రేల పూల పాటకి పుట్టినరోజు శుభాకాంక్షలు

గోరటి వెంకన్న జన్మదినం సందర్భంగా..   రేపురేపను తీపికలలకు రూపమిచ్చును గానం  ...చింత బాపును గానం ...  'పులకించని మది పులకించు '  పాటలో ఆత్రేయ ఈ మాటలన్నది  గోరటి వెంకన్న గురించేనా?  కొన్ని శ్రావ్యమైన గొంతులు మధురంగా పాడుతున్నపుడు - పున్నాగ పూలు వొయ్యారంగా రాలి పడుతున్నట్టు.. చలికాలం రాత్రులు పంటపొలాల మీద వెన్నెల పరుచుకుంటున్నట్టు..  ఒక తెలియని తియ్యని బాధ మనసుని మెలిపెడుతున్నట్టు...  ఎలాగో వుంటుంది కదా! గోరటి వెంకన్న జీర గొంతు వేరు! భగవంతుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని -  కొన్ని వయొలిన్ తీగల్నీ, డప్పునీ, దరువునీ  ఒకచోట చేర్చి... కొంచెం నిప్పునీ, కాసిని కన్నీళ్ళనీ కలిపి, దాన్ని పేద జనం చెమటతో తడిపి... ఈ మిశ్రమాన్నొక పాలపుంతలో పెట్టి,  ఇంద్రధనస్సుతో వెంకన్నకి కానుకగా పంపించాడేమో! దేవుడెందుకో కొందరు వెర్రివాళ్ళనే ఎంచుకుంటాడు.  అన్నమయ్య, బడే గులాం అలీఖాన్, కుందన్ లాల్ సైగల్, షంషాద్ బేగం, చీమకుర్తి నాగేశ్వరరావు, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, సుబ్బారావు పాణిగ్రాహి... ఇలాంటి వాళ్ళే ... పాల్ రాబ్సన్, మెహిదీ హసన్, భూపేన్ హజారికా, బాబ్ మార్లే... ఈ కోవలోని వాడే...  పాలమూరు రోడ్ల మీద పాడుకుంటూ వెళిపోయే పిచ్చివాడే గోరటి వెంకన్న. *** ఎలా రాస్తాడో  ఆ పంటకాల్వ లాంటి కవిత్వం! అందులోనే తలవంచని తత్వం.  వొట్టి తిరుగుబాటు కవి కాదు.  వెంకన్న వొక్కడే... ఒక పారిస్ కమ్యూన్! పాటా? కాదది... పెరల్ హార్బర్ మీద యుద్ధ విమానాల మెరుపు దాడి  జర్మన్ రీచ్ స్టాగ్ మీద 1945 లోనే ఎగిరిన జెండా... అతను.  *** పాతికేళ్ళుగా వెంకన్న తెలుసు నాకు.  అతని స్నేహితుణ్ణి అనికూడా క్లెయిమ్ చేసుకోగలను. మా అన్నయ్య మోహన్ దగ్గరికి వచ్చేవాడు. కుర్చీలోనే కూర్చోవాలనీ, చుట్టూ జనం వుండాలనీ అనుకునే మనిషి కాదు.  ఏ మూలనో చతికిలబడేవాడు.  రాసుకుంటూ వుండేవాడు.  కొన్ని మాటలు చెప్పేవాడు.  సరదా పాటలు పాడేవాడు.  'ఏకునాదం మోత ' కో, 'రేలపూతల' కో  బొమ్మ వేయమని అడిగేవాడు.  గ్లాసులో ఏం పోసినా తాగేవాడు. కంచంలో ఏం పెట్టినా తినేవాడు. నో కంప్లయింట్స్. బావుందా సార్ పాట? అంటాడు. నీ పాట చాలా బావుంది .. అని ఎలా చెప్పటం గోరటి వెంకన్నతో, సిగ్గు లేకుండా! మరో పాట - అని అడిగేవాళ్ళం. ఖాళీ గ్లాసుని కాస్త ముందుకి జరిపేవాడు. ఎప్పుడూ డిజప్పాయింట్ చేయడు. హృదయాన్ని పాటతో నింపేవాడి గ్లాసు మాత్రమే నింపగల నిమిత్తమాత్రుణ్ణి నేను.  ***  కుదురుగా కూర్చుని బుద్ధిగా బొమ్మలేసుకుంటున్న ఆర్టిస్ట్ మోహన్, తలెత్తి చూస్తే గుమ్మంలో గోరటి వెంకన్న. " న్యూసెన్స్ రా.. పరమబోరు వీడు " అనేవాడు మోహన్.              వెంకన్న వచ్చి కుర్చీలో సెటిలయ్యి పద్యం అందుకునేవాడు.... ఆరున్నొక్క రాగం... అలా వారాలు, నెలలు, సంవత్సరాలు -  వో రెండు దశాబ్దాలు మేం పాలమూరు పాటల వెన్నెల పూలతోటల్లో తిరిగాము. మేం! అంటే? ఆర్టిస్టులు శ్రీరాం కారంకి, సాక్షి శంకర్, అన్వర్, లెల్లె సురేష్, పైడి తేరేష్, మా చెల్లెళ్ళు శకుంతల, సరళ, శుభ, మా ఆవిడ నళిని, దళిత కార్యకర్త వెంకటేశ్వరరావు, మా కంప్యూటర్ ఆపరేటర్లు మస్తాన్, బిజిన్ బాబు, గుడికందుల భిక్షు, ... మోహన్ కోసం వచ్చే ఎందరో, ఎవరెవరో -  వెంకన్న పాట కచేరీ... పూర్తిగా ఉచితం. అప్పటికి ఏదితోస్తే అది పాడేవాడు. అందులోనే ఒక అలవిమాలిన అందం వుండేది. జాషువా అనో, రజనీబాయి చింతామణి అనో... పద్యంలోకి జారిపోవడం, తానే పద్యంగా మారిపోవడం -  వెంకన్నకి ఎంత ఇష్టమో!  ' చింతామణీ ' అని భలే అంటాడు.  అత్తవారిచ్చిన అంటుమామిడి తోట - ఏంటో  ఆ తోట వెంకన్నకే రాసిచ్చినంత సంబరంతో పాడతాడు.  *** మోహన్ అస్సలు తిన్నమైనవాడు కాదు.  మొహమ్మీదే అనేస్తాడు... జోవియల్ గా. "నువ్వు బాగా బోరు అబ్బా" అని -  వెంకన్నని పట్టుకుని!  పాడి, వెంకన్న వెళిపోయాక, ఒకరోజు అడిగాను. ' ఎలా? ఆ గొంతు ఎలా సాధ్యం? ' అని మోహన్ని. " అది భగవదత్తంరా, సంప్రదాయం తెలిసినవాడు వెంకన్న" అన్నాడు.  మోహనూ, నేనూ ఏనాడూ దేవుణ్ణి నమ్మిందీ లేదు.  సరదాకి కూడా దణ్ణం పెట్టుకున్న పాపానపోలేదు. వెంకన్న కవిత్వం అంటే ఎంతో ప్రేమతో,  శ్రద్ధగా బొమ్మ వేసేవాడు.  గడగడా మాట్లాడి, గది కంపించిపోయేలా పాడే వెంకన్న కూడా, మోహన్ మాట్లాడుతుంటే చెవులప్పగించి వినేవాడు.  ఆ ఇద్దరు అరుదైన ఆర్టిస్టుల స్నేహాన్ని ఈ తుచ్చమైన కళ్ళతో ఏళ్ళతరబడి చూసి తరించినవాణ్ణి నేను. *** మోహన్ దగ్గరికి రెగ్యులర్ గా వచ్చేవాళ్లు :  కే ఎన్ వై పతంజలి, తల్లావఝుల శివాజీ,  శ్రీరాం కారంకి, గోరటి వెంకన్న, కలేకూరి ప్రసాద్, లెల్లె సురేష్ ఆర్టిస్టులు మృత్యుంజయ, రాజు, పాండు... మేమంతా ఒక ముఠా. కొవ్వెక్కిన సృజనాత్మక గుంపు.  ప్రతిదీ వేళాకోళమే. ఏ ఒక్క విషయమూ తిన్నగా మాట్లాడరు. రెటమతం. వంకర మాటలు, క్విక్ రిపార్టీలు, చటుక్కున వో మహాకవినో, రచయితనో కోట్ చేయటం, అరుదైన పద్యాలు అప్పజెప్పటం,  వో చరణమో, పల్లవో పాడటం,  దాని జ్ఞాపకం చెప్పటం.. ఏమి సాయంత్రాలవి! కన్నీళ్లు వచ్చేలా నవ్విన సందర్భాలెన్నో! *** ఎప్పుడన్నా నిజామాబాద్ నించి వచ్చే రచయిత కేశవరెడ్డి, కవి నున్నా నరేష్, జర్నలిస్టు పాశం యాదగిరి, విశాఖ నుంచి డాక్టర్ చందు సుబ్బారావు, పర్స్పెక్టివ్స్ ఆర్కే, కవులు జీవీ రమణ, సిద్దార్థ, ఎమ్మెస్ నాయుడు, అనంత్.. మా గుంపులో కలిసేవారు. కూనపరాజు కుమార్, ప్రసాదమూర్తి, శిఖామణి, వేముల ఎల్లయ్య, దేవులపల్లి కృష్ణమూర్తి, తిప్పర్తి వూదరి వెంకన్న మా పాటకచేరీ సభ్యులు.  అలా ఎందరెందరో వున్నా అక్కడ  ప్రత్యేకమైంది వెంకన్న పాటే! నా నల్లని గుండె, రెక్కలల్లార్చే తెల్లని కొంగయి  దుందుభి నదికి అడ్డంపడి ఎగిరిపోతున్నట్టు  పాడటం ఎవరికి సాధ్యం? గోరటి వెంకన్న గొంతు వింటున్నప్పుడు ... ఏటి వొడ్డున తడి ఇసకలో వొట్టి పాదాలతో నడుస్తున్నట్టు..  వేంకటేశ్వరుని దర్శనం కోసం ఏడుకొండలూ  ఎక్కి వెళుతున్నట్టు.. సున్నిపిండితో నలుగు పెట్టుకుని, కుంకుడు రసంతో వేడినీళ్ళ స్నానం చేస్తున్నట్టు .. ప్రియురాలి చనుమొనలు ఛాతీని తాకి, ఒక గరుకుగరుకు పులకింత నరాల్లో ప్రవహించినట్టు.. కరీంనగర్ అడవి వీచే ఆకుపచ్చని సంగీతాన్ని గుండెల్లో వొంపుకుంటున్నట్టు.. తరతరాల దళిత జనం వేదనల దుఃఖాశ్రువులు ముంచెత్తుతున్నట్టు ... ఎండలో ఎర్రజెండాల వూరేగింపులో కూటికి లేని కూలిజనంతో కలిసి నడుస్తున్నట్టు ... శ్రీశ్రీ విన్న నక్షత్రాంతర్నిబిడ నిఖిలగానాన్ని దోసిళ్ళతో పట్టుకుని ఆత్మని నింపుకుంటున్నట్టు ...  ఎంత అదృష్టం ఈ జన్మకి! *** జర్నలిస్టు దేవులపల్లి అమర్ నడిపే ' ప్రజాతంత్ర ' వారపత్రిక ఏడాదికోసారి ' సాహిత్య స్పెషల్ ' గా వచ్చేది. చాలా ఏళ్ళ క్రితం వచ్చిన సాహిత్య సంచికకి లిటరరీ ఎడిటర్ కే శ్రీనివాస్, నాటి ఆంధ్రజ్యోతి సంపాదకుడు. ఆ ఏడాది గోరటి వెంకన్న కవర్ పేజీ. వెంకన్న ఇంటర్వ్యూ ని 'పగిడికంటి పాటగాడు' అనే గొప్ప శీర్షికతో రాశారు. "నోరులేని పాలమూరు పల్లెను గొంతులో జీరగా నిలుపుకుని సమూహ దుఃఖాన్ని అతను పలుగు రాళ్లు నమిలినట్టు పదాలలోకి అనువదిస్తున్నాడు.... తెలంగాణ కావలసివచ్చిన కాలానికి ఎదిగివచ్చిన పుత్రుడు వెంకన్న" అని రాశారు శ్రీనివాస్. ఇంటర్వ్యూ నెపంతో ఒక అరుదైన, అనితరసాధ్యమైన విశ్లేషణ చేసి వెంకన్న రాజకీయ, కళాసౌందర్య - ఆధ్యాత్మిక తత్వాన్ని తొలిసారి మనకి తెలియజెప్పినవాడు  కే. శ్రీనివాస్.  *** వెంకన్న కొత్తగా ఎమ్మెల్సీ అయ్యాడుగా... అందుకే మాట్లాడుకోడం.  హంస అవార్డు, కాళోజీ అవార్డు, సినారె, లోక్ నాయక్, అరుణ్ సాగర్ అవార్డులు వచ్చినపుడు, ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు ' కబీర్ సమ్మాన్ ' వరించినపుడూ మనం వెంకన్నని తలుచుకున్నాం.  మనవాడే మహగట్టి వాడు - అని  జబ్బలు చరుచుకున్నాం.  కానీ, ఒక రాష్ట్రానికి శాసనమండలి సభ్యుడు  అవడం ప్రత్యేకమైన గౌరవం.  మనందరి కంటే ఎక్కువ సాహిత్యం చదువుకున్నవాడు, గొప్ప వాగ్ధాటి కలవాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన వెంకన్నకి పిలిచి ఇచ్చిన గౌరవం నాకెంతో నచ్చింది. చట్టసభల్లో వీధిరౌడీలు, గుండాల్ని చూడడానికి అలవాటుపడిపోయాం కదా!  ఒక మంచి కవిని, నిజమైన ప్రజాప్రతినిధిని ముఖ్యమంత్రి సత్కరించినపుడు మనమెందుకు నొసలు చిట్లించడం! అదేంటో.. ప్రతిదాన్నీ తప్పుబట్టటం. విమర్శించడం, నిందించడం, చటుక్కున జడ్జీల పాత్ర పోషించి ఆనందించడం మనకి అలవాటైపోయింది. బాగా నెగెటివ్ గా మారిపోతున్నాం. లేదా,  కరోనా పాజిటివ్ గా మిగిలిపోతున్నాం.  కసి, ద్వేషం, పగ ఇచ్చినంత కిక్కు  అపేక్ష, ప్రేమ ఇవ్వలేవేమో కదా! *** వాగు ఎండిపాయెరో పెదవాగు తడిపేగు ఎండిపాయెరా... పాట గుర్తుందా మీకు?  నిరుపేద పల్లెటూరి పిల్లల ఆటలు, ఆనందాల మీద వెంకన్న పాట విన్నారా? అందులో కవిత్వం పలికిన తీరూ, ఒక విజువల్ వండర్ గా ప్రజెంట్ చేయడంలోని కామన్ సెన్సూ మనల్ని అబ్బురపరుస్తాయి. పాటా పాడేటీ పిల్లలు వూటా సెలిమల్లో ఆటాలాడేటీ పిల్లలు మోటా గిరీకల్లో  వాగూలోనీ సేపలోలె ఈదుతున్నారో వొడ్డున రెల్లుగడ్డీ లాగా వూగూతున్నారో ఏలే ఎన్నెల్లో పిల్లలు ఏలే ఎన్నెల్లో... తెలంగాణ అంటే హైదరాబాద్ కానట్టే, భారతదేశం అంటే వో పదిపన్నెండు పెద్ద నగరాలు కావు, వందల వేల పచ్చని పల్లెలు అసలు సిసలైనవి. అక్కడి పిల్లల కోసం, ముందుతరాల కోసం గోరటి వెంకన్న రాసిన  ఆ పాట, పాడిన ఆ పాట మనకి  బాలల జాతీయగీతం కాదగ్గది. దాన్నో మాంచి యానిమేషన్ ఫిల్మ్ చేస్తానన్నాడు మోహన్. గౌతమ్ ఘోష్, శ్యాం బెనెగల్ లాంటి చేవ వున్న దర్శకులు ఆ పాటనీ, అందులోని నిసర్గ సౌందర్యాన్నీ చిత్రీకరించి మనకివ్వాలని అనిపిస్తోంది. వెంకన్నకి పదవులు కట్టబెట్టడం కాదు. పది పన్నెండు పాటలు ఎంపిక చేసి 'జయం మనదేరా' శంకర్ లాంటి మంచి దర్శకుడి చేతికిచ్చి " THE BEST OF GORATI VENKANNA " అని ఒక విజువల్ ట్రీట్ గా వాటిని పదిలపరచాలి.  కొంగమ్మా... పాట వెండి తీగలతో రెండు రెక్కలు ఏ దేవుడల్లే మాసిపోని తనువున్న కొంగమ్మా - నరుడు తప్ప పుడమిలోన కొంగమ్మా ఏ జీవి కపట మెరుగదమ్మ కొంగమ్మా - రాత్రి పాట .. తోపులకొచ్చిన జంటకు సీకటి దాపును జూపిందో తాను కాపల కాసిందో  కోరిక తీరని మనుషులేమో కొరివీదెయ్యాలై పొలిమేరంచు కొచ్చీరో .... ఇంకా వాన, నల్లతుమ్మ, సంచారం, గల్లీసిన్నదీ, పిట్టబతుకు... పవిత్రమైన కవిత్వం ప్రవహించే ఇలాంటి గోరటి వెంకన్న పాటలు ఎన్నయినా కోట్ చేయవచ్చు. *** వేల పాటలు పాడి ఈ దేశాన్ని ఊగించిన, వెర్రెత్తించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గోరటి వెంకన్న  ' సంతా మావూరి సంతా వారానికోసారి ...' ' అద్దాల అంగడీమాయ... ' పాటలు విని పరవశించిపోవడం మనమందరం టీవీల్లో చూశాం.  బాలు చనిపోయినపుడు కొందరు అతనికి శాస్త్రీయ సంగీతం రాదనీ, మంచి మిమిక్రీ ఆర్టిస్టనీ వెటకారాలు పోయినపుడు, గొప్ప వాటర్ కలర్ ఆర్టిస్ట్ మోషే డయాన్ వారితో వాదనకి దిగారు.  ' అదేంటి, బాలూని మీరెలా తప్పుబడతారు? శాస్త్రీయ సంగీతం నాకు బాగా తెలుసని బాలూ ఎప్పుడూ చెప్పలేదే. అయినా బాలూని అనడానికి మనమెవరం? నాతో సహా are we not part of the hypocrasy? ' అని నిలదీశాడు మోషే! వెంకన్న విమర్శకులకి ఈ మాట వర్తిస్తుంది. *** గోరటి వెంకన్నకి ఒక వ్యక్తిగత లేఖ : వెంకన్నా... నీకూ తెలుసు, నాకూ తెలుసు.  మనకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కి  ఇంకా బాగా తెలుసు.  It's all in the game!  పిలిచి పదవి ఇచ్చాడు.  ఎమ్మెల్సీ ని చేశాడు. నాకు నచ్చింది నిజంగా! విద్య విలువ తెలిసిన, పద్య కావ్యాలు, సౌందర్య శాస్త్రం చదువుకున్న చంద్రశేఖరరావు కి మనస్సులోనే నమస్కారం పెట్టుకున్నాను.  అయినా - లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ అందలం తాత్కాలికం.  అది నీచేతికో బంగారు సంకెల. నీ పేరు ప్రతిష్ట ఇప్పుడు అక్కరకొచ్చింది.  అది పూర్తిగా ప్రభుత్వ అవసరం. నీకీ ప్రభుత్వంతో ఎలాంటి అవసరమూ లేదు.  ప్రభుత్వానికైతే నీతో చాలా పని వుంది.  నువ్వు పేదోడివి. కూలోడివి. మాలోడివి మాత్రమే కాదు... తూరుపు ఆకాశం నుంచి వేకువని తెచ్చి మాకిచ్చిన కవివి. గంధర్వుడివి. గాయకుడివి.  గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ వచనం కవిత్వమై మా మధ్యనే తిరుగుతున్న మేజికల్ రియనిజానివి!  నువ్వే ప్రభువ్వి.  నీకెవరి గొడుగునీడా అవసరం లేదు. అయితే ఇక్కడ ప్రభువులు ఒకందుకు పోస్తారు.  పాలమూరు పేద కవులు మరొకందుకు తాగుతారు.  రాజకీయాల్దేముంది!  మనం పుట్టకముందు నించీ వున్నాయవి! ప్రభుత్వానికి లొంగిపోయావనో, కేసీఆర్ కి భజన చేస్తున్నావనో, వెలమదొరల గడీ కి కాపలా పనికి వొప్పుకున్నాడనో నిన్ను మాటలంటారు.  ఇప్పటికే అన్నారు. ఆ మాటలూ విను. పట్టించుకోకు. నవ్వేసి ఊరుకో.  సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదు.  ఇక్కడ నువ్వెవరికీ రుణపడి లేవు.  నీ రుణం తీర్చుకునే శక్తి మాకెవ్వరికీ లేదు.  నిర్లక్ష్యంగా, నిష్పూచిగా, బాధ్యతతోనో, రహితంగానో ఎప్పటిలాగే నీ ఇష్టం వచ్చినట్టే వుండు.  గుంటూరు శేషేంద్రశర్మ చెప్పినట్టు .. పంచె పైకెత్తి పట్టుకుని ఈ నగరాన్ని  తొక్కుకుంటూ వెళ్ళిపో.  అప్పుడు కూడా, గోరటి వెంకన్నా..  పది తరాలు పాడుకునే మరో పాట ఒకటి రాయి. కవీ, కాళిదాసు సాక్షిగా మరొక్కసారి నీ గొంతెత్తి విశ్వమానవ గీతం ఆలపించు.  అదిగో...  అటుచూడు.  కోటి చేతులు నిన్నే కోరి రమ్మంటున్నాయి! *** నలుగురు బిడ్డల తండ్రివి.  నీ బాధ్యతలూ, అవసరాలూ తెలుసు. నీ గారాల బిడ్డల పట్ల నీ అనురాగం  కళ్లారా చూసినవాణ్ణి. సుఖంగా వుండు.  పాలమూరు రాళ్లలో, అడవుల్లో అనామకంగా  తిరిగే సంచార జీవివి.  వూర్కెనే హైదరాబాద్ లో వున్నట్టు నటిస్తుంటావు.  నీ మనసెపుడూ ఆ పల్లెల్లోనే. చిరిగిపోయిన  మురికి బట్టల మనుషుల్తోనే ...  ఆంధ్రా, తెలంగాణ పేద పల్లెలన్నీ నీ పాటే పాడుకుంటున్నాయి.  మా వెంకన్న అంటూ హృదయానికి హత్తుకుంటున్నాయి.  నీ పేరు తలుచుకుని గుడిసెలో దీపం వెలిగించి, నిన్ను గుండెల్లో పెట్టుకుంటున్నాయి. *** నడిచివస్తున్న వెంకన్న ఒక్కోసారి  ముద్దొచ్చే ఎద్దు మూపురంలా అనిపిస్తాడా! పాట ఎత్తుకున్నాడా...  ఆలయ గోపురంలా కనిపిస్తాడు. వెంకన్నది కవ్వించి, నవ్వించి, కన్నీళ్లు పెట్టించే సెన్సాఫ్ హ్యూమర్. అది చాప్లిన్ టెక్నిక్. "రావొచ్చు పోవొచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు రవీంద్రభారతికొచ్చి రాయబారమాడొచ్చు" అని ఆంధ్రావాళ్లని వెక్కిరించినా -  బతుకు ఆగం అయిపోయిన, తన పేరు కూడా తెలీని వెర్రిపిట్ట దగ్గరికెళ్లి "ఏదీ లేని పిట్ట చెంతకు జేరి జాతకం అడుగుతున్నడు" .. అని అజ్ఞానాన్నిహేళన చేసినా - అది గొప్ప spontaneity. "మీరు వుసుకొ వుసుకొ వుసుకంటే  వురికె వేటకుక్కలం ... సమరసింహారెడ్డి నువ్వు సల్లంగుండాలి బాబు హాయిగుండాలి  మీరు బాంబులిస్తె నెత్తిమీద ఏసుకునే తొత్తులం ఎస్పీలు కలెక్టర్లయి... మీ పిల్లల ఫోటోలు  పేపర్లలో పడాలి, పోలీసుస్టేషన్ లల్ల మా ఫోటోవులుండాలి - అని సీమ ఫ్యాక్షన్ రెడ్ల అరాచకాన్ని Hilarious గా నరికి పోగులు పెడతాడు.          *** వెంకన్నా... నువ్వు Emotional,  నువ్వు Irrational ...  Irresistable and you are just unstoppable. అలాగే వుండు. నీకేం వెంకన్నా. కవివి మాత్రమే కావుకదా.  నిండు కల్లుకుండ లాంటి మనిషివి! నివురులేని నిప్పుకణికవి! అంతెత్తున ఎగిరే ప్రజల ఆకాంక్షవి! మేల్కొలిపే రాగానివి, దారిచూపే దీపానివి! జబ్బుపడిన సమాజానికి ఆకులూ, పువ్వులూ,  అలల గలగలలూ కానుకలుగా ఇచ్చే నువ్వు..  సాక్షాత్తూ 'సంచార' ప్రకృతి చికిత్సాలయానివి! గోరటి వెంకన్న అంటే ఒక పాబ్లో నెరూడా,  ఒక బాబ్ డిలాన్ అని కవికులగురువు  శివారెడ్డి వూర్కెనే అన్నాడా! *** తెలుగు రచయితలు, కవులు, విమర్శకుల మధ్య కుతూహలంరేపే ఒక చర్చ జరిగింది.  ఒక్కటే సూటి ప్రశ్న! శ్రీశ్రీ తర్వాత ఎవరు? ఆరుద్రా? బాలగంగాధరతిలక్కా? దాశరథా? కేజీ సత్యమూర్తా? (శివసాగర్) శ్రీశ్రీ కి ముందు అంతా శూన్యం అన్న అజంతానా?  'జ్ఞానపీఠ్' సీ నారాయణరెడ్డా? 'సరస్వతీ సమ్మాన్' కే శివారెడ్డా? పోనీ, శ్రీరంగం నారాయణబాబా? వెలుతురెక్కడ సోనియా అన్న బైరాగా? ... అంతూపొంతూ లేని చర్చ జరిగింది.  తెలంగాణ జానపద సాంస్కృతిక సంప్రదాయం అద్భుతమైనది. ఇక్కడ కవిత్వం రాసినవాడే  పాడాలి, ఆడాలి, జనాన్ని గెలవాలి.  తెలంగాణ ప్రశ్న : గద్దర్ తర్వాత ఎవరు? ఒక్కపేరే! ఇక్కడ పోటీ లేనేలేదు.  ONE AND ONLY గోరటి వెంకన్న. UNDISPUTED ROCK STAR OF TELANGANA Tail Twist : తెలంగాణ సందర్శనకు వచ్చే  ప్రపంచ పర్యాటకులకు ఒక సూచన : దర్శనీయ స్థలాలు :  వేయి స్తంభాల గుడి - వరంగల్ రామప్ప దేవాలయం - వరంగల్ చార్మినార్ - హైదరాబాద్ గోరటి వెంకన్న, గౌరారం, మహబూబ్ నగర్. హెచ్చరిక : తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాక వెంకన్నని చూడకుండా, అతని పాట వినకుండా వెళ్ళిపోయారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకెవరూ వుండరు. గానం అన్నా , కవిత్వం అన్నా గోరటి వెంకన్న గుర్తుకొస్తాడు . గల్లీ సిన్నది అని ఎగిరెగిరి  పాడుతుంటాడు ... సంతా మావూరి సంతా  అంటూ మనల్ని మాయ చేస్తాడు .  -తాడి ప్రకాశ్

