చాగంటి సోమయాజులు

చాగంటి సోమయాజులు కథకులకు కథడుడిగా పేరుపొందిన కథకుడు చాసో. రాసిన కథలు తక్కువైనా వాటిలోని వస్తువు, శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. అందరికీ సామాన్యంగా అనిపించే దృశ్యంలోంచి అసమాన్యమైన కథను సృష్టించడంలో చాసో అసమాన్యుడు. ఏది రాసినా, ఏది చెప్పినా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక సన్నివేశంలోనే మనిషి జీవితాన్ని వ్యాఖ్యానించేలా కథను రాయగల ప్రతిభ వారిది. ఈయన బాణి మన కథకుల్లో విశిష్ఠమైంది. సామాజిక ప్రయోజనం లేనిది కథ రాయడం వృధా అంటారు వారు. జీవితం చివరి వరకూ అభ్యుదయవాదిగానే నిలబడిన వాస్తవిక వాది చాసో. చాసో అసలు పేరు చాగంటి సోమయాజులు. జనవరి 17, 1915లో జన్మించారు. తల్లి తులసమ్మ, తండ్రి కానుకొలను లక్ష్మీనారాయణ. పుట్టంది శ్రీకాకుళం అయితే వారి పెద్దతల్లి దత్తత తీసుకోవడం వల్ల చిన్నప్పుడే విజయనగరం వచ్చేశారు. ఎక్కువ రోజులు అక్కడే నివశించారు. కాదంబరి అన్నపూర్ణతో 13 ఏటనే వివాహం జరిగింది. బి.ఎ. రెండో సంవత్సరం చదువుతుండగానే చదువు ఆపేసి చిన్నాజీ కథలను ముద్రించారు. అయితే కళాశాలలో చదివే రోజుల్లో కవిత్వం కూడా రాసేవారు. కానీ ఆ తర్వాత కథలవైపే మొగ్గు చూపి ఆణిముత్యాల్లాంటి కథలను మనకు అందించారు. వీరికి శ్రీశ్రీ, రోణంకి అప్పలస్వామి, ఆరుద్ర లాంటి కవులు బాగా సన్నిహితులు. విజయనగంలోని హవేలీ భవనం వీరి సాహిత్యాభిమానానికి నిలయం. వీరి మొదటి కథ చిన్నాజీ 1942లో భారతిలో ముద్రితమైంది.          వాయులీనం, ఎంపు, పరబ్రహ్మం, దుమ్మలగొండె, కుక్కుటేశ్వరము, లేడీ కరుణాకరం, బండపాటు, కుంకుడాకు, భల్లూకస్వప్నం, పోనీ తిను, బుగ్గిబూడిదమ్మ కథ... ఇలా సుమారు నలభైకి పైగా కథలు రాశారు చాసో. లేడీ కరుణాకరం  కథలో- శారద, భర్త చదువుకోసం వ్యభిచారిణిగా మారినట్లు చెప్తుంది. ఇందులో తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా కొంత ఉంటుంది. చివరికి భర్తకూడా ఇదంతా నీ భిక్షమే అంటాడు. చాసో ఆమెను మహాపతివ్రత అంటాడు. ఈ కథంతా వ్యంగ్యంగా సాగుతుంది. ఎంపు కథలో - ఓ బిచ్చగాడి కూతురు మరో బిచ్చగాడిని ప్రేమిస్తుంది. కానీ తండ్రి ఇంకో బిచ్చగాడి సంబంధం తెస్తాడు. వీరిద్దరిలో  పెళ్లికొడుకును ఎంపిక చేసుకోవడమే ఈ కథలోని వస్తువు. వాయులీనం కథలో- భార్యాభర్తల అన్యోన్యత, ఆర్థికబంధాలు కనిపిస్తాయి. కుంకుడాకు కథలో- వంటకోసం ఎండుటాకులు ఏరుకునే అమ్మాయికి ఎదురైన సంఘటనను చెప్పారు. పరబ్రహ్మం కథలో- పిచ్చివాడిగా చెలామణి అవుతున్న విద్యావంతుడి ప్రతిభను వర్ణించారు. బదిలీ కథ- కేవలం ఉత్తరాలతో నడిచే కథాశిల్పానికి మంచి ఉదాహరణ. అందుకే వీరు రాసిన ఏ కథకు మరో కథతో సామ్యం అంటూ ఉండదు.          చాసో కథలు హిందీ, రష్యన్, కన్నడం, మరాఠీ, మలయాళం, ఉర్దూ భాషల్లోకి అనువాదమయ్యాయి. చాసో అవసరాన్ని మించిన వర్ణనలు చేయడు. పాఠకుడ్ని నేరుగా కథలోకి తీసుకెళ్తాడు. ఇతివృత్తం, స్పష్టత, కథనంలో సంక్షిప్తత, సహజత్వం, కళాత్మకత వీరి కథకున్న లక్షణాలని చెప్పాలి.  వీరి మొదటి కథా సంపుటి 1968లో వచ్చింది. తర్వాత వీరి 70వ జన్మదినం సందర్బంగా మరికొన్ని రచనలు ప్రచురించారు. వీరి కథలను విశాలాంధ్రవాళ్లు సంపుటిగా తీసుకొచ్చారు. చాసో గురించి జననీరాజనం, కథాశిల్పి చాసో అనే ప్రసిద్ధ రచనలు వచ్చాయి. అసలు చాసో  రచనలపై టాల్ స్టాయ్, గోర్కీ రచనల ఫ్రభావం ఉందంటారు విమర్శకులు. అలానే మార్క్సిజాన్ని అభిమానించే చాసో పీడిత వర్గపక్షపాతిగానే రచనలు చేశారు. కానీ ఎక్కడా సిద్ధాంతాన్ని రచనల్లో చొప్పించినట్లు కనపడదు.                    70 ఏళ్ల వయసులో మద్రాసులో ఉండగా గొంతు క్యాన్సర్ వచ్చి మరణించారు చాసో. మరణాంతరం శరీరాన్ని పరీక్షల నిమిత్తం మెడికల్ కాలేజీకి ఇచ్చిన ఆదర్శవాది. వీరి పెద్దకూతురు చాగంటి తులసి. తండ్రి పేరుమీద ట్రస్ట్ ఏర్పాటు చేసి కథను అభ్యుదయ పంథాలో ముందుకు తీసుకెళ్తున్న వారికి చాసో పేరిట ప్రతి ఏడాది అవార్డు ప్రధానం చేస్తున్నారు. ప్రముఖ విమర్శకులు శ్రీకాంతశర్మ అన్నట్లు- ఒక సన్నివేశానికి వుండే వివిధ కోణాలను పోల్చి, ఏ కొసనుంచి ప్రారంభిస్తే అది ఒక జీవన సూత్రానికి వ్యాఖ్యాప్రాయంగా వుంటుందో గ్రహించ గలిగేవాడే గొప్ప రచయిత. అటువంటి అపురూప లక్షణంగల కథా రచయిత చాగంటి సోమయాజులు.         చాసోకు ప్రకృతిని చూస్తూ ఆనందించడమంటే చాలా ఇష్టం. చీకటి చిరు వెలుగుల మధ్య, కొబ్బరి చెట్ల నీడలనీ, అరటి చెట్ల నీడలనీ, దట్టమైన రంగుల్నీ, గాలికి కదలాడే ఆ నీడల అందాలని చూస్తూ చుట్టకాల్చుకోవడం చాసోకు మహా ఇష్టం.           చాసోలోని వస్తువు, శిల్పం ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటాయి. అందుకే చాసోను తెలుగువారి చెఖోవ్ అంటారు. కథ రచన చేసే వాళ్లకు వారి కథలు పాఠాలవంటివి. - డా. ఎ. రవీంద్రబాబు

మహాకవి శ్రీ శ్రీ జయంతి సందర్భంగా పాటల నివాళి

  మహాకవి శ్రీ శ్రీ జయంతి  సందర్భంగా పాటల నివాళి    రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజదర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టివీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అందుకే ఆయన పేరు తెలియని  తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు. పేరు తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయన ఆంధ్రులందరికీ చిరస్మరణీయుడు. నేడు ఆ మహాకవి వర్థంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఆయనరచనల్లో1950లోప్రచురించబడిన'మహాప్రస్థానం'అనేకవితాసంపుటి తెలుగుసాహితీఅభిమానులమనసుల్లోనేకాకుండా..సామాన్యప్రజల గుండెల్లోకూడాచిరస్థాయిగానిలిచిపోతుంది. ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్నిశాసించిన మహాకవి శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధకవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవరచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నతెలుగు సాహిత్యంలో కవితను ఇలానిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవిలేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది అన్న బూదరాజురాధాకృష్ణ గారి మాటలు శ్రీశ్రీ సాహితీ ప్రజ్ఞ్య కి నిదర్శనాలు. 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. (మునిసిపల్ రికార్డుల ప్రకారం శ్రీశ్రీ పుట్టినరోజు ఏప్రిల్, 30, 1910. అయితే తాను ఏప్రిల్‌లో జన్మించినప్పటికీ  స్కూలు అవసరాల నిమిత్తం తన తండ్రి తన పుట్టినరోజును జనవరి 2, 1910 అని రాయించారని శ్రీశ్రీ తన ‘అనంతం’ పుస్తకంలో పేర్కొన్నారు. విప్లవ రచయితల సంఘం కూడా మునిసిపల్ రికార్డులను పరిశీలించి శ్రీశ్రీ పుట్టినరోజు ఏప్రిల్ 30, 1910 అని నిర్ధారించింది) శ్రీరంగం సూర్యనారాయణకు దత్తత వెల్లటం వలన ఈయనఇంటిపేరు శ్రీరంగంగా మారింది. 1935 లో విశాఖ లోని మిసెస్ ఎ వి ఎస్ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణిపత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు ఆయనరాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్పకవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశను మార్చిన పుస్తకం అది.1947 లోమద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఎన్నో సినిమాలకు పాటలు,మాటలు రాసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆసందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది. శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు. తన 18 వ ఏట 1928 లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించారు. ఈ రచనను సాంప్రదాయ పధ్ధతి లోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సువంటి వాటిని పక్కన పెట్టి వాడుకభాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం మొదలు పెట్టారు.  1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నతస్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవి ని చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టిఅనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియోనాటికలు రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకుతెలియదు. 1981 లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం కు ముందుమాటలో ఆయన ఈ విషయంస్వయం గా రాసాడు. తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయనరచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన తెలుగు వీరలేవరా.. అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజ తోకలిసి సినిమాలకు మాటలు రాసాడు. ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలోశ్రీశ్రీ మేటి. తెలుగు కవిత్వానికి దిశా నిర్దేశం చేసిన శ్రీ శ్రీ అమరుడు..  ఈ రోజు ఆ మహాకవి వర్థంతి సంధర్బంగా మరోసారి తెలుగు కవితా రథసారధికి అక్షర నివాళి అర్పింద్దాం.. శ్రీశ్రీ జయంతి సందర్భంగా చిన్న పాటల నివాళి శ్రీరంగం శ్రీనివాసరావు కంటే శ్రీశ్రీ అంటేనే ఠక్కున గుర్తుపడతారు తెలుగువారెవరైనా శ్రీశ్రీ గారిని. విప్లవ భావాలని, పదాల మాటున అంత శక్తివంతంగా ఇమిడేలా చేయగలగిన శ్రీశ్రీని కవిగా ఆరాధించేవారెందరున్నారో... మనసు, మమత, బంధాల గురించి అలతి అలతి పదాలతో అందంగా వర్ణించే శ్రీశ్రీని అభిమానించే సినీప్రియులు అందరే ఉన్నారు. వెయ్యికి పైగా తెలుగు సినీ గీతాలు  రాశారు శ్రీశ్రీ.  వాటిలో ఎన్నెన్నో ఆణిముత్యాల్లా ఇప్పటికీ మెరుస్తూనే ఉన్నాయి. శ్రీశ్రీ గారి పాటలనగానే ఆయన సాహిత్యంలా విప్లవభావాలతో రక్తాన్ని మరిగించేలా ఉంటాయనుకుంటాం. అయితే మనసున మనసై అంటూ మనసు భాషకి అర్థం చెప్పే పాటలు ఎన్నో రాశారు శ్రీశ్రీ. ఉదాహరణకి మాంగల్యబలం సినిమాలో '' వాడిన పూలే వికసించనే '' పాట వింటుంటే తెలియని ఆనందం మనసుని పట్టి ఊపెస్తుంది.    అలాగే మరొక ఉదాహరణ తీసుకుంటే ఆత్మగౌరవంలోని '' వలవు విరిసిన పూవులే '' పాట కూడా అంతే ! ఇక ప్రేమలేఖలు సినిమాలోని పుట్టినరోజు పాటలో ఓ మనిషి పుట్టుక అలాగే ప్రేమ పుట్టుకలని కలబోసి రాసిన విధానం నిజంగా అద్బుతమని చెప్పొచ్చు. '' ఈ రోజు మంచి రోజు మరపురానిది మధురమైనది..మంచితనం ఉదయించిన రోజు '' అనే పాటని జాగ్రత్తగా వినండి. ఎంత అందంగా రెండు భావాలని ఒకేపాటలో పలికించారో ! ఇక శ్రీశ్రీ మార్కు పాటల గురించి చెప్పేదేముంది చెప్పండీ. యమగోల లోని సమరానికి నేడే ప్రాంరంభం అంటూ అన్యాయంపై గళమెత్తిన పాట అయినా! సర్థార్ పాపారాయుడు చిత్రంలోని '' వినరా సోదరా '' పాట అయినా మనలో ఆవేశాన్ని పొంగించక మానవు. ఈ పాటలో '' ఒక యోధుని మరణం శత వీరుల జననం స్వేచ్చ నిమిత్తం చిందిన నెత్తురు వృధా కాబోదు '' ఈ మాటల తూటాలు నేరుగా మన గుండెల్లో పేలతాయి. ఇక మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పాట వింటుంటే రక్తం మరగటం అంటారే అదేంటో రుచి చూస్తాం మనం. శ్రీశ్రీ పాటల పూదోట ఏంతో విశాలమైనది. కొన్ని పాటల పరిమాళాలని పరిచయం చేసుకున్నాం. మరికొన్ని మరోసారి. ఆ మహానుభావుని జయంతి సందర్భంగా చిన్న పాటల నివాళి ఇది.

