మళ్లీ జన్మించాలా...!!

  మళ్లీ జన్మించాలా...!!                                    ఎప్పుడూ ఏదో ఆలోచన తెగదు.... తెల్లారదు ఎందుకో ఏమిటో అర్థంకాదు, అంతం లేదు ఈ జీవన యవనికపై నటించడం కష్టంగానే ఉంది. ఎందుకంటే.... నాకు నేను గుర్తు చిక్కడం లేదు పుట్టిన నాటికి నేటికీ ఎన్నో మార్పులు కొన్ని వచ్చినవి, కొన్ని కల్పించుకున్నవి... మరికొన్ని వాటికవే నాలో ప్రవేేశించినవి. ఈ ఎడతెగని బంధాలలో నేను బంధీనై పోతున్నాను. వద్దనుకుంటూనే, వదల్లేకున్నాను. మొన్న సినిమా, నిన్న షాపింగ్, నేడు ఇంటర్నెట్ లో ఛాటింగ్ అంతా మయాజాలంగా ఉంది, విడిపోతున్న సంబంధాలు, చంపేస్తున్న ప్రేమలు. ఒకరితో లవ్, మరొకరితో డేటింగ్, ఇంకొకరితో పెళ్లి. మానవ సంబంధాలన్నీ అవసరాలు, ఆర్థిక శక్తుల్లో నలిగిపోతున్నాయి. అందుకే నా బాల్యపు చిగురు మోడుబారి పోతుంది. కొబ్బరి చెట్లమధ్య చందమామ కనుమరుగవుతున్నాడు. ఆనాటి బోసినవ్వుల్లో ఏదో వెలితి నాదో చిన్నకోరిక... చిన్న మనవి... నా బాల్యంలోకి నన్ను తీసుకెళ్లి నాకు మళ్లీ జీవించడాన్ని నేర్పించరూ.. ప్లీజ్.. నా ఆనవాళ్లను నాలో నింపరూ... ప్లీజ్... నాక్కొద్దిగా స్వచ్ఛమైన మనిషి ఇచ్చే ఆప్యాయతని రుచి చూపించరూ... ప్లీజ్... ప్లీజ్... ప్లీజ్... మనిషిని వెతకడం కష్టంగా ఉంది. అందులో మర్మంలోని ప్రేమను వెతకడం మరీ కష్టంగా ఉంది. అందుకే నన్ను మళ్లీ బాల్యానికి తీసుకెళ్లండి. లేదంటే... మళ్లీ జన్మించేలా వరం ఇవ్వండి.. చంపేసి అయినా ఫర్వాలేదు. ఒక్కసారి జీవించడానికి ఎన్ని జన్మలైనా ఎత్తాలి కదా. - డా. ఎ.రవీంద్రబాబు

ఏదో చెప్పాలనిపించి

ఏదో చెప్పాలనిపించి ఒక్కో రోజు ఒక ప్రశ్నా పత్రాన్ని మన చేతికి ఇస్తుంటాడు సృష్టికర్త దానిలో గట్టెక్కడం మన నడకలో, నడతలో  ఉంది వెతికి చూసుకున్న తర్వాతే తెలిసింది నా చిరునామాలో నేను లేనన్న నిజం ప్రేమను నన్ను పెంచిపోషించే ఓ ఎరువనుకున్నాను కానీ అదే నా ప్రత్యర్ధి అయ్యింది ఇది కవిత కాదు రాస్తున్న నా పెన్ను ద్వారా కారుతున్న నా కన్నీరని ఎవరికి తెలిసినా తెలియకున్నా నీకు తెలిస్తే చాలు నా ఒక్కో కన్నీటి చుక్కా తాజ్ మహలే ఈ భూమ్మీద పడ్డాం రా మన వాటా కన్నీటిని ఆఖరి బొట్టు వరకు కార్చేద్దాం అనాధగా ఏడుస్తోంది మన ఇద్దరికీ పుట్టిన ప్రేమ నా కవితలు ఆరిన గాయాల మచ్చలు అనుభవమూ ఒక ఆయుధమే ఒకే సూర్యుడే వేర్వేరు రోజుల్ని మన ముందు ఉంచుతున్నాడు - యామిజాల జగదీశ్

