ఇంగ్లిషుతో ఆడుకున్న శామ్యూల్‌ జాన్సన్‌

ఇంగ్లిషుతో ఆడుకున్న శామ్యూల్‌ జాన్సన్‌!     ఇవాళ కంప్యూటర్లో గూగుల్‌ హోంపేజి చూసిన ప్రతి ఒక్కరికీ ‘శామ్యూల్‌ జాన్సన్‌’ పేరుతో ఓ డూడుల్‌ కనిపించడం ఖాయం. ఇంగ్లిషులో ఓ నిఘంటువుని రూపొందించిన ఆయన 308వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్‌ ఈ డూడుల్‌ని రూపొందించింది. ఇంతకీ ఎవరీ జాన్సన్‌. ఆయన రూపొందించిన డిక్షనరీ ఎందుకంత ప్రత్యేకం. తెలుగులో మొట్టమొదటి నిఘంటువు అనగానే బ్రౌన్‌ నిఘంటువు, సూర్యరాయాంధ్ర నిఘంటువులాంటి పుస్తకాలు ఎలాగైతే గుర్తుకువస్తాయో.... ఆంగ్లంలో మొదటి తరం నిఘంటువులలో శామ్యూల్‌ రూపొందించిన Dictionary of the English Language అంతే ప్రసిద్ధం. ఎప్పుడో 1755లోనే ఆయన ఈ నిఘంటువుని తయారుచేశారు. శామ్యూల్‌ నిఘంటువు ఎంత ప్రత్యేకమో, ఆయన జీవితమూ అంతే విభిన్నంగా కనిపిస్తుంది. శామ్యూల్‌ 1709లో ఇంగ్లండులో జన్మించాడు. ఆయన తండ్రిది పుస్తకాల వ్యాపారం. దాంతో సహజంగానే శామ్యూల్‌ చిన్నప్పటి నుంచి పుస్తకాల మధ్యే పెరిగాడు. ఆయన చిన్నప్పుడే Scrofula అనే ఒకరకమైన క్షయ రావడంతో, శరీరం అంతా గాట్లతో నిండిపోయింది. దాంతో తనని వింతగా చూసే జనం మధ్య కాకుండా, తనని అక్కున చేర్చుకునే పుస్తకాలతోనే ఎక్కువగా స్నేహం చేసేందుకు ఆయన ఇష్టపడేవాడట. శామ్యూల్‌ ఏకసంథాగ్రాహి ఏ విషయం విన్నా, చదివినా... ఇట్టే దాన్ని మెదడులో భద్రపర్చుకునేవాడు. సహజంగానే అలాంటి తెలివితో, చదువులోనూ బాగా రాణించసాగాడు. కానీ దురదృష్టవశాత్తూ, శామ్యూల్‌ పెరుగుతున్నకొద్దీ ఆయన తండ్రి ఆర్థికస్థితి దిగజారిపోసాగింది. దాంతో ఆక్స్‌ఫర్డులో చదువుని సైతం మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ఆర్థికంగా ఎలాగైనా నిలదొక్కుకునేందుకు శామ్యూల్‌ 1737లో లండన్‌కు చేరుకున్నాడు. అక్కడ ఓ నాలుగు డబ్బుల కోసం ఆయన చేయని పనంటూ లేదు. పిల్లలకు చదువు చెప్పడం, అనువాదాలు చేయడం, కవితలు రాయడం, పత్రికలు వ్యాసాలు రాయడం... ఇలా ఏదో ఒక పనితో కడుపు నింపుకొనే ప్రయత్నం చేశాడు. అలా క్రమంగా ఓ మంచి రచయితగా శామ్యూల్‌ పేరు ప్రచారంలోకి రాసాగింది. సంపద పోగు కాకున్నా, ఆకలితో పడుకోవాల్సిన దుస్థితి తప్పింది. 1746లో శామ్యూల్‌ దగ్గరకి కొందరు ప్రచురణకర్తలు వచ్చారు. ఇంగ్లిషులో ఓ నిఘంటువుని రూపొందించమని అడిగారు. అప్పటికి ఇంగ్లిషులో నిఘంటువులు లేవని కాదు. కానీ వాటిలో ఏదో ఒక లోటు ఉండేది. అందుకని ఓ పరిపూర్ణమైన నిఘంటువుని రూపొందించమంటూ శామ్యూల్‌ని అభ్యర్థించారు ప్రచురణకర్తలు. దాంతో శామ్యూల్‌ ఓ తొమ్మిదేళ్లపాట శ్రమించి ఓ నిఘంటువుని రూపొందించాడు. శామ్యూల్‌ కేవలం మధ్యాహ్నం సమయంలో మాత్రమే నిఘంటువు పని మీద కూర్చునే తీరిక చిక్కేది. వందలాది పుస్తకాలని చుట్టూ పేర్చుకుని, ఆ తొమ్మిదేళ్ల పాటు సాగించిన శ్రమ ఓ యజ్ఞాన్ని తలపించేదట. ఎట్టకేలకు 1755లో శామ్యూల్‌ నిఘంటువు ఓ కొలిక్కి వచ్చింది. దాన్ని ప్రచురణకర్తలు భారీ లాభాలకు అమ్ముకున్నారు. ఈ రోజుల్లో లెక్కల ప్రకారం ఒకో నిఘంటువు వెల దాదాపు 30 వేల రూపాయలకు పైమాటే పలికింది. ఇంతాచేసి ఆ లాభాలలో శామ్యూల్‌కు కొంత కూడా వాటా లేకపోయింది. ఆ తర్వాత చాలాకాలం ఆయన్ను దరిద్రం వెంటాడింది. ఒకానొక సందర్భంలో అప్పులపాలై అరెస్టయ్యాడు కూడా! శామ్యూల్‌ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం తర్వాతకాలంలో ఆయనకు కొంత పింఛనుని ఏర్పాటు చేసింది. శామ్యూల్‌కు అండగా నిలిచే స్తోమత ఉన్న స్నేహితులూ పరిచయం అయ్యారు. అయితే అప్పటికే శామ్యూల్‌కు వయసు మీదపడింది. క్రమంగా ఆరోగ్యం క్షీణించింది. తన 75వ ఏట లండన్‌లో మరణించాడు. శామ్యూల్‌ నిఘంటువు రూపొందించిన 173 ఏళ్ల తర్వాత కానీ మరో నిఘంటువు (oxford dictionary) పూర్తికాలేదంటే... ఆయన కృషి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. శామ్యూల్‌ రూపొదించిన నిఘంటువు మొట్టమొదటిది కాకపోవచ్చు. ఇప్పుడున్న పదాలలో కేవలం ఐదో వంతు పదాలకే (42,773) అందులో చోటు ఉండవచ్చు. కానీ తొలి సమగ్రమైన నిఘంటువుగా, ఒక వ్యక్తి సాధించిన అద్భుతమైన కార్యంగా ఆయన నిఘంటువు మిగిలిపోతుంది. పైగా ఆయన ఇచ్చిన అర్థాల ఆధారంగా ఆనాటి ప్రజల జీవనవిధానం కూడా అర్థం చేసుకోవచ్చునంటారు. అలాంటి మనిషి కోసం ఓ డూడుల్‌ని రూపొందించడం అర్థవంతమే కదా!   - నిర్జర.  

కస్తూరి రంగ రంగ!

కస్తూరి రంగ రంగ!     కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగా శ్రీరంగ రంగ రంగా నినుబాసి యెట్లు నేమరచుందురా॥ కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనపుడు దేవకి గర్భమునను కృష్ణావతారుడై జన్మించెను॥ ఏడురాత్రులు ఒకటిగా ఏక రాత్రిని జేసెను ఆదివారం పూటనూ అష్టమి దినమందు జన్మించెను॥ తలతోటి జననమైతే తనకు బహు మోసంబు వచ్చు ననుచు యెదురుకాళ్ళను బుట్టెను ఏడుగురు దాదులను చంపెనపుడు॥ తన రెండు హస్తములతో దేవకి బాలుణ్ణి యెత్తుకొనుచు అడ్డాలపై వేసుకు ఆ బాలు చక్కదనము చూచెను॥ వసుదేవ పుత్రుడమ్మా ఈబిడ్డ వైకుంఠవాసుడమ్మ నవనీత చోరుడమ్మ ఈబిడ్డ నందగోపాలుడమ్మా॥   (ఒకవైపు శ్రీకృష్ణుని మహిమను వర్ణిస్తూ, ఆయన చేసిన సాహసాలను కీర్తిస్తూ... పిల్లలను నిద్ర పుచ్చేందుకు తల్లులు పాడే లాలి పాట ఇది. చిన్నాచితకా మార్పులతో ఈ పాట చాలా రూపాంతరాలుగా వినిపిస్తుంది. పైన కనిపించే పాట మాత్రం ప్రయాగ నరసింహ శాస్త్రి సేకరించిన ‘తెలుగు పట్టె పాటలు’ పుస్తకంలోది)    

దేవుడిచ్చిన తండ్రి!

దేవుడిచ్చిన తండ్రి!    "ఈరోజు బ్రేక్ ఫాస్ట్ సర్వీస్ ఉంది , వస్తారా?"అడిగాడు ఉమేష్ , కొత్తగా ఆ కమ్యూనిటీలో  అద్దెకు దిగిన నవీన్ ను. నవీన్ అమేరికాలో చికాగోనగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగరీత్యా వచ్చాడు.  తెలుగు వారూ, ఇండియన్సూ ఉన్న కమ్యూనిటీ వెతుక్కుని ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కమ్యూ నిటీ వారంతా వెల్కం చేస్తూ పార్టీ ఇచ్చారు.అప్పుడే పరిచయ మయ్యాడు ఉమేష్. తెలుగు వాడు , హైదరాబాదులో పుట్టి, చదివి ,ఉద్యోగరీత్యా పదేళ్ళనుంచీ అక్కడ ఉంటున్నాడు. ఇంకా చాలా మంది అక్కడ ఇండియన్సూ, తెలుగువారూ, తమిళియన్స్ , కేరళీయులూ, కన్నడీగులూ చాలా మందే ఉన్నారు. ఆరోజు శుక్రవారం రాత్రి డిన్నరయ్యాక, కమ్యూనిటీలో చల్లగాలికి నడుస్తున్న నవీన్, సుజన లను చూసి అడిగాడు ఉమేష్."అదేంటి అన్నయ్యగారూ! ఇక్కడ బ్రేక్ ఫస్ట్ సర్వీసేంటీ!"అందిసుజన . "ఔను నేనూ అదే అడగబోతున్నాను."అన్నాడు నవీన్. "ఇక్కడా హోం లెస్ పీపు ఉన్నారండీ!వారికి ఒక పెద్ద హాల్ ప్రభుత్వం ఇచ్చింది. అనేక సర్వీస్ ఆర్గ నై జేషన్స్ వారు వారికి బ్రేక్ ఫాస్, డిన్నర్ ఇస్తుంటారు.మేమూ సత్యసాయి  సంస్థ తరఫున నెలకో మారు బ్రేక్ ఫాస్ట్ , డిన్నర్ ఇస్తుంటాం. "అన్నాడు.  "ఇక్కడ వీళ్ళంతా వెజ్ కాదుకదా తినేది ఏం ఇస్తారూ?అంది సుజన. ఆమెకు కొత్త విషయాలు తెల్సు కోవడం చాలా ఇష్టం. "ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బ్రడ్ టోస్ట్శ్ ఇస్తాం, ఛీజ్ తో. టీ,ఇంకా యాపిల్ జ్యూస్ వంటివి.డిన్నర్ కు పీజాలు, బర్గర్స్ , బ్రెడ్ , పాస్తా, వెజిటబుల్ రైస్ , ఫ్రూట్ సలాడ్, యాపిల్, ఆరంజ్ జ్యూస్ ఇస్తాం. కొన్ని అక్కడే వండుతాం. వేసవికాలంలో తక్కువగా అంటే సుమారుగా యాభైనుంచీ,అరవై వరకూ ఉంటారు, వింటర్ లో వందవరకూ ఉంటారు. మీరు వచ్చారంటే అన్నీ చూడవచ్చు. లాంగ్ వీకెండ్ కావటాన ఎప్పుడూ వచ్చే వలంటీర్స్ తగ్గారు. మీకు సరదా ఐతే రండి. లేకపోతే ఫరవాలేదు."ఉమేష్ వివరంగా చెప్పాక , వారికీ వెళ్ళాలనిపించింది."అలాగే వస్తామండీ "అన్నారు దంపతు లిరువురూ. "ఉదయ్యాన్నే ఫోర్ తర్టీకి బయల్దేరాలి, ఒక గంట డ్రైవ్, డౌన్ టవున్ వెళ్ళాలి. తిరిగి వచ్చేసరికి ఎనిమిది కావచ్చు , నేను మిమ్మల్ని పికప్ చేస్తాను " అంటూ వివరం చెప్పి, గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు ఉమేష్.  అక్కడ మొత్తం పదిమంది వరకూ వలంటీర్స్ ఉన్నారు. అందరికీ నవీన్ దంపతులను పరిచయం చేసాడు ఉమేష్. నవీన్, సుజన అందరితో కలిసి  గబగబా  కూరలు తరగడం, పండ్లు తరగడం బ్రెడ్ వేడి చేయడం అన్నీ చేసారు. అందరికీ సర్వ్ చేసే ముందు కిచెన్ లోనే బ్రహ్మార్పణం చెప్పారు. వరుసగా ట్రేల న్నీ తీసుకెళ్ళి టేబుల్స్ మీదపెట్టి వలెంటీర్సంతా వరుసగా ఒక్కో డిష్ వద్దా ఒక్కోరూ నిల్చుని ,లేన్లో వస్తున్నవారికంతా ప్లేట్స్ ఇస్తూ వారు కోరినవి వడ్డించ సాగారు. అంతా సుమారుగా యాభై మంది ఉన్నారు ఉమేష్ చెప్పినట్లే.   ఒక వ్యక్తి ఒక టేబుల్ ముందు కూర్చుని లేచి రానేలేదు.పక్కనే కూర్చుని బ్రెడ్ తింటున్న మరో వ్యక్తి అమేరికన్ ఇంగ్లీష్ లో "వెళ్ళి బ్రేక్ ఫాస్ట్ తెచ్చుకో "అని చెప్పాడు. ఐనా అతడుకదల్లేదు. ఉమేష్ , కూర్చుని తింటున్న వారందరికీ మారు వడ్డిస్తూ అతడికేసి చూస్తూ "ప్లీజ్ నవీన్ మీరెళ్ళి అతడికి ఒకప్లేట్ ఇచ్చి వస్తారా! రాలేని వారికిమేమే వెళ్ళి ఇస్తుంటాం. "అని చెప్ప గానే నవీన్ వెంటనే ఒక ప్లేట్ లో అన్నీ వడ్డించుకుని , అతడి దగ్గరకెళ్ళి " ప్లీజ్ టేకిట్ అండ్ ఈట్ "అంటూ, అతడి చేయి పట్టుకుని చేతికిప్లేట్  అందించాడు. అతడు తలపైకెత్తి చూసి "ఇట్స్ ఓకే.తినకపోతే కుక్క చావు చస్తానిక్కడే. భగవంతుడు ఇంకా ఎంత ఆయుష్షు పెట్టాడో! నాబతుకిలా ఐంది. "అని స్వగతంగా అనుకుంటున్నట్లు అంటూ  , ప్లేట్ తీసు కున్నాడు. నవీన్ ఆశ్చర్యంగా  అతడి కేసి చూసి " మీరు తెలుగు వారా!ఇక్కడికెలా వచ్చారు!" అని అడిగాడు. పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ.దానికతడు వెక్కి వెక్కి ఏడ్వసాగాడు. అక్కడ ఆ హోం కంతా వలంటీర్  ఉంటూన్న జాన్ వచ్చి ఆంగ్లంలో" సర్ ! ఇతడు గత పదిరోజులుగానే ఇక్కడ ఉంటున్నాడు. ఇక్కడికి మీలాగా డిన్నర్ సర్వీస్ చేయను వచ్చిన తను వెళ్ళేప్పుడు ఇక్కడ వది లేసి, కారు ట్రబులైంది, రెడీ చేసుకుని వచ్చి తీసుకెళతానని చెప్పి  వెళ్ళాడు. మళ్ళీరాలేదు. ఇతడి కొడుకుట.ఆరోజునుంచీ ఇంతే తినడు, ఏమీత్రాగడు, మేమే బలవంతంగా పెడుతుంటాం. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటాడు. " అని చెప్పాడు.  "సర్ !  మీపేరేంటీ! మీకొడుకు ఇక్కడ వదిలేసి పోయాడా! ఎందుకూ! ఇదినిజమేనా!  "అని అడగ్గానే అతడి ఏడుపు మరింత పెరిగింది."సర్ ! మీరు ఏదైనా చెప్తే మేమేమన్నా సాయం చేయగలమేమో చూస్తాం సర్. మీరు ఇండియా వెళ్ళాలన్నా సాయం చేస్తాం" అన్నాడు. ఆమాట వినగానే అతడు లేచి నవీన్ పాదాలపై బడి "ఆసాయం చేసి పెట్టు నాయనా!"అంటూ ఏడ్వ సాగాడు. నవీన్ ఉమేష్ తో అరడి విషయం మాట్లాడ్గా"నవీన్ ! అతడేవరో ఏమో ఏమీతెలీకుండా ఇంట్లో పెట్టు కోడం మంచిదేనా , మీ మిసెస్ తో మాట్లాడండి ముందుగా "అన్నాడు నవీన్ సుమనతో మాట్లాడాడు "ఎందుకో అతడిని చూస్తుంటే బాగా తెలిసిన వాడిలా ఉన్నాడు, అతడి బాధ చూడలేకున్నాను. హోం వలెంటీర్ మాటలు వింటుంటే ఇక్కడ ఉంటే ఎంతో కాలం బ్రతికేలాలేడు. అతడు ముసలి వాడు మమ్ము లనేం చేస్తాడు. చూద్దాం ఉమేష్! అతడితో అన్నీ మాట్లాడాక మనకు సాధ్యంకాక పోతే తిరిగి ఇక్కడే వదు లుదాం."అంటూ , హోం వలెంటీర్ తో చెప్పి, వచ్చేప్పుడు అతడ్ని తనతో తన ఇంటికి తెచ్చాడు. అతడి వద్ద హోం వారిచ్చిన ఒక జత బట్టలు తప్ప ఏమీలేవు. అతడు అవితెచ్చుకుంటుంటే నవీన్ వద్దని చెప్పాడు. ఇంటికొచ్చాక అతడిని స్నానం చేయమని, తన తువ్వాలూ,పంచె బనియన్ ఇచ్చి, షేవ్ చేసుకోమని అన్నీ ఏర్పాటు చేశాడు.చక్కగా స్నానం చేసి వచ్చాక అతడ్ని గుర్తిచి  నవీన్ ఆశ్చర్యపడ్డాడు. "సర్ మీరు మీరు మధవరావు గారుసార్ కదూ! మా మాస్టర్ , మాకు బ్రతుకు నేర్పిన మాస్టర్!" అంటూండగా ఆయన "అవును బాబూ మాధవరావునే ! నీవు .." "నేను నవీన్ను మాస్టారూ !మీరు రోడ్డుమీద కనిపించిన నన్ను తెచ్చి బళ్ళో వేసి చదివించి, ఆ తర్వాత హాస్టల్లో వేశారు. అప్పుడప్పుడూ వచ్చి చూసేవారు. ఐఐటీ ట్రివెండ్రం లో చదువయ్యాక మీకోసం వస్తే మీరు రిటైరయ్యాక ఎక్కడున్నారో తెలీ దని చెప్పారు.ఎవ్వరూ మీ చిరునామా కూడా చెప్పలేక పోయా రు. నా వివాహం సందర్భంలో కూడా మీకోసం చాలా ప్రయత్నించాను. ఈమే నా భార్య సుజన . నేను ఉద్యోగరీత్యా తిరుగుతూ ఇటీవలే ఇక్కడి కొచ్చాను. అసలేమైంది మాస్టారూ!" అని ప్రేమగా అడుగు తున్న నవీన్ ను ఆలింగనం చేసుకుని చాలా సేపు ఏడ్చాడాయన.కొద్దిసేపయ్యాక ంతేరుకుని,మెల్లిగా మాట్లాడ సాగాడు.  "బాబూ ! నవీన్! నీలాగే ఎందరికో చదువు చెప్తూ బతికిన నాకు ఒక దురదృష్టపు క్షణాన నీలాగే వాడినీ,ఒక అనాధ శరణాలయంలో చూసి, మాకూ పిల్లలు లేనందున దత్తత తీసుకున్నాం.చదువు చెప్పించి,అమేరికా వెళతానంటే మా ఆస్థతా కరిగించి డాలర్స్ చేసి పంపాం. నాభార్య నేను రిటైరయ్యాక గతించింది. అక్కడే ఉండే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానన్నాడు. చేసుకున్నాడు కూడా ఆపాటికే. నా మా స్వగ్రామంలో ఉన్న ఐదెకరాల పొలం విలువ కోట్లలోకి రాగానే , దాన్ని అమ్ముదామన్నాడు. నేను అంగీ కరించలేదు. కొద్దికాలమయ్యాక అమేరికా చూద్దువుగానిరా అనిపిలిచి అన్నీ ఏర్పాటు చేసి, తెచ్చాడు. పదిరోజులు బాగానే చూసుకున్నాడు.  మీలాగే ఏదోక్లబ్ వారు డిన్నర్  సర్వీస్ అని వాళ్లతో పాటుగా వచ్చీ, వెళ్లేముందు,"నాన్నా! కారు రిపేరు వచ్చింది, ఒక్క గంటలో వస్తాను ఇక్కడే ఉండు "అనిచెప్పి వెళ్లాడు.ఇహరానే లేను. ఆ పొలం కోటల కోసం నన్నిక్కడ వదిలేసి ఉంతాడు. అనాధను దత్తత తీసుకుని అనాధనై ఆ హోం లెస్ వారితో కలసి పోయాను బాబూ! నిన్ను భగవంతుడే పంపాడు "అంటూ భోరున ఏడ్వసాగాడు మళ్ళీ. "మాస్టారూ ! ఏడ్వకండి, చూడలేము. ఆభగవంతుడు మిమ్ము చూడనే మమ్మల్ని అక్కడికి పంపాడు. మొదటి మారు రావడం మిమ్ము తిరిగి కలవనే మాస్టారూ!.  ఏమీ భయపడకండి. ఇక్కడి మా స్నేహితులతో మాట్లాడి ,సాయం తీసుకుని అతడెక్కడున్నా పట్టుకుందాం, మీపొల అమ్ముకోకుందా చేయగలం. మీరు మాకిక్కడ దేవుడిచ్చిన తండ్రి. మాదగ్గరే ఉండండి."అంటూ దంపతు లిద్దరూ ఆయన పాదాలకు నమస్కరించారు.   -రచన---అదూరి.హైమావతి.

