విలక్షణ విళంబీ స్వాగతం

విలక్షణ విళంబీ! స్వాగతం    విలక్షణ విళంబీ! ఇక విలంబంచేయక సలక్షణంగా అరుదెంచు! సకలరంగాలలో మాకు విజయాల్ని కలిగించు ప్రజలందరికీ శాంతి సౌఖ్యాల్ని ప్రసాదించు! పచ్చడి అందించకపోయినా పర్వాలేదుగాని అధిక ధరల భారంతో నలిగి పచ్చడి కాకుండా మమ్మల్ని రక్షించు! అవినీతి అసురనేతలపై నిశిత బాణాల్ని సంధించు! సర్వం స్వాహా చేసే స్వాముల్ని లక్షల కోట్లు "స్కాముల్ని" తక్షణం శిక్షించు! అన్ని చట్టాల్ని తెచ్చినా అంతకంతకూ దేశంలో నలుదెసలా అధికమవుతున్న అత్యాచారాల్నివారించు పండగపూట భాక్ష్యాల్ని ప్రసాదించకపోయినా సరే  మా లక్ష్యాల్నిసాధించేలా అనుగ్రహించు  అలా - పంచాంగాల్ని సవరించు! రచన :  డా|| వడ్డేపల్లి కృష్ణ

తేట తెలుగులోన మనం మాటాడితె - మాధుర్యం

తేట తెలుగులోన మనం మాటాడితె - మాధుర్యం   స ||     అమ్మపలుకులోని ఆర్ద్రత తెలిసియు             "మమ్మన్న" పిలుపుకై మంకు ఏల?            "అయ్య" - "నాయన" బాపు యననెంతొమధురము            "డాడి" యనగనెంచు దంభమేల?            అత్త - మామయు - అక్కయనినంతప్రేమయే            ఎడదలోతులనుండి ఎగిరిపడదె!            రెండు చేతులనెత్తి "దండము" మీకన్న             గుండెలవిసిపోయి కూరు ప్రియము  తే.గీ ||  మనసు తోడుతమాటాడు మనదు తెలుగు             దీనిమించున బాసేది తేనెకన్న                           తీయనైనది  తెలుగని తెలియవొక్కొ!            తెలుగువాడిగా వీడను తెలుగుననియు             తెలుగు తల్లిపై బాసతో తెలుగుకొరకు            ప్రతినజేయుము తమ్ముడా! సతమునీవు             ప్రతినజేయుము అన్నయ్యా! సతమునీవు            ప్రతినజేయుము చెల్లెలా! సతమునీవు                   ప్రతినజేయుమో ప్రభుతమా! భవితనెంచి            తెలుగు రుచియు దెల్సి - తెలుగు తీపి నెరిగి             తిరుగు బాటేలనొయి ఓ! తెలుగులార!            రచన : మడిపల్లి భద్రయ్య

అంతం ఆంరంభానికి నాంది

ఉగాది కవిత అంతం ఆంరంభానికి నాంది   పట్టువదలని కలం  తెలుగింట తిష్టవేసిన గడువుతీరిన ఏడాదిని  భుజాన వేసుకొని మోనంగా నడకసాగించింది నిర్జీవమైన సంవత్సరం ప్రశ్నించింది ఓ కాలమా! ఎందుకు నీకీ ప్రయాస  నువ్వెంత నన్ను మోసుకేళ్ళినా  అరవై ఏళ్ళకు తిరిగి వచ్చేదాన్నే మళ్ళీ తెలుగు లోగిత సందడి చేసేదాన్నే కలం మోనంవీడి హెచ్చరిస్తూ ఓ సంవత్సరమా! పేరు మార్చుకొని  నా వెంట తిరుగుతుంటే సరిపోదు పేరులోనే పెన్నిధి ఉన్నట్లు  జనత మురిసిపోతున్నది  ఆకులను రాల్చుకున్న కొమ్మలు  కొత్త చిగుళ్ళను ఆహ్వానిస్తున్నాయి రేమ్మలన్ని కొత్తపూలనెత్తావిని  ఆష్రూణించటానికి ఆరాటపడుతున్నాయి కలాండజములు పల్లవములనారగించి గానామృతాన్నందించటానికి ఉవ్విళ్ళూరుతున్నాయి కవులు అక్షరమొదళ్ళను తొలచి  మొదళ్ళను కొత్త కవితలల్లటానికి సమాయత్త పరుస్తున్నారు పేరులోనేకాదు నాణ్యతలోనూ కొత్తదనముందని నీవూ చాటిచేప్పుకోవాలి వివేకవంతులెవారూ పాతనే అంటిపెట్టుకొనుండాలని అనుకోరన్నది తరతరాల సత్యం 'అంతం ఆరంభానికి నాంది' అన్నట్లు  నూతనత్వాన్ని నింపుకున్న మరో సంవత్సరానికి  జనం స్వాగతం పలుకుతారంటూ కలం మోనంవహించింది రచన : పొత్తూరి సుబ్బారావు   

