సొంత పిల్లలు

సొంత పిల్లలు   లలిత, వనిత ఇద్దరూ అక్కచెల్లెళ్లు. వాళ్ళది పేద కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ కూలికి పోయేవాళ్ళు. అయితే అకస్మాత్తుగా ఒక రోజున ప్రమాదంలో వాళ్ల అమ్మా నాన్నలు చనిపోయారు! ఆ సమయానికి లలిత చాలా చిన్నది- ఆరేళ్ళు అంతే. వనితేమో కొంచెం పెద్దది; ఆ పాపకు పదేళ్లు. వాళ్ళిద్దరినీ చూసుకునేందుకు బంధువులు ఎవ్వరూ లేరు కూడా. చుట్టు ప్రక్కల వారి సహకారంతో కొద్ది రోజులు నెట్టుకొచ్చాక, చివరికి వనిత రామారావు గారి ఇంట్లో పనికి కుదురుకున్నది. రామారావుగారు మంచి మనిషి. 'చిన్నపిల్లల్ని పనిలో‌ పెట్టుకోకూడదు' అని ముందు వనితని పనిలోకి రానివ్వలేదు ఆయన. అయితే అందరూ నచ్చజెప్పాక, 'ఆ పాప పనిచేస్తూ చదువుకోవాలి' అన్న షరతు మీద ఆయన ఒప్పుకున్నాడు. అయితే వనితకు చదువు ఏమంత అబ్బలేదు. ఆ పాప మనసంతా పనిమీద, చెల్లెమీదే ఉండేది. 'చెల్లెని సరిగ్గా చూసుకోవాలి' అనే ఉండేది ఎప్పుడూ. అంత చిన్న వయస్సులోనే తనకొచ్చే కాస్త నెలజీతాన్నీ రెండు భాగాలు చేసేది వనిత. ఒక భాగాన్ని ఇంటి ఖర్చులకు వాడేది; ఇంకొక సగాన్ని ఒక కుండలో దాచి పెట్టేది. ఒక రోజున ఆ కుండలో ఇక డబ్బు పట్టలేదు- చూస్తే కుండ నిండిపోయి ఉన్నది! లలితకి, వనితకి ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియలేదు. అంత డబ్బును ఇంట్లో ఉంచుకోవటం ఏమంత మంచిది కాదు! కొంచెం సేపు ఆలోచించాక, దాన్ని తీసుకొని రామారావుగారి దగ్గరికి వెళ్ళారిద్దరూ- "ఈ డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి; ఏమైనా అవసరం పడితే మళ్ళీ తీసుకుంటాం" అని.   ఆయన కాసేపు ఆలోచించి, "చూడమ్మా! లలితది ఇప్పుడు బడికెళ్ళే వయస్సు. నిజానికి నువ్వూ బడికి వెళ్ళాలి- కానీ‌ వెళ్ళట్లేదు. ఒక పని చేద్దాం. ఈ డబ్బులు నా దగ్గర ఉంచుతాను. వీటితోటే లలితను చదివిద్దాం, మా పాప రేఖతో‌ పాటు. ప్రభుత్వ బడిలో చేరితే ఖర్చులు కూడా ఏమంత ఉండవు- మధ్యాహ్నం భోజనం బడిలోనే పెడతారు; ఇక ప్రొద్దున-మాపున భోజనం మా యింట్లోనే చేయచ్చు- మెల్లగా వనిత కూడా కనీసం ఒకపూట బడికి పోవచ్చు" అన్నారు. అట్లా లలిత బడికి వెళ్లటం మొదలెట్టింది. రామారావుగారు ఆరోజునుంచి లలిత-వనితలకు చాలా సహాయం చేశారు. తన సొంత కూతురు రేఖతో పాటు వాళ్లనీ ఒకేలా చూసుకున్నారు. అయితే ఒక రోజున రామారావు గారి చేతి గడియారం మాయం అయ్యింది. ఆయన స్నానం చేసేముందు దాన్ని, తన కళ్లజోడును ముందుగదిలో టేబుల్ మీద పెట్టి వెళ్ళారు. వచ్చి చూసేసరికి అది లేదు! తన గడియారాన్ని ఎవరో తీసారని ఆయనకు అర్థం అయ్యింది. కానీ‌ ఎవరు? ఆ సమయానికి రేఖ బడికి వెళ్ళి ఉన్నది. వనిత ఇల్లు తుడుస్తూ ఉండింది. రామారావుగారికి వనిత మీద కొద్దిగా అనుమానం వచ్చింది. "బయటివాళ్లను ఇంట్లో పెట్టుకోవద్దంటే విన్నారా? చూడండి, ఇట్లానే అవుతుంది. ఈ రోజున గడియారం, రేపు మరొకటి!" అని రామారావుగారి భార్య గట్టిగా అనటం మొదలు పెట్టింది. అది విని వనిత చాలా నొచ్చుకున్నది. ఆ పాప చిట్టి హృదయం చిన్నబోయింది. ఇల్లు తుడిచేటప్పుడు తను కూడా చూసింది- నిజంగానే ఆ గడియారం టేబుల్ మీద ఉండింది. మరి ఇప్పుడు అది ఎటు పోయింది? ఆ రోజంతా వనిత మనసు మనసులో లేదు. ఒక వైపున పని చేస్తూనే మరో వైపున ఇల్లంతా వెతుకుతూ ఉండింది. గడియారం జాడలేదు. ఆరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక, మాయమైన గడియారం‌ గురించి చెల్లెలికి చెప్పింది వనిత. "ఇవాళ్ళ బడిలో రేఖ తన స్నేహితురాళ్లకు ఒక గడియారం చూపిస్తూ ఉండింది. అదే అయి ఉంటుంది బహుశ:. నువ్వేం‌ కంగారు పడకు- రేపు నువ్వు వెళ్ళేసరికి గడియారం ఇంట్లోనే ఉంటుంది చూడు" అని అక్కను ఊరడించింది. మరునాడు వనిత పనికి వెళ్ళేసరికి, నిజంగానే గడియారం‌ యథాప్రకారం టేబుల్ మీద ఉండింది. రేఖ దాన్ని తిరిగి తీసుకొచ్చేసిందనమాట! అయితే గడియారం గురించి, రేఖ దాన్ని బడికి తీసుకెళ్లటం‌ గురించి తనతో ఏమైనా చెబుతారేమోనని ఆ రోజంతా చాలా ఎదురుచూసింది వనిత. కానీ రామారావుగారు ఆఫీసుకు వెళ్ళిపోయారు; ఆయన భార్యేమో తనకుగా ఏమీ అనలేదు! మరునాటికి వనితకు జ్వరం వచ్చేసింది. ఆ పాపకు ఇక పనికి వెళ్లాలనిపించలేదు. లలిత బడికి వెళ్ళింది; వనిత మూలుగుతూ ఇంట్లోనే పడుకున్నది.   ఆరోజు సాయంత్రం అవుతుండగా వచ్చారు రామారావుగారు. వనితను, లలితను తమ ఇంటికే తీసుకెళ్ళారు. డాక్టరును పిలిపించి మందులు ఇప్పించారు. నిద్రలో అంతా వనిత కలవరిస్తూనే ఉండింది- 'నేను గడియారం తీయలేదు' అని. మరునాడు జ్వరం కొద్దిగా తగ్గాక, వనిత వెళ్ళి రామారావుగారికి చెప్పింది- "ఇంక నేను పని మానేస్తాను" అని. రామారావుగారు నవ్వారు. "అర్థమైందా?" అన్నట్లు భార్యవైపు చూశారు. రామారావుగారి భార్య కళ్ళనీళ్ళు పెట్టుకొని వనిత చేతులు పట్టుకొన్నది. రామారావుగారు వనితతో‌ అన్నారు "మేమిద్దరం నిన్న దీని గురించి బాగా ఆలోచించాం- నిజంగానే, నిన్ను ఇక పనిలోంచి తీసేస్తున్నాం!" అని. వనిత నిర్ఘాంతపోయింది. రామారావుగారు కొనసాగించారు చిరునవ్వుతో- "అయితే విను- ఇకనుండి మీ అక్కచెల్లెళ్ళిద్దరూ వేరుగా ఉండటానికి వీలులేదు- మాతోబాటు మా ఇంట్లోనే ఉండాలి. మేం ఇద్దరం మిమ్మల్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపైన మాకు ముగ్గురు ఆడపిల్లలు. నువ్వు, లలిత, రేఖ. ముగ్గురూ బడికి వెళ్ళాలి; ఆరోగ్యంగా, బలంగా, ఎదగాలి. గొప్పవాళ్ళవ్వాలి!" "అవునే, మా మాట కాదనకు!" అన్నది రామారావుగారి భార్య. వనిత మళ్ళీ నిర్ఘాంతపోయింది- అయితే ఈసారి సంతోషంగా! అటు తర్వాత వనిత కూడా బడికి వెళ్లటం మొదలు పెట్టింది. రామారావుగారికి ఇప్పుడు ముగ్గురు పిల్లలు! ముగ్గురూ చక్కగా చదువుకుంటున్నారు. ముగ్గురూ తప్పకుండా గొప్పవాళ్లవుతారు! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ఆశల చెట్టు

ఆశల చెట్టు     పవన్, గణేష్ ఇద్దరూ ఒక రోజున వాళ్ళ ఊరి ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి, దారి తప్పారు. అడవిలో అంతా తిరిగి అలసిపోయారు. . అంతలో వాళ్లకు ఎదురుగుండా ఒక పెద్ద చెట్టు కనబడింది. దాని కాండమే కాదు, పూలు, కాయలు అన్నీ బంగారం రంగులో మెరుస్తున్నాయి. "ఈ కాయలు కోసుకుందాం. ఆకలి వేస్తున్నది" అన్నాడు గణేష్. "ఇవి తినేందుకు పనికి రావేమో. ఇక్కడ ఒక్క పిట్ట కూడా లేదు చూసావా?" అన్నాడు పవన్, తనూ చుట్టూ కలయ చూస్తూ. "కొన్ని కోసుకెళ్దాంలే; మా తాతకు తెలీని చెట్టు లేదు. కనీసం ఇది ఏం చెట్టో అయినా తెలుస్తుంది" అంటూనే గబగబా చెట్టు ఎక్కిన గణేష్, చకచకా కొన్ని కాయలు కోసి, పవన్ దగ్గరికి విసిరాడు. పవన్‌ వాటిలోంచి ఒక కాయను తీసుకొని కొరికి చూసాడు.. కాయ చేదుగా ఉంది. చాలా గబ్బు వాసన కూడా! గణేష్ కూడా దిగివచ్చి, ఆ కాయని నాకి చూసాడు. "ఛీ! అందుకనే వీటిని పిట్టలు కూడా తినట్లేదు" అంటూ తాము ఏరిన కాయలన్నీ పడేసారు ఇద్దరూ. "ఒక్క కాయని మాత్రం తీసుకెళ్దాం. తాతని అడిగితే ఇది ఏం కాయో చెబుతాడు" అని అని ఒక్క కాయని మటుకు జేబులో వేసుకున్నాడు గణేష్. ఇద్దరూ దారులు, దిక్కులు చూసుకుంటూ అడవిలోంచి బయట పడి, అతి కష్టం మీద ఊరు చేరుకున్నారు. గణేష్ వాళ్ల తాత మామూలుగా అయితే ఎప్పుడూ 'శక్తిలేదు' అని ముడుచుకొని పడుకొని ఉండేవాడు. అతను ఇప్పుడు ఆ కాయని చూడగానే లేచి గంతులు వేయటం మొదలు పెట్టాడు! "ఇవి ఎన్ని తింటే అన్నేళ్ళు ఎక్కువ బ్రతుకుతారట! ఈ బంగారు చెట్టు మీకు ఎక్కడ కనిపించింది? నన్ను అక్కడికి తీసుకపోండి!" అంటూ.     పిల్లలు బిక్క మొహాలు వేసారు. దారి తప్పటం వల్ల అక్కడికి వెళ్ళగలిగారు గానీ, మళ్ళీ అక్కడికి వెళ్ళే దారి తెలీదు వాళ్ళకు!! "అయినా ఇది ఒట్టి పనికి మాలిన చెట్టు తాతా! వీటి కాయలు ఎంత చేదు, ఎంత గబ్బు! భరించలేం! బంగారం అయితే -నేమి, వెండి అయితేనేమి? ఇది ఒట్టి ఆశల చెట్టు! అంతే" అన్నారు పిల్లలిద్దరూ. అయినా వాటి మీద ఆశ తోటి అడవి అంతా గాలించాడు తాత. ఎంత వెతికినా ఆ బంగారు చెట్టు కనిపించనే లేదు !