కథా యజ్ఞం చేస్తున్న మహర్షి కారా మాస్టారు

  కథా యజ్ఞం చేస్తున్న మహర్షి కారా మాస్టారు  కారా మాస్టారుగా మనందరం ఎంతో ఆత్మీయంగా పిల్చుకునే కాళీపట్నం రామారావు గారికి తొంభై వసంతాలూ కథే ఊపిరిగా, కథే ప్రాణంగా గడిచాయి. ‘యజ్ఞం’ కథ ద్వారా సాహిత్య లోకంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన మాస్టారుకు కథా రచనే ఓ ‘యజ్ఞం’. రాశికన్నా వాసికెక్కే కథల్నే రాసిన మాస్టారు గారి కథా రచనం, పాత్రల, సన్నివేశాల చిత్రీకరణ, ఆతరం సామాజిక, రాజకీయ స్థితిగతులకు అద్దం పట్టడమే కాక, భావితరాలు కథారచనం వైపు మొగ్గు చూపడానికి కథను కేవలం కథగా కాక ఆత్మతో రచన సాగించడానికే తోడ్పడిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కారా మాస్టారు వ్రాసిన జీవనధార, చావు, నో రూమ్, ఆర్తి కథల్లో ముక్కసూటితనం చదివేవారిని కట్టిపడేస్తుంది. అంతేనా, ఆ కథల్లో కనిపించే రచనా కౌశలం ఆ కథలు మనం మళ్ళీ మళ్ళీ చదివేలా లంగరేసి లాగుతాయ్. కథ వ్రాయడం ద్వారా ఓ అంశాన్నో, పాత్రల స్వభావాన్నో మనకు పరిచయం చేయడమే కాక, ఆ కథను చదవడం ద్వారా సమకాలీన సమాజంలోని ప్రజల స్థితిగతులు, జీవన విధానాన్ని వివిధ పార్శ్వాల్లో అర్థం చేసుకోగలిగేలా రచనకు ఓ చారిత్రక స్వభావాన్ని కల్పించడం రచయిత సామర్థ్యాన్ని, సామాజిక బాధ్యతను తెలియజేస్తాయి. మాస్టారు గారి ‘యజ్ఞం’ కథలో ఈ స్వభావం పుష్కలంగా కన్పించడమే కాదు. ఆ ‘కథే’ వివిధ రకాల సాహితీ చర్చలకు నాంది పలికింది. ఒక కథారచన రచయిత సృజనాత్మకత మీదే కాకుండా, సమకాలీన అంశాలను విశ్లేషించే విధంగా తయారయిందంటే ఆ కథలు తర్వాతి తరం వారికి ఒక రిఫరెన్సులా పనికొస్తున్నాయంటే ఆ కథలకు ఉన్న ప్రయోజనం ఏంటో విడిగా చెప్పనఖ్కర్లేదు. ముఖ్యంగా 1960లలో ఉత్తరాంధ్రలోని పరిస్థితులు, పోరాటాలు, తిరుగుబాట్లు లాంటి చారిత్రక అంశాలు కారా మాస్టారి రచనల్లోంచి మనకు ఆనాటి సమాజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాదు మాస్టారి ‘ఋతుపవనాలు’ కథా సంకలనం తెలంగాణలో వస్తున్న పోరాట కథలకు ఊతాన్నిచ్చిందని చెప్పటం అతిశయోక్తి కాదు. తొలుత కథలు రాయడం మొదలుపెట్టి రెండు, మూడు కథలు వ్రాసి ఆ తర్వాత తన శైలి నచ్చక వాటిని ముద్రణకు ఇవ్వకుండా వున్నా, మాస్టారు తర్వాతి కాలంలో వరుస కథలతో సాహితీ ప్రియులను మురిపించారు. తను సొంతంగా కథలు రాయడమే కాదు.. పదిమందీ సాహితీ సృజన చేసేట్టుగా ప్రోత్సహించడం వల్లే ఇవాళ ‘కథ’కు ‘పట్టం’ కట్టే ఇంతమంది రచయితలు మనచుట్టూ మెరుస్తున్నారు. అలాంటి కొత్త చివుళ్ళని చూసి ఇవాల్టికీ మురిసిపోతున్నారు కాబట్టే ఆయన మనందరికీ మాస్టారు... తొంభై ఏళ్ళ జీవితంలో ఎంతో సాహిత్యాన్ని, ఎందరో సాహిత్యకారులనీ దగ్గరగా చూసిన మాస్టారు ఇప్పుడు ‘కథానిలయం’ అంటూ స్థాపించి Internet ద్వారా సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పుస్తకాల్ని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను తన భుజాలపైనే వసుకున్నారు. ఇలాంటి సాహితీ దిగ్గజం మన కారా మాస్టారు ఈ తొంభై ఏళ్ళలో ఎంతో జీవితాన్ని, ఎన్నో అనుభవాల్ని సొంతం చేసుకుంటే ఆ వారసత్వాన్ని ముందు తరాలకు అందివ్వడం ఎలా అంటే మాస్టారు రచనల్ని మళ్ళీ చదువుకోవడం, మరింతమంది చదివేలా చేయడంతోపాటు... ఆ రచనల మీద మరిన్ని పరిశోధనల్ని, చర్చల్ని, విశ్లేషణలని జరపడమే మనం ‘ఉడుతాభక్తి’ని ప్రదర్శించుకోవడం. మాస్టారి పుట్టిన్రోజున భక్తితో... భావన   కారా మాస్టారు గారి గురించి మరికొన్ని సంగతులు చదవండి

కథా మహర్షి కారా మాస్టారికి జాతీయ అవార్డు

  కథా మహర్షి కారా మాస్టారికి జాతీయ అవార్డు ప్రముఖ తెలుగు కథా రచయిత, కారా మాస్టారుగా అందరూ పిలుచుకునే కాళీపట్నం రామారావు 2015 సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని మే 28న అందజేస్తారు. అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు పురస్కారం కూడా ప్రదానం చేస్తారు. కాళీపట్నం రామారావు 1924, నవంబరు 9న శ్రీకాకుళం లో జన్మించారు. కాళీపట్నం రాసిన 'యజ్ఞం' కథకు 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. కారా మాస్టారుగా మనందరం ఎంతో ఆత్మీయంగా పిల్చుకునే కాళీపట్నం రామారావు గారికి తొంభై వసంతాలూ కథే ఊపిరిగా, కథే ప్రాణంగా గడిచాయి. ‘యజ్ఞం’ కథ ద్వారా సాహిత్య లోకంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన మాస్టారుకు కథా రచనే ఓ ‘యజ్ఞం’. రాశికన్నా వాసికెక్కే కథల్నే రాసిన మాస్టారు గారి కథా రచనం, పాత్రల, సన్నివేశాల చిత్రీకరణ, ఆతరం సామాజిక, రాజకీయ స్థితిగతులకు అద్దం పట్టడమే కాక, భావితరాలు కథారచనం వైపు మొగ్గు చూపడానికి కథను కేవలం కథగా కాక ఆత్మతో రచన సాగించడానికే తోడ్పడిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కారా మాస్టారు వ్రాసిన జీవనధార, చావు, నో రూమ్, ఆర్తి కథల్లో ముక్కసూటితనం చదివేవారిని కట్టిపడేస్తుంది. అంతేనా, ఆ కథల్లో కనిపించే రచనా కౌశలం ఆ కథలు మనం మళ్ళీ మళ్ళీ చదివేలా లంగరేసి లాగుతాయ్. కథ వ్రాయడం ద్వారా ఓ అంశాన్నో, పాత్రల స్వభావాన్నో మనకు పరిచయం చేయడమే కాక, ఆ కథను చదవడం ద్వారా సమకాలీన సమాజంలోని ప్రజల స్థితిగతులు, జీవన విధానాన్ని వివిధ పార్శ్వాల్లో అర్థం చేసుకోగలిగేలా రచనకు ఓ చారిత్రక స్వభావాన్ని కల్పించడం రచయిత సామర్థ్యాన్ని, సామాజిక బాధ్యతను తెలియజేస్తాయి. మాస్టారు గారి ‘యజ్ఞం’ కథలో ఈ స్వభావం పుష్కలంగా కన్పించడమే కాదు. ఆ ‘కథే’ వివిధ రకాల సాహితీ చర్చలకు నాంది పలికింది. ఒక కథారచన రచయిత సృజనాత్మకత మీదే కాకుండా, సమకాలీన అంశాలను విశ్లేషించే విధంగా తయారయిందంటే ఆ కథలు తర్వాతి తరం వారికి ఒక రిఫరెన్సులా పనికొస్తున్నాయంటే ఆ కథలకు ఉన్న ప్రయోజనం ఏంటో విడిగా చెప్పనఖ్కర్లేదు. ముఖ్యంగా 1960లలో ఉత్తరాంధ్రలోని పరిస్థితులు, పోరాటాలు, తిరుగుబాట్లు లాంటి చారిత్రక అంశాలు కారా మాస్టారి రచనల్లోంచి మనకు ఆనాటి సమాజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాదు మాస్టారి ‘ఋతుపవనాలు’ కథా సంకలనం తెలంగాణలో వస్తున్న పోరాట కథలకు ఊతాన్నిచ్చిందని చెప్పటం అతిశయోక్తి కాదు. తొలుత కథలు రాయడం మొదలుపెట్టి రెండు, మూడు కథలు వ్రాసి ఆ తర్వాత తన శైలి నచ్చక వాటిని ముద్రణకు ఇవ్వకుండా వున్నా, మాస్టారు తర్వాతి కాలంలో వరుస కథలతో సాహితీ ప్రియులను మురిపించారు. తను సొంతంగా కథలు రాయడమే కాదు.. పదిమందీ సాహితీ సృజన చేసేట్టుగా ప్రోత్సహించడం వల్లే ఇవాళ ‘కథ’కు ‘పట్టం’ కట్టే ఇంతమంది రచయితలు మనచుట్టూ మెరుస్తున్నారు. అలాంటి కొత్త చివుళ్ళని చూసి ఇవాల్టికీ మురిసిపోతున్నారు కాబట్టే ఆయన మనందరికీ మాస్టారు... తొంభై ఏళ్ళ జీవితంలో ఎంతో సాహిత్యాన్ని, ఎందరో సాహిత్యకారులనీ దగ్గరగా చూసిన మాస్టారు ఇప్పుడు ‘కథానిలయం’ అంటూ స్థాపించి Internet ద్వారా సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పుస్తకాల్ని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను తన భుజాలపైనే వసుకున్నారు. ఇలాంటి సాహితీ దిగ్గజం మన కారా మాస్టారు ఈ తొంభై ఏళ్ళలో ఎంతో జీవితాన్ని, ఎన్నో అనుభవాల్ని సొంతం చేసుకుంటే ఆ వారసత్వాన్ని ముందు తరాలకు అందివ్వడం ఎలా అంటే మాస్టారు రచనల్ని మళ్ళీ చదువుకోవడం, మరింతమంది చదివేలా చేయడంతోపాటు... ఆ రచనల మీద మరిన్ని పరిశోధనల్ని, చర్చల్ని, విశ్లేషణలని జరపడమే మనం ‘ఉడుతాభక్తి’ని ప్రదర్శించుకోవడం.   కారా మాస్టారు గారి గురించి మరికొన్ని సంగతులు చదవండి

కానుక

    కానుక - ముళ్ళపూడి వెంకటరమణ తెలుగు కథా సాహిత్యంలో హాస్యాన్ని అందలం ఎక్కించిన కథా రచయితల్లో ముళ్లపూడి ఒకరు. పత్రికా రచనలో ప్రత్యేకతోపాటు కథా సాహిత్యంలోనూ హాస్యంతో పన్నీటి జల్లులు కురిపించారు. తెలుగుభాషపై ఉన్నపట్టుతో అనేక ప్రయోగాలు చేశారు. బుడుగు, రాధ, కాంతం వంటి వీరి పాత్రలు తెలుగువారికి సొంతమనుషులై పోయారు. మాటలతో గారడీలు చేయగల మళ్లపూడి బాపుతో కలిసి అనేక సినిమాలకు కథ, మాటలు అందించారు. రమణీయం, కోతికొమ్మచ్చి రచనలు వీరి చివరినాళ్లలో మరింత పేరు తెచ్చాయి. అలాంటి ముళ్లపూడి వెంకటరమణ హృద్యమైన శైలితో, పురాణ ఇతివృత్తాన్ని తీసుకొని కళాకారుడి గుండెను ఆవిష్కరించారు కానుక కథలో.       ఈ కథ చీకటి వర్ణనతో మొదలవుతుంది. మర్రిచెట్టు కింద గోపన్న మురళిని తయారు చేస్తూ ఉంటాడు. అలా మురళిని తయారు చేయడం ప్రారంభించి పాతిక సంవత్సరాలు అయింది. అప్పటి నుండి మురళిని తయారు చేసే పనిలో ఉన్నాడు గోపన్న. ప్రతి మురళిని తయారు చేసి ఊదుతాడు కానీ అందులో గోపన్న అనుకున్న సంగీతం పలకదు. శ్రుతి దొరకదు. వెంటనే దానిని పక్కన పడేసి మరో మురళిని తయారు చేయడానికి ఉపక్రమిస్తాడు. ఇలా అతను తయారు చేసిన మురళులు పక్కన గుట్టలు గుట్టులుగా పడి ఉంటాయి. వాటని ఎవరన్నా తీసుకెళ్తే కృష్ణుడి కంట పడతాయని  అటకమీద పడేస్తాడు. తెల్లారితో కృష్ణుడి పుట్టినరోజు రేపైనా మురళిని కృష్ణుడికి ఇవ్వాలని అనుకుంటాడు. అలా నిమగ్నమై ఉన్నప్పుడు కొడుకు వచ్చి బువ్వతినమని అడుగుతాడు. అతనికి ఆ మాటకూడా వినపడదు. బృందావనం, గోపికల అందెల రవళి, కృష్ణుడి మురళీనాదం మాత్రమే వినిపిస్తుంటాయి.           అసలు గోపన్న మురళి తయారుచేయడానికి వెనుక ఓ కథ ఉంది. గోపన్నఒకరోజు కృష్ణుడు వాయించే మురళీనాదాన్ని విని ముగ్థుడైపోతాడు. ఆ వంశీనాదాన్ని హృదయంలో పోసుకున్నాడు. ఆ పరిశుద్ధమైన స్వరాలలో ఒక్కొక్క స్వరాన్ని మనసులో నిలుపుకొని దాని విశ్వరూపం దర్శించడానికి తపస్సు చేశాడు. అదే మనసులో పదిలంగా దాచుకొని పరుగు పరుగున వచ్చికొత్త వెదురు కోసి, స్వర ద్వారాలు వేసి, మనసులో స్వరాన్ని అందులో పలికించబోయాడు. అలా పలికితే కృష్ణుడికి ఇవ్వాలనుకున్నాడు. కానీ అది పలకలేదు. అలా ఎన్నో వేల వేణువులు చేశాడు. చివరికి ఒకరోజు అంత మోహనమైన సంగీతాన్ని వెదురుముక్కలో కృష్ణుడు ఎలా ఇమిడ్చాడో తెలుసుకోవాలని దాన్ని దొంగతనం చేస్తాడు. కానీ గజదొంగ అయిన కృష్ణుడు సాయంత్రం కనపడి "నా మురళిని తీసుకపోయావు. మరొక మురళిని చేసిపెట్టు" అన్నాడు నవ్వుతూ. అప్పటి నుండి గోపన్నకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వేణువులు తయారుచేసే పనిలో కళాసృజనకు శ్రీకారం మొదలైంది.         అలా పాతికేళ్లు గడిచిపోయాయి. కృష్ణుడు పెద్దవాడై యమునాతీరానికి రావడం మానేశాడు. కానీ గోపన్న మాత్రం మురళిని తయారు చేయడం మాత్రం మానుకోలేదు. బిడ్డను కూడా సరిగ్గా పట్టించుకోలేదు. పాపం వాడే కాసింత గంజికాసి ఇచ్చేవాడు. ఈ పుట్టినరోజుకు కృష్ణుడికి మురళిని ఇవ్వాలని తయారు చేస్తాడు. ఊది చూసి, ఫర్వాలేదనుకొని దాన్ని కొడుక్కు ఇస్తాడు. తెల్లవారి కొడుకును కృష్ణుడిలా అలంకరణచేసి, ముద్దుపెట్టుకొని- "పిల్లనగ్రోవి తీసుకురా కృష్ణుడికి ఇద్దువు" అని చెప్తాడు. కానీ కొడుకు దాన్ని "అటకమీద పెట్టాన"ని చెప్తాడు. "ఎంత పనిచేశావురా" అని, అటకమీద ఉన్న మురళులు అన్నీతీసి ఒక్కోదాన్ని ఊది, తను ఇద్దామనుకున్న మురళిని వెదుకుతాడు. సాయంత్రం అవుతుంది. కానీ మురళి మాత్రం దొరకదు. చివరకు రెండు మాత్రమే మిగులుతాయి. ఒకదాన్ని చూసి, ఇక రెండోదాన్ని చూడలేక- పరీక్షించే ధైర్యం లేక కొడుక్కు ఇచ్చి పంపిస్తాడు గోపన్న. తన పాతిక సంవత్సరాల కృషి చివరకు అలా జరిగినందుకు నీరసంగా పడుకుని, కృష్ణుడు ఏమనుకుంటాడో అని పరిపరి విధాలా ఊహించుకుంటుంటాడు.         ఒక్కసారిగా తను పనికిరావు అనుకున్న మురళులు అన్నీ వాటికవే పలకడం మొదలుపెడ్తాయి. అద్భుతమైన స్వరాలు పలుకుతాయి. అది బృందావనంలోని కృష్ణుడి వేణుగానంలా తోస్తుంది గోపన్నకు. కొడుకు చిన్న గోపన్న తిరిగి వస్తాడు. కొడుకు కూడా బాల కృష్ణుడిలా కనిపిస్తాడు. "నీవు తయారు చేసి ఇచ్చిన మురళి కృష్ణుడు వాయిస్తే శబ్దమే రాలేదు" అని చెప్తాడు. వెంటనే ఇంతవరకు తన కుటీరంలో స్వరనాదం చేసిన మురళిని తీసు ముద్దపెట్టుకుంటాడు గోపన్న.          కళాసృజనలో మేటికోసం తపించే కళాకారుడి హృదయాన్ని వెంకటరమణ అద్భుతంగా ఆవిష్కరించాడు ఈ కథలో. ముళ్లపూడివారి శైలి దీనికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. హృద్యమైన భాష, అలౌకికమైన మురళీనాద వర్ణనలు ఈ కథకు ఎస్సెట్స్. ఈ కథ తెలుగు సాహిత్యంలో హాస్యానికే పరిమితమైన ముళ్లపూడి వారిలోని మరో రసావిష్కరణ కోణాన్ని తెలియజేస్తుంది.    - డా. ఎ.రవీంద్రబాబు