తెలుగు భూమి - గేయం

తెలుగు భూమి - గేయం    1.  చూడంగ వలె తెలుగు వాని - చూచి      తీరంగవలె తెలుగు భూమి      ఆ పంచకట్టేటి తీరు - ఓహో      పై పంచ వేసేటి జోరు      మొగమున మీసాలకోరు      ఎంతెంత పనినైన సాధించుతీరు || చూ || 2. చూడంగవలె తెలుగు భామ - భళిరా!      ధీర శూరర చూడలేమ      కాకతీ రుద్రమ్మ, పలనాటి నాగమ్మ      రామాయణపు మొల్ల లెందరోగాయనులు || చూ || ౩. ఎతైన తెలుగమ్మ ఎడద - అందులో       ఎన్నెన్నొ భాద్యతల బెడద      తలలోన తంగేటి పులు       పాండవుల పాటతో పనిలోకి వాలు  || చూ || 4. చూడంగవలె తెలుగు భూమి - చూచి       తీరంగవలె తెలుగు భూమి       బంగారములు పండు పైరు - జీవ       నదులుగ పరుగులిడు నీరు      నల్లగ ఎతైన గిరులు - తెల్లగ      వాటిపై సర్వేశు గుడులు || చూ || 5. అన్న చెల్లలు వరుసలోనో       తల్లిదండ్రుల వరుసలోనో      పల్లెలో నివసించు ప్రజలు       అన్నిరంగాలలో ఆత్మబంధువులు || చూ ||   రచన : నందివాడ కనక దుర్గాప్రసాదరావు 

విరిసిన కవిహృదయం

పద్య కవిత  చైత్ర వసంతాన శ్రీవిళంబి  (విరిసిన కవిహృదయం)  చం||  యుగముల కాదియై, గణన యోగ్యముగా, ప్రభవాదిపేరులన్            జగతిని కాల చక్రమున, చైత్ర వసంత, శుభోదయంబుగన్            సుగతిని జూపి మానిసికి, సుందర నందన మౌచు ధాత్రికిన్            ప్రగతి ఫలాలు పంచగను, వచ్చెనుగాదియు శ్రీవిళంబిగన్ "  చం||   సగటున వర్షపాతమును, సాలున, పంటకు గిట్టుబాటునున్             తగిన యుపాధి కల్పనలు, తగ్గని రాబడి వస్తుసేవలన్             తగవులు లేని పాలనము, ధర్మము దప్పని నాయకత్వమున్             సొగసగు జీవనంబు, మన సొంతము నూతన వత్సరంబునన్" తే||గీ||   వత్స వత్సరానికుగాది, వచ్చుచుండ              నిత్య శోభలన్ వర్థిల్లు, నేలతల్లి              ప్రకృతి యందాలు, మానవుల్, పాడుజేయ             కాలమే, కరవాలమై, కలచివేయు"  ఉ||      పచ్చని పైటవేసికొని, బారులు తీరగచెట్టుకొమ్మలున్             విచ్చిన పూలు దాల్చికొని, వేళలు గాచగ తీవెకోమలుల్             అచ్చికబుచ్చికన్, నెమలు లాడగ, కోయిల గుంపు పాడగన్              వచ్చెను, నేత్ర పర్వముగ, వ్యక్తము కాగ, వసంత మీయెడన్" ఆ||వె||  మధురమైన తెలుగు, మాకందమేయని              చిలుక పలికె నోట, తెలుగు మాట               మధువుకన్న తెలుగు, మాధుర్యమనుకొని               తెలుగు పదము గ్రోలె, తేనెతిండి " . రచన:- పొనకంటి దక్షిణామూర్తి 

ఉగాది కవిత

టోరీ ఉగాది కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత  ఉగాది కవిత   ఉ. స్వాగతమో! విళంబి శుభ వత్సరమా! విజయ ప్రదాయివై సాగరమంత సత్ఫలము సన్మతి నీయగ నేగుదెంచు నీ యాగమనమ్ముతో మదులు హర్ష పరిప్లుత మయ్యె; సత్కృపా యోగము గల్గజేసి సమయోచిత సత్ఫలముల్లోసంగుమా! ఆ.వె. చైత్ర రథము నెక్కి చైతన్య దీప్తితో స్ఫూర్తి తోడ దివ్య మూర్తితోడ శుకపికమ్ములెల్ల యకలంకమతి గొల్వ నరుగుదెంచె నవవసంతుడిలకు! ఆ.వె.పూల తావి పొందె పొలుపారు పులకింత తెమ్మిరమ్మ తగిలి తీపి పెంచ కొమ్మ కొమ్మ చిగిర్చి సమ్ముదమ్మున నూగ ప్రకృతి పరవశించె రాజితముగ ఆ.వె. కోయిలమ్మ కూసె కుహు! కుహూ!! రవముల కిసలయములు నవ్వె; కీరవాణి రవము వనుల నిండె; నవనవోన్మేషంబు కలుగ ప్రకృతి కాంత కాంతి నొందె   ఆ.వె. బొండు మల్లె లెల్ల నిండు గుండెల తోడ పండు వెన్నెలందు వలచి కలిసె సౌరభమ్ము వలనె సౌందర్య పుష్పాల జాడ తెలిసె కనుల చూడ నవక రచన :  శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు

( శీర్షిక) తెలుగు భాష

టోరీ ఉగాది కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత  ( శీర్షిక) తెలుగు భాష  సీ. “దిరిసెన పువు” కంటె, కరము సున్నితమహో .......”అలసాని” సాక్షి నా తెలుగు భాష  “వసుచరిత్ర”సుకవి పలుకుల సాక్షిగా.... “కాంభోజి” వినిపింప,కమ్ర భాష,  “సుకవి ధూర్జటి” సాక్షి, శూలి నర్చిం పగన్... “కల నాదము”గలది తెలుగు భాష ఘనుడు “పింగళి” కవి,”కల భాషిణి” దయిన, ఊయల తూగు” నిజము నా తెలుగు భాష అభిజాత్యపు జాణ “సత్యా”వధూటి ....దర్పమున గెల్చుకున్నట్టి తరువు సాక్షి “పరమ వికట కవివరుని”పాద సాక్షి.....తిరుగు లేనిది నిజము నా తెలుగు భాష! సీ. అబ్ధి కన్యను గన్న,ఐశ్వర్య శాలినే....తలదన్ను “పొగరున” నలరు భాష అమర నాథుని దైన,”ఐరావతము”కంటె.....వన్నె మిన్నగ నౌచు వరలు భాష చేత వీణియ దాల్చి,చెలువంబుగా గుల్కు ...”శుక్ల వర్ణను” మించి సొక్కు భాష ముక్కంటి గారిదౌ ,”ముసలి యెద్దును” మించి....తెల్లనై మివుల రాజిల్లు భాష ఎనయ నిద్ధాత్రి నంది వర్ధనము కంటె...”తుమ్మి పువు” కంటె,తెల్లదౌ “తమ్మి”కంటె పోరి చిననాటి నాచెలి “గౌరి” కంటె......తెలుపు నిక్కంబు వినుడి నా “తెలుగు భాష”! “గౌళ”... “కల్యాణి”... “నాట”... “హిందోళ” ..“కాపి”  “వలజి”... “సింహేంద్ర మధ్యమ”...”బిలహరి” యును., సార యశుడైన “కాకర్ల”వారి సాక్షి చెలువు ధట్టించి పాడ బల్ “జిలుగు” భాష! రచన :  డా.అక్కిరాజు సుందర రామ కృష్ణ గారు 

గాదిలి ఉగాది (పద్యకవిత)

టోరీ ఉగాది కవితల పోటీలో ప్రధమ బహుమతి పొందిన కవిత  గాదిలి ఉగాది (పద్యకవిత)   1) సీ" అత్తవారింటిలో అప్పుడే అడుగుమోపెడి క్రొత్త కోడలు పిల్లవోలె           నిగ్గుల సిగ్గుల మొగ్గయై మరుమల్లె బరువుతోడ తలెత్తు వధువువోలె           ఆంధ్రికి  "హోదా"ల అమృతంబునేపంచ పొలుపుగానే తెంచు మొహినివలె           సగటు మానవుని నెమ్మొగమందు విరిసిన మవ్వంపు జిరునవ్వుపువ్వువోలె          రసము చిందింపనెత్తు కలంబువోలె హృదయమును దోచ సిద్ధమో ఉదయము వలే           అందములుమీఱ, అవనికానందమూర | వచ్చు " శ్రీ విళంబ్యబ్దమా ! "స్వాగతంబు " ||  2) సీ" లంచంబు పట్టు సొమ్మంచనంగ చెలంగె వెగటైనా  రుచితోడ వేపపూత           పొగరుగా కట్నమ్ము పుచ్చుకొన్న వరుండనా వెల్గె  వగరుతో మావిముక్క          వడి హడావుడిని చేసెడు "మృగాళ్ళో" యనవరలె కారంబుతో పచ్చిమిర్చి           తలలోని నాల్కయై మెలగు నేటి పడంతియుల్ల మౌచువెలింగె బెల్లమోర!          నాయకుని వోలె ఉప్పు కనంబడదుగ! చింతపండు నిరుద్యోగి జీవితంబె           పచ్చడిగ ఇచ్చు నీవిందు "బహుపసందు"; గాదిలి ఉగాది! రసవేది ! ఘనవినోది! ||  3) సీ" ముత్తైదువలెయైన మ్రోడులా? అవి - కావు వీరేశలింగంబు సౌరుగాని;             కమ్మని కోకిల గళరవమ్మటె? కాదు బాలమురళికృష్ణ వాణిగాని;          రెప్పవిప్పిన పూలరేకటే? అది - కాదు బాపు గీసిన బొమ్మ రూపుగాని ;          భావమాధుర్యంపు బరిమళంబటె? కాదు - అల కృష్ణశాస్త్రి గేయంబు గాని;          అనగ నొప్పారె వాసంతహాసరేఖ వేదమై, శుకశారికానాదమలర             తెలుగు భారతికల్యాణలలిత వేదియనగ నామనియొప్పెనుగాదివేళ ||  రచన :-  డా||  రామడుగు వెంకటేశ్వర శర్మ గారు 

జయహో ఆకాశవాణి..

