ప్రశాంతత (కవిత)

  ప్రశాంతత     ఏ బాదరాబందీ లేని కొన్ని మౌనాలు కావాలిప్పుడు ఆడంబరాలన్నీ శూన్యమైపోయిన నిశ్శబ్ధం కొద్దిగా కావాలిప్పుడు మెదడులో నిక్షిప్తమై ఒత్తిడి పెంచుతున్న పనుల చిట్టా టెంపరరీగా రిమూవ్ అయిపోవాలిప్పుడు ఎంత యాంత్రికమైపోయాం మనం! ఉదయం పూట లీలగా వచ్చి పలకరించే చల్లగాలిని గాబరా గాబరాగా సింక్ నీళ్ళ కింద స్నానం చేస్తున్న వేడి పప్పు కుక్కర్ ఎప్పుడూ డామినేట్ చేస్తూఉంటుంది ఆఫీస్ నుంచి వస్తూ బురదలో ఆనందంగా ఎగురుతున్న వీధి బాలలను చూసి ఏం కోల్పోతున్నామో గ్రహించే లోపే..చీకటి పడితే బస్ మిస్సయిపోతామన్న భయం తొందరపెడ్తూ ఉంటుంది ఇన్ని గంధరగోళాల తర్వాత రాత్రి వంట గుబులు .. శిథిలావస్థలో ఉన్న పాత టేప్ రికార్డర్ మూలుగును నొక్కి పెట్టేస్తుంది.. రోజంతా గజిబిజిగా విలవిల్లాడుతున్న మనసుకు కొంత ప్రశాంతత కావాలిప్పుడు ఒక నిశ్శబ్ధ శబ్ధాన్ని గుండెల నిండా నింపుకోవాలనుందిపుడు.   -సరిత భూపతి 

ఏ యుగం చూసినా ఏమున్నది గర్వకారణం (కవిత)

ఏ యుగం చూసినా ఏమున్నది గర్వకారణం   యా దేవీ సర్వభూతేశు మాతృరూపేణ సంస్థిత లోకమాతా! లవకుశులంటి వీర కొమరులెవరూ లేరిక్కడ క్షమించాలి వీరత్వం లేకపోవటమేమిటీ కామంతో కళ్ళు బయర్లు కమ్మి, నీ మాతృరూపాన్ని కూడా గుర్తించని మెుగతనమంతా వీరత్వమేగా యా దేవీ సర్వభూతేశు శాంతిరూపేణ సంస్థిత ఎంత ఎమోషనల్ బ్లాక్ మెయిలింగో నిన్ను పొగిడినపుడే గుర్తించాల్సింది రాఘవప్రియా! ఆ ప్రియత్వం అంతా చేయని అపరాధాన్ని మోస్తూ అగ్నికి నిన్ను నువ్వు అర్పించుకొని పునీత అని నాలుగు నోళ్ళలో నానితేనే బయటపడుతుందనీ, కర్కశత్వానికి భయపడి తల్లి ఒడిన దాగోకపోతే ఇంకెన్నాళ్ళో కదూ రామవల్లభా అని పిలుస్తూ నిరంతరం వధిస్తూ విష్ణుపత్నీ! మరి సిరికిన్ చెప్పడే? సిడి ముడి తడబడినా, జారే పవిట ఆపటానికి అష్టకష్టాలు పడటం ముల్లోకాలు చూస్తున్నా, అది నీ పరువు తీయటం కాదనీ గజేంద్రమోక్షం అంటే లోకం చంకలు గుద్దుకొని ఆలకిస్తుందనీ ద్రుపదరాధ్యా.. ధర్మరాజప్రియాయై.. అర్జునవిమోహనాయై.. భీమసేనమనూవల్లభాయై.. సవ్యశాచిశివశాయై .. నకులస్వాంతభూషణాయై వారి నామధేయములను ముందు తగిలించుకున్నా ఆ అయిదుగురు భర్తల ముందు విధవ అవుతుంటే గుడ్లప్పగించి చూసారే?యజ్ఞసంభూతా! పేరుకు తగిలించిన నీ పురుషపుంగవుల పేర్లు ఆనాడే నిన్ను నగ్నంగా చూస్తూ వెక్కిరించాయి కదా స్త్రీ శక్తిస్వరూపిణి.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈ పొగడ్తలన్నీ నిన్ను తుంగలో తొక్కటానికే యుగాలు మారినా ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీ అంటే కార్యేషు దాసీ శయనేషు రంభ   ...సరిత భూపతి