కుందేలు బెరుకు

కుందేలు బెరుకు   అనగనగా ఓ రైతు దగ్గర ఒక ఆవు, ఒక గుర్రం ఉండేవి. రోజూ అవి రెండూ ఊరవతల ఉన్న అడవికి వెళ్ళి మేసి వచ్చేవి.  ఆవు, గుర్రం అడవికి వెళ్తుంటే ఒక కుక్క కూడా వాటితో పాటు అడవికి పోయేది. అట్లా రోజూ కలిసి వెళ్తూ, వస్తూ అవి మంచి స్నేహితులయ్యాయి. ముచ్చట్లు చెప్పుకొనీ చెప్పుకొనీ వాటి స్నేహం బాగా గట్టి పడింది. అడవిలో ఉండే ఒక కుందేలుకు ఈ ముగ్గురు స్నేహితులను చూస్తే చాలా ముచ్చటగా ఉండేది. "నాకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుండేది!" అనుకునేదది. కానీ వాటి దగ్గరికి వెళ్ళి "నాతో స్నేహం చేస్తారా?" అని అడగాలంటే, మరి దానికి సిగ్గు, బెరుకు!! ఒకసారి కుందేలు పొదల మాటున కూర్చొని ముగ్గురు స్నేహితుల్నీ చూస్తూ మైమరచి పోయింది. తెలివి వచ్చి చూసుకునేసరికి ఏమున్నది, నక్క ఒకటి తనను వాసన చూస్తున్నది! భయంతో వణికిపోయిన కుందేలు ఒక్క గెంతు గెంతి, పరుగు పెట్టింది. అంతలోకే గుర్రం సకిలించింది. ఆవు బుస్సుమన్నది. కుక్క గుర్రుమన్నది. నక్క వాటిని చూడగానే ఆగిపోయి, తోకముడిచింది. కుక్క, ఆవు, గుర్రం ముందుకు దూకటం, నక్క పారిపోవటం ఒకేసారి జరిగిపోయాయి.  ముగ్గురు స్నేహితులకూ కృతజ్ఞతలు చెప్పేసింది కుందేలు: "మిమ్మల్ని ఎన్నో రోజుల నుండీ చూస్తున్నాను. మీతో స్నేహం చేయాలని చాలా ఉత్సాహ పడ్డాను, కానీ బెరుకు వల్ల మీ ముందుకు రాలేదు ఇన్నాళ్ళూ" అన్నది. ముగ్గురు స్నేహితులూ ఒకదానికేసి ఒకటి చూసుకొని "స్నేహం చేయాలనుకున్నప్పుడు బెరుకు పనికిరాదు. ఇన్ని రోజులూ‌ నువ్వు మాకు కనబడలేదు గానీ, లేకపోతే మేమే నీతో స్నేహం చేసేవాళ్లం. ఈ నక్క ఏదో మనకు మేలే చేసింది. ఇవాల్టినుండి మనం నలుగురం స్నేహితులం!" అన్నాయి. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

మూడు సలహాలు

మూడు సలహాలు   అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేది. ఆ అడవికి వెళ్ళాడొక వేటగాడు. వాడు ఆ అడవి మధ్యలో వల వేశాడు. ఆ వలలోకి ఏ జంతువులో, పక్షులో వచ్చి పడతాయని ఎదురు చూస్తూ చెట్టు క్రింద కూర్చున్నాడు. చూస్తుండగానే ఓ బుజ్జి పిట్ట మెల్లగా వచ్చి వలలో చిక్కుకున్నది. వేటగాడు లేచి వల దగ్గరికి వచ్చాడు. బుజ్జి పిట్టను చేతిలోకి తీసుకొని "ఆహా! భలే రుచిగా ఉంటుంది!” అంటూ బుజ్జి పిట్టను చంపి తిందామని ప్రయత్నించాడు. బుజ్జి పిట్టకు భయం వేసిందిగానీ, చటుక్కున తేరుకొని ధైర్యంగా మాట్లాడింది: "వేటగాడా! నన్ను తిన్నంత మాత్రాన నీ కడుపు నిండుతుందా? నీ‌ కడుపు నిండదు; నీ ఆకలీ తీరదు. నన్ను వదిలేయ్- నీకు అమూల్యమైన సలహాలు మూడు ఇస్తాను. మొదటి సలహాను నీ చేతి మీద కూర్చొని ఇస్తాను. రెండవ సలహాను దూరంగా నేలమీద కూర్చొని ఇస్తాను. మూడవ సలహాను చెట్టు కొమ్మ మీద కూర్చొని ఇస్తాను" అన్నది. వేటగాడు కొద్ది సేపు ఆలోచించాడు- 'సరేలే' అని దాన్ని వదిలేసాడు.   బుజ్జి పిట్ట వేటగాడి చేతిమీదే కూర్చొని మొదటి సలహా ఇచ్చింది: "అసంభవమైన వాటిని ఎప్పుడూ నమ్మవద్దు" అని. వేటగాడు ఇంకా ఆలోచిస్తుండగానే బుజ్జి పిట్ట దూరంగా వెళ్లి కూర్చొని రెండవ సలహా ఇచ్చింది: "జరిగి పోయిన దాన్ని గురించి ఎన్నడూ బాధపడవద్దు" అని. ఆ వెంటనే మూడవ సలహా ఇచ్చేందుకు చెట్టు కొమ్మ మీదికి ఎగిరింది: "నా కడుపులో కిలో బంగారం ఉంది. ఆ బంగారాన్ని నువ్వు గనక తీసుకొని ఉంటే పది తరాల పాటు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతికేవాడివి" అన్నది బుజ్జి పిట్ట. వేటగాడు నిర్ఘాంత పోయాడు. నేను నిన్ను నమ్మి వదిలాను. బుజ్జి పిట్టా! నువ్వు నన్ను మోసం చేశావు" అని ఏడుపు ముఖం పెట్టాడు.   బుజ్జి పిట్ట నవ్వింది. “చూడు, నా సలహాలు నువ్వసలు పట్టించుకున్నట్టే లేవు. అసంభవమైనవాటిని నమ్మద్దని చెప్పాను కదా, మరి పిట్ట కడుపులో బంగారం ఉందంటే నువ్వు ఎలా నమ్మావు? ఇక నా కడుపులో నిజంగానే కిలో బంగారం ఉండి ఉంటే, నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు ఆ బరువు తెలిసేది కదా? అయినా నా కడుపులో కిలో బంగారం పట్టేనా?” అన్నది. వేటగాడు సిగ్గుతో తల వంచుకున్నాడు. పిట్ట కొనసాగించింది: "చూడు, జరిగిపోయినదాన్ని గురించి ఎన్నడూ బాధపడకు" అని చెప్పాను. నువ్విప్పుడు ఏం చేస్తున్నావు? 'అనవసరంగా నన్ను వదిలేసానే' అని బాధపడుతున్నావు. కదూ?” అన్నది నవ్వుతూ. వేటగాడికి మరింత సిగ్గు వేసింది. “నిజమే. ఇక మీద నీ సలహాలు పాటిస్తాను. మరిప్పుడు మూడో సలహా కూడా ఇవ్వు” అని అడిగాడు. "ఎవరు ఏ సలహాలను ఇచ్చినా, మనకు వాటిని పాటించే గట్టి మనసు ఉంటేనే ప్రయోజనం. సలహాలు ఆచరణలోకి వస్తేనే ఉపయోగం- అర్థమైందా?” అని చెప్పి బుజ్జి పిట్ట తుర్రుమని ఎగిరిపోయింది. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

వదిలెయ్యండి!

వదిలెయ్యండి! శివపురపు శివార్లలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉండేది. నూరేళ్ల వయసున్న ఆ చెట్టు అనేక తరాలుగా రకరకాల పక్షుల, ఉడతలు, మరెన్నో ఇతర జంతువుల్ని ఆకర్షిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం నాలుగైదు నెలలపాటు చెట్టు తన తీయని పండ్ల ను వాటితో పంచుకొనేది. రాజు అనే కోతి ఒకటి ఆ చెట్టు మీద నివసించేది. ఆ చెట్టుమీదే గూడు కట్టుకొని నివసించే "కాలియా" అనే కాకికి, రాజుకు చక్కని స్నేహం కుదిరింది. రెండూ ఆడుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఒకరి అనుభవాలనొకరు పంచుకుంటూ సంతోషంగా ఉండేది. ఒక రోజున రాజుకు చెట్టు మొదట్లోనే ఒక వింత వస్తువు కనబడింది. అదొక సన్నమూతి కూజా- మెడ వరకూ నేలలో పూడిపోయి ఉన్నది. ఆ కూజాలో దాదాపు సగం వరకూ వేయించక శనగపప్పులు ఉన్నాయి! కోతులకు వేయించిన శనగపప్పు అంటే చాలా ఇష్టం. రాజుకు వాటిని చూసి ఎక్కడలేని సంతోషం కలిగింది. ఆ సమయానికి కాలియా చెట్టు మీదనే ఒన్నది. క్రిందనుండే అరిచింది రాజు-”ఓ...కాలియా, చూడు, ఇవ్వాళ్ల ఎంత మంచిరోజో! ఏంటో! ఊహించు! నాకోసం భోజనం నా ఇంటి గడపకే వచ్చింది! అదిన్నీ, నాకిష్టమైన భోజనం! కాలియాకు అదంతా నమ్మసక్యం కాలేదు. ఏ వేటగాడో, కోతుల్ని పట్టుకునేవాడో పన్నిన ఉచ్చు కావచ్చుననిపించింది. అది కోతికంటే ఎత్తు నుండి లోకాన్ని చూస్తుంది కనకనేమో, దానికి మనుషుల ప్రవర్తన గురించి కొంచెం ఎక్కువే తెలుసు. వాళ్లు జంతువుల్ని పట్టేందుకు వాడే తెలివితేటల్ని చూస్తే దానికి ఒకింత భయం కూడానూ. అందువల్ల అది రాజుతో "ఒరే! దాని మానాన దాన్ని వదిలెయ్యి. వేయించిన శనగపప్పుల మీద యావ తగ్గించుకో. ఈ ఒక్కసారికీ వాటిని తినకపోతే ఏమీ కాదులే. ఎందుకు, లేనిపోని ప్రమాదాల్లో పడతావు?” అన్నది. కానీ రాజు కాకి సలహాను తీసుకోలేదు. ఎదురుగా కనబడుతున్న ఆహారపు రుచి గురించిన ఊహలు దాని మనసును వశం చేసుకున్నై. ఆ పరవశంలో అది అసలు కాలియా ఏం చెప్తున్నదీ పూర్తీగా విననే లేదు. “ఈ కాకి ఎప్పుడూ 'వద్దు ' అనే అంటుంటుంది. దాని ముందుచూపు కొన్నిసార్లు మేలు చేస్తుంటుంది, నిజమే. కానీ అది అన్నిసార్లూ ఎలా పనిచేస్తుంది? పట్టుబడకుండా ఈ పనుల్ని ఎలా అందుకోవాలో తెలుసు, నాకు. నాకు కనీసం ఆ మాత్రం తెలివితేటలు లేవా? కోతులు చాలా తెలివైనవి. బహుశ: ఈ కాకి మా తెలివితేటల్ని తక్కువగా అంచనా వేసి ఉంటుంది. నేను జాగ్రత్తగా ఉండాలి, కానీ ఈ పప్పుల్ని ఎలాగైనా సరే, తినాల్సిందే.” అనుకున్నదది. అలా అనుకొని, అది కూజా దగ్గరికి వెళ్లింది. సన్నటి దాని చేయి, కూజాలోకి సులభంగానే దూరింది. లోపల కూజా విశాలంగానే ఉన్నది. రాజు తనకు వీలైనన్ని పప్పుల్ని పిడికిట పట్టింది. అటూ ఇటూ చూసింది. ఎలాంటి ఉచ్చూ లేదు. దానికి చాలా సంతోషం వేసింది. కానీ, చేతిని బయటికి తీద్దామని చూసేటప్పటికి, చెయ్యి బయటికి రాలేదు! మూసిన పిడికిలి సన్నమూతిలోకి దూరటం లేదు! రాజు తన శక్తినంతా ఉపయోగించి చేతిని బయటికి లాగేందుకు ప్రయత్నించింది. చేతిని అన్ని వైపులకూ వంచి, లాగి చూసింది. ఏం చేసినా దాని వేళ్లకు కూజా రాచుకొని పెచ్చులు ఊడినై,తప్పిస్తే పిడికిలి మాత్రం కూజాలోంచి బయటికి రాలేదు. నొప్పికొద్దీ అది అరవటం మొదలు పెట్టింది- పిడికిలిని మాత్రం తెరవటం లేదు. కొద్ది దూరంలోనే ఉన్న కోతులు పట్టేవాడికి రాజు అరుపులు వినబడినై. వాడు కులాసాగా నవ్వుకుంటూ అటువైపు రాసాగాడు. పైనుండి చూసిన కాలియా గాభరాపడి రాజుతో- “ఓరే! వదిలిపెట్టురా, కోతీ! నీ చేతిలోని పప్పుల్ని వదులు" అని అరిచింది. “పిడికిలి బిగించకు, తెరిచి పెట్టు. ఆ పప్పుల్ని వదిలెయ్యి. వదిలేస్తే, నీ చెయ్యి బయటికి జారి వచ్చేస్తుంది" అని కాకి ఎంత మొత్తుకున్నా, మొండి కోతి తన పట్టును సడలించలేదు. విడిచిపెట్టటం రాని రాజు, ఆ విధంగా కోతులవాడి పాలబడింది. వదిలెయ్యటం నేర్చుకోవాలి అందరమూ- పట్టు పట్టడం ఎంత అవసరమో గానీ, పట్టు విడవటం అంతకంటే ఎక్కువే అవసరం! ఏమంటారు? Courtesy.. kottapalli.in

