బలివాడ కాంతారావు

 బలివాడ కాంతారావు                                                     - డా. ఎ.రవీంద్రబాబు                  తన నవలలు, కథలతో తెలుగు పాఠకులను ఆకట్టుకోవడమే కాదు, ఇతరభాషల్లోకి అనువదాల ద్వారా వారి అభిమానాలను కూడా పొందిన రచయత బలివాడ కాంతారావు. నిత్యం సాహిత్యకారులతో జీవిస్తూ, తన రచనలకు పదును పెట్టుకున్నాడు. సాధారణ జీవితాలను నుండి, జీవిత పాఠాలనే కాదు, సాహిత్య పాఠాలను నేర్చుకుని తన రచనల్లో పొందుపరిచాడు. వాళ్లే నాకథలకు చిరునామా అని గర్వంగా చాటుకున్నారు బలివాడ కాంతారావు.              బలివాడ కాంతారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని మడపాంలో జూలై 3, 1927న జన్మించాడు. తండ్రి సూర్యనారాయణగారే వీరికి తొలి గురువు. పోలుమహంతి సూర్యనారాయణ గారి దగ్గర ఇంగ్లిషు నేర్చుకున్నారు. తాతయ్య రామమూర్తి దగ్గర రామాయణ, మహాభారత కథలను తెలుసుకున్నాడు. తర్వాత నేరుగా విశాఖపట్నంలో ఐదో తరగతిలో చేరారు. అక్కడ వారి అత్తయ్య, అమ్మాయమ్మ దగ్గర భేతాళ, విక్రమార్క కథలు, పంచతంత్రం కథలు విన్నాడు. అవే తర్వాత ఆయన రచలకు ఉపయోగపడ్డాయి. అప్పడే పాఠశాలలో స్కూలు మ్యాగజేన్ కు సంపాదకుడిగా కూడా చేశాడు. పదిహేనో ఏట విశాఖపట్నం ఆర్డినెన్స్ లో చేరాడు. బదిలీకి ఒప్పుకోక ఉద్యోగాన్ని మానేశాడు. తర్వాత నౌకాదళంలో చేరి వివిధ విభాగాల్లో పని చేశారు.              బలివాడ కాంతారావు ఆగస్టు5, 1947లో నేవల్ ఆర్మమెంట్ డిపోలో ఉద్యోగం చేరాక తొలి కథ పరివర్తన రాశారు. ఈ కథ అప్పటి ప్రజాబంధు పత్రికలో ముద్రితమైంది. తర్వాత రాసిన అమ్మ కథ ఆంధ్రసచిత్ర వారపత్రికలో, నేరస్థులు కథ భారతి పత్రికలోనూ అచ్చయ్యాయి. తర్వాత వీరి కథలు ఆనాటి వివిధ పత్రికల్లో వచ్చాయి. వీరు సుమారు 400ల వరకు కథలు రాశారు. ఈ కథలన్నీ ఆయన ప్రేరణ పొంది రాసినవే.              మనిషి-పశువు కథ- వీరు బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక త్రాగుబోతు డ్రైవరకు ఛార్జిషీటు ఇచ్చాడు. మళ్లీ ఇతను తిరుగు బదిలీ అవుతుంటే అతను కన్నీరు కార్చాడు. ఆ సంఘటనే ఈ కథకు ప్రేరణ. అలానే ముంగిస కథ- మేనమామ ఇంటికి వెళ్లినప్పుడు మువ్వల శబ్దంతో తిరుగుతున్న ముంగిసను చూశాడు. దానిమీద కూడా కథ రాస్తావా అని వారి అత్తయ్య సరదాకు అన్నది. కానీ కాంతారావు కథ రాసి వినిపిస్తే ఆవిడ కళ్లల్లో నీళ్లు తిరిగాయట.              బలివాడ కాంతారావు తనకు కథలు రాసేటప్పుడు ముగ్గురు వ్యక్తులు గుర్తుకు వస్తారు అంటాడు. 1. వాళ్ల ఊరిలో మహాభారత గాథలు చెప్పిన గొల్ల రామస్వామి. అతనికి కథను రక్తికట్టించడం బాగా తెలుసంటాడు. 2. చిన్నప్పుడు వీధిలో జరిగిన గొడవ గురించి ఒకరు అన్న మాటలు తప్పొప్పులు బేరీజు వేసి తీర్పు చెప్పాలంటే దూరంగా వుండి గమనించాలి కదా... 3. ఆఫీసు పెద్ద తన క్రింద సబార్డినేటు గురించి రాసిన రిపోర్టు- అడ్మినిస్ట్రేషనుకు లేబరుకు మధ్య యితను లింకులా వున్నాడు.. దీని ద్వారా కాంతారావు కథను సూటిగా క్లుప్తంగా చెప్పడం నేర్చుకున్నాడట.                  బలివాడ కాంతారావు కథలే కాకుండా 38 నవలలు కూడా రాశాడు. ఇవి అనేక భాషల్లోకి అనువాదాలయ్యాయి. దగాపడిన తమ్ముడు నవలను నేషనల్ బుక్ ట్రస్టు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురించింది. సంపంగి నవల హిందీ, కన్నడ భాషల్లోకి, ఇదే నరకం - ఇదే స్వర్గం హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదం పొందాయి. వీరి అడవి మనిషి నాటకం జాతీయ కార్యక్రమంగా ఆకాశవాణిలో అన్ని భారతీయ భాషల్లో ప్రసారమైంది. వీరి వంశధార నవల తన సొంత వూరు గురించి రాశారు. వీరు తమ రచయితలు, రచనల నేపథ్యం గురించి చెప్తూ- మెరుపులా వచ్చే భావాన్ని బీజంగా నాటి చెట్టులా పెరిగేటట్లు చేసే ప్రతిభ రచయితకుండాలని నమ్మని వాడిని. ఈ ప్రతిభ నిరంతరం కృషి లేనిదే రాదు. అంచేత రచయిత చివరి వాక్యం రాసేవరకు విద్యార్థే... విద్యార్థిగా రచయిత ఎవరి దగ్గర నేర్చుకుంటాడు. ప్రజ దగ్గరనించి, గురుత్వం పొందిన రచయితలు చెప్పినది, వాళ్ల సాహిత్యం చదివి నేర్చుకుంటాడు.               వీరికి శ్రీపాద సుబ్రహ్మణ్యం, కొడవటిగంటి కుుటంబరావు, ముళ్లపూడి వెంకటరమణ... ఇలా ఎందరో రచయితలతో సాంగత్యం ఉండేది. భారతదేశంలో సిమ్లా నుంచి కన్యాకుమారి వరుకు, కలకత్తా నుంచి ద్వారకు వరకు తిరిగి ఆయా ప్రదేశలలో తనకు కలిగిన అనుభవాలను, వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని రచనలు చేసేవారు. తన వ్యక్తిత్వం గురించి చెప్తూ- ఈ విశాల విశ్వంలో యెక్కడ చెడు జరిగినా బాధపడ్తాను, ఏ మంచి జరిగినా ఆనందిస్తాను అంటాడు. కాంతారావు ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా పనిచేశారు. 1972లో పుణ్యభూమి నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్టు వచ్చింది. 1986లో వంశధార నవలకు తెలుగు విశ్వవిద్యాలయం బహుమతి లభించింది. 1988లో సాహిత్యంలో ఉన్నత సేవకుగాను గోపీచంద్ అవార్డు కూడా వరించింది.               నిజాయితీ, నిక్కచ్చి, జాలి, దయ, కరుణ వీరి రచనల్లో తొణికిసలాడుతాయి. అవి మానవ సహజాతాలను, హృదయ స్పందనలను ప్రభావితం చేస్తాయి. వీరి రచనలపై పలు విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు కూడా జరిగాయి. ఏది ఏమైనా తెలుగు వారు గర్వించదగిన రచయితల్లో బలివాడ కాంతారావు ఒకరు.                            

అలలు వదలని కడలి

అలలు వదలని కడలి                   దృశ్యాలన్నీ అదృశ్యాలవుతున్నాయి. ఎదలోని ఎద తనలోకి తాను మునగదీసుకొని నిద్రకు ఉపక్రమిస్తుంది. ప్రతి చర్య ప్రతిచర్యను కోరుకుంటుంది. ఆకాశం నీటిని ఇచ్చి మేఘాల ద్వారా మళ్లీ గ్రహించనట్లు. మనుషులు అసలు నచ్చడం లేదు. హటాత్తుగా ఈ మానవ ప్రపంచం గొప్ప అద్భుతమైన వనంగా మారిపోతే...! చెట్లు చేమలు. పక్షులు, జంతువులు, పువ్వులు, లేనవ్వును పూసుకునే మొగ్గలు, తొలికిరణాలను ముద్దాడే మంచు బిందువులు...! ఎంత బావుంటాయి. ఈ కాంక్రీట్ భవనాల మధ్య, మనుషుషులు, వారిలోని మనసులు పూర్తిగా  కాంక్రీట్ గానే మారిపోయాయి. నేనే మారలేక నా జ్ఞాపకాల వలలో చిక్కుకుని ఆత్మను తొవ్వుతున్నాను పగలు రేయి తేడా లేకుండా...               నిద్రకు వెలియై నేనొంటరినై అన్నాడో కవి, అవును దీనంగా నా చూపులు నన్నే ప్రశ్నిస్తున్న వేళ... సమాధానాల కోసం కొత్తదనాన్ని వెతుక్కోలేక పోతున్నా, ఆశకు అనుభవాలకు మధ్య బంధించబడి శిలాక్షరంలా ఉంటున్నా...! నీకో విషయం చెప్పనా...! భూమ్మీద సూర్యప్రతాపం ఎక్కువైంది. వానలు కనుమరు గవుతున్నాయ్. నీవు ఉంటే ఎంత భాధపడే దానివో కదా...! నీవు వర్షంలో తడుస్తుంటే... నీ నల్లటి కురుల్లోదాగలేక ఎన్ని నీటి బిందువులు నక్షత్రాలై నేలపై రాలేవో...! ఎన్ని కవితలు నీ ఆనందపు పొలిమేరల్లోంచి నా సెల్ లో ప్రక్షమయ్యేవో...! ముద్దుల మాటున జల్లులు విరిసిన క్షణాలను ఎలా మర్చిపోగలం. కాలం చెక్కిలిపై నీ అధరాల చప్పుళ్లను లిఖించలేని ఈ చరిత్ర ఎంత కోల్పోయిందో కదా...! అయినా ప్రకృతి అందాలకు మైమరచిన దేవుడు దానికి మించిన సౌందరాన్ని స్పృజించాలనే కాంక్షతో స్త్రీని ఈ భూలోకం మీద సృష్టించి ఉంటాడు. నీ దేహంలో విరిసే ఇంధ్రదనసులు, విరగే నెలవంకలు, నీలికొండల మధ్య సంద్యాసమయాలు, చిరు గరికలై విచ్చే లేలేత పాదాల రవళులు, వన్నెలపువ్వులై విరిసే నవ్వుల పువ్వులు, పవిత్రమైన పూజకోసం పుష్పించే మొగ్గల వేళికొసలు, నడుమొప్పుల్లో దాగిన లతా మణులు... ఎన్నని చెప్పను.!            గతకాలపు ప్రేమ పుటలు నీ ప్రేమని నింపుతంటే.., ప్రస్తుతం, కన్నీరై అక్షరాలను అభిషేకిస్తుంది... ప్రియా...! ఆనందం లేదు, ఆత్మతృఫ్తి లేదు, అరమరికలు లేవు, అభిషేకాలు లేవు, ఆలింగినాలు లేవు, అనురాగాలు లేవు, ఆత్మీయ స్పర్శలు లేవు, వెచ్చటి దేహంలో కాంతి పరావర్తనం చెందే క్షణాలు లేవు. వదలలేని నిశ్వాస తాళ వృంతాలు లేవు. ఘనీభవించిన రెండోజాము చీకటి పెళ్లలు తప్ప. ఇంకా భయం, చేదులాంటి భయం, తీపి లాంటి భయం... తీపికి చేదుకు మధ్య విరక్తి చెందే రుచిలేని భయం. అందుకే... మనుషులకు దూరంగానే ఉంటున్నాను. ఎదను కాల్చే వెలుగులో నాకునేను చలి కాచుకుంటున్నాను. ఆ చలిలోంచే ఈ వాక్యల విస్పోటనలు. ఎప్పటిలాగే మానవ ప్రపంచానికి అంటీ అంటనట్లు బతుకుతున్నాను. ఇమడలేని మనుషుల మధ్య మేఘాల మధ్య సూర్యుడిలా  కాలుతూ తిరుగుతున్నాను. ఏమీ తోచదు. నిస్తేజం. నిస్పృహ.            నీలిలిట్మస్ కాగితాల మనసుల మధ్య ఏ దరికి చేరాలో తెలియదు. ఈ ప్రపంచానికి ఓ సృష్టికర్త ఉన్నాడు అంటారు. నిజంగా ఉంటే... ఈ మనుషుల మీద జాలి, దయ లేకుండా ఎందుకిలా తయారు చేస్తున్నాడు. ఆ దేవుడు కూడా మనిషిలానే ప్రేమ లేనివాడా... ఏమో...! నీవు అన్న ఓ మాట ఎప్పటికీ ఏ సత్యం... నీ నోటి నుంచి నే విన్న నీ భక్తి శ్లోకాలవలే...         నేనెప్పుడూ నీతోనే ఉంటా... నీ లోనే ఉంటా..          అంత ప్రేమ సాధ్యం కాదురా అంటారు ఈ మనోవృద్ధులు. శరీరాలు, ధనంలో సుఖాన్ని వెతుక్కునే అల్పజీవులు. ఎందుకు బతుకుతున్నామో తెలుసుకోలేక. సృష్టిలోని బంధాలన్నీ ఇంతే అనుకుంటారు. అల్ప మనుషులు, అల్ప సంతోషాలు. వీళ్లకు ప్రేమించడమే కాదు, ప్రేమించహబడమూ తెలియదు. రాదు అనుకుంటాను. కొద్ది గా వర్షంలో తడిసి, అబ్బా... తడిసి పోయాను, అని ఆరబెట్టుకునే మనుషులు. అహాన్ని ఎలా వీడతారు. నాది అనే భావనలోనే చిక్కుకొని దానిలోనే అందరిని కుదించి చూస్తారు. ఒక్కసారి బైటకు వస్తే ఎంత ప్రేమమయం. మనిద్దరిలా ఈ లోకం. ఎంత సుఖం... ఆత్మపరమాత్మల సంయోగంలా... నీలా నాలా...         ఈ సాయంత్రం గాలి చల్లదనాన్ని పూసుకొని వీస్తుంది. ఇన్ని పరవాల శరీరాలలో ఒక్కరైనా దాని తాకిడికి స్పందించక పోతారా... వేటూరి అన్నాడు పరువానికి బరువైన యువతీ... ముందు నువ్వు పుట్టి తర్వాత సొగసు పుట్టీ... మొదటి వర్ణన దేహానికైతే, రెండోది ఆత్మకని నా భావన. ఈ మధ్య రవీంద్రుడి  గీతాంజలిని మరోసారి చదువుతున్నా... ఎవేవో కొత్తతెరలు నాలో లేస్తున్నాయి...! నీ కవితల్లో... నిండిన నా పూరణలే గుర్తుకు వస్తున్నాయ్. ఒక్కటి మాత్రం నిజం ప్రియా...! మనసు పుష్పించినప్పుడు, ప్రేమ అంకురించినప్పుడు, విషాదం విరహమై దావానలంలా మనలో రేగినప్పుడు... తప్పక కవిత పూస్తుంది. నీవన్నీ భావాల్లో తేలిన పారిజాతాలే... వాటిలో నిండిన నా మనసుది ఒక జీవితకాలం చాలని ప్రేమ... ...          అలలే సముద్రానికి అలంకరణ, నీ జ్ఞాపకాల మత్తే నాలో ఆ అలల పునరుత్పత్తి.   ఎవరో అన్న గుర్తు...                        కెరటం నా ఆదర్శం                            లేచి పడినందుకు కాదు                         పడినా మళ్లీ లేచినందుకు.                                                  ----  అలల భాషతో   -  డా. ఎ.రవీంద్రబాబు  

గాలిపటం

  గాలిపటం                                                    - వట్టికోట ఆళ్వార్ స్వామి            వట్టకోట ఆళ్వార్ స్వామి. తెలుగులో తొలితరం కథారచయితల్లో ముఖ్యుడు. అంతేకాదు తెలంగాణలో కథకు ఓ భూమిక ఉంది అని చెప్పడానికి ఓ చారిత్రక సాక్ష్యం. ముదిగంటి సుజాతరెడ్డి వట్టికోట ఆళ్వార్ స్వామి కథలన్నీ సేకరించి ముద్రించారు. అవి తెలుగు సాహిత్యంలో నిలిచే మణుల్లాంటివి. ఒక్కో కథ వైవిధ్యంతో కూడి మన మనసునను సునితంగా గాయం చేసి బాగుచేస్తాయి. మనల్ని నిజమైన మనుషులుగా తయారు చేసే మానవీయతను నింపుతాయి. అలాంటిదే గాలిపటం కథ.          ఈ కథ ఉత్తమ పురుషలో రచయిత చెప్తున్నట్లు నడుస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకుని హాస్పెటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు కథలో నాయకుడు. అయితే డాక్టరు రోజూ ఆవుపాలు తాగు ఆరోగ్యానికి అవసరం అని చెప్తాడు. అయితే ఎన్ని చోట్ల తిరిగినా, ఎంతమంది పాలవ్యాపారులను అడిగినా కల్తీలేని ఆవుపాలు దొరకటం కష్టం అని తెలుస్తుంది. అయితే చివరకు వాళ్ల ఇంటికి దగ్గరగా ఉండే ఓ చిన్న దుకాణంలో అడుగుతాడు. ఆ దుకాణం ముసలాయని దొరకుతాయి కానీ మనం కల్తీలేనివని పూర్తిగా నమ్మలేం అంటాడు. అప్పుడు ఆ ఇంట్లో నుంచి ఓ అందమైన స్త్రీ బైటకు వచ్చి దొరుకుతాయి. మీకు ఎన్ని కావాలి? అని అడుగుతుంది. ఆమె మాటలు, చూపులు, ప్రవర్తనలో అతనికి ఆమె తనను కోరుకుంటుంది అని అర్థమవుతుంది. కానీ తనకు పాలు అవసరం కాబట్టి... రోజూ నా కొడుకును పంపుతాను. అద్దసేరు చాలు అని చెప్పి ఇంటికి వెళ్తాడు. జరిగిన విషయం అంతా భార్యకు చెప్తాడు. భార్య సరదాగా ఆటపట్టిస్తుంది. రోజూ పాలు కొడుకుతో డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటూ ఉంటాడు. రోజూ ఆ కొట్టు మీద నుంచి వెళ్లేటప్పుడు ఆమె తనను గమనిస్తున్నదన్న విషయం అతనికి తెలుస్తూనే ఉంటుంది. ఒకసారి భార్యకు కూడా ఆమెను చూపిస్తాడు.              ఒకరోజు బయటకు వెళ్తుంటే ఆమె అతడిని లెక్క సరిచూసుకోవా? అని కొట్టు దగ్గరకు పిలుస్తుంది. వెళ్తాడు. పాలు కల్తీ లేకుండా పోస్తున్నావా? అని అడిగితే... మీకు మనిషి పాలు ఇష్టమేనా...!? నా పాలే కలుపుతున్నా...! అని ఒయ్యారాలు తిరుగుతూ మా మామ లేడు. రాత్రి ఎనిమిది గంటలకు వస్తే...! అని చెప్తుంది. ఇంతలో అతని స్నేహితుడు మల్లేశం వస్తే బతుకు జీవుడా అని అతనితో ఇంటికి వెళ్తాడు. జరిగిన విషయం అంతా భార్యకు చెప్తాడు. రాత్రి ఎనిమిది గంటలకు ఆమెకు తెలియకుండా మల్లేశాన్ని తనను వెంబడించమని చెప్తాడు. అలానే ఆ సమయానికి ఆమె దగ్గరకు వెళ్తాడు. మా మామ వచ్చాడు. ఎక్కడికైనా వెళ్దాం? అని అడుగుతుంది. ఇద్దరూ కలిసి పబ్లిక్ గార్డెన్ కు వెళ్తారు. ఒక చెట్టుకింద కూర్చొంటారు. మల్లేశం వాళ్లని వెంబడిస్తూనే ఉంటాడు.              అతను నీకు పెండ్లికాలేదా... అని అడిగితే ఆమె కండ్ల నీళ్లతో చెప్తుంది. ఆ కొట్లో ఉండే ముసలాయనికి, ఆమెకు ఏ సంబంధం లేదని, అందరూ మోసం చేశారని, పెండ్లి చేస్తామని ఇక్కడకు తెచ్చారని. జనాలకు భయపడి పుట్టిన పసిగుడ్డుని మామయం చేశాడని, ఆ పాలే రోజూ అతనికి పోస్తున్నాని...!  అతనికి కూడా కండ్లలో నీళ్లు తిరుగుతాయి. నీ పాలు తాగిన కొడుకుగా చెప్తున్నాను... నీకు మంచి జీవితం చూపిస్తాను. నీకు పెండ్లి చేసుకోవాలిని ఉంటే మీ మామను వదిసలేసి రా... నిన్ను పదిలంగా కాపాడుతాను అని చెప్తాడు. చివరకు మల్లేశాన్ని, ఆమెను తీసుకొని ఇంటికి వెళ్తాడు అతను. భార్య ఆమెను సాధరంగా ఆహ్వానిస్తుంది. మల్లేశం ఆమెను చేసుకోడానికి ఒప్పుకుంటాడు. ఆ సంతోషంలో ఆమె అతడ్ని ఒక తల్లిలా వచ్చి కౌగిలించుకుంటుంది.                ఈ కథ హృదయాన్ని ద్రవింపజేస్తుంది. మనలోని మూనవత్వపు లోతులను వెలికితీసి కన్నీరు పెట్టిస్తుంది. పైగా ఆళ్వార్ స్వామి ఎక్కడా కుత్రిమమైన వర్ణనలు, వస్తువును దాటిన సన్నివేశాలు కల్పించడు. ప్రతిదీ హృద్యంగా చిత్రీకరిస్తాడు. మధ్యమధ్యలో మనుషుల తీరును, సమాజ పోకడను ఎండగడతాడు. పాలబేరం చేసే ప్రతివాడు కల్తీలేని ఆవుపాలు దొరకవని చెప్పే స్థాయికొచ్చాడు. అటువంటి నగ్నసత్యాన్ని అరమర లేకుండా బయటపెడ్తున్నారు. కల్తీపాలు కల్తీ కానివని చెప్పి అమ్మచూపే చైతన్యం మనోనిబ్బరం దెబ్బతిన్నందుకు సంతషించాను. మరోచోట పురుషుని నిజాయితీని, నైతికతను చెప్తూ.. ఎవరో ఏమేమో తప్పులు చేస్తుంటారని మనం అనుకుంటాం. కానీ అటువంటి వాతావరణం పరిస్థితి ఒత్తిడి మనకు కలిగినపుడు మనము ఏమౌతామో అప్పుడుగాని తేలదు... ఇలాంటివి కథ మధ్య ఇతివృత్తానికి బలాన్ని చేకూరుస్తాయి.                భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఒకరికి ఒకరిమీద పూర్తి నమ్మకం. ఈ కథలో భార్యాభర్తల మధ్య రచయిత కొంటెతనాన్ని చిత్రీకరించినా... ఇరువురికీ ఉన్న సంబంధాన్ని చెప్తూ... ఎవరేమనుకొంటే మనకేంటండీ...! మన సంగతి మనకు తేలియకుండా ఉందా..! ఎవరినీతి వారినే కాపాడుతుంది అని భార్య ద్వారా చెప్పిస్తాడు ఆళ్వార్ స్వామి. అలానే మరోచోట... స్త్రీ, పురుషల మధ్య కోరిక కలగటానికి పురుషుడు కూడా కారణమే అని చెప్తూ... ఒక స్త్రీని వలలో వేసుకోడానికి, ఆమెలో దుర్బుద్ది రేకెత్తించడానికి నూటికి నూటాయాభై వంతు పురుషుని దుష్టచింత, ప్రేరణ ఉంటుందని నా విశ్వాసం అని రాస్తాడు.                కథలో వ్యావహారిక భాష వాడినా పాత్రోచిత భాషగా తెలంగాణ బాషను వాడారు.. రేపో, ఎల్లుండో వస్తడు... నీకోసం మీగడ దాచి ఉంచిన తినరాదూ... ఆ కల్తీ నీకు నుక్సాన్ చెయ్యదులే, మరింత బలం వస్తది... ఇక కథకు గాలిపటం అని పేరు పెట్టడంలోని విశేషం...ఆమె పాత్రకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. కథ ప్రారంభంలో పాల ప్రాస్తావన తెచ్చి, అవే నాయకుడి పాత్రకు జీవంగా చేసి, కథ మధ్యలో వాటికి ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి, చివరలో... ఆ అమ్మాయి అమాత్తంగా వచ్చి నన్ను కౌగిలించుకున్నది. చేపిన ఆమె పాల రొమ్ములు నా చొక్కాను తడిపాయి. అని ముగించడం కథా నిర్వహణకు ప్రాణం. జీవం.          అందుకే ఈ కథ తెలుగు కథా సాహిత్యంలో ఒ కలికితురాయి అనిచెప్పొచ్చు.                                                                                                                                                   -   డా.ఎ. రవీంద్రబాబు                                                               

