంటలు, మిఠాయిలు చేసుకున్నారు. ఈ దీపావళి కథలోని పాత్రలేవీ నిజంగా ఉండనక్కర్లేదు. కథ ఉందిగా, చాలు! ఈ కథ ఏం చెబుతుంది? - ప్రకృతి ఎంత బలీయమైనదో చెబుతుంది ఈ కథ. ప్రకృతిలోని సంపదలు అన్ని ప్రాణులకీ చెందాలి తప్ప, వాటిని ఏ ఒక్క జీవీ, ఏ ఒక్క దేశమూ తన సొంతం చేసుకునేందుకు ప్రయత్నించకూడదని చెప్తుంది; ప్రపంచంలోని అన్ని ఘటనలనూ నిర్ణయించే శక్తిని ఏ ఒక్కరూ వశపరచుకోలేరని, దాన్ని ఎవ్వరూ దుర్వినియోగం చేయరాదని చెప్తుంది; చీకటీ-అజ్ఞానం ఏనాటికైనా తప్పకుండా నశిస్తాయని చెప్తుంది. ఆశావాదానికి పునాది వేస్తుంది! మీకందరికీ మరి, వెలుగుల పండగ దీపావళి శుభాకాంక్షలు!  

ద్వారబంధ రహిత ముఖాని - [తలుపుల్లేని నోళ్ళు]

ద్వారబంధ రహిత ముఖాని - [తలుపుల్లేని నోళ్ళు]            అప్పటికి ఇరవై మార్లు మోగింది సుశీలమ్మ మొబైల్ ఫోన్. ఇంకో ఇరవై మార్లు ల్యాండ్ ఫోన్ ,మెసేజస్ మరో ఇరవై. ఏంచేయాలో తెలీక హాలంతా అటూ ఇటూ తిరుగుతూ తలపట్టుకుని కూర్చుందామె.ఇంతలో ఇంటిముందుకారాగింది. గబు క్కున తలుపేసి, గదిలో కెళ్ళిపోయింది. గేట్ తీసిన శబ్దం వినిపించింది. గుండె దడ దడ లాడుతుండగా పక్కమీద కూర్చుని ముణుకుల్లో తల ఉంచుకుని కూర్చుంది.ఆమె వెక్కిళ్ళతో ఎదంతా కదలిపోతున్నది గుంతల రోడ్లో వెళ్తున్న ఒంటెద్దు బండి లా. డోర్ బెల్ మ్రోగుతోంది. నిశ్శబ్దంగా శ్వాస కూడా గట్టిగా పీల్చకుండా కూర్చుందామె. రెండు నిము షాలకు తలుపుమీద గట్టిగా బాదుతున్న శబ్దం.                                                                                                                        " మేడం! తలుపు తీయండి. ప్లీజ్. మేడం!. మీరింట్లో నే ఉన్నారు. మాకుతెల్సు." అంటూ అరుపులు.   ఉన్నట్లుండి సుశీలమ్మకు భయమేసింది. చుట్టు పక్కల వారంతా ఈ శబ్దాలకు, అరుపులకూ వచ్చి ఏమైంద నిగొడవ చేస్తా రని .ఆ దృశ్యం  ఎదుర్కోడం కంటే తలుపుతీసి వీరిని ఎదుర్కోడమే మేలనుకుంది. ఏమైతే కానీ మని లేచి గది లోంచీ హాల్లో కొచ్చి  గడియతీసి ,తలుపు తెరిచింది.  మోహన్, మనోజ నిల్చునున్నారు.చాలా కంగారు పడ్డట్లు, అలసిపోయినట్లూ వారి ముఖం మీద పట్టిన చెమట, వారిముఖం లోని ఆందోళన చెప్పకనే చెప్తున్నాయి.     " మేడం! ఏమైంది? బావున్నారుకదా!ఆరోగ్యం బావుందా? ఎన్నిమార్లు ఫోన్ చేసినా తీయక పోడంతో మళ్ళా గుండె నొప్పి వచ్చిందేమోని వచ్చాం మేడం. శ్రీహర్ష మీకోసం ఎదురు చూస్తున్నాడు మేడం!. మీరు  చేస్తే గానీ ‘ గాయత్రీ మంత్రోపదేశం’ చేయించుకోట్ట. ముహూర్తం దాటి పోతుందని పంతులు గారు చెప్తున్నా వినడం లేదు మేడం.మీరు ఫోన్ తీయలేదు.అందు కని  మేమే వచ్చాం. ప్లీజ్ మా కోసం కాకపోయినా మీ ప్రియ శిష్యుని కోసం రండి మేడం! ఎంతోమందికి గాయత్రి ఉపదేశం చేశారు. మీ శిష్యునికి చేయరా మేడం!" అంటూ ఇద్దరూ చేతులు పట్టుకున్నారు. అప్పుడు చూసింది సుశీలమ్మ వారిని. ఇద్దరూ పట్టు బట్టల్లో ఉన్నారు ,పీటలమీంచీ లేచి అలాగే వచ్చినట్లున్నారు. ఏంచేయాలో పాలుపోక " నేనిలా ఈ సమయంలో నలుగు ర్లోకీ రాను ఇష్టం లేకనే మీ ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు మోహన్!. ముహూర్తం దాకా అలాగే ఉంటే శుభకార్యం జరిగిపోతుందని మనస్సు చిక్కబట్టుక్కూర్చున్నాను. మీరిలా రావడం ఏమీ బావోలేదు మనోజా !"అంది.    " మీరు రాకపోతే ఈ ఉపనయనం జరుగదు మేడం!. మీశిష్యుడు ఎవరు చెప్పినా వినేట్లు లేడు. ఉదయం నుంచీ మేం ముగ్గురం పచ్చి మచి నీరు ముట్టలేదు. మీరూ అలాగే ఉన్నారని నాకు  తెల్సిపోతున్నది. ప్లీజ్ మేడం! "అంటూ స్వతం త్రంగా చేయి పట్టుకుంది మనోజ .  మోహన్ గబుక్కున క్రిందకూర్చుని పాదాలు తాకి " మేడం ప్లీజ్ మాకోసం కాకున్నా మీ శిష్యుని కోసం రండి మేడం!." అంటూ తలపైకెత్తి సుశీలమ్మ ముఖంలోకి దీనంగా చూశాడు. ఇహ వెళ్ళకుండా ఉండటం భావ్యం కాదని, తన బాధను పంటి బిగువున నొక్కి పట్టి,"పదండి." అంటూ తలు పేసి బయల్దేరింది.                      " చాలా కృతఙ్ఞతలు మేడం." అంటూకారు డోర్ తెరిచి, ఎక్కగానే డోర్ వేసి కారు స్టార్ట్ చేశాడు మోహన్. సుశీలమ్మ మనస్సు బయటి కెళుతుంటే లేత చిగురాకులా రెపరెపలాడుతున్నది. గుమ్మం దాటి అప్పటికే మూణ్ణెల్లు  దాటింది. ఒత్తిడికి తట్టుకోలేక గుండె సన్నగా నొప్పెడుతున్నది.                 - 'దైవలీల ఎంత చిత్రం! ఒక్క సంఘటనతో జీవన గమనమే మారిపోయింది. అందుకే అన్నారు - మ్యాన్ ప్రెపో జస్ గాడ్ డిస్పోజస్  - అని.తానెప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురౌతుందని, తన జీవితం ఇలా గాడి తప్పు తుందని భావించనేలేదు. తనమీద, తన నమ్మకం మీద తనకున్న భ్రమను భగవంతుడు తప్పించి, పిచ్చిదాన్ని చేసినట్లు అనిపించి చేతి గుడ్దతోకళ్ళు వత్తుకుంది ఆమె. ఈమధ్యకాలంలో ఎన్ని చేతి గుడ్డలు ఇలా తడిసి పోయాయో ! ఐనా బయటి కెళ్ళను తనెందుకింత  వేదన పడుతున్నదో , భయపడుతున్నదో  తనకే అర్ధం కావడం లేదు. జీవితం ఎంత చిత్రమైనది !' అని ఆమె అనుకోడం ఈమూడు నెలల్లో  వెయ్యో మారో ఇంకా ఎక్కువో.  కారు ముందుకెళుతుంటే మనస్సు వెనక్కెళ్ల సాగింది.       ‘తనకు తన విద్యార్ధులంటే ఎంత ఇష్టమో!. వారూ తనని అలాగే అమ్మాన్నాన్నల కంటే ఎక్కువగా ప్రేమించే వారు. ఎంత కష్టం వచ్చినా కాస్తంత బాధకలిగినా ముందు తనకే చెప్పడం, తాను వాటిని పరిష్క రించడం , ఒక్కరోజు తాను వారినిచూడ కున్నా, వారు తనను చూడకున్నా ఉండలేని స్థితి. పిల్లల్లేనితమకు వారే పిలల్లు.  గురు శిష్యుల మధ్య ఇంత  ప్రేమాభిమా నా లుండటాన్ని తోటి ఉపాధ్యాయ బృందం, ఇరుగుపొరుగు ఇంకా ఎందరో సహించ లేకపోయే వారు. తనమీద లేనిపోని వి అందరికీ చెప్పి, ఏదో చేసి, తనమీద దుమ్ముపోసి, బురదచల్లి,వారి  అసూయను చల్ల బర్చు కోవాలని ఈర్యాప రు లంతా తపనతో వారి శాయశక్తులా శ్రమించారు.ఎంతమంది ఎన్ని చేసినా భగవంతుని నమ్ముకుని , తన వృత్తిలో నిరం తరం దృష్టి నిల్పిన తనను, తన శిష్యుల మీద స్వార్ధ రహిత ప్రేమను చూపుతున్న తనను ఏమీ చేయలేక వారు కుళ్ళిపోడం తనకు తెల్సు.  వీటన్నిటికీ తనకు  మనో ధైర్యాన్నిచ్చిన వ్యక్తి తన జీవిత  భాగస్వామి, మార్గదర్శి, ఆధ్యా త్మిక గురువు, ఐన తన భర్త వాసు! వాసు ఎంత విశాల హృదయుడు!నిరంతరం చిరునవ్వు ముఖం.అందర్నీ అర్ధం చేసుకుని తగు సలహా లిచ్చి వారి బాధలను తొలగించి మనోధైర్యాన్నీ ,ఆధ్యాత్మిక సూచనలను ఇవ్వగల సమర్ధుడు. ఎంతమంది తన ఇంట్లో పడుకుని పరీక్షల సమయంలో వారి సంశయాలు తీర్చుకుని స్టేట్ ఫస్ట్ వచ్చినవారూ,ఇంకా ఎంతో మంది, ఆర్ధిక సాయం అందుకుని ,ఉన్నత విద్య గడించి ,ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి ,తరచూ వచ్చి తనను చూసి పోయేవారితో ఇల్లు కళ కళ లాడుతుండేది. అలాంటి ఇల్లు , నేడిలా చిన్నబోయిందేం!  నిరంతరం విద్యబోధించే తన స్వరం ,తన విద్యార్ధులను చూడకుండా  ఇంత కాలం ఉండటం తన కెలాసాధ్య మైంది? ఏంటీ చిత్రం! ఏంటీ మార్పు?ఇది ఇలాగే సాగుతుందా! తన స్వరంమూగ బోతుందా! తానిక పాఠాలు చెప్ప లేదా! తన మనస్సుకు స్వాంతన లభించదా!' అనుకుంటున్న సుశీలమ్మ ఆలోచనలకు అడ్డు కట్టవేస్తూ, " మేడం దిగండి వచ్చేశాం."అంటూ డోర్ తెరిచింది మనోజ .                                                                                                                        కారుదిగి భయ భయంగానే లోపలికి అడుగు పెట్టింది సుశీలమ్మ ,ఇరువైపులా రక్షక భటుల్లా మోహన్,మనోజ నడు స్తుండ గా. వారినిచూసి పెద్దగా మాట్లాడుకుంటున్న జనం, పెద్దగా నవ్వుతూ కబుర్లా డుతున్న మహిళలు స్థంభాన్నా నుకుని జోగు తున్న పురోహితుడు,అంతా ఒక్క మారు తలలెత్తి చూసి మానుల్లా నిలబడి పోయారు. హాలంతా నిశ్శబ్ద మై పో యింది. తడ బడే అడుగులతో మోహన్, మనోజ నడిపిస్తుండగా సుశీలమ్మ స్టేజ్ మీదకు  వచ్చింది. మోహన్, మనోజ పీటలమీద కూర్చో గా పురోహితుడు మంత్రాలు వల్లిస్తుండగా శ్రీహర్ష చెవిలో గాయత్రీమంత్రంచెప్పింది సుశీలమ్మ. మొదటి భిక్ష ఆమెవద్ద తీసు కుని ఆమె పాదాలకు నమస్కరించాడు శ్రీహర్ష. ఆమెను స్టేజ్ మీద ఒక పక్క గా కుర్చీలో కూర్చోబె ట్టాడు మోహన్. శ్రీహర్ష అందరి వద్దా భిక్ష  స్వీకరిస్తుండగా , మోహన్ పక్కనే నడవసాగాడు.         " ఓ ఈవిడవద్దా ఒక్కగా నొక్క బిడ్దకూ గాయత్రీ మంత్రోపదేశం చేయించి, ప్రధమభిక్ష వేయిస్తావా! నీకుతెలీకపోయినా ఆవిడ కు తెలియొద్ధూ! బుధ్ధుండాలి" అంటున్న దూరపు బంధువును ఉరిమి చూసి ,ముందుకు సాగాడు  మోహన్.  "తగుదునమ్మా అంటూ వచ్చింది. ఇంకా  మూణ్ణెల్లు కాలేదు.ఇంత ఘోరమా?"  "చేయించుకుంటే పౌరోహిత్యం కూడా చేస్తుంది.ఎవరెలా ఉండాలో చదివినట్లు లేదు.వందల మందికి చదువు చెప్పేది!”     " ఐనా ఆడది, అదీనీ ఇప్పుడా గాయత్రి చెప్పేది ? ఈ మోహన్ కు బుధ్ధీ సిగ్గూ లేకపోతే ఆవిడ కుండక్కర్లా?"     " తెగించిన వారికి తెడ్డేలింగం, వెధవముండలకు వీరేశలింగం, ' అని ఊరికే అన్నారా?"   " బరితెగించిన వారికి బదులాడే వారెవరమ్మా! అప్పుడే ఊరిమీదపడింది. ఛీ ఛీ "   "చదివిందనీ, ఉద్యోగం చేస్తున్నాననీ చెడ్డ గర్వం. దానికితోడూ ఏవేవో అవార్డులూ గట్రాకూడా వచ్చాయిటగా! "   "ఎందరినో ఇంట్లో పడుకో బెట్టుకునేదిట! సిగ్గులేకుండా! పట్టలేంలే "  " ఆ--  కట్టుకున్నవాడే ఏమీ చేయలేక వదిలేశాట్ట, ఇప్పుడిహ అడ్డూ ఆపూ ఎవరున్నార్లే! ఎవరినైనా పడుకో బెట్టు కుంటుంది." పుసిక్కిన నవ్వు.  " అన్నీ వదిలేస్తే సరి ! పక్కనే మీ ఇల్లు మీ ఆయన జాగ్రత్త."   " ఏమన్నా అనుమాన మొస్తే ఇద్దర్నీ నడిబజార్లో చెప్పుచ్చుక్కొట్టనూ ! నాతోనే!"      ఇహ వినలేక మనోజ గబగబా వారివద్దకు వచ్చి " నోరుముయ్యండి అంతా. మీరా మేడం గారిని విమర్శించేది?ఆమె కాలి గోటిక్కూడా చెల్లరు.మీ భాగోతాలెవరికి తెలీవు? మీ కూతుళ్ళూ కొడుకులూ క్లబ్బుల్లో పబ్బుల్లో కులుకుతుంటే ఆపగలి గారా! మీకోడళ్ళను సరిగా కాపరాలు చేయనిచ్చారా! మీ ఇంటాయనల్ని కడుపునిండా తిన నిస్తున్నారా? మీ లో ఒక్కరికి గాయత్రి సరిగా పలకను వచ్చా! అర్ధం తెలుసా! ఆమె మా ఇద్దరికీ మేడం. మేం చదివేప్పుడు వారింట్లో పడుకుని చదువుకు నే వారం. అప్పుడు మావయస్సు15 సం. మేడం, సార్ కలిసి మాడౌట్స్ తీర్చి చదివించి పోటీ పరీక్షలకు పంపి ఇంత మంచి ఉద్యో గా ల్లో స్థిరపడను, మాలాంటి వారికెంత మందికో అండగా నిలిచారు. మా ఇరువు రికీ వివాహం చేశారు. ఇప్పుడు మావాడూ మేడం స్టూడెంట్ .ఆమె మాకు గాయత్రీ మంత్ర జపం ఎలాచేయాలో నేర్పించి,  మాచేత నిత్య గాయత్రి  చేయించి, మామేధ పదును పెంచారు.    మీరంతా మీ మనవళ్ళ వడుగులకూ, మీ అమ్మాయిల పెళ్ళిళ్ళకూ ,గృహప్రవేశాలకు, నోములకు మొదటి తాంబూలం ఇచ్చినవారే!ఆమె ఆశీర్వాదాలు కావా లని తపించిన వారే! లోపల్లోపల ఆమెకు అంతా ఇచ్చేగౌరవానికి కుళ్ళి ,ఈర్ష్య పడ్దవారే! ఇప్పుడు సార్ హార్ట్ ఎటా క్ తో పోయి,ఆమె ఆబాధను తట్టుకోలేక కుమిలి పోతుంటే మీరిలా మాట్లాడు తు న్నా రంటే' స్త్రీకి ప్రధమ శత్రువు స్త్రీనే ' అని ఋజువు చేస్తున్నారు. సిగ్గు లేదా కష్టంలో ఉన్న ఒక వయస్సు మళ్ళిన మహిళ గూర్చీ ఇలా మాట్లాడను? మీ రసలు మనుషులా? రాక్షస స్త్రీలా? మిమ్మల్ని చూడటమే మహాపాపం " అంటుం డగానే, స్టేజ్ మీద ఉన్న సుశీలమ్మ కుర్చీలోంచీ పక్కకు ఒరిగిపోయి దబ్బున క్రిందపడ్ద శబ్దం విని పించి అటుపరుగెత్తింది మనోజ .     -రచన -ఆదూరి.హైమవతీ  

అనంత సంగ్రామం

  అనంత సంగ్రామం   అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం అనాధుడికి, ఆగర్భ శ్రీనాథుడికీ మధ్య. సేద్యం చేసే రైతుకు భూమి లేదు, పుట్రలేదు రైతులరక్తం త్రాగే జమీందార్ల కెస్టేట్లు. మిల్లు నడిపి, కోట్ల డబ్బు కొల్లగ లాభం తెచ్చే కూలోనిది కాదు మిల్లు, మిల్మ్యాగ్నే టొకసేటు. శత్రువులను యుద్ధంలో చిత్రంగా వధ చేసిన పేద సైనికునికి 'సున్న' రాజ్యమంత రాజులదే. మధనపడే మేధావులు శాస్త్రజ్ఞులు, విద్వాంసులు కనిపెట్టిన అణుశక్తికి ప్రభుత్వాల కంట్రోళ్ళు. కర్షకులు, కార్మికులు మధనపడే మేధావులు తమ శ్రమలకు తగినఫలం ఇమ్మంటే "తిరుగుబాటు!" షావుకారు వడ్డీలకు జమీందార్ల హింసలకు వేగలేక ఆగలేక తిరగబడితే "అతివాదం?" (దాశరథి కృష్ణమాచార్య రాసిన అగ్నిధార కవితాసంపుటిలోంచి)