నన్ను తెలుసుకుంటావా

నన్ను తెలుసుకుంటావా !   అవును... నేను స్త్రీని సృష్టి నా తల్లి సూర్యుడు నా వెలుగు కోటి మల్లెల గంధం.. నా మనస్సు ప్రపంచం ఉయ్యాల ఊగి ఊగి నా దగ్గరే ఆగిపోతుంది నా కళ్ళలోకి సూటిగా చూడు అనేక జన్మ రహస్యాలు బెంగగా గుర్తొస్తాయి నేనెంత బలవంతురాల్నో అంత నిర్బాలను కూడా! ప్రేమకోసం ఓడిపోయి గెలవటం నాకిష్టం నా కళ్ళల్లో మెరపు నా మొహంలో కాంతులున్నా పెదవుల చిరునవ్వుల చాటున హృదయాకాశం నిండా పరుచుకున్న వేదన తెలుసా!! నన్ను అందంతో కొలువగలవా ? ఆనందంతో పోల్చగలవా షరతులు లేని నా ప్రేమను పసిదాని అరచేతుల స్పర్శతో తమ్ముడి నెత్తుకునేఅక్క గారాబంతో రక్తంలో కలిపిన అమ్మపాలతో సరిపోల్చుకుని చూడు నీకంటే బరువులెత్తుకుని శక్తికి మించి పరిగెత్తే నీ సహచరి పాదాల్లో నా మూలలున్నాయి చూడు కనిపించని ప్రేమ గురించి ఎందుకు గానీ సకల విశ్వ సత్యానికి ప్రతీకగా నీ ఇంట్లోనే ఉన్నాను కదా!! నన్ను తెలుసుకుంటున్నావా? నిన్ను వదులుకోగలవా మరి !! - భవానీదేవి

ఆనందం అర్ణవమై

  - డా. ఎ. రవీంద్రబాబు     ఆనందం అర్ణవమైతే     ఆంబరం ఆటస్థలమైతే     పువ్వుల నవ్వుల జల్లుల్లారా     వికసించే ఆత్మీయ బంధాల్లారా         మీ మనసుల నక్షత్రాలు ప్రకాశిస్తే     మీ అమాయకపు చేష్టలు అవలోకిస్తే     ఎన్ని సుమధుర నాదాలు     ఎన్ని సృజనాత్మక చిత్రాలు     ఎన్ని మనోరంజ మకరంద మాలలు         ఈ సృష్టియవనికపై, మా హృదయ కవాటాలపై     మనో నేత్రాల దీవుల్లో, ప్రకృతి పులకింతల్లో     ఆడిపాడి... లయించి, స్మరించి, ధ్యానించే     పాపం, పుణ్యం ఎరగని బుడతల్లారా     ఆత్మీయ నేస్తాల్లారా... ఆనందపు పొలిమేర్లల్లారా         వానవీణ మీటిన చిరుగాలి సితారాలా     రంగు రంగుల సీతాకోక చిలుకల నాట్యాల్లా     ఆ దేవుడ్ని మించిన మా పాలకుల్లా     నిలిచే, పిలిచే, ఎదిగే, నడిచే     పిల్లల్లారా... పాలనవ్వుల పొంగుల్లారా         తోటలో పూసిన పసి ప్రాణుల్లా     ఎద లోతుల్లో విరిసిన జ్ఞానంలా     కాలం కలిపిన కరదీపికలా     భవిష్యత్ దారికి చుక్కానుల్లా     కలిసి ఎదుగుదాం...         ఆత్మీయ స్పర్శలా...     అనురాగపు సింధువులా...     అనుబంధాలకు చిరునామాలై...    