ముళ్లపూడి వెంకటరమణ

ముళ్లపూడి వెంకటరమణ         - డా.ఎ.రవీంద్రబాబు             తెలుగు కథకు హాస్యాన్ని జోడించారు. సున్నితమైన వ్యంగ్యాన్ని అలంకరించారు. సరికొత్త పదాలను తెలుగు భాషకు అరువిచ్చారు. మన వాకిళ్లలో తిరిగే ఎన్నో పాత్రలను మనకోసం నూతనంగా సృష్టించారు. జీవితంలో ఎన్నో లోతులను చూసి ఆ బాధలను నవ్వులతో ప్రేక్షకుల మదిలో పూయించారు. బాపు బొమ్మకు తన రాతతో వెండితెర ఎక్కించారు. బాపు, రమణల స్నేహం అజరామరం అని స్నేహానికి చిరునామాగా మారారు. అతనే తెలుగువారి ప్రియ కథకుడు, సినిమా రచయిత ముళ్లపూడి వెంకటరమణ.         ముళ్లపూడి వెంకరమణ జూన్ 28, 1931లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరున్న ధవళేశ్వరంలో జన్మించారు. వీరి అసలు పేరు ముళ్లపూడి వెంకటరావు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మద్రాసులో 5,6 తరగతులు... 7, 8 తరగతులు రామండ్రిలో చదువుకున్నారు. ఎస్సెల్సీ పూర్తికాాగానే అనేక చిన్నాచితక ఉద్యోగాలు చేశారు. తర్వాత ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరారు. పత్రికలో సినిమా రిపోర్టరుగా ఉన్న సమయంలోనే సినీ రచయితగా అవకాశం వస్తే వెండితెరవైపు అడుగులు వేశారు. ఆపై ఎన్నో సినిమాలకు కథ, మాటలు అందించారు. నిర్మాతగా కూడా చిత్రాలు నిర్మించారు. ఎక్కువ సినిమాలకు బాపుతో కలిసి పనిచేశారు.         అసలు స్కూల్లో చదివే రోజుల్లోనే రమణ వ్యాసరచన, వక్తృత్వం లాంటి పోటీలలో పాల్గొనేవారు. నాటకాలు కూడా వేసేవారు. 1945లోనే వీరి మొదటి కథ అమ్మమాట వినకపోతే బాలపత్రికలో అచ్చయ్యింది. సొంతగా ఉదయభాను పత్రికను కొంతకాలం నడిపారు. వీరు ఆంధ్రపత్రికలో పనిచేస్తున్న రోజుల్లోనే బుడుగు పాత్రన సృష్టించారు. ఇది తెలుగు సాహిత్యంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పటికీ బాలసాహిత్యంలో బుడుగు ప్రముఖ స్థానం వహిస్తున్నాడు. వీరి రచనలు-         ముళ్లపూడి వెంకటరమణ కథలు - 6 (1964)         వేట కథలు - 4 (1966)         రాజకీయ భేతాళ పంచవింశతి - 25 (1977)         విక్రమార్క సింహాసనం కథలు - 25 (1978)         జనతా ఎక్స్ ప్రెస్ - 5 (1979)         రాధాగోపాలం కథలు - 5 (1980)         ఋణానందలహరి - 23 (1981)         భగ్నవీణలూ భాష్పకణాలు - 7 (1981)         సీతాకళ్యాణం - 10 (1982)         వీరి తర్వాతి రచనలను కలిపి విశాలాంధ్ర వారు 8 సంపుటాలుగా ముద్రించారు.         కోతికొమ్మచ్చి పేరుతో స్వాతి వారపత్రికలో జీవిత చరిత్రను రాశారు.         ముఖ్యంగా 1950-60ల నాటి నగరాల్లోని జీవితాలే వీరి కథల్లో కనిపిస్తాయి. రాజకీయాలు, అప్పులు, ఆకలి, నిరుద్యోగం, ఫలించని ఆశలు, కొత్తజంటల మధ్య వచ్చే తగాదాలు, కుటుంబాల గోలలు... ఇలాంటివే వీరి కథా వస్తువులు. స్వయంగా రమణ అనుభవించిన పేదరికం, ఆకలి ఆకలీ - ఆనందరావు కథలో, నిరుద్యోగం యువరాజు - మహారాజు కథలో ప్రతిబింబిస్తాయి. మధ్యతరగతి జీవితాలు, ఇరుకు గదులు వీరి జనతా ఎక్స్ ప్రెస్ కథలో, సినీ అనుభవాలు విక్రమార్కుని మార్కు సింహాసనం కథల్లో ఉన్నాయి. వీరి కథల్లో హాస్యం, వ్యంగ్యం తొణికిసలాడుతూ ఉంటుంది. వైవిధ్యం, వైరుధ్యుంతో కూడిన తెలుగు పదాలు, పలుకుబడులు, పాత్రలు సృష్టించడం ముళ్లపూడి వెంకటరమణకు చేతనైనంతగా మరొకరికి చేతకాదేమో... అందుకే వీరి హాస్యం పన్నీరు చిలికినట్లు ఉంటుంది అంటారు విమర్శకులు. అసలు వీరి హాస్య కథలు దుఃఖానికి నకళ్లు.           బుడుగు విషయానికి వస్తే మాత్రం అదో అద్భుత సృష్టి. ఈ బొమ్మ నేను, నా పేరు బుడుగు. ఇంకోపేరుంది పిడుగు... ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావలిస్తే మా నాన్నని అడుగు... అని తన గురించి తను పరిచయం చేసుకుంటూ తెలుగు సాహిత్యం లోకి బుడుగు వచ్చాడు. ఈ చిచ్చర పిడుగు బుడుగుతో పాటు లావుపాటి పిన్నిగారు, సీనాగ పెసూనాంబ, రాధ, గోపాళం, రెండు జడల సీత, పక్కింటి పిన్నిగారి మొగుడు, అప్పారావు, గుర్నాధం ... ఇలా ఎంతో మంది రమణ గారి కలం నుంచి వచ్చేశారు.           రమణ పత్రికల్లో ఉన్నప్పుడే బాపుగారితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారి వెండితెరను వెలిగించింది. ఎన్నో అపూర్వమైన చిత్రాలను మనకు అందించింది. రమణ మాట, బాపు గీత అనేలా పేరొచ్చింది వారిద్దరికి. రమణ రక్తసంబంధం చిత్రం ద్వారా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. దాగుడు మూతలు చిత్రానికి కథను అదించారు. 1967లో సాక్షి సినిమాను నిర్మించారు. తర్వాత పంచదార చిలుక, ముత్యాల ముగ్గు, గోరంతదీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, రాధాగోపాళం,  శ్రీరామ రాజ్యం లాంటి ఎన్నో చిత్రాలకు పని చేశారు. మొత్తం మీద 60 సినిమాలకు మాటలు, 25 సినిమాలకు కథలు అందించారు.        ఎన్ని చిత్రాలకు పనిచేసినా... రమణ డైలాగు సెటైరై పేలింది. తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించింది. అవసరమైన చోట పదనుగా మారింది. కన్నీరు వొలికించింది. భక్తకన్నప్ప చిత్రంలో- మూడో కన్నంటే వెలుగు, మనలోపలి చీకట్లో వెలిగే చిన్నదీపం. నీ తప్పు నువ్వు తెలుసుకో- ఎదుటి వాడి గొప్పని ఒప్పుకో. అప్పుడే చీకటి చెదిరి పోతుంది... అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే మూడో కన్ను. అన్న సంభాషణ ప్రతి మనిషికీ వర్తిస్తుంది. ఇదే విధంగా ముత్యాలముగ్గు చిత్రంలో రావుగోపాలరావు పలికే డైలాగు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు. అలో... అలో... లో... ఆకాశంలో మర్డరు జరిగినట్టు లేదూ... సూర్యుడు కందగడ్డలా లేడూ అన్న మాట చాలు రమణ కలం గొప్పతనం తెలియడానికి. ఆ సినిమాలోనే ఎప్పుడూ ఎదవ బిగినెస్సేనా... మడిసన్నాక కుసంత కళాపోసనుండాలి. తిని తొంగుంటే గొడ్డుకూ మనిసికి తేడా ఏముంటాది. అన్న మాటలు నేటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. వీరు రాసిన సీతాకళ్యాణం లండన్ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ లో పాఠ్యగ్రంథంగా ఉంది. మిస్టర్ పెళ్లాం చిత్రానికి సంభాషణా రచయితగా నంది అవార్డు కూడా వచ్చింది.              తిరుప్పావై, శ్రీ కృష్ణలీలలు... ఇలా ఏది రాసినా పాఠకులను ఆకట్టుకున్నారు ముళ్లపూడి వెంకటరమణ. గిరీశం లెక్చర్లు అని సినిమాలపై సెటైర్లు కూడా రాశారు. సినీ రచయితగా అనేక అవార్డులు అందుకున్న రమణకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు సీతాకళ్యాణం కథా సంపుటికి వచ్చింది. బాలల అకాడమీ నుండి బాలబంధు, 1992లో తెలుగు విశ్వవిద్యాలయం, తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్లు వీరిని వరించాయి. ఇవే కాక ఎన్నో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు వీరిని గౌరవించాయి. 1987లో రఘుపతి వెంకయ్య అవార్డు కూడా వీరికి వచ్చింది.             వీరిని గురించి ప్రముఖ రచయిత ఆరుద్ర తన కూనలమ్మ పదాల్లో-             హాస్యమందున అఋుణ             అందెవేసిన కరుణ             బుడుగు వెంకటరమణ             ఓ... కూనలమ్మా అన్నారు             తెలుగు పాఠకులకు పదహారణాల తెలుగు పలుకులను పంచిన రమణ ఫిబ్రవరి 23, 2011న తన ప్రాణమిత్రుడు బాపును, తన అభిమాన పాఠకులను వదిలి వెళ్లిపోయారు.            అప్పుడు స్వాతి వార పత్రికలో ఆయన అభిమానులు-            రమణగారి పెన్ను            తెలుగు భాషకి వెన్ను            నిలబెట్టెను నిన్ను నన్ను            ఓ... గోదారమ్మ అనీ...                       కోతికొమ్మచ్చి            తెలుగు వాకిళ్లకిచ్చి            చదుంకొమ్మన్నారు గిచ్చి             ఓ... గోదారమ్మా... అని ఆయన అక్షరాలను తలపోసుకున్నారు. నేటికీ ఆ అక్షరాల జ్ఞాపకాల్లో జీవిస్తూనే ఉన్నారు. వాటిని మననం చేసుకుంటూనే ఉన్నారు.

అరికాళ్ల కింద మంటలు

  అరికాళ్ల కింద మంటలు                                                                                                                                       - శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి              తెలుగు నుడికారాన్ని, మధ్యతరగతి బ్రహ్మణ జీవితాల్లోని హంగులు, ఆర్బాటాలని, సంప్రదాయ ఛాదస్తాలను తన కథల్లో అద్భుతంగా చిత్రించిన కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. స్త్రీల జీవితాల్లోని కష్టాలను, బయట ప్రపంచానికి తెలియని వారి మానసిక క్షోభను తన కథల ద్వారా చెప్పాడు శ్రీపాద. కథా నిర్మాణంలో కూడా అందెవేసిన చేయి అయిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అరికాళ్ల కింద మంటలు కథను గొప్పగా రాశారు. 1910లలో భర్త చనిపోయిన బ్రాహ్మణ స్త్రీ పుట్టిట్లో పడే బాధను చెప్పారు.            ఈ కథను చెప్పడంలో శ్రీపాద కొత్త టెక్నిన్ ను పాటించాడు. ఈ కథ 8 భాగాలుగా ఉంటుంది. మొదటి 7 భాగాలు కేవలం సంభాషణాత్మకంగా సాగుతాయి. ఆ సంభాణల వల్లే ఏ ఏ పాత్రలు మాట్లాడుకుంటున్నాయి, వాటి స్థితిగతులు ఏమిటి, వాటి మధ్య సంబంధాలు ఏమిటి... అన్న విషయాలు పాఠకులకు తెలుస్తుంది. ఇలా కథను నడిపి, పాఠకుల మదికి కథా వస్తువు అందించిన శ్రీపాద కథా మాంత్రికుడనే చెప్పాలి.         రుక్ముణి పదహారేళ్లకే పెళ్లయి, 17 సంవత్సరాలకే భర్త చనిపోవడం చేత పుట్టిట్లోనే ఉంటుంది. ఇంట్లో అందరూ ఆమెను చులకనగా చూస్తూ, పనులు చేయించుకుంటూ ఉంటారు. ఆమె మంచితనాన్ని పట్టించుకోక పోగా దెప్పిపొడుపు మాటలు అంటూ ఉంటారు. తిడుతూఉంటారు. కథను శ్రీపాద ప్రారంభిస్తూనే.. దిమ్మచెక్కలాగ అలా కూచోకపోతే కాస్త గంధం తియ్యరాదుషే... రోజూ పురమాయించాలా... అంటుంది వాళ్ల అమ్మమ్మ. ఏ మాత్రం ఎదురు చెప్పకపోయినా మాటల మధ్య నీ మొగం యీడ్చా, నీ సిగ్గు చిమడా, దరిద్రం వోడుకుంటూ పుట్టకువచ్చావు,  జాణవయ్యావూ కుంకపీనుగా... అని తిడుతుంది. తర్వాత రుక్మిణి అక్క రైక కుట్టి పెట్టమంటుంది... 'నాకు పెద్దక్క తన కూతురు జుబ్బా కుట్టమని ఇచ్చింది. అదీ కుట్టాలి' అన్నా... చిన్నక్క వినదు. పైగా 'అదంటే... నీకు ప్రేమ ఎక్కువ' అని ఆడిపోసుకుంటుంది. 'నిన్ను నాతో పాటు మా యింటికి తీసుకెళ్తాను. అక్కడ ఇంటిపని చేస్తే చాలు. నీక్కావలసిని తిండి పెడ్తాను' అని లేనిపోని కబుర్లు చెప్తుంది.                    అంతలో పెద్దక్క వస్తుంది. 'తన కూతురు జుబ్బా కుట్టలేదని, చిన్నక్క అంటేనే ఇష్టమని' తూలనాడుతుంది. తనకు 'చాలా పనులున్నాయన్నా' వినదు. 'దాని మాటలు నమ్మకు మీ బావకు చెప్పి, నేనే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను' అంటుంది. 'మాకు పదెకరాల పొలం ఉంది' అని ధీమా పోతుంది. చెల్లెలు వచ్చి 'బువ్వాలాట ఆడుకోవాలి డబ్బు, బెల్లం ముక్క' కావాలంటుంది. ఇవ్వక పోయేసరికి గంధం గిన్నె దొర్లించి వెళ్తుంది. రుక్మిణి  వాళ్ల అమ్మ వచ్చి 'అమ్మమ్మ కందులు బాగుచేసేసరికి అలసి పోయిందట వంట చేయి' అంటుంది. 'వంటే కదా సుఖంగా చేయొచ్చు' అంటూనే ఆయిదారు రకాలు చేయమంటుంది. తమ్ముడు వచ్చి 'అన్నం పెట్టు సినిమాకు వెళ్లాలం'టాడు. 'ఇంకా ఎసరులో కూడా వేయలేదు' అంటే... 'నే వచ్చిందాకా మేలుకుని ఉండు...' అని పురమాయించి వెళ్తాడు. నాన్న వచ్చి 'ఇవ్వాళ నువ్వు వంట చేస్తున్నావేంది' అని అడుగుతాడు. వాళ్ల అమ్మమ్మ కూడా వస్తుంది. ఇద్దరి మధ్య రుక్మిణి గురించి చర్చ సాగుతుంది. వాళ్ల అమ్మమ్మ 'రుక్మిణి తల అంటుకోవడం, దువ్వకోవడం ఎందుకు... ఆ దిక్కుమాలిన జుట్టు ఎందుకు... ఆచారం ప్రకారం గుండు చేయిద్దాం' అంటుంది. అది విన్న రుక్మిణి పనులు తత్తరబిత్తరగా చేస్తూ కంగారు పడుతుంది. 'వీరేశలింగం వెధవలకు పెళ్లి చేస్తున్నాడు. ముండలని తోటలోవాళ్లు వెతుకుతున్నారు. సమయాలు, ముహూర్తాలు చూసుకోవడం లేదు. తర్వాత ఏమన్నా జరిగితే కొరివితో తల గోక్కోవడం అతుందని' అమ్మమ్మ తండ్రికి చెప్తుంది.              ఆ రోజు రాత్రి రుక్మిణికి నిద్రపట్టదు. అన్నివిధాలా ఆలోచిస్తుంది. చివరకు ఒంటరిగా ఇల్లువిడిచి వెళ్తుంది. ఓ జడ్కావాని సహాయంతో వీరేశలింగం వివాహాలు చేసే స్థలానికి వెళ్లాలని నిర్ణయించుకుని, జడ్కా ఎక్కుతుంది. ఆ శుభవార్తను చెప్తూ మేఘాల మీద యెగిరిపోయింది జడ్కా. మలుపు కూడా తిరిగింది. అని ఆమె జీవితంలో మంచిరోజులు రాబోతున్నాయని సూచిస్తాడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.           బ్రాహ్మణ ఇల్లల్లో ఆడవాళ్లు మాట్లాడుకునే భాష ఈ కథకు అదనపు అలంకరణ. వీరేశలింగం పంతులు చేసే విధవ వివాహాలను కథలో సందర్భానుసారంగా జోడించి పాత్రను చెప్పడం శ్రీపాద కథకు చారిత్రక వాస్తవికత వచ్చినట్లైంది. ఈ కథంతా ఉదయం లేసినప్పటి నుంచి రుక్మిణి జీవితంలో జరిగిన సన్నివేశాలు అల్లిక. ఒక రోజును కథా నేపథ్యంగా ఎన్నుకోవడం కూడా శ్రీ పాద ఘనతే. రుక్మిణికి జీవితంపై కలిగే విసుగును, విరక్తిని ఆమె మాటలు ద్వారానే వ్యక్తపరిచాడు కథకుడు.- నేనేమీ వొళ్లు దాచుకేలేదు ( పనులు చేస్తూనే ఉన్నాను) నా బతుక్కి రోషం కూడాను. ఎన్నెళ్లేపని చెబితే అది పుచ్చుకోవాలి గానీ,.. రామయ్యతండ్రీ, నా బతుకిలా వెళ్లిపోవలసిందేనా మహాప్రభూ... ఇవి ఆడవాళ్ల మాటలు...  శ్రీపాద రచనల్లోని మాటల విన్యాసానికి ఉదాహరణలు.           ఈ కథ ఒకప్పటి బ్రాహ్మణ కుటుంబాల్లోని స్త్రీల జీవితాలకు వాస్తవిక అద్దం. చరిత్రకు సాక్ష్యం. అందుకే ప్రతి ఒక్కరూ చదవదగిన కథ అరికాళ్ల కింద మంటలు.                                                                  - డా. ఎ. రవీంద్రబాబు

