నేను కొనబోయే ఆవు కథ

నేను కొనబోయే ఆవు కథ   ఏ.కే.రామానుజన్, నారాయణ పేరొందిన హాస్య కళా మూర్తి గోపాల్ భాండ్ బెంగాల్ రాష్ట్రంలో నివసిస్తున్న రోజుల్లో, ఆయన ఇంటి ప్రక్కనే పేద దంపతులు ఇద్దరు నివసించేవాళ్ళు. ఆ భార్యాభర్తలిద్దరికీ, పాపం, పగటి కలలు కనే అలవాటు ఉండేది. ఒక రోజున గోపాల్ భాండ్ వింటుండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళను మించి మరొకళ్ళు కోతలు కోస్తూ పగటి కలలు కనటం మొదలు పెట్టారు. భర్త అన్నాడు: " నాకు కొంచెం డబ్బు సమకూరిందంటే, నేనొక ఆవును కొంటాను" అని. భార్య శృతి కలిపింది- "అప్పుడు నేను పాలు పిండుతాను. మనకు చాలా కుండలు అవసరమౌతాయి మరి. నేను వెళ్ళి, కొన్ని కుండలు కొనుక్కురావాలి" అని. మర్నాడు నిజంగానే భార్య సంతకు వెళ్లి కుండలు కొనుక్కొచ్చింది. భర్త ఆమెను అడిగాడు: " ఏం కొనుక్కొచ్చావు?" అని. "ఏముంది? కుండలు! ఒకటి పాలకు, ఒకటి మజ్జిగకు, ఒకటి వెన్నకు, ఒకటి నెయ్యికి!" అన్నది భార్య. "బాగుంది, బాగుంది. మరి ఇంక ఆ ఐదో కుండ దేనికి?‌" అడిగాడు భర్త. "మిగులు పాలు కొన్నిటిని మా చెల్లెలికి ఇవ్వటం కోసం ఈ ఐదో కుండ!‌" అన్నది భార్య. "ఏంటీ!? మిగులు పాలు మీ చెల్లెలికి ఇస్తావా?! ఎంతకాలంగా చేస్తున్నావు, ఈ పని? నాకు కనీసం చెప్పకుండా, నా అనుమతి లేకుండా, ఇంత నాటకం ఆడుతున్నావా?" అని భర్త అరుస్తూ, కోపం పట్టలేక కుండల్ని విసిరేసి, అన్నింటినీ పగలగొట్టేశాడు. ఇక భార్య తిరగబడింది- " ఆవు ఆలనా, పాలనా చూసేది నేను! పాలు పిండేది నేను! మిగులు పాలతో‌నాకేది ఇష్టమైతే అది చేస్తాను!" అని. "దుర్మార్గురాలా! నేను రాత్రింబవళ్ళూ చెమటోడ్చి పనిచేసి, డబ్బులు కూడబెట్టి, ఆవును కొంటే, ఆ పాలను నువ్వు తీసుకెళ్లి నీ చెల్లెలికి పోసేస్తావా? ముందు నిన్నేం చేస్తానో చూడు" అని గర్జిస్తూ, భర్త తన చేతికందిన మూకుళ్లనూ, గిన్నెల్నీ భార్య మీదికి విసిరేశాడు. ఇంట్లోంచి వింటున్న గోపాల్ భాండ్ కి చాలనిపించింది. అతను పక్కింటికెళ్ళి అడిగాడు అమాయకంగా- "ఏమైంది? వంట సామాన్లన్నీ ఎందుకు విసిరేస్తున్నారు?" అని. " మా ఆవు పాలన్నీ తీసుకెళ్ళి, ఈమె తన చెల్లెలికి పోసేస్తోంది!" అన్నాడు భర్త. "మీ ఆవా?!" అడిగాడు గోపాల్ భాండ్. "అవును. తగినంత డబ్బు సంపాదించి కూడబెట్టాక నేను కొనబోతున్న ఆవు!" "ఓహో, ఆ ఆవా? మీకు ఈరోజున ఇంకా ఆవు లేదు, కదూ?" అడిగాడు గోపాల్. భర్త అన్నాడు- " చూస్తూండు. ఎప్పటినుండో అనుకుంటున్నాను. నేనొకదాన్ని తెస్తున్నాను త్వరలో" అని. "ఓహో ఇప్పుడు అర్థమైంది, నా కూరగాయల తోట ఎప్పుడూ నాశనం ఎందుకౌతున్నదో!" అని గోపాల్ అకస్మాత్తుగా ఓ చింత బరికె చేతపుచ్చుకొని అతని మీదికి ఉరికాడు. "ఆగు..ఆగు... నన్నెందుకు కొడుతున్నావు?" అని అడుగుతూనే తప్పించుకునేందుకు గంతులు వేయటం మొదలుపెట్టాడు పక్కింటాయన. "నీ ఆవు! నీ ఆవు మా తోటలోకి జొరబడి, నా చిక్కుళ్ళనీ, దోసపాదుల్నీ ఇష్టం వచ్చినట్లు నమిలేస్తోంది. నువ్వు దాన్ని అట్లా వదిలేశావు!" అని చిందులేశాడు గోపాల్. "ఏ చిక్కుళ్ళూ, ఏ దోస పాదులు? నీ కూరగాయల తోట ఎక్కడుంది అసలు?" "నేను నాటబోతున్న చిక్కుళ్ళూ, నేను పెట్టబోతున్న దోసపాదులు! నేను పెంచబోతున్న కూరగాయల తోట! నేను ఎంతో కాలంగా దాన్ని గురించి ఆలోచిస్తుంటే, మీ ఆవు ఎప్పటికప్పుడు నాశనం చేస్తోంది దాన్ని!" అన్నాడు గోపాల్ ఊపిరి బిగబట్టి. పొరుగింటివాళ్లకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నై. కలలన్నీ విరిగి, ఆకాశం నుండి నేలకు దిగి వచ్చారు. ఆపైన కొద్ది సేపటికి అందరూ కలిసి నవ్వుకున్నారు.   కొత్తపల్లి.ఇన్  వారి సౌజన్యంతో

నేనే రాజవుత

నేనే రాజవుత - నారాయణ     ఒకసారి కుందేలుకు ఒక కోరిక పుట్టింది - తను అడవికి రాజునైతే బాగుండుననిపించింది. ‘ఎప్పుడూ సింహమే రాజు ఎందుకు అవ్వాలి? రాజవ్వటం అనేది వంశపారంపర్యం కాకూడదు. సింహమూ, దాని కొడుకూ, మళ్ళీ దాని కొడుకూ - ఇదే క్రమం అయితే మిగతా జంతువులకు అవకాశం రాదు గద!’ కొన్ని రోజులపాటు ఆలోచించిన పిమ్మట అది ఇక ఊరుకోలేకపోయింది. సింహంగారి దర్బారుకి వెళ్ళి అడిగేసింది - "సింహంగారూ! అడవికి మీరే ఎప్పుడూ రాజవ్వటం బాగాలేదు. మేమూ ఉన్నాం జంతువులం. మాకూ అవకాశం ఇవ్వండి." అని. సభికులంతా నివ్వెరపోయారు. సభంతా నిశ్శబ్దంగా వణికిపోయింది. సింహం ఇక కుందేలును రాజద్రోహ నేరంకింద శిక్షించి తీరుతుందని అందరూ ఊపిరి బిగపట్టారు. అయితే సింహం చిరునవ్వు నవ్వింది. "అవును మిత్రమా, మరిచాను. ప్రజాస్వామ్య భావజాలం పరుచుకున్న ఈ రోజుల్లో మేం ఇంకా ఇలా రాజసింహాసనాన్ని అంటిపెట్టుకు కూర్చోవడం బాగాలేదు. నీకే ఇస్తున్నా మొదటి అవకాశం. ఈ క్షణం నుండీ ఈ అడవి మొత్తానికీ సర్వం సహా చక్రవర్తివి నీవే. నేను నీకు వెన్నుదన్నుగా రాజ్యరక్షణ భారం వహిస్తాను." "అదికూడా అవసరం లేదు మిత్రమా! అన్నది కుందేలు రాజోచితంగా." రాజ్య రక్షణ ఇకపై మా బాధ్యత. మీరు అంత:పురంలో విశ్రాంతి తీసుకోండి, లేదా వనాంతాలకు వెళ్ళి తపస్సు చేసుకోండి." సభలోని వారికి ఎవరికీ నోటమాట రాలేదు. సింహం గద్దె దిగుతూ" ప్రజలారా! ప్రజాస్వామ్య భావనలను గౌరవిస్తూ మేం రాజపదవి నుండి తప్పుకొని, కుందేలుకు తొలి అవకాశం ఇచ్చాం. మీరంతా రాజౌన్నత్యాన్ని గౌరవిస్తూ మీ కొత్త రాజు పట్ల విదేయులుగా వర్తిస్తారనీ, వనశాంతిని సంరక్షించడంలో మీ బాధ్యతల్ని గుర్తించి మసులుకుంటారనీ ఆశిస్తున్నాను" అని ముగించి నిష్క్రమించింది. అందరూ కుందేలు మహారాజుకు జయం పలికారు. కానీ ఎవరికివారు నోళ్లు నొక్కుకున్నారు. ముఖ్యంగా పులి సేనాపతీ, గుంటనక్క మంత్రీ నోరు మెదపలేదు. వాళ్ళిద్దరూ చాలా రోజులుగా రాజ్యాన్ని కబళించే యోచనలోనే ఉన్నారు. ఇప్పుడు సింహమే తమ మార్గాన్ని సుగమం చేసింది! కుందేలు పని ముగించటం ఎంతసేపు? ఇలా సాగుతున్నాయి వాటి ఆలోచనలు. ఆ రోజు రాత్రి కుందేలుకు నిద్రపట్టలేదు. ప్రపంచం అంతా కొత్తగా అనిపిస్తోంది. తను తీసుకురావాల్సిన మార్పులు ఏమున్నాయని ఆలోచిస్తుండగానే తెల్లవారింది. అంతలోనే అంత:పురం గగ్గోలెత్తింది. పులి సేనానీ, గుంటనక్క మంత్రీ తిరుగుబాటు చేశారు. తమ బలాలతో కోటను పూర్తిగా ముట్టడించారు. కుందేలు మహా రాజు అత్యవసర సమావేశం నిర్వహించింది. పులికీ, నక్కకూ తానే స్వయంగా బుద్ధి చెబుతానన్నది. జన నష్టం తనకు ఇష్టంలేదు కనుక , ఒక్క ఏనుగుపైనెక్కి తాను తన ప్రతాపం చూపిస్తానన్నది. ఏనుగు పూర్తిగా తయారై, రాజుగారిని అంబారీమీద ఎక్కించుకొని, కోట తలుపులు తెరిచి, ముందుకు ఉరికింది. ఎదురుగా పులీ, నక్కా తమ సైన్యాలను మోహరించి నిలబడి ఉన్నాయి. ఏనుగు వాటికి ఎదురుగా నిలబడి, కుందేలు మహారాజు వేస్తానన్న శరపరంపరలకోసం ఎదురుచూస్తున్నది. కానీ ఆశ్చర్యం! ఒక్క బాణమూ రాలేదు! ఏనుగు తొండంతో తన వీపును తడుముకొని చూసింది. అక్కడ కుందేలు మహారాజు లేడు. శత్రుమూకల శబ్దానికి వెరచి ఏనాడో పలాయన మంత్రం పఠించారు వారు! బిక్కచచ్చిపోయిన ఏనుగు ప్రళయకాల ఘర్జనలా వినవచ్చిన సింహనాదంతో అకస్మాత్తుగా మేలుకున్నది. తన పక్కనే నిలబడి సింహం భీకరంగా గర్జిస్తున్నది. శత్రుసైన్య సమూహం ఆ గర్జనకు కకావికలై దారీతెన్నూ తెలీకుండా పరుగులు పెడుతున్నది! సింహం వారిని తరిమి, అందినవారిని అందినట్లు విసిరేస్తున్నది. పులి సేనానీ, గుంటనక్క మంత్రీ ఇక ఎవ్వరికీ కనిపించలేదు. కుందేలు కూడానూ! తిరిగి అడవిని సింహమే పరిపాలించవలసి వచ్చింది. అసమర్థులైన రాజులు రాజ్యానికి వన్నె తేలేరని అందరికీ మరోసారి తెలిసివచ్చింది.                                  కొత్తపల్లి వారి సౌజన్యంతో