ప్రాంతీయ అస్తిత్వ సాహిత్య విమర్శ

ప్రాంతీయ అస్తిత్వ సాహిత్య విమర్శ విషయానికి వస్తే రాయలసీమ, కళింగాంధ్ర సాహిత్యాలపై వచ్చిన విమర్శ ఉనికిని చాటుకునే చైతన్యంతో వచ్చింది. తమ సాహిత్యంలో ప్రత్యేకతలను వివరించి చెప్పింది. ప్రాంతీయ అస్తిత్వ విమర్శకు మల్లీశ్వరి రచించిన “ఉత్తరాంధ్ర కథాస్థానీయత” ఉదాహరణగా నిలుస్తుంది. రామతీర్థ వంటి వారు ఉత్తరాంధ్ర  సాహిత్య విశ్లేషణ చేశారు. ‘ప్రబంధ’ అభివ్యక్తికి రాయలసీమ పునాదిగా నిలిచిందని విమర్శకులు అనడం వెనక ప్రాంతీయ స్పృహ పనిచేసింది. రాయలసీమ కథలపై పరిశోధన చేసిన తవ్వా వెంకటయ్య తొలినాటి రాయలసీమ కథలను వెలుగులోకి తేవడమే కాకుండా ఆ కథలపై వ్యాసాలు రాశారు. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి కథాంశం, మన నవలలు ` కథానికలు, ప్రతిఫలనం వంటి సంపుటుల్లో రాయలసీమ సాహిత్య విశిష్టతను చెప్పారు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య రాయలసీమ ప్రాంతంలో ప్రతిఫలించిన ఆ ప్రాంత సామాజిక, సాంస్కతిక ప్రత్యేకతలు ప్రతిఫలించాయి. రాయలసీమ ప్రాంత సాహిత్య పరిణామ వికాసాలను కూడా ఆయన వివరించారు. సింగమనేని నారాయణ, వేంపల్లి గంగాధర్, బండి నారాయణ స్వామి రాయలసీమ ప్రాంత సాహిత్యంపై చర్చించారు.  తెలంగాణ ప్రాంతీయ సాహిత్యం, దానికి సరిజోడుగా విమర్శ పెద్ద యెత్తున వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేపథ్యంలో సాహిత్యంతో పాటు సాహిత్య విమర్శ కూడా ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం పెల్లుబుకింది. అది ఉద్యమ స్థాయిని అందుకుంది. దీన్నే ముదిగంటి సుజాతారెడ్డి ` రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అస్తిత్వ చైతన్యం ఉన్నపటికీ అవి అస్తిత్వ ఉద్యమాలుగా రూపుదిద్దుకోలేదని, తెలంగాణ ప్రాంతం మాత్రమే అసిత్వ ఉద్యమంగా ఎదగిందని అన్నారు.  జరగాల్సిన తీరుపై ఇందులోని వివిధ రచయితలు చేసిన సూచనలు తర్వాతి కాలంలో విమర్శ విస్తరించడానికి దోహదం చేశాయి. తెలుగు సాహిత్యంలో బ్రిటిషాంధ్ర సాహిత్య చరిత్రకారులు, సంకలనకర్తలు తెలంగాణ సాహిత్యాన్ని విస్మరించడంపై, తప్పుడు సూత్రీకణలు చేయడంపై ప్రశ్నలు సంధిస్తూనే తొలితరం తెలంగాణ సాహిత్య ప్రక్రియలను వెలికితీసే పరిశోధనలు సాగాయి. అదే సమయంలో తెలంగాణ, బ్రిటిషాంధ్ర సాహిత్యాలు సమాంతర పరిణామ, వికాసాలు చెందలేదని, అందువల్ల బ్రిటిషాంధ్ర సాహిత్యాన్ని విశ్లేషించే కొలమానాలు సరిపోవనే వాదనలు కూడా తెచ్చి తెలంగాణ సాహిత్యాన్ని విశ్లేషించే పనిముట్లను తయారు చేసుకున్నారు. తెలుగు సాహిత్యంలో తొలి కవి, తొలి కథ వంటివాటిని ముందుకు తెచ్చారు. సాహిత్య చరిత్రలు తెలంగాణ సాహిత్యాన్ని ఇముడ్చుకునే రీతిలో లేవని విమర్శించారు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన ‘లెఖ్ఖ తప్పిన తెలుగు సాహిత్య చరిత్ర’, కాసుల లింగారెడ్డి రాసిన ‘మనం తక్కువేమీ కాదు’ అనే వ్యాసాలు తెలుగు సాహిత్య చరిత్రను తిరగరాయాల్సిన అవసరాన్ని తెలియజేశాయి. తెలుగు సాహిత్య చరిత్ర పునర్మూల్యాంకనానికి ప్రతిపాదనలు చేశాయి. బ్రిటిషాంధ్ర, నిజామాంధ్రల్లో వచ్చిన సాహిత్య ప్రక్రియలపై తులనాత్మక పరిశీలన కూడా చేసి తెలంగాణ సాహిత్య పరిణామ వికాసాలు భిన్నమని కూడా ప్రకటించాయి. ‘తెలంగాణ తోవలు’ పుస్తకంలో కాసుల ప్రతాపరెడ్డి రాసిన ‘వాళ్లూ ` మనమూ’, శోభా భట్ రాసిన ‘మీకు మీరే, మాకు మేమే ఎందుకీ నసనస’ అనే వ్యాసాలు ఆ పని చేశాయి. తెలంగాణకు సురవరం ప్రతాపరెడ్డి ఆదర్శం కావాలంటూ తెలుగు సాహిత్యంలో ఇప్పుడు వీస్తున్నది తెలంగాణ గాలి అని సురేంద్రరాజు ప్రకటించారు. తెలంగాణ దళిత, ముస్లిం, స్త్రీవాదాల గురించి కాసుల ప్రతాపరెడ్డి భౌగోళిక, చారిత్రక, సాంస్కతిక, సామాజిక సరిహద్దులను పరిగణనలోకి తీసుకుని తులనాత్మక అధ్యయనం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రకటించుకునే విషయంలో సురవరం ప్రతాపరెడ్డి తొలి అడుగు వేశారు. ఆయన వెలువరించిన ‘గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక’ ఆ పని చేసింది. తెలంగాణ సృజనాత్మక సాహిత్యం వివక్షకు, విస్మరణకు గురవుతున్న తీరును, ఆ సాహిత్యంపై ఉన్న తప్పుడు అభిప్రాయాలను తెలంగాణ విమర్శకులు ఎత్తి చూపారు. కె. శ్రీనివాస్ రాసిన ‘యాంటీ కలోనియల్ విశ్వనాథా, తెలంగాణ కష్ణారావూ!’ అనే వ్యాసం అందుకు ఉదాహరణ. తెలంగాణ కథ  పట్ల ప్రదర్శిస్తున్న వివక్షపై, తెలంగాణ కథ తీరు తెన్నులపై ‘తెలంగాణ కథ ` దేవులాట’ అనే సంకలనంలోని రచయితల వ్యాసాలు చెప్పాయి. వివక్షను ప్రశ్నించడం నుంచి తెలుగు కథా సాహిత్యంలో తెలంగాణ అస్తిత్వాన్ని చాటడానికి నిర్మాణాత్మక కషి తెలంగాణ రచయితల నుంచి జరిగింది.  తెలంగాణ కథ రచనకు వాడిన భాషపై కూడా చర్చ జరిగింది. ఇది ఒక రకంగా ఆత్మవిమర్శ లాంటిది. గుడిపాటి తెలంగాణ కథ విషయంలో ప్రధానంగా మూడు పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. కథా రచనలో వాడుతున్న భాషపై ఆయన విమర్శ పెట్టారు. దాన్నే కాసుల ప్రతాపరెడ్డి మరో రూపంలో చెప్పారు. “తెలంగాణ అస్తిత్వ ఉద్యమం బలంగా ముందుకు వచ్చిన తర్వాత తెలంగాణ భాషలోనే రాయాలనే వాదన బలంగా ముందకు వచ్చింది. అది చాలా మంచిది. అయితే కేవలం క్రియారూపాలను మార్చినంత మాత్రాన ప్రాంతీయ లక్షణాన్ని తేలేమనే విషయాన్ని గుర్తించడం ఈ సందర్భంలో అవసరం. తెలంగాణ భాష వాడకం, జీవిత చిత్రణ విషయాల్లో పాత తరంలో పి. యశోదారెడ్డి, ఈ తరంలో జాజుల గౌరి ఆదర్శమైతే తెలంగాణ కథకు పుష్టి చేకూరుతంది’ అని అన్నారు. తెలంగాణ నవలలను వెలికి తీసి, విమర్శించే సాహిత్యం కూడా బలంగానే వచ్చింది.   తెలంగాణ సాహిత్య విమర్శకు తొలి మైలురాయి ‘తెలంగాణ తోవలు’ అయితే మలి మైలురాయి ముదిగంటి సుజాతారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన ‘ముద్దెర’ మలి మైలురాయి. వచన కవిత్వానికి ఇచ్చిన గౌరవాన్ని గేయ కవిత్వానికి ఇస్తూ విమర్శకులు గేయ కవిత్వాన్ని విశ్లేషించారు. గోరటి ఎంకన్నపై కె. శ్రీనివాస్ రాసిన ‘పగిడికంటి పాట’ అనే వ్యాసం అత్యంత ప్రధానమైంది. తెలంగాణ కవిత్వాన్ని కాసుల ప్రతాపరెడ్డి ‘తెలంగాణ పాట ` దేశీయత’ అనే వ్యాసం రాశారు. పాటకు వచన కవిత్వం స్థాయిని కల్పించి ఈ రకమైన విశ్లేషణ చేయడం ఇదే ప్రథమమని డాక్టర్ యాకూబ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి భాష కూడా సాధనంగా మారింది. తమది ప్రత్యేకమైన భాష అని తెలంగాణ సాహిత్యవేత్తలు ప్రకటించారు. ఇది అతివాద విమర్శనే అయినప్పటికీ తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని ముందకు తీసుకుని పోవడానికి పనికి వచ్చింది. భాష విషయంలో విశేషంగా కషి చేసినవారు నందిని సిధారెడ్డి. ఇందులో భాగంగా తెలుగు ప్రామాణిక భాషపై విమర్శలు ఎక్కుపెట్టారు. భాషను ఆంధ్ర ఆధిపత్య వాదులు తెలంగాణ ప్రజల మనసులను బానిసలుగా మార్చుకోవడానికి వాడుకున్నారని సిధారెడ్డి అన్నారు.   డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ‘ముంగిలి’, ‘గనుమ’, నందిని సిధారెడ్డి ‘ఇగురు’, కాసుల ప్రతాపరెడ్డి ‘తెలంగాణ సాహిత్యోద్యమాలు’, ‘భౌగోళిక సందర్భం’, కొలుపు, ఇరుసు, గుడిపాటి ‘ఫాయిదా’, బన్న అయిలయ్య ‘తెలంగాణ పీఠికలు’, తెలంగాణ కథ ` పరామర్శ, బిఎస్ రాములు సమగ్ర సామాజిక కథ, కాలువ మల్లయ్య ‘తొమ్మిది పదుల తెలంగాణ కథ, సంగిశెట్టి శ్రీనివాస్ దస్త్రమ్, కె. శ్రీనివాస్ తెలంగాణ సాహిత్య వికాసం తెలంగాణ సాహిత్య విమర్శలో ఎన్నదగినవి. తూర్పు మల్లారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన ‘తెలంగాణ సాహిత్యం ` జీవితచిత్రణం’, ముదిగంటి సుజాతారెడ్డి సంపాదకత్వంలోని ముద్దెర, పంతంగి వెంకటేశ్వర్లు సంపాదకత్వంలో వచ్చిన ‘తెలంగాణ తెలుగు నవల, తెలంగాణ తెలుగు కథ’ ప్రముఖమైనవి. తెలుగు అకాడమీ ‘తెలంగాణ ఆధునిక తెలంగాణ సాహిత్యం’ అనే గ్రంథాన్ని వెలువరించింది. -కాసుల ప్రతాపరెడ్డి

ఆధునిక కవిత్వంలో విలక్షణమైన కంఠస్వరం

ఆధునిక తెలుగు కవిత్వంలో నందిని సిధారెడ్దిది ప్రత్యేకమైన గొంతుక. తన కవిత్వంలో ఆయన తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సామాజిక చైతన్యం, ప్రాంతీయ అస్తిత్వాలను ప్రతిబింబింపజేశారు. ఆయన కవిత్వం కేవలం భావ వ్యక్తీకరణకు మాత్రమే పరిమితం కాలేదు. అది తెలంగాణ సమాజ చరిత్రకు, వేదనకు, ఆకాంక్షలకు సాహిత్య రూపం కూడా. నందిని సిద్ధారెడ్డి కవిత్వంలో అత్యంత ముఖ్యమైన లక్షణం తెలంగాణ మాండలిక భాష వినియోగం. తెలుగు సాహిత్యంలో ఒకప్పుడు పరాయి భావనకు గురైన తెలంగాణ భాషను ఆయన కవిత్వంలో గౌరవనీయమైన స్థాయికి తీసుకువచ్చారు. సాధారణ ప్రజల మాటలు, పల్లె జీవన రీతులు, రైతు జీవితపు అనుభవాలు ఆయన కవిత్వంలో అత్యంత సహజంగా ప్రతిఫలిస్తాయి. అంతేకాదు.. వస్తువు ఏదైనా సరే, అతి సులభంగా, సహజంగా తెలంగాణ పదజాలంతో, నానుడులతో పూర్తి అధునిక వచన కవిత్వం రాసిన అతి కొద్ది మంది తెలంగాణ కవుల్లో సిధారెడ్డి ప్రముఖుడు. అది ఆయనకు అనివార్యమైంది కూడా. ఈ రకంగా ఆయన తెలంగాణ కవిత్వం ప్రత్యేకతను అగ్రభాగాన నిలపడమే కాకుండా మొత్తం తెలుగు కవిత్వానికి కొత్త డిక్షన్ ను అందించారు. ఆ రకంగా ఆధునిక తెలంగాణ వచన కవిత్వ భాషను రూపొందించిన కొద్ది మంది కవుల్లో ఆయన ముందుంటారు.  తెలంగాణ అస్తిత్వ ఉద్యమం సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో వేళ్లూనుకోక ముందు నుంచి తెలంగాణ భాష , నుడికారం పూర్తి స్థాయి వచన కవిత్వం  ఆయన నుంచి వెలువడింది. ‘భూమి స్వప్నం‘, ‘సంభాషణ’, ‘ఒక్క బాధా కాదు’  నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ‘అనిమేష‘ వరకూ అన్ని కవితా సంపుటుల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. అందువల్లనే కె. శివారెడ్డి కవిత్వ ప్రభావం ఆయనపై పడలేదు. నందిని సిద్ధారెడ్డి కవిత్వం సామాజిక చైతన్యంతో కూడుకున్నది. తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్న అన్యాయం, ఆర్థిక వెనుకబాటుతనం, సాంస్కృతిక వివక్ష వంటి అంశాలు ఆయన కవిత్వంలో ప్రతిధ్వనిస్తాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన రాసిన పాటలు ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని పెంచాయి. ‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’ తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉర్రూతలూగించింది. ఆయన కవిత్వంలోని ప్రతీకలు చాలా వరకూ సజీవమైనవి. భూమి, నది, వర్షం, చెట్టు వంటి ప్రకృతి అంశాలు తెలంగాణ సమాజపు జీవన పోరాటానికి ప్రతీకలుగా మారుతాయి.  నందిని సిధారెడ్డి తెలంగాణ ఆధునిక సాహిత్యంలో ఒక ఉద్యమ కవిగా గుర్తింపు పొందారు. ఆయన రచనలు తెలంగాణ సాంస్కృతిక స్వరూపాన్ని ప్రతిబింబించడమే కాకుండా ప్రజలలో ఆత్మగౌరవాన్ని పెంపొందించాయి. నందిని సిధారెడ్డి కథలు కూడా రాశారు. ’నాగటి తరం‘ అనే నవల రాశారు. పదునైన సాహిత్య విమర్శ కూడా చేశారు. తెలంగాణ భాషపై ప్రత్యేక అధ్యయనం చేశారు. కానీ ఆయనకు కవిగానే ఎక్కువ పేరు వుంది.  -కాసుల ప్రతాపరెడ్డి