దేవరకొండ బాలగంగాధర తిలక్

దేవరకొండ బాలగంగాధర తిలక్ - డా. ఎ. రవీంద్రబాబు   అతను ఆధునిక తెలుగు కవి, కథకుడు, నాటకకర్త. అమృతాన్ని తాగి, ఆ రుచిని తన కవిత్వం ద్వారా తెలుగు పాఠకులకు పంచిన ప్రభారవి. భావకవిత్వాన్ని, అభ్యుదయ పంథాను మానవీయతలో రంగరించి కవిత్వంగా అందించిన రసధుని. ఊహలకు, వాస్తవాలకు మధ్య తన కథలతో అంతుచిక్కని వారధి నిర్మించిన ప్రజాకవి.          నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారవతాలు అని మానవీయను...,          నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు అని అభ్యుదయాన్ని...,           నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని భావుకతను..., తన కవిత్వ లక్షణాలుగా చెప్పుకున్నాడు బాలగంగాధర తిలక్.           పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరున్న మండపేటలో 1921 ఆగస్టు 1వ తేదీన జన్మించాడు తిలక్. ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాలే కాదు, పాశ్చాత్య సాహిత్యాన్ని కూడా చదువుకున్నాడు. అన్నీ అతనికి కరతలామలకమే. తెలుగులో వచనాన్ని, పద్యాన్ని అద్భుతంగా రాయగల ప్రతిభ ఆయనది. సుతి మెత్తనైన అభివ్యక్తితో పదునైన భావాన్ని వ్యక్తం చేయగల శైలి తిలక్ ది. కవిత్వం, కథ, నాటికలను సమర్థవంతంగా రాశాడు. కవితా సంపుటాలు- ప్రభాతము సంధ్య, గోరువంకలు, కఠినోపనిషత్తు, అమృతం కురిసిన రాత్రి కథా సంపుటాలు- సుందరి - సుబ్బారావు, ఊరిచివరి ఇల్లు, తిలక్ కథలు నాటకాలు, నాటికలు- శుశీలపెళ్లి, సుప్తశిల, సాలెపురుగు, సుచిత్ర ప్రణయం. ఇవి కాక తిలక్ లేఖలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి.            తిలక్ 11 ఏళ్లకే మొదటి కథ మాధురి రచించాడు. 16 సంవత్సరాలకు పద్యాలు, గేయాలతో తొలి కవితాసంపుటి ప్రభాతము - సంధ్యను వెలువరించాడు. వీరి రచనలపై ఎక్కువగా మొదట కృష్ణశాస్త్రి ప్రభావం, తర్వాత శ్రీశ్రీ ప్రభావం ఉన్నట్లు అర్థమవుతుంది. తిలక్ కవిత్వం, కథల్లో- బిచ్చగాళ్లు, అనాధలు, అశాంతులు, దగాపడిన తమ్ముళ్లు, పడుపుగత్తెలు, చీకటి బజారు చక్రవర్తులు .... కనిపిస్తారు. మనుషుల్లోని కపటత్వాన్ని గురించి-           దేవుడా           రక్షించు నా దేశాన్ని           పవిత్రుల నుండి, పతివ్రతల నుండి           పెద్దమనషుల నుండి, పెద్ద పులుల నుండి           నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే           నిర్హేతుక కృపాసర్పాల నుండి           లక్షలాది దేవుళ్ల నుండి, వారి పూజారుల నుండి అని వ్యంగ్యాన్ని వాచ్యంగా రాశాడు.           తిలక్ కవిత్వంలో సుకుమారమైన హృదయ స్పందన ఉంది. మన హృదయాల్లో కూడా ఆయన తన వాక్యాలతో ఆ స్పందనను కలిగించగలడు. శబ్దశక్తి, ఆలంకారిక పుష్టి కలగలిపి రాయగల ద్రష్ట తిలక్.            గగనమొక రేకు            కన్నుగవ సోకు            ఎరుపెరుపు చెక్కిళ్ల విరిసిన చెంగల్వ            సంజె వన్నెల బాలరంగు పరికిణి చెంగు            చీకటిని తాకినది అంచుగా            చిరుచుక్క ప్రాకినది అని సంద్యను అద్భుతంగా వర్ణించిన కవి తిలక్.           ఆయన కవిత్వంలో మెటఫర్లు, ఆర్ద్రత, జౌచిత్యం ఉన్నాయి. అనుభూతికి మన గుండెల్లో ఆకారాన్ని కడతాయి. నిజానికి తిలక్ కవిత్వం ఏ ఇజానికి, ఏ భావానికి, ఏ వాదానికి లొంగదు. జీవితంలోని ఒక పార్శ్వాన్ని కాకుండా సమగ్ర స్వభావాన్ని దర్శిస్తుంది.            చావుపుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపులా అంధకారం            మంచిగంధంలా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక్క అలంకారం అంటూ కవికి, సగటు మనిషికు ఉండాల్సిన మానవత్వాన్ని చెప్పాడు తిలక్.           కాలం సవాల్ లాంటిది           సాహసవంతుడందుకొని ముందుకు సాగిపోతుంటాడు.           తెరిచే కిటికీ బట్టి           పరితపించే పుష్పరాగం వుంటుంది.           మురికి కాల్వమీద, ముసలితనం మీద           మృషా జగతిమీద, మహోదయం వికసించదు వసంతం హసించదు... ఇలాంటి జీవిత సాఫల్యాన్ని, తత్వాన్ని తెలిపే వాక్యాలు తిలక్ కవిత్వంలో ఎన్నో దొరకుతాయి. వీరి తపాలా బంట్రోతు కవిత చాలాకాలం పాఠ్యపుస్తకాల్లో ఉన్నది. అతను ఉత్తరం ఇచ్చి వెళ్తున్నప్పుడు- సముద్రంలోకి వెళ్తున్న ఏకాకి నౌక చప్పుడు అన్న వాక్యం హృదయాలను ద్రవింపజేస్తుంది. అందుకే తిలక్ కవిత్వం గురించి ప్రముఖ కవి కాలోజీ రాస్తూ- రచన కవిత పాదాల పారాణి, పాపిటబొట్టు, నుదుట తిలకం, రసికతకు రాణింపు, ధ్వనికి గుభాళింపు, ట్రాన్స్ పరెంట్ చీకటి, వానికి వాడే సాటి... అన్నాడు.           తన కవిత్వంలో తాను దొరుకుతాను అన్న తిలక్ తన కథల్లో కూడా దొరుకుతాడు. వీరి గురించి దేవరకొండ బాలగంగాధర తిలక్ అనే పుస్తకం రాసిన ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీకాంతశర్మ కథల గుంరించి చెప్తూ- మానసిక విశ్లేషణ, తాత్వికత, విశ్వశాంతి, అభ్యుదయ భావాలు కనిపిస్తాయంటారు. వీరి కథల్లో నల్లజర్ల రోడ్డు, ఊరిచివరి ఇల్లు, అద్దంలో జిన్నా, కదలే నీడలు, దొంగ, సుందరీ-సుబ్బారావు, ఫలితకేశం, గడియారపు గుండెలు... లాంటివి ఎన్నో ఉత్తమ కథలు.            నల్లజర్ల రోడ్డు కథ- ఇద్దరు స్వార్థపూరితమైన మనుషుల తీరును కళ్లకు కట్టినట్లు చెప్తుంది. చావునుంచి కాపాడిన వాళ్లు ఆపదలో ఉంటే పట్టించుకోని మనుషుల స్వార్థాన్ని తెలియజేస్తుంది. లిబియో యెడారిలో కథ చిన్నదైనా యుద్ధం తర్వాత చిందరవందరైన శరీరభాగాలు మాట్లుకున్నట్లు సాగుతుంది. నిజమైన ప్రేమను చావుకూడా చంపలేదేమో... అన్నట్లు సాగుతుంది. కదిలే నీడలు కథ కూడా యుద్ధం గురించే అయినా అందరికీ దూరంగా బిక్కుబిక్కు మంటూ ఉంటున్న వారి కథ ఇది. ఒకామెను భర్త వదిలేస్తే, మరో అతనికి పెళ్లిగాక ముందే భార్య మరణిస్తుంది. వారి మనసులు కలిస్తే... తోడైతే... అన్నదే ఈ కథలోని వస్తువు. అద్దంలో జిన్నా కథ శిల్పం దృష్ట్యా గొప్పది. జిన్నా భారతీయుల్ని రెండుగా చీల్చి, జాతిభేదం చేత చిచ్చురగిల్చాడు. ప్రతి మహ్మదీయుడు ఒక అద్దం లాంటివాడు. ఈ కథలో భయంకరమైన చారిత్రక సత్యాన్ని శిల్పంతో మలచాడు తిలక్. దీనిలో మొదట ఆత్మాశయం, అహంకారం, అజ్ఞానం... చివర ఆత్మావలోకం, పశ్చాత్తాపం, భాధ కనిపిస్తాయి. మనిషి మాటను సృష్టించాడు. మాట అతనిని బంధించింది. మనిషిలో ఉండే అహం, పతానికి, ఔన్నత్యానికి, పరిశ్రమకు, పరిణామానికి కారణభూతమైన మూలశక్తి. అని ఈ కథలో చెప్తాడు తిలక్.         ఊరిచివరి ఇల్లు కథే ఇటీవల కమలతో నాప్రయాణం సినిమాగా వచ్చింది. కథలో రమ ఒంటరి జీవితాన్ని గడుపుతున్న దుర్బరజీవి. గాలివాన కారణంగా మూర్తి ఆమెను కలుస్తాడు. మనసులు, శరీరాలు కలుస్తాయి. పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ రమ పోషిస్తువ్న అవ్వ రమ వేశ్య, ఆమెది నటన అని చెప్తుంది. మూర్తి ఆమె మాటలు నమ్మి రమకు పర్సు ఇచ్చేసి రైలుకు వెళ్లిపోతాడు. కానీ రమ మూర్తి కోసం రైల్వేస్టేషనుకు వెళ్తుంది. పర్సును విసిరేస్తుంది. మూర్తి ఫొటోను మాత్రం గుండెలకు హత్తుకొంటుంది. చివరకు మూర్తి రైల్లోంచి చూస్తుండగానే ప్లాటుఫారమ్ మీద రక్తం మడుగులో పడి చనిపోతుంది.                    తిలక్ కథలు తేలిక భాషలో, హాయిగొలిపే విధంగా సాగుతాయి. మనుసును రొమాంటిక్ ఫీల్ కు తీసుకెళ్తాయి. ఊహకు వాస్తవానికి మధ్య భేధాన్ని చూపెడతాయి. మసుగులు తొడుక్కున్న అసలు మొహల్ని వెలికితీస్తాయి. పాత్రల స్వభావం, విశ్లేషణ, విడదీసి చూపే మంచి చెడు అభ్భుతంగా ఉంటుంది. సీతాపతి కథలో పద్మ, ఊరిచివరి ఇల్లు కథలో రమ, దొంగ కథలో ఇల్లాలు... లాంటి స్త్రీ పాత్రలు ఉన్నతంగా, మృదువుగా, మంచి స్వభావంతో ప్రవర్తిస్తాయి. కొన్ని కథల్లో స్త్రీలు వెర్రివెర్రి ఆలోచనలతో, చేష్టలతో కూడా కనిపిస్తారు.         తిలక్ మంచి కథకుడుగా, కవిగా రాణిస్తున్న రోజుల్లోనే అనారోగ్యంతో జూలై 1, 1966లో మరణించాడు. తర్వాత వీరి కవితా సంపుటి 1968లో కుందిర్తి ఆంజనేయులు ముందుమాటతో అమృతం కురిసన రాత్రి ముద్రితమైంది. దీనికి 1971లో కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. తిలక్ మరణించినప్పుడు ప్రముఖ కవి ఆవంత్స సోమసుందర్ తిలక్ జ్ఞాపకాలు - వాడని జాజిపూలు అన్నాడు. శ్రీశ్రీ అమృతం కురిసిన రాత్రికి కవిత్వంగా ముందుమాట (ఎలిజీ)  రాస్తూ-          గాలిమూగదయి పోయింది          పాట బూడిదయింది            వయస్సు సగం తీరక ముందే          అంతరించిన ప్రజాకవి          నభీస్సు సగం చేరక ముందే          అస్తమించిన ప్రభారవి అని అక్షర నీరాజనాలు సమర్పించాడు.

నెత్తురుకన్నా చిక్కనిది

నెత్తురుకన్నా చిక్కనిది                                                                       - మునిపల్లె రాజు          సమకాలీన సమాజాన్ని తనదైన తాత్విక కోణంలో దర్శించి కథలుగా మలచిన కథకుడు మునిపల్లె రాజు. మనుషుల్లోని స్వార్థాన్ని, అసూయని, ధనకాంక్షని, మారుతన్న ప్రపంచీకరణ వింత పోకడల్ని తన రచనల్లో చిత్రించాడు. అయితే వీరి కథలు ఎక్కువగా మ్యాజిక్ రియలిజం ధోరణిలో సాగుతాయి. పాత్రలు, నేపథ్యాలు ఆయా సందర్భాలను బట్టి ఎక్కడైనా సంచారం చేస్తాయి. అయితే కథడుకు చెప్పాల్సిన విషయం మాత్రం పాఠకుడికి చేరుతుంది. మనుషుల్లో డబ్బుపై ఆశ పెరిగితే, అదే లోకం అనుకుంటే...! హోదాకు విలువ ఇస్తే...! మానవీయ విలువలు ఎలా నాశనం అవుతాయో... ! వివరించాడు నెత్తురుకన్నా చిక్కనిది కథలో మునిపల్లె రాజు.           కథ ఎక్కువ భాగం క్లబ్ వాతావరణంలో సాగుతుంది. రచయిత మునిపల్లె రాజు పాత్ర మానసిక స్థితిని తెలియజేసేందుకు కథను- 'తుప్పర తుప్పర వానజల్లులతో క్లబ్బు ఆవరణమంతా బావురుమంటూన్నది' అని ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ప్రధాన పాత్ర జగన్నాథాన్ని కథలోకి ప్రవేశపెడతాడు. జగన్నాథం క్లబ్బులో కొత్తమెంబరైనా పెద్దపెద్ద పార్టీలు ఇవ్వడం చేత నగరంలో బడా బడా అధికారులకు, పెద్దపెద్ద కంపెనీల డైరెక్టర్లకు దగ్గరై ఉంటాడు. క్లబ్బులోని బంట్రోతు కాసిమ్ కు కూడా జగన్నాథం అంటే గౌరవం. అందుకే అతను రాగానే తగిన మర్యాదలు చేస్తాడు. బార్ రూమ్ లో కూర్చోబెట్టి బ్రాందీ సోడా అందిస్తాడు. కానీ జగన్నాథం మనసు, శరీరం వణుకుతూనే ఉంటాయి. ఆ వణుకుకు కారణం మాత్రం బైట కురిసే వాన కాదు. అతను ఆడే పందెపు జూదం. ఆ జూదం గెలిస్తే పెద్దల స్నేహం, హోదా, సలాములు. ఓడిపోతే దిగులు, బీదతనం.           ఓ పెద్ద కాంట్రాక్టు కోసం టెండరు వేసి, ఫిక్స్ చేసి క్లబ్బుకు వచ్చాడు. అది అతని తాహతకు మించిన పని. దానికోసం ఇన్ కంటాక్స్ సర్టిపికేట్ దిద్దాడు, తమ్ముడి సంతకంతో పవర్ ఆఫ్ అటార్ని కూడా పుట్టించాడు. దాంతో తమ్ముడి ఆస్తి అంతా అమ్మేశాడు. అప్పటికీ భార్య రుక్మిణి చెప్పింది. 'తమ్ముడి ఆస్తి అమ్మొద్దు. నలుగురు ఆడిపోసుకుంటారు' అన్నది. కానీ జగన్నాథం దృష్టిలో భార్య ఓ సత్తెకాలం మనిషి. అందుకే వెంకటేశ్వరస్వామి పటం వెండిది తెచ్చిస్తానని ఆమె నోరు నొక్కేశాడు. చివరకు క్లబ్బు ఫోన్ నంబరు ఇచ్చి టెండరు విషయం తెలుసుకోడానికి ఇప్పుడు ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. పైగా వస్తూ వస్తూ తన రివాల్వర్ కూడా తెచ్చుకున్నాడు. మాటిమాటికి దాన్ని తమిడి చూసుకుంటున్నాడు పిరికివాడిలా.           ఇంతలో ఫోన్ వస్తే కాసిమ్ వచ్చి చెప్పాడు. జగన్నాథం కంగారుగా, ముచ్చెమటలు పోస్తూ వెళ్లి 'కాయా... పండా...'అని అడిగాడు. కానీ ఫోన్ అతనికి కాదు. దాంతో భయంతో, వణుకుతూ చల్లగాలికి వరండాలో నిలబడ్డాడు. 'మనిషికి మిగిలేది... ప్రేమా కదా... బీదవాళ్లందరూ నిజాయితీ పరులు కారే...' లాంటి ఆలోచనలు చేస్తాడు. లోకంలోని మనుషుల గురించి పరిపరి విధాలా...తనను తాను సమర్థించుకునేలా... తనలో తాను మాట్లాడుకుంటాడు.             మళ్లీ ఫోన్ రావడంతో వెళ్తాడు. అతనికే టెండర్ అని తెలిసి ఆనందంతో సంబరపడతాడు. క్లబ్బునంతా కొత్తశోభతో చూస్తాడు. బాఁయ్ కాసిమ్ కు అయిదు రూపాయలు బహుమానంగా విసిరేస్తాడు. ఆ సంతోషంతో ఇంటికి వస్తాడు. కానీ రాగానే నెత్తిమీద పిడుగు పడ్డట్టు భార్య రుక్మిణి అతని తమ్ముడు రంగడు వచ్చాడని చెప్తుంది. జగన్నాథానికి ఏమి చేయాలో అంతుపట్టదు. తమ్ముడిని చూడునుకూడా చూడడు. 'రంగడిని మళ్లీ పంపెయ్... రెండు దోవతలూ, చొక్కాలూ కొనిపెట్టి, ఇరవై రూపాయలు చేతికిచ్చి పంపెయ్' అని భార్యకు గట్టిగా చెప్తాడు.        మానవత్వాన్ని, మానవీయ విలువలను మరచిన జగన్నాథం ధనం అనే పిశాచికి, హోదాకు ఎలా దాసోహమయ్యోడో తెలిజేస్తుంది ఈ కథ. ఇక మునిపల్లె రాజు కథను నడిపిన తీరు చదివేవాళ్లలో ఉత్కంఠను కలిగిస్తుంది. ముగింపు ఊహకందని విధంగా ఆసక్తిగా అనిపిస్తుంది. జగన్నాథం పాత్రను విశ్లేషించిన తీరు నిజంగా అద్భుతం. ఆయనలోని చెడు గుణాల పరిణామం కనపడుతుంది. విలువలు పతనమయిన మనిషి ఎలా ఉంటాడో, అనుబంధాలను, ఆత్మీయతలను ఎలా డబ్బుతో కొలుస్తాడో చక్కగా చెప్పాడు ఈ కథలో మునిపల్లెరాజు.           పాత్రోచిత భాషకు కాసిమ్ మాటలు... 'మాఫ్ కర్నా సాబ్... సాబ్ కు తబీయత్ ఠీక్ నైక్యా సాబ్...' మంచి ఉదాహరణలు. 'కాయా.. పండా..' అనే నానుడిని సరైన సందర్భంలో టెండర్ వచ్చిందా లేదా తెలుసుకోనే కోడ్ భాషగా ఉపయోగించాడు రచయిత. జగన్నాథం కంగారులో లోకం పోకడ గురించి చేసిన ఆలోచనలు కథకు హైలెట్ గా నిలుస్తాయి... 'పిచ్చి సన్నాసి రంగడు కూలీలందర్నీ పేరు పేరునా పిలిచేవాడు- పనుల మీదికి పంపిస్తే. వాళ్ల కెందరు పిల్లలు? ఇల్లెక్కడ?. కూలితో గడుస్తున్నదా? అని యోగక్షేమాలు అడుగుతుంటాడు. ఏమి శాశ్వతం? చివరికి మిగిలేది మనిషి మీద మనిషికి  ప్రేమే గదా? ఈ గొప్ప దర్జాల్లో ఏది నిజం?           అట్లా అని ఈ బీదవాళ్లందరూ నిజాయితీపరులా తన పెద్ద మేస్త్రీ దొంగ రాస్కెల్- కూలి వాళ్లకు బేడ వడ్డీకి అప్పులిస్తుంటాడు.'        ముగింపు కొసమెరుపులా ఉండాలన్నా కథానికా లక్షణాన్ని ఈ కథలో మునిపల్లె రాజు తప్పక పాటించాడు. జగన్నాథం తమ్ముడు రంగడు ఇంటికి రావడం ఒక ఎత్తైతే, 'నెత్తురుకన్నా చిక్కని వేరే విలువల వలయంలో తన భర్త చిక్కుకొని వున్నాడని ఆమె ఎప్పటికీ తెలుసుకోలేదు. సత్తెెకాలం మనిషి' అని భార్య రుక్మిణి స్వభావంతో కథను ముగించడం. అందుకే ఈ కథ మృగ్యమైపోతున్న మానవీయ విలువలపై గొడ్డలి పెట్టు లాంటిది. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సినది.                                                     - డా. ఎ. రవీంద్రబాబు           

మహాకవి శ్రీశ్రీకి అక్షర నివాళి

మహాకవి శ్రీశ్రీకి అక్షర నివాళి - డా.ఎ.రవీంద్రబాబు               శ్రీశ్రీ రెండక్షరాల సంయోజనం. ఆధునిక తెలుగు కవిత్వ శబ్ద ప్రభంజనం. కవి అంటే కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడని సగర్వంగా చాటిన కవి. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని మనిషే కవిత్వ చిరునామా అని కవిత్వాన్ని నిర్వచించిన కవి. ఆయన తన కవిత్వం గురించి చెప్పుకుంటూ నేనొక దుర్గం...నాదొక స్వర్గం... అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం అన్నాడు. ఆధునిక తెలుగు కవిత్వానికి దిశదశ  శ్రీశ్రీ... ఆధునిక కవులకు మార్గదర్శి శ్రీశ్రీ. అందుకే తెలుగు కవిత్వాన్ని శ్రీశ్రీ ముందు శ్రీశ్రీ తర్వాత అని విభజించాల్సిన అవసరం ఉందన్నారు విమర్శకులు.               శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. మారుతున్న సమాజానికి అనుగుణంగా కవిత్వం మారాలని, తన భావాలను మార్చుకున్న శ్రీశ్రీ 1910, ఏప్రిల్ 30 న విశాఖపట్నంలో జన్మించాడు. నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఆకాశ హర్మ్యాలను, అగాథ లోతలను చవిచూశాడు. పలు సాహిత్య ఉద్యమాలకు వెన్ను దన్నుగా నిలిచాడు. పదండి ముందుకు పదండి అంటూ ప్రోత్సహించాడు.             ఎనిమిదో ఏటనే చిట్టిపొట్టి పదాలతో కందపద్యాన్ని రాసిన శ్రీశ్రీ, తర్వాత పురిపండ అప్పలస్వామితో కలిసి కవితాసమితి స్థాపించాడు. తొలిరోజుల్లో ప్రభవ అనే ఖండకావ్యాన్ని వెలవరించారు. మద్రాసులో బి.ఎ. పూర్తి అయ్యాక అబ్బూరి రామకృష్ణారావు సహచర్యంతో దేశదేశాల కవిత్వాన్ని అధ్యయనం చేశాడు. బతకడం కోసం అనేక ఉద్యోగాలు చేశాడు. 1933లో టైఫాయిడ్ తో బాధపడి కోలుకున్న శ్రీశ్రీ మరోప్రపంచం మరోప్రపంచం అనే గీతాన్ని అయిదు నిముషాలలో పూర్తి చేశాడు. తర్వాత రచించిన అన్ని కవితలతో కలిపి 1950 నాటికి మహాప్రస్థానం పుస్తకాన్ని ప్రచురించాడు. తెలుగు సాహిత్యంలో ఈ పుస్తకం మైలురాయిగా నిలిపోయింది. యువ కవులకు నేటికీ దిక్సూచిగా నిలిచింది. తర్వాత శ్రీశ్రీ ఖడ్గసృష్టి, మరోప్రస్థానం, సిప్రాలి, చరమరాత్రి, అనంతం, వివిధ వ్యాసాలు... వంటివి ఎన్నో రచించాడు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షునిగా పనిచేశాడు. విప్లవ రచయితల సంఘం (విరసం) లో కూడా చాలా కొలం కొనసాగాడు.            నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను. నేనుసైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను అని జీవితాన్ని సమాజం పరం చేశాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ కవిత్వంలోని ఎన్నో వాక్యాలు జనం నాలుకల మీద నర్తిస్తున్నాయి. పత్రికల్లో పతాక శీర్షికలై వెలుగుతున్నాయి. ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం అన్నా కదిలేది కదిలించేది... పెను నిద్దర వదిలించేది... కావాలోయ్ నవకవనానికి అన్నా... కాదేది కవితకనర్హం అన్నా అది శ్రీశ్రీకే సాధ్యం. చరిత్రను సరికొత్త పంథాలో నిర్వచిస్తూ పరస్పరం సంఘర్షించిన శక్తుల్లో పుట్టిందన్నాడు. వ్యథార్థ జీవుల యదార్థ దృశ్యాన్ని తన కవిత్వంలో ఆవిష్కరించాడు. కార్మిక లోకపు కళ్యాణం, శ్రమిక లోకపు సౌభాగ్యం తన కవిత్వం అని చాడాడు. ఆకాశపు టెడారిలో కాళ్లు తెగిన ఒంటరి ఒంటె లాగుంది జాబిల్లి అని సరికొత్తగా ఊహించాడు.              శ్రీశ్రీ పదాల్ని, మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా చేశాడు. ఉద్రేకాలు, యుద్ధాలుగా మార్చాడు. తెలుగు కవిత్వానికి వాడిని వేగాన్ని ఇచ్చాడు. సింధూరం రక్తచందనం, బంధూకం, సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురూ, ఎగరేసిన ఎర్రని జెండా... కావాలోయ్ నవకవనానికి అని అభ్యుదయాన్ని కాంక్షించాడు. సరికొత్త ప్రతీకల్ని, పదబంధాల్ని సృష్టించాడు. పాతపదాల నడ్డి విరగ్గొట్టి శ్మశానాల వంటి నిఘంటువులను దాటాడు. వ్యాకరణాల సంకెళ్లు తెంచాడు. అందకే శ్రీశ్రీ గేయాల్లో అంతర్లయ తొణికిసలాడుతుంది. మాత్రఛందస్సుతో అవి పరుగెత్తుతాయి. చెలం లాంటి వాళ్లే శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రపంచపు బాధ అన్నారు. రక్తం నెత్తరు కలిపి ఈ వృద్ధ ప్రపంచానికి శ్రీశ్రీ సరికొత్త టానిక్ తయారు చేశాడు అని చెప్పారు.                శ్రీశ్రీ పాటల రచయిత కూడా... తెలుగు సినీ ప్రపంచానికి ఎన్నో మధురమైన గీతాలు అందించాడు. పాడవోయి భారతీయుడా అన్నాడు. తెలుగు వీర లేవరా అని అల్లూరి సీతారామరాజు విప్లవోద్యమాన్ని స్తుతించాడు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండాలని భావగీతాన్ని రచించాడు. అందుకే సినీ పాటల్లో కూడా ఆయన వాణి చెరగనిది. తెలుగు కవిత్వానికి అంతర్జాతీయ దృక్పథాన్ని కలిగించిన శ్రీశ్రీ  20వ శతాబ్దం నాది అని సగర్వంగా చెప్పుకున్నాడు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదన్నాడు. కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిల్లా- హీనంగా చూడకు అని అన్నీ వస్తువులు కవితామయమేనోయ్ అని చాటాడు.             ఆకాశపుదారులెంట వెళ్లిపోయే జనగన్నాథ రథచక్రాలను భూమార్గం పట్టించాడు. కనపడలేదా మరో ప్రపంచపు అగ్నికిరీటపు ధగధగలు, ఎర్రభావుటా నిగనిగలు, హోమజ్వాలల భుగభుగలు అని ప్రకటించిన శ్రీశ్రీ జూన్ 15, 1983లో మరణించాడు. ఆయన మరణించినా ఆయన కవిత్వం బతికే ఉంది. ఎందరో అభ్యుదయ వాదుల్లో నిలిచే ఉంది. ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటో దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతించిన వైతాలికుడు శ్రీశ్రీ... అందుకే ఆ మహా కవి వర్థంతి సందర్భంగా అక్షర నీరాజనాలు.... ఇవి...                      

