వరం

వరం   పావని కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని సవతి తల్లి చేతిలో యమ యాతనలు అనుభవించింది. సవతి తల్లి ఆ పిల్లను ఓ త్రాగుబోతుకు కట్టబెట్టింది. అంతా చేసి తనకు పుట్టిన సంతానమన్నా గొప్పగా ఉన్నారా, అంటే అదీ లేదు రోగాల పుట్టలై ఇద్దరూ అకాల మృత్యువు పాలయ్యారు. అటుపైన అత్తా-మామల ఆరళ్ళు భర్త ప్రమాదంలో కాళ్ళు పోగొట్టుకోవటం. జీవచ్ఛవంలా బ్రతుకు ఈడ్వవలసి రావటం పాపం, అన్నీ కష్టాలే ఆమెకు! చివరికి ఆమెకు జీవితం అంటేనే విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఓ మర్రి చెట్టు క్రిందికి చేరుకోగానే చెట్టు పైనుండి బ్రహ్మరాక్షసుడొకడు ఆమె ముందుకి దూకాడు. "పావనీ, ఆత్మహత్య మహా పాపం! దాని వల్ల ఇప్పటి కష్టాలు తీరటంకాదు; బాధలు రెట్టింపు అవుతాయి. నాలాగా ఏ చెట్టుమీదో, పుట్టమీదో తిరుగుతూ అనేక తరాలపాటు కృంగి కృశిస్తూ తిరగాల్సి వస్తుంది" అని రకరకాలుగా బుజ్జగించి చెప్పాడు. "ఇన్ని తెలిసినవాడివి, ఇలా అయ్యావేం?" అని అడిగింది పావని, కొంచెం తేరుకొని. "ఏం చెప్పను? ఒకప్పుడు నేను గొప్ప శివభక్తుడిని కానీ ఒట్టి కోపిష్టి వాడిని. ఆ కోపంలో ఎంతో మందిని నాశనం చేశాను. చివరికి అందరూ నాకు ఎదురు తిరిగారు; నా ఆస్తులన్నిటినీ లాక్కున్నారు. నా భార్యాపిల్లలు నన్ను విడచి పెట్టేశారు. తినేందుకు ఏమీలేక, రోగాల పాలై, చివరికి వాటినుండి తప్పించుకుందామని, ఆత్మహత్య చేసుకు-న్నాను. ఇలా తయారయ్యాను" చెప్పాడు వాడు. వాడి కథ వినేసరికి పావనికి వాడి మీద జాలి వేసింది. "నీ కథ వింటే ఇక ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోరు. నేనూ తిరిగి ఇంటికి వెళ్ళి పోతానులే, ఇప్పటికి అయ్యింది చాలు" అన్నది విచారంగా. మరుక్షణం ఆ బ్రహ్మరాక్షసుడికి దివ్య శరీరం వచ్చేసింది. "నిన్ను ఆత్మహత్య చేసుకోకుండా ఆపాను చూడు, అ పుణ్యం వల్ల నా కష్టాలు తీరిపోయాయి. రాక్షస రూపం నుండి నాకు విముక్తి లభించింది" అని చెప్పి పావనికి ఓ మంత్రం ఉపదేశించాడు ఆ దివ్యపురుషుడు. "దీన్ని జపించు, అంతా మేలు జరుగుతుంది" అని చెబుతూ. పావని శ్రద్ధగా ఆ మంత్రం జపించే సరికి, పార్వతీ పరమేశ్వరులు ఆమె ముందు ప్రత్యక్షం అయ్యారు: "ఏం వరం కావాలో కోరుకో" అంటూ. పావనికి తను ఇంతకాలమూ పడ్డ కష్టాలు కన్నీళ్ళు, బాధలు అన్నీ గుర్తుకొచ్చాయి. "దేవాధిదేవా! ఈ లోకంలో ఎవరికీ కష్టాలు-బాధలు లేకుండా చెయ్యి స్వామీ!" అంటూ కన్నీళ్ళు కార్చింది. శివుడు నిర్ఘాంత పోయాడు. "అసాధ్యం! అలవికాని కోరికలు కోరకు, పావనీ! నీకు ఒక్కదానికీ ఏం కావాలో చెప్పు" అన్నాడు. "కేవలం నా ఒక్కదానికోసం ఏమీ కోరుకోలేను స్వామీ! ప్రపంచంలో ఎవ్వరికీ ఏలాంటి బాధలూ లేకుండా వరం ఇవ్వండి - నా కోరిక అదే" అన్నది పావని. "ఇది సృష్టికి వ్యతిరేకం నేను ఇవ్వలేను" అన్నాడు శివుడు. "వేరే ఏదైనా కోరుకో, పావనీ" అన్నది పార్వతీదేవి. "తల్లీ నా కోరిక అదొక్కటే, నేనేం చెయ్యను?" అంది పావని. "పాపం, ఆడపిల్ల, అడుగుతోంది, ఆమె కోరుకున్న వరమే ఏదో ఇచ్చేస్తే పోలేదా, అట్లా కఠినంగా మాట్లాడతారెందుకు?" భర్తతో నెమ్మదిగా చెప్పింది పార్వతమ్మ. "లేదు పార్వతీ! మనుషులు గతంలో చేసిన పనులవల్లనే వాళ్లకు కష్టాలుగాని, సుఖాలుగాని కలుగుతుంటాయి. ఆ కర్మ చక్రంలో నా వంటివాళ్ళు జోక్యం చేసుకోకూడదు; చేనుకోను" అన్నాడు శివుడు. "నీ కోరికను మార్చుకోమ్మా!" పావనికి చెప్పింది పార్వతమ్మ. "లేదమ్మా! నా కోరికలో మార్పులేదు. ఈ లోకంలో కష్టాలతోటీ, బాధలతోటీ ఎవ్వరూ నశించకూడదు" అన్నది పావని. పార్వతి నవ్వుతూ చూసింది భర్తకేసి. శివుడు కలవర పడ్డాడు. అంతలోనే ఓ మంచి ఆలోచన తట్టిందాయనకు "సరే, అలాగే కానియ్యి, పావనీ! నీ కోరిక ప్రకారమే మానవుడికి మతిమరపు ప్రసాదిస్తున్నాను. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఒక్క సారి మంచి నిద్రపోయి లేస్తే చాలు తన బాధలన్నిటినీ మనిషి" అంటూ సతీ సమేతంగా మాయమైపోయాడు. అంతే! అప్పటినుండి మానవుడు ఎన్ని బాధలున్నా మరచిపోయి హాయిగా నవ్వుతూ జీవిస్తున్నాడు. మరపు మానవుడికి నేస్తంగా వచ్చి చేరుకున్నది మరి! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ముసలాయన - ఆవు

ముసలాయన - ఆవు   అనగనగా ఒక ముసలాయన ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. ముసలాయన చాలా పేదవాడు. ఒక సంవత్సరం వానలు సరిగ్గా పడలేదు. ముసలాయనకి రోజులు గడవటం కష్టమైంది. చేసేది లేక, ఆ ఆవును అమ్మేందుకు సంతకి బయలు దేరాడు. సంతకి వెళ్ళే దారిలో ఒక కాలువ ఉన్నది. దానిని దాటడానికి ఇష్టపడలేదు ఆవు. దానిని ఎంత బ్రతిమిలాడినా ప్రయోజనం లేక పోయింది. ఆవు జానెడంత కూడా కదల్లేదు. విసుగు వచ్చేసింది ముసలాయనకి. అటూ ఇటూ చూస్తే అతనికి దూరంగా నిలబడి ఇటే చూస్తున్న కుక్క ఒకటి కనిపించింది. ఆయన ఆవును అక్కడే వదిలేసి కుక్క దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, "కుక్కా! కుక్కా! నువ్వొచ్చి నా ఆవును కరువు, ఆది కాలువ దాటిపోతుంది!" అన్నాడు. కుక్క ఒప్పుకోలేదు. "పాపం! ఆ ఆవుని కరవటం ఎందుకు, అనవసరంగా?" అనుకున్నది. అంతలో కాలవ ఒడ్డున ఒక కర్ర కనిపించింది ముసలాయనకు. "ఈ కుక్క ఎంతకీ మాట వినటం లేదు. దీని పని చెప్పాలి" అనుకొని అతను కర్ర దగ్గరికి వెళ్ళాడు. "కర్రా! కర్రా! రా! కుక్కను బాదు! నువ్వు బాదితే, అప్పుడు కుక్క వచ్చి ఆవును కరుస్తుంది; ఆవు కాలువ దాటుతుంది" అన్నాడు. కర్ర ఎందుకు కదులుతుంది? అది అస్సలు కదలలేదు. ముసలాయనకి ఇప్పుడు కర్ర మీద కూడా కోపం వచ్చింది. అటూ ఇటూ చూసే సరికి, అక్కడికి దగ్గర్లోనే చీమల పుట్ట ఒకటి కనిపించింది. చీమలన్నీ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాయి- ఏవేవో మోసుకొస్తున్నాయి.   ముసలాయన చీమల దగ్గరికి వెళ్ళి- "చీమల్లారా! చీమల్లారా! మీరు పోయి కర్రను కొరకండి; అప్పుడు అది పోయి కుక్కను కొడుతుంది; కుక్క పోయి ఆవును కరుస్తుంది; ఆవు కాలువ దాటుతుంది!" అని చీమల్ని అడిగాడు. కాని చీమలు కూడ ఒప్పుకోలేదు. 'చేస్తున్న పనిని ఆపి ఊరికే కర్రను ఎందుకు కొరకాలి, మేం కొరకం!' అనుకున్నాయి. ముసలాయనకు చీమల మీద కోపం వచ్చింది. అంతలో అక్కడ గింజల్ని ఏరుకుంటున్న కోడి ఒకటి కనబడింది ఆయనకు. 'వీటి పని చెబుతాను ఆగు!' అని, కోడి దగ్గరికి వెళ్ళాడు. "కోడీ, కోడీ, చీమలను తినెయ్యి. అప్పుడు అవి పోయి కర్రను కొరుకుతాయి; కర్ర పోయి కుక్కను కొడుతుంది; కుక్క పోయి ఆవును కరుస్తుంది; అప్పుడు ఆవు కాలవ దాటుతుంది" అని బ్రతిమిలాడాడు. కానీ కోడి "కొక్కొక్కొక్కొ" అంటూ దూరం పారిపోయింది. ఇంక ఇప్పుడేం చేయాలి? ఇంకేమీ చెయ్యలేక, ముసలాయన "వీటిని బ్రతిమిలాడడం ఎందుకు? నేనే ఈ కర్రతో కొట్టి కాలువ దాటిస్తాను చూడు' అని కట్టెతో ఆవును గదమాయించాడు. వెంటనే ఆవు కాలువ దాటింది. సొంతగా పని చేసుకోటాన్ని మించింది వేరే ఏదీ లేదు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ప్రత్యుపకారం

ప్రత్యుపకారం   పులిచెర్లలో గంగయ్య అనే తాపీ పనివాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ పట్నం వెళ్ళి పనిసేవాడు. ఆ వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన బియ్యమో, రాగి-జొన్నలో కొనుక్కుని, కాలినడకన ఊరికి తిరిగి వచ్చేవాడు. అతను వచ్చే దారిలోనే, ఊరికి దగ్గరగా పెద్ద జువ్వి చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు కింద ఓ పెద్ద చీమల పుట్ట ఉండేది. గంగయ్య ప్రతిరోజూ ఆ పుట్ట దగ్గర ఆగేవాడు. తను తెచ్చుకున్న ధాన్యపు మూటని విప్పి, ఒక చారెడు ధాన్యం తీసి, ఆ పుట్ట చుట్టూ పోసి ఆనక మెల్లగా నడచుకుంటూ ఇంటికి పోయేవాడు. అది చూసి కొందరు నవ్వుకునేవాళ్ళు: "వీనికి ఇదేమి పిచ్చి?! తను ఏమైనా దానకర్ణుడ-నుకుంటున్నాడో ఏమో. ఇతనికే ఏమీ లేదు కదా, తినేందుకు?! అయినా కష్టపడి సంపాదించిన సొమ్మును ఇంటికి తీసుకుపోయి దాచుకోక, నేలపాలు చేస్తాడు. తిక్కే, వీడికి!" అని అనుకునేవాళ్ళు. తనని ఎవరు ఎన్ని మాటలన్నా, గంగయ్య మటుకు వారి మాటల్ని చెవికి ఎక్కించు-కునేవాడు కాదు. కాలం గడిచే కొద్దీ ఆ చెట్టు కాస్తా జనాల భాషలో 'గంగయ్య జువ్వి చెట్టు' అయ్యింది. చీమలు అతడిని గుర్తించినాయో లేదో గాని, అతడు మాత్రం చీమలకు గింజలు వెయ్యని దినమే లేదు. అలా ఉండగా ఆ ప్రాంతంలో క్రమంగా వర్షాలు తగ్గిపోసాగినై. ఒక ఏడాదైతే అక్కడి నేల మొత్తం బీటలు వారింది; చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు అన్నీ ఎండిపోయాయి! భూమిలో తేమ తగ్గిపోయింది. జువ్విచెట్టుకు కూడా నీరు చాల లేదు. అందుకని అది తన కొమ్మలకు, రెమ్మలకు నీటి సరఫరా తగ్గించింది. దానితో చిన్న చిన్న కొమ్మలు అన్నీ ఎండిపోసాగినై. క్రమంగా ఆ చెట్టును ఆశ్రయించి నివాసం ఉంటున్న పక్షులు కూడా వలస పోసాగాయి!   గ్రామంలో‌ జనాలంతా వాడుకొన్న నీళ్ళు పోయేందుకు ఓ మురికి కాలువ ఉండేది. అది గంగయ్య జువ్వి చెట్టుకు కొంత దూరంనుండే పోతుండేది. మరి ఈ చీమలకు ఆలోచన ఎట్లా వచ్చిందో ఏమోగాని, చెట్టు చుట్టు ప్రక్కల ఉన్న నేలను అంతా గుల్ల బార్చాయి. మురికి కాలువ వరకూ నేలకు చిన్న చిన్న రంధ్రాలు వేసి దారులు ఏర్పరచాయి. చూస్తూ చూస్తూండగానే మురికి కాలువల్లో‌ని తేమ ఈ దారులను అంటుకున్నది. నెమ్మదిగా చెట్టు దగ్గరి వరకూ వచ్చి చేరింది. ఆ సంగతి తెలియగానే జువ్వి చెట్టు నులివేళ్ళు ఆ వైపుకు సాగాయి. తేమను అందిన జువ్వి చెట్టుకు ప్రాణం‌ లేచి వచ్చినట్లయింది. త్వరలోనే అది మళ్ళీ పచ్చగా అయ్యింది. అంతకు ముందున్న రూపాన్ని సంతరించుకుంది. వలసపోయిన పక్షులు కూడా తిరిగి తమ గూళ్లలోకి చేరుకున్నాయి ఆనందంగా. చెట్టు చీమలనడగలేదు.  చీమలు చెట్టుకు చెప్పలేదు.  పక్షులు చెట్టుకు చెప్పిపోలేదు.  అవి తిరిగి చెట్టునడిగి రాలేదు.  ప్రకృతి ఎవరి ప్రమేయమూ లేకుండా తనపని తాను సాగిస్తూనే ఉంటుంది. జీవుల మధ్య అవినాభావ సంబంధం అర్థం కానిది. తర్వాత కొన్నేళ్లకు ఒకసారి ప్రకృతి మళ్ళీ వికటించింది. ఈసారి చిన్న గాలితో మొదలై, ఓ మోస్తరు వానగా మారి, చివరికి అదే కుండపోత వర్షమై, మన్ను మిన్ను ఏకమైనట్లు కురవసాగింది వాన! గంగయ్య ఇల్లు ఊరికి కొంచెం ఎడంగా ఉండేది. ఎండిన వాగు ప్రక్కనే, ఓ రాళ్ళగుట్టకు దగ్గరగా ఉండేది అతని ఇల్లు. అక్కడ అతనితో బాటు మరో‌ మూడు నాలుగు ఇళ్ళు ఉండేవి అంతే. కొద్ది సేపటికి వంకల నీళ్ళు అన్నీ చేరుకునే సరికి, వాగులో ప్రవాహం మొదలైంది. దాంతో కాలనీవాసులకు అందరికీ‌ భయం వేసింది. అందరూ తమ తమ ఇళ్ళు వదిలి దూరంగా‌ పోయి, ఎత్తైన ప్రాంతాల్లో తల దాచుకున్నారు.   గంగయ్యకు ఎందుకనో భయం అనిపించలేదు. వేరే ఎక్కడికో‌ పోయి ప్రాణాలు కాపాడుకోవాలని కూడా అనిపించలేదు. పొంగుతున్న వాగుని, వానలో తడుస్తున్న జువ్వి చెట్టుని చూస్తూ అతను అక్కడే కూర్చున్నాడు. రాను రాను ప్రవాహ ఉధృతి పెరిగింది. మెల్లగా గంగయ్య ఇంటి వైపు నేల కోతకు గురవ్వసాగింది. ఆ సరికే వంకలోకి రకరకాల వస్తువులు కొట్టుకొచ్చినై. గ్రామంలోకి నీళ్ళు వచ్చేసాయి. చాలామంది ఇళ్ళలోని వస్తువులు నీళ్ళపై తేలుతున్నాయి. ఇక మిగిలింది గంగయ్య ఇల్లు ఒక్కటే. " అది కూడా కూలిపోతుంది..మొత్తం వంకలో పడి కొట్టుకొని పోతుంది- ఖాయం" అనుకున్నారు అందరూ. అదేమి చిత్రమో గాని, అప్పటికప్పుడు పెద్ద బండరాయి ఒకటి గుట్ట పైనుండి జారి పడింది. ఆ శబ్దానికి అందరూ భూకంపం వచ్చిందేమో‌ అన్నట్లు ఉలిక్కిపడ్డారు. పడటం పడటం అది వంకలో పడింది! ప్రవాహ వేగానికి అడ్డంగా దొర్లుకొని, గంగయ్య ఇంటి పునాదిని ఆనుకొని నిలబడింది. ఆ ఒక్క బండ అడ్డు ఉన్నందువల్లనే నీటి ప్రవాహపు దారి మళ్ళింది. వాగు మొత్తం అవతలి ఒడ్డును ఒరుసుకొని పారింది!   వర్షం నిలిచి వాతావరణం‌ శాంతించేందుకు వారం రోజులు పట్టింది. చూడగా గంగయ్య ఇంటి పునాది ఏమాత్రం కోత పడలేదు. ఇల్లు చెక్కుచెదరలేదు. గంగయ్య తిరిగివచ్చి తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయాడు. గంగయ్య చీమలకు ఆహారం అందించి-నందుకు ప్రతి ఫలంగా ఏ దేవుడో వచ్చి అతనికి సాయం అందిస్తారు అనుకున్నారు కదూ?! ఈ కథలో అట్లా జరగలేదు. మనం మానవతతో, ప్రతిఫలాన్ని ఆశించకుండా, 'తోటివారికి సాయం చేయటం మన కర్తవ్యం కదా' అనుకొని పని చేస్తూ పోతే, ఏదో ఒకనాడు- ఎప్పుడో‌ ఒకప్పుడు- ఎవరో ఒకరు తోడుగా నిలచి, మనకు సాయం అందిస్తారు. ఇది సున్నితమైన ధర్మం. గంగయ్య తనకు తెలీయకుండా చీమలకు సాయమందించాడు. ఆ సాయం ఊరికే పోలేదు. అది మరోరూపంలో అతనికి సాయంగా అందింది. ఇతరులకు చేసే సాయం ఏనాటికీ వృధా పోదు!! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