చావు చూపిన పరిష్కారం

చావు చూపిన పరిష్కారం (తెలుగువన్ ఉగాది కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)     ఆనంద్ కర్మకాండలు జరిగిపోయాయి!  చీకటి పడకుండా... వచ్చిన బంధుమిత్రులంతా ఎవరి ఇళ్లకు వాళ్ళు తొందరపడుతూ ప్రయాణమై వెళ్లిపోయారు. ఇక ఆ ఇంట్లో తనకూ, కొడుక్కీ తోడుగా అత్తమామలు వుండిపోవడం... కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి.మనసులో ప్రాశ్చాత్తాప భావనతో వారిని కృతజ్ఞత గా చూసింది-లలిత. భర్తను కోల్పోయి-భార్య, తండ్రిని కోల్పోయి-కొడుకూ, కొడుకుని కోల్పోయి-ముసలి తల్లిదండ్రులు, ఎవరికీ వారికే కావాల్సినవాడు- ఆనంద్. ఎవరి బాధా  తీర్చేది కాదు.ఒకింట్లో ఒక మనిషి పోయాడంటే... ఆ ఇల్లు ఎంత నిసీధిగా మిగిలిపోతూ బావురుమంటుందో...ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. మూడు రోజులు గడిచాయి....కోడలికీ,మనువడికీ ధైర్యం చెప్పి బరువెక్కిన గుండెలతో గుమ్మందాటి వెళ్తున్న ఆ ముసలివాళ్ళిద్దరి కాళ్ళనీ చుట్టేసింది లలిత. "అత్తయ్యా, మావయ్యా..! నన్ను క్షమించండి.మీకు మీ కొడుకు మీద యేమాత్రం ప్రేమ వున్నా... మమ్మల్ని వదిలి వెళ్ళకండి.మీకు మీ అబ్బాయి లేని లోటుని మేము తీరుస్తాం.ఇన్నాళ్లూ మిమ్మల్ని ఎంతో కష్ట పెట్టాను.ఒక్కగానొక్క కొడుకుదగ్గర మీ జీవితం సాగనీయకుండా ప్రవర్తించేను. మీ అబ్బాయి మనమంతా కలిసుండాలని తపించేవారు.ఆ విషయం లో నేను యేనాడూ సహకరించలేకపోవడంతో ...ఆయన బాధపడని రోజంటూ లేదు.ఆయన బ్రతికున్నంత కాలం మీతో గడపానీయకుండా చేసిన పాపిష్ఠిరాలను.నాకు నాభర్తా,పిల్లాడే లోకం అనుకున్నాను. మాకందరికీ పెద్ద దిక్కైన మీ అండదండలు మాకు అవసరం వుంటాయని యేనాడూ గ్రహించలేకపోయాను.మీగురించే ...పదిహేను రోజుల క్రితం  మీ అబ్బాయికీ నాకూ మధ్య చిన్న వాదన  జరిగింది. హైదరాబాద్ నుంచి ఇప్పట్లో ఇక్కడకు ట్రాన్స్ఫర్ అయ్యేటట్లు లేదనే నిరాశ తో...అమ్మా నాన్నా రోజు రోజుకి నీరసించిపోతున్నారు. ఈ వయసులో వారిని వేరుగా ఉంచడం న్యాయమంటావా? వాళ్ళని కూడా మన ఇంటికి తీసుకొచ్చేస్తే... కనీసం నువ్వైనా వాళ్ళని ఓ కంటకనిపెట్టుకుని ఉండొచ్చని వేడుకోలుగా నన్ను అడుగుతున్నా...ఆయన మాటలని మధ్యలోనే తుంచేసాను.వయసైన మీ ఇద్దరికీ సేవలు చేయడం నా వల్ల కాదని విరుచుకుపడ్డాను.దానితో మనస్తాపం చెంది...ఆ మర్నాడే నాతో ఏమీ మాట్లాడకుండా హైదరాబాదుకి ప్రయాణమై వెళ్లిపోయారు. అలా వెళ్ళినాయన కనీసం ఫోను కూడా చేయలేదు సరికదా నేను చేసిన ఫోనేకాల్ ని కూడా రిసీవ్ చేసుకోలేదు.నాపై కోపం తగ్గాకా చేస్తారనుకున్నాను. కానీ ...ఆయన ఫోను నుండే ఆయన చావు కబురు వినడం...నాపై పిడుగు పడ్డట్టయింది. ఆయన నాకింత శిక్ష వేస్తారనుకోలేదు.ఇదంతా నా వల్లే జరిగింది.నన్ను క్షమించండి"అంటూ ప్రాశ్చాత్తాప వేదనతో ఏడ్చేసింది లలిత . కోడలు క్షమాపణ అడిగేసరికి...ఆ పెద్దమనసులు కరిగిపోయి ఆమెను అక్కున చేర్చుకుని కన్నీళ్లు  తుడిచారు.             హాల్లో గోడకి దండ వ్రేలాడుతూ...ఆనంద్ ఫోటో! ఇంట్లోకి అడుగుపెడుతూనే...తనఫోటోకి పట్టిన దుస్థితిని చూసి స్థాణువైపోయాడు ఆనంద్. సడన్ గా వచ్చిన ఆనంద్ ని చూసి  ఆశ్చర్యపోయారు ఆ కుటుంబమంతా!వారందరికీ తేరుకోడానికి కొంత సమయం పట్టినా... ఆనంద్-తల్లి తండ్రులను చూసి... తల్లిదండ్రులు-కొడుకుని చూసి... లలిత-భర్తను చూసి... కొడుకు-తండ్రిని చూసి... మొత్తానికి తమకింక లేడు అనుకున్న ఆనంద్ కళ్ళముందు కనిపించగానే...ఒకరికొకరు చూసుకుంటూ.....నమ్మలేకుండా వున్నారు. భార్య చెప్పిన తన చావుకబురు కథంతా విన్నాకా.. ఆనంద్ కి నవ్వాగలేదు. ఇంతకీ ఆనంద్ చావుకబురు ఎలా పుట్టిందంటే.... సికింద్రాబాద్ రైల్వే పోలీసుల నుంచి లలిత కి ఫోన్ వచ్చింది..... ఆనంద్ అనే వ్యక్తి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ట్రైన్ కిందపడి చనిపోయాడనీ,పోలికలు కూడా గుర్తుపట్టలేనట్టుగా ఉన్నాయనీ,అతని దగ్గర ఉన్న ఆధారాలతో... మీ మనిషై వుంటాడనీ పోలీసులు నిర్ధారించి చెప్పడంతో... ఆ పిడుగుపాటు వార్తని తట్టుకోలేకపోయింది లలిత.తనమీద కోపంతో వెళ్లిన భర్త విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడనుకుంది.రైల్వే పోలీసులు ప్యాక్ చేసి అందించిన అతని శవానికి దహనకాండలు కూడా చేసేసారు.భర్త నుంచి ఫోన్ కాల్ కూడా రాకపోవడంతో అదే నిజమనుకుని ఇంకేమీ ఎంక్వయిరీ కూడా చేయించుకోలేదు. ఆనంద్ కి ఆ విషయం అంతా తెలిసాకా.... పదిహేను రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన సీనంతా కళ్ళముందు మెదిలింది. ప్రతినెలా హైదరాబాద్ నుంచి రెండుసార్లు ఇంటికి వచ్చి వెళ్తున్నట్లే...విశాఖపట్నం నుంచి బయలుదేరి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దిగాడు ఆనంద్. తల్లిదండ్రుల విషయమై భార్యతో గొడవపడి...చెదిరిన మనసుతో వున్న ఆనంద్ కి భార్య నుంచి వచ్చిన ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకోవాలనిపించలేదు.హైటెక్ సిటీ వెళ్లడానికి ఎమ్ ఎమ్టీఎస్ కి టికెట్ కొనుక్కుని...చంకనపెట్టుకున్న హ్యాండిబాగ్ తో ట్రైన్ ఎక్కుతుండగా...ఎవడో చాలా చాకచక్యంగా ఆ బాగ్ ని కొట్టేసాడు.మెరుపువేగంతో అతను మాయమైపోవడం...అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.అప్పటికే ట్రైన్ కదిలిపోవడంతో ఏమీ చేయలేక చూస్తూండిపోయాడు.మళ్ళీ అంతలోనే కీచుమంటూ ట్రైన్ ఆగడం...ఎందుకాగిందో అనుకునేంతలో ఆ వార్త అందరికీ గుప్పుమంది.ఎవడో ట్రైన్ ఎక్కుతూ జారిపడి చచ్చాడని అనుకుంటున్నారంతా.పాపం అనుకున్నాడు ఆనంద్. కళ్ళముందు ఆరోజు జరిగిన సంఘటన కనిపించేసరికి... ఆ చచ్చిన మనిషిగా తానే గుర్తింపబడ్డాడని అర్థమైంది ఆనంద్ కి. భార్య కాల్ ని పట్టించుకోకుండా....షర్ట్ జేబులోంచి తీసిన సెల్ ని హ్యాండ్ బాగ్ లో పడేసాడు. ఆ బాగ్ లో సెల్ తో పాటూ ఆధార్ కార్డు,ఎటిఎం కార్డు,డ్రైవింగ్ లైసెన్స్ వగైరా వగైరా కార్డులన్నీ వున్నాయి.చంకన పెట్టుకున్న అలాంటి ముఖ్యమైన బాగ్ ని దొంగ లాక్కెళ్లడం. ..ప్రమాదవాసత్తు అతనే ట్రైన్ కింద పడటంవల్ల...బాగ్ లోని ఆధారాలబట్టి ఆనంద్ గా గుర్తించి రైల్వేపోలీసులు ఫోన్ చేయడంతో... ఆనంద్ చనిపోయాడనే నిర్ధారణకి వచ్చారు.    చనిపోయాడనుకున్న ఆనంద్ తిరిగి రావడంతో...నుదుట కుంకుమ పెట్టుకుని...తీసేసిన తాళిని మళ్ళీ భర్తతో కట్టించుకుంది లలిత. భర్తతో కలిసి అత్తమామల కాళ్ళకి నమస్కరిస్తూ వారి ఆశీర్వాదం కూడా తీసుకుంది. భార్యతో వచ్చిన మార్పుకి ఎంతో పరవసించిపోయాడు ఆనంద్. ఆరోజు రాత్రి-భర్త ఒడిలోకి వాలిపోతూ ఎంతో ప్రేమ చూపించింది లలిత."సెల్ ఫోన్ పోయినంతమాత్రాన్న కనీసం ఫోన్ చేయకుండా మానేస్తారా?నా నెంబర్ మీకు నోట్లోనే ఉంటుంది కదా.ఈపదిహేను రోజుల్లో మీకసలు ఫోన్ కూడా చేయాలనిపించలేదా"?భర్త కళ్ళలోకి చూస్తూ గోముగా అడిగింది . ఆ సమయంలో భార్య అలా అడిగేసరికి...ఏం సమాధానం చెప్పాలో అర్థంకాలేదు ఆనంద్ కి. నిజానికి సెల్ పోయిందనికాదు.భార్య మీద కోపంతోనే ఫోన్ కూడా చేయకుండా ఆమెను ఏడిపించాలనే అలా చేసాడు. మనసు చల్లబడ్డాకా  ఇక వుండబుద్దికాక వచ్చేసాడు. ఇంటికి వచ్చేసరికి-పరిస్థితి అంతా మారిపోయి స్వర్గంగా తయారైంది. ఇక ఈ ఇంటికి తీసుకురాలేమనుకున్న తల్లితండ్రులు ఆ ఇంట్లో ఉండటం...భార్య వారినెంతో ప్రేమగా చూసుకోవడం....ఈ పదిహేనురోజుల్లోనే ఎంత మార్పు ...? ఇదంతా నా చావు చూపించిన పరిష్కారమే కదా అనుకుంటూ మనసులో నవ్వుకున్నాడు. నేను ఫోన్ చేయలేదు కాబట్టి సరిపోయింది.ఫోన్ చేసి ఉంటే ...నేను చనిపోలేదన్న నిజం బయటపడి...నాకు జరపాల్సిన కార్యక్రమాలన్నీ ఆగిపొయి ఉండేవి.అవన్నీ జరిపించాలి కాబట్టి...నా తల్లిదండ్రులు నా గూటికి చేరారు.వారి అండదండల్ని ఈనాటికైనా తెలుసుకుంది నా భార్య- అనుకున్నాడు భార్య నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ. లలిత ఇంకా మరిచిపోలేదేమో....ఫోన్ చేయలేదన్న విషయాన్నే పదేపదే అడుగుతున్న భార్యకు ఏవో కథలు చెప్పేసి...కమ్మగా నిద్రలోకి జారుకున్నాడు ఆనంద్!        -రచన: శానాపతి ప్రసన్నలక్ష్మి(ఏడిద)

వృద్దాప్య వరము

వృద్దాప్య వరము (తెలుగువన్ ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)     అమెరికా ఉదయం 5.00  అల్లారం మోగడం తో  మెలుకువ వచ్చింది, కాని రోజు లాగా లేచే శక్తి లేక పోయింది. కాసేపు పడుకుంటే బావుండు అనిపించింది. బయట ఆరు సెంటిమీటర్ల మంచు తుఫానుట. వణికించే చలి. పక్కనే ప్రశాంతంగా పడుకున్న మా వారిని చూసి, పోనీలే కనీసం తనకి అయినా విశ్రాంతి ఉంది అనుకుంటూ నెమ్మదిగా లేచాను. మొహం కడుక్కుని కొద్దిగా కాఫీ తాగగానే సత్తువ వచ్చినట్టు అనిపించింది. తరువాత చక చకా స్నానం చేసి, దీపం పెట్టుకుని వంట మొదలు పెట్టాను.  ఏడింటికి కూతురు, అల్లుడు ఆఫీస్ కు వెళ్ళి  పోవాలి మరి. వాళ్లకి టిఫిన్, మధ్యాహ్నం భోజనం అన్నీ సిద్ధం చేసి ఉంచాను. ఇంతలోనే రెండేళ్ల వయస్సు ఉన్న నా మనవడు 'అమ్మమ్మా  మిలికిస్ 'అని అరవడం తో వాడి పాల సంగతి మర్చిపోయాను ఏమో, గబ గబా  పాలు కలిపి పట్టుకుని వెళ్ళాను. మరి వాడిని చూసుకోడానికే  ఐదు నెలల క్రితం మా అమ్మాయి దగ్గరికి వచ్చాము. వచ్చినప్పటి నుండి ఇదే దిన చర్య, వారు ఇద్దరు ఉదయం  ఏడింటికి ఆఫీస్ కి వెళ్లి సాయంత్రం  ఐదింటికి  రావడం. ఆఫీస్ నుండి వచ్చాక కూడా  పని చేసుకోవడం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కదా. నేను ఇంటి పని, వంట పని, పిల్లాడి పని చేయడం, మా వారు వాడిని కాసేపు ఆడించి, బయటకి తిప్పడం.  వచ్చిన మొదట్లో ఓపిక గానే ఉండేది. మా అమ్మ , అమ్మమ్మలు ఇలానే ఇంటి చాకిరీ ఓపిక గా చేసేవారు అని ,వాళ్ళని ఆదర్శంగా తీసుకుని  పని చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇప్పుడే పని మీద ధ్యాస వెళ్లడం లేదు,చేసే పని నచ్చడం లేదు. ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటు లో ముప్పై ఏళ్ళు పని చేసి రిటైర్ అయిన నేను, నాకన్నా మూడేళ్ళు ముందుగానే బ్యాంకు మేనేజర్ కింద రిటైర్ అయిన మా వారు ,అమ్మాయి డెలివరీకి అని అమెరికా రావడం ,ఆ తరువాత ప్రతి ఆరు నెలలకి ఇలా వచ్చి వెళ్తూ ఉండడం తో నాకు రిటైర్  అయిన అనుభూతి కలగడం లేదు. అలా అని తల్లిగా నా బాధ్యత వదులుకోలేను. కానీ నా ఇంట్లో , నా ఊర్లో, నాకు నచ్చిన పనులు చేస్తూ ఇంటిపని చేయడం అంత ఇబ్బంది కాదు ఏమో అని నా ఆలోచన. గత పదిహేను ఏళ్లుగా నేను రిటైర్ అయితే ఎలా ఉండాలి, ఏమి చేయాలి అని నేను వేసుకున్న ప్రణాళికలో ఏది ఆచరించినట్టు అనిపించలేదు. మా అత్తగారు, అమ్మ ఉద్యోగం చేసి ఎరగరు. అయితే మాత్రం వారు వృద్దాప్యం అంటే ,అరవేయేళ్ళు వచ్చేసరికి స్వతంత్రగా, వారికీ ఎక్కడ నచ్చితే అక్కడ ఉండి, ఎంత చేయగలిగితే అంత పని చేస్తూ, పుస్తకాలు చదువుతూ,పురాణ కాలక్షేపం చేస్తూ, రామకోటి రాస్తూ ,పెద్ద దిక్కుగా ఉండేవారు.  మరి నేను ? వారి పిల్లలుగా మేము ఎప్పుడు వారి నుండి పని ఆశించలేదు. వారి మీద ఆధారపడి మా జీవితాలు అల్లుకోలేదు. మంచి ఉద్యోగం చేస్తూ కూడా వారి మీద భారం వేయడం ఇష్టం లేక మూడేళ్ల పాటు ఉద్యోగం మానేసి , ఖర్చులు నియంత్రణ చేసుకుని మేము ఇద్దరం ఒకటి గా ఉండి పిల్లని చూసుకున్నాము. ఎందుకు అంటే  పిల్లని కష్టపడి కన్నది మా కోసం కానీ వాళ్ళ కోసం కాదు కాబట్టి. మేము వారికీ అంత ప్రాముఖ్యత ఇచ్చాము. మరి మాకు? ఆలోచిస్తూ ఉండగానే అమ్మాయి నుండి వాయిస్ మెసేజ్ వచ్చింది. " అమ్మా సాయంత్రం ఫ్రెండ్స్ ని పిలిచాను కూర సాంబార్ చెయ్యి. అలాగే మీ రిటర్న్ టికెట్స్ బుక్ చేశాను. ఇంకో నెలలో ప్రయాణం. కానీ అక్కడ ఒక నెల ఉండి అవకాయలు అవి పెట్టి వెనక్కి వచ్చేయండి. ఇప్పుడే చెప్తే ఆ టికెట్స్ కూడా బుక్ చేసేస్తాను, సరేనా ఒక అరగంట లో కాల్ చేస్తా బాయ్" అది వినగానే నా ఆలోచనలకి ఒక అర్ధం ఉంది అనిపించింది. వెంటనే నేను అనుకున్నది మా వారితో చర్చించాను. తనకి నేను చెప్పింది నచినప్పటికీ, కూతురు మనస్సు బాధపడుతుంది ఏమో అనే సంకోచం, నాకు అర్థంకాకపోలేదు.   కానీ నా మనస్సుకి తెలుసు అన్ని అవే సర్దుకుంటాయి అని.   హైదరాబాద్ ఉదయం 6:30 బాల్కనీ లో కట్టిన ధాన్యం కుచ్చు ని తింటున్న పక్షుల కిలకిల రావాలతో మెలుకువ వచ్చింది. నేను మా వారు ఇద్దరం లేచి , మొహం కడుక్కుని నింపాదిగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగి, ఒక అరగంట వ్యాహ్యాళి కి వెళ్లి వచ్చాము.  రాగానే స్నానం చేసి , దీపం పెట్టి ఒక పావుగంట దేవుడుకి ధ్యానం చేసుకున్నాను. ఈలోపు పని అమ్మాయి వచ్చి కూరలు తరిగి, ఇంటి పని చేసి వెళ్ళింది. నేను టిఫిన్, మధ్యాహ్నం రాత్రికి కి కలిపి వంట చేయడంలో పడ్డాను, మా వారు గంట సేపు చేసే పూజలో నిమగ్నులయ్యారు. 9.30 కి పని , పూజ, టిఫిన్ అని అయ్యాయి. ఈనాడు పేపర్ తీసి సుడోకు  పజిల్ నింపాము. నగరంలో ఈనాడు అనే శీర్షిక చూసి ఇవ్వాళ మనకి నచ్చిన కార్యక్రమాలు ఏవున్నాయా అని చూడగానే, త్యాగరాజ గాన సభలో భాగవత హరికథ కాలక్షేపం ఉంది. అది కూడా సాయంత్రం 5 ఇంటికి ఎలాగా అయినా వెళ్ళాలి అని అనుకున్నాము. 10.30 కి నేను దూరవిద్య లో కట్టిన ఎం.ఏ సోషియాలజీ కి సంభందించిన పుస్తకాలు తీసి ఒక రెండు గంటలు చదివాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలి అనే నా కోరిక తీరబోతోంది. మా వారు పక్కనే ఉన్న గుడికి వాలంటీర్ గా  సర్వీస్ చేయడానికి ఈ రెండు గంటలు వెళ్తారు. 1.00 కి ఇద్దరం భోజనం చేసి ఒక గంట పడుకుని లేచి టీ తాగి కాసేపు పురాణాలు, ఇతిహాసాలు, సాహిత్యం మీద పుస్తకాలు చదవడం, రామకోటి రాయడం అలవాటు చేసుకున్నాము. 5.00 కి ఇద్దరం ఇవ్వాళ త్యాగరాజ గాన సభ కి వెళ్లి హరికథ విని చాలా ఆనందించాము. రోజు అయితే ఈ సమయానికే మా కాలనీ సీనియర్ సిటిజెన్స్ క్లబ్ కి వెళ్లి ఒక గంట స్నేహితులతో గడిపి వస్తాం. ఊరికే వెళ్లి కబుర్లు చెప్పుకుంటాం అనుకోకండి, వారానికి మూడు రోజులు సొసైటీ కి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాము. పనివాళ్ల పిల్లల స్కూల్ ఫీజు కట్టడం, కాలనీ లో ఇంకుడు గుంతలు తవ్వడం, చెట్లు నాటడం, పూల మొక్కలు,కూర మొక్కలు పెంచడం, పిల్లలకి స్వచ్ఛ భరత్ మీద వాతావరణం కాలుష్యం మీద అవగాహన లాంటి పనులు. ఇంతే కాదు ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాము అంటూ కౌన్సెలింగ్ లాంటివి ఇస్తూ ఉంటాము. సోషియాలజీ  చదువుతున్నాను కదా దినికోసమే అనుకోవచ్చు. అంతే  కాక వారానికి ఓ రోజు మేము అంతా స్కూల్ పిల్లలుగా  క్లాసులకి వెళ్తాము. మా కాలనీలోని పిల్లలు మాకు ఇంటెర్నట్ వాడకం, యాంటీ వైరస్, మొబైల్ ఫోన్ వాడకం, హ్యాకింగ్ లాంటి విషయాల పయిన ఎంతో ఓపికగా పాఠాలు చెప్తారు. ఇంకా ఇలాంటివి చేయాల్సినవి చాలానే ఉన్నాయి , ఆ దేవుడు ఓపిక శక్తి ఇస్తే తప్పకుండా చేస్తాం. 7.30 లోపల భోజనం చేసి  కాసేపు టీవీ లో ఏ పాత సినిమానో, చాగంటి వారి ప్రవచనమో, పాడుతా తియ్యగా లాంటి కార్యక్రమమో చూసి అమ్మాయితో ఓ అరగంట స్కైప్ లో మాట్లాడి  పదింటికి  అలా అలసిపోయి, ఒక సంతృప్తి తో , నా జోవితానికి ఒక అర్ధం ఉంది అనే ఆత్మవిశ్వాసం తో వెంటనే నిద్రలోకి జారుకోవడం, మళ్ళి కొత్త ఉత్సాహం తో ఉదయం లేవడం ఇదే నేను కోరుకున్న ,  ఆశించిన  దినచర్య. అయితే ఇవ్వాళ అమ్మాయి ఇంకా వీడియో కాల్ చేయలేదు ,ఆన్లైన్ లో కూడా లేదు ఎందుకా అని ఆలోచిస్తుంటే అమ్మాయి నుండి మెయిల్ వచ్చింది. "అమ్మా, మొదటిసారి నీకు సారీ చెపుకుంటున్నాను. ఇంక లైఫ్ లో నీకు ఇలా సారీ చెప్పుకునే సిట్యుయేషన్స్ రాకూడదు అనుకుంటున్నాను. నువ్వు వెళ్లిన ఈ 3 నెలల్లో నాకు నువ్వు ఏంటో ఇంకా ఎక్కువ అర్ధం అయింది. మూణ్ణెల్ల ముందు నువ్వు మేము ఇంకా అమెరికా తిరిగిరాము అన్ని మాకు చెపినప్పుడు నాకు చాల కోపం వచ్చింది. నన్ను సముద్రం మధ్యలో వదిలేసి వెలిపోతున్నావని తిట్టుకున్నాను. అమ్మమ్మ, నానమ్మ నీకు ఎంతో చేసారు మరి నువ్వు నాకు ఎందుకు చెయ్యట్లేదు అని అనుకొన్నాను. కానీ వాళ్ళు వాళ్లకి తగినట్టుగా , ఇష్టపడి ఎంత ఓపిక ఉంటె అంతే చేసారు కానీ నువ్వు ఎప్పుడు వాళ్లని ఇలా చేయి అలా చూడండి అని అడగ లేదు అని అర్ధం చేసుకున్నాను. ఇన్ని రోజులు నువ్వు చేస్తూ ఉంటే తెలీలేదు కానీ , అన్ని పనులు పిల్లాడితో చేసుకుంటుంటే  మూడుపదులలో ఉన్న నాకే ఓపిక ఉండట్లేదు. అలాంటిది అరవయి ఏళ్ళ వయసులో అది కూడా జీవితంలో ఎంతో కష్టపడిన నీతో చాలా చాకిరీ చేయించాను. ఈ వయసులో నీకు కావాల్సిన విశ్రాంతి  నేను నీకు ఇవ్వలేకపోయినందుకు చాల సిగ్గు పడుతున్నాను. అయినా నువ్వు ప్రతి నెల నాకు కూరపొడి, చారుపొడి దగ్గర నుండి వడియాలు అప్పడాలు వరకు అన్ని చేసి పంపిస్తూనే ఉన్నావు. తల్లి మనస్సు కదా అంతే మరి. ఇలాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా మొత్తానికి నువ్వు అనుకున్నది సాదించావు ప్రౌడ్ అఫ్ యు అమ్మా..   అందుకే నేను కూడా నిన్ను ఇన్స్పిరేషన్ కింద తీసుకుని కొంత కాలం ఉద్యోగానికి బ్రేక్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. బాబు స్కూల్కి వెళ్ళేదాక నిన్ను కానీ మా అతగార్ని కానీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, ఎలాగో అలాగా ఖర్చులు తగ్గించుకుని మీకు మీ ఫ్రీడమ్ ఇవ్వాలని అనుకున్నాము. థాంక్ యూ ఫర్ ఎవెర్య్థింగ్ అమ్మా, బాయ్, రేపు కాల్ చేసి మాట్లాడతాను." మెయిల్  మూడు సార్లు చదువుకున్నాను , నాకు తెలుసు నా కూతురు ఆలస్యం అయినా నన్ను అర్ధం చేసుకుంటుంది అని ,మా పెంపకం మీద నాకు ఆ నమ్మకం ఉంది. పిల్లలు చెడు చూసినట్టే మంచిని చూసి కూడా నేర్చుకుంటారు. మనం చేసినది మనకి తప్పక తిరిగివస్తుంది. నా ప్రశ్నలకి సమాధానం దొరికినందుకు మనస్సులో ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ప్రశాంతంగా పడుకున్నాను. పొద్దునే లేచాము  కాని ఇవాళ మా దినచర్య లో కొద్దిగా మార్పు , ఎందుకు అంటే ఇవాళ మా సీనియర్ సిటిజన్స్ క్లబ్లలో వంద మంది సభ్యులు చేరిన తరుణం లో వాళ్ల కుటుంబాలుతో సహా అందర్నీ లంచ్ కి పిలిచారు.  అందరూ వారి వారి కుటుంబాలతో చక్కగా వచ్చారు. భోజనాలు అయ్యాక  ఆసక్తి ఉన్నవారు నాలుగు మంచి మాటలు చెప్పవచ్చు అని అందరికీ అవకాశం ఇచ్చారు . నా వంతు రాగానే  “ వృద్దాప్యం శాపం కాదు, దేవుడు మన కలల్ని సాకారం చేసుకోడానికి ,మరల జీవించడానికి ఇచ్చిన గొప్ప వరం. అది ఎవరు తాహతుకి తగ్గట్టు గా ఆలోచించి ఆచరణలో పెట్టండి. అందరికీ అన్ని కుదరకపోవచ్చు ఆర్థిక సమస్యలు ,ఆరోగ్య సమస్యలు , పిల్లల సమస్యలు ఉండచ్చు కాబట్టి అనుకున్నవన్నీ చేయలేకపోవచ్చు. కానీ కనీసం కొంత స్వీయ సమయం అంటే రోజుకో గంట వ్యచించచ్చు. ఆ గంట మనకి నచ్చినట్టు ఉండి ,నచ్చినట్టు చెయ్యచ్చు.అది ఎంత చిన్న పని అయినా సరే, స్నేహితులని  కలవడం, పార్కులో వ్యాహ్యాళి,లైబ్రరీ కి వెళ్ళడం, పక్కన గుడికి వెళ్లడం లాంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు అడ్డు రావు. ఎందుకు అంటే నచ్చింది చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కుదుటపడి అలజిమేర్స్, డిప్రెషన్ లాంటి ఎన్నో వ్యాధుల్ని నియంత్రించి ,మన ఆరోగ్యం మన చేతిలో ఉంచుకోవచ్చు. అందుకే ఈ వృద్దాప్య వరాన్ని మన ముందు తరానికి బహుమతి గా ఇద్దాం , కదలి రండి నా తోటి మిత్రులారా…” అని నేను ముందుగానే ఆలోచించుకున్న నా భావాల్ని, అనుభవాల్ని  వారితో  పంచుకున్నాను. అందరూ కారతాళధ్వనులు చేసి, ఎవరి పిల్లలు వారి వారి తల్లిదండ్రులని మీకు మేము ఉన్నాము నచ్చింది చేయండి అన్నట్టుగా చూసారు అనిపించింది, ఒక  భరోసా వారి కళ్ళలో కనిపించింది. ఇది చాలు ,ఇంతకన్నా  సాధించటానికి ఇంకా ఏమి ఉంది అని, నిజానికి ఈ చప్పట్లు, ఈ కార్యసిద్ధి నావి కాదు, ఈ వయస్సు లో కూడా  నాకు  ఇంత స్వేచ్ఛని ఇచ్చిన నా కుటుంబానికే చెందుతుంది కదూ!    -భాస్కరలక్ష్మి.సోంభొట్ల

ప్రేమ నేర్పిన పాఠం

ప్రేమ నేర్పిన పాఠం (తెలుగువన్ ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)     ‘ఎంటమ్మా...ఆవిడ పెట్టె బేడాతో ఇంటికొచ్చేసింది.ఎన్ని రోజులుంటుందేమిటి’ చిరాగ్గా అడిగింది శివాని తల్లిని. ‘అబ్బా..సరిగ్గా నేను అదే అడుగుదామనుకున్నాను’అన్నాడు అభిలాష్. ‘ఏంటా మాటలు..పెద్దా చిన్నా లేకుండా..ఆవిడ ఎక్కడకూ వెళ్ళదు. ఇక్కడే ఉంటుంది. తాతయ్య చనిపోయాడని నేనే తీసుకొచ్చాను మీకేం కష్టం’ తీవ్రంగా అంది ఉమ. ‘ఆ..ఇక్కడే ఉంటుందా...ఇంతకుముందు ఆ గదిలో మా ఫ్రెండ్స్ అంతా కల్సీ కబుర్లు చెప్పుకొవడానికి హాయిగా ఉండేది. ఇప్పుడు ఆవిడ మంచం తో ఇరుకయ్యింది. పైగా ఎప్పటికీ ఆ దగ్గోకటి. అదొచ్చినప్పుడల్లా శబ్దం చేస్తూ ఉమ్ముతూ ఉంటుంది.చికాకనిపిస్తోంది.’ శివాని అంది. ‘అవునమ్మా’వంత  పాడాడు అభిలాష్.   ‘మన నాన్నమ్మ  మన దగ్గరుండక ఇంకెక్కడుంటుంది. అలా అనకూడదు తప్పు. రేపు ముసలిదాన్నయ్యాక నన్ను అలాగే అంటారా..’ ‘వూర్కో అమ్మా....అన్నీ పొంతన లేని  మాటలు మాట్లాడతావు. నాకు కాలేజ్ కి టైమవుతోంది’ అంటూ విసుగ్గా వెళ్లిపోయింది శివాని. కోపంగా వెళ్ళాడు అభిలాష్. నాన్నమ్మ ఎప్పటికీ తమతోటే ఉంటుందన్న సత్యం జీర్ణించుకోలేక తమ అసహనాన్ని కోపంగా మాట్లాడుతూనో, ఏదైనా ఎత్తేస్తూనో నిరసన వ్యక్తపరుస్తుంటే ఎక్కడ అత్తయ్య బాధపడుతుందోనని మధన పడుతోంది ఉమ. ఎంత పల్లెటూరినుండి వచ్చినా ఆ మాత్రం గ్రహించలేని అమాయకురాలు కాదు తాయారమ్మ. అందుకే ‘నన్ను మావూరు పంపించేయ్యండే...వూరు పొమ్మంటోంది,  కాడు  రమ్మంటోంది. కాటికి కాళ్ళు చాపుకున్న నా శేష జీవితం కూడా అక్కడే  మట్టిలో కలిసిపోనీ..’ అంది. అలా అత్తయ్యకు తెలిసిపోయినందుకు, తన పెంపకం లో పెరిగిన పిల్లలలా తయారయినందుకు తెగ సిగ్గుపడి అవమానం లా ఫీలయ్యింది ఉమ.  ‘నువ్వలా అనకు అత్తయ్యా...మామయ్య లేని ఇంట్లో ఉండలేవు. మేమంతా లేమా’ అని సర్ధి చెబుతోంది. ఆరోజు హటాత్తుగా ఉమ తల్లిగారి  దగ్గరి బంధువేవరో చనిపోవడం తో తప్పనిసరై తెలవారకముందే ప్రయానమై వెళ్ళిపోయారు ఉమా,భార్గవ్ లు. అంతకు ముందు రోజు రాత్రి కాలేజ్ లో ఏవో సాంసృతి క కార్యక్రమాలంటూ  అలసిపోయి వచ్చి , ఆలస్యంగా పడుకున్న శివానికి రాత్రికి రాత్రే జ్వరం అందుకుంది. పొద్దున్న 8 గంటలకే వెళ్లాల్సిన అభిలాష్ నాన్నమ్మ పెట్టిన ఇడ్లీ,చట్నీ,సాంబార్ లొట్టలువేసుకుంటూ తిని వెళ్ళాడు. శివాని ఇంకా లేవలేదని లేపబోతూ, చలికి వణుకుతూ,మూలుగుతున్న శివాని ని చూసి నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి వాష్బేసిన్ దగ్గరకు నడిపించి బ్రష్ చేయించింది తాయారమ్మ .   వేడివేడి పాలు తాగించింది బూస్ట్ వేసి. ఇంట్లోని పారసిట మాల్ టాబ్లెట్ వేసి ఒక ఇడ్లీ తినిపించి పడుకోబెట్టింది.  కానీ పది నిమిషాలైనా కాకముందే  భల్లున వాంతి చేసుకుంది శివాని.  అప్పుడే ఇంటికొచ్చిన అభిలాష్,’ఛీ...అంతా వాసనొ స్తుంది ఏమయ్యింది’ అన్నాడు మొహం చిట్లిస్తూ.  విషయం చెబుతూ, డాక్టర్ దగ్గరకు అతన్ని పంపించి, అంతా శుబ్రము  చేసి,బెడ్ షీట్  చద్దరు తీసింది. ఆమె డ్రెస్ కూడా తీసి వొళ్ళంతా వేడి నీళ్లలో డెట్టాల్ వేసి తుడిచి ఉతికిన బట్టలు తొడిగింది. నుదుటిపై చన్నీళ్ళ పట్టి వేసి, బట్టలు అన్నీ శుబ్రమ్ చేసేసరికి ఫామిలీ  డాక్టర్ ని తీసుకుని అభిలాష్ వచ్చాడు. డాక్టర్ కొన్నిటాబ్లెట్స్ రాసిచ్చి వెళ్లిపోయాడు. అభిలాష్ టాబ్లెట్స్ తెచ్చిచ్చి క్లాస్కెళ్లిపోయాడు.  తాయారమ్మా’మా బంగారం కదూ..’ అంటూ బతిమిలాడి ,టాబ్లెట్ వేశాక  అందులోని మత్తు కో ఏమో గానీ కొంచెం సేపు ని ద్ర పోయింది.  కాసేపటికి  లేపి   ఇడ్లీ కారప్పొడితో కలిపి తినిపించి,  దిష్టి తీసింది.  ‘నాన్నమ్మా ..నాకు రేపు కాలేజ్ లో ‘కాలేజ్ డే’ ఉంది. నాపాట ఉంది. రేపేలాగయినా వెళ్ళాలి’ తొలిసారిగా నాన్నమ్మా అంటూ కళ్ల నీళ్ళు పెట్టుకున్న శివాని కన్నీళ్లు తుడిచి ‘తప్పక వెళతావు’ అంటూ పడుకోబెట్టింది. మధ్యాన్నం లేచేసరికి జ్వరమంతా  తగ్గిపోయింది. కంఠం మంచిగా ఉండడానికి మిరియాలు కలిపిన పాలు ఇచ్చింది.  వేడి వేడిగా అన్నం వండి ఎల్లిపాయ కారం తో  నాలుగుముద్దలు  తినిపించింది.  మరోగంటలో పాట ప్రాక్టీస్ కి సిద్దమయిపోయింది శివాని . అయిదారు సార్లు పాడి నీరసంగా  అనిపించడంతో బోర్ గా అనిపించి ఫేస్ బుక్ తెరిచింది.  ఆరోజు వృద్ధుల దినోత్సవం కావడం తో ఫ్రెండ్స్ పోస్ట్ చేసిన కొటేషన్లు చదవసాగింది.  ‘ వృద్ధాప్యం ఎప్పటికీ శాపమే కాదు. మంచిగా మలుచుకుంటే వరమూ అవుతుంది. అది అనివార్యమని తెలిసినప్పుడు దాన్ని ఆనందంగా ఆహ్వానించాలి. ఒకర్కి భారం కాకుండా కొన్ని సదుపాయాలూ ముందే చేసుకోవాలి. పెద్దవాళ్ళు అనుభవసారంతో తల పండినవారు , చిటికెలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల నేర్పరులు.’ ‘నీ శరీరం లేచి నిలబడడానికి సహకరించని రోజు,  నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు నీ పనులకు ఇకోకరిపై ఆధారపడిన రోజు నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు నీ నిస్సహాయ స్థితికి నికే జాలి కలిగే రోజు  నీ జీవితం లో ఎం సాధించావో ఎం పోగొట్టుకున్నావో  స్పష్టంగా తెలిసి పోతుంది కానీ అప్పటికే అంతా చేజారిపోతాయి... తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు.....’ ‘ కన్నా.... నా  దగ్గర ముసలి వాసన వ వస్తుందని నా  దగ్గరకు రాకుండా  నన్ను ముట్టుకోకుండా ఉండకురా.. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నిన్ను ఎత్తుకుని ముద్దాడా నురా... నేను బట్టలలోనే మల మూత్రాలు చేసుకుంటున్నానని అసహ్యించు కోకురా.... నీ చిన్నప్పుడు ఈ చేతులతోనే అవన్నీ శుబ్రం  చేసానురా.... పదే పదే అడుగుతున్నానని విసుక్కోకురా...  నీ చిన్నతనం లో ఎన్ని సార్లు ఒకే విషయాన్ని అడిగినా ప్రేమగా చెప్పానని గుర్తు చేసుకోరా.... అన్ని తినలేక పోతున్నానని  కోప్పడ కురా...... నీకు పళ్ళు రానప్పుడు మెత్తగా ఉగ్గు చేసి నిన్ను బుజ్జగించి తినిపించేదాన్నిరా   నడవలేక పోతున్నానని ఈసడించ కురా  తప్పట డుగులతో  నువ్వు పడిపోకుండా నా చేయందించి నడిపించానురా.......’ కళ్ళ నిండా  నీళ్ళు నిండగా  ఇక చదవ లేక క్లోజ్ చేసింది శివాని .  నిజంగా చదువుకునే తామే ఎన్ని సూటి పోటి మాటలన్నారు నాన్నమ్మని. తాతయ్య చనిపోయిన భాద లో ఉన్న నాన్నమ్మను ఎంత కష్ట  పెట్టారు. తామేప్పుడైనా నాన్న వాళ్ళతో వెళితే తమ కోసం వేరుశనక్కాయలు, లేత కంకులు, పెసరు కాయలు, దుంప లతో ఎన్ని రకాలు చేసి ప్రేమగా పెట్టేది. తామే ఒకటి రెండు రోజులకు మించి ఉండక పోయేవాళ్ళు. ఉన్నన్ని రోజులు తామెక్కడ బాధ పడతారో నని తమకు ఎ కష్టం కలక్కుండా కూడా చూసేది. బురద గా ఉన్నదని, దోమలున్నాయని, బాత్రూమ్లు దూరంగా ఉన్నాయని తామే తొందరగా  వచ్చేవాళ్ళు. అలాంటి నానమ్మ ను ఎన్ని మాటలన్నారు.  ఇవ్వాల  తాను  వాంతి చేసుకుంటే తనకే  అసహ్యం గా అనిపించింది. పాపం... విసుక్కోకుండా ప్రేమగా అంతా ఎలా శుబ్రం చేసింది.  పశ్చాత్తాపంతో కళ్ళ నిండా నీళ్ళు నిండాయి.   సాయంత్రం అయింది.  మనవడు వచ్చేసరికి వేడివేడి సర్వపిండి (తపాలచెక్క) పెట్టి అందించింది ఇద్దరికీ... ‘అబ్బా ఎంత బావుంది నాన్నమ్మా.. మా అమ్మ ఎప్పటికీ ఆ మ్యాగీలు,  బజ్జీలు పెడుతుంది. ‘ అంటూ ఇష్టంగా  తిన్నాడు . శివానికి ఇష్టంగానే అనిపించింది. నాన్నమ్మ ఆప్యాయత ఎంతో నచ్చింది. ఇంతకు ముందు  అమ్మ ఎక్కడికైనా ఇలా వెళ్ళినపుడు ఒంటరిగా చాలా ఇబ్బంది పడేవారు. నాన్నమ్మ వచ్చిందగ్గర్నుండి చేగోడీలు, సున్నుండలు, జంతికలు, కారబ్బిళ్ళలు, పల్లీల ఉండలు చేయడంతో రాగానే ఇష్టంగా  తింటున్నారు. అభిలాష్ కి కాలేజ్ లో వక్తృత్వ పోటీ ఉండటంతో  ప్రి పే ర్ అవుతున్నాడు. లంచం తీసుకోకుండా  మానసికంగా  ఎలా పరివర్తన తీసుకురావాలనే అంశం గురించి. ఎదో కొంత విషయం ప్రిపేర్ చేసుకున్నాడు. కానీ అది అంత ఆసక్తి కరంగా లేదు. పైగా  భయం లేకుండా, చూడకుండా  చెప్పాలంటే ఒక వాక్యం చెబితే ఒకటి మర్చిపోతున్నాడు. అతని అవస్థ అంతా చూస్తున్న తాయారమ్మ,’కన్నా.. ముందు మనం చెప్పే విషయం ఎదుటి వారిని ఆకర్షించి వారి మనసు దోచుకునేలా ఉండాలి. మన కిచ్చిన అంశం  పరిధి లో ఉండాలి. మనకిచ్చిన సమయం లోనే పూర్తీ చేయగలిగి ఉండాలి.  మన ముందువాళ్లని చూసి మనం భయపడకూడదురా.. ప్రతీ టీచర్ కూడా ఒకప్పుడు విధ్యార్దే. నీలో ఎలాంటి రక్తం ఉందొ వాళ్లలోనూ అదే రక్తం ఉంది. అలాంటప్పుడు ఎదుటి వారిని చూసి భయపడకూడదు.  అలాగే నీ ముందున్న వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే. అలనాడు మన స్వాతంత్ర్య సమర యోధులు కూడా అలా భయపడి ఉంటే మనకీ స్వాతంత్ర్యం వచ్చేదా... ఇంకా భయమైతే నన్ను, చెల్లెల్ని చూస్తూ స్పీచ్ ఇవ్వు. లేదా అద్దం ముందు  నిన్ను నీవు చూసుకుంటూ ఇవ్వు. ఒక్కసారి ఫెలవుతావు. పది సార్లు ఫెలవవు కదా…. అందుకే తినగ తినగ వేము తియ్యనుండు అన్నారు’ అంటూ ధైర్యం చెప్పింది.  కానీ అభిలాష్ , పల్లెటూరు నుండి వచ్చిన పాత  కాలం నానమ్మ తనకు హితబోధ చేయడం జీర్ణించుకోలేక పోయాడు. ఆమె చెప్పిన వన్నీ నిజమని తెలుస్తున్నా వొప్పుకోవడానికి అహంకారం అడ్డొచ్చింది.  ‘ఆ..... ఉచిత సలహాలు ఎన్నయినా ఇవ్వొచ్చు.  ప్రాక్టికల్ గా  చేస్తే తెలుస్తుంది అదేంత  కష్టమో....’ వ్యంగ్యం గా అన్నాడు. ‘ వావ్....నాన్నమ్మ... నీ కివన్నీ ఎలా తెలుసు...అసలు నువ్వేం చదువుకున్నావ్..అన్నయ్యా.... ఎందుకు అలా అంటావ్.... నాన్నమ్మ చెప్పింది అన్నీ కరేక్ట్ నే కదా.... పైగా నాన్నమ్మ ఇవన్నీ  చెప్పిందంటే ఆసక్తిగా ఎలా చెప్పాలో కూడా చెబుతుంది.  తెలుగు లోనే కదా చెప్పేది.... నాన్నమ్మా చెప్పవా....’ బ్రతిమిలాడింది. ‘ఆ.. ఎదో వానాకాలం చదువు... నేనేం చదివాను.... ఎదో తాతయ్య దగ్గరే నేర్చుకున్నా....  ఇప్పుడవన్నీ ఎందుకు గానీ వాణ్ని ప్రాక్టీస్ చేసుకోనివ్వు..... మనం బయట కేలదాం...రా....’ అంది  కొంచెం చిన్నబుచ్చుకుంటూ తాయారమ్మ. ‘ సారీ.... నాన్నమ్మ.... ఎదో  అన్నాలే గానీ ....నిజంగా నీకు తెలిస్తే చెప్పవా.... మా మంచి నాన్నమ్మ కదూ...’ నవ్వుతూ చుబుకం పట్టుకుని అభిలాష్ సరెండ రయి పోయాడు, చెల్లి మాట కరేక్టే నిపించడంతో . ‘అది కాదు నాన్న... లంచాలు తీసుకోకుండా వారి మనస్సుల్లో పరివర్తన తేవాలంటే , మీకు అలేగ్జాందర్ చనిపోతూ కోరిన కోర్కెల గురించి తెలుసు కదా ... అది  ఇక్కడ ప్రస్తావిస్తే... ఆసక్తికరంగా ఉంటుంది. బట్టీ పట్టినట్లు కాకుండా సందర్భోచితంగా సులువుగా చెప్పగలవు...’ ‘పూర్తిగా గుర్తులేదు  కానీ నువ్వు చెప్పు నాన్నమ్మా...’ ‘అలేగ్జాండర్ చాలా రాజ్యాలను జయించి ఇంటికి తిరిగి వెళుతుంటే మార్గంలో తీవ్ర అనారోగ్యానికి గురయి మరణించ బోతున్నానని తెలుసుకుని , తాను చనిపోయాక 1. తన శవ పేటికను వైద్యులు మాత్రమె మోయాలని, 2. స్మశానానికి వెళ్ళేదారిలో తానూ సంపాదించిన విలువైన రత్నాలు, మణి మానిక్యాలు చల్లమని ౩. తన శవపేటిక నుండి తన రెండు అరచేతులు బయటకు కనిపించేలా ఉంచమని  చెపుతాడు. ఎందుకలా అని అడిగిన వారితో, 1. వైద్యుడు వైద్యం చేయగలడుగానీ మరణాన్ని ఆపలేడు  అని 2. సంపద కూడా కూడబెట్టడానికే నా  జీవితమంతా వృధా అయ్యింది, దాని కోసం  విలువైన సంతోషాన్ని పోగొట్టుకోకూడదు అని ౩. నేను ప్రపంచానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చాను, వెళ్ళేప్పుడు అలాగే వెళుతున్నాను ఎంత సంపాయించినా ఏమీ తీసుకు పోను, కేవలం పాప పుణ్యాలు తప్ప అని చెప్పడానికి , అని అంటాడు... ఈ విషయం రెండు నిమిషాల్లో చెప్పవచ్చు. బాగుంటుంది...’ అంది. పిల్లలీద్దరు  మంత్రముగ్ధులై విన్నారు. ‘వావ్.....’ ఇద్దరి నోటినుండీ ఒకే సారి వచ్చింది. ‘నాన్నమ్మా.... నీకివన్నీ ఎలా తెలుసు....’ ఆశ్చర్యంగా అడిగింది శివాని.  ‘ తాతయ్య స్వాతంత్ర్య సమర యోధుడు కదా....రాత్రి వయోజన విద్య కేంద్రం లో మా వూరి జనాలందరికీ  చదువు చెప్పేవాడు . నేనూ వెళ్ళేదాన్ని. ఇలాంటి వెన్నో చెప్పేవాడు.  తీరిక వేళల్లో పుస్తకాలు చదవమంటూ ఎన్నో పుస్తకాలు ఇచ్చేవాడు....’  పై రూపం చూసి ఎవర్నీ తక్కువ అంచనా వెయ్యకూడదు అని తెలిసింది ఇద్దరికీ....చెరో వైపు హత్తుకున్నారు.   తెల్లవారి శివాని, అభిలాష్ చెరోక ట్రోఫీ తో వచ్చి నాన్నమ్మకి చేతుల్లో పెట్టి చెరో చెంప పై ముద్దిచ్చారు. అప్పుడే వచ్చిన తండ్రి భార్గవ్ ఆశ్చర్యంతో చేతిలోని సెల్ కెమెరా క్లిక్ మనిపించాడు. తల్లి తలో ఏం మహిమ జరిగి ఉంటుందా అని ఆనందంతో అవాక్కైంది.                                                                                                                                             -నామని సుజనాదేవి 

జాషువా హాస్యం!

జాషువా హాస్యం! మహాకవి గుర్రం జాషువా గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. దిగువ కులంలో పుట్టడం వల్ల నానారకాల అవమానాలను అనుభవిస్తూనే, అరుదైన సాహిత్యాన్ని అందించిన వీరుడు జాషువా. హరిజనుడు కావడం చేత అగ్రవర్ణాలవారు ఆయనను దూరంగానే ఉంచేవారు. సాహిత్య సమావేశాలలో సైతం ఆయనకు విడిగానే భోజనం వడ్డించేవారట. అబ్బూరి వరదరాజేవ్వరరావుగారు రాసిన ‘కవనకుతూహలం’ అనే పుస్తకంలో తాను ఇలాంటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్లు రచయిత చెబుతారు. మరోవైపు హైందవ సంప్రదాయంగా భావించే పద్యరచనని చేపట్టడంతోనూ, వారి దేవతల గురించి రాయడంతోనూ... క్రైస్తవులు కూడా ఆయనను వెలివేసేవారు. ఈ ఉపోద్ఘాతమంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే- తన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా, జాషువాలోని హాస్యచతురతలో ఎలాంటి మార్పూ రాలేదు. అయనలోని చమత్కృతికి చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. వాటిలో కొన్ని... - జాషువా గురించి తరచూ వినిపించే ఓ హాస్య సంఘటన దీపాల పిచ్చయ్యశాస్త్రికి సంబంధించినది. దీపాల పిచ్చయ్యశాస్త్రి, గుర్రం జాషువాకు సహాధ్యాయి. ఆయన సాహచర్యంలోనే జాషువాగారు పద్యాల మీద పట్టు సాధించారట. అదే సమయంలో కొప్పరపు కవులు, తిరుపతి వెంకట కవులు జంటకవులుగా మంచి ప్రచారంలో ఉన్నారు. మరోవైపు విశ్వనాధవారు కూడా కొడాలి ఆంజనేయులు అనే కవితో కలిసి కవిత్వం చెబుతున్నారు. ఇదంతా చూసిన జాషువా, పిచ్చయ్యశాస్త్రులకు తాము కూడా జంట కవిత్వం ఎందుకు చెప్పకూడదు అన్న ఆలోచన వచ్చింది. కానీ జంట కవిత్వం కోసం ఇద్దరి పేర్లనీ ఎలా కలిపేది? పిచ్చి జాషువా, జాషువా పిచ్చి, దీపాల జాషువా, జాషువా దీపాలు, జాషువా శాస్త్రి, గుర్రం పిచ్చి, దీపాల గుర్రం... ఇలా ఎలా చూసినా కూడా ఇద్దరి పేర్లూ కలవడమే లేదు. దాంతో జంట కవిత్వపు ఆలోచనను విరమించుకున్నారు ఆ కవిద్వయం. - జాషువాకి సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా ఉంది కానీ, లక్ష్మీదేవి (సంపద) మాత్రం ఆయనకు దూరంగానే ఉండేది. జాషువా గురించి తెలిసిన ఒక పెద్దాయన గుంటూరు నుంచి ఓ 25 రూపాయలని మనీఆర్డరు చేశారట. దానిని జాషువా స్వీకరిస్తారో లేదో అన్న సంశయంతో సరదాగా- ‘రాత్రి నాకు దేవుడు కలలో కనిపించి 25 రూపాయలు నీకు పంపమన్నాడోయ్।‘ అని మనీఆర్డరు వెనుక రాశాడట. దానికి జాషువా ‘మీ దేవుడు 25 పక్కన సున్నా పెట్టమని చెప్పలేదా!’ అని అంతే సరదాగా జాబు రాశాడట! - జాషువా గురించి చెప్పుకొనేటప్పుడు ఆయనకీ విశ్వనాథకీ మధ్య జరిగినట్లుగా ఓ కథ ప్రచారంలో కనిపిస్తుంది. ఓ సమావేశంలో తనతోపాటుగా జాషువాని పిలిచినందుకు విశ్వనాథ ఆక్షేపిస్తూ ‘గుర్రాన్నీ గాడిదనీ ఒకే గాటున కట్టేశారు’ అన్నారట. ఆ వెంటనే జాషువా ‘నా పేరులో గుర్రం ఉంది, మరి గాడిద ఎవరో నాకు తెలియదు!’ అని చురక అంటించారని చెబుతారు. ఈ సంఘటన చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ, దీని వెనుక ఎలాంటి ఆధారమూ లేదు. ఎందుకంటే అటు విశ్వనాథా, ఇటు జాషువా ఒకరంటే ఒకరు చాలా గౌరవభావంతో ఉండేవారట. - ఒకసారి జాషువాగారికి జ్వరం వచ్చింది. అది ఎంతకీ తగ్గడం లేదయ్యే! ఎవరో వచ్చి ‘తగ్గిందా!’ అని అడిగితే... ‘ఆహా! తగ్గకేం. సీసాలో మందు సగం తగ్గింది,’ అని జవాబిచ్చారట జాషువా. ఇంతకీ జాషువాకి ఇంత హాస్య ప్రవృత్తి ఎలా అబ్బి ఉంటుందీ అంటే, ఆయన పద్యంలోనే జవాబు కనిపిస్తుంది. నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు , కొన్ని నవ్వులెటు తేలవు , కొన్ని విష ప్రయుక్తముల్ పువ్వుల వోలె ప్రేమ రసమున్ వెలిగ్రక్కు విశుద్ధ మైన లే నవ్వులు సర్వదు:ఖదమనంబులు వ్యాధులకున్ మహౌషదుల్। అంటారు జాషువా ఒకానొక సందర్భంలో- ‘నవ్వు మనిషికి మాత్రమే ప్రత్యేకమైన వరం. ప్రశాంతమైన, స్వచ్ఛమైన అంతరంగానికి చిహ్నం! నవ్వులలో చాలారకాలు ఉండవచ్చు. కానీ అభిమానంతో కూడిన నవ్వులు సమస్త దుఃఖాలనూ నశింపచేస్తాయి. ఎటువంటి వ్యాధికైనా మందులా పనిచేస్తాయి,’ అన్నది పై పద్యంలోని భావం. అంతటి భావం మనసున కలిగి ఉన్నవాడు కాబట్టే... ఎటువంటి బడబాగ్నిలోనైనా చిరునవ్వుతో నిలువగలిగాడు జాషువా! - నిర్జర.

నట్టింట్లో విషం పెట్టె

నట్టింట్లో విషం పెట్టె ( తెలుగువన్ ఉగాది కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)     తన కూతురు జాహ్నవి మేడమీద నుంచి కిందపడింది, ఆసుపత్రిలో చేర్పించారని చెల్లెలు మాధవి ఏడుస్తూ సెల్ ఫోన్లో చెప్పిన  వార్త నా గుండె జారిపోయేలా చేసింది. వెంటనే ఆటో మాట్లాడుకుని ఆసుపత్రికి బయల్దేరాను. దారిలో జాహ్నవిని గురించిన ఆలోచనలు మనసులో సుళ్లు తిరుగుతున్నాయి. దానికి ఆరేళ్లు. థర్డ్ క్లాస్ చదువుతోంది. హైపర్ యాక్టివ్. ఏదైనా ఇట్టే పట్టేస్తుంది. నేనంటే దానికి చాలా ఇష్టం. వాళ్లింటికెళితే ‘పెద్దమ్మా’ అంటూ నన్ను చుట్టేసి ఒకపట్టాన వదలదు. నిజానికి అదంటే నాకూ అంతే. ఒకే ఊళ్లో ఉండడం వల్ల అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటాం. పదిహేను రోజుల క్రితమే వెళ్లొచ్చాను. ఇంతలో ఈ సంఘటన. పాపం ఎన్ని దెబ్బలు తగిలాయో ఆ లేత శరీరానికి, అసలా పిల్ల పరిస్థితి ఎలా ఉందో. ఆ ఆలోచనకే ఒళ్లు జలదరించింది. ఆలోచనల్లో ఉండగానే ఆటో ఆసుపత్రికి చేరుకున్నట్టు డ్రైవర్ చెప్పడంతో దిగి అతనికి డబ్బిచ్చిఆసుపత్రిలోకి వేగంగా అడుగులేశాను. పాప మూడో అంతస్తులోని పి ఐ సి యు ఉందన్న విషయం రిసెప్షన్ లో తెలుసుకుని మెట్లమీదుగా పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నాను. నన్నుచూడగానే ఏడుస్తూ నా వైపు వచ్చి "చూడవే..నా..చిట్టి తల్లి" అని పి ఐ సి యు వైపు చూపించింది. "పాపకేం కాదు, నువ్వు కంగారు పడకు" అని ఊరడించి ’శ్రీకర్ ఎలా జరిగిందిది?" అక్కడున్న కుర్చీలో నిస్త్రాణగా కూర్చుని ఉన్న మా మరిదిని అడిగాను. "ఏమో, ఎలా జరిగిందో నాకూ తెలియదు. ఆఫీసుకు ఫోనొస్తే హుటాహుటిన వచ్చేశాను"అన్నాడు. "నేను.. ఇల్లు.. సర్దుకుం..టున్నానే..ఉన్నట్టుండి పెద్ద.. శబ్దం వినిపించింది. బయతకు వెళ్లి చూద్దు..ను కదా..రక్తం మడుగులో..అది.."ఇహ చెప్పలేక వెక్కి వెక్కి ఏడవసాగింది. "అదేంటి? డాబాపైన చుట్టూ పిట్టగోడ ఉంటుంది కదా. పాప దానికి ఆనుకుంటే కూలిపోయిందా?"అడిగాను. "లేదు..అదొక్కతే నేల... మీద పడింది, సిమెంటు పెళ్లలు..మట్టీ ఏం లేవు."అంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. పోనీ ఆ పిట్టగోడ ఎక్కి అందుకోబోయి పడిపోయిందనుకుందామంటే-వాళ్ల డాబాకానుకుని కాయలు, పళ్లతో ఉన్న చెట్లేం లేవు.  "పోనీ స్నేహితులెవరన్నా తోసెయ్యడం..లాంటివి" అనుమానంగా అడిగాను.  "చ..ఛ..చదువుకుంటానని చెప్పి అదొక్కతే పైకెళ్లింది .."చెప్పింది. నా ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు. ఇంక ప్రశ్న లేయడం సరికాదని "సర్లే..జరిగిందేదో జరిగిపోయింది. పీడ ఏవన్నా ఉంటే పోతుంది." అన్నాను. అప్పుడే బైటకొచ్చిన డాక్టర్ ‘దెబ్బలు బాగా తగలడం వల్ల.. ట్రీట్మెంట్ జరుగుతోందని...ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే తప్ప ఏం చెప్పలేమని’అన్నాడు. అది విని మళ్ళీ ఏడవడం మొదలెట్టింది మాధవి.  "ఇక్కడ ఏడవకూడదమ్మా"అంది అటుగా వచ్చిన నర్స్. నేను తనని కొద్దిదూరం తీసుకెళ్లి అక్కడ ఉన్న స్టీల్ బెంచ్ మీద కోర్చోబెట్టి..ఊర్కోబెట్టే ప్రయత్నం చేశాను.                                               మూడ్రోజులు ఐ సి యూలో, వారం రోజులు జనరల్ వార్డ్ లో ఉంచి జాహ్నవిని డిస్చార్జ్ చేశారు. అది ఆసుపత్రిలో ఉన్నంత కాలం మాకు కాలం చాలా భారంగా సాగింది. మనసంతా దిగులు. ఏదీ తినబుద్ధి కాలేదు. నిద్రపోలేదు. ఇంటికొచ్చాక పిల్లకు దిష్టి తీసింది మాధవి. ’ఎవరి కళ్లు పడ్డాయో మృత్యుముఖం చూసొచ్చింది పిచ్చిది..’ జాహ్నవిని గట్టిగా కౌగలించుకుని ఒళ్లంతా ముద్దులెట్టుకుంది మాధవి. పిల్లలున్నదాన్ని నాకూ తెలుసు కన్నప్రేమ, కడుపు తీపి. కళ్లలో నీళ్లు నిలిచాయి. పదిహేను రోజులైంది పాప ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయి. జాహ్నవి ఎందుకో మాధవితో ముభావంగా ఉంటోంది. నేను ఇంటికెళ్లకుండా దాదాపు అక్కడే ఉన్నాను. జాహ్నవి నన్ను వదలడం లేదు. ఒకరోజు- "అక్కా..పిల్ల చక్కగా ఆరోగ్యంగా ఇంటికిరావాలని అమ్మవారికి మొక్కుకున్నాను. మొక్కు తీర్చుకొస్తాను. కాస్త దాన్ని జాగ్రత్తగా చూసుకో" అని మాధవి గుడికెళ్లింది. నేను దానికి చందమామలోని కథ చదివి వినిపిస్తున్నాను. అంతలో హఠాత్తుగా జాహ్నవి నావైపు తిరిగి "పెద్దమ్మా..నేను డాబా పైనుంచి జారి పడలేదు" అంది. నేను గతుక్కుమన్నాను. అది కాస్త కోలుకున్నాక ఆ విషయం నేనే కదుపుదామనుకున్నాను. కానీ ఇవాళ అదే చెప్పబోతోంది. నాకు ఉత్కంఠగా ఉంది. కానీ అది పైకి కన్పించనీయకుండా "మరి" అన్నాను ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేసి. "నువ్వెవరికీ చెప్పకూడదు. అమ్మానాన్నలకు కూడా, ఒట్టేయి" అని లేత తమలపాకులాంటి చేయి నా ముందు చాచింది. నేను ఒట్టేశాను. "ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను" అంది. నేను గతుక్కుమన్నాను. ఆత్మహత్యలు తెలిసే వయసా అది? అసలు ఆత్మహత్య అంటే దానికెలా తెలిసింది? "ఎందుకు ఆత్మహత్య చేసుకుందామనుకున్నావు" దగ్గరకు తీసుకుని అనునయంగా అడిగాను. "మరి..మరి..అమ్మా ఆరోజు స్కూలు మానతానంటే, తిట్టి పంపింది. స్కూలునుంచి ఆఫ్టర్ నూన్ థ్రీవో క్లాక్ వచ్చాక, బజ్జీలు చేసిపెట్టమంటే పెట్టలేదు. నేను మళ్లీ మళ్లీ అడిగితే..ఏంటి అల్లరి చేస్తున్నావ్..అని కొట్టింది. డాడీకి కూడా చెబుతానంది. నాకు ఏడు పొచ్చేసింది. పుస్తకాలు తీసుకుని డాబా మీదకెళ్లాను. అప్పుడొచ్చింది ఐడియా. ఆత్మహత్యచేసుకోవాలని. అందుకే దూకేశా?" అంది. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. పిచ్చిపిల్ల.. అమ్మ.. ప్రేమతో అదిలిస్తే, కోపం అనుకుంది. ప్రాణం తీసుకోవాలనుకుంది. ఎంత ప్రమాదం తప్పింది. దాన్ని మరింత దగ్గరకు తీసుకుని గుండెల్లోపొదువుకున్నాను. "అవును ఆత్మహత్య నీకెలా తెలుసు?’అడిగాను గుండెలు గుబ గుబ లాడుతుండగా. "టీ వీ సీరియల్లో చూశాను. అందులో ఓ అమ్మాయిని అందరూ తిడితే ఇలాగే ఇంటి పైకెక్కి దూకేస్తుంది."అంది. అదీ సంగతి. నట్టింట్లో కొలువుండే విషం పెట్టెలు ప్రోగ్రాముల పేరుతో అందరి మనసుల్లో విషం గుమ్మరిస్తున్నాయి. ఆబాలగోపాలం మనసుల్ని విరిచేస్తున్నాయి. అనుమానాలు, అసూయలు, ద్వేషాలూ నూరిపోస్తున్నాయి.  చెడు వింటున్నాం, కంటున్నాం, అంటున్నాం. హృదయల్లో ముద్రించుకుపోయే టీ వీలో వచ్చే పాత్రల దుశ్చర్యలు మన ద్వారా బహీర్గతం అవుతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు తమకు తెలియకుండానే కూలిపోతున్నాయి. అన్ని మహామ్మారులను తుదముట్టించినట్టుగానే దీన్నీ సామూహికంగా తరిమికొట్టాలి లేకపోతే మానవ సంబంధాలు మంట గలిసిపోతాయి.  "అమ్మ చాలా మంచిదమ్మా..చూడు నీకు ఆయొచ్చి హాస్పిటల్లో ఉంటే అన్నం తినలేదు. నిద్రపోలేదు. ఇప్పుడేమో..నువ్వు చక్కగా ఇంటికొచ్చావు కదా అందుకని పాపం పొద్దుటే గుడికి వెళ్లింది. నువ్వు బుల్లపాపాయివి కదా అందుకని నువ్వంటే నాకూ..అమ్మకూ..నాన్నకూ అందరికీ ఇష్టమే..ఇంకెప్పుడూ ఇలా చేయకు సరేనా?"అన్నాను. నవ్వుతూ "సరే"అంది. కాసేపటికి మాధవి వచ్చి ‘అరే బుజ్జిపిల్ల నవ్వుతోందే’ అంటూ వచ్చి పాపని ముద్దు పెట్టుకుంది. జాహ్నవి కూడా తల్లి వంక నవ్వుతూ చూడ్డంతో నా మనసు తేలికపడింది. కొంతసేపయ్యాక జాహ్నవి నిద్రపోయింది. అప్పుడు మాధవిని దూరంగా తీసుకెళ్లి నేను అసలు విషయం చెప్పకుండా "అర్జంటుగా ఇంట్లోనుంచి టీ వీ తొలగించేయండీ..పిల్ల చక్కగా చదువుకుంటుంది. మొక్కై వంగనిది మానై వంగదన్నది నీకు తెలుసుకదా..ఇప్పటినుంచే టీ వీ కి అడిక్ట్ కాకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకో..దాని భవిష్యత్తు బావుంటుంది. ఇహ నేను వెళతాను’అని ఇంటిదారి పట్టాను.    ***** -ప్రతాప సుబ్బారాయుడు

మూడు‘ముళ్ళ’బంధం

మూడు‘ముళ్ళ’బంధం (తెలుగువన్ ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)     వివాహమంటే విడదీయరాని బంధమే, అయినా ఇద్దరు వ్యక్తుల్ని జీవితకాలంపాటు కట్టి వుంచడానికి ఒక దారాన్ని ఆధారంగా చేయడం నిజంగా ఆశ్చర్యమే. పసుపుతాడుకు పవిత్రతను ఆపాదించి బతికి వున్నంతకాలం ఆ చట్రంలోనే తిరగమని నిర్దేశించడం ఆశ్చర్యాన్ని దానితో పాటు విస్మయాన్ని కూడా కలిగిస్తుంది. ఇలా అంటున్నానని మంగళసూత్రం మీదా, మాంగళ్యబంధం మీదా నాకేదో వ్యతిరేకభావం ఉండని అర్థం చేసుకోవద్దు. మనువుతో తనువులు మాత్రమే కాదు మనసులు కూడా కలుస్తాయి. సంతానం వృద్ధి చెందుతుంది. కుటుంబం సంఘ జీవనంలో భాగస్వామిగా మారుతుంది. సక్రమమైన దారిలో పిల్లల్ని పెంచుకుంటూ వారికి దిశానిర్దేశం చేస్తూ కుటుంబ అభివృద్ధికి తద్వారా సంఘాభివృద్ధికి తోడ్పడాలనే మహదాశయం మంగళసూత్రం వెనుక దాగిఉందనే విషయం నాకెప్పుడూ గుర్తొస్తూనే ఉంటుంది.      అంతేకాదు, ఒకరి ఇష్టాయిష్టాల్ని ఒకరు నెరవేర్చుకుంటూ, ఒకరి కష్టనష్టాలను మరొకరు పంచుకుంటూ ఒకరికొకరు తోడూనీడగా వుండే వివాహబంధమంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? కానీ కొన్ని జంటల్ని చూసినప్పుడు వాళ్ళు భార్యాభర్తలేనా అన్న సందేహం కలగక మానదు. మాట్లాడుకోవడం కంటే పోట్లాడుకోవడంలోనే తనివితీరని ఆనందాన్ని అనుభవిస్తుంటారు. దానికి కారణాలేవైనప్పటికీ, ఒకరికొకరు బాసటగా నిలవాల్సిన వారు ఒకరంటే ఒకరికి సరిపడని ఉన్మాదస్థితిలో బతుకుతుంటారు. మూడుముళ్ల బంధాన్ని కొనసాగిస్తున్నంత కాలం ‘ముళ్ళ’మీదే ఉన్నట్లుగా జీవిస్తూ పవిత్రమైన వైవాహిక బంధాన్ని అలుసుగా తీసుకుంటారు. పాము-ముంగిసల్లా, పిల్లి-ఎలుకల్లా ఒకర్నొకరు నిందించుకుంటూనో, చిన్నచిన్న కారణాలను పెద్దవిగా చేసుకుని ఆధారంగా ఉన్న దారాన్ని పుటుక్కున తెంచుకోవాలనే తొందరపాటులోనో కొన్ని జంటలు అలుపెరగకుండా శ్రమిస్తూ ఉంటారు. సాన్నిహిత్యం స్థానంలో సంపాదనకే పెద్దపీట వేయడం, సర్దుబాటు చేసుకోవడంలో సమర్ధత చూపించలేకపోవడం ఈ బంధాన్ని మరింత బలహీనపరుస్తుంది.  పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న నా స్నేహితులు మహేష్, కిరణ్మయిల పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే వుంది.                                                                                                                               ***                       నేను వెళ్ళేసరికి ఇల్లు యుద్ధరంగంలా ఉంది. అప్పటివరకూ పొరాడి అలసిపోయిన సైనికుల్లా మహేష్, కిరణ్మయిలిద్దరూ చెరోవైపూ కూర్చున్నారు తలలు పట్టుకుని. పీక్కుపోయిన ముఖం, రేగిపోయిన జుట్టు, ఎరుపెక్కిన కళ్ళు అక్కడి యుద్ధ వాతావరణాన్ని చెప్పకనే చెప్తున్నాయి. కనీసం తలుపు కూడా వేసుకోవడం మర్చిపోయి తగువు పడినట్లు న్నారు. అప్పటివరకూ లోపల జరుగుతున్న తంతంతా బయటినుండి గమనిస్తున్న పక్క పోర్షన్ వాళ్ళు నేను రావడం గమనించి ఏదో పని వున్నట్లు లోపలికి వెళ్లసాగారు. మనింట్లో ఎన్ని గొడవలున్నా వాటిని బయటివారికి తెలియకుండా జాగ్రత్తపడతాం. కానీ పక్కింట్లో గొడవ జరుగుతుంటే మాత్రం దాన్ని ఇంకొంతమందికి చెప్పి ఆ ఆనందాన్ని తనివితీరా అనుభవిస్తుంటాం. లోకాన్ని ఎలా అంచనావేయాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఒక్కోసారి ఊహకు కూడా అందదు.                                              నేను వచ్చానన్నట్లుగా ఒకసారి చిన్నగా దగ్గి లోపలికి వెళ్ళి మూలగా వున్న ఒక కుర్చీ లాక్కుని దానిలో కూర్చున్నాను. ఇదివరకు ఎంత తగువులాడుకున్నా నేను వెళ్ళేసరికి కనీసం పలకరించి తాగడానికి కాసిని మంచి నీళ్లిచ్చేవాళ్లు. ఇప్పుడున్న వాతావరణంలో మర్యాదనాశించడం మానసికంగా సాహసం అవుతుంది కనుక ఏమీ మాట్లాడ కుండా మౌనంగా ఉండిపోయాను. ఇల్లంతా చిందరవందరగా వుంది.  వీళ్ళ యుద్ధానికి చేతులు సరిపోయినట్లు లేవు. వస్తువులన్నీ సగం విరిగి కొన్ని, పూర్తిగా విరిగిపోయి మరికొన్ని యుద్ధంలో చనిపోయిన సైనికుల్లా అక్కడక్కడా చెల్లా చెదురుగా పడిపోయివున్నాయి.                                          ఎవరు మట్టుకు వాళ్ళం ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాము. నిశ్శబ్దాన్ని భరించడం ఎంత నరకమో నాకు ఆ క్షణం మరింత అర్థమైంది. కాసేపటి తర్వాత మౌనాన్ని త్యజిస్తూ “ఏమిట్రా ఇది... ఇద్దరూ చదువు కున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అయినడానికీ కానిదానికీ ఇలా గొడవపడితే నలుగురి మధ్యా ఎంత చిన్న తనంగా ఉంటుందో ఆలోచించారా...?” అన్నాను.                                   “నాక్కాదు దానితో చెప్పు ఆ సంగతి. ఉద్యోగం చేస్తున్నానని పొగరు...” బుసలుకొడుతూ అన్నాడు  మహేష్.     “నాకేం అక్కర్లేదు. ప్రతీదానికీ గొడవే. ఆయనకే పెట్టండన్నయ్యా కాస్తంత గడ్డి...” అంది కిరణ్మయి. “ఇదిగో ఇలాగే మాటకు మాటా సమాధానం చెప్తోంది.  ఇలాగైతే కష్టం. దీనితో ఉండలేను...” అన్నాడు.  “అవునవును మరి. నేనే నిన్ను పట్టుకుని వేళ్లాడుతున్నాను. నాకు బతకడం చేతనవుతుందా మరి? నేనేమీ నీ తిండి తిని బతకడం లేదు. నా జీతం నేను సంపాదించుకుంటున్నాను....” మాటకు మాటా అంది కిరణ్మయి. పెళ్ళయి సంవత్సరమైనా ఇంకా చిన్నపిల్లల్లాగే మాట్లాడుతున్న వాళ్ళిద్దరినీ చూస్తే ముందు జాలేసింది, తర్వాత బాధేసింది. పెళ్ళైన కొత్తలో వచ్చే సర్దుబాట్లకు సతమతమవుతూ ఎంతమంది భార్యాభర్తలు తమ కాపురాలను ఎలా పాడుచేసుకుంటున్నారో అనే ఆలోచన రాగానే మనసంతా దిగులుగా అయిపోయింది. అందుకే ఇద్దర్నీ ఉద్దేశిస్తూ “నాలుగు రోజులు కలిసుండి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోవడానికి మీదేమీ కాంట్రాక్టు ఉద్యోగం కాదు. మూడు ముళ్ల తోనూ, ఏడు అడుగులతోనూ ముడిపడిన బంధం. ఇద్దరూ కూర్చుని సమస్యల్ని పరిష్కరించుకోవాలిగానీ ఇలా మీరిద్దరూ కలిసి కొత్త సమస్యల్ని సృష్టించుకోకూడదు...” అన్నాను.                                   “అంటే ఏంట్రా నువ్వు చెప్పేది... ఎన్ని గొడవలొచ్చినా సర్దుకుపోయి సన్నాసుల్లా బ్రతకమంటావా? అది నా వల్ల కాదు, నాకా ఖర్మ కూడా పట్టలేదు...” అటో ఇటో తేల్చుకోవాలనే ఆలోచన బలంగా వినిపించింది మహేష్ మాటల్లో.     “మరేం చేస్తావు...” కొంచెం కోపంగానే అడిగాను.                                   “విడిపోయి ఎవరిదారి వాళ్ళు చూసుకోవడమే. కలిసుండి ప్రతీరోజు గొడవపడేకన్నా దూరంగా వుండి ఎవరి గొడవ వాళ్ళు చూసుకోవడమే బెటర్ కదా...”                                       “చాలా బాగుంద్రా నువ్వు చెప్పేది.  ఏమ్మా నువ్వేమంటావు?”  అన్నాను చిన్నగా నవ్వుతూ. “ఆయనకు అవసరం లేని సంసారం నాకు మాత్రం ఎందుకన్నయ్యా. నేను బతకలేయినా?” అంది కోపంగా. “బావుందమ్మా... చాలా బావుంది. నేను వచ్చినప్పటినుండీ నేను, నాది అంటున్నారే తప్ప ఒక్కరన్నా మనది అనలేదు. మనది కాదు అనుకున్నదంతా పరాయిగానే అనిపిస్తుంది, కనిపిస్తుంది. మనది అనే భావం ఇద్దరిలోనూ లేదు కాబట్టే వైవాహిక జీవితాన్ని ఇంత తేలికగా తీసిపారేస్తున్నారు. మామూలు దారానికి మరో దారాన్ని జతచేసి మంగళ సూత్రం తయారుచేస్తారమ్మా. ఒక దారానికి మరో దారం తోడుండాలి కాబట్టే ఆ ఏర్పాటు. చేప నీటిలో ఉన్నంతసేపే దానికి అందం, ఆనందం. అలా కాకుండా దాన్ని బయట వేస్తే దాని ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది. భార్యాభర్తల బంధానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కలిగించింది ఈ సంఘం. ఆ బంధాన్ని గౌరవించి అందులో ఉన్నంతవరకే మీకు విలువా, గౌరవం ఉంటాయి తప్ప ఎవరికి వారుగా విడిపోయి బతకాలనుకుంటే ఆ బంధం అపహాస్యం పాలౌతుంది. అందుకే చెప్తున్నా... మీకు పెళ్ళిచేసిన పెద్దలున్నారు. అంతగా అవసరం అనుకుంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లున్నాయి. మీ సమస్యను వాళ్ళముందుంచండి. జబ్బు చేస్తే మందేసుకోవడానికి చూడాలి కానీ అసలు జబ్బే రాకుండా ఉండాలని కోరుకోవడం మంచిది కాదు. సమస్యలకు పరిష్కారం చచ్చిపోవడమో, విడిపోవడమో కాదు.  సముద్రానికి అలలు, సంసారానికి కలతలు సహజంగా వచ్చే ఆటుపోట్లు. సర్దుకుపోతూ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి గానీ సమస్యల్ని పెద్దవి చేసుకుంటూ సతమతమైపోకూడదు.  నేను చెప్పవలసింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం...” అంటూ వాళ్ళిద్దరి వైపూ ఒకసారి చూశాను.      ఇద్దరిలోనూ ఏదో ఆలోచన మొదలైనట్లుంది. నాలో నేను నవ్వుకుంటూ కుర్చీలోంచి పైకి లేచాను వెళ్తాననన్న ట్లుగా. అప్పటివరకూ ముక్కు చీదుకుంటూ మూల కూర్చున్న కిరణ్మయి నేను పైకి లేవడం చూసి తనూ పైకి లేచింది ఒక్కసారిగా. ఇంత చెప్పినా వినకుండా ఇంటికి వెళ్లడానికి బట్టలు సర్దుకోవాలని లేచిందేమో అని కంగారుపడ్డాను నేను కాసేపు. నా ఆలోచనల్లో నేనుండగానే “అన్నయ్యా... కాసేపాగండి టీ తాగి వెళ్దురుగానీ.  ఈ టైంలో టీ తాగకపోతే మహేష్ తలనొప్పి అంటాడు మళ్ళీ...” అంటూ వంటింటి వైపు వెళ్లసాగింది. ఈ మాత్రం దానికి ఇంత రచ్చ చేసు కోవడం దేనికో అనుకుంటూ నాలో నేనే నవ్వుకుంటూ టీ కోసం కుర్చీలో కూలబడ్డాను.                                         -డా. జడా సుబ్బారావు

అల్ప సంతోషి

అల్ప సంతోషి ( తెలుగువన్ ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)    ‘మా అన్నయ్య ‘ అని  కాదు కానీ , వాడు చాలా మంచి వాడు, తెలివైన వాడూనూ.  ఒక్కమారు చూస్తే చాలు  ఇట్టే పట్టుకుని అట్టే అల్లుకు పోతాడు. వాడి తెలివి చూసి స్కూళ్ళో పంతుళ్ళంతా  ఆశ్చర్య పోయేవారు  చిన్నప్పటి నుంచే. అదేదో ‘ ఏక సంధా గ్రాహిట! ‘అదేట వాడు. కేవలం  చదువే కాదు , వాడి బుధ్ధీ చాలా మంచిది. పెద్ద లెవరు కనిపించినా నడుం వంచి మరీ నమస్కరిస్తాడు.  ఎవరికైనా ఎదైనా సాయం కావలిస్తే  వెనకా ముందూ చూసు కోకుండా చేసేస్తాడు. వాడి చేతి వ్రాత చక్క గా ముత్యాలు పొదిగి నట్లుంటుంది.  ముత్యాలకైనా  కాస్తంత ఎక్కడైనా  వంపులుంటాయేమో  కానీ  మా అన్న చేతి వ్రాత అచ్చంగా అచ్చు గుద్ది నట్లుంటుంది. వాడి చేతి వ్రాతకే  మాస్టార్లంతా ముగ్ధులై పోయేవారు  . ఎన్ని ఉన్నా ఏం లాభం?  వాడి చేతి వ్రాత ఎంత బావుంటుందో వాడి తలవ్రాత అంత బాగా లేదు.  దానికి కారణం మేం పుట్టిన కులం .ఆకులాని కున్న పెద్ద పేరు. అదేమా పాలిటి శాపమైంది.కూటికి కొర గాని పేరు.                                                                                                                                                                                               మాతాత  అంటూంటాడు " పుట్టినపుడూ మంచి రోజు చూడను బ్రాహ్మడు  కావాలి ,పేరు పెట్టేప్పుడూ కావాలి,జాతకం చూసి చెప్పనూ,అన్న ప్రాశనకూ,అక్షరాభ్యాసానికీ,పెళ్ళికీ పేరంటాలకూ, ఇళ్ళలో చేరనూ,చివరకు చావుకూ బ్రాహ్మడు కావాలి, మంచికీ చెడుకూ అన్నింటికీ కావా లి, కానీ ఆ కులాన్నిమాత్రం అంతా ద్వేషించేవారే ! వారేం పాపం చేశారనీ?  వెనకటి కొక కధ చెప్పినట్లు ‘మేకపిల్ల నదిలో దిగువన నీరు త్రాగు తుండగా తోడేలు, చూసి దాన్ని ఎలాగైన చంపి తినాలని యోచించి, "నీ ఎంగిలి నీరు నాకు వస్తున్నది , నాకు కోపం వచ్చింది నిన్ను చంపే స్తాను " అందిట, దానికా మేకపిల్ల " అదేలా వస్తుంది తోడేలు మామా! నేను దిగువన నీరు త్రాగుతున్నాను , నీ ఎంగిలే నాకు వస్తున్నది " అనగా, తోడేలు " మీతాత  వెనకటికి నేను నీరు త్రాగుతుంటే  ఎంగిలి నీరు  వదిలాడు. అందుకని నిన్ను చంపు తాను "అందిట . దానికి మేక పిల్ల "నేను అప్పటికి పుట్టనైనా లేదు , నీవైనాపుట్టి ఉన్నవోలేదో! నన్నేదో చేయాలని ఇలా అంటున్నావు , ఐనా ఆపాపం నాకెలా వస్తుందీ?  " అంటూ తుర్రుమందిట. అలా  ఎప్పుడో ఎవరో ఏదో చేశారని ఇప్పుడు మన కీ బాధలా! " ఆయ నెంత అనుభవంతో , బాధతో  ఆమాటన్నా డో తెలీదు  కానీ,  మా అన్నమాత్రం మాఈ  కులంలో పుట్టడమే వాడి పాలిటి నేరమూ, శాపమూ ఐంది.                                                             ******               "ఎమే చెల్లాయ్! పోస్ట్ మ్యాన్ పోలయ్య వచ్చాడుటే!" ఇంట్లోంచీ విని పించిన అన్న మాట కు తల పైకెత్తి చూసి " లేదురా ! ఇంకారా లేదు.  ఇక్కడే ఉన్నాలే రా!"  అని జవాబిచ్చాను . మళ్ళీ నా ఆలోచన ఏటో  పోతోంది.       మా అన్నకు  తాత మాటంటే మహా గురి. మా ఊరి సర్కార్ బళ్ళో చదివేప్పటి నుంచే మా  అన్న మా తాత తో కల్సి పూజలకూ,  వ్రతాలకూ వెళ్ళే  వాడు . అవీ ఇవీ మా తాతకు అందిస్తూ పూజలయ్యాక  భోజనం చేసి వచ్చే వాడు. మా తాత చేసినట్లే తానూ చేయగల  నేర్పు సంపా దించాడు . వాడు ఏకసంధా గ్రాహి కదా!   మా అమ్మా ఎవరైనా వంటకు పిలిస్తే  వెళ్ళేది . నేనూ వెళ్ళి’ అమ్మకు సాయం ‘- అన్న పేరుతో ఇంత తిని వచ్చేదాన్ని. అమ్మ తినకుండా వాళ్ళిచ్చింది  డబ్బాలో  పెట్టుకు తెచ్చి అన్నకు పెట్టేది . చాలా సార్లు అమ్మ కడుపునిండా నీళ్ళు త్రాగటం చూశాన్నేను. మా నాన్న తన అసహాయతకు కళ్ళనీళ్ళు పెట్టుకోడం నేనూ , అన్నా కూడా చూశాం .                                                                                           అన్న అనేవాడూ " నాన్నా! దుఃఖ పడకు, నేను బాగా చదువుకుని ఉద్యోగం చేసి మీ కంతాకడుపు నిండా అన్నం పెడతాగా!"  అని.    ఆమాట విని  మానాన్న మరింతగా దుఃఖ పడేవాడు,  అమ్మ సరే సరి, ఆమె కళ్ళు ఎప్పుడూ మా పరిస్థికి గంగా యమున లే.                                           తాత మాత్రం "నిజం రా ! బాగా చెప్పావు. నీవు సాధించి తీరుతావురా! నాకా నమ్మక ముంది, మన గాయత్రీ మాతే మనకు రక్ష ,మనం చేసే జపం ఎందుకు వృధా పోతుంది రా! నీకు మంచి ఉద్యోగం వచ్చితీరుతుందిరా నాన్నా! అని మా అన్న బుజం తట్టి ధైర్యం చెప్పేవాడు.   ఎవరైనా ముత్తైదువుకు పెట్టే తద్దినాలకు అమ్మను పిలిస్తే , వంట కూడా తానే చేస్తాననీ , మంత్రాలు చెప్పను  తాతనూ , భోక్తగా మానాన్న నూ పిలవమని కోరేది. ఆరోజు అంతా కడుపు నిండా తినేవారం. వారు అమ్మకు పెట్టే చీరతో నాకు పరికణా కుట్టేది చేత్తోనే. అన్నకు వడుగు చేసి జంధ్యం వేయటాన వాడికీ బాలవటువు గానో ,సుబ్రహ్నణ్య  షష్టికి  బ్రాహ్మచారి గానో  వెళ్ళే అవకాశం అప్పుడప్పుడూ దక్కేది.                                                                                                                   అప్పుడు మాఊరు  500 గడప గల ఊరు. క్రమేపీ జనం నగరాల బాట పట్టి నేడు పాడుపడ్ద పల్లైంది. మాఊరిబాగు గురించీ ఎవ్వరికీ పట్టదు.  మా ఊరి సర్కార్ బడి పెద్దపంతులు అన్నగారు  ఒకమారు వారింట బాలవటు పూజలో అన్నను చూసి, వివరాలడిగి వాడిని తనతో బలవం తాన నగరం తీసుకెళ్ళి వారాలు కుదిర్చి , తమ కారు షెడ్ లో వసతి కల్పించి  హైస్కూల్ లో వేసి చదువు కొనసాగించాడు. అలా వాడి చదువు పట్టణం లో  హైస్కూల్ దాకా కొనసాగింది. మా అన్నకు పదో తరగతి లో పట్టణానికే ఫస్ట్ వచ్చిందిట. కొన్నికాలేజీలవాళ్ళు ఫ్రీగా చదువు చెప్పించి ఇంజనీర్నో  డాక్టర్నో చేస్తామన్నారు. మా అన్న ఒప్పుకోలేదు. అన్నేళ్ళు  చదువుతూ కూర్చుంటే మా అందరి పొట్టలూ నింపేదేలా అనీ.  వాడికి ఎప్పుడూ అదే ధ్యాస పాపం . మా అన్నకు మేమంటే ప్రాణం, మాప్రాణాలూ మా అన్నమీదే! వాడికి  మొదటి నుంచీ సాయం చేసిన పంతులు గారి సాయంతోనే ప్రభుత్వ కాలేజీలో  ఇంటర్లో చేరాడు. ఆపంతులుగారి  సలహా తోనే  లైబ్రరీ లో  ఏవేవో  పుస్తకాలు చదువుతూ బ్యాంక్ పరీక్షలకూ ,LIC పరీక్ష లకూ , ఇంకా ఏవేవో ఆఫీసుల్లో ఉద్యోగాలకూ టెంత్ క్లాస్ మార్కుల తో వచ్చే పోస్టల్, టెలిఫోన్ ఆఫీసుల్లో ఉద్యోగాలకూ రాత్రింబవళ్ళూ చదివేవా డు. ఆపంతులు గారి కారు షెడ్లో ఉంటూ వారింట పనులన్నీ చేస్తూ వారి అబ్బాయి కారు డ్రైవర్ సలహా మేరకు కొన్ని కార్లు తెల్ల వారు ఝామునే లేచి వెళ్ళి కడుగుతూ జీవించను కావాల్సిన పనులెన్నో నేర్చు కున్నాడు.   వాడి జీవిత ఆశయం మా అందరికీ వెతుక్కో కుండా కడుపు నిండా ఇంత తిండి పెట్టడమే.’ ఆకార్లు కడగ్గావచ్చిన సొమ్ము దాచి మమ్మ ల్నిచూడను వచ్చేప్పుడు బియ్యం,పప్పూ ఇంకా కొన్ని దినుసులూ కొని మోసుకు తెచ్చేవడు పాపం. అవిచూసి అమ్మా, నాన్న కన్నీళ్ల తో అంటే ఆనంద భాష్పాలను కుంటా వాడి తల కడిగే వారు.                                                                                                                                                   "ఏమే చెల్లాయ్! పోస్ట్ మేన్ పోలయ్య  వచ్చాట్టే!" మళ్ళీ మళ్ళీ ఇంట్లోంచీ అన్నమాటలు . వాడికి జ్వరం వచ్చి లేవలేక లోపలినుంచీ  కేక లేస్తు న్నాడు లేని ఓపిక తెచ్చుకుని.  "ఒరే అన్నా! నే చెప్తాలేరా ! కళ్ళు మూసుకు పడుకో."అని నేనూ అరిచాను.                                                                                         ఉచితంగా వచ్చేది కానీ, భిక్ష మెత్తడం కానీ కూడని పనని మా ఇంటిల్లి పాదీ విశ్వసించే మాట.  పట్టణంలో చదువుకునేప్పుడు ,ఒక రోజు న వాడు కారు కడుగు తుంటే పక్కింటి తాత గారు ఒకాయన చూసి, దగ్గర కొచ్చి "నిన్నెక్కడో చూసి నట్లుందయ్యా!" అంటూ ఊరూ, వివ రాలూ అడిగి ,"ఇదేం పనయ్యా ! మీ ముత్తాత గారు వేద పండితులు, ఆయన గొంతువిప్పి వేదం చదువు తుంటే అంతా మహదా నందం గా శిలల్లా నిల్చుని వినేవారు. ఆయన కంఠం అలాంటిది, ఖంగు ఖంగున మ్రోగు తుండేది కంచు ఘంటలా. అప్పుడు నేను చిన్న వాడ్ని. ఐనా గుర్తుంది. అలాంటి వంశంలో పుట్టిన నీవేంటయ్యా ఇలా కార్లు కడగడం ! సిగ్గు సిగ్గు!" అన్నారట.దానికి మా అన్న" తాత గారూ!వేదం వినేవారు తగ్గిపోయి ఆదరణ, పోషణ లేక , మా తాతగారు పూజలు, వ్రతాలు, పెళ్ళిళ్ళూ , క్రతువు లూ చేయిస్తూ, అవే మంత్రాలు మా నాన్నగారికి నేర్పారు.వాటికీ ఆదరణ తగ్గి, మనిషి చనిపోగానే కాశీవెళ్ళి బూడిద గంగలో పోసేసి పిండ ప్రదానం చేసేసి చేతులు దులిపేసుకుని పోతుండగా ,తద్దినాలు పెట్టేవారు లేక వాటికీ డిమాండ్ పోయింది. ఐనా తాత గారూ! కాని పని చేస్తే సిగ్గు కానీ ఇలా కార్లు కడుక్కుని సంపాదించి కడుపు నింపు కుంటే సిగ్గెందు కండీ!"అన్నాట్ట.                                                              “నిజమే లేవయ్యా! మీవంశం అలాంటిది .ఎవ్వర్నీచేయిచాచి  అడుగేవారు కాదు మీ ముత్తాతలు సైతం. కష్టపడి క్రతువులో కర్మలో చేసి మాత్రమే  తగిన సొమ్ము దక్షిణగా పుచ్చుకునేవారు."అంటూ వెళ్ళా ట్టాయన.                                                                                                   మాఅన్న కు సాయంచేసిన పంతులు గారు కాలం చేశాక మా అన్న అక్కడ నుంచీ తిరిగి మా పల్లెకు వచ్చేశాడు. ఆయన కుటుంబ మూ ఏదో నగరానికి వెళ్ళిపోయిందిట. అప్పటికి మా అన్న డిగ్రీపూర్తైంది . ఉన్న నూకలతో మా అమ్మ గంజికాచి ఇస్తే, కాంతి లేని వీధి లైట్లలో చదివి , చదివి పోటీ పరీక్షలన్నీ వ్రాశాడు. వాడి దగ్గర చెప్పించుకోను వాడి స్నేహితులు మోటార్ బైకుల మీద వచ్చివెళ్లేవారు. వాళ్ళు మా అన్నకోసం పండ్లూ ఫలాలూ, స్వీట్లూ తెస్తే మా అమ్మ అవన్నీ వాళ్లకే ఫలహారంగా పెట్టేది. మాపల్లెకు వచ్చి మాఇంటి ముందు న్న వేపచెట్టు అరుగు మీద కూర్చుని చెప్పించుకుపోయేవారు.మా అన్నచెప్తుంటే వింటున్న నాకే అన్నీ అర్ధమయ్యేవి, అంత బాగా చెబుతుండ బట్టే అంత దూరం నుంచీ  వాడికోసం వాడి స్నేహితులు వస్తున్నారని అర్ధమైంది.                                                     వాడికి మహా నమ్మకం తప్పక ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుందని. వాడి స్నేహితులంతా యోగ క్షేమాలు ఉత్తరాలు వ్రాసేవారు. రిజల్ట్స్ రాగానే కార్డు ముక్క వ్రాస్తామని. టెలిగ్రాములు ఆగిపోయాయిట అందుకని. మా ఊరికి పేపర్లూ రావు. ఎవరైనా టౌన్ కెళ్ళి తెస్తేనే. మా ఊర్లో ఎవరికైనా ఉన్నాయేమో కానీ కడుపుకు తిండేలేని మాకు ఫోన్లెలా ఉంటాయీ!.                                                                      మా అమ్మకూ వంటలు తగ్గి పోయాయి.కర్మ క్రతువులూ లేవు. సగం , ముక్కాలు  ఊరు టౌన్ కెళ్ళిపోయింది. చిన్నపాటి రైతులూ ,కౌలు చేసేవారూ తప్ప. అంతా మాలాగా ఒక పూట గంజి త్రాగి బతికే వారే!                                                                                   మా అన్నమాత్రం ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి , స్నానం ,జపం ,సంధ్యా వందనం చేసేసుకుని మా ఇంటి ముందున్న , ఇల్లంటే పూరి పాక.  ఆ పాకే మా అందరికీ ఆశ్రయ మిస్తున్న దేవాలయం, వేపచెట్టు క్రింది మట్టి అరుగుమీద కూర్చుని మనస్సులో గాయత్రి జపిస్తూ పోస్ట్ బంట్రోతు కోసం ఎదురు చూసేవాడు. ఆబంట్రోతు భుజానికున్న సంచీలోనే  - వాడి-- కాదు కాదు మా భవిష్యత్తు దాక్కో నుందని మా అన్న అభిప్రాయం .                                                                                                                                                మా తాతగారు పాకా ముందున్న మట్టి అరుగులమీద కూర్చుని ఉదయ సంధ్య నుంచీ సాయం సంధ్య వరకూ  సంధ్యా వందనం చేసు కుంటూ నీరు నోట్లో ఉధ్ధరిణె తో పోసుకుంటూ గొంతు తడుపుకుంటూ , కడుపునింపుకుంటూ గడుపు తుంటాడు. మానాయన మాత్రం సంధ్యా వందనం తర్వాత ఊర్లో ఉన్న పాడు పడుతున్న ట్లున్న శివాలయానికి వెళ్ళి , అటునుంచీ ఊర్లో ఉన్న నాలుగు వీధులూ తిరిగి తిరిగీ వస్తుంటారు.  ఎవరైనా ఏదైనా మంచి రోజో , తిధో వారమో చెప్పించుకుని , ఒక్క పది రూక లైనా ఇస్తారనే ఆశతో.                                                                                                                                                                     మా అమ్మ స్నానం చేసి తన కున్న రెండో చీర ఆరేసుకుని అది అరిందాకా తులసి కోట వద్ద జపం , పూజా లలిత చదువు కుంటూ కూర్చుంటుంది. ఆ లలితా మాతను మనస్సులో , "అమ్మా! ఈ పూటన్నా మా ఇంట్లో పొయ్యిలో పిల్లిని తరిమేసి అగ్గివెలిగిస్తావా! మాపై ఎందుకమ్మా ఇంత సీత కన్ను? ఏం పాపం చేసి పుట్టామమ్మా అంతా ఒక్క ఇంట్లో?" అని ప్రశ్నించుకుంటూ కూర్చునుంటుంది.   అప్పుడప్పుడూ అమ్మ నాకు ధైర్యం చెప్ప నో తనకు తాను ధైర్యం చెప్పుకోనో, "మనకేమే చిన్నీ! మన పులుసు రాచ్చిప్పలో రామాయ ణమూ, మన బియ్యం బానలో భారతమూ, మనవంట వేదిక మీద వేదాలూ ,మన ఉట్టి మీద ఉపనిషత్తులూ  ఉండగా మనకేం భయమే! అవన్నీ మనల్ని చూడవూ?!" అంటూ నీళ్ళు నిండిన కళ్లతో నన్ను తన గుండెలకు గాఢంగా హత్తుకుంటుంటుంది అప్పుడప్పుడూ , నా మీద వెర్రి ప్రేమ పుట్టి నప్పుడేమో మరి !. లేక తమ అసహాయత గుండెల్ను పిండినప్పుడో!                                                                                                                                                          నేను మాత్రం ఇల్లు చిమ్మి, తోమేందుకు అంట్లేం ఉండవు కనుక , దొడ్లోవేసుకున్న పూల మొక్కల పూలు కోసుకుని, వాటికి నీళ్ళు పోసుకుంటూ, మాల కట్టుకుంటూ అందర్నీ గమనిస్తూ  మధ్య మధ్యలో ఒక్కోగ్లాసు నీళ్ళు త్రాగుతూ ఉంటాను. ఆమధ్య మా అమ్మ ఒక పనిచేసింది. బీర, సొర , గుమ్మడి , టమోటా చిన్న మొక్కలు దిబ్బలో దొరికితే తెచ్చి నాటింది. మిట్ట మధ్యాహ్నం వరకూ చూచి చూసి ఆతర్వాత ఆ చెట్ల కాయలు కోసి , అన్నీకలగలిపి ,ఏదో ఒకటి వండు తుంది.అది అందరం దేవునికి నివేదనచేసి మా దొడ్లో అరిటాకులో పెట్టు కుని తినేస్తాం, అదే కూర, అదేపప్పూ, అదే అన్నం, అదే పెరుగు అని ఊహించుకుని తినేస్తాం. కాలే కడుపుకు మండే గంజిలా-. అంటారుకానీ ఆగంజీదొరక్క. ఆకలి రుచెరగదు కదా! ఐనా మా అమ్మచేయి తిగిరిన వంటగత్తె. ఆచేత్తో ఏం చేసి పెట్టినా మధురం గానే ఉంటుంది, ఆమె ప్రేమ ,అప్యాయత అంతా దాన్లో రంగరిచి పోస్తుందనుకుంటా.షిరిడీ సాయిబాబాలాగా. మా పెరట్లో ఉన్న జామ, బొప్పాయి,  అరటి చెట్లకు మేమంటే ఎంతో ప్రీతి, బాగా కాయలు కాచి మా కడుపులు నింపు తుంటాయి.నేను కొన్ని పండ్లు శివునికి కూడా సమర్పింస్తుంటాను.           నేను చిన్నతనంలో మాఊర్లో అప్పుడున్న, సర్కార్ బళ్ళో ఐదోక్లాస్ వరకూ చదువుకుని , ఇంట్లో మాతాత గారివద్ద సంస్కృతమూ, అమ్మవద్ద అన్నిదేవతల స్త్రోత్రాలు , రామాయణ మహా భారతాలూ , భగవద్గీతా, శతకాలూ , మా అన్నవద్ద కాస్తంత ఆంగ్లమూకూడా వంట బట్టించుకున్నాను. ఏం లాభం ఏదీ దేనికీ పనికి రాదాయె మాపాడుపడ్డ పల్లెలో . పోనీ నేను నేర్చుకున్నది ఎవరికైనా పిల్లలకు చెప్దామన్నా అంతా నగర నాగరికత కెళ్ళిపోయారు, అందుకే  సర్కార్ బడీ మూతపడింది.                                                                                                                                             పదిరోజులుగా తుఫాన్ . ఊరంతా జలమయం ఎక్కడికీ వెళ్ళేందుకు లేక ఇంట్లోనే కడుపులో కాళ్ళు ముడుచు క్కుర్చున్నాం. మా అన్న కు జ్వరం కూడా వచ్చింది. పది రోజులయ్యాక వాడి జ్వరమూ, వానాకూడా కాస్తంత తగ్గింది. ‘చలి గాలిరా’ అని ఎంత వద్దంటున్నా విన కుండా మా అన్న  ఇంట్లోంచీ వచ్చి మా ఇంటిముందున్న వేప చెట్టు అరుగుమీద కూర్చుని పోస్ట్ బంట్రోతు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.                         " ఒరే అన్నా! పోస్ట్ బంట్రోతు పోలయ్య వచ్చే సరికి మధ్యాహ్నం అవుతుందిరా! పైగా నగరం నుంచీ మట్టి రోడ్డెలా ఉందో తెలీదు కదురా! ఇంట్లోకొచ్చి కూర్చోరా! ఎందుకురా అలా ఎదురు చూట్టం? ఊర్లోకి వస్తే మనకు ఉత్తరం వస్తే ఇవ్వక ఎటుపోతాడ్రా!?" అన్నాను.                                                                                                                                                    దానికి అన్న పెరిగిన గడ్డం లోంచీ నిరాశగా నవ్వుతూ " చెల్లాయ్!వారం క్రితమే రిజల్ట్స్ వచ్చి ఉంటాయ్! మా స్నేహితులు కార్డ్ వ్రాయ లే దంటే నాకు అనుమానమేనే! ఐనా మెరిట్ కు ఉద్యోగాలెవరిస్తారే? ఉత్తర దక్షిణాల్లేకుండా ఉద్యోగం ఎలావస్తుందే? నాపిచ్చిగానీ! కన్న అమ్మా నాన్నలకు కడుపు కింత అన్నం పెట్టి కనీస రుణం తీర్చుకోలేని చవటనై పోయానే! "అంటూ పిచ్చిగా నవ్వి,మో కాళ్లలో తల దాచు కుని రోదిస్తున్న వాడ్ని చూస్తుంటే నాకు బాధేసింది. ఏడుపొచ్చింది. " ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం కనీసం ప్యూన్ ఉద్యోగమన్నా మా అన్నకు ఇప్పించు గాయత్రీ మాతా!" అని ఆతల్లికి నమస్కరించుకుంటూ నేనూ వాడిపక్కనే  కూర్చున్నాను , గాయత్రి జపిస్తూ .                                                           తాతగారు " ఒరే బాబూ! నీకు తప్పక ఉద్యోగం  ఆర్డర్ వస్తుందని నా మనస్సు చెప్తోందిరా! తప్పక వస్తుంది." అన్నారు.              ఇంతలో అన్న స్నేహితులు పదిమంది మోటార్ బైకుల్లో వచ్చారు. "రాఘవా! మా అందరికీ బ్యాంకుల్లో, ఎల్.ఐ.సీలో , కలెక్టర్  ఆఫీసు, తాలుకా ఆఫీస్ లో ఉద్యోగాలు వచ్చాయి. తుఫాన్ కారణంగా వెంటనే రాలేకపోయాం రా! నీకు మాత్రం....."అంటూ  తలలు వంచుకుని మౌనంగా నిల్చున్నారు.  "ఏమైందిరా! నాకే ఉద్యోగమూ రాలేదా! నేను దేనికీ సెలక్ట్ అవలేదా! నాకు ఉద్యోగం చేసే యోగ్యతే లేదా!" అంటూ ఆవేశంగా ,ఆరాటంగా వాళ్ల కేసి చూస్తూ అడిగాడు.                                                                                      "రాఘవా! నీవే మాకు కోచింగ్ ఇచ్చావు, కానీ నీకు మాకు వచ్చిన ఉద్యోగా లేవీ రాలేదురా!! సో సారీరా రాఘవా! నీకూ--- నీకూ ---మాకు ఉద్యోగం వచ్చిన బ్యాంకు లో ప్యూన్ ఉద్యోగం వచ్చింది, బాధగా ఉందిరా!" అన్నారు వారు.                                                              " ఎందుకురా బాధ! నాకూ ఏదో ఒక ఉద్యోగం  వచ్చింది అంతే చాలు. మావాళ్ళలందరికీ వెతుక్కో కుండా కడుపు నిండా ఇంత అన్నం పెట్ట వచ్చు కదరా! తాతా నాకూ ఉద్యోగం వచ్చింది, నీవిక ఉధ్ధరిణె తో నీళ్ళుత్రాగుతూ కూర్చోనక్కరలేదు. చెల్లాయ్ ! నాకూ ఉద్యోగం వచ్చింది . నేనూ ఉద్యోగి నయ్యాను. అమ్మా! నాన్నా! నేనూ  ఉద్యోగినయ్యాను. మీకంతా కడుపునిండా ఇంతన్నం వేళకు పెట్టగలను. అమ్మా నీవింక కూరగాయలతో పులగం వండక్కర్లేదు. నాన్నా నీవింక గ్రామలో రూపాయకోసం ఎదురుచూస్తూ తిరగక్కర్లేదు.   చెల్లాయ నీవింక జామపళ్ళుతిని నీరుత్రాగక్కర్లేదు.  మన గాయత్రీమాత మనలను ఆదుకుంది. నాకు ఉద్యోగం వచ్చింది   " అంటూ నన్ను పట్టు కుని గిరగిరా త్రిప్పుతున్న  అన్న ను  చూసి వాడి ‘అల్పసంతోషాని’ కి నాకూ సంతోషమేసింది.                       -- ఆదూరి.హైమావతి    

కాంతి (అల్లూరి [గట్టు] నరసింగరావు స్మారక కథలపోటీ లో తృతీయ బహుమతి)

కాంతి (అల్లూరి [గట్టు] నరసింగరావు స్మారక కథలపోటీ లో తృతీయ బహుమతి) ఉదయం ఎనిమిది కావస్తూంది..! “రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లాల్సిన పని పడింది. ఎల్లుండి రాత్రిక్కానీ రాను. ఎల్లుండి ఉదయం కోర్టులో వాయిదా ఉన్న కేసు తాలూకు అప్ డేట్స్ గురించి మాట్లాడాలి. రేపు తొమ్మిదింటికల్లా నువ్వు ఆఫీసులో ఉంటే... “ అని రాత్రి బాగా పొద్దు పోయాకా ఫోన్లోనే హుకుం జారీ చేసాడు సీనియర్.  అందుకే తెల్లారగట్త నాలిగింటికే లేచి అన్నిపన్లూ పూర్తి చేసుకుని, అట్నించి అటే కోర్టుకి కూడా వెళ్లిపోవచ్చని లంచ్ బాక్స్ , అవసరమైన ఫైల్ తీసుకుని కైనిటిక్ హోండా బయటికి తీసాను. బండి స్టార్ట్ చేయ్య బోతూ.. ఎప్పట్లానే మనసులో ఒకట్నించి అంకెలు లెక్కెట్టుకుంటూ నన్ను నేనే మనసుతో ఒళ్లంతా తడుముకున్నాను. ఇంట్లోంచి బయటికి బయల్దేరే ముందు ప్రతి సారీ నేను చేసే పనది. ఫోన్లోనే కాదు స్పీడ్ డయల్.. నాకు పనుల్లో కూడా.   డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పేపర్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఏటిఎం కార్డ్, పాన్, బార్ లైసెన్స్, కోటు, కళ్లజోడు, స్కార్ఫ్, హెల్మెట్, లంచ బాక్స్, ఫైల్స్ ఇలా ఒక్కో దానికీ ఒక్కో నంబర్. ఇవన్నీ రోజూ కూడా ఉండాల్సిందే. ఏ ఒక్కటి మర్చిపోయినా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు ఏ సమస్యవస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే మన జాగ్రత్తలో మన ముంటే మంచిదని సెల్ప్ సణుగుడు.  అలవాటైపోయిందేమో.. అలవోకగా పెదాలు పలికేస్తుంటే మనసు వెతికేస్తూ ఉంటుంది వేటి స్దానాల్లో అవున్నాయా, లేదాని. ఈ విషయంలో నాకు ఫాలోయర్స్ కూడా ఎక్కువే. మంచని పిస్తే అంతే కదా..!  అన్నీ ఉన్నాయనుకున్నాకా.. బండి స్టార్ట్ చేసాను. ఎలాగైనా ఆ కేసు గెలవాలని సీనియర్ పట్టుదలగా ఉన్నాడు. అతను చెప్పేవి బాగా మనసు కెక్కించుకోవాలి.  అవసరమైతే రాత్రంతా కూడా దాని మీదే కూర్చోవాలి. ఆలోచిస్తూ నే బండి నడుపుతున్నాను.  నెమ్మదిగా అరవైకి చేరువవుతూంది బండి. ఎంత అర్జంటు పనున్నా స్పీడోమీటర్ని ఎప్పుడూ అంతకి మించి దాటనీయను. నా జీవితం కంటే నాకేదీ ముఖ్యంకాదు కదా..!  డ్రైవింగ్లో ఉన్నప్పుడు ప్రధాని ఫోన్చేసినా ఎత్తను. అవును మరి నా కేదైనా అయితే ఆయన నా వాళ్లకి డబ్బులివ్వగలరు గానీ నన్ను తెచ్చివ్వలేరు గదా..!  బొల్లారం దాటి బాచుపల్లికి వెళ్తూండగా బస్టాపుకి దగ్గర్లో ఎడం వైపు ఏదో గుంపు. చుట్టూ నిలబడి అక్కడ దేన్నో చూస్తున్నారంతా. అందరి ముఖాల్లో రవ్వంత అలజడి. ఏం జరుగుతూందక్కడ??   సహజ సిద్ధమైన ఆసక్తితో బండాపి, కుడి కాలు నేల మీదాన్చి “ ఏమైంది?” అనడిగాను అక్కడున్న ఒకబ్బాయిని. చాలామందిలో చెప్పాలని ఆసక్తి ఉంటుంది. అది చాలా సార్లే గమనించాను. కొన్ని కొన్ని సార్లు అత్యాసక్తితో అవసరాన్ని మించి కూడా చెబుతూంటారు వినే ఓపిక ఉండాలే గానీ..!   నాకు ఒక్కోసారి అనుమానం వస్తుంది “నేను అమ్మాయిని కాబట్టి ఇంతలా చెబుతున్నారా? ఏ ముసలాళ్లయినా అడిగినా కూడా ఇలాగే చెప్తారా?“ అని. ఏదేమైనా చెబుతున్నారు కదా..! మానవసంబంధాల పెరుగుదలకు అదీ మంచిదేలే.  అతనే దోచెప్తూనే ఉన్నాడు. ఇంతలో ఎవరో అమ్మాయి రోదిస్తున్న శబ్ధంతో పాటు .. “ఏడవకమ్మా..! నిన్న నీ ఫ్రండ్ కి జరిగిందని ఇవ్వాళ నీకు జరగాలనేముంది? పోనీ బండి మీద దింపుతాము రమ్మంటేనేమో రానంటావ్..! బస్సు లేమో రావటంలేదు. వెధవది పరీక్షల టైములో నన్నా సమయానికి వచ్చి చావరు. ఏం చేద్దాం ?”  బస్సు వస్తుందో లేదో నని దూరంగా తల తిప్పి చూస్తూ అంటున్నారెవరో.  “నువ్విలా ఏడిస్తే ఆ టెన్షన్లో చదువుకున్నది కూడా గుర్తుండదు. ఈ కుర్రాడు తీసుకెళ్తానంటున్నాడు కదా? ఏడ్చేకంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బెటరు. అవతల టైమై పోతుంది కదా.. పోనీ ఆటో మీద వెళ్ళిపో..” ఎవరెవరో ఏదేదో సలహాలిస్తున్నారు. ఆ అమ్మాయి మాత్రం వెక్కెక్కి పడుతూనేఉంది. విషయం అర్ధమైపోయింది నాకు.  ఇంటర్ పరీక్షలు తొమ్మిదింటికి మొదలవుతాయ్. ఎనిమిదిన్నర కల్లా అంతా హల్లోకి వెళ్ళిపోయి హాల్టికెట్స్  సబ్మిట్ చేసెయ్యాలి. ఓ యెమ్మార్ పూర్తి చెయ్యాలి తొమ్మిదింటికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకి హాజరవ్వనీయమని పత్రికల్లోనూ, పేపర్లలోనూ ఊదరగొడుతున్నారు అధికార్లు. పేద్ద… వాళ్లేదో ఆఫీసులకి టైముల కెళ్ళిపోతున్నట్టునట్టు.. వెధవఫోజూ, వీళ్ళూను.  ఆలోచిస్తూనే అసంకల్పితంగా టైము చూసాను. ఎనిమిందింపావు. “సార్తొమ్మిదింటికి కదా నన్ను అక్కడ ఉండమన్నది. పర్లేదులే ..! ఇంకాటైముంది. ఈ లోపు వెళ్ళిపోగలను. ముందు ఈ అమ్మాయి సంగతేంటో చూద్దాం ”మనసులో అనుకుని బండిని కొంచెం ముందుకి పోనిచ్చి ఒక పక్కగా పార్క్ చేసి హెల్మెట్ తీసి చేత్తో పట్టుకుని అటుగా నడిచాను.  దగ్గర్నించి చూద్దును గదా!  చూడబోతే చాల పేద అమ్మాయిలాగా తెలుస్తూనే ఉంది.  ఇక్కడే ఎనిమిందింపావు అయ్యింది. ముప్పావు గంటలో ఎర్రగడ్ద వెళ్లాలి. ఏడున్నరకే బస్టాపుకు  వచ్చిందట. అప్పట్నించీ ఒక్క బస్సూ రాలేదట.  ఒకటే ఏడుపు. ఏడుస్తూనే చెబుతూంది. ఆమె ఏడుపు చూస్తుంటే ఈ అధికార్ల మీద పిచ్చి కోపం వచ్చింది నాకు.  ఏడాది పాటు చదివిన చదువంతా సమయానికి వెళ్లకపోతే పోయినట్తే.! మళ్ళీ కష్టపడి చదవాలి. అసలు నన్నడిగితే ఇంత టెన్షన్లో వాళ్లకి రాయాలన్నా ఏం గుర్తుంటుంది? ఏడాదంతా కష్టపడేది అక్కడ పర్ ఫారం  చెయ్యటానికే గదా?పరీక్షకి ఫీజు కట్టిమరీ వెళుతున్నారు. అలాంటప్పుడు కావాలని లేటెందుకు చేస్తారు? ఎన్నో ఒత్తిడుల నడుమ నిద్రాహారాల్లే కుండా చదువుతారు పిల్లలు? పైగా తోటివాళ్లతో పోటీ ఒకటి ఉండనే ఉంటుంది.  ఆలస్యంగా వెళ్లే వాళ్లు తక్కువ శాతం మందే ఉన్నా, పొరపాటున వెళ్ల లేకపోతే, ఇక ఆ రోజుకి ఆ పరీక్ష వ్రాయ లేకపోతే ఆ నిస్పృహలో దేని కైనా ఒడిగడితే ఎంత మంది బాధపడాలి? బాధ మాట అటుంచి ఒక నిండు ప్రాణం బలై పోదా?! ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి?  నిబంధనలు అవసరమే. కానీ ఒక విధ్యార్ధి భావి జీవితాన్ని ఫణంగా పెట్టేంత కఠిన నిబంధనలు అవసరమా? ఏ నిబంధనైనా విధ్యార్దికి ఉపయోగపడేలా ఉండాలే తప్ప వాళ్ల జీవితాలకి చేటు చేసేదిలా ఉండకూడదు కదా? ఆ విషయానికొస్తే ఎవరు ఏ నిబంధనలని పాటిస్తున్నారని? సరిపడినంత స్టాఫ్ కానీ నాన్  టీచింగ్  గానీ ఉంటున్నారా కాలేజీల్లో? లైబ్రరీలుండాలి. ఉంటున్నాయా? ప్లేగ్రౌండ్ల సంగతి సరేసరి. పిచ్చిగ్గూళ్ల ల్లాంటి అపార్ట్మెంటుల్లో స్కూళ్ళూ, కాలేజీలూ. వీళ్ళెవరూ పాటించని నిబంధనలు పాపం పిల్లలు మాత్రం పాటించి తీరాలి. ఆలస్యం అయ్యిందంటే అందుకు సవా లక్ష కారణాలుంటాయి. అందరూ కార్లల్లోనూ, బళ్లమీదా, కేబు ల్లోనూ, ఆటోల్లోనూ రాలేరు కదా..! బస్సుల్లో వచ్చే వాళ్లని కూడా దృష్టిలో పెట్టుకోవద్దా!  పైగా పరీక్షలకి ముందు, టీచర్లు పిల్లల్తో సమయానికి పరీక్షా కేంద్రాలకి వెళ్ళండని పదే పదే చెబుతుంటారు కూడా. కావాలని ఎవ్వరూ ఆలస్యంగా వెళ్ళి తమ జీవితాన్ని తామే నాశనం చేసుకోరు కదా?ఒక్క ఏడాది ఒక్క నిమిషం ఆలస్యం వల్ల ఒక్క విద్యా సంవత్సరం కోల్పోతే,  ఏడాదికి లక్షల్లో దిగుమతవుతున్న ఎంత మందితో పోటీపడాలి ఏ విషయంలో నైనా? పైగా వచ్చే ఏడాది ఇదే సిలబస్ ఉంటుందని గ్యారంటీ ఏమైనా ఉంటుందా?   ఎందుకాలోచించరు వీళ్లంతా?  క్షణంలో వేన వేల ఆలోచనలు నాలో..! అయినా ఈ నిబంధనలు పెట్టే అధికారులు ఆఫీసులకి సరైన టైములకి వెళుతున్నారా? ప్రతి రోజూ ఆలస్యంగా వెళ్లినందుకు కాళ్ల, వేళ్లా బడ్దా పరీక్ష రాయనివ్వలేదని ఏడుస్తున్న వాళ్లెంత మందిని గురించో టీవీల్లో చూపిస్తున్నారు, పేపర్లల్లో రాస్తున్నారు. వాళ్లెందుకంత బాధపడాలి? ఆ మాత్రం టైం  సేన్స్ ఎందుకుండదు పిల్లలకి? అర్ధం చేసుకోవాలి కదా.. ఆ అమ్మాయి పడుతున్న బాధని చూస్తుంటే అంతకంతకీ నాలో ఉప్పొంగుతున్న ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని సీనియర్తో ఈ విషయం గురించి సీరియస్గా చర్చించాలి.. అనుకున్నాను మనసులో. లోలోన రగులుతున్న ఆలోచన్లని పక్కన పెట్టి వాళ్లందర్నీ పక్కకి జరగమని ఆ అమ్మాయికి చెయ్యందించాను “నేనుదింపుతానురా...” అంటూ. అందుకోలేదు. భయం భయంగా చూసింది.. నమ్మచ్చోనమ్మకూడదో అన్నట్టు. ఆ అమ్మాయి భయంలో నిజం ఉంది. మనిషి తోటి మనిషిమీద నమ్మకం కోల్పోయాడు మరి. ఇదెంత బాధాకరమైన విషయం.. ఆ అమ్మాయి అలా సందేహిస్తూండగా అన్నాను.. “చూడు నేను లాయర్ని. నువ్వు ఎనిమిదిన్నరకల్లా హాల్లోఉండాలి. ఓ యమ్మార్  పూర్తి చెయ్యాలి. నీ హాల్టికెట్ వాళ్లు చెక్చెయ్యాలి. ఇప్పుడు ఎనిమిదీ ఇరవై అయ్యింది. కనీసం నువ్వు గేట్లు మూసేసేసరికి కేంపస్లో ఉంటేనే నిన్ను లోపలికి అనుమతిస్తారు.. నిన్ను ఎర్రగడ్దలో సెంటర్ దగ్గర దింపటానికి ఈ టైం సరిపోతుంది.  పైకిలే..! రా.. నిన్ను దింపేస్తాను..” స్ధిరంగా అన్నాను. అంత ఇదిగా చెప్పినా అందర్లో అనుమానపుఛాయలే .. “ఆ లాయరమ్మగారు దింపుతానంటున్నారు కదా..పోపిల్లా..”ఎవరో అన్నారు. అయినా కదల్లేదు. ఆమెదేం తప్పు లేదు. ఆమెకు కలిగిన అనుభవాలెలాంటివో? మనకు తెలియవు కదా..!  సరిగ్గా అప్పుడే కానిస్టేబుల్ కూడా వచ్చాడక్కడికి. హమ్మయ్య అనుకుంటూ.. వాలెట్లోంచి నా పాన్ కార్డ్ తీసి ఆయనకిస్తూ.. “ఇది నా పాన్ కార్డ్. మీ దగ్గరుంచండి..ఆ అమ్మాయిని దించి మళ్ళొచ్చి తీసుకుంటాను. మీరిక్కడే ఉంటారు కదా..”అన్నాను. అప్పుడుగానీ నమ్మలేదామ్మాయి నన్ను. ప్రయారిటీస్ అంతే కదా..!  చదువు కంటే జీవితం ముఖ్యం. నిజానికి అంతమందిలో ఎవరో ఒకళ్ళిద్దరు డ్రాప్ చేస్తానన్నా ఈమెకే ధైర్యం చాల్లేదులా ఉంది. ఎవరు ఎలాంటోళ్ళో ఎలా చెప్పగలం?  నేనిలా ఆలోచిస్తున్నంతలో గబుక్కున లేచి చేయందుకుంది. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆమెని లాక్కెళ్తూ బండికేసి అడుగులేసాను.  “ఈ మాత్రం స్పృహ అందర్లోనూ ఉంటే ఏ రూల్సూ ఏం చెయ్యగలవ్చెప్పండి”, అంటున్నారెవరో.. వెనక నుంచి. అది విని నాలో నేనే నవ్వుకుంటూ గబుక్కునెళ్ళి బండెక్కి, ఆమె వెనుక కూర్చోగానే స్టార్ట్ చేసాను.  మొదటిసారిగా నా బండి స్పీడోమీటర్ అరవై దాటింది.  మధ్యలో ఎన్ని కబుర్లు చెప్పిందో.  అమ్మా, నాన్నాలేరట. కట్తే కట్తే అపార్ట్మెంట్  కూలిపోతే దాని కింద నలిగి చనిపోయారంట. దాంతో ఊర్నించి తాతయ్యా, నాయనమ్మలు వచ్చేశారంట. కాలు విరిగిపోయిన తమ్ముడూ, తాతయ్యా, నాయనమ్మల్ని తనే చూసుకోవాలంట. బిల్డర్ ఇచ్చిన దాన్ని తమ్ముడి పేరుతో  ఫిక్సెడ్  వెసారట. తమ్ముడికి కాలు లేకపోవటంతో ఆ వచ్చిన వడ్డీని వాడి కోసమని చిట్టీలు కట్టి, పొద్దున్నే లేచి రెండు మూడిళ్లల్లో పాచి పని చేసి అందర్నీ పోషిస్తుందట. కనీసం ఇంటరన్నా చదివితే ఏదో ఒక ఉద్యోగంలో తన దగ్గరే పెట్టుకుంటానని బిల్డర్ కూతురనే సరికి ప్రవేటుగా చదువుతుందట. రాత్రంతా చదువుకుని, ఇళ్లల్లో పని చేసి, వాళ్ల ముగ్గురికీ వంట చేసి పెట్టి బస్ కోసంవచ్చిందట. ఆటోలో వెళ్ళాలంటే డబ్బుల్లేక ఆ విషయం చెప్పటానికి సిగ్గేసిందట. పరీక్షకి వెళ్లలేనేమోననే డిప్రెషన్లో పోయిన అమ్మా, నాన్నా గుర్తొచ్చి ఏడ్చేసిందట. పాపం . ఎంత జాలేసిందో నాకు జీవితాన్ని ఆమె సాధిస్తున్న తీరువిని.  ఎంతకష్టం. ఎంతకష్టం.  కబుర్లలోనే పరీక్షాకేంద్రాని కొచ్చేశాం. దిగి గబగబా వెళ్లబోతుంటే పిల్చిచెప్పాను.. “నువ్వివేంమనసులో పెట్టుకోకుండా హాయిగా పరీక్ష రాసిరా..! పరీక్షవ గానే మళ్ళీ ఇక్కడికేరా..! నిన్ను మీ ఇంట్లో దిగ బెడతాను. అలా మీ ఇల్లు కూడా తెలుస్తుంది నాకు. అన్నట్టు రేపట్నించీ ఏడూ నలభై అయిదు కల్లా రెడీగా ఉండు ఇంట్లో. పరీక్షలయ్యేదాకా నేనే నిన్ను తీసుకొచ్చి, తీసుకెళతాను. సరేనా..!” అన్నాను ఆల్  ది బెస్ట్ చేబుతున్నట్టుగా చెయ్యెత్తి ధమ్స్అప్ పింగర్  చూపిస్తూ.  నా మాటల్తో అంతకు ముందు టెన్షన్తో ఆమె పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసం ఆమెని చేరినట్టు ఆ ముఖంలో వెలుగు చెప్పకనే చెప్పింది. నాక్కావల్సింది కూడా అదే..! “ఈ ఇంటర్, టెన్తోళ్లకి స్పెసిఫిక్ కోడ్ ఏదైనా పెట్టి,  పరీక్షలటైములో వాళ్లని ఎవరూ రోడ్ల మీద అడ్దగించటం కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ద దగ్గర నిబంధనలను పాటించండని అనటంకానీ చెయ్యకుండా వాళ్ల డ్రస్ చూడగానే పరీక్షలకి వెళ్లే స్టూడెంట్స్ అని అర్ధం చేసుకుని పోలీసులూ, పబ్లిక్కూ వాళ్లంతటవాళ్లే వీళ్లకి సహకరించే విధంగా రూల్ వస్తే బాగుంటుంది కదా సార్ “ అన్నాను మా సీనియర్తో ఆలస్యంగా వెళ్ళినందుకు అర్ధవంతమైన సంజాయిషీ ఇచ్చుకుంటూ.. “ ఐడియా బాగుంది. చేద్దాం” అన్నారు ప్రశంసిస్తున్నట్టుగా నా వైపే చూస్తూ.. ఆయనకది సాధ్యమే. ఎందుకంటే ఆయన ప్రభుత్వ న్యాయసలహాదారు కూడా.                                      -కన్నెగంటి అనసూయ 

కాకి పిండం (అల్లూరి నరసింగరావు స్మారక కథలపోటి లో రెండవ బహుమతి కథ)

