శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

 శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

- డా. ఎ. రవీంద్రబాబు

తెలుగు సంస్కృతి సంప్రదాయాలు తెలియాలంటే శ్రీపాద సుబ్రహ్మహ్మణ్యశాస్త్రి కథలు చదవాలి. ప్రతి కథ మనం మర్చిపోతున్న ఆచారాలను గుర్తుచేస్తాయి. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, ఆప్యాయతలు, నవ్వులు, కేరింతలు, చమత్కార సంభాషణలూ వీరి కథల నిండా గుభాళిస్తాయి. మనల్ని ఆత్మీయంగా స్పర్శిస్తాయి.
       

  అచ్చమైన తెలుగు కథలు రాసిన శ్రీపాద తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం దగ్గరున్న పొలమూరులో1891, ఏప్రిల్ 23న జన్మించారు. 'ఇలాంటి తవ్వాయి వస్తే', 'గులాబీ అత్తరు', 'గూడు మారిన కొత్తరికం', 'అన్నంతపనీ జరిగింది', 'కీలెరిగిన వార్త', 'యావజ్జీవం హోష్యామి', 'వడ్లగింజలు' లాంటి ఎన్నో గొప్ప కథలు రాశారు. తెలుగు పలుకుల్ని కలకండ పలుకుల్లా అందించిన శ్రీపాద నిజంగా కథా చక్రవర్తే. 'వడ్లగింజలు' కథలో శంకరప్ప మహారాజుతో చదరంగం ఆడి గెలవాలనుకుంటాడు. శంకరప్ప సంకల్పానికి, రాజుగారి రాచరికానికి మధ్య ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు, ఉద్రిక్తతలు... ఇలా కథ ఏకబిగిన మనల్ని చదివిస్తుంది. 'కొత్తచూపు' కథలో 'స్త్రీలు విద్యావంతులై ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటే సరిపోదు, ఇంకా ముందుకు వెళ్లాలి' అంటారు. అందుకే ఆయన కథలు ఆ రోజులకే కాదు ఈ రోజులకు మార్గదర్శకాలు.   
      

   కథల్లో మధ్యతరగతి గృహిణుల జీవితాలను శ్రీపాద చిత్రించినట్లు మరెవరూ రాయలేదు. వారి కథ చదివిన తర్వాత మంచి భోజనం తిని, తాంబులం వేసుకుని సేదతీరిన తృప్తి కలుగుతుంది. అసలు శ్రీపాద తెలుగు నుడికారాన్ని స్త్రీల సంభాషణల నుంచే నేర్చుకున్నారట...! నీళ్లు తొరపడం, ఆబగా, రెక్కలు ముక్కలు చేసుకోవడం, బులిపించడం, బులబులాగ్గా... లాంటి ఎన్నో పదాలు వీరి రచనల్లో అచ్చ తెలుగుకు ఆనవాలుగా కనిపిస్తాయి. శ్రీపాద వారివి 4 కథా సంపుటాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 22 కథలు లభ్యంకావటం లేదు. వీటిలో ప్రతికథ, వీరు ఓ కథలో చెప్పినట్లే గడ్డపెరుగులో ఆవకాయ నంజుకుని తిన్నట్లు ఉంటుంది.
       శ్రీపాద వారు కథలు రాయడమే కాదు. కళాభివర్థినీ నాటక సమాజాన్ని స్థాపించారు. అష్టావధానాలు చేశారు. 'గంధర్వ ఫార్మశీ' ఏర్పాటు చేసి ఆయుర్వేధ ఔషదాలు అమ్మారు. వాల్మీకి రామాయణాన్ని తొలిసారిగా వచనంలో అనువదించారు.
      

    వీరికి 1956 ఏప్రిల్ 25న విశాఖపట్నంలో కనకాభిషేకం జరిగింది. తెలుగుభాషా మాధుర్యాన్ని తన కథల ద్వారా మనకందించిన శ్రీపాద 1961, ఫిబ్రవరి 25న మరణించారు. అతని ఆత్మ శరీరాన్ని మాత్రమే వదిలి, కథలను మాత్రం మనకు మిగిల్చి వెళ్లింది. అవి ఎప్పుడు చదివినా తెలుగు లోగిళ్లలోని ముచ్చట్లను మనకు వినిపిస్తాయి. తెలుగువారి సాంస్కృతిక జీవితాన్ని మన కళ్లముందు నిలుపుతాయి.