పెద్దపులి

పెద్దపులి   పులులు చాలా ప్రమాదకరమైనవి. ప్రమాదకరమైన వాటితో ఆడుకునేవాళ్లను అజ్ఞానులే అనాలి. అయితే తెలివిలేకగానీ, అహంకారంతోటిగానీ వాళ్ళు ప్రమాదాలకు ప్రాణం పోస్తే, ఆ మంటల్లో చిక్కుకుని, సామాన్యులూ కష్టాలపాలౌతుంటారు. నలుగురు బ్రాహ్మణులు ఒకప్పుడు భారతదేశమంతా తిరిగి, రకరకాల విద్యలు నేర్చుకున్నారట. ఎంతో విజ్ఞానాన్ని మూటగట్టుకున్నారు వాళ్ళు. తమకున్న నేర్పునూ, తాము నేర్చిన విద్యల మహత్తునూ తోటి మిత్రులకు చూపాలని ఎదురుచూస్తున్నారంతా.    ఆ నలుగురూ ఒక అడవిలో కలిశారు. వాళ్లలో ఒకడికి అక్కడ ఒక ఎముక దొరికింది. అది ఒక పులి తుంటి ఎముక. దాన్ని సంపాదించిన బ్రాహ్మణుడు అన్నాడు. "చూడండి - ఇది ఏ జంతువైనా కావొచ్చు. దీని ఎముక ఒక్కటి ఉంటే చాలు - నా శక్తితో నేను దీని అస్థిపంజరాన్ని సంపూర్ణంగా నిర్మించగలను." అలా అని, వాడు ఆ ఎముక మీద తన ఉత్తరీయాన్ని కప్పి, ఏదో మంత్రం పఠించాడు. వెంటనే ఎముక స్థానంలో పులి అస్థిపంజరం తయారైంది.   రెండవ బ్రాహ్మణుడు అన్నాడు - " నేను దానికి మాంసం, రక్తం, చర్మం ఇవ్వగలను" అని. అతని మంత్ర ప్రభావం వల్ల అస్థిపంజరానికి మాంసమూ, రక్తమూ, చర్మమూ లభించాయి. ఇప్పుడు వాళ్లముందు ప్రాణంలేని పులి ఒకటి పడి ఉన్నది - చారలతోటీ, మీసాలతోటీ. మూడో బ్రాహ్మణుడు అన్నాడు. "నేను ఏం చేయగలనో తెలుసా, మీకు? దానికి ప్రాణం పోయటం ఎలాగో నాకు తెలుసు!" అని. నాలుగోవాడికి మిగతా ముగ్గురికి ఉన్నంత విజ్ఞానం లేదు. "ఆగాగు! దానికి ప్రాణం పొయ్యకు! నీ శక్తి యుక్తులమీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది." అన్నాడు వాడు కంగారుగా.   "ఏదైనా చేసేందుకు శక్తి ఉండీ ఆ పని చెయ్యకపోతే ఏం లాభం? నా మంత్ర శక్తిని పరీక్షించే అవకాశం నాకు ఇప్పటివరకూ రాలేదు. నేనిప్పుడు దీనికి ప్రాణం పోసి తీరతాను. చూస్తూండు, ఊరికే" అన్నాడు మూడోవాడు. "నువ్వంత గట్టిగా పట్టు పడితే, సరే. కానీ కొంచెం సేపు ఆగు. నన్ను ముందు ఈ చెట్టు ఎక్కనీ" అని, నాలుగోవాడు దగ్గర్లో ఉన్న చెట్టును ఎగబ్రాకాడు.   అప్పుడు మూడోవాడు తన మంత్ర మహిమతో పులికి ప్రాణం పోశాడు. ప్రాణం రాగానే దానికి విపరీతమైన ఆకలివేసి, తినేందుకు ఏది దొరుకుతుందా' అని చుట్టూ చూసింది. భయంతో ముడుచుకొని కూర్చున్న ముగ్గురు బ్రాహ్మణుల్నీ చూడగానే అది గర్జిస్తూ వాళ్ళమీదికి దూకింది. పారిపోవటానికి కూడా కాళ్ళు రాక, ఆ ముగ్గురూ అట్లా పులికి ఆహారం అయిపోయారు.   తన మిత్రులు ముగ్గురూ పులికి ఆహారమౌతుంటే చూస్తూ, రాయిలా కదలక-మెదలక కూర్చోవటం మినహా నాలుగోవాడు మరేమీ చేయలేకపోయాడు. పులి భోజనం ముగించుకొని సంతృప్తిగా అడవిలోకి వెళ్లిపోయిన తర్వాత చాలాసేపటికి, వాడు క్రిందికి దిగి, వణికే కాళ్లతో ఇంటివైపుకు పరుగు తీశాడు. పులులకు ప్రాణం పోశాక, ఇంక ఎవరూ ఏమీ చెయ్యలేరు - అవి తమ భోజనం ముగించుకొని, తృప్తిగా తమ దారిన తాము వెళ్ళిపోయేంతవరకూ. ఆపైన మిగిలిన వాళ్ళు తమకు మిగిలిన దారుల్ని- అప్పుడు- వెతుక్కుంటారు. మన రాష్ట్రంలోంచి అల్లర్లపులి తొందరగా వెళ్ళిపోతుందనీ, మనందరికీ ఏదైనా చక్కని దారి సత్వరం దొరుకుతుందనీ ఆశిద్దాం. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

కనువిప్పు

కనువిప్పు     ఇంద్రప్రస్థాన్ని ఒకప్పుడు కీర్తివర్మ అనే రాజు పరిపాలించేవాడు. కీర్తివర్మకు తన రాజ్యాన్ని విస్తరింప జేయాలని చాలా కోరికగా ఉండేది. ఆ రాజ్యానికి చుట్టుప్రక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యా లపైకి అతను దండెత్తి, వాటినన్నిటినీ తన రాజ్యంలో కలుపుకున్నాడు. వాటిని సామంత రాజ్యాలుగా ఉంచుకొని, ఆ రాజుల నుండి బలవంతంగా కప్పం వసూలు చేయసాగాడు. సామంత రాజ్యాల ప్రతినిధులు తమ అశక్తతను ఎన్ని విధాలుగా వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది- కీర్తివర్మ కోరికలకు అంతులేకుండా ఉన్నది. కొన్నాళ్లకు గూఢచారులనుండి కీర్తివర్మకు ఒక వర్తమానం అందింది: సామంత రాజులంతా కలిసి తనకు వ్యతిరేకంగా కుట్రపన్నుతున్నారు. అయినా కీర్తివర్మ ఏమాత్రం తొణకలేదు. తనకు సైనిక బలం ఎక్కువ ఉన్నదనే ధైర్యం ఆయన కళ్ళకు పొరగా నిల్చింది. వాళ్లందరిపైనా మరోసారి యుద్ధం చేద్దామని నిశ్చయించాడు. మంత్రి, సైన్యాధిపతి అది తప్పని చెప్పిచూశారు. అయినా లాభం లేకపోయింది. తెలివైన మంత్రి రాజుకు ఏదో ఒక విధంగా కళ్ళు తెరిపించాలనుకున్నాడు. దానికి తగిన సందర్భంకోసం వేచి ఉన్నాడు. అలాంటి అవకాశం త్వరలోనే వచ్చింది: రాజు, మంత్రి ఉద్యాన వనంలో విహరిస్తుండగా వాళ్లకొక వింత కనబడింది- ఒక మూలన ఉన్న పుట్టకు దగ్గరలోనే వేలాది చలి చీమలు ఒక పామును కరిచి చంపుతున్నాయి. పాము అటూ ఇటూ దొర్లుతున్నది- దానిక్రిందపడి అనేక చీమలు నలిగిపోతున్నాయి- అయినా మరిన్ని చీమలు వచ్చి ఆ పామును పట్టుకొని ఈడ్చుకు పోతున్నాయి. చివరికి ఆ పాము చనిపోయింది కూడా. ప్రక్కనే ఉన్న మంత్రి సమయానుకూలంగా ఈ పద్యం చెప్పాడు. "బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా? బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ?" అని. కీర్తివర్మకు కనువిప్పు కలిగింది. కేవలం తనకున్న సైన్యబలంపై ఆధారపడి, సామంతరాజ్యాలను దోచటం తప్పని అర్థమైంది. చిన్న చిన్నవైనా సరే, అవన్నీ కలిస్తే తనకు ముప్పు తప్పదని అతను తెలుసుకున్నాడు. సామంత రాజ్యాల కష్టాలను అర్థంచేసుకొని, ఆ రాజుల మనోభావాలకు దెబ్బ తగలకుండా ప్రవర్తించాలని అతనికి తెలిసివచ్చింది. ఆపైన అతను మంత్రిగారి సలహాల మేరకు అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టాడు. ప్రజా సంక్షేమం కోసం అతను చేపట్టిన చర్యలవల్ల, సామంత రాజులకు ఆందోళన మార్గం చేపట్టవలసిన అవసరమే లేకుండా పోయింది. అందరూ కీర్తివర్మకు మిత్రులైనారు. దట్టంగా క్రమ్ముకున్న యుద్ధ మేఘాలు దూదిపింజల్లాగా తొలగిపోయాయి. తన కనువిప్పుకు కారణమైన మంత్రిని ఘనంగా సత్కరించాడు కీర్తివర్మ. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

సాహసం

సాహసం అది ఒక తాండా. తాండాలో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అది వేసవి కాలం. ఎప్పటి లాగే మగవాళ్ళు అంతా బయటి పనులకు వెళ్ళి ఉన్నారు. వడగాలులు బాగా వీస్తున్నాయి. అంతలోనే ఎక్కడో నిప్పు రవ్వలు లేచాయి. అంతే- తాండాలోని నాలుగైదు గుడిసెలు ఒక్కసారిగా అంటుకున్నాయి.    గుడిసెలలో ఉన్న వాళ్లంతా భయంతో గబగబా బయటకు పరుగు పెట్టారు. గుడిసెముందు తొక్కుడు బిళ్ళ ఆడుకుంటోంది లచ్చిమి. ఈ మంటల్లో వాళ్ళ గుడిసె కూడా అంటుకున్నది. లచ్చిమి వెనక్కి తిరిగి చూసేసరికి మంటలు పెద్దవయ్యాయి. ఒక్క క్షణం పాటు ఆ పాపకు ఏమీ అర్థం కాలేదు. మరుక్షణంలో తమ్ముడు సోము గుర్తుకు వచ్చాడు. వాడు ఇంట్లో ఉయ్యాలలో పడుకొని నిద్రపోతున్నాడు! వాడికి ఇంకా ఉయ్యాల దిగటమే రాదు. అమ్మ-నాన్నలు వాడిని తనమీద వదిలి పనులకు వెళ్ళారు!! లచ్చిమి తటాలున లేచి గుడిసెలోకి పరుగెత్త బోయింది. బయట మూగిన జనం హాహా కారాలు చేసారు. "లోపలికి పోవద్దు- ప్రమాదం" అని అరిచారు.                                                       కానీ లచ్చిమి భయపడలేదు. తనకు ఏమైతుందో తను అస్సలు ఆలోచించలేదు. "చిట్టి తమ్ముడికి ఏమీ కాకూడదు" అనేది ఒక్కటే ఆ పాప ఆలోచన. చటుక్కున లోపలికి దూరిన లచ్చిమి గబగబా ఉయ్యాలలోంచి సోమును ఎత్తుకుని అదే పరుగున బయటికి వచ్చింది.   ఆ సరికే లచ్చిమి పరికిణీకి నిప్పు అంటుకున్నది. చుట్టు ప్రక్కల వాళ్ళు గబగబా ఆ మంటను ఆర్పేసారు. 'ఇంకాస్త ఆలస్యమైతే మంటల్లో చిక్కుకు పోయేవాళ్ళు. అయినా అంత సాహసం ఎలా వచ్చింది పాపా, నీకు? ప్రమాదం కాదూ?!” అంటూనే అందరూ లచ్చిమి సాహసాన్ని కొనియాడారు.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ఆరోజు వస్తుంది