చక్రి ... ఓ సింహం లాంటి మ్యూజిక్ డైరక్టర్

  చక్రి ... ఓ సింహం లాంటి మ్యూజిక్ డైరక్టర్                                                     -  డా. ఎ. రవీంద్రబాబు       అతి చిన్నవయసులోనే సినీ సంగీత ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. అటు క్లాస్ ను, ఇటు మాస్ ను ఆకట్టుకొనేలా మెలోడీలకు జీవం పోస్తున్నాడు. పక్కా నాటు పాటను కూడా అలవోకగా అందిస్తున్నాడు. సన్నివేశానికి తగిన ట్యూన్, సంఘటనకు తగిన బ్యాంగ్రౌండ్ మ్యూజిక్, హీరో ఇమేజ్ ను ఓ మెట్టు ఎక్కించే బాణీ... టోటల్ గా చిత్రం విజయంలో సంగీతానికి అతనో ఐకాన్ గా ముందుకెళ్తున్నాడు సినీ సంగీత దర్శకుడు చక్రి. అతి తక్కువ సమయంలోనే సెంచరీ చిత్రాల మ్యూజిక్ డైరక్టర్ గా ప్రేక్షకుల గుండెలపై ఆయన పాటలు నృత్యం చేస్తున్నాయి.       చక్రీ అసలు పేరు చక్రధర్. సొంతవూరు పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలోని వరంగల్ జిల్లా వనపర్తి మండలంలోని కంభాలపల్లి గ్రామం. తండ్రి సాధారణ ఉపాధ్యుడు వెంకటనారాయణ, తల్లి విద్యావతి. తల్లి ఉగ్గుపాలతో, జోలపాటలతో సంగీతంపై మక్కువ పెంచుకున్నాడు. తండ్రి నుంచి సంగీత వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నాడు. సంగీతం పై ప్రేమతో ఎనిమిదో తరగతిలోనే మురళికి అందే పలుకులను ఒంటబట్టించుకున్నాడు. ఆపై ఇంటర్మీడియట్ లో కర్ణాటక సంగీతాన్ని, వయోలీన్ ను అవపోసన పట్టాడు. స్కూల్ రోజుల్లోనే సాంస్కృతిక కార్యక్రమాలకు శిక్షణ ఇచ్చేవాడు. 18 ఏళ్లకే ఒకే జాతి మనదిరా... ఒకే బాట మనదిరా అంటూ పాటరాసి, కంపోజ్ చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఊళ్లో సొంతగా ఒక ఆర్కెస్ట్రాను కూడా ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చాడు. డిగ్రీ చదివే రోజుల్లోనే సొంతగా అనేక సొంత ట్యూన్లూ కట్టాడు.             డిగ్రీ పూర్తి అయ్యాక పరిస్థితుల వల్ల1985, జూన్ 14న హైదరాబాదు వచ్చాడు. అతికష్టం మీద ఓ హాస్పెటల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా 1300 రూపాయలకు ఉద్యోగం సంపాదించాడు. కానీ మనసు అంతా మ్యూజిక్ పైనే, తన ఆత్మకు తనే దూరమవుతున్నానే బాధ. దాంతో ఉద్యోగం మానేసి, ఆల్బమ్స్ చేయడానికి పూనుకున్నాడు. సుమారు 40 వరకు  ఆల్బమ్స్ చేశాడు. వాటిలో చిరునవ్వుతో, వందేమాతరం అనేవి చక్రీకి మంచి పేరుతెచ్చాయి. కానీ అందరిలాగే తనూ సినిమా కష్టాలు పడ్డాడు. తన మ్యూజిక్ డైరక్షన్ లో వచ్చిన నేనింతే సినిమాలో చెప్పినట్లు కృష్ణానగర్ లో ఇల్లు. ఆకలి, అద్దెకట్టలేని దైన్యం, ఆల్బమ్స్ కోసం హైదరాబాద్ కోటీలోని షాపుల చుట్టూ తిరుగుళ్లు. సినీ కంపెనీల చుట్టూ ప్రదక్షణలు. వారి కల్లబొల్లి మాటలు నమ్మి జేబులో ఉన్న డబ్బులు ఖర్చు చేసేవాడు. చివరకు నిరాశ, నిస్పృహ. వెరసి ఓ చిన్నసైజు నరకాన్ని సంగీతం పై ఉన్న అభిమానంతో, ఆరాధనతో ఆనందంగా భరించాడు. కానీ సొంత ఊరికి వెళ్లాలను కోలేదు. చావో బతుకో సంగీతమే తన ప్రాణం, ప్రణవం అనుకున్నాడు. ఎప్పుడూ మనస్సును చెదరనివ్వలేదు. సంగీతం పైనుంచి దృష్టిని పక్కకు తిప్పలేదు.             చివరకు ఏ స్వరసురవాణో కరుణించినట్లు 2000 సంవత్సరంలో లిటిల్ హార్ట్స్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే సత్యదేవ్ ద్వారా దర్శకుడు పూరీ జగన్నాథ్ తో పరిచయం. అలా చివరకు బాచి సినిమా అవకాశం చక్రీని వరించింది. ఇక చక్రి వెనుతిరిగి చూడలేదు. నేటికీ సినీ ఆకాశంలో తన స్వరఝరిని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. పాటలకు సరిగమల సొబగులద్దుతున్నాడు. సన్నివేశాలకు తన సంగీతంతో స్వరరచన చేస్తున్నాడు. పాత్రల హావభావాలకు అంతర్గతంగా భావోద్దీపన కలిగిస్తున్నాడు. నేడు తెలుగు సినీ చరిత్రలోనే కాకుండా దక్షిణాది భాషల్లో కూడా చక్రీకి ఓ సముచిత స్థానం ఉంది. అంటే దాని వెనుక అనేక పరాజయాల సోపానలు ఉన్నాయి. ఆకలి కేకలు ఉన్నాయి. అన్నిటికి మించి చక్రి మొక్కవోని ధైర్యం ఉంది.            మళ్లి కూయవే గువ్వా అని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో వినే మెలోడీని తెలుగు ప్రేక్షకులు మళ్లీమళ్లీ విన్నారు. ఇడియట్ లో టీజింగ్ సాంగ్ యువతను కేరింతలు కొట్టిచ్చింది. వంశీ అంటే పదహారణాల తెలుగు సినిమాకు మరోరూపం. ఆయన టేకింగ్, మేకింగ్ అలాంటిది మరి. గోదావరిని గోముగా పలకరిస్తాడు. అలాంటి వంశీతో కలిసి ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాకు చక్రి పనిచేశారు. ఆ సినిమా విజయంలో పాటలే ప్రధానం. ఎన్నెన్నో అందాలు అన్నింట్లో అందాలు అని పాడుకున్నా, వెన్నెల్లో హాయ్.. హాయ్... మల్లెల్లో హాయ్.. హాయ్... అని హీరోహీరోయిన్లు చెప్పుకున్నా అది చక్రీ సంగీత చలువే. దేశముదురు చిత్రంలో అంటాటోడే.. ఇట్టాంటోడే అని నేటి యూత్ కు తగిన బాణీని కూర్చాడు చక్రీ. ఇదే చిత్రంలో సత్తే ఏగొడవా లేదూ అని హీరోతో ఎంట్రీ సాంగ్ పాడించాడు. అసలు సత్యం సినిమాలో ఓ మగువా నీతో దోస్తీ కోసం అన్న పాటతో ఎంతో మంది లేడీస్ ఫాలోవర్స్ ఏర్పడ్డారు చక్రీకి. వంశీ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా గోపి గోపిక గోదావరి. దీనిలో నువ్వక్కడంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల పాటతో చక్రీకి మెలోడీ బ్రహ్మగా గుర్తింపు వచ్చంది. శివమణి లో నాగార్జున లాంటి సీనియర్ నటుల ఉద్వేగాలకు సరైన మ్యూజిక్ ను పలికించాడు.  వైవీయస్ చౌదరి తీసిన సినిమా దేవదాసు. రామ్, ఇలియానా తొలి పరిచయం. దేవదాసు బంపర్ హిట్. అడిగి అడగలేక  అన్నా, ఓ నేస్తం కావాలే అన్నా హీరో హీరోయిన్లు గోముగా అడిగే ప్రేమకు చక్రీ అందమైన ట్యూన్ ఇచ్చాడు. ఇలా ఈ విజయానికి చక్రీ మ్యూజిక్కే కారణం అంటే తప్పక నమ్మల్సిందే. గోలీమార్ సినిమాలో హీరోయిన్ ద్వారా మగాళ్లు వట్టి మాయగాల్లే అని పాడిచ్చిన పాటకు చక్రి ఇచ్చిన ట్యూనే యుత్ లో క్రేజీని సృష్టించింది. ఇక చక్రం. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. దీనిలో జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది.. అని సిరివెన్నెల రాసిన భావానికి చక్రి ఇచ్చిన గమకాలు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాయి. ఇక సింహా చిత్రం అఖండ విజయాన్ని అందిస్తే... దానికి చక్రి సంగీతం బంగారు కొండ. సింహం అంటి చిన్నోడే వేటకొచ్చాడే అని తన సంగీత వేటతో పాటు, మగువతో మగాళ్ల వేటను కూడా కొనసాగించే ట్యూన్ ను ఇచ్ాడు చక్రి. తెలంగాణ ప్రాంతానికి చెందిన చక్రీ ఆ అభిమానంతో జై బోలో తెలంగాణ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. మ్యూజిక్ కు కీ చక్రీ. ఆయన గురించి చెప్పకుంటే పోతే స్వరాలు నవనాడుల్లో నాదాన్ని పుట్టిస్తాయి. మనసులు వెన్నెల్లో ఊరేగుతాయి. మగాళ్లని మాయగాళ్లు చేసి ప్రేయసుల వెంట తిప్పుతాయి.             ఎన్ని మంచి పాటలు కూర్చినా, ఎన్ని మంచి చిత్రాలకు సంగీతం అందించినా చక్రీకి మాత్రం ఎ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ అంటే ఇష్టం. ప్రాణ స్నేహితులు చిత్రంలోని స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా... పాటంటే ప్రాణం. ఎన్ని సంగీత వాయిద్యాలను మీటినా పిల్లనగ్రోవి అంటేనే మమకారం. సాగరసంగమం సినిమా అంటే మళ్లీమళ్లీ చూడాలనిపించేటంత పిచ్చి. చక్రీ కేవలం సినీ సంగీత దర్శకుడే కాదు ఆయనలో సామాజికి స్పృహకూడా ఉంది. చక్రి ఛారిటబుల్ ట్రస్టు స్థాపించాడు. తనకు స్ఫూర్తి ప్రధాత అయిన వివేకానందుడి పుట్టిన రోజున సేవాకార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు. రక్తదానం, అన్నదానం వంటివి చేపడుతున్నాడు.            స్వరాల్ని పారిజాతాల్లా మార్చగల చక్రికీ ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. సత్యం సినిమా లోని ఓ మగువా నీతో స్నేహం కోసం పాటకు సౌత్ ఇండియా వారి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు వచ్చింది. శంకర్, జయకిషన్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డులు అందుకున్నారు. సంతోషం అవార్డులు వంటివి లభించాయి. సింహా సినిమాకు నంది అవార్డు సైతం ఆయన ముందు ఆనందంగా వాలింది. తనకు తోడుగా శ్రావ్యమైన శ్రావణీని జీవితభాగస్వామిగా ఎన్నుకున్నాడు.        చక్రి పాటలు రాశాడు, పాడాడు, ట్యూన్సు కట్టాడు. ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించాడు. ఉవ్వెత్తున ఎగసిపడే స్వరాలను తన వేళ్లపై పలికించాడు. ప్రేక్షకుల ఎదలను మీటాడు. తన స్వరంలో నుంచి సప్తస్వరాలకు తనదైన శైలిలో ప్రాణం పోశాడు. ఆ సువాసననలో ఎంతో మంది అభిమానులు తడిసి ముద్దయ్యారు. అందుకే ఆయన పుట్టిన రోజు తెలుగు సినీ స్వర సరస్వతి, తనూ జన్మదినం జరుపుకుంటున్న ఆనందాన్ని పొందుతుంది అని భావిద్దాం. చక్రీకి, ఆయన సంగీతానికి జోష్ గా తెలుగు ఒన్ డాట్ కమ్ ద్వారా హాపీ బర్తడే విషెష్ ...

సింగమనేని నారాయణ

సింగమనేని నారాయణ                                                     డా. ఎ. రవీంద్రబాబు             రాయలసీమ కరువును, రైతుల దైన్యాన్ని తన కథల్లో విషాదభరితంగా చిత్రించిన రచయిత సింగమనేని నారాయణ. నేలవిడిచి సాము చేయకుండా వాస్తవాన్ని రచనలో నిరాడంబరంగా చెప్పగల దిట్ట. కృత్రిమత, అలంకారిక పదాల శోభ ఆయనకు నచ్చవు. ఏ కథ రాసినా పాఠకుని గుండె తడి అవ్వాల్సిందే... క్లుప్తంగా, సూటిగా అనంతపురం మాండలిక భాషతో కలిసి వీరి కథలు సీమ నేపథ్యాన్ని నిర్మొహమాటంగా మనముందు ఉంచుతాయి.           సింగమనేని నారాయణ అనంతపురం జిల్లాలోని బండ్లమీద పల్లె గ్రామంలో జన్మించాడు. తెలుగు ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. ఆ వృత్తిలో ఉంటూనే అపారమైన సాహితీ వ్యవసాయాన్ని చేశారు. ప్రాచీన సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశాడు. పురాణాల్ని, ప్రబంధాల్ని పరిశీలించాడు. శ్రీశ్రీ, చలం, కొ.కు, బుచ్చిబాబు లాంటి  సాహితీ వేత్తల లోతుల్ని పట్టుకున్నాడు. అన్నిటికీ మించి రాయసీమ సామాజిక స్వరూపాన్ని, ఆర్థిక న్వభావాన్ని, ప్రజల స్థానిక సమస్యలను అర్థం చేసుకున్నాడు.              సంగమనేని నారాయణ కథలు పలు సంపుటాలుగా వచ్చాయి. వీరి రచనలు అన్నీకలిపి సుమారు 40కి పైగా ఉన్నాయి.            జూదం (12 కథలు) ఈ సంపుటి 1988లో వచ్చింది. దీనిలోని జూదం కథ చదివితే సీమనేల మీద, మనుషుల మీద అపారమైన సానుభూతి కలుగుతుంది.            సింగమనేని నారాయణ కథలు (18 కథలు) ఈ సంపుటి 1999లో వచ్చింది.            అనంతం కథల సంపుటి అనంత ప్రజల జీవన విధానంలోని వైవిధ్యాన్ని తెలియజేస్తుంది.                            నీకు నాకు మధ్య నిశీధి కథా సంపుటిలోని కథలు స్త్రీవాదాన్ని చదివి అర్థం చేసుకుని సహానుభూతిని ప్రకటించేవిగా ఉన్నాయి. మధ్యతరగతి స్త్రీలపై జరుగుతన్న హింస, వరకట్నం, దౌర్జన్యాలు, పురషాధిక్య భావాజాలం... వంటి వస్తువులనే కథలుగా మలిచారు.              వీరి తరగతిలో తల్లి కథ ఉపాధ్యయుడు పిల్లల్ని ఏవిధంగా ఆకట్టుకొని చదువు చెప్పాలో నేర్పిస్తుంది. అందుకే ప్రతి టీచరు ఈ తప్పక చదవాల్సిన కథ ఇది.             మకరముఖం కథ దళితులు తమ కులం పేరు చెప్పుకోడానికి ఎలాంటి తిప్పలు పడుతున్నారో చక్కగా వివరిస్తుంది.               సింగమనేని నారాయణ కథలు వాస్తవ జగత్తును చిత్రిస్తాయి. అనంతపురం జిల్లా భాషను రుచి చూపుతాయి. కథలు తగినంత వర్ణనలతో క్లుప్తంగా ఉంటాయి. కథ ఎప్పుడూ విపరీత పోకడులకు పోకుండా తనవెంట తాను పోతుంది. వీరిని తమ కథా సాహిత్యం గురించి అడిగితే- 'నాకు కథా రచన సహజంగా అబ్బలేదు. గట్టిగా సాధన చేసి నేర్చుకున్నాను' అంటారు. అందుకే వీరి కథలు చదివితే రాయలసీమ నేపథ్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని, అందులోని మానవీయతను సున్నితంగా తనకథల్లో స్పర్శించినట్లు అర్థం అవుతుంది. ఈ కథలు చదువుతుంటే మన ప్రశాంతతకు భగ్నం కలుకుతుంది. అవి మెదడులో చేరి గగ్గోలు చేస్తాయి. ముఖ్యంగా రైతుల జీవితాల్లోని కన్నీటి చారికల్ని తుడుస్తాయి. మట్టి పరిమాళాల్లోని ముళ్ల బాధను కలిగిస్తాయి. నీళ్లులేని కరువు దృశ్యాలు మన ముందు కరాళనృత్యం చేస్తాయి. అందుకే సింగమనేని కథా జీవితం రైతు జీవితం అప్పులమయం నుంచి రైతు జీవితం ఆత్మహత్యలమయం వరకూ కన్నీళ్లతోనే ప్రయాణించింది అని చెప్పొచ్చు.          నారాయణ కథలు కన్నడ, హిందీ, మళయాళం భాషల్లోకి అనువాదాలు అయ్యాయి.           సింగమనేని నారాయణ కథలు రాయడమే కాదు. కథా సంకలనాలకు కూడా సంపాదకత్వం వహించాడు. వీరు సీమ కథలు పుస్తకాన్ని 1992లో ప్రచురించినా అది 1994, 2010లో కూడా పునర్ముద్రణలు పొందింది. ఈ కథలు రాయలసీమ గ్రామల యదార్థ వ్యథలను, బతుకు అనుభవాలను పిండిన కథా రవ్వలు. తెలుగు కథలు - కథన రీతులు సంకలనాలకు కూడా సంపాదకత్వం వహించారు. విశాలాంధ్ర వారి తెలుగు కథకు కూడా సంపాదకత్వ బాధ్యతలు వహించారు.                    సింగమనేని నారాయణ విమర్శకుడు కూడా- 'కొల్లాయి గ్టటితేనేమి', 'జానకి విముక్తి' నవలలు, చాసో, రారా, మధురాంతకం రాజారం తదితర కథకుల గురించి విమర్శ రాశారు. వీరి విమర్శ కటువుగా ఉన్నా సాహిత్య కారులకు కర్తవ్యాన్ని బోధిస్తుంది. వీరిది విమర్శలో కూడా వాస్తవిక దృష్టి. ప్రగతివాద విమర్శ. అందుకే సింగమనేనిది కొడవటిగంటి, రారాల మార్గం అని చెప్పొచ్చు. సంభాషణ పేరుతో వీరి వ్యాస సంపుటి కూడా వెలువడింది.           ప్రజలు ఆంగ్ల భాషపై వ్యామోహం వీడి తెలుగభాషపై మక్కువ పెంచుకోవాలన్నది సింగమనేని నారాయణ అభిప్రాయం. వీరి శైలి- 'పొలం దున్నతున్నప్పుడు నాగేలులా సాగిపోతుంటుందని, కథ చదువుతున్నంతసేపు సీమపొలాల్లో నడుస్తున్నట్లుంటుంద'ని విమర్శకులు అభిప్రాయపడ్డారు. వీరి సాహిత్య కృషికి అప్పాజోస్యుల విష్ణుబొట్ల కందాళం పౌండేషన్ వారి పురస్కారం లభించింది. మరెన్నో పురస్కారాలు కూడా వచ్చాయి. నిత్యం సాహితీ సభలు, సమావేశాలకు వెళ్తూ ఉపన్యాసాల ద్వారా తెలుగు సాహిత్యాన్ని విశ్లేషిస్తుంటారు.              రచయిత, కథకుడు, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, సామాజిక కార్యకర్త అయిన సింగమనేని నారాయణ రాయలసీమలో సాహిత్య వాతావరణం ఏర్పరచడానికి శ్రమించాడు. అనేకమంది రచయితలకు మార్గాన్ని చూపాడు. అసలు ఆయనతో పది నిమిషాలు మాట్లాడితే ఓ కథా నేపథ్యం దొరుకుతుందట. అర్ధగంట మాట్లాడితే నవలే రాయొచ్చట. ఇదీ సింగమనేని జీవిత, సాహిత్యానుభవం.     వీరికి పేరుప్రఖ్యాతులు తెచ్చిన 

