ప్రాంతీయ అస్తిత్వ సాహిత్య విమర్శ

ప్రాంతీయ అస్తిత్వ సాహిత్య విమర్శ విషయానికి వస్తే రాయలసీమ, కళింగాంధ్ర సాహిత్యాలపై వచ్చిన విమర్శ ఉనికిని చాటుకునే చైతన్యంతో వచ్చింది. తమ సాహిత్యంలో ప్రత్యేకతలను వివరించి చెప్పింది. ప్రాంతీయ అస్తిత్వ విమర్శకు మల్లీశ్వరి రచించిన “ఉత్తరాంధ్ర కథాస్థానీయత” ఉదాహరణగా నిలుస్తుంది. రామతీర్థ వంటి వారు ఉత్తరాంధ్ర  సాహిత్య విశ్లేషణ చేశారు. ‘ప్రబంధ’ అభివ్యక్తికి రాయలసీమ పునాదిగా నిలిచిందని విమర్శకులు అనడం వెనక ప్రాంతీయ స్పృహ పనిచేసింది. రాయలసీమ కథలపై పరిశోధన చేసిన తవ్వా వెంకటయ్య తొలినాటి రాయలసీమ కథలను వెలుగులోకి తేవడమే కాకుండా ఆ కథలపై వ్యాసాలు రాశారు. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి కథాంశం, మన నవలలు ` కథానికలు, ప్రతిఫలనం వంటి సంపుటుల్లో రాయలసీమ సాహిత్య విశిష్టతను చెప్పారు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య రాయలసీమ ప్రాంతంలో ప్రతిఫలించిన ఆ ప్రాంత సామాజిక, సాంస్కతిక ప్రత్యేకతలు ప్రతిఫలించాయి. రాయలసీమ ప్రాంత సాహిత్య పరిణామ వికాసాలను కూడా ఆయన వివరించారు. సింగమనేని నారాయణ, వేంపల్లి గంగాధర్, బండి నారాయణ స్వామి రాయలసీమ ప్రాంత సాహిత్యంపై చర్చించారు. 
తెలంగాణ ప్రాంతీయ సాహిత్యం, దానికి సరిజోడుగా విమర్శ పెద్ద యెత్తున వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేపథ్యంలో సాహిత్యంతో పాటు సాహిత్య విమర్శ కూడా ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం పెల్లుబుకింది. అది ఉద్యమ స్థాయిని అందుకుంది. దీన్నే ముదిగంటి సుజాతారెడ్డి ` రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అస్తిత్వ చైతన్యం ఉన్నపటికీ అవి అస్తిత్వ ఉద్యమాలుగా రూపుదిద్దుకోలేదని, తెలంగాణ ప్రాంతం మాత్రమే అసిత్వ ఉద్యమంగా ఎదగిందని అన్నారు. 

జరగాల్సిన తీరుపై ఇందులోని వివిధ రచయితలు చేసిన సూచనలు తర్వాతి కాలంలో విమర్శ విస్తరించడానికి దోహదం చేశాయి. తెలుగు సాహిత్యంలో బ్రిటిషాంధ్ర సాహిత్య చరిత్రకారులు, సంకలనకర్తలు తెలంగాణ సాహిత్యాన్ని విస్మరించడంపై, తప్పుడు సూత్రీకణలు చేయడంపై ప్రశ్నలు సంధిస్తూనే తొలితరం తెలంగాణ సాహిత్య ప్రక్రియలను వెలికితీసే పరిశోధనలు సాగాయి. అదే సమయంలో తెలంగాణ, బ్రిటిషాంధ్ర సాహిత్యాలు సమాంతర పరిణామ, వికాసాలు చెందలేదని, అందువల్ల బ్రిటిషాంధ్ర సాహిత్యాన్ని విశ్లేషించే కొలమానాలు సరిపోవనే వాదనలు కూడా తెచ్చి తెలంగాణ సాహిత్యాన్ని విశ్లేషించే పనిముట్లను తయారు చేసుకున్నారు. తెలుగు సాహిత్యంలో తొలి కవి, తొలి కథ వంటివాటిని ముందుకు తెచ్చారు. సాహిత్య చరిత్రలు తెలంగాణ సాహిత్యాన్ని ఇముడ్చుకునే రీతిలో లేవని విమర్శించారు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన ‘లెఖ్ఖ తప్పిన తెలుగు సాహిత్య చరిత్ర’, కాసుల లింగారెడ్డి రాసిన ‘మనం తక్కువేమీ కాదు’ అనే వ్యాసాలు తెలుగు సాహిత్య చరిత్రను తిరగరాయాల్సిన అవసరాన్ని తెలియజేశాయి. తెలుగు సాహిత్య చరిత్ర పునర్మూల్యాంకనానికి ప్రతిపాదనలు చేశాయి.
బ్రిటిషాంధ్ర, నిజామాంధ్రల్లో వచ్చిన సాహిత్య ప్రక్రియలపై తులనాత్మక పరిశీలన కూడా చేసి తెలంగాణ సాహిత్య పరిణామ వికాసాలు భిన్నమని కూడా ప్రకటించాయి. ‘తెలంగాణ తోవలు’ పుస్తకంలో కాసుల ప్రతాపరెడ్డి రాసిన ‘వాళ్లూ ` మనమూ’, శోభా భట్ రాసిన ‘మీకు మీరే, మాకు మేమే ఎందుకీ నసనస’ అనే వ్యాసాలు ఆ పని చేశాయి. తెలంగాణకు సురవరం ప్రతాపరెడ్డి ఆదర్శం కావాలంటూ తెలుగు సాహిత్యంలో ఇప్పుడు వీస్తున్నది తెలంగాణ గాలి అని సురేంద్రరాజు ప్రకటించారు. తెలంగాణ దళిత, ముస్లిం, స్త్రీవాదాల గురించి కాసుల ప్రతాపరెడ్డి భౌగోళిక, చారిత్రక, సాంస్కతిక, సామాజిక సరిహద్దులను పరిగణనలోకి తీసుకుని తులనాత్మక అధ్యయనం చేశారు.

తెలంగాణ అస్తిత్వాన్ని ప్రకటించుకునే విషయంలో సురవరం ప్రతాపరెడ్డి తొలి అడుగు వేశారు. ఆయన వెలువరించిన ‘గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక’ ఆ పని చేసింది. తెలంగాణ సృజనాత్మక సాహిత్యం వివక్షకు, విస్మరణకు గురవుతున్న తీరును, ఆ సాహిత్యంపై ఉన్న తప్పుడు అభిప్రాయాలను తెలంగాణ విమర్శకులు ఎత్తి చూపారు. కె. శ్రీనివాస్ రాసిన ‘యాంటీ కలోనియల్ విశ్వనాథా, తెలంగాణ కష్ణారావూ!’ అనే వ్యాసం అందుకు ఉదాహరణ. తెలంగాణ కథ  పట్ల ప్రదర్శిస్తున్న వివక్షపై, తెలంగాణ కథ తీరు తెన్నులపై ‘తెలంగాణ కథ ` దేవులాట’ అనే సంకలనంలోని రచయితల వ్యాసాలు చెప్పాయి. వివక్షను ప్రశ్నించడం నుంచి తెలుగు కథా సాహిత్యంలో తెలంగాణ అస్తిత్వాన్ని చాటడానికి నిర్మాణాత్మక కషి తెలంగాణ రచయితల నుంచి జరిగింది. 
తెలంగాణ కథ రచనకు వాడిన భాషపై కూడా చర్చ జరిగింది. ఇది ఒక రకంగా ఆత్మవిమర్శ లాంటిది. గుడిపాటి తెలంగాణ కథ విషయంలో ప్రధానంగా మూడు పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. కథా రచనలో వాడుతున్న భాషపై ఆయన విమర్శ పెట్టారు. దాన్నే కాసుల ప్రతాపరెడ్డి మరో రూపంలో చెప్పారు. “తెలంగాణ అస్తిత్వ ఉద్యమం బలంగా ముందుకు వచ్చిన తర్వాత తెలంగాణ భాషలోనే రాయాలనే వాదన బలంగా ముందకు వచ్చింది. అది చాలా మంచిది. అయితే కేవలం క్రియారూపాలను మార్చినంత మాత్రాన ప్రాంతీయ లక్షణాన్ని తేలేమనే విషయాన్ని గుర్తించడం ఈ సందర్భంలో అవసరం. తెలంగాణ భాష వాడకం, జీవిత చిత్రణ విషయాల్లో పాత తరంలో పి. యశోదారెడ్డి, ఈ తరంలో జాజుల గౌరి ఆదర్శమైతే తెలంగాణ కథకు పుష్టి చేకూరుతంది’ అని అన్నారు. తెలంగాణ నవలలను వెలికి తీసి, విమర్శించే సాహిత్యం కూడా బలంగానే వచ్చింది.  