గుడ్లగూబల సమస్య

గుడ్లగూబల సమస్య     అనగనగా ఒక అడవిలో గొప్ప గుడ్లగూబ ఒకటి ఉండేది. దాని కళ్ళు పెద్దగా, భయంకరంగా, వికారంగా ఉండేవి. దాన్ని చూసి మిగతా పక్షులన్నీ ఎగతాళి చేసేవి. దాంతో గుడ్లగూబకి చాలా బాధ వేసింది. ఎలాగైనా తన కళ్ళను మార్చుకోవా-లనుకున్నది. కానీ ఎంత ప్రయత్నించినా దాని కళ్ళు మటుకు చిన్నవి కాలేదు. భరించలేక, చివరకి అది ఘోర తపస్సు చేసింది. దాని తపస్సుకు మెచ్చి దేవుడు కూడా త్వరగానే ప్రత్యక్షమైనాడు. "ఏమి కావాలో కోరుకో, గూబా!" అన్నాడు. "దేవుడా, అందరికీ చక్కగా అంత చిన్న చిన్న కళ్ళు ఇచ్చావు.     మాకు మటుకు ఇంత పెద్ద కళ్ళు! పది మందిలో ఎంత నగుబాటుగా ఉందో తెలుసా? మాకు ఈ పెద్ద కళ్ళు వద్దు! అందరి మాదిరి, చిన్న చిన్న కళ్ళు చేసెయ్యి!" అని వేడుకున్నది గుడ్లగూబ. "సరేలే, నీ ఇష్టప్రకారమే కానివ్వు" అంటూ దేవుడు వెంటనే గుడ్లగూబల కళ్ళను చిన్నవిగా, అందంగా మార్చేశాడు. అందమైన చిట్టి చిట్టి కళ్ళు పెట్టుకున్న గుడ్లగూబలు చాలా సంతోషపడ్డాయి. తోటి పక్షులన్నిటికీ తమ కళ్ళను చూపించుకొని చాలా మురిసిపోయాయి. తమ అందానికి చాలా గర్వ పడ్డాయి. కొన్నయితే మిగతా పక్షులను కూడా ఎగతాళి చేసాయి!  అయితే రోజులు ఎప్పుడూ‌ ఒకేలాగా ఉండవు కదా, కొన్ని సంవత్సరాలు గడిచాక, ఫ్యాషన్ మారింది.   గుడ్లగూబలకు అసంతృప్తి మొదలైంది మళ్ళీ. "మాకిప్పుడు ప్రత్యేకతే లేకుండా అయ్యింది. అన్ని పక్షులలాగే ఉన్నాయి, మా కళ్ళు కూడాను!" అనుకోసాగాయి. "పెద్ద పెద్ద కళ్ళు చాలా బాగుంటాయి. పాపం, ఈ గుడ్లగూబల కళ్ళు ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి!" అని కొన్ని పక్షులు వాటి మీద జాలి చూపించసాగాయి కూడా. కళ్లని పెద్దవి చేసుకునేందుకు గూబలు ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఒక గుడ్లగూబ మళ్ళీ తీవ్రమైన తపస్సు చేసింది. మళ్ళీ ప్రత్యక్షమైనాడు దేవుడు. "ఏంటి వత్సా, నీ కోరిక?" అంటూ. "మాకళ్ళు ఎప్పటి లాగే పెద్దవిగా, గుండ్రంగా మార్చెయ్యి స్వామీ!" అన్నది గుడ్లగూబ.    "మరి అప్పుడు చిన్నగా, అందంగా కావాలన్నారు కదా?" అన్నాడు దేవుడు నవ్వుతూ. గుడ్లగూబ ఏమీ అనలేకపోయింది. అయినా దేవుడు దాని కోరికను అర్థం చేసుకొని "సరేలే! ప్రస్తుతానికి మీ కళ్ళని తిరిగి పెద్దవి చేసేస్తున్నాను. ఇకమీద ప్రకృతి సహజంగా వచ్చినవాటిని వేటినీ చిన్న చూపు చూడకండి!" అని, నవ్వుతూ మాయమైపోయాడు. ఆ తర్వాత గుడ్లగూబలు తమ పెద్ద కళ్ళతో, ఇప్పటికీ సంతోషంగా, వినయంగా ఉన్నాయి. ఎవరైనా "చిన్న చిన్న కళ్ళు- ఎంత బాగుంటాయో! మీ కళ్ళూ ఉన్నాయి చూడండి- బండలు బండలుగా!" అంటే అవి ఇప్పుడు నవ్వుతున్నాయి తప్ప, మరేమీ అనుకోవట్లేదు.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అన్న-తమ్ముడు

అన్న-తమ్ముడు     రామాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీధర్‌, మురళి అనే అన్నదమ్ములు ఇద్దరు చదివేవాళ్ళు. ఇద్దరూ అన్నదమ్ములే అయినా వాళ్ళ ప్రవర్తన చాలా భిన్నంగా ఉండేది. శ్రీధర్‌లో స్వార్థం పాలు ఎక్కువ అనిపించేది. వాడు తనకంటే చిన్నపిల్లల్ని బెదిరించేవాడు. పెద్దల్ని ఎదిరించేవాడు, ఎవ్వరికీ సహాయం చేసేవాడు కాదు. "సాయం చేయొచ్చు కదా! ఏమౌతుంది?" అని ఎవరైనా అంటే "నాకేంటి లాభం?" అనేవాడు. వీడితో పోలిస్తే వీడి తమ్ముడు మురళి బాగుండేవాడు. చిన్నవాళ్లంటే కొంత ప్రేమ, పెద్దలంటే కొంత గౌరవం ఉండేవి వాడికి. తోటివారికి సాయం కూడా చేసేవాడు.   టీచర్లు, పిల్లలతో సహా అంతా తమ్ముడిని మెచ్చుకుంటుంటే అన్నకి కుళ్ళుగా ఉండేది. అయినా శ్రీధర్‌ ఇతరుల్ని తప్పు పట్టేవాడు తప్ప, తన ప్రవర్తనని మాత్రం మార్చుకునేవాడు కాదు. ఇలా ఉండగా ఒకసారి వాళ్ళ బడి పిల్లలంతా విహారయాత్రకని బయలుదేరారు. అందరితో పాటు వీళ్లిద్దరూ కూడా వెళ్ళారు. ఆ యాత్రలో శ్రీధర్‌ని ఎవరూ పట్టించుకోలేదు. అసలు అతను ఉన్నా లేనట్లే ప్రవర్తించారు. ఇక మురళితో మాత్రం ప్రతి ఒక్కరూ స్నేహంగా ఉన్నారు. అందరూ వాడిప్రక్కన చేరి సంతోషంగా ముచ్చట్లు పెట్టారు. అది చూసి శ్రీధర్‌కు అంతకంతకూ బాధ పెరిగి పోయింది. దర్శనీయ స్థలాల వద్ద కూడా, అందరూ ఒక ప్రక్కన నడిస్తే, శ్రీధర్ ఒక్కడూ మరో ప్రక్కన నడిచాడు. భోజనాల సమయంలో‌ కూడా, అందరూ కలివిడిగా అక్కడి వింతలు-విశేషాల గురించి కబుర్లు చెప్పుకుంటూ చాలా ఆనందంగా గడిపితే, శ్రీధర్ మటుకు ఒంటరిగా కూర్చొని కుళ్ళుకుంటూ భోంచేసాడు. ఆ రోజు సాయంత్రం అంతా వెనక్కి తిరిగి వస్తున్నారు, బస్సు దగ్గరికి. పిల్లలంతా బాగా అలసిపోయారు. అయినా గందరగోళంగా, గుంపులు గుంపులుగానే ఉన్నారు. శ్రీధర్‌ మటుకు ఒక్కడే, ఏదో ఆలోచిస్తూ, నడుస్తున్నాడు. ఉన్నట్టుండి అతనికి ఒక బండ కొట్టుకుంది. రక్తం ధారగా కారసాగింది. అయినా ప్రతి ఒక్కరూ అతన్ని చూసి, ప్రక్కకు తప్పుకొని వెళ్తున్నారు తప్ప, అతనికి సాయం చేసేందుకు ఎవ్వరూ‌ ముందుకు రాలేదు. చివరికి మురళియే వాళ్ళ అన్నను చూసి, "అయ్యో! పెద్ద దెబ్బే తగిలిందే!" అనే సరికి అందరూ అక్కడ గుమిగూడారు. అందరూ మురళి వెంట ఉండి వాళ్ల అన్నను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు.   గాయం తగ్గాక శ్రీధర్ "చూసావా, ఎవ్వరికీ‌ నేనంటే ఇష్టం లేదు! ఇట్లాంటి వాళ్లకు నేను మటుకు ఎందుకు సాయం చెయ్యాలి?" అన్నాడు తమ్మునితో, కోపంగా. అప్పుడు మురళి "నిజమే అన్నయ్యా! చూశావా! మనం‌ విహార యాత్రకు వెళ్ళినప్పుడు నీకు దెబ్బ తగిలితే కూడా ఎవ్వరూ నీకు సాయం చేయలేదు. నువ్వు "ఇతరులకు సహయం చేస్తే నాకేంటి లాభం" అంటావుగా, అలాగే వాళ్లంతా కూడా అనుకున్నారనమాట! అది తప్పు కదా?! స్నేహ సంబంధాలను ఎవరికి వాళ్ళు పెంచి పోషించుకోవాల్సి ఉంటుంది. మనం ముందుకు పడి సాయం చేస్తే, వేరేవాళ్ళు కూడా సమయం వచ్చినప్పుడు మనకు సాయం చేస్తారు. ముందుగా మనం ఇతరులందరినీ దూరం పెట్టామనుకో, అప్పుడు వాళ్ళు కూడా మనల్ని దూరం పెడతారు" అన్నాడు. తమ్ముడు ఏమంటున్నదీ అర్థమైన శ్రీధర్‌ తనను తాను మార్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. "ఇకమీద అవతలి వాళ్ల తీరును పట్టించుకోను. నా అంతట నేనుగా అందరికీ సాయం చేస్తాను" అనుకున్నాడు. శ్రీధర్‌లో వచ్చిన మంచి మార్పుని బడిలో పిల్లలు కూడా త్వరలోనే గుర్తించారు. వాళ్లకు తెలీకుండానే అందరూ మురళి పట్ల స్నేహ భావనతో మెలగసాగారు. కొద్ది నెలల తర్వాత అన్నదమ్ములిద్దరూ బడిలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారంటే 'అబ్బ! వీళ్ళను చూస్తే ఎవరూ అన్నదమ్ములు అనుకోరు- మంచి ఫ్రెండ్స్ అనుకుంటారు!" అని చెప్పుకోసాగారు అందరూ.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