జయహో ఆకాశవాణి !!                 భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆకాశవాణి, ప్రతిష్టాత్మకంగా 1956 నుంచీ భారతీయ భాషా కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నది.సంస్కృతంతో పాటూ,  దక్షిణా భారత దేశ భాషలైన తెలుగు, మళయాళం , కన్నడ, మరాఠీ, కొంకిణీ భాషలతో పాటూ,  ఉత్తర భారత దేశ భాషలైన అసమియా, ఒడియా,కష్మీరీ, గుజరాతీ, డోగ్రీ, నేపాలీ, పంజాబీ, బంగ్లా, బోడో, మణిపురీ, మైథిలీ, సింధీ, సంథాలీ, ఉర్దూ, హిందీ మొదలైన 22 భాషల  భాషల మూల కవులతో పాటూ, ఆయా కవుల కవితల హిందీ అనువాదాలనూ (మొత్తం 44 మంది కవులు) ఒకే వేదికపై నిర్వహించటం యీ కార్యక్రమ ప్రత్యేకత.  తెలుగులో  సుప్రసిద్ధ  కవులైన విశ్వనాధ, శ్రీశ్రీ, పుట్టపర్తి, దాశరథి, సినారే, కృష్ణశాస్త్రి, ఆరుద్ర, ఇటీవలి  కాలంలో సుధామ, కవి యాకూబ్ వంటి లబ్ధ ప్రతిష్టులెందరో పై ప్రతిష్టాత్మక కవిసమ్మేళనంలో జాతీయ స్థాయిలో తెలుగు కవులుగుగా తళుక్కున మెరిసిన వారే. మూల కవులను ఎన్నుకోవటమెంత ప్రణాలికా బద్ధమో, ప్రతిష్టాత్మకమో, అనువాద కవుల ఎంపిక కూడా అంతే  ప్రణాలికా బద్ధమూ, ప్రతిష్టాత్మకమూ కూడా. కాగా,ఈ సంవత్సరం, ఆకాశవాణి  జాతీయ తెలుగు కవిగా సుప్రసిద్ధ కవి డా. బీ.ఆర్.వీ. ప్రసాద మూర్తి (తల్లి ప్రేమ)  జాతీయ స్థాయి అనువాదకురాలిగా  డా. పుట్టపర్తి  నాగపద్మిని  (మైథిలీ నుంచీ హిందీ లోకి  కవితానువాదం) యీ కార్యక్రమంలో పాల్గొనే గుర్తింపును ఆకాశవాణి ద్వారా అందుకున్నారు.   పైగా యీ సంవత్సరం, యీ ప్రతిష్టాత్మక కార్యక్రమ నిరంతరాయ నిర్వహణకై, లండన్ కు చెందిన వర్ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపును పొందటం మరో విశేషం. ప్రతి సంవత్సరమూ, జనవరి 25 వ తేదీన రాత్రి ప్రసారమయ్యే యీ కార్యక్రమం రికార్డింగ్ యీ నెల (జనవరి) 16 వతేదీ, మధ్యప్రదేశ్ రాజధాని ఇందోర్ లోని ఇంపెరియల్ హాల్, బ్రిలియంట్ కన్వెన్షన్  సెంటర్ (నక్షత్ర) లో  ఘనంగా నిర్వహించబడింది. జనవరి 15 వతేదీ డ్రెస్ రిహార్సల్స్ జరిగినప్పుడు  స్థానిక మీడియా విలేఖరుల కి  ఆకాశవాణీ ఏ.డీ.జీ.