ఆరోజు  వస్తుంది      చీకటి పడిపోయింది.  కాస్త భయంగానే ఉంది  కౌసల్యకి  ఆ చీకట్లో.  వీధి దీపాలు వెలగట్లేదు. దానికి తోడు  అమావాస్య. అసలు చిన్నప్పటినించీ  భయస్తురాలే. ఇలా చీమ చిటుక్కుమంటే  భయపడిపోయేదానివి  రేపు  పెళ్ళయ్యాక  నీ పిల్లల్ని ఎలా పెంచుతావే  అంటూ  దిగులుగా  కూతుర్ని దగ్గిరకి  తీసుకునేది  తల్లి  పద్మావతి.  “ మీ ఆడాళ్ళకి  పెద్దయ్యాక  మొండి ధైర్యాలు  అవే వస్తాయిలే. “  ఓ  విసురు  విసిరేవాడు తండ్రి సాంబమూర్తి. “  ఔనౌను.  లేకపోతే  సంసార సాగరం  ఈదగలమా ? మీలాంటి వాళ్ళకి  వెనకఉండి విజయాలు  తెచ్చిపెట్టగలమా ? “ నవ్వుతూ  చురక  వేసేది పద్మావతి.  వాళ్ళమాటలు  వింటూ నవ్వుకునేది  కౌసల్య .  కానీ  ఇప్పుడు  నవ్వు రావట్లేదు.  ఏ రోజుకారోజు  బతికి బయటపడితే అంతేచాలన్న రీతిలో  కాలం గడుస్తుంటే అమ్మయ్య  అన్న నిట్టూర్పులే  వస్తున్నాయి .  ఆడపిల్లని  ఒక  అయ్య  చేతిలో పెట్టేస్తే  పెళ్ళంటూ చేసేస్తే  ఆ స్ర్తీకి రక్షణ   ఏర్పడిపోయినట్టేనని భావించేవారు  పూర్వపురోజుల్లో.  కంచే  చేను మేసినట్టు  వాడు కొట్టినా తిట్టినా  పట్టించుకునేవారే కాదు. అడిగేవారే  కాదు. అడిగి మాత్రం ఏం చెయ్యగలం అన్న ధోరణిలో  ఉండేవారు.   ఇప్పుడూ  అలాంటి సంసారాలున్నాయి  లేకపోలేదు. ఎటొచ్చీ చదువుకుని   ఎవరి కాళ్ళమీద  వాళ్ళు నిలబడాలన్న ఆలోచన  పెరగడం మంచిదయ్యింది.  అయినా కూడా  రక్షణ  అనే  విషయానికి  వచ్చేసరికి అగమ్యగోచరంగానే  ఉంది. దాన్ని గురించే  ఆలోచిస్తూ  నడుస్తోంది కౌసల్య.  అసలు  సృష్టిలోనే  ఎందుకంత  అన్యాయం ! స్త్రీని  శారీరకంగా   బలహీనంగానూ  మానసికంగా సున్నితంగానూ  ఎందుకు  సృష్టించాలి ? ఈ రోజుల్నిబట్టి ఆడవాళ్ళు కాస్త మారుతున్నారు నిజమే. మానసికంగా ధైర్యాన్ని అలవరచుకుంటున్నారు.  మానసిక బలంతో  కష్ట నష్టాలు ఎదుర్కుంటున్నారు.  అదీ  నిజమే. మంచిదే.  కానీ మరి  రౌడీల  ఆగడాలు అత్యాచారాలు  అంతకంతకీ  ఎక్కువ  అవుతున్నాయే  తప్ప తగ్గుతున్న  ఛాయలేవీ ! ఆ రౌడీ  కుటుంబంలో   ఆడవాళ్ళుండరా ! ఓ  తల్లి  కన్నబిడ్డే  కదా  వాడు. ఆడవాళ్ళంటే అంత  నీచమైన  నికృష్టమైన  భావన  ఎలా  చోటు చేసుకుంటుందో  అర్ధం కావట్లేదు కౌసల్యకి.  చదువూ  చదువుకుంది.   ఉద్యోగమూ  చేస్తోంది  తను.  రెండు బస్సులు  మారి  వెళ్ళి రావాలి.  ఇంటికి  దూరం    బస్ స్టాపు.  ఆఫీసులో పని  అయ్యేసరికి  ఆలస్యమైందంటే ఇంటిదగ్గిర  బస్ దిగేసరికి  చిమ్మ చీకటే .  లోపలికి    సందులో  ఎక్కువే  నడవాలి.   వీధి దీపాలు  ఎప్పుడూ  ఉండవు.   చివరగా  ఓ మూలగా  విసిరేసినట్టుంది  ఇల్లు.  ఆతర్వాత ఇంక  ఇళ్ళులేవు.   ఉన్న నాలుగు  ఇళ్ళల్లోనూ  టీ.వీ. లు చూస్తూ  తలుపులు వేసేసుకుని ఎవరిలోకంలో వాళ్ళుంటారు.  తలుపులు  తెరుచుకుని   కూర్చోడానికి   ఇదేమన్నా గుప్తులకాలంనాటి   స్వర్ణయుగమా? ఇళ్ళ   వెనకాల  పెద్ద పెద్ద   తుప్పలు చెట్లు  బండరాళ్ళూ.  ఇళ్ళ ముందూ  అవే కనపడతాయి. రాత్రయితే  జీబురుమంటూ ఉంటుంది. పగలు  కూడా  సుమారుగా  అంతే.  ఏవున్నా  లేకపోయినా ఎవరున్నా లేకపోయినా  రౌడీలకీ  దొంగలకీ  కొదవలేదు కదా . అలాంటివాళ్ళకి  ఇలాంటి సందులు మరీ చులకన.   అందుకే  అప్పుడప్పుడు  తల్లితో  అంటూనే   ఉంటుంది  సమాజంలో  మృగాళ్ళు ఉన్నంతవరకూ ఆడవాళ్ళు  ఏం చదువులు చదువుకున్నా ఏం  ఉద్యోగాలు  చేసినా ఏవుంది  సంతోషం అని.  విని ఊరుకునేది కాదు  పద్మావతి. కూతురికి  ధైర్యం   చెప్పడానికి  శతవిధాల  ప్రయత్నం చేసేది.  రోజులు ఒక్కలా ఉండవులే  కాలం మారుతోంది అంటూ  చాలా  తేలిగ్గా  చెప్పేది.  కానీ ఆవిడకీ  మనసులో బిక్కుబిక్కుమంటూనే  ఉండేది.  ప్రతిపూటా  కూతురు  ఆపీసు నించి  ఇంటికి వచ్చేవరకూ హనుమాన్ చాలీసా  మనసులో  పఠిస్తూనే  ఉంటుంది.  కూతురి ఎదురుగా  బింకంగానే ఉంటుంది.  పిల్లకి సంబంధం  తొందరగా  కుదిరితే  బావుండునని  రోజుకి  వందసార్లు అనుకుంటూ  ఉంటుంది.  ఓ రోజు నవ్వుతూ  అడగనే  అడిగింది  కౌసల్య  తల్లిని.                                                               వెర్రిదానివమ్మా  నువ్వు .  నేను  ఇంటికి  చేరేదాకా  నువ్వు  ఆదుర్దా  పడుతూ ఉంటావు. రేపు  పెళ్ళయ్యాక  ఆ కట్టుకున్న వాడు   పడతాడు.  అంతేగా ! అంటే ఏమిటి ?  ఆడది బయటికెళ్తే  చీకటి పడిందంటే   ఇంట్లో  వాళ్ళు   ఎవరో  ఒకళ్ళు   ఆదుర్దా   పడుతూ   ఆందోళనతో   రక్తపోటు పెంచుకోవలసిందన్నమాటేగా ?   దీనికి  పరిష్కారం లేదా ? “  “ఎందుకు  లేదూ పరిష్కారం ? మన ఆడవాళ్ళం  మనసుల్లో  సున్నితత్వం  గుండెల్లో మొండిధైర్యం  జీవిత  చరమాంకం  వరకూ పెంచుకుంటూ  పోవాలి.  లేకపోతే  జీవించడం కష్టం.  సమస్యలున్నప్పుడు  వాటికి  తగ్గ   పరిష్కారాలూ ఉంటాయి.  అమలు పరచడంలో తెలివితేటలు  ఉపయోగించే  నేర్పు  సంపాదించాలి .”   “ అడవుల్లోకి  వెళ్తే  క్రూరమృగాలుంటాయి  కాబట్టి  అడవుల్లోకి  వెళ్ళద్దంటే  అర్ధం  ఉంది.  నగరాల్లో  వీధుల్లోకి  చీకటిపడితే  ఆడవాళ్ళు   వెళ్ళద్దంటే  మగవాళ్ళు   క్రూరమృగాలు  అని  అర్ధమా ? “  “అందరూ కాదే నా తల్లీ  కొంతమంది  రాక్షసులు కొన్ని క్రూరమృగాలు  నరరూపంలో వీధుల్లో  తిరగడం జరుగుతోంది. అటువంటివాళ్ళకి  భయపడుతోంది  ఆడది.  కానీ ఎన్నాళ్ళిలా  సాగాలి ? దీనికి  అంతం చూపించేందుకు  ఆడదే  ముందుకి రాక  తప్పదేమో !   వస్తుందిలే !  ఆడపిల్ల బ్రతుకులో  ఆ రోజు  తప్పక వస్తుంది. “  ఆమె మాటల్లో  ధ్వని    కంటే  నమ్మకం ఎక్కువగా  కౌసల్య హృదయాన్ని తాకింది. తల్లి   మాటలు  పదేపదే   గుర్తొస్తున్నాయి   కౌసల్యకి .  తనవెనకే  ఎవరో  వస్తున్న సవ్వడి  అయ్యింది. రోడ్డు   మీద  ఎవరూ  లేకపోయినా  భయమే.  తనుకాక  ఒక్కడే ఒక్కడు  మరొకడెవరైనా చుట్టుపక్కల ఉన్నా  భయమే. ఎలా  బతకాలి ? బస్సులో  నిలబడి  నిలబడి  వచ్చిన  నీరసం  రెట్టింపుగా అనిపిస్తోంది  భయంవల్ల .   నడక వేగం  పెంచాననుకుంది.  అబ్బే ! ఉత్తదే !   వెనకాల   అడుగులు కాస్త దగ్గరగా   వస్తున్నట్టనిపించింది.  ఎందుకైనా  మంచిదని  చున్నీ  ఒక వైపునించి  తల చుట్టూ ముసుగులా  వేసుకుంది.   వెనక్కి  తిరిగి  చూడాలంటే  వణుకు  పుడుతోంది. అసలెందుకు  చూడటం? కొరివితో  తల  గోక్కోవడమెందుకు ?   కావాలని  రోటిలో  తల దూర్చడమెందుకు ?   అయినా ఎంత చెప్పింది  తను  నాన్నగారికి   ఇలాంటి  చోట  ఇల్లు తీసుకోవద్దు అని. వింటేనా?  ఆయన గొడవ  ఆయనది మరి . అందులో   తప్పు ఎంచడానికి  లేదు. తక్కువ  సొమ్ములో  వచ్చేది ఆయన  తాహతుకి  తగ్గట్టు  చూసుకున్నారు.  మిగిలిన ఖాళీ స్థలాలన్నిటిలోనూ  ఇళ్ళు  లేచి చుట్టుపక్కల  కొన్ని  దుకాణాలవీ  వస్తే  గానీ   ఈ బిక్కు బిక్కుమంటూ  బతకడం  తప్పదు.  అన్నయ్య  ఉన్నాడు  కాబట్టి   చెట్టంత కొడుకు  ఉన్నాడన్న  ధైర్యంతో అప్పు  తీసుకుని మారుమూల శివార్లలో  ఉన్నా కూడా  ఈ ఇల్లు  కొనేసి  సొంత  ఇంట్లో  ఉన్నాము హాయిగా  అన్న సంతృప్తితోనూ అస్తమానం  సామాన్లు  సద్దుకుని   నెత్తిన   పెట్టుకుని ఇళ్ళు మారే  ప్రయాస  తప్పిందన్న సంతోషంతోనూ   ఉన్నారు   నాన్నగారు.  ఆలోచన్లలో  తల మునకలవుతూ  త్వరత్వరగా  నడుస్తున్న  కౌసల్యనోటిని   హఠాత్తుగా   వెనకనించి ఒకచెయ్యి  వచ్చి  గట్టిగా  మూసేసి  బలంగా చేతులు  రెండూ  నొక్కి పట్టేసుకుని  వెనక్కి  తిరిగే అవకాశం   ఏమాత్రం ఇవ్వకుండా   తుప్పల్లోకి లాక్కుపోతుంటే   శాయశక్తులా   పెనుగులాడుతోంది. గట్టిగా  అరుద్దామనుకుంటే  నోట్లోంచి  అసలు  శబ్దం  వస్తేగా ! తాగిన  మత్తులో తూలుతున్న ఆ వ్యక్తి    “ తొందరగా  రారా ! “  అంటూ పిలిచేదాకా వెనకాల ఇంకెవరో  వస్తున్నట్టు   తెలియదు కౌసల్యకి.  తెలిసిన మరుక్షణం  భయాందోళనలతో  వణికిపోతూనే  బలాన్ని పుంజుకోక తప్పదన్న నిర్ణయానికి  వచ్చింది.  “ఎక్కడికితీసుకొచ్చావు?  ఎక్కడున్నాంఇప్పుడు?  నాకేమీ తెలియట్లేదు. “మత్తు మత్తుగా మాట్లాడుతున్న  ఆ  గొంతు  విని  తనకొచ్చిన సందేహానికి  తనని తనే  తిట్టుకుంది  అంత  దుర్భర పరిస్థితిలో కూడా.  “ఈ సందులో  చీకట్లో   ఒంటరిగా  పోతున్న   ఈఅమ్మాయిని  వదిలేసి  ఎక్కడికో  మనం  తిరగడానికి  ఎందుకెళ్ళడం   అనిపించి  ఇటువైపు  మళ్ళాను.  తొందరగా  రావయ్యా  బాబూ ! ఎవరూ  టువైపు  రాకముందే.  “చిరాకు తొణికిసలాడింది  కౌసల్యని   బలవంతంగా  లాక్కుపోతున్న   వ్యక్తి గొంతులో.   “ వస్తున్నా  వస్తున్నా “ వెనకనించి  సమాధానం. తన  సందేహం తీరిపోయినట్టనిపించింది  కౌసల్యకి.  తల్లి  ఆవిడ  మనసులో ఎన్నెన్ని భయాలు  పడేదో  ఏఏ   దేవుళ్ళకి  మొక్కుకుంటూ  ఉండేదో  ఆ లెక్కాపత్రాలు  తనకి తలియదుగానీ  ఆవిడ తనకి  ప్రతి రోజూ  జీవితమ్మీద ఆసక్తి  కలిగిస్తూ  ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నాలు  చేయడం  మాత్రం  తెలుసు.   ఆ  ప్రయత్నాన్ని  తను  వమ్ము చెయ్యకుండా  నిలబడాలి.  ఔను.  ఆ బలం ఎక్కడినించో కాదు  అమ్మ పలుకుల నించే  వచ్చింది  అందుకే   తనని పట్టుకున్న వ్యక్తిని చేతిమీద  కొరకడమే  కాదు  ఆదిశక్తిలా  అపరకాళిలా  కాళ్ళతో  ఎడాపెడా  తన్ని  పడేసింది.  రాళ్ళమీద రక్తమోడుతూ  పడ్డాడు. తూలిపోతూ  మెల్లిగా వచ్చి  వెనకనించి  తన భుజమ్మీద  చెయ్యి  వేసిన  వ్యక్తి మొహమ్మీద  ఛీత్కరించి  ఉమ్మేసింది.   “ నువ్వా ? “  తుళ్ళిపడి  ఒక అడుగు  వెనక్కి వేశాడతను దగ్గరనించి  చూశాక.                              “ఏం? నేను కాక వేరే అమ్మాయి అయితే మాత్రం  ప్రాణమున్న మనిషికాదా ! ఆటబొమ్మనుకుంటున్నావా?  ఆడపిల్లల  మానప్రాణాలతో   ఆడుకునేవాడికంటే   అడవిలోని క్రూరజంతువులు  నయంరా  నికృష్టుడా !  నువ్వు  నా  అన్నయ్యవని  నేను నీ   చెల్లెలినని చెప్పుకోడంకంటే   దౌర్భాగ్యం  ఇంకొకటి  లేదు  నాకు. చెట్టంత కొడుకున్నాడని   గుండెలమీద చెయ్యివేసుకుని  నిద్ర పోయే  నీ  తండ్రి  గుండెలమీద తన్నే పనులు  చేస్తున్నావని  తెలిసి తీరాలి ఆయనకి.  ఇంట్లో వాళ్ళ  కళ్ళు కప్పి నీలాంటివాళ్ళు  చేసే పనులు  బయటపడకపోవు. నిన్ను నేనే పోలీసులకి అప్పచెప్తాను. నడు. “    అదిరిపోయాడు  అన్నయ్య . కాదుకాదు  ఆ రూపంలో   ఉన్న నరరూపరాక్షసుడు.  చీమ  చిటుక్కుమంటే  భయపడే  ఆడపిల్ల  అవసరమైతే   ఆదిశక్తి   కాగలదు.   ఓర్పు సహనం వహిస్తుంటే  ఓడిపోయిందనుకున్న   మొగవాడు   తెలివితక్కువవాడు.  - తమిరిశ జానకి

మిత్రద్రోహం

మిత్రద్రోహం   అనగా అనగా ఒక ఊళ్లో ఒక కోతి, పిల్లి, ఎలుక ఉండేవి. సాధారణంగా పిల్లికి ఎలుకకు పడదు కదా! కానీ ఈ‌ పిల్లి-ఎలుకలు మాత్రం మంచి మిత్రులు. ఊరి చివరన, అడవికి దగ్గరలో ఇళ్లు కట్టుకున్నాయి అవన్నీ. రోజూ మూడూ కలిసి అడవికి వెళ్ళేవి; వేటికవి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకునేవి; ఆనందంగా కాలం గడుపుతూండేవి. అయితే ఒకసారి ఎండాకాలం, వానలు అస్సలు పడలేదు. అడవంతా ఎండిపోయింది. పిల్లి, ఎలుకలకు పరవాలేదు గానీ, కోతికి మాత్రం అక్కడ జీవించటం కష్టం అయ్యింది. కోతి కష్టాన్ని గమనించినై, ఎలుక- పిల్లి .  ఒకరోజున, కోతి వింటుండగా అవి రెండూ మాట్లాడుకున్నాయి-"నాకు ఇక్కడ ఆహారం సరిగ్గా దొరకటం లేదు. పట్నానికి పోతే బాగుండుననిపిస్తున్నది" అన్నది పిల్లి. "నాకూ సమస్యగానే ఉంది; నేనూ వస్తాను" అన్నది ఎలుక. కోతి మాత్రం ఏమీ మాట్లాడలేదు. దానికీ వెళ్ళాలనిపించింది చాలాసార్లు. అయితే ఆ సంగతి చెబితే పిల్లి-ఎలుక ఏమంటాయో అని అది వాటితో ఇంతవరకు ఆమాట అనలేదు. "నువ్వేమంటావు?" అడిగాయి పిల్లి-ఎలుక. "కొంచెం ఆలోచించి చెబుతాను" అన్నది కోతి. మరునాడు కోతి తన నిర్ణయాన్ని ప్రకటించింది: "నేను పట్నానికి వెళ్తున్నాను" అని. ఎలుక, పిల్లి చాలా సంతోషించాయి.    అయితే వాటి మనసు చివుక్కు మన్నది- "మీరు వస్తున్నారుగా?!" అని మాట వరసకైనా అడగలేదు కోతి. అయినా "ఇంత కాలం కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు మాత్రం విడిపోయేదెందుకు?" అనుకొని, పిల్లి-ఎలుక కూడా కోతి వెంట పట్టణానికి బయలు దేరాయి. ఇంకా పట్టణం చేరకనే, దారిలో కోతికి ఒక బంగారునాణెం దొరికింది. పిల్లి-ఎలుకలకు ఆ నాణెం విలువ తెలీదు గానీ, కోతి చాలా తెలివైనది- "ఇది మీకేమీ పనికి రాదులే, నేను ఉంచుకుంటాను దీన్ని" అని అది అంటే, "దానిదేముంది, నువ్వే ఉంచుకో. దీంతో ఏం చెయ్యాలో‌ మాకేం తెలుసు?" అన్నాయి పిల్లి-ఎలుక. కోతి ఆ బంగారు నాణాన్ని పట్టణంలో అమ్మి చాలా డబ్బులు సంపాదించింది. ఒక్కసారిగా వచ్చిన పెద్ద మొత్తంతో వెనువెంటనే అది కాస్తా షావుకారు అయ్యింది. కోతి వెంట వచ్చిన పిల్లి-ఎలుక అక్కడికి దగ్గర్లోనే వేరే ఎవరి ఇంట్లోనో జీవించటం మొదలు పెట్టాయి. ఆ యింటి వాళ్ళు దయ తలచి పిల్లికి ఇంత అన్నం‌ పెడితే అది దాన్ని ఎలుకతో పంచుకొని తినటం మొదలు పెట్టింది. పట్నం వచ్చాక, కోతి ఇక పిల్లి-ఎలుకలకేసి చూడనే లేదు. తనకు వచ్చిన డబ్బుతో పెద్ద ఇల్లు కట్టి, చుట్టూ కంచె వేసింది అది! ఒకసారి పిల్లి-ఎలుక కోతిని చూడడానికని వెళ్ళాయి. కోతికి వాటిని చూస్తే చికాకు అనిపించింది. వాటిమీద కోపం చేసుకొని, నిష్కారణంగా వాటిని కట్టెతో కొట్టి తరిమేసిందది! దాంతో ఆ చుట్టుపక్కల ఎక్కడా కనబడకుండా వెళ్ళిపోయిన పిల్లి-ఎలుక త్వరలోనే పట్నాన్ని ఏవగించుకున్నాయి. కొన్నాళ్ళకు రెండూ బయలుదేరి తిరిగి పల్లెను చేరుకుని, అడవికి పోయి స్వేచ్ఛగా బ్రతకటం మొదలు పెట్టాయి.    ఇక అక్కడ, పట్నంలో కోతికి ఒక నక్క దొరికింది. ముద్దు ముద్దుగా మాట్లాడి కోతిని బుట్టలో వేసుకున్నది నక్క. కోతి దాన్ని నమ్మి, అదేదో గొప్ప తెలివైనది అనుకున్నది. దానితో స్నేహం చేసింది. కొంత కాలానికి, కోతి తనను గుడ్డిగా నమ్ముతోంది అని తెలియగానే, నక్క కోతిని మోసగించింది: కోతి దాచుకున్న డబ్బునంతా అది ఒక్క పెట్టున ఎత్తుకెళ్ళి-పోయింది! డబ్బు ఉన్నంత వరకూ కోతిని గౌరవించిన పట్నం వాళ్ళు, ఇప్పుడు 'దాని దగ్గర డబ్బు లేదు' అనగానే చిన్నచూపు చూడటం మొదలు పెట్టారు. రాను రాను పట్నంలో బ్రతకటం దుర్భరం అయిపోయింది కోతికి. అప్పుడు గానీ దానికి పాత మిత్రులైన పిల్లి-ఎలుక గుర్తు రాలేదు. అయితే అది ఎంత వెతికినా పట్నంలో పిల్లి-ఎలుక కనిపించలేదు. చివరికి మిత్రులకోసం అది పల్లెకు బయలుదేరి పోయింది! అక్కడ సంతోషంగా జీవిస్తున్న పిల్లి ఎలుకల్ని చూసే సరికి దాని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వాటి దగ్గరకు వెళ్ళి 'క్షమించండి ' అని వేడుకుంది.  అప్పటినుండి మళ్ళీ కోతి, పిల్లి, ఎలుకలు మూడూ స్నేహితులైపోయాయి. ఆ సరికి వానాకాలం కూడా వచ్చేసింది; అడవి బాగా తయారైంది; దాంతో మూడూ అడవిలో తమకు కావలసిన ఆహారం సంపాదించుకుంటూ సుఖంగా బ్రతికాయి. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

