అనంత సంగ్రామం
posted on Jul 19, 2017
అనంత సంగ్రామం
అనాదిగా సాగుతోంది
అనంత సంగ్రామం
అనాధుడికి, ఆగర్భ
శ్రీనాథుడికీ మధ్య.
సేద్యం చేసే రైతుకు
భూమి లేదు, పుట్రలేదు
రైతులరక్తం త్రాగే
జమీందార్ల కెస్టేట్లు.
మిల్లు నడిపి, కోట్ల డబ్బు
కొల్లగ లాభం తెచ్చే
కూలోనిది కాదు మిల్లు,
మిల్మ్యాగ్నే టొకసేటు.
శత్రువులను యుద్ధంలో
చిత్రంగా వధ చేసిన
పేద సైనికునికి 'సున్న'
రాజ్యమంత రాజులదే.
మధనపడే మేధావులు
శాస్త్రజ్ఞులు, విద్వాంసులు
కనిపెట్టిన అణుశక్తికి
ప్రభుత్వాల కంట్రోళ్ళు.
కర్షకులు, కార్మికులు
మధనపడే మేధావులు
తమ శ్రమలకు తగినఫలం
ఇమ్మంటే "తిరుగుబాటు!"
షావుకారు వడ్డీలకు
జమీందార్ల హింసలకు
వేగలేక ఆగలేక
తిరగబడితే "అతివాదం?"
(దాశరథి కృష్ణమాచార్య రాసిన అగ్నిధార కవితాసంపుటిలోంచి)