దళిత సాహిత్య విమర్శ - స్థూల పరిచయం

1980 దశకంలో ఊపందుకున్న మరో అస్తిత్వ ఉద్యమం దళితవాదం. అంబేడ్కర్ సామాజిక విప్లవ దృక్పథం సైద్ధాంతిక భూమిక పునాదిగా ఈ ఉద్యమం తలెత్తింది. ఆత్మగౌరవాన్ని ప్రధానంగా దళిత స్పృహ కోరుకుంది. దళిత సాహిత్య విమర్శ సిద్ధాంత చర్చతో మొదలైంది. కులాన్ని పునాది అంశంగా స్వీకరించి చర్చోపచర్చలు జరిగాయి. దళిత తాత్వికత రూపుదిద్దుకునేందుకు ఈ చర్చలు ఉపయోగపడ్డాయి. విప్లవోద్యమాన్ని ప్రశ్నించడంతో దానికి పునాదులు పడ్డాయి. దళిత సాహిత్య విమర్శ - దృక్పథం, పరిణామం, ఒక పరిచయం  అనే వ్యాసంలో బిఎస్ రాములు దళిత విమర్శను నిర్వచించారు. విప్లవోద్యమంపై ప్రశ్నలు సంధిస్తూ బిఎస్ రాములు రాసిన  గతితర్క తత్వదర్శన భూమిక  పుస్తకం ప్రధానమైంది. జి. లక్ష్మీనరసయ్య వంటి దళిత సాహిత్య విమర్శకులు  దేశీయ మార్క్సిజం  అనే ప్రతిపాదన చేశారు. ఇందులో భాగంగానే డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి  దళం, దళితం రెండూ కావాలని ప్రతిపాదించారు. ఉ. సాంబశివరావు, కేజీ సత్యమూర్తి అంబేడ్కరిజం, మార్క్సిజం సమన్వయంతో ఈ దేశీయ మార్క్సిజానికి రూపకల్పన చేశారు. ఈ ప్రతిపాదనను నావంటి వారుర కొందరు వ్యతిరేకించారు. బిఎస్ రాములు వీరన్న పార్టీపై చేసిన విమర్శలు దాన్ని సమర్థించేవిగా ఉన్నాయి. దళిత సాహిత్య తాత్వికతను నిర్దేశించడానికి ప్రయత్నించినవారిలో కత్తి పద్మారావు, కంచె ఐలయ్య ముఖ్యులు.  కలేకూరి ప్రసాద్ రచించిన దళిత ఉద్యమం   దళిత సాహిత్యోద్యమం  అనే పుస్తకం స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం దళిత సామాజిక, ఆత్మగౌరవ పోరాటాలు ఎలా ముందుకు వచ్చాయో, వాటి ఫలితంగా దళిత సాహిత్యం ఎలా ఆవిర్భవించిందో వివరిస్తుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్) రంగం మీదికి వచ్చిన తర్వాత గుణాత్మకమైన మార్పు సంభవించింది. దళిత సాంస్కృతిక అస్తిత్వానికి అది తాత్విక భూమికను అందించింది.  దళిత సాహిత్యంపై జరిగిన వాదవివాదాలను డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ ఒక పుస్తకంగా తెచ్చారు. 1990 దశకంలో స్త్రీ, దళితవాదాలు సామాజిక, తాత్విక, సాహిత్య రంగాల్లో కొత్త ప్రశ్నలను సంధించాయని ఆయన అన్నారు. కొత్త వ్యక్తీకరణకు మార్గం వేశాయని గుర్తించారు. ఆర్ఎస్ సుదర్శనం, మో దళిత సాహిత్యాన్ని తప్పు పట్టారు. మో అనే వేగుంట మోహనప్రసాద్‌కు హెచ్చార్కె ధీటైన సమాధానం ఇచ్చారు. దళిత కవిత్వంలో బూతు పదాల వాడకంపై తీవ్రమైన చర్చ జరిగింది  సాహిత్యాన్ని దళిత దృక్కోణం నుంచి చూసే పద్ధతికి బిఎస్ రాములు, కత్తి పద్మారావు వంటివారు ఉదాహరణగా నిలుస్తారు.  కన్యాశుల్కాన్ని ఇప్పుడెలా చూడాలి?’ అని బిఎస్ రాములు రాసిన వ్యాసం ద్వారా బ్రాహ్మణ  భావజాల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. కేశవరెడ్డి నవలలను విమర్శిస్తూ రంగనాయకమ్మ రాసిన వ్యాసానికి అసుర సమాధానం ఇచ్చారు. కత్తి పద్మారావు తులనాత్మక పరిశీలన ద్వారా నిమ్న వర్ణాల రచయితల సాహితీ విలువలను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ‘వేమన - జాషువా’, ‘జాషువా - గద్దర్’, ‘జాషువా - తాపీ ధర్మారావు’, ‘జాషువా - శ్రీశ్రీ’ అంటూ తులనాత్మక పరిశీలన చేశారు. దేశీయ మార్క్సిజాన్ని ప్రతిపాదించిన లక్ష్మీ నరసయ్య బీసీలను, మైనారిటీలను, ఎస్‌టిలను ఎస్‌సిల సరసన చేర్చి అమూర్త సాధారీకరణ చేశారు.  సజనాత్మక సాహిత్యం మరింత ఫ్రాగ్మంటేషన్‌కు గురై బీసీలు, ఎస్‌టిలు, ముస్లింలు విడివిడిగా తమ ఐడెంటీలను ప్రకటించుకున్నారు. అంతేకాకుండా మాల, మాదిగలు కూడా విడివిడి ఐడెంటీలను ప్రకటించుకున్నారు. దీన్నే కాసుల ప్రతాపరెడ్డి 1997లో -  మేమే కవులు జీవిత మూలాల్లోకి వెళ్లారు. తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ఈ విధమైన పద్ధతి దాదాపుగా లేదు” అని అన్నారు.  సాహిత్యానికి దళిత విమర్శ సూత్రాలను అన్వయించి వ్యాసాలు రాసిన, రాస్తున్నవారిలో శిఖామణి, ఎండ్లూరి సుధాకర్, డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు, జిలుకర శ్రీనివాస్‌లను ప్రధానంగా చెప్పుకోవాలి. నాగార్జున విశ్వవిద్యాలయం, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో కాసుల ప్రతాపరెడ్డి రచించిన ‘వెంటాడే అవమానం’ కథపై సమర్పించిన వ్యాసం దళిత కథా విమర్శకు నమూనాలాంటిదని డాక్టర్ యాకూబ్ అభిప్రాయపడ్డారు. వేముల ఎల్లయ్య ‘కక్క’ నవలపై జిలుకర శ్రీనివాస్, బైరెడ్డి కష్ణారెడ్డి రాసిన వ్యాసాలు దళిత సాహిత్య విమర్శలో చెప్పుకోదగినవి.  దళిత ఈస్తటిక్స్ గురించి శివసాగర్ వంటివాళ్లు మొదటి నుంచి మాట్లాడుతూ వచ్చారు. అయితే, దీనికి సంబంధించి శిఖామణి తన ‘దళిత సాహిత్య తత్వం’ ద్వారా కాస్తా ఎక్కువ చర్చ చేశారు. అయితే, దళిత ఈస్తటిక్స్‌ను నిర్దిష్టంగా నిర్వచించడంలో వారెవరూ పెద్దగా ఫలితం సాధించలేదు. అందుకే దళిత ఈస్తటిక్స్‌ను నిర్వచించి, వివరించాల్సి ఉందని శ్రీరాములు ‘జాతర నవల - సమగ్ర పరిశీలన’ అనే పరిశోధనా గ్రంథానికి రాసిన ముందుమాటలో కాసుల ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. అయితే, దళిత కవిత్వ శైలిని, అభివ్యక్తి నవ్యతను చాలా మందే గుర్తించి, వివరించారు.  ఇకపోతే, దళిత సాహిత్యంలో మాలమాదిగ నిర్దిష్టలతో పాటు క్రైస్తవ, క్రైస్తవేతర నిర్దిష్టతలు చోటు చేసుకున్నాయి. కోస్తా దళిత కవులు క్రైస్తవ మత ప్రతీకలను విరివిగా వాడుకున్నారు. తెలంగాణ దళిత కవులు అందుకు భిన్నంగా కుల విశ్వాసాల నుంచి, తమ సామాజిక పరిస్థితుల నుంచి ముందుకు వచ్చినవాటిని వాడుకున్నారు. కవిత్వ భాషలో కూడా తేడా కనిపిస్తుంది. బ్రాహ్మణీయ భావజాలంపై పోరాటానికి కోస్తా దళిత కవులు క్రైస్తవ మతాన్ని, అందుకు సంబంధించిన ప్రతీకలను ఉన్నతీకరించారు. తెలంగాణ దళిత కవులు గ్రామ దేవతలను ఉన్నతీకరించారు.  - కాసుల ప్రతాపరెడ్డి

స్త్రీవాద సాహిత్య విమర్శ - సంక్షిప్త పరిచయం

తెలుగులో 1980 దశకం విప్లవోద్యమాన్నీ దాన్ని అనుసరిస్తూ వచ్చిన కాల్పనిక సాహిత్యాన్నీ విమర్శనూ అస్తిత్వ వాద ధోరణులు ఒక కుదుపు కుదిపాయి. ఇందులో భాగంగా మొదట వచ్చింది స్త్రీవాద ధోరణి. 1970 దశకంలో స్త్రీవాద ధోరణి ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే Feminist literary criticism   ముందుకు వచ్చింది. ఓల్గా, వసంత   స్త్రీవాద ధోరణికి సైద్ధాంతిక ప్రతిపత్తిని కల్పించే ప్రయత్నం చేశారు. స్త్రీవాద సాహిత్య విమర్శలో ప్రధానంగా ఎన్నదగింది జయప్రభ  భావకవిత్వంలో స్త్రీ  అనే గ్రంథం. ఆ తర్వాత ప్రధానమైంది డాక్టర్ పి. లక్ష్మి రాసిన  కవయిత్రుల కవిత్వంలో స్త్రీల మనోభావాలు అనే గ్రంథం. రంగనాయకమ్మ రాసిన వ్యాసాలు స్త్రీవాద విమర్శకు భూమికను తయారు చేశాయని ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ: వాదాలు ` ధోరణులు  అనే గ్రంథంలో డాక్టర్ యాకూబ్ అభిప్రాయపడ్డాడు. తెలుగు కవిత్వంలోకి వేగంగా స్త్రీవాదం దూసుకొచ్చింది. అయితే స్త్రీవాద కవయిత్రులలో బలమైన తాత్వికత ఎవరికీ ఉన్నట్లు అనిపించదని తిరుపతి రావు అభిప్రాయపడ్డారు.   1992 సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగిన సెమినార్ పత్రాలను మల్లాది సుబ్బమ్మ, రామమూర్తి  స్త్రీలు ` సాహిత్యం, సంస్కరణ విప్లవం పేర పుస్తకంగా తెచ్చారు. శారదా అశోకవర్ధన్ కందుకూరి వీరేశలింగం పంతులుపై విమర్శనా వ్యాసం రాశారు. స్త్రీ సంస్కరణను పట్టించుకున్న ఆయన ఆమె హ్రుదయఘోషను వినిపించుకోలేదని అన్నారు. ఇది ఆనాటి స్త్రీభావనలో వచ్చిన మార్పుగా గుర్తించవచ్చు. ఇదే పుస్తకంలో మృణాళిని రాసిన నవల ` స్త్రీపురుష సంబంధాలు , ఓల్గా రాసిన  నవల  సామాజిక విప్లవం , రావి భారతి రాసిన  ఆధునిక కవిత్వం  స్త్రీపోరాటం, కాత్యాయని విద్మహే రాసిన  తెలుగు కథ  సామాజిక విప్లవం  వ్యాసాలు స్త్రీవాద విమర్శనా ధోరణిని పట్టిస్తాయి. చలం శతజయంతి కమిటీ ప్రచురించిన  నూరేళ్ల చలం పుస్తకంలో కె. లలిత, తదితరులు రాసిన వ్యాసాలు ముఖ్యమైనవి. డాక్టర్ కాత్యాయని విద్మహే సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్కోణంతో పరిశీలించారు. ఆమె వెలువరించిన సంద్రాయ సాహిత్యం  దృక్కోణం  పేరుతో ప్రచురించిన గ్రంథంలో ప్రాచీన సాహిత్యంలోని స్త్రీ వ్యతిరేక భావనలను ఎత్తి చూపారు. జెండర్ స్పృహను స్వీకరించిన తర్వాత సాహిత్యాన్ని మానవ సంబంధాలతో అనుసంధానం చేసే కొత్త కోణం ఆవిష్కృతమైంది.  అయితే, స్త్రీవాదం దళిత స్త్రీల నుంచి విమర్శను ఎదుర్కుంది.  మాకు గోడలు లేవన్న స్త్రీవాదులను కూడా కులం గోడలు వదిలిపెట్టనట్లు కనిపించని పరిస్థితి ఉందని గోగు శ్యామల అన్నారు. దళిత స్త్రీ రచనలతో వెలువడిన  నల్లపొద్దు సంపాదకురాలు గోగు శ్యామల తన ముందు మాటలో దళిత స్త్రీవాదం ప్రతిపాదన చేశారు.  స్త్రీల ప్రత్యేక పదరూపాలు, వాక్య నిర్మాణ పద్ధతులు, ప్రత్యేక అభివ్యక్తి రీతులు జెండర్ స్పృహ దృక్పథంతో స్త్రీల భాషగా రూపొంది స్త్రీవాద విమర్శ బలపడింది. - కాసుల ప్రతాపరెడ్డి

ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ తొలి అడుగులు

తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ కందుకూరి వీరేశలింగంతో ప్రారంభమైంది, కొక్కొండ వెంకటరత్నం రచనపై కందుకూరి విగ్రహతంత్ర విమర్శనము  అనే పేరుతో విమర్శ రాశాడు. ఇందులో భాషాపరమైన దోషాలను ఎత్తిచూపడమే ఎక్కువగా ఉంది. సంఘ సంస్కరణ దృష్టితో చేసిన విమర్శ ఉంది. కావ్యానికి సంబంధించిన బాహ్య అంశాలనే ప్రధానంగా విశ్లేషించారాయన. ఈ రకంగా చూస్తే కందుకూరి పాశ్చాత్య విమర్శనా లక్షణాలను ఆకళింపు చేసుకున్నప్పటికీ తెలుగులో ఆధునిక  విమర్శ మార్గాన్ని ప్రామాణిక రీతిలో నిర్వచించలేకపోయారు. అభాగ్యోపాఖ్యానము ,  ఆంధ్ర కవుల చరిత్ర  అనే రచనలు కూడా చేశారు.  కందుకూరి వీరేశలింగం కన్నా ముందు కల్నల్ కాలిన్ మెకంజీ వద్ద పనిచేసిన కావలి వేకంట రామస్వామి అనే పండితుడు 1829లో ఇంగ్లీషులో  దక్కను కవుల చరిత్ర ను  Biographical sketches of Deccan poets గా రచించాడు. తెలుగు భాషాసాహిత్యాలను సిపీ బ్రౌన్ క్షుణ్నంగా అధ్యయనం చేశాడు. ఆయన వేమన పద్యాలను తెలుగులోనే కాకుండా ఇంగ్లీషులో కూడా అందించారు. శైవకావ్యాల్లోని శృంగార వర్ణనల్లో సభ్యత, సంస్కారం కనిపిస్తాయని, శైవేతర సాహిత్యంలో శృంగార వర్ణనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన విశ్లేషించాడు. కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి 1896లో  వివేక చంద్రికా విమర్శనము  అనే గ్రంథాన్ని వెలువరించారు. ఆధునిక ప్రక్రియ అయిన నవలపై వచ్చిన తొలి విమర్శగా దీన్ని చెప్పవచ్చు.  గురజాడ అప్పారావు  ఆధునిక ఆంధ్ర వచన రచన  అనే ఇంగ్లీసు వ్యాసంలో దుగ్గిరాల రాఘవ చంద్రయ్య రాసిన  విజయనగర సామ్రాజ్యాలు  అనే నవలను పరిశీలించారు. తెలుగు సాహిత్య విమర్శలో ఎన్నదగినవారు కట్టమంచి రామలింగారెడ్డి. ఆయన  కవిత్వతత్త్వ విచారము తెలుగు సాహిత్య విమర్శలో ఆధునికతను సమర్థంగా ప్రవేశపెట్టిన గ్రంథంగా ప్రసిద్ధి పొందింది. ఈ గ్రంథంలో ఆయన సాంప్రదాయిక విమర్శలో లేని imaginationని ప్రతిపాదించాడు. రచనకు అది ముఖ్యమని చెప్పారు. సాహిత్యంపై సామాజిక శక్తుల ప్రభావం గురించి తొలిసారి ప్రస్తావించినవాడు కట్టమంచి అని సివీ సుబ్బారావు తన  విభాత సంధ్యలు అనే పుస్తకంలో రాశారు. కట్టమంచి సంప్రదాయ భావాలను ప్రశ్నించాడు.  అక్కిరాజు ఉమాకాంతం 1928లో  నేటి కాలపు కవిత్వం  అనే గ్రంథంలో భావకవిత్వంపై విరుచుకుపడ్డారు. కాలపరిమితిని స్వాగతించకపోవడం అనే లోపం ఈ విమర్శలో ఉంది.  రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ  సారస్వతోపన్యాసములు ,  నాటకోపన్యాసములు , ‘వేమన’ వంటి విమర్శనా గ్రంథాలను వెలువరించారు. ఆయన ప్రాచ్య, పాశ్చాత్య సంప్రదాయాల అవగాహనతో, అనుశీలనతో సౌందర్యాన్వేషణ చేశారు. విశ్వనాథ సత్యనారాయణ సంప్రదాయ దృష్టితో, ప్రాచీన అలంకారిక సిద్ధాంతాలతో విమర్శ చేశారు.  నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తి,  శాకుంతలము యొక్క అభిజ్ఞానత,  అల్లసానివారి అల్లిక జిగిబిగి  వంటివాటిని ఆయన విమర్శనారీతికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.  కట్టమంచి రామలింగారెడ్డి సూచనప్రాయంగా వెల్లడించిన వాస్తవికతా ధోరణి తర్వాతి కాలంలో హేతువాదంగా, గతితార్కిక భౌతికవాదంగా, మానవతా వాదంగా విస్తరించింది. ఇది మార్క్సిస్టు విమర్శకు దారి తీసింది. మార్క్సిస్టు విమర్శ తర్వాతి కాలంలో అభ్యుదయ సాహిత్య విమర్శగా, విప్లవ సాహిత్య విమర్శగా విస్తరించింది.  మద్దుకూరి చంద్రశేఖర రావు, జీవి కృష్ణారావు, తాపీ ధర్మారావు, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, ఆరుద్ర, తుమ్మల వెంకట్రామయ్య, కేవిఆర్, రారాగా ప్రసిద్ధుడైన రాచమల్లు రామచంద్రారెడ్డి మార్క్సిస్టు విమర్శ చేసినవారిలో ముఖ్యులు. జీవీ కృష్ణారావు 1938లో తన ‘కావ్య జగత్తు’ ద్వారా మార్క్సిస్టు విమర్శకు పునాదులు వేశాడు.  ప్రముఖ కవి శ్రీశ్రీ కూడా విమర్శ రాశాడు. ఆయన తన విమర్శలో ప్రధానంగా లక్ష్య ప్రకటనలు చేశారు, వర్గ దృక్పథాన్ని నొక్కి చెప్పారు, సోషలిజానికీ సాహిత్యానికీ మధ్య ఉన్న సంబంధాన్ని ప్రతిపాదించారు. అయితే.. ఆయన మార్క్సిస్టు విమర్శకుల్లో కనిపించే యాంత్రికతకు దూరంగా ఉన్నారు. కాగా  శ్రీశ్రీ విమర్శలో మార్క్సిస్టు పద్ధతి ఎంతవరకు ఉందనేది సందేహమేనని చేరాలాంటివాళ్లు అభిప్రాయపడ్డారు. గురజాడ, వేమనల మీద ఆయన వ్యాసాలు రాశారు. గురజాడ ముత్యాలసరాల మీద రాశారు.  ఆ తర్వాత మార్క్సిస్టు విమర్శకుడిగా కొడవటిగంటి కుటుంబరావు ముందడుగు వేశారు. పారిభాషిక పదాలు, ఉటంకింపులు లేకుండా ఆయన ప్రతి విషయాన్ని తన అవగాహనలోంచి అర్థం చేసుకుని అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. విమర్శకుడిగా కొడవటిగంటికుటుంబరావుకి ఒక స్వతంత్రమైన తాత్విక వ్యక్తిత్వం ఉందని బాలగోపాల్ అభిప్రాయపడ్డారు. శాస్త్రీయమైన ఆలోచనా విధానం, మార్క్సిస్టు సామాజిక దృక్పథం, మానవతావాదం ఆయన వ్యక్తిత్వంలో భాగం. ఇవన్నీ కలిసి అభ్యుదయ దృక్పథం ఏర్పడుతుంది. ఈ అభ్యుదయ దృక్పథం కొడవటిగంటి కుటుంబరావుకు ఉంది.  కేవీఆర్ మార్క్సిస్టు విమర్శకుల్లో ఎన్నదగినవాడు. గురజాడపై రాసిన  మహోదయం గ్రంథాన్ని మార్క్సిస్టు విమర్శనా సూత్రాలను అన్వయిస్తూ రాశారు. ఆరుద్రపై ఆయన చేసిన విమర్శ అత్యంత ప్రధానమైంది.  శ్రీశ్రీ కంటే ఎక్కువగా కవిత్వ భాషను విప్లవీకరించిన ఘనత ఆరుద్రది అని ప్రకటించారు. కేవీఆర్ తన విమర్శలో చారిత్రక దృష్టిని ప్రదర్శించారు. రా.రా.గా పిలుచుకునే రాచమల్లు రామచంద్రారెడ్డి విమర్శను వ్యక్తిగత స్థాయి నుంచి సామాజిక స్థాయికి ఎదిగించారు. త్రిపురనేని మధుసూదనరావు సాహిత్యం వరకే పరిమితం కాలేదు. సాహిత్యం, రాజకీయ, తాత్విక రంగాలకు సంబంధించిన అంశాల గురించి రాశారు. ఆయన  కవిత్వం  చైతన్యం అనే విమర్శనా సంపుటిని వెలువరించారు. సాహిత్య చరిత్ర వ్యక్తుల పేర్లతోనో, రాజవంశాల పేరుతోనో ఉండడాన్ని ఆయన వ్యతిరేకించారు. కొత్తగా ఆయన యుగవిభజన చేశాడు.  పౌరహక్కుల కోసం, ఆ తర్వాత మానవ హక్కుల కోసం విశేషంగా కృషి చేసిన కె. బాలగోపాల్ చేసిన సాహిత్య విమర్శ తెలుగులో అత్యంత ప్రధానమైంది.  రూపం సారం  అనే పేరుతో ఆయన సాహిత్య విమర్శ గ్రంథం వెలువడింది. రాజకీయ, ఆర్థికాంశాల సమన్వయంలో ఆయన సాహిత్య విమర్శ చేశారు. ప్రముఖ రచయిత రావిశాస్త్రి నవలలపై రాస్తూ  లంపెన్ వర్గాల జీవితాన్ని ఎంత వాస్తవికంగా చిత్రించినా అది వాస్తవిక దృక్పథం అవుతుందే కానీ విప్లవ దృక్పథం కాదని అభిప్రాయపడ్డారు. విమర్శ నిర్దిష్టంగా ఉండాలనేది ఆయన అభిప్రాయం. మార్క్సిజం మీద ఆయన పరోక్షంగా విమర్శ పెట్టాడు.  తెలుగు మార్క్సిస్టు విమర్శకు ఒక కొత్త దృక్కోణాన్ని అందించడానికి సీవి సుబ్బారావు ప్రయత్నించారు. ఆయన తాను సంపాదకత్వం వహించిన  విభాత సంధ్యలు పుస్తకంలో తెలుగు మార్క్సిస్టు విమర్శనా ధోరణిలో పరిమితులు ఉన్నాయని గుర్తించి, వాటిని అధిగమించేందుకు ప్రయత్నించారు. మార్క్సిస్టు విమర్శలో లేని Text Centred విమర్శను చేరాగా పిలిచే చేకూరి రామారావు ప్రవేశపెట్టారు. ఆయన కేవలం మార్క్సిజాన్ని మాత్రమే కాకుండా భాషాశాస్త్రాన్ని, ఇతర శాస్త్రాలను తన సాహిత్య విమర్శకు వాడుకున్నాడు. రాజకీయ సిద్ధాంతాల భారం లేకుండా తెలుగు సాహిత్య విమర్శ చేశారు చేరా. భాషా శాస్త్రం ఆయనకు అదనపు శక్తిని ఇచ్చింది. వల్లంపాటి వెంకటసుబ్బయ్య  నవలాశిల్పం,  కథాశిల్పం, విమర్శ శిల్పం అనే పుస్తకాలను వెలువరించారు. సాహిత్య సిద్ధాంత నేపథ్యాన్ని చెబుతూనే అన్వయానికి ఆయన తన విమర్శలో ప్రాధాన్యం ఇచ్చారు. మార్క్సిస్టు సాహిత్య విమర్శను నిర్దిష్టమైన దేశీయ సాహిత్య సంబంధంలోంచి కేకెఆర్‌గా పిలుచుకునే కె. రంగనాథాచార్యులు పరిశీలించడానికి ప్రయత్నించారు. కేతవరపు రామకోటి శాస్త్రి సంప్రదాయ సాహిత్యం నుంచి వచ్చి, మార్క్సిస్టు సాహిత్య విమర్శనా ధోరణిని అందిపుచ్చుకున్నారు.  మొత్తంగా అభ్యుదయ సాహిత్య విమర్శగా ప్రారంభమైన మార్క్సిస్టు విమర్శ విప్లవ సాహిత్య విమర్శగా ఎదుగుతూ వచ్చింది. అయితే, ప్రజల చరిత్రనే నిజమైన చరిత్ర అని పదే పదే చెబుతూ వచ్చిన అభ్యుదయ, విప్లవ సాహిత్య విమర్శకులు, చరిత్రకారులు చేయని పని సురవరం ప్రతాపరెడ్డి చేశారు. తన  ఆంధ్రుల సాంఘిక చరిత్ర  అనే గ్రంథంలో ప్రజల చరిత్రకు పట్టం కట్టారు. ప్రజల వైపు నుంచి చరిత్రను రాశారు. ఇందులో భాగంగానే ఆయా యుగాల్లోని సాహిత్యాన్ని కూడా విశ్లేషించారు. - కాసుల ప్రతాపరెడ్డి