పిసినారి పుల్లయ్య

పిసినారి పుల్లయ్య     ఒక ఊళ్లో ఓ పిసినారి పుల్లయ్య ఉండేవాడు. అతను ఎవ్వరికీ ఏదీ ఇచ్చేవాడు కాదు. ఎప్పుడూ 'ఎట్లా పైసలు మిగల బెట్టాలా' అనే ఆలోచించేవాడు. అతని పిసినారితనం చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయేవాళ్ళు. అట్లాంటి పిసినారి పుల్లయ్య కూడా సంవత్సరానికి ఒకసారి పండగరోజున దేవుడికి ఒక టెంకాయ కొట్టేవాడు. ఒకసారి అట్లాంటి పండుగ వచ్చింది. టెంకాయ కావాలి. పుల్లయ్య తమ ఊళ్ళోని దుకాణానికి వెళ్ళి "టెంకాయ ఎంత?" అని అడిగాడు. "నాలుగు రూపాయలు" అన్నాడు దుకాణదారు. "మూడు రూపాయలకు ఇస్తావా?" అడిగాడు పుల్లయ్య. పుల్లయ్య తత్వం తెలిసిన దుకాణదారు నవ్వాడు. "మన ఊళ్ళో అంతటా నాలుగు రూపాయలేనయ్యా! ప్రక్క ఊర్లో మూడు రూపాయలకు దొరకచ్చు చూడు" అన్నాడు. పుల్లయ్యకు ఆ ఆలోచన నచ్చింది. తను నడుచుకుంటూ ప్రక్క ఊరికి వెళ్ళాడు- "టెంకాయ ఎంత?" అంటే అక్కడి దుకాణదారు "మూడు రూపాయలు" అన్నాడు. "రెండు రూపాయలకు ఇచ్చెయ్యరాదూ?" అన్నాడు పుల్లయ్య, అలవాటుగా. దుకాణంవాడు పుల్లయ్యకేసి వింతగా చూస్తూ-"ఆ ధరకి ఇక్కడ రాదు- మూడు ఊళ్ళ అవతల రామాపురంలో ఉంది ఆ రేటు" అన్నాడు. పుల్లయ్యకు డబ్బులు ఎక్కువ పెట్టేందుకు మనసు రాలేదు. రామాపురం బయలు దేరాడు. తీరా రామాపురం చేరే సరికి మధ్యాహ్నం దాటింది. "రెండు రూపాయలకు ఒక టెంకాయ!" అరుస్తున్నారు అక్కడి వ్యాపారులు. పుల్లయ్య వాళ్ల దగ్గరికి వెళ్ళి- "ఒక రూపాయికి ఇవ్వరాదూ?" అని అడిగేశాడు."నువ్వెవరో పిసినారి పుల్లయ్యలాగే ఉన్నావే!? ఇంతకంటే‌ తక్కువ ధరకి కావాలంటే లక్ష్మీపురం తోటకి పోవాల్సిందే" అన్నారు వాళ్ళు. పుల్లయ్య అక్కడి నదిని దాటి, సాయంత్రంకల్లా లక్ష్మీపురానికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న తోటకు చేరుకున్నాడు. అతను అక్కడికి వెళ్ళేసరికి తోట యజమాని క్రింద నిలబడి ఉన్నాడు. పనివాళ్ళు చెట్లెక్కి కొబ్బరికాయలు కోసి, క్రింద కుప్ప చేస్తున్నారు.  "ఒక రూపాయికొక కొబ్బరికాయట కదా, మీ దగ్గర?" అడిగాడు పుల్లయ్య. "అవును-మీకు ఎన్ని కావాలి?" అడిగాడు తోట యజమాని. "ఊరికే ఇవ్వచ్చుకదా, ఒక కొబ్బరికాయకు ఒక రూపాయా, మరీ దురాశ కాకపోతే?!" అన్నాడు పుల్లయ్య. "మీదే ఊరు?" అని అడిగి తెలుసుకుని, "మీ ఊళ్ళో పుల్లయ్యగారని ఎవరో ఉన్నారటనే?" అన్నాడు తోట యజమాని. "నేనే ఆ పుల్లయ్యని!" అన్నాడు పుల్లయ్య, 'తన ఖ్యాతి ఇంత దూరం వ్యాపించిందే' అని సంతోషపడుతూ. తోటయజమాని నవ్వాడు. "ఓహో మీరేనన్నమాట! మీఅంతటివారు శ్రమపడి ఇంత దూరం నడిచి వచ్చారు; అందులోనూ దేవుడికి అంటున్నారు; ఊరికే కావాలంటున్నారుగా, చెట్టెక్కి కోసుకోండి ఎన్ని కావాలంటే అన్ని! క్రిందివి కావాలంటే మటుకు రూపాయికొకటి!" అన్నాడు. పుల్లయ్యకు చెట్టు ఎక్కటం రాదు. అలాగని రూపాయి ఇచ్చి కొబ్బరికాయ కొనుక్కునేందుకు మనసొప్పలేదు కూడాను. "చెట్టెక్కుతాను-ఆమాత్రం‌ నేర్చుకోలేనా?" అనుకున్నాడు. చాలా శ్రమపడి, నిక్కుతూ నీల్గుతూ అంత పొడుగున్న కొబ్బరి చెట్టెక్కేశాడు పుల్లయ్య. ఆలోగా అతని కాళ్ళూ, చేతులూ గీసుకుపోయి రక్తం కారసాగింది. అయినా డబ్బు ఖర్చులేకుండా కొబ్బరి కాయ వచ్చేస్తుందన్న ఆశ అతన్ని చెట్టెక్కించింది. చెట్టెక్కాక పుల్లయ్యకు అనిపించింది- "ఒక్క కాయే ఎందుకు? ఓ బస్తాడు కోసుకుంటే పోలేదూ?" అని. అట్లా ఒక మూడు నాలుగు కాయలు కోసి పంచెలో వేసుకున్నాడు. ఆ హడావిడికో, మరి టెంకాయల బరువు మోయలేకనో, మరి- పుల్లయ్య పంచె కాస్తా జారిపోయింది! అయినా పట్టువదలని పుల్లయ్య చేతులు వదిలి పైన ఉన్న కొబ్బరి కాయను పట్టుకోబోతూ, ఒక్కసారిగా క్రిందికి చూశాడు- ఎప్పుడూ ఎక్కనంత ఎత్తు! అంత ఎత్తునుండి చూసేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగాయతనికి! అంత ఎత్తునుండి పట్టు తప్పి క్రిందపడిపోయిన పుల్లయ్యకు నడుం విరిగింది! అటుపైన డాక్టరు ఖర్చులు వంద రూపాయలు దాటాయి! 'గోటితో పోయేదానికి గొడ్డలి' అంటే ఇదేనేమో!  

చీమ - అగ్గిపుల్ల

చీమ - అగ్గిపుల్ల     అనగా అనగా ఒక చీమ ఉండేది. వాళ్ల అమ్మను అది రోజూ అడుగుతూ ఉండేది- "అమ్మా, పిన్నమ్మ వాళ్ళ ఇల్లు ఎంత దూరం?"అని. అడిగితే, వాళ్ళ అమ్మ "చాలా దూరం" అనింది. "మరి, తాత వాళ్ళ ఇల్లు ఎంత దూరం?" అని అడిగితే "చాలా దూరంరా, కన్నా!" అని అమ్మ చీమ బదులిచ్చింది.  "ఓహో! మరి సూర్యుడు ఎంత దూరం అమ్మా?" అని అడిగితే అమ్మ చీమ అన్నది- "చాలా చాలా దూరంరా బుజ్జీ!" అని అనింది. అయితే 'చాలా దూరం' అంటే ఎంతో చిన్నారి చీమకు అర్థం కాలేదు. 'చాలా చాలా దూరం' అంటే ఇంక ఏమాత్రమూ అర్థం కాలేదు. కానీ అర్థం చేసుకోవాలని గట్టిగా అనుకుంది అది.  అప్పుడు ఇంక చిన్నారి చీమ ఒక అగ్గి పుల్లను తీసుకుంది. దాంతో కొలుచుకుంటూ వాళ్ళ పిన్నమ్మ ఇంటికి వెళ్ళింది. దాంతో 'చాలా దూరం' అంటే ఏంటో కొంచెం కొంచెం అర్థం అయింది దానికి.  చాలా నడిచింది కదా, దానికి బాగా కాళ్ళు నొప్పులు పుట్టాయి. పిన్నమ్మ పెట్టింది తిని, కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని, అక్కడి నుండి మళ్ళీ అగ్గిపుల్లలతో కొలుచుకుంటూ‌ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది.  తాత ఇల్లు చేరుకునేసరికి చిన్నారి చీమకు 'చాలా దూరం ' అంటే ఏమిటో బాగా అర్థమైపోయింది.    తన ఇంటి నుండి పిన్నమ్మ ఇంటికి '9 అగ్గిపుల్లల దూరం' అని, అక్కడినుండి తాత ఇల్లు '13 పుల్లల దూరం' అని తేల్చింది.  'చాలా దూరం' అంటే దానికి బాగా అర్థమయ్యేసరికి, 'చాలా చాలా దూరం' అంటే ఏంటో సులభంగా ఊహించుకోగలిగింది అది. సొంత ప్రయత్నంతో చిన్న విషయాల్ని బాగా అర్థం చేసుకుంటే, పెద్ద విషయాలుకూడా సులభంగా తెలుస్తాయని చిన్నారి చీమకు బాగా వంటపట్టింది  