భగవంతుని భక్తుడు కోరాల్సినది

  భగవంతుని భక్తుడు  కోరాల్సినది!     భగవంతుడు భక్తులపాలిటి కల్పవృక్షం, కామధేనువు. కోరిన వరాలిచ్చే కొంగుబంగారం. అలాంటి భగవంతుని అడగ వలసినవి అడక్కండా తుఛ్ఛమైన ప్రాపంచికమైన, అశాశ్వతమైన కోరికలు కోరు కోడం దురదృష్టం.ఒక్క నమస్కారం భక్తిపూర్వకంగా, మనస్పూర్తిగా ,నిష్కల్మష హృదయంతో చేయ గానే భగవంతుడు,' వీడునాకు నమస్కరించాడు, వీడుకోరుకునే కోరిక  తీర్చాలి ' అని నిశ్చయమై పోతాట్ట ఆయన. అంతదయాసాగరుడు, కరుణామయుడు. అలాంటిపరమేశ్వరుని మనం ఏమికోరు కోవాలో, ఈ జన్మనెలా సార్ధకం చేసుకోవాలో తెల్సుకోవాలి.   పూర్వకాలం అంటే సుమారుగా వంద, వందా యాభై  ఏళ్లనాటి విషయం.మానవులకు ప్రయాన సాధనాలేమీ ఉండేవికావు. డబ్బున్నవారు పురుషులు గుఱ్ఱాలమీద  స్వారీచేస్తూ, మహిళ లైతే  గుఱ్ఱ బ్బగ్గీల్లో  ప్రయాణం చేసేవారు. మధ్యతరగతివారు ఒంటెద్దు బండిలోనో, రెండెద్దుల బండిలోనో, గూడ బండ్లలోనో ప్రయాణించేవారు. సాధారణ మానవు లంతా కాలినడకన వెళ్లేవారు.ఆరోజుల్లో తమ తమ బాధ్యతలన్నీ తీర్చుకుని కాశీప్రయాణం పెట్టుకునేవారు. కాశీకెళ్ళితే కాటి కెళ్ళినట్లే అనేసామెత వచ్చింది. కాశీకెళ్ళిన వారు ఇహ తిరిగి రావడం ఉండదని భావన. ఎందుకంటే కాలినడకన ప్రయా ణం దూరా భారం కనుక మధ్యలో అనారోగ్యమో, దొంగల తాకిడో, ఏదో అనానుకూలాలో వస్తే ఇహ తిరిగి రావడం జరిగేది కాదు.   అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి జీవితం రోసి ,ఇంట్లో విసిగిపోయి కాలినడకన ప్రయాణం మొద లెట్టా డు. ఉదయాన్నే బయల్దేరి మధ్యాహ్నం వరకూ ప్రయాణం సాగించాడు.తెచ్చుకున్న ఉదకం ఐపోయింది, దాహం వేస్తున్నది. చుట్టుపక్కల ఎక్కడా బావి కనిపించలేదు. ఎండవేడి ఎక్కువగా ఉంది. అతడికి ఆసమయంలో అతడి అదృష్టమాని ఒక పెద్ద వృక్షం దట్టమైన కొమ్మలతో కనిపిం చింది . హాయిగా దానిక్రింద విశ్రమించాడు. దాహం భరించలేక అతడు 'ఇప్పుడు నాకు చల్లని పానీయం లభిస్తే ఎంత బావుంటుంది '  అని అను కుంటూ  కళ్ళుమూసుకుని ఆలోచిస్తూ కొద్దిక్షణాల య్యాక కళ్ళుతెరిచాట్ట.     అక్కడ అతడికి తళతళా మెరుస్తున్న ఒక రాగి మరచెంబులో కనిపించింది. వెంటనే దానిమూత తీసి చూడగా స్వఛ్ఛమైన చల్లని నీరు నిండుగా దాన్లో ఉంది . హాయిగా త్రాగాడు,ముఖప్రక్షాలనం చేసుకుని సేద తీరాడు.దాహంతీరి, అలసట తీరాక, అప్పుడు గుర్తుకువచ్చింది ఆకలి దంచేస్తున్నట్లు. చెట్టు మానుకు అనుకుని కళ్ళు మూసుకుని విశ్రాతిగా కొద్దొసమయం ఉండి, ఇహ ఆకలి భరించలేక , 'ఈ పానీయం వచ్చినట్లే మంచి ఆహారం లభిస్తే ఎంత బావుంటుందీ!' అనుకున్నాట్ట. కొద్ది సేపటికి కళ్ళుతెరచి చూడగానే అక్కడ ఒక భోజనం పీటమీద విశాలమైన పచ్చని అరటాకులో వివిధ రకాలైన భోజన పదార్ధాలు, తీపి వస్తువులతో సహా వడ్డించి ఉండటం చూసి, 'ఆహా! ఎవరో పుణ్యా త్ములు నా ఆకలి గ్రహించి ఆహారంఉంచిపోయారు 'అని భావించి హాయిగా కడుపారాఅన్నీతిన్నాడు. ‘అన్నదాతా సుఖీ భవ ' అనికూడా చెప్పుకున్నాడు. కమ్మని భోజనం , తీపివంట కాలతో సహా కడుపునిండా తినగనే అతడికి ఆయాసం  వచ్చింది.    'కొద్దిసేపు విశ్రమించి ఆతర్వాత ప్రయాణం సాగించవచ్చు, ఐతే ఇక్కడ పవ్వళించను ఏమీ లేవే! ఒక్క మంచి మంచం మెత్తని పరుపూ తలగడతో సహా ఉంటే ఎంత హాయిగా నిద్రించవచ్చోఅనుకున్నాట్ట. వెంటనే అతడు కోరిన విధంగా మంచి మంచం పరుపూ వచ్చేశాయి. దాంతో మహదా నందంగా అక్కడ పడుకున్నాడు. ' 'అబ్బా! ఉదయం నుంచీ కనీసం ఆరుగంటలు , సుమారుగా ఇరవై మైళ్ళు నడిచాను, కాళ్ళు పీకుతున్నాయి, ఎవరైనా వచ్చి నాభార్య పిసికినట్లు కాళ్ళు వత్తితే ఎంత బావుంటుందో కదా! హాయిగానిద్రించి కాళ్ళనొప్పులు పోగొట్టుకోవచ్చు.' అనుకున్నాట్ట.    వెంటనే అక్కడ ఒక మహిళ వచ్చి కాళ్లవైపుకూర్చుని కాళ్ళు మెల్లిగా వత్తసాగింది. కళ్ళు తెరచిచూసి 'ఇదేంటీ! నాభార్య ఇక్కడికి ఎలా వచ్చిందీ!  ఇదేం బ్రహ్మ రాక్షసి కాదుకదా!  నా గొంతునులిమి చంపేయదు కదా!' అనుకున్నాట్ట. వెంటనే ఆ మహిళ బ్రహ్మరాక్షసిగా మారి అతడి గొంతు నులిమి చంపేసిందిట. అతడు కూర్చున్న వృక్షం కల్పవృక్షం. ఏమికోరితే అదంతా ఇచ్చేస్తుంది. మనం కల్పవృక్షం వంటి భగవంతుని ఇలా అనవసరమైన, వ్యర్ధమైన కోరికలు కోరుకుంటూ , ఆయన మనకిచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నాం. మన జీవితాలు, మనశ్వాసలూ వూర్ధ పరచు కుంటూ దుర్వినియోగమూ,ఇంకా దుఃస్తూనే ఉన్నాం. దుఃఖాన్ని బాపే దైవం మన ముందున్నా ఆయన్ని ఏమి కోరాలో మనకు తెలీడం లేదు. దీనికో ఉదాహరణ.   పూర్వం ఒక మహారాజుకు నలుగురు భార్య లుండేవారుట, త్రిగుణాలవంటి ముగ్గురు భార్యలతోనే దశరధుడు మహా వీరుడయ్యీ పుత్రశోకంతో అసువులుబాశాడు, ఇహ నలుగురు భార్యల ఈ మహా రాజు ఎలాగో చాకచక్యంగా జీవనం సాగిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఆయన సముద్రానికి ఆవల , దూర తీరాన ఉన్న ఒకరాజ్యానికి ఆయన మిత్రులను కలవను వెళ్ళాల్సి వచ్చిందిట. సుమారుగా మూడు మాసాలు రాజ్యాన్నీ, ప్రియమైన నలుగురు భార్యలనూ వదలి ఉండాల్సి రావడం ఆయనకు బాధగానే ఊంది పాపం. బయల్దేరే ముందు మంత్రులకు రాజ్య బాధ్యతలన్నీ  అప్పగించి, పట్టపు రాణిని రాజ్య వ్యవహారాలు చూసు కోమని చెప్పాడు.    నలుగురు భార్యలనూ వారి వారికోరికలు తెల్సుకుందామనీ వచ్చేప్పుడు అక్కడ వారి కోరికల ప్రకారం కోరినవి తేవచ్చనీ భావించి , ముందుగా ముద్దుల నాల్గో భార్య దగ్గర కెళ్లాట్ట." ప్రియా ! నేను కొద్దిమాసాలు నీకు దూరమవుతున్నాను కదా! నీకు ఆదేశం నుంచీ ఏమి కావాలో చెప్పు, నీవు కోరినవి తెస్తాను" అన్నాట్ట. దానికామె " మహారాజా! అక్కడ ఏమేమి  కొత్త వస్తువులు లభ్యమవుతాయి?"అని అడిగిందిట. దానికి మహారాజు" అక్కడ బంగారు గనులున్నట్లు విన్నాను. బంగారు నగలు బాగా లభ్యం కావచ్చు "అన్నాట్ట.  వెంటనే ఆ నాలుగవ భార్య "ఐతే ప్రభూ నాకు ఏడు వారాల కొత్త నగలు, నాణ్యమై నవీ, కొత్త నమూన్నాలోవి అంద మైనవీ తెండి "అని కోరిందిట. సరే అనిచెప్పి, మహారాజు రెందవ భార్య దగ్గరకెళ్ళి "రాణీ! మీకు విదేశాలనుండీ ఏమి కావాలి? "అని అడిగాట్ట.    ఆమె "ప్రభూ! అక్కడ విరివిగా మనదేశంలో కంటే భిన్నంగా ఉండేవి ఏముంటాయి?"అని అడి గిందిట. దానికి మహారాజు, తెలివైనవాడు కనుక ఈమెకూ బంగారం గురించీ చెప్తే మళ్ళా పేచీలు వస్తాయని భావించి," రాణీ! అక్కడ మంచి పత్త్రి పండుతుందనీ,నాణ్యమైన నేత నేసేవారున్నారనీ విన్నాం. " అనగానే ఆమె," ప్రభూ! నాకు వింతవింత రంగుల మెత్తని, నాణ్యమైన చీరలు తెండి. మన రాజ్యంలో ఎవ్వరూ అలాంటివి చూసికూడా ఉండకూడదు. "అని కోరిందిట. మహారాజు "అలాగే రాణీ!",అనిచెప్పి, ముచ్చటైన మూడో భార్య వద్దకెళ్ళి ,ఆమెనూ 'ఏమికావా లని" అడిగాట్ట. దానికామె ,మనస్సులో 'నేను ముదుసలినై పోతున్నందున , నామేని ఛాయ తగ్గుతున్నందున మహారాజు మూడో, నాలుగో రాణుల వద్దకే ఎక్కువగా వెళుతున్నట్లున్నారు. అందుకని నా అందం పెరిగేలా , నా వన్నె తగ్గకుండా ఉండేలా ఏదైనా కోరాలని'  అనుకుని , " మహారాజా! ఇక్కడ లభించనివీ, అక్కడ మాత్రమే లభించేవీ ఏవైనా నూతనమైనవి అక్కడ ఉన్నాయా!"అని అడిగిందిట.    దానికి తెలివైనమహారాజు, వారిద్దరికీ చెప్పినవి కాక "ఆ దేశంలో చక్కని అరణ్యాలున్నాయనీ, అక్కడ మంచి సువాసనా భరితమైన వనమూలికలు లభిస్తాయనీ, అందాన్ని పెంచేవీ, శరీరపటు త్వాన్ని తగ్గకుండా చేసేవీ ఉన్నాయని విన్నాం రాణీ! "అన్నాట్ట.  వెంటనే రెండో భార్య "ప్రభూ! ఐతే నాకు అలాంటి మంచి మూలికలు శరీర పటుత్వాన్ని తగ్గించ కుండాపెంచేవీ సువాసనా భరితమైనవీ దండిగా తెండి" అందిట. దానికి అంగీకరించి మహారాజు "అలాగే రాణీ! !తప్పక తెస్తాను " అనిచెప్పాట్ట.   మొదటి భార్య, పట్టపురాణీ ఐన ప్రధమకళత్రం వద్దకెళ్ళి "దేవీ! విదేశాలనుంచీ నీకేం కావాలి? మూడు మాసాలు రాజ్యాన్నీ,మిమ్మూవదలి వెళుతున్ననుకదా! మీకోర్కె చెప్తే మీకవి ఎంత కష్ట మైన వైనాసరే తెప్పించి తెస్తాను " అన్నాట. దానికా పట్టపు రాణి"మహాప్రభూ! మీరే నాసర్వస్వమని భావిస్తున్నాను. అది మీకూ తెల్సుకదా! మీరు సుఖంగా,ఆరోగ్యంగా క్షేమంగా రండి, నాకదేచాలు. మరే కోరికలూ నాకు లేవు. మీరు శుభంగా తిరిగి రావటమే నా కోర్కె" అని చెప్పిందిట, మహారాజు ప్రయాణమై వెళ్ళాడు.       మూడు మాసాలు గడచిపోయాయి. రాణులంతా వారు వారు కోరిన వస్తువులకోసం మహా రాజు ఎప్పుడెప్పుడు అవి తెచ్చి అంద జేస్తారా!' అని ఎదురు చూడ సాగారు. ఒక శుభ ఘడియన మహారాజు రాజ్యానికి వచ్చారు . ముందుగా ఆయన ఒక అందమైన అలంకారంగా ఉన్న పెద్ద నగిషీ లు చెక్కిన దంతపు  పెట్టెను నాల్గవభార్య కు పంపారుట. ఆమెదాన్ని తెరచి చూసుకుంది. మహా అధ్బుత మైన ఏడువారాల నగలు కళ్ళు మిరుమిట్లు గొల్పు తున్నాయి. అవన్నీ తీసుకుని ఒక్కో వారం నగలూ అలంకరించుకుని అద్దం ముందు నిల్చుని తన  అందాన్నీ, అవిలభించిన తన  అదృ ష్టాన్నీ తనను తానే పొగుడుకుంటూ, చూసుకుంటూ  ముచ్చటపడి,మురిసిపోసాగింది.     మహారాజు ఒక అందమైన పెద్ద పేటికను మూడవ రాణి అంతఃపురానికి పంపారు. అది చూడగానే ఆమె మహదానందంగా మురిసిపోయి, తెరచి చూసి, దానిలోని మహా నాణ్యమైన, అందమైన రంగు రంగుల చీరలు, వాటి సరిగ అంచులూ, సొగసులూ, పల్లూలూ, చూసుకుని క్షణాని కొకటి మార్చు కుంటూ మురిసిపోసాగింది. ఇహ మహారాజు మూడవ భార్యకు నలుగురు కూర్చునేంత పెద్ద గంపను పంపారు.అదిచూడగానే ఆమె మనస్సు ఆహ్లాదం తో నిండిపోయి, పొంగిపోయింది.దాన్ని విప్పి చూసి హర్షాతిరేకంతో చిందు లేసింది.దానిలోని వనమూపలికలూ, సుగంధ మూలికలూ ఆమె అంతఃపురాన్నంతా సుగంధ భరి తం చేశాయి.మీదు మిక్కిలి సంతసంతో ఆమె అవన్నీ ఎలా ఎలా వాడాలో లిఖించి ఉన్న తాటాకు పత్రాలు పఠిస్తూ ఒక్కోటీ వాడుతూ తనశరీరంలో వచ్చే మార్పులు దర్పణం లో చూసుకుంటూ వింత పోసాగింది.     మహారాజు పట్టపు రాణి అంతఃపురానికి వెళ్ళి,హాయిగా ఆమె చేసే సేవలను ఆనందగా అనుభవిస్తూ సుఖించసాగాడు. కొద్ది నెలలు గడిచాయి.మహారాజు తమ అంతఃపురాలకేసి రాకపోడం మిగతా ముగ్గురు రాణులూ గమనించి, పట్టపురాణి మందిరానికి ఒక రోజున కలసి కట్టుగా ముగ్గురూ వచ్చారు "ఏమమ్మా! మహారాజు మాకూ భర్తే ! నీవు ఇలా ఆయన్ని నీ అంతః పురంలోనే కట్టి పడేసుకోడం సిగ్గుచేటు "అంటూ తగవులాడ సాగారు. దానికి మహారాజు చిఱునవ్వుతో" ప్రియ రాణులారా! ఆగండాగండి. మీరు కోరినవి మీకిచ్చాను. ఆమెకోరినది ఆమెకిచ్చాను. దీన్లో ఆమె తప్పేంలేదు. మీరు అనవసరంగా ఆమెను దూషించడం భావ్యంకాదు "అన్నాడుట.   దానికి ఆముగ్గురు రాణులూ " మహారాజా! ఏంటి ఆమెకోరిందీ! మేముకోరందీనీ?"అని ప్రశ్నించారుట. దానికి ఆ మహారాజు " రాణులారా! మీరు ముగ్గురూ ! నగలూ, చీరలూ, మూలికలూ కోరారు. ఆమె నన్నే కోరింది.  నేను సురక్షితంగా, ఆరోగ్యంగా తిరిగి  రావాలని కోరుకున్నది. ఆమె కోరినట్లే  నేను ఆమె మందిరానికి వచ్చాను. మీరు కోరినవి మీకు పంపాను. ఆమెకోరిక ప్రకారం నేను ఆమె చెంత ఉన్నాను. దీన్లో ఆమె తప్పేముందీ!" అన్నాట్ట. దానికి ముగ్గురు  రాణులూ , తమ తప్పిదం తెల్సుకుని తలలు వాల్చుకుని వెళ్లారుట. ఇదండీ మనం చేసే తప్పు, కోర రానివన్నీ కోరుతాం. అసలు కోరవల్సిన భగవత్సన్నిధిని మాత్రం కోరం.    అందుకే ఆయన  కల్పతరువులా, కామధేనువులా కోరినవన్నీ ఇస్తూనే ఉన్నాడు, మనం కోరుతూనే ఉన్నాం. ఏం కోరుతున్నాం?. "కల్పవృక్షాన్ని కాఫీపొడి కోరుతున్నాం!.’ ఇదా మనం కోరాల్సింది. క్షణ భంగురమూ అశాశ్వతమూ ఐన కోరికలతో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మన మనస్సునే మనం తెల్సుకోలేక పోతున్నాం. జీవన సాఫల్యం మాత్రం మిగిలి పోతూనే ఉంది. జన్మ  రాహిత్యం మాత్రం మనం  కోరడం లేదు. కోరడం లేదు గనుక ఆయన ఇవ్వడం లేదు. ఇహ నైనా అటు వైపు మనస్సును మరలిద్దామా! కోరవలసినదానిని బహ్గవంతుని కోరుకుందామా!                                -రచన-ఆదూరి. హైమావతి.     