గురకానందం

  గురకానందం    తెలుగు సాహిత్యంలో ప్రధానంగా చెప్పుకోదగిన వచన కవితా రచనలు విష్ణుధనువు, నవమి చిలుక. వీటిని రచించిన కవి శిష్ట్లా ఉమామహేశ్వరారవు. అద్భుతమైన ఊహలు చేయడంలో, వాటిని కవిత్వపు అక్షరాలుగా మార్చడంలో వీరికి వీరే సాటి. ప్రముఖ విమర్శకులందరూ వీరి కవితా రచనలను మెచ్చుకున్న వారే. అలాంటి ఉమామహేశ్వరరావు కథలు రాశాడని చాలా మందికి తెలియదు. సిపాయి కథలు, ఆంగ్లో ఇండియన్ కథలు వీరు రాసిన ఆణిముత్యాలే. అదీగాక వీరి కథలు హాస్యపు జల్లులు కురిపిస్తాయని, పొట్టచెక్కలయ్యేలా నవ్వును పుట్టిస్తాయని కూడా తెలియదు. అయితే వీరి గురకానందం కథ హాస్యాన్నే కాదు, హాస్యంతో పాటు అద్భుతమాన ముగింపుతో మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. గురకానందం కథ చాలా విచిత్రంగా మొదలవుతుంది. అసలు ఆనందరావు పుట్టగానే పేరుపెట్టడంలోనే తల్లిదండ్రుల మధ్య చర్చ జరుగుతుంది. తల్లి- "వాళ్లమ్మ అచ్చమ్మ, నాన్న రామయ్యల పేర్లు కలిసుండేలా అచ్యుతరామయ్య అనే పేరు పెడదామని" అంటుంది. తండ్రి- "తెల్లవాళ్ల దేశంలో కూడా జాతకాలు పాటిస్తున్నారని చెప్పి చివరకు ఆనందరావు" అని పేరు పెడతాడు. అలాంటి ఆనందం బి.ఏ. చదవడానికి పట్నం వెళ్తాడు. ఆనందం గురకకు భయపడి ఎవరూ అతని రూములో చేరరు. చివరకు ఒక్కడికే రూమ్ లో ఉండాల్సి వస్తుంది. అయితే ఆనందరావును వెక్కిరించడం, గురకను ఎగతాళి చేయడం తోటి విద్యార్థుల్లో మొదలైంది. ఒక అరవ కుర్రాడు "ఎన్నడా గురకారావ్" అని పిలిస్తే అది నచ్చని తెలుగు వాళ్లు "గురకానందం" చేశారు. అలా ఆనందారావు కాస్తా గురకానందంగా మారిపోయింది. హాస్టల్ కుర్రాళ్ల బాధ ఇలా ఉంటే ఇక భార్య సుశీల బాధ వర్ణనాతీతం. శోభనం రోజు రాత్రే గుండెల్లో రాయిపడింది. అసలు మొదట్లో గురక ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కునే ప్రయత్నం చేసి చివరు అది భర్తనుంచి వచ్చేశబ్దం అని తెలిసి విస్తుపోయింది.  రెండోరోజే కన్నీళ్లతో భర్తగదిలోకి అడుగు పెడుతుంది. భర్తచేత గురక మాన్పిద్దామనుకున్న సుశీల ప్రయత్నం అప్రయత్నంగానే మిగిలిపోయింది. ఇక ఓ నిర్ణయానికి వచ్చేసి, పుట్టింటికి వచ్చేసింది. ఆఖరకు సుశీల అమ్మ సలహా కూడా ఇచ్చింది." కిటికి అవతల గాడెదను కట్టేసి ఆ అరుపను వినిపించ"మని, సుశీల ఆ ప్రయత్నం చెయ్యలేదు కానీ భర్త దగ్గరకు మాత్రం వెళ్లనంది. గురకానందం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్ల కాపరానికి కూడా వచ్చింది. సుశీలకు బాగలేక ఆసుపత్రిలో జేరితే అక్కడే ఆనందరావుకు భార్యగా వచ్చిన రెండో పిల్ల పరిచయం అవుతుంది. ఆనందారావు గురక పెట్టడం లేదని చెప్తుంది. దాంతో సుశీల అమ్మ నాన్న సుశీలను కాపరానికి పంపాలని నిర్ణయించుకొని ఓ ప్లాన్ వేస్తారు. ఇంట్లో సుశీల నిద్రపోయేటప్పుడు కావాలని ఇద్దరూ గురకపెడుతున్నట్లు నటిస్తారు. అది విని సుశీలకు విసుగొస్తుంది. రోజు రోజుకు పెరిగే గురకశబ్దాలు వినలేక సుశీల కాపురానికి వెళ్తాననే నిర్ణయానికి వస్తుంది.  తల్లిదండ్రులు రాజీ మాటలు సాగించి ఆనందరావు దగ్గరకు మళ్లీ సుశీలను పంపుతారు. ఓ రోజు తండ్రి సుశీలను చూడ్డానికి వచ్చి, "నిన్ను కాపురానికి పంపడానికి గురక తంతువాడం. కానీ మీ అమ్మకు గురక అలానే అలవాటైంది. నేను పడలేకపోతున్నాను" అని తన గోడు వెళ్లబోసుకుంటాడు. సుశీల తండ్రి గురకతో ఆనందానికి నిద్ర లేకుండా పోతుంది. ఎప్పుడు మీ నాన్న ఊరికి వెళ్తాడు అని అడుగుతాడు.  అలానే సుశీల కూడా గురక పెడుతుందన్న విషయాన్ని ఆనందరావు చెప్పడంతో... కథ ముగుస్తుంది. ఇలా కేవలం గురక వల్ల ఇతరులు పడే కష్టాన్ని ఇతివృత్తంగా తీసుకొని పూర్తి హాస్యంతో రాశారు కథను ఉమామహేశ్వరరావు. ఆనందరావు పేరు పెట్టడం నుంచి, గురక వల్ల భార్యాభర్తలు విడిపోవడం, ఆనందరావురెండో పెళ్లి, తల్లిదండ్రులు గురకతోనే భార్యాభర్తల్ని కలపాలన్న పన్నాగం, చివరకు సుశీలే గురకపెట్టడం... ఇలా ప్రతిది ట్విట్ ఫర్ టాట్ లా సాగుతుంది. కథ మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. పాత్రోచిత భాష మరొ గొప్ప లక్షణం. ఇలా ఈ కథను ఇప్పుడు చదివినా గురక వల్ల పడే బాధ ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చి మన ముఖంలో కూడా నవ్వులు పూస్తాయి. -డా. ఎ.రవీంద్రబాబు

బీనాదేవి

  బీనాదేవి          తెలుగు సాహిత్యంలో కలంపేర్లతో రచనలు చేసిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ భార్యాభర్తలు ఇద్దరూ ఒకే కలం పేరుతో రచనలు చేసే సంప్రదాయానికి వీళ్లే ప్రథములు అని చెప్పాలి. వాళ్లే బీనాదేవి. భాగవతుల నరసింగరావు, భార్య భాగవతుల త్రిపుర సుందరి. వీళ్లిద్దరూ కలిసి బీనాదేవి పేరుతో కథలు, నవలలు రాశారు. భర్త నరసింగరావు చనిపోయే వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. నరసింగరావే రచనలు చేస్తున్నారని పాఠకులు భావించేవాళ్లు. అయితే బీనాదేవి రచనలు రావిశాస్త్రి రచనల్లా ఉంటాయనేది చాలామంది అభిప్రాయం. కానీ అనుకరణలు కావు కేవలం అతని రచనా వ్యక్తిత్వాన్ని తెలిపే వారసత్వానికి బీనాదేవి ప్రతినిధి అని కొడవటిగంటి కుటుంబరావు గారే చెప్పారు.         నరసింగరాజు ఆగస్టు 25, 1924లో జన్మించారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. త్రిపురసుందరి ఫిబ్రవరి 11, 1935న జన్మించారు. వివాహం అయిన తర్వాత భర్త ఉద్యోగరీత్యా త్రిపురసుందరి కూడా తెలుగు ప్రాంతమంతా తిరగవలసి వచ్చింది. విశాఖపట్నంలో జన్మించిన త్రిపురసుందరికి కర్ణాటక సంగీతమంటే ఇష్టం. అంట్లు తోముకునే ఆడపిల్లకు  ఆల్జీబ్రా ఎందుకు అనే రోజుల్ని, సంఘటనల్ని అధిగమిస్తూ, నలుగురు పిల్లలు పుట్టినా లెక్కచేయకుండా ప్రైవేటుగా చదివి బి.ఎ. పట్టా పుచ్చుకుంది. భర్తతో కలిసి రచనలు చేసి, 1990లో ఆయన చనిపోయిన తర్వత కూడా అదేపంథాలో రచనలు చేసింది. వీరి రచనలు ఫస్ట్ కేఫ్ 1960లో, ఎమేటరాఫ్ నే ఇంపార్టెన్స్ 1972లో, రాధమ్మపెళ్లి ఆగిపోయింది 1975లో, డబ్బు డబ్బు డబ్బు 1975లో, హరిశ్చంద్ర మతి 1980లో, బీనాదేవి కథలు - కబుర్లు 1998లో సంపుటాలుగా వచ్చాయి. బీనాదేవి కథలు - కబుర్లు భర్త చనిపోయిన తర్వాత భార్య ప్రకటించిన రచన.  త్రిపుర సుందరి 90ల తర్వాత కథలు, వ్యాసాలు కూడా రాసింది. వీరి రచనలకు అనేక పోటీలలో బహుమతులు వచ్చాయి.                 వీరి రచనల్లో ఎక్కువ ఉత్తరాంధ్ర మాండలికం కనిపిస్తుంది. కథ, పాత్రలు కూడా వస్తువు తగినవిధంగా ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. రావి శాస్త్రి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అలానే పుణ్యభూమి కళ్లుతెరు వీరు రాసిన గొప్ప నవల. మరో నవల హేంగ్ మీ క్విక్ పై మార్క్సిజం ప్రభావం కనిపిస్తుంది. రాజ్యం, దాని ప్రభావం, వ్యక్తులపై అది చేసే దోపిడీని సజీవ దృశ్యాలుగా ఈ నవల మనకు చూపిస్తుంది. సమాజంలోని ప్రజల సంవేదనల్ని వీరి రనచలు వస్తువుగా స్వీకరించాయి. న్యాయస్థానాల్లో కేసులు ఓడిపోయిన నిజాయితీ పరులైన పేదలు, వారి కష్టాలు వీరికి కనిపించాయి. అందుకే బీనాదేవిది ప్రజల పక్షం అని చెప్పాలి. వీరి రచనలు ఎంత సామాన్యంగా ఉంటాయంటే... 1967లో రచించిన ఫస్ట్ కేస్ కథలో-          ఆనందరావు డాక్టరు. అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉంటాడు. మిత్రుడి కోరికపై ఓ పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ ఓ పేదపిల్ల తన చెల్లికి వైద్యం చేయమని ప్రాదేయపడుతుంది. కాదన లేక వెళ్తాడు. ఆ అమ్మాయి రోగానికి మందు ఆకలి తీర్చడమే అని తెలుసుకుని తనదగ్గరున్న హార్లెక్స్ ను చెల్లికివ్వమని అక్కతో పంపిస్తాడు. తీరా ఆనందరావు పేషంట్ దగ్గరకు వెళ్లే సరికి ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. అక్క కనపడదు. ఆనందరావుకు కోపం వస్తుంది. వెతికుతాడు. చివరకు ఆ హార్లెక్స్ పాలు అక్క తాగిందని తెలుస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి పక్కన ఉన్న పాములాగే  కనిపిస్తుంది ఆనందరావుకు.  ఆకలికి బంధుత్వాలు, ప్రేమలు ఉండవని తెలుసుకున్న డాక్టరు విస్తుపోతాడు. వీరిది బీనాదేవీయం మరో గొప్ప రచన, దీనిలో త్రిపురసుందరి వ్యక్తిగత జీవితాన్ని, కౌటుంబిక జీవితాన్ని వివరించే ప్రయత్నం చేశారు.            1972లో బీనాదేవికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి సమగ్ర రచనలను మనసు ఫౌండేషన్ వాళ్లు ముద్రించారు. వీరి కథల్లో కొన్ని చెప్పవలసి వస్తే- ఆత్మహత్య, అసలు లేని వడ్డీ, అతడు ఆమె, అవు పులి, ఇది కథకాదు, రిబ్బను ముక్క,  ఏదిక్రమం, ఉద్యోగపర్వం, అందాలూ అనుభవాలూ, అదృష్టహీనుడు, ఔను అమ్మ చచ్చిపోయింది, కుంకుమ ఖరీదు పదివేలు... .... ఇలా చాలానే ఉన్నాయి. వాస్తవాన్ని రచనలుగా చేస్తూ, దోపిడీని, రాజ్య స్వభావాన్ని ఎండగడుతూ నిత్యం చైతన్య వంతమైన రనచలు కావాలంటే బీనాదేవి రచనలు చదవాల్సిందే. అంతేకాదు రావిశాస్త్రి గారిని తెలుగు ప్రజలు మర్చిపోకుండా ఉండాలన్నా బీనాదేవిని గుర్తుపెట్టుకోవాల్సిందే.  - డా. ఎ.రవీంద్రబాబు

వాసిరెడ్డి సీతాదేవి

   వాసిరెడ్డి సీతాదేవి           స్వాతంత్ర్యానంతంరం తెలుగు కథకుల్లో, నవలా రచయిత్రుల్లో వాసిరెడ్డి సీతాదేవిది ప్రముఖమైన పాత్ర. సామాజిక వాస్తవికతకు కళాత్మకను జోడించి, అందమైన శిల్పంగా మార్చగల ప్రతిభ ఆమెది. ఎన్నో విలువైన, అమూల్యమైన నవలల్ని, కథల్ని రచించడంతోపాటు కొన్ని ఉన్నతమైన పదవులు కూడా నిర్వహించారు. ఎక్కువగా సమాజంలో దిగువ తరగతి జీవితాల గురించి, మానసిక స్థితుల గురించి,1970-90 ల మధ్య తెలుగు సమాజం గురైన మార్పులను జాగ్రత్తగా తన రచనల్లో పొందుపరిచారు.             వాసిరెడ్డి సీతాదేవి  తండ్రి రాఘవయ్య, తల్లి రంగనాయకమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని చేబ్రోలు వీరిది. సాంప్రదాయమైన కుటుంబం. బయటకు వెళ్లాలంటే ఘోషా లాంటిది ధరించే వెళ్లే వాళ్లు. అలాంటి కుటుంబంలో సీతాదేవి డిసెంబరు 15, 1933లో జన్మించారు. గుర్రం బండికి చుట్టూ పరదా కట్టుకొని బడికి వెళ్లేది. అలా ఐదో తరగతి వరకు చదువుకొన్నది, తర్వాత మద్రాసు వెళ్లడంతో అక్కడ ప్రైవేటుగా హిందీ చదువుకొంటూ సాహిత్య రచన వరకు పూర్తి చేశారు. అంతేకాదు ప్రైవేటుగానే నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఆ తర్వాత ఎం.ఎ. కూడా చదువుకుంది              సీతాదేవి 1950లో సాహిత్య రచన ప్రారంభించారు. మొదటి సారిగా జీవితం అంటే అనే నవల రాశారు. మొదటి కథ సాంబయ్య పెళ్లిని 1952లో రాశారు. మొత్తంగా వీరు 39 నవలలు, వందకు పైగా కథలు రాశారు. సాంబయ్య పెళ్లి కథలో కురూపి, దరిద్రుడు అయిన సాంబయ్య, మూగదైన మేనకోడల్ని పెళ్లిచేసుకుంటాడు. కానీ ఆమె మూగదని తెలుసుకొని దూరమై, చివరకు దగ్గరవుతాడు. ధర్మదేవత గుడ్డికళ్లు కథలో భర్త భార్యను కొట్టడం సహించలేని ఇరుగుపొరుగు భర్తను జైలుకు పంపిస్తారు. జైల్లో పరిచయం అయన వ్యక్తి ద్వారా తన తప్పు తెలుసుకుంటాడు భర్త. ఎల్లమ్మ తెల్లరూపాయి కథ మద్రాసులో కారేజీలు మోసే స్త్రీజీవితాన్ని మరింత హృద్యంగా చిత్రించింది. తరాలు అంతరాలు కథలో స్వాతంత్ర్యానంతరం స్త్రీల జీవితాల్లో వస్తున్న మార్పును తెలియజేశారు. సత్ చిత్ ఆనంద్, ధర్మాసనం కథలో స్వాముల ఆశ్రమాల్లో జరుగుతున్న అక్రమాలను, లొసుగులను ఎత్తి చూపారు. ఇలా వీరి కథల్లో వస్తువు సమాజంలోని అన్ని కోణాలను మనకు విశధీకరిస్తుంది. ఇంకా ఉద్యోగాలు చేస్తున్న స్త్రీల జీవితాలు, మూఢనమ్మకాలతో ప్రజలు పడుతున్న అవస్థలు కనిపిస్తాయి. వీరి కథల్లో ఉపన్యాసాలు ఉండవు. సూటిగా చుక్కానిలా సాగుతుంటాయి. అవసరాన్ని బట్టి సీతాదేవి గ్రామీణభాషను కూడా చక్కగా ప్రయోగించింది కథల్లో.           మరీచిక, ఉరితాడు, వైతరణి, మృగతృష్ణ, అడవి మల్లె, ఊర్మిళ, బొమ్మరిల్లు, నింగినుండి నేలకు, ప్రతీకారం, తొణికిన స్వప్నం...ఇలా ఎన్నో నవలలు మనకు అందించారు వాసిరెడ్డి సీతాదేవి. వీరి నవలలు కుటుంబ వాతావరణంలో వస్తున్న మార్పులను ఒడిసి పట్టుకున్నాయి. చిన్నతనంలో బాల్యంలో పడిన ముద్రలు జీవితాంతం ఎలా వెంటాడతాయో చాలా నవలల్లో చిత్రీకరించారు ఈమె. మానినీ  నవలలో సావిత్రి తన మామ, అత్తను కొట్టడం, హిసించడం చూసి మగవారిపై అనుమానాన్ని పెంచుకుంటుంది. దాంతో స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేస్తుంది. మృగతృష్ణ నవలలో కూడా సునంద బాల్యం ఇలానే ఉంటుంది. మరీచిక నవల్లో శబరి తండ్రి చూపే అతిప్రేమ, తల్లి చేసే షాపింగ్ లతో ఆమె జీవితంలో అద్భుతాలు సృష్టించాలనుకొని డ్రగ్స్ కు బానిస అవుతుంది. సమత నవల రాజకీయాల్లోని కుళ్లను కడిగేస్తుంది. కాపురాన్ని, ఇంటిని వదిలిన స్త్రీజీవితాన్ని కూడా వివరిస్తుంది. మరీచిక నవల నక్సలైట్ ఉద్యమాన్ని చిత్రించింది. 1980లలో ఈ నవలను ప్రభుత్వం నిషేధించింది. అయితే కొంతమంది సాహిత్యకారుల అభిప్రాయాలతో మళ్లీ నిషేధాన్ని ఎత్తి వేసింది. రాబంధులు - రామచిలుకలు నవలలో భూస్వాముల దోపిడీ, వర్గపోరాటాన్ని అద్భుతంగా వివరించింది.                                                      వాసిరెడ్డి సీతాదేవి చిన్నారుల కోసం బుజ్జి కథలు కూడా రాశారు.          సీతాదేవి రచనలను విశాలాంధ్ర వాళ్లు 9 సంపుటాలుగా వెలువరించారు. యాభై కథల్ని ఒక సంపుటంగా తెచ్చారు. ప్రస్తుతం 5 సంపుటాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీరి నవలలు కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. సమత ప్రజానాయకుడు సినిమాగా, ప్రతీకారం నవల మనస్సాక్షిగా, మానినీ నవల ఆమెకథగా మృగతృష్ణ నవల అదే పేరుతో సినిమాలుగా వచ్చాయి. మట్టిమనిషి నవల 14 భాషల్లోకి అనువాదం పొందింది.          వీరికి ఐదుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయాలు గౌరవ డి.లిట్ లను ప్రధానం చేశాయి. తెలుగువిశ్వవిద్యాలయం జీవితకాల పురస్కారం కూడా ఇచ్చింది. వాసిరెడ్డి సీతాదేవి ఏప్రిల్13, 2007లో మరణించారు. కానీ ఆమె రచనలు, అవి సంధించిన ప్రశ్నలు మాత్రం మనల్ని జాగృతం చేస్తూనే ఉంటాయి. - డా. ఎ.రవీంద్రబాబు