తల్లి కోడి

తల్లి కోడి   అనగనగా ఒక అడవిలో ఒక కోడి ఉండేది. అడవి అవతల ఉన్న ఊళ్లోకి వెళ్ళి, ప్రతి రోజూ అక్కడ పడేసిన గింజలు తిని బ్రతికేది అది. కొన్ని రోజులకు అది మూడు గుడ్లు పెట్టింది. అవి మామూలు సైజు కంటే చాలా పెద్దగా ఉండినై. కోడి ఆ గుడ్ల మీద కూర్చొని జాగ్రత్తగా పొదుగుతూ ఉంటే అవి కూడా రోజు రోజుకూ పెద్దవౌతూ పోయినై. అట్లా పది నెలలు గడిచాక, వాటిలోంచి ముగ్గురు ఆడపిల్లలు బయటికి వచ్చారు! కోడి ఎంతో ప్రేమతో వాళ్లని పెంచి పెద్ద చేసింది. రకరకాల పనులు, విద్యలు నేర్పింది. వాళ్లు ఉండేందుకు ఊళ్ళో ఒక పెంకుల ఇల్లు కూడా కట్టింది. కొన్నాళ్లకు వాళ్ళు ముగ్గురూ పెద్దయ్యారు. చాలా అందంగా, దేవకన్యల్లాగా అయినారు. ఒక రోజున ఊళ్లో ఒక పండుగ జరుగుతోంది. కోడి తల్లి ఆ అమ్మాయిలతో అంది "మీరు అడవిలో ఉన్న కొలనులోంచి నీళ్ళు తీసుకు రండి; నేను రాగానే అందరం కలిసి పూజ చేసుకుందాం" అని. అమ్మాయిలు ముగ్గురూ మూడు కడవలు పట్టుకొని పోగానే, తను సామానుల కోసం ఊళ్ళోకి పోయింది. ఆ రోజున ఊళ్ళో జాతర చూసేందుకు రాజుగారి కొడుకులు ముగ్గురు వచ్చారు. ఇంకా సమయం‌ ఉంది కదా అని ముగ్గురూ గుర్రాలెక్కి అడవిలో‌ వేటకు వెళ్ళారు. అయితే ఎంత తిరిగినా వాళ్లకు అక్కడ ఒక్క జంతువు కూడా కనిపించలేదు. చివరికి వాళ్ళు బాగా అలసిపోయారు; విపరీతంగా దాహమైంది. "కొలను ఎక్కడ?" అని వెతుక్కుంటూ పోయారు వాళ్ళు. వాళ్ళు సరిగ్గా కొలను చేరే సమయానికి ఈ అమ్మాయిలు ముగ్గురూ కడవలు ఎత్తుకొని ఎదురయ్యారు వాళ్లకి. "అమ్మాయిలూ, మేం ఈ ఊరి రాజకుమారులం. బాగా దాహం వేస్తోంది. ఇన్ని నీళ్ళు పోస్తారా?" అన్నారు వాళ్లతో. వాళ్లని చూడగానే ముగ్గురు అమ్మాయిలకూ వాళ్లంటే జాలి పుట్టింది. ఇంటికోసం తీసుకెళ్తున్న నీళ్ళను వాళ్ళకు పోసారు.   ఆ సమయంలో వాళ్లని గమనించిన రాజకుమారులు "అబ్బ! వీళ్లెవరో‌ మామూలు అమ్మాయిలు కాదు! దేవకన్యలే అయిఉంటారు! వీళ్లని పెళ్ళి చేసుకోవాలి" అనుకున్నారు. అమ్మాయిలు కూడా వాళ్లను చూసి ఇష్టపడ్డారు. "మా అమ్మని అడిగి చెబుతాం" అన్నారు. "అయితే సరే, మేం మీరు సరేననటం కోసం ఎదురు చూస్తుంటాం" అన్నారు రాజకుమారులు. అమ్మాయిలు ఇంటికొచ్చి తల్లిని అడిగారు: "అమ్మా!‌ వీళ్ళు మాకు బలే నచ్చారు; పెళ్ళి చేసుకుంటాం" అని. "మంచిదే అమ్మాయిలూ!" అంది తల్లికోడి- "అయితే వాళ్ళేమో రాజకుమారులు! మీరేమో మామూలు కోడి పిల్లలు. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో, చూసుకోండి. నిజంగా ఇష్టం ఉంటే చేసుకోండి. అయితే వాళ్ల వాళ్ళకు నేను కనబడితే మటుకు మీ సంబంధం కలవదు. అందుకని నేను మీ పెళ్ళికి రాను. ఎవరైనా అడిగితే మీ అమ్మ ఎక్కడికో వెళ్ళిందని చెప్పండి" అన్నది. పెద్ద అమ్మాయిలు ఇద్దరూ రాజకుమారులకు కోడి చెప్పమన్నట్టే చెప్పారు. వాళ్ళిద్దరూ వాళ్లని పెళ్ళి చేసుకునేందుకు ఒప్పుకున్నారు. కానీ మూడో అమ్మాయి మాత్రం 'మా అమ్మ ఒక మామూలు కోడి. అందుకని పెళ్ళికి రాదు" అని నిజం చెప్పేసింది తన కాబోయే మొగునికి. అయినా అతను కూడా "ఏమీ పర్లేదు" అనేసాడు. వెంటనే మూడు జంటల పెళ్ళిళ్ళు కూడా జరిగిపోయాయి. 'ఇక వాళ్లంతా భర్తలతో బాటు బయలుదేరతారు' అనగా తల్లికోడి వాళ్ళు ముగ్గురికీ‌ మూడు సంచుల్లోకి కొన్ని గింజలు వేసి ఇచ్చింది. ఆ సంచులకు క్రింద వాళ్లకు తెలీకుండానే చిన్న రంద్రం పెట్టింది.   రాజకుమారులు వాళ్లని తీసుకొని గుర్రాల మీద బయలుదేరారు. తల్లి ఇచ్చిన గింజల సంచీలు అమ్మాయిల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు వేగంగా పోతుంటే, సంచిలోని గింజలు కూడా ఒకొక్కటీ క్రిందికి జారి పడుతూ పోయాయి. అట్లా కలిసి కొంత దూరం పోయి, ఆ తర్వాత ఒక్కొక్క రాజకుమారుడూ ఒక్కో దిక్కుకు వెళ్ళిపోయారు. రోజులు, నెలకు గడిచాయి. తల్లికోడికి పిల్లలు గుర్తుకొస్తున్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారో అని ఆదుర్దా ఎక్కువైంది. వర్షం ఎప్పుడు పడుతుందా, విత్తనాలు ఎప్పుడు మొలకెత్తుతాయా అని చూస్తూ ఉండింది. చూస్తూండగానే వానాకాలం వచ్చింది. రాత్రి పెద్ద వర్షం పడింది. ఆ తల్లి గుండె నిబ్బరం అయింది. ప్రొద్దున్నే బయటకి వచ్చి చూస్తే గింజలన్నీ మొలకెత్తి ఉన్నాయి! కోడి ఎగిరి గంతేసి, ఆ మొలకల్నే వెంబడించుకుంటూ పోయింది. అట్లా పోయి పోయి, ముందు పెద్ద కూతురు దగ్గరికి చేరుకున్నది. పెద్ద కూతురు ఉండేది చాలా పెద్ద భవంతి. "ఎట్లా చెయ్యాలి?!" అని ఆలోచించి కోడి మెల్లగా పోయి, భయపడుతూనే తలుపు తట్టింది. "ఎవరు, తలుపు కొట్టారు?" అని ఆ పెద్దకూతురు వచ్చి చుట్టూ చూసింది. ఆమె చాలా నగలు, నాణ్యాలు అన్నీ చాలా ఒంటినిండా వేసుకొని ఉండింది. "నేనేనే! బాగున్నారా, మీరు?" అంది తల్లి కోడి సంతోషంగా.   అప్పుడు ఆ పిల్ల క్రిందికి చూసి, "నువ్వా?! నువ్వెందుకు వచ్చావు?!" అని అడిగింది చికాకుగా. అప్పుడు తల్లి కోడి నిర్ఘాంతపోయి "ఏంటమ్మా, ఇలా అంటావు?! నేను మీ అమ్మను గదా?!" అన్నది. "బానే ఉంది! 'మా అమ్మ ఒక పనికిరాని కోడి' అని తెలిస్తే మా ఆయన నన్ను గెంటేస్తాడు. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో!" అని ప్రక్కనే ఉన్న కట్టె తీసుకొని రెక్కకు విసిరింది బిడ్డ. అంతే తల్లికోడి రెక్క కాస్తా విరిగి పోయింది, ఆమె మనసుతో పాటు. ఇంక అలాగే ఆ రెక్కను ఈడ్చుకుంటూ రెండవ కూతురు దగ్గరికి పోయి, ఆమె ఇంటి తలుపు తట్టింది. ఆ సమయానికి ఆమె చపాతీలు తిక్కుతున్నది. తలుపు కొడితే పని ఆపి వచ్చి తలుపు తీసి, ఆమె కూడా పైపైకే చూసింది- "ఎవరు, తలుపు కొట్టారు?" అనుకుంటూ. తల్లి కోడికి ప్రేమ పొంగుకొచ్చింది. "బాగున్నావానే? నేనే, తలుపు కొట్టింది!" అన్నది. ఆమె చటుక్కున క్రిందికి చూసి "నువ్వా?! నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనేదో బాగా కాపురం చేసుకుంటుంటే మధ్యలో నువ్వొచ్చావు నా ప్రాణానికి ముందు ఇక్కడి నుండి పోతావా, లేదా?" అని చపాతీ కర్రను కోడి మీదికి విసిరింది. ఆ దెబ్బకు కోడి రెండవరెక్క కూడా విరిగిపోయింది. తల్లి మళ్ళీ రోడ్డు మీద పడింది. మూడవ కూతురు దగ్గరికి వెళ్తే 'ఇంక మిగిలి ఉన్న ప్రాణం కూడా పోతుందేమో' అనుకున్నది. మళ్ళీ "పోతే పోయింది పాడు ప్రాణం. బిడ్డ చేతిలోనే పోనీ" అనుకొని, దేకుకుంటూ చిన్న కూతురు ఇల్లు చేరుకొని తలుపు తట్టింది. చిన్న కూతురు వచ్చి క్రిందికి చూస్తే రక్తం ఓడుతూ ఉన్నది వాళ్ల అమ్మ! అట్లా వాళ్ల అమ్మను చూసే సరికి ఆ బిడ్డకు ఏడుపొచ్చింది. వెంటనే తల్లికోడిని చేతిలోకి తీసుకొని "ఏమయిందమ్మా?!" అని అడిగింది. తల్లికోడి జరిగిందంతా చెప్పింది. వెంటనే ఆమె ఆ గాయాలను శుభ్రం చేసి, రెక్కలకు మందువేసి, గుడ్డతో కట్టి, తినేందుకు గింజలు పెట్టింది. 'అప్పటికే బాగా అలసిపోయిన కోడి అమెను ఆశీర్వదించి, గింజలు తిని, కొంచెంసేపటికి అట్లానే తలవాల్చేసింది ! ఆ కూతురు పాపం బాధతో ఏడ్చి ఏడ్చి వేసింది. అంతలోనే ఇంక భర్త వచ్చే సమయం అవుతున్నది. మూడో కూతురు లేచి వాళ్ల అమ్మను ఓ అట్టపెట్టెలో జాగ్రత్తగా పడుకోబెట్టి, మూత వేసి కట్టేసి, ఏడ్చుకుంటూనే పైన అటక మీద పెట్టింది. ఆ వెంటనే కళ్ళ నీళ్ళు తుడుచుకొని మామూలుగా కూర్చున్నది. కొద్ది సేపటికి భర్త వచ్చాడు. "ఏంటి ఈమె ఇట్లా ఉంది ఈ రోజు?!" అనుకున్నాడు. అయినా ఏమీ అనకుండా అన్నం తిని, మంచం వేసుకొని పడుకొని, అలా పైకి చూశాడు. అటకమీద కొత్త పెట్టె కనబడింది- భార్యను పిల్చి "అందులో ఏముంది?" అని అడిగాడు.   అకస్మాత్తుగా అడిగే సరికి ఆమెకి ఏం చెప్పాలో తెలీక "మా అమ్మ వచ్చిందండి-ఏవో తిండి వంటకాలు చేసిందట, ఇచ్చి వెళ్లింది" అని చెప్పేసింది. "అవునా?! ఎప్పుడు వచ్చారు?! మళ్ళీ అప్పుడే ఎందుకు వెళ్ళిపోయారు? అయ్యో, పెట్టెని పైన పెడితే ఇంక వంటలు మనం తింటామా?! దాన్ని దింపుతాను ఆగు- ఏమైనా తిందాం" అని ఆమె ఎంత వద్దంటున్నా వినకుండా పైకెక్కి, పెట్టెను క్రింది దింపాడు రాజకుమారుడు. అమె భయపడుతూనే పెట్టెను తెరిచింది. చూస్తే అందులో తల్లికోడి లేదు- దాని నిండా వజ్రాలు, రత్నమాణిక్యాలు, వెండి, బంగారం"! ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. "మీ అమ్మా వాళ్ళు ఇంత ధనవంతులా?" అని అడిగాడు రాజకుమారుడు. "ఏమీ లేదు. మా అమ్మ పాపం చాలా పేద కోడి, చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. ఇప్పుడు ఇంత సంపద మరి ఎట్లా వచ్చిందో తెలీదు!" అన్నది మూడో‌ కూతురు. అప్పుడు రాజకుమారుడు "చూడు, ఈ వయసులో మీ అమ్మ అంత కష్టపడి సంపాదించి మనకు తెచ్చి పెడుతుంటే ఏం‌ బాగుంది? ఇంత వరకూ మనం మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళలేదు కదా; ఇప్పుడు వెళ్దాం, బయల్దేరు" అన్నాడు. ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకొనే "ఎందుకండీ?! చాలా దూరం! మరెప్పుడైనా వెళ్దాం" అన్నది గాని భర్త ఒప్పుకోలేదు. చివరికి ఆమెకు సరేననక తప్పలేదు. ఇంక ఇద్దరూ తినేందుకు అన్నం కట్టుకొని గుర్రం మీద అట్లా పోసాగారు. అట్లా ఒక రోజంతా ప్రయాణం చేశారు కానీ వాళ్ల ఇల్లు ఇంకా రాలేదు. భర్త ఎంత అడిగినా, భార్య "ఇంకా పోవాలి" అంటూనే ఉంది. చివరికి ఇంక సాయంత్రం అవుతుండగా "ఇంక పోలేను. అలసి పోయాను" అన్నాడు రాజకుమారుడు. సరే అని ఇద్దరూ అక్కడ అడవిలోనే ఓ చెట్టు నీడనే గుర్రం‌ ఆపుకొని విశ్రాంతిగా కూర్చున్నారు. రాజకుమారుడికి కొంచెం నిద్రపట్టింది; కానీ భార్య మాత్రం అట్లాగే కూర్చొని ఉంది. భయంతో ఆమెకు చెమటలు పట్టి, బొట్లు బొట్లు గా క్రిందికి కారుతున్నాయి.   ఆ చెట్టు క్రిందే పాము పుట్ట ఒకటి ఉంది. అందులో ఒక పాము. కొంత కాలంగా దానికి వీపు మీద ఒక గుల్ల లేచి, చాలా మండుతోంది. ఏ పనీ‌ చేయనివ్వట్లేదు. అయితే ఈమె చెమట కారి, ఆ పాము గాయం మీద పడగానే ఆ పాముకి ఎంత చల్లగా అనిపించిందంటే, క్షణంలో అది తన బాధనంతా మర్చిపోయింది. దానికి ఈ మూడోకూతురు మీద చాలా గౌరవం కలిగింది. దాంతో అది పుట్టలోంచి బయటికి వచ్చి, ఆమెకు మ్రొక్కి, తన సంగతంతా చెప్పి, "తల్లీ! నీకు ఏం సాయం కావాలన్నా చేయగలను. చూస్తే నువ్వేదో అవసరం మీద పోతున్నట్లు ఉన్నావు. ఎందుకు, ఈ అడవి దారి పట్టావు?" అని అడిగింది. అమె చెప్పింది విని, పాము బాధపడి "ఏమీ పర్లేదు తల్లీ! నీ కోరిక తీరుతుంది. నా బలంతో ఒక ఊరు సృష్టిస్తాను. మీరు ఇద్దరూ అక్కడ మీకు ఇష్టమైనన్ని రోజులు ఉండచ్చు. మేం అందరం నీకు అనుకూలంగా ఉంటాం.." అని ధైర్యం చెప్పింది. కొద్ది సేపటికి రాజకుమారుడు నిద్రలేచి, మళ్ళీ ప్రయాణానికి నడుం కట్టాడు. "ఇంకా ఎంత దూరం?" అని అడిగితే, "అదిగో- ఆ కనిపించే ఊరే, మా ఊరు!" అని చెప్పింది భార్య. వాళ్ళు అక్కడికి చేరుకునే సరికి, ఆ నగరం అంతా వెండి బంగారాలతో, ధగధగా మెరిసిపోయే పెద్ద పెద్ద భవనాలతో, చక్కని ఉద్యానవనాలతో బలే ఉన్నది. ఊళ్ళోవాళ్ళు కూడా అందరూ వాళ్లని "అక్కా! బాగున్నారా?! బావా, ఎంత కాలానికి వచ్చారు!" అంటూ ప్రేమగా పలకరించారు.   "మీ ఇంటి తాళాలు ఇవిగో, మీ అమ్మ వీటిని మాకు అప్పగించి పోయింది. ఒక చోట ఉండదు కద!" అంటూ ఓ పెద్ద భవంతి తెరిచి ఇచ్చారు కూడా. భార్యాభర్తలు ఇద్దరూ అక్కడే రకరకాల వంటలు తింటూ కొన్ని రోజులు గడిపారు. "ఇంక వెళ్ళొస్తాం! చాలా రోజులైంది" అని అందరికీ వీడ్కోలు చెప్పి, బయలు దేరారు. వాళ్ళు అట్లా గుర్రం ఎక్కి కొంత దూరం వెళ్ళారో-లేదో, ఆ ఊరు ఊరంతా మాయమైపోయింది! అటుపైన రాజకుమారుడికి సంగతంతా అర్థమైంది: 'ఈమె నిజంగానే ఎవరో దేవకన్య. దేవకన్యలకు అమ్మానాన్నలు ఎందుకుంటారు?' అని అతను మరెన్నడూ ఆమెని తమ ఊరికి తీసుకెళ్ళమని బలవంతపెట్టలేదు. ఇంక వాళ్ళిద్దరూ సిరి సంపదలతో సుఖంగా జీవించారు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