చురకల మెరుపుల కార్టూనిస్టు సురేంద్ర

తెలుగు దినపత్రికల్లో మొట్టమొదట రాజకీయ కవితలు రాసిన వాళ్లెవరో చెప్పండి? అని ఎడిటర్‌ నండూరి రామ్మోహనరావు ఒక మధ్యాహ్నం వేళ విజయవాడ  ఆంధ్రజ్యోతి ఆఫీసులో అడిగారు నన్ను.   ఇంకెవరు! రాంభట్ల కృష్ణమూర్తి గారేగా  అన్నాను చాలా కాన్ఫిడెంట్‌గా!  ఆయన నా భుజమ్మీద చిన్నగా కొట్టి.. మీతో అదే వచ్చింది  అన్నారు.  మీతో అంటే కమ్యూనిస్టులతో అని ఆయన ఉద్దేశం.  మొట్టమొదట రాసింది నేను అని నండూరి చెప్పారు. 1956లోనో 57లోనో రాశానని వివరంగా తెలియజెప్పారు. నడుస్తున్న రాజకీయాలమీద ఒక కామెంటరీలా, చురకలతో, మెరుపులతో ఎనిమిది లైన్ల పొట్టి కవితలు రాయడం ఆనాడే మొదలైంది. నండూరి, ఆరుద్ర, రాంభట్ల రాసినవి జనానికి నచ్చాయి. పాపులర్‌ అయ్యాయి. అసలు సిసలు రాజకీయ కవితలకి ఆద్యుడు శ్రీశ్రీ. ....శ్రీమాన్ గోగినేని రంగా....కోట్లు మార్చి ప్లేట్లు మార్చి కులుకు  విలాసంగా ,చ్చీరంగా ఘోరంగా క్రూరంగా అని  రాసి పారేశారు.  ఆ  వరసలోనే ఆంధ్రప్రభ, ఉదయం దినపత్రికల్లో కవి దేవిప్రియ రాసిన చిట్టి కవితలకు ఆర్టిస్ట్‌ మోహన్‌ వేసిన బొమ్మలు ఒక ఊపు వూపాయి. ఒక ట్రెండ్‌ సెట్‌ చేశాయి. దినపత్రిక మొదటి పేజీలో ఒక మూల వుండే ప్యాకెట్‌ కార్టూన్‌కి బదులు ఇలా రన్నింగ్‌ కామెంటరీ ఉండాలని దాదాపు అందరు సంపాదకులూ అనుకున్నారు. సాయంత్రం పార్టీల్లో ఆ పొట్టి కవితల్ని కోట్‌ చేయడం ఆహా వోహో అనుకోడం...అలా నడిచాయి అప్పటిరోజులు. 1980 నుంచి 2000 సంవత్సరందాకా ఈ జోరు నడిచింది.  కార్టూన్‌ వేయడం, మరీ ముఖ్యంగా పొలిటికల్‌ కార్టూన్‌తో ఒప్పించడం అంత ఈజీ కాదు. భార్యాభర్తలు, పక్కింటి లావుపాటి పిన్నిగారు, చిన్నపిల్లల సరదా కార్టూన్లు చాలా మంది వేశారు. పొలిటికల్‌ కార్టూన్‌ పూర్తిగా వేరు. పీవీ నరసింహారావో, ఇందిరాగాంధీనో, ఎన్టీఆరో...కార్టూన్‌ బొమ్మలో పోలిక బాగా రావాలి. ఐడియా పేలాలి. అనగా నడుస్తున్న రాజకీయాల మీద ఆర్టిస్టుకి అవగాహన వుండాలి.  మన వెకిలి, మకిలి, దరిద్రపు రాజకీయాలమీద కామెంట్‌ చేయగలిగే శక్తి వుండాలి. అంచేత పొలిటికల్‌ కార్టూనిస్టు అనేవాడు అరుదైన  సోషల్‌ యానిమల్‌  అన్నమాట. ఒక శంకర్‌ పిళ్లై, ఆర్కే లక్ష్మణ్, అబూ అబ్రహాం లాంటి అతికొద్ది మంది మన జాతీయ రాజకీయ కార్టూనిస్టులుగా పేరు పొందారు. తెలుగులో మంచి కార్టూనిస్టులు చాలామంది వున్నా, రాజకీయ వ్యంగ్య చిత్రాలు వేయగలిగే మొనగాళ్లు అతి కొద్దిమంది మాత్రమే. ఆ ఐదారు మందిలో ఒక పొడుగాటి శక్తిమంతుడైన చిత్ర లేఖకుడు సురేంద్ర.   కడప జిల్లాకి చెందిన, మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉన్న సురేంద్ర తెలుగు పత్రికల్లో 14 సంవత్సరాలు పనిచేశారు. లెక్కలేనన్ని బొమ్మలూ, కేరికేచర్లూ, కార్టూన్లు వేశారు. సురేంద్ర సాధించిన ఒక విజయం గురించి తప్పకుండా చెప్పుకోవాలి. కలం భుజాన వేసుకుని మద్రాసు రైలెక్కిన సురేంద్ర జాతీయ దినపత్రిక హిందూలో ఏకంగా 28 సంవత్సరాలు పొలిటికల్‌ కార్టూన్లు వేశారు. దేశంలోని మంచి కార్టూనిస్టుల్లో ఒకడిగా పేరుపొందారు. ముఖ్యంగా 1990వ దశకంలో కవి గజ్జెల మల్లారెడ్డి విజృంభించి రాసిన ‘అక్షింతలు’ అనే పొట్టి కవితలకి అర్థవంతమైన బొమ్మలు వేశాడు.  నలుపు  తెలుపు రేఖావిన్యాసం   తో సూపర్‌ కార్టూనిస్ట్‌ సురేంద్ర అనే పేరు తెచ్చుకున్నాడు.    మనందరం రోజువారీ జీవితాన్నీ, రాజకీయాల్నీ చూస్తాం. కార్టూనిస్టు అనేవాడిది వంకర చూపు. ఆ పదునైన చూపే మనల్ని నవ్విస్తుంది.  కొత్త  దారుల్లో    నడిపిస్తూవుంది. బతుకులోని విషాదాన్ని చూసి కూడా నవ్వుకునే శక్తిని ప్రసాదించేవాడే వ్యంగ్య చిత్రకారుడు.  40, 50 ఏళ్ల క్రితం ప్రముఖ రచయితగావెలిగిన పి.రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి సురేంద్ర. అసలే కడప, పైగా రెడ్లు...అయితే గియితే ఫ్యాక్షనిస్టులు కావాలిగానీ, రచయితలూ, కార్టూనిస్టులూ అవుతారా అని మన సమాజం ఆశ్చర్యపోవచ్చు. మన చిల్లర  కమర్షియల్ తెలుగు సినిమాలు తెచ్చిపెట్టిన దరిద్రం అది. పుట్టపర్తి నారాయణాచార్యులు, రాచమల్లు రామచంద్రారెడ్డి, సోదుం రామ్మోహన,  సోదుం జయరాం నుంచి కేతు విశ్వనాథరెడ్డి, పి.రామకృష్ణారెడ్డిగారి దాకా అందరూ గొప్ప సాహితీవేత్తలు. సహృదయులు. కరుణ నిండిన మనుషులు. ఆ అద్భుతమైన తరానికి తగిన వారసుడే సురేంద్ర. తక్కువ మాట్లాడతాడు. చిన్నగా జోకేస్తాడు. స్నేహితుడు అంటే ఎలా వుండాలో అలా వుండే ఆత్మీయుడే సురేంద్ర.  గజ్జెల మల్లారెడ్డి సొంత వూరు సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరు. ఆ వూరికి దగ్గరలోనే ‘ఎద్దులయ్యగారి కొత్తపల్లి’ వుంది. అది తెలుగు సినీ లేజెండ్స్‌ విజయా నాగిరెడ్డి, ఆయన అన్న బి.ఎన్‌.రెడ్డిల స్వగ్రామం. ఆ పక్కనే పైడిపాలెం రాచమల్లు రామచంద్రారెడ్డి వూరు. ఆ పక్కనే సురేంద్ర గ్రామం. తెలుగు నాటక  కళాకారుల ప్రతిభని ప్రపంచానికి చాటిన సురభి గ్రామం అక్కడే వుంది.  కనుక కడపరెడ్లు అందరూ నెత్తురుతాగే ఫ్యాక్షనిస్టులు కారని ఇందుమూలముగా తెలియజేయడమైనది.  మల్లారెడ్డి ‘అక్షింతలు’ కవితలతో, సురేంద్ర బొమ్మలతో అందంగా డిజైన్‌ చేసిన 400 పేజీల పుస్తకం వచ్చింది. అందులో కాంగ్రెస్‌ పార్టీ మీద మల్లారెడ్డి విసురు.... ఎవరైనా కాంగ్రెస్‌లో ఎప్పుడైనా చేరవచ్చు. తలుపుల్లేని గుడిసెలో దర్జాగా దూరవచ్చు. అదో పెద్ద ఊరచెరువు ఏమైనా చెయ్యవచ్చు. అదో ధర్మసత్రం, ఎవరైనా భోంచేయ్యొచ్చు... దీనిని సురేంద్ర వేసిన బొమ్మః కప్పలు నిండిన చెరువు గట్టున వున్న ఒక కప్ప, ‘మే ఐ కమిన్‌?’ అని అడుగుతుంటుంది.  1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు వోడిపోయారు. అప్పుడు మల్లారెడ్డి...తొడలు విరిగి కూలబడిన–తెలుగు సుయోధనుని చూడు, ఏడేళ్లుగ పీడించిన–ఏలినాటి శనిని చూడు, అహంకార మతిశయించ–అణగారిన దొరను చూడు, తిరగబడిన తెలుగువాడు–తెగులు వదిల్చాడు నేడు....  దీనికి సురేంద్ర వేసిన తొడలు విరిగిన ఎన్టీఆర్‌ బొమ్మ చూసి తీరాలి. వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన విధ్వంసంపై సురేంద్ర చమత్కారం చూడండి. అల్లర్లలో తగలబడిన ఆర్టీసీ బస్సు స్కెలిటన్‌ వేసి, ఆర్టీసీ నష్టాలు పూడ్చుకునేదాకా కొంతకాలం ఇలాగే నడుపుతారట! అని కామెంట్‌ రాశాడు. సెన్సాఫ్‌ హ్యూమరూ, సురేంద్రా కవల పిల్లలు.   ఫిబ్రవరి 22 ఆదివారంనాడు హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ సోమాజిగూడలో ‘అక్షింతలు’ ఆవిష్కరణ సభ జరిగింది. పుస్తకం కావాలంటే  9447234086 నెంబరులో వాట్సప్‌ మెస్సేజ్‌తో సంప్రదించాలి. -తాడి ప్రకాష్ ఫోన్. 9704541559

యధార్థ జీవితాలకు ప్రతీకలు

మహిళలు కథలు చాలా ఆసక్తికరంగా చెప్పగలరు. అదే ఒరవడి వాళ్లు రాసిన కథల్లోనూ కనిపిస్తుంది. శిల్పం లేనట్లుగా అనిపించే వినూత్నమైన శిల్పం వారి కథల్లో కనిపిస్తుంది. డాక్టర్ తంగెళ్ల శ్రీదేవి రెడ్డి రాసిన కథలను చదువుతుంటే అలా అనిపించింది. తన అనుభవంలోకి వచ్చిన విషయాలను, సమాజాన్ని చదువుతూ తాను తెలుసుకున్న అంశాలను, పరిశోధన చేసి తెలుసుకున్న అంశాలను ఆమె కథలుగా మలిచినట్లు అనిపిస్తుంది. సామాజిక చారిత్రక పరిణామక్రమాన్ని ఆమె తన కథల్లో పట్లుకున్నారు. అంతేకాకుండా సామాజిక పరిణామ క్రమంలో మరుపునకు, దురవగాహనకు గురైన అంశాలను ఆమె తన కథల్లో చిత్రిక కట్టారు. ‘ఎర్ర రేగళ్లు’ పేరిట ఆమె వెలువరిస్తున్న ఈ కథాసంపుటిలో వైవిధ్యమైన కథలు వున్నాయి. తెలంగాణ సమాజంలోని పరిణామాలను, మానవీయ కోణాలను ఆమె తన కథల్లో స్పృశించారు. ఈ సంపుటిలో మొత్తం 15 కథలున్నాయి. ముస్లింలు, హిందువులు కలిసి మెలిసి సాగించిన జీవన ప్రయాణాలు కూడా ఈ కథల్లో కనిపిస్తాయి, కరోనా కాలంలో జీవితాలు ఎలా అల్లకల్లోలమయ్యాయో చెప్పే కథలూ వున్నాయి.  రెడ్ల జీవిత ప్రయాణాలను, వారి వ్యక్తిగత ప్రవర్తనను కొన్ని కథల్లో డాక్టర్ శ్రీదేవిరెడ్డి చిత్రించారు. రెడ్ల సామాజిక జీవన ప్రయాణాల మీద వచ్చిన కథలు చాలా తక్కువ. ఆ కొరతను కొంత మేరకు ఈ రచయిత్రి తీర్చారు. ‘నాగిరెడ్డిపల్లె’, ‘బాల్రెడ్డి’, ‘కావలి బుడ్డమ్మ’ ఇంకా కొన్ని కథల్లో రెడ్ల పాత్రలు కనిపిస్తాయి. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఇవి అవసరమైన కథలుగా కనిపిస్తాయి. గంపగుత్తగా రెడ్డి సామాజిక వర్గాన్ని దోపిడీదారులుగా, పీడకుల చిత్రించే ‘రాజకీయం’ నడుస్తున్నది. కులం రీత్యా అగ్రకులమే అయినప్పటికీ గ్రామ నిర్మితిలో, గ్రామ ప్రజల సంక్షేమంలో వారు నిర్వహించిన పాత్ర తక్కువదేమీ కాదు. అలాగే ఇతర కులాలవారితో వారు నెరిపిన, నెరుపుతున్న సామాజిక, వ్యక్తిగత జీవితాలు త్యాగంతోనూ, సానుకూల ఆలోచనతోనూ సాగాయని చెప్పడానికి ఈ కథలు రుజువులుగా నిలబడతాయి.  సామాజిక పరిణామ క్రమంలోనూ, సామాజిక నిర్మాణంలోనూ, గ్రామీణ వ్యవస్థ మానవ సంబంధాల విషయంలోనూ రెడ్లను ప్రతికూలంగానే చూపుతున్నారు. కులవాదం కాస్తా వ్యక్తివాద ఎజెండాగా మారిన వైనానికి ఇది అద్దం పడుతుంది. కాకుంటే భావవాదంగా మారింది. విసునూరు రామచంద్రారెడ్డినే రెడ్ల ప్రతీకగా దశలో మనం వున్నాం. రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కుర్రారం రామిరెడ్డి, బిఎన్ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటివారు చేసిన త్యాగాలు చిన్నవేమీ కాదు. అంతటి త్యాగాలు చేయకపోయినా గ్రామ సంబంధాల్లో, గ్రామాభివద్ధిలో, గ్రామ సమస్యల పరిష్కారంలో, మానవ సంబంధాల విషయంలో చాలా మంది రెడ్లు సానుకూల పాత్ర పోషించారని ఆమె కథలు చదివితే మనకు అర్థమవుతుంది. గ్రామీణ వ్యవస్థలో రెడ్లు పోషించిన సానుకూల పాత్ర కూడా అర్థమవుతుంది. ‘బందూకు చెప్పిన కథ’ సంపుటిలోని అతి పెద్ద కథ. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని చిత్రించారు. అయితే, ఇందులో ప్రతికూల పాత్ర లేదా పీడక పాత్ర పోషించిన రెడ్డితో పాటు దౌష్ట్యాన్ని ఎదరించిన రెడ్లు కూడా మనకు కనిపిస్తారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చారిత్రక పురుషులు మన ముందు నిలబడుతారు. సాయుధ పోరాటంలో వీరోచిత పోరాటం చేసిన తమ తాత తరాన్ని మనవడు గుర్తు చేసుకోవడం ద్వారా ఆమె కథను నడిపించారు. మరుగున పడిన సాయుధ పోరాట వీరుల చరిత్రను ఆమె ఈ కథ ద్వారా గుర్తు చేశారు. అయితే, ఆమె ఈ కథలను ఎవరికో సమాధానంగా రాయలేదు. తాను చూసిన, తాను అనుభవంలోకి తెచ్చుకున్న సమాజాన్ని మాత్రమే చిత్రించారు. అంటే పనిగట్టుకుని ఇది సత్యం అనే నిశ్చయవాదం ఆమె కథల్లో కనిపించదు. సామాజిక వాస్తవికతకు, ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ సామాజిక వాస్తవికతకు అవి అద్దం పడుతాయి. ఏం జరిగిందో మాత్రమే ఆమె చెప్పారు. ఒక వర్గాన్ని ఎత్తిపట్టడానికి ఆమె ఇతర వర్గాలను కించపరచలేదు, విమర్శించనూ లేదు. కులాల అంతరాలు వున్నప్పటికీ కలిసిమెలిసి సాగించే జీవన ప్రయాణాలను చూపించారు. ఈ కథల్లో వాదోపవాదాలు లేవు, రచయిత్రి సొంత అభిప్రాయాలు లేవు, జీవితాలు మాత్రమే వున్నాయి.  నేటి విద్యావిధానంలో పిల్లలు బయటకు కనిపించని మానసిక ఒత్తిడి గురవుతున్న తీరుకు ‘చిట్టితల్లి’ కథ అద్దం పడుతుంది. పిల్లలు ఎదుర్కుంటున్న ఒత్తిడిని అత్యంత సున్నితంగా చెప్పిన కథ ఇది. మనకు అర్థం కాని, మన ఆలోచనా పరిధిలోకి రాని విషయాన్ని ఆమె కథగా మలిచారు. ఈ కథను చదివి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది చాలా వుంది. కుటుంబాలు విచ్ఛిన్నమై, మానవ సంబంధాలు దెబ్బ తింటున్న తీరును ‘బాబుగాడు’ కథ చిత్రించింది. అదే విధంగా ‘పాడుబడ్డ బాయి’ కరుణ రసాత్మకమైన కథ. కుటుంబంలో అందరికీ పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన ఓ స్త్రీ చివరకు కూతుళ్లు, కొడుకులు, మనవళ్లు, మనవరాళ్లు వున్నప్పటికీ అనాథగా మారిపోయి, అనాథగానే మరణించిన తీరును చిత్రించిన కథ. సమాజంలోని ప్రస్తుత వ్యక్తికేంద్రక సమాజంలోని అమానవీయ కోణాన్ని ఈ కథ చూపుతుంది. కరోనా కాలంలో మనుషులు పడిన కష్టాల గురించి, సంభవించిన మరణాల గురించి, దెబ్బ తిన్న మానవ సంబంధాల గురించి కథలూ కవిత్వం వచ్చాయి. శ్రీదేవిరెడ్డి ఈ నేపథ్యం నుంచి ‘కంచె’, ‘విధి’, ‘బుగాడా’ అనే మూడు కథలు రాశారు. ఈ మూడు కథలు కూడా విలక్షణమైనవి. దేనికదే ప్రత్యేకమైనది. ‘బుగాడా’ కథ కరోనా కాలంలో నిర్హేతుక ప్రచారాలకు అడ్డుకట్ట వేసిన చిత్రించింది. ‘పోషవ్వ’, ‘మొగిలి’, ‘కుచ్చుల గౌను’ కథలు శ్రీదేవిరెడ్డి నిశిత పరిశీలనకు, పరిశోధనకు అద్దం పడుతాయి. రాళ్లు కొట్టుకుని నిత్యం ఉదరపోషణకే విలవిలలాడే వడ్డెర జీవితాలను ‘కుచ్చుల గౌను’ కథ చిత్రించింది. వారిలోనూ పురుషాధిక్యత ఎలా వుంటుందో తెలిపిన కథ ఇది. ‘పోషవ్వ’ కథ సంచార జాతుల్లోని ‘ఓలి’ అనే దుష్టసంప్రదాయాన్ని చిత్రించింది. ఇక్కడ కూడా మహిళలే బాధితులు కావడం చూస్తాం. ‘మొగిలి’ మత్స్యకారుల కుటుంబంలో తలెత్తిన ప్రతికూల ఘటన ప్రభావాన్ని చూపుతూ మానవీయ స్పర్శతో ముగిసే కథ. ‘కావలి బుడ్డమ్మ’ ఈ సంపుటిలోని మరో విలక్షణమైన, ప్రత్యేకమైన కథ. గ్రామీణ వ్యవస్థలో ఆయా గ్రామాలకు లేదా స్థానిక ప్రాంతాలకు చెందిన దేవతలను చూస్తాం. ‘కావలి బుడ్డమ్మ’ తన త్యాగనిరతి ద్వారా గ్రామీణ ప్రజల మొక్కులు అందుకునే దేవతగా అవతరించిన వైనాన్ని చిత్రించింది. ఇటువంటి గ్రామీణ దేవతలకు ప్రత్యేకమైన కథలు వుంటాయి. వాటిని రికార్డు చేయాల్సిన అవసరాన్ని ఈ కథ తెలియజేస్తుంది.  ‘జుబేదా’ అనే కథ పేద ముస్లిం కుటుంబం దయనీయమైన స్థితిని మాత్రమే కాకుండా ఆ కుటుంబంలోని మహిళ అనుభవించే ప్రత్యేకమైన హింసను కూడా తెలియజేస్తుంది. ఆ మహిళనే తన హింసకు పరిష్కారాన్ని కనుక్కున్న కథ. కేవలం పేదరికాన్ని, దాని వల్ల అనుభవించే దుర్భర పరిస్థితిని మాత్రమే చిత్రించకుండా దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కున్న ముస్లిం మహిళ పాత్రను సృష్టించడం ద్వారా ఒక ప్రగతిశీల దృక్పథాన్ని ప్రదర్శించారు శ్రీదేవి రెడ్డి.  చివరగా అత్యంత ముఖ్యమైన కథ గురించి మాట్లాడుకుందాం. అది ‘ఎర్రరేగళ్లు’. వైద్య చికిత్స కోసం ఎర్రరేగళ్లను పోగొట్టుకున్న కటుంబం, ఆ ఎర్రరేగళ్లను కుట్రపూరితంగా వశం చేసుకున్న పెద్దల నీతిని ఈ కథ చిత్రించింది. నిజానికి, కపట నాటకానికి తమ భూములు అన్యాక్రాంతం అయ్యాయనే విషయం కూడా వాటిని పోగొట్టుకున్న కుటుంబ సభ్యులకు తెలియకపోవడం అత్యంత చిత్రంగానూ వాస్తవంగానూ కనిపిస్తుంది. వైద్యరంగం ప్రైవేటీకరణ చెంది కార్పోరేట్ ఆస్పత్రులు వచ్చిన తర్వాత చికిత్సకు మానవీయ కోణం నశించింది. ధనార్జనే ధ్యేయంగా ఒక గొలుసుకట్టు విధానంలో వైద్యరంగం ప్రజలను ఎలా మోసం చేస్తున్నదో తెలిపే కథ ఇది. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు వైద్యులు ఒక కచ్చితమైన అవగాహనతో, ఆచరణతో ప్రజలను మభ్యపెట్టి దోచుకుంటున్న వైనం ఈ కథ మన కళ్లకు కడుతుంది.  శ్రీదేవి రెడ్డి తన కథల్లో గ్రామీణ పదజాలానికి పెద్ద పీట వేశారు. అవసరమైన ప్రతిచోటా తెలంగాణకు, మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రత్యేక పదజాలాన్ని కథల్లో వాడారు. యిన్నూరు, పటాకి, యాష్ట, బిందానం, సుస్తు, పొరకట్ట, ఇకమతు, అగస్తంగా వంటి అనేక ప్రత్యేకమైన పదాలు ఆమె కథల్లో కనిపిస్తాయి. ఈ పదాల వాడకం మాత్రమే కాకుండా స్థానిక ప్రత్యేక సాంస్కతిక ప్రత్యేకతలను కూడా కథల్లో సందర్భాన్ని బట్టి వాడడం కూడా కనిపిస్తుంది. ‘మొగిలి’ అనే కథలో పిల్లవాడికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఆమె చెప్పారు. ‘పెళ్లయిన పదేళ్ల తర్వాత మొగల్సావ్ పీరుకు మొక్కుకుంటే పుట్టిండు కాబట్టి ఈ పేరు పేరే వాడి పేరయింది’ అని రచయిత్రి అంటారు. ఇది హిందూ, ముస్లింలు కలిసి మెలిసి చేసే ప్రయాణాన్ని కూడా తెలియజేస్తుంది. ‘శంకరమ్మ, చెన్నప్పల పెండ్లి పాలమూరు దగ్గర కురుమూర్తి స్వామి గుట్ట మీద బంధు మిత్రుల మధ్య జరిగింది’ అని అంటారు. పాలమూరు సమీపంలోని కురుమూర్తి స్వామికి ఒక ప్రత్యేకత వుంది. ఇది వేంకటేశ్వరస్వామి దేవుడు కురుమూర్తిగా అవతరించిన ఆలయం అంటారు. ఇక్కడ అతి పెద్ద జాతర జరుగుతుంది. ఈ సమయంలో మాంసాహారం కూడా వండుకుని తింటారు. ఈ ఆలయానికి ప్రత్యేకమైన కథ కూడా వుండి వుంటుంది. ఇలా స్థానిక పదజాలన్ని, సాంస్కతిక ప్రతీకలను ఉపయోగించడం ద్వారా శ్రీదేవి రెడ్డి తన కథలకు విశ్వసనీయతను సమకూర్చుకున్నారు.  సామాజిక వాస్తవాలు అయిన కులం, మతం, సాంస్కృతిక విశిష్టతలను చెప్పకుండా కథలు రాసే సంప్రదాయం తెలుగులో విరివిగా వుంది. సూచనప్రాయంగానైనా కులం, మతం అర్థమయ్యే తీరును కథల్లో ప్రవేశపెట్టడం వల్ల కథలకు విశ్వసనీయత సమకూరడమే కాకుండా వాస్తవికతను కూడా సంతరించుకుంటాయి. ప్రాంతం విషయంలోనూ అదే జరుగుతున్నది. నిర్దిష్టత ద్వారా సార్వజనీనం సాధించాల్సిన గుణం చాలా ఉత్తమమైంది. ఆ లక్షణం శ్రీదేవి రెడ్డి కథల్లో కనిపిస్తుంది. మొత్తంగా, ఇవి వాదాల జోలికి వెళ్లని కథలు. సమాజాన్ని యధార్థ దృక్పథంతో చిత్రించిన కథలు. సిద్ధాంత రాద్దాంతాల గొడవ కూడా ఆమెకు ఉన్నట్లు కనిపించదు. ఇవి తెలుగు కథానికా ప్రపంచానికి అందించిన చేర్పుగా భావించవచ్చు. డాక్టర్ తంగెళ్ల శ్రీదేవి రెడ్డి ‘ఎర్రరేగళ్లు’ అనే కథాసంపుటి త్వరలో వెలువడనుంది. ఆ కథల పుస్తకానికి నేను రాసిన ముందుమాట. -కాసుల ప్రతాపరెడ్డి