శ్రీ రాజశేఖర్ వ్యాస్ గారు మూల కవులనూ, అనువాద కవులనూ అకాశవాణి కేంద్ర స్థాయి నుండీ జాతీయ స్థాయి వరకూ, జల్లెడ పట్టి, లబ్ధ  ప్రతిష్టులైన కవుల ద్వారా ఎంపిక చేసే విధానాన్ని యెంతో చక్కగా వివరించారు.      ఆ తరువాత, తెలుగు, వుర్దూ, కొంత మంది ఇతర భాషాకవులతో పత్రికా విలేఖరుల పరిచయాలూ, మరుసటి రోజే వాటిని హిందీ స్థానిక పత్రికల్లో వ్యాస్ గారి ప్రసంగ వివరాతోపాటూ,ప్రచురించటం మరో విశేషం. ఇక 16 వతేదీ, ఇంపెరియల్ హాల్, బ్రిలియెంట్ కన్వెన్షన్ సెంటర్ (నక్షత్ర) లో స్థానిక కవితా ప్రేమికుల సమక్షంలో జరిగిన ఆకాశవాణీ సర్వ భాషా  కవిసమ్మేళనంలో ముందుగా మూల భాషల కవితా పఠనం, వెంటనే వాటి హిందీ అనువాదాలూ క్రమంగా ఆయా కవులు పఠిస్తున్నప్పుడు, హిందీ అనువాదాలకన్నింటికీ ముఖ్యంగా  అమ్మా, నాన్నా, మహిళామానసం, వృద్ధాప్యం వంటి మానవీయ బంధలూ, అనుబంధాలకు సంబంధించిన కవితలకు విపరీతమైన కరతాళ ధ్వనులతో  స్పందన రావటం చూస్తే, యీ వేగనాగరికతలో అందరూ కోల్పోతున్న యీ సున్నితాంశాలవైపు దృష్టి మరలటం మంచి పరిణామంగా భావించవచ్చు.    ఈ కార్యక్రమ  రికార్డింగ్ ను జనవరి 25 వ తేదీ రాత్రి 10 గంటలనుండీ, దేశంలోని 450 ఆకాశవాణి కేంద్రాలు, దూరదర్శన్ అన్ని జాతీయ చానళ్ళూ ప్రసారం చేశాయి. కాగా, ఉత్తర భారత దేశమంతా ఒక్క సంస్కృతం, హిందీ, ఉర్దూ తప్ప తక్కిన అన్ని భాషల మూల కవితలూ, హిందీ అనువాదాలతో ప్రసారమౌతుండగా, దక్షిణాదిన  సంస్కృతం తప్ప  తక్కిన  అన్ని భాషలకూ ఆయా రాష్ట్రానికి చెందిన భాషానువాదాలతో  (కర్ణాటకలో కన్నడమూ, తమిళనాడులో తమిళం, మహారాష్ట్ర లో మరాఠీ, కేరళలో మళయాళం, రాజస్థాన్ లో రాజస్థానీ, గుజరాత్ లో గుజరాతీ  ఇలా)  ప్రసారం కాబడటం మరో విశేషం.  ఈ పద్ధతిన, అన్ని భాషలనూ గౌరవించే సంప్రదాయానికి  ఆకాశవాణి పెద్ద పీట వేయటం ద్వారా పలువురికి  ఆదర్శప్రాయంగా నిలవటమూ కూడా  గమనించవచ్చు. ఈ కార్యక్రమం, ప్రతివత్సరమూ, క్రమం తప్పకుండా జనవరి 25 రాత్రే, గత 61 యేళ్ళుగా నిరంతరాయంగా ప్రసారం కాబడుతుండటం,యీ వత్సరం బీబీసీ వారి ప్రపంచ రికార్డ్ ను అందుకోవటం కూడా  మన ఆకాశవాణి కీర్తి కిరీటంలో మరో వెలుగులీనే వజ్రం.  జయహో ఆకాశవాణి !! - Padmini Puttaparthi