ఎవరు గొప్ప

ఎవరు గొప్ప   పూర్వం తూర్పుదేశంలో చెంబన్న, పడమటి దేశంలో మంబన్న అనే ఇద్దరు బలశాలులు ఉండేవారు. వారి బలాబలాలను గూర్చి చుట్టుపక్కలవాళ్ళు బహుగొప్పగా చెప్పుకొనేవారు. చెంబన్న,మంబన్నలు ఒకరినిగూర్చి మరొకరు విన్నారేకాని, వారు ఒకరినొకరు ఎన్నడూ చూసుకోలేదు. ఒక రోజు చెంబన్న, మంబన్నను చూడడానికి బయలుదేరాడు. ప్రయాణానికన్నీ సిద్దంచెయ్యమన్నాడు భార్యను. చెప్పిందే తడవుగా చెంబన్న భార్య ఊరిలోని అమ్మలక్కలను అందరినీ అడిగి , పాత చీరలన్నీపోగుచేసి, ఒక బొంతగా కుట్టి, అందరి సాయంతో వంట చేసి, వరిబువ్వా, ముద్ద పప్పు, ఊరగాయ, నెయ్యీ వేసి బొంతనిండా సద్దిని కట్టించింది. ఆ సద్ది మూటను ఒక ఏనుగుమీదుంచి భర్తను సాగనంపింది. చెంబన్న, ప్రయాణం చేసీ, చేసీ మాపటేళకు ఒక చోట ఆగి, సద్దిమూటను విప్పిభోజనం తిన్నాడు. భోంచేశాక బొంతను ఒక పెద్ద చింతమాను మీద ఆరేసి, మళ్ళీ తిరుగుప్రయాణంలో తీసుకోవచ్చునులే అనుకొని ప్రయాణాన్ని కొనసాగించాడు. సాయంత్రానికి మంబన్న ఊరిని చేరుకొని మంబన్న గురించి ఆరాతీయసాగాడు. కట్ట మీద కూర్చున్న ఒక ముసలి తాతను మంబన్న ఇల్లు ఎక్కడుంటుందని అడిగాడు. అదిగో ! అక్కడ బిందెలో నీళ్ళు తెస్తోందే, ఆమే మంబన్న భార్య అని తాత చెప్పాడు. అపుడు చెంబన్న, మంబన్న భార్యతో మాట్లాడి తాను, మంబన్నను చూడాలనీ, అతనితో మాట్లాడాలనీ చెప్పాడు. సరే అని చెంబన్నను, మంబన్న భార్య వాళ్ళ ఇంటికి తీసుకపోయింది. "అన్నా! ఇప్పుడే వస్తాను, అలా ఆ మంచం వాల్చుకొని కూర్చో"మని చెప్పి లోపలికి వెళ్ళింది. చెంబన్నకు అది అవమానంగా అనిపించింది. అయినా తప్పదుగదా. "ఒక ఊరి రెడ్డి మరోఊరి పాలేగాడు" , అనుకొని మంచం వాల్చబోయాడు. మంచం వంగలేదు. కొంచెం గట్టిగా ప్రయత్నించాడు. మంచం కదలనేలేదు. బలమంతా ఉపయోగించి చూసాడు. కానీ మంచాన్నిమాత్రం కదపలేకపోయాడు. ఇక మంచాన్ని చూస్తూ ఆశ్యర్యపోవడం చెంబన్న వంతయింది. ఇంతలో మంబన్న భార్య వచ్చి, కూర్చోమంటే అలా నిలబడ్డావేందన్నా? అంటూ వచ్చి తన చిటికెన వేలితో మంచాన్ని వాల్చింది. చెంబన్న ఆశ్యర్యంతో, "మంబన్న భార్యనే ఇంత బలవంతురాలే ! ఇక మంబన్న ఎంత బలవంతుడయి ఉంటాడో?" అనుకున్నాడు. ఇంతలో మంబన్న భార్య వచ్చి, "ఆయన ఉదయం వస్తారు, మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండండని, ఒక చాపా, రగ్గూ ఇచ్చి, ’ఇక్కడ పడుకొమ్”ని బయట ఒక అరుగును చూపించింది. అరుగు మీద పడుకున్న చెంబన్నకు, నిద్ర పట్టలేదు. "అమ్మో! ఉదయం వరకూ నేను ఇక్కడే ఉంటే మంబన్న చేతిలో నాకు పరాజయం తప్పదు" అనుకొని తెలవారకనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా ఆయన వెళ్ళిన కొంతసేపటికే మంబన్న ఇంటికి వచ్చాడు. చెంబన్న వచ్చివెళ్ళిన విషయాన్ని భర్తతో చెప్పింది మంబన్న భార్య. అవునా ! అయ్యో ! నేను ఎంతకాలంనుండీ ఆయనను కలవాలనుకుంటున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆయనను కలుసుకొంటానని బయలుదేరాడు. చెట్టుపైకెక్కి, బొంతను విప్పుకొంటున్న చెంబన్నకు, గుర్రంపైవస్తున్న మంబన్న కనిపించాడు. అతనే కాబోలు మంబన్న! నన్ను ఓడించడానికే వస్తున్నట్టున్నాడు. ఆలస్యం చేస్తే నాకే ప్రమాదం అనుకొని త్వరగా చెట్టును దిగి, దాన్ని వేర్లతోసహా, పెకిలించేసుకొని, తన ఏనుగెక్కి ముందుకు పోయాడు. ఇది చూసిన మంబన్న, చెంబన్న తన మీదకు యుద్దానికి వస్తున్నాడేమోననుకొని, తనూ ఒక తాటి చెట్టును పెకలించుకొని దాన్ని భుజాన పెట్టుకొని, తన గుర్రాన్ని, దౌడుతీయించాడు. కొంత సేపటికి వారిద్దరూ, కలుసుకొని తమలో ఎవరు గొప్పో తేల్చుకోవాలనుకొన్నారు. గెలుపును నిర్ణయించే మధ్యవర్తి కోసం ఎదురుచూశారు. ఇంతలో అంబలి కుండను నెత్తిమీద పెట్టుకొనివస్తున్న సీతాలు వారికి కనిపించింది. ఇద్దరూ అమె దగ్గరకు పోయి "అమ్మా ! మేమిద్దరం యుద్దం చేస్తాము. మాలో ఎవరు గొప్పో నువ్వు తేల్చాలి" అని అడిగారు. అందుకు సీతాలు "అమ్మో! నిన్ననే నా మొగుడు సద్ది ఆలస్యమైందని మక్కిలు విరగదన్నాడు. ఇక ఈ రోజూ ఆలస్యమయితే, అంతే సంగతి. అంతగా కావాలంటే, మీరిద్దరూ నాభుజాలమీదకెక్కి పోట్లాడండి. నేను వెళుతుంటాన"ని చెప్పింది. ’ఈ ఉపాయం బాగానే ఉం”నుకొని, వారిద్దరూ సీతాలు భుజాలమీద కూర్చొని యుద్ధం చేయసాగారు. ఆంత దూరంలో వస్తున్న సీతాలును చూసిన గొర్రెలు కాసే తన భర్త, అయ్యో ! నిన్న నేను తనను కొట్టినందుకు కాబోలు ఇవాళ నన్ను కొట్టించడానికి ఎవరో బలవంతులను తీసుకవస్తున్నది నా భార్య! వాళ్ళకు దొరికితే నన్నెక్కడ బ్రతకనిస్తారు ? బ్రతికుంటే బలుసాకులు తినవచ్చు’ననుకొని, తన కంబళిని పరిచి, గొర్రెలనన్నింటినీ అందులొ మూటగట్టుకొని,ఆ మూటను తన నెత్తిన పెట్టుకొని పరిగెత్తసాగాడు. అలా పరుగెత్తి పోతున్న అతన్ని, పైనుండి ఓ గ్రద్ద చూసి "ఇదేదో పెద్ద మాంసపు ముద్దలాగా ఉన్నదే" అనుకొని కిందికొచ్చి వాడిగల తన కాలిగోళ్ళతో అతన్నీ, గొర్రెల మూటనూ ఒక్క తన్నుతో తన్నుకపోయింది. అలా పోతూండగా ఏడంతస్తుల మేడలో తల ఆర్పుకుంటున్న యువ రాణి ఒకసారి ఆకాశంలోకి చూసింది. అంతలోనే గ్రద్ద తన్నుకుపోతున్న గొర్రెల మూటవచ్చి రాణి కంట్లో పడింది. రాణి సుతారంగా తన కంటిరెప్పను ఒక్కసారి రుద్దింది. వెంటనే గొర్రెల మూట కరిగిపోయింది. కథనంతా విన్నారు కదా ! మరి మీరే చెప్పండి వీరిలో ఎవరు గొప్పో.?? - గంగమ్మ కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

కన్నీళ్ల ఉల్లిగడ్డ

కన్నీళ్ల ఉల్లిగడ్డ     అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక టమోట, ఒక ఉల్లిగడ్డ, ఒక మిరపకాయ, ఒక ఐస్ క్రీం ఉండేవారు. వారంతా ప్రాణ స్నేహితులు. ఒకసారి వారంతా కలసి ఒక జాతరకు బయలుదేరారు. వారంతా దారిలో పోతుండగా, ఒక సైకిల్ ఆయప్ప వచ్చి, టమోట కాయ మీదుగా సైకిల్ని పోనిచ్చాడు. తక్కిన ముగ్గురూ జరిగినదానికి చాలా బాధపడ్డారు, కానీ ’జరిగిందేదో జరిగింది’ అని ముందుకు సాగారు. ఒక చెరువు దగ్గరికి పోయి అందులో స్నానం చేద్దామని అందరూ కలసి అందులోకి దిగారు. చెరువు స్నానానికి వచ్చిన పిల్లవాడొకడు ఐస్ క్రీం ని చూడగానే దాని మీదికి దూకి చప్పరించేశాడు. తక్కిన రెండింటికీ చాలా బాధ కలిగింది. ఇక ఆ రెండే ముందుకు సాగాయి. ఇంతలో బజ్జీలకోసమని మిరపకాయలు తీసుకపోతున్న పిల్లవాడొకడు దారిన పోయే మిరపకాయను చూసి దాన్ని తన సంచిలోకి వేసుకున్నాడు. ఇక ఉల్లిగడ్డ మాత్రమే మిగిలిపోయింది. ’మిత్రులు లేని ఈ జీవితం నాకెందుకు?’ అని అది చాలా బాధపడుతూ, జాతరను చేరి, గుడిలోకి వెళ్ళింది. ’ఏమి దేవుడా! నా మిత్రులందరినీ నాకు లేకుండా చేశారు ఈ మనుషులు? నాకు వారి మీద చాలా పెద్ద ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది. అలాంటి వరాన్ని నాకివ్వు’ అని దేవుడిని వేడుకుంది. అంతలోనే దేవుడు ఎర్రగడ్డకు కనిపించాడు. ’సరే ! నీకోరిక తీరుస్తున్నాను. ఇకమీదట నిన్ను ఎప్పుడైనా మనుషులు కోయగానే వాళ్ళ కళ్ళవెంబడి నీళ్ళు కారుగాక!’ అని వరమిచ్చాడు. అందుకే, ఉల్లిపాయ తరిగేప్పుడు మనకు కళ్ళళ్ళో నీరుకారేది! ప్రవల్లిక కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అవ్వ-కోయిల

అవ్వ-కోయిల     - C రాజు ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఒక కోయిల ఉండేది. అవ్వ కోయిలను చాలా బాగా చూసుకొనేది. ఒక రోజు అవ్వకు జ్వరం వచ్చింది. అపుడు కోయిలకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడది చాలా ఆత్రంగా తన మిత్రుడయిన కుందేలు దగ్గరికి వెళ్ళింది. కుందేలును కలిసింది. అప్పుడు, కుందేలు వచ్చిన మిత్రుడిని ఆప్యాయంగా పలకరించి, కోయిల రాకకుగల కారణాన్ని అడిగింది. అవ్వకు జ్వరంగా ఉన్న సంగతి చెప్పింది కోయిల. ’అవునా ! అరె ! పద..పద..పోదా’మని కుందేలూ, కోయిలా అవ్వదగ్గరికి వెళ్ళాయి. అవ్వను చూశాక కుందేలు, ’మిత్రమా ! నువ్వేమీ భయపడకు. ఈ జ్వరం ఇవ్వాళ కాకపోతే, రేపు పోతుందిలే! మరి నేను వెళ్ళి రేపు మళ్ళీ వస్తా’నని చెప్పి, వెళ్ళిపోయింది. మరునాడు అది మళ్ళీ వచ్చింది; కానీ అవ్వకు జ్వరం తగ్గలేదు. కుందేలు ఆలోచించి, అవ్వకు తన మిత్రుడయిన ఆవు ఇచ్చే పాలను ఇస్తే, జ్వరం నయమవుతుందేమోనని, ఆవు దగ్గరికి వెళ్ళి, తన సహాయాన్ని అడిగింది. ఆవు, సంతోషంగా ఒప్పుకొని, కుందేలుతోపాటుగా అవ్వవాళ్ళ ఇంటికి వెళ్ళింది. కుందేలు పాలు పితికి, వాటిని కాంచి అవ్వకు ఇచ్చింది. అవ్వ పాలను తాగింది. మర్నాడు అవ్వకు జ్వరం బాగయింది. అందరూ చాలా సంతోషించారు. కలసిమెలసి ఆనందంగా జీవించారు.   కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

పరుగో పరుగు

పరుగో పరుగు - సంద్య   ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఒక సారి టెంకాయ చెట్టు కింద నిద్ర పోతూ ఉన్నది. అంతలోనే చెట్టుపైనుండి ఒక టెంకాయ తెగి ’దబ్బు’మని క్రింద పడింది. పడితే, కుందేలు ఉలిక్కిపడి లేచింది. చుట్టూ చూడగా ఏమీ కనబడలేదు. "ఏందోలే’ అని అట్లాగే మళ్లీ పడుకున్నది. కొంచెం సేపు అయ్యిందో లేదో మళ్లీ ’దబ్బు’ మని శబ్దం వచ్చింది. కుందేలు కళ్లు తెరిచి చుట్టూ వెతికింది. పైన ఆకాశం నీలంగా కనబడుతున్నది. ’అమ్మో ఆకాశం విరిగి మీద పడుతున్నది’ అనుకున్నది కుందేలు. మరుక్షణంలో అది పరుగుతీయటం మొదలు పెట్టింది. అంతలో దానికి ఓ జింక ఎదురయ్యింది. ’ఆగాగు! ఎందుకు పరుగెత్తుతున్నావు, కుందేలూ’ అని అడిగింది అది. ’అయ్యో, ఆకాశం విరిగిపడుతోంది, నువ్వూ పరుగెత్తు’ అని ఉరుకెత్తింది కుందేలు. జింక దాని వెనకనే పరుగు పెట్టింది. అలా ఉరుకుతున్న కుందేలు, జింకలకు పులి ఎదురైంది. పులి అడిగింది ’జింకా, కుందేలూ ఎందుకు పరుగెడుతున్నారు?’ అని. ’అయ్యో, ఆకాశం విరిగిమీద పడుతోంది, నువ్వూ పరుగెత్తు’ అన్నై జింకా, కుందేలూ. పులి కూడా వాటితో పాటు కలిసి పరిగెత్తటం మొదలు పెట్టింది. అంతలో వాటికి ఓ ఏనుగు ఎదురయ్యింది. "ఏమర్రా, ఆగండి ఆగండి. ఎందుకు పరుగెత్తుతున్నారు?’ అంటే అవి ’ఆకాశం విరిగిపడుతోంది నువ్వూ పరుగెత్తు పరుగెత్తు త్వరగా’ అని అవన్నీ ఉరుకెత్తాయి అటూ ఇటూ చూడకుండా. ఇక ఏనుగుకూ వాటి వెనక పరుగెత్తక తప్పలేదు. ఇలా ఇవన్నీ పరుగెత్తుతుంటే వాటికి ఓ సింహం ఎదురైంది. వాటిని ’ఎందుకు పరుగెత్తుతున్నారు? ఏమైంది?’ అని అడిగింది. ఏనుగు చెప్పింది రొప్పుతూ- ’ఆకాశం విరిగిపడుతున్నది. అందుకే పరుగెత్తుతున్నాం’ అని. కానీ సింహానికి ఇది విచిత్రంగా తోచింది. ’ఆకాశం విరిగిపడితే నువ్వు చూశావా?’ అని అది ఏనుగును అడిగింది. ’నేను చూడలేదు. నాకు పులి చెప్పింది’ అని అంది ఏనుగు. ’ఏం పులీ, ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూశావా?’ అని సింహం పులిని నిలబెట్టి అడిగింది. ’లేదు, నాకు జింక చెప్పింది’ అన్నది పులి. అప్పుడు సింహం జింకను నిలదీసింది: ’ఆకాశం విరిగిపడితే నువ్వు చూశావా?’ అని. ’లేదు, నాకు కుందేలు చెప్పింది’ అంది జింక. ’సరే’ అని సింహం కుందేలును అడిగింది. ’నేను టెంకాయ మానుకింద నిద్రపోతున్నప్పుడు దబ్బుమని శబ్దం వినిపించింది. ఆకాశం విరిగిపడింది’ అంది కుందేలు. ’ఆ టెంకాయ చెట్టు కిందకు వెళ్లి చూద్దాం అంది సింహం. అన్నీ కలిసి టెంకాయ చెట్టుకిందికి వెళ్లి చూశాయి. అక్కడ నేలమీద ఒక పెద్ద టెంకాయ కనిపించింది. అంతలో దబ్బుమని మళ్ళీ ఒక టెంకాయ పడింది. వెంటనే కుందేలు ’అదిగో, ఆకాశం విరిగిపడుతోంది, పరుగెత్తండి!’ అంది. సింహం అప్పుడు వెళ్ళి క్రిందపడిన టెంకాయను చూపిస్తూ ’ఇదేనా, నీ ఆకాశపు ముక్క?’ అని అడిగింది. కుందేలుకు సంగతి అర్థమై సిగ్గుపడింది. మిగిలిన జంతువులన్నీ నవ్వాయి.  