నిత్య స్వతంత్రం

నిత్య స్వతంత్రం                                                         తెల్లవారితే స్వతంత్రదినోత్సవం. స్వతంత్రభారతికి అక్షర నీరాజనాలర్పించాలని కాగితం, కలం ముందుంచుకుని ఆలోచనా తపస్సులోకి వెళ్ళిపోయాను. అదేమి చిత్రమో తెలియదుగానీ, ఎప్పుడూ కదం త్రొక్కే                నా మేథాశ్వం నేడు అడుగు కదపనని మొండికేసింది. నిముషాలనూ, గంటలనూ నిర్దయగా నలిపేస్తూ... కాలం తన దారిన తను వెళ్ళిపోతూనేవుంది.... మౌనంగా. భావప్రసవానికై పురిటి నొప్పులు పడుతున్న నేను, ఎందుకో కన్నులు తెరిచి చూసాను.....నాకు తెలియకుండానే. నిబిడాంధకారం తప్ప మరేదీ కనిపించలేదు నాకు. గమ్యం తెలియని బాటసారిలా బయటకు బయలుదేరాను. శ్రావణమాసపు శీతల గాలులు శరీరాన్ని సేద దీరుస్తున్నాయి. నేను నడుస్తున్నా.... నా మనస్సు మాత్రం ఆలోచిస్తూనే వుంది. ఎక్కడనుంచో లీలగా చిరునవ్వుల జల్లులు నా ఏకాగ్రతనూ, ఏకాంతాన్ని ఒక్కసారి భగ్నం చేసాయి. నాకు తెలియకుండానే నేనా దిశగా వెళ్ళాను. ఒక నవయవ్వన సౌందర్యరాశి...వనమయూరాలతో, స్వర్ణహరిణాలతో పాటలు పాడుతూ, ఆటలాడుతూ  నాకు కనిపించింది. శుక, పిక, సారస సమూహాలు తమ కలస్వనాలతో...ఆమె స్వతంత్ర లయవిన్యాసానికి స్వరజతులు వేస్తున్నాయి. సింహ, శార్దూల, మత్తేభ, భల్లూకగణాలు... ఆమె నాట్యభంగిమలను నయనమనోహరంగా తిలకిస్తూ,  ఆనందంతో చిందులేస్తున్నాయి. ‘‘ఆహా! ఎంతటి స్వేచ్ఛా సంబరం! ’’ అనుకుంటూ అనిమిషనేత్రుడనై తిలకిస్తున్న నన్ను దగ్గరకు రమ్మని ఆ సుందరి పిలిచింది. మంత్రముగ్ధుడనై నేను ఆమె దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. ‘‘నాకు అక్షర నీరాజనాలర్పించాలని వచ్చావు కదూ!’’ కోటి సితారులు మీటినట్లు పలికిందామె... ఒయ్యారాలుపోతూ. ‘‘ ఔనన్నట్లు’’ ఎంతో నిజాయతీగా, అమాయకంగా తలూపాను. ఆ అడవి ప్రాణులు ఎంతో అవహేళనగా పకపకా నవ్వాయి. వాటి నవ్వులోని భావం నాకు అర్ధం కాలేదు. ‘‘ అమాయకుడా! అర్ధంకాలేదా! అయితే విను. నేనేనాడూ అస్వతంత్రురాలిని కాదు. స్వేఛ్ఛాసంచారిని. మీరే...మీ రచయతలే.... మూర్ఖులు, శాడిస్టులు. మీ అస్వతంత్ర భావాల బందిఖానాలో నన్ను బంధించి వుంచడం మీ నైజం. వాస్తవంలోనే కాదు...భావనలో కూడా స్వతంత్రంగా బ్రతకలేని దుర్బలులు మీరు. నా గురించి నీకు తెలియదేమో! నా నడకలో ఎప్పుడూ పవిత్ర భాగీరథి హొయలున్నాయి. నా ఎదలో ఎప్పుడూ పావన గోదావరి గలగలలున్నాయి. నా గళంలో ఎప్పుడూ  మధురామృత రారులున్నాయి.   నా పదంలో కృష్ణాతరంగ మృదంగ విన్యాసాలున్నాయి.                    నిత్య వసంత ఋతుశోభ నా స్వంతం. వేద విఙ్ఞాన  వాఙ్మయ వైభవం నా గంధం. సనాతన సాంప్రదాయాలకు సాకారం....నా ఆకారం. అందాన్ని, ఆనందాన్ని దర్శించలేని అంధులు కనుకనే... మీ రచనల్లో నన్ను నిరంతర బందీని చేసి... ఆనందిస్తూంటారు.                               రక్తాక్షరాలతో మృత్యుగీతాలు రాసుకుంటూ...సంతోషిస్తూంటారు. జాతి వైషమ్యాలు, కుల కార్పణ్యాలు, భాషా భేదాలు పెంచుకోమని నేను మీకు ఏనాడైనా చెప్పానా? సరిహద్దు రేఖలు గీసుకుని సంగరాలు సాగించమన్నానా? మానవత్వాన్ని మరచి మారణహోమాలు చెయ్యమన్నానా?                                   మీతోపాటు సమానంగానే కన్నానే ఈ ప్రాణులను కూడా...! కానీ...ఇవేనాడూ వర్గభేదంతో, విభేదించడం నేను చూడలేదు. సమైక్యతా భావమేరా...  ‘‘స్వతంత్రం ’’ అంటే. ఐకమత్యతా జీవనమేరా...‘‘స్వతంత్రం’’ అంటే. అడ్డాలనాడే  గానీ...గడ్డాలనాడు కాదు...బిడ్డలంటే. అందుకే...మాతృత్వ మమకారాన్ని కూడా చంపుకుని, మీ నరజాతి మొత్తాన్ని శాశ్వతంగా వెలి వేసాను. మేథోవంతులమనే అహంకారంతో మీరు చేసిన స్వయంకృతాపరాధానికి, నేను మీకు వేసిన శిక్ష ఇదే. మీకు ఏడాదికి ఒకేఒక్క స్వతంత్రదినం. కానీ...మాకు ప్రతినిత్యం స్వతంత్రదినమే. ఫో!  పోయి నిస్సారమైన కవితలు రాసుకుంటూ కాలం గడుపు.’’ ఆమెలా కటువుగా పలుకుతున్నా...అవి కఠోర సత్యాలనిపించాయి నాకు. ఆత్మవంచన చేసుకుంటూ...అష్టైశ్వర్యాలతో తులతూగడంకన్నా.., అనంత స్వతంత్రం అనుభవించే ఆ అరణ్యమృగాలతో కలసి జీవించడం మేలనిపించింది నాకు. అంతే.... అహం విడచి, ఇహం మరచి అవనత శీర్షంతో క్షమించమంటూ..  ఆ తల్లి పాదాల మీద వాలిపోయాను. నా కన్నీరు ఆమె పవిత్ర పాదాలను అభిషేకించాయి. ఆ తల్లి ఎంతో ప్రేమతో నన్ను అనుగ్రహించి, ఆశీర్వదించింది. ద్విపాదినైన నేను....చతుష్పాదినయ్యాను.                            యం.వి. సుబ్రహ్మణ్యం