కొంచెం నా గురించి... ఇంకొంచెం కేశవ రెడ్డి గురించి...

ఆలేరులోనో, జనగామలోనో సరిగా గుర్తు లేదు గానీ కొంతమంది మిత్రులతో కలిసి ఆర్టీసి బస్సెక్కాను. ఏ సంవత్సరం అనేది కూడా నిర్దిష్టంగా గుర్తు లేదు. బహుశా 1997 కావచ్చు. నేను అప్పుడు ఓ ఆంగ్ల దినపత్రికకు అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా  కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాను. వరంగల్, హన్మకొండ, ఆపై నుంచి వచ్చే బస్సులు వేళలను బట్టి టిపిన్, లంచ్, డిన్నర్ కోసం ఆలేరులో ఎక్కువ సేపు నిలుపుతారు. సాయంత్రం పూట, కాస్త చీకటి కూడా పడింది. ఆలేరులో బస్సు ఆగగానే సీటు రిజర్వ్ చేసుకుంటూ నా వద్ద ఉన్న పుస్తకాలను సీటుపై ఉంచి దిగిపోయాను. తిరిగి బస్సెక్కగానే కండక్టర్ పుస్తకాలను చూస్తూ కనిపించాడు. ఏమిటి చూస్తున్నావు అని అడగా. డాక్టర్ అని ఉంటే డాక్టర్ కేశవరెడ్డి పుస్తకం అనుకుని చూస్తున్నాను అని చెప్పాడు. అంతటితో మా సంభాషణ ఆగిపోయింది.నేను సీటు మీద పెట్టిన పుస్తకం డాక్టర్ కె. లింగారెడ్డి కవిత్వం జలపాత శబ్దంలోకి.... ఆ పుస్తకం ఆవిష్కరణ సభకే వెళ్లి మేం తిరిగి నల్లగొండ వెళ్తున్నాం. బస్సు దిగేప్పుడు కండక్టర్‌ను అడిగాను - కేశవ రెడ్డి రచనలు అంటే ఇష్టమా, ఏవైనా చదివావా అని అడిగాను. చదివానని చెప్పాడు. తాను మహబూబాబాద్‌లో ఆర్టీసి కండక్టర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పాడు. నిజానికి మహబూబాబాద్ తెలంగాణలో ఓ మారుమూల ప్రాంతమనే చెప్పాలి. కేశవరెడ్డిని రచయితలకే రచయితగా చెబుతారు. పైగా పాపులర్ లిటరేచర్ ఆయన రాయలేదు. చాలా సీరియస్ నవలా రచనలు చేశారు. స్మశానం దున్నేరు, రాముడుండాడు రాజ్యముండాది, ఇన్‌క్రెడిబుల్ గాడెస్, అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, మూగవాని పిల్లనగ్రోవి, మనెమ్మ వంటి నవలలు రాశారు. కేశవరెడ్డి నవలలకు ఓ మారుమూల ప్రాంతంలో పాఠకుడు ఉన్నాడనే విషయాన్ని నేను నమ్మలేపోయాను. కండక్టర్ కూడా కవో, రచయితో అయి ఉండాలని అనుమానం కలిగింది. దాంతో మీరైమైనా రాస్తారా అని అడిగాను. లేదు, సార్ అన్నాడు. కవిత్వమైనా రాయరా అని అడిగాను. లేద్సార్ అని చెప్పాడు. రాసే అలవాటేమైనా ఉందా అని ప్రశ్నించాను.. లేదన్నాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో కేశవరెడ్డి రచనలపై వార్త దినపత్రికలో వివాదం నడుస్తోంది. ప్రముఖ రచయిత్రి రంగ నాయకమ్మ ఆ వివాదానికి తెర తీశారు. బహుశా చర్చ చివరి గుడిసె ముగింపు మీద అనుకుంటా. నవల ముగింపులో ప్రతినాయకుడిని కుక్క చంపుతుంది. బాధితులు పెంచుకున్న కుక్క అతన్ని చంపుతుంది. దీన్ని రంగనాయకమ్మ ప్రశ్నిస్తూ వివాదం ప్రారంభించినట్లు గుర్తు. వార్తలో రంగనాయకమ్మ కేశవరెడ్డి మీద రాసిన రాతలు చూశారా అడిగా. దానికి ఆ కండక్టర్ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ - రంగనాయకమ్మకు వ్యతిరేకంగా వ్యాఖ్య చేశాడు. అతని వ్యాఖ్యకు దిమ్మితిరిగి పోవడం అటుంచి, అంత వివేచనతో అతను ఆ రచనలు చదివాడని తెలిసి అబ్బురమనిపించింది. అతను కేశవ రెడ్డి రచనలను అంత సూక్ష్మస్జాయిలో అర్థం చేసుకున్నాడని తెలిసి కలిగిన అబ్బురం అది. దాంతో అతను నన్ను ఆశ్చర్యపరచడం ఆపలేదు. నేను బస్సు దిగేప్పుడు కె. ప్రతాపరెడ్డి అంటే కాసుల ప్రతాపరెడ్డా, సార్ అని అడిగారు. నా అక్రిడేషన్ కార్డు మీద కె. ప్రతాపరెడ్డి అని ఉంది. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు అది. అది ఉంటే, ఆర్టీసి బస్సు చార్జీలో వన్ థర్డ్ రాయితీ ఉంటుంది. టికెట్ తీసుకునే సమయంలో ఆ రాయితీ కోసం కండక్టర్‌కు చూపించాను. అది గుర్తు పెట్టుకుని అడిగాడు. అవునని చెప్పాను. ఆ మాట నోటి నుంచి వచ్చిందో, లేదో మీదంతా తీవ్రవాదం కదా సార్ అన్నాడు. నా రచనల్లో ఏ విధమైన తీవ్రవాదం కనిపించిందో నాకు తెలియదు. కానీ రచనలు కాస్తా ఘాటుగా ఉండేవి. పెద్ద పెద్దవాళ్లకు కూడా మింగుడుపడేవి కావు. బహుశా అందువల్ల అతను నా రచనలపై ఆ విధమైన వ్యాఖ్య చేసి ఉంటాడని సర్దిచెప్పుకున్నాను. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన రచనలకు పాఠకులు ఉంటారు. ఆ పాఠకులు వ్యక్తిగత సంబంధాల్లోకి రారు కాబట్టి మనకు తెలియదు. మన రచనలు అటువంటివారి కోసమే అనుకున్నప్పుడు మనకు గుర్తింపు సమస్య ఉండదు. -కాసుల ప్రతాపరెడ్డి

కలలను మోసుకు తిరుగుతున్న కవి

‘అక్షరాలకు పురుడు పోసి నడకలు నేర్పుతాను స్పందనల వెల్లువలో  నిలువెల్లా తడుస్తూ  కవిత్వమై జాలువారుతాను’   ఇవి మద్దికుంట లక్ష్మణ్ రాసిన ‘కలం’ అనే కవితలోని పాదాలు. అక్షరాలా మద్దికుంట లక్ష్మణ్ తన కవిత్వంలో అదే పని చేశాడు. ఆయన  వర్గమూలాలు పేర కవితా సంపుటిని వెలువరించాడు. ఇందులో ఒక కవితను కూడా తీసేయడానికి వీలు కాదు. అంత తాజాదనంతో కవితలు వున్నాయి. కవిత్వమంతా మల్లెపూల పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. నేను  కొన్ని అక్షరాలు ఒక గమ్యం  అనే కవితలో తిరగబడిన అక్షరాలను బుదగరించి, అలక వహించిన అక్షరాలను బతిమిలాడి, ఆగమాగం అయ్యే అక్షరాలను క్రమంలో పెట్టి తాను ఎలా కవితను అల్లుతాడో చెప్పాడు. ఆ అక్షరాలన్నీ ‘తీరా గమ్యం చేరాక కాంతులీనుతూ మెరిసిపోతున్న తమ రూపాల్ని చూసుకుని అమాంతం నా మీద పడి ఊపిరి సలపకుండా  ఉక్కిరిబిక్కిరి చేస్తాయి’  అని లక్ష్మణ్ మురిసిపోయాడు. ఆయన కవితలన్నీ ఆయన మాత్రమే కాదు, పాఠకులూ మురిసిపోయే విధంగా వున్నాయి. అల్లిక ఆ విధంగా వుంది. కవిత్వం గురించే ఆయన మరో రెండు కవితలు రాశాడు. ‘కొన్ని అందమైన రంగు రంగుల వాక్యాలు’ అనేది అందులో ఒకటి. తన మిత్రుడు తెచ్చిన అక్షరాల మూటను విప్పి చూపిస్తే తాను అచ్చెరువు చెందాడు, ఆనందించాడు. అక్షరాలను పదాలుగా, అందమైన వాక్యాలుగా మార్చిన కవితలను వినిపించి తిరిగి వాటిని మూట కట్టుకుని వెళ్లిపోయాడు మిత్రుడు. అలా వెళ్లిపోయిన తర్వాత ` ‘ఇందాక గమనించలేదు కానీ కొన్ని వాక్యాలను  మా ఇంట్లోనే వదిలి వెళ్లిపోయినట్టున్నాడు. చూద్దును కదా రంగు రంగుల అందమైన వాక్యాలను మా ఆవిడ చీపురుతో చెత్తబుట్టకెత్తుతోంది’   అని ఆవేదన చెందుతాడు.  అదే భావాన్ని ఆయన ‘ఉంగుటం’ అనే కవితలో ఇలా వ్యక్తీకరించాడు`  ‘ఇంతా చేసి పద్యం ప్రాణం పోసుకుని రంగురంగులుగా విరబూయాల్సిన సమయంలో భార్య, పిల్లలు, ఇరుగుపొరుగు తలా ఒకటి ఊడబెరికి అవతల పారేస్తుంటారు’  అని అంటాడు. కవిత్వ రచన ఒక పనికి మాలిన వ్యవహారంగా చూసే లోకంలో లక్ష్మణ్ కవిత్వమై పల్లవించాడు. అదే ఇక్కడ వ్యక్తమైంది. లక్ష్మణ్ తన కవిత్వాన్ని అనుభూతి ప్రధానం చేశాడు. అర్థం కాని పదాలు గానీ వాక్యాలు గానీ ఆయన కవిత్వంలో కనిపించవు. పొల్లుమాటలు వుండవు. ప్రతి కవిత కూడా పోతపోసినట్లుగా వుంటుంది. అక్షరాలు, పదాలు, వాక్యాలు సరళంగానే వుంటాయి. కానీ వాటిలోని భావం సాంద్రంగా వుంటుంది. ఆ భావాన్ని గుండెల్లోకి ప్రవహింపజేస్తుందీ కవిత్వం. కవి కష్టజీవుల పక్షాన్నే వుంటాడు. మద్దికుంట లక్ష్మణ్ అందుకు మినహాయింపు కాదు. కానీ ఆయన వారి శ్రమ గురించి చెప్పే విషయంలో అతిశయోక్తులకు వెళ్లడు. వారి శ్రమను దోచుకునే శక్తులపై కఠిన పదజాలం వాడడు. రైతు శ్రమ ఫలితం అతని దక్కకుండా పోవడంలోని అర్థాన్ని కవితాత్మకంగా, సున్నితంగా మనకు ఎరుక పరుస్తాడు ‘తక్కెడలో చెమట చుక్కలు’ కవితలో   ‘తక్కెడలో వాళ్ల చెమట చుక్కల బరువు ఎప్పుడూ అల్కగనే  పాసంగంలో సెంటు తుంపరల దురువు ఎప్పుడూ మోతకోలుగనే’  అని వైరుధ్యాలను కళ్లకు కడుతాడు.  ‘మిగులు మనుషులం కాదు’ అనే కవితలో ధనదాహంతో ప్రకృతిని నాశనం చేస్తూ ఆదివాసీల జీవితాలను అల్లకల్లోలం చేసే పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి ` ‘ప్రపంచాన్ని పెట్టుబడితో అలుముకున్నవాడికి ప్రజలైనా ప్రకతైనా పచ్చనోట్ల కిందే లెక్క అడవిని చెరబడుతున్నానని భ్రమిసేవాడికి గాలిని బంధిస్తున్నానని మురిసేవాడికి ఈ అడవితో ఈ గాలితో పెనవేసుకున్న మా జీవితాలు ఎలా అర్థమవుతాయి’  అని అంటాడు.  ‘ఎ రివర్ దట్ రిటర్న్‌స్ ఒన్‌డే’ కవిత బహుశా ఉత్తర తెలంగాణలోని నక్సలైట్ ఉద్యమం గురించి రాసింది కావచ్చు. ఉద్యమం తెచ్చిన మార్పును చెప్తూ చివరగా  ‘వొట్టిపోయినదాని గురించి  ఎందుకంత నస... అని మీరు నిలదీయవచ్చు కానీ ఇది ఏదో ఒకనాడు పోరుగానమై హోరెత్తకపోదు’ అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాడు లక్ష్మణ్. ఆధునికత తెచ్చిన మార్పును, ఆ ఆధునికతలో మానవ సంబంధాలు ధ్వంసం అవుతున్న తీరును ‘దూరం’ అనే కవితలో అయన చిత్రిక కట్టాడు. ‘ఆ వూరికి ఈ వూరికి దూరం కేకపెట్టే కిలోమీటరో ఒకప్పుడు పిల్ల తొవ్వ మాత్రమే వుండేది’  అది ఆత్మీయ సంబంధాలతో విలసిల్లుతూ వుండేది.  వరుసలు పెట్టి పలకరించడాలు వుండేవి.  బాగోగులు అడిగి తెలుసుకునే ప్రేమలు వుండేవి. ఇప్పుడేమైంది? ‘మహా అయితే చేయి ఎత్తడాలు చేయి ఊపడాలు డీజిల్ పెట్రోల్ వాసనల్లో మట్టి వాసన మాయం అంతా మొసమర్రని కంపు ఊపిరి ఉక్కిరి బిక్కిరి’  అధునికత, అభివృద్ధి తెచ్చిన మార్పు ఇలా వుంది మరి.  సాగునీరు అందితే పల్లెలు ఎలా పచ్చనిల్లి, పరవశిస్తాయో ‘నీటికళ’ అనే కవితలో లక్ష్మణ్ కవితాత్మకంగా చెప్పాడు. ఇందుకు ఆయన స్థానిక వత్తికారుల పేర్లను ఎంచుకున్నాడు. దానివల్ల కవితాస్వాదనకు ఏ మాత్రం ఆటంకం ఏర్పడదు. అదీ ఆయన కవిత్వ నిర్మాణంలోని సౌందర్యం.  పల్లెలో   తల్లిలా విలసిల్లే మహిళ నగరానికి నెట్టివేయబడింది. పల్లెలు ధ్వంసం అవుతుంటే ఉపాధిని వెతుక్కుంటూ నగరం చేరిన మహిళ గురించి  ‘పల్లె తల్లి’ కవితలో చెబుతూనే ఆమె కళ తప్పి దీనురాలిగా మారిన వైనాన్ని కళ్లకు కట్టాడు. ఈ కవిత ఒక దయాపారావతం. నిజానికి, మద్దికుంట లక్ష్మణ్ ‘వర్గమూలాలు’ అనే సంపుటిలోని ప్రతి కవితా, ప్రతి కవితలోని ప్రతీ వాక్యమూ ఉటంకింపదగినవే. ఒకసారి ఆ పుస్తకం తెరిస్తే ఆ కవిత్వంలోని ఆర్ద్రత, సౌందర్యం మనకు అర్థమవుతాయి. కవితల్లోని క్లుప్తత మనలను కట్టిపడేస్తుంది, వ్యర్థపదాలు, వాక్యాలు వుండవు. అభివ్యక్తి వల్ల ప్రతి కవితనూ మద్దికుంట లక్ష్మణ్ ఆస్వాదయోగ్యం చేశాడు. ‘చూపుల్ని పేజీలపై చిందరవందరగా ప్రసరించకండి అక్షరాల అర్థాలు మారిపోతాయి ఒకదాని వెంట ఒకటి క్రమం తప్పకుండా వెళ్లే చీమల బారులా అక్షరం అక్షరం వెంట జాగ్రత్తగా వెళ్లండి అప్పుడే అక్షర పరమార్థం బోధపడుతుంది’ -కాసుల ప్రతాపరెడ్డి

రానురాను ట్రంప్ లా తయారౌతున్నాడేంటి?