ఇదీ తెలుగు ప్రత్యేకత – కాదనగలరా!

  ఇదీ తెలుగు ప్రత్యేకత – కాదనగలరా!      1 - తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి భాషలని ద్రవిడ భాషలంటారు కదా! వీటన్నింటిలోనూ ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగే! దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ భాషలలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య మూడో స్థానం. ఇక ప్రపంచవ్యాప్తంగా పదిహేనవ స్థానం. 2 - తెలుగు అన్న పేరు ఎలా వచ్చిందో చెప్పడం కష్టం. కానీ దీని వెనుక రెండు వాదనలు మాత్రం స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి. కాళేశ్వరం, శ్రీశైలం, భీమేశ్వరం అనే మూడు లింగాల మధ్య ఉన్న ప్రదేశంలో వినిపించే భాష కాబట్టి, త్రిలింగ అన్న పేరు తెలుగుగా మారింది అన్నది మొదటి వాదన. తెన్‌ అంటే ద్రవిదభాషలో దక్షిణం అని అర్థం. మనం దక్షిణాన నివసిస్తాం కాబట్టి తెనుగువారం అయి ఉంటామన్నది రెండో వాదన. తేనెలూరే భాష కాబట్టి తెనుగు అయ్యిందన్నది సాహిత్య అభిమానుల నమ్మకం. ౩ - తెలుగు భాష ఒకటి కాదు రెండు కాదు... దాదాపు మూడు వేల సంవత్సరాలకు పూర్వమే ఉందని అంటున్నారు. అయితే అప్పటికి అది ఇంకా అభివృద్ధి దశలో ఉండి ఉండవచ్చు. కానీ 2500 సంవత్సరాల నాటికి దాన్ని ప్రజలు విస్తృతంగా మాట్లాడుకుని ఉంటారు. అప్పటి నాణేల మీదా, కావ్యాలలోనూ తెలుగు పదాలు కనిపించడమే దీనికి ఉదాహరణ. 2,200 సంవత్సరాలకు పూర్వం హలుడు ప్రాకృత భాషలో రాసిన గాథసప్తశతిలో సైతం తెలుగు పదాలు విస్తృతంగా కనిపిస్తాయి.   4 - మహాభారతంలోనూ, రుగ్వేదంలోనూ ఆంధ్రుల ప్రసక్తి ఉన్న విషయం తెలిసిందే! భారతానికి ముందు రామాయణంలో సైతం తెలుగు ఉండే ఉంటుందని ఓ ఆలోచన. శ్రీరాముడు సీతమ్మను వెతుక్కుంటూ మన మార్గం గుండానే పయనించాడని అంటారు. ఆ సమయంలో జటాయువు పడిపోయిన చోటుని చేరుకున్నాడు. అక్కడ సీతమ్మ కోసం పోరాడి నేలకొరిగిన జటాయువుని చూసి ఆయన ‘లే పక్షి’ అన్నాడనీ... అదే తర్వాత కాలంలో లేపాక్షి అయ్యిందని ఓ నమ్మకం.       5 - తెలుగులోని ప్రతి పదమూ అచ్చుతో అంతమవుతుంది. అలా అచ్చుతో అంతమవుతుంది కాబట్టి దీన్ని అజంత భాష అంటాము. చాలా కొద్ది భాషలు మాత్రమే ఇలా అచ్చుతో అంతమవుతాయి. వాటిలో ఇటాలియన్ ఒకటి. అందుకే ఇటలీ యాత్రికుడు నికొలో మన భాషను ‘ఇటాలియన్ ఆఫ్‌ ద ఈస్ట్‌’గా అభివర్ణించాడు.   6 - మన దేశంలో తెలుగువారి సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక ఈమధ్య కాలంలో అమెరికాకి తెలుగువారి వలసలు ఎక్కువగా సాగాయన్న విషయమూ తెలిసిందే! కానీ మలేసియా, ఫిజి, మారిషస్, సౌదీ అరేబియా, మయమ్నార్‌ వంటి దేశాల్లోనూ తెలుగువారి సంఖ్య గణనీయంగానే ఉంది. వీరే కాకుండా శ్రీలంక వంటి కొన్ని ప్రదేశాలలోని ఆదిమజాతివారు తెలుగు మాట్లాడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.   7 - తెలుగు, సంస్కృతం అంత ప్రాచీనం కాకపోవచ్చు. అక్కడ ఉద్భవించినంత సాహిత్యం ఇక్కడ పుట్టి ఉండకపోవచ్చు. కానీ తెలుగు కావ్యాలు సంస్కృతానికి ఏమాత్రం తీసిపోవు. మొదటి నుంచి చివరికి, చివరి నుంచి మొదటికి… ఎటు చదివినా ఒకేలా తలపించే కావ్యాలు; ఒకే కావ్యంతో రెండు రకాల అర్థాలను స్ఫురింపచేసే ద్వర్థి కావ్యాలు; ఒకే ఒక్క అక్షరంతో మొత్తం పద్యమే రాసేయడం… తెలుగుకి ప్రత్యేకం. ఇక తెలుగులో ఉన్నన్ని జాతీయాలు, సామెతలు మరే భాషలోనూ ఉండవని కూడా అంటారు.   8 - ఇక ప్రపంచలో సంస్కృతం, తెలుగు రెండే రెండు భాషలలో కనిపించే అవధాన ప్రక్రియ గురించి చెప్పుకోకుండా తెలుగు చరిత్ర సంపూర్ణం కాదు. ఒకప్పుడు సంస్కృతంలో కనిపించి అదృశ్యం అయిపోయిన ఈ ప్రక్రియను తెలుగు కవులు ఇంకా నిలబెట్టుకు రావడం గొప్ప విశేషం. తిరుపతి వేంకట కవుల దగ్గర నుంచి గరికపాటి నరసింహారావు వరకు అవధాన ప్రక్రియను సజీవంగా ఉంచుతూనే వస్తున్నారు. ఎనిమిది మంది దగ్గర నుంచీ వేయి మంది వరకు పృచ్ఛకుల సమస్యాలను పూరిస్తూ సాగించే ఈ అవధాన ప్రక్రియ నిషిద్ధాక్షరి, దత్తపదీయం, ఘంటానాదం వంటి సమస్యలతో మరింత జటిలంగా మారుతుంది.  ఆ సాహితీ యుద్ధంలో విజేతగా నిలిచే అవధాని తెలుగు భాష కీర్తి పతాకను మరింతగా రెపరెపలాడిస్తాడు.   9 - ఇదీ మన తెలుగు గురించి కొన్ని విశేషాలు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుంగు అని పొగిడినా, దేశభాషలందు తెలుగులెస్స అని రాయుడు కొలిచినా… తెలుగులోని ఈ ప్రత్యేకతలకు ముగ్థులయ్యే కదా! అలాంటి తెలుగుని సామాన్య ప్రజానీకానికి చేరువ చేసేందుకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కృషి అంతా ఇంతా కాదు. గ్రంథాలలో ఉండే భాషని కాదని, అందరూ మాట్లాడుకునే వ్యవహారిక తెలుగుని ప్రచారం చేయడంలో ఆయన సఫలం అయ్యారు కాబట్టే… తెలుగు ఇప్పటికీ ఉజ్వలంగా వెలుగుతోంది. అందుకే గిడుగు జయంతి అయిన ఆగస్టు 29న తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకొంటున్నాం. -నిర్జర.  

కాశీ పట్నం చూడర బాబూ!

  కాశీ పట్నం చూడర బాబూ!   ‘కాశీ పట్నం చూడర బాబూ’ అన్న వాక్యం తరచూ వినేదే! ఏదన్నా విచిత్రమైన ప్రదేశం గురించి చెప్పాలనుకున్నా, వింత విషయాన్ని పంచుకోవాలనుకున్నా ఈ మాటని వాడుతూ ఉంటారు. నిజానికి ఆ వాక్యం జానపదుల పాటలోది. ఇప్పుడంటే కాలక్షేపం కావడానికి చాలారకాల మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. టీవీలు, సినిమాలు, వీడియోగేమ్స్, సోషల్‌ మీడియా... ఇలా ఏదో ఒకటి మన చేతికి అందే దూరంలోనే ఉంది. కానీ ఒకప్పుడు వినోదం కావాలంటే చాలా శ్రమించాల్సి వచ్చేది. నాటకాలు, హరికథలు, బుర్రకథలు లాంటి కళారూపాలతోనే వినోదం దొరికేది. అలాంటి సమయంలో ఓ పెట్టెకి ముస్తాబు చేసి, అందులో నాలుగు బొమ్మలు చూపించి సొమ్ము చేసుకునేవారు. దాన్ని జంతర్ మంతర్‌ పెట్టె అనేవారు. ఆ పెట్టెలో కాశీ క్షేత్రం దగ్గర నుంచీ తాజ్‌మహల్‌ వరకూ రకరకాల చిత్రాలు చూపించేవారు. పిల్లలు అలా బొమ్మలు చూస్తుండగా నేపథ్యంలో ఆ బొమ్మలకి అనుగుణమైన పాట పాడేవారు. ఆ పాటే ఇది… పైస తమాషా చూడర బాబూ ఏమి లాహిరిగా ఉన్నది చూడు ఏమి తమాషాలున్నయి చూడు కాశీ పట్నం చూడర బాబూ కలకల లాడే గంగా నదిని కన్నుల కఱవుగ చూడర బాబూ హరిశ్చంద్రుడు సత్యంకోసం ఆలిబిడ్డలను అమ్మిన చోటు అదుగదుగదుగో విశ్వేశ్వరుడు హర హర హర యను భక్తుల చూడు చూచి మోక్షం పొందర బాబూ    ॥పైస॥ హస్తినాపురీ పట్నం చూడు పాండవులేలిన పట్నం చూడు తాజమహలును చూడర బాబు కృష్ణదేవరాయలని చూడు బెజవాడలో కనకదుర్గను భద్రాచలములో రామదాసును కన్నుల పండువుగ చూడర బాబూ చూచి జ్ఞానం పొందర బాబూ ఈ గేయం ప్రేరణగా వాగ్దానం అనే సినిమాలో శ్రీశ్రీ ఒక పాట రాశారు. ‘కాశీ పట్నం చూడర బాబు కల్లా కపటం లేని గరీబు’ అంటూ ఆ పాట సాగుతుంది.  

జయదేవుని అష్టపదులు

జయదేవుని అష్టపదులు   భగవంతుని ఒకో మనిషి ఒకో తీరున కొలుచుకుంటాడు. కొందరు స్వామి నామాన్ని నిత్యం తల్చుకుంటూ కాలం గడిపితే, మరొకొందరు తమ ఇష్టదైవానికి నిత్య కైంకర్యం చేస్తూ తమ భక్తిని చాటుకుంటారు. ఇంకొందరు స్వామిని ప్రియునిగానూ, తాము ప్రేయసిగానూ భావిస్తూ మధురభక్తిలో మునిగితేలుతూ ఉంటారు. చూసేందుకు ఇవి శృంగారంలా తోచినా... జీవాత్మ పరమాత్మల కలియికే వాటి వెనుక ఉండే ఆంతర్యం అంటారు. హిందూమతంలో అలాంటి మధురభక్తికి ఔన్నత్యాన్ని తీసుకువచ్చినవాడు జయదేవుడు. జయదేవుడు 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ సంస్కృత కవి. ఈయన ఒడిషాలోని పూరీకి సమీపంలో ఓ చిన్న గ్రామంలో జన్మించినట్లు తెలుస్తోంది. జయదేవుడు చిన్నప్పటి నుంచే కృష్ణభక్తిలో ఓలలాడేవాడు. ఆ భక్తితోనే కృష్ణుడు తప్ప అన్యమెరుగని ‘పద్మావతి’ అనే దేవదాసీని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులిరువురూ నిత్యం కృష్ణనామ స్మరణలోనే మునిగితేలేవారు. రాజ ఆస్థానంలో కొలువు చేస్తున్నా, ఎలాంటి హంగూ లేకుండా నిరాడంబరంగా జీవిస్తూ ఉండేవారు. జయదేవునికి భక్తితో పాటు పాండిత్యమూ అపారంగా ఉండేది. దాంతో గీతతోవిందం, పీయూషలహరి, దశకృతికృతే వంటి కావ్యాలు రాశారు. వాటిలో గీతగోవిందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కావ్యం 12 అధ్యాయాలలో విస్తరించబడింది. ఒకో అధ్యాయంలోనూ 24 ప్రబంధాలు ఉంటాయి. ఒకో ప్రబంధంలోనూ ఎనిమిది ద్విపదలుతో ఒక గీతం కనిపిస్తుంది. అందుకనే వీటినే అష్టపదులని పిలుస్తారు. జయదేవుని అష్టపదులన్నీ సంస్కృతంలోనే సాగుతాయి. అవి సామాన్యులకి అర్థం కాకపోయినా... ఆ గీతాలలో వినిపించే లయ, కనిపించే శబ్ద సౌందర్యం అత్యద్భుతం. ఈ అష్టపదుల గొప్పదనాన్ని పెంచుతూ చాలా గాథలు ప్రచారంలో ఉన్నాయి. అందులోని ఒక అష్టపదిని జయదేవుడు చదివినప్పుడు, ఆయన భార్య చావు నుంచి బయటపడిందని చెప్పుకొంటారు. మరో అష్టపదిలోని కొన్ని వాక్యాలను స్వయంగా ఆ కృష్ణుడే వచ్చి రాశాడనీ అంటారు. ఈ కథలన్నీ నిజమైనా కాకపోయినా జయదేవుని అష్టపదులకి సాటిరాగల కావ్యాలు చాలా తక్కువని చెప్పుకోవచ్చు. జయదేవుని అష్టపదులకు మరో ప్రత్యేకత కూడా ఉంది. హిందూ మతాన్ని పునర్వైభవం తీసుకువచ్చేందుకు అప్పుడప్పుడే భక్తి ఉద్యమం మొదలవుతోంది. జయదేవుని కృతులు ఆ భక్తి ఉద్యమానికి ఒక అద్బుతమైన ఆలంబనగా నిలిచాయి. సంగీతం ద్వారా నృత్యం ద్వారా కృష్ణభక్తిని నలుచెరగులా ప్రచారం చేసేందుకు సాయపడ్డాయి. తర్వాత కాలంలో చైతన్య మహాప్రభు వంటివారు కృష్ణభక్తిని ఒక ఉద్యమంలా చేపట్టేందుకు ఒక బాటని ఏర్పరిచాయి. జయదేవుని అష్టపదులతో భక్తి, సంగీతం, నృత్యం, సాహిత్యం, చిత్రలేఖనం... వంటి అన్ని రంగాలకీ ఒక ఆలంబన దొరికినట్లయ్యింది. జయదేవుని అష్టపదులని ఇతర భాషలలోకి అనువదించే ప్రయత్నాలు చాలానే జరిగాయి. కానీ నిజంగా అందులోని సౌందర్యాన్ని గ్రహించాలంటే అర్థమయినా కాకపోయినా మూలాన్ని చదువుకోవాల్సిందే! సినిమా పాటగా అయినా, సంగీత రూపకంగా అయినా ఏదో ఒక రూపంలో ఆ అష్టపదులను ఆస్వాదించని వారు ఉండరేమో. తెలుగు చిత్రాలలో సైతం సా విరహే తవ దీనా, ప్రయే చారుశీలే, ధీర సమీరే... వంటి అష్టపదులెన్నో తెరకెక్కాయి. ఇక జయదేవుని అష్టపదులలో రూపొందిన ప్రైవేట్‌ ఆల్బమ్స్ సంగతి సరే సరి. నెట్‌లో ఇవి కావల్సినంతసేపు వినవచ్చు. ఓసారి ప్రయత్నించి చూడండి!   - నిర్జర.

గాంధీజీ మీద ఒక శతకం

గాంధీజీ మీద ఒక శతకం     కృష్ణాజిల్లా గుడివాడ పక్కన ఓ చిన్న గ్రామం - అంగలూరు. ఊరు చిన్నదే కానీ దీని ఘనత మాత్రం అసమాన్యం. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి ప్రముఖులు ఎందరో ఈ గ్రామవాసులే! స్వాతంత్ర్య సంగ్రామంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ ఈ గ్రామ ప్రజలు చాలా చురుగ్గా ఉండేవారు. అలాంటి అంగలూరులో దుగ్గిరాల రాఘవచంద్రయ్య అనే స్వాతంత్ర్య సమరయోధుడు ఉండేవాడు. రాఘవచంద్రయ్య వ్యక్తిగత జీవితం గురించి తక్కువ విశేషాలే తెలుస్తున్నాయి. తెలిసినంతలో ఆయనకు గాంధీజీ అంటే వీరాభిమానం అని మాత్రం తేలుతోంది. గాంధీ పిలుపు విని ఆయన సహాయనిరాకరణోద్యమం వంటి పోరాటాలలో పాల్గొనేవారు. అలాంటి ఓ సందర్భంలో జైలుకి కూడా వెళ్లారు. నీలం సంజీవరెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి కాంగ్రెస్ యోధులు ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. రాఘవచంద్రయ్యగారికి మొదటినుంచీ సాహిత్యం మీద మంచి పట్టు ఉండేది. చదువుకునే రోజుల నుంచి అద్భుతమైన రచనలు చేసేవారు. దానికి తోడు వేదాల నుంచి పురాణాల దాకా శాస్త్రగ్రంథాలన్నింటి మీదా ఆయనకు అవగాహన ఉంది. తనకి ఉన్న పాండితీప్రకర్షతో, సాహిత్యాభిలాషతో రాఘవచంద్రయ్యగారు ఒక శతకాన్ని రాయాలని అనుకున్నారు. కానీ ఎవరి మీద రాయడం. శతక కవులంతా కూడా తమకి ఇష్టమైన దేవుళ్ల మీద శతకాలను రూపొందించారు. కానీ రాఘవచంద్రయ్యగారికి గాంధీజీనే దేవునితో సమానం. అందుకని ఆయన మీదే ఒక శతకాన్ని రాయాలని సంకల్పించారు. అలా గాంధీగారికి ఉన్న 20కి పైగా లక్షణాలని వర్ణిస్తూ 101 పద్యాలలో ‘గాంధిజీ శతకం’ పేరుతో ఒక శతకాన్ని రూపొందించారు. హరిజనసేవ, స్వరాజ్యదీక్ష, అహింసాచరణ, శాకాహారదీక్ష, అహింస, క్షమ, సత్యం, అభయం, కారుణ్యం, నిష్కామసేవ, పితృమాతృభక్తి... ఇలా గాంధీజీలో ఉన్న గొప్ప లక్షణాలని వర్ణిస్తూ ఈ శతకం సాగుతుంది. 1941లో ముద్రించిన ఈ శతకం అప్పట్లో ఒక సంచనంగా మారింది. ప్రస్తుతానికి ఈ శతకం దొరకడం కష్టంగానే ఉంది. ప్రభుత్వపు డిజిటల్‌ లైబ్రరీలో దీని ప్రతి ఉంది. ఆ శతకంలోని ఒక పద్యం మచ్చుకి…   పంచములంచుఁ బిల్చుటది పాపమటంచును బల్కి యెంతయు న్మంచితనమ్ముతో హరిజనమ్ములు నాఁజను పేరు నిచ్చి ధ ర్మాంచితరీతి హైందవుల యాదరణమ్మును బొందఁ జేసి ర క్షించితి కోట్ల సజ్జనుల నెల్లరు మెచ్చఁగ నీవు గాంధిజీ!   (స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా) - నిర్జర.  

స్నేహితులని గెలుచుకునే పుస్తకం - How to Win Friends

స్నేహితులని గెలుచుకునే పుస్తకం - How to Win Friends   వ్యక్తిత్వ వికాస పుస్తకాలు (self sevelopment books) మనకి కొత్తేమీ కాదు. తెలుగు సహా ఏ భాషలో చూసినా, ఇలాంటి పుస్తకాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. తలపండిపోయిన ఫిక్షన్ రచయితలు కూడా కుర్రకారుని ఆకట్టుకునేందుకు వ్యక్తిత్వ వికాస రంగం వైపు అడుగులు వేస్తున్నారు. కానీ ఈ రంగంలో ఎన్ని పుస్తకాలు వచ్చినా.... ఓ ఎనభై ఏళ్ల క్రితం వచ్చిన పుస్తకం ఇప్పటికీ ఓ సంచలనంగానే నిలుస్తోంది. అదే How to Win Friends and Influence People. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి పేరు డేల్ కార్నెగి. నిజానికి ఆయన తాను ఒక పుస్తకం రాయాలనీ, అది ఒక సంచలనంగా మారిపోవాలనీ కోరుకోలేదు. డేల్ కార్నెగి అమెరికాలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. జీవితంలో నిలదొక్కుకోవడానికి సేల్స్మెన్ అవతారం ఎత్తాడు. ఆ ఉద్యోగం అతనికి కావల్సినంత డబ్బుని సంపాదించి పెట్టింది. ఆ డబ్బుతో పాటుగా బోలెడు లోకానుభవాన్నీ ఇచ్చింది. దాంతో డేల్ తనకి ఉన్న అనుభవాన్ని నలుగురికీ పంచే ప్రయత్నం చేశాడు. స్వామికార్యమూ, స్వకార్యమూ పూర్తయ్యేలా.... కుర్రకారుకి మార్కెటింగ్లో పాఠాలు నేర్పించడం మొదలుపెట్టాడు. డేల్ ఇచ్చే లెక్చర్లకి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఎక్కడెక్కడి నుంచో జనం అతని దగ్గర శిక్షణ తీసుకునేందుకు రాసాగారు. కానీ డేల్ మనసులో ఒకటే అసంతృప్తి. తను రిఫరెన్స్ కోసం చూసుకోవడానికైనా, మార్కెటింగ్ రంగంలో ఉండేవారికి మార్గదర్శిగా నిలిచేందుకైనా.... అప్పటివరకూ మార్కెటింగ్కి సంబంధించి ఎలాంటి పుస్తకమూ అందుబాటులో లేదు. పోనీ తనే ఒక పుస్తకం రాద్దామా అంటే, ఏమాత్రం తీరిక లేదయ్యే! పైగా రచనారంగంలో తనకి అనుభవమూ లేదు. అదే సమయంలో డేల్ ఉపన్యాసాలు విన్న ఒక ప్రచురణకర్త అతని దగ్గరకు వచ్చాడు. `నేను మీకోసం స్టెనోగ్రాఫర్ని ఏర్పాటు చేస్తాను. మీరు ఉపన్యసించే సమయంలో సదరు వ్యక్తి, మీ మాటలని యథాతథంగా పుస్తకంలోకి ఎక్కిస్తుది. దానికే కావల్సిన మార్పులు చేసి ఒక పుస్తకంగా అచ్చువేద్దాం,` అని ప్రతిపాదించాడు. డేల్కి ఆ ఆలోచన నచ్చడంతో అతని ఉపన్యాసాలు ఒక పుస్తకంగా రూపొందాయి. ఆ పుస్తకానికి తగిన మార్పులు చేసి 1936లో How to Win Friends and Influence People అన్న పుస్తకంగా తీసుకువచ్చారు. పుస్తకం మార్కెట్లోకి వచ్చిన మొదటి మూడు నెలలలోనే రెండున్నర లక్షల ప్రతులు అమ్ముడుపోయాయి. మొదటి ఏడాదే 17 సార్లు పుస్తకాన్ని ముద్రించాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ పుస్తకం వ్యక్తిత్వ వికాస రంగంలోని అత్యుత్తమ పుస్తకాల జాబితాలో ముందు ఉంటుంది. ఇప్పటిదాకా దాదాపు మూడు కోట్ల ప్రతులు అమ్ముడుపోయింది.     నిజానికి ఈ పుస్తకం మార్కెటింగ్ రంగంలో ఉండేవారి కోసం రాయబడింది. కానీ ఇందులోని సూత్రాలు ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గవి కావడంతో, అందరికీ ఉపయోగంగా నిలిచింది. మనిషి మనసు గెల్చుకోవడం అనేది కేవలం మార్కెటింగ్కు మాత్రమే పరిమితం కాదు కదా! అవతలివారి మనసుని నొప్పించకుండా, వారికి తగిన ప్రాముఖ్యతని ఇస్తూ, వారి ఇష్టాయిష్టాలని తెలుసుకుంటూ... బంధాన్ని నిలుపుకోవడం ఎలాగో ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లోనూ విమర్శించవద్దు, వారిని మనస్ఫూర్తిగా అభినందించండి, ఎదుటి మనిషి చెప్పేది శ్రద్ధగ ఆలకించండి, సంభాషణని స్నేహపూర్వకంగా మొదలుపెట్టండి... లాంటి విలువైన సూచనలతో ఈ పుస్తకం నిండిపోతుంది. ఆ సూచనలు నిజంగా ఉపయోగపడతాయి అనేందుకు రుజువుగా అనేక కథలు, అనుభవాలను జోడిస్తూ పాఠకులలో తగిన నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తారు రచయిత. డేల్ కార్నెగి రాసిన పుస్తకంలో చాలా విశేషాలే ఉన్నాయి. దీన్ని చదివేటప్పుడు పాఠకుడు ఎలాంటి బోర్ ఫీలవడు, ఎవరో తనకి క్లాస్ పీకుతున్నట్లుగా తోచదు, ఇందులోని సూచనలు పాటించడానికి చాలా సులువుగా తోస్తాయి, మధ్యమధ్యలో వచ్చే కథలు చదివిన విషయాన్ని మర్చిపోకుండా తోడ్పడతాయి. అందుకే ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ పుస్తకం ఒక మాస్టర్పీస్గా నిలిచిపోయింది. పుస్తకం ఎలా రాయాలి అన్న విషయం మీద రచయితలకు, పుస్తకం ఎలా ఉండాలి అన్న విషయం మీద పాఠకులకు ఒక ఉదాహరణగా మిగిలింది. కావాలంటే మీరూ ఒకసారి చదివి చూడండి. ఇప్పటికే చదివేస్తే మరోసారి సరికొత్తగా చదివే ప్రయత్నం చేయండి. ఈ పుస్తకం తాలూకు పీడీఎఫ్ నెట్లో ఉచితంగానే దొరుకుతుంది. - నిర్జర.    

శ్రావణ శుక్రవారపు పాట

శ్రావణ శుక్రవారపు పాట       కైలాస గిరిలోను కల్పవృక్షము క్రింద ప్రమధాది గణములు కొలువగాను పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని యడిగె పార్వతపుడు !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! ఏ వ్రతము సంపదల నెలమితోడుతనిచ్చు, ఏ వ్రతము పుత్రపౌత్రాభివృద్ధినొసగు అనుచునూ పార్వతి ఆ హరునియడుగగా పరమేశు డీరీతి పలుక సాగె !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! కుండినంబనియెడు పట్నంబులోపల, చారుమతి యనియేటి కాంతకలదు అత్తమామల సేవ పతిభక్తితో చేసి, పతిభక్తి గలిగున్న భాగ్యశాలి !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! వనిత స్వప్నమందు వరలక్ష్మీ రాబోయి, చారుమతిలెమ్మనుచు చేత చరిచె చరచినంతనే లేచి తల్లి మీరెవరని, నమస్కరించెనా నళినాక్షికీ !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! వరలక్ష్మినీ నేను వరములూ యిచ్చేను, మేల్కొనవె చారుమతి మేలుగాను కొలిచినప్పుడె మెచ్చి కోరిన రాజ్యముల్, వరములనిచ్చినను వరలక్ష్మినే !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! ఏ విధిని పూజను చేయవలెననుచూను, చారుమతియడిగెను శ్రావ్యముగను ఏమి మాసంబున ఏమి పక్షంబున, ఏ వారమూనాడు ఏ ప్రొద్దున !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! శ్రావణమాసమున శుక్లపక్షమునందు, శుక్రవారమునాడు మునిమాపునా పంచకల్వలు తెచ్చి బాగుగా తనునిల్పి, భక్తితో పూజించుమని చెప్పెను !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! చారుమతి లేచి యా శయ్యపై గూర్చుండి, బంధువుల పిలిపించి బాగుగాను స్వప్నమున శ్రీవరలక్ష్మీ చకచక వచ్చి, కొల్వమని పలికెనూ కాంతలారా !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! ఏ విధంబున పూజ చేయవలెనన్నదో, బంధువులు అడిగిరి ప్రేమతోనూ ఏమి మాసంబున ఏమి పక్షంబున, ఏవారమూనాడు ఏ ప్రొద్దున !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!  శ్రావణామసమున శుక్లపక్షమునందు, శుక్రవారమునాడు మునిమాపునా పంచకల్వలు తెచ్చి బాగుగా తనునిల్పి, భక్తితో పూజించుమని చెప్పెను !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! అప్పుడు శ్రావణమది ముందుగా వచ్చెనను, భక్తితో పట్నము నలంకరించి వన్నెతోరణులు సన్నజాజులు, మదిచెన్నుగా నగరు శృంగారించిరి !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! వరలక్ష్మీనోమనుచు వనితలు అందరు, వరుసతో పట్టుపుట్టములు గట్టి పూర్ణంపు కుడుములు పాయసాన్నములూ, ఆవశ్యముగ నైవేద్యములు బెడుదురు !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! కండ్రిమండ్రిగనునుండి బలుదండిగా యెంచి, యొండిన కుడుములు ఘనపడలునూ దండిగా మల్లెలు ఖర్జూర ఫలములూ, విధిగ నైవేద్యములు నిడుదురూ !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! నిండు బిందెలతోను నిర్మలా ఉదకులు, పుండరీకాక్షులకు వారుపోసి తొమ్మిదిపోగుల తోరమొప్పగపోసి, తల్లికి కడు సంభ్రమముతోడను !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !! వేదవిదుడయినట్టి విప్రుని పిలిపించి, గంధమక్షతలిచ్చి కాళ్ళుకడిగి తొమ్మిది పిండివంటలు తోమొప్పగబెట్టి, బ్రాహ్మణునకు పాయసముబెట్టుదూరు !! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!  

తెలుగువాడి జీవితాన్ని కళ్లకు కట్టిన – కాశీయాత్ర చరిత్ర

తెలుగువాడి జీవితాన్ని కళ్లకు కట్టిన – కాశీయాత్ర చరిత్ర     ఒకే ఒక్క పుస్తకంతో సాహిత్య చరిత్రలో నిలిచిపోవడం సాధ్యమేనా అంటే సాధ్యమే! ఆ పుస్తకం అత్యద్భుతమైనదో, అరుదైనదో అయినప్పుడు పాఠకులు దాన్ని తలకెత్తుకోవడమే కాదు, ఆ పుస్తక రచయితను కూడా చిరకాలం తల్చుకుంటారు. అలాంటి అరుదైన పుస్తకం ‘కాశీయాత్ర చరిత్ర’. ఆ పుస్తకాన్ని రాసిన రచయిత ఏనుగుల వీరాస్వామయ్య! మానవ చరిత్రలో యాత్రాసాహిత్యానికి ఒక ప్రత్యేకమైన స్థానం. ఇన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా మనం ఇంకా హుయాన్‌త్సాంగ్, మార్కోపోలో వంటి యాత్రికులని తల్చుకుంటున్నామంటే... కారణం వారు వదలివెళ్లిన స్మృతులే! రుద్రమదేవి వీరత్వం దగ్గర్నుంచీ కృష్ణదేవరాయల గొప్పదనం వరకూ లోకానికి తెలిసింది ఇలాంటి యాత్రా సాహిత్యం వల్లనే! అందుకనే తెలుగులో తొలి యాత్రాగ్రంథంగా పేరొందిన కాశీయాత్ర చరిత్ర గురించి ఇప్పుడు ఇంతగా చెప్పుకొంటున్నాం.   ఏనుగుల వీరాస్వామయ్య వ్యక్తిగత జీవితం గురించి తెలిసింది చాలా తక్కువే! అది కూడా ఆయన తన గ్రంథంలో పేర్కొన్న విషయాల ద్వారా, ఆ గ్రంథానికి రాసిన పీఠికల ద్వారా తెలుస్తోంది. వీరాస్వామయ్య 1780 ప్రాంతంలో చెన్నైలో జన్మించారు. తండ్రి చిన్నప్పుడే చనిపోయినా, కష్టపడి పైకి వచ్చారు. ఇటు హిందూ ధార్మిక గ్రంథాలతోనూ, అటు ఆంగ్లంలోనూ పట్టుసాధించడంతో... బ్రిటిష్‌ అధికారుల వద్ద ట్రాన్స్‌లేటర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఆంగ్లేయులు వేషబాషలు, సంప్రదాయాలు మన దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు వారికి మన దేశాన్ని ఏలేందుకు ఇక్కడి ధర్మసూక్ష్మాలు, ఆచారవ్యవహారాల గురించి ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాలి. వీరాస్వామయ్య వంటి ట్రాన్స్‌లేటర్ల ద్వారానే ఈ సమస్యని అధిగమించగలిగేవారు. అందుకనే వీరాస్వామయ్యకి మంచి పలుకుబడి ఉండేది. ఆ పలుకుబడితోనే ఆయన కాశీయాత్రిను సాగించ తలపెట్టారు. 1830 మే 18వ తేదీన మొదలైన ఆయన కాశీయాత్ర సరిగ్గా 15 నెలల 15 రోజులపాటు సాగింది. వీరాస్వామయ్యగారు వందమందికి పైగా పరివార జనాన్ని తీసుకుని ధూంధాంగా కాశీకి బయల్దేరారు. ఆ రోజుల్లో ఇప్పటిలా రైళ్లు, మోటర్‌ వాహనాలు ఎలాగూ లేవు... కనీసం ఎక్కడికక్కడ వంతెనలు కూడా ఉండేవి కాదు! ఇక రోడ్ల సంగతి చెప్పేదేముంది. నడవడానికి కాస్త వీలుగా ఉన్న బాటను ‘బాటసరాళం’ అని పిలిచి అదే పూలపాన్పుగా భావించి నడిచిపోయేవారు. వీరాస్వామయ్య పరివారం ఈ బాటసరాళం మీద నడుస్తూ, అవసరమైన చోట పడవల సాయంతో నదులను దాటుతూ, అడవులగుండా ప్రయాణం చేస్తూ తన యాత్ర సాగించింది. ఎక్కడికక్కడ సత్రాలలోనో, గుడారాలు వేసుకునో బస చేసింది. ఒంటిమిట్ట, తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, ప్రయాగ, గయ వంటి పుణ్యక్షేత్రాలెన్నో చూసుకుంటూ వీరాస్వామయ్య తన యాత్రను సాగించారు. దారిలో కోల్‌కతా, హైదరాబాదు వంటి మహానగరాలనూ దాటుకుని వెళ్లారు. ఆనాటి బ్రిటిష్‌ పాలనకు కేంద్రాలుగా ఉన్న మచిలీపట్నం వంటి ప్రదేశాలను దర్శించారు. మొత్తానికి ఆయన బృందం మద్రాసు నుంచి కాశీ వరకు ఉన్న దేశాన్ని ఒక చుట్టు చుట్టిందని చెప్పవచ్చు. ఆ అనుభవాలన్నింటినీ వీరాస్వామయ్య ఎప్పటికప్పుడు ఓ గ్రంథరూపంలో నమోదు చేయడమే అసలు విశేషం!   వీరాస్వామయ్య కేవలం బ్రిటిష్‌ అధికారి మాత్రమే కాదు, మహాపండితుడు. దానికి తోడు సునిశితమైన పరిశీలన కలిగినవాడు. దాంతో తను చూస్తున్న క్షేత్రాలను, అక్కడి ఆచారాలను రాస్తూనే.... వాటికి తనదైన అభిప్రాయాలను జోడించారు. ఆ కాలంలో జీవనం గురించి, వేర్వేరు ప్రాంతాల్లో ప్రజల స్వభావం, ఆయా క్షేత్ర మహత్యాల గురించీ కాశీయాత్రలో మనకి విలువైన సమాచారం ఎంతో తెలుస్తుంది. పైగా అప్పటికింకా కొన్ని ప్రదేశాలలో రాచరికం కూడా ఉంది. దాంతో ఇటు బ్రిటిష్‌ పాలకుల తీరు, స్థానిక రాజుల ప్రాభవం కూడా ఈ గ్రంథంలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. వీరాస్వామయ్య ఓ బ్రిటిష్ అధికారి. పైగా ఆంగ్లతరహా విద్యాభ్యాసం పట్ల అభిరుచి ఉన్నవాడు. అందుకనే తన మిత్రులు శ్రీనివాస పిళ్లై, రాఘవాచార్యులతో కలిసి 1853లో హిందూ లిటరరీ సొసైటీ అనే విద్యాసంస్థను నెలకొల్పాడు. అయినప్పటికీ ఆయన గ్రంథం ఆంగ్లేయుల పక్షపాతంతోనో, హైందవ ఆచారాల పట్ల వ్యతిరేకతతోనో కనిపించదు. ఆకాలానికి వీరాస్వామయ్య అభిప్రాయాలు కాస్త ఆధునికంగానే కనిపిస్తాయి. కాశీయాత్రచరిత్ర పుస్తకాన్ని మొట్టమొదటిసారి 1838లో ప్రచురించారు. నిజానికి వీరాస్వామయ్య తన గ్రంథాన్ని అప్పటి వ్యవహారిక భాషలోనే రాశారు. కానీ దాదాపు 200 ఏళ్లనాటి ఆ భాష మనకి ఏమంత సులువుగా అర్థం కాదు. ఎక్కడికక్కడ ఆనాటి పదాలకు అర్థవివరణ సాగినా పాఠకుడు పుస్తకంలో మమేకం అవ్వడానిక కాస్త సమయం పడుతుంది. యేను అని ఉంటే ‘నేను’ అనీ భాట అని ఉన్నది ‘బాట’ కావచ్చుననీ కొన్ని పేజీలు దాటాక కానీ ఇప్పటి పాఠకులకు అర్థం కాదు. అయినా ప్రతి తెలుగువాడూ కాస్త ఓపిక చేసుకుని చదివీతీరాల్సిన గ్రంథమిది. మన పూర్వీకులు ఎవరన్నా తన కాలంలోని విషయాలు చెబుతూ ఉంటే వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో... కాశీయాత్ర చరిత్రలోని ప్రతి పేజీ అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తొలి ముద్రణలకి సంబంధించిన కాశీయాత్ర చరిత్ర కాపీ నెట్‌లో ఉచితంగానే దొరుకుతుంది. ఓసారి ప్రయత్నించి చూడండి!   - నిర్జర.

ఆధునిక నవలకు ఆరంభం – Ulysses

  ఆధునిక నవలకు ఆరంభం – Ulysses       ఇంగ్లిష్లో నవలలు రావడం మొదలై దాదాపు 400 సంవత్సరాలు గడుస్తోంది. కానీ అవన్నీ మన రోజువారీ జీవితంలో జరిగే సంఘటనల గురించో, సాహసాల గురించో రాసినవే! మనిషి మనసులో లోతుల్లోకి వెళ్లే ప్రయత్నం చాలా అరుదుగా జరిగింది. మనిషి ఆలోచనలనీ, ప్రవర్తననీ విశ్లేషించే ప్రయత్నం ఏ నవలలోనూ కనిపించదు. ఆ లోటుని భర్తీ చేసిన మొదటి పుస్తకమే... యులిసీస్ (Ulysses). జేమ్స్ జోయ్స్ అని ఓ ఐర్లండ్ రచయిత ఉండేవాడు. చిన్నకథలు, కవితలు, నాటకాలు రాయడంలో ఆయన దిట్ట. సంగీతం చెబుతూ, చదువు నేర్పుతూ, పాటలు పాడుతూ జీవితాన్ని నెట్టుకొచ్చేవాడు. ఒక్కచోట కూడా నిలకడగా ఉండకుండా ప్రపంచం అంతా తిరుగుతూ ఉండేవాడు. అలాంటి జేమ్స్ జోయ్స్కి వచ్చిన ఆలోచనే యులిసీస్ నవల. ఈ నవలలో ప్రధాన నాయకుడు Leopold Bloom. ఆ బ్లూమ్ అనే ఆయన జీవితంలోని ఒక్క రోజులో జరిగే సంఘటనలతోనే యులిసీస్ నడుస్తుంది. Leopold Bloom ఒక సాదాసీదా యూదుడు. ఐర్లండ్ రాజధాని డబ్లిన్లో ఓ చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు.  16 June 1904న ఆయన జీవితంలో జరిగిన ఘటనలే యులిసీస్ నవలలో కనిపిస్తాయి. స్నేహితునితో వాదన, స్త్రీల పట్ల ఆకర్షణ చెందడం, లేనిపోని గొడవల్లో ఇరుక్కోవడం, అంత్యక్రియలకు హాజరు కావడం, హోటల్కి వెళ్లడం... లాంటి సందర్భాల దగ్గర్నుంచీ తన భార్య వేరొకరితో ప్రేమలో ఉందని తెలుసుకోవడం వరకూ ఈ రోజు అనేకమైన విషయాలు జరుగుతాయి. పైన చెప్పుకొన్న విషయాలన్నీ బహుశా చాలామంది జీవితాల్లో జరిగేవే! కానీ ఆయా ఘటనలని వివరిస్తూనే వాటి వెనుక అంతర్లీనంగా సాగే ఆలోచనలని పేర్కొనడమే యులిసీస్లో ప్రత్యేకతగా నిలుస్తుంది. ఆ వివరణ వల్లే ఈ కథ 700 పేజీలకు పైగా సాగే భారీ నవలగా మారింది. గ్రీకు రచయిత హోమర్ రాసిన ఒడీసే కావ్యం, యులిసీస్ నవలకు ప్రేరణగా చెబుతారు. పాత ఇతివృత్తాన్ని తీసుకుని ఇప్పటి సమాజానికి అనుగుణంగా రాయడం వల్ల కూడా యులిసీస్ను గొప్ప ప్రయోగంగా భావిస్తుంటారు. యులిసీస్ నవలలో ప్రతి పాత్రా, ప్రతి సంఘటనా, ప్రతి సంభాషణా ఏదో ఒక తత్వానికి ప్రతీకగా సాగుతుంది. బ్లూమ్ ఒక సగటు మనిషికి ప్రతినిధిగా నిలిస్తే... అతని స్నేహితుడు స్టీఫెన్ బాధ్యతారాహిత్యానికీ, స్వార్థానికీ, ఆత్మన్యూనతకీ ప్రతీకగా కనిపిస్తాడు. విధి, చావు, ప్రేమ లాంటి ఎన్నో అంశాలు యులిసీస్లో అడుగడుగునా చర్చకి వస్తాయి. యులిసీస్ మొదటి ఓ ధారావాహికగా వెలువడింది. ఆ తర్వాత దీన్ని నవలారూపంలో ప్రచురించారు. యులిసీస్ను నవలగా ప్రచురించీ ప్రచురించగానే ఓ సంచలనంగా మారిపోయింది. అప్పటి వరకూ ఉన్న ప్రేమకథలు, సాహసగాథలకు భిన్నంగా మనస్తత్వ విశ్లేషణతో సాగిన ఈ నవల ఆంగ్ల సాహిత్యంలో మైలురాయిగా నిలిచింది. ఓ సరికొత్త ప్రయోగంగా కొందరు దీనిని తలకెత్తుకుంటే, ఏమాత్రం అర్థం కాని గందరగోళం అంటూ మరికొందరు పెదవి విరిచారు. మొత్తానికి ఓ సరికొత్త అనుభవం కోసం చదివితీరాల్సిన పుస్తకంగా అందరూ ఒప్పేసుకున్నారు. ఇందులోని కొన్ని ఘట్టాలు మరీ అసభ్యంగా ఉన్నాయంటూ అమెరికాలో యులిసీస్ నవలను నిషేదించారు. ఎవరేమన్నా ఆంగ్లసాహిత్యంలో ఒక కొత్త ఒరవడికి మాత్రం యులిసీస్ దారితీసింది. అందుకే సాహిత్యాభిమానులు ఇప్పటికీ యులిసీస్లో పేర్కొన్న జూన 16వ తేదీని కథానాయకుడు బ్లూమ్ పేరు మీదుగా Bloomsday గా జరుపుకొంటారు. - నిర్జర.        

పెద్ద మార్పు తీసుకువచ్చే చిన్న పుస్తకం

పెద్ద మార్పు తీసుకువచ్చే చిన్న పుస్తకం   Who Moved My Cheese?   లోకం తీరు మారిపోయింది. దాని వేగం పెరిగిపోయింది. ఆ ప్రపంచంతో పాటుగా సాగాలంటే నడిస్తే సరిపోదు... పరుగులు తీయాల్సి వస్తోంది. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఆ పరుగుకి సాయపడతాయని కొందరి నమ్మకం! అందుకే ఇప్పుడు ఎవరి ఇంట్లో చూసినా అలాంటి పుస్తకం ఏదో ఒకటి కనిపించి తీరుతోంది. ఈ self- help (వ్యక్తిత్వ వికాస) పుస్తకాల గురించి మాట్లాడుకొనేటప్పుడు, తప్పకుండా వినిపించే ఓ పేరు Who Moved My Cheese? Spencer Johnson అనే రచయిత రాసిన Who Moved My Cheese? రెండు కోట్లకు పైగా ప్రతులు అమ్ముడుపోయింది. దాదాపు 40 భాషలలోకి దీనిని అనువదించారు. చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన పది వ్యక్తిత్వ వికాస పుస్తకాల జాబితాలో ఇది తప్పకుండా కనిపిస్తుంది. ఇంతాచేసి ఈ పుస్తకం పట్టుమని 40 పేజీలు కూడా ఉండదు. కానీ అందులో కనిపించే కథ, ఆ కథని మన జీవితాలకు అన్వయించే తీరే... ఈ పుస్తకం ఇంతటి అభిమానం సాధించడానికి కారణం. చాలా వ్యక్తిత్వ వికాస పుస్తకాలలో ఎడతెగని విశ్లేషణలు, సోత్కర్షలూ కనిపిస్తాయి. పాఠకుడిని తామేదో ఉద్ధరించేస్తున్నాం అన్న స్థాయిలో రచయిత క్లాసులు పీకేస్తుంటాడు. కానీ Who Moved My Cheese? అలా కాదు. కొందరు పాతస్నేహితులు ఓ కథని చెప్పుకోవడంతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది. ఆ స్నేహితులు చెప్పుకొనే కథ కూడా చాలా వింతగా ఉంటుంది. ఆ కథలో నాలుగే నాలుగు పాత్రలు ఉంటాయి. రెండు ఎలుకలు, ఇద్దరు మనుషులు... ఇవే పాత్రలు! ఈ పాత్రలు నిజానికి మనలోని భిన్నమైన స్వభావాలకి ప్రతిరూపాలే అని ముందుగానే చెబుతాడు రచయిత. రచయిత పేర్కొన్న ఈ నాలుగు పాత్రలూ ఒక పద్మవ్యూహంలో (maze) చిక్కుబడిపోతాయి. ఆ పద్మవ్యూహంలో ఎక్కడన్నా జున్ను దొరికితే... అదే వాటికి ప్రాణాధారం. ఆ జున్ను కోసం ఈ నాలుగు పాత్రలు ప్రవర్తించే తీరే ఈ పుస్తకంలో కథాంశంగా ఉంటుంది. పద్మవ్యూహంలో ఎక్కడన్నా ఒక చోట జున్ను కనిపించినప్పుడు ఎలుకలు సంతోషిస్తాయి. కానీ అదే సమయంలో అది ఎక్కువకాలం రాకపోవచ్చన్న జాగ్రత్తలో ఉంటాయి. అందుకే తమ కంటి ముందు ఉన్న జున్ను తరిగిపోయేలోపే, మరోచోట ఎక్కడన్నా జున్ను ఉందేమో అన్న ప్రయత్నాలు మొదలుపెట్టేస్తాయి. కానీ మనిషి అలా కాదు! తన కంటి ముందర కనిపించేదానితో కడుపు నిండిపోతే చాలు... ఇక మరో లక్ష్యం గురించి ఆలోచించని comfort zoneలోకి జారుకుంటాడు. జడంగా మారిపోతాడు. దాంతో ఏదో ఒక రోజున అతని జీవితం తల్లకిందులవక మానదు. ఇక్కడా అదే జరుగుతుంది. ఎదురుగా జున్ను ఉన్నంతకాలమూ ఇద్దరు మనుషులూ పొగరుగా ప్రవర్తిస్తారు. కానీ అది తరిగిపోయేసరికి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు. తన జున్ను ఎక్కడికి పోయిందా అని తెగ ఆశ్చర్యపడిపోతారు.   ఇద్దరు స్నేహితులలో ఒకడు అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుంటే, మరొకరు మాత్రం జున్ను లభించే మరోచోటు కోసం ప్రయాణం ఆరంభిస్తాడు. ఆ ప్రయాణంలో అతను ఎన్నో సత్యాలను తెలుసుకుంటాడు. జీవితం నిరంతరం మారుతూ ఉంటుందనీ, ఆ మార్పుని ముందుగా ఊహించే ప్రయత్నం చేయాలనీ, మార్పుకి అనుగుణంగా మనం సిద్ధంగా ఉండాలనీ, ముందుకు సాగితేనే పరిష్కారం దొరుకుతుందనీ... ఇలా అతనికి ఎన్నో విషయాలు స్ఫురిస్తాయి. ఆ విషయాలన్నింటినీ అతను దారిపొడుగూతా గోడల మీద రాస్తాడు. వాటి ఆధారంగా తన మిత్రడు కూడా ముందుకు నడుస్తాడన్నది అతని నమ్మకం. చివరికి అతను మరో చోట జున్ను కనుక్కుంటాడు. కానీ అతని మిత్రడు అక్కడికి చేరుకున్నాడా లేదా అన్నది రచయిత స్పష్టం చేయడు! వ్యాపారరంగంలో రాణించాలన్నా, ఉద్యోగంలో ముందుకు సాగాలన్నా, జీవితంలో ఎదగాలన్నా... ఏ రంగంలోని వారికైనా సరే... Who Moved My Cheese? విజయం సాధించేందుకు ఓ సరికొత్త మార్గాన్ని చూపిస్తుంది. అతి క్లిష్టమైన విషయాలను ఓ చిన్నపాటి కథలో ఇమడ్చడంతో... చదవడమూ, గుర్తుంచుకోవడమూ తేలిక అనిపిస్తుంది. అందుకనే ఈ పుస్తకం విపరీతమైన సంచలనంగా మారిపోయింది. కేవలం ఈ పుస్తకాన్ని అమ్మేందుకే- Who Moved My Cheese Inc. అనే కంపెనీని స్థాపించారంటే దీని ప్రభావం ఏమిటో అర్థమవుతుంది. మరి వీలైతే ఓసారి చదివి చూడండి!!!   - నిర్జర.

ఇలాంటి పుస్తకాలు కూడా ఉంటాయా!

  ఇలాంటి పుస్తకాలు కూడా ఉంటాయా!     పుర్రెకో బుద్ధి అంటుంటారు పెద్దలు. ఆ మాట ప్రతి రంగానికీ వర్తిస్తుంది. కొందరు రచయితలు శ్రద్ధగా, బుద్ధిగా పుస్తకాలు రాస్తారు. తను రాసిన పుస్తకానికి ఓ ప్రయోజనం ఉండాలనీ, పది మందికీ ఉపయోగపడాలనీ అనుకుంటారు. మరికొందరు ఉంటారు! పుస్తకం రాయాలన్న తపనేకానీ, అది నవ్వులపాలవుతుందేమో అన్న ఆలోచన ఉండదు. అలా చరిత్రలో మిగిలిపోయిన కొన్ని చిత్రమైన పుస్తకాలు ఇవిగో... Crafting with Cat Hair – పాశ్చత్యదేశాలలో పిల్లుల్ని పెంచుకునే అలవాటు ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే వాటి నుంచి విడిపోయే వెంట్రుకలు ఇల్లంతా చిందరవందరగా పడుతుందటాయి. అవి ఊపిరితిత్తులలోకి చేరితే ప్రమాదం అని కూడా వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు. కానీ Kaori Tsutaya అనే రచయిత్రికి ఈ వెంట్రుకలతో అందమైన బొమ్మలు ఎందుకు చేసుకోకూడదు అనిపించిందట. ఇంట్లో పడ్డ పిల్లి బొచ్చుని సేకరించి, దాంతో అందమైన కుచ్చు బొమ్మలు చేయవచ్చంటూ ఏకంగా ఒక పుస్తకమే రాశారు. TEACH YOUR WIFE TO BE A WIDOW – తను పోయిన తర్వాత భార్య ఈ లోకంలో ఎలా నెట్టుకొస్తుందో అన్న అనుమానం ఎవరికైనా కలగక మానదు. కాకపోతే ఏకంగా ‘నేను పోయాక నువ్వు ఏం చేయాలంటే...’ అంటూ ఆమెకి క్లాస్ పీకితే అసలుకే మోసం రాక మానదు. కానీ డొనాల్డ్ రోజర్స్ అనే రచయిత 1953లోనే భార్యలకి ఇలాంటి క్లాసులు పీకడం ఎలా? అనే విషయం మీద ఓ పుస్తకాన్ని రాశారు. Bombproof Your Horse – గుర్రపు స్వారీ గురించి పుస్తకాలు చూశాం, వాటి పెంపకం గురించి పుస్తకాలు చూశాం. కానీ గుర్రాలు ఎలాంటి ప్రమాదాన్నయినా తట్టుకునేలా తర్ఫీదు ఇవ్వడం ఎలా? దెబ్బల్ని ఓర్చుకోవడం, గాయాలని తట్టుకోవడం ఎలాగో గుర్రాలకు అలవాటు చేయడం ఎలా? లాంటి వివరాలతో ఈ పుస్తకం నిండిపోయి ఉంది. How to Poo on a Date – ఓ ప్రేమజంట అలా సరదాగా షికారుకని బయల్దేరారు. ఇంతలో ఆ ప్రియుడికి అకస్మాత్తుగా బాత్రూంకి వెళ్లాల్సిన పని పడింది. ఆ విషయం బయటకి చెప్పాలంటే నామోషి, దాచుకునేందుకు అసాధ్యం! తరతరాలుగా యుగయుగాలుగా ఈ కష్టాన్ని అనుభవించాల్సిందేనా? అంటూ ఓ ఇద్దరు రచయితలు కలం కదిపారు. అభాసుపాలుకాకుండా ‘ఆ’ పని ముగించుకోవడం ఎలా? అన్న సమస్య మీద 144 పేజీల పుస్తకం రాశారు. How to live with an idiot – ఈ లోకంలో చాలామంది మూర్ఖులతో కలిసి జీవించక తప్పదన్నది జాన్ హోవర్ అనే రచయిత అభిప్రాయం. అలాంటివారందరితో ఎలా మెలగాలి అనేందుకు ఆయన ఏకంగా ఈ పుస్తకమే రాశారు. జీవితభాగస్వామి, బంధువు, ఆఫీసరు... ఇలా తప్పించుకోలేని మూర్ఖులతో ఎలా ప్రవర్తించాలో ఈ పుస్తకంలో బోలెడు చిట్కాలు సూచించారు. చిత్రమైన పుస్తకాల జాబితాలో ఇవి కొన్ని మాత్రమే! నలుగురిలో తల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా తోచే పుస్తకాల పేర్లు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఒక్కసారి గూగుల్ చేసి చూడండి. కావల్సినంతసేపు నవ్వుకోవచ్చు. - నిర్జర.    

జీవితాన్ని పాడుచేసే పుస్తకం - The Anarchist Cookbook

  జీవితాన్ని పాడుచేసే పుస్తకం - The Anarchist Cookbook     ఆయుధాన్ని ఉపయోగించడం చేతకాకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అక్షరాన్ని ఉపయోగించడం చేతకాకపోతే పనికిరాని పుస్తకం తయారవుతుంది. దాంతో సమాజమే ప్రమాదంలో పడిపోతుంది. అందుకు ఓ గొప్ప ఉదాహరణ The Anarchist Cookbook.   అది 1969. వియత్నాం యుద్ధంలో అమెరికా తలమునకలైపోయి ఉన్న సమయం. అప్పటికి ఆ యుద్ధం మొదలై 15 ఏళ్లు కావస్తోంది. ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం మధ్య మొదలైన గొడవ ఇంచుమించు ఓ ప్రపంచయుద్ధంగా మారిపోయింది. చైనా, రష్యా వంటి కమ్యూనిస్టు దేశాలన్నీ ఉత్తర వియత్నాంకు మద్దతు ఇవ్వగా... అమెరికా, ఆస్ట్రేలియా వంటి కమ్యూనిస్టేతర దేశాలన్నీ దక్షిణ వియత్నాంకు మద్దతునిచ్చాయి. కేవలం అమెరికా పట్టుదల కోసం సాగుతున్న ఈ పోరులో వేలాదిమంది అమెరికన్ పౌరుల పిట్టల్లా రాలిపోతున్నారు. లక్షలాది మంది నిష్కారణంగా వికలాంగులవుతున్నారు. వియత్నాంలో తాము ఓడిపోతున్నామని అమెరికాకు తెలుసు. కానీ వెనకడుగు వేస్తే తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందో అన్న అహంకారంతో గుడ్డిగా యుద్ధభూమిలోనే నిలిచి ఉంది. దాంతో అమెరికా ప్రభుత్వం పట్ల అక్కడి పౌరులలోనే చెప్పలేని ఆగ్రహం మొదలైంది. తమ ఆగ్రహాన్ని వెలగక్కేందుకు ఏం చేయాలో వారికి పాలుపోలేదు. చిత్రవిచిత్రమైన అలవాట్లు, పద్ధతులను అనుసరిస్తూ... రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామనే భ్రమలో బతకసాగారు. దీనినే COUNTER CULTURE ERA అంటారు. మరోవైపు ప్రభుత్వం మీద నరనరాన విద్వేషాన్ని పెంచుకునే అరాచకవాదులకూ (ANARCHISTS) లోటు లేకుండా పోయింది.   ఆ కాలంలో అమెరికా ప్రజలందరిలోనూ ఉన్న దుగ్థ ‘విలియం పావెల్’ అనే వ్యక్తిలోనూ ఉంది. ఆ ఆగ్రహానికి అక్షరరూపం ఇచ్చేందుకు ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఒక పుస్తకం రాయడం మొదలుపెట్టాడు. The Anarchist Cookbook పేరుతో 1971లో ఆ పుస్తకం ప్రచురింపబడింది. సవాలక్ష పుస్తకాలలో ఇది కూడా ఒకటి కాబోసు అనుకుని దాన్ని చేతిలోకి తీసుకున్నవారు దిగ్భ్రాంతికి గురయ్యారు. కారణం! ఆ పుస్తకం అంతటా అరాచకం ఎలా చేయాలో తెలియచేసే సూచనలే ఉన్నాయి.   గంజాయి మొక్కలని పెంచడం ఎలా, మాదక ద్రవ్యాలని తయారుచేయడం ఎలా, అందుబాటులో ఉండే మందులతో నషాని పొందడం ఎలా... లాంటి ఉపాయాలతో ఈ పుస్తకం మొదలవుతుంది. ఇక రెండో అధ్యాయంలో సమాచార వ్యవస్థను నాశనం చేయడం, ఇతరుల సంభాషణల మీద నిఘా పెట్టడంలాంటి వివరాలు ఉంటాయి. మూడో అధ్యాయంలో కత్తుల దగ్గర నుంచీ తుపాకీల దాకా రకరకాల ఆయుధాలను ఉపయోగించడంలో మెలకువలు కనిపిస్తాయి. నాలుగో అధ్యాయంలో సులువుగా దొరికే వస్తువులతో బాంబులు తయారుచేయడం, వాటితో విధ్వంసం సృష్టించడం కనిపిస్తుంది.   The Anarchist Cookbook పుస్తకం అమెరికా అంతటా ప్రకంపనలు సృష్టించింది. చాలా ప్రదేశాలలో ఆ పుస్తకాన్ని నిషేదించారు. ఆ పుస్తకం ఎంత ప్రమాదకరమో పేర్కొంటూ FBI ఒక నివేదిక రూపొందించింది. అందులో బాంబుల తయారీ విధానాలలో చాలా లోటుపాట్లు ఉన్నాయనీ... వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తే, తయారుచేసేవారే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందనీ హెచ్చరికలు వినిపించాయి.   మరోవైపు ఆ పుస్తక రచయిత మనసు కూడా మారింది. తాను ఏదో కోపంలో రాశాననీ ఆ పుస్తకాన్ని ప్రచురించడం ఆపివేయమనీ ప్రచురణకర్తలను కోరాడు. కానీ ఏం లాభం! పుస్తకం మీద కాపీరైట్ ప్రచురణకర్త వద్దే ఉండటంతో... లాభాలు తెచ్చిపెడుతున్న ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేందుకు ఒప్పుకోలేదు. ఆ కాపీరైట్ వేరొకరి చేతికి వెళ్లిన తర్వాత కానీ అందులోని వివాదాస్పద విషయాలను తొలగించలేదు. కానీ ఈలోగా ఇంటర్నెట్ ప్రభంజనం వచ్చేసింది. The Anarchist Cookbook పీడీఎఫ్ కాపీ విచ్చలవిడిగా ఆనలైన్లో దొరకడం మొదలైంది.   ఎవరికన్నా జీవితంలో అసంతృప్తి, సమాజం మీద కోపం ఉన్నప్పుడు... దాన్ని ఎలా వెళ్లగక్కాలా అని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటివారి చేతికి The Anarchist Cookbook దొరికితే ఇంకేమన్నా ఉందా! అందుకనే చాలా సందర్భాలలో విచక్షణారహితంగా అమాయకుల మీద కాల్పులు జరిపేవారి దగ్గరా, బాంబులు తయారుచేసే వారిదగ్గరా ఈ పుస్తకం కనిపిస్తోంది. నోరు జారిన మాటలాగానే, చేయి జారిన అక్షరాన్ని కూడా వెనక్కి తీసుకోలేమని నిరూపిస్తోంది. - నిర్జర.  

ఆత్మహత్య చేసుకోమంటూ ఉత్తరం పంపారు

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌. ఈ పేరు ఎవ్వరికీ కొత్త కాకపోవచ్చు. అమెరికాలో నల్లవారి పట్ల ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు లూధర్‌ కింగ్‌. నల్లవారికి బస్సులో సీటు ఇవ్వకపోవడంతో మొదలైన ఉద్యమాన్ని పౌరహక్కుల పోరుగా మార్చినవాడు. ఒకానొక సమయంలో లూథర్‌ కింగ్‌ను అడ్డుకోవడం అక్కడి ప్రభుత్వ తరం కాలేదు. అతన్ని నిర్బంధించే ప్రయత్నం చేసిన ప్రతిసారీ, ఉద్యమం మరింత బలపడసాగింది. లూథర్‌కింగ్‌కు కమ్యూనిస్టుల సహకారం కూడా ఉందేమో అని అక్కడి ప్రభుత్వం నమ్మింది. ఒకవేళ అదే నిజమైతే అమెరికా సమాజం కుప్పకూలిపోయే అవకాశం ఉందని భయపడింది. ఎలాగొలా ఆయన మీద ఒక కన్ను వేయాలని నిశ్చయించుకుంది. దాంతో అమెరికా గూఢచారి సంస్థ FBI రంగంలోకి దిగింది. లూథర్‌ కింగ్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు... లాంటి సూక్ష్మమైన వివరాలన్నింటినీ సేకరించింది. ఆయన ఫోన్లని ట్యాప్‌ చేసి కింగ్‌ మాట్లాడుతున్న సంభాషణలన్నింటినీ రికార్డు చేసింది. వ్యక్తులను అణచివేసే ధ్యేయంతో సాగిన ఈ తరహా గూఢచర్యానికి ‘COINTELPRO’ అని ఓ ముద్దుపేరు కూడా పెట్టుకుంది. FBI అనుమానించినట్లుగా లూథర్‌ కింగ్‌కు కమ్యూనిస్టులతో ఎలాంటి సంబంధాలూ లేవని తేలింది. కానీ ఆయన కొందరు స్త్రీలతో సాగించిన ఫోన్ సంభాషణలు శృతిమించాయని చెబుతారు. అసలే లూథర్ కింగ్ స్త్రీలోలుడు అంటూ ఒక ప్రచారం ఉంది. ఈ సంభాషణలు కనుక బయటపడితే లూథర్ కింగ్‌ పరువు మరింత దిగజారిపోవచ్చని FBI మురిసిపోయింది. దాంతో ఆ సంభాషణలు ఉన్న టేప్‌లను ఉపయోగించి లూథర్ కింగ్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేయాలనుకుంది. 1964లో FBI లూథర్ కింగ్‌కు ఒక పార్సిల్ పంపింది. అందులో ఆయనను ఇబ్బందిపెట్టే టేప్‌లతో పాటుగా ఒక ఉత్తరాన్ని కూడా జతచేసింది. ఇదంతా FBIనే చేస్తోందని కింగ్‌కు అనుమానం రాకుండా ఉండేందుకు... ఎవరో ఆకాశరామన్న రాసినట్లు ఉత్తరం రాసింది. ‘నిన్ను గౌరవంగా సంభోదించడానికి కూడా నాకు మనసు రావడం లేదు. నువ్వు మా నీగ్రోల పాలిట శాపానివి. తెల్లవాళ్లకంటే పాపాత్ముడివి. నీకు ఎలాంటి విలువలూ లేవు. నీ పాపం పండింది. అంతం దగ్గరపడింది. నువ్వు సాధించిన నోబెల్‌ బహుమతి సహా ఏ అవార్డూ ఇక నిన్ను రక్షించలేదు. నిజాన్ని దాచడం ఎవ్వరి వల్లా కాదు! కింగ్‌ నీ పని అయిపోయింది. ఇక నీకు ఒక్కటే దారి మిగిలింది. అదేమిటో నీకు తెలుసు. ఆ పని చేయడానికి నీకు 34 రోజుల గడువుని మాత్రమే ఇస్తున్నాను. ఈలోగా నువ్వా పని చేయలేదో... నీ నిజస్వరూపాన్ని దేశం ముందర నిలబెడతాను’ అన్నదే ఆ ఉత్తరంలోని సారాంశం. గట్టివాడైన లూథర్ కింగ్‌ సహజంగానే తనకు వచ్చిన ఉత్తరాన్ని పట్టించుకోలేదు. అయినా దురదృష్టం ఆయనను వెంటాడింది. 1968లో ఒక ఉన్మాది చేతిలో కింగ్ చనిపోయాడు. కానీ ఆపాటిలే ఆయన మొదలుపెట్టిన పౌరహక్కుల ఉద్యమం కావల్సిన హక్కులను రాబట్టుకొంది. 1975లో FBIకి చెందిన కొన్ని రహస్య పత్రాలు వెలుగుచూసినప్పుడు, ఆనాటి ఉత్తరం నకలు కూడా బయటపడింది. దాంతో మారుపేరుతో FBI రాసిన ఈ ఉత్తరం గురించి ప్రపంచానికి తెలిసివచ్చింది. FBI రికార్డు చేసిన లూథర్ కింగ్ సంభాషణలను మాత్రం బహిర్గతం చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ రికార్డులను బహిర్గతం చేయవలసిందిగా కొందరు కోర్టు మెట్లని ఆశ్రయించినా ఉపయోగం లేకపోయింది. 2027 వరకూ ఈ రికార్డులు రహస్యంగానే ఉంచాలంటూ కోర్టు పేర్కొంది. లూథర్‌ కింగ్‌ గురించి ఉన్న అపవాదు నిజమా కాదా అన్నది తెలియాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే! ఇంతకీ ‘నీకు ఒక్కటే దారి మిగిలింది. అదేమిటో నీకు తెలుసు. ఆ పని చేయడానికి నీకు 34 రోజుల గడువుని మాత్రమే ఇస్తున్నాను,’ అన్న బెదిరింపుకి అర్థం ఏమిటి? లూథర్‌ కింగ్‌ని చనిపోమంటూ FBI సూచించిందని చాలామంది వాదన. అతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత, అక్రమసంబంధాలే అతని ఆత్మహత్యకు కారణంగా ప్రచారం చేయాలన్నది FBI వ్యూహమని అంటారు. అయితే FBI ఆ వాదనను వ్యతిరేకిస్తోందనుకోండి. ఏది ఏమైనా ఒక ఉద్యమకారుడిని ఆత్మహత్య చేసుకోమంటూ ప్రోత్సహించిన ఉత్తరంగా ఈ లేఖ మిగిలిపోయింది. లేఖాసాహిత్యంలో ఈ ఉత్తరాన్ని ఓ అరుదైన సందర్భంగా పేర్కొంటూ ఉంటారు.   - నిర్జర.

జీవితాన్ని మార్చేసే The Art of War పుస్తకం

  జీవితాన్ని మార్చేసే The Art of War పుస్తకం       2,500 సంవత్సరాల క్రితం రాసిన ఒక పుస్తకం ఇప్పటికీ అద్భుతాలు సృష్టిస్తోంది. చదివిన ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తోంది. అవడానికి యుద్ధానికి సంబంధించిన పుస్తకమే అయినా... జీవితమనే యుద్ధంలో విజయం సాధించేందుకు సాయపడుతోంది. ఈపాటికి పాఠకులకి ఆ పుస్తకం పేరు గుర్తుకువచ్చే ఉంటుంది. ఒకవేళ మర్చిపోయి ఉంటే... తిరిగి గుర్తుచేసుకునే ప్రయత్నం చేద్దాం. చైనా వీరుడు సన్జు (sun tzu) రాసిన The Art of War ని మరోసారి తల్చుకుందాం. రాసింది అతనేనా! యుద్ధం చేయడం ఓ కళ (The Art of War) అనే పుస్తకాన్ని ఎప్పుడో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో రాశారని చెబుతారు. అప్పట్లో హెలూ అనే రాజు దగ్గర సన్జూ సైన్యాధ్యక్షునిగా ఉండేవాడట. ఆయనే ఈ పుస్తకాన్ని రచించారని ఓ నమ్మకం. అయితే ఈ పుస్తకం మరీ అంత పాతదేమీ కాదనీ, సన్జూ దీనిని రాయలేదనీ, అనాదిగా చైనా యుద్ధవీరులు ఆచరిస్తున్న సూత్రాలన్నీ కలిపి ఎవరో ఈ పుస్తకాన్ని సంకలనం చేశారనీ చాలారోజులు వాదించేవారు. కానీ సన్జు అనే వీరుడు నిజంగా ఉన్నాడనీ, ఆయనే ఈ పుస్తకాన్ని రాశాడని చెప్పేలా ఈ మధ్యకాలంలో కొన్ని తవ్వకాలు రుజువుచేస్తున్నాయి. అంతగా ఏముంది? The Art of War పుస్తకంలో మొత్తం 13 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్క అధ్యాయంలో యుద్ధానికి సంబంధించిన ఒకో తంత్రం గురించి రాసుకొచ్చారు. ఉదాహరణకు- యుద్ధానికి సిద్ధపడటం ఎలా అని మొదటి అధ్యాయంలో ఉంటే, శక్తిని వినియోగించుకోవడం ఎలా అని ఐదో అధ్యాయం చెప్పుకొస్తుంది. పరిస్థితులని బట్టి వ్యూహాలను మార్చుకోవడం ఎలా, గూఢచారులను ఎలా వినియోగించుకోవాలి, సైన్యాన్ని ఎలా వాడుకోవాలి... ఇలా ఒకటేమిటి! ప్రతి అధ్యాయమూ ఓ ఉపయుక్తమైన విషయంతో నడుస్తుంది. అనుభవమే పుస్తకంగా సన్జు చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న తన రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడాడని ప్రతీతి. ఆఖరికి రాజసభలో నాట్యం చేసే నేట్యకత్తెలతో కూడా ఒక అద్భుతమైన సైన్యాన్ని నిర్మించాడట. ఆ ప్రతిభను గమనించిన రాజుగారు సన్జుని సర్వసైన్యాధ్యక్షునిగా నియమించాడని చెబుతారు. అలా యుద్ధతంత్రంలో తనకి ఉన్న అనుభవాన్నంతా రంగరించి సన్జు ఈ పుస్తకాన్ని రాశాడన్నమాట! ఆసియా నుంచి అమెరికా వరకు The Art of War పుస్తకం చైనాలో గొప్ప ప్రచారం పొందింది. రాజు దగ్గర నుంచి సైనికుడి దాకా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. క్రీ.శ ఎనిమిదో శతాబ్దం నాటికి ఈ పుస్తకం జపాన్, కొరియా వంటి ప్రాంతాలలో కూడా అద్భుతాలు చేయడం మొదలుపెట్టింది. క్రమేపీ ఈ పుస్తకం ఆసియాను దాటుకుని ఇతర దేశ భాషలలోకి అనువాదం కాసాగింది. దానిని చదివన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకునిగా మారింది. అలా నెపోలియన్ అద్భుతాలు సాధించేందుకు ఈ పుస్తకమే కారణం అని చెబుతారు. అంతదాకా ఎందుకు? ఈ మధ్యనే గల్ఫ్ యుద్ధంలో అమెరికా విజయం సాధించేందుకు కూడా అప్పటి అమెరికా సైన్యాధ్యక్షుడు కొలెన్ పావెల్ ఈ పుస్తకాన్ని అనుసరించడమే కారణమట! చైనా దేశస్తులు దేవుడిగా కొలుచుకునే మావోని ప్రభావితం చేసింది కూడా ఈ పుస్తకమే అని ఓ ప్రచారం ఉంది. ప్రతి సందర్భంలోనూ! 20వ శతాబ్దంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత పెరగడంతో The Art of Warకి కూడా ప్రచారం పెరిగిపోయింది. ఆ పుస్తకాన్ని జీవితంలోని ప్రతి సందర్భంలోనూ వినియోగించే ప్రయత్నం మొదలైంది. లాయర్లు అద్భుతంగా వాదించడానికీ, వ్యాపారంలో ముందుకు దూసుకుపోవడానికీ, ఆటల్లో గెలవడానికీ... ఆఖరికి అమ్మాయిలను డేటింగ్కు పిలవడానికి కూడా ఈ పుస్తకంలోని సూక్తులను ఆచరిస్తున్నారు. అంతదాకా ఎందుకు? ఈ మధ్యనే ఒక సినిమాలో వినిపించిన ‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు’ అన్న మాట The Art of Warలో కనిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన సందేశాలు ఆ పుస్తకంలో అడుగడుగునా పలకరిస్తాయి. ఇంత గొప్ప పుస్తకం కేవలం 100 పేజీల లోపే ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. పైగా పెద్దగా ఖరీదు కూడా చేయదు. మరెందుకాలస్యం? వెంటనే ఈ పుస్తకాన్ని కొనేయండి. లేదంటే ఇంటర్నెట్లో అయినా ఈ పుస్తకం పీడీఎఫ్ ఉచితంగా లభిస్తుంది. ఓసారి చదివి చూడండి!! - నిర్జర.    

తెలుగు ఉన్నంతకాలం వినిపించే పాట – సినారే!

నిండైన విగ్రహం. కదిపితే సెలయేరులా జాలువారే సాహిత్యం. కవికి గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తిత్వం- ఆ సినారే ఇక లేరన్నది జీర్ణించుకోలేని సత్యం. ఎంత చిన్న సాహితీ వేడుకకైనా, పిలవగానే వచ్చి అందించే ఆశీస్సులు ఇక ఉండబోవు. ఏటా తన జన్మదినాన వెలువరించే కొత్త పుస్తకాలకి ఇక సెలవు! తెలుగునాట సాహిత్య అభిమానులంతా చెమర్చిన కళ్లని అదుముకుంటూ, గుండెని తడుముకుంటూ... సినారేకి ఇక సెలవంటూ కడసారి వీడ్కోలు చెప్పుకొంటున్నారు. ఆనాటి మధురస్మృతులు, ఏనాటికీ చెరిగిపోని తీపి గురుతులు అయిన ఆయన జీవితాన్ని తల్చుకొంటున్నారు. సింగిరెడ్డి నారాయణరెడ్డి అంటే బహుశా ఎవరూ గుర్తుపట్టలేరేమో! కానీ సినారే అంటే మాత్రం, ఠక్కున తెలుగు కవిత్వపు దివిటీని చేపట్టిన కవి గుర్తుకువస్తారు. తెలుగునాట ఏఎన్నార్, ఎన్టీఆర్‌ అంటే ఎంత ప్రచారం ఉండేదో సినారే పొడి అక్షరాలకి కూడా అంతే ప్రభావం ఉండేది. సినారేది సాహిత్యం నేపథ్యంగా ఉన్న కుటుంబమేమీ కాదు. ఆయనది కరీంనగర్‌లోని ఓ మారుమూల గ్రామం. తండ్రి ఓ సాధారణ రైతు. బీ.ఏ వరకూ సినారే చదివిందంతా ఉర్దూ మాధ్యమంలోనే! కానీ తెలుగు సాహిత్యం పట్ల అభిరుచితో పోస్ట్‌గ్రాడ్యుయేట్, డాక్టరేట్‌ అంతా తెలుగులోనే సాగించారు. ఆ సమయంలో విద్య కోసమే కాకుండా, తన అభిలాషని చల్లార్చుకోవడం కోసమూ విస్తృతంగా పుస్తకాలు చదివేవారు. తెలుగు అధ్యాపకునిగా స్థిరపడిన సినారే, వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి (VC) స్థాయికి చేరుకున్నారు. మరోవైపు కలంతోనూ అద్భుతాలకు తెరతీశారు. తన 23వ ఏట సినారే రచనా వ్యాసంగం మొదలైంది. కవిత్వం, కావ్యాలు, గజల్స్, అనువాదాలు, విమర్శ, పరిశోధనా గ్రంథాలు.. ఇలా ఒకటీ రెండూ కాదు- అక్షరానికి ఎన్ని రూపాలు ఇవ్వవచ్చునో అన్ని రూపాలలోనూ ఆయన రచనలు చేశారు. తెలుగునాట విశ్వనాధ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని అందుకున్న తెలుగువాడిగా నిలిచారు. మానవుడే నాయకునిగా, ప్రపంచమే రంగస్థలంగా సాగిన ‘విశ్వంభర’ అనే కావ్యానికిగాను ఆయనకు ఆ పురస్కారం లభించింది. ‘మనసుకు తొడుగు మనిషి/ మనిషికి ఉడుపు జగతి/ ఇదే విశ్వంభరా తత్వం/ అనంత జీవిత సత్యం’ అని విశ్వంభరలో కనిపించే వాక్యాలు ఆ కావ్యపు లక్ష్యం ఏమిటో చెప్పకనే చెబుతాయి. విశ్వంభరతో పాటుగా కర్పూర వసంతరాయలు, విశ్వనాధ నాయకుడు, అజంతా సుందరి... లాంటి రచనలెన్నో సినారే సృజనకు సాక్ష్యంగా నిలుస్తాయి. ఒకవైపు సాహిత్యాభిమానులకు మాత్రమే అర్థమయ్యే రచనలు చేస్తూనే, తెలుగువాడు ఎక్కడున్నా పాడుకోగల పాటలను రాశారు. సినిమా పాటలు సీరియస్‌ సాహిత్యం కాదనే అపవాదును తరిమికొట్టారు. ఇప్పటికీ మనం క్లాసిక్స్ అని పిల్చుకునే చాలాపాటలు సినారే కలం నుంచి జాలువారినవే!  ‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని’ అంటూ గులేబకావళి కథ (1962)లో ఆయన రాసిన తొలిపాటే సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆపై- వగలరాణివి నీవే సొగసుకాడను నేనే (బందిపోటు), ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో (అమరశిల్పి జక్కన), అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి (బంగారు గాజులు), వస్తాడు నా రాజు ఈ రోజు (అల్లూరి సీతారామరాజు) లాంటి అద్భుతమైన పాటలెన్నింటిలోనో ఆయన కలం పదును కనిపిస్తుంది. అంతదాకా ఎందుకు? ఈ మధ్యవరకూ మనం పాడుకున్న ఒసేవ్‌ రాములమ్మా, జేజమ్మా జేజమ్మా (అరుంధతి) పాటలు కూడా ఆయన రాసినవే! ఇలా వంద కాదు వెయ్యి కాదు... సినారే దాదాపు మూడువేలకు పైగా పాటలు రాశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రతిభ ఉండటం వేరు. ఆ ప్రతిభని లోకం గుర్తించడం వేరు. లౌక్యం చేతనో, మరే కారణం చేతనోగానీ... సినారే ఎప్పుడూ తనకి రావల్సిన గౌరవాన్ని దక్కించుకుంటూనే వచ్చారు. జ్ఞానపీఠ్‌, పద్మశ్రీ, పద్మభూషణ్‌, రాజ్యసభ సభ్యత్వాలతో పాటుగా... అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు వంటి పదవులనీ అలంకరించారు. ఇటు వ్యక్తిగత జీవితంలోనూ, అటు వృత్తి జీవితంలోనూ పరిపూర్ణతని సాధించిన సినారే ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సినారే మరికొన్నాళ్లు మన మధ్యన ఉంటే బాగుండు అనిపించడం సహజమే! కానీ తను లేని లోటు కనిపించకుడా, ఆయన అందించిన సాహిత్యానికి ఏమాత్రం కొరత లేదు. (సింగిరెడ్డి నారాయణరెడ్డి జూలై 29, 1931 - జూన్ 12, 2017)   - నిర్జర

హనుమంతుని జీవితమే విజయానికి పాఠం

మన దేశంలో చిన్న పిల్లల దగ్గర్నుంచీ పండు ముసలి వరకూ హనుమంతుడు అంటే ఇష్టపడని వారు ఉండరు. వారి దృష్టిలో హనుమంతుడు ఒక దేవుడు మాత్రమే కాదు... ఒక హీరో, ఒక రోల్ మోడల్‌. ఆయన వ్యక్తిత్వంలోని ప్రతి లక్షణమూ ఆదర్శప్రాయంగానే కనిపిస్తుంది. సరదా సరదా బాల్యం కృష్ణుని బాల్య లీలలు ఎంతగా ప్రసిద్ధమో, హనుమంతుని బాల్య చేష్టలూ అంతే ప్రసిద్ధం. అవి ఒకోసారి శృతి మించవచ్చుగాక. కోరికోరి ఆపదలకి అవకాశం ఇచ్చి ఉండవచ్చుగాక. కానీ బాల్యం నిర్లిప్తంగా సాగిపోతే ఎలా! ఒక చోట బుద్ధిగా కూర్చునే పిల్లవాడిని చూసి నలుగురూ మెచ్చుకోవచ్చేమో కానీ... మున్ముందు సమస్యలను ఎదుర్కొనేందుకు కావల్సిన చొరవా, చురుకూ అతనిలో లోపిస్తాయి. శ్రేయోభిలాషి సూర్యుని దగ్గర శిష్యరికం చేసినందుకు గురుదక్షిణగా, ఆంజనేయుడు సూర్యుని కుమారుడైన సుగ్రీవునికి మంత్రిగా ఉండేందుకు సిద్ధపడతాడు. వాలి చేతిలో పరాభవం పొందిన సుగ్రీవుడు రుష్యమూక పర్వతం మీద తలదాచుకుంటే... హనుమంతుడు కూడా అతన్ని అనుసరిస్తాడు. ఆ పర్వతం దగ్గరకు వచ్చిన రామలక్ష్మణులను బ్రాహ్మణుని రూపంలో పరీక్షించి.... వారిని సుగ్రీవునితో కలుపుతాడు. హనుమంతుడు తల్చుకుంటే సుగ్రీవునికే నాయకునిగా ఉండగలిగేవాడు. కానీ గురువుగారి మీద అభిమానంతో, సుగ్రీవునికి మంత్రిగా నిలిచి అడుగడుగునా అతనికి శ్రేయస్సుని కలిగించాడు. విధేయత హనుమంతుడు చిరంజీవుడు. కానీ మానవరూపంలో ఉన్న రాముని మీద అభిమానంతో అతని ప్రతి ఆజ్ఞనీ నెరవేర్చాడు. సీతమ్మ జాడని కనిపెట్టడం దగ్గర్నుంచీ, సంజీవని మోసుకురావడం వరకూ ఎలాంటి అహంకారమూ లేకుండా రామునికి సేవ చేశాడు. పెద్దలకు, గురువులకు ఏ విధంగా విధేయంగా ఉండాలో ఆచరణలో చూపించాడు. అందుకనే నవవిధ భక్తులలో ‘దాస్యం’ గురించి చెప్పుకొనేటప్పుడు హనుమంతునే ఉదాహరణగా పేర్కొంటారు. ఆత్మవిశ్వాసం తన నమ్మకం ఎట్టిపరిస్థితుల్లోనూ వృధా కాదని హనుమంతుని విశ్వాసం. ఆ విషయాన్ని నిరూపించేందుకు నారదుడు ఓ కథని కూడా నడిపిస్తాడు. రాముని చేతే హనుమంతునికి మరణదండన విధిస్తాడు. కానీ రామనామాన్ని నమ్ముకున్న హనుమంతుని రామబాణం ఏమీ చేయలేకపోతుంది.  పట్టుదల ఆలోచించకుండా ఏ దీక్షనీ చేపట్టకూడదు. ఒకసారి చేపట్టిన తర్వాత దాని నుంచి ఇసుమంతైనా సడలకూడదు. అందుకు హనుమంతునే ఉదాహరణగా పేర్కొనవచ్చు. హనుమంతుడు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతినపూనాడు. ఎన్ని అవాంతరాలొచ్చినా ఆ ప్రతినకు కట్టుబడే ఉన్నాడు.  కార్యసాధన రామాయణంలో ఏ ముఖ్య ఘట్టాన్ని తీసుకున్నా అందులో హనుమంతుని పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. సాగరాన్ని లంఘించాలన్నా, సీతమ్మ జాడను కనుగొన్నా, లంకానగరాన్నే దహనం చేసినా, రాక్షసులను సంహరించినా, సంజీవని పర్వతాన్ని పెకలించి లక్ష్మణుని రక్షించినా... ఎటువంటి కార్యాన్నయినా సుసాధ్యం చేసిన కార్యశీలత హనుమంతునిది. జ్ఞాని హనుమంతుడు వినయవిధేయతలకు ప్రతీక అని తెలుసు కానీ, ఆయన గొప్ప జ్ఞాని అన్న విషయాన్ని మర్చిపోతుంటాం. సాక్షాత్తూ ఆ సూర్యభగవానుడితో పాటు తిరుగుతూ సకల శాస్త్రాలూ అభ్యసించిన ఘనత హనుమంతునిది. అణిమ, మహిమలాంటి అష్టసిద్ధులనీ గుప్పిట్లో ఉంచుకున్న సామర్థ్యం ఆయనది. అంతదాకా ఎందుకు! రాముని చరిత్రను లిఖించాలనే కోరికతో తనే స్వయంగా ఓ రామాయణాన్ని లిఖించాడని చెబుతుంటారు. మనలో దాగిన శక్తి మనలో ఎవ్వరమూ హనుమంతునితో సమానం కాకపోవచ్చు. కానీ మనకీ ఆయనకీ మధ్య ఒక పోలిక మాత్రం ఉంది. హనుమంతుని శక్తి అపారం. దానిని ప్రపంచం తట్టుకోవడం అసాధ్యం. అందుకనే అవసరం వచ్చి, ఎవరన్నా తన శక్తిని గుర్తుచేస్తేనే కానీ ఆయనకు తనలో ఉన్న బలం తెలియదు. మనం కూడా అంతే! మనలో ఎంత శక్తి ఉందో మనకే తెలియనంత ఆత్మన్యూనతతో ఉంటాము. ఆ శక్తిని గుర్తించిన రోజున అద్భుతాలు చేసేందుకు సిద్ధపడతాము.     - నిర్జర.