రక్షాబంధనం (రాఖీ )

 రక్షాబంధనం ( రాఖీ )    రక్షాబంధనమంటే   ఒక చెల్లి...ఒక  అన్నకు కట్టే సిల్కు తాడు కాదు  ఒక అక్క ...ఒక తమ్ముడికి కట్టే దారపు పోగు కాదు నమ్మకాన్ని కోరుతూ సోదరి కట్టే ప్రేమసూత్రం. రక్షణనిచ్చే సోదరుడిని ఏకష్టం తాకరాదని శాసిస్తూ     కట్టే రక్షాసూత్రం. తల్లిదండ్రులు లేకున్నా  అన్నీ తానై ఉంటానంటూ ఓ అన్న ... చెల్లికి చేసే వాగ్దానం ఓ తమ్ముడు... అక్కకి చేసే  కృతజ్ఞతాభివందనం. ప్రతీ కుటుంబానికి కావాలి  కట్టిన చేయికి కష్టం కలగనివ్వని అన్న కట్టించుకున్న చేతికి నొప్పి తెలియనివ్వని చెల్లి తమ్ముడి బాగోగులు చూసే అక్క  అక్కని జీవితాంతం కంటికి రెప్పలా కాచే తమ్ముడు                                                                    ... @ శ్రీ