రాజు మంగలి

రాజు మంగలి   అనగననగా ఒక రాజు ఉండేవాడు. ఆరాజుకు గడ్డం పెరిగిపోయింది. గడ్డం తీయించుకోవాలనుకున్నాడు. సేవకులను పిలిచి మంగలిని పిలుచుకొని రమ్మని చెప్పినాడు. సేవకులు మంగలిని పిలుచుకు రావడానికి పోయి చాలా సేపటికి కూడా రాలేదు. రాజు కూర్చున్న చోటే నిద్రపోయినాడు. మంగలి నిద్రపోతున్న రాజును లేపితే ఏమంటాడో, ఏమి శిక్ష విధిస్తాడో అని భయపడి రాజుకు మెలుకువ రాకుండా గడ్డం తీసేసినాడు. గడ్డం తీయడానికి కావలసిన నీళ్లను వెండి గిన్నెలో ఇచ్చినారు సేవకులు. గడ్డం తీసేటపుడు ఆ మంగలికి ఒక దుర్బుద్ధి పుట్టింది. అది ఏమంటే, వెండి గిన్నె తీసుకు పోదామని . గడ్డం తీసేలోపు పూర్తిగా నిర్ణయించుకొని, వెండి గిన్నెను సంచిలో పెట్టుకొని మంగలి వెళ్ళి పోయినాడు. ఇంటికి పోయిన తరువాత మంగలికి భయం వేసింది. ’వెండి గిన్నెను నేనే తీసుకున్నానని రాజుకు తెలిసి ఉంటుందేమో , ఉరి శిక్ష వేస్తాడేమో’ అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. మంగలికి ఈ ఆలోచనలతో ఊర్లో ఉండాలనిపించలేదు. అడవిలోకి పోయినాడు. పగలంతా అడవిలో ఉండి , రోజూ రాత్రికి ఊళ్ళోకి వచ్చేస్తున్నాడు . అడవిలోఉన్నాగాని అతని మనస్సు మాత్రం భయం భయంగా ఉంది. ఎవరన్నా కనిపిస్తే "ఊళ్ళో ఎవరన్నా ఏమన్నా అనుకుంటున్నారా?"అని అడుగుతాడు. అలా భయపడుతూనే ఒక తంగేడు చెట్టుకింద గుంత తీసి వెండి గిన్నెను ఆ గుంతలో పూడ్చిపెట్టినాడు. మళ్ళీ ఎవరన్నా కనపడితే "ఏమన్నా, వెండిగిన్నె -గిండి గిన్నెఅనుకుంటూ వుండిరా ఊర్లో ! తంగిడి చెట్టు గింగడి చెట్టు అనుకుంటాండారా ఊర్లో?" అంటూ భయంగా అడిగేవాడు. అయితే నిద్రపోతున్న రాజుకు మెలుకువ వచ్చేసి చూస్తే, గడ్డం లేదు! బాగా నున్నగా ఉంది! "అరే నాకు మెలుకువ రాకుండా గడ్డం తీసేసినాడంటే ఆ మంగలికి ఎంతో నైపుణ్యం ఉంది. ఖచ్చితంగా అతనికి బహుమానం ఇవ్వాల"ని రాజు నిర్ణయించుకున్నాడు. సేవకులతో మంగలిని పిలుచుకురమ్మని చెప్పి పంపాడు. సేవకులు ఊరంతా వెతికినా ఎక్కడా మంగలి కనిపించలేదు. ఆ విషయాన్ని రాజుకు చెబితే, "మీరు మంగలిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని రావాల్సిందే" అని చెప్పినాడు. సేవకులు ఊరంతా మరోసారి వెతికి అడవిలోకి పోయారు. అడవిలో సేవకులు పోతుంటే మంగలికి గుండె దడదడ అంటోంది. పట్టుకొని పోతారని, ఏమి చేస్తారోనని భయం వేసింది . చివరికి వారి చేతుల్లో చిక్కక తప్పలేదు మంగలికి. ఎన్నిరోజులు దాగగలడు? రాజు పిలుస్తున్నాడని సేవకులు మంగలిని పిలుచుకుపోయినారు. రాజు దగ్గరకు పోతావుంటే మంగలికి చాలా భయం వేస్తా వుంది. కాని మంగలి అనుకున్నట్లు రాజుకు వెండి గిన్నెమీద ఆలోచనలేదు. రాజుకు ఎన్నో వెండి గిన్నెలు ఉంటాయి. కాని మంగలికి అనుమానం పోలేదు. రాజు మంగలితో "నాకు మెలుకువ రాకుండా గడ్డం తీశావు. నీలో చాలా నైపుణ్యం ఉంది. ఇదిగో ఈ బంగారు హారం బహుమానంగా ఇస్తున్నాను తీసుకో" అని బంగారు హారం బహుమానంగా ఇచ్చినాడు. రాజు ప్రవర్తనకు మంగలికి నోటమాట రాలేదు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో   రచన: హనుమంతు  

కుక్కకాటుకు చెప్పుదెబ్బ

కుక్కకాటుకు చెప్పుదెబ్బ      సేకరణ- డా.ఎ. రవీంద్రబాబు            ఒక అడవిలో ఉండే నక్కకు, కొంగకు మంచి స్నేహం కుదిరింది. చాలా కాలంగా హాయిగా కలసిమెలసి సంతోషంగా ఉంటున్నాయి. ఒకరోజు ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మాటల మధ్య కొంగ 'నక్కబావ నక్కబావా...! ఎప్పుడూ ఏటిలో చేపలు తినితిని విసుగొస్తుంది. నాకు ఎప్పటి నుంచో ఓ కోరికుంది.' అని చెప్పంది నక్కతో. 'ఏం కోరిక...? ఏమన్నా కొత్త వంటలేమన్నా తినాలని ఉందా?' అని అడిగింది నక్క. 'అవును నక్కబావా...! నాకు పాయసం అంటే చాలా ఇష్టం. తినాలని అనిపిస్తుంది. నాకేమో చేయడం కూడా రాదు' అన్నది. అందుకు నక్క 'ఓ... పాయసమా... అదేంత పని. నాకు చేయడం వచ్చు. రేపు ఆదివారం మా ఇంటికి వచ్చేయి. నీకు పాయసం చేసి పెడతాను' అన్నది. అందుకు కొంగ చాలా సంతోషించింది. ఇన్నాళ్లకు తన నాలుకకు పాయసం రుచి తగలబోతుందన్న ఆనందంతో...        ఆదివారం రాగానే త్వరత్వరగా తయారై, నక్క ఇంటికి వెళ్లింది. నక్క కొంగ రాగానే... 'రా కొంగబావా రా... నీవు నా ఇంటికి రావడం నా అదృష్టం. పాయసం ఉండుకుతోంది. రెండు నిముషాలు కూర్చో' అంది. వంటగదిలోంచి పాయసం వాసన గుభాళిస్తుంది. ఆ వాసనకే కొంగకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎప్పుడెప్పడు తెస్తుందా...! ఎప్పుడెప్పుడు తిందామా...! అని మనసులో అనుకుంటుంది. అనుకున్నట్లుగానే నక్క పాయసాన్ని రెండు వెడల్పాటి ప్లేటుల్లో పోసి తీసుకొచ్చింది. ఒకటి కొంగ ముందు పెట్టింది. తనూ ఒకటి తీసుకొంది. యాలుకలు, కొబ్బరి... లాంటివి వేసి చేసినట్లుంది. వాసన అద్భుతంగా ఉంది.       కొంగ ఉండబట్టలేక పాయసం ప్లేటులో తన పొడువాటి నోరుబెట్టి తినబోయింది. కాని కొద్దిగా కూడా దాని నోటిలోకి రాలేదు. తన పొడువాటి మూతికి అసలు దొరకడం లేదు. అటు ఇటు కదలడం తప్ప. పాపం కొంగకు తినాలని మనసు ఎంత ఉవ్విళ్లూరుతున్నా ఏమి తినలేక బిక్కమొహం వేసుకొని నక్కను చూస్తుంది. నక్కమాత్రం... 'తిను కొంగబావా' అంటూ... తన నాలుకతో తన ముందున్న ప్లేటులోని పాయసం మొత్తాన్ని నాకినాకి తినింది. తినడమే కాకుండా... 'ఏంటి కొంగబావా నీవు అసలు తినలేదు...?' అని కొంగ ముందున్న ప్లేటులోని పాయసాన్ని కూడా అదే లాగించేసింది. కొంగకు చాలా బాధ కలిగింది. ఏమీ చేయాలో అర్థం కాలేదు. మంచి స్నేహితుడని అనుకుంటే- ఇంటికి పిలిచి, తనకిష్టమైన వంటకం చేసి మరీ అవమానించిది. అందుకే ఆలోచించింది.       వెళ్తూ వెళ్తూ... 'నక్కబావా నక్కబావా...! నీ అతిథి మర్యాదకు కృజ్ఞతలు. నీవు కూడా మా ఇంటికి తప్పక భోజనానికి రావాలి. నీకిష్టమైన చేపలకూర వండి పెడతాను.' అంది. చేపలకూర అనగానే నక్కమదిలో ఆశ ఎక్కువైంది. 'తప్పకుండా వస్తాను. రేపే వస్తాను. మంచిమంచి చేపలు పట్టి, పులుపెట్టు నాకు బాగా ఇష్టం.' అని చెప్పంది. కొంగ 'అలాగే...' అని చెప్పి, వెళ్లిపోయింది.      కొంగ ఏటికి వెళ్లి మంచిమంచి చేపల్ని పట్టితెచ్చింది. చింతపండు వేసి బాగా పులుసు చేసింది. అనుకున్న సమయం కంటే నక్క అర్థగంట ముందే వచ్చింది. నక్కరాగానే కొంగ... 'రా నక్కబావా రా...' అని మంచి మర్యాద చేసింది. చేపల పులుసు లోపల ఉడుకుతుంటే ఎప్పుడెప్పుడు తిందామా అని నక్కకు ఆశగా ఉంది.       కొంగ చిన్నచిన్న చేప ముక్కలతో ఉన్న పులుసును రెండు పొడుగు కూజాలలో పోసి తెచ్చింది. ఒకటి నక్కముందు పెట్టి, తనూ ఒకటి ముందు పెట్టుకుంది. నక్క చేప ముక్కల తిందామని లోపలికి తల పెట్టగానే తల లోపలికి పోవడం లేదు. ఆ కూజా పైభాగం చాలా సన్నగా ఉంది. ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. ఎదురుగా కొంగ మాత్రం తన పొడవాటి మూతిని కూడా లోపలికి దూర్చి ఒక్కో ముక్కను తింటుంది. 'ఏంటి నక్కబావా నావైపు చూస్తావు. తిను. నీకోసం కష్టపడి వండాను.' అని పైగా ఎగతాళి చేస్తుంది. కానీ నక్క ఏం చేయలేక. మూతి ముడుచుకొని కూర్చొంది. కొంగ తన కూజాలో చేప ముక్కలు అయిపోగానే, నక్క దగ్గరున్న కూజా దగ్గరకు వచ్చి 'ఇలా తినాల'ని ఆ చేపముక్కల్ని కూడా తినేసింది.            నక్కకు తను చేసిన తప్పు తెలిసొచ్చింది. 'నన్ను క్షమించు కొంగబావా...' అని చెప్పింది. 'ఈసారి మళ్లీ మా ఇంటికి రా... నీకు తప్పక పాయసం వండిపెడతాను.' అని బ్రతిమాలింది. చివరకు కొంగ ఒప్పుకుంది. అలానే చేసిపెట్టింది. మళ్లీ కొంగ నక్కకు చేపలకూర కూడా వండి పెట్టింది. తర్వాత వారిస్నేహం మళ్లీ కొనసాగింది.    నీతి- ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి. స్నేహితుల్ని మోసం చేయకూడదు.  