తోలు తిన్న కుక్కలు

తోలు తిన్న కుక్కలు     బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో బోధిసత్వుడు ఒకసారి ఒక కుక్కగా జన్మించాడు. బలంగా, నిండుగా ఉండిన ఆ కుక్క, వందలాది కుక్కలకు నాయకుడిగా ఉండేది. వాటి దండు అంతా నగరంలోని పెద్ద స్మశానంలో నివసించేది. ఒకనాడు రాజుగారు ఎప్పటి మాదిరే తెల్లటి గుర్రాలతో పూన్చిన రథం ఎక్కి నగర సంచారం చేసి, సాయంత్రం చీకటి పడుతుండగా తిరిగి వెనక్కి చేరుకున్నాడు. ఆయన ఎక్కి వచ్చిన రథాన్ని రాజ ప్రాసాదం బయటనే నిలిపి ఉంచారు భటులు. గుర్రాలకు వేసే జీను, కళ్లాలు మొదలైన తోలు వస్తువులన్నీ రథంతో పాటు అక్కడే ఉండిపోయాయి. ఆ రోజు రాత్రి వాన కూడా కురిసింది; దాంతో అవన్నీ బాగా నానాయి. రాజుగారి కోటకి ఒక వైపున, గోడ మధ్యలో సన్నని సందు ఉండేది. చీకటిపడ్డాక, ఊళ్లో కుక్కలు కొన్ని ఆ సందులో నుండి కోట లోపలికి దూరి, ఆహారాన్ని వెతుక్కునేందుకు అలవాటు పడ్డాయి. అయితే రాజుగారి రథం ఆలస్యంగా కోటలోకి పోవటాన్ని, ఆపైన వాన పడటాన్ని గమనించిన బోధిసత్వుడు తోటి కుక్కలతో "ఒరే! ఇవాళ్ల రాజుగారు ఆలస్యంగా ఇల్లు చేరారు. పనివాళ్ళు ఆయన వస్తువుల్ని వేటినో బయటనే వదిలిపెట్టి ఉండొచ్చు. దానికి తోడు ఇవాళ్ల వాన కూడా పడింది- కాబట్టి నేను చెబుతున్నాను; ఈ రోజున మీరెవరూ కోటలోకి పోకండి- పోతే ప్రమాదం!" అని, బయటి కుక్కలేవీ ఆ రోజున కోటలోకి పోకుండా అడ్డుకున్నాడు. అయితే కోట లోపల కాపలా ఉండే రాజుగారి ఆస్థాన కుక్కలకు అడ్డు ఏమున్నది? అవి యదేచ్ఛగా తిరుగుతూ, రాజుగారి రథానికి తగిలించి ఉన్న జీనులు, కళ్లాలు, రథపు మెత్తలు మొదలైన తోలు వస్తువులను అన్నిటినీ రాత్రంతా నమిలి, ముక్కలు చేసి ఎంచక్కా తిని పోయాయి! తెల్లవారాక రథపు దుర్దశను గమనించిన భటులు నాలుకలు కొరుక్కొని, "మహా ప్రభూ! ఊరి కుక్కలు దొంగతనంగా లోనికి ప్రవేశించి, దొరికిన వస్తువునల్లా పాడు చేస్తున్నాయి. నిన్నటి రాత్రి తమరి రథాన్ని కూడా తుక్కు తుక్కు చేశాయి" అని ఫిర్యాదు చేశారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. వెంటనే "కనిపించిన ఊరకుక్కనల్లా చంపేయండి" అని ఆదేశించాడు. వెంటనే భటులు ఊరంతా తిరుగుతూ కనిపించిన కుక్కనల్లా వలలతో బంధించి, వధ్యశాలకు తీసుకుపోవటం మొదలుపెట్టారు. వాళ్ల చేతికి ఇంకా చిక్కని ఊర కుక్కలన్నీ బోధిసత్వుడుండే స్మశానానికి చేరుకొని, "అయ్యా! తమరు ముందుగానే హెచ్చరించారు కదా, ఆ ప్రకారమే మేం ఎవ్వరమూ నిన్నటి రాత్రి కోటలోకి అడుగు పెట్టలేదు. అయినా 'తన రథపు తోలు వస్తువులన్నీ నమిలివేసింది మేమే' అన్న అనుమానంతో రాజుగారు మమ్మల్ని అందరినీ చంపేందుకు సమకట్టారు. భటులు ఊరకుక్కల్ని వందల సంఖ్యలో పట్టుకొని పోతున్నారు. మన జాతికి పెను విపత్తు వాటిల్లింది. మీరే ఏదైనా చేయాలి" అని మొరపెట్టుకున్నాయి.     "బయటి కుక్కలేవీ లోనికి పోలేదు- కాబట్టి ఈ పని చేసింది ఖచ్చితంగా కోటలో ఉన్న రాజుగారి కుక్కలే. అసలైన నేరస్థులు సుఖంగా ఉండగా, అమాయకులైన జీవులకు శిక్ష పడుతున్నది. ఇది తప్పు. నేరస్థులను రాజుకు పట్టించి, అమాయకుల ప్రాణాలను కాపాడుతాను" అని నిశ్చయించుకున్నాడు బోధిసత్త్వుడు. "భయపడకండి. మీరంతా నేను తిరిగి వచ్చేవరకూ ఇక్కడే ఉండండి" అని వాటి పట్ల కరుణతో నిండిన చిత్తంతో, పది రకాలైన చైతన్యాలను స్మరించుకొని, బోధిసత్వుడు ఒక్కడే- నగర వీధులగుండా నడుస్తూ- రాజు మందిరం చేరుకున్నాడు. బోధిసత్వుని ఉన్నత ఆశయానికి అనుగుణంగా దారిలో ఏ భటుడూ అతనిపై చేయి ఎత్తలేదు. బోధిసత్వుడు నేరుగా రాజసభకు చేరి, అక్కడ కొలువుదీరిన బ్రహ్మదత్తుడి ముందుకు పోయి నిలబడ్డాడు. అతన్ని అడ్డుకునేందుకు అక్కడ చేరిన వారెవ్వరికీ చేతులు రాలేదు. బోధిసత్వుడు రాజుకు నమస్కరిస్తూ, మానవ స్వరంతో "ఓ రాజా! ఊళ్లోని కుక్కలన్నిటినీ చంపమని ఆదేశించింది నువ్వేనా?!" అని అడిగాడు. "అవును-నేనే!" అన్నాడురాజు.   "అవి చేసిన నేరం ఏమిటి?"   "నా రథాన్ని అవి పాడు చేసాయి"  "ఆ పని చేసిన కుక్కలు ఏవో నీకు స్పష్టంగా తెలుసా?"  "లేదు- తెలీదు"  "అయితే మహరాజా! అసలు నేరస్థులు ఎవరో తెలీకుండానే, కనపడిన ప్రతి ఊరకుక్కనల్లా చంపమనటం ధర్మం కాదు" "కుక్కలు నా రథాన్ని పాడుచేసాయి, కాబట్టి కుక్కలన్నింటినీ నిర్మూలించమని నేను ఆజ్ఞాపించాను" "తమరి భటులు అన్ని కుక్కల్నీ చంపుతున్నారా, లేక కొన్నింటిని వదిలి పెడతారా?" "మా రాజప్రాసాదంలోని మేలు జాతి కుక్కల్ని తప్ప, మిగిలిన వాటినన్నింటినీ భటులు నిర్మూలిస్తారు" "రాజా! 'కుక్కలు నేరం చేసాయి, కాబట్టి వాటిని అన్నింటిని నిర్మూలించాలి' అని పూనుకున్న మీరు, ఆ తర్వాత 'మా ప్రాసాదం లోపల ఉండే కుక్కల్ని మటుకు బ్రతకనిస్తాను' అనటం తప్పు కదా?! 'పక్షపాతం, అయిష్టం, అజ్ఞానం, భయం’- అనే నాలుగు అధర్మ మార్గాలకూ మీ ఆలోచన దోహదం చేస్తున్నది. అటువంటి నిర్ణయాలు తప్పు. రాజులకి తగినవి కావు. న్యాయ నిర్ణయం చేసేటప్పుడు. తక్కెడపైన ముల్లు మాదిరి- రాజు స్థిరంగా, పక్షపాత రహితంగా నిలవాలి. కాని మీ ఈ నిర్ణయం అమాయకులైన కుక్కలకు విపత్కరంగా మారటమే కాక, అసలు తప్పు చేసిన వాటిని పూర్తిగా వదిలి వేస్తూన్నది" అన్నాడు బోధిసత్వుడు గంభీరంగా. "ఇతనెవరో కుక్క వేషంలో వచ్చిన బోధిసత్వుడే తప్ప మరొకడు కాదు" అని నిశ్చయించుకున్న రాజు, గౌరవ పురత్సరంగా సింహసనం దిగి నిలబడుతూ "అయ్యా! మీరు చెప్పిన మాటలు యుక్తియుక్తంగా ఉన్నాయి. కానీ ఒక సంగతి చెప్పండి- మాకు ఇలా నష్టం కలిగించిన కుక్కలు ఏవో మీకు తెలుసా?" అన్నాడు. "రాజా! నా సలహాను అనుసరించి, బయటి కుక్కలేవీ నిన్నటి రోజున మీ కోటలోకి ప్రవేశించలేదు. కాబట్టి ఈ పనిని చేసింది మీరు పెంచుకునే మేలుజాతి కుక్కలే తప్ప వేరు కాదు. అయినా ఊహలు అవసరం లేదు. ఈ ఊరి చెరువుల్లో ఏపుగా పెరిగే 'కుశ'గడ్డిని, చిలికిన మజ్జిగను తెప్పించారంటే, వాస్తవం ఏంటో మీకు తెలిసేటట్లు చేస్తాను" అన్నాడు బోధిసత్వుడు. రాజుగారి ఆదేశాన్ని అనుసరిస్తూ, మహల్‌లోని కుక్కలన్నింటినీ అక్కడికి తెచ్చి, వాటిచేత ఆ గడ్డిని నమిలించి, మజ్జిగ త్రాగించారు భటులు. దాని ప్రభావం వల్ల అవన్నీ వాంతులు చేసుకున్నాయి.  ఆ వాంతుల్లో అవి నమిలిన తోలు ముక్కలు, ఇంకా అరగకుండా ఉన్న ఇతర పధార్థాలు అన్నీ బయటపడ్దాయి! తన తప్పును గుర్తించిన రాజుగారు సిగ్గుతో తలవంచుకొని, బోధిసత్వుడికి చేతులు జోడిస్తూ, "తమరు నా కళ్లు తెరిపించారు. అజ్ఞానంతో ఘోరమైన పాపం మూట కట్టుకునే వాడిని" అంటూ రాచరికానికి గుర్తుగా తాను ధరించే ఛత్రాన్ని బోధిసత్వుడికి సమర్పించుకున్నాడు. "రాజులు న్యాయాన్ని, ధర్మాన్ని నిలపాలి. అందుకుగాను పక్షపాత రాహిత్యాన్ని, సునిశిత బుద్ధిని, కరుణను ఆశ్రయించాలి" అంటూ బోధిసత్వుడు ఐదు రకాలైన ధర్మ సూత్రాలను రాజుకు ఉపదేశించాడు. అటుపైన రాజు "ప్రాణులన్నింటినీ కాపాడటం మనుషుల ధర్మం" అని, "కుక్కలు మొదలైన జీవులకు తగినంత ఆహారాన్ని మనుషులే ఇవ్వాలి" అనీ ఆదేశించాడు. జీవితాంతం రాజధనాన్ని 'దాన-దయా-శీల' కార్యకలాపాలకోసం, మంచిని పెంచే ఇతర కార్యక్రమాలకోసం వెచ్చించాడు. బోధిసత్వుడు కూడా చాలా ముసలితనం వచ్చేవరకు ఆ శరీరంలో ఉండి, అటుపైన తన కర్మలకు తగిన లోకాలకు చేరుకున్నాడు.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

మతి మరుపు

మతి మరుపు   కొత్తపల్లిలో ఉండే కళ్యాణ్‌ కు మతిమరుపు. అతని భార్య బయ్యమ్మకు కూడా మతిమరుపే. వాళ్ల మతిమరుపు గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఒకసారి బయ్యమ్మకు తన మతిమరుపుతో విసుగు వచ్చేసి, "ఇగో, ఏదో ఒకటి చెయ్యప్పా, నాకు ఈ మతిమరుపుతో చానా కష్టంగా ఉంది" అంది. "ఏం చెయ్యమంటావో చెప్పు, నాకు గుర్తుంటే చేస్తాను" అన్నాడు కల్యాణ్. సరిగ్గా ఆ సమయానికి వాళ్ళ ఇంటి గుమ్మం ముందునుండి పోతున్నది ఒక గాడిద. "గాడిద పాలు త్రాగితే మతిమరుపు నయం అవుతుంద"ని ఎవరో చెప్పినట్లు గుర్తొచ్చింది బయ్యమ్మకు. "నాకు గాడిద పాలు తెచ్చి పెట్టు" అంది. "సరే" అని కల్యాణ్ గాడిద కోసం ఊరంతా తిరగటం మొదలెట్టాడు. అయితే గాడిదలన్నీ‌ రేవు చేరాయో ఏమో, వాడికి ఒక్క గాడిద కూడా కనిపించలేదు ఊళ్ళో. చివరికి వాడు వాళ్ళ ఊరి ప్రభుత్వ ఆసుపత్రిలో నెంబరు తీసుకొని, లైన్‌లో నిలబడ్డాడు. వాడి నెంబరు వచ్చాక డాక్టరుగారు అడిగారు- "ఏంటి, నీ సమస్య?" అని. "నాకు ఏమీ గుర్తుండట్లేదు" అన్నాడు కల్యాణ్, కొంచెం సేపు ఆలోచించి.   "మతిమరుపు మందులు సప్లై ఉండవప్పా, బలానికి ఏదైనా టానిక్ ఇమ్మంటే ఇస్తాను" అన్నాడు డాక్టరు. "మరి గాడిద పాలు?" అనేసాడు అకస్మాత్తుగా ఆ సంగతి గుర్తొచ్చిన కల్యాణ్. "దేవుడా! నీకు నిజంగానే మతిమరుపు మందులు కావాలి. కానీ పాలు మాత్రం ఆసుపత్రిలో అమ్మరు నాయన్నా! పోయి పొలాల్లో పనిచేసే రైతుల్ని అడుగు!" అని చెప్పి పంపాడు డాక్టరు గారు. కల్యాణ్ మళ్ళీ మర్చిపోతానేమోనని భయం కొద్దీ "గాడిద పాలు-గాడిద పాలు" అని మంత్రం చదువుకుంటూ రైతుల దగ్గరికి పోయాడు. రైతులు నవ్వి, "పాలన్నీ‌ ఇప్పుడు డైరీలోనేనప్పా, ఉండేది" అని వాళ్ల దగ్గరికి పంపారు. కల్యణ్ పాలవాడి దగ్గరికి వెళ్ళి పది లీటర్ల గాడిద పాలు కావాలన్నాడు. అప్పుడు ఆ పాలవాడు కల్యాణ్‌నే ఎగాదిగా చూస్తూ "ఇదేదో మంచి బేరమే! ఎవరైనా ఆవుపాలో, మేకపాలో అడుగుతారు. వీడికి గాడిద పాలు కావాలట!" అని అనుకొని, "అవి చాలా రేటు. లీటరు రెండొందల వరకూ‌ ఉంటుంది!" అన్నాడు. "సరేలే, అవేవో నాకు దొరికితే చాలు! ఒక ఐదు లీటర్లు కానివ్వు" అంటూ కల్యాణ్ వాడికి వెయ్యి రూపాయలిచ్చాడు. "ఇక్కడే వుండు, నేను పోయి తెచ్చిస్తాను నీకు!" అని చెప్పి, వాడు తనకు తెల్సిన చాకలి వాని దగ్గరికి పోయి లీటరు గాడిద పాలు కొని, వాడికి వందరూపాయలు ఇచ్చి వచ్చాడు. "ఈ లీటరు గాడిద పాలకు నాలుగు లీటర్లు అవుపాలు కలుపుతాను" అనుకున్నాడు వాడు. అయితే పాలని చూడగానే ఎగిరి గంతేసిన కల్యాణ్ వాడికి ఆ అవకాశం ఇవ్వనే లేదు. ఆ లీటరు పాలూ పట్టుకొని, పాలవాడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇల్లు చేరుకున్నాడు. తనకు అదనంగా నాలుగు లీటర్ల ఆవుపాలు మిగిలినందుకు పాలవాడు కూడా సంతోషపడి, ఊరుకున్నాడు. అయితే ఆ సరికి బయ్యమ్మ తను గాడిద పాలు తెమ్మన్న సంగతి మరచే పోయింది. కల్యాణ్ కూడా తను తెచ్చింది గాడిద పాలు అని మరచే పోయాడు. ఇద్దరూ కలిసి ఆ పాలతో టీ పెట్టుకొని త్రాగారు!   తర్వాతి రోజున కల్యాణ్‌కి గుర్తొచ్చింది- "అవునే, నేను తెచ్చిన గాడిదపాలు ఎన్ని లీటర్లు?" అని అడిగాడు. "ఏమోనండి, లీటరంటే ఎన్ని పాలొస్తాయో నాకెక్కడ గుర్తుంటుంది?" అన్నది బయ్యమ్మ. అయితే కల్యాణ్ జేబులో చూసుకుంటే డబ్బులు బాగా తక్కువ కనిపించాయి. దాంతో అతను "పాలవాడి దగ్గరికే వెళ్ళి అడుగుతాను- నాకు ఎన్ని పాలు ఇచ్చాడో, ఎంతకి ఇచ్చాడో" అని ఊళ్ళోకి బయలు దేరాడు. పట్టుదలగా తనవైపుకే వస్తున్న కల్యాణ్‌ని దూరం నుండే చూసాడు పాలవాడు. 'అంతకు ముందు రోజు తను వాడిని మోసం చేసినందుకు ఏమంటాడో' అని అతను హడలిపోయాడు. అయితే అతని ఆలోచన తెగేలోగా కల్యాణ్ అతని దగ్గరికి రానే వచ్చాడు. "అవునూ," అని మొదలు పెట్టాడుగానీ, ఆ తర్వాత తను ఎందుకొచ్చాడో మరచిపోయాడు కల్యాణ్. "నిన్న నువ్వు ఇచ్చిన డబ్బుల గురించి కదా, ఇదిగో- దీన్ని నేను నాకోసం కొనుక్కున్నాను, కానీ నువ్వు అడిగావని ఇచ్చేస్తున్నాను. ఇది ఇక నీదే.. పూర్తిగా నీదే. ఇవాళ్ల సాయంత్రమే దీని డ్రా తీస్తారు.. ఎంత బహుమతి వచ్చినా అది నీకే!" అని తను అంతకు ముందు కొన్న ఓ లాటరీ టిక్కెట్టును కల్యాణ్ చేతిలో‌ పెట్టాడు పాలవాడు. కల్యాణ్ ఏదో గుర్తుకొచ్చినట్లు అనబోతుంటే అతను అటూ ఇటూ చూసి, అక్కడే ఓ టబ్బు దగ్గర తిరుగుతున్న తాబేలును ఒకదాన్ని తీసి కల్యాణ్ చేతిలో పెట్టి, "ఇదిగో! ఈ తాబేలు కూడా నీకే! తీసుకో! మన లెక్క దీంతో సరిపోయింది!" అని చెబుతూ గబగబా లేచి వెళ్ళిపోయాడు, గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ. ఆ లాటరీ టిక్కెట్టును, తాబేలును పట్టుకొని సంతోషంగా ఇంటికొచ్చాడు కల్యాణ్. "చూడు! ఇవాళ్ళే డ్రా తీస్తారట! ఈ తాబేలునేమో.. మరి.. ఎందుకిచ్చాడో మర్చిపోయాను- ఏదో చెప్పి ఇచ్చాడు నాకు" అన్నాడు, బయ్యమ్మతో. రంగు రంగుల ఆ టిక్కెట్టుని చూసి మురిసిపోయింది బయ్యమ్మ. అయితే ఆ రోజు సాయంత్రం లాటరీలో మొదటి బహుమతి కోటి రూపాయలు కల్యాణ్ చేతిలో ఉన్న టిక్కెట్టుకే వచ్చాయి! ఆ డబ్బుల చెక్కుని అందుకుంటూ కల్యాణ్ "నాకు ఈ టిక్కెట్టు కొనిపెట్టిన నా భార్యకు కృతజ్ఞతలు!" అని చెబుతుంటే, అక్కడే ఉన్న పాలవాడు వీళ్ల మతిమరుపును తలచుకొని స్పృహ తప్పి పడిపోయాడు!   బహుమతిని అందుకుంటూ మురిసిపోతున్న కల్యాణ్ వీడియోని లాటరీ వాళ్ళు ఇంటర్నెట్లో పెట్టారు. ఆ వీడియోలో అటూ ఇటూ తిరుగుతూన్న తాబేలుని చూసి, జూ అధికారి ఒకడు గుర్తుపట్టాడు- అది చాలా అరుదైన రకం తాబేలు! అతను చెప్పటంతో కదిలిన అధికార యంత్రాంగం కల్యాణ్‌ని అడిగింది- "ఇది మీకు ఎక్కడ దొరికింది?" అని. "ఏమో, గుర్తులేదు. పాల దుకాణం దగ్గర కాబోలు, దొరికింది" అన్నాడు కల్యాణ్. "దీన్ని మా జూకు ఇవ్వరాదూ? మీకో చక్కని బహుమతి ఇస్తాం" అని వాళ్ళు తాబేలుని తీసుకెళ్ళి, వీళ్లకు పదివేల రూపాయల బహుమతినిచ్చారు! అట్లా ధనవంతులైన కల్యాణ్, బయ్యమ్మ పట్నంలో మంచి ఆస్పత్రికెళ్ళి. తమ మతిమరుపును బాగు చేయించుకున్నారు.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