గురుతొకటి (కవిత)

గురుతొకటి   మతపు ముసుగొకటి అవసరం ఇదే లొసుగులున్న ఈ ప్రపంచపు లౌకికస్వరం మారణ కాండలకు కావాలిగా ఆ భాస్వరం! ఉన్నా లేడనిపించే లేకపోయినా ఉన్నాడనపించే ఆ వింత విధాతనెతకడానికి ఎన్నో దార్లు! పుట్టుకతోనే పురిటివాసనకంటే వేగంగా గిట్టుక లేని ఛాందసవాదాల కౌగిలిలో.. నీకు నువ్వు రాసుకొని, నవ్వులరిగిపోయేలా గీసుకొనే, మతతత్వపు మత్తు సిరాని మరింత జల్లుతూ స్వాగతిస్తారు! మహోన్నత లోకానికి మరపు రాని మాయల మతపు వర్ణాన్ని విరచిస్తారు! మనిషిగా పుట్టాక తప్పదేమో, గత జన్మపు పాపపు అప్పేమో, ఈ మతపు గుర్తులు.. మానవత్వం పై! మనిషనే గుర్తొకటుందని ఎవరు గుర్తుచేస్తారో.. ఈ గుంభన సత్యాన్ని ఎవరు గుర్తిస్తారో.. గుర్తొకటి వేస్తారు.. గుర్తొకొటి... నీపై!!!!     Raghu Alla

సం'కీ'ళ్ళు(కవిత)

  సం'కీ'ళ్ళు పరుగలిడకుండా ఆపే కాలి బంధనాల తాళం చెవిని గీయాలిపుడు ఉన్నవవే కదా నేటి కాలపు కుదుపులలో.. అందుబాటు లేని అవసరాల కట్లలో నుంచి, బంధాల పునాదులతో నిర్మించిన జీవితపు వసారాలో కాళ్లు పెట్టి , ఊహల వెలుగులలో కళ్లు మరింత మిటకరించి.. నిను వెక్కిరించే వింత లోకాన్ని విసురుగా చూస్తూ, తలపుల తలుపులకు గడియ పెట్టి, నీదేదో దొరుకుతున్న ఆశల వలువలను సరిచేసుకుంటూ.. అడుగు ముందుకు పడాలనే అద్భుతాన్ని అసాధ్యమనుకోక అప్పుడప్పుడు తడిచే కనులకు ఇప్పుడిప్పుడే గీస్తున్న పొడి చిత్రలేఖనపు నమూనాకి తగలకుండా.. బాధ్యతల రహదారిపై ఊసుల ఊయలలో ఊగలనుకునే బాటసారీ, తెంచుకోవోయ్ సంకెళ్లు.. గీతగీసి రాత రాసి కూత వేసి తనివితీరా నడవాలనిపించే నీ రహదారిపైకి, తాళపు నమూనాని సిద్ధం చేయవోయ్ అలపుల అలల్ని తుడిచేయవోయ్ నీ లోకానికి పరుగులిడవోయ్ నీ పరుగులకి లోకాన్ని సిద్దం చేయవోయ్ నీ సత్తువ లోహాన్ని కరిగించవోయ్.. అది జరిగే వరకూ నిదురించకోయ్!!!!           -రఘు ఆళ్ల