అయ్యో పాపం కుయ్యో మొర్రో

అయ్యో పాపం కుయ్యో మొర్రో - చంద్ర శేఖర్ ఒకానొక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా టక్కరిది. ఆ అడవికి రాజు పులి. ఒక రోజున నక్క అడవిలో బడి పెడదామని అనుకున్నది. అది పులి దగ్గరకు వెళ్ళి "పులి రాజా! నేను ఈ అడవిలో బడి పెట్టబోతున్నాను. నాకు మీ అనుమతి కావాలి" అంది. పులి రాజు ఆలోచించి, "సరే, నువ్వు బడి పెట్టుకో" అని చెప్పి వెళ్ళి పోయింది. వెంటనే నక్క అడవిలోకి పోయి "నెమలి, కోకిల, కోతి, కుందేలు, బాతు- అందరూ ఇలారండి! ఒరేయ్, దున్నపోతూ! నిన్ను వేరేగా పిలవాలారా?" అని అరిచింది. "సరేగానీ, సంగతి ఏంటో చెప్పు మరి!" అన్నాయన్నీ. "ఏమీలేదు- నేను ఈ అడవిలో బడి పెడుతున్నాను. అందులో మీ పిల్లలకు గొప్పగొప్ప విద్యలు నేర్పిస్తాను. అయితే నాకు మీరంతా ప్రతిరోజూ మాంసం పెట్టాలి- ఇది పులిరాజు గారి ఆజ్ఞ. మీజంతువులూ, పక్షులూ అందరూ కలసి ఆలోచించుకోండి" అని చెప్పి వెళ్ళిపోయింది నక్క. సరే, ఇక పక్షులు, జంతువులు అన్నీకలిసి మాట్లాడుకున్నాయి. మాట్లాడుకొని, "సరే నక్కా! నువ్వు బడి పెట్టుకో. మేం మా పిల్లల్ని పంపుతాం" అని చెప్పాయి. నక్క బడిని ప్రారంభించింది. మొదటి రోజున పిల్లలందరి పేర్లనూ ఒక పుస్తకంలో రాసుకున్నది. "కోయిల పిల్లా! ఇటురా! ఈ నీటిలో ఈదు!" అని మొదలు పెట్టింది. "నాకు రాదు. నాకు రాదు" అన్నది కోయిల పిల్ల. "చెప్పింది చేస్తారా లేదా? మీరంతా క్రమశిక్షణ అంటే ఏంటో నేర్చుకోవాలి" అని నక్క మిగిలిన పక్షులన్నిటినీకూడా ఈదమన్నది. అవి ఏవీ అందుకు అంగీకరించలేదు. ఈదనందుకు నక్క వారిని బాగా కొట్టింది. ఆ తరువాత అది కోతినీ, దున్నపోతునీ, ఇతర జంతువుల్నీ ఎగరమన్నది. వాటికి ఎగరటం రాలేదు. అందుకుగాను నక్క ఆ జంతువులన్నింటినీ కూడా కొట్టింది. తెలివైనది కనుక అది అందరినీ కొట్టింది; కానీ పులి పిల్లను మాత్రం కొట్టలేదు. నక్కతీరుకు పిల్లలందరూ దాన్ని అసహ్యించుకున్నారు. మరుసటి రోజున దున్నపోతు నాన్న నక్కదగ్గరికి వచ్చింది. "నేను ఒక ప్రశ్న అడిగి నీ చెవులు మూసిపెడతాను. దానికి నువ్వు సమాధానం చెప్పాలి" అని అది నక్కతో అన్నది. "ఈ ఆట ఏదో బాగుంద"ని నక్క అందుకు ఒప్పుకున్నది. "వర్షాకాలంలో వర్షం వస్తుందా?" అని అడిగి, దున్నపోతు వచ్చి నక్క చెవులు మూసిపెట్టింది. సరిగ్గా అదే సమయానికి పులిపిల్ల వచ్చి "మా నాన్నకు ఎయిడ్స్ వస్తుందా?" అని అడిగింది. దున్నపోతు తన చెవుల్ని మూసి ఉంచటం వల్ల నక్కకు ఆ ప్రశ్న అసలు వినబడలేదు. అది "వస్తుంది" అని సమాధానం చెప్పింది. పులిపిల్ల వెంటనే పులి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పింది. అమాయకులైన పిల్లల వద్ద తన పరువు తీస్తున్నదని నక్కపై పులికి చాలా కోపం వచ్చింది. అది నక్కను బాగా కొట్టి, ఆ అడవి నుండి తరిమేయబోయేసరికి జంతువులు, పక్షులు అన్నీ వచ్చి "మా పిల్లలు కనిపించటం లేదు" అని పులిరాజుకు ఫిర్యాదు చేశాయి. నక్క పెట్టే బాదల్ని భరించలేక పిల్లలంతా ఆత్మహత్య చేసుకున్నాయని ఆరోపించింది కోతి తల్లి. దున్నపోతు కూడా "చూశారా, నేను చెబితే వినకుండా మీ పిల్లల్ని ఆ బడికి పంపి వాళ్లందరూ ఆత్మహత్య చేసుకోటానికి కారకులయ్యారు!" అన్నది. పరిస్థితి తారుమారు అవుతున్నదని గ్రహించిన నక్క అందరి కళ్ళుగప్పి, మెల్లగా జారుకున్నది. తమ పిల్లల్ని తలచుకొని, జంతువులు, పక్షులు చాలా బాధ పడసాగాయి. అది చూసి దున్నపోతు "మీరు ఏమీబాధ బాధ పడవలసిన అవసరం లేదు. మీ పిల్లలు ఆత్మహత్య చేసుకోబోతూ వుంటే నేను వెళ్లి, సర్ది చెప్పి, నా గుహ వద్ద క్షేమంగా వుంచాను" అని చెప్పి వాటిని తీసుకెళ్లి వారి పిల్లలను చూపింది. జంతువులన్నీ దున్నపోతుకు కృతజ్ఞతలు తెలుపుకుని ఎవరి ఇండ్లకు అవి వెళ్లిపోయాయి. బడిపేరిట నక్క తనను ఎంత మోసం చేసిందో చూసిన పులిరాజు ఇకపై తాను మరింత జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకున్నది.   కొత్తపల్లి వారి సౌజన్యంతో

పేర్లతో తిప్పలు

పేర్లతో తిప్పలు సేకరణ- డా.ఎ.రవీంద్రబాబు                ఒకఊరిలో ఓ కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని ఎప్పుడూ ఒక అతిథికి భోజనం పెట్టి, అన్నం తినేవాడు. రోజూ భర్త, పిల్లలతో పాటు మరొకరికి భోజనం వండి పెట్టలేక భార్య చాలా బాధపడేది. కానీ భర్తమాత్రం అసలు పట్టించుకొనే వాడు కాదు. ఎవరో ఒకర్ని వెతికి మరీ భోజనానికి తెచ్చేవాడు. అతను తిన్న తర్వాత మాత్రమే తను తినేవాడు. ఇంట్లో ఆహారపదార్థాలు ఉన్నాయో, లేవో కూడా ఆలోచించేవాడు కాదు. అది వండిపెట్టు, ఇది వండిపెట్టు అని విసిగించేవాడు. వండటానికి కావాల్సిన సరుకులు కూడా అన్ని తెచ్చిఇచ్చేవాడు కాదు.      చివరకు విసిగిపోయిన భార్య, భర్త అలవాటు పోడొట్టడానికి ఓ మంచి పథకం చేసింది. అయితే వాళ్ల ఇంట్లో ముద్దు పేర్లు చాలా విచిత్రంగా ఉండేవి. అందుకు వాటిని తన పన్నాగానికి అనుకూలంగా వాడుకోవాలని అనుకుంది.       ఆరోజు భర్త పనిమీద బయటకు వెళ్లాడు. ఇంతలో ఆ ఇంట్లో మంచి భోజనం దొరుకుతుందని తెలుసుకున్న ఒకతను ఇంటికి వచ్చాడు. "ఈ రోజు అతిథిగా నేను వచ్చాను. మీరు వంట చాలా చక్కగా చేస్తారటకదా... " అని ఆమెను పొగడడం ప్రారంభించాడు. బార్య అతని తిక్క, భర్త అలవాటు మార్చడానికి ఇదే సరైన సమయం అనుకుంది. "మీరు ఇప్పుడే భోజనం చేస్తారా...? నెయ్యి వచ్చేదాకా ఆగుతారా...?" అని అడిగింది. 'ఓహో...! వీళ్ల భర్త నెయ్యి తేవడానికి బయటకు వెళ్లినట్లు ఉంది' అని అనుకున్న అతిథి "నెయ్యి వచ్చిందాకా ఆగుతాను" అన్నాడు. కొంత సేపటికి భర్త వచ్చాడు. వరండాలో కూర్చొన్న అతిథి 'భర్త వచ్చాడు, నెయ్యి తెచ్చి ఉంటాడు, భోజనానికి ఇక పిలుస్తారు' అని ఎదురు చూస్తూ ఉన్నాడు. భర్త రాగానే వరండాలో అతిథిని చూసి చాలా సంతోషించాడు.          "అతిథిని కట్టేసి, దెయ్యాన్ని విప్పమంటావా?" అని భార్యను అడిగాడు. భార్య "సరే... విప్పండి, సమయం మించిపోతుంది." అన్నది. ఈ మాటలు వరండాలో కూర్చొన్న అతిథి విన్నాడు. 'ఏంటి...! నన్ను కట్టేసి దెయ్యాన్ని విప్పుతారా...!!' అని భయపడ్డాడు. అంతే...! చెప్పాపెట్టకుండా వీధిలోకి ఒకటే పరుగు. పరుగెత్తుతూ, పరుగెత్తుతూ... "వాళ్లింట్లోకి భోజనానికి ఎవరూ వెళ్లకండి... వెళ్లినవాళ్లని కట్టేసి దెయ్యానికి ఆహారంగా వేస్తున్నారు" అని అరుస్తూ పరుగెట్టాడు.        భర్త అతథిని భోజనానికి రమ్మనటానికి వరండాలోకి వచ్చి చూస్తే కనపడలేదు. భార్య అతిథి పరుగెత్తడం గమనించి. తిక్క కుదిరింది అని మనసులోనే నవ్వుకుంది.       అసలు విషయం ఏమిటంటే-!! భర్తను ముద్దుగా భార్య నెయ్యి అని పిలుచుకుంటుంది. వాళ్లింట్లో ఉండే ఆవును అతిథి అని, దూడను దెయ్యం అని పిలుచుకుంటారు. అందుకే- బయటనుంచి వచ్చిన భర్త పాలుతీయడానికి ఆలశ్యం అయింది, ఆవును (అతిథిని) కట్టేసి దూడను (దెయ్యాన్ని) విప్పి, పాలు తీస్తాను అని ముద్దు పేర్లతో అన్నాడనమాట.

కాకి - కోరిక

కాకి - కోరిక   డా.ఎ. రవీంద్రబాబు         అనగనగా ఒక అందమైన అడవిలో చాలా జంతువులు, పక్షులు కలిసి మెలిసి సంతోషంగా జీవించేవి. ఆ పక్షుల్లో ఒక కాకికి మాత్రం ఓ కోరిక ఉండేది. "నేను అందరికంటే బలంగా ఉండాలి. అందరికంటే గొప్పగా ఉండాలి. అందరూ నన్ను మెచ్చుకోవాలి" అని ఎప్పుడూ అనుకునేది.        ఒక రోజు కాకికి ఎలాగైనా సరే అందరి కంటే గొప్పదానిగా నిరూపించుకోవాలని ఆ అడవి నుంచి బయట కొచ్చింది. ఎగురుకొంటూ ఎగురు కొంటూ చాలా ప్రదేశాలు తిరిగింది. చాలా అడవులు గాలించింది. కానీ దాని కోరిక తీర్చే వాళ్లెవరూ కనిపించలేదు. చివరకు ఓ భయంకరమైన కొండమీదకు చేరింది. అక్కడున్న ఓ చెట్టుమీద వాలి దిగులుగా కూర్చొంది. విహారానికి వచ్చిన వన దేవతలు దాన్ని చూశారు. "అయ్యో పాపం ఏమైంది?" అని పలకరించారు. కాకి తన బాధంతా వెళ్లబోసుకుంది. "అందరూ తనను అవమానిస్తున్నారని, అందుకని ఎలాగైనా గొప్పదానిగా తిరిగి వెళ్ళాలని" చెప్పింది.       అందుకు వన దేవతలు నువ్వేమి బాధపడకు. నిన్ను మేము అందంగా, తీయటి గొంతు నీకు వచ్చేలా, నువ్వు ఏది కోరితే అది జరిగేలా వరం ఇస్తాము అని చెప్పి... వరాలిచ్చారు. కానీ "మా గురించి, నీకు ఈ విధంగా వరాలు ఇచ్చిన సంగతి ఎవరకూ చెప్పకు. చెప్తే ఈ శక్తులన్నీ పోయి మళ్లీ మామూలు దానివై పోతావు" అని చెప్పి వెల్లిపోయారు.       దాంతో కాకి అందమైన పక్షిలా మారిపోయింది. కోకిలకంటే తీయనైన గొంతు వచ్చేసింది. తనను తాను చూసుకొని చాలా సంతోషించింది. తన అరుపు తనే విని పొంగిపోయింది. ఇక తన సొంత అడవిలోకి వెళ్లాలని మనసులో అనుకుంది. అంతే ఎగరకుండానే అక్కడకు వెళ్లిపోయింది.       దీని రంగు, అరుపు చూసిన మిగిలిన పక్షులు, జంతువులు బిత్తరపోయాయి. నేను మీతో కలిసున్న కాకిని అని చెప్పింది. అయినా అవి నమ్మలేదు. నా శక్తులు చూడండి అని అక్కడో పెద్ద జలపాతాన్ని సృష్టించింది. వాటికి కావాల్సినన్ని ఆహార పదార్థాలు వచ్చేలా చేసింది. జంతువులు పక్షులు ఆ ఆహార పదార్థాలను చక్కగా తిన్నాయి. కానీ "నీకు ఇలాంటి శక్తులు ఎలా వచ్చాయి?" అని అడిగాయి.  "అవన్నీ మీకెందుకు? మీకు ఏమి కావాలన్నా నన్ను అడగండి... నేను ఇప్పుడు మీకు రాజును. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను" అని చెప్పింది. కాకి పెట్టే తిండికోసం అన్ని జంతువులు, పక్షులు సరే అన్నాయి.     కానీ కొన్ని పక్షులకు, జంతువులకు ఇది నచ్చలేదు. మనకు అది రాజేంటి అనుకున్నాయి. దీని గుట్టు బయటపెట్టాలని అనుకున్నాయి. ఒక రోజు రాత్రి కాకి నిద్ర పోతుంటే దాని గూటిలోకి జొరబడ్డాయి. అంతా వెతికాయి. కానీ ఏమీ దొరకలేదు. కోపంతో నిద్రపోతున్న కాకిని గెట్టిగా పట్టుకొని  "నీకు ఈ శక్తులు ఎలా వచ్చాయి?. మాకు తెలియాలి?" అన్నాయి. "ఇది రహస్యం చెప్పకూడదు" అని కాకి సమాధానమిచ్చింది.     కోపంతో అవి కాకిని  చంపేశాయి.     నీతి: ఉన్న దాంతో తృప్తి పొందాలి, కానీ హటాత్తుగా కలిసి వచ్చే సంపదల వెంట పరుగులు తీయకూడదు. దురాశ దుఃఖానికి చేటు. పరుగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు.

తెనాలి రాముని చిత్రకళ

తెనాలి రాముని చిత్రకళ - రామానుజన్   ఒకసారి రాయలవారికి తన భవనం బోసిపోయినట్లు తోచింది. `గోడలకు వర్ణచిత్రాలు తగిలిస్తే అందంగా ఉంటుంది కదా' అని ఆయన అనుకున్నారు. ఆ పనికోసం ఆయన ఒక చిత్రకారుడిని నియోగించారు; ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కని చిత్రాలు గీచి తెచ్చాడు. వాటిని అందరూ చాలా మెచ్చుకున్నారు, కానీ తెనాలి రామకృష్ణుడికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఒక వ్యక్తి పక్కకుతిరిగి నిలబడ్ద చిత్రాన్ని చూసిన రామలింగనికి "రెండో పక్క ఎక్కడున్నది? మిగిలిన శరీర భాగాలేమైనాయి?" లాంటి అనుమానాలు వచ్చాయి. రాయలవారు నవ్వారు. "రామకృష్ణా, మీరు ఎరుగరా? వాటిని మీరు ఊహించుకోవాలిగదా?" అన్నారు. "ఓహో, బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది. నాకు ఇప్పుడు అర్థమైంది" అన్నాడు రామకృష్ణుడు. కొన్ని నెలల తర్వాత రామకృష్ణుడు రాయలవారి దగ్గరికి వచ్చి చెప్పాడు: "కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్లూ చిత్రకళను సాధన చేస్తున్నాను. మీ భవనపు గోడలమీద కొన్ని చిత్రాలు గీస్తాను నేనుకూడా" అని. రాయలవారి ముఖం విప్పారింది. "అద్భుతం! పాత, మసిబారిన చిత్రాల్ని తీసేసి, మీరు కొత్త చిత్రాలు గీయండి" అన్నారు. తెనాలి రామకృష్ణుడు పాత పటాల మీద సున్నం కొట్టించేసి ఆయా స్థలాలలో తన సొంత చిత్రాలు గీశాడు. అక్కడొక కాలు, ఇక్కడో కన్ను, ఇంకోచోట ఒక వేలు గీశాడు. అలా గోడలనన్నింటినీ శరీర భాగాలతో నింపి తన హస్తకళా నైపుణ్యాన్ని చూసేందుకు రాయలవారిని ఆహ్వానించాడు. విడివిడి శరీర భాగాల్ని చూసిన రాజుగారు నివ్వెరపోయారు. "మీరిక్కడ ఏం చేశారు రామకృష్ణా, చిత్రాలేవి?" అన్నారు. "చిత్రాల్లో వేయనిదాన్ని మీరు ఊహించుకోవాలి" అన్నాడు రామకృష్ణుడు తాపీగా. "మీరింకా నా చిత్రాల్లో అత్యద్భుతమైనదాన్ని చూడనేలేదు" అన్నాడు మళ్లీ. రాయలవారికి ఉత్సాహం పెరిగి, చూపించమన్నారు. రామకృష్ణుడు రాయలవారిని ఒక గోడ దగ్గరికి తీసుకవెళ్లి చూడమన్నాడు గర్వంగా. ఆ గోడ ఖాళీగా ఉంది. ఆకుపచ్చ రంగు గీతలు మాత్రం ఉన్నాయి అక్కడక్కడా. "ఇదేంటి?" అడిగాడు రాయలవారు ఉస్సూరుమంటూ. "గడ్డిమేస్తున్న ఆవు" "గడ్డేదీ?" "ఆవు తినేసింది గదా!" "మరి ఆవేదీ?" గడ్డిని మేసేసిన తరువాత ఆవు ఇంటికి వెళ్లిపోయింది!" రాయలవారు నోరు తెరిచారు, ఇంకేమీ అడగలేక.

కాకమ్మ - పిచుకమ్మ

కాకమ్మ - పిచుకమ్మ    - డా. ఎ. రవీంద్రబాబు     ఒక అడవిలో  పెద్ద చెట్టు మీద కాకమ్మ పిచుకమ్మ ఉండేవి. కాకమ్మ కర్రలతో ఇల్లు కట్టుకుంటే, పిచుకమ్మ పుల్లలతో ఇల్లు కట్టుకొని ఆనందంగా జీవించసాగాయి. కానీ ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది. కాకమ్మ ఇల్లు కర్రలతో ఉండటం వల్ల కూలిపోయింది. పిచుకమ్మ ఇల్లు పుల్లలతో ఉండటం వల్ల గాలికి ఊగిందే కానీ కూలిపోలేదు. అప్పుడు కాకమ్మ పిచుకమ్మ దగ్గరకు వచ్చి... "పిచుకమ్మా... ! పిచుకమ్మా...! నా ఇల్లు కూలిపోయింది. గాలివాన తగ్గేదాక నీ ఇంట్లో ఉంటాను" అని బతిమాలింది. పిచుకమ్మ 'అయ్యో పాపం...!' అని జాలిపడి లోనికి ఆహ్వానించింది.      కానీ కాకమ్మ గాలివాన తగ్గటంతోనే పిచుకమ్మను తన్ని ఇంట్లో నుంచి తరిమేసింది. పిచుకమ్మ చిన్నది కదా...! ఏమీ చేయలేక ఏడుస్తూ బయటకొచ్చింది. అడవి బయటున్న ఏటి గట్టున కూర్చొని బాధపడసాగింది. ఆ దారి వెంట వెళ్తున్న గాజులమ్మే శెట్టి చూసి... "పిచుకమ్మా...! పిచుకమ్మా...! ఎందుకు దిగులుగా ఉన్నావు.?" అని అడిగాడు. అప్పుడు పిచుకమ్మ జరిగిందంతా చెప్పింది. పిచుకమ్మ దయాగుణాన్ని మెచ్చుకున్న గాజులశెట్టి "పిచుకమ్మ బాధపడకు. చెట్టెక్కిచూడు చెండ్రాకోలు దొరుకుతుంది. గట్టెక్కిచూడు కాడెద్దులు దొరుకుతాయి. వాటితో ఈ పక్కనున్న పొలం దున్నుకొని హాయిుగా జీవించు" అని చెప్పి వెళ్లిపోయాడు.      అట్లానే పిచ్చుక చెట్టెక్కి చూసింది చెండ్రాకోలు దొరికింది. గట్టెక్కి చూసింది. కాడెద్దులు దొరికాయి. వాటితో పొల దున్నుకొని వ్యవసాయం చేస్తూ... సంతోషంగా బతకసాగింది. ఆ దారివెంట వచ్చే వారికి తిండిపెడ్తూ ఆనందాన్ని పొందసాగింది.      ఒకరోజు కాకి అటుగా వచ్చింది. పిచ్చుక సౌభాగ్యాన్ని చూసి ఈర్ష్య చెందింది. "నేను నిన్ను ఇంట్లో నుంచి తన్ని తరిమేశాను కదా...! ఇదంతా ఎలా వచ్చింది?" అని అడిగింది. అప్పుడు పిచ్చుకమ్మ జరిగిందంతా చెప్పింది.      అంతా విన్నాక, కాకి కూడా ఏటి ఒడ్డుకు వెళ్లి దిగులుగా కూర్చొంది. మళ్లీ అటుగా వచ్చిన గాజులశెట్టి కాకమ్మని చూసి "ఏంటి కాకమ్మా బాధపడుతున్నావు?" అని అడిగాడు.  "నా ఇల్లు కూలి పోయింది" అని కాకమ్మ అబద్ధం చెప్పింది. గాజులశెట్టి పిచుకమ్మకు చెప్పినట్లుగానే "చెట్టెక్కి చూడు, చెండ్రాకోలు దొరుకుతుంది. గట్టెక్కి చూడు, కాడెద్దులు దొరుకుతాయి. వాటితో నువ్వూ మరికొంత పొలాన్ని దున్నుకొని బతుకు." అని చెప్పి వెళ్లిపోయాడు.      గాజులశెట్టి చెప్పినట్లుగానే కాకి చెట్టెక్కి చూసింది. చెయ్యి విరిగింది. గట్టెక్కి చూసింది. కాలు విరిగింది. చేసేది ఏమీ లేక కుర్రోమర్రో అంటూ బాధపడసాగింది.   నీతి- ఉపకారికి అపకారం చేయరాదు. ఈ కథవల్ల ఉపయోగాలు- 1. పిల్లలకు కాకి, పిచ్చుక లాంటి పక్షులను పరిచయం చేయడం. 2. వ్యవసాయం చేసే విధానాన్ని, చెండ్రాకోలు, ఎద్దులతో పొలం దున్నటం... లాంటివి పిల్లలకు వివరించవచ్చు. 3. ఒకప్పుడు గ్రామాలు తిరుగుతూ గాజులు అమ్మే వారిని గాజులశెట్టి అని పిలిచేవారు.

దేవుడు విన్నాడు

దేవుడు విన్నాడు - నారాయణ ఒకసారి ఒక పసుపుముద్దకు తన రంగంటే అసహ్యం వేసింది. "ఏంటి, ఈ రంగు? ఎప్పుడూ పచ్చగానేనా? తను ఎంచక్కా వేరే రంగుకు మారిపోతే ఎంతబాగుండును?" అనుకున్నదది. కానీ అలాంటి అవకాశమే కనబడలేదు. మంచి రంగులు ఏవి కనబడ్డా వాటిని తెచ్చి తనపైన పూసుకునేదది. అయితే అవన్నీ రాలిపోయేవి, కారిపోయేవి తప్ప - నిలిచేవి కావు. అప్పుడు అది దేవుని దగ్గరకు బయల్దేరింది - తన రంగు మార్చమని వేడుకునేందుకు. వెళ్తూంటే, దారిలో దానికో సున్నపుముద్ద ఎదురైంది. "ఏంటమ్మా పసుపూ, ఎటు? బయలుదేరావు?" అన్నది సున్నం, పసుపు హడావిడిని చూసి. "దేవుడి దగ్గరికి వెళ్తున్నానమ్మా, నా రంగు మార్చేయమని అడిగేందుకు. నాకు ఈ రంగు నచ్చలేదు" అన్నది పసుపు. "అవునా, అయితే నేనూ వస్తాను నీ వెంట. నాకూ ఈ రంగు నచ్చలేదు. మార్చమని అడుగుతాను నేనున్నూ!" అని సున్నం పసుపు వెంట బయలుదేరింది. మధ్యదారిలో చాలా చోట్ల అవి రెండూ ఒకదానికొకటి సాయం చేసుకున్నాయి. కొన్నిచోట్ల సున్నం పసుపుచేయి పట్టుకొని పైకిలాగింది. కొన్ని చోట్ల పసుపు సున్నాన్ని కాపాడింది. రెండూ‌గమనించలేదు - రెండింటి చేతులూ ఎర్రగా మెరవటం‌మొదలెట్టాయి. అయితే అవి రెండూ ఇంకా దేవుడి దగ్గరికి చేరకనే పెద్ద వాన మొదలైంది! తలదాచుకునే చోటులేదు - పసుపుముద్ద ఆ వానకు తట్టుకోలేక పగిలిపోతున్నది. తోటిదాన్ని కాపాడదామని, సున్నం తన చొక్కాలోనే పసుపును దాచుకొని కాపాడింది. బయటికి వచ్చిన తర్వాత చూస్తే, పసుపు, సున్నం రెండూ‌ఎర్రబారాయి పూర్తీగా! ఒక్కసారి అవిరెండూ ఒకరిముఖాన్నొకటి చూసుకుని, సంతోషంగా నవ్వాయి. ఆపైన, ఏదో అర్థమైనట్లు, వెనక్కి తిరిగి ఇంటిదారి పట్టాయి - తమ రంగులు మారే మార్గం చూపిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ.   కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో              