తపన

తపన   తాళ్లరేవులో గోపాలుడనే యువకుడు ఒకడు, పశువులు కాస్తూ ఉండేవాడు. చిన్నతనంనుండీ అదే పనిలో ఉండటం వల్లనో ఏమో, వాడు అసలు ఏమాత్రం చదువుకోలేదు. ప్రతి సంవత్సరమూ శ్రీరామ నవమికి ఆ ఊరి రామాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఒక ఏడాది వాడు వెళ్ళేసరికి గుడిలో రామాయణ ప్రవచనం జరుగుతున్నది. వ్యాసపీఠం మీద రామాయణ గ్రంథం పెట్టుకుని చదువుతూ, అందులోని సూక్ష్మాలను పామరులకు అర్థమయ్యేట్లు వివరిస్తున్నారు రామశర్మగారు. ఆయన గొంతూ, చెప్పే తీరూ బాగుండటంతో గోపాలుడు అక్కడే కూర్చొని ఆయన చెప్పేది ఆసాంతం విన్నాడు. ఆయన చెప్పిన సంగతులన్నీ గోపాలుడి హృదయంలో నాటుకుపోయాయి. "అబ్బా! చదువు వచ్చి ఉంటే ఇట్లాంటి పుస్తకాలన్నీ నేనే చదవగలిగేవాడిని కదా! ఏమయినా సరే ఇవాల్టి నుంచీ చదువు నేర్చుకోవాలి. మంచి మంచి పుస్తకాలన్నీ చదవాలి" అని గట్టిగా అనుకున్న గోపాలుడు, సభ అయిపోగానే రామశర్మ దగ్గరికి వెళ్ళి, తన గురించి చెప్పుకొని, "అయ్యా! నాకు బొత్తిగా చదువు రాదు. కానీ బాగా చదువుకోవాలని అయితే ఉంది. రోజూ‌ మీ సేవ చేసుకుంటాను, నాకు చదువు చెప్పండి" అని ఆయన కాళ్ళకు దండం పెట్టాడు. గోపాలుడి జిజ్ఞాసకు రామశర్మ చాలా సంతోష పడ్డాడు. "నాయనా! రామాయణం రాసిన వాల్మీకికి కూడా మొదట్లో అసలు చదువే రాదట. చదువుకోవాలని కోరికతోటి, తగినంత కృషి చేసి అంత గొప్పవాడు అయ్యాడు. ఇవాళ్ల నీలో ఈ ఆలోచన కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పక్క వీధిలోనే మా ఇల్లు. నువ్వు రోజూ మా ఇంటికి రా. నేను నీకు చదువు చెబుతాను. చదువుకోవాలన్న తపన ఉండాలే కాని చదువు ఏమంత కష్టం కాదు" అన్నాడు. గోపాలుడికి చాలా సంతోషం అయ్యింది. మరుసటి రోజునుండీ ప్రతిరోజూ ఉదయాన్న రామశర్మ వద్దకు వెళ్ళి అక్షరాలు, అంకెలు నేర్చుకోవటం మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లోనే చిన్న వాక్యాలు, చిట్టి చిట్టి పద్యాలు చదవసాగాడు. ఇంకొన్ని నెలలు గడిచే సరికి కఠినమైన పద్యాలు చదవటం కూడా వచ్చేసింది. అట్లా కొద్దికాలంలోనే మంచి పుస్తకాలు చదివే స్థాయికి ఎదిగాడతను. ఆ సమయంలో మేత మేసేందుకు వెళ్ళిన ఆవుల్లో ఒకటి తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ కొండ అంతా తిరిగిన గోపాలుడికి చెట్ల గుబుర్ల వెనకగా గుహ ఒకటి కనిపించింది.  "అరే! ఇన్నిసార్లు ఇటు వచ్చినా ఈ గుహ ఎన్నడూ కనబడలేదే?! ఇందులో ఏముంది?" అని ఆశ్చర్యపోతూ ఆ గుహలోకి ప్రవేశించాడు గోపాలుడు. గుహ అంతా అప్పుడే ఊడ్చినట్టు శుభ్రంగా ఉంది. ఒక ప్రక్కగా ఎత్తైన రాయిమీద కొన్ని తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. గోపాలుడు ఆశ్చర్యపోయాడు. 'గుహ చుట్టు ప్రక్కల ఎవరైనా ఉన్నారేమో' అని వెతికాడు. ఎవ్వరూ లేరు. ఆ తాళపత్ర గ్రంథాలలో ఏమి రాసి ఉన్నదో చదివేందుకు ప్రయత్నించాడు. అవేవో సంస్కృత శ్లోకాలు.. గోపాలుడికి ఏవీ అర్థం కాలేదు. "గుహలో ఎవరో ఋషి ఉంటాడల్లే ఉంది" అని సాయంత్రం చీకటి పడే వరకూ.. మర్నాటి ఉదయం వరకూ ఎదురు చూసాడు గోపాలుడు. ఎవ్వరూ రాలేదు. "ఈ గ్రంథాలను ఒక్కసారి తీసుకువెళ్ళి, గురువుగారికి చూపించి, మళ్ళీ తెచ్చేస్తాను" అని వాటిని జాగ్రత్తగా ఊళ్ళోకి తీసుకువెళ్ళాడతను. వాటిని చూసిన రామశర్మ ఆశ్చర్యపోయాడు. అవి లోక ప్రసిద్ధి చెందిన కారుణ్య మహాముని రచించిన సూక్తులు. ఎలా నడచుకుంటే జీవితం సక్రమంగా ఉంటుందో చెప్పే శ్లోకాలవి. ఇన్ని రోజులుగానూ వాటిని కర్ణా కర్ణిగా విని చెప్పుకునేవాళ్ళు అందరూ. కానీ ఇప్పుడు దొరికినవి, వందల సంవత్సరాల క్రితం రాసిన గ్రంథాలు! వాటి విలువ అమూల్యం! రామశర్మ ఆ సంగతి గోపాలుడికి చెప్పి,"నాయనా! వీటిని సేకరించి గుహలో పెట్టుకున్నవాళ్ళెవరో మహాత్ములు, వీటికోసం వెతుక్కుంటూ ఉంటారు. నువ్వు వీటిని తీసుకెళ్ళి వాళ్లకు ఇచ్చి, "మీరు అనుమతిస్తే వీటి నకలు చేసుకొని, కొద్ది రోజుల్లో తిరిగి తెచ్చిస్తాను" అని అడిగి చూడు. వాళ్ళు ఒప్పుకుంటే చాలా మేలు! లేకపోతే మనకు ప్రాప్తం లేదనుకుంటాం" అన్నాడు. గోపాలుడు వాటిని పట్టుకొని గబగబా కొండ ఎక్కి చూసాడు. ఎంత వెతికినా అతనికి మళ్ళీ ఆ గుహ కనబడనే లేదు! అతను తిరిగి వచ్చి ఆ సంగతి చెబితే రామశర్మ సంతోషానికి అవధులు లేకుండా పోయింది: "నాయనా! నువ్వు నిజంగా సరస్వతీ‌పుత్రుడివే!‌ చదువుకోవాలనే తపన నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నది. ఇన్ని శతాబ్దాలుగా ఎవ్వరికీ లభించని మహోన్నత గ్రంధాలు నీకు లభించాయంటే ఆ మహాముని కరుణ సంపూర్ణంగా నీ మీద ఉన్నట్లే" అని చెప్పి, అతనికే ఆ గ్రంధాల నకళ్ళు తీసే పనిని అప్పగించాడు. గోపాలుడు గుండ్రని అక్షరాలతో ఆ గ్రంథాలకు అనేక నకళ్ళు తయారు చేశాడు. ఆ ప్రతులను కొన్నింటిని వేరు వేరు పాఠశాలలకు ఇచ్చాడు రామశర్మ. అక్కడి ఉపాధ్యాయులు ఆయన సహకారంతో ఆ సూక్తుల్ని, జీవిత సత్యాలను పిల్లలకు బోధించసాగారు. ఈ సంగతులన్నీ రాజుగారికి తెలిసేసరికి, ఆయనే స్వయంగా తన పరివారంతో సహా ఆ గ్రామానికి వచ్చి, రామశర్మను, ఆ గ్రంధాలను దర్శించుకున్నాడు. గోపాలుడిని మెచ్చుకొని, "రామశర్మగారూ! చదువు పట్ల ఇతనికి చాలా ఆసక్తి అని తెలిసి సంతోషించాము. ఇతనికి అయ్యే ఖర్చుల్ని పూర్తిగా మేమే భరిస్తాం. తమరు చదువులో గోపాలుణ్ణి దిట్టగా తయారుచేయండి. భవిష్యత్తులో అతనికి మా ఆస్థానంలోనే తగిన ఉద్యోగం ఇస్తాము" అని చెప్పారు రాజుగారు. గోపాలుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. "మీరు సరేనంటే ఈ తాళపత్ర గ్రంథాలను రాజధానిలోని సంగ్రహాలయంలో పెట్టిస్తాను. ఆ విధంగా దేశ విదేశాల వారు వాటిని చదివే అవకాశం ఉంటుంది" చెప్పారు రాజుగారు. "అంతకన్నా భాగ్యం ఏముంటుంది మహారాజా!" అని ఆ గ్రంథాలను రాజుగారికి అప్పగించారు రామశర్మ, గోపాలుడు. ఇక ఆ తరువాత గోపాలుడి చదువు అద్భుతంగా సాగింది. అతను ఇక అనేక గ్రంథాల మీద, శిలాశాసనాలమీద పరిశోధనలు చేసాడు. పలు పరిశోధనా గ్రంథాలను వెలువరించాడు. కొంత కాలానికి రామశర్మ అనుమతితో రాజుగారి కొలువులో ఆయనకు సలహాదారుగా చేరాడు. "చదువు పట్ల ప్రేమ ఉంటే చాలు అది మనల్ని ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది" అని చెప్పేవాడతను, అందరికీ.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

తగిన శాస్తి

తగిన శాస్తి   అనగనగా ఓ అడవిలో తోడేలు ఒకటి ఉండేది. అమాయకంగా ఉండే జంతువులను నమ్మించి మోసం చేస్తుండేది అది. ఒకసారి అడవి అంచుననే దానికి పెద్ద కోడి ఒకటి కనిపించింది. దాన్ని చూడగానే తోడేలుకు నోరు ఊరింది. కానీ అది తన చేతికి అంత సులభంగా దొరికేటట్లు లేదు.. "మీదికి దూకితే అది దొరక్కుండా పారిపోవచ్చు..ఏం చేద్దామా?" అనుకున్న తోడేలు స్నేహం నటిస్తూ, తను ఉన్న చోటినుండే : "ఏం అల్లుడూ?! ఎట్లా ఉంది ప్రాణం?" అంటూ‌ పలకరించింది. కోడి దాన్ని చూడగానే కలవర పడింది. "అయ్యో! మావాళ్ళు అడవి దగ్గరికి వెళ్లద్దంటే వినకుండా ఇటు వచ్చానే, ఎంత తప్పైంది?! ఇప్పుడు దీని నుండి తప్పించుకునే ఉపాయం వెతకాలి" అనుకున్నది. పైకి మటుకు "బాగుంది మామా! చాలా బాగుంది! నువ్వెట్లా ఉన్నావు?! అత్తా, అల్లుళ్ళూ అంతా కులాసానా?" అంది, తను కూడా వరస కలుపుతూ.దాని ఆ వరస తోడేలుకు చాలా నచ్చింది. "ఇక్కడెక్కడో నేను ఆ మధ్య ధాన్యపు గింజల రాశి ఒక దాన్ని చూశాను అల్లుడూ! మీకు మేత పరిస్థితి ఎలా ఉన్నది?" అని మాట కలిపింది."అబ్బో! మా మేతకేమి, అద్భుతంగా ఉంది మామా!    మా గూట్లో ఒక వందమంది కోళ్లం‌ ఉంటామా?! అందరం కలిసి కూర్చొని తిన్నా రెండేళ్లపాటు ఐపోదు. అంత మేత సేకరించి పెట్టుకున్నాం! పైపెచ్చు, మాకో‌ వ్రతం కూడాను! రోజూ ఎవరో ఒక అతిథి ఉండాలి! లేకపోతే మేం ఎవ్వరం అన్నమే తినం! అందుకనే ప్రతిరోజూ ఇట్లా అడవి బాట పడుతున్నాం!" నవ్వుతూ చెప్పింది కోడి, తెలివిగా. "నీకు అభ్యంతరం లేకపోతే, మామా!‌ నాతో పాటు రారాదూ, మా గూట్లో అందరం నీకు ఈ రోజున కడుపు నిండా విందు చేస్తాం!" అని జోడిస్తూ. "ఓహో ఏమి నా భాగ్యం?! తంతే కోళ్ల బుట్టలో‌ పడటం అంటే ఇదే!‌  ఒకసారి దీనివెంట కోళ్ళగూడు చేరుకున్నానంటే ఇక అన్ని కోళ్లనూ‌ భోంచేయచ్చు" అనుకున్న తోడేలు సంతోషంతో ఎగిరి గంతేసింది. "ఓ!‌ నువ్వు పిలవటమూ, నేను రాకపోవటమూనా, అల్లుడూ?! పద! పద! ఇప్పుడే వస్తాను!" అంటూ కోడి వెంట బయలుదేరిందది. కోడి దాన్ని తాము ఉండే గూటి దగ్గరికి తీసుకెళ్ళింది. అవి ఇంకా అల్లంత దూరాన ఉండగానే మిగిలిన కోళ్లన్నీ‌ గొల్లున అరవటం మొదలు పెట్టాయి. "రా! మామా! మా వాళ్ళంతా నీకు స్వాగతం ఎలా పలుకుతున్నారో చూడు!" అంటూ ముందుకి దారి తీసింది కోడి.    కోళ్ల అరుపులు వినగానే బయటికి వచ్చిన కుక్కలు గట్టిగా మొరిగాయి. వాటి అరుపులు విన్న ఊళ్ళోవాళ్లంతా కట్టెలు పట్టుకొని వచ్చి తోడేలును చితకబాదారు. "విందు పెడతారన్నావు కదా, అల్లుడూ!" అంది తోడేలు, పారిపోతూ. "ఊరికే అన్నాను! ఈసారి అటొచ్చినప్పుడు నువ్వు చూపించే నిజం ధాన్యపు రాశిని ఎత్తుకొస్తాంలే మామా!" అంది కోడి, పరుగున పోయి తన వాళ్లను కలుసుకుంటూ. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