ముదిగంటి సుజాతారెడ్డి

ముదిగంటి సుజాతారెడ్డి                                                     - డా. ఎ. రవీంద్రబాబు            కథ, నవల, విమర్శ, సాహిత్య చరిత్ర, సమీక్ష, పరిశోథన, యాత్రాచరిత్ర, సంపాదకత్వం ... ఇది వెరసి ముదిగంటి సుజాతారెడ్డి సాహితీ చిత్రపటం. నేడు ప్రాంతీయ చైతన్యం గల రచనా మార్గానికి ఆమె ఒక మైలురాయి లాంటిది. తెలంగాణ సాహిత్య చరిత్ర రచనలో తనకంటూ ఓ గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఎక్కడా అలసట, నిరాశ, నిస్పృహ చెందకుండా నేటికీ యువ సాహితీ వెేత్తలతో కలిసి పనిచేస్తున్నారు. మార్గదర్శకాలనే కాదు, తనూ ఓ చేయి వేసి తెలంగాణ కథ, నవలా చరిత్రకు సంబంధించిన కృషీ చేశారు. చేస్తూనే ఉన్నారు.            ముదిగంటి సుజాతారెడ్డి మే 25, 1942లో నల్లగొండ జిల్లాలోని నకరేకల్ దగ్గరున్న ఆకారం గ్రామంలో జన్మించారు. అక్కడే బి.ఏ మొదటి సంవత్సరం వరకు చదువుకున్నారు.  1959లో గోపాల్ రెడ్డితో వివాహం అయింది. తర్వాత హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ రెండో సంవత్సరంలో చేరి ఎం.ఏ. వరకు చదుకున్నారు. 1975లో తెలుగు సాహిత్యంలో పిహెచ్.డి. చేసి డాక్టరేట్ కూడా పొందారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి 2000లలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేశారు.          సుజాతారెడ్డి కేవలం కథా రచయిత్రి మాత్రమే కాదు తెలుగు సాహిత్యానికి సంబంధించి అనేక విలువైన గ్రంథాలు రచించారు.          శ్రీనాథుని కవితా సౌందర్యం          సంస్కృత సాహిత్య చరిత్ర          ఆంధ్రుల సంస్కృతి - సాహిత్య చరిత్ర          నాటక లక్షణాలు          తెలుగు నవలానుశీలన          వేమన నాథ సంప్రదాయం          ముద్దెర (వ్యాస సంపుటి)          ఆద్యతన దృష్టి (సాహిత్య వ్యాసాలు)                   తొలినాటి కతలు (తొలితరం తెలంగాణ కథలు 1, 2)          వట్టికోట ఆళ్వారుస్వామి కథల (జైలు లోపల) కు సంపాదక బాధ్యతలు వహించారు          ముసురు (ఆత్మకథ)          వీరి ఆత్మకథ 1940-50లలోని తెలంగాణ సాంఘిక జీవితాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది. అంతేకాదు 1960లలోని జర్మనీ గురించి కూడా వివరిస్తుంది.          ఇక సృజనాత్మక రచనలు నవల, కథల గురించి-          మలుపు తిరిగిన రథ చక్రాలు(1994) - నవల. ఇది  1946-86 ల మధ్యగల తెలంగాణ బతుకు చిత్రం          సంకెళ్లు తెగాయి(1994) - నవల.  ఇది సంఘసంస్కరణను బోధించే విధంగా ప్రబోధాత్మకంగా సాగుతుంది.          ఆకాశంలో విభజన రేఖలు లేవు (1995) - నవల. ఇది స్త్రీ పురుష సంబంధాలు, స్త్రీల అభ్యుదయం, స్వేచ్ఛ, సమానతలను కోరుకునే దిశగా సాగుతుంది.          సుజాతారెడ్డిగారికి కథా రచయితగా కూడా మంచి పేరు ఉంది. వీరి కథలు సంపుటాలను వెలువరించారు.          విసుర్రాయి (1998). ఇవి స్త్రీల జీవన విధానాన్ని అద్భుతంగా చిత్రించిన కథలు. వీటికి విశేషమైన స్పందన లభించింది. హిందీ బాషలోకి కూడా అనువాదం అయ్యాయి.          మింగుతున్న పట్నం (2001). ఇవి బహుళజాతి కంపెనీలు అభివృద్ధిపేరిట సృష్టిస్తున్న విధ్వంసాన్ని తెలియజేస్తాయి.          వ్యాపార మృగం. ఈ కథా సంపుటి ప్రపంచీకరణ పేదవాళ్లను మరీ పేదరికంలోకి నెట్టివేయబడటాన్ని బట్టబయలు చేస్తుంది.          మరో మార్క్స్ పుట్టాలే...! ఈ కథా సంపుటి గడిచిన రెండు దశాబ్దాల సామాజిక జీవన వైవిధ్యానికి అద్దం పడుతుంది.         వీరి కథలు మొత్తంమీద తెలంగాణ నుడికార సౌందర్యాన్ని పట్టి చూపిస్తాయి. మానవ సంబంధాల్లోని ఆర్ద్రతను పాఠకులకు కలిగిస్తాయి. సందేశాలు ఇచ్చే దిశగా సాగుతాయి. వీరు ఇటీవల రాసిన కథలు సాప్ట్ వేర్, రియలెస్టేట్, లాభసాటిగా మారిన రాజకీయాలు, సినిమాలు, మార్కెట్ మాయజాలంలో కొట్టుకుపోతున్న యువ ప్రపంచాన్ని మన కళ్లముందు ఉంచుతాయి. వీటి వెనుక ఉన్న రహస్యాలను విప్పి చూపుతాయి. వాస్తవాలను వెలికి తీసి మన కళ్లముందు పెడతాయి. ఉదాహరణకు 'న్యూ ఆనంద్ హోటల్ పాస్ట్ ఫుడ్ సెంటర్' కథను చూస్తే- ఆధునికీకరణ, ప్రపంచీకరణ వల్ల చీకట్లోకి, విషాదం లోకి నెట్టవేయబడుతున్న కుటుంబాలు కనపడాయి. ఈ కథలోని పాత్ర లాలయ్య ఆవేదన కూడా ఇదే.          ఇంకా చెప్పాలంటే సుజాతారెడ్డి సృజనాత్మక రచనలు (కథలు, నవలలు) జీవన వైరుధ్యాలను చిత్రిస్తూ, పాఠకుల మనసుల్లో ప్రశ్నలు ఉదయించేలా చేస్తాయి. ఇదే వీటి గొప్పతనం. పత్రికల్లో వీరు రాసిన కాలమ్స్ కూడా ఇదే ధోరణిలో సాగాయి. 1999లో వీరి 'తెలుగు నవలానుశీలన' గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం అవార్టు వచ్చింది. ఇదే ఏడాది అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డూ లభించింది. వీరి 'రస సిద్ధాంతం - నవల' వ్యాసం విమర్శకుల ప్రశంసలు పొందింది. ముదిగంటి సుజాతారెడ్డి సాహిత్య కృషికు ఇంకా పలు బహుమతులు, సత్కారాలూ వరించాయి.             సుజాతారెడ్డి ఇప్పటికీ హైదరాబాదులో నివశిస్తూ తెలుగు సాహిత్యానికి, తెలుగు కథకు... అస్తిత్వాన్ని ముందుకు తెచ్చిన తెలంగాణకు సేవ చేస్తూనే ఉన్నారు. సాహిత్య సభలు, సమావేశాలలో రచయితలు, కవులు, విద్యావేత్తలతో మాట్లాడుతూ... తన రచనలను కొనసాగిస్తూ ఉన్నారు. నేటి యువతరానికి మార్గాన్ని చూపుతున్నారు.            

మల్లాది రామకృష్ణశాస్త్రి

 మల్లాది రామకృష్ణశాస్త్రి                                                - డా.ఎ. రవీంద్రబాబు         ఆయనది చక్కనైన తెలుగు భాష. అందమైన పలుకుబడులు, నుడికారాలతో ఆయన రచనలు తొణికిసలాడుతుంటాయి. అవసరమైన కొలది సంస్కృత పదాలు వాడినా అవి పంటికింద రాళ్లలా అనిపించవు. హాయిగా సముద్రపు గాలిలో తేలుతున్నట్లు ఉంటాయి మల్లాది రామకృష్ణ శాస్త్రి రచనలు. కథ రాసినా, పాట రాసినా, మాటలు రాసినా మల్లాది వారిని ఇట్టే పట్టేయవచ్చు. తెలుగు కథా కథనా రీతుల్లో మల్లాది వారి స్థానం మామిడిపండు లాంటిది అంటారు ఆయన కథలు చదివిన అభిమానులు.            మల్లాది రామకృష్ణశాస్త్రి జూన్ 16, 1905లో కృష్ణాజిల్లాలోని మచలీపట్నం దగ్గరున్న చిట్టిగూడూరు గ్రామంలో పుట్టారు. మచలీపట్నంలోనే బి.ఏ. వరకు చదువుకున్నారు. మద్రాసు వెళ్లి అక్కడ సంస్కృత, తెలుగు భాషల్లో ఎం.ఏ పట్టాలు పొందారు. అంతేకాదు ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిషు భాషల్లో మంచి పాండిత్యాన్ని సంపాదించాడు. నలభైకి పైగా భాషలను అభ్యసించిన ఘనుడాయన. వివిధ శాస్త్రాల్లో పాండిత్యాన్ని సంపాదించి మద్రాసులోని పానగల్ పార్కులో అనేకమందికి వాటిని బోధించేవాడు. సంపన్న కుటుంబంలో పుట్టినా లేమిరికాన్ని అనుభవించాడు. పత్రికల్లో అనేక ఉద్యోగాలు చేశాడు. అనేక చిత్రాలకు అజ్ఞాతంగా సేవలను అందించాడు. 1920లో వెంకటరమణను వివాహం చేసుకున్నాడు.                మల్లాది వారు 'కృష్ణాపత్రిక'లో ఛందోబద్దమైన కవిత్వాన్నే కాదు, 'చలువ మిరియాలు' లాంటి వ్యంగ్య వ్యాసాలూ రాశారు. పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. 'దేశాభిమానం' పత్రికకు కొంతకాలం ఉపసంపాదకులుగా పనిచేశారు. ఆహల్యా సంక్రందనము, హంసవింశతి గ్రంథాలకు పీఠికలు వెలయించారు. 19 సంవత్సరాల వయసులో కథారచనను ప్రారంభించాడు. సుమారు 250 కథలు రాశాడు. 'తేజోమూర్తులు', 'కృష్ణాతీరం' నవలల్ని కూడా రచించాడు. వీరి కథలు-             దోదమ్మ (1963)             వనమాల (1963)             రసమంజరి (1970)             రామకృష్ణ శాస్త్రి కథా సంపుటాలు 1, 2... (1984-2000) పేరిట ముద్రితమయ్యాయి. వీరి కథల్ని రెండు రకాలుగా విభజించి చూడవచ్చు.        1. పురాణాలు, ఇతిహాసాల ఇతివృత్తాలతో కూడినవి.         'వనమాల', 'స్వరమేళ', 'రంగవళ్లి', 'డు.ము.వు.లు.' లాంటివి        2. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, మానవీయ నేపథ్యంతో కూడినవి.           వీరి కథల్లోని ఇతివృత్తం ఎక్కవ స్త్రీ, పురుష సంబంధాల చుట్టు తిరుగుతుంటుంది. కొందరు స్త్రీలు భోగవస్తువులుగా కనపడితే, మరికొందరు విలక్షణ వ్యక్తిత్వంతో ప్రకాశిస్తుంటారు. 'కనక జానకి' కథలో 'నేనెందుకు మీతో లేచిపోవాలీ... కావలిస్తే మీరే రండి నాదగ్గరకు' అని సవాల్ చేస్తుంది స్త్రీ. తెలుగు సమాజంలో 20వ శతాబ్దంలో వచ్చిన మార్పులు వీరి కథా జగత్తలో సంపూర్ణంగా కనిపిస్తాయి. ఉదాహరణకు 'చైత్రరథం' కథలో ఆనాటి రాజకీయాలు, రాజకీయ నాయకుల చిత్తవృత్తులను వివరంగా చిత్రించాడు. అందుకే వీరి పాత్రలు వైవిధ్యంతో నిండి మానవ సాంఘిక పరిణామాన్ని చలన చిత్రంగా చూపుతాయి.            వీరి రచనలు మరో భాషకు లొంగవు. కథల్లోని సంభాషణలను అర్థం చేసుకోవాలంటే కామాలు, సెమీకోలన్స్, చిన్నచిన్న గీతలు, ఆశ్చర్యార్థకాలు, ప్రశ్నార్థకాలు అన్ని పాటిస్తూ చదవాలి. మల్లాది వారి కథలు ఎక్కువ మధ్యమ పురుషలో నడుస్తాయి. 'ఖామోష్' కథ మాండలిక భాషలో సాగుతుంది. 'ఆడకూతురికి ఓ కంట యెన్నెలుండాలి. ఓ కంట కత్తులుండాలి. గొెంతులో కోయిల లుండాలి, కొరడా ఉండాలి...' ఇలా బాధలో, కోపంలో సాగే స్వచ్ఛమైన తెలుగులో ఉంటుంది ఈ కథ. వీరి కథలు ఎక్కవ కృష్ణా జిల్లా వ్యవహారిక భాషలో సాగుతాయి. మల్లాది వారి కథల మరో లక్షణం సన్నివేశం, సంఘటన జరిగినప్పుడు దాని తాలూకూ  పాత్రల మనోభావాలను, పరిణామాలను, వాతావరణాన్ని విశ్లేషించేవిగా ఉంటాయి.             మల్లాది రామకృష్ణ శాస్త్రిది భావనా జగత్తు. పాత్రలు ఊహల్లో విహరిస్తుంటాయి. ఇతి వృత్తాలు శృంగారభరితంగా ఉంటాయి. కథలు గురించి మల్లాది వారే స్వయంగా చెప్తూ... 'కథకు తలా తోకా ఉండాలా... అది పాత్రల ఇష్టం. కథని మొదలు పెట్టడం వరకే రచయిత బాధ్యత. ఆ తర్వాత పాత్రలే కథను నడిపిస్తాయి.' అన్నారు. 'చూర్ణిక' కథలో- 'మానాన్న చూశావ్. బయట పరమ సాధువు. ఇంట ఫాలాక్షుడు... ఎవరి మీదా కోపం కాదు. ఎందుకో ఒకందుకని కాదు. ఎప్పుడు ఒకటే ధుమధుమ... అలా అని పెళ్లాన్ని వేపుక తినేవాడా... అక్కడ పిల్లి... నా మీద మాత్రం ఒంటికాలి మీద లేచేవాడు...' అంటూ తమాషాగా చమత్కారంగా పాత్ర గురించి రాస్తాడు.    వీరి 'డు.ము.వు.లు' కథ 40 భాషల్లోకి అనువాదం అయింది.                    మల్లాది రామకృష్ణశాస్త్రి సినీ జీవితానికి వస్తే- 39 చిత్రాలకు సుమారు 200 పాటల్ని రాశారు. వీరు మొదట 1952లో 'చిన్నకోడలు' చిత్రంలో 'పిల్లనగ్రోవి పాటకాడ...' అనే పాటతో చలన చిత్రరంగంలోకి అడుగుపెట్టాడు. ఆఖరిత్రం 1968లో వచ్చిన 'వీరాంజనేయ'. కానీ తర్వాత కూడా వీరి పాటలను 'రహస్యం', 'అత్తగారు-కొత్తకోడలు' చిత్రంలో వాడుకున్నారు. చాలాకాలం సముద్రాల దగ్గర ఘోస్ట్ రచయితగా చాలా సినిమాలకు పనిచేశారు. అసలు ఘోస్ట్ రచనా పద్ధతి వీరితోనే తెలుగుచిత్రసీమలో మొదలైంది అని చెప్తారు. శ్రీశ్రీ కూడా మల్లాదివారే తనను సిినిమాలకు పరిచయం చేసిన గురుతుల్యులు అని చెప్పుకున్నారు.               వీరి పాటల్లో సన్నజాజుల సౌకుమార్యం, సంపెంగపూల సౌరభం కలిసి ఉంటాయి. 'చిరంజీవులు' (1956) చిత్రంలో 'తెల్లవార వచ్చె తెలియక పరుండేవు లేరా...' పాట మార్మిక భక్తికి మరో మచ్చుతునక. అలానే 'జయభేరి' (1959) చిత్రంలోని 'రాగమయీ రావే అనురాగమయీ రావే...' పాట ప్రతీకలతో నిండి ప్రియుడు పాడుకునే ప్రణయగీతంగా ప్రసిద్ధికెక్కింది. 'దేశద్రోహులు' (1964) సినిమాలో 'మన స్వతంత్ర భారతం, మహామహుల త్యాగఫలం...' పాట దేశభక్తి గీతాలకు ఓ వరవడిని సిద్ధం చేసింది. ఇలా వీరి పాటలు కూడా సరళమైన పదప్రయోగంతో, అందమైన అనుప్రాసలతో స్వయం ప్రకాశంగా వెలుగొందుతున్నాయి.          రామకృష్ణ శాస్త్రి గురించి ఆరుద్ర- 'రామకృష్ణ శాస్త్రి గారు సముద్రుడి కన్నా గొప్పవాడు. తనలో ఎన్నో నిధి నిక్షేపాలున్నా గొప్పవాడినంటూ సముద్రిడిలా ఘోష పెట్టడు. రామకృష్ణ శాస్త్రి అగస్త్యుడికన్నా గొప్పవాడు. అగస్త్యుడు సముద్రాలను పుక్కిట పట్టి వదిలి పెట్టేశాడు. శాస్త్రి గారు భాషా సముద్రాలను తనలోనే నిలబెట్టుకున్నారు'. అని చెప్పారు. ఇంతకంటే మల్లాది వారి గురించి చెుప్పడం కష్టసాధ్యమేమో...            సెప్టెంబరు 12, 1965లో మల్లాది రామకృష్ణశాస్త్రి మరణించినప్పడు ఆత్రేయ స్మృతిగీతం రాస్తూ-            'తెలుగు పోయింది... తెలుగుదనం పోయింది            తెలుగు ధనం పోయింది... తెలుగు లిపి సొగసు పోయింది            తెలుగు చిలిపి పొగరు పోయింది...            తెలుగు రచన కొయ్యబారింది... తెలుగు రసన బండబారింది            తెలుగు నుడికారం తెల్లవారి పిడికెడు తెల్లబూడిదయ్యింది.                                  అని బాధపడ్డారు.           ఇది నేటికీ అక్షర సత్యం.

బుచ్చిబాబు

     బుచ్చిబాబు                                                                              డా. ఎ. రవీంద్రబాబు                 తెలుగు కథ, నవలా సాహిత్యాన్ని రెండో దశకంలో ప్రభావితం చేసిన రచయితల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు బుచ్చిబాబు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగుకు నూతన పోకడలు, లక్షణాలను నిర్దేశించిన రచయిత. ఎక్కడా తెలుగు ప్రాంతీయ శోభ తగ్గకుండా ఆధునిక సాహిత్య విలువలను నర్మగర్భితంగా వెలిబుచ్చిన ప్రతిభామూర్తి. తెలుగు నవలకు, కథకు నవ్య పంథాను చూపిన వారిలో బుచ్చిబాబు ఒకరు. ఎందరో భవిష్యత్ రచయితలకు, విమర్శకులకు మార్గదర్శకులు.          బుచ్చిబాబు అసలు పేరు శివారాజు వెంకట సుబ్బారావు. జూన్ 14, 1916న ఏలూరులో జన్మించాడు. తల్లి వెంకాయమ్మ, తండ్రి సూర్యప్రకాశరావు. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి ఎస్.ఎస్.ఎల్.సి. వరకు కంకిపాడు, పాలకొల్లులో చదివాడు. ఇంటర్మీడియట్, బి.ఏ. గుంటూరలోని ఆంధ్ర క్రిష్టియన్ కళాశాలలో చదువుకున్నాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. ఆనర్సు పూర్తిచేశాడు. తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషులో ఎం.ఎ. పట్టా సంపాదించాడు. కొంతకాలం అనంతపురం, విశాఖపట్నాలలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేశాడు. అటు పిమ్మట 1945 నుంచి 1967 మరణించే వరకు ఆలిండియా రేడియోలో పనిచేశాడు.           కథ, నవలా రచయిత, నాటక కర్త, వ్యాసకర్తగా పేరొందిన బుచ్చిబాబు కాలేజీలో చదువుకునే రోజుల్లోనే మ్యాగజేన్ కోసం ఆంగ్లంలో కవితలు, 'పశ్చాత్తాపం' లేదు అనే తెలుగు కథను రాశాడు. సుమారు 80కి పైగా కథలు, 40 వ్యాసాలు, 40 నాటికలు, నాటకాలు రాశాడు. పీఠికలు, పరిచయ రచనలు, స్వీయచరిత్ర కూడా కొంతభాగం చేశాడు. వీరి రచనల్లో ముఖ్యమైనవి-        చివరకు మిగిలేది        అజ్ఞానం        ఆద్యంతాల మధ్య దారి        నా అంతరంగ కథనం        షేక్ స్పియర్ సాహిత్య పరామర్శ...        చివరకు మిగిలేది నవలను తెలుగు  సాహిత్యంలో తొలి మనో వైజ్ఞానిక నవలగా విమర్శకులు చెప్తారు. పాఠకులకు జీవితంపై ఓ దృక్పథం ఏర్పరచడం కోసమే ఈ రచన చేశానని బుచ్చిబాబు చెప్పాడు. నవలలో ప్రధాన పాత్ర దయానిధిని తల్లి చేసిన అపచారం నీడలా వెంటాడుతుంది. అతని జీవితాన్ని కలుషితం చేస్తుంది. దయనిధి అన్నిటిని ఎదుర్కొని జీవితానికి సంబంధించిన కొన్ని విలువలను సాధిస్తాడు. నవలలో కథంతా ఇతనికి చెందిన తాత్విక కోణంలో నడుస్తుంది.         'వాంఛ దైహికం, ప్రేమ మానసికం. వాంఛలో స్వార్థం వుంది. ప్రేమలో త్యాగం వుంది.' ఇలాంటి వాక్యాలు నవలలో ఎన్నో కనిపిస్తాయి. మనకు జీవన తత్వాన్ని బోధిస్తాయి. నవలంతా ప్రథమ పురుషలో సాగినా దయానిధి ఆంతరంగిక కథనం కనుక ఉత్తమ పురుషలో ఉన్నట్లు కనిపిస్తుంది. జీవితం పుట్టిన క్షణం నుండీ మరణం వరకూ సాగే ప్రయాణం. అయితే ఈ నవల జీవితానికి అర్థం లేదు. చివరకు ఏమీ మిగలదు అని చెప్తూనే జీవితాన్ని సౌందర్యవంతంగా అనుభూతి చెందాలంటుంది. ఇదే దయానిధి సిద్ధాంతం.         కథల విషయానికి వస్తే బుచ్చిబాబు కథ మళ్లా మళ్లా చదివించే ఖండకావ్యంలా సాగాలని చెప్పారు. వీరి కథలు-            నన్ను గురించి కథ వ్రాయవూ          అరకులోయలో కూలిన శిఖరం          దేశం నాకిచ్చిన సందేశం          మేడమెట్లు          పొగలేని నిప్పు          అడవి గాచిన వెన్నెల          పాతనీరు-కొత్త వంతెన... ఇలాంటి చాలా కథలు సార్వ జనీనం, సర్వ సాలికం. ఇతి వృత్తాలు అనంతం. స్త్రీ, పురుషుల మధ్య ఉండే ప్రేమానురాగాల్ని, ఆంతరంగిక జగత్తులోని కల్లోలాలని, సౌందర్యాన్వేషణను, స్వేచ్ఛామానసాన్ని, ప్రకృతి ప్రేమను హృదయానికి హత్తుకనేలా, ద్రవించేలా రాస్తాడు.          వీరు కథాచిత్రణలో పడికట్టు పదాలను, పాత చింతకాయ పచ్చడిని వాడరు. సానబట్టిన వజ్రంలా కొనసాగిస్తారు. ప్రపంచ సాహిత్య పోకడల్ని తెలుగు కథకు పరిచయం చేస్తాడు. 'చైతన్య స్రవంతి', 'గాజుమేడ' లాంటి కథలు ఈ కోవకు చెందినవే... 'మనిషికి మనిషికి మధ్యలోనే కాదు గోడలుండటం, ప్రతి మనిషిలోనూ ఒక పల్చటి పొర వుంటుంది. ఆ తెర ఊడి పోకుండా సంఘం కాపలాకాస్తుంది.' అని మనిషి సమాజంలో ఉంటూనే జీవితాన్ని సౌందర్యభరితం చేసుకోవాలంటాడు బుచ్చిబాబు. అందువల్లేనేమో... కథల్లో కల్పనా జగత్తుకు, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న పొరను చీల్చి వేయడానికి ప్రయత్నించాడు. ప్రతి పదం, వాక్యం, నిర్మాణం, పోలిక అన్నీ కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యంతో పాటు అనుభూతికి లోను చేశాడు. ఊహల్లో విహరింపజేస్తూనే గుండెను పట్టేస్తాడు. భావోద్వేగాలను చిక్కగా కురిపిస్తాడు.            'తనకేం కావాలో తెలీనప్పుడు మానవుడు ద్వేషిస్తాడు. ఏం కావాలో తెలిస్తే, ఆ వొస్తువును ప్రేమించి, దాన్ని పొందడం కోసం ప్రయత్నిస్తాడు. తెలీనప్పుడు హృదయంలో మిగిలేది ద్వేషం. అక్కర్లేదని తెలుసుకుంటే ద్వేషం ఉండదు.' ఇలాంటి జీవన సత్యాలు వీరి రచనల్లో కోకొల్లలుగా మనకు దొరుకుతాయి. జీవితాన్ని చక్క దిద్దుకోమంటాయి.           బుచ్చిబాబు తన రచనా వ్యాసంగం గురించి చేప్తూ- 'బాహ్య జగత్తులోని విషయాలు అంతరంగంలోకి ప్రవేశించి, ఒక మూల నక్కి ఉండి ఎప్పుడో ఒకసారి బైట పెట్టమని ఒత్తిడి జరిగినప్పుడే అవి కథలుగా అవతరిస్తాయి' అని చెప్పుకున్నాడు. బుచ్చిబాబు కథని మూడుముక్కల్లో చెప్పడు. విపులంగా, కులంకషంగా, లోతుగా చెప్పడం ఆయనకు అలవాటు. జీవితంలో సంతృప్తిని సూత్రీకరణ చేస్తూ- 'సంతోషం సంచలనాత్మకమైనది. సంచలనాత్మకమైన దానికెప్పుడూ అవతలి పక్షం వుంటుంది. సంతోషం జారిపోతే దుఃఖం కలుగుతుంది. కానీ హృదయ లోతుల్లోంచి జన్మించే సంతృప్తికి దీటైనది ఏదీ లేదు.' అంటాడు.        బుచ్చిబాబు ఇంద్రజాలికడు. దాన్ని తన రచనల్తో చేసి చూపించాడు. శైలి, సన్నివేశం, పాత్ర, ఔచిత్యం, ప్రారంభం, నడక, ముగింపు ... ఇలా  కథనాన్ని, వస్తువును మమేకం చేసి చూపించే కళాద్రష్ట బుచ్చిబాబు. ఎక్కడో పుట్టి క్రమంగా ఉదృతమై పారే జలపాతం పంటపొలాల్ని తడిపనట్లు మన హృదయాలను చల్లగా తడుపుతాయి వీరి కథలు. రచనలు.

ధర్మవడ్డీ

ధర్మవడ్డీ   - త్రిపురనేని గోపీచంద్         ఆధునిక తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కథ, నవలల్లో గోపీచంద్ ది ప్రత్యేకముద్ర. రచనను ప్రారంభించడంలో, ముగించడంలో ఆయనదో ఒరవడి. గోపీచంద్ కథల్లోనే కాదు, తెలుగు కథా సాహిత్యంలో కూడా 'ధర్మవడ్డీ' చెప్పుకోదగిన కథ. మనిషిని ధనం అనే మహమ్మారి ఎలా ఒంటరిని చేసి, ఆత్మహత్య చేసుకునేలా చేస్తుందో గోపీచంద్ ఈ కథలో అద్భుతంగా చెప్పారు రచయిత.       కథలోకి ప్రవేశిస్తే- 'నేను ఆ ఊరు ఎందుకు వెళ్లానో, నాకిప్పుడు జ్ఞాపకం లేదు కాని... ' అని అనుభవాల్లోంచి కథను నడిపిస్తాడు గోపీచంద్. అతను, అతని స్నేహితుడు కలిసి ఇంట్లో మాట్లుడుకుంటూ ఉంటే సూరయ్య ప్రవశిస్తాడు. అతని దగ్గరున్న మూటను విప్పి 'ఇదిగోనోయ్ డబ్బూ...' అని రాళ్లను ఇచ్చి పైగా 'నూటికి రూపాయిన్నర వడ్డీ... మళ్లీ యిరవై సోమవారం నాటికి దమ్మిడీతో సహా యిచ్చెయ్యాలి' అని ఒట్టేయించుకుని వెళ్లిపోతాడు. అలా బయటకు వెళ్లి మళ్లీ వస్తాడు. 'ఏదీ నా డబ్బు...? ఎన్నాళ్లయింది?. పరువు మర్యాదా వుండక్కర్లేదా? కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? అని తిట్టి, ఇచ్చిన రాళ్లను, వడ్డీ కింద ఇంకొన్ని రాళ్లను తీసుకొని వెళ్లిపోతాడు.          ఈ తతంగం అంతా చూసిన స్నేహితుడు 'అతనికి ఏమైంది?' అని విస్తుపోయి అడుగుతాడు. స్నేహితుడు చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. సూరయ్య తండ్రి మంచితనంతో ఉన్న ఆస్తినంతా దానధర్మాలు చేసి దిక్కులేకుండా చనిపోతాడు. దాంతో సూరయ్య కసితో డబ్బు సంపాదించడం ప్రాంరభించి ఊళ్లో వాళ్లకు వడ్డీలకిచ్చేవాడు. కానీ ఏమాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా, కాపురాలు నాశనం అయినా చలించకుండా బాకీలు వసూలు చేసేవాడు. క్రమంగా ఊళ్లో వాళ్లకి సూరయ్య మీద అసూయ, అసహ్యం పెరుగుతుంది. సూరయ్య చంద్రయ్య అనే మద్యతరగతి రైతుకు అప్పు ఇచ్చి ఉంటాడు. అతను కొద్దిగా పలుకుబడి కలిగిన వ్యక్తి. చంద్రయ్యకు బాకీ రెండువందలు ఇవ్వకుండా 'నీకు చేతనైంది చేసుకుపో' అంటాడు. కోపంతో సూరయ్య టౌనుకెళ్లి కేసుపెడ్తాడు. వచ్చే టప్పుడు రాత్రిపూట చంద్రయ్య పదిమందితో వెళ్లి సూరయ్యని కొటడతాడు. ఈ వార్త ఊరంతా పొక్కుతుంది. దాంతో సూరయ్య పరువు పోతుంది. చులకనై పోతాడు. పిల్లలు కూడా 'సూరయ్య వడ్డీ చంద్రయ్య లాఠీ' అని ఏడిపించే స్థితికి వస్తాడు. ఊళ్లో మిగిలిన వాళ్లూ బాకీలు ఎగేస్తారు. క్రమంగా సూరయ్య పేదవాడై పోతాడు. తనకు రావలసిన ఆస్తి రాదనుకొని అల్లుడు సూరయ్య కూతుర్ని ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు. ఊళ్లో కొంతమంది సూరయ్య మీదున్న కసితో కూతుర్ని మానభంగం చేస్తారు. ఆ అవమానాన్ని బరించలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది కూతురు. భార్య కిరోసిన్ పోసుకుని చనిపోతుంది. దాంతో సూరయ్యకు గుండెలు పగిలి పిచ్చి పడుతుంది. ఇంటికి, బావి దగ్గరకు తిరుగుతూ ఉంటాడు. రాళ్లనే డబ్బులని వడ్డీలకు ఇస్తూ వుంటాడు.              ఈ కథంతా విన్న తర్వాత బయట ఏదో గొడవగా ఉంటే స్నేహితులు ఇద్దరూ బయటకు వస్తారు. సూరయ్యను పిల్లలు గోలచేస్తూ ఉంటారు. సూరయ్య రాళ్ల మూటతో నేరుగా వెళ్లి బావిలో దూకుతాడు అని  గోపీచంద్ కథను విసాదాంతంగామ ముగిస్తాడు.           కథలో ప్రథాన పాత్ర స్వభావాన్ని, వచ్చిన మార్పును పూసగుచ్చినట్లు మరో పాత్రతో చెప్పించడం ఈ కథలోని గొప్ప టెక్నిక్. కథను ఉత్తమ పురుషలో ప్రాంరంభించినా ప్రథమ పురుష ద్వారా చెప్పించాడు. చెయ్యి తిరిగిన రచయిత గోపీచంద్ కథా నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథను 'రాళ్లను డబ్బులుగా వడ్డీకి' ఇచ్చే సన్నివేశంతో ప్రారంభించి పాఠకునిలో ఉత్కంఠను కలిగించాడు. చివరకు మరణంతో విషాదవీచికను మనలో నింపాడు. అంతేకాదు సూరయ్య ప్రవర్తనకు కారణాన్ని తండ్రిలో వెతుక్కోమన్నాడు. పాత్రౌచితభాష, సంభాషణా లౌక్యం, వాస్తవిక చిత్రణ కథకు జీవాన్ని పోశాయి. గోపీచంద్ వాక్యం ఆగదు. అలాగని పరుగెత్తదు. నెమ్మదిగా నడిపిస్తుంది. 'పిల్లికి బిచ్చం పెట్టడు', 'అరిచి గీపెట్టినా దమ్మిడీ వదలడు' లాంటి పిసినారి తనానికి చెందిన లోకోక్తులు సందర్భోచితంగా కనిపిస్తాయి. 'క్షణాల మీద యీ వార్త వూరంతా పొక్కింది' లాంటివి లోకంలోని మనిషి స్వభావానికి అద్దం వంటివి.         సూరయ్య రెండోసారి వచ్చినప్పుడు 'ఆపాద మస్తకం వొణికిపోతున్నాడు, కళ్లు యెర్రగా జ్యోతుల్లా వున్నై, గాలి తెగ పీలుస్తున్నాడు... 'లాంటి ఎన్నో పాత్ర భౌతిక వర్ణనలు అలకరించని అలంకరణలే. ఈ కథ నాటకంగా కూడా టీవీలో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమాజ స్వభావానికి, మనిషి పేరాశకు ఈ కథ ప్రతిబింబిం వంటిది. ప్రతి మనిషి చదివి తనను తాను ఉన్నతంగా మార్చుకోడానికి ఉపయోగపడుతుంది.                                             - డా.ఎ.రవీంద్రబాబు       

కాళీపట్నం రామారావు

కాళీపట్నం రామారావు                          డా.ఎ. రవీంద్రబాబు       కారా మాస్టారుగా సుపరిచితులైన కథా రచయితే కాళీపట్నం రామారావు. రెండోతరం తెలుగు కథా సాహిత్యంలో తనదైన ప్రత్యేక ముద్రవేశాడు. కథాసేవే తన జీవిత మార్గంగా ఎన్నుకుని జీవిస్తున్న సాహిత్య సృజనశీలి. నిత్యం కథ గురించి మాట్లాడుతూ, కథ గురించి రాస్తూ, కథల్ని భద్రపరుస్తూ కథే జీవితమైన వ్యక్తి కాళీపట్నం రామారావు. గురజాడ బాటను కథల్లో మరింత ముందుకు తీసుకెళ్లి, దానికి అభ్యుదయ వాసనలు పూయించిన ఘనుల్లో కారా మాస్టారు ముఖ్యులు.        కారా మాస్టారు శ్రీకాకుళం జిల్లా మురపాకలోనవంబరు 9, 1924లో జన్మించారు. వీరి నాన్న కరణం పేర్రాజు. అక్కడే ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదువుకున్నారు. విశాఖ జిల్లా భీమిలీలో టీచర్ ట్రైనింగ్ శిక్షణ తీసుకున్నారు. 1948లో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి 31 ఏళ్లపాటు ఎందరో విద్యార్థులకు పాఠాలు బోధించాడు. 1979లో ఉద్యోగ విరమణ చేశారు. మార్చి 19, 1946లో సీతామహాలక్ష్మిని వివాహం చేసుకున్నారు. జీవితంలో అనేక సాధక బాధకాలు పడ్డారు.           కారా మాస్టారు తన 19వ ఏట తొలికథ 'ప్లాటు ఫారమో...' రాశారు. ఇది 1943లో 'చిత్రగుప్త' పత్రికలో వచ్చింది. ఆ తర్వాత 'వీసంలో... అయితే గియితే' పేరుతో రెండో రాశారు. రామారావు మొదట స్వాతంత్ర్య పోరాటం, గాంధీ భావాలు, నెహ్రూ సోషలిస్టు భావాల ప్రభావంతో కథలు రాసినట్లు కనిపిస్తుంది. రాగమయి, అభిమానాలు, అభిశప్తులు, పలాయితడు... లాంటి కథలు ఇలాంటివే. 1967లో నక్సల్బరీ ఉద్యమం తర్వాత వీరి చూపులో మార్పు వచ్చింది. కారా గారికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన కథ 'యజ్ఞం' 1966లోనే వెలువడింది. తర్వాత ఈ భావాలతోనే హింస, నో రూమ్, ఆర్తి, భయం, చావు, కుట్ర, ఆయన చావు... లాంటి ఎన్నో కథలు వీరి నుంచి వచ్చాయి. ఇవన్నీ తెలుగులో శాశ్వతంగా నిలిచిపోయే రచనలు.      వీరి రచనలు పలు సంపుటాలుగా ముద్రితమయ్యాయి. రాగమయి (1957), యజ్ఞం (1971), కాళీపట్నం రామారావు కథలు (1972), అభిమానాలు (1974), జీవధార-ఇతర కథలు (1974), కాళీపట్నం రామారావు కథలు (1986), యజ్ఞంతో తొమ్మిది (1993), కాళీపట్నం రామారావు కథలు( 1999). 2008లో వీరి రచనలు అన్నీ 567 పేజీల గ్రంథంగా వెలుగులోకి వచ్చింది.           'యజ్ఞం' కథ తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే కథ. ఈ కథలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించారు. అందులో నిగూఢంగా కనిపించే ధనికవర్గం పక్షపాతాన్ని సూటిగా చెప్పారు. కథా లోతుకు, విస్తృతమైన పరిదికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ.           'జీవధార' కథలో పేదవాళ్లు నీళ్లు దొరక్క నానా యాతన పడుతుంటే... శ్రీమంతులు విలాసం కోసం పెంచుకునే క్రోటను మొక్కలకు నీళ్లు వృధా చేస్తూ ఉంటారు. పేదవాళ్లందరూ కలిసి నీళ్లకోసం శ్రీమంతుల ఇంటికి వెళ్తారు. వాళ్లు జనశక్తికి బెదిరి అనుగ్రహించే దేవుళ్లలా పట్టుకోమంటారు. ఇలా సాగుతుంది కథ. ఈ కథలో లోతుగా వర్గ దృక్పథమే ఉంటుంది. కానీ రచయిత ఎక్కడా ప్రవేశించడు. తన భావాలను చెప్పడు. శిల్పం దృష్ట్యా కూడా ఇదో గొప్పకథ.            కాళీపట్నం రామారావు ప్రత్యేకతే ఇది. రచయిత చెప్పదలచుకున్న భావం అంతర్లీనంగా పాఠకుడికి చేరుతుంది. భాష సరళంగా ఉంటుంది. జీవితంలో అనుభవించి, పరిశీలించి, కష్టాలను, సంఘర్షణలను కథల్లో రాశారు కారా. అట్టడగు వర్గాల జీవన సమరాన్ని పాత్రల్లో ప్రవేశపెట్టాడు. ఆరు దశాబ్దాలు తెలుగు కథను సుసంపన్నం చేసిన కారా మాస్టారి కథలు రష్యన్, ఇంగ్లీషు, ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువాదాలయ్యాయి. ఆంధ్రభూమి దినపత్రికలో 'నేటి కథ' శీర్షికను నిర్వహించి ఎంతో మంది కొత్త రచయితలను ప్రోత్సహించారు.             కారా మాస్టారు తన కథా రచనకు కొడవటిగంటి కుటుంబరావును గురువుగా, రా.వి.శాస్త్రిని మార్గదర్శకునిగా భావిస్తారు. కానీ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మాత్రం వీరిని గురువుగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటిస్తే ప్రభుత్వ విధనాలు నచ్చక తిరస్కరించారు. 1995లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును స్నేహితుల కోరిక ప్రకారం అందుకుని ఆ డబ్బుతో ఫిబ్రవరి 22, 1977లో శ్రీకాకుళంలో 'కథానిలయా'న్ని స్థాపించారు. ఇక్కడ సుమారు ప్రముఖ తెలుగు పత్రికలన్నీ దొరుకుతాయి. 600ల మంది కథా రచయితల కథలు లభ్యమవుతాయి. రామారావు నేడు కథా రచయతల జీవిత విశేషాలను, ఛాయాచిత్రాలను భద్రపరిచే పనిలో ఉన్నారు. ఇదొక అపూర్వమైన కథా ప్రపంచం. తెలుగులో సుమారు 3000ల మంది కథా రచయితలు ఉన్నారని వీరి అంచనా...        'జీవితానికి చాలా ముఖాలున్నాయి. ఆంతరంగిక జీవితం మనకొక్కడికి మాత్రమే. అది అందరికీ కాదు, కొందరికే తెలుస్తుంది. మన వ్యక్తిగత జీవితం చుట్టూ ఉండే వాళ్లకు కూడా కనిపిస్తుంటుంది. కౌటంబిక జీవితం చుట్టూ ఉండే కుటుంబ సభ్యులకూ, బంధుమిత్రులకూ తెలుస్తుంది. సామాజాకి జీవితం ప్రపంచానికి తెలిసేదైతే, వ్యవస్థాగత జీవితం స్పష్టమైన ప్రపంచ దృక్పథం ఉన్న వాళ్లకు మాత్రమే తెలిసేది' అని కథా రచన చేస్తున్న వారికి, కథా లోతుల్ని పసిగట్టే వారికి చెప్తారు కారా మాస్టారు.           తెలుగు సాహిత్యం పై ఏమాత్రం అభిమానమున్న వారు ఒక్కసారైనా ఈ కథా నిలయాన్ని దర్శించాలి. కారామాస్టారును కలవాలి. 90 ఏళ్ల వయసులో ఆ నవ యవ్వనుడు చేస్తున్న కథా సేవను కళ్లారా చూడాలి. అదో అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుంది. 

బోన్ సాయ్ బ్రతుకు

  బోన్ సాయ్ బ్రతుకు                                                  - అబ్బూరి ఛాయాదేవి             స్త్రీల జీవితాల్లోని చిన్నచిన్న సంఘటనలను, వాటి వెనకున్న అంతరార్థాన్ని, సమాజ భావజాలాన్ని మంచి కథలుగా చిత్రించారు అబ్బూరి ఛాయాదేవి. వీరి ప్రతి కథ చక్కని భాషతో, శైలితో ప్రకాశిస్తుంది. కుటుంబానికే పరిమితమైన స్త్రీలను, కుటుంబంతోపాటు, ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆధునిక స్త్రీల జీవితాలను దగ్గరగా పరీక్షించి, ఆ ఇతివృత్తాలతోనే అద్భుతమైన కథలు రాశారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా స్త్రీకి కూడా విద్య, ఉద్యోగం అవసరమని తెలిజేప్పేదే 'బోన్ సాయ్ బ్రతుకు' కథ.         రచయిత్రి ఇంటిపని, వంటపని చేసుకునే స్త్రీకి ప్రతీకగా ఈ కథకు ఆపేరు పెట్టారు. కథ మొత్తం ఉత్తమ పురుషలో సాగుతుంది.            కథ- భారత రాజధాని ఢిల్లీల్లో ఉద్యోగం చేస్తున్నచెల్లెలికి ఇంటికి రాగానే ఉత్తరం కనిపిస్తుంది. అది అక్కరాసిన ఉత్తరం. చించి చదివితే అక్క, బావ వస్తున్నారన్న వార్త తెలుస్తుంది. ఆ విషయాన్నే భర్తతో కూడా ఆనందంగా పంచుకుంటుంది. భర్తకూడా సంతోషిస్తాడు.         అక్కను వాళ్ల నాన్న అయిదో తరగతి తోటే చదువు మాన్పించి ఉంటాడు. 'ఆడపిల్లలకు చదువేమిటి... చాకలి పద్దు రాయగలిగితే చాలదా' అనుకునే రోజులవి. కానీ చెల్లెలు పుట్టేనాటికి పరిస్థితులు మారతాయి అందుకే ఈమెను చదివిస్తాడు. అక్కకు పల్లెటూరి సంబంధం కుదురుతంది. ఆమె భర్త చదువుకున్నా ఆదర్శభావాలతో, ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూర్లోనే స్థిరపడతాడు. చెల్లెలు ఉద్యోగం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని, చదివిన చదువుకు సార్థకత, సంపాదన ఉండాలనే కోరికతో తనూ ఉద్యోగం చేస్తుంటుంది.            అక్క వస్తూ వస్తూ పల్లెటూరి నుంచి దోసకాయలు, గోంగూర, వడియాలు, ములక్కాడలు... లాంటివి ఎన్నో తెస్తుంది. చెల్లెలు వాటిని చూసి సంబరపడతుంది. 'ఇవన్నీ చేయడానికి నాకు అసలు తీరికే ఉండదక్కా.. ఆఫీసు నుంచి సోలిపోయి వస్తాను. వెధవ ఉద్యోగం' అని తన స్వానుభవాన్ని అక్క ముందు వెళ్లబోసుకుంటుంది. అంతా విన్న అక్క 'అలా అనకు. నువ్వు అదృష్టవంతురాలివి. మగాడితో సమానంగా ఉద్యోగం చేస్తున్నావు. చేతినిండా సంపాదనా.. దర్జాగా బ్రతగ్గలవు' అంంటుంది.             బాల్కనీలో పూలకుండీలలో తురాయి. దానిమ్మ మొక్కలను చూసి ఆశ్చర్యపడి 'ఇవేంటి... నిక్షేపంలా పెరట్లో పెరగాల్సిన చెట్లని పూలకుండీల్లో మరగుజ్జుల్లా తయారు చేశావు' అంటుంది అక్క. తన గొప్పతనం అక్కకు తెలియాలనే ఉద్దేశ్యంతో చెల్లెలు 'ఇదో స్పెషల్ పద్ధతి. వీట్ని బోన్సాయ్ అంటారు. మహా వృక్షాన్ని కూడా పూలకుండీల్లో పెంచొచ్చు. ఇదో గోప్పకళ' అనిచెప్తుంది. అంతలో గాలి వర్షం రావడంతో చెల్లెలు ఆ కుండీలను లోపలికి, చూరి కిందకు లాగుతుంది. అక్క కిటికీతీసి దూరంగా వాతావరణాన్ని చూస్తుంది. దూరంగా తురాయి చెట్టుకింద వర్షానికి తడవకుండా ఎంతో మంది నిలబడి ఉంటారు. వాళ్ళని చెల్లెలకు చూపిస్తూ... 'నీ బోన్ సాయ్ కుదురుగా, ముచ్చటగా సంసారపక్షపు స్త్రీలా ఉంది. నువ్వు వెయ్యి కళ్లతో కాపాడాలి. కాస్త తుఫానుకి కూడా తట్టుకోలేదు. ఒకరి మీద ఆధారపడి, మరొకరికి ఏమివ్వగలదు.... ఆడదాని బ్రతుక్కూడా... బొన్సాయిలా మారింది.' అని అంటుంది. చెల్లెలకు పంజరంలోంచి చిలకను స్వేచ్ఛగా బయటకు వదిలేసినట్లు బోన్సాయికి కూడా విముక్తి కలిగించాలన్న ఆవేశం కలుగుతుంది.            ఛాయాదేవి కథ నిడిపిన తీరు రాసే భాషలో కాకుండా, మాట్లాడే భాషలో సాగుతుంది. కథ మొదట్లో లేఖల గొప్పతనం వివరిస్తూ రచయిత్రి...  'ఉత్తరాలను చూస్తే ఆత్మీయులు ఎదురై ఆప్యాయంగా పలకరించినట్లు', 'కూనిరాగం తీస్తూ కులాసాగా కాఫీ తాగొచ్చు' అంటుంది. ఇలాంటివి మనసుకు తేనీరులా తాకుతాయి. ప్రారంభం నుంచి అక్క పాత్రను పల్లెటూరి స్త్రీగా చెప్పి, చివరకు ఆమె ద్వారానే కుటుంబ స్త్రీ జీవితాన్ని 'బోన్సాయి' మొక్కతో పోల్చడం అద్భుతమైన కథా శిల్పంలోని సుగుణం. నేటి సమాజంలో కుటుంబాన్ని, ఉద్యోగ బాధ్యతను నిర్వరిస్తున్న స్త్రీకి చెల్లెలు ప్రతినిధి, గ్రామాలలో కుటుంబ బరువును మోస్తున్న స్త్రీకి అక్క ప్రతిరూపం. అందుకే వీరి మధ్య సాగే సంభాషణలు నేటి సమాజంలోని ఎందరో స్త్రీల జీవితంలోని ఆలోచనలకు, అంతగంగాలకు ప్రతిబింబాలు.             'ఈదురో దేముడా', 'పిల్లాపీచు గొడ్లూ గోతం పట్టలూ', 'కుచేలుడు లాగా పట్టగరావటం', 'పంచభక్ష్య పరమాన్నాలు', 'దూరపు కొండలు నునుపు', 'బూడిదలో పోసిన పన్నీరు...' లాంటి నుడికారాలు కథలో కలకండ పలుకుళ్లా పాఠకుడి హృదయాన్ని తీపిచేస్తాయి. అంతేకాదు 'ఆడపిల్లకు చదువేంటి... చాకలి పద్దు రాయగలిగితే చాలు', 'మగవాడి చెప్పు కింద తేలులాగా పడి ఉండాల్సిందే...' వంటి పురుషాధిక్య భావజాల సమాజం కల్పించిన పదజాలాన్ని కథలో సందర్భోచితంగా పదును తేలిన బాణాల్లా వాడారు ఛాయాదేవి. అందుకే ఈ కథ స్త్రీల జీవితానికి స్వచ్ఛమైన వ్యాఖ్య లాంటిది.                                                   - డా.ఎ. రవీంద్రబాబు   

అమ్మకే జీతం ఇవ్వాల్సి వస్తే...?

 అమ్మకే జీతం ఇవ్వాల్సి వస్తే...?   -కనకదుర్గ                                                                                             "మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ" - మన శాస్త్రాలల్లో కూడా కన్న తల్లికే మొదటి స్థానం ఇచ్చింది.  కన్న తల్లి తర్వాతే ఎవ్వరయినా.  ఒకమ్మాయికి వివాహం జరిగి భర్తతో కాపరానికి వచ్చాక మొదటిసారి గర్భవతి కావడం అప్పటినుండి ఆమె శరీరంలో ఒక చిన్న పాపో, బాబో ప్రాణం పోసుకోవడం మొదలు పెట్టాక శరీరంలో, ఆమె మనసులో ఎన్నో మార్పులు వస్తుంటాయి.  పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో తీపి కలలు.  ఇప్పటిలా ఆడపిల్లయితే గర్భస్థ శిశుహత్య చేయించే అవకాశాలు లేనప్పుడు మొగపిల్లాడు పుట్టినా, ఆడపిల్ల పుట్టినా ఆనందించేవారు.  ముఖ్యంగా తల్లికి ఎటువంటి భేధాలు వుండవు, ఎవరు పుట్టినా ఆరోగ్యంగా, సంతోషంగా, తన వొళ్ళో కేరింతలు కొట్టాలని కోరుకుంటుంది.  సృష్టికే మూలం అయిన స్త్రీ శిశువునే పుట్టకముందే పొట్టన పెట్టుకునే రోజులు వస్తాయని అప్పటివారు వూహించి కూడా వుండరు.  మదర్స్ డే ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా జరుపుకుంటారు, మే నెలలో రెండవ ఆదివారం.  అలాగే ఫాదర్స్ డే, గ్రాండ్ పేరంట్స్ డే (స్కూల్స్ లో), ఫ్రెండ్షిప్ డే, సెక్రటరీస్ డే, నర్సస్ డే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి.  కానీ మదర్స్ డే ప్రపంచీకరణ తర్వాత త్వరగా ఇతర దేశాలకు ముఖ్యంగా అబివృద్ది చెందుతున్న దేశాలకు ప్రాకిపోయింది.  ముందు జరుపుకోలేదు కదా ఇప్పుడు ఎందుకు జరుపుకుంటున్నాం? అని కొంతమంది ప్రశ్నించుకుంటారు.  కొంతమంది ఆధ్యాత్మిక గురువులు పాశ్చాత్యదేశాలనుండి వచ్చిన ఈ ’రోజులను,’ ముఖ్యంగా అమ్మల దినం, నాన్నల దినం జరుపుకోనవసరం లేదు, మన సంస్కృతిలో తల్లిని, తండ్రిని ప్రతి రోజు గౌరవిస్తూనే వుంటాం కాబట్టి.  అమ్మ, ఆయి, మాద్రే, మమ్మీ, మమ్మా, మాయి, మామ్, హహోయా, మమోచ్కా, ఏ భాషలో పిలిచినా అమ్మ ప్రేమ, ఆప్యాయతా, అనురాగం, మమత ఎక్కడయినా ఒక్కలాగే వుంటాయి.  ఇప్పుడు చూడండి నైజీరియాలో ఆడపిల్లల్నిఎత్తుకెళితే ఇతర దేశాల వారు కూడా వారిని వెదికి తీసుకురావడానికి సాయం చేయడానికి ముందుకు వచ్చాయి.  వాళ్ళని ఎత్తుకెళ్ళినప్పట్టినుండి తల్లులు, ఏడ్చీ, ఏడ్చీ, తిండి తిప్పలు లేకుండా, నిద్ర కూడా లేకుండా రోడ్డు మీద కెళ్ళి వారి నిరసన తెలియజేస్తున్నారు, తమ పిల్లల్ని వెదకడంలో ప్రభుత్వం జాప్యం చేసినందుకు. మదర్స్ డే చాలా హంగామా చేస్తారు అమెరికాలో.  కొత్తగా తల్లి కాబోతున్న తల్లికి, గర్భవతికి భర్త మంచి బహుమతులిస్తాడు.  కాలేజిల్లో చదువుకుంటున్నవారు, వేరే ప్రదేశాల్లో వుద్యోగాలు చేస్తున్న పిల్లలు తల్లులకు మంచు గిఫ్ట్స్ తీసుకుని ఆ రోజంతా తల్లితో గడపడానికి వస్తారు. వృద్దాశ్రమాల్లో వుండేవారిని చూడడానికి కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవలు, మనవరాళ్ళు, మునిమనవలు అంతా కలిసి వచ్చి వారితో గడిపి వెళతారు.  ఒకోసారి మరీ దూరంగా వుంటే రావడం కుదరక పోతే వృద్దాశ్రమాల్లో వుండే వృద్దులు పిల్లల కోసం రోజంతా ఎదురు చూస్తూనే గడిపేస్తారు.  ఆ ఆశ్రమంలో వారు వారి సంతోషం కోసం రక రకాల కార్యక్రమాలు చేసినా వారి చూపు మాత్రం పిల్లల కోసం ఎదురు చూస్తూనే వుంటాయి.   అమ్మ అంటే కడుపులో వున్నప్పుడే బిడ్డతో అనుబంధం ఏర్పడి, భూమ్మీద పడినప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడే తల్లి భాధ్యతలు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి.  సూపర్ వుమన్ పేరిట, మల్టీ టాస్కింగ్ స్త్రీలు బాగా చేయగలరనే పేరుతో ఇటు ఇంట్లో, అటు వుద్యోగాల్లో పురుషులకు ఏ మాత్రం తక్కువ కామని వారికంటే కూడా ఇంకా ఎక్కువే చేయగలమని నిరూపించుకుంటున్నారు నేటి స్త్రీలు.  ఇక గృహిణుల విషయానికొస్తే వారు ఇంట్లో వుంటారు వారికేం సమస్యలుంటాయి అనుకుంటారు చాలా మంది.  కొంతమంది పిల్లల్ని కానీ, భర్తలని కానీ మీ అమ్మ, లేదా భార్య ఏం చేస్తుంటారు? అని అడిగితే, వెంటనే, మా అమ్మ ఇంట్లోనే వుంటుందండీ, ఏం చేయదు, మా ఆవిడ ఇంట్లోనే వుంటుంది ఏం చేయదు, షి ఈజ్ జస్ట్ ఏ హౌజ్ వైఫ్ అంటారు చాలా మంది.  ఒక గృహిణి, తల్లిగా, భార్యగా, కోడలిగా, ఒక ఇంట్లో ఎన్ని పనులు చేస్తుందో తను చేసే పనులను విభాగాలుగా విడగొట్టి చూస్తే అందరూ ఒక్క వుద్యోగం చేస్తే గృహిణులు ఒక్క రోజులో ఎన్ని వుద్యోగాలు చేస్తున్నారో తెలుస్తుంది.  మొట్టమొదటగా ఒక ఇంట్లో ప్రతి ఒక్కరికి అన్నీ అమర్చి పెట్టడం, అందరి రూమ్స్ లో అన్నీ సరిగ్గా వున్నాయా లేదా, ఏమైనా లేకుంటే పిల్లలకు చదువుకునే డెస్క్ పాడయిపోతే కొత్తది తెప్పించి పెట్టడం లాంటివి, ఇలా అందరికీ అమర్చి పెట్టడం చేస్తారు ఒక హౌజ్ కీపర్ గా (Housekeeper).   ఈ హౌజ్ కీపర్ పనుల్లో ఇల్లు రోజు శుభ్రం చేయడం, పసి పిల్లలుంటే వారిని చూసుకోవడం అంటే బేబి సిట్టర్ గా లేకపోతే ఒక డేకేర్ సెంటర్ పని కూడా చేస్తున్నారన్నమాట. కాస్త పెద్ద పిల్లలయితే రోజు వారితో హోం వర్క్ చేయించడం, వారు పియానో, వయోలిన్, సంగీతం కానీ, కూచిపూడి,కానీ నేర్చుకుంటుంటే వారు రోజు మర్చిపోకుండా ప్రాక్టీస్ లు చేయించడం, వారిని రోజు ఆ క్లాసెస్ కి తీసుకెళ్ళడం, తీసుకురావడం చేస్తారు. అలాగే పిల్లలు  స్పోర్ట్స్ లో వుంటే సాకర్, టెన్నిస్, జిమ్ నాస్టిక్స్, బాస్కెట్ బాల్ ఏ ఆటలో వుంటే ప్రాక్టీస్ లకి తీసుకెళ్ళడం, శనివారాలు గేమ్స్ కి తీసుకెళ్ళడం చేస్తారు.   ఇలా ఒక టీచర్ గా(Teacher), డ్రైవర్(Driver) పని కూడా చేస్తున్నారన్న మాట.  ఒకోసారి తల్లులందరు కలిసి ఒకరోజు అందరి పిల్లల్ని ఒకరు, మరో రోజు మరొకరు తీసుకెళ్లే పద్దతి, కార్ పూలింగ్ (Carpooling) చేస్తుంటారు.  శనివారాలు గేమ్స్ తల్లి ఒకరిని ఒక గేమ్ కి తీసుకెళ్తే, తండ్రి ఒక గేమ్ కి తీసుకెళ్తారు.  ఇక వంట విషయానికొస్తే పొద్దున బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్, వారి వారి అవసరాలను బట్టి చేయాల్సి వుంటుంది.  పర్యావరణ కాలుష్యం వల్ల చిన్నప్పటి నుండే పిల్లలకి రక రకాల అలెర్జీల వల్ల వారికి ఏది పడుతుందో, ఏది పడదో, అలాగే ఇంట్లో ఎవరికైనా డయబెటిస్ వుంటే వారికి వేరే రకంగా, అందరికి కావాల్సినట్టుగా చేయాలి,  మధ్య మధ్యలో పిల్లలకి తినడానికి స్నాక్స్ చూసుకోవడం చేస్తారు కాబట్టి ఇది వంట మనిషి చేసే పని కిందకి వస్తుంది, (Cook). స్కూల్స్ నుండి వచ్చే మేల్స్ చూడడం, ప్రెండ్స్ తో టచ్ లో వుండాలంటే కూడా మేల్స్ పంపిస్తూ వుండాలి, స్కూల్ కి వలంటీర్ వర్క్ కుడా ఇంటినుండే ఇంటర్నెట్ ద్వారా చేస్తారు కొంతమంది స్త్రీలు.  చాలావరకు బిల్స్ అన్నీ ఆన్లైన్ ద్వారా కట్టడం, ఏవైనా అర్జెంటుగా కొనాలన్నా బయటకు వెళ్ళి షాపింగ్ చేసే సమయం లేకపోతే ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తారు, పెద్ద పిల్లలకు హోం వర్క్ కి ఇంటర్నెట్ సాయంతోనే చేయిస్తారు.  ఈ విధంగా కంప్యూటర్ ఆపరేటర్ (Computer Operator) గా కూడా పని చేస్తూనే వుంటారు. బట్టలు వాషింగ్ మెషిన్ లో వేయడం, డ్రయర్ లోకి మార్చడం, డ్రై క్లీనింగ్ బట్టలకి కిట్స్ తీసుకొచ్చి ఇంట్లోనే డ్రయర్లో చేస్తారు, ఇలా అయితే చీప్ గా అవుతుందని.  ఆ తర్వాత ఇస్త్రీ తప్పకుండా చేయాల్సిన కుటుంబాల్లో స్త్రీలు ఆ పని కుడా చేస్తుంటారు.  ఇలా వీరు లాండ్రీ ఆపరేటర్ (Laundry Operator) గా కూడా పని చేస్తున్నారు. పిల్లలు కాని, పెద్దలు కానీ జబ్బు పడితే వారికి తగ్గే వరకు జాగ్రత్తగా చూసుకుంటూ నర్సింగ్ (Nursing) పని కూడా చేస్తుంటారు కదా! పిల్లలు స్కూల్లో కానీ, బయట పిల్లలతో కానీ గొడవ పడడమో, లేకపోతే వారిని ఎవరైనా ఏడిపిస్తూ రోజూ విసిగిస్తుంటే దాంతో పిల్లలు ఇంట్లో చురుగ్గా వుండలేరు. ఈ విషయాలు తల్లులకే త్వరగా తెలుస్తుంది.  మెల్లిగా విషయం అడిగి తెలుసుకుని, వారిని దగ్గరకు తీసుకుని, వారి వయసుని బట్టి రక రకాల ఉదాహరణలు ఇస్తూ, కథలు చెబ్తూ, వారికి వారు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ధైర్యం ఇస్తూ చెప్పాలి.  లేదా స్కూల్లో వారి ఫ్రెండ్స్ వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతున్నా, అనుకోకుండా క్లోజ్ ఫ్రెండ్ ఏదైనా జబ్బు చేసి పోవడమో, ఎక్సిడెంట్ లో పోవడమో జరిగితే వారి దు:ఖం తగ్గే వరకు వారికి ధైర్యం చెబుతూ జాగ్రత్తగా చుసుకోవాలి.  ఇలా వారు కౌన్స్ లర్ (Counselor) చేసే పనిని కూడా చేస్తున్నారు.  ఈ పనులన్నీ సక్రమంగా జరిగేట్టుగా చూస్తూ ఇంట్లో అందరూ వారి వారి పనులు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది కాబట్టి తల్లి ఇంటికి ఒక సి.ఈ.ఓ(C.E.O) అందరికీ అన్నీ అమర్చి పెట్టడం అయితే చేస్తారు కానీ పిల్లల్ని పికప్ లు, స్పోర్ట్స్ కానీ కళల క్లాసులకి డ్రాప్ చేయడంలో మునిగిపోయిన వారు కారులోనే వారి లంచ్ కానిచ్చేస్తారు, అదీ ఒక ఆపిల్ పండో, అరటిపండో తినేసి. ఇక బీద వాళ్ల విషయానికి వస్తే తల్లులు ఎంత కష్ట పడి పని చేసినా ఒకోసారి అందరికీ ఒక్క పూట కూడా తినడానికి వుండదు.  అలాంటి సమయంలో తల్లి వున్నదేదో పిల్లలకు పెట్టేసి తను కడుపునిండా నీళ్ళు తాగేసి పడుకుంటుంది.  ఇలాంటి త్యాగాలు చేయడం తల్లులకి మామూలే.  ప్రతి ఏడాది ఇంటర్నెట్ లో సాలరీ.కామ్ వారు ఒక గృహిణికే తను చేసే పనికి కనక జీతం ఇవ్వల్సి వస్తే ఏడాదికి ఎంత ఇవ్వవలసి వస్తుంది అన్న విషయం మదర్స్ డే సమయానికి విడుదల చేస్తారు.  ఈ ఏడాది ఎంత లెక్క కట్టారో చూద్దామా?  ఒక గృహిణికి ఏడాదికి $118,905 డాలర్లు ఇవ్వాల్సి వుంటుందని నిర్ణయించారు.  ప్రతి ఏడాది తల్లుల పనులు పెరుగుతున్నట్టే ఈ జీతాల లెక్క కూడా పెరుగుతుంటుంది, ఈ ఏడాది చూపించిన సంఖ్య గత సంవత్సరం కన్న $5,000 డాలర్లు ఎక్కువుంది.  ఎవరైనా ఒక గృహిణి, తల్లి నిస్వార్ధంగా చేసే పనికి లెక్కలు కట్టి జీతాలిస్తారా అని ముక్కున వేలు వేసుకునేవారు చాలామందే వుంటారు.  ఒక తల్లి ఎంత మంది పిల్లలనయినా నిస్వార్ధంగా పెంచే పనికి మనం విలువ కట్టలేము.  ఆమె అనురాగం, ప్రేమల ముందు ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే అవుతుంది.  పిల్లల సంతోషం కోసం వారిని విదేశాలకు పంపి, పిల్లలు ఎపుడైనా అమ్మ నీకేం కావాలంటే మీరు మర్చిపోకుండా ఫోన్ చేస్తుండండి చాలు అంటారు. వారు చేసిన పనులకు బదులుగా ఏ తల్లి అయినా ఎపుడైనా ఏదైనా కోరుకుంటుందా? వూళ్ళో వుంటే అప్పుడపుడు కనిపించడం, ఫోన్ చేసి ఎలా వున్నావమ్మా అని పలకరించడం, మనవలు, మనవరాళ్ళు అప్పుడపుడు కనిపించినా చాలు అనుకుంటారు.  తల్లులు ఏమీ కోరుకోరు ఇలాగే వుండాలి వారి ప్రేమానురాగాలు అనుకుంటారు చాలా మంది.  కానీ ఒకోసారి అవసరం వున్నా, మందులకి కానీ జబ్బు చేసి ట్రీట్మెంట్ కి డబ్బులు అవసరం పడినా కూడా, వృద్దాప్యంలో కొన్ని జబ్బులు వస్తే తగ్గవు ఒకోసారి ప్రాణాంతకం అవుతాయి, అలాంటపుడు పిల్లలు తన దగ్గర వుండాలని ఆ కన్నతల్లి మనసు కొట్టుకుంటుంది కదా!  అలాంటపుడు కుడా ఆవిడ మౌనంగా వుండిపోతే పిల్లలు ఈ పొజిషన్ లో వుండడానికి కారకురాలయిన తల్లికి తీరని బాధే కదా!  కాబట్టి ఆలోచించండి! ఒక్కరోజు మదర్స్ డే జరుపుకోవడం ఒక్క ఫోన్ కాల్ చేసి చేతులు దులుపుకోవడం అవసరమా, లేక రోజు కాకపోయినా అపుడపుడు వెళ్ళి ఆమెకు కనిపించడమో, ఆమెని తమ దగ్గర తీసుకొచ్చి వుంచుకుని ఆమె రుణం తీర్చుకోవడం మంచి పద్దతో ఆలోచించండి, అఫ్ కోర్స్ ఎంత చేసినా తీరే రుణం కాదు ఇది.  "అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట..."  "అమ్మ అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే ప్రాయమే మళ్ళీ రావాలని...."  "అమ్మా లాంటి చల్లనిది లోకం ఒకటి వుందిలే..." "అమ్మను మించిన దైవం వున్నదా?..."                                                                    

మనసుకవి ఆత్రేయ

మనసుకవి ఆత్రేయ                                                       - డా.ఎ. రవీంద్రబాబు         తెలుగు సినిమా పాటకు మనసు తడిని అద్దిన కవి ఆత్రేయ. మనోలోతుల్ని అక్షరాల్లో రంగరించి ప్రతి గుండెకు పాటల రూపంలో అందించిన మనస్వి. నాటకాలతో ప్రజాచైతన్యానికి బాటలు వేసిన అభ్యుదయవాది. అలతి పదాల్లో అనల్పార్థాన్ని నింపిన భావకుడు. తెలుగుతెర వెండి పాటల్లో చందమామలా ప్రకాశించే సూర్యుడు ఆత్రేయ.       ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తాలూకా మంగళంపాడులో మే7, 1921ల జన్మించాడు. చిన్ననాడే తల్లి మరణించింది. వీరిది ఆత్రేయ గోత్రం. అందుకే పేరును గోత్రంతో కలిపి ఆచార్య ఆత్రేయ అని పేరు పెట్టుకున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నాటకాలమీద మోజుతో చదువుకు స్వస్తి పలికాడు. ఆ పైన టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేశాడు. లేఖకునిగా, గుమస్తాగా, పత్రికా సంపాదకునిగా ఉద్యోగాలు చేసి... చివరకు సినీప్రపంచంలో స్థిరపడ్డాడు.         పాటల రచయితగానే కాకుండా ఆత్రేయకు నాటక రచయితగా గొప్ప పేరుఉంది. ఎన్.జి.ఓ., ఈనాడు నాటకాలు రచించి ప్రదర్శనలు ఇస్తూ ఆనాటి ఆంధ్రదేశం అంతా పర్యటించాడు. 1949లో 'ఎన్జీవో' నాటకానికి ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది. అటుపై హ్యాట్రిక్ కూడా సాధించింది. విశ్వశాంతి, కప్పలు, భయం, బలిదానం, ఒక రూపాయి, తెరిచిన కళ్లు... లాంటి సుమారు 15 నాటకాలు నేడు అందుబాటులో ఉన్నాయి. ఆత్మకథను 'తొలిగాయం' పేరుతో పద్యరూపంలో రాశాడు. వీరి రచనలు మొత్తం 9 సంపుటాలుగా మనస్విని సంస్థ ముద్రించింది. అంతేకాదు ఆరోజుల్లో ఆత్రేయ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆర్నెళ్లు జైలు శిక్షకూడా అనుభవించాడు. తర్వాత క్రమంగా కమ్యూనిస్టు భావాలవైపు ఆకర్షితుడయ్యాడు.                 1951లో విడుదలైన 'దీక్ష'చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సుమారు 400 సినిమాలకు, 1400 పాటలు రాశాడు. ఆత్రేయ తన పాటల్తో మనసుకు కొత్త భాష్యాలు చెప్పాడు. మనసులోని భావాల్ని, అంతరంగ లోతుల్ని, పొరల్ని విడివిడిగా తన పాటల్తో అల్లారు. ఎటువంటి శబ్దడాంబికాలు లేకుండా నిర్మలగంగా ప్రవాహంలాగా సరళమైన పదాలతో పాటలు రాశాడు. ప్రజల మాటల్నే పాటలు చేశాడు. రాశాక తన పాటల్నే మాటలు చేశాడు. అత్రేయ చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరం అవడం వల్ల ఆ ప్రేమ మాధుర్యాన్ని అమ్మపై రాసిన పాటల్లో కురింపిచాడు. 'అమ్మంటే అమ్మ, అనంత సృష్టికి ఆమే అసలు బ్రహ్మ' (రామ్ రాబర్ట్ రహీం) అన్నాడు. 'అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నోతెలియని మమతల మూట' (బుల్లెమ్మ-బుల్లోడు) అని కూడా వర్ణించాడు.          ఇక ప్రేమ గురించి, ప్రేమికుల గురించి, ప్రేమలోని ఆనందం, విషాదం, విరహం, బాధ, ఒంటరితనం గురించి ఎన్నో పాటలు అద్బుతంగా అందించాడు. అసలు ఆత్రేయ జీవితంతోనే ప్రేమ అనే పదం ఆడుకుందేమో అనిపిస్తుంది ఆ పాటలు వింటుంటే... స్కూలు ఫైనల్ చదివేటప్పుడు పద్మావతి అనే అమ్మాయిని ప్రేమించి, ఆమెకు దూరమయ్యాడు. ఆలా తొలిగాయం నుంచి ఆత్రేయ కోలుకోకుండానే ప్రేమకోసం తపించి ఎన్నో అనుభవాలను, వైఫల్యాలను పొందాడు. అవే ఆయన పాటల్లో మనకు దొరుకుతాయి.              స్త్రీని ఉద్దేసించి 'ఆడవాళ్లు ఆడుకునే ఆటబొమ్మ ఈ మగవాడు, ఆడుకున్నా ఫర్వాలేదు పగలగొట్టి పోతారెందుకు' (ఆడబ్రతుకు) అని ప్రశ్నిస్తాడు. అంతేకాదు 'ఓ హృదయం లేని ప్రియురాలా... రాయికన్న రాయివి నీవు, కసాయివి నీవు' (కన్నె వయసు) అని నిందిస్తాడు. ప్రియురాలి ప్రేమకై తపిస్తూ 'నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది' (ఇంధ్రదనస్సు) అంటాడు. ప్రేమించి విఫలుడైన ప్రియుడి గురించి 'మనసుగతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మసున్న మనిషికి సుఖము లేదింతే '(ప్రేమనగర్) అని విరక్తి చెందుతాడు. 'మనిషికి మనసే తీరని శిక్ష' అని నిర్ణయానికి వచ్చేస్తాడు.            పవిత్రమైన ప్రేమికుల గురించి చెప్తూ 'మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెపుడో కలసి పోతది' (మూగమనసులు) అంటాడు. పైగా అదే చిత్రంలో 'మనసు మూగదే కాని బాసుంటది దానికి' అని మనోభాషని నిర్వచిస్తాడు. 'మనసుతోటి ఏలాకోలం ఆడుకోకూడదని' విజ్ఞప్తి చేస్తాడు. 'మనసు లేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడు' (ప్రేమలు-పెళ్లిళ్లు) అని ఆ దేవుడ్నే నిందిస్తాడు. ప్రియురాలికి దూరమైన ప్రేమికుడి బాధను చెప్తూ 'ప్రేమఎంత మధురం, ప్రియరాలు అంత కఠినం... ప్రేమలేదని ప్రేమించ రాదని' (అభినందన) అంటాడు. ఇక ఆత్రేయను మనసుకవిగా నిలిపిని పాట 'మౌనమే నీబాస ఓ మూగ మనసా...' (గుప్పెడు మనసు) దీనిలో మనసును ఉయ్యాలగా, దయ్యంగా, చీకటి గుహగా, కూరిమి వలగా... ఎన్నో ప్రతీకలతో విశ్లేషించాడు.            ఆత్రేయ కేవలం మనసు పాటల్నే రాయలేదు. వలపు పాటలు, జీవితాన్ని తర్కించే పాటలు, ప్రేమ గీతాలు, జానపద గీతాలను... కూడా సరికొత్త హంగులతో రాశాడు. 'ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధమూ' (జీవన తరంగాలు) అని మానవ సంబంధాలు చావుకు అతీతం కాదన్నాడు. 'కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చానా నీ బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా... నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాటిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరను తెలుసుకో' (తోడికోడళ్లు) అని పాటలో సామ్యవాదాన్ని ప్రకటించాడు. 'కడవెత్తుకొచ్చిందీ కన్నెపిల్లా... అన్నా, చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నదానా...' అన్నా ఆత్రేయకే చెల్లింది. 'శేష శైలావాసా శ్రీ వెంకటేశ' అని ఆ ఏడుకొండల వాడిని వేడుకున్నాడు. 'అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం, మమతన్నది ఒట్టి పిచ్చి, మనసన్నది మరో పిచ్చి' (అంతులేని కథ) అని లోకం రీతిని ఎండగట్టాడు. 'చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడే సరసన ఉంటే...' (ఆత్మబలం) అని తెలుగు తెరపై తొలిసారిగా వాన చినుకుల్ని, వలపు పలుకుల్ని కలిపి రాశాడు.            ఆత్రేయ కేవలం మాటలు, పాటలు, నాటకాలు మాత్రమే రాయలేదు. దర్శకత్వం వహించాడు, నిర్మాతగా కూడా చిత్రాలు నిర్మించాడు. అన్నిటికీ మించి 'నీలిమేడ' అనే కథ కూడా రాశాడు. ఈ కథ 1946 జూలై 'భారతి' పత్రికలో ముద్రితమైంది. ఇలా ప్రేక్షకుల మనసుపై మనసుకవిగా ముద్రపడిన ఆత్రేయ సెప్టెంబరు13, 1989లో మరణించాడు. ఆయనే చెప్పినట్లు 'మనసు పోతే మాత్రమేమి మనసు ఉంది'. ఆయన పాటలు మన మనసుల్లో పదిలంగా ఉన్నాయి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆ పాటల్లో వెదుక్కునేలా చేస్తున్నాయి. చేశాయి. చేస్తాయి.  

గాలివాన కథ

    గాలివాన కథ                               - పాలగుమ్మి పద్మరాజు      తెలుగు కథకు అంతర్జాతీయఖ్యాతి కల్పించిన రచయిత పాలగుమ్మి పద్మరాజు. తొలిసారిగా, చివరిసారిగా తెలుగు కథ గొప్పతనాన్ని ప్రపంచ యవనికపై నిలిపిన కథ ఆయన రాసిన 'గాలివాన'. పాలగుమ్మి పద్మరాజు 'పడవప్రయాణం' లాంటి అద్భుతమైన కథలు రాసినా... ఈ కథకు వచ్చిన గుర్తింపే ముఖ్యమైంది. కథలో భిన్న పార్శ్వాలను, వైవిధ్యాన్ని, పాత్రలో వచ్చిన సమున్నతమైన మార్పును పద్మరాజు అప్రతిహతంగా చిత్రించారు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ తెలుగులో పది గొప్పకథలు చెప్పాలంటే దానిలో 'గాలివాన' కథ తప్పక ఉంటుంది.        కథ మొత్తం ప్రధానపాత్ర రావుగారి ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. ప్రయాణంలో అతని అనుభవాలు, వాటి తాలూకు అనుభూతులే ఈ కథ. మబ్బు మసగమసగ్గా అల్లుకుంటుండగా రావుగారు రైలు ఎక్కుతాడు. అప్పటికే రైలులో నలుగురు ప్రయాణికులు ఉంటారు. యువ దంపతులు, వారి చేష్టలు, అపరాధక పరిశోథన నవల చదివే పెద్దమనిషి, మరో ముసలాయన. వాళ్ల గురించి రావుగారే తనదైన అభిప్రాయాలతో, ఊహలతో ఆలోచించుకుంటుంటాడు.       అసలు రావుగారు వేదాంతి. 'వేదాంతం జీవితంతోటి, జీవన విధానంతోటి వ్యక్తికీ సంఘానికీ మధ్య ఏర్పడే రకరకాల సమస్యలతో అనుబంధించి వుంటుందని ఆయన వాదము'. 'ఆస్తిక సమాజము' అనే సంస్థ ఆహ్వానం మీద 'సామ్యవాదమూ రసామోదము' అనే అంశపై మాట్లాడటానికి వెళ్తూ రైలు ఎక్కుతాడు. రావుగారు పిల్లలను కూడా ఒక విధమైన క్రమశిక్షణలో పెంచాడు. జీవితాన్ని కొన్ని నియమాల ప్రకారం జీవించాలని నిర్ణయించుకుని, అలానే పాటిస్తుంటాడు.        గాలివాన బాగా పెరుగుతుంది. ఒక ముష్టి ఆమె తడిసిన బట్టలతో నీళ్లు కారుకుంటూ రైలు పెట్టెలోకి ఎక్కుతుంది. అందరిదగ్గరా బతిమాలుకుంటూ డబ్బులు అడుక్కుంటుంది. అందరూ వారికి తోచింది ఇస్తారు. కానీ రావుగారు మాత్రం ఏమీ ఇవ్వడు. అసలు అడుక్కోవడం తప్పని అతని అభిప్రాయం. అంతలో రావుగారు దిగవలసిన స్టేజీ వస్తుంది. గాలివాన ఉధృతం అవుతుంది. ఆమె వస్తువులు అందించడంతో రావుగారు రైలు దిగుతాడు. స్టేషన్ లో ఉన్న మాస్టరూ, బంట్రోతు కూడా వెళ్లిపోతారు, రావుగారు ఒక్కడే బిక్కుబిక్కుమంటూ విశ్రాంతి గదిలో కూర్చొంటాడు.     టి.సి. దించేయడంతో ముస్టి ఆమె కూడా ఆ గదిలోపలికి వస్తుంది. దాంతో రావుగారికి కొంత ధైర్యం వస్తుంది. ఇద్దరూ కలిసి తలుపులు తెరుచుకోకుండా భీరువా, కుర్చీ అడ్డుపెడ్తారు. రావుగారు పొడిగుడ్డ ఇస్తాడు. తన దగ్గరున్న బిస్కెట్లు కూడా ఆమెకు పెడ్తాడు. మాటల మధ్యలో ఆమె భర్త తాగుబోతని, ఇద్దరు పిల్లలున్నారని తెలుసుకుంటాడు. 'నాగరికులకు సహజమయిన సంకీర్ణ మనస్తత్వం ఆమెకు లేదని, లోతైన ఇష్టాయిష్టాలు కల మనిషి కాదని, జరుగుతన్న క్షణంతోనే ఆమెకు సజీవ సంబంధమని' తెలుసుకుంటాడు.       అంతలో పెద్ద చప్పుడుతో గది తలుపులు తెరుచుకుంటాయి. సామాను చెల్లాచెదురై పోతుంది. రావుగారు భయంతో ఒక్కగెంతుగెంతి ఆమెను పట్టుకుంటాడు. ఆమె తన చేతుల్ని ఆయన చుట్టూ చుడుతుంది. ఆయనకు ప్రాణావసరమైన వెచ్చదనాన్ని ఇస్తుంది. అప్పుడు రావుగారి 'హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్నీ మాయమై పోతాయి'. ఇద్దరూ నిద్రపోతారు. రావుగారు తెల్లారి లేచే సరిగి ఆమె కనిపించదు. కానీ గోడకింద పడి చనిపోయి ఉంటుంది. రావుగారు చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు. ఆమె చేతిలో డబ్బు, తన పర్సు ఉంటాయి. ఆమె దొంగ అని అందరూ అనుకోవడం ఇష్టంలేక ఆమె చేతిలో ఉన్న టిక్కెట్లు అమ్మిన డబ్బును డ్రాయర్లో వేస్తాడు. తన చిహ్నంగా ఆమె చేతిలోనే పర్సును వదిలేసి తన పేరున్న కార్డును మాత్రం తీసుకొని బరువెక్కిన హృదయంతో వెళ్లిపోతాడు.          అనంతమైన తాత్విక భావనతో నిండిన వర్ణనలు, మనిషి జీవితాన్ని తర్కించే వ్యాఖ్యలు, రావుగారిలో వచ్చిన సజీవమార్పు, గాలివానతో బద్దలైపోయిన ఆయన ఆలోచనలు, సమాజంలో కింది స్థాయిలో ఉండేవారి క్షణిక భావోద్వేగాలు, భావాలు... ఇలా కథంతా ఒక విధమైన ఆలోచనా స్రవంతిలా సాగుతుంది. వ్యవహారిక భాష, చిన్నచిన్న వాక్యాలు మనల్ని సన్నివేశం, సంఘటనలలో లీనం చేసి ప్రత్యక్షానుభూతిని కలిగిస్తాయి. రావుగారి ఆలోచనల ద్వారా మిగిలిన పాత్ర గుణగణాలను చెప్పడం కథలోని ఔచిత్యం. 'గాలివాన' పేరును రావుగారి ఆలోచనల్లో వచ్చిన మార్పుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. కథ పెద్దదైనా పాఠకుడిని పద్మరాజు శైలి ఆకట్టుకుంటుంది. పాత్రలు, భావాలను, ప్రవర్తనా తీరను నిక్కచ్చిగా చెప్పాడు రచయిత. కథ చివర కరుణ రసాన్ని కురిపించనా, రావుగారిలో వచ్చిన మార్పు మనలో అట్లానే నిలిచిపోతుంది.     'క్రమశిక్షణ, నియమాలు, విలువలు అన్నీ కూడా మానవాతీత మయిన కొన్నిశక్తులు విజృంభించినప్పుడు అర్దరహితమై పోతాయని ఆయనకు జీవితంలో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది'.     'ఆయన హృదయం తుపానులో సముద్రంలాగా ఆవేదనతో పొంగి పొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్టు ఆయనకు అనిపించింది.'     ఇలాంటి హృదయ లోతుల్ని పట్టి ఇచ్చే వాక్యాలు కథలో ఎన్నో మనకు కనిపిస్తాయి. అందుకే ఈ కథ మనల్ని మేల్కొలిపే 'గాలివాన' లాంటిదే...                                                    డా.ఎ. రవీంద్రబాబు

ఓ పువ్వుపూసింది

ఓ పువ్వుపూసింది - డా.ఎ.రవీంద్రబాబు              స్త్రీ స్వేచ్ఛకోసం పోరాడి, వారి అణచివేతలను తన రచనల ద్వారా ఎండగట్టిన రచయిత చలం. కథ, నవల, నాటిక... ఏది రాసినా స్త్రీ. స్త్రీ ఆనందమే లక్ష్యంగా తెలుగు సమాజాన్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి చలం. నేటి స్త్రీవాద భావజాలానికి ఆనాడే సాహిత్యంలో బలమైన పునాదిని నిర్మించాడు. చలం అనగానే ఏపాటి అవగాహన ఉన్నా  మొదట గుర్తొచ్చే నవల 'మైదానం', కథ 'ఓపువ్వు పూసింది'.        'ఓపువ్వు పూసింది' ప్రతీకాత్మక కథ. చలం పువ్వును స్త్రీకి ప్రతీకగా తీసుకుని అద్భుతమైన వర్ణనలతో, అపూర్వమైన సౌందర్యవంతంగా ఈ కథను తనదైన శైలిలో రచించాడు. ప్రకృతిలోని అందాన్నంతా కథలో నింపి, స్త్రీ జీవితాన్ని విశ్లేషించాడు. తుమ్మెదను పురుషుడికి ప్రతీకగా తీసుకుని అతని ధాష్టీకాన్ని చెప్పాడు. కానీ కథను విశ్లేషణాత్మ దృష్టితో చదివితే అనేక తాత్విక, సౌందర్య భావనలు మనలో ద్యోతకమవుతాయి.    1. స్త్రీ, పురుషుడు 2. ప్రకృతి, పురుషుడు 3. ఆత్మ, పరమాత్మ         కథ- 'అర్థరాత్రి అడవిలో పువ్వుపూసింది' అని ప్రారంభమవుతుంది. ఆ పువ్వు... చుట్టూ ఉన్న ప్రకృతిని కొత్తగా, వింతగా చూస్తుంది. తల్లి తీగతో     'భయమేస్తుంది. కిందికి పడిపోతానా...' అని అడుగుుతంది.     'నేను పట్టుకున్నాను కదూ' అని తల్లితీగ భరోసా ఇస్తుంది.     'ఆకలేస్తుంది అమ్మా' అని అడిగితే    పువ్వునోట్లోకి వెచ్చగా, తియ్యగా, వొంటినంతా సంతోషంతో నింపుతో పాలు వస్తాయి.'      ఇలా తీగ పువ్వును లాలిస్తుంది. పెంచుతుంది. సూర్యోదయంతో వెలుగు కిరణం పువ్వును సోకగానే పువ్వుకు యవ్వన దశ వచ్చేస్తుంది. 'తన రేకుల్లో తళతళలు, తన యీనెల్లో నున్నటి వుబుకు, తన బొడిపెల్లో పగలడానికి సిద్ధమైన మదపు సౌరభం, తన తొడిమలో విశాలమౌతున్న బలం, తన సమస్తంలో ఆగని, అంతులేని, కారణం లేని కాంతి అకస్మాత్తుగా తనని ముంచుతో, చీలుస్తో పైన దొర్లి సముద్రం అలల మల్లే మూర్ఛలు తెప్పించే పరిమళం'      అలాంటి దశలో ఉన్న పువ్వుకు మధుపం కనిపిస్తుంది. 'నా వైపు రాడేం...' అని ఓ నవ్వు విసురుతుంది పువ్వు, దాంతో ఆ తుమ్మెద ఆగి, చూసి తన వైపు రావడాన్ని గమనిస్తుంది. 'వొస్తున్నాడని భయం, సంతోషం. తీరారాడేమో నన్న దిగులు, న్యూనత. వొస్తున్నాడని గర్వం, సిగ్గు... ' ఇలా ప్రకృతిలో యవ్వన దశలో ఉన్న స్త్రీ మానసిక సందిగ్థతలా ఆ పువ్వుకూడా ఆనేక ఆలోచనలు చేస్తుంది. ఆకుల్లో తను తప్పించుకుని తిరుగుతూ మధుపాన్ని వేధించాలని అనుకుంటుంది.      ఆ మధుపం వస్తుంది, ఎంతో తీయనైన అబద్ధాలు చెప్తుంది. పువ్వు పై వాలుతుంది. పువ్వు తనలో ఉన్న పరిమళ గంథాన్నంతా ఆ తుమ్మెదపై చల్లుతుంది. 'ఇక నన్ను వదిలి వెళ్లకు, నేను నీదాన్ని, నా ఆత్మను కూడా తాగెయ్య' మని రహస్యంగా చెప్తుంది. కానీ మధుపం ఒక్క దూకు దూకి, పువ్వు వైపు ఒక్క చూపు కూడా చూడకుండా వెళ్లిపోతుంది. మధ్యాహ్నకావడంతో సూర్యూడు ఆకు నీడల్ని మంటపెడతాడు. సృష్టి లీలా విన్యాసాల వల్ల 'పువ్వులో రేకులు ముడతలు పడతాయి. కేసరాలు ఒక్కొక్కటి జాలిగా వూడిపోతాయి. పువ్వు తన గర్భాన్ని చూసుకుని ప్రపంచాన్నే మరిచిపోతుంది.'            చివరకు అనంతమైన పురుషుడు, దివ్యకాంతితో వచ్చి 'నీ ప్రాణాన్ని పాపాయికి ఇచ్చి నాతో రా...' అంటాడు. మొదట ఒప్పుకోక పోయినా ఆ దివ్యత్వం గురించి, సృష్టిలోని జనన మరణ రహస్యాలను గురించి తెలుసుకుని ఒప్పుకుంటుంది. 'బాల్యం, యవ్వనం, బలం, సంతోషం, మాతృత్వం, ప్రేమ అన్నీ అతనికి అర్పించి, మొక్కుతుంది. అతని చెయ్యి పట్టుకుని అనంతాకాశంలోకి ఒక్క దూకు దూకుతుంది.' అని కథను ముగిస్తాడు చలం.       స్త్రీ మాతృత్వపు భావన, పిల్లలపై ఆమెకుండే మమకారం, ప్రకృతిలోని సహజమైన యవ్వన దశ, స్త్రీ మానసిక ఉద్విగ్నత... గర్భం దాల్చే సృష్టి క్రియ... చివరకు మరణం... ఈ దశలను ఒక రోజులో పువ్వును ప్రతీకగా చెప్పాడు రచయిత.      అర్థరాత్రితో ప్రారంభమైన కథ పొద్దుగూకడంతో ముగుస్తుంది. ఇదో అద్భుతమైన కథా టెక్నిక్.       'ఎప్పటెప్పటినుంచీ, అనంతకాలం నుంచీ అనేక రూపాలలో, అనేక లోకాలలో, అనేక ఆనంద దారులలో తనతో చెయ్యి కలిపి ఎన్నడూ తనను వొదలని ఆనీడ ఎవరు...' అని జన్మకు ముందే స్త్రీ, పురుషులు కలిసి ఉండే ఆనందమయ లోకాన్ని వర్ణించాడు చలం. అలానే కథ చివరిలో కథ చివరిలో 'అనంతమైన ఆ ఆనందాన్ని ఆ ఆకాశంలో తేలుతూ, భక్తితో, అతని మొహం వంక చూసి ఫక్కు నవ్వింది- ఆనందాన్ని అణచుకోలేక' అని అంటాడు. ఇవి రెండూ అద్వైత భావనని తెలిపే తాత్విక వర్ణనలు. మరో విధంగా చూస్తే సృష్టికి పూర్వం, సృష్టి తర్వాత స్త్రీ పురుషులు మమేకమై ఉంటారనే అలౌకిక భావన.       చలం శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదో మంత్రశక్తి. మనల్ని ఆ వాక్యాల కాంతితో తన్మయం చేస్తుంది.  'అలల మల్లే కాంతి విడుచుకు పడుతోంది లోకం మీద'.   'గాలిమీద చిందులు తొక్కుతుంది ఎండ'   'అన్నీ అబద్ధాలు. కానీ, ఎంత మధురమైన అబద్దాలు...' ఇలాంటివి కథ నిండా కోకొల్లలు. అందుకే ఈ కథ ఎప్పుడు చదివినా మన మనసులో కూడా ఓ పువ్వు పూస్తుంది. పరిమళాలలను సుగంద భరితంగా మనలో వెదజల్లుతుంది.