మా వెనకవీధిలో రావుగారి కూతురు మాల. మా మనవడు తేజ పదో తరగతి చదువుతున్న స్కూల్లోనే ఏడో తరగతి చదువుతోంది. మంచిపిల్ల, బాగా చదువుతుంది. ఆ మధ్య ఏదోపోటీలో చిన్న ప్రైజ్ ఏదో వచ్చింది. అది చూపించడానికి మా యింటికి మొన్న ఆదివారం వచ్చింది. చిన్న షీల్డ్ మీద దాని పేరు రాసుంది. సేవాకార్యక్రమంలో బాగా పనిచేసినదానికి గుర్తింపుగా ఇస్తున్నామని రాసుంది. అందరం ఎంతో సంతోషించాం. మధ్యాన్నం దాకా ఇంట్లోనే ఉండి తేజకి చూపించండి అంటూ ఆ షీల్డ్‌ని మా ఆవిడకి ఇచ్చి వెళ్లింది. మధ్యాన్నం భ్పుోనాల టైమ్‌కి వచ్చాడు తేజా. వాడికి దాని సంగతి చెప్పగానే అప్పటిదాకా ఫ్రెండ్స్‌తో ఆడివచ్చినవాడు ఒక్కసారిగా కసురుకున్నాడు. ఏదో చిన్నవాడులే అనుకున్నాం. గ్రౌండ్‌లో అప్పటికే బ్యాట్ గురించి గొడవపడి వచ్చాడని మోచేతికి తగిలిన దెబ్బల రహస్యం చెప్పాడు..అదీ వాడి అమ్మమ్మ మరీ అడిగితేగాని చెప్పలేదు. సరే ఇంతకీ మాల సంగతి మాత్రం వినిపించు కోలేదు. గదిలోకి పరుగున వెళ్లినవాడిని వాళ్ల బాబాయి బుజ్జగిండానికి శతవిధాలా ప్రయత్నించాడు.  ప్లీజ్ బాబాయ్..నా మనసేం బాగాలేదు..కోపం తెప్పించకు.నేను వినను. దానికి ప్రైజ్ వస్తే నేనేం చెయ్యను?’ అని బాబాయ్‌ని గెంటేసినంత పనిచేశాడు.  ‘అదిగాదు నాన్నా..మరీ అంత కోపమైతే ఎలారా?’ అంటూ వాళ్లమ్మ ముద్దాడబోయింది. ససెమిరా అని పరుగునబోయి వీధి గేటుదగ్గర వేపచెట్టువెనక నక్కి కూచున్నాడు. ఇంటిల్లపాదీ వాడిని శాంతింపచేసి లోపలికి తీసుకురావాలని విశ్వయత్నాలుచేసినా ఎన్ని ఆశలు చూపినా వినిపించుకోలేదు. పైగా అందరిమీదా అరిచాడు. నన్ను మోసం చేశారన్నాడు. నిన్ను మోసం చేయడవేవిట్రా పిచ్చివెధవా..అని వాళ్ల అమ్మమ్మ అరిచింది.  ‘మొన్నటికి మొన్న లెక్కల టెస్ట్ పెడితే నా సాయం తీసుకునేగదా రవి, సుకుమార్ మంచి మార్కులు తెచ్చు కుంది. అంతెందుకు గత ఆదివారం మ్యాచ్‌లో గొడవయితే రవిగాడికి మద్దతుగా వుండి దెబ్బలు తిన్నదీ నేనేగా నన్ను ఎందుకు గుర్తించలేదు. వాడినే మీరంతా సమర్ధించారు. బాగా అడాడు, బాగా స్కోర్ చేశాడని నాన్న కూడా అన్నారు. అలా అంటారు. మాలా వాళ్ల డాడీ కూడా అంతే..సురేష్‌గాడు వాళ్ల తమ్ముడిని కొడితే నేనే కాపాడాను. కానీ ఆయన మాత్రం నీ వల్లే అంతా జరుగుతోందిరా అన్నారు. పైగా హెడ్‌మాస్టర్ పిలిచి కొట్లాటలు, గిల్లికజ్జాలుపెట్టడం కాదురా ఆ తెలుగు నాలుగు ముక్కలు నేర్చుకోవచ్చుగా అని శ్రీలక్ష్మి ముందు తిట్టారు. ఎంత అవమానించారు! ఇదేమీ మీకు తెలీదు..’ అనీ కోపగించుకుని ఏకంగా గోడెక్కి కూచున్నాడు. అవన్నీ సరేరా.. ఇప్పుడు మరీ అంత కోపగించుకోవాల్సిందేమీ లేదు. నువ్వు తెలివిగలవాడివే.. కానీ అదేదో చదువుమీద, నీ మీద కాస్తంత చూపరా.. వాళ్ల గొడవెందుకు? అంటూ తేజ పిన్నీ, మా ఆవిడా ఏక కంఠంతో అరిచి మరీ చెప్పారు. ప్రభావం శూన్యం! ‘పోయిన నెల బాలా వాళ్ల ఏరియాలో ఎవరితోనో గొడవపడ్డావట? నీకేమన్నా వెర్రా, పిచ్చా? సురేషో, సావనీరో..ఏదో పేరు.. వాడు ఎలా వుంటే నీకేమిట్రా? వాళ్ళింటి దగ్గర చెట్టు పీక్కొస్తానంటావేమిటి? నీకు బుద్ధుందా పైగా చెప్పాచెప్పటకా మొన్నెపుడో గులాబీ మొక్కలు పీకిపడేసి మీకలానే కావాలని వాళ్లని తిట్టావట? నీవయసెంత? నువ్వెంతరా? అలా వాళ్లని బెదిరిస్తావా? నువ్వేమైన రౌడీవా, ముఠా వుందా? పిచ్చివెధవ? పళ్లు రాలగొడతా యింకోసారి అటుగా వెళ్లావంటే!’ అని వాడి బాబాయ్ స్వరాన్ని నేనూ అందుకున్నాను. తేజ ముఖం ఎర్రగా అయింది. ఉక్రో షంతో ఉన్నాడు. చిన్న రాయి ముక్క తీసుకుని వీధిలోకి విసిరాడు.  ‘వీడేదో చదువులో కాస్తంత వెలగబెడుతున్నాడని, స్థిరంగా ఉంటాడని వీధిలో అనుకుంటున్నారంతా ఇటు చూస్తే కోపిష్టి, గొడవలమారిగా తయారేవిటే నీ కొడుకు’ అంటూ అమ్మ మా ఆవిడకి క్లాస్ పీకింది.  సాయింత్రం ఆరవుతుండగా మాల పరుగున వచ్చింది. దీనిచేత చెప్పిస్తేనన్నా దిగివస్తాడని అంతా భావించాం. ఆ పిల్ల వస్తూనే తేజని గోడమీద కూచోని వుండడం చూసి ‘హాల్లో కూడా కూచోవచ్చురా!’ అంటూ గేలిచేసింది.  ‘నీ బొందే.. బోడి ప్రైజ్ నువ్వూ!’ అనేశాడు. ‘నేను పోటీలో గెలిచి సాధించింది. నీలా తన్నులు, తిట్లూ తినలేదు.. గుర్తుంచుకో!’ అన్నదా పిల్ల. ‘అవును మామ్మగారూ.. వీడు మొన్న క్లాసులో నా ఫ్రెండ్‌ని తిట్టాడు.. సాయింత్రం దాని అన్న వచ్చి ఒక్కటి పీకాడు.. చెప్పలేదా!’ అంది మాల. తేజకి కోపం మూడింతలై ఒక్కసారిగా గోడ దూకి దాన్ని వెంబడించాడు. మాల పరుగున వెళ్లి హాల్లో కుర్చీల వెనక దాక్కుంది. అందరం అలా హాల్లో చేరాం. మా ఆవిడ దాన్ని దగ్గరికి తీసుకుని రక్షించింది.  ‘ఏంటే వాగుతున్నావ్.. నేను రాసిచ్చింది చదివి, నాలుగు ముక్కలు రాసి, మాట్లాడగానే  నీవో పెద్ద విజేతవా?  నిజానికి ఆ షీల్డ్ నాది. నీ పేరుందని నీదయిపోదు.. గుర్తుంచుకో!’ అని అరిచాడు తేజ. ‘వాళ్లు ఇచ్చింది నాకు.. నా పేరుంది చూడు సరిగ్గా.. నీదెలా అవుతుంది. ఏదో చిన్న సాయం చేశావని చూపించడానికి తెచ్చాను. ఆంటీ, అంకుల్ చూస్తారని ఇచ్చి వెళ్లాను. అంతేగానీ అది నీదయిపోదు.. పిచ్చి వేషాలు వేయకురోయ్!’ అని మాల కౌంటర్ ఇచ్చింది.. నేను వెనకే ఉన్నానన్న దైర్యంతో. ‘అవునురా.. అది పరీక్షరాసి తెచ్చుకున్న ప్రైజు నీదెలా అవుతుందిరా పిచ్చి సన్నాసీ!’ అడిగింది మా అమ్మ. ‘మామ్మా! ప్లీజ్.. నీకు అర్ధం కాదు. అదంతా దాని పన్నాగం..’ అని మాల వేపు చూశాడు. ‘ఏడిశావ్‌గాని ఏడున్నరవుతోంది.. స్నానం చేసిరా తిని చదువుకుందువుగానివి’ అన్నాను. ‘అయితే ఒక షరతు ఈ షీల్డ్ కావాలి!’ అన్నాడు తేజ. ‘ఇది మరీ బాగుందిరా..చిన్నపిల్ల చక్కగా చదివేది.. దాన్ని ఏడిపిస్తావేంట్రా!’ అంది మా ఆవిడ. ‘అదంతా కాదు..ఈ షీల్డ్ చూడ్డానికీ బాగుంది.. దాని పేరుండవచ్చుగాక.. నేను ఉంచేసుకుంటా. అంతే!’ ‘బుద్ధున్నాడికి ఒక్క మాట చెప్తాం.. నీకెలా చెప్పగలం.. సేవ్.. రేపు రావే.. తీసికెలుదుగానీ’ అని మాలని పంపేసింది మా అమ్మ. అందరూ టెన్త్ తేజాని వాడి కోపాన్ని, అర్ధంలేని వాదనని భరించి నవ్వుకుంటూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లారు. నేను మాత్రం అలా చూస్తుండి పోయాను. తేజా ఆ షీల్డ్ చూస్తూ నవ్వుకుంటూ గదిలోకి వెళ్లాడు. ‘అబ్బాయ్.. వీడేవిట్రా ఇలా తయారయ్యాడు..నువ్వేనా బుద్ధిచెప్పు’ అంటూ అమ్మ అంది. ‘వీడు రాను రాను మరీ నా ప్రాణానికి ట్రంప్‌లా తయారవుతున్నాడు’ అని తినడానికి వెళ్లాను. మర్నాడు మరీ విడ్డూరం జరిగింది.. ఉదయాన్నే మా బెడ్‌రూమ్ బయట గోడకి కాయితం అంటించి ఉంది. దాని సారాంశం ఇది.. ‘అన్ని విధాలా సాయం చేసినందుకు తేజకి మాల బహుమతి’ అని రాసి దాని కింద ఆ షీల్డ్ బొమ్మ వేసుంది.ఆ బొమ్మ కింద మాల చేసినట్టు పెద్ద సంతకం కూడా!!

సమ్మోహన కవిత్వం ‘అనగనగా...’

అనగనగా... చదువుతూ తొలుత మమత కవిత్వ సౌందర్య సమ్మోహనంలో మూర్ఛిల్లాను. అర్థం చేసుకోవడానికి తగిన వ్యవధి ఇవ్వనంత సౌందర్యం ఆ కవిత్వానికి వుంది. పదాలు, వాక్యాలు సరళమవుతూ భావసాంద్రత పెరిగిన కవిత్వానికి ఆ లక్షణం వుంటుంది. ఆ తర్వాత ఒకటి రెండుసార్లు చదివాను. ఆ కవిత్వం అర్థాలు చెప్పే తాళం చెవి కోసం అన్వేషించాను. ఆ కవితలకు కూర్చిన అనన్య బొమ్మల్లో ఆ తాళం చెవిని వెతకడానికి ప్రయత్నించాను. అయితే, తాళం చెవి కవిత్వానికి ద్వారాలు తెరిచిందా, లేదా అనేది చెప్పలేని మానసిక స్థితి. వ్యక్తిగత జీవితాలు, సమాజం తలకిందులుగా వున్నాయని, తలకిందుల విలువలు ఆధిపత్యం సాధిస్తున్నాయని మమత తన కవిత్వంలో పలుకుతూ అవి ఎంత అందంగా, ఎంత సున్నితంగా వుండాలో చెప్పారు. కవిత్వం మొత్తంలో ఒక ఆశాకిరణం కనిపిస్తూ వుంటుంది. దానివల్ల కవిత్వానికి ఒక సానుకూల జీవన దృక్పథం సౌందర్యం అలవడింది. కవిత్వంలో అమ్మ, కూతురు, పిచ్చుక పదే పదే వస్తుంటాయి. దానివల్ల మానవ సంబంధాల్లోని సున్నితత్వం కవిత్వమంతా విస్తరించింది. ఒకటి మనల్ని వీడితే మరోటి వస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తూ జీవితాన్ని అలా స్వీకరించి అనుభవించడమే అనే తాత్త్వికతను అందిస్తుంది. ‘ఇంత జరిగాక తెలుసుకున్నది కాసేపు విరబూసి వెళ్లిపోవడమే’ (నిర్నిమిత్తం) అంటారు మమత.  ‘అన్ని దారులనూ అతి జాగ్రత్తగా మూసేసి ముఖద్వారానికి బండరాయిని భద్రంగా అదిమిపెట్టుకున్న గుహల గురించి మాట్లాడుకుని  ప్రయోజనమేమీ ఉండదని తెలుసుకుని ఆకాశానికి ఎగిసిన పడికిలిని నిలువెల్లా హత్తుకుని విశ్వప్రేమను నేనే అవుతాను’ (నిరంతరం)  అంటూ సంకట పరిస్థితిలో తాను అండగా వుంటాననే నమ్మకాన్ని ఈ కవి కలుగజేస్తారు.  మమత బాధిత సమాజానికి తన గొంతును ఇచ్చారు. ఇజ్రాయిల్ దాడుల్లో గాజాలోని పసిపిల్లల పరిస్థితిపై ఆమె ఆవేదన చెందుతారు. ‘గుర్తింపు’ అనే కవితలో  ‘కళ్లలో ఉబికిన నీళ్లలో తేలుతూ అయిలన్ కుర్దీ గుండెలో హోరుమని పాలస్తీనా పాపాయిల ఏడుపు’  అంటూనే ‘చీకటి కూడా మెత్తగా అల్లుకుపోతోంది చుట్టూ’ అంటారు. ‘ఎంతటి వెర్రివాడవు!’ అనే కవితలో కూడా పిల్లల దుస్థితిని, నిస్సహాయతను వ్యక్తీకరించారు. మహిళలపై అత్యాచారాలపై ఆమె రాసిన ‘క్షమించు’ అనే కవిత అత్యంత పదునైన కవిత. ‘రక్షించగలనా నిన్ను మనిషి నుంచి’ అని ఆమె పురుషుల్లోని క్రౌర్యాన్ని ఎత్తిచూపారు. ‘ఆరని జ్వాలలు’ రోహిత్ మరణంపై రాసిన కవిత. కులం, మతం రాజ్యమేలుతున్న వైనాన్ని ఆమె ఎత్తి చూపారు. ‘చెంపలపై కులం వేళ్ల చారలను కన్నీళ్లతో మలుపుకుంటున్నవాళ్లు ` చూస్తున్నారు నిన్నూ, నన్నూ’ (భయంగా వుంది)   అంటూ ఉదారవాద ప్రజాస్వామిక ఆకాంక్ష కోసం అందరమూ ఒక్కటవుదాం అని నినదిస్తారు. మొత్తంగా, మమత కవిత్వం చదివి అనుభవించాల్సిందే. దాన్ని విశ్లేషించడం వల్ల ఆ అనూభూతి మాధుర్యాన్ని కోల్పోతామనిపిస్తుంది. ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరవండి. కడదాకా సాగిపోతారు. అర్థమై కానట్లు అనిపిస్తూ ఒక మధురమైన అనుభూతికి లోనవుతాం. గలగల పారే సేలయేరును ఆ కవిత్వం తలపిస్తుంది. మమత ‘అనగనగా...’ అనే సంపుటిలో కొన్ని అనువాద కవితలు కూడా కవినిస్తాయి. అవి అత్యంత పదునైన కవితలు. అవి ఇజ్రాయిల్ దుర్మార్గం చర్యలకు అల్లాడుతున్న జీవితాలు వాటిలో కనిపిస్తాయి. -కాసుల ప్రతాప్ రెడ్డి

ఆకాశానికి అటూ ఇటూ!

ఉదయం ఏడవుతుండగా రమకి తన స్నేహితురాలింటికి వెళ్లాలనిపించింది. అంతే గబగబా అన్ని పనులూ ముగించుకుని భర్త అలా ఆఫీస్‌కి వెల్లేందుకు ఇల్లు దాటగానే ఫోన్‌ అందుకుంది. ఓ అయిదుగురిని కలుద్దామని అడిగింది. వాళ్లూ ఓకే అనేశారు. పదవుతుండగా దిల్‌సుక్‌నగర్‌ బస్టాండ్‌లో కలిశారు. నాలుగు బస్సులు వదిలేసి మెహదీపట్నం వెళ్లే బస్సు ఎక్కారు. అప్పటికే దాదాపు సీట్లు అయిపోయాయి. నిలబడాల్సివచ్చింది. టికెట్‌ చింతలేనపుడు నిలబడైనా  విజయవాడ వెళ్లచ్చన్నది వారి లీడర్‌ రమ అబిప్రాయం. అందుకే వారందరూ తమతమ బ్యాగ్ లలోంచి  ఆధార్‌ కార్డ్‌ ముక్క తీసి చేతబట్టారు. అవతలవైపు అప్పుడే ఎక్కడానికి సతమతమవుతున్న రామం నానా అవస్థాపడ్డాడు. ఎలాగో ఇద్దరి మధ్య ఇరుక్కుని నిలబడ్డాడు. కాలు వెనకడుగు వేస్తే అక్కడ సీట్లో ఉన్న మహిళా మణి ఖస్సుమంటుంది, చేయి ఆడిస్తే మరో మహిళారత్నం తిడుతుంది. ఈ స్థితిలో కండక్టర్‌ కోసం గావుకేక వేశాడు. బస్సు ఆగినంత పనయింది. పెద్ద గుంతని తప్పించి డ్రైవర్‌ చాకచక్యంగా ముందుకు తీసికెళ్లడంలో బస్సు అందర్ని కంగారెట్టింది. కండక్టర్‌ రావడానికి మరో పది నిమిషాలు పట్టింది. అంతే అప్పటికే ఒక స్టేజీ దాటేసింది బస్సు. కండెక్టర్‌ వచ్చి  విసుక్కున్నాడు. ఫ్రీ సర్వీస్‌ కాదుగానీ వాళ్ల ఆధార్‌ కార్డులు చూసి జీరో టికెట్‌ ఇవ్వడంతో ఇక్కడ పురుషులంతా తెగ కోపగించుకున్నారు. స్టేజి దాటిపోయినా రాలేదని. తీరా వచ్చాక దిల్‌సుక్‌నగర్‌ నుంచే టికెట్‌ లెక్కగట్టి డబ్బులు తీసుకున్నాడు. ఇదేదో తన ఆస్థంతా లాగేసుకున్నట్టు రామం ఆగ్రహించాడు.  మరో రెండు స్టేజీల తర్వాత ఇటు ఇద్దరు దిగితే వెనకాలే ఇద్దరు ఎక్కారు, అటు ఆరుగురు ఎక్కారు. ఇంత మంది ఆఫీసులకి ఇలా నానా అవస్థాపడి వెళుతున్నారా అని రామం చాలా జాలిపడ్డాడు. కానీ పక్కనే వినపడుతున్న చర్చా కార్యక్రమం అసలు సంగతి బయటపడేసింది. తను ఆనుకున్న సీటులో కూచున్న అమ్మలక్కలు వాళ్ల స్నేహితురాలి దగ్గరికి ముగ్గుల పుస్తకం తెచ్చుకోవడానికి వెళుతోందిట. ఆ పక్కనే ఉన్న మహిళ చాలా రోజులయింది అలా తిరిగి రావాలనిపించి ప్రయాణమయిందట. ఆ ముందు సీట్లలో ఇలా చాలామంది కోడలికోసం అత్తగారు, అత్తగారి కోసం చిన్నత్తగారు.. బాయ్‌ఫ్రెండ్‌ టికెట్‌ తీసాడని సినిమాకి వెళుతోన్న స్టూడెంటు, ఇంట్లో పని ఎగ్గోట్టేందుకు బస్సెక్కిన  పెద్దింటి కోడలు.. ఇలా చాలామంది ఆధార్‌ కార్డును చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ తెలివేదో చదువులోనో ఉద్యోగంలోనో చూపితే బాగుండేది అనుకున్నాడు రామం.  మహిళలకు బస్సు ప్రయాణాలు ఫ్రీ అని ప్రకటించి ప్రభుత్వాలు ఎంత లాభపడ్డాయో తెలీదుగాని మంత్రి వర్గాన్ని మాత్రం మహిళలు భువికి దిగివచ్చిన దేవతల కింద లెక్కేసుకుంటున్నారు. ఆ మగానుబావుల వల్లనే ఇంత సౌక్యం లబించిందక్కా! అని అనుకోని వారు లేరు. చెంచాడు కార్డు వెళ్లగలిగినంత దూరానికి బస్సు వీలు కల్పించడం వాళ్లకి ఎంతో పుణ్యఫలంగా భావించుకున్నారు. ముఖ్యంగా ఈ బృందం. తీరా చూస్తే, వీళ్లు ఒకరి నుంచి మరొకరి దగ్గరికి ఊసుపోక వెళుతున్నారు. అలా దాదాపు సాయంత్రం నాలుగింటిదాకా బస్సులో తిరిగి ఒళ్లు హూనమయినా కార్డ్‌ ఆనందంలో ఆ ఇబ్బందిని మర్చిపోయి నవ్వుకుంటూ టాటాలు చెప్పుకున్నారు.  ఈ బస్సుల్లో ప్రయాణించడం కంటే నడిచివెళ్లడం చాలా సుఖమనుకున్నాడు రామం. ఆధార్‌ కార్డు పుణ్యమా అని మహిళలకు బస్సులో సీట్లన్నీ వాళ్లవే అన్న భ్రమ నిజమయింది. అలా అనుకునే రెండు వేపులా పరుగున ఎక్కేస్తున్నారు. బస్సు ప్రయాణాన్ని ఇలా ఆనందించిన శకం మరోటి లేదు, ఉండదేమో! ఈ సౌకర్యం కల్పించిన ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయో ఏమోగాని నిజంగా అత్యవసరంగా బస్సులో వెళుతున్నవారి కష్టాలు మాత్రం ఎవరికీ పట్టడం లేదు. ఆధార్‌ కార్డు  ఇంతగా పురుషులకు వెన్నుపోటు తెస్తుందని ఎవరు ఊహించగలరు దేవా! రామం ఇల్లు చేరాక కాస్తంత టీ తాగి పిల్లలతో మాట్లాడుతుంటే, అవతలి గదిలో భార్యామణి రేపటి బస్సుయాత్ర గురించి స్నేహితులను వాకబు చేస్తోంది!!