రేపు ఎవరికెరుక

రేపు ఎవరికెరుక?     పాండవులు ఐదుగురూ అనామకులు-గా ఒక చిన్న పట్టణంలో ఉంటున్న సమయం అది. ఒక రోజున, ఇంకా తెల్లవారకనే ఎవరో వచ్చి, వాళ్ళు ఉంటున్న ఇంటి తలుపు తట్టారు. ధర్మరాజు వెళ్లి, తలుపు తీసి చూశాడు. చూస్తే, అక్కడున్నది ఒక బిచ్చగాడు! ధర్మరాజుకు కొంచెం చికాకు వేసింది- ’తాము ఇంకా నిద్ర నుండి పూర్తిగా లేవనైనా లేవలేదు; అప్పుడే భిక్షకోసం వచ్చి నిలబడ్డాడా?’ అని. అనాలోచితంగా అతను అనేశాడు బిచ్చగాడితో- "రేపురావయ్యా" అని. అంతలో ఇంటిలోపలి నుండి "హహ్హ హ్హా" అని గట్టిగా నవ్వులు వినబడ్డాయి. ఆ గొంతు-చూడగా, భీముడిది. ఏదో పెద్ద జోకు విన్నట్లు నేలమీద పడి దొర్లుతూ, కడుపు పట్టుకొని, పగలబడి నవ్వుతున్నాడు వాడు. ధర్మరాజు లోపలికి వెళ్లి అరిచాడు, చెవులు మూసుకొని- "అబ్బ!ఆపు! ఎందుకట్లా నవ్వుతున్నావు? పిచ్చి గానీ పట్టలేదు గద! లేకపోతే ఏమైనా తిక్క పని చేశావా, మళ్ళీ? ఇంకా బాగా తెల్లవారనే లేదే, నీ తిక్క పనులకు?" అని. ధర్మరాజుకు శాస్త్రాలన్నీ తెలుసు. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి, అతని పాండిత్యమే తరచు అతనికి అడ్డం వచ్చేది: అతని కళ్లముందు పదాలు, వాటికి ఉన్న విభిన్న అర్థాలు నిల్చేవి- మార్గం కానరాకుండా చూసేవి. ఆ రోజూ అలాంటి రోజే- ధర్మరాజుకు తన బండ తమ్ముడు అట్లా నవ్వటం చూసి చికాకు వేసింది-" ఎందుకట్లా నవ్వుతున్నావు, భీమా?" అన్నాడు కోపంగా, దగ్గరకు వెళ్ళి. "నిన్ను చూసే నవ్వుతున్నాను- ఇంకెవర్ని చూసి నవ్వాలి? 'రేపు అంటూ ఒకటి ఉండబోతున్నద'ని నీకు ఎట్లా తెలుసు? సరే, ఒకవేళ ఆ ’రేపు’ ఏదో వచ్చిందే అనుకో- ఆనాటికి నువ్వూ, ఆ బిచ్చగాడూ- ఇద్దరూ బ్రతికే ఉంటారని ఎట్లా చెప్పగలవు? ఆనాడు నువ్వు ఎక్కడుంటావో, వాడెక్కడుంటాడో!? కానీ నువ్వు మాత్రం ఆ బిచ్చగాడికి అద్భుతమైన ఆత్మ విశ్వాసంతో బదులిచ్చావు- ’రేపు రా’అని. నేనిప్పుడే ఊరంతా చాటింపు వేసి చెప్పబోతున్నాను- 'మా అన్నకు అద్భుతమైన జ్ఞానం కలిగింది- రేపు ఏమి కానున్నదో చెబుతాడు ఆయన' అని! హీ హీ హీ!" అన్నాడు భీముడు, ఇకిలిస్తూ. ధర్మరాజు వెంటనే బయటికి పరుగెత్తి, ఆ బిచ్చగాడ్ని వెనక్కి పిలుచుకొచ్చాడు. అతనికి భోజనం పెట్టి కొన్ని డబ్బులిచ్చి, పంపేశాడు. తన ’బండ’తమ్ముడి సునిశితమైన వాస్తవిక దృష్టి, అతని కళ్లకు కమ్మిన పుస్తక పాండిత్యపు పొరల్ని కరిగించివేసింది. "నువ్వు సరిగ్గా కనుక్కున్నావు భీమా, ధన్యవాదాలు!" అన్నాడు తమ్ముడితో. అప్పుడు భీముడు అన్నకు ఒక చక్కని కథ చెప్పాడు-  "ఒక రాజుగారి దర్బారులో ఒక మంత్రి ఉండేవాడు.ఆ మంత్రి చాలా తెలివైన వాడూ, లోకజ్ఞానం కలవాడు కూడా. అయినా ఒకసారి ఎందుకనో రాజుకు అతనిమీద విపరీతమైన కోపం వచ్చింది. ఎంత కోపం అంటే, అతనికి మరణశిక్ష విధించి, మరుసటిరోజు ఉదయాన్నే దాన్ని అమలు చేయమన్నాడు.   మంత్రిగారి ఇంట్లో వాళ్ళంతా ఏడవటం మొదలెట్టారు. చుట్టుప్రక్కల వాళ్ళూ, బంధువులూ వచ్చి మంత్రిగారి భార్యను, పిల్లల్ని ఓదారుస్తున్నారు. "త్వరలో ఇక మంత్రిగారు ఉండరు." అని వాళ్లందరికీ అర్థమైంది. ఎందుకంటే వాళ్లంతా తమకు 'రేపు ఏం కానున్నదో తెలుసు' అనుకున్నారు. అయితే మర్నాడు ఉదయాన, మంత్రిగారి శవానికి బదులు, స్వయంగా మంత్రిగారే ఇకిలించుకుంటూ ఇంటికి వచ్చారు!- అదిన్నీ రాజుగారు పెంచుకునే పంచ కళ్యాణి గుర్రాన్నెక్కి! ఆయన్ని అలా చూడగానే, ఏడుస్తున్న బంధువర్గం అంతా ఒక్క క్షణం స్తంభించి-పోయింది- ఎవ్వరికీ నోట మాట లేదు. ముందుగా తేరుకున్న మంత్రి గారి భార్య లేచి వచ్చి, ’ఇంత అద్భుతంఎలా సాద్యమైంది?’ అని అడిగింది. మంత్రిగారుచెప్పారు, చిద్విలాసంగా:"నా మృత్యుఘడియలు దగ్గర పడే సమయానికి, మమూలుగా రివాజు ప్రకారం రాజుగారు అక్కడికి విచ్చేశారు. ఆ సమయంలో ఏడుస్తున్న నన్ను చూసి, ఆయన "’నీకు చావంటే ఇంత భయం’ అని నేను అనుకోలేదు!" అన్నారు.” " 'నేను ఏడుస్తున్నది నేను చచ్చిపోతానని కాదు! నాకు మాత్రమే తెలిసిన ఆ అద్భుతవిద్య, నాతోటే అంతమైపోతున్నదే, అని, నా బాధ!' అన్నాను నేను.” 'ఏమిటావిద్య?' అని అడిగారు రాజుగారు.     'కొన్నిరకాల గుర్రాలకు శిక్షణ ఇచ్చి, అవి గాలిలో ఎగిరేలా చేయటంవచ్చు, నాకు'అన్నాను నేను. "రాజుగారికి ఆ ఐడియా నచ్చింది.- 'ఎన్నాళ్ళు పడుతుంది?' అని అడిగారు ఆయన.” " 'ఒక సంవత్సరం పట్టవచ్చు' అన్నాను నేను. ఆయన నన్ను విడుదల చేసి, నాకు ఈ గుర్రాన్నిచ్చేశారు- 'సంవత్సర కాలంలో ఈ గుర్రాన్ని గాలిలో ఎగిరించగల్గితే నీకు నీ ప్రాణాలే కాదు, నా రాజ్యంలో 4వ వంతు ఇచ్చేస్తాను' అన్నారు! అలా నేను ఇక్కడికి క్షేమంగా చేరుకున్నాను!" అని. ఇది వినగానే మంత్రిగారి భార్య సంతోషం ఆవిరైంది: "నీకు గుర్రాలకు శిక్షణ నిచ్చేంత ప్రత్యేక శక్తులు ఏమీ లేవు కదా, ఎందుకు - అబద్ధం చెప్పావు? ఇలా చేస్తే నాకు ఏం సుఖం? ఇంకో సంవత్సరం పాటు నేను ప్రతి క్షణమూ కంగారు పడుతూ గడపాలి. అంత చేసినా సంవత్సరం తర్వాత నేను విధవరాలినవ్వక తప్పదు. అదేమి బ్రతుకు?! దీని కంటే ఏం జరగాలో అది ఒక్కసారిగా జరగటమే నయం!" అన్నది ఏడుస్తూ. మంత్రిగారు ఆమెని ఓదార్చి, ప్రేమగా తిట్టాడు- "తిక్కదానా! రేపు ఎవరికెరుక? రాజుగారు ఇంకో సంవత్సరం పాటు బ్రతికి ఉంటారని ఎవరికెరుక? నేను మాత్రం అంతకాలం ఉంటానని ఎవరు చెప్పగలరు?- ఆలోగా పరిస్థితులు ఎంత మారిపోవచ్చు! ఏదో ఒక సందర్భం వచ్చి, నేను రాజుగార్ని మెప్పిస్తే , అయన నన్ను క్షమించెయ్యవచ్చు- ఆలోగా వేరే ఏదైనా కావచ్చు కూడా. గుర్రం ఎగరనూ వచ్చు! భవిషత్తును ఎవ్వరూ ముందుగా కనుక్కోలేరని తెలీలేదా ఇంకా ? ఆందోళనను వదిలిపెట్టు. ప్రస్తుతంలో బ్రతుకు. సంతోషంగా ఉండు!" అన్నాడు నవ్వుతూ.   కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ఓక్ చెట్ల కథ

ఓక్ చెట్ల కథ     అనగనగా అమెరికాలో ఎప్పుడూ‌ పచ్చగా ఉండే అడవి ఒకటి ఉండేది. ఆ అడవిలో చాలా ఓక్ చెట్లు ఉండేవి. సూర్యుడి ఎండ ఆ అడవిలో ఎక్కడా ఒక్క సూది మోపినంత కూడా పడేది కాదు: ఆ ఓక్ చెట్లు అంత దట్టంగా ఉండేవి. అడవి మొత్తం ఓక్ చెట్లతోటే నిండిపోయి ఉండేది. అది కనుక్కున్నారు కొందరు మనుషులు. వాళ్లంతా రోజూ ఆ అడవిలోకి రావటం మొదలు పెట్టారు. చెక్క పని చేసే వడ్రంగులు వచ్చి చెట్లను నరికి కొట్టుకొని వెళ్ళేవాళ్ళు; వాటితో మంచి మంచి బొమ్మలు తయారు చేసేవాళ్ళు. రైతులు వచ్చి ఓక్ చెట్ల కొమ్మలను, ఒక్కోసారి పూర్తి మానుల్ని కూడా, నరికి తీసుకెళ్ళేవాళ్ళు; వాటితో తమకు కావలసిన వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకునేవాళ్ళు.   కొద్ది రోజుల వరకూ ఓక్‌చెట్లకు ఇది బాగానే అనిపించింది. రాను రాను వాటికి భయం వేయటం మొదలైంది: "వీళ్ళు మనల్ని పూర్తిగా ఐపోగొడితే?" అని. ఆ ఆలోచన వచ్చేసరికి ఓక్‌ చెట్లు చాలా గందరగోళ పడ్డాయి. తమ జాతి మొత్తం అంతరించిపోతుందని వాటికి భయం వేసింది. చివరికి అన్నీ కలిసి దేవుడిని ప్రార్ధించటం మొదలు పెట్టాయి. "దేవుడా! ఈ మనుషులు ఎవ్వరూ మమ్మల్ని కొట్టకుండా చూడు!" అని. వాటి ప్రార్థన విన్న దేవుడు ఒకరోజున నీటి మేఘం రూపంలో ప్రత్యక్షమైనాడు: "చూడండి, ప్రకృతిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని లేదు, మీరు వృధాగా భయపడుతున్నారు!" అన్నాడు.   "కాదు కాదు "నిజంగానే మేం అంతరించి పోతాం! మమ్మల్ని మనుషులెవ్వరూ కొట్టేయకుండా చెయ్యి" అన్నాయి ఓక్ చెట్లు. "సరే, అట్లాగే కానివ్వండి మరి, మీ ఇష్టం" అంటూ దేవుడు మాయం అయిపోయాడు. తర్వాతి రోజుకల్లా ఓక్ చెట్లన్నిటికీ ఏదో వ్యాధి సంక్రమించింది. ఓక్ చెట్టుతో చేసిన ప్రతి వస్తువూ పాడవ్వసాగింది. ఇప్పుడు ఆ చెక్క బొమ్మలకి పనికి రావట్లేదు; పనిముట్లకీ పనికి రావట్లేదు. చివరికి పొయ్యిలో పెట్టుకునేందుకు కూడా!   మనుషులు "ఓక్ చెట్టు" అనగానే "అబ్బ వద్దు!" అనటం మొదలు పెట్టారు. మొదట్లో ఓక్ చెట్లకు ఇది చాలా సంతోషం అనిపించింది. కానీ రాను రాను అవి ఒంటరివి అయిపోయాయి. మనుషులెవ్వరూ ఇప్పుడు అడవిలోకే రావట్లేదు. వాటిని పట్టించుకోవట్లేదు. చివరికి ఎండి, పడిపోయిన చెట్లమొద్దుల్ని కూడా ఎవ్వరూ ఎత్తుకెళ్ళట్లేదు. ఇట్లా కొంత కాలం గడవగానే అవి మళ్ళీ దేవుడిని తలుచుకోవటం మొదలు పెట్టాయి: "దేవుడా!‌ మాకు ఈ ఒంటరి తనం వద్దు. ఇదివరకులాగే ఉండనివ్వు చాలు! తప్పయిపోయింది" అంటూ. దేవుడు మళ్ళీ వచ్చాడు. "నేను చెప్పలేదా, ఇట్లా మీరు ఉండలేరని?!" అంటూ. "నిజమే స్వామీ! మాకు ఇలాంటి జీవితం వద్దు. దీనికంటే అంతరించిపోవటమైనా మేలే!" అన్నాయి ఓక్ చెట్లు. దేవుడు నవ్వి, "లేదులే! మీ వల్ల ఎంత లాభమో గుర్తించిన మనుషులు ఇంకా ఇంకా ఎక్కువ సంఖ్యలో మిమ్మల్ని పెంచుతారు. మీ వల్ల ఈ పర్యావరణం అంతా బాగౌతుంది. భూమి మొత్తం మీ గురించి గొప్పగా చెప్పుకుంటుంది. బెంగపడకండి" అంటూ ఆశీర్వదించాడు.   ఆ తర్వాత ఓక్ చెట్లు మళ్ళీ ఉపయోగంలోకి వచ్చేసాయి; మనుషులకు అవంటే మళ్ళీ ఇష్టం ఏర్పడ్డది. వాళ్ళు ఎక్కడపడితే అక్కడ ఓక్ చెట్లను పెంచటం మొదలెట్టారు.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అక్కా చెల్లెళ్ళు

అక్కా చెల్లెళ్ళు   అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి పెళ్లి అయింది; ఇద్దరు కూతుర్లు కూడా పుట్టారు; కానీ కొన్ని సంవత్సరాల తరువాత రాణీగారు చనిపోయారు. అప్పటినుండీ ఇద్దరు పిల్లల బాధ్యతా రాజుగారి మీదే పడింది. పిల్లలిద్దరూ‌ చాలా మంచివాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్లకి అమ్మ లేదు కదా, అందుకని వాళ్ళకు పనుల్లో సాయం చేయటం కోసం మంగళ అనే ఆమెను తెచ్చి పెట్టారు రాజుగారు. మంగళ కూడా వాళ్ళతోబాటే ఉండేది, వాళ్ల ఇంట్లోనే. అయితే కొన్ని రోజులు అయ్యాక ఆమె కాస్తా రాజుగారి మీద మనసు పడ్డది. ఎలాగైనా రాజుగారిని పెళ్లి చేసుకొని, ఈ ఇద్దరు పిల్లల్ని ఇంటి నుండి వెళ్లగొట్టాలని కంకణం కట్టుకున్నది. ఒకరోజున పిల్లలు ఇద్దరూ పొయ్యి మీద అన్నం పెట్టి, బయటకు వెళ్లి ఆడుకొంటున్నారు. మంగళ వచ్చి "నాకు బట్టలు తోమడానికి బొగ్గులు కావాలి- కొన్ని బొగ్గులు తెచ్చిపెట్టండి" అని అడిగింది. "సరేలే ఎందుకో అడుగుతోంది" అని పిల్లలు బొగ్గులు ఏరుకొచ్చి ఇచ్చారు. మంగళ ఆ బొగ్గుల్ని చాటలో ఎత్తుకెళ్ళి నేరుగా అన్నంలో వేసేసి, ఏమీ తెలియని నంగనాచిలా వెళ్లిపోయింది. ఆరోజున రాజు వచ్చి భోజనానికి కూర్చుంటే, పిల్లలు బొగ్గులు వేసిన అన్నం వడ్డింఛారు. "ఏమిటమ్మా ఇవి?" అడిగాడు రాజుగారు."ఏమో నాన్నా! మాకు తెలీదు" అన్నారు పిల్లలు.   రాజుగారికి చాలా కోపం వచ్చింది. "మంగళను పిలవండి" అని అరిచాడు. మంగళ వచ్చింది. ఇదేంటి, అన్నంలోకి బొగ్గులు వేస్తారా, ఎవరైనా?" అరిచాడు రాజుగారు. "నాకేం తెలుసు? మీ పిల్లల్నే అడగండి. నేను ఒద్దంటున్నా వాళ్ళే, బొగ్గులు ఎత్తెత్తి వేశారు అన్నంలో. కావాలంటే వాళ్ళ చేతులు, గోళ్ళు చూడండి. నల్లగా ఉండకపోతే అప్పుడు అడగండి నన్ను" అన్నది మంగళ గట్టిగా. రాజుగారు చూస్తే పిల్లలిద్దరి గోళ్ళూ నల్లగా ఉన్నాయి. "మాకేం తెలీదు- మంగళ బొగ్గులు తెమ్మంటే తెచ్చాం, అంతే" అన్నారు పిల్లలు. కానీ రాజుగారు నమ్మలేదు. "పనిచేసి ఆకలితో‌ ఇంటికొస్తే ఇట్లా చేస్తారా? ముందసలు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీ‌ ముఖం నాకు చూపించకండి" అని పిల్లలిద్దర్నీ గట్టిగా తిట్టారు. అన్నం కంచం ముందునుండి గబగబా లేచి వెళ్ళిపోయారు. పిల్లలిద్దరూ ఏడుస్తూ గదిలో కూర్చుంటే మంగళ వచ్చి- "విన్నారుగా, మీ నాన్న చెప్పినా మీకు సిగ్గులేదా? పోండి. మీ ముఖం అసలు మాకు చూపించనే చూపించవద్దండి" అని ఇంట్లోంచి గెంటేసింది. పిల్లలు ఏడ్చుకుంటూ అడవిలో పడి పోతూ ఉంటే తోక రాక్షసుడు ఒకడు ఎదురయ్యాడు. "ఎందుకు, ఏడుస్తు-న్నారు?" అని అడిగి, సంగతంతా తెలుసుకున్నాడు.   అసలు సంగతేంటంటే వాడికి పిల్లలిద్దరినీ చూసేసరికి నోరు ఊరింది. "నా వెంట రండి. ఇక్కడ ఊరవతలే నాకో భవంతి కూడా ఉంది. అందులో సలిపిండి (చలిమిడి) చేసుకునే సామానూ చాలా ఉంది" అని వాడు వాళ్ళిద్దరినీ భవంతిలోకి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక, వాళ్ళిద్దరినీ లోపలే పెట్టేసి, బయటినుండి తాళాలు వేసుకొని వెళ్ళిపోయాడు! వాడి అసలు ఉద్దేశం పిల్లలకు తెలీదు కద- అందుకని కొంచెం సేపు అక్కడే ఆడుకుంటూ‌ కూర్చున్నారు. తర్వాత వాళ్లకు ఆకలైంది. వెతికి చూస్తే భవంతిలో సలిపిండి చేసుకునే సామాను అసలు ఒక్కటీ లేదు. అన్నీ‌ ఏవేవో‌ ఎండబెట్టిన జంతువుల మాంసాలూ, సారాయిలూ ఉన్నాయి గదుల నిండా! దాంతో పిల్లలిద్దరికీ అర్థం అయ్యింది- 'వీడు ఎవరో మంచివాడు కాదు' అని, వాడు వచ్చేసరికి జాగ్రత్తగా ఒక మూలన నక్కి కూర్చున్నారు. ఆరోజు రాత్రి రాక్షసుడు వచ్చీ రాగానే "ఎక్కడున్నారు పిల్లలు?!" అని చూసి, "నిద్రపోతున్నారులే" అని అన్నంతినేసి వెళ్ళి పడుకున్నాడు. అప్పుడు అక్క-చెల్లి ఇద్దరూ మెల్లగా లేచి వెళ్ళి, ఆ రాక్షసుడి తోకకు పరుపులు, దుప్పట్లూ అన్నీ చుట్టి కట్టేసి, నూనె పోసి అగ్గి ముట్టించి, ఆ గదిలోంచి గబగబా బయటికి పరుగెత్తి గొళ్ళెం వేసేసారు.   రాక్షసుడు లేచి చూసుకునేసరికి వాడి పరుపు, తోక అన్నీ‌ అంటుకొని ఉన్నాయి! దాంతో వాడు గట్టిగా అరుస్తూ‌ పారిపోదామని చూశాడు. కానీ బయటినుండి గొళ్ళెం వేసి ఉంది కదా, ఏమీ చేయలేక చివరికి వాడు కాస్తా మాడి మసైపోయాడు. తెల్లవారాక అక్క-చెల్లి ఇద్దరే ధైర్యంగా పోయి వాడిని లాక్కెళ్ళి భవంతిలోనే బూంచి పెట్టారు. ఇంక ఆ రోజునుండీ వాళ్ళిద్దరే ఆ భవంతిలో ఉంటూ, అక్కడి తోటలో కొంచెం కూరగాయలు, ఆకుకూరలు, రాగులు అన్నీ పండించుకొని తింటూ హాయిగా ఉన్నారు.   అక్కడ రాక్షసుడి దగ్గర, ముందుగానే చాలా ఆవులు గేదెలు ఉండినై; ఇప్పుడు అక్క-చెల్లెళ్లకు అవి బాగా దగ్గరైనాయి. చెల్లెలేమో రోజూ ఆవుల్ని గేదెల్ని మేపేందుకు వెళ్లేది. అక్క ఇంట్లో పని చూసుకునేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇంక అక్కడ, వాళ్ల రాజ్యంలో, రాజుగారు ప్రొద్దునే లేచి 'పిల్లోల్లు ఏరి?' అని చూస్తే ఎక్కడా లేనే లేరు! "వీళ్ళెక్కడికి పోయారు?" అని మంగళనడిగితే "నాకేం తెలీదు" అన్నది. రాజుగారు పిల్లలిద్దరికోసం రాజ్యమంతా వెతికించాడు గానీ, ఎవ్వరికీ వీళ్ళున్న భవంతి కనబడనే లేదు. దాంతో రాజుగారు చాలా బాధపడ్డాడు. "బాధపడకు, నీకేమీ పర్వాలేదు" అని చెప్పి, మంగళ మెల్లగా రాజును మంచి చేసుకున్నది. కొంతకాలానికి రాజుకు కూడా మంగళ మీద ప్రేమ కలిగింది. "ఈమె చాలా మంచిదిలాగున్నది. ఇంక ఈమెని పెళ్ళి చేసుకుంటాను" అనుకున్నాడు రాజుగారు. పిల్లలిద్దరూ రోజూ హాయిగా పనులన్నీ చేసుకొని, బాగా వండుకొని తింటున్నారు కదా, ఇద్దరూ‌ బాగా పెద్దయినారు; యుక్తవయసు వచ్చింది. ఇద్దరూ దేముడికి రోజూ మొక్కుకుంటున్నారు.   అక్కడ రాజు మంగళను పెళ్ళి చేసుకోవాలని అనుకోగానే, ఇక్కడ దేముడు అతని కళ్ళు తెరిపించాలనుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి ప్రక్క ఊరి రాజకుమారుడు అటుగా వెళుతున్నాడు. అతనికి ఈ భవనం కనిపించింది; బాగా దాహంకూడా వేసింది. "ఇక్కడ ఎవరో‌ ఉంటారు. నాకు నీళ్ళు దొరుకుతాయి" అని అతను ఇంటి తలుపు తట్టాడు. ఆ సమయానికి చెల్లె అక్కడ లేదు. అక్క ఒక్కతే ఉండింది. రాజకుమారుడు ఆమెని చూసి "మాది ప్రక్క ఊరే! దారిలో‌ పోతాఉంటే దాహం‌ అయ్యింది. నీళ్ళు ఇవ్వు" అని అడిగాడు. అక్క నీళ్ళు తెచ్చి ఇచ్చింది. "నువ్వెవరు, ఇక్కడెందుకు ఉన్నావు ఒంటరిగా?" అని అడిగాడు రాజకుమారుడు. ఆమెను చూడగానే రాజ కుమారుడికి ఆమెను పెళ్ళి చేసుకోవాలని అనిపించింది. "నేను ఒంటరిగా ఉండను. ఇక్కడ మా చెల్లి కూడా ఉంటుంది. మేం ఇద్దరమూ ఇట్లా పలానా రాజుగారి పిల్లలం.." అని వాళ్ల కథంతా చెప్పింది అక్క.  "సరే అయితే, మరి నన్ను పెళ్ళి చేసుకుంటావా, నాతో‌ మా దేశానికి రావచ్చు?!" అన్నాడు రాజకుమారుడు. "మా చెల్లెని కూడా‌ తీసుకెళ్దాం" అన్నది అక్క. అయితే వాళ్ళు మూడు రోజులు ఎదురు చూసినా, చెల్లి మటుకు ఇంటికి రానే లేదు! రాజకుమారుడేమో "మనం వెళ్దాం- మీ చెల్లె కోసం మళ్ళీ రావచ్చులే" అని బలవంత పెడుతూనే ఉన్నాడు. చివరికి అక్క "సరే" అని అతనితోబాటు బయలుదేరింది. అయితే తను బయలుదేరే రోజున చాలా పూలు కోసుకొచ్చి, తను వెళ్ళే దారిలో అంతా ఆ పూలరేకులు చల్లుకుంటూ‌ పోయింది- 'చెల్లెలు వచ్చి చూసుకుంటుంది కదా' అని. చెల్లెలు ఆవుల్ని, ఎనుగొడ్లను వెంటబెట్టుకొని మరుసటి రోజే ఇంటికి వచ్చింది. 'అక్క లేదే' అనుకున్నది. కొంచెం సేపు వెతికాక, పూల దారిని కనుక్కున్నది- ఆ దారివెంట నడవటం మొదలు పెట్టింది. అయితే కొంత దూరం పోయాక, పూలబాట ఆగిపోయింది! పూల రెక్కలన్నీ గాలికి చెల్లా చెదరైపోయి ఉన్నాయి! చెల్లెలు ఏదో ఒక దారిని పట్టుకొని పోయింది. పోగా పోగా చివరికి వాళ్ల నాన్న రాజ్యమే ఎదురైంది! ఆ సరికే రాజుగారు మంగళను పెళ్ళి చేసుకోబోతున్నాడు. రాజ్యంలో ఎవ్వరికీ మంగళ అంటే ఇష్టం లేకుండింది. ఇప్పుడు చెల్లెల్ని చూడగానే ప్రజలంతా "ఈమే మా యువరాణి" అని ఆమెను ఊరేగింపుగా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆమెను చూడగానే కళ్ల నీళ్ళు పెట్టుకున్నాడు రాజుగారు. "అక్కేది? మీరు నన్ను వదిలి ఎందుకు వెళ్ళారు అసలు?" అని అడిగాడు. వాళ్ల మాటల్లో మంగళ మోసం కాస్తా బయట పడ్డది. రాజుగారు మంగళను దేశంలోంచి బహిష్కరించారు. "పద, పద అక్కను పిల్చుకొద్దాం" అంటుండగానే, అక్క- ఆమెను పెళ్ళి చేసుకున్న యువరాజు అక్కడికి వచ్చారు. అప్పటి నుండి అందరూ కలిసి సంతోషంగా జీవించారు! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

అనుకున్నదొకటి

అనుకున్నదొకటి!     అనగనగా ఒక కుక్క ఉండేది. అది చాలా తుంటరిది. ఒకనాడు ఆ కుక్క ఒక తోకను చూసింది. అది ఆ తోకను ’ఎలుక తోక’ అనుకుంది. అనుకోవటం ఆలస్యం, వెళ్ళి ఆ తోకను పట్టుకోబోయింది; కానీ దాని అడుగుల శబ్దం విని ఎలుక తొర్ర లోపలికి పారిపోయింది.   కొన్నిరోజులకు ఆ కుక్కకు ఇంకో తోక కనబడింది. అది ఒక ఉడతది. కుక్కకు నోరూరింది. ఉడత తోక కోసం పైకెగిరింది. అమ్మా! ఉడత అంత సులువుగా దొరికేదేనా? -అది కూడా తప్పించుకుంది. చేసేదిలేక కుక్క ఊరుకున్నది.   ఒకసారి కుక్క ఊరి బయటికి పోయింది. అక్కడున్న పొదలలో దానికి ఇంకొక తోక కనిపించింది! కుక్క మెల్లగా నక్కి నక్కి వెళ్ళి ఆ తోకను పట్టుకోబోయింది. కొంచెంగా పట్టుకున్నది కూడాను. కానీ పొదలో ఉన్న నక్క శక్తి కొద్దీ తోకను వెనక్కి లాక్కుని పారిపోయింది. నోటచిక్కిన తోకను కోల్పోయినట్లయింది కుక్కకు. కానీ పాపం, ఏం చేయగలదు? అక్కడినుండి మెల్లగా వెనుదిరిగింది.   మరొకనాడు కుక్క ఒక అడవికి పోయింది. అక్కడకూడా, కుక్కకు ఒక తోక కనబడింది-రెండు రాళ్ల సందున. ఆసరికి తోకల వేట అలవాటయింది కుక్కకు. ఈసారైనా తోకను వదలకూడదనుకున్నది. ఒక్క ఉదుటున ఎగిరి తోకను నోట చిక్కించుకున్నది. తన తోక ఎక్కడుందో, ఏమైపోతోందో అర్థం కాలేదు, గాఢ నిద్రనుండి అకస్మాత్తుగా మేలుకున్న పులికి. అది వెంటనే అడవంతా దద్దరిల్లేలా గర్జించింది.   ఊహించని పరిణామానికి ఉలిక్కిపడిన కుక్క, తోకను వదిలి, వెనక్కుచూడకుండా,...... ఏం చేసిందంటారు?......ఆ ..కరెక్టే... సరిగ్గా అదే చేసింది- తోక ముడుచుకొని పరుగెత్తింది!    కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

గుణమే అందం

  గుణమే అందం     అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఒక వెంట్రుక, రెండవ భార్యకు రెండు వెంట్రుకలు ఉండేవి. రాజుకి చాలామంది సలహాదారులు ఉండేవాళ్ళు. వాళ్లలో ఒకడు రెండో భార్యకు దగ్గర. ఒకసారి ఆమె వాడితోటి రాజుకు చెప్పించింది: "ఒక వెంట్రుక ఉండే భార్య కన్నా రెండు వెంట్రుకలు ఉన్న భార్య మేలు" అని. వాడి మాటలు పట్టుకున్న రాజు మొదటి భార్యని బయటికి గెంటేశాడు. మొదటి భార్య అప్పుడు బాధపడుకుంటూ పోతూంటే దారిలో కొన్ని నల్ల చీమలు కనిపించాయి. అవి ఆమెతో అన్నాయి "అమ్మా! అమ్మా! మమ్మల్ని తొక్కద్దు తల్లీ! ఎప్పుడైనా నీకు నోటి నిండా చక్కెర పోస్తాము" అని. "సరేలే, మిమ్మల్ని తొక్కితే నాకేమొస్తుంది?" అని ఆమె వాటిని తొక్కకుండా ముందుకు పోయింది.   ఇంకా ముందుకు వెళ్ళాక ఆమెకు ఒక గాడిద కనిపించింది. గాడిద ఆమెతో "అమ్మా! అమ్మా! నాకు కొంచెం గడ్డి వేయమ్మా, ఎప్పుడైనా నిన్ను ఎక్కించుకొని తీసుకు వెళ్తాను!" అంది. "సరేలే పాపం ఆకలి వేస్తుండచ్చు" అని ఆమె గాడిదకు గడ్డి వేసింది. ఇంకా ముందుకు వెళ్తుంటే అక్కడ ఒక పాడుబడ్డ గుడి కనిపించింది. అందులో దేవుడు ఆమెతో మాట్లాడాడు: "అమ్మా! నాకు పూజ చెయ్యమ్మా! ఎప్పుడైనా నీకు ఒంటినిండా నగలు ఇస్తాను" అని. "నీ నగలు నాకెందుకులేగానీ, నీకు పూజ చేస్తాను ఆగు!" అని ఆమె ఆ గుడి అంతా ఊడ్చి శుభ్రం చేసి, అక్కడి అక్కడి పూలు తెచ్చి దేవుడికి పూజ చేసింది. ఇంకా అట్లా పోతా ఉంటే ఆమెకు ఒక అవ్వ కనబడింది. "నాకేదైనా ఒక రొట్టి కాల్చి పెట్టు తల్లీ! నాకు తెలిసిన సాయం నేను చేస్తాను" అంది అవ్వ. "దానిదేమున్నది, నీ సాయం నాకేమీ‌ అక్కర్లేదుగానీ, రొట్టె కాల్చి ఇస్తాను ఆగు!" అని అవ్వకు రొట్టె కాల్చి ఇచ్చింది రాణి. రొట్టె తిన్నాక అవ్వ రాణిని చూసి "నీకు వెంట్రుకలు కావాలంటే ఏం చేయాలో తెలుసుగా?" అంది.     "అయ్యో! అది తెలిస్తే ఇక్కడిదాకా ఎందుకొస్తుంది కథ?" అని రాణి ఆమెకు తన కథ అంతా చెప్పుకుని, "ఇంతకీ అవ్వా! నాకు వెంట్రుకలు రావాలంటే ఏం చేయాలో చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది" అని అడిగింది. అప్పుడు ఆ అవ్వ ఆమెకు ఒక నది చూపించి, "అందులో మునుగు. నీకు ఏది రాసి ఉంటే అట్టాగ అవుతుంది" అని చెప్పింది. సరే అని రాణి ఆ నదిలో మునగగానే ఆమెకి తల నిండా నల్లని వెంట్రుకలు వచ్చేసాయి! రాణి అవ్వకు దణ్ణం పెట్టుకొని వెనక్కి తిరిగింది. "దారిలో దేవుడిని కలిసి పో తల్లీ!" అని చెప్పింది అవ్వ. సరేనని వెనక్కి పోయి దేవుడికి మొక్కుకున్నది రాణి. దేవుడు తన మాట ప్రకారం ఆమెకు ఎక్కడలేని నగలూ ఇచ్చాడు. ఆమె ఆ నగలు పెట్టుకొని నడుస్తూ పోతావుంటే గాడిద ఎదురై, "మీదికి ఎక్కు! నిన్ను బాగా తీసుకు పోతా" అంది. అట్లా దేవుడిచ్చిన నగలు పెట్టుకొని, గాడిదనెక్కి పోతున్న రాణిని చూడగానే చీమలు ఆమె నోటినిండా చక్కెర పోసి పంపించినై. అట్లా వచ్చిన రాణిని చూసి రాజు ఇంక నోట మాట రాకుండా అయిపోయినాడు. వెంటనే రెండో భార్యని గెంటేసి, మొదటి భార్యని పిలుచుకున్నాడు.   పోతూ పోతూ రెండో భార్య మొదటి భార్యను అడిగింది- "అక్కా! నీకు ఇన్ని వెంట్రుకలు ఎట్లా వచ్చినాయి?" అని. మొదటి రాణి చెప్పింది "చీమల్ని తొక్కకుండా, గాడిదకు గడ్డి వేసి, దేవుడికి పూజచేసి వెళ్ళి, అవ్వకు రొట్టె కాల్చి ఇచ్చి, నదిలో‌ మునగాలి" అని. "సరేలే, దానిదేముంది, నేనూ నదిలో మునిగి నిండా వెంట్రుకలు పెట్టుకొని వస్తాను" అని అదే దారిలో పరుగెత్తింది రెండో రాణి. అట్లా ఆమె పరుగు పెడుతుంటే చీమలు ఆమెను వేడుకొన్నాయి "తల్లీ తల్లీ! మమ్మల్ని తొక్కకు! నీకు నోటినిండా చక్కెర పోస్తాము" అని. అయినా నదిలో మునగాలని తొందరలో ఉన్న ఆమె, వాటిని అలాగే తొక్కుకుంటూ పరుగు పెట్టింది. ఇంకాస్త ముందుకు వెళ్లాక గాడిద అడిగింది "తల్లీ! నాకు కొంచెం గడ్డి వేయి. నిన్ను ఎప్పుడైనా ఎక్కించుకు వెళ్తాను" అని. కానీ "నువ్వు నన్ను ఎక్కించుకునేదేంది, నేనే పరుగు పెడతా వేగంగా" అని గడ్డి వేయకుండానే వెళ్ళిపోయింది ఆమె. అట్లాగే దేవుడు కూడా ఆమెని అడిగాడు "పూజ చేసి పో తల్లీ! ఎప్పుడైనా నీకు నగలు ఇస్తాను" అని.     "నీ నగలు నాకెందుకు? నాకే కొల్లలుగా ఉన్నాయి" అని పూజ చెయ్యకుండానే వెళ్ళిపోయింది ఆమె. అక్కడ అవ్వకు రొట్టె కూడా చేసి పెట్టలేదు. "నీ రొట్టె నువ్వు కాల్చుకో! ఇంతకీ నదికి దారి ఏది?" అని అడిగింది. అవ్వ నది వైపు చూపించగానే, అక్కడికి పరుగు పెట్టి బుడుంగుమని మునిగింది చిన్న రాణి. లేచి చూస్తే ఏముంది, ఆమెకు ఉన్న రెండు వెంట్రుకలూ ఊడిపోయినై! అవ్వని అడుగుదామని చూస్తే అక్కడ అవ్వా లేదు, అవతలగా దేవుడూ లేడు, గాడిదా, చీమలూ ఏవీ లేవు!! నిండా గుండు అయిన చిన్నరాణి మళ్ళీ రాజు దగ్గరికి, పెద్ద రాణి దగ్గరికి వెళ్ళి, తన తప్పు ఒప్పుకున్నది. రాజు, రాణి ఆమెను క్షమించి ఇంట్లో పెట్టుకున్నారు. క్రమంగా చిన్నరాణికి కూడా వెంట్రుకలు వచ్చేసాయి! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో