పెద్ద మార్పు తీసుకువచ్చే చిన్న పుస్తకం

పెద్ద మార్పు తీసుకువచ్చే చిన్న పుస్తకం

 

Who Moved My Cheese?

 

లోకం తీరు మారిపోయింది. దాని వేగం పెరిగిపోయింది. ఆ ప్రపంచంతో పాటుగా సాగాలంటే నడిస్తే సరిపోదు... పరుగులు తీయాల్సి వస్తోంది. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఆ పరుగుకి సాయపడతాయని కొందరి నమ్మకం! అందుకే ఇప్పుడు ఎవరి ఇంట్లో చూసినా అలాంటి పుస్తకం ఏదో ఒకటి కనిపించి తీరుతోంది. ఈ self- help (వ్యక్తిత్వ వికాస) పుస్తకాల గురించి మాట్లాడుకొనేటప్పుడు, తప్పకుండా వినిపించే ఓ పేరు Who Moved My Cheese?


Spencer Johnson అనే రచయిత రాసిన Who Moved My Cheese? రెండు కోట్లకు పైగా ప్రతులు అమ్ముడుపోయింది. దాదాపు 40 భాషలలోకి దీనిని అనువదించారు. చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన పది వ్యక్తిత్వ వికాస పుస్తకాల జాబితాలో ఇది తప్పకుండా కనిపిస్తుంది. ఇంతాచేసి ఈ పుస్తకం పట్టుమని 40 పేజీలు కూడా ఉండదు. కానీ అందులో కనిపించే కథ, ఆ కథని మన జీవితాలకు అన్వయించే తీరే... ఈ పుస్తకం ఇంతటి అభిమానం సాధించడానికి కారణం.


చాలా వ్యక్తిత్వ వికాస పుస్తకాలలో ఎడతెగని విశ్లేషణలు, సోత్కర్షలూ కనిపిస్తాయి. పాఠకుడిని తామేదో ఉద్ధరించేస్తున్నాం అన్న స్థాయిలో రచయిత క్లాసులు పీకేస్తుంటాడు. కానీ Who Moved My Cheese? అలా కాదు. కొందరు పాతస్నేహితులు ఓ కథని చెప్పుకోవడంతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది. ఆ స్నేహితులు చెప్పుకొనే కథ కూడా చాలా వింతగా ఉంటుంది. ఆ కథలో నాలుగే నాలుగు పాత్రలు ఉంటాయి. రెండు ఎలుకలు, ఇద్దరు మనుషులు... ఇవే పాత్రలు! ఈ పాత్రలు నిజానికి మనలోని భిన్నమైన స్వభావాలకి ప్రతిరూపాలే అని ముందుగానే చెబుతాడు రచయిత.


రచయిత పేర్కొన్న ఈ నాలుగు పాత్రలూ ఒక పద్మవ్యూహంలో (maze) చిక్కుబడిపోతాయి. ఆ పద్మవ్యూహంలో ఎక్కడన్నా జున్ను దొరికితే... అదే వాటికి ప్రాణాధారం. ఆ జున్ను కోసం ఈ నాలుగు పాత్రలు ప్రవర్తించే తీరే ఈ పుస్తకంలో కథాంశంగా ఉంటుంది. పద్మవ్యూహంలో ఎక్కడన్నా ఒక చోట జున్ను కనిపించినప్పుడు ఎలుకలు సంతోషిస్తాయి. కానీ అదే సమయంలో అది ఎక్కువకాలం రాకపోవచ్చన్న జాగ్రత్తలో ఉంటాయి. అందుకే తమ కంటి ముందు ఉన్న జున్ను తరిగిపోయేలోపే, మరోచోట ఎక్కడన్నా జున్ను ఉందేమో అన్న ప్రయత్నాలు మొదలుపెట్టేస్తాయి. కానీ మనిషి అలా కాదు! తన కంటి ముందర కనిపించేదానితో కడుపు నిండిపోతే చాలు... ఇక మరో లక్ష్యం గురించి ఆలోచించని comfort zoneలోకి జారుకుంటాడు. జడంగా మారిపోతాడు. దాంతో ఏదో ఒక రోజున అతని జీవితం తల్లకిందులవక మానదు. ఇక్కడా అదే జరుగుతుంది. ఎదురుగా జున్ను ఉన్నంతకాలమూ ఇద్దరు మనుషులూ పొగరుగా ప్రవర్తిస్తారు. కానీ అది తరిగిపోయేసరికి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు. తన జున్ను ఎక్కడికి పోయిందా అని తెగ ఆశ్చర్యపడిపోతారు.

 


ఇద్దరు స్నేహితులలో ఒకడు అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుంటే, మరొకరు మాత్రం జున్ను లభించే మరోచోటు కోసం ప్రయాణం ఆరంభిస్తాడు. ఆ ప్రయాణంలో అతను ఎన్నో సత్యాలను తెలుసుకుంటాడు. జీవితం నిరంతరం మారుతూ ఉంటుందనీ, ఆ మార్పుని ముందుగా ఊహించే ప్రయత్నం చేయాలనీ, మార్పుకి అనుగుణంగా మనం సిద్ధంగా ఉండాలనీ, ముందుకు సాగితేనే పరిష్కారం దొరుకుతుందనీ... ఇలా అతనికి ఎన్నో విషయాలు స్ఫురిస్తాయి. ఆ విషయాలన్నింటినీ అతను దారిపొడుగూతా గోడల మీద రాస్తాడు. వాటి ఆధారంగా తన మిత్రడు కూడా ముందుకు నడుస్తాడన్నది అతని నమ్మకం. చివరికి అతను మరో చోట జున్ను కనుక్కుంటాడు. కానీ అతని మిత్రడు అక్కడికి చేరుకున్నాడా లేదా అన్నది రచయిత స్పష్టం చేయడు!


వ్యాపారరంగంలో రాణించాలన్నా, ఉద్యోగంలో ముందుకు సాగాలన్నా, జీవితంలో ఎదగాలన్నా... ఏ రంగంలోని వారికైనా సరే... Who Moved My Cheese? విజయం సాధించేందుకు ఓ సరికొత్త మార్గాన్ని చూపిస్తుంది. అతి క్లిష్టమైన విషయాలను ఓ చిన్నపాటి కథలో ఇమడ్చడంతో... చదవడమూ, గుర్తుంచుకోవడమూ తేలిక అనిపిస్తుంది. అందుకనే ఈ పుస్తకం విపరీతమైన సంచలనంగా మారిపోయింది. కేవలం ఈ పుస్తకాన్ని అమ్మేందుకే- Who Moved My Cheese Inc. అనే కంపెనీని స్థాపించారంటే దీని ప్రభావం ఏమిటో అర్థమవుతుంది. మరి వీలైతే ఓసారి చదివి చూడండి!!!

 

- నిర్జర.