తెలంగాణ సాహిత్య విమర్శకు తొలి మైలురాయి ‘తెలంగాణ తోవలు’ అయితే మలి మైలురాయి ముదిగంటి సుజాతారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన ‘ముద్దెర’ మలి మైలురాయి. వచన కవిత్వానికి ఇచ్చిన గౌరవాన్ని గేయ కవిత్వానికి ఇస్తూ విమర్శకులు గేయ కవిత్వాన్ని విశ్లేషించారు. గోరటి ఎంకన్నపై కె. శ్రీనివాస్ రాసిన ‘పగిడికంటి పాట’ అనే వ్యాసం అత్యంత ప్రధానమైంది. తెలంగాణ కవిత్వాన్ని కాసుల ప్రతాపరెడ్డి ‘తెలంగాణ పాట ` దేశీయత’ అనే వ్యాసం రాశారు. పాటకు వచన కవిత్వం స్థాయిని కల్పించి ఈ రకమైన విశ్లేషణ చేయడం ఇదే ప్రథమమని డాక్టర్ యాకూబ్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి భాష కూడా సాధనంగా మారింది. తమది ప్రత్యేకమైన భాష అని తెలంగాణ సాహిత్యవేత్తలు ప్రకటించారు. ఇది అతివాద విమర్శనే అయినప్పటికీ తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని ముందకు తీసుకుని పోవడానికి పనికి వచ్చింది. భాష విషయంలో విశేషంగా కషి చేసినవారు నందిని సిధారెడ్డి. ఇందులో భాగంగా తెలుగు ప్రామాణిక భాషపై విమర్శలు ఎక్కుపెట్టారు. భాషను ఆంధ్ర ఆధిపత్య వాదులు తెలంగాణ ప్రజల మనసులను బానిసలుగా మార్చుకోవడానికి వాడుకున్నారని సిధారెడ్డి అన్నారు.
 
డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ‘ముంగిలి’, ‘గనుమ’, నందిని సిధారెడ్డి ‘ఇగురు’, కాసుల ప్రతాపరెడ్డి ‘తెలంగాణ సాహిత్యోద్యమాలు’, ‘భౌగోళిక సందర్భం’, కొలుపు, ఇరుసు, గుడిపాటి ‘ఫాయిదా’, బన్న అయిలయ్య ‘తెలంగాణ పీఠికలు’, తెలంగాణ కథ ` పరామర్శ, బిఎస్ రాములు సమగ్ర సామాజిక కథ, కాలువ మల్లయ్య ‘తొమ్మిది పదుల తెలంగాణ కథ, సంగిశెట్టి శ్రీనివాస్ దస్త్రమ్, కె. శ్రీనివాస్ తెలంగాణ సాహిత్య వికాసం తెలంగాణ సాహిత్య విమర్శలో ఎన్నదగినవి. తూర్పు మల్లారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన ‘తెలంగాణ సాహిత్యం ` జీవితచిత్రణం’, ముదిగంటి సుజాతారెడ్డి సంపాదకత్వంలోని ముద్దెర, పంతంగి వెంకటేశ్వర్లు సంపాదకత్వంలో వచ్చిన ‘తెలంగాణ తెలుగు నవల, తెలంగాణ తెలుగు కథ’ ప్రముఖమైనవి. తెలుగు అకాడమీ ‘తెలంగాణ ఆధునిక తెలంగాణ సాహిత్యం’ అనే గ్రంథాన్ని వెలువరించింది.

-కాసుల ప్రతాపరెడ్డి