కాయలతో కథ
posted on Jan 28, 2014
కాయలతో కథ
అనగనగా ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మ ఈతకాయంత ఇంట్లో ఉంది. ఆ మునక్కాయంత ముసలమ్మ దగ్గర బాదం కాయంత బంగారం ఉంది. మునక్కాయంత ముసలమ్మ బాదంకాయంత బంగారాన్ని పనసకాయంత పెట్లో పెట్టి తాటికాయంత తాళం వేసింది.
అయితే ఒక రాత్రి దోసకాయంత దొంగ ఈతకాయంత ఇంట్లో జొరబడి, తాటికాయంత తాళం పగులగొట్టి బాదంకాయంత బంగారాన్ని దోచుకుపోయాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకు ఫిర్యాదు చేసింది. పొట్లకాయంత పోలీసు వెళ్లి దోసకాయంత దొంగని వెతికి పట్టుకొని జామకాయంత జైల్లో పెట్టాడు.
మునక్కాయంత ముసలమ్మని పిలిచి బాదంకాయంత బంగారాన్ని ఇచ్చేశాడు.
ఉపయోగాలు- ఈ కథ పిల్లలకు చెప్పడం వల్ల వారికి తెలుగులో కాయల పేర్లు తెలుస్తాయి. పైగా కథా రూపంలో ఉండటం వల్ల సలభంగా గుర్తుపెట్టుకుంటారు. తోటి స్నేహితులకు చెప్పి ఆనందాన్ని పొందుతారు. అంతేకాదు ప్రతి కాయని మనుషులు, వస్తువులతో పోల్చడం ఈ కథలోని మరో విశేషం. చిన్నారులకు దొంగతనం చేయడం తప్పు, అనే నీతిని కూడా ఈ కథ బోధిస్తుంది. ఒక వేళ చేస్తే పోలీసులు పట్టుకుంటారు అనే సామాజిక పరిజ్ఞానాన్నీ చిన్నిబుర్రలకు అందిస్తుంది. అందుకే మనకు సంప్రదాయంగా వస్తున్న కథలను చిన్నారులకు తప్పక చెప్పాలి. అప్పుడే వారిలో సృజనశక్తికి బీజాలు పడతాయి.
ఈ కథలో వచ్చిన కాయలు-
1. ఉసిరికాయి
2. మునక్కాయ
3. ఈతకాయ
4. బాదంకాయ
5. పనసకాయ
6. తాటికాయ
7. దోసకాయ
8. పొట్లకాయ
9. జామకాయ
కథంతా విన్నాక ఈ కథలో ఎన్ని కాయలు ఉన్నాయని ప్రశ్నించి పిల్లల జ్ఞాపకశక్తికీ పదును పెట్టొచ్చు....
సేకరణ- డా. ఎ. రవీంద్రబాబు