తెలుగు లేకపోతే జీవితం వృథా..

తెలుగు లేకపోతే జీవితం వృథా!   ఒకప్పుడు సంస్కృతంలో మాట్లాడితే పండితుడు అనుకునేవారు. అందుకని స్థానికులు కూడా బలవంతంగా సంస్కృతంలోనే మాట్లాడేవారు. దేవభాష సంస్కృతం రానురానూ క్షీణించిపోయింది. కానీ ఆ స్థానంలో ఆంగ్లేయుల పెత్తనం మొదలైంది. మొదట తమ వ్యాపార విస్తరణ కోసం వాళ్లే స్థానిక భాషలని నేర్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే వారి వ్యాపారం కాస్తా పెత్తనంగా మారిందో... తమ భాషనే స్థానికుల మీద రుద్దడం మొదలుపెట్టారు. ఇక ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష నేర్చకుంటేనే మనుగడ సాధ్యం అన్న వాదన మొదలైపోయింది. ఆంగ్లం తప్పనిసరే! కాదని ఎవరూ అనడం లేదు. కానీ తొలి ప్రాధాన్యత ఎప్పుడూ మాతృభాషదే కావాలంటున్నారు నిపుణులు. అలా ఎందుకు? అనే ప్రశ్నకు చాలా స్పష్టమైన జవాబులు ఉన్నాయి. మన జన్యువులలోనే :–  తరతరాలుగా మనం ఒక భాషకి అలవాటు పడి ఉన్నాము. కాబట్టి మన మెదడు కూడా సదరు భాషకి అనుగుణంగానే ఏర్పడుతుందని చెబుతున్నారు. అంటే మాతృభాష మన మెదడులోని సహజసిద్ధమైన హార్డ్‌వేర్ అన్నమాట. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం అంటే... మన సహజమైన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడమే! తల్లి కడుపులోనే :–  భాష నేర్చుకోవడం తల్లి కడుపులోనే మొదలవుతుందని పరిశోధనలు తేల్చాయి. తల్లి నుంచి వినిపించే శబ్దాలు అతని మెదడులోని భాష నేర్చుకునే భాగాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. తల్లులు లాలిపాటలు పాడటం, కడుపులోని బిడ్డతో మాట్లాడటం వృధా కావనీ... ఆ బిడ్డలోని భాషా నైపుణ్యాన్ని పెంచుతాయని అంటున్నారు. అలా అలవోకగా నేర్చుకుంటున్న భాషని వదిలేసి మరో భాష కోసం ఎగబడం ఎంతవరకు సబబు! మాతృభాషలోనే నేర్చుకోగలం :–  ఏడాది దగ్గర నుంచి పిల్లలు, తమ మాతృభాషలో ఒకో పదాన్ని నేర్చుకుంటారు. ఆ భాషలోనే తమకి తెలియని విషయాలను నేర్చుకోవడం, తమ భావాలను వ్యక్తపరచడం చేస్తుంటారు. అది పక్కన పెట్టేసి ఆంగ్లంలో ఒకేసారి ఓనమాలతో పాటుగా పద్యాలని, వాక్యాలని నేర్చుకోవడం ఎంత కష్టం! ఇది వారి నేర్పు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒక స్థాయి వరకూ చదువుని మాతృభాషలో నేర్చుకుంటేనే ఉపయోగం అని నివేదికలు తేల్చి చెబుతున్నాయి. ఏ భాష నేర్చుకోవాలన్నా :–  పునాది సరిగా లేకుండా ఎన్ని అంతస్తులు కట్టినా ఉపయోగం ఏముంది? మాతృభాష మీద పట్టు సాధించకుండా ఇతర భాషలు నేర్చుకోవడమూ ఇంతే! ముందు మాతృభాష మీద ఒక అవగాహన వచ్చినవాడే ఇతర భాషలను సులువుగా నేర్చుకోగలడనీ, అందులో పరిపూర్ణతను సాధించగలడనీ పరిశోధనలన్నీ ఏకరవు పెడుతున్నాయి. ఎంత సాధించి ఏం ఉపయోగం :–  మనిషి ఎప్పుడూ ఒంటరివాడు కాదు. అతనికంటూ ఒక సంస్కృతిక నేపథ్యం ఉంటుంది. కానీ మాతృభాష నుంచి దూరమైనవాడు ఒంటరిగా మారిపోతాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న విషయం అతనికి తోచదు. ఆ ఒంటరితనం తెలియకుండా అతన్ని క్రుంగదీస్తుంది. అందుకే భాషని దూరమైన ఆదిమజాతివారు త్వరగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న పరిశోధన ప్రపంచాన్ని కుదిపేసింది. జ్ఞానానికి దూరం :–  భాష అంటే తరతరాల జ్ఞానసంపద. భాషకి దూరమైతే ఆ జ్ఞానానికి కూడా దూరమైపోతాం. ఉదాహరణకు మన చుట్టూ ఉండే మొక్కలనే తీసుకోండి. బీపీని తగ్గించే సర్పగంధి, షుగర్‌ని తగ్గించే నేలవేము గురించి ప్రాంతీయ భాషలలో ఉన్నంత తేలికపాటి సమాచారం ఆంగ్లంలో ఉండదు. అంతదాకా ఎందుకు! ‘కాళ్ళాగజ్జీ కంకాలమ్మ వేగు చుక్కా వెలగామొగ్గా’ లాంటి పిల్లల పాటలలో ఉన్న ఆయుర్వేద సూత్రాలను ఎలా మర్చిపోగలం. ఇలా లాలిపాటల దగ్గర నుంచి సామెతల వరకు మాతృభాషలో అద్భుతమైన విజ్ఞానం దాగి ఉంటుంది. దాన్ని మనం చేజేతులారా దూరం చేసుకుంటున్నాం. చివరగా ఒక్క మాట. మనకి కోపం వస్తే ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఆంగ్లంలో మాట్లాడటం మొదలుపెడతాం. బాధ కలిగితే అమ్మా అంటూ మనసుకి సర్దిచెప్పుకొంటాం. మన మనసుకి దగ్గరగా ఉన్న మాతృభాష కావాలా, మన అహంకారాన్ని పెంచి పోషించే ఇతర భాషలు కావాలా! తేల్చుకోవాల్సిందే మనమే! - నిర్జర