ప్రమదాక్షరి ఉగాది హేల

ఉగాది పర్వదినం మరునాడు శ్రీమతి సోమరాజు సుశీలగారింట్లో ప్రమదాక్షరి సమావేశం జరపాలని నిర్ణయిచబడింది. ఉగాది రోజున ఎక్కడ చూసినా పంచాంగ శ్రవణాలతోపాటు కవి సమ్మేళనాలూ, కవితాగానాలూ, పండిత సన్మానాలూ జరుగుతూ వుంటాయికదా. కొత్త సంవత్సరం మొదలుకదా, మనం మాత్రం ఆ ఆనవాయితీని పోగొట్టటమెందుకు, మనలో అనేకమంది కవయిత్రులు వున్నారు, వారంతా కవితాగానం చెయ్యండి అన్నారు ఎడ్మిన్స్. మనవారిలో కూడా అనేక అవార్డులు పొందినవారున్నారుకదా, వారిని ప్రమదాక్షరి తరఫున సన్మానించుకుందాం, ఎవరెవరికి ఏ అవార్డులొచ్చినయ్యో, కిందటి ఉగాది నుంచీ ఇప్పటిదాకా ఏ ఏ బహుమతులొచ్చినయ్యో లిస్టు పెట్టెయ్యండి, ఫైల్ ఓపెన్ చేశానన్నారు భానక్క .. మరేనండీ .. భానక్కంటే శ్రీమతి మంధా భానుమతే మీరెవరూ దిష్టిపెట్టనంటే చెబుతాను...అదేం లిస్టండీ...ఏ ఒకరిద్దరికో తప్పితే అందరికీ బహుమానాలొచ్చాయి .. పైగా ఒకటికాదు రెండుకాదు .. కిందటేడు తెలుగు సాహిత్యంలో వున్న బహుమతులు మూడొంతులు పైన వీళ్ళదగ్గరే వున్నాయండీ. మీకు నమ్మకం లేకపోతే పత్రికలు తిరగెయ్యండి, లేకపోతే లిస్టు భానక్క దగ్గరుంది. వీరంతా మా ప్రమదాక్షరి మెంబర్లు, మా స్నేహితులు, వారితో మాకెంతో సాన్నిహిత్యమున్నది, వారితో మేమంతా సరదాగా గడుపుతాం అన్న భావనే నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాంటి మహానుభావులలో కొందరి పేర్లు...... శ్రీమతులు * ఆర్. శాంత సుందరి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత * సోమరాజు సుశీల, మాకు ఆతిధ్యమిచ్చిన ప్రముఖ రచయిత్రి * మంధా భానుమతి, ప్రముఖ రచయిత్రి, ప్రమదాక్షరి ఎడ్మిన్ * ముక్తేవి భారతి, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత * డి. కామేశ్వరి, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత * పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ హాస్య రచయిత్రి, ఈ సంవత్సరం మునిమాణిక్యంవారి హాస్య సాహిత్య అవార్డు గ్రహీత * కె.బి. లక్ష్మి, ప్రముఖ విశ్లేషకురాలు, కవయిత్రి, కధయిత్రి, సంపాదకురాలు, కాలమిస్ట్, వక్త. * అత్తలూరి విజయలక్ష్మి, ప్రముఖ రచయిత్రి. నాటికలు వీరి ప్రత్యేకత. కధలు, వ్యాసాలు, నవలలుకూడా వ్రాస్తారు. * పోడూరి కృష్ణకుమారి, ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత్రి * శీలా సుభద్ర, ప్రముఖ కవయిత్రి, చిత్రకారిణి, కధయిత్రి, గాయని * గంటి సుజల (అనూరాధ), ఈ సంవత్సరం సాహిత్యంలో అత్యధిక బహుమతులు అందుకున్న ప్రఖ్యాత రచయిత్రి * వారణాసి నాగలక్ష్మి, ప్రముఖ కధయిత్రి. వీరుకూడా తమ కధలకు బహుమతులు అందుకున్నారు. చిత్రకారిణి, కవయిత్రి, గాయకురాలు * తమిరశ జానకి, ప్రముఖ రచయిత్రి. అనేక కధలు, కవితలు, నవలలు రాశారు. అనేక పోటీలకు న్యాయ నిర్ణేతగా వున్నారు. ప్రముఖ అంతర్జాల పత్రిక సుజనరంజని సంపాదకవర్గంలో ఒకరు. ఈ సంవత్సరం మానసా ఆర్ట్స్ వారి పురస్కారాన్ని అందుకున్నారు. * జి.యస్. లక్ష్మి, హాస్య లక్ష్మి అని అందరం పిలుచుకునే ఈవిడ ప్రముఖ రచయిత్రి. తమ కధలకు అనేక బహుమతులు అందుకున్నారు. బ్లాగరి. * పి.యస్..యమ్. లక్ష్మి, యాత్రా వ్యాసాలేకాక కధలు, నాటికలు, కవితలు రాస్తారు. రచయిత్రులలో తెలుగులో ఇప్పటిదాకా అత్యదిక యాత్రా వ్యాసాలు వ్రాసిన రచయిత్రి. యాత్రలగురించి 6 ఇబుక్స్ ప్రచురించారు. * నండూరి సుందరీ నాగమణి, అనేక కధలు రాశారు. అంతర్జాలంలో అనేక కవితలకు బహుమతులు అందుకున్నారు. అంతర్జాల మాస పత్రికలో ప్రతి నెలా పజిల్స్ నిర్వహిస్తున్నారు. * మణి వడ్లమాని, ప్రముఖ కధా రచయిత్రి. తమ కధలకు బహుమతులు అందుకున్నారు. ఈ నెలలో 3 ప్రముఖ పత్రికలలో వారి కధలు ప్రచురించబడ్డాయి. * స్వాతి శ్రీపాద, ప్రముఖ రచయిత్రి. అనువాదం వీరి ప్రత్యేకత. అనేక కధలు, నవలలు రాశారు. ప్రముఖ కవయిత్రి. * వీరుకాక ఆ రోజు సమావేశంలో పాల్గొన్న విదుషీమణులు, ముచ్చర్ల రజనీ శకుంతల, శ్రీ రమణగారి శ్రీమతి జానకి, ప్రమదావనం ప్రోత్సాహంతోనే రచయిత్రులమయ్యామనే శ్రీమతులు మాలా కుమార్, బాలా మూర్తి, బి. ఉమా మహేశ్వరి ఇంకా ఎందరో. నేను మరచిపోయి పేర్లు పేర్కొననివారంతా నన్ను క్షమించాలి. * మరి సమావేశం ముచ్చట్లు చెప్పాలికదా...ఉదయం 10-40 కు బయల్దేరి నేను మాలా కుమార్, దోవలో కె.బి. లక్ష్మిని పికప్ చేసుకుని సోమరాజు సుశీల గారింటికి వెళ్ళాము. దోవంతా ఎన్నో కబుర్లతోబాటు ఎండలు పెరిగిపోతున్నాయి, * ఇంక ఎండల్లో బయటకి రాకూడదనే ఆపసోపాలూ అయినాయి, పగలంతా కూర్చోలేము వీలయినంత పెందరాళే వచ్చేద్దామనే నిర్ణయాలూ అయ్యాయి. ఉదయం 11-30కి సుశీలగారింట్లో అడుగు పెట్టాము. ఒక్కసారి ఎన్ని స్నేహ సుమ పరిమళాలో....మల్లెలు, జాజులు, సంపెంగలు, మొగలిపూలు, పొగడలు, చామంతులు, మాలతులు, మందారాలు, గులాబీలు ఇంకా ఎన్నో ఎన్నో సువాసనలు గుప్పుమన్నాయి. అర్ధమయిందా? అప్పటికే అక్కడ మన మిత్రులు వున్నారన్నమాట. వారి పలకరింపుల పరిమళాలవ్వి. పెద్దలు అతిధి దేవోభవ అనేవారు. పూర్వం అతిధులని ఆదరించటం గృహస్తు ధర్మాలలో ముఖ్యమైనవాటిలో ఒకటి. ఆతిధ్యమివ్వటం ఒక కళలాంటిది. ఈ మధ్య ఉరుకుల పరుగుల జీవితాలతో ఆ కళ కళ తప్పిపోతోంది. కానీ నిన్న సుశీలగారింట్లో కళకళలాడింది. వెళ్ళగానే మంచి నీరు ... ఎండనబడొచ్చారు, వెంటనే తాగద్దు, రెండు నిముషాలాగి తాగండి అనే మిత్రుల ఆప్యాయతతో, తర్వాత భానుడి ప్రతాప భారాన్ని తగ్గించే ఫ్రూట్ సలాడ్ ... కొంచెం చల్లబడ్డామో లేదో ఇంకొంచెం స్ధిమితపడండి అంటూ కొబ్బరి నీరు. మిస్సయినవారంతా ఖచ్చితంగా బాధ పడాల్సిందే. ఇవే కాదు, ఇంకా చాలా మిస్సయ్యారు మీరు. సభ్యులూ, అతిధులూ ఒక్కొరొక్కరూగా చేరుకుంటూ, కబుర్లు సాగుతున్న సమయంలో భానక్క సభ మొదలుపెట్టారు. ఇవాళ సమావేశంలో ముఖ్యంగా రెండు అంశాలున్నాయి. ఒకటి కవితాగానం, రెండోది పురస్కార గ్రహీతలకు సన్మానం. ముందు కవితాగానం. సభ్యులు చాలామంది తమ కవితలు వ్రాసుకు వచ్చి చదివి వినిపించగా, శ్రీమతి కె.బి. లక్ష్మి, పొత్తూరి విజయలక్ష్మి ఆశువుగా చెప్పి అలరించారు. ఇంకొక ముఖ్య అతిధి, మిధునం రచయిత శ్రీ రమణ, వారి వాక్చాతుర్యంతో సభ్యులను ఆకట్టుకుని కడుపుబ్బ నవ్వించారు. ఫ్రూట్ సలాడ్, కొబ్బరి నీళ్ళు, ఆప్యాయతలు, కవితాగానాలతో వచ్చిన శక్తి అంతా వీరి కవిత్వాలకీ, జోకులకీ నవ్వీ నవ్వీ ఖర్చు పెట్టేశాము. మధ్యాహ్నం 1-30 అవుతోంది. అందరూ భోజనాలకి లేవండి అన్నారు. ఎండాకాలం ఏమీ తినబుధ్ధి కావటం లేదు అనుకుంటూ ప్లేటు తీసుకున్నవాళ్లమంతా మారు వడ్డించుకోకుండా మానలేదంటే నమ్మండి. గుత్తి వంకాయ కూర, బీరకాయ కూర, పప్పు, పెరుగు పచ్చడి, గోంగూర పచ్చడి, ఆవకాయ, ముక్కల పులుసు, కుండలో తోడు పెట్టిన గడ్డ పెరుగే కాదు, బొబ్బట్లు, పులిహోర, మిర్చి బజ్జీ. బి.పీలు షుగర్లూ ఆ సమయంలో ఎవరికీ గుర్తు రాలేదు. వాటి రుచిని మెచ్చుకోనివారు లేరు. కేటరర్స్ ఎవరూ అని అడిగిన నాకు ఠక్కున సమాధానం వచ్చింది ..అవ్వన్నీ స్వయంగా శ్రీమతి సుశీలగారే చేశారు. హయ్యబాబోయ్ .. నేను కలలోకూడా చెయ్యలేని పని. కమ్మటి విందారగించిన తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి శాంత సుందరి, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతలు శ్రీమతి డి. కామేశ్వరి, ముక్తేవి భారతికీ, తర్వాత ప్రమదాక్షరిలో బహుమతుల గ్రహీతలతోబాటు ఈ సంవత్సరం అధిక రచనలు చేసినందుకు నాకు కూడా ప్రమదాక్షరి ఆత్మీయ సత్కారం జరిగింది. బహుమతిగా శ్రీమతి స్వాతి శ్రీపాద స్పాన్సర్ చేసిన అందాల కుంకుమ భరిణ, పుష్పంతో సహా ఇచ్చారు. అనురాగ పూరితమైన ఈ అత్మీయ సత్కారం అన్ని అవార్డులకన్నా మిన్న అనుకున్నాం అందరం. ఈ సందట్లో అందరికీ కూర్చున్న చోటికే కసటా ఐస్ క్రీంలు, తర్వాత కాఫీలు సరఫరా చెయ్యబడ్డాయి. కుళ్ళుకోకండని ముందే చెప్పా. ఈ కార్యక్రమాలయిపోయాక గ్రూప్ ఫోటో. ఓపికగా కార్యక్రమాన్నంతా ఫోటోలు తీసినవారు శ్రీ గంటి మూర్తిగారు. ఎంతో సందడిగా సాగిన కార్యక్రమాలు అయిపోయినా ఇంటికి రావాలనిపించలేదు అందరినీ వదిలి. అక్కడికీ వేరే కార్యక్రమాలున్నవారు కొందరు సెలవు తీసుకుంటున్నారు. ఎండల్లో ఎక్కడికీ వెళ్ళద్దని వచ్చేటప్పుడు డిసైడ్ చేసుకున్నవాళ్ళం, భానక్కా మళ్ళీ ప్రోగ్రాం ఎప్పుడు అని మొదలు పెట్టాము. కొంచెం సేపుండి వచ్చేద్దామనుకోవటమూ ఎవరికీ గుర్తు రాలేదు. నేనింకా ముచ్చట్లు పెట్టుకు కూర్చుంటే కె.బి. లక్ష్మి నా చెయ్యి పట్టుకుని లాక్కొచ్చేసింది. తనకి వేరే ప్రోగ్రాం వుందని ముందునుంచీ చెబుతూనే వున్నది మరి. అలా జరిగిన మా సాహితీ మిత్రుల సమావేశం అందరికీ పండగకన్నా ఎక్కువ ఆనందాన్ని పంచిన పండగ అయింది. .... పి.యస్.యమ్ - లక్ష్మి