వంకాయకి బదులు బీరకాయ!!

సాయంత్రం ఆరవుతుండగా చటుక్కున రామానికి ఓ గొప్ప ఆలోచనవచ్చింది. సమస్త ఇంటిగోలకు విరుగుడు  చెప్పగలిగేది రామగుండ స్వామి ఒక్కడే అని. అంతే వెంటనే ఆయన ప్రవచనం ఎక్కడుందో కనుక్కొని మరీ స్కూటర్‌ మీద రివ్వున వెళ్లాడు.  ఇసుకేసినా కిందపడని జనంతో రామగుండస్వామి ప్రవచనం చెప్పడానికి బుక్ చేసుకున్న స్టేడియం  నిండిపోయింది. సరిగ్గా ఏడవుతుండగా స్వామి దర్శనమైంది. ఆయనేం పెద్ద ఆజానుబాహుడేమీ కాదు గానీ ముఖం కనపడకుండా భక్తులకు కేవలం కుంకుమ బొట్లతోనే దర్శనమిచ్చాడు. ఆయన త్రిశూలం పక్కన బెట్టుకుని, చెంబులోంచి కాసిని నీళ్లు తాగి మైకు దగ్గరకు లాక్కున్నాడు. ‘శివోహం’ అన్నాడు గట్టిగా. అంతే అప్పటిదాకా మిర్చీలు, పావుబాజీలు, ఇంటిగొడవలతో సరదా కబుర్లలో ఉన్న భక్తులంతా అలెర్ట్‌ అయి ‘ఓహోం’ అన్నారు.  నాయనలారా! మనసు ప్రశాంతతే ముఖ్యం. అదిలేకుంటే కొంప కొల్లేరే అవుతుంది. ఎంత పెద్ద భవంతిలో ఉన్నా, బంగారు దుకాణాలున్నా అది లేందే అడుగేయలేం. మన ఆలోచనలేవీ ముందుకు సాగవు. అంచేత దేన్ని గురించి ఎవరితోనూ కొట్లాటకు దిగవద్దు. చక్కగా నవ్వుతూ అన్ని భరించి మీ పని మీరు చేసుకుంటూ పోండి.  శివుడున్నాడు.. వాడే అంతా చూసుకుంటాడు! అనేసి స్వామి వారు ధ్యాన ముద్రలోకి జారుకున్నారు. ఓ పదిహేను నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే పట్టుమని పదిహేను మంది మిగిలారు, షామియానాలు, పట్టాలు ఎత్తుకెళ్లడానికి.  అయితే ప్రసంగం మధ్యలో ఒక్కమాట చెప్పారాయన.  ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టండి అని. మతిమరుపు పెరగకుండా ఉండడానికి గొప్ప సూత్రం అనుకున్నారాయన. దానికి ప్రశాంతతకి సంబంధమేమిటని రామానికి లేనిపోని అనుమానం తలెత్తింది.  రాత్రి ఎనిమిదిన్నరకి ఇల్లు చేరిన రామానికి గేట్లోనే ఒక స్టీలు గ్లాసు కాలికి తగిలింది. అంతే ఒళ్లు మండిరది. లోపలికి వెళ్లి భార్య మీద అరిచాడు..గ్లాసు అలా పారేశావేమిటని. వచ్చేటప్పుడు తెచ్చారుగా గోల చేయకండి. పిల్లాడు ఆడుతూ అటు విసిరేసినట్టున్నాడు. మర్చిపోతానేమో వంటింట్లో గిన్నెల అరలోనే పెట్టండి. ఆనక వెతుక్కు చావాలి.. అని చిన్న హెచ్చరిక చాలా మర్యాదగా చేసింది. భోజనానంతరం ఓ అరగంట పచార్లు చేస్తూ వస్తువుల సర్దుడు కార్యక్రమ రహస్యం గురించి ఆలోచించాడు. వెంటనే లోపలికి వెళ్లి చూస్తూ డైనింగ్‌ టేబుల్‌ మీద అతని అద్దాలు, హాల్లో టేబుల్‌ మీద మనవడి విరిగిన బొమ్మతో పాటు సగం తిని వదిలేసిన అన్నం కంచం దర్శనమిచ్చాయి. రామానికి ఒళ్లు మండిరది. తీసి జాగ్రత్తగా ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు. భార్యారత్నం చూసి కాస్తంత నవ్వుకుంది. మర్నాటి నుంచి చాలా స్ట్రిక్ట్‌గా ఆమె వదిలేసిన వస్తువులన్నీ వాటి స్థానాల్లోకి చేర్చడంలో నిమగ్నమయ్యాడు. గ్లాసులు, చెంచాలు, గిన్నెలు, పార్సిల్‌ కవర్లు వగైరాలన్నీ. ఆయన మర్చిపోయిన వాటిని మాత్రం  ఆమె   ససేమిరా ముట్టుకోలేదు.  ఆర్టిస్టిక్‌ మైండ్‌ లేదంటాడని ఆమె భయం. ఆయన తనలా గొప్పగా ఆలోచిస్తూ కనీసం హాలు వరకైనా నీట్‌గా ఉంచాలమ్మా అన్న గొప్ప రచయితల స్టేట్‌మెంట్లను ఆలవోకగా చెవులు వాచేట్టు ఉటంకించి చంపు తాడని కూడా ఆమె భయపడింది.  ఇలా నాలుగు రోజులు గడిచింది. ఐదో రోజు ఈ వస్తువులను వాటి స్థానాల్లో పెట్టడంలో తను చేయాల్సిన పని, చేస్తానని వాగ్దానాలిచ్చిన పనీ రెండూ ఒక్కసారిగా మర్చిపోయాడు రామం.  ఐదోరోజు ఉదయాన్నే ‘రామంగారూ.. ఇంతకీ నేను చెప్పిన పని అయిపోయిందా! పెద్దాయన ఒకటే ఫోన్‌ చంపుతున్నాడు సుమా’ అంటూనే లోపలికి వెళ్లాడు వెంకట్రావు. ఆయన్ను చూడగానే ఒక్కసారిగా సమస్త దేవతలు  కనిపించారు రామానికి. చచ్ఛాంరా ఫో! అనుకున్నాడు పైకే! తాను చేయవలసిన పని అలానే ఉంది. హాలు సగం ముస్తాబయింది. వంటిల్లు అలానే ఉంది. వరండాలో  కుర్చీ కాలు విరిగి అలానేవుంది. రామం మనసులోంచి వెంకట్రావు వెళిపోయాడు! ఏమిసేతురా లింగా.. అని పాడు కోవడానికీ ఆయన క్షణం వీలుపడనీయలేదు. మెత్తగా తిట్టి మళ్లీ కలుద్దామన్నాడు.రామానికి ఉన్న ప్రశాంతతా పోయింది. స్వామిని తిట్టుకున్నాడు.. భార్యమీద విరుచుకుపడ్డాడు.. రాయాల్సిన కాయితాలతో మనవడు పతంగులు తయారీలో నానా కష్టాలు పడుతున్నాడు. రామానికి కోపం నషాళానికి అంటింది.. మనవడు తన ఆర్టిస్టిక్‌ మైండ్‌తో చేసిన వంకరటింకర పతంగుని చూపించాడు. ఇప్పుడు తిట్టాలా, నవ్వాలా, ఏడవాలో అర్ధంకాలేదు. భార్యామణి భర్తగారి డొక్కు సర్దుడుని ఆమె ఆలోచనా పంథాలో సరిచేయడంలో తలమునకలై వంకాయకి బదులు బీరకాయ కూర  చేసేసింది. 

దెయ్యాల కొంప!

నువ్వెప్పుడు మేల్కొన్నా, ఒక తలుపు మూతపడుతుంటుంది. గదిలోంచి గదిలోకి వెళతారు, చేతిలో చేయి వేసుకుని, ఒకచోట ఎత్తి, మరొ చోట తెరచి వెళుతూంటారు.. దెయ్యం జంట. ‘ఇక్కడ మనం దాన్ని వదిలేశాం. ఇక్కడే ఆ వస్తువును వదిలేసింది. పైకి వెళ్లే మెట్ల దారిది’ ఆమె గుసగుసలాడింది. ‘అదుగో ఆ తోటలోకి వచ్చాం. మెల్లగా. వాళ్లు మేల్కొంటారు సుమా!’ అన్నాడతను.  కానీ మమ్మల్ని మేల్కొల్పింది నువ్వుకాదు. ఓహో!  ఇంకా వాళ్లు దానికోసం వెతుకుతున్నారు. కర్టెన్‌ లాగుతున్నారు’  అని అనవచ్చు ఎవరేనా, ఒకటి రెండు పేజీలు ఇలా చదవవచ్చు. ఇప్పుడు వాళ్లు కనుగొన్నారు. ఒక్కటిమాత్రం కచ్చితం, మార్జిన్‌ దగ్గర పెన్సిల్‌ ఆపడం. ఆ వెంటనే, చదవడంవల్ల నీరసించి, లేచి ఎవరికోసమో చూస్తారు, ఇల్లంతా ఖాళీయే, తలు పులు బార్లా తెరచి వుంటాయి. చెక్కబొమ్మలు గాలికి కదిలి శబ్దంచేస్తున్నాయి. ‘ఇంతకీ  ఇక్కడికి  దేనికి వచ్చాను? దేని కోసం వెతుకుతున్నాను?’ నా చేతులు ఖాళీగా వున్నాయి. ‘బహుశా పైన వుండొచ్చునేమో?’ గాజుపాత్రలో ఆపిల్స్‌ వున్నాయి. తోట లోనూ బొమ్మల్లా వున్నాయి, కేవలం పుస్తకమే గడ్డి మీదకి జారిపడింది.  కానీ వాళ్లు డ్రాయింగ్‌రూమ్‌లో చూశారు. అప్పటికి ఎవరూ చూడలేదని కాదు. కిటికీ అద్దాల్లో ఆపిల్స్‌, రోజాలు, ఆకుపచ్చని ఆకులూ ప్రతిఫలిస్తున్నాయి. డ్రాయింగ్‌రూమ్‌లో అవి కదిలినపుడు ఆపిల్‌ పసుపురంగువేపు తిరుగుతోంది. అయినా, క్షణం తర్వాత, తలుపు తెరుచుకుంటే, పెద్ద గదిలో గోడలకి, సీలింగ్‌కి వేలాడుతూ కనిపించేవేమిటి? నా చేతులు ఖాళీయే.  అంతటా నిశ్శబ్దం. నిశ్శబ్ద తరంగాలు రాజ్యమేలుతుంటాయి. ఒక్కసారిగా, అడవి పావురం  శబ్దం చేస్తుంది, ఇల్లంతా శబ్దం మెల్లగా విస్తరించింది.. ‘భద్రం..అంతా భద్రమే’ అంటూ.  క్షణం తర్వాత దీపం కాంతి తగ్గిపోయింది. అక్కడ మరి గార్డెన్‌లో? చీకటిని చెట్లు చిలుకుతున్నాయి..తొలి వెలుగు రాకకోసం. ఎంతో బావుంది, ఎన్నడూ చూడనిది.. గాజుపలక కింద సన్నని వెలుగురేఖ జారిపోతోంది. గాజుపలకే మరణం. ఇద్దరి మధ్యనున్నది మరణమే.  ముందుగా ఆమెకు వచ్చింది..వందల యేళ్ల క్రితం, ఈ ఇంటిని నిర్మానుష్యంగా వదిలేసింది. కిటికీలు మూతబడ్డాయి, గదులన్నీ చీకటిమయం. అతను ఆ ఇంటిని వదిలేశాడు, ఆమెను, ఉత్తర తూర్పు ప్రాంతాన్ని సయితం. ఆకాశంలో దక్షిణాన చుక్కలు పొడిచాయి.  ఆ ఇంటిని గుర్తించారు.. అంతా భద్రమే..ఎక్కడో దిగంతాల్లోంచి..నీ నిధులంతా భద్రమే అంటూ.  చాలాదూరం వరకూ కిటికీ రెక్కలు శబ్దం చేస్తున్నాయి. గాలి దుమారానికి చెట్లు తలలూపుతున్నాయి అటు ఇటూ. వర్షంలో చంద్రకాంతి వెదజల్లినట్లు పడుతోంది. కానీ దీపం కాంతి వెలుగురేఖ మాత్రం కిటికీలోంచి నేరుగా పడుతోంది. కొవ్వొత్తి కదలక మెదలక వెలుగుతోంది. ఆ దెయ్య్ దంపతులు ఇల్లంతా తిరుగుతూ, కిటికీ తలుపులు బలవంతంగా వేస్తూ,  తమ నిద్రకు భంగం కలిగించవద్దని మెల్లగా వేడుకుంటున్నాయి.   ‘ఇక్కడే మనం పడుకున్నది  ఆమె అన్నది.  ముద్దులకు అంతేలేదు .  పొద్దుటే లేచాం.. చెట్లమధ్య వెండిలా మెరిసింది సూరీడు కిరణాలు మెట్లపైన ,  గార్డెన్‌లో ..  ఎండాకాలం వచ్చేసింది.. చలికాలం మంచుకురిసే వేళలో దూరంగా ఎక్కడో తలుపులు మూసుకుంటున్నాయి, గుండె కొట్టుకుంటున్నట్టు బహు సుతారంగ ఇద్దరూ దగ్గరకు వచ్చారు. బయటకు వెళ్లే దారి తలుపులు మూసేశారు. గాలి గోల చేస్తోంది. వర్షం ధారాపాతంగా జారుతూ పచ్చిక మీద వెండిలా మెరుస్తోంది. మా చూపుకి ఏమీ కనపడటం లేదు, పక్కన ఎలాంటి సవ్వడినీ వినిపించుకోలేదు, ఎవరూ తన భయానక నల్లకోటును విప్పుతున్నట్టు చూడలేదు.  వెండి లాంతరును పైకి పట్టుకుని దూరంగా చూశారు వాళ్లు. సుదూరంగా దృష్టి సారించారు. గాలి నేరుగా రివ్వున వీస్తోంది. దీపం వెలుగు కాస్తంత వంగిపోతుంది. అడవి వెన్నెల కాంతి రేఖలు నేలని, వంగిన ముఖాల్ని, గోడల్నీ దాటుతాయి. మళ్లీ కలుస్తూ నిద్రపోతున్న వారిని వెతుకుతూ వారి దాచిన ఆనందాన్ని కోరుకునే ముఖాలను మరకచేస్తాయి.  సురక్షితమే అంటూ గృహ యజమాని గుండెకొట్టుకుంటుంది గర్వంగా.  చాలాకాలం తర్వాత మళ్లీ నన్ను కనుగొన్నావు  అతను నిట్టూర్చాడు.  ఇక్కడ.. నిద్రపోతోంది. తోటలో చదువుతోంది  నవ్వుతూ, అటకపై ఆ పిల్లను దొర్లిస్తోంది. ఇక్కడ మేము మా నిధిని వదిలిపెట్టాం.. వంగి, వాటి కాంతి నా కనురెప్పలు ఎత్తింది.  సురక్షితం, సురక్షితం!  ఇంటి నాడి విపరీతంగా కొట్టు కుంటుంది. నేను మేల్కొని అరుస్తాను, ‘ఓప్‌  ఇది మీ పాతిపెట్టిన నిధి? మీ హృది వెలుగు.  -వర్జీనియా కథ ఉల్ఫ్ కు టి.లలితా ప్రసాద్ స్వేచ్ఛానువాదం

కర్మ ఫలితం!

పాండవులు వనవాసం చేస్తున్న రోజుల్లో కుంతీమాతకి కుటీరంలో బియ్యం నిండుకున్నాయి. అడవిలో పనులకు వెళ్లి న తన అయిదుగురు కమారులు వచ్చే వేళయింది. భోజనం వండటానికి బియ్యం గింజ లేదు.  భీముడు అసలే ఆకలికి తట్టుకోలేడు. ఏం చేయాలి? ఎవరిని అడగాలి? అన్నది పాలుపోలేదు కుంతీదేవికి.  పక్కనే ఒక గ్రామం వుందని తెలుసుకున్న కుంతీ దేవి.. ఆ గ్రామానికి వెళ్లి ఓ ఇంటి ముందు నిలబడి.. అమ్మా.. నేను  అయిదుగురు బిడ్డలు తల్లిని. నా బిడ్డలు పనులు మీద బయటకు వెళ్లి  మధ్యాహ్నం భోజనానికి వచ్చే వేళయింది.   వండటానికి ఇంట్లో బియ్యం గింజ లేదు. కొంచెం బియ్యం ఇస్తే నేను వెళ్లి వంట చేసి పిల్లల ఆకలి తీరుస్తాను అని కోరింది.   అయితే ఆ ఇంటి ఇల్లాలు పరమ గయ్యాళి. ఆ ఇల్లాలు గంపంత నోరేసుకొని నేను నా పిల్లలు కి స్నానం చేసి వాళ్ళను ముస్తాబు చేసుకుంటున్నాను. నాకు ఓపిక లేదు.అసలు మాఇంట్లో బియ్యం లేవు ఏమి లేవు " నీవు అయిదుగురు బిడ్డల్ని  కని పారేసి ఇలా అడుక్కుతిని సాకాలా.? వాళ్ళు తినకుంటే వాళ్లే ఆకలికి మాడి చస్తారు. నీవు పో మా ఇంటి దగ్గర నుండి అంటూ దుర్భాషలాడింది.  నిష్కారణంగా నిందించింది.  అయినా కుంతీదేవి మారుమాటాడకుండా  తలవంచుకొని హృదయం లో కలిగిన క్షోభను పైకి కనపడకుండా ఇంటికివచ్చింది.  ఆ రోజు  పాండవులు వస్తూ, వస్తూ  తమతో పండ్లు ఫలాలు తెచ్చి   ఆకలిని తీర్చుకున్నారు. ఆ రోజు గడిచిపోయింది. తెల్లారి ఆ గ్రామంలో ఒక కలకలం రేగింది. ఒక ఇంట్లో ని పిల్లలందరూ పడుకున్నవాళ్ళు పడకున్నట్లు మృతి చెందారు. కారణం లేదు. ఆ నోటా ఈనోటా వార్త ధర్మరాజు వరకూ వచ్చింది. ధర్మరాజు తనకున్నదివ్యదృష్టితో చూసి సంగతి తెలుసుకున్నాడు.   ఆఇంటి గృహిణి ఎన్ని దుర్భాషనలు తిట్లు శాపనార్దాలు పెట్టిన ఒక్కమాట అనకుండా తలవంచుకొని వచ్చిన తన తల్లి సహనం. క్షమా గుణాలకు ధర్మరాజు  తన తల్లి కి మనసులో నే నమస్కరించుకున్నాడు. తరువాత తల్లి దగ్గరకు వచ్చి తల్లి, నిన్నటి రోజు పక్కన గ్రామంలోకి ఎవరింటికైనా భిక్షం కోసం వెళ్ళావా? అని అడిగాడు. కాని కుంతీదేవి లేదు, నేను నిన్నటి రోజు ఎక్కడికి వెళ్ళ లేదంది. లేదు తల్లి నిజం చెప్పు, అంతా నాకు తెలుసు, ఆ గృహిణి నిన్ను అవమానించినా మారు పలకనందుకు ఆ దూషణలు తిరిగి ఆమె బిడ్డలకే తగిలి మరణించారు. అని చెప్పాడు. ఎదుటి వారు మనల్ని నిష్కారణంగా మనల్ని దూషించినప్పుడు ఆ మాటలు చేసే గాయానికి నీవు ఓర్చావు. మనం మౌనంగా వున్నప్పుడు ఆ మాటలు మన ఎడమ కాలి గోటిని కూడా తాకవు. కాని మళ్ళీ మనం తిరిగి    శాపనార్దం పెడితే వాళ్ళ కి తిట్టినవారికి ఏమి కాదు. చెల్లు కు చెల్లు. కానీ మౌనంగా నీవు ఒక్క మాట అననందున ఆ శాపనార్ధాలు ఆమె బిడ్డలకి తగిలి వాళ్ళు మంచలోనే పడుకున్నవాళ్ళు పడుకున్నట్లు మృతిచెందారు.   నీవు తక్షణమే వెళ్లి ఆ గృహిణి తిరిగి దూషించిరా..  అని ధర్మరాజు చెప్పాడు.అంతట కుంతిదేవి గ్రామంలో నిన్న బిక్షకి వెళ్లి అడిగిన ఇంటికి వెళ్లి ...తిరిగి దూషించగానే మరణించిన ఆమె పుత్రులు నిద్రలో లేచి నట్లు లేచారు.    ఆ సంఘటన తో కుంతిదేవి సహనం కరుణ క్షమ గుణాలు ,   పాండవుల విలువ ఆ గ్రామమంతా తెలిసింది.  ఎవరైనా మనల్ని అకారణంగా దూషిస్తే అది వారికే తగులుతుందని అంటారు. అంటే ఎవరి కర్మ వారికే ఫలితం వెతికి మరీ ఇస్తుంది అన్నమాట. 