బైరాగి పాట

బైరాగి పాట!   ఇప్పుడంటే కనిపించడం లేదు కానీ, ఒకప్పుడు ఊరూవాడా తిరిగే విరాగులకి కొదవుండేది కాదు. బహుశా ఈ విరాగి అన్న మాట క్రమంగా బైరిగిగా మారి ఉంటుంది. ఎవరన్నా పెడితే ఇంత తినడం, ఏదో ఒక అరుగు మీద పడుకోవడం. కొంత కాలం ఇలా గడిచిన తర్వాత మరో ఊరికి సాగిపోవడం... ఇదే బైరాగుల జీవన విధానం. వీళ్లు అద్భుతమైన జ్ఞాన సంపన్నులు కాకపోవచ్చు, ఆధ్యాత్మికతలో లోతులు తెలియకపోవచ్చు...   కానీ జీవితం మీద విరక్తి భావం మాత్రం మెండుగా కనిపిస్తుంది. ఒక తంబురాని వాయిస్తూ, జీవితం మీద తమకి ఉన్న అభిప్రాయాన్ని పదాలుగా పాడుకుంటూ తిరిగే వీరి పాటలు ప్రజల్లో కావల్సినంత భక్తిభావాన్ని నింపేవి. జీవితం అశాశ్వతమన్న వైరాగ్యాన్ని నేర్పేవి. కాలక్రమంలో వీరి సంఖ్య తగ్గిపోయింది.  కొన్ని ప్రాంతాల్లో ఈ పేరు ఒక కులానికి సూచనగా మిగిలిపోయింది. కానీ జానపద సాహిత్యంలో మాత్రం బైరాగుల పదాలకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పాటలలో ఒకటి ఇది.... నాద బ్రహ్మానందయోగీ వీడు వేదాంతసారము వినిచే బైరాగీ రాజసంబు దుఃఖదమురా, ఘన రాజయోగ మార్గమే సౌఖ్యదమురా చిత్తశుద్ధి గల్గియుండు, భక్తి జేరి సద్గురు నీవు సేవించుచుండు నాద బ్రహ్మానందయోగీ వీడు వేదాంతసారము వినిచే బైరాగీ మత్తత్వము లేకయుండు, స మస్త మింద్రజాలమంచూరకుండూ నాద బ్రహ్మానందయోగీ వీడు వేదాంతసారము వినిచే బైరాగీ పెద్దల నిందించవలదూ, ఒరులు పీడించినా నీవు భీతిల్లవలదూ నాద బ్రహ్మానందయోగీ వీడు వేదాంతసారము వినిచే బైరాగీ వనిత లేకున్న దుఃఖమురా, కాని వనిత గల్గెనేని వగవదుఃఖమురా నాద బ్రహ్మానందయోగీ వీడు వేదాంతసారము వినిచే బైరాగీ ధనము లేకున్న దుఃఖమురా, చాల ధనము గల్గెనేని దాచదుఃఖమురా నాద బ్రహ్మానందయోగీ వీడు వేదాంతసారము వినిచే బైరాగీ పచ్చి కుండ వంటిమేను, ఇది చచ్చుగాక ఆత్మ చావదెన్నడును నాద బ్రహ్మానందయోగీ వీడు వేదాంతసారము వినిచే బైరాగీ విచ్చికుండ వ్రక్కలైనా, లోన హెచ్చియున్న బయలు విచ్చి రెండౌన నాద బ్రహ్మానందయోగీ వీడు వేదాంతసారము వినిచే బైరాగీ    

మహాగీతం

  మహాగీతం     చరిత్ర పాడని ధరిత్రి చూడని పవిత్రగీతం పాడండి విచిత్ర భూతం చూడండి నరాలలో తరతరాల గాథలు శిరస్సులో నరనరాల బాధలు గిరి శిరస్సుపై హరీంద్ర గర్జన మన మనస్సులో తర్జన భర్జన పర ప్రభుత్వపు టురికంబాలు ప్రజాప్రభుత్వపు గజిబిజి చర్యలు స్వతంత్రమంటూ పెద్ద మాటలు కుతంత్రాలతో గ్రుద్దులాటలు విన్నాం కన్నాం కన్నాం విన్నాం చరిత్ర పాడని ధరిత్రి చూడని పవిత్రగీతం పాడండి విచిత్ర భూతం చూడండి ఊరి ఊరి పొలిమేరలు మారి దేశదేశ సహవాసం కోరీ జాతిమతాలను పాతరవేసి సామ్రాజ్యాలకు సమాధిచేసి అడుగు కడుగుకూ మడుగులు కట్టిన యెడద నెత్తురులు వడబోయించి ముల్లుముల్లుకూ చిళ్ళిన రక్తం గులాబీల రంగులై వెలింగి యూరపు, తూరుపు, ఏషియ, రషియా భారత, సింహళ, బర్మా, వీట్నాం అమెరికా, బ్రిటన్ శ్రమజీవులతో శ్రమజీవులతో, సమభావులతో అమర్చి కూర్చిన, జగాన్ని మార్చిన విశాల విశ్వశ్రామిక భూతం మహోగ్ర భూతం ఉల్కాపాతం ఉత్తర ధ్రువాత్యున్నత శీతం వజ్రాఘాతం ప్రళయోత్పాతం --- పరుగెత్తే హిమగిరి ఎదురు నడచు గంగాఝరి కంపించే ఇలాతలం కదలాడిన గభీర సముద్రజలం పేలిన కోటికోటి తారలు కురిసిన ప్రళయ వర్షధారలు గ్రీష్మంలో తగులబడే పెద్దపెద్ద కొండలు కరువులతో వణకిన నిరుపేదల గుండెలు కేంద్రీకృత పీడిత భూతం విరాట్ స్వరూపం మహేంద్ర చాపం ఉచ్ఛ్వసించితే, నిశ్శ్వసించితే -- నింగి నంటు కరెన్సీ గోడలు నీల్గుతున్న బాంబుల మెడలు నుగ్గునుగ్గుగా తగ్గిపోవునట! "అది రక్తగంగా తరంగమా? అంత్య మహా యుద్ధరంగమా?"     "అమృతం ముందరి హలాహలం పంటలు సిద్ధం కానిపొలం ఫలితానికి ముందటి త్యాగం నిరుపేదల నెత్తుటి రాగం పడగెత్తిన మహోగ్ర నాగం తగలబడే ధనికుల భోగం అరుణారుణ విప్లవమేఘం నయయుగ మహా ప్రజౌఘం" "ఆ మహాతరంగానికి అవతల? ఆ యుద్ధరంగానికి అవతల?" "నిజమై ధ్వజమెత్తిన కల, గగనానికి నిక్కిన పేదల తల ఉక్కుటడుగు త్రొక్కిడిలో పడి నలిగిన గడ్డిపోచ చెక్కుచెదర కొక్కుమ్మడి చక్కవడిన ఇనుప ఊచ తెగిపోయిన మృత్యుశవం వినిపించని ధనారవం." చరిత్ర పాడని ధరిత్రి చూడని పవిత్రగీతం పాడండి విచిత్ర భూతం చూడండి (దాశరథి కృష్ణమాచార్య రాసిన రుద్రవీణ కవితాసంపుటంలోంచి)      