అనువాద సాహిత్యంలో అగ్రగామి శ్రీమతి ఆర్. శాంతసుందరి

    అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఇంతవరకూ ఇద్దరు మహిళలకే లభించింది. ఆ ఇద్దరిలో ఒకరు 'శ్రీమతి ఆర్. శాంతసుందరి'. అనువాదం ఒక యజ్ఞంలా నలభై సంవత్సరాలుగా విరామం లేకుండా చేస్తున్న ఏకైక రచయిత్రి అని చెప్పవచ్చు. తమిళ రాష్ట్రంలో పెరుగుతూ, హిందీ భాషలో అత్యున్నత పరీక్షలో ఉత్తీర్ణురాలవడమే కాకుండా హిందీ సాహిత్యంలో లభ్యమయ్యే పుస్తకాలని వదలకుండా ఒక అనురక్తితో, ఆసక్తితో చదువుతూ భాష మీద మంచి పట్టు సాధించారు. తెలుగు సరే సరి మాతృభాష.. పుట్టి పెరిగింది సాహిత్య కుటుంబంలో. తండ్రి కొడవటిగంటి కుటుంబరావుగారి గృహమే ఒక సరస్వతీ నిలయం. సాహిత్యం నలుమూలలా నిలిచి ఉంటుంది. అటు మాతామహులింట కూడా అందరూ సాహితీ ప్రియులే, స్రష్టలే. అమ్మమ్మ కొమ్మూరి పద్మావతిగారు, పిన్ని ఉషారాణి భాటియాగారు, మేనమామ కొమ్మూరి సాంబశివరావుగారు గత శతాబ్దిలో పేరెన్నిక గన్న రచయితలు. కొమ్మూరి సాంబశివరావుగారి డిటెక్టివ్ నవలలు చదవని పాఠకులు ఆ తరంలో లేనే లేరంటే అతిశయోక్తి కాదు. అసాధారణ రచయితగా చదువరులను ప్రభావితం చేసిన చలంగారు పెద్దతాతగారు. ఆ మహామహుల పేర్లు వినడమే.. వారి రచనలు చదవడమే మహద్భాగ్యమైతే.. ఇంక వారితో నిరంతరం గడుపుతూ ఉంటే సాహిత్యం మీద అభిలాష కలగడంలో ఆశ్చర్యమేముంది? శాంత సుందరిగారు ఆ మాటే అన్నారు, వారిని కలిసినప్పుడు.. అక్షరాలు నేర్చినప్పటి నుంచీ పఠనాసక్తి సహజంగా కలిగిందని. ఇంటి నిండా ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు.. హిందీ ప్రచార సభ గ్రంధాలయం నుంచి హిందీ పుస్తకాలు.. ఆ సమయంలో వారు చదవని, తిరగెయ్యని గ్రంధమేదైనా ఉందంటే అది అలభ్యం అయుంటుంది.    వివిధ భాషలలో గ్రంధ పఠనం, ఆ యా గ్రంధాలలో వైవిధ్యం శాంత సుందరిగారిని అనువాద ప్రక్రియ వైపుకి ప్రభావితం చేశాయని చెప్పచ్చు. మొట్టమొదటి అనువాదమే తమిళ రాష్ట్రంలో పెట్టిన పోటీల్లో ప్రధమ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత వెనుతిరిగి చూడ లేదు శాంత సుందరి గారు.    తెలుగు యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్స్‍లర్ డాక్టర్ యన్. గోపీ గారి కవితలని హిందీ లోకి చాలా మంది అనువదించారు. వారిలో పి.హెచ్.డిలు కూడా ఉన్నారు. అయితే వేదిక మీద వార్త ఎడిటర్ డా. రాధేశ్యామ్ శుక్లా గారు “శాంతసుందరిగారి అనువాదం లాగ ఏదీ లేదు..” అంటూ కితాబు ఇచ్చారు. మంజుల్ పబ్లికేషన్స్ వాళ్ళ ఎడిటర్ వీరి అనువాదాలలోని భాష ప్రేమ్‍చంద్ భాషకి దీటుగా ఉందని మెచ్చుకున్నారు.    తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగుకీ, ఆంగ్ల భాష నుంచి తెలుగుకి వీరు చేసిన అనువాదాలు అనేకం. అరవై ఎనిమిది రచనలు పబ్లిష్ అయ్యాయి. అందులో నవలలు, వ్యాసాలు, కథలు.. మొదలైన వివిధ ప్రక్రియలున్నాయి. వీరి అనువాదాలని పబ్లిష్ చెయ్యడానికి ప్రచురణకర్తలు నేనంటే నేనని పోటీపడతారంటే అతిశయోక్తి కాదు. ఏ పుస్తకానికీ తనంత తానుగా పబ్లిషర్‍ని అడగడం కానీ, తానే స్వయంగా పబ్లిష్ చేసుకోవడం కానీ చెయ్యవలసిన అవసరం రాలేదంటే.. వీరి అనువాదాలలోని ప్రతిభ మనకి అర్ధం అవుతుంది. అందుకే మరి కేంద్ర సాహిత్య అకాడమీ వీరికి పురస్కారాన్ని అందజేస్తోంది.    శాంత సుందరిగారి వ్యక్తిత్వం గురించి రాయాలంటే ఎంతయినా రాయచ్చు. నిరాడంబరత, స్థిరమైన మనస్తత్వం, స్నేహానికి ప్రాణమిచ్చే తత్వం, కళ్ళతోనే ఆప్యాయతని తెలియజెయ్యగల నైపుణ్యం, శాంతం.. అన్నింటి కలయికే మన శాంత సుందరి. వారి సమక్షంలో వసంత ఋతువులో చల్లని చెట్లనీడలో సెలయేటి దగ్గరున్న అనుభూతి కలుగుతుంది. ఎంతో సహజంగా సాగి పోతుంది వారితో సంభాషణ.    సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయిన పుస్తకం, “ఇంట్లో ప్రేమ్‍చంద్”. భూమిక పత్రికలో ధారావాహికంగా వచ్చినప్పుడు పాఠకుల ప్రశంసలందుకుంది. అకాడమీ వారు పురస్కారాన్ని ఇచ్చేటప్పుడు ఏదో ఒక పుస్తకం పేరు చెప్పినప్పటికీ ఆ గ్రహీతల సాహిత్య సేవనీ, ప్రతిభనీ పూర్తిగా గణనంలోకి తీసుకుంటారని నా అభిప్రాయం.    శ్రీమతి శాంత సుందరి ప్రతీ అనువాదం పురస్కారానికి అర్హమైనవే. అయితే ఆ నాటి సామాజిక పరిస్థితులను వర్ణిస్తూ, సామాజిక స్పృహతో రచనలు చేసిన ఒక మహనీయుని గురించి.. వారి శ్రీమతి శివరాణీదేవి, నిత్యం, నిరంతరం వారి వారి చర్యలని, అనుభవాలనీ, అనుభూతుల్నీ కళ్ళకి కట్టినట్లు వివరించడం ఎంపికైన ఈ పుస్తకంలోని ప్రత్యేకత. అనువాదానికి పురస్కారం ఇచేటప్పుడు మూల కథా వైశిష్ట్యం కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా!   శ్రీమతి శివరాణీదేవి ప్రేమ్‍చంద్ కూడా, కొద్దో గొప్పో హిందీ సాహిత్యాభిలాషులందరికీ తెలిసిన రచయిత్రి. ప్రేమ్‍చంద్‍జీనే వారి శ్రీమతి పేరుతో రచించారనే అపప్రధని ఎదుర్కున్నట్లు కూడా రచయిత్రి చెప్తారు. ఒక దశలో రచనలు చెయ్యద్దని కూడా చెప్తారు ప్రేమ్‍చంద్‍జీ. కానీ కోకిల ని పాడద్దనీ, నెమలిని నాట్యం చెయ్యద్దనీ ఎవరైనా శాసించగలరా? అనువాదం ఏవిధంగా ఉందీ అని చెప్పటానికి మూలకథని చదవాలి. లేకపోతే న్యాయం చెయ్యలేము. నాకు హిందీ అక్షరమాల వచ్చినా అంతవరకే నా పరిజ్ఞానం. అయితే శాంతసుందరి పుస్తకం తీసుకుని చదువుతుంటే మూలకథలో భావం ఈ విధంగానే ఉంటుంది.. ఇంతకంటే ఏమాత్రం భేదించదు అని చదువరికి తెలిసిపోతూ ఉంటుంది. కనీసం ఐదు సంవత్సరాలనుంచీ శాంతసుందరిగారికి ఈ పురస్కారం రావాలని సాహితీ ప్రేమికులందరూ ఎదురు చూస్తున్నారు. ఆలశ్యం అయినా తొంభై సంవత్సరాల వయసుగల వారి తల్లిగారు, శ్రీమతి వరూధినీ కుటుంబరావుగారు ఆవార్త విని ఆనందించగలిగారని తృప్తి చెందాము అందరం.   “శాంతసుందరిగారు ఈ పుస్తకాన్ని తెనిగించాలని ఎందుకనుకున్నారు?” అదే ప్రశ్న అడిగాను నేను. ప్రేమ్‍చంద్ రాసిన పుస్తకం అంటే అర్ధం చేసుకోగలము. వారి భాష, భావ వ్యక్తీకరణ అనువాదకులని ఆకట్టుకుంటాయని విన్నాము. కానీ ఆట్టే పేరు లేని శివరాణీదేవి రాసిన పుస్తకం ఎంచుకోవడం ఆశ్చర్యమే!    ప్రేమ్‍చంద్‍జీ మనుమడు ప్రభోద్ కుమార్ స్వయంగా శాంతసుందరిగారిని, అనువదించమని అడిగారుట. అంటే ఆవిడ ప్రతిభ ప్రముఖ హిందీ రచయితల ఇళ్ళల్లోకి ప్రవేశించిందని మనకి తెలుస్తుంది. వీరు అనువాదాలకు ఇప్పటివరకూ అనేక పురస్కారాలు అందుకున్నారు. భారతీయ భాషా పరిషద్ (న్యూడిల్లీ), జాతీయ మానవ హక్కుల సంస్థ (న్యూడిల్లీ), తెలుగు విశ్వవిద్యాలయం (హైద్రాబాద్) నుంచి అందులో కొన్ని.   అనేక వ్యక్తిత్వ వికాస పుస్తకాలని ఆంగ్లం నుంచి తెలుగుకి, తెలుగు నుంచి హిందీకీ అనువదించిన శ్శాంతసుందరి తెలుగులో “విజయంవైపు అడుగులు” అనే పుస్తకాన్ని స్వయంగా రాశారు. మన గ్రంధాలలోని అనేక కవితలని ఉదహరిస్తూ.. వ్యక్తిత్వ వికాసానికి ఆంగ్ల పుస్తకాల మీదనే ఆధార పడనక్కర్లేదని తెలియజెప్పారు.ఆ రచన స్వప్న మాస పత్రికలో ధారావాహిక గా వచ్చింది.    ఆ కవితల సేకరణలోనే కాక, తన ప్రతీ రచననీ విశ్లేషించి, విమర్శించి.. ఒక్కోసారి సరిదిద్దుతూ అనుక్షణం శాంతసుందరిగారి వెంటే ఉండి ప్రోత్సాహ సహకారాలందిస్తున్న జీవిత భాగస్వామి శ్రీ గణేశ్ రావుగారి గురించి చెప్పుకోక పోతే ఈ వ్యాసం పరిపూర్ణం కాదు. శ్రీ రావుగారు న్యూఢిల్లీలో ఆంగ్ల అధ్యాపకునిగా, విమర్శకునిగా ముప్ఫైఐదు సంవత్సరాల పైగా ఉండడం శాంతసుందరిగారి అభిరుచికి దోహదం చేసింది.    శ్రీమతి శాంతసుందరి, గణేశ్ రావుగార్ల అమ్మాయిలు ఇద్దరూ విద్యాధికులు. అమెరికాలో నివసిస్తున్నారు. పెద్దమ్మాయి శ్రీమతి అరుణ యమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ చేసి, కంప్యూటర్ కోర్సులెన్నింటిలోనో నైపుణ్యం సాధించి పదహారేళ్ళు సాఫ్ట్ వేర్ రంగంలో పని చేశారు. చిన్నతనం నుంచీ చిత్రకళలో ఉన్న అభిరుచి, ఆసక్తితో అందులో ప్రావీణ్యత సంపాదించాలని నిశ్చయంతో ఉన్నత విద్యని అభ్యసిస్తున్నారు. తప్పకుండా చిత్రలేఖనంలో శిఖరాగ్రాలనందుకుంటారు. రెండవ అమ్మాయి శ్రీమతి సత్య, యమ్మెస్సీ బయాలజీ చేసింది. 11 ఏళ్ల వయసులో భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టి  30వ ఏట ధిల్లీ లో అరంగేట్రం చేసింది . అమెరికా లో కూడా  శారదాపూర్ణ శొంఠి గారు నృత్యం చేసే అవకాశం ఇచ్చారు . కొన్నాళ్ళు అమెరికా లో భరతనాట్యం నేర్పింది . ప్రస్తుతం అవసానదశలో ఉన్న  కేన్సర్ రోగులకి సేవలందించే హాస్పిస్ లో పని చేస్తోంది . శ్రీమతి శాంతసుందరి ఇంకా అనేక అనువాదాలు చెయ్యాలని, తెలుగు రచయితల ప్రతిభని దేశవ్యాప్తం చెయ్యాలని కోరుతున్నాను. మరొక్కసారి వారికి అభినందనలు.           మంథా. భానుమతి   *----------------------*

రాలిన సాహితీ తార.. రాళ్ళబండి

ఆయన ప్రముఖ సాహితీవేత్త. సాంస్కృతికశాఖలో పలు కీలక పదవులను నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి  డాక్టరేట్ తీసుకున్నారు. అష్టావధానం, నవరసావధానం, శతావధానం, ద్విశతావధానం సహా ఐదు వందలకు పైగా అవధానాలు నిర్వహించారు.  ఒంటరి పూలబుట్ట, పద్య మండపం, అగ్నిహింస, ఇది కవి సమయం వంటి అనేక పుస్తకాలు రాశారు. ఆయనే భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు రాళ్లబండి వెంకట ప్రసాద రాజు... మనందరికీ కవితా ప్రసాద్‌గా పరిచయం. భద్రాద్రి రాముని కళ్యాణం... ఆ రాముని గుణగణాలను, సీతమ్మ సుకుమార సౌందర్యాన్ని కవితా ప్రసాద్ మాటలలో వింటుంటే... సాక్షాత్తు ఆ శ్రీరామ చంద్రుడిని నేరుగా దర్శించినట్టే వుండేది. స్పష్టమైన ఉచ్ఛారణ, అనర్గళంగా మాట్లాడగలిగే వాక్పటిమా ఆయన స్వంతం. ఆయన మరణం సాహితీ జగత్తుకి ఒక తీరని లోటు. ఆయన స్మృతికి ‘తెలుగువన్’ నివాళులర్పిస్తోంది.   CLICK HERE FOR Rallabandi Kavitha Prasad at teluguone Photos

ఆయన జీవితం కళామయం

  ఆయన జీవితం కళామయం ఆయన ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా తీర్చిదిద్దిన ప్రముఖ రచయితలలో ఒకరు. ఆయన పత్రికా రచయిత, పత్రికా సంపాదకుడు, మొట్టమొదటి చలన చిత్ర కళా దర్శకుడు ,ప్రముఖ చిత్రకారుడు, మహా వక్త . ఆయన నవలలు తెలుగు నవలా సాహిత్యం లో మైలురాళ్ళు . కులపతి ఆయన బిరుదు.. అడవి ఆయన ఇంటి పేరు.. బాపిరాజు ఆయన పేరు . ఆయన 12 నవలలు రాసారు. అందులో ముద్రితాలు తొమ్మిది , అముద్రితాలు మూడు . అందులో నారాయణరావు ,తుఫాను,కోనంగి వంటి ఐదు సాంఘిక నవలలు , గోనగన్నారెడ్డి ,మధురవాణి ,హిమబిందు మొదలైన ఏడు చారిత్రక నవలలు . సాంఘిక నవలలని రాసి ఎంతగా మెప్పించ గలిగారో ..చారిత్రక నవలలని రాసి కూడా అంతే  మెప్పు పొందారు .   వీరి సాంఘిక నవలల్లో అగ్ర స్థానం లో నిలిచేది 'నారాయణరావు'  నవల. ఇది  పాత్ర ప్రధాన మైన నవల.  తెలుగునాట జమిందారుల కధ. సమకాలీన ఆంధ్ర సామాజికుల సమస్యల్ని ,భూ కామంధుల్ని, జమిందారీ వ్యవస్థ నిర్ములనాన్ని ,  ఆంధ్ర జాతీయ స్వతంత్రోద్యమాన్ని , గాంధీ  సిద్దాంతాల్ని ఈ నవలలో బాపిరాజు గారు ప్రతిబింబింప చేసారు . అలాగే కధని ఎంతో నేర్పుతో పాటకుల హృదయాలని తాకే లా తీర్చి  దిద్దారు. "నీకు పెండ్లి అయినదా ? ' అనే శీర్షికతో ఈ నవల ప్రారంభ మవుతుంది .ఈ శీర్షిక కిందే నారాయణరావు ,అతని మిత్రులు మనకి పరిచయం అవుతారు . నవల ఆద్యంతం పాటకులని కట్టి పడేస్తుంది. అందుకే ఈ నవలకి ఎన్నో బహుమతులు, గుర్తింపులు దక్కాయి. 1934  లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వారు నిర్వహించిన నవలా రచన పోటిలో ఈ నవలకి ఉత్తమ బహుమతి వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమి వారు వివిధ భాషల లోకి అనువదింప చేసారు . ఇక వివిధ విశ్వ విద్యాలయాలు ఈ నవలని పాట్య గ్రంధం గా కూడా పెట్టాయి.   బాపిరాజు గారికి  చిన్నతనం నుంచి గేయాలు  రాయటం అలవాటు . పిల్లల కోసం ..పిల్లల గేయాలని కూడా రాసారు. ఇక ఈయన రాసిన వచన కవితలు,  వచన కవితా లోకం లో ప్రత్యేక స్థానాన్ని పొందాయని చెప్పచ్చు .ఎన్నో వ్యాసాలు రాసారు ఆయన. భారతీయ చలన చిత్ర రంగంలో ప్రప్రదమంగా ఆంధ్రచలనచిత్ర కళా దర్సకత్వం వహించినవారు బాపిరాజు గారేనంటారు .సతీ అనసూయ ,ధ్రువ విజయం,మీరాబాయి ,చిత్రాలకి కళా దర్సకత్వం వహించారు. ఇక చిత్ర కళ విషయానికి వస్తే ఎన్నో ఉత్తమ కళా కండాల్ని సృష్టించారు .మంచి వక్తగా కూడా ఈయనకి పేరు.ఏ విషయం మీద అయనా శ్రోతల్ని అలరిస్తూ ,కమ్మని ఛలోక్తులతో గంటలు తరబడి ఉపన్యాసం ఇవ్వగల మహా వక్త. ఆయన సాహిత్య సంపద అంతా ఒక ఎత్తు . ఆయనొక ఎత్తు . అతనున్న చోట ఆనందం తాన్డవిస్తుందని , వారిది గొప్ప వ్యక్తిత్వమని పేరు.  అడవి బాపిరాజు గారి రచనలని ఒక్కసారి చదివి ఆ మాదుర్యాన్ని రుచి చూడాల్సిందే  తప్ప ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది . - రమ

సాహితీమేరునగధీరుడు

  సాహితీమేరునగధీరుడు డా|| జి.వి.కృష్ణరావు     సాహితీమేరునగధీరుడు, సాహిత్యమానకలశుడు డా||గవిని వెంకటకృష్ణరావుగారు అతిసామాన్య రైతుకుటుంబంలో అప్పటి తెనాలి తాలూక కూచిపూడి గ్రామంలో 1914లో జన్మించారు. వారి అమ్మగారికి చదువురాదు. తండ్రిగారు అతికష్టంమీద సంతకం చేసేవారట. నేటి నవయువతరం రచయితలకు ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చును. ఒకవేళ తెలిసినా వారి ప్రఖ్యాత నవల ''కీలుబొమ్మలు'' నవలా రచయితగా మాత్రమే తెలిసియుండవచ్చును. వివిధ సాహిత్య ప్రక్రియలలో వారు చేసిన కృషి రచయితగా యస్‌.యస్‌.యల్‌.సి నాటికే ఒక చిన్న నవల శతకం వ్రాసారని, కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ''వరూధిని'' అన్న  ఖండకావ్యం వ్రాసారని, నవలిక, నాటిక, నాటకాలు వ్రాసారని, అలంకార శాస్త్రాలు, పాక్‌, పశ్చిమదేశాల సాహిత్యతత్త్వ శాస్త్రాలను ఔపోసనపట్టారని, తత్త్వవేత్త జిజ్ఞాసువు, మీదుమిక్కిలి మానవతావాది అని బహుకొద్ది మందికి తెలుసు. ఇంతటి బహుముఖప్రజ్ఞ వెనుక బి.ఎ.డిగ్రీతో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ''స్టడీస్‌ ఇన్‌ కళాపూర్ణోదయం'' అన్న పరిశోధనాపత్రం సమర్పించి డాక్టరేట్‌ పట్ట పొందిన గవిని వెంకటకృష్ణయ్య డా||గవిని వెంకటకృష్ణరావుగా గణుతికెక్కుటలో ఆయన సాహిత్యకృషి, పట్టుదల ఆత్మవిశ్వాసం ఎంతగా ఉన్నవోమనం తేలికగా ఊహించుకొనవచ్చును. మార్క్సిస్టు దృక్పధంతో వ్రాసిన ఆయన ''కావ్యజగత్తు'' సాహిత్యవిమర్శ నాగ్రంథం విశ్వవిద్యాలయాలలో పాఠ్యగ్రంధంగా నిర్ణయించపబడింది. కాశీ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ డిగ్రీ కొరకు చేరినా, పరిస్థితుల  ప్రాబల్యం వలన పూర్తిచేయలేదు. 1941లో జర్నలిజం రంగంలో ప్రవేశించి నార్ల, శ్రీశ్రీలతోపాటు ''ఆంధ్రప్రభలో సబ్‌ఎడిటర్‌గా పనిచేశారు.  తెనాలి, వి.యస్‌.ఆర్‌. కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, పొన్నూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాలుగా, విజయవాడ ఆకాశవాణిలో స్పోకెన్‌ వర్డ్‌ ప్రొడ్యూసర్‌గా 1963 నుండి 1979 వరకు పనిచేశారు. ఆంద్రవిశ్వవిద్యాలయం సెనేట మెంబరుగా కూడ వ్యవహరించారు.  రేడియో ఉద్యోగంతో కుంటుపడిన ''పాపికొండలు'' నవలారచన ఆయన అనారోగ్య కారణాల వలన అసంపూర్తి నవలగా మిగిలిపోయినది. ఇది తెలుగువారి దురదృష్టం అని చెప్పక తప్పదు. ఆకాశవాణివిజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నపుడు ఆయన అనేక నూతన సాహిత్య ప్రక్రియలకు శ్రీకారం చుట్టారు. వ్యక్తిస్వతంత్ర విచారధార కల్గి ఉండాలని, ఆత్మసాక్షిగా మనోధర్మం ప్రకారం వ్యక్తులు నడుచుకొనని ఎడల అతడు పరిస్థితుల  చేతిలో కీలుబొమ్మ అయి బొమ్మలాగ ఆడవలసి వస్తుందని 1951లో వారు ప్రబోధిస్తూ వ్రాసిన ''కీలుబొమ్మలు'' నవలా ఆంధ్రనవలా సాహిత్యంలో సాహిత్య విమర్శకులు పేర్కొను ఆరు ప్రసిద్ధ నవలలో ఒకటి గుర్తించబడినది. ఈ నవల ఆంగ్లంలో ''(పప్పెట్స్‌)''గా అనువదింపబడి మాక్మిలన్‌ కంపెనీవారిచే ప్రచురింపబడినది. కాలం చెల్లని నవల కీలుబొమ్మలు విహారిగారి అభిప్రాయం. పాపికొండలు నవల ఆంధ్రప్రభలో సీరియల్‌గా వచ్చింది. అధికారం మనుష్యుల్ని ఎలా మదోన్మత్తుల్ని చేస్తుందో ఈ నవలలో వ్యంగ్య వైభవంతో రచించారు. డా|| జి.వి.కె. కేంద్ర సాహిత్య అకాడమీ వారి తరపున  ప్లేటో ''రిపబ్లిక్‌'' గ్రంధాన్ని ''ఆదర్శరాజ్యం'' పేరుతో తెలుగులో అనువదించారు. మార్క్సిస్టు దృక్పథంతో వ్రాసిన ''భిక్షపాత్ర'' నాటికి పదహారు భారతీయ భాషలలోకి అనువదింపబడి ఆకాశవాణి నుండి ప్రసారమయినది. ఆంధ్ర విశ్వవిద్యాలయం సిల్వర్‌జూబ్లీ వేడుకల సందర్భముగా ఆనాటికే ఓపెన్‌ ఎయిర్‌ థియేటరులో ప్రదర్శింపబడి ప్రేక్షకుల విశేష ప్రశంసలు అందుకున్నది. కాశీవిశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఇంగ్లీషు లిటరేచరు కోర్సులో చేరి, ట్యూషన్లతో పొట్టపోసుకుంటూ ఆంగ్లసాహిత్య అధ్యయనం చేసిన విషయం, ఒకప్పుడు జి.వి.కె. గారు యం.బి.బి.యస్‌. చదువుదామని విశాఖపట్నం వెళ్లి ఆసక్తిలేక తిరిగివచ్చిన విషయం బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆంధ్రప్రభ సంపాదకవర్గంలో పనిచేస్తున్న కాలంలో ప్రాయిడ్‌ సిద్ధింతాల ప్రాతిపదికగా ''జఘన సుందరి'' నవలిక వ్రాశారు. 1952లో తెనాలి కళాశాలలో పనిచేస్తున్న కాలంలో ఆర్యనాగార్జునుని గ్రంథాలను కొన్నిటిని పద్యాలుగా అనువదించగా అవిపోయాయి. ''విగ్రహవ్యావర్తిని'' మాత్రం తిరిగి అనువదించి విపుల భూమికతో ప్రచురించారు. రాగరేఖలు నవలలో తీయ తీయని సామెతలు కండగల తెలుగు పలుకుబడులు నిండుగా మెండుగా కనిపిస్తాయి. 1979లో వ్రాసిన ''బొమ్మ ఏడ్చింది'' నాటకంలో ఆర్య నాగార్జునల ఉపదేశం, సలహాలను పెడచెవినిపెట్టి గౌతమీపుత్ర శాతకర్ణి హిందూమత అనుమాయిగా బౌద్దుల్ని బాధిస్తూ దేశబహిష్కరణ శిక్ష విధిస్తాడు. అందుకు బౌద్ధుల ఆరాధ్య దేవత షట్పారమితాదేవి కంట కన్నీరు పెడుతుంది. వారి సందేశము ప్రస్తుత నాయకులు స్వీకరిస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. 1948లో ''రష్యాలో రైతు'' అన్న వ్యాసం జ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడింది. అందులో రష్యన్‌ రచయితలు గొగోల్‌, టర్గనీవ్‌, టాల్‌స్టాయి, డస్టో విస్కీ, గోర్కి, సివెంస్కీ మున్నగవారు రైతుల జీవితాలు, సమస్యలను ఎంత వాస్తవికతతో చిత్రించినది వివరించారు. డా||జి.వి.కె.గారి ''నవతోరణం'' సాహిత్యవిమర్శ, వ్యాసాల సంపుటి, తెలుగు సాహిత్యంలో చక్కటి పచ్చని మామిడి ఆకుల తోరణం. ''ఆదర్శశిఖరాలు'' నాటికల సంపుటి విలువలకు కాణాచి ''ఉదబిందువులు'' కథల సంపుటిలో మానవ మనస్తత్వ పరిశీలనతో మానవతా విలువలను పట్టం కట్టిన కథలు ఉన్నవి. ఇక కవిగా, గేయ రచయితగా డా||జి.వి.కె.గారి ప్రతిభ పాఠవముల పరిశీలన. కవిగా కావ్యఖండికలు ఆయన 1953-1963 మధ్యకాలంలో వ్రాశారు. వారి కావ్యాలలో ద్రాక్షాపాకం కంటే, నారికేళ పాకం పాలు హెచ్చు అని చెప్పక తప్పదు. ''వరూధిని'' 1935లో విద్యార్థిథలోనే వ్రాశారు. హిమాలయాల్లో దారితప్పిన ప్రవరాఖ్యుడు దారి చెప్పమని అడిగినప్పుడు వరూధిని యిచ్చే సుదీర్ఘసమాధానం ఈ ఖండకావ్యం. దీనిలో అల్లసాని పెద్దన గారి అల్లిక జిగిబిగి ప్రతిఫలించింది. ఈ ఖండకావ్యంలో డా||జి.వి.కె.గారిని అంతగా ప్రసిద్దిపొందని కవి కుమారుణ్ణి చూడదగును. ఉదాహరణగా ప్రాయపుటాడుదంట; యటు పైన సువర్ణవ పుర్విలాసికా మ్మాయమటంట మీద్రసుమ నఃప్రమదామణియంట; దానిపై నాయతచతురీగతవే చోత్యభినందితశీలయంట; తా నేయనురక్తివచ్చెనట యింకవిపర్యయమేలతెల్పుమా! అనే వరూధిని జి.వి.కె.గారి వరూధిని గౌతముడు అర్ధరాత్రివేళ ఇల్లువిడిచి వెళ్లిన వృత్తాంతం మూడు యామాలుగా ''శివరాత్రి'' ఖండికలో విభజింపబడినది. ఈ ఖండిక గోపిచంద్‌ గారికి అంకితం. కృష్ణదేవరాయల ఆస్థాన వైభవచిత్రణ, కవిరాజు ప్రశంస, ఆచార్య నాగార్జునుడు రాజుకు చెప్పిన హితోక్తులు చెప్పిన విథం చక్కటి ప్రసాద గుణం కల్గిన  ''నివేదన'' (పండిత గోపదేవ్‌ గారికి అంకితం) హృదయోల్లాసం కల్గించే ''బాల మేఘము'' ''ప్రాఢమేఘము'' మేఘవర్ణనలు ''శివరాత్రి''లో ఉన్నవి. ఎక్కువ కావ్యాలు వ్రాయక పోయినప్పటికి డా||జి.వి.కె.గారు ఉత్తమ తెలుగుకవులలో ఒకరని  డా|| పోరంకి. దక్షిణామూర్తిగారి అభిప్రాయం. ఇక గేయ రచయితగా డా||జి.వి.కె.గారిని చూద్దాం. 20వ శతాబ్ధపు పూర్వభాగంలో ఆయన వ్రాసిన ఈక్రింది గేయంవారి అభ్యుదయ భావాలకు దర్పణం. ఈగేయం ఆరోజుల్లో ఆంధ్రదేశంలోని అతిచిన్న పల్లెపట్టుకు కూడా ప్రాకిన విషయం బహుకొద్ది మంది సాహితీవేత్తలకు తెలుసు. ''ఎగరేయ్‌ ఎగరేయ్‌ ఎఱ్ఱ జెండా ధగధగ జ్యోతి థదిశనిండా కర్మాగారముగనికుహరమ్ములు జనమేసోత్తనిజయజయపెట్టగ  || ఎగరేయ్‌ || జాతివిభేదము విర్ణవిభాగము మతగతరోగము మాసిపోవగా జనమేకావలె జనమే వీరుడని ప్రభుత్వలక్ష్మి వరించరాగా || ఎగరేయ్‌ || పైగేయాన్ని పరిశీలిస్తే డా||జి.వి.కె. ఏనాడో జాతి, మత విద్వేషాలను, వర్ణపోరాటాలను తెగనాడిన గొప్ప మానవతావాదిగా గోచరించకమానరు.  ఆచార్య శ్రీమతి కె.మలయవాసినిగారు కొద్ది కాలము క్రితము నాగార్జున విశ్వవిద్యాలయం వారు ఏర్పాటు చేసిన ధార్మిక ఉపన్యాస ప్రసంగంలో ఆయన ''కౌముది'' అనే పత్రిక నడిపారని అది చేతితో తయారుచేసిన ముతక కాగితంపై ముచ్చటగా ముద్రించారని తెల్పినారు. ఆ సందర్భములో ఆమె ''కౌముది'' పత్రిక ప్రతి ఒకటి తనవద్ద కలదని ఆచార్య అబ్బూరి గోపాలకృష్ణగారు తనకు తెల్పినట్లు తమ ప్రసంగ వ్యాసంలో తెల్పినారు. 1979లో తెనాలిలో జరిగిన తన సన్మానమునకు ఆయన వ్రాసిన జవాబు ''కృష్ణార్పణం'' తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్‌గా పేర్కొనవచ్చును. ఆ కృతజ్ఞతాపూర్వక జవాబుపత్రం బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన విశాల హృదయమునకు, సహృదయతకు నిరంహంకార స్వభావమునకు, సమాజ శ్రేయస్సు ఆకాంక్షించే  మనస్తత్వమునకు అద్దంపడుతుంది. తమ తండ్రిగారి రచనలన్నింటిని పలు సంపుటాలుగా ఆయన కుమార్తెలు డా||జి.ఉమాదేవి, డా||జి.శోభాదేవి వెలువరించి, కుమారులే కాదు కుమార్తెలు కూడ తండ్రి ఋణం తీర్చుకోగలరని నిరూపించారు. తాను నమ్మిన సిద్దాంతాలు తప్పని తోచినప్పుడు వదిలి వేయటానికి వెనుకాడని ధీరోదాత్తుడు, మానవతావాది, ఆత్మగౌరవంకు భంగం కల్గినప్పుడు జీవనోపాధికి ఆధారభూతమైన ఉద్యోగాలను సైతం  తృణప్రాయంగా త్యజించిన వ్యక్తి డా||జి.వి.కె. వివిధ సాహిత్య ప్రక్రియలను సత్యాన్వేషణ దృష్టిలో ఔపోసనపట్టిన సాహిత్య అగస్త్యుడు, నిరంతర సాహిత్య కృషీవలుడు, సత్యాన్వేషి, తత్త్వవేత్త, మీదు మిక్కిలి మానవతావాది, జీనియస్‌ డా||జి.వి.కృష్ణరావు గారు. ఆయన 23.8.1979లో కాలధర్మం చేశారు.     పరుచూరి శ్రీనివాసరావు సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో    

యద్దనపూడి సులోచనారాణి

  యద్దనపూడి సులోచనారాణి            యుద్దనపూడి సులోచనారాణి తెలుగులో పాపులర్ నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. మధ్యతరగతి మహిళా మణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు. ఎక్కడా నేల విడిచి సాముచేయకుండానే తనదైన శైలితో అరుదైన రచనలు చేసింది. ముఖ్యంగా 1970వ దశకంలో ఈమె రచనలు సినీ ప్రపంచాన్ని కూడా ఓ ఊపు ఊపాయి. స్త్రీలు కాల్పనికి సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో సులోచనా రాణి తనదైన సొంత మార్గంలో ఎన్నో నవలలు రాశారు. అప్పటి ఆడపిల్లలకు వీరి నవలా నాయకుడు ఓ కలల రాకుమారుడు.         యద్ధనపూడి సులోచనారాణి 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. తను పరిశీంచిన జీవితాలను వస్తువులుగా తీసుకొని మొదట రచనలు చేయడం ప్రారంభించారు. తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి, వారి ఊహల్లోంచి, కలల్లోంచి వచ్చిన పాత్రలను సృష్టించారు. అయితే వాటిని సజీవపాత్రలకు దగ్గరగా ఉండే విధంగా మలిచారు. వీరి నవలల్లో, కథల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు,  స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఎక్కువగా కోటీశ్వరుడైన నాయకుడు, కిందిస్థాయి నాయిక, విరిద్ధరి మధ్యా అంకురించే ప్రేమ. ఇదే వీరి నవలా సూత్రం.   ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం... ... ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు.     వర్ణనల విషయానికి వస్తే వీరి నవలల్లో ఇళ్లు, పరిసరాలు, ప్రకృతి, మానసిక వర్ణనలు సహజత్వాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని బట్టి సాగుతాయి. ఇవి ఎక్కువ ప్రచారం పొందడానికి కారణం- మెజారిటీ ప్రజల జీవన విధానాలను, అనుభూతులను పొందుపరచడమే. వీరి నవలా పాత్రలు విచిత్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతాయి. కొద్ది సంతోషాన్ని పొందగానే వెంటనే దుఃఖానికి లోనవుతాయి. అందుకేనేమో బహుశా సాధారణ ప్రజల జీవితాలకు ఇవి దగ్గరయ్యాయి. ధైర్యం - అధైర్యం, ప్రేమ - కోపం, పేదరికం - సంపద, శాంతి - అశాంతి, ఆశ -  నిరాశ... ఇలాంటి సహజాతాల మధ్య వీరు సృష్టించే పాత్రలు తలమునకలవు తుంటాయి. చదివే పాఠకులకు ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తుంటాయి.      యద్దనపూడి సులోచనారాణి తొలిసారిగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది. ఆ రోజుల్లో ప్రతి యువకుడు ఓ రాజశేఖరంలా, ప్రతి యువతీ ఆత్మాభిమానం గల జయంతిలా ఉండాలనుకునే వారు. మీనా నవల పత్రికలో ధారావాహికగా వచ్చింది. పేరును పాఠకులే నిర్ణయించారు. చివరకు మీనా నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి సినిమాగా తీసింది.     సులోచనారాణి ఎక్కువ ప్రేమ కథలనే రాశారు. ఆత్మాభిమానం గల ఆడపిల్లలను తన నాయికలుగా ఎన్నుకున్నారు. ధనవంతుల యువకులను నాయకుడిగా చేశారు. వీరి రచనలు నేటికీ టీవీలలో ధారావాహికలుగా వస్తూనే ఉన్నాయి. ప్రముఖ ఛానల్లో వచ్చిన రాధ మధు సీరియల్ కథ వీరిదే. నేటికీ చాలామంది పాఠకుల హృదయాల్లో వీరి నవలలు నిక్షిప్తమయి ఉన్నాయి. చాలామంది పాఠకులు నేటికీ వీరి రచనలను విస్తృతంగా చదువుతున్నారు.     - డా. ఎ. రవీంద్రబాబు

కారా మాస్టారు గారి గురించి మరికొన్ని సంగతులు...

కారా మాస్టారు గారి గురించి మరికొన్ని సంగతులు...     * కారా మాస్టారు అక్టోబర్ 14, 1924న జన్మించారు. * కారా మాస్టారు పేర్రాజు, భ్రమరాంబ దంపతులకు ప్రథమ పుత్రుడు. * సోదరులు కృష్ణారావు, విశ్వేశ్వరరావు - సోదరీమణులు సూరీడు, కమల. * కారా మాస్టారు గారికి అయిదుగురు కుమారులు, ఒక కుమార్తె. * ప్రధమ రచన: చిత్రగుప్త. మరికొన్ని రచనలు : తీర్పు, యజ్ఞం, వీరుడు-మహావీరుడు, మహదాసీర్వచనము, ఆదివారం, హింస, స్నేహం, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవనధార, కుట్ర. * కారా మాస్టారు 1966లో రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా ఆ కథలో చూపించారు. ఈ కథకు దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సినీ ప్రముఖుడు గుత్తా రామినీడు ఈ కథను అదే పేరుతో సినిమాగా కూడా రూపొందించారు. * కారా మాస్టారు తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేష కృషి చేస్తున్నారు . ఆంధ్రభూమి దినపత్రికలో ‘నేటి కథ’ శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు. * కారా మాస్టారు ఉపాధ్యాయ వృత్తి  నుండి రిటైరైన తరువాత 1997 ఫిబ్రవరి 22వ తేదీన 800 పుస్తకాలతో కథానిలయాన్ని శ్రీకాకుళంలో రెండు గదులున్న ఒక చిన్న భవనంలో  ప్రారంభించారు. ఈ కథానిలయం లో 1898వ సంవత్సరం నుండి ప్రచురణలు ఉన్నవి.  9 మంది సభ్యులతో 1998వ సంవత్సరంలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కథానిలయం ద్వారా ప్రతి సంవత్సరం 20 నుండి 30 మంది విద్యార్ధులు ఎంఫిల్, పీహెచ్‌డీ చేస్తున్నారు. INTACH ద్వారా కథా నిలయాన్ని సందర్శనా స్థలంగా పరిగణించుటకు గాను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కథా నిలయం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి, సాయంత్రం 7 గంటల వరకు తెరచి ఉంటుంది. * కారా మాస్టారు తన రచనల ప్రచురణల ద్వారా వచ్చిన ఆదాయాన్ని,  అవార్డుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేవలం తెలుగు  సాహిత్యానికి, మరియు కథానిలయం కోసం మాత్రమే ఖర్చు చేయడం విశేషం. సమాజంలోని పరిస్థితులు, ప్రకృతి వీటన్నిటి ప్రేరణ ద్వారానే తన రచనలు వచ్చేవి కాబట్టి దానిపై వచ్చిన ఆదాయాన్ని తన స్వంత విషయముల కోసం ఖర్చు చేసే అధికారం లేదు అని ఆయన అంటారు. కారా మాస్టారు కథా నిలయం విశేషాలు.. రెండు అంతస్తుల భవనం. ( రెండవ అంతస్తులో రీడింగ్ రూం మరియు ఫోటో గేలరీ కలవు) పత్రికా శీర్షికల సంఖ్య : 453, పత్రికా సంచికల సంఖ్య : 22000, మొత్తం పుస్తకాల సంఖ్య : 11697, సంకలనాలు : 417, సంపుటాలు : 2328, ఫీచర్ రచనలు : 105 వ్యాస సంకలనాలు : 110, ఆత్మ కథలు : 67, పరిశోధనా పత్రాలు : 97, జీవిత చరిత్రలు : 95, సాహిత్య సర్వస్వాలు : 130, ఉపయుక్త గ్రంధ సూచికలు : 53, ఇతర భాషలలో వచ్చిన తెలుగు పుస్తకాలు : 45, ఇతరములు : 2850, కథా రచయితల సంఖ్య : 13025, వ్యక్తిగత సమాచారం అందించిన రచయితలు : 2600, సేకరించిన ఫోటోలు : 500. ప్రస్తుతం వీటిని డిజిటలైజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు డిజిటలైజ్ అయినవి : 2 లక్షల పేజీలు, డిజిటలైజ్ కావలసినవి : 4 లక్షల పేజీలు.  

రాలిపోయిన సాహితీ ధ్రువతార ద్వివేదుల విశాలాక్షి

  రాలిపోయిన సాహితీ ధ్రువతార ద్వివేదుల విశాలాక్షి   తెలుగు సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన ప్రముఖ రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి 85 సంవత్సరాల సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించి కన్నుమూశారు. 1926 ఆగస్టు 15వ తేదీన విజయనగరంలో జన్మించిన ఆమె తన తుదిశ్వాసను 2014 నవంబర్ 07వ తేదీన విశాఖపట్టణంలో మరణించారు. జననానికి - మరణానికి మధ్య వున్న సుదీర్ఘ కాలంలో ఆమె చేసిన సాహితీ వ్యవసాయం ఎంతోమంది పాఠకుల మనసులను నింపింది.  తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగిన విశాలాక్షి.. అనేక కథలు, కవితలు, వ్యాసాలు, రేడియో నాటికలు రచించారు. అమెరికా, కెనడా, ఇంగ్లండ్‌, మలేషియా, సింగపూర్‌ దేశాల్లో పర్యటించి తన సాహిత్య వాణి వినిపించారు. ద్వివేదుల విశాలాక్షి సాహితీ ప్రస్థానం 1965లో.. ‘వైకుంఠపాళి’ నవలా రచనతో ప్రారంభమైంది. ఆ పయనం 1995లో రాసిన ‘ఎంత దూరమీ పయనం’ వరకూ కొనసాగింది.  వైకుంపాళి నవల ఆంధ్రప్రభ నవలలపోటీలో ప్రథమబహుమతి పొంది పాఠకులదృష్టినాకట్టుకుని వారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. ద్వివేదుల విశాలాక్షి ఏదో ఒక ప్రత్యేక శైలికే కట్టుబడిపోకుండా రకరకాల శైలులతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. అయితే ఆమె రాసిన అనేక కథలు ఆమె జన్మస్థలమైన విజయనగరం నుడికారంతో రాశారు. విశాలాక్షి ఆమె కథలకు కథావస్తువులను సామాజిక సమస్యల నుంచి తీసుకున్నారు. అయితే ఆ సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను మాత్రం తన కథల్లో చాలా కొత్తగా చూపించారు. ద్వివేదుల విశాలాక్షిమొత్తం 13 నవలలు రాశారు. విశాలాక్షి రచించిన ‘వారధి’ నవలను.. ‘రెండు కుటుంబాల కథ’ పేరుతో 1969లో ఫీచర్‌ ఫిల్మ్‌గా నిర్మించగా, ‘వస్తాడే మా బావ’ చలన చిత్రానికి ఆమె మాటలు రాశారు. ఆమె రాసినక కథలతో ఎనిమిది సంపుటాలు వెలువడ్డాయి. విశాలాక్షి రచించిన కొన్ని నవలలను కన్నడ, హిందీ భాషలలోకి అనువదించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు (1982), రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ లిటరరీ అవార్డు (1999) సహా 13 పురస్కారాలను విశాలాక్షి అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆమెకు 1998లో గౌరవ డీలిట్‌ ప్రదానం చేసింది. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌(ఢిల్లీ) వారు.. ఆమె ‘వారధి’ నవలను 1973లో పలు భారతీయ భాషలలోకి అనువదించి ప్రచురించారు. ఆంధ్ర, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్‌, పీహెచ్‌డీలు పొందారు. అనేక సాహితీ ప్రక్రియలలో తన ప్రతిభను చాటిన ద్వివేదుల విశాలాక్షి కన్నుమూతతో ఒక తెలుగు సాహితీ దిగ్గజం తెలుగువారికి దూరమైంది. ఆమె లేని లోటు ఆమె సాహిత్యం తీరుస్తుంది.

మాజిక్ రియలిజమ్ కథా మాంత్రికుడు

మాజిక్ రియలిజమ్ కథా మాంత్రికుడు మునిపల్లె రాజు                                                                                                              - డా. ఎ. రవీంద్రబాబు   తెలుగు కథకు శిల్పంతో కూడిన కొత్తదనాన్ని అద్దిన రచయిత మునిపల్లెరాజు. సమకాలీన సమాజ సంక్షోభాన్ని మాజిక్ రియలిజం ద్వారా కథల్లో చెప్పిన విశిష్ట కథకుడు. ప్రతి కథలోనూ వాక్యాల్ని లయ బద్దంగా రాసిన ప్రతిభాశాలి. సుమారు 64 పైగా కథలు రాసినా తన కంటూ ప్రత్యేకతను చాటుకున్న వైవిధ్యమైన కథాశిల్పి.        మునిపల్లె రాజు 1925 మార్చి 16న గుంటూరు జిల్లాలో జిన్మించారు. ఎమ్.ఇ.ఎస్.లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. వీరి పూర్తి పేరు మునిపల్లె బక్కరాజు. మునిపల్లె రాజు, మునీంద్ర పేర్లతో కథలు, కవిత్వం రాశారు. వీరి కథలు 'మునిపల్లె రాజు కథలు' (16), 'పుష్పాలు - ప్రేమికులు - పశువులు' (20), 'దివో స్వప్నాలతో ముఖాముఖి' (14), 'అస్తిత్వనదం ఆవలి తీరాన' (15) పేర్లతో సంపుటాలుగా వచ్చాయి. వీరు రాసిన 'పూజారి' నవల 'పూజాఫలం' చలన చిత్రంగా రూపొందింది. 'జర్నలిజంలో సృజన రాగాలు', 'అలసి పోయిన వారి అరణ్యకాలు', 'వేరొక ఆకాశం - వేరెన్నో నక్షత్రాలు'... లాంటి పుస్తకాలలో వ్యాసాలు, కవిత్వాన్ని ముద్రించారు.          మునిపల్లె రాజు కథలు, మాజిక్ రియలిజంతో వాస్తవానికి తీసిన నకళ్లుగా కాక నిజాలను పాఠకులకు బోధిస్తాయి. అసలు మాజిక్ రియలిజం అంటే .... పౌరాణిక, చారిత్రక, జానపద గాథలతో శిల్పాన్ని రూపొందించి, కథలో ప్రస్తుత సమాజంలోని సంక్షోభాన్ని చెప్పడం. 1953లో 'వారాల పిల్లవాడు' పేరుతో మొదటి కథను ప్రారంభించిన మునిపల్లె రాజు మొదట బాల్యపు గుర్తులను, జీవితపు ఆలోచనా ధోరణులను కథల్లో అన్వేషించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అస్తిత్వ సరిహద్దుల్ని చెరిపేసి నేటి మానవ నాగరికత స్వభావాన్ని, సంక్షోభాన్ని ఇతివృత్తాలుగా స్వీకరించారు.     'బిచ్చగాళ్ల జెండా', 'అరణ్యంలో మానవ యంత్రం' కథలు వర్తమాన మానవుల భవిష్యత్ ను అంచనా వేస్తాయి. 'నైశారణ్యంలో సత్రయాగం' కథ భారతీయ తాత్విక సిద్ధాంతాలకు అక్షర రూపంగా కనిపిస్తుంది. 'వీర కుంకమ' మరో అద్భుతమైన కథ. మునిపల్లె రాజు కథలు కథా పరిధులు దాటకుండానే వర్తమాన కాలం నుంచి భూత, భవిష్యత్ కాలల్లోకి ప్రయాణిస్తాయి. అయినా పాఠకుడికి ఎక్కడా కథలోని అంశంపై సంశయం ఏర్పడదు.   పాశ్చాత్య కథకు భారతీయ ఆత్మ జోడించడం వీరి కథల్లోని ప్రత్యేకత. నిజంగా చెప్పాలంటే ఈ యుగపు అస్తిత్వవాద తాత్విక ధోరణికి చెందిన మాజిక్ రియలిజం కథల వీరివి. మునిపల్లె రాజు యూరోపియన్ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. ఆధునిక కథా నిర్మాణ జాడల్ని వెతికి పట్టుకున్నారు. తనకు తానుగా వాటి నుంచి సరికొత్తగా, తనదైన కథా నిర్మాణ పద్ధతిని నిర్మించుకున్నారు. అందుకే వీరి కథలు నేడు శరవేగంగా మారుతున్న మానవ జీవన పరిస్థితుల వెనుక ఉన్న రహస్యాలను వెలికి తీస్తాయి. మన చుట్టూ ఉన్న సమాజంలోని మనకు తెలియని విషయాల గురించి, మనలో ఉన్న మనకు తెలియని భిన్న పార్శ్వాల గురించి, మనం పట్టించుకోని వైవిధ్యాలు, సంవేదనల గురించి మనకు వివరిస్తాయి.  మునిపల్లె రాజు కథలు ఇంగ్లీషు, తెలుగు భాషల్లోని అన్ని ప్రముఖ సంకలనాలలో చోటుచేసుకున్నాయి. వీరికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, రావిశాస్త్రి జీవిత సాఫల్య సాహితీ పురస్కారం, గోపిచంద్ అవార్డు లభించాయిు. అంతేకాదు 2006లో వీరి కథా సంపుటి 'అస్తిత్వనదం ఆవల తీరాన' కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. నాలుగు విశ్వవిద్యాలయాలలో వీరి కథలపై పరిశోధనలూ జరిగాయి.             నేటి సంక్షుభిత మానవుడి జీవిత రహస్యాలను, మనలో అజ్ఞాతంలో ఉన్న ఛేతనను, ఒంటరి తనపు వేదనను, యంత్రనగరి బీభత్సాన్ని తెలుసుకోవాలంటే మునిపల్లె రాజు కథా పుటలు తెరవాల్సిందే... ....

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

 శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - డా. ఎ. రవీంద్రబాబు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు తెలియాలంటే శ్రీపాద సుబ్రహ్మహ్మణ్యశాస్త్రి కథలు చదవాలి. ప్రతి కథ మనం మర్చిపోతున్న ఆచారాలను గుర్తుచేస్తాయి. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, ఆప్యాయతలు, నవ్వులు, కేరింతలు, చమత్కార సంభాషణలూ వీరి కథల నిండా గుభాళిస్తాయి. మనల్ని ఆత్మీయంగా స్పర్శిస్తాయి.           అచ్చమైన తెలుగు కథలు రాసిన శ్రీపాద తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం దగ్గరున్న పొలమూరులో1891, ఏప్రిల్ 23న జన్మించారు. 'ఇలాంటి తవ్వాయి వస్తే', 'గులాబీ అత్తరు', 'గూడు మారిన కొత్తరికం', 'అన్నంతపనీ జరిగింది', 'కీలెరిగిన వార్త', 'యావజ్జీవం హోష్యామి', 'వడ్లగింజలు' లాంటి ఎన్నో గొప్ప కథలు రాశారు. తెలుగు పలుకుల్ని కలకండ పలుకుల్లా అందించిన శ్రీపాద నిజంగా కథా చక్రవర్తే. 'వడ్లగింజలు' కథలో శంకరప్ప మహారాజుతో చదరంగం ఆడి గెలవాలనుకుంటాడు. శంకరప్ప సంకల్పానికి, రాజుగారి రాచరికానికి మధ్య ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు, ఉద్రిక్తతలు... ఇలా కథ ఏకబిగిన మనల్ని చదివిస్తుంది. 'కొత్తచూపు' కథలో 'స్త్రీలు విద్యావంతులై ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటే సరిపోదు, ఇంకా ముందుకు వెళ్లాలి' అంటారు. అందుకే ఆయన కథలు ఆ రోజులకే కాదు ఈ రోజులకు మార్గదర్శకాలు.              కథల్లో మధ్యతరగతి గృహిణుల జీవితాలను శ్రీపాద చిత్రించినట్లు మరెవరూ రాయలేదు. వారి కథ చదివిన తర్వాత మంచి భోజనం తిని, తాంబులం వేసుకుని సేదతీరిన తృప్తి కలుగుతుంది. అసలు శ్రీపాద తెలుగు నుడికారాన్ని స్త్రీల సంభాషణల నుంచే నేర్చుకున్నారట...! నీళ్లు తొరపడం, ఆబగా, రెక్కలు ముక్కలు చేసుకోవడం, బులిపించడం, బులబులాగ్గా... లాంటి ఎన్నో పదాలు వీరి రచనల్లో అచ్చ తెలుగుకు ఆనవాలుగా కనిపిస్తాయి. శ్రీపాద వారివి 4 కథా సంపుటాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 22 కథలు లభ్యంకావటం లేదు. వీటిలో ప్రతికథ, వీరు ఓ కథలో చెప్పినట్లే గడ్డపెరుగులో ఆవకాయ నంజుకుని తిన్నట్లు ఉంటుంది.        శ్రీపాద వారు కథలు రాయడమే కాదు. కళాభివర్థినీ నాటక సమాజాన్ని స్థాపించారు. అష్టావధానాలు చేశారు. 'గంధర్వ ఫార్మశీ' ఏర్పాటు చేసి ఆయుర్వేధ ఔషదాలు అమ్మారు. వాల్మీకి రామాయణాన్ని తొలిసారిగా వచనంలో అనువదించారు.            వీరికి 1956 ఏప్రిల్ 25న విశాఖపట్నంలో కనకాభిషేకం జరిగింది. తెలుగుభాషా మాధుర్యాన్ని తన కథల ద్వారా మనకందించిన శ్రీపాద 1961, ఫిబ్రవరి 25న మరణించారు. అతని ఆత్మ శరీరాన్ని మాత్రమే వదిలి, కథలను మాత్రం మనకు మిగిల్చి వెళ్లింది. అవి ఎప్పుడు చదివినా తెలుగు లోగిళ్లలోని ముచ్చట్లను మనకు వినిపిస్తాయి. తెలుగువారి సాంస్కృతిక జీవితాన్ని మన కళ్లముందు నిలుపుతాయి.

ఆచార్య కొలకలూరి ఇనాక్

  ఆచార్య కొలకలూరి ఇనాక్ - డా. ఎ. రవీంద్రబాబు. అన్నీ మనం చూస్తున్న జీవితాలే... ఎప్పుడో ఒకప్పుడు మన మనసుల్లో కలిగిన భావాలే... కానీ వాటిని అందరూ పట్టించుకోరు. సమాజంలోని అసమానతలే... అణచివేతలే... కానీ మనం దూరంగా ఉంటాం. కానీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అలాకాదు. వాటి లోతుపాతుల్ని వాస్తవరీతిలో వ్యక్తీకరిస్తూ కథలు రాస్తాడు. ఆ రచనల్లో ఆయన వ్యక్తిగత జీవితపు వాసనలు ఉంటాయి. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసినా ఆయన కథలు మాత్రం కింది కులాల ప్రజల అష్టకష్టాలను అక్షరాలుగా అందిస్తాయి.        గుంటూరు జిల్లా వేజెండ్ల గ్రామంలో 1939లో ఇనాక్ జన్మించాడు. క్రైస్తవమత బోధకులు "హానోకు" అని పేరుపెట్టారు. కానీ ఆపేరు అందరి నోళ్లల్లో నాని "ఇనాక్" గా మారింది. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ట్రైన్ వెళ్లిపోతే... ఆ పట్టాలపై పరుగెత్తుకుంటూ వెళ్లి ఆరోతరగతికి ప్రవేశ పరీక్షరాసి వచ్చాడు. అదీ ఆ పసి వయసులో ఆయనకు విద్యపై ఉన్న మమకారం. జీవితంలో ఎదగాలన్న ఆకాంక్ష. ఆ పట్టుదలే ఇనాక్ కు డాక్టరేట్ ఇప్పించింది. అధ్యాపకుడిని చేసింది. ఉపకులపతి పదవి పొందేలా చేసింది.       వృత్తిరీత్యా ఎంత ఎదిగినా, వారి జీవితం తాలూకు అనుభవాలు, అతనిలోని సృజనశక్తి ఇనాక్ ను రచయితను చేశాయి. 1955 నుండి  నేటికీ తన రచనా యాత్రను సాగిస్తూనే ఉన్నారు. జాషువా, బోయిభీమన్న తర్వాత సమున్నతస్థానం ఇవ్వగలిగిన దళిత రచయిత ఇనాక్. కులం పనాదుల్ని ప్రశ్నిస్తూ, దళితుల, దళితస్త్రీల చైతన్యాన్ని చిత్రిస్తూ 1980లో వీరు రాసిన "ఊరబావి" కథలు అప్పట్లో సంచలనాన్ని సృష్టించాయి. "సూర్యుడు తలెత్తాడు", "అస్పృశ్యగంగ", "కాకి" లాంటి కథాసంపుటాలు నేటికీ కొనసాగుతున్న అస్పృశ్యతలను భిన్నకోణాలలో తెలియజేస్తాయి. ఆలోచింపజేస్తాయి. మనల్ని నిలదీస్తాయి. సమాజాన్ని ప్రశ్నిస్తాయి. కథలే కాదు "సర్కారుగడ్డి" లాంటి నవలలు రాయలసీమలోని కరువును, అక్కడి రైతులు దుస్థితిని కళ్లకుకడతాయి. ఇనాక్ రాసిన "సమత" లాంటి అనేక నవలలు కులసమస్యకు కులాంతర వివాహరూపంలో పరిష్కారాన్ని చూపాయి. వీరి "మునివాహనుడు", "కీ", "అభ్యుదయం", "దృష్టి" వంటి నాటకాలు, నాటికలు కూడా ఇదే సమస్యను, వాస్తవ సంఘటనల రూపంలో వ్యక్తపరుస్తాయి.      ఇనాక్ పరిశోధకుడిగా "ఆధునిక విమర్శసూత్రం" లాంటి ఎన్నో విలువైన విమర్శాగ్రంథాలు రాశారు. వీరి రచనలు ఆంగ్లం, హిందీ, కన్నడం--- అనేక భాషల్లోకీ అనువాదాలయ్యాయి. ఇనాక్ రచనాశైలి చాలా సున్నితంగా ఉంటూనే కటువుగా సాగుతుంది. చిన్నచిన్న వాక్యాలు సూటిగా అనితర సాధ్యమైన భావార్థాన్ని ఇస్తాయి. శిల్పపరంగా ఇనాక్ కథల్లో ఎన్నో అద్భుతైన ప్రయోగాలు చేశారు. ఊరబావి కథలో ప్రధాన పాత్రైన స్త్రీకి పేరు ఉండదు. కథలో ఎద్దుదట్టాన్ని తాడుతో బావిలోంచి తీయడానికి వేసిన ముడులు ఎవరు వేశారోే చెప్పడు. కానీ ఆ ముడులను మాత్రం అద్భుతంగా వర్ణిస్తాడు.  కానీ కథ చదివిన పాఠకులకు మాత్రం నర్మగర్భితంగా బోధపడేలా చేస్తాడు. ఇలాంటి శిల్పరహస్యాలు వారి కథలు చదువుతుంటే ఎన్నో కనిపిస్తాయి.        వీరి "అనాథ" నవల 1961లో ఆంధ్రప్రభ పోటీలో బహుమతి పొందింది. "మునివాహనుడు" నాటకానికి 1988లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ నాటక బహుమతి లభించాయి. "తలలేనోడు", "మునివాహనుడు" రచనలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యాంశంగా కూడా కొంతకాలం ఉన్నాయి.      మారుతున్న సమాజంతోపాటు తన ఆలోచనాసరళినీ మార్చుకుంటూ ముందు తరానికి ఆదర్శంగా నిలుస్తున్న రచయిత ఇనాక్. అందుకే ఆయన రచనలు సజీవ శిల్పాలు. అందుకే వీరి రచనలపై సదస్సులు, సమావేశాలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.     వీరికీ ఎన్నో అరుదైన పురస్కారాలూ దక్కాయి. వాటిలో కొన్ని- 1994లో జాతీయవ్యక్తిగా, 1998లో ఉత్తమ విద్యావేత్త హోదా, 1999లో జాతీయకవిగా గుర్తింపూ పొందారు. ఈనెల 18న గుమ్మిమడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ "స్ఫూర్తి" అవార్డును ఇనాక్ అందుకున్నారు. అయినా నేటికీ తన రచనా వ్యాసంగాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. మరికొన్ని కథలకు నేపథ్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

మన రావూరి

మన రావూరి ఇక మనకి లేరు      వీరు 1927 జూలై 5వ తేదీన కృష్ణా జిల్లా లోని నందిగామ తాలూకా కంచికచర్ల సమీపంలోని మొగులూరు (నాటి హైదరాబాదు సంస్థానంలోని) గ్రామంలో రావూరి కోటయ్య మరియు మల్లికాంబ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు. తొలి నాళ్ళలో రావూరి భరద్వాజపై చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. యుక్త వయసులోనే తెనాలి చేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేయటం ప్రారంభించాడు. కొన్నాళ్ళ తర్వాత ఒక పత్రికకు ఉపసంపాదకుడైనాడు. ఆత్మాభిమానం కించపరచే ఒక సందర్భంలో తాళలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేశాడు. అక్కడ కూడా యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నాడు. రావూరి భరద్వాజ గారి వివాహం 1948 మే 28 తేదీన శ్రీమతి కాంతం గారితో జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. రవీంద్రనాథ్, గోపీచంద్, బాలాజీ, కోటీశ్వరరావు మరియు పద్మావతి. ఇతని భార్య1986 ఆగష్టు 1వ తేదీన పరమపదించింది. ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి మరియు రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస మరియు ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు. చివరకు 1987లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశాడు. రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా రాశారు. మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం. సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన. రావూరి భరద్వాజ గారికి లభించిన డాక్టరేట్లు, పురస్కారాలు : రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌర్రవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి.    1980 - కళాప్రపూర్ణ - ఆంధ్ర విశ్వవిద్యాలయం.     1983 - కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.     1985 - సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం ఇనుక తెర వెనక కు లభించింది.     1987 - రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు     1987 - తెలుగు కళాసమితి కె.వి.రావు, జ్యోతిరావు అవార్డు     2007 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు     2008 - లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం (వినూత్న సాహితీ ప్రక్రియ కల్పించినందుకు, డిసెంబర్ 4 వ తేదీన ప్రకటించారు)     2011 - కేంద్ర సాహిత్య అకాడమీ, వంగూరి ఫౌండేషన్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారాలు.     2012 - జ్ఞానపీఠ అవార్డు తెలుగు సినిమా ప్రపంచంలోని వెలుగుల వెనుక చీకటిని ఆవిష్కరిస్తూ రచించిన పాకుడురాళ్ళు నవలకు ఈ గౌరవం దక్కింది. 2012వ సంవత్సరానికి గాను రావూరి భరద్వాజ దేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తెలుగు సాహిత్యకారుల్లో రావూరి భరద్వాజ మూడోవారు. విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణ రెడ్డి ఇది వరకు ఈ అవార్డును పొందారు. తీన్‌మూర్తి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సరోద్ వాయిద్య కళాకారుడు ఉస్తాద్ అమ్జాద్ అలీ ఖాన్ చేతుల మీదుగా రావూరి భరద్వాజకు ఇటీవలే జ్ఞానపీఠ్ అవార్డును స్వీకరించారు. కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రావూరి భరద్వాజగారు హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన అంత్యక్రియలు శనివారం మెహదీపట్నంలో జరుగుతాయ్.