పసివాడి పట్టుదల

ఉపమన్యుడు ఒక నిరుపేద బాలుడు. వేళకు ఇన్ని గంజిమెతుకులు కతకడమే మహాభాగ్యంగా భావించే కుటుంబలో పుట్టాడు. ఓ రోజున ఉపమన్యుడు బంధువుల ఇంటికి వెళ్ళాడు . అక్కడ పిల్లలందరూ పాలు తాగుతూ , ఇతనికి కూడా కాసిని పాలు ఇచ్చారు. మొదటిసారిగా పాలను రుచి చూసిన ఉపమన్యుడు ఇంటికెళ్ళాక తల్లితో.. అమ్మా! నాకూ పాలు కావాలి  అని ఏడవసాగాడు. ఆమ్మ హృదయం ద్రవించిపోయింది . కొడుకును దగ్గరకు తీసుకుని , నాయనా.. కనీసం పాలైనా ఇవ్వలేని ఈ నిర్భగ్యారాలి కడుపున పుట్టడం నీ దురదృష్టం . అయితే మన నొసటి రాతను మార్చగలిగే శక్తి ఆ పరమేశ్వరుడికొక్కడికే ఉంది. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి స్మరించు. అప్పుడు నీకు గుక్కెడు పాలేం ఖర్మ..  ఆ పాలసముద్రమే తరలి వస్తుంది  అని ఊరడించింది.  తల్లి మాటలతో ఉపమన్యుడు ఉత్సాహంగా.. అమ్మా, నేను తపస్సు చేసి , ఆ ముక్కంటిని మెప్పిస్తాను అని చెప్పి తల్లికి నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్లి  తపస్సు ప్రారంభించాడు.  కఠోర దీక్షతో ఆ పసివాడు చేసే తపస్సు లోకాలను అల్లకల్లోలం చేయసాగింది . దాంతో దేవతలందరూ కలసి పరమేశ్వరుడి వద్దకెళ్లి, ఆ బాలుడి తపస్సును విరమింప జేయమని మొరపెట్టుకున్నాడు. అందుకు సమ్మతించాడు శివుడు.  ఇంతలో కఠోర తపస్సులో లీనమై ఉన్న ఉపమన్యుడి కళ్లెదుట హఠాత్తుగా దేవేంద్రుడు ప్రత్యక్షమై  కుమారా..  నేను దేవేంద్రుణ్ణి నీ తపస్సుకు మెచ్చాను . ఎందుకింత కఠోర తపస్సు చేస్తున్నావు ? అని అడిగాడు . ఉపమన్యుడు కళ్ళు తెరిచి , ఇంద్రుణ్ణి చూసి "మహేంద్రా ! పరమేశ్వరుడి కటాక్షం కోసమే నా ఈ తపస్సు , దయ ఉంచి, ముక్కంటి నాకు త్వరగా ప్రత్యక్షం అయేలా వరమివ్వండి అన్నాడు   బాలకా ! పరమేశ్వరుడు ఒక పాషాణం. నీకు కావలసిన వరాలడుగు, నేను అనుగ్రహిస్తాను, వెంటనే ఈ తపస్సు చాలించు  అన్నాడు ఇంద్రుడు . ఆ మాటలు విన్న బాలుడు కోపంతో,   నువ్వసలు ఇంద్రుడివేనా లేక ఆ వేషంలో వచ్చిన మాయావివా? శివనింద చేస్తున్న నిన్ను ఇప్పుడే చంపేస్తాను " అని అన్నాడు ఉపమన్యుడు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా , దేదీప్యమానమైన కాంతితో ప్రత్యక్షమై..   భక్తా ! నీ తపస్సు నన్ను కదిలింపజేసింది. నీ తల్లి మాట ప్రకారం నీవున్న చోటుకే పాలసముద్రం తరలి వస్తుంది . నీకు సకల సంపదలూ లభిస్తాయి అన్నాడు. జగన్మాత ఆ బాలుణ్ణి ప్రేమతో ఒడిలోకి తీసుకుని మాతృవా త్సల్యంతో తన చనుబాలిచ్చించి. వయస్సులో చిన్నవాడైనా , తల్లిమాటల పట్ల ఉపమన్యుడికి ఉన్న నమ్మకం,  ధృఢదీక్ష అతన్ని పరమేశ్వరానుగ్రహానికి నోచుకునేలా చేశాయి.

అత్యాశ

కోసలపురం అనే గ్రామంలో రామయ్య, భీమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు.వారికి ఉన్న చెరో ఎకరం భూమిలో ఎన్నో చెట్లు నాటుతూ వ్యవసాయం చేసేవారు. ఆ చెట్ల పండ్లు, కూరగాయల ద్వారా వచ్చే డబ్బుతో వారి జీవితం గడిచేది. కానీ ఆ డబ్బుతో భీమయ్య తృప్తి పడేవాడు కాదు. ఒకనాడు భీమయ్య పక్క ఊరిలో సంతకు కూరగాయలు తీస్కుని వెళ్ళాడు. పక్కన అతని చిన్ననాటి మిత్రుడ్ని చూశాడు. చాలా రోజుల తర్వాత కలిసిన మిత్రుడ్ని ఆలింగనం చేసుకుని, అతడు దర్జాగా విలాసవంతంగా ఉండటం చూసి, 'ఇంతకీ నీవు ఏం చేస్తున్నావు, ఇంత డబ్బు ఎలా సంపదించావు' అని ఆ మిత్రుడ్ని అడుగుతాడు భీమయ్య. అప్పుడు అతను భీమయ్యతో 'నేను పల్లెలో కొన్న విలువైన చెట్ల కట్టెల్ని పట్నంలో అమ్మి ఇలా ధనవంతుడిని అయ్యాను' అని చెపుతాడు. అప్పుడు భీమయ్య అలానా అని తన మిత్రుడికి వీడ్కోలు చెప్పి సంత ముగించుకుని ఇంటికి వెళ్తాడు. ఆ రాత్రి భీమయ్యకి ఒక ఆలోచన తడుతుంది. తను ఎన్ని రోజులు ఇలా చాలీచాలని డబ్బుతో బతకడం, తన మిత్రుడిలా శీఘ్రంగా ధనవంతుడు కావాలని భావించి తన పొలంలో ఉన్న చెట్లన్నిటిని నరికి వాటి కట్టల్ని అమ్మేద్దాం అనుకుంటాడు. మరుసటి రోజు నుండి చెట్లన్నీ నరికి తన మిత్రుడికి ఆ కట్టేల్ని అమ్మేసి డబ్బు సంపాదించాడు. ఒకనాడు భీమయ్య అనారోగ్య సమస్యతో మంచాన పడ్డాడు. అతడిని చూడటానికి రామయ్య వచ్చాడు. రామయ్య కూడా ధనవంతుడిగా రావడం చూసి భీమయ్య ఆశ్చర్యపోయాడు. రామయ్య భీమయ్యని చూసి 'భీమయ్యా… డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్షం చేశావు. ఈ రోజు చెట్లని నరికి కట్టెలను అమ్మి డబ్బు సంపాదించావు. ఆ చెట్లన్నీ అయిపోయాయి. ఇక ఇప్పుడు ఎలా సంపాదిస్తావు. ఆశకి పోయి ఉన్న మంచి వ్యవసాయాన్ని కోల్పోయావు. ఇప్పుడు నేను పొద్దున లేసి పొలానికి వెళ్ళగానే శరీరానికి కావాల్సిన ప్రాణవాయువును చెట్ల ద్వారా ఎంతో పొందుతాను. నీరు పెట్టడం మాత్రమే నా పెట్టుబడి. ప్రతి వారం సంతలో కూరగాయలు, పండ్ల ద్వారా ఎంతో డబ్బు సంపాదిస్తున్నాను. నా కుటుంబం అంతా కూడా మా పొలంలో పండే కూరగాయలని తింటూ ఆరోగ్యంగా ఉన్నాం. ఒకేసారి ధనవంతుడు కావాలనే నీ ఆశ నిన్ను ఇలా అనారోగ్య పరిస్థితుల్లోకి తీసుకొని వచ్చింది' అన్నాడు రామయ్య. రామయ్య మాటలు విన్న భీమయ్య ఎంతో బాధ పడ్డాడు. రామయ్యా తన వెంట తెచ్చిన పొలంలోని కూరగాయలు, పండ్లు భీమయ్యకి ఇచ్చి వెళ్లాడు. భీమయ్య తను చేసిన తప్పు తెలుసుకుని తను ఆరోగ్యవంతుడు అవ్వగానే తిరిగి వ్యవసాయాన్ని మొదలుపెడతాడు. మళ్ళీ కూరగాయలు, పండ్లు సంతలో అమ్ముకుంటూ ఆనంద జీవితాన్ని పొందాడు.

అమ్మ మాట

ఒక అడవిలో ఒక జింక వుండేది. దానికి ఒక పిల్ల వుండేది. అది చానా ముచ్చటగా... కనబడితే చాలు... కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేలా వుండేది. ఎప్పుడూ చెంగుచెంగున ఎగురుతా, దూకుతా, ఆడతా, పాడతా, నవ్వుతా, తుళ్ళుతా జలపాతంలా వుండేది. దాని అల్లరి చూసి అందరూ నవ్వేవారే గానీ ఎవరూ కోప్పడేవారు కాదు. దానికి అడవంతా తిరగాలని ఒకటే కోరిక. అమ్మకి కూడా చెప్పకుండా చానాచానా దూరాలు పోయొచ్చేది. ఒకరోజు వాళ్ళమ్మ దాన్ని పట్టుకోని ''చూడు పాపా... ఈ అడవిలో సింహాలు, పులులు లేవు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈపాటికి వాటికి ఆహారం అయిపోతా వుంటివి. అందరిలాగా అక్కడికి పోవద్దు, ఇక్కడికి పోవద్దు అని నేను చెప్పను. పదిమందిలో కలవాల. కొత్త విషయాలు తెలుసుకోవాల, అనుభవాలు పంచుకోవాల, తిరగాల... అప్పుడే లోకజ్ఞానం వచ్చేది. కానీ ఒక్కమాట అడవిలో ఎక్కడైనా తిరుగు ఏమయినా చెయ్‌. కానీ అడవి దాటి పోవద్దు. అక్కడ మనుషులు వుంటారు. వాళ్ళు చూడడానికి నీలాగే అమాయకంగా వుంటారు గానీ చానా మంది పులులు, సింహాలు, గుంటనక్కల లాంటి వాళ్ళు. వాళ్ళ కంటబడినా, చేతికి చిక్కినా అస్సలు వదలరు. కమ్మగా కూర వండేసుకుంటారు'' అని చెప్పింది. జింకపిల్ల అలాగేనంది. కొంతకాలానికి అడవిలో అది చూడని చెట్టు లేదు. ఎక్కని గుట్ట లేదు. కలవని జంతువు లేదు. ఈదని చెరువూ లేదు. ఇంకా కొత్త కొత్తవి చూడాలని దాని మనసు ఒకటే గోల చేసేది. దాంతో అడవి దాటి, మనుషులను చూసి రావాలి అనుకొనింది. అమ్మ మాట మతికి వచ్చింది. ఏమీ కాదులే... తల్లులు ఎప్పుడూ అలాగే గదా చెప్పేది అనుకొనింది. నెమ్మదిగా అడవి దాటి అడుగులో అడుగు వేసుకుంటా ఒక ఊరివైపు వచ్చింది. ఒక ఇంటి ముందు చిన్న పిల్లవాడు వున్నాడు. అమాయకంగా వున్నాడు. వాడు జింకపిల్లను చూసి ముద్దుగా నవ్వినాడు. జింకపిల్ల గూడా కలుపుగోలుగా నవ్వింది. దగ్గరకు రమ్మని పిలిచినాడు. పోదామా వద్దా అని ఆలోచించి ఏమీ కాదులే అనుకోని దగ్గరకు పోయింది. వాడు సంబరంగా దాని ఒళ్ళంతా నిమిరినాడు. ముద్దు పెట్టుకున్నాడు. పచ్చగడ్డి నోటికి అందించినాడు. బాగా ఆడుకున్నాడు. జింకపిల్ల గూడా ఆడీ ఆడీ అలసిపోయి అక్కడే నిదురపోయింది. కాసేపటికి ఆ పిల్లవాని అమ్మానాయన ఇంటికి వచ్చినారు. అక్కడ పడుకోని వున్న జింకపిల్లను చూసినారు. ఆ పిల్లోని నాయన ''అరే... అడవి నుంచి తప్పిపోయి వచ్చినట్టుంది. బలే బలంగా, లేతగా వుంది. అమ్మితే డబ్బులే డబ్బులు'' అనుకుంటా చప్పుడు కాకుండా దగ్గరికి వచ్చి లటుక్కున దాన్ని పట్టేసుకున్నాడు. జింకపిల్ల అదిరిపడి లేచింది. తప్పించుకోడానికి పెనుగులాడింది. కానీ వాని బలం ముందు దాని బలం సరిపోలేదు. వాడు ఒక తాడు తీసుకోని వచ్చి దాన్ని పెరటిలో కట్టేసినాడు. అడవిలో హాయిగా ఎటు పడితే అటు తిరిగిన దానికి అక్కడ అలా ఒక్కచోటనే వుండడం చేతగావడం లేదు. తప్పించుకోవాలని తెగ గింజుకోనింది. కానీ ఆ తాడు చానా లావుగా, బలంగా వుంది. అడవిలో అమ్మ తన పిల్ల కోసం ఎదురు చూడసాగింది. రోజూ ఎక్కడెక్కడ తిరిగినా చీకటి పడే సమయానికంతా ఇంటికి వచ్చి ఒళ్లో వెచ్చగా పడుకొనేది. అలాంటిది రెండు రోజులయినా రాలేదు. తల్లి తల్లడిల్లిపోయింది. వెదకని చోటూ లేదు. అడగని జంతువూ లేదు. ఆఖరికి ఒక అడవిపంది జింకపిల్ల వుత్తరంవైపు మనుషులున్న చోటికి పోవడం చూశాననింది. జింక అడుగులో అడుగేసుకుంటా మట్టసంగా పొదల్లో దాచిపెట్టుకుంటా ఆ వూరికాడికి వచ్చింది. ఒక ఇంటిలో జింకపిల్ల కట్టేసి కనబడింది. తాడు చానా లావుగా వుందిగదా... ఎలా తెంపడం అని బాగా ఆలోచించింది. అంతలో దానికి తనింటికి కొద్ది దూరంలో వుండే ఎలుక మతికి వచ్చింది. పరుగుపరుగున పోయి దానికి విషయమంతా వివరించి ''నువ్వే నా పిల్లను ఈ ఆపద నుంచి గట్టెక్కించగలవు. నీ కొశ్శని పళ్ళతో ఆ తాడు కొరికి దానిని విడిపించవా'' అనింది దీనంగా బతిమలాడుతా. ఎలుక బాగా ఆలోచించి ''నేనూ పిల్లలున్నదాన్నే... ఆ బాధ నాకూ తెలుసు... కానీ అంతలావు తాడు కొరికే సరికి నా పళ్ళన్నీ అరిగిపోతాయి. ఆ తరువాత నా పిల్లలకు ఆహారం ఎలా తీసుకోని రాగలను'' అనింది. ఆ మాటలకు జింక ''ఎలుకా... నువ్వు నీ పిల్లలు రోజూ తినేదెంత మీ చిన్ని బొజ్జలను నింపే పూచీనాది. నీ పళ్ళు మరలా బాగయ్యేదాకా అది ఆరునెల్లుగానీ, అరవై నెలలుగానీ మూడుపూటలా పళ్ళూ కాయలు తెచ్చి ఒలిచి పెట్టే పూచీ నాది సరేనా'' అనింది. ఎలుక సరేనని జింకపైకి ఎక్కి కూచోనింది. రెండు చీకటిపడే సమయానికంతా జింకపిల్ల వున్న చోటుకు పోయినాయి. అందరూ పండుకున్నాక ఎలుక పోయి నెమ్మదినెమ్మదిగా తాడు కొరకసాగింది. ఒక్కొక్కపోగు తెగిపోతా తెగిపోతా ఉదయానికంతా తాడు మొత్తం తెగిపోయింది. అంతే... జింక ఎలుకను మీద కూచోబెట్టుకొని పిల్లతో సహా కళ్ళు మూసి తెరిచేలోగా అడవికి చేరుకొనింది. అమ్మ మాట వినకపోతే ఏమవుతుందో ఆ జింక పిల్లకి తెలిసి వచ్చింది .

కాళీపట్నం ‘జీవధార’:కనుతెరిచిన క్షణం

 ఎమర్జెన్సీ రోజులు...ఎంచక్కా యద్దనపూడి సులోచనారాణి ‘బహుమతి’ కథలూ, ఆదివిష్ణు ‘కలెక్టరూ! నన్ను క్షమించు కథలూ’, గొల్లపూడి మారుతీరావు ‘రోమన్ హాలిడే’ కథలూ చదువుకుంటున్నరోజులు. తెలియకుండానే జీవితం చంకనాకిపోతున్న రోజులు...ఆ రోజుల్లో ఒకరోజు మా అన్నయ్య గణపతిరావుగారు ఓ పాత స్వాతి మాసపత్రికను తీసుకొచ్చి నా చేతికిచ్చారు. దానికి కవర్ పేజీలేదు. చాలా పేజీలు చిరిగి, నలిగిపోయి ఉన్నాయి. ఇందులో ఓ కథ ఉంది ‘జీవధార’ అని. రచయిత కాళీపట్నం రామారావు మాస్టారు. ఆ పేజీలు చిరగలేదు. చదువు అన్నారు.    చదివాను. కథల్లో అలకలూ, అల్లర్లూ ఉండాలి. ముద్దులూ, ముచ్చట్లూ ఉండాలి. అలరింతలూ, కౌగలింతలూ ఉండాలి. అంతేగాని ఈ కథేమిటి ఇలా ఉంది? నిత్యం  వీధికొళాయి దగ్గర జరిగిన గొడవలే ఇవి. వీధికొళాయిదగ్గర నీరు రాకపోతే  అక్కడా ఇక్కడా దేవులాడడం చూస్తున్నదే! ఏమున్నది ఇందులో అనుకున్నాను. అనుకుంటూనే ఆలోచించాను. ఆలోచిస్తే...జీవధారలోని ప్రతి అక్షరం, ప్రతిపదం, ప్రతి వాక్యం నాకేవేవో కొత్త దృశ్యాలను చూపిస్తున్నట్టనిపించింది. దృశ్యం ఒకటే! కాకపోతే ఎదురుబొదురు అద్దాల్లో వందలు, వేలాది ప్రతిబింబాలు కనిపించినట్టుగా అనేక దృశ్యాలు కనిపించసాగాయి. అరికాళ్లలోంచి ఏదో సెగ బయల్దేరి గుండెల్లోంచి పాకి, మెదడుకెక్కి కూర్చున్నదక్కడ.      నీటి కోసం కింది తరగతులవారయితే గొడవపడతారు. కింది మధ్యతరగతివారయితే బతిమలాడుతారు. పొరుగింటివారినీ, ఇరుగింటివారినీ మంచిచేసుకుని, వారికి పచ్చళ్లూ, పొడులూ ఇచ్చి నీళ్లబిందె చంకనెత్తుకుంటారు. నీళ్లబిందె చంకనెత్తుకున్నప్పుడు ఆ ఇంటి మగవాళ్లు ఆడవారిని చూసే చూపులు నాకు తెలుసు. మా పిన్ని కూతురిని పొరుగింటి కుర్రాడు అలాగే చూసేవాడు. తమకాన్ని తమాయించుకోలేకపోయేవాడు. పిడికిళ్లు బిగించి, దంతాలు గిట్టకరచి నిల్చునేవాడు.    వాడి నిన్ను అదోలా చూస్తున్నాడే అక్కా అంటే...  చూణ్ణీనీరా! కాసేపుచూసుకుంటాడు, పోతాడు. నీళ్లెవరిస్తారు? కొళాయి మనింట్లో లేదుకదా? అనేది అక్క. అలా అంటున్నప్పుడు అక్కగొంతు జీరపోవడం నేను చాలాసార్లు గమనించాను. బాధపడ్డాను. అదిగో...ఆ బాధని బొమ్మగీసిపెట్టారు కాళీపట్నంమాస్టారు.    ఎలా ఆలోచించాలో కథకుడు చెప్పకూడదురా! ఆలోచించేందుకు అనేక ప్రశ్నలను సంధించాలంతే అనేవాడు మా అన్నయ్య. ఆ మాట ‘జీవధార’ నిజంచేసిందనిపించింది. గుండెల్లోంచి తన్నుకొస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కుంటూ సాయంత్రం రైల్వేస్టేషన్ కి వెళ్లాను. మా ఊరిలో సాయంత్రాలు అంతా రైల్వేస్టేషన్స్ లోనే కూర్చునేవారు. సింగిల్ ట్రాక్. అప్పుడో రైలూ, అప్పుడో రైలూ వచ్చేవి. పెద్దగా ప్రయాణికులు ఉండేవారు కాదు. సాయంత్రం పొలాలమీదినుంచి వచ్చే చల్లనిగాలికోసం, కబుర్లకోసం యువతంతా అక్కడే తిష్టవేసేది.   పట్టాలకు అటూ ఇటూ పడిన బొగ్గును పేదింటిపాపలు ఏరుకునేవారు. చిరిగిన జాకెట్టు, చాలీచాలని లంగాలో ఉండేవారు. వారిని కుర్రకారు దొంగచూపులు చూసేది. నేనూ వారిలో ఒకణ్ణి. నేనేం శుద్ధుణ్ణికాను. కాకపోతే...జీవధార కథచదివిన సాయంత్రం బొగ్గు ఏరుకునే పాపలను అలా చూడకూడదనుకున్నాను. నా స్నేహితుడు చూస్తుంటే వద్దన్నాను. వినకపోతే...నెత్తిమీద ఒకటిచ్చాను. షాకయ్యాడు వాడు. విస్తుపోయిచూశాడునన్ను. వద్దంటే వద్దు! అంతే అన్నాను. ఇక అక్కడ కూర్చోవాలనిపించలేదు. లేచి బయల్దేరాను.   ఏదో అసహనం, కోపం, కసి. ఆ రాత్రి నిద్రలేదు నాకు. మర్నాడు అక్క నీళ్లబిందె చంకనెత్తుకుంటుంటే...ఎప్పటిలాగానే పొరుగింటికుర్రాడు అక్కని చూడసాగాడు. నేనది భరించలేకపోయాను. చాచిపెట్టి కొట్టానతన్ని. ఎందుకు కొట్టావని కుర్రాడు అడగలేదు. భయపడి పారిపోయాడక్కణ్ణుంచి.   చిన్నకథలు హ్యాండ్ గ్రెనేడ్ లాంటివి. ప్రయోగిస్తే పాఠకుడు నాలా కదిలిపోతాడనిపించింది. తర్వాత వరుసగా మాస్టారుగారి కథలన్నీ చదివాను. చాలా తెలుసుకున్నాను.   కథలకు ప్రయోజనం ఉంటుందా? ఉండాలా? అనుకునేవారికి నేనొకటే చెబుతాను. కథలకు ప్రయోజనం ఉంటుంది. ఉండాలి. అందుకు నేనే పెద్ద ఉదాహరణ. జీవధార కథ నన్ను బాగా మార్చింది. అలాంటి కథలు పదుల్లోవస్తే, వందలూ, వేలాదిమంది చదివి, లక్షలూ, కోట్లమందిలో మార్పులొస్తే...ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు అప్పుడు ఉండవు. నేల నేలలా ఉంటుంది. గాలి గాలిలా ఉంటుంది. ఆకాశం ఆకాశంలా ఉంటుంది. నీరు నీరులా ఉంటుంది. అందరికీ అన్నీ దొరుకుతాయి. కొందరికే అన్నీ దొరికే అవకాశం ఉండదుగాక ఉండదు.   రాత్రి మాస్టారిని చూడాలనిపించింది. వారి కథలు చదువుతూ కూర్చున్నాను. కథకులకు మరణం ఉండదు. వారి కథల్లో వారు జీవిస్తూనే ఉంటారు. పిలిస్తే పలుకుతారు.  -జగన్నాథశర్మ