వెంట్రుకలు పూడిశిన కథ

వెంట్రుకలు పూడిశిన కథ - మోహన్ ఒక ఊళ్లో ఒక రాజంట. ఆ రాజుకు ఇద్దరు భార్యలంట. ఒకటో భార్యకేమో ఒక వెంట్రుకంట. రెండో భార్యకేమో రెండు వెంట్రుకలంట. ఎక్కువ వెంట్రుకలున్న భార్య కావాలని రాజు, రెండు వెంట్రుకలున్న భార్యను ఉంచుకొని, ఒక వెంట్రుకున్న భార్యను పంపించేశాడంట. ఒకటో భార్య పోతావుంటే చీమ ఎదురయ్యిందంట. "చీమా! చీమా! మా అవ్వోళ్ల ఇళ్లు చూపీ నాకు?" అని అడిగిందంట. అప్పుడు చీమ "మీ అవ్వోళ్లింటికి పొయ్యే దారి చూపిస్తాను, కానీ నువ్వు నన్ను తొక్కకుండా పోతానంటేనే నేను నీకు చూపిస్తాను" అని చెప్పిందంట. "సరేలే" అని తొక్కకుండా పోయిందంట రాణి. అప్పుడు చీమ రాణికి దారిని చూపిందంట. ఆ తరువాత చీమ చూపిన దారిలో పోతున్న రాణికి ఏనుగు అడ్డమొచ్చిందంట. "ఏనుగూ! ఏనుగూ! నాకు మా అవ్వోళ్ల ఇళ్లు చూపిస్తావా ?" అంటే, "తప్పిపోయిన నా పిల్లను తెచ్చి నాదగ్గర వొదిలితే నేను నీకు మీ అవ్వోళ్ల ఇంటికి పొయ్యేదానికి దారి చూపిస్తా"ననిందంట. `సరే'నని రాణి దాని పిల్లను తెచ్చి వదిలిందంట. అప్పుడు ఏనుగు దారి చూపిందట. దారెంబడి పోతావుంటే ముద్దబంతి పూలు కనిపించినాయంట. అప్పుడు రాణి ముద్దబంతి పూలను అడిగిందట "ముద్దబంతీ! ముద్దబంతీ! నాకు మా అవ్వోళ్ల ఇల్లు చూపిస్తావా?" అని. అప్పుడు ముద్దబంతి "నన్ను కోసుకుని పొయ్యి , దేవుని దగ్గర పెడితే చూపిస్తాను" అని చెప్పిందంట. "సరే"లెమ్మని కోసుకొనిపొయ్యి దేవుడిదగ్గర పెట్టిందంట . పెట్టి అక్కడున్న దేవుణ్ణి అడిగిందంట రాణి "దేవుడా! దేవుడా! నాకు మా అవ్వోళ్ల ఇళ్లు చూపించవా?" అని. "నాకు పూజ చెయ్యి" అన్నాడంట దేవుడు. "సరే"నని పూజచేసిందంట ఒక వెంట్రుకున్న రాణి. అప్పుడు దేవుడు తన గుడిపక్కనే ఉన్న అవ్వోళ్ల ఇంటిని రాణికి చూపించినాడంట. రాణి అక్కడికి పోయి, అవ్వతో "అవ్వా! అవ్వా! నా మొగుడు నాకు ఒకటే వెంట్రుకుందని నన్ను పంపించేశాడవ్వా. అందుకని నేనేం చెయ్యాలి?" అని అడిగిందంట. అప్పుడు అవ్వ రాణితో "నేను నీకొక నిమ్మకాయను ఇస్తాను. నువ్వు దాన్ని గట్టిగా పట్టుకొని కోనేట్లో మునుగు. అప్పుడు నీకు వెంట్రుకలొస్తాయి. కానీ నువ్వు దాన్ని కిందొదలద్దు. వొదిలేస్తే నీకు ఉండే వెంట్రుక కూడా పూడుస్తుంద"ని చెప్పిందంట. "సరే"లే అని, అవ్వ ఇచ్చిన ఆ నిమ్మకాయను గట్టిగా పట్టుకుని నీళ్లల్లో మునిగిందంట రాణి. లేచి చూసుకుంటే వెంట్రుకలు పొడుగ్గా వచ్చున్నాయంట. అప్పుడు ఆ రాణి భర్త దగ్గరికి పోయిందంట. పోతే "ఒకటో భార్యకు ఎక్కువ వెంట్రుకలున్నాయని, ఆమెను ఉండమని, రెండు వెంట్రుకలున్న రెండవ భార్యను పంపించేశాడం"ట రాజు. రెండో రాణి పోతావుంటే ఆమెకు చీమ కనిపించిందంట. అప్పుడు రెండో రాణి, చీమతో "చీమా! చీమా! నాకు మా అవ్వోళ్ల ఇల్లు చూపించవా?" అని అడిగిందంట. "సరే, చూపిస్తాలేగానీ, నువ్వు నన్ను తొక్కకుండా పోవాలి మరి" అని చెప్పిందంట చీమ. కానీ రాణి దాన్ని తొక్కి పోయిందంట. అప్పుడు చీమ "ఫో నేను చూపియ్యను గాని" అని అనిందంట. రాణి ఇంకా ముందుకు పోతావుంటే ఏనుగు ఎదురొచ్చిందంట. "ఏనుగూ! ఏనుగూ! నాకు మా అవ్వోళ్ల ఇల్లు చూపించవా?" అని అడిగిందంట. అప్పుడు ఏనుగు "చూపిస్తానుగాని, ముందు నువ్వు తప్పిపోయిన నా పిల్లను చూపించవా?" అని అడిగిందంట. అప్పుడా రాణి ఏనుగును తనతోపాటు ఎక్కడికో తీసుకెళ్లి వదిలేసిందంట. అప్పుడు ఆ ఏనుగు "నేను నీకు ఏమీ చూపించను పో" అని అనిందంట. రాణి ఇంకా ముందుకు పోతావుంటే ఒక ముద్దబంతి కనిపించిందంట. అప్పుడు రాణి ఆ ముద్దబంతితో "ముద్దబంతీ! ముద్దబంతీ! నాకు మా అవ్వోళ్ల ఇల్లు చూపించవా?" అని అడిగిందంట. అప్పుడు ముద్దబంతి "నువ్వు నన్ను కోసుకుని పోయి దేవుని దగ్గర పెడితే నేను నీకు సాయం చేస్తాను" అని చెప్పిందంట. అప్పుడు రాణి ఆ ముద్దబంతి చెట్టును రెండుగా ఇంచి , బాగా మొత్తిందంట. ఆ తరువాత ముందుకు పోయిన రాణికి దేవుడిగుడి కనబడిందంట. గుళ్ళోకి పోయి "దేవుడా! దేవుడా! నాకు మా అవ్వోళ్ల ఇల్లు చూపించవా?" అని అడిగితే, దేవుడు "నాకు పూజ చేస్తే నేను నీకుసాయం చేస్తా"నన్నాడట. అప్పుడా రాణి దేవుణ్ణి తన్నేసి పోయిందంట. అట్లా పోతున్న ఆ రాణికి అవ్వోళ్ల ఇల్లు కనిపించిందంట. అక్కడున్న అవ్వ దగ్గరకు పోయి "అవ్వా! అవ్వా! ఒకటో భార్యకు పూర్తీగా వెంట్రుకలొచ్చేటట్లు చేస్తివికదా! నాకు కూడా వెంట్రుకలొచ్చేటట్లు చెయ్యవూ?" అని అడిగిందంట. అప్పుడా అవ్వ ఒక నిమ్మకాయను ఇచ్చి, " పోయి, ఈ నిమ్మకాయను చేతిలో గట్టిగా పట్టుకుని కోనేట్లో మునుగు. అప్పుడు నీకు బాగా వెంట్రుకలొస్తాయి. కానీ నువ్వు మునిగున్నప్పుడు నిమ్మకాయను మాత్రం వొదిలేయొద్దు" అని చెప్పిందంట. "సరే"నని పోయి కోనేట్లో మునిగిన ఆ రాణి, నీళ్లలో అవ్విచ్చిన ఆ నిమ్మకాయను వొదిలేసిందంట. అప్పుడా రాణికి ఉన్న రెండు వెంట్రుకలు కూడా పూడ్చినాయంట. "ఉన్న వెంట్రుకలు కూడా పోయెనే" అని ఏడ్చుకుంటూ పోయి ఒక కొబ్బరి చెట్టు కింద కూర్చుందంట. అప్పుడు ఆ కొబ్బరిచెట్టులో ఉన్న టెంకాయ ఒకటి పైనుండి వచ్చి రాణి గుండు మీద పడిందంట. పాపం! తల పగిలినంత పనైందంట రాణికి. ఏడ్చుకుంటూ మళ్లీ అవ్వ దగ్గరకు పోయి "అవ్వా! నా తలమీద ఒక పుచ్చిపోయిన టెంకాయ పడిందవ్వా!" అని చెప్పిందంట. అప్పుడు అవ్వ ఆ టెంకాయలోపలున్న బూజును తీసుకుని నీ గుండుకు పూసుకో" అని చెప్పిందంట. అప్పుడు రాణి ఆ బూజును తీసుకుని గుండుకు పూసుకున్నదట. అప్పుడు ఆమె తలమీద కొన్ని తెల్ల వెంట్రుకలొచ్చాయంట. అప్పుడా రాణి రాజుదగ్గరకు పోయిందంట. కానీ రాజు, "నాకు తెల్లవెంట్రుకల భార్య వొద్దు. నల్ల వెంట్రుకల భార్యనే కావాలి" అని రెండో భార్యను పంపించేశాడంట.

కాయలతో కథ

కాయలతో కథ అనగనగా ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మ ఈతకాయంత ఇంట్లో ఉంది. ఆ మునక్కాయంత ముసలమ్మ దగ్గర బాదం కాయంత బంగారం ఉంది. మునక్కాయంత ముసలమ్మ బాదంకాయంత బంగారాన్ని పనసకాయంత పెట్లో పెట్టి తాటికాయంత తాళం వేసింది.      అయితే ఒక రాత్రి దోసకాయంత దొంగ ఈతకాయంత ఇంట్లో జొరబడి, తాటికాయంత తాళం పగులగొట్టి బాదంకాయంత బంగారాన్ని దోచుకుపోయాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకు ఫిర్యాదు చేసింది. పొట్లకాయంత పోలీసు వెళ్లి దోసకాయంత దొంగని వెతికి పట్టుకొని జామకాయంత జైల్లో పెట్టాడు.     మునక్కాయంత ముసలమ్మని పిలిచి బాదంకాయంత బంగారాన్ని ఇచ్చేశాడు.   ఉపయోగాలు- ఈ కథ పిల్లలకు చెప్పడం వల్ల వారికి తెలుగులో కాయల పేర్లు తెలుస్తాయి. పైగా కథా రూపంలో ఉండటం వల్ల సలభంగా గుర్తుపెట్టుకుంటారు. తోటి స్నేహితులకు చెప్పి ఆనందాన్ని పొందుతారు. అంతేకాదు ప్రతి కాయని మనుషులు, వస్తువులతో పోల్చడం ఈ కథలోని మరో విశేషం. చిన్నారులకు దొంగతనం చేయడం తప్పు, అనే నీతిని కూడా ఈ కథ బోధిస్తుంది. ఒక వేళ చేస్తే పోలీసులు పట్టుకుంటారు అనే సామాజిక పరిజ్ఞానాన్నీ చిన్నిబుర్రలకు అందిస్తుంది. అందుకే మనకు సంప్రదాయంగా వస్తున్న కథలను చిన్నారులకు తప్పక చెప్పాలి. అప్పుడే వారిలో సృజనశక్తికి బీజాలు పడతాయి.    ఈ కథలో వచ్చిన కాయలు- 1. ఉసిరికాయి 2. మునక్కాయ 3. ఈతకాయ 4. బాదంకాయ 5. పనసకాయ 6. తాటికాయ 7. దోసకాయ 8. పొట్లకాయ 9. జామకాయ     కథంతా విన్నాక ఈ కథలో ఎన్ని కాయలు ఉన్నాయని ప్రశ్నించి పిల్లల జ్ఞాపకశక్తికీ పదును పెట్టొచ్చు....                                                   సేకరణ- డా. ఎ. రవీంద్రబాబు

మాట వినని దయ్యం!

మాట వినని దయ్యం! G.హరిత అనగనగా ఒక ఊళ్లో రంగమ్మ, రంగన్న అనే దంపతులు ఉండేవారు. రంగన్న చాలా మంచివాడు. రంగమ్మ మాత్రం గయ్యాళిది. భర్త ఎడ్డెమంటే ఆమె తెడ్డెమంటుంది. మగని మాటను ఆమె ఏనాడూ మన్నించేది కాదు. ఎప్పుడూ రంగన్నకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండేది. ఇలా ఉండగా ఓసారి కుండపోత వర్షం మొదలైంది. ఆ సమయానికే దంపతులిద్దరూ వేరే ఊరికి వెళ్లవలసి వచ్చింది! ఇద్దరూ పూర్తిగా తడిసిపోయారు. దారిలో వాళ్ళు దాటవలసిన వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నది. 'వాగు దాటద్దు, ఇక్కడే, ఓ చెట్టుకింద తలదాచుకుందాం!' అన్నాడు రంగన్న. 'వీలుకాదు, సమయంలేదు! వానలోనే వాగును దాటి తీరాలి!' అన్నది రంగమ్మ. 'అలా కాదే! వాగు చాలా ఉధృతంగా ఉన్నది, ఏ కొంచెం కాలు జారినా అంతే సంగతులు!" అన్నాడు రంగన్న. 'నీకేం నష్టం? ఇక్కడ ఆగితే మాత్రం నామీదొట్టు!' అన్నది రంగమ్మ. ఇక చేసేది లేక, రంగన్న ఆమె చేతిని పట్టుకొని, జాగ్రత్తగా నీళ్లలోకి దిగాడు. ఇద్దరూ ఇంకా ఏరు మధ్యకు చేరుకున్నారో, లేదో- నీళ్లలో కొట్టుకు వస్తున్న కొమ్మ ఒకటి తగులుకొని, రంగమ్మ నీళ్లలో పడిపోయింది. రంగన్న తేరుకునేలోగా ఆమె ఎక్కడికి కొట్టుకుపోయిందో- ఇక కనబడలేదు. రంగన్న మాత్రం భద్రంగా ఇల్లు చేరుకున్నాడు. గయ్యాళి రంగమ్మ అలా చచ్చిపోయినా, ఆమె ఆత్మకు మాత్రం శాంతిలేకుండా పోయింది. ఏంచేయాలో తెలీక, పరితపిస్తూ, ఆమె ఆత్మ ఆ ఊరి జమీందారు ఇంటికి వెళ్ళింది. జమీందారుకు ఒక్కతే కూతురు- పేరు రిచా. రంగమ్మ ఆత్మ వెళ్లి ఆమెను పట్టుకొని కూర్చున్నది. పనుల్తో అసలే వ్యస్తంగా ఉండే జమీందారుకు ఇదో ప్రాణ సంకటం అయిపోయింది. ఒక్కగానొక్కకూతురు 'తాను రంగమ్మను' అని అరుస్తుంటే ఆయన చూడలేక, అనేక మంది వైద్యులను, నాటు వైద్యులను, భూత వైద్యులను రప్పించి వైద్యం చేయించాడు. అయినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. గయ్యాళి రంగమ్మ ఆత్మ మాత్రం రిచాను వదలక, అక్కడే గట్టిగా తిష్ఠ వేసుకొని కూర్చున్నది. జమీందారుకి ఇక ఈ సంగతిని దాచే వీలు లేకపోయింది. 'ఎవరో రంగమ్మ ఆత్మ జమీందారు గారి బిడ్డను పట్టి పీడిస్తున్నదట' అని అందరికీ ‌తెలిసిపోయింది. మొదట్లో పట్టించుకోకపోయినా, చివరికి రంగన్న ఎలాగైనా జమీందారు బిడ్డను కాపాడాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఎలా? కొంచెం ఆలోచించిన మీదట, అతనికి ఓ ఉపాయం తట్టింది. అతను బయలుదేరి జమీందారు ఇంటికి చేరుకున్నాడు. రంగన్నని చూడగానే రంగమ్మ ఆత్మ చాలా సంతోషపడి, తన మామూలు తిట్లు, శాపనార్థాలు మొదలుపెట్టింది. రంగయ్య ప్రశాంతంగా ఆమె ముందు కూర్చొని, "చూడు, నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడికీ వెళ్ళద్దు. ఈ పాపను వదిలి పోయేవు, పోకు! ఎక్కడని తిరుగుతావు? ఒకవేళ ఈ పాపను వదిలి పోదామనుకున్నా- ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీసాలోకి మాత్రం దూరకు! సీసాలో చోటు నీకు సరిపోదు." అన్నాడు, ఓ సీసాను తీసి ఆమె ముందు పెడుతూ. రంగన్న మాటలు వినగానే రంగమ్మకు, తన అలవాటు గుర్తొచ్చింది. ఖచ్చితంగా వాటికి వ్యతిరేకంగా చేయాలనుకున్నది ఆమె. వెంటనే రిచాను వదిలిపెట్టి, హడావిడిగా వచ్చి, సీసాలోకి దూరింది! పూర్తిగా దూరిందని అనిపించగానే రంగన్న ఆ సీసాకు మూతపెట్టేసి, దాన్ని తన సంచీలో వేసుకున్నాడు! తన కూతురిని కాపాడినందుకుగాను జమీందారుగారు రంగన్నకు చాలా బహుమతులిచ్చారు! మాటవినని దయ్యానికి మందు కనుక్కున్న రంగయ్య, సంతృప్తిగా ఇల్లు చేరుకున్నాడు!

కోతి ఉపవాసం

కోతి ఉపవాసం గురుస్వామి   తాత కోతి శివరాత్రి ఉదయం 4 గం|| లకే నిద్ర లేచి అందరిని లేపాడు అందరూ తొందరగా కాలకృత్యాలు తీర్చుకొని కోనేరులో స్నానం చేసారు. అందరికీ ఇది బాగానే ఉంది కాని, పిల్ల కోతికి కొంచెం ఇబ్బందిగా ఉంది. గుడిలో కెళ్లి దేవునికి దణ్నం పెట్టుకొని; ముఖానికి వీభూది పట్టించుకొని గుడికి కొంచెం దూరంలో ఒక బండ మీద గుండ్రంగా కూర్చున్నాయి. తాత అందరిని "ఓం నమఃశివాయ" పలకమన్నాడు. పిల్లకోతి, అమ్మ కోతి, నాన్నకోతి, అవ్వ, తాతకోతి అందరూ "ఓం నమః శివాయ, ఓం నమః శివాయ" అంటూ చాలా భక్తిగా పలకడం మొదలు పెట్టారు. తనవాళ్ళు మనుషుల కంటే చాలా భక్తితో శివ నామ జపం చేస్తున్నారని తాత చాలా గర్వపడ్డాడు. మళ్ళీ అందరితో చెప్పాడు. "మనం ఇలాగే దేవుని మీద మనసు పెట్టి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు భజన చేయాలి. పిల్ల కోతి కూడా బాగా భజన చేస్తున్నది వెరీగుడ్." అని. పిల్ల కోతి , అమ్మ కోతి , నాన్న కోతి, అవ్వకోతి , తాత కోతి, బాగా భజన చేస్తున్నారు. ఐదు - పది నిమిషాలు గడిచింది . అందరికీ బాగానే ఉంది . కానీ పిల్లకోతికి ఒక చోట కూర్చుని భజన చేయడం చాలా ఇబ్బందిగా ఉంది . నిదానంగా తెల్లారుతోంది. ఉన్నట్టుండి పిల్లకోతి అమ్మకోతితో , నాన్న కోతితో , అవ్వ కోతితో , తాత కోతితో "నాకొక ఐడియా వచ్చింది చూడండి- సూర్యోదయం సమయంలో ప్రకృతి ఎంత బాగా ఉందో ! మనం ఈ సమయంలో ఈ బండ మీద కూర్చుని భజన చేయడం కన్నా అలా ప్రకృతిలో విహరిస్తూ దేవుని మీద మనసు పెట్టి భజన చేస్తే బాగుంటుందని నాకని పిస్తున్నది" అంది. తాత కోతికి ఈ ఆలోచన నచ్చింది. ఇప్పుడు కోతులన్నీ అడవిలో చెట్లమధ్యన తిరుగుతూ చాలా భక్తిగా ’ఓం నమ: శివాయ’ చెబుతున్నాయి. అలానడుచుకొంటూ పోతూ వుంటే పిల్లకోతికి కొంచెం బాగా వుంది. ఇలా ఐదారు నిమిషాలుగడిచే సరికి దానికిమళ్ళీ ఏదో ఇబ్బంది మొదలయ్యింది. దేవునిమీద మనసు పెట్టలేకపోతోంది. ఇంతలోనే కోతులన్నీ అడవికి ఆనుకొని ఉన్న గంగులన్న తోట దగ్గరికి చేరుకొన్నాయి. ఆ తోటను చూసిన వెంటనే పిల్ల కోతికి ఒక ఐడియా వచ్చింది. "అమ్మ కోతీ , నాన్నకోతీ, అవ్వకోతీ, తాతకోతీ -మనం ఇలా, ఈ చెట్ల మధ్యన తిరిగే బదులు గంగులన్న తోటలో నడుద్దాము . చూడండి, తోట ఎంతబాగున్నదో దేవుని మీద మనసు పెట్టడానికి అది చక్కని వాతావరణము. అందరమూ ఈ అందమైన తోటలో తిరుగుతూ ఈరోజు సూర్యాస్తమయం వరకూ భజన చేద్దాం."అని పిల్లకోతి చెప్పిన మాటకు తాత కోతి సంతోషపడి అందర్నీ తోటలోనికి వెళ్లి భజన చేయమన్నాడు. ఎవరూ అరటిపళ్ల జోలికి మాత్రం వెళ్లకూడదని హెచ్చరించాడు. పచ్చని అరటి తోటలో, పొద్దునే వస్తున్న సూర్యుని కాంతిలో శివుని భక్తిలో మునిగిపోతూ కోతులన్నీ శివనామ జపం చేస్తున్నాయి. భక్తి ప్రభావం వల్ల విరగ కాస్తున్న అరటి పళ్లను తినాలని బుద్ధి పుట్టలేదు. ఐతే ఐదు నిమిషాల పాటు తట్టుకున్న పిల్లకోతి ఇక ఊరుకుండ లేక పోయింది. కానీ ’సాయంత్రం చీకటి పడేంతవరకు ఏమీ తిననని తాతకు మాట ఇచ్చింది కదా, ఇప్పుడు ఎలా?’అది చాలా తెలివైనది కదా. దానికి మళ్ళీ ఒక ఉపాయం వచ్చింది. "అమ్మకోతీ, నాన్నకోతీ, అవ్వకోతీ, తాతకోతీ, మనం ఊరికే ఇలా తోటలో కుర్చొని భజన చేసేకన్నా ఏదైనా పని చేస్తూ భజన చేయవచ్చు కదా! ’ఉపవాసం ఉండాలి, దేవుని మీద మనసు పెట్టి శివనామ జపం చేయాలి. అంతే గాని ఇది చేస్తూ ఏ పనీ చేయకూడదని స్వామి చెప్పలేదు కదా! కాబట్టి మన మంతా తోటలోనే మంచి మంచి అరటి పళ్లను కోసుకొచ్చి ఒక కుప్ప చేద్దాం. ఆ కుప్ప చుట్టూ కూర్చొని సూర్యాస్తమయం వరకు భజన చేస్తూ గడుపుదాం. సూర్యాస్తమయం అయిన వెంటనే మన దైవప్రసాదంలాంటి ఈ తోటలోని అరటి పళ్లను తినడానికి ఆలస్యం కాదు" అని పిల్లకోతి చెబితే దాని అద్భుతమైన ఆలోచనకు తాత ఎంతగానో ముచ్చటపడ్డాడు. అందుకు అనుగుణంగా అందరూ ఏమేం చేయాలో ఆదేశించాడు. అయితే అందరూ శివభజన చేయడం మరువరాదని గుర్తు చేశాడు. ఎవరూ అరటి పళ్లు తినరాదని కఠినంగా చెప్పాడు. కోతులన్నింటికి పనిచేస్తూ భజన చేయడం బాగున్నట్టుంది. తోట దద్దరిల్లేట్లు " ఓం నమ:శివాయ, ఓం నమ:శివాయ" అని అవన్నీ ఒకే గొంతుతో అరుస్తున్నాయి. సైనికుల్లాగా ఒక క్రమ పద్ధతిలో చాలా అరటి పళ్ళు కోసి ఒక పెద్దకుప్ప చేసాయి. పదిరోజులు తిన్నా మిగిలిపోయేన్ని కోసి కుప్ప చేసాయి. పిల్లకోతికి అరటి పళ్ళకుప్పను చూస్తూంటే అదే స్వర్గంలా అనిపించింది. అది కూడా చాలా ఉత్సాహంగా అందరి భజనతో తనగొంతు బాగా కలిపి పని చేస్తోంది. తాత ఇక చాలని చెప్పిన తరువాత అన్నీ కుప్ప చుట్టూ కూర్చొని దేవుని మీద మనసు పెట్టి ఏకాగ్రతతో భజన చేయడం మొదలెట్టాయి. పిల్లకోతి కూడా కొంతసేపు బాగా భజన చేసింది. కాని దానికి గమ్మున కుర్చోని భజన చేయడం చాలా కష్టంగా ఉంది. అందులోనూ ఎదురుగా ఉన్న తియ్యని అరటి పళ్లకుప్ప తనని భజనమీద మనసు పెట్టించలేక పోతున్నది. నోరూరుతోంది. కానీ తాత చెప్పిన మాటలు కూడా చాలా బలంగా గుర్తున్నాయి. ఒక అయిదు నిమిషాలు సతమతమయింది. ఇప్పుడు దానికి ఠపీమని మరొక అద్భుతమైన ఐడియా వచ్చింది. "అమ్మకోతీ, నాన్నకోతీ, అవ్వకోతీ, తాతకోతీ మన మెందుకు ఇలా గమ్మునే కూర్చొని భజన చేయాలి? ఇంతకు ముందే అనుకున్నాం కదా, మనం పనిచేసుకుంటూ భజన చేయవచ్చునని? మనం ఇంతకు ముందు చేసి చూశాం కూడా. మనం పని చేసుకుంటూ ఎంత భక్తితో పని చేసామో! అని పిల్ల కోతి చెబుతోంటే తాతకోతి " మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం " అని అడిగాడు. దానికి పిల్లకోతి " మనం చీకటి పడ్డాక తినడానికి దేవుని ప్రసాదం లాంటి ఈ అరటిపళ్లను రెడీగా ఉంచుకుందాం! వీటి తొక్కలన్ని తీసి పళ్ళను మాత్రం కుప్పగా ఉంచుకుంటే మనం చీకటి పడ్డాక తినడానికి వీలుగా ఉంటుంది. " అని తన ఆలోచన చెప్పింది. ఈ ఆలోచన కూడా కోతులన్నింటికీ నచ్చింది. తమ పిల్లకోతి ఎంత తెలివైనదోనని అన్ని మురిసి పోయాయి. ’వీడు నామనవడ’ని తాత మీసం కూడా తిప్పుకున్నాడు. అరటి పళ్ల చుట్టూ కూర్చొని కోతులన్నీ చాలా భక్తి శ్రద్ధలతో శివ నామం పలుకుతూ పని చేయడం మొదలు పెట్టాయి. చాలా హుషారుగా పని చేస్తున్నాయి అన్నీ. తొందరలోనే అన్ని అరటి పళ్లకూ తొక్కలు తీసేశాయి. లోపలి పండు భాగాలన్నీ ఒక కుప్పగా చేశాయి. తొక్కలన్నిటినీ దూరంగా పడేశాయి. ఏ ఒక్కటీ చిన్న అరటి ముక్కను కూడా తినలేదు. శివుని మీద ఉన్న భక్తి వల్ల ఎవరికీ అసలు తినాలనిపించలేదు. పిల్లకోతికి మాత్రం మనసు కొంచెం అటు వెళ్లింది. అయినా చాలా బాగా ఓర్చుకున్నది. కోతులన్నీ ఇప్పుడు తొక్కలు తీసిన అరటి పళ్ళ కుప్ప చుట్టూ కూర్చొని భజన చేస్తున్నాయి. పిల్ల కోతి కూడా ప్రయత్నం చేసి భజన చేస్తోంది. భజన చేస్తుంటే నోట్లో నుంచి జొల్లు కారుతోంది. ఒక వైపున తియ్యటి అరటిపళ్లు , మరొక వైపున ఉపవాసం గురించి తాత చెప్పిన మాటలు తనను బలంగా గుంజుతున్నాయి. ఏం చేయాలో తోచక పిచ్చి పట్టినట్లు అవుతూ ఉండగా దానికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. ఈ సారి అందరికీ తన ఆలోచను ఇలా చెప్పింది: "అవ్వకోతీ ,తాత కోతీ,అమ్మకోతీ, నాన్నకోతీ - ఇలా గమ్మునే కూర్చుని భజన చేయటం బాగా లేదు. అసలు మనం ఏదైనా పని చేస్తూ భజన చేసినపుడే మన భజన బాగా నడుస్తుంది. అందువల్ల ఇప్పుడు మనం ఒక పని చేయవచ్చు. మనముందున్న తొక్కల్లేని అరటి పళ్ళను ఎవరికి వాళ్లు వీలైనన్ని నోట్లో పెట్టుకోవాలి . ఐతే సూర్యాస్తమయం వరకు ఎవరూ మింగకూడదు. దేవుని మీదనుండి మనసు మళ్లించకుండా శివభక్తితో నామస్మరణ చేస్తూ కూర్చుందాం . ఉపవాస సమయం అయీపోతునే మనం ఆలస్యం కాకుండా దేవుని ప్రసాదం తినేయవచ్చు. సరేనా?" అని పిల్లకోతి అందరినీ అడిగింది. అప్పటికే కోతులన్నీ పిల్లకోతి తెలివి తేటలకు చాలా ముగ్దులై ఉన్నాయి. తాతకోతి కూడ మరొక ఆలోచన లేకుండా సరే అన్నది. కోతులన్నీ వీలైనన్నిపళ్ళను నోటీలో దోపుకున్నాయి. గొంతులోకి ఏదీ వెళ్ళకుండా జాగ్రత్తపడుతున్నాయి. నోట్లో ఎంగిలి ఊరినా అది గొంతులోకి పోకుండా చూసుకుంటున్నాయి. పిల్లకోతి కూడా వీలైనంత జాగ్రత్త పడుతున్నది. అయితే అందరికంటే దానికి చాలా ఇబ్బందిగా వుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కోతులు శివనామ జపం ఆపలేదు. అయితే ఇప్పుడు అందరినుండి శబ్దాలు కొంచెము పిచ్చి పిచ్చి గా వస్తున్నాయి. బుగ్గలనిండా కూరుకున్నఅరటి పళ్లు " ఓం నమ:శివాయ" అని పలకడానికి అడ్డము వస్తున్నాయి. అయినా వాటి మనసుల్లో శివుని మీద ధ్యాస స్పష్టంగా ఉంది. ఇంతలో "తాతా ! పండు గొంతులోకి వెళ్లి పోయింది" అని పిల్ల కోతి గట్టిగా అరిచింది. "అవునా" అనేసరికి తాత గొంతులోదీ వెళ్లిపోయింది. "నా పండూ వెళ్లి పోయింది" అని తాత అనే సరికి అవ్వ "అయ్యో" అన్నది . దాంతో అవ్వ గొంతులోకి ఒక అరటి పండు జారి పోయింది . ఇలా అమ్మ కోతి , నాన్న కోతి కూడా అరటి పళ్లు మింగేశాయి. ఇక చేసేది లేక "శివా, శివా ! శివాశివా !" అని నిట్టూర్చుతూ అందరూ తమ బుగ్గల్లో యిరికించుకుని వున్న అరటి పళ్ళను అన్నీ తినేశాయి. ఇంకా సమయం ఉదయం 6 గం|| కూడా కాలేదు అప్పటికే తమ ఉపవాసం భంగం జరిగిపోయింది శివరాత్రి పుణ్య ఫలాన్ని దక్కించుకొనే భాగ్యం కలగలేదని తాత కోతి ,అవ్వకోతి, అర్ధ గంట సేపు ఏడ్చారు. అమ్మ కోతి ,నాన్న కోతి కూడ పెద్దోళ్ల భాధను చూసి ఏడ్చారు. దీని కంతటికి తననే బాధ్యుణ్ని చేస్తారని భయంతో పిల్ల కోతి ఇంకా బిగ్గరగా ఏడ్చింది. పొద్దున్నే కోతుల ఏడుపులు విని గంగులన్న ఒక దుడ్డుకర్ర తీసుకుని కోతుల దగ్గరకు వచ్చాడు. కొన్ని వందల అరటి పళ్ళు కోసుకుని , వాటి తొక్కలు తీసేసి, తొక్కల్లేని పళ్లను ఒక పెద్ద కుప్ప చేసి, దాని చుట్టూ ఏడుస్తూ కూర్చున్న కోతుల్ని చూసేసరికి గంగులన్నకి పట్టరాని కోపం వచ్చింది. దుడ్డుకర్ర తీసుకొని వాటికి నాలుగు అంటించాడు . అవి "కుర్రో మొర్రో" అని అరుచుకుంటూ అడవిలోకి పారిపోయాయి . వచ్చే సారి శివరాత్రికి పిల్ల కోతి తెలివి తేటలు మీద ఆధార పడకూడదని తాత కోతి, అవ్వ కోతి అనుకున్నాయి . ఈ సారి శివరాత్రి ఉపవాసం ఎలాగూ పాడైపోయింది కదా , ఇక కడుపు నిండా తిని హాయిగా ఉందామని కోతులన్నీ ఎర్రప్ప మామిడి తోటకి వెళ్ళాయి.   కొత్తపల్లి.ఇన్ సౌజన్యంతో  