దాశరథి - మహాగీతం

దాశరథి - మహాగీతం       చరిత్ర పాడని ధరిత్రి చూడని పవిత్రగీతం పాడండి విచిత్ర భూతం చూడండి నరాలలో తరతరాల గాథలు శిరస్సులో నరనరాల బాధలు గిరి శిరస్సుపై హరీంద్ర గర్జన మన మనస్సులో తర్జన భర్జన పర ప్రభుత్వపు టురికంబాలు ప్రజాప్రభుత్వపు గజిబిజి చర్యలు స్వతంత్రమంటూ పెద్ద మాటలు కుతంత్రాలతో గ్రుద్దులాటలు విన్నాం కన్నాం కన్నాం విన్నాం చరిత్ర పాడని ధరిత్రి చూడని పవిత్రగీతం పాడండి విచిత్ర భూతం చూడండి ఊరి ఊరి పొలిమేరలు మారి దేశదేశ సహవాసం కోరీ జాతిమతాలను పాతరవేసి సామ్రాజ్యాలకు సమాధిచేసి అడుగు కడుగుకూ మడుగులు కట్టిన యెడద నెత్తురులు వడబోయించి ముల్లుముల్లుకూ చిళ్ళిన రక్తం గులాబీల రంగులై వెలింగి యూరపు, తూరుపు, ఏషియ, రషియా భారత, సింహళ, బర్మా, వీట్నాం అమెరికా, బ్రిటన్‌ శ్రమజీవులతో శ్రమజీవులతో, సమభావులతో అమర్చి కూర్చిన, జగాన్ని మార్చిన విశాల విశ్వశ్రామిక భూతం మహోగ్ర భూతం ఉల్కాపాతం ఉత్తర ధ్రువాత్యున్నత శీతం వజ్రాఘాతం ప్రళయోత్పాతం --- పరుగెత్తే హిమగిరి ఎదురు నడచు గంగాఝరి కంపించే ఇలాతలం కదలాడిన గభీర సముద్రజలం పేలిన కోటికోటి తారలు కురిసిన ప్రళయ వర్షధారలు గ్రీష్మంలో తగులబడే పెద్దపెద్ద కొండలు కరువులతో వణకిన నిరుపేదల గుండెలు కేంద్రీకృత పీడిత భూతం విరాట్‌ స్వరూపం మహేంద్ర చాపం ఉచ్ఛ్వసించితే, నిశ్శ్వసించితే -- నింగి నంటు కరెన్సీ గోడలు నీల్గుతున్న బాంబుల మెడలు నుగ్గునుగ్గుగా తగ్గిపోవునట! "అది రక్తగంగా తరంగమా? అంత్య మహా యుద్ధరంగమా?" "అమృతం ముందరి హలాహలం పంటలు సిద్ధం కానిపొలం ఫలితానికి ముందటి త్యాగం నిరుపేదల నెత్తుటి రాగం పడగెత్తిన మహోగ్ర నాగం తగలబడే ధనికుల భోగం అరుణారుణ విప్లవమేఘం నయయుగ మహా ప్రజౌఘం" "ఆ మహాతరంగానికి అవతల? ఆ యుద్ధరంగానికి అవతల?" "నిజమై ధ్వజమెత్తిన కల, గగనానికి నిక్కిన పేదల తల ఉక్కుటడుగు త్రొక్కిడిలో పడి నలిగిన గడ్డిపోచ చెక్కుచెదర కొక్కుమ్మడి చక్కవడిన ఇనుప ఊచ తెగిపోయిన మృత్యుశవం వినిపించని ధనారవం." చరిత్ర పాడని ధరిత్రి చూడని పవిత్రగీతం పాడండి విచిత్ర భూతం చూడండి   - దాశరథి కృష్ణమాచార్య (రుద్రవీణ సంపుటి)