కాకి పిండం (అల్లూరి నరసింగరావు స్మారక కథలపోటి లో రెండవ బహుమతి కథ)     పసి కూన ఇల్లెగిరి పోయేలా అరుస్తున్నా పడక్కుర్చీలో పడుకొని దీర్ఘాలోచనలో ఉన్నాడు పాపారావు. ఉదయపు ఎండ పూర్తిగా అతన్ని అల్లుకుపోయి ఉంది. సూర్యుడు కనపడకుండా తుండుగుడ్డ ఫైన కప్పుకున్నాడు. “ఛత్.........ఎందుకేడుస్తున్నావే?” చిరాకుగా అన్నాడు. చింటూ స్కూల్ డ్రస్సుకు బెల్టు బిగించుకుంటూ  చాప మీద పడి ఏడుస్తున్న చంటి దాన్నిగదమాయిస్తున్న తండ్రి వైపు చూసాడు. వాడి మొహము ఫైన జుట్టు నీళ్ళు కారుతూ అతుక్కుపోయి ఉంది. తడి మీద పౌడర్ రాసుకున్నాడేమో అంతా అతుకులు అతుకులు తెల్లగా. పిల్ల ఆపకుండా ఏడుస్తుంటే వాడికీ ఏడుపు వస్తోంది.  “అమ్మొస్తుంది ఆగు....బాయి కావాలా పిలుస్తా ఉండు” అన్నాడు. పిల్ల ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఏడుపందుకుంది.  “ఎక్కడ చచ్చిందిరా మీ అమ్మ! అదేడుస్తుంటే వినపట్టంలా...” పాపారావు మొహం ఫైనున్న తుండు గుడ్డ తీసి అరిచాడు. చింటూ తనకు బాక్సులో పెట్టిన అన్నం గబగబా మూత పెట్టి బ్యాగులో పడేసుకున్నాడు. “అదేంటీ ఇప్పుడు తినవా?మద్యాహ్నం ఎలాగూ స్కూల్లో పెడతారుగా తిండి..పొద్దాకా ఎలా ఉంటావురా?”  పిల్లదాని ఏడుపు వినిపించుకోనట్లుగా లేచి లుంగీ సరిగా కట్టుకుంటూ అడిగాడు కొడుకుని పాపారావు. వాడు బూట్లు రెండూ చేత్తో పట్టుకుని, బ్యాగు భుజానికి వేసుకొని పరిగేత్తాడు రోడ్డు మీదకు తడి తలతోనే, మూల మలుపు మీదికి బస్సు వస్తుంది మరి. పిల్ల పెంకు లేపుతున్నది ఏడుపుతో. పాపారావు హాల్లోంచి ఇంటి ముందరికొచ్చాడు సుధ కోసం. గోడ మీంచి పక్కింట్లోకి చూసాడు. ‘ఎక్కడ చచ్చిందబ్బా పొద్దున్నే’ అనుకుంటూ వాకిట్లోకి వచ్చాడు, అక్కడ పంపు నీళ్ళు పడుతోంది సుధ. “ఒక్కసారి దాని సంగతి చూడు ఫో...పట్టిన నీళ్ళు చాలుగానీ...ఏడ్చి ఏడ్చి చచ్చేలా ఉందది” చుట్టుపక్కల ఆడాళ్ళున్నారని కూడా చూడకుండా అరిచాడు. “కాస్త చూడకూడదూ...వచ్చేస్తున్నా...” చిన్నగా గొణిగింది సుధ. ఆమె బేల మొహం చూసి  “నువ్వెళ్ళమ్మా ఏవన్నాఅనేయగలడా మానవుడు. నీ బింది నే నింపి పెడతాగానీ లోపలికి పో “ మామ్మగారు సుధను పంపేసింది పంపు దగ్గర్నించి. “మందని చూసుకోని బానే పురమాయిస్తున్నావు పని...ఆ...” అతని మాటలకు భయంతో పరిగిత్తింది పసిదాని దగ్గరికి. “కాస్త నిమ్మళంగా నడువు, ఏంటా పరిగెట్టడం...చిన్న పిల్లనుకుంటున్నావా? ఉత్త మనిషివి కూడా కావు” స్నానం చేసి దొడ్లోంచి వస్తున్న కాంతమ్మ కసిరింది. అత్తగారి మాటలు చెవికి దూరనివ్వకుండా వసుధ  నెత్తుకుని గుండేలకాన్చుకుంది. తల్లి గుండె చెప్పుడు వినటానికి విరామం ఇచ్చి మళ్ళీ కేవ్వుమన్నదది. రొమ్ము దానోట్లో పెట్టి కళ్ళు మూసుకుంది సుధ కిందికి దుమికే కన్నీటిని అదిమిపెడుతూ. కుంపటి వెలిగించి పప్పుతప్పలాలో పప్పు పడేసి నాలుగు తోటకూర కాడలు ముందేసుకొని కూర్చుంది అత్తగారు. అవి రిల్లుతూ కోడలి హావ భావాలూ కనిపెడుతోంది. ‘మూడో కాన్పుకు రివటలా తయారైంది. ఇవ్వాళా రేపు ఎవరు కంటున్నారు మూడో సంతానాన్ని?? వాడికి బుద్ది లేకపోతే మానే, దీనికైనా ఉండద్దూ? ఆ పుట్టింటి వాళ్ళు కనీసం ఇటుకేసినా తొంగి చూడరు. అదేం పాపమో! మొదటి కాన్పుకు తీసుకొని పోయి, పురుడు పోసి పంపారు అంతే... తల్లి పోయి ఒక సంవత్సరం, తండ్రి పోయి ఇంకో సంవత్సరం...ఆనక అన్నదమ్ములు వేర్లుపడడం, అనారోగ్యాలు...ఈ వరస కార్యక్రమాలు జరుగుతూ సుధని మర్చేపోయినట్లుగా అయినారు. ఏనాడు ఎవర్ని పల్లెత్తు మాట అనని కోడలిని చూస్తే ఒక్కోసారి చిర్రెత్తుతుంటుంది. కొడుకు తిడుతున్నా నోరెత్తదు! ఇహ తనతో... తనంటేనే దానికి వెన్నులో వణుకు వస్తుంటుంది..’ అది తలుచుకొంటున్న కాంతమ్మ పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి. “ఇచ్చకాల ముండ ఎంత లావు ఏడ్చిందీ...ఇప్పుడు చూడూ!” అత్తగారి మాటలకు బిడ్డ కళ్ళు తుడిచి బొంత సరిచేసి మళ్ళీ పడుకోబెట్టింది. మోపెడు గుడ్డలు ఎదురుకుపోయి బావి గట్టు మీద పడేసి, నీళ్ళలో జాడించడం మొదలు పెట్టింది సుధ. సర్ఫు సబ్బు ఏమి లేవు. వసుధ గుడ్డలు నాచు వాసన వేస్తున్నాయి ఎంత బండకేసి బాదినా. ఎండా చురచురా నెత్తి కాలుస్తోంది. సుధ ఏ పని చేస్తున్నా బస్సు ఫీజు గురించే ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. చింటూ గాడి ఫీజు ఇప్పటికే మూడు నెలలు బాకీ.  వాడి పుస్తకాలూ, ఫీజులు, మద్యాహ్నం తిండీ అంతా పిల్లాడి తాతయ్య పరమయ్య స్కూలు యాజమాన్యం తో మాట్లాడుకొని మాఫీ చేయించాడు పౌరోహిత్యంతో వాళ్ళ ఇంటి కార్యాలు చక్కపెడతానని చెప్పి.  ఎండా వానా తెలీకుండా తిరుగుతాడు పరమయ్య. ఇంట్లో భోజనం చేయడం ఎప్పుడో, అంత పెద్ద ఊళ్ళో ఎప్పుడూ ఏదో ఓ కార్యం జరుగుతూనే వుంటుంది. పదో పరకో దొరుకుతాయి. ఆ సంపాదన సంసారానికి బొటాబోటిగా సరిపోతాయి. పాపారావు నాలుగు గంటలకు లేచి బస్టాండ్ లో పేపర్ తెచ్చి ఇంటింటికీ వేసి, ఆ చేత్తోనే పాల ప్యాకెట్లూ  వేసోస్తాడు. అప్పటికి తెల్లవారుతుంది. స్నానం చేసి గుడి కేడతాడు.  అక్కడ మూడు గంటలు పూజ చేసి బత్యం తెచ్చుకుంటాడు. పగలు తండ్రి తో పాటు అపర కర్మలకు, ఇతర కార్యాలకు వెళ్లి వస్తుంటాడు. సాయంత్రం ఇరవై మంది పిల్లలకు ట్యూషన్లు చెబుతుంటాడు.  ఏమిచేసినా ఇంటర్ పాసయిన తనకేం ఉద్యోగం సద్యోగం దొరకదని తెలిసి రెక్కల్ని కరగదీయడం మొదలుపెట్టాడు . కడుపులో అతనికో భయం పట్టుకుంది. తల్లీ తండ్రీ పెద్దవాళ్ళు అవుతున్నారు. తనకి మూడో సంతాన౦ అందబోతున్నది. అరా కోరా సంపాదనతో వీళ్ళందరి అనారోగ్యాలకూ, చదువులకూ, తిండికీ ఎన్నాళ్ళు దేవుళ్ళాడినా ఫలితం ఉండదని అర్థం అయ్యిందగ్గర్నించీ విసుగూ, చిరాకూ పెరిగిపోయి అభద్రత ఎక్కువయ్యింది. భార్యని పోరుపెట్టాడు గర్భం తీయించుకోమని, భయపడిపోయింది సుధ. తను పోషించలేనని ఖరాఖండిగా చెప్పాడు. అత్తగారికి చెప్పుకోలేకా...భర్త నస భరించలేకా నలిగిపోతోంది సుధ. పాపారావుకు ఆరోజు ఇంట్లోనే భోజనం. ఒంటిగంటయ్యింది. అమ్మ పిలవదేం ఇంకా అన్నానికని ముందర వరండాలో వాలు కుర్చీలో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. రెండుగంటలకు కాబోలు “నాయనా, భోజనానికి వస్తావా?” అంటున్న తల్లి మాటలకు దిగ్గున లేచాడు. విస్తరి ముందు కూర్చుంటే  ఆత్మన్యూనత గా అనిపించింది. అత్తా కోడళ్ళ వాటా లో ఏంతో కొంత తగ్గితేనే తన విస్తరి నిండుగా కనిపిస్తుంది  అనుకున్నాడు. “పెద్దిరాజు గారిని  ఇవాళో రేపో తీసుకోస్తున్నారటగా ... కర్మలకు కాస్త మీ తండ్రీ కొడుకుల గొంతులు పెగలాలి. ఎంతసేపూ గిద్దెడు బియ్యం, అర గిద్దెడు కందిపప్పుసాయిత్యం కుదరదు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అంటే ఎలా?” ఆవిడ నిష్టూర పడింది.  “అమ్మా, బయట చావు సంపాదన క్కూడా ఎంత పోటీ వుందో తెలుసా? పెద్దాచారి గారికి ప్రతి పనికీ కమీషన్ పడితేనే మనకీపాటి అధరవులు అన్నం లోకి వస్తున్నాయి తెలుసా? ఊరంతా ఆయనదే నాయే... ఏకార్యం దొరికినా ముందుగా ఆయనకీ వాటా పోతేనే మనకి పని దొరుకుద్ది”  తెలిసిన విషయమైనా మళ్ళీ వల్లించాడు. “శాస్త్రం గురించి చెప్పాలి జనాలకి..” అంది కాంతమ్మ. “ఈ కరువు రోజుల్లో శాస్త్ర ప్రకారం ఎవడు మటుకు చేస్తున్నారూ? ఏదో అల్లాటప్పాగా కానిచ్చేయమని వాళ్ళే మనకి చెప్పుతుండిరి. చెరువులో స్నానం చేయడానికి భయపడే జనానికి గజ ఈతగాడి స్వగతం ఎందుకు? వాళ్ళు అవసరం అయితే స్నానం మానుకుంటారు గానీ...” కొడుకు నిర్వేదం ఆవిడకు కడుపులో అగ్గి పుట్టించింది. “మీ నాయన నిర్వాకం అనూ, చాదస్తం అనూ ఇదిగో ఇప్పుడిలా కుటుంబాన్ని కుంటుపడేలా చేసింది. నిన్ను ఫైకి చదివిద్దామంటే తనకు తోడుంటాడని వెంట తిప్పుకునే వాడు. ఈ రోజుల్లో బ్రాహ్మణీకానికి గౌరవం ఏమేడిసింది? పెద్దలు ఇచ్చిపోయిన ఈ పెంకుటిల్లే ఇంతమందికి నీడనిస్తోంది”  అంటూ మూడో కాన్పువిషయం మాట్లాడలనుకున్నా అది భార్యాభర్తల విషయంగా మద్యలో దూరలేకపోయింది కాంతమ్మ. “మీ నాయనకి ఒక కల ఉండే...అందరూ ఉద్యోగాలకు పోతే ఖర్మలూ, క్రతువులూ జరిపించే నాథుడు కరువైతాడు అనీ... అప్పుడు మనకే ఇబ్బడి ముబ్బడి అని మురిసాడు పాపం” మూతి విరిచింది ఆవిడ. “ఆ....ఈ రోజుల్లో మంత్రాలకు మనిషక్కర లేదు. సెల్ ఫోన్లు చాలు”  తల్లి మాటలకు విసుగ్గా అన్నాడు పాపారావు. బయటి తలుపు జారేసి  పిల్లని పడుకోబెట్టి రాబోతున్న సుధ విన్నదా మాటలు. దాంతో పిల్లాడి ఫీజు డబ్బులకై ఆమె మనసు ఇంకా వ్యాకుల పడింది. కడుపులో పిండం భారం ఎక్కువైంది. అదోలాంటి విరక్తి ఆమెనూపేసింది. పెళైన కొత్తల్లో వాయలు చీరలు కట్టుకుని సాయంకాలాలు సాయబు అమ్మే మల్లె పూలు పెట్టుకొని భర్తతో సినిమాకి పోవాలని ఆరాటపడేది. కానీ అత్తా మావ ఆంక్షల మధ్య అది ఆవిరిపోయింది. చింటూ గాడు పుట్టాక పుట్టింటితో సంబంధాలు కనుమరుగై పోయాయి. తక్కువ సంపాదనతో ఎదగలేక అవస్థ పడుతోంటే, బావమరదుల సహాయ సహకారాలు లేకపోవడం తోడై పాషాణంలా  తయారయ్యాడు పాపారావు. సుధ ఏమడిగినా అదో పనికిమాలిన విషయంలా తోచేదతడికి. భార్య కడుపు చూస్తోంటే పుండు మీద ఉడుకునీళ్ళు పోసిన చందంగా గుండెలో భాధ! చంటిది పుట్టగానే ఆపరేషన్ చేయిస్తే పీడా పోయేది. చూస్తూ చూస్తూ బ్రూణహత్య చేయించలేడు. ఇప్పుడు పుట్టేది ఆడో మొగో...పెంచడం ఎంత ప్రళయం! ఎవరికైనా పెంపుకిస్తే?...అమ్మో కన్నపేగది. ఎప్పుడూ శాపనార్థాలు పెడుతూనే ఉంటుంది మనసు. సగం తిని లేచిపోయాడు పాపారావు మనసు మొద్దుబారుతుంటే. సుధ కూర్చుందా విస్తరి ముందు. కాంతమ్మ ఊసురంటూ కూర్చుండి పోయింది “ఇప్పటి పిల్లలు తిండి తినాలేరూ...పనీ చెయ్యలేరు.ఏంటో వీళ్ళ వరుస” అంటూ కాంతమ్మ నీళ్ళు చిలకరించి విస్తరి దులుపుకుని, తోటకూర పప్పుకూర వేసుకుని అన్నం వడ్డించుకుంది. పక్కన నీళ్ళ చారు గిన్న పెట్టుకుంది. కంది పచ్చడి కోడలికి వేసింది. “కాస్త మీరూ వేసుకోండి పచ్చడి” “ఆ...పర్లేదులే...రెండు ముద్దలు ఎక్కువ తింటే కడుపులో పెట్టె పెట్టినట్లు ఉంటోంది. అరిగి చావట్లేదు” అంది కాంతమ్మ.  కోడలితో మాట కలిపి కడుపు విషయం ఆరా తీయాలని ఉందామెకు. “శుబ్రంగా తిను బాగా నీరసంగా ఉన్నట్లున్నావ్” వ్యంగ్యమా? అన్నట్లు కళ్ళెత్తి చూసింది అత్తగార్ని సుధ.  ఏవిటో ఆలోచించింది కాబోలు ఉన్నట్టుండి ఫకాల్మన్ని నవ్వింది కాంతమ్మ. చొక్కా తగిలించుకుని రోడ్డు మీదకి వెళ్లబోయే వాడల్లా తల్లికేసి సాలోచనగా చూసాడు ఎందుకు నవ్విందా అని పాపారావు. “మా మామగారి తండ్రి భోజన పరాక్రమం చుసానొకసారి...నాకు టారెత్తి పోయి౦దనుకో...” అంటున్న కాంతమ్మ మాటలకి ‘అదా ‘అనుకుంటూ తలుపు దగ్గరికి వేసుకుని బయటకి వెళ్ళిపోయాడు. “ఏం?” అంది సుధ. ఆ ముచ్చట ఎన్నో సార్లు విన్నదే అయినా అడిగింది. “ఆయనకు రాక్షస ఆకలి...ఇంట్లో పాపం తిండికి ఏమీ అమిరేది కాదు. దొరికితే మటుకు ఊదిపారేయ్యడమే! ఆయన తిండి మీద ఓ పెళ్ళిలో పందెం కూడా కాసారు. అప్పట్లో గంగాళాల లో వంటలుగా... నాలుగు బానల పెరుగులో ఆవడలు ఊరేస్తే భోజన సమయానికి ఆయన విస్తరి వేసుక్కుర్చున్నాక ఒక్కటంటే ఒక్కటీ పక్క విస్తట్లో పడేది కాదట. వడ్డన ఆయన దగ్గరకి వచ్చేసరికి గారెలు మొత్తం వేయించుకునే వాడట. మద్య మద్యన గొంతు జారడానికి మంచినీళ్ళు తాగుతూ, మెంతిపెరుగు తాలింపు ఆవడల్ని హాంఫట్ అనిపించే వాడట! తద్దినాలకు వెడితే వడ్డించే ఇంటావిడ నడుములు విరిగిపోవల్సిందేనట. మెంతికాయ ముక్కల పచ్చడి, ఉత్తపప్పు నెయ్యి కలిపితే వంటవాడు మళ్ళీ వెనకవాళ్లకు ఎసరు వెయ్యాల్సి వచ్చేదట!”  సుధ గుటకలు మింగిందా తిండి ప్రతాపానికి. అత్తగారు చెప్పే ముచ్చట అంత వైభవంగా ఉంది మరి. “మామిడికాయ మాట తెస్తే మాబోటి వాళ్ళకే నోట్లో నీళ్ళూరుతాయ్. నీబోటి దానికి మరీనీ..” అంటూ కాంతమ్మ కాస్త సందు చూసుకొని  “మూడో కాన్పుగా... ఒళ్ళు కాస్తా భారువుగా ఉండొచ్చునేం?” అంది. “నీరసంగా ఉంది ... దీనికే ఇపుడు పాలు లేవు ఇహ పుట్టబోయే వాళ్లకెలాగో పాలు. అదో ఖర్చు అదనం అయితే తల్లి పిల్లలం కూలికి పోవాల్సిందే” చెప్తున్న సుధలో అలవికాని దుఃఖం కనురెప్పల కింద అల్లాడింది. “మన దరిద్రానికి ముగ్గురు పిల్లలు అవసరమా? కాస్తన్నా ఇంగితం లేకపోయే “ కాంతమ్మ మొహంలోకి కటినత్వం అలవోకగా వచ్చేసింది.  “ఇప్పటిదాకా ఇద్దరూ ఏవీ ఆలోచించుకోలేదా?” మళ్ళీ ప్రశ్నించింది.  “లేత నెలలేగా...ఓ నిర్ణయం తీసుకోలేక పోయారా?” “మాట్లాడకుండా ముంగిలా ఉంటే ఏమిటర్థం?? ఈ సంతానం నీకిష్టమా ...వాడికిష్టమా??” “నాకే భయం. కాన్పు కాగానే ఆపరేషన్ చేయించుకుంటా... “ అంటూ మళ్ళీ తనే అంది కాంతమ్మతో. “శ్రీరామనవమి ఉత్సవాలకి పదిమంది ఉన్న వంటల బృందం వస్తోందట మనూరు. ఇంటింటికీ నీళ్ళు పోసే  మామ్మ గారు చెబుతోంది కూరలు తరిగే పనికి ఇద్దరు మనుషులు తక్కువ పడ్డారనీ ...” భయంగా అత్తగారి కళ్ళల్లోకి చూసింది. “ఎన్నిరోజులో?” “తొమ్మిది రోజులనుకుంటా!” కాంతమ్మ మౌనంగా విస్తట్లో ఎంగిలినీళ్ళు విదిల్చి లేచింది. సాయంకాలం పేరయ్యగారు లొనికొస్తూనే చేసంచి పక్కన పారేసి పడక్కుర్చీలో కూలిపోయాడు. ఆయన మొహం కందగడ్డలా ఎర్రగా...కళ్ళు చింతనిప్పుల్లా ......వంట గదిలోంచి మామగారిని చుసిన సుధ మళ్ళీ  బయటరాలేదు. కాంతమ్మ చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి ఇస్తూ  “అలా ఉన్నారే?” అంది చిన్నగా.  చూసాడాయన పెళ్ళాన్ని కోపంగా ...కాంతమ్మలో ఏదో అలజడి కలిగి నీళ్ళ చెంబు తీసుకొని వెనుతిరిగింది. ”పెద్దిరాజుగారింటి మీద కన్నేసి ఉంచో అని వారం రోజులుగా కోరుతుంటివిగా. విధి లేక పొద్దున్నే దాసుగారింట్లో తద్దినం భోజనం చేసి పెద్దిరాజు భార్యని పలకరిద్దామని వారింటికి వెళ్ళా..ఇంటి నిండా బందువులు. ఆవిడ్ని చూద్దామని లోనికి వెళ్ళానోలేదో  ‘వీళ్ళు ఒకళ్ళు పీనుగ వచేస్తోందన్నట్టు వాసన పట్టేస్తారు వెంటనే...చచ్చాడా లేదా అని చూడ్డానికి వచ్చినట్టున్నాడు. ఈళ్ళు చేసే ఖర్మలేంటో గానీ పిండాలు ముట్టడానికి కూడా కాకులు రావడం లేదంటే ఎంత ఘోరంగా ఉందో చూడు...’ అని హేళనగా మాట్లాడుకుంటున్నారు. ఎంత బాధేసిందో...చెప్తే వినకపోతివి ఆ బేరం ఎవరికిపోతుందో అని నీ ఆరాటం...” అన్నాడు. “వాళ్ళకేం పోయేకాలం??” కనుబొమ్మలు ముడిచింది కాంతమ్మ. “కానికాలం మనదీ...డబ్బున్నవాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఈ బస్తీలో ఎంత కాలుష్యం ఉందీ, ఏం చెట్లున్నాయి? నీళ్ళు ఎక్కడున్నాయీ... ఇలాంటి ఊళ్ళల్లో, కాకులు ఎక్కడినుంచి వస్తాయని ఒక్కసారైనా  ఎవడన్నా  ఆలోచించాడా?? కాకి వెదవలు...” ఎప్పుడొచ్చాడో పాపారావు ఆవేశపడ్డాడు.  ఎవ్వరూ మాట్లాడలేదు. “కాశీ పోదాం పదండి పీడా పోతుంది. నది ఒడ్డున తలా ఒకపని చేసుకు బతకచ్చు. ఉన్న ఊళ్ళో ఏం పనీ చేసి బతకలేం. పేపరేస్తున్నానని ఎంత చిన్నచూపో అందరికి” పాపారావు అక్కసు పడ్డాడు. సుధకు కడుపులో దేవుతున్నట్టుగా ఉంది వింటో౦టే. కాశీ లో ఆడాళ్ళు కూడా పూజలు చేయిస్తారట! కాలే శవాల దగ్గర రోగాల గబ్బు, కాలే కట్టెల వాసనా కలిసి ఉన్నచోట తన పిల్లలు పెరగాలేమో.... నిలుచున్న పాటున ముక్కల పీటమీద కూలబడింది తల విసురుతోంటే. అర్ధరాత్రి పెద్దిరాజు గారి శవం ఊళ్లోకి వచ్చింది. ఆ వెనకే కార్లూ, జీపులూ, బంధువులూ ...  పెద్దాచారి గారు ఫోన్ల మీద ఫోన్లు. పరమయ్యగారు, పాపారావు ఉన్నపళాన వెలుగు రేఖలు భూమ్మీద పడకముందే శవం ముందు వాలారు.  కమీషన్ మాట్లాడ్డం పూర్తయ్యింది. పదిరోజుల ఖర్మ పరమయ్య చేయించేట్టు, ఆఖరి రోజుల సంభావన్లు అయిన గోదానం, సువర్ణ దానం, భూదానం లాంటివి చెరి సగం పంచుకునేటట్టు ఖరారు చేసుకున్నారు. అయిదోరోజు వంట మొదలుపెట్టి పిండాలు పిట్టకేసారు ఊరి బయట. ఎంత సేపు పిలచినా ఒక్క కాకీ జాడలేదు. పెద్దిరాజు కొడుకులకు విసుగు ఎక్కువైపోతున్నది. తడకోసారి వాచీ చూసుకుంటూ ’స్టుపిడ్ సాంప్రదాయాలు... కాకులు వచ్చి మెతుకు ముట్టకపోతే డాడి స్వర్గానికి పోడా? స్టుపిడ్ కాకులు  ఛ... ‘ విసుగు పడుతున్నారు. ఒంటిగంట దాటింది. కాకి కాదుకదా ఏ పక్షులూ,ఏ జంతువులూ రాలేదు. వచినవాళ్ళల్లో అసహనం తారాస్థాయిలో పెరుగుతున్నది. చూస్తున్న పాపారావులో చటుక్కున మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తండ్రి చెవిలో ఊదాడు. ఆయన స్తబ్దుడై ఉంటే వత్తిడి చేసాడు కొడుకు. వెంటనే పెద్దచారి గారికి ఫోను కొట్టాడు. అటునుంచి ఏం సమాచారం వచ్చిందో గాని అంతాలేచి ఇంటికి నడిచారు.  వంట బ్రామ్మడు వసారా లో  విస్తరి వేసి వేడి వేడి అన్నం, నాలుగు కూరలూ, నాలుగు పచ్చళ్ళు లాంటి వండిన వంటంతా వడ్డించి, గారెలు, నెయ్యి, నువ్వుపొడి వేసాడు.  కళ్ళు తడి వారుతుంటే పరమయ్య మొహం తుడుచుకునే నెపంతో కండువాతో కళ్ళు తుడుచుకున్నాడు. పాపారావు తమ ఇలవేల్పుని తలుచుకుని విస్తరి ముందు కూర్చున్నాడు.  “కాకులు స్మశానంలో లేవు వండిన వంట తినడానికి. ఎంతోసేపు చూశాం. చివరకు చిన్నయ్యగారే ఉపాయం చెప్పాడు ‘కాకి పిండం’ తాను తింటాడని. కానీ దానికి వేరే రేటు ఉంటుందన్నాడు. పీడా పోయింది మరక్కడ ఎంతసేపని కూర్చుంటాం? రెండువేలకు ఈ కార్యక్రమం ఒప్పుకున్నాము” లోపల తల్లితో చెబుతున్నాడు పెద్దిరాజు కొడుకు. నీళ్ళ బిందె లోపలకి తెస్తూ గడప తగిలి భోర్లపడింది సుధ కేవ్వుమన్న కేకతో. ఎవ్వరికీ ఇష్టం లేని పిండం గడప అవతలే చితికిపోయింది.     కాకిపిండం తృప్తిగా తిని లేచాడు పాపారావు.               -తమ్మెర రాధిక