దయ్యం

దయ్యం - పి. సయ్యద్ అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఇద్దలు బాల మిత్రులు. రాము, సోము వారి పేర్లు. ఒక సారి రాము, తనకు కావాల్సిన నోటుపుస్తకం ఒకదాన్ని సోము దగ్గరినుండి ఇప్పించుకున్నాడు. తీసుకున్న నోట్సును సోముకి తిరిగి ఇవ్వడానికి రాత్రి సమయంలో వెళ్ళాడు. రాత్రిపూట ఒంటరిగా తమ ఇంటికొచ్చిన రాముతో సోము అన్నాడట, "ఒరేయ్ రామూ! ఇంత రాత్రిలో ఒంటరిగా వచ్చావా? ఇలాగ ఇంకెప్పుడూ రాకురా!" అని. అప్పుడు రాము "ఎందుకు సోమూ?" అని అడిగాడట. "రాత్రి వేళల్లో దయ్యాలు తిరుగుతాయిరా! అందుకనే రాత్రిపూట తిరగరాదు" అన్నాడట సోము. "ఏంటీ, దెయ్యాలా! అవెక్కడుంటాయి రా?" అనడిగాడట రాము. "అవా! అదిగో ఆ చింత చెట్లమీదుంటాయి" అని రెండు చింత చెట్లను చూపించాడట సోము. అది విన్న రాము గట్టిగా నవ్వి, "దెయ్యాలూ లేవు, భూతాలూ లేవు" అన్నాడట. కానీ సోము మాత్రం ఒప్పుకోలేదట. పైగా "నీకు దెయ్యాలు లేవని నమ్మకం ఉంటే, రేపు రాత్రికి వెళ్ళి ఆ చింతచెట్టు కొమ్మ మీద ఒక మేకు కొట్టిరా రామూ!" అన్నాడట. రాము సరే నన్నాడట. నిజానికి వాడికి కూడా దయ్యాలుంటాయేమోనని అనుమానమే. కాని పైకి మాత్రం లేని గాంభీర్యం నటించాడు అంతే. మరునాడు అమావాస్య. రాము మిత్రునికిచ్చిన మాట ప్రకారం ఆ రాత్రికి ఒక మేకు తీసుకొని, సోము చూపించిన చెట్టు దగ్గరకు వెళ్ళాడు. భయం భయంగానే చెట్టును ఎక్కాడు. అత్రంగా మేకును చెట్టుకు కొట్టబోయాడు. బదులుగా దాన్ని తన ప్యాంటుమీదనే కొట్టుకున్నాడు. ఇక దిగి రావాలని ప్రయత్నించిన రాముకి తన కాలినేదో పట్టుకున్నట్టుగా అనిపింది. చీకటి మాపున ఆ పట్టుకున్నదేమిటో తెలియలేదు. నిజంగానే దయ్యం పట్టుకున్నదనిపించింది వాడికి. ఉన్న ధైర్యం కాస్తా ఆవిరైపోయింది. మనస్సునంతా భయం ఆవరించింది. ఆ భయంతోనే వణికిపోయాడు. కొమ్మపైనుండి కిందికి పడి, కాళ్ళు చేతులు విరగగొట్టుకున్నాడు. అనుమానం ప్రాణ సంకటం. ఏ పనినైనా చెయ్యాలంటే ధైర్యంగా చేయాలి. భయపడుతూ చేసిన పనులు సజావుగా కాకపోవటంలో ఆశ్చర్యమేమున్నది?   కొత్తపల్లి .ఇన్ వారి సౌజన్యం తో

కీలుగుర్రం

కీలుగుర్రం   - రేణుక   పూర్వం ఒక దేశాన్ని ఓ అందమయిన రాజు పాలించేవాడు. ఆ రాజుకు ఒక భార్య ఉండేది. వారి రాజ్యం సిరిసంపదలతో, పాడిపంటలతో తులతూగేది. ఒకసారి, రాజు వేటకని అడవికి వెళ్ళాడు. ఆ అడవిలోని రెండు ఆడదయ్యాలు రాజును చూసి, అందగాడయిన ఆ రాజును ఎలాగయినా పెళ్ళాడాలనుకొన్నాయి. నేను చేసుకొంటానని ఒకటంటే, కాదు, రాజు నావాడన్నది మరో దయ్యం. రెండూ న్యాయంకోసం మరో దయ్యం దగ్గరికి వెళ్ళాయి. ’రాజు వేటాడుతున్న అడవికి తూర్పుకు ఒకరూ, పడమటికి మరొకరూ వెళ్ళండి. రాజు ఏ దిక్కుకు వస్తే ఆ దిక్కున ఉన్నవాళ్లు రాజును పెళ్ళి చేసుకోండి’ అని చెప్పింది ఆ దయ్యం. రాజును పెళ్ళాడిన వారు గెలిచినట్లు, మరొకరు ఓడినట్లు. మరి ఓడినవారు గెలిచినవారు చెప్పినట్టు వినాలి’ అని కూడా తీర్పు చెప్పిందది. దయ్యాలు రెండూ అందుకు అంగీకరించాయి. వాటిలో పెద్దదేమో తూర్పుకూ, చిన్నదేమో పడమటికీ వెళ్ళాయి. ఆరోజున రాజు తూర్పు వైపుకు వెళ్ళాడు! ఇక తూర్పువైపునున్న పెద్దదయ్యం అందమైన కన్యగా మారి రాజుకు ఎదురుపడింది. రాజు ఆమె అందానికి ముగ్ధుడయి, ఆమెను పెళ్ళిచేసుకొని తనతో తీసుకెళ్ళాడు. రాజును పెళ్ళాడిన పెద్ద దయ్యం వెంటనే తనప్రాణాలను ఓ చిలకలో ఉంచి, దాన్ని ఓడిపోయిన దయ్యానికిచ్చింది. "ఏడు చెరువులూ, ఏడు నదులూ, ఏడు సముద్రాలూ దాటి, అక్కడున్న పెద్ద మర్రితొర్రలో ఉంటూ తన ప్రాణాలను కాపాడుతూ ఉండమ"ని చెప్పి పంపేసింది. అలా అది తన ప్రాణాలకు రక్షణ తెచ్చుకోవటంతోపాటు తన పోటీదారుకు దేశ బహిష్కారం కూడా చేయగల్గింది. ఆ సమయంలోనే రాజు మొదటి భార్య గర్భవతి అయ్యింది. కొన్నాళ్ళు గడిచాయి. రెండవ రాణిగా ఉంటున్న పెద్ద దయ్యానికి రాజభవనంలోని తిండి ఏమాత్రమూ రుచించలేదు. రోజూ దొరికిన ప్రతి జంతువునూ తినే దానికి ఆ తిండి ఎలా నచ్చుతుంది, మరి?! ఒక ఉపాయం ఆలోచించి ఒక నాటి రాత్రి బయటికి పోయి కోటలోని జంతువులను తిని వచ్చింది. ఉదయాన్నే భటులు పరుగుపరుగున వచ్చి, రాజుతో జంతువులన్నీ మాయమయ్యాయన్న విషయాన్ని చెప్పారు. రాజు తగిన ఏర్పాట్లు చేయించాడు. సరిగ్గా అప్పుడే రాజు గారి మొదటి భార్యకు రెండవ భార్యమీద అనుమానం వచ్చింది. అది తెలుసుకొన్న రెండవ భార్య, మరునాటి రాత్రి ఆహారం కోసం వెళ్ళివచ్చి, రాణి పక్కన రక్త మాంసాలను వేసి, రాణి మూతికీ, చేతులకూ రక్తాన్ని పూసింది. మరునాడు ఉదయమే భటులొచ్చి విషయాన్ని రాజుతో చెప్పారు. ఇంతలోనే రాజు రెండవ భార్య వచ్చి, రాణిగారి గదిలో రక్తమాంసాలున్నట్లు చెప్పింది. అది చూసి రాజు, తన మొదటి భార్యే జంతువులన్నింటినీ చంపి తింటున్నదని అనుకొని, ఆమె కళ్ళు పీకి, అడవిలో వదలి రమ్మన్నాడు. భటులు, రాజుమాటను పాటించారు. అడవిలో ఉన్న గుడ్డి రాణిని ఒక ముని చేరదీశాడు. ఆమెకు ఒక కొడుకు కుడా పుట్టాడు. ఆ ముని, ఆ అబ్బాయికి అన్ని విద్యలూ, నేర్పాడు. ఇదిలా ఉండగా, రాజు రెండవ భార్యగా ఉంటున్న దయ్యం రాజ్యంలోని చాలా జంతువులను , తినేసింది. రాజ్యంలో కరువు తిష్ఠ వేసింది. మరోవైపున రాకుమారుడు విద్యాభ్యాసం ముగించుకొని, దేశాటనకు తన కీలుగుర్రం ఎక్కి బయలుదేరాడు. ఒక నాటి రాత్రికి రాజుగారి కోటను చేరాడు. ఆకాశంలోనుండి చూస్తున్న రాకుమారునికి, కోటలోని ఏనుగును తింటున్న ఓ దయ్యం కనిపించింది. అంతలోనే ఆ దయ్యం కూడా రాకుమారుణ్ణి చూసి, రాణిగా మారి కోటలోకి మాయమయింది. దాన్ని రాకుమారుడు గమనించాడు. దయ్యం వీడి పీడను ఎలాగయినా వదిలించుకోవాలని, మర్నాటి ఉదయం "తలనొప్పి, తలనొప్పి..." అంటూ నటనమొదలెట్టింది. రాజవైద్యుల వైద్యం రాణి తలనొప్పిని తగ్గించలేకపోయింది. అపుడు రాణి, "రాజా ! నా తలనొప్పి పోగొట్టే మందు ఇక్కడెక్కడా లభించదు. ఏడుచెరువులూ, ఏడు నదులూ, ఏడు సముద్రాలూ దాటి, అక్కడున్న పెద్ద మర్రి చెట్టు తొర్రలో నేనిచ్చే చీటీ ఇస్తే, నాకు కావలసిన మందు దొరుకుతుంద"ని చెప్పింది. రాజు అంత దూరం పోయివచ్చేవారికోసం దండోరా వేయించాడు. మందు తెచ్చిన వారికి తన రాజ్యంలో సగ భాగాన్ని ఇస్తానన్నాడు. విషయాన్ని తెలుసుకున్న రాకుమారుడు, ఆ పని తను చేస్తానన్నాడు. రాజు సంతోషంతో, విషయాన్ని రాణికి చెప్పాడు. రాణి ఆ అబ్బాయిని చూసి "వీణ్ణి చంపి తిను" అని తన భాషలో ఒక చీటీని రాసి ఇచ్చి, ’ఇక వీడి పీడ వదిలిపోతుంది’ అనుకుని తృప్తి పడింది. రాకుమారుడు ఆ చీటీని తీసుకొని తన కీలు గుర్రం ఎక్కి బయలుదేరాడు. ఏడు చెరువులూ, ఏడు నదులూ, ఆరు సముద్రాలూ దాటాక, రాకుమారునికి ఒక ముసలి దయ్యం, అనారోగ్యంతో కదలలేక కనిపించింది. రాకుమారుడు జాలితో ఆ దయ్యానికి సాయం చేశాడు. నాలుగు రోజులు అక్కడే ఉన్నాడు కూడా. నాల్గవ నాటి రాత్రి రాకుమారుని జేబులోని చీటీ కిందపడి, ముసలి దయ్యానికి దొరికింది. దయ్యం చీటీని చదివి "అయ్యో ! ఇంత మంచి అబ్బాయిని ఎవరో చంపాలని పన్నాగం పన్నారు. అలా జరగడానికి వీలు లేదు. వారినే అంతం చేయాలి" అని, ఆ చీటీని చించేసి, "ఇతన్ని బాగా చూసుకో . నా ప్రాణాలను ఇతని చేతికిచ్చి పంపు" అని మరో చీటీ రాసి రాకుమారుని జేబులో ఉంచింది. మర్నాటి ఉదయం రాకుమారుడు బయలుదేరి ఏడవ సముద్రాన్ని దాటి, అక్కడున్న మర్రి తొర్ర వద్దకువెళ్ళి, ’ఎవరమ్మా లోపల?’ అని అడిగాడు. లోపలినుండి ఒక అందమైన ఆడ మనిషి వచ్చి, ఎవరు కావాలన్నది. రాకుమారుడు తన దగ్గరున్న చీటీని ఆమెకిచ్చాడు. ఆమె ఉత్తరాన్ని చదివి, తన యజమాని దయ్యం తన కొడుకునే పంపిందేమోననుకొని, అన్ని విషయాలూ రాకుమారుడితో చెప్పేసింది. దయ్యం ప్రాణాలున్న చిలుకను అతనికి ఇచ్చేసింది కూడా. రాకుమారుడు మరునాడే బయలుదేరి, ఒక నాటి రాత్రికి కోటను చేరాడు. ఆ సమయానికి దయ్యపు రాణి కోటలోని గుర్రాలను తింటున్నది. అది చూసిన రాకుమారుడు, దయ్యం ప్రాణాలున్న చిలుక కాళ్ళనూ, రెక్కలనూ విరిచాడు. దయ్యం కాళ్ళూ, చేతులూ పోయి, బాధతో గట్టిగా అరిచింది. ప్రజలంతా వచ్చారు. రాజు కూడా వచ్చాడు. అందరూ అక్కడి పరిసరాలనుచూసి, భయపడ్డారు. రాకుమారుడు తన కీలు గుర్రం దిగివచ్చి "ఓ దయ్యమా ! ఇప్పటికయినా నిజం చెప్పమ"న్నాడు. దయ్యం జరిగినదంతా చెప్పేసింది. రాజు కోపంతో చిలుకను, దానితోపాటు దయ్యాన్ని చంపేశాడు. తమ రాజ్యాన్ని గొప్ప ఆపద నుండి కాపాడినతను ఎవరని రాకుమారుణ్ణి అడిగాడు రాజు. రాకుమారుడు తన చరిత్రనంతా రాజుతో చెప్పాడు. అప్పుడు రాజు, తన తల్లిని చూపించమని రాకుమారుణ్ణి అడిగాడు. రాకుమారుడు తన తల్లిని చూపాడు. తన తప్పును గుర్తించిన రాజు రాణిని, కుమారుడిని క్షమాపణ వేడాడు. ఆ తరువాత అందరూ కలిసి సుఖంగా జీవించారు.   కొత్తపల్లి .ఇన్ సౌజన్యం తో