పెద్దల మాట

పెద్దల మాట   అనగా అనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఓ పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుకో తొర్ర ఉండేది. ఆ తొర్రలో ఒక ముసలి గుడ్లగూబ ఉండేది. అది చాలా మంచిది, తెలివైనది. అందరికీ సాయం చేసేది. ఆ అడవిలో లెక్కలేనన్ని పూలు ఉండేవి. ఎన్నో కాయలు కాసేవి. ఏ చెట్టుకు చూసినా పండ్లు, గుత్తులు గుత్తులు గా వేళ్ళాడుతుండేవి. ఓసారి ఆ అడవిలోకి ఒక రామచిలుక వచ్చింది. అప్పటివరకూ అది పట్నంలోనే, ఎవరి ఇంట్లోనో ఓ పంజరంలో‌బ్రతికింది. దానికి అడవి గురించి అస్సలు ఏమీ తెలీదు. అయితే ఆ సంగతి చెప్పుకోవాలంటే దానికి నామోషీ.    తనకు అన్నీ తెలిసినట్లు నటిద్దామనుకున్నదది. అడవిలోకి వచ్చీ రాగానే గుడ్లగూబను పలకరించింది. “ఏంటి మామా?! కులాసానా? అందరూ బాగున్నారా? నేను పట్నం నుండి వచ్చాను మిమ్మల్ని అందర్నీ చూసిపోదామని; మన అడవిలో దొరికే పళ్ళన్నీ తిందామని!” అని. "పళ్ళన్నీ తినద్దురో అల్లుడూ!” అంది గుడ్లగూబ. "మిలమిలా మెరిసేవన్నీ మంచి పళ్ళు కాదు.  ఎర్రగా బుర్రగా కనిపిస్తా ఉన్నాయని ఎగబడి తినేవు జాగ్రత్త, విషపు పళ్ళుంటాయి!” చెప్పింది. “నాకు తెలీదా, ఆ మాత్రం?!” అంది చిలుక. “ముసలి వాళ్లంతా ఇంతే, చాదస్తం!” అనుకున్నది చిలుక. అడవంతా తిరిగి, ఏవేవో పళ్ళు తిన్నది. “అన్నీ కొరికి చూడాలి" అనుకొని, నిజంగానే అన్నీ‌కొరికి చూసింది.   ఓ గంటసేపు అట్లా తిరిగి తిరిగి ఏమేం తిన్నదో కడుపులో గడబిడ మొదలు అయ్యింది. కళ్ళు మసక బారాయి. తల తిరిగింది దాని అదృష్టం బాగుండి, గుడ్లగూబ ఉండే చెట్టు ముందుకే వచ్చి నేలబారుగా పడిపోయింది. "శబ్దం ఏంటా!?” అని లేచి వచ్చి చూసింది గుడ్లగూబ . ఎదురుగా నేలమీద చిలుక, గుడ్లు తేలవేసి పడి ఉన్నది.  వెంటనే అది తనకు తెలిసిన మందు ఆకులు తెచ్చి, నూరి దాని ముక్కులో పిండింది. చిలుక ప్రాణాలను కాపాడింది. లేచి కూర్చున్న చిలుక తన అవివేకానికి సిగ్గుపడి తలవంచుకుంది. “తెలీనప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు చెబితే వినాలిరా అల్లుడూ" అని గుడ్లగూబ అంటే "నిజమే" అనిపించింది దానికి ఇప్పుడు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అందం

అందం     అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు నివిసించేవి. ఒక రోజున చక్కని ఓ నెమలి నల్లని కాకిని చూసి "మిత్రమా! నేనెంత అందగా ఉన్నానో చూశావా? అందరూ నన్ను ఇష్టపడతారు. కానీ నువ్వు? ఎట్లా ఉన్నావో చూడు! నల్లగా, దిష్టిబొమ్మలాగా?! అందుకనే నిన్ను ఎవరూ ఇష్టపడనిది!" అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆ మాటలు విని కాకికి చాలా బాధ వేసింది. అది గూటికి వెళ్ళి, తన అందం గురించే ఆలోచిస్తూ దిగాలుగా కూర్చున్నది. అంతలోనే అటుగా వెళ్తున్న ఓ చిలుక దాన్ని చూసి ఆగింది. "ఏమి కాకి బావా! కులాసానా?" అని అడిగింది. ఏదో లోకంలో‌ఉన్న కాకికి అసలు అదేమన్నదో కూడా వినిపించలేదు.  చిలుక అప్పుడు కాకి దగ్గరకు వెళ్ళి కూర్చొని "కాకి బావా! ఏమి, దిగాలుగా ఉన్నావు?" అని అడిగింది. కళ్ళ నీళ్ళు పెట్టుకొని జరిగిన విషయమంతా చెప్పింది కాకి. అంతా విని చిలుక "కాకి బావా! బాధపడకు. నిజానికి మనం చూసేందుకు ఎలా ఉంటే మాత్రం ఏమున్నది? ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది ముఖ్యం. రూపు ఏదైతేనేమి, మనసు ముఖ్యం కదా. నీకంటూ ఒక రోజు తప్పక వస్తుంది- బాధపడకు!" అని దాన్ని ఓదార్చి వెళ్ళిపోయింది. అది అన్నట్లే ఒక రోజున కాకికి అవకాశం వచ్చింది. వేటగాడు ఒకడు చెట్ల మాటునుండి నెమలికి బాణం గురిపెట్టాడు.  ఆ సమయానికి నెమలి వెనక్కి తిరిగి పురివిప్పుకొని నాట్యం చేయటంలో మునిగి ఉన్నది. వేటగాడిని చూడగానే కాకి నెమలిని హెచ్చరిస్తూ "మిత్రమా! పారిపో! వేటగాడు!" అని గట్టిగా అరవటం మొదలు పెట్టింది. గబుక్కున ఈ లోకంలోకి వచ్చిన నెమలి తోక ముడుచుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. వేటగాడు దాని వెంట పడ్డాడు. నెమలి చెట్ల కొమ్మల మీదుగా దూక్కుంటూ అతి కష్టం మీద వాడి బారినుండి తప్పించుకోగలిగింది.  తరువాత ఆ రోజు సాయంత్రం నెమలి కాకిని వెతుక్కుంటూ వచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవటమే కాకుండా తనను క్షమించమని అడిగింది. "ఎందుకు, ఏం తప్పు చేశావు?" అంది కాకి. నెమలి తనను ఎగతాళి చేసిన సంగతి అసలు గుర్తే లేదు దానికి! "ఆ రోజు నువ్వు అందంగా లేవని చులకనగా మాట్లాడాను కదా, నీ మంచితనాన్ని గుర్తించలేదు. అయినా నువ్వు దాన్ని మనసులో పెట్టుకోకుండా ఇవాళ్ల నా ప్రాణాలను కాపాడావు. నన్ను క్షమించు. శరీరాల అందం కంటే మనసుల అందమే గొప్పదని నాకు అర్థమైంది. ఇకమీద నేను ఎవ్వరినీ కించపరచను" అన్నది నెమలి, కాకి చేతులు పట్టుకొని.  "ఓ, అదా?! ఆ రోజున నువ్వు అట్లా అనే సరికి చాలా బాధేసింది. కానీ అప్పుడు నేను ఏమీ అనలేక, నాలో నేనే ఏడ్చుకున్నాను. ఇకమీద ఎవ్వరిని గురించీ చులకనగా మాట్లాడనన్నావుగా! ఏమీ పర్లేదు. ఇప్పటి నుండి మనం అందరం ఫ్రెండ్స్" అంటూ సంతోషంగా చేతినందించింది కాకి. అదే సమయానికి అక్కడికి వచ్చిన చిలుక సంతోషంగా చప్పట్లు కొట్టింది. అటుపైన నెమలి, కాకి, చిలుక అడవిలో కలిసి మెలిసి సంతోషంగా జీవించాయి. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

తాత బాధ

తాత బాధ   నా పేరు రాము నేను మీ అంత వయసులో ఉన్నప్పుడు, చదువుకన్నా నాకు దేవుని మీద భక్తే ఎక్కువ ఉండేది. అందుకని, నేను ప్రతిరోజూ బడికి వెళ్ళేటప్పుడు దేవాలయం దగ్గర ఆగి, దేవునికి మ్రొక్కుకొని గానీ ముందుకు వెళ్లేవాడిని కాదు. ఒకసారి ఏమైందంటే, బడి వదిలిన తర్వాత నేను మా ఊరికి వెళ్తున్నాను గదా, అప్పుడు ఉన్నట్టుండి పెద్ద గాలి వీచింది. 'ఏమిటా?' అని నేను ఆగి చూశాను.  తర్వాత నేను రోజూ కొలిచే దేవుడే నాముందు ప్రత్యక్షం అయ్యాడు! నేను చాలా‌ ఆశ్చర్యపోయాను. దేవుడు అప్పుడు నాముందు నిలబడి, ఉరుముతున్నట్లు అన్నాడు. "నువ్వు రోజూ నన్ను కొలుస్తున్నావు గదా, అందుకని నాకు నీమీద కరుణ కలిగింది. నీకు ఒక వరం ఇస్తున్నాను- కోరుకో, ఏం కావాలో" అని. చిన్న పిల్లవాడిని కదా, అందుకని తక్షణమే నాకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. నేను అడిగాను. "స్వామీ! 'మీ లోకంలో ఒక సెకన్ అంటే మాలాంటి మనుష్యులందరికీ పదివేల సంవత్సరాలు' అని మా అయ్యవారు చెప్పారు, నిజమేనా?" అని.  "అవును, నిజమే" అన్నాడు దేవుడు. "మరి, మీ లోకంలో ఒక రూపాయి అంటే మాలోకంలో 100 కోట్ల రూపాయలట, నిజమేనా స్వామీ?" అడిగాను నేను. "అవునవును, నిజమే" ఒప్పుకున్నాడు దేవుడు. "మరయితే నాకు మీ రూపాయి ఒకటి ఇవ్వండి స్వామీ" అన్నాను నేను, నా తెలివికి నేనే మురిసిపోతూ. అప్పుడు దేవుడు "ఒక్క సెకన్ ఆగు- ఇస్తాను " అని వెళ్లిపోయాడు! ఇప్పుడు నాకు 90 సంవత్సరాలు- దేవుడి సెకను ఇంకా పూర్తికాలేదో, ఏమో- ఆయనా రాలేదు, ఆయన రూపాయీ రాలేదు నాకు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

చేప-లేడి

చేప-లేడి   నల్లమల అడవుల్లో చిట్టి లేడిపిల్ల ఒకటి ఉండేది. హాయిగా గంతులు వేస్తూ అడవిలో ఎక్కడ పడితే అక్కడ తిరిగేదది. ఒకసారి అట్లా తిరుగుతూ తిరుగుతూ అకస్మాత్తుగా అది ఓ నదీ తీరాన్ని చేరుకున్నది. చిట్టి లేడిపిల్ల అప్పటివరకూ ఏనాడూ నది అన్నదాన్ని చూసి ఉండలేదు. అన్నన్ని నీళ్ళను మోసుకొని బరువుగా ప్రవహిస్తూ పోతున్న నదిని చూస్తే దానికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. అది నదిలోకి దిగి కాళ్ళు కడుక్కున్నది, మునిగి లేచింది, అటూ ఇటూ గెంతింది, కొంచెం దూరం‌ కొట్టుకుపోయింది, మళ్ళీ తేరుకొని బయటికి ఎగిరి దూకి ముచ్చట పడ్డది. అట్లా షికార్లు చేస్తుంటే దానికి నీళ్ళలో చక్కని చేప ఒకటి కనిపించింది. అది కూడా చిట్టి లేడిపిల్లను చూసి చాలా సంతోష పడ్డది. నీళ్లలో నుంచి పైకి ఎగురుతూ, కిందికి పడుతూ విన్యాసాలు చేసింది. "ఏ..య్! చిట్టి పిల్లా! నీళ్ళతో‌ జాగ్రత్త! ఒడ్డుకు దగ్గరగానే ఉండు- నదిలో లోపలికి పోకు! సుడిగుండాలుంటాయి!" జాగ్రత్తలు చెప్పింది. చిట్టి లేడి పిల్లకు నది నచ్చింది, చేప ఇంకా చాలా నచ్చింది. చేప విన్యాసాలను చూస్తూ చూస్తూ, గంతులు వేయటం‌ కూడా మరిచిపోయిందది. దానికి చేపతో స్నేహం చేద్దామనిపించింది. అలా అనుకున్నదే తడవు, చేపతో తన మనసులోని మాటను చెప్పింది. "అమ్మో! భూమి మీద తిరిగే లేడిపిల్లతో‌ స్నేహమా? ఇంకేమైనా‌ఉందా?!" ఆలోచిం-చింది చేప. "నువ్వేమేం తింటావు?" అడిగింది జింకను. "గడ్డి, చిగుర్లు, కాయలు.." అంది జింక. "మాంసం తినవు కదా?" అడిగింది చేప. "ఉహు. తోడేళ్లయితే తింటాయి. నాకు అవంటే భయం" చెప్పింది జింకపిల్ల. "అయితే సరే, మనిద్దరం ఇవాల్టి నుండి స్నేహితులం. నాకు తోడేళ్ళంటే భయం లేదుగానీ, కోరపళ్ళ చేపలంటే మటుకు చాలా భయం" అన్నది చేప. అంతలోనే అకస్మాత్తుగా ఎక్కడినుండో ఊడిపడిందొక తోడేలు! మెల్లగా అడుగులు వేసుకుంటూ జింకపిల్ల వైపుకు రాసాగింది. అయితే ఆ సమయానికి జింకపిల్ల తోడేలును చూడటం లేదు. దాని చూపంతా నీళ్ళలో చక్కని చేప వైపుకు దూసుకువస్తున్న కోరపళ్ళ పెద్ద చేప మీదనే ఉన్నది! ముందుగా తోడేలును చూసిన చేప- "ఏయ్, తోడేలు! పరుగు తియ్యి!" అని అరిచింది. "ఓయ్! కోరపళ్ళ చేప!‌ నీమీదికే వస్తోంది! పారిపో!" అరిచింది జింక పిల్ల. చక్కని చేప చటుక్కున నీళ్ళలోకి దూకి ఎటో పోయింది. జింక పిల్ల మెరుపు వేగంతో తమ ఇంటివైపుకు పరుగెత్తింది. కోపంగా దాన్ని వెంటాడిన తోడేలు కొంత సేపటికి నిరాశగా వెనుతిరిగింది. మరునాడు జింకపిల్ల మళ్ళీ నది దగ్గరికి వెళ్ళి, చక్కని చేపను పిలిచింది- "ఓయ్! మిత్రమా!‌ ఎలా ఉన్నావు? కోరపళ్ళ చేపనుండి తప్పించుకున్నావా?" అని అడిగింది. చేప నీళ్ళ పైకి ముఖం పెట్టుకొని విచారంగా ఉన్నది- జింక పిల్లను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లు. "అబ్బ! బాగానే ఉన్నావా! నీకేమైపోయిందో అని నేను తెగ ఆందోళన పడ్డాను. చూడు, ఎలా జరిగిందో! నీళ్ళలో అయితే నేను నీకు ఏదో కొంచెం సాయం చేసేదాన్ని. కానీ భూమి మీద నేను ఎక్కువసేపు ఉండలేను కదా! నువ్వు ఆపదలోఉన్నప్పుడు నేను ఏమాత్రం ఆదుకోలేకపోయాను. నేను నీకు మిత్రుడిగా సరిపోను" అని బాధపడింది. "అయ్యో! అదేం మాట! నువ్వు సమయానికి హెచ్చరించకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్ని?! నువ్వు నన్ను ఎంత ఆదుకున్నావో నీకేం తెలుసు?" అడిగింది జింకపిల్ల. "నిజమేలే!‌ నువ్వు నన్ను హెచ్చరించి ఉండకపోతే నా పనీ సరి అయ్యేది!" అన్నది చేప. "మరింకేమి, ఇద్దరం ఒకరికొకరం సాయపడ్డట్లే! నీకు నేలపై పోరాడగల శక్తి ఉంటే నా దారిన నన్ను వదిలి పెట్టే దానివి కాదు. నీళ్లలో అయితే నన్ను కాపాడే దానివి కదా! నేను కూడా నేలపై నీకు సహాయం చేసి ఉండేదాన్ని. కాబట్టి బాధ పడాల్సింది ఏమీ లేదు. అయినా స్నేహం అనేది లాభ, నష్టాలపై ఆధారపడకూడదు. స్నేహం స్నేహమే!" చెప్పింది జింక పిల్ల. అటుపైన చేప- జింకల స్నేహం ఎంతో కాలం కొనసాగింది. తమకు వీలు చిక్కినప్పుడల్లా రెండూ కలుసుకొని నీటిలోను, భూమి మీద జరిగే ముచ్చట్లను కథలు కథలుగా చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నాయి!  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

చిన్న సాయం

చిన్న సాయం   కంకణాలపల్లిని ఆనుకొని చాలా కొండలు ఉండేవి. రాము అనే పిల్లవాడు ఒకడు రోజూ సాయంత్రం బడి వదిలాక, ఊరి అవతల ఉన్న బండమీదికి వచ్చి కూర్చునేవాడు. చుట్టూ ఉన్న కొండల్ని, ప్రకృతిని చూసి సంతోషపడేవాడు. రెండు మూడు రోజులుగా అతనికి అక్కడ ఒక ఆవు, దూడ కనిపిస్తున్నాయి. రెండూ పడుకొనే ఉంటున్నాయి- పెద్దగా కదలట్లేదు, మెదలట్లేదు. బాగా సన్నగా ఉన్నాయి. రాముకి వాటిని చూస్తే జాలివేసింది. "అయ్యో! వీటికి మేత ఉన్నట్లు లేదు. ఎక్కడా గడ్డి కూడా లేదు. పాపం" అనిపించింది. దగ్గర్లోనే ఉన్న చెట్టు నొకదాన్ని ఎక్కి, కొన్ని కొన్నిగా ఆకులు తుంచి వాటికి అందించాడు. తరువాతి రోజున రాము వచ్చేసరికి ఆవు-దూడ రెండూ అక్కడే కూర్చొని ఉన్నాయి. ఆరోజున కూడా వాటికి ఆకులు తుంచివేశాడు రాము. అట్లా కొన్ని రోజులు గడిచే సరికి అవి కొంచెం తేరుకున్నాయి. అప్పుడు రాముకి ఒక ఆలోచన వచ్చింది. కొండపైన అంతా తిరిగి, దొరికినన్ని ఎండిన తాటి మట్టల్ని ఈడ్చుకొచ్చాడు. వాటిని ఒక్కటొక్కటిగా తీగలతో వ్రేలాడగట్టాడు చెట్టుకు. అలా రోజుకు కొన్ని చొప్పున తెచ్చి చిక్కగా కట్టి, అక్కడ ఒక నీడ కల్పించాడు. కొన్ని రోజులకు వాన పడింది. పోయి రాము తయారుచేసిన కప్పు కింద నిలబడ్డాయి ఆవు-దూడ. చూసి రాము అనందపడ్డాడు. మరి కొన్ని రోజులయ్యేసరికి ఆ చుట్టుప్రక్క-లంతా పచ్చి గడ్డి మొలిచింది. బలం పుంజుకున్న ఆవు-దూడ ఇప్పుడు తమంతట తాము పోయి పచ్చిగడ్డి మేస్తున్నాయి. "అరె..వాటికి మేత దొరికింది!" అని రాము ఎంతో సంతోషపడ్డాడు. ఇక ఆకులు తుంచలేదు. పైకి చెట్టుమీదకు చూశాడు. అక్కడ ఆకులు తుంచిన చోట మళ్ళీ ఇగురు వచ్చింది. అది చూసి ఇంకా సంతోషపడ్డాడు రాము.    - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

స్నేహం విలువ

స్నేహం విలువ   అనగనగా ఒక అడవిలో ఒక కాకి, పావురం ఉండేవి. పావురమేమో నీలంగా ఆకాశం రంగులో మెరుస్తూ ఉండేది. కాకి మటుకు నల్లగా, వికారంగా ఉండేది. కాకికి పావురం అంటే చాలా ఇష్టం. "మనిద్దరం స్నేహితులం- సరేనా?" అనేది చాలాసార్లు, పావురం దగ్గరికొచ్చి. పావురానికి మటుకు అదంటే చులకన. 'ఎట్లా ఉంటుందో చూడు- కర్రిగా' అనుకునేది. కాకితో మాట్లాడకుండా మొహం తిప్పుకునేది. అయితే ఒకరోజున దుష్ట నక్క ఒకటి ఆ అడవిలోకి వచ్చింది. ఆ నక్క చాలా చెడ్డది.   ఆ రోజున పావురం చెట్టు కొమ్మ పైన కూర్చొని కునికిపాట్లు పడుతున్నది. ఆ సమయంలో చాటుమాటున నక్కుకుంటూ నక్క దాని దగ్గరికి రాబోయింది. అంతలోనే దాన్ని చూసిన కాకి 'కావ్ కావ్'మని అరిచింది గట్టిగా. దాని అరుపుకి పావురం చటుక్కున కళ్ళు తెరిచి చూసింది. ఆ సరికి నక్క దానికి చాలా దగ్గరికి వచ్చేసింది కూడా! అయితే వెంటనే పావురం గాల్లోకి ఎగిరింది- నక్కబారినుండి తప్పించుకున్నది. అంత జరిగినాక కూడా అది కాకిని చిన్నచూపు చూడటం మానలేదు. 'నల్ల కాకి!' అని అసహ్యించుకుంటూనే ఉంది. మరునాటి రోజున కాకి పుట్టిన రోజు. ఆ రోజున అది తన తోటి పక్షులన్నిటినీ విందుకు పిల్చింది. అన్నీ వెళ్ళి వచ్చాయిగానీ, పావురం మటుకు వెళ్లలేదు. 'కర్రిదాని ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి?' అని ఊరికే ఉన్నది. అయితే ఆరోజు రాత్రికే దానికి జ్వరం మొదలైంది. తర్వాతి రోజున కాకి తనే దాన్ని పరామర్శించటానికి వచ్చింది. వస్తూ వస్తూ పావురానికి ఇష్టమని ఏవేవో వంటలు కూడా చేసి పట్టుకొచ్చింది. అయితే పావురానికి దాన్ని చూస్తే చికాకు వేసింది. "నీ ఆహారం నాకు అవసరం లేదు. నువ్వు దూరంగా ఉండు" అంది పావురం. ప్రేమగా పలకరించబోయిన కాకి దాని మాటలకు చిన్నబోయింది.    అయితే సరిగ్గా అదే సమయంలో మళ్ళీ పావురాన్ని పట్టుకునేందుకు నిశ్శబ్దంగా చెట్టు ఎక్కుతున్నది నక్క. చిన్నబోయి తల వంచుకున్న పావురపు చూపు నక్క మీద పడింది. "కావ్! కావ్! నక్క వచ్చేసింది! ఎగురు! పారిపో!" అని అది పావురాన్ని ఉద్దేశించి అరిచి, అది పైకి ఎగిరి పోయింది. ఇంకొక్క క్షణం ఆలస్యమైనా పావురం నక్క చేతికి చిక్కి ఉండేది! చటుక్కున తేరుకొని, అతి కష్టం మీద అది కాస్తా ఎగిరిపోయింది. అట్లా కాకి మంచితనాన్ని గుర్తించిన పావురం సిగ్గు పడింది. "నన్ను క్షమించు కాకమ్మా!నిన్ను అంతగా అవమానించాను" అన్నది. "కాకి నవ్వి, మనం మనం స్నేహితులం కదా, స్నేహితుల మధ్య క్షమాపణలుండవు" అన్నది.   "ఈ నక్క పని పట్టాలి ఎవరైనా. ఎన్ని పిట్టలను చంపుతోందో ఇది" అని బాధ పడింది పావురం. "ఎవరో రమ్మంటే రారు- మనమే ఏదో ఒకటి చేద్దాం" అని, కాకి దానికొక పథకం చెప్పింది. వెంటనే అవి రెండూ కలిసి నక్క కంట పడకుండా తాము ఉండే చెట్టు చుట్టూతా ముళ్ల కంపలు తెచ్చి పరచాయి. తర్వాతి రోజున నక్క వచ్చింది మళ్ళీ, చెట్టు పైకి చూసుకుంటూ. అది అట్లా చెట్టు దగ్గరికి రాగానే దానికోసమే చూస్తున్న కాకి వేగంగా ఎగురుకుంటూ వచ్చి దాని కన్నును ఒకదాన్ని పొడిచి పోయింది. నక్క కుయ్యో మొర్రో మంటూ, ఒక్క కన్నుతోటే కోపంగా చెట్టును ఎక్కబోయింది. అంతలోనే కాకి, పావురం మళ్ళీ ఓసారి దానిపైకి దాడి చేసాయి. రెండో కన్నునూ పొడిచేసాయి. దాంతో నక్క కాస్తా పట్టుజారి ముళ్ల కంపలో పడి, లేచి, తోచిన దిక్కుకు ఉరికింది. నక్క బెడద తప్పినందుకు కాకి, పావురం ఎంతో సంతోషించాయి. పావురానికి స్నేహం విలువ అర్థమైంది.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

పిల్లాడు-పిచ్చుక

పిల్లాడు-పిచ్చుక   నది ఒడ్డున చెట్టు మీద రెండు పిచ్చుకలు ఉండేవి. అవి మంచి స్నేహితులు. రెండూ కలిసి పుల్లలు తెచ్చుకున్నాయి; రెండూ కలిసి గూడు కట్టుకున్నాయి; చాలా కాలం కలిసి బ్రతికాయి. ఒకనాడు ఉదయాన్నే ఒక పిచ్చుక నిద్ర లేచింది. చుట్టూ చూసింది. వాతావరణం చాలా బాగా అనిపించింది. నదిలో ఉన్న పూలను, మొక్కలను చూస్తూ సంబరపడింది.   నీళ్ళలో తన నీడ చూసుకుందామని, క్రిందకు వంగింది. అంతే- పొరపాటున కాలు జారి నదిలో పడిపోయింది! నది బాగా వేగంగా పోతోంది; దానికి ఈత కూడా రాదు! దాంతో అది నదిలో కొట్టుకుపోయింది. కొంచెం సేపటికి రెండవ పిచ్చుక నిద్రలేచింది. మిత్రుని కోసం చూసింది. మిత్రుడు లేడు. 'ఎక్కడికి వెళ్ళాడబ్బా ఇంత పొద్దున్నే?' అనుకుంది. ఎంత సేపు వేచి చూసినా స్నేహితుడు తిరిగి రాలేదు. చివరికి అది ఆందోళన పడింది. చుట్టూ వెతికింది. తన ఫ్రెండ్‌ ఎక్కడా కనపడలేదు. అటూ ఇటూ ఎగిరి వెళ్ళి చూసింది. ఎక్కడా దొరకలేదు. బాధ పడుతూ ఒకచోట కూర్చుని ఏడుస్తున్నది.   అంతలో అటుగా వచ్చాడు రాము. వాడికి ఒక్క అవ్వ తప్ప వేరే ఎవ్వరూ లేరు. "ఎందుకు ఏడుస్తున్నావ్?" అని అడిగాడు దూరం నుండే. "నా ఫ్రెండ్ కనిపించట్లేదు" అన్నది పిచ్చుక. "నా ఫ్రెండూ కనిపించట్లేదు. నేను ఏడుస్తున్నానా?" అన్నాడు రాము- "ఇదిగో, ఈ కాసిని సెనగలు ఉన్నై నా దగ్గర- తిను" అని దానికి వేస్తూ. పిచ్చుక ఏమీ అనలేదు. సెనగలు తినలేదు. "ఏడవకు" అని దాన్ని నిమిరాడు రాము. "ఇకమీద నువ్వు-నేను ఒకరికొకరం స్నేహితులం సరేనా?" అన్నాడు. పిచ్చుకకు ఏడుపొచ్చింది. కానీ దానికి రాము తన స్నేహితుడు అని అర్థం అయింది. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

కోతి సమయస్ఫూర్తి

కోతి సమయస్ఫూర్తి     అనగనగా ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది. ఒకరోజున దానికి చాలా ఆకలి వేసింది. అట్లా ఆకలితో ఉన్న సింహం తనకు 'తగిన ఆహారం ఏం దొరుకుతుందా' అని అలోచిస్తూ అడవి అంతటా తిరిగింది. దూరంనుండే దాన్ని చూసిన జంతువులన్నీ వేటికవి దాక్కున్నాయి, దాని కంట పడలేదు. చివరికి మామిడి చెట్టు మీద ఉన్న కోతి ఒకటి కనిపించింది దానికి. 'వేరేవేమీ‌ కనిపించటం లేదు. ఈ పూటకి దీన్ని తిని కడుపునింపుకుందాం' అనుకున్నది సింహం. 'సరే, మరి నాకు చెట్టెక్కటం రాదు కదా, దాన్నే చెట్టు దిగేలా చెయ్యాలి' అని, అది ఒక ఉపాయం ఆలోచించింది. నేల వైపుకే నిశితంగా చూస్తూ, దేన్నో బాగా పరిశీలిస్తున్నట్లు ఒక్కో కాలునూ ఎంతో జాగ్రత్తగా ఎత్తి ఎత్తి వేస్తూ నడవటం మొదలు పెట్టింది. 'క్రింద ఎవరో‌ కదులుతున్నట్లున్నారే' అని చూసిన కోతికి అడుగులో అడుగు వేసుకుంటూ పోతున్న సింహం కనబడింది. 'ఇదేంటి, ఇట్లా నడుస్తోంది? క్రింద ఏం చూస్తోందసలు? కనీసం పైకి తలెత్తి కూడా చూడటం లేదేమిటి?' అని దానికేసే ఆశ్చర్యంగా చూడసాగింది కోతి.   కొంత సేపటికి సింహం కోతి తనను గమనిస్తున్నదని కనుక్కున్నది. 'ఇదే అవకాశం' అనుకొని అది ఒకసారి పైకి కోతి వైపుకు చూసి, చిరునవ్వు నవ్వి అన్నది- "మిత్రమా! నన్ను చూసి భయపడుతున్నావా? ఇప్పుడింక ఆ అవసరం లేదు. నేను ముసలిదాన్నయినాను. యౌవనంలో ఎన్నో జంతువులను చంపి తిన్నాను, చాలా పాపం మూటగట్టుకున్నాను. ఇప్పుడు నాకు హింస అంటేనే అసహ్యం వేస్తున్నది. అందుకని, నా పాప పరిహారం కోసం తీర్థయాత్రలకు బయలుదేరాను. నా వల్ల ఎవ్వరికీ హాని కలగకూడనని నాకుగా నేను ఈ నియమం పెట్టుకున్నాను- నా కాలి క్రింద పడి కీటకాలు కూడా చావరాదని, ఇలా చూసి చూసి నడవాలని నిశ్చయించుకున్నాను. కాశీ చాలా దూరంలోనే ఉంది- అయినా నా నియమాన్ని మటుకు తప్పేది లేదు" అన్నదది కోతితో. కోతి దాని మాటలు నమ్మింది. "ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంతటి మార్పు!" అనుకున్నది ముచ్చటగా. "ఇట్లాంటి భక్తులను కాకపోతే వేరే ఎవరిని దర్శించుకుంటాం?" అనుకొని, చెట్టు దిగి వచ్చి, సింహం ముందు నిలబడి, ఎంతో భక్తిగా నమస్కరించింది. అదే అదననుకున్న సింహం ఒక్కసారిగా దాని మీదికి దూకి, దాన్ని బోర్లా పడేసి, దాని పొట్టమీద కాలు మోపి నిలబడింది. క్రూరంగా నవ్వుతూ, కోర పళ్ళు చూపిస్తూ, నాలుకతో పెదాలను నాక్కుంటున్న సింహాన్ని చూడగానే కోతికి తను చేసిన తప్పు అర్థమైంది. 'క్రూరజంతువుల్ని ఏనాటికీ నమ్మకూడదు' అని వాళ్ళ అమ్మ ఎంత గట్టిగా చెప్పిందో గుర్తొచ్చి, దానికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అయితే అది తెలివైనది కదా, వెంటనే తమాయించుకున్నది. గట్టిగా, పడి పడి నవ్వటం మొదలెట్టింది. "ఇంకొద్ది సేపట్లో నీకు చావు తప్పదు. ఏడవటానికి బదులు ఎందుకు, నవ్వుతున్నావు?" అడిగింది సింహం అనుమానంగా. "పూర్వం నీలాంటి తెలివి తక్కువ సింహం ఒకటి ఇలాగే ఓ కోతిని చంపి తినాలనుకున్నదట" చెప్తూ చెప్తూ నవ్వ సాగింది కోతి. "అప్పుడు దాని పరిస్థితి ఎలా అయ్యిందో తలచుకుంటే నవ్వు ఆగట్లేదు. మరీ ఇంత ఇదిగానా?" అని మళ్ళీ మళ్ళీ నవ్వసాగింది కోతి.     "ఏమైందట, దానికి?" అడిగింది సింహం కరకుగా. "అబ్బ...ఉహ్హుహ్హుహ్హు.." అని మళ్ళీ పడి పడి నవ్వింది కోతి. నువ్వు నా పొట్ట మీద కాలు పెట్టి నొక్కుకుంటూంటే ఎట్లా చెప్పను- ఆయాసంగా ఉంది. కాలు కాస్త ప్రక్కకు తియ్" అంటూ సింహం కాలును పక్కకు నెట్టింది కోతి. అదేమిటో వినాలనే ఆత్రుతలో ఉన్న సింహం‌ కూడా అదాటున కాలును ప్రక్కకు జరిపింది. అంతే- కోతి ఒక్కసారి ఎగిరి గంతేసి చెట్టు మీదికి పారిపోయింది! పారిపోతూ పారిపోతూ "ఇప్పుడేం జరిగిందో అదే జరిగిందిలేమ్మా!" అని సింహాన్ని వెక్కిరించింది! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

తీరిన కష్టం

తీరిన కష్టం   ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకడి పేరు తరుణ్‌, మరొకడి పేరు బాలాజీ. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే బడిలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఆ సంవత్సరం వాళ్ల తరగతికి కొత్తగా రాజు అనే పిల్లవాడు వచ్చి చేరాడు. వాడొక గొప్ప 'యాక్టర్' అనచ్చు. వాడు వీళ్లతోటి ఒక మంచి స్నేహితుడిలాగా నటిస్తూనే, ఇద్దరి దగ్గరా దొంగతనాలు చేయసాగాడు.   అనుమానపడ్డ తరుణ్‌కు బాలాజీ మీద, బాలాజీకి తరుణ్ మీద చాడీలు చెప్పాడు. వాడు చెప్పింది నిజం అనుకొని, వాళ్ళిద్దరూ ఒకరికొకరు దూరమైనారు. కనీసం మాట్లాడుకోవటం‌ కూడా మానేసారు. అయితే ఒక రోజున రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తరుణ్‌కు అక్కడ బాలాజీ పుస్తకాలు, వస్తువులు కనిపించాయి. వేరేవాళ్ళు పోగొట్టుకున్న వస్తువులు కూడా కొన్ని కొన్ని కనిపించాయి. సరిగ్గా అదే సమయానికి బాలాజీకేమో తరుణ్ వస్తువులు కనబడ్డాయి! దాంతో బాలాజీ, తరుణ్‌ మళ్ళీ మంచి స్నేహితులైపోయారు.    ఇద్దరూ కలిసి రాజు గురించి హెడ్‌ మాస్టర్‌ గారికి చెప్పారు. హెడ్మాస్టరుగారు రాజు వాళ్ల అమ్మ-నాన్నలను పిలిపించి మాట్లాడారు. తన బండారం బయట పడ్డందుకు రాజు సిగ్గుతో తల వంచుకున్నాడు. అయితే 'ఇకమీద నేను మంచిగా ఉంటాను' అని రాజునుండి మాట తీసుకున్నారు హెడ్మాస్టరు గారు. వాడి పేరు బయట పడకుండానే బడిలో పిల్లలకందరికీ వాళ్ల వాళ్ల సామానులు తిరిగి ఇప్పించారు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అబద్ధాలు చెబితే...

అబద్ధాలు చెబితే...   నందపురంలో ఉండే గోపి, చందు, గౌరిలకు వాళ్ళ మామయ్య అంటే చాలా ఇష్టం. వచ్చినప్పుడల్లా కొత్త కొత్త కథలు చెప్తాడు మామయ్య. అంతేకాదు, వీళ్ళతో కలిసి రకరకాల ఆటలు ఆడతాడు. మామయ్య వచ్చాడంటే పిల్లలకు పండుగే. ఒకరోజు బాగా వర్షం పడుతోంది. సరిగ్గా అప్పుడే వచ్చాడు మామయ్య. బయట ఆడుకోవడానికి వీలులేక ఇంట్లో బోరుగా కూర్చున్న పిల్లలు మామయ్యని చూసి సంతోషం గా అరిచారు. మామయ్య వచ్చీ రావడంతోనే "ఆ! పిల్లలూ ఈరోజు ఒక కొత్త ఆట ఆడదాం" అన్నాడు.  "ఏం ఆట? " అన్నారు పిల్లలు మామయ్య చుట్టూ చేరి. "దాన్ని అబద్ధాలు చెప్పే ఆట" అందాం. మీలో ఎవరైతే పెద్ద అబద్ధం చెప్తారో వాళ్ళకి బహుమతి ఇస్తాను" అన్నాడు మామయ్య. మామయ్య మాటలకు పిల్లలు ఆశ్చర్యపోతూ "మా అమ్మ ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదని చెప్పింది. నువ్వేమో చెప్పమంటున్నావు" అన్నారు. "మీ అమ్మ అబద్ధాలు చెప్పొద్దంది కాని ఎందుకు చెప్పకూడదో చెప్పిందా?" అడిగాడు మామయ్య. "చెప్పలేదు" అన్నారు పిల్లలు మూతి ముడుచుకుని.   "అయితే మరి అబద్ధాలు ఎందుకు చెప్పకూడదో మీకే తెలుస్తుందిలే కాని, ముందు ఎవరెంత బాగా అబద్ధం చెప్పగలరో చూద్దాం- కానీండి" అన్నాడు మామయ్య నవ్వుతూ. "సరే! ఎలాంటి అబద్ధాలు చెప్పాలో మాకు తెలీదుగా, అందుకని ముందు నువ్వే మొదలు పెట్టు!" అన్నారు పిల్లలు. "సరే, అయితే వినండి: ఒక తోటలో ఓ కుంటోడు, ఓ గుడ్డోడు, ఒక మూగోడు నడుస్తూ ఉన్నారు.   గుడ్డోడు అన్నాడు: 'అదిగో చూడండి! అక్కడ తెల్ల కుందేలుంది. అబ్బ! ఎంత బాగుందో కదా! ' అని. 'అవును! అవును! కుందేలు చాలా బాగుంది. పట్టుకోండి-పట్టుకోండి' అన్నాడు మూగోడు. మరుక్షణం కుంటోడు వేగంగా పరిగెత్తి ఆ కుందేలుని పట్టుకున్నాడు. అప్పుడు మూగోడు అన్నాడు: 'దాన్ని పెట్టెలో పెట్టు. రేపు మనం దాని మీద ఎక్కి షికారుకి వెళ్దాం' అని! ఇంత మాత్రం‌చెప్పి ఆపాడు మామయ్య- "ఇంత మాత్రం చాల్లే.. దీని కంటే పెద్ద అబద్ధం ఎవరైనా చెప్పగలరా?" అన్నాడు కధ లోని అబద్ధాలకు నవ్వుకుంటున్న పిల్లలను చూస్తూ.   "నేను చెప్పగలను!" అని మొదలు పెట్టాడు గోపి. "ఒక రోజు నేను బడి నుండి వస్తుండగా చాలా పక్షులు -వీపు కిందికి, తల పైకి- పెట్టి ఎగురుతూ కనిపించాయి. నేను చూస్తూండగానే అవి అట్లా పైపైకి ఎగిరి ఎగిరి పోయినై. చివరికి ఆ రోజు రాత్రి చంద్రుడు వచ్చే సరికి అవన్నీ చంద్రుడిని చేరుకున్నాయి. పాపం‌ అంత దూరం ఎగిరి వెళ్ళే సరికి వాటికి కాస్తా చాలా ఆకలి అయ్యింది. అప్పుడు చంద్రుడు వాటికి తేనె పోశాడు. ఆ తేనె కారి నా మీద పడుతుంటే నేను ఏంచేశానో తెలుసుగా, నా స్కూలు పుస్తకంతో పట్టేసుకుని కడుపునిండా తాగాను!" ఆపాడు గోపి. "బలే చెప్పావు గోపీ -ఇప్పుడు చందూ, నువ్వు చెప్తావా?" అడిగాడు మామయ్య చందూని. చందూ మొదలు పెట్టాడు: "సరే వినండి - ఒక రోజున బాగా వర్షం కురిసింది. హఠాత్తుగా పైనుండి మా ఇంట్లోకి కూడా వర్షం పడటం మొదలు పెట్టింది! 'ఏంటబ్బా' అనుకొని బయటికి వెళ్ళి చూస్తే ఏముందనుకుంటున్నారు? మా ఇంటి పైన ఒక ఆవు నిల్చొని పెంకులు తినేస్తోంది! అప్పుడు మా నాన్న పైప్ ద్వారా ఆవుని కిందికి తెచ్చి, ఒక మూటలో కట్టి, సంతకి తీసుకెళ్ళి అమ్మేశాడు!" చెప్పాడు చందు. "భలే! నీ అబద్ధం కూడా నాకు నచ్చింది. ఇప్పుడు నీ వంతు, గౌరీ!" అన్నాడు మామయ్య నవ్వుతూ.   "అలాగే చెబుతాను- జాగ్రత్తగా వినండి మామయ్యా!" అంటూ గౌరి చెప్పడం మొదలు పెట్టింది. "ఒక రోజు నేను ఆకాశంలో ఎగురుతుండగా ఒక పేను కనిపించింది. దాన్ని పట్టుకుని నా తలలో వేసుకున్నాను. అప్పుడు అది నా జుట్టును నా కాళ్ళ వరకు వచ్చేట్లు చేసింది. ఒక్కొక్క వెంట్రుకను నాకుతూ నా జుట్టునంతా అది నల్లగా చేసేసింది. దాంతో‌నేను చాలా అందంగా తయారయ్యాను. అప్పుడు నా అందానికి మెచ్చి ఆకాశం నుండి దేవతలు ఒక తెల్ల ఏనుగుని పంపారు. దాని మీద ఎక్కి స్కూలుకు వెళ్ళాను" అంది గౌరి.   "మీరందరూ భలే అబద్ధాలు చెప్పారురా! మీకందరికీ‌ బహుమతులు ఇవ్వాల్సిందే!" అంటూ మామయ్య మూడు పటిక బెల్లం ముక్కలు తీసి ఒక్కొక్కరికి ఒక్కొకటి ఇస్తూ "వీటిని వదలకుండా తిన్నవాళ్ళకి అదనంగా ఒక బొమ్మ ఇస్తాను!" అన్నాడు. పిల్లలు ఆత్రంగా ముక్కలను నోట్లో పెట్టుకున్నారు. వెంటనే "ఛీ! ఇది పటిక బెల్లం కాదు" అంటూ ఊసేశారు. "ఇదేంటి మామయ్యా! పటిక బెల్లం ఇలా ఉంది? " అన్నారు. అప్పుడు మామయ్య "అది పటిక. పటిక బెల్లం కాదు. అబద్ఢాలు చెబితే దొరికేది పటిక బెల్లంలా కనిపించే చేదు పటికే. నిజాలు చెబితేనే తియ్యని పటిక బెల్లం దొరికేది." అన్నాడు. "మాకు పటిక బెల్లమే కావాలి మామయ్యా. అబద్ధాలు చెప్పంలే!" నవ్వారు పిల్లలు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో