తోట బాట

తోట బాట   అనగనగా ఓ తోట- అసలది తోటో, కాదో తెలీదు. ఏవో కొన్ని చెట్ల లాంటివి, తుప్పల లాంటివి ఉన్నై తప్ప, దానికి నిజంగా తోటకుండాల్సిన లక్షణాలు వేరే ఏమీ లేవు. తోటలో ఎక్కడ చూసినా ఎండి మ్రోడులై పోయిన చెట్లు. ఎండుటాకులు ఇరుక్కున్న బోడి కొమ్మలు. కాలిబాటల్లో నిండా ఒత్తుగా రాలి పడిపోయిన గోధుమరంగు ఆకులు. ఎటు చూసినా దుమ్ము. ఎడారిలో వీచినట్లు వేగంగా వీస్తున్న పొడిగాలి. నీరసించి పోయిన చెట్లు తమ ఆకుల బరువును కూడా మోయలేక పోతున్నై. ఎండిపోయిన రెమ్మలు గాలికి కొట్టుమిట్టాడుతున్నాయి. ఎక్కడా ఒక పిట్టగాని, ఒక జంతువు గాని కానరావట్లేదు. ప్రాణంలేని ఆ తోటలో, ఒకరోజున పుట్టిందో చిట్టి గడ్డి పువ్వు. పుట్టగానే కళ్ళు తెరిచి అటూ ఇటూ చూసింది. తోడుగా ఒక్క పువ్వూ కనబడలేదు. చూసి చూసి చిట్టి పువ్వు తన చుట్టూ ఎగిరే ఎండుటాకులను పలకరించింది. "ఏంటన్నలూ, బాగున్నారా?!" అని. జీవంలేని ఆకులు మూలిగాయి-" ఏం బాగు చెల్లీ, ఇదిగో ఇట్లా కొట్టుకుపోతున్నాం. నువ్వూ వచ్చావే పాపం, ఈ‌ పాడు ప్రపంచంలోకి!" అంటూ అది ఇచ్చే జవాబు వినకనే ఎగిరిపోయాయి. ఆకుల్ని ఎగరేసుకుపోతున్న సుడి గాలి చిట్టిపువ్వుని చూసి ఎగతాళిగా నవ్వింది-"ఏంటే, మిడిసి పడుతున్నావ్? కాలం కాని కాలంలో పుట్టింది చాలక, ఇంకా ముచ్చట్లు కావాలటనే,నీకు?" అని ఉరిమింది. చిట్టి గడ్డి పువ్వు పాపం, చిన్నబోయింది. క్రిందికి వాలి తన ముఖాన్ని తల్లి రెమ్మల్లో దాచుకున్నది. తల్లి మొక్క దాన్ని చూసి నిట్టూర్చింది "పాపం, పిచ్చిది- కాలం కాని కాలంలో పుట్టింది. దీనికి ఒక్కతోడు కూడా లేదు" అనుకుంది. అంతలోనే ఏమైందో మరి- చల్లటి పిల్ల గాలులు వీచాయి. ఆ గాలికి, అంతకు ముందున్న గాలికి ఎంత తేడా!? ఈ గాలి గుసగుసలాడింది- కొమ్మ కొమ్మనూ ఊపి చెప్పింది-"లేండమ్మా! లేండి! నిద్ర చాలించి లేవండి! గొప్ప సమయం వచ్చేసింది- ఇంకా నిద్రపోతారా, ఎక్కడన్నా, గలీజుగా?!" అంది. మరునాడు చిట్టి గడ్డి పువ్వు లేచి చూసేసరికి కొమ్మలన్నీ కొత్త కొత్త చిగుళ్ళు తొడుక్కొని సిగ్గు పడుతున్నాయి. రెమ్మ రెమ్మా సంతోషంతో మొగ్గలు వేస్తున్నది. "ఏమైంది, ఏమైంది" అంది గడ్డి పువ్వు. "పండగొచ్చేసింది! పండగొచ్చేసింది!" అన్నది తల్లి చెట్టు సంబరంగా. అంతలోనే తుమ్మెదలూ, తేనెటీగలూ 'ఝుం..ఝుం.." అంటూ ఎగిరొచ్చి తిరగటం మొదలు పెట్టాయి. నిద్రపోతున్న చిట్టి చిట్టి మొగ్గలు ఒక్కొక్కదాన్నీ అవి తట్టి లేపాయి- "శుభోదయం! లేవండి లేవండి! పండగ రోజులు వచ్చేశాయి లేవండి!" అన్నాయి. వాటి మాటలు విని వికసించిన పువ్వుల్లోంచి వెలువడిన సువాసనల్ని మోసుకెళ్తూ కొత్తగాలి మహా బరువెక్కి మత్తెక్కించింది. చిట్టి గడ్డి పువ్వుకి మహా సంబరంగా ఉంది ఇదంతా. అంతలోనే ఓ మూలగా వేపచెట్టు మీదికొచ్చి వాలిందో కోయిల. మరొకటి ఎగిరొచ్చి మామిడి చెట్టు మీద కూర్చున్నది. వచ్చీ రాగానే రెండూ పాటల పోటీ మొదలెట్టాయి. "కొత్త యుగం వచ్చేసింది-లేవండోయ్-లేవండోయ్! సంతోషంగా మీరందరూ కళకళలాడండోయ్! గలగల నవ్వండోయ్!" అని అవి పాడే కొత్త పాటలు వింటూ చిట్టి గడ్డిపువ్వుతో సహా తోటలోని పూలన్నీ పరవశించి పోయాయి. ఎక్కడెక్కడినుంచో ఎగిరొచ్చిన పిట్టలు కిలకిలమంటూంటే, కొమ్మలన్నీ గలగలమన్నాయి. 'కొత్త చిగుళ్ళు తొడుగుదాం, నిజంగానే పండగ వచ్చేసింది!' అని ఒక్కటొక్కటిగా అన్ని చెట్లూ తొందరపడ్డాయి. వసంతుడు చేసిన ఈ మాయాజాలంతో చిట్టి పొట్టి పిల్లలు, వాళ్ల అమ్మానాన్నలు అందరూ ఇప్పుడు తోటల బాట పట్టారు. వాళ్ల నవ్వులతో కలగలసిపోయిన పూల సొగసులు మాగొప్పగా అనిపిస్తున్నాయి. వసంతుడు కురిపించిన మంత్రపు జల్లులో తడిసి, తోటలన్నీ చివురించాయి; ముగ్ధమనోహరంగా తయారయ్యాయి. ఆశలు మోసులు వేసే ఈ సమయంలో మరి మీరేం చేస్తున్నారు? ఇంట్లోనే ఉన్నారా, పదండి, తోటబాట పట్టండి! - kottapalli.in సౌజన్యంతో

అసమానం

అసమానం చలికాలం. రోజూ మంచు కురుస్తోంది. ఇప్పుడైతే సమయం ఏడు గంటలవుతున్నది. పిల్లలు రమేష్, స్వర్ణ లోపలి గదిలో ముడుచుకొని పడుకొని ఉన్నారు. వాళ్ళ నాన్న మూర్తి టీ త్రాగుతూ పేపరు చదువుతూన్నాడు. వాళ్ళమ్మ సుజాత వంటగదిలో టిఫిన్ తయారీలో ఉంది- పనమ్మాయి శాంతిని ఎప్పటిమాదిరే తిడుతోంది: "ఇదిగో, నీకు వంద సార్లు చెప్పాను- గిన్నెలు కడిగామంటే అవి తళతళలాడాలి. ఇట్లా జిడ్డోడుతూ ఉండకూడదు. మనసు ఎక్కడ పెట్టుకొని పనిచేస్తున్నావ్?" అని అరుస్తున్నది. "అబ్బ! ప్రశాంతంగా పేపరు చదువుకోనివ్వరే! శాంతీ, ఇటొచ్చి ఈ టీ కప్పు తీసుకెళ్ళు! ప్రతిరోజూ చెప్పాలి నీకు!" రోజూ లాగే కసురుకున్నాడు మూర్తి. "పో! పోయి సార్ దగ్గర టీ కప్పు తీసుకొచ్చి, దాన్నీ- దాంతోబాటు ఈ జిడ్డు గిన్నెల్నీ మళ్ళీ కడుగు. ఇల్లంతా ఊడ్చి తడిబట్టతో తుడువు. మనసు పెట్టు కొంచెం. అట్లా మజ్జుగా, బద్ధకంగా ఉండకు. పనులు ప్రతిరోజూ చెప్పించుకునేదెందుకు? ఇంతకీ‌ ముఖం కడుక్కున్నావా, ఇంకా దానికి ముహూర్తం అవ్వలేదా?" హుంకరించింది సుజాత. శాంతి తలవంచుకొనే "లేదాంటీ, ఇంకా కడుక్కోలేదు- సమయం చాల్లేదు" అంది, వెళ్ళి టీ కప్పు తెచ్చి కడిగేస్తూ. ఇల్లంతా ఊడ్చి తడిబట్టతో తుడిచేటప్పటికి ఎనిమిది కావొస్తున్నది. మూర్తి ఇంకా పేపరు చదువుతూనే ఉన్నాడు. పిల్లలిద్దరూ పడుకొని ఉన్న గదిలోకి వెళ్ళి, వాళ్ళకేసి మురిపెంగా చూసుకున్నది సుజాత. అమాయకంగా నిద్రపోతున్న రమేష్, స్వర్ణల్ని చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నారో! "బాబూ! నాన్నా- చిన్నా రమేష్! లే నాన్నా!- పాపా, స్వర్ణా, చిట్టి తల్లీ, లేమ్మా, లే! సమయం ఎనిమిది అవుతోంది. బడికి వెళ్ళొద్దూ? బళ్లో మీ సార్లూ టీచర్లూ అందరూ ఎదురుచూస్తుంటారు గదా?! శాంతీ! పిల్లలు లేచేసరికి వేడినీళ్ళు సిద్ధం చెయ్యాలని వందసార్లు చెప్పాను. అబ్బ, నీకు పని చెప్పటం నా బుద్ధి తక్కువ- నాయనా చిన్నా, పాపా- చిట్టి తల్లీ, లేవండిరా, లేవండి" అని ఓ పదిసార్లు ముద్దు ముద్దుగా, హడావిడిగా పిల్లల్ని లేపే సరికి మరో పదిహేను నిముషాలయింది. లేవగానే పిల్లలిద్దరూ శాంతిమంత్రం మొదలెట్టారు-"శాంతీ! బ్రష్ ఎక్కడ? శాంతీ, పేస్టు కనబడటం లేదు! శాంతీ! నా బట్టలు ఇస్త్రీ చెయ్యలేదా? శాంతీ, అబ్బ- షూస్ పాలిష్ చేయమన్నానా- ఎంత వికారంగా చేస్తావో చూడు! నీకసలు ఏ పనీ చక్కగా రాదే? శాంతీ, జడలు వెయ్యి!" అంతలో మూర్తి లేచి "శాంతీ! బాత్రూంలో నీళ్ళు పెట్టు! ఏ టైముకు ఏం చెయ్యాలో నీకు ఎప్పుడూ ఎవరో ఒకరు ఎందుకు చెప్పాలి? అన్నీ వరసగా చేసుకుంటూ పోవచ్చు కదా? అబ్బ, అసలు నీకు పనులు చెప్పేకంటే మా పనులు మేమే చేసుకోవటం నయమనిపిస్తున్నది" అని విసుక్కున్నాడు. సుజాత అరిచింది వంటరూంలోంచి- "ఓ శాంతీ! మొద్దు పిల్లా! వినిపిస్తున్నదా? సారుకు నీళ్ళు పెట్టు. అంత బద్ధకంగా ఉండకు. ఇదిగో, టిఫిన్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టు. చేతులు బాగా కడుక్కో. ప్లేట్లూ, గ్లాసులూ, స్పూన్లూ అన్నీ తీసుకొచ్చి పెట్టు- చిన్న బాబూ! స్నానం అయ్యిందా? చిట్టి తల్లీ, ఎంతవరకూ వచ్చావు? శాంతీ! పాపకు జడలు వెయ్యి! చేతులు కడుక్కో, ముందు- ఎక్కడెక్కడ పెడతావో ఏమో, పది నిముషాలకోసారి చేతులు కడుక్కొమ్మంటే కడుక్కోవే?! సారు బట్టలు ఇస్త్రీ చేశావా, లేదా? వెంటనే చెయ్యి! లేకపోతే నా ప్రాణం తింటారు" వరసగా చదివింది. శాంతి రమేష్‌కి షూస్ పాలిష్ చేసిచ్చింది; స్వర్ణకు జడలు వేసింది; సారుకు ఇస్త్రీ బట్టలు అందించింది; అన్నీ అయ్యాక సుజాతకు టిఫిన్ పెట్టింది; వాషింగ్ మెషీన్లో బట్టలు వేసింది; అప్పుడు వెళ్ళి మొహం కడుక్కున్నది- సుజాత అరుస్తోంది- "శాంతీ! ఎక్కడికెళ్ళావ్? ఎంత సేపు?! అబ్బ- నీకు చెప్పేకంటే నేను చేసుకున్నది మేలు..." అని. శాంతికి తొమ్మిదేళ్ళు. మూడో తరగతి వరకు బడికి వెళ్ళింది. ఆ తర్వాత ఇట్లా సుజాత వాళ్ళింట్లో పనికి కుదురుకున్నది. ఎవరేమన్నా, నవ్వుతూ- నిబ్బరంగా- అమాయకంగా- పనులు చేస్తూ పోతుంది. ఇట్లా లెక్కలేనంతమంది శాంతులు- పసితనంలోనే అంతలేసి బరువుల్ని మోసే పెద్దవాళ్ళు. ఎంత సాయం చేసినా కూసింత మెప్పూ పొందని చిన్నారులు- వీళ్లకి వేరే మంచి అవకాశం ఏదైనా ఉంటే బాగుండు గదా, మంచి ప్రత్యామ్నాయం దొరికితే బాగుంటుంది. మూర్తిగారిలాంటి పెద్దలు ప్రొద్దునే పేపరు చదవటం తగ్గించుకొని ఇంటిపనులు చేసే రోజులొస్తే బలే ఉంటుంది. సుజాతలాంటి తల్లులు తమ పిల్లలమీద చూపించే ప్రేమలో ఓ చిన్న భాగాన్ని శాంతి లాంటి అసమానులకూ కేటాయించగల్గితే బాగుండు. రమేషులూ, స్వర్ణలూ తమ తోటి పిల్లల ప్రతిరూపాల్ని శాంతుల్లోనూ చూడగల్గితే బాగుండు. -కదూ? చక్కని హృదయాలున్న మీకందరికీ ఈ చలికాలంలో వెచ్చటి అభినందనలు! .......... kottapalli.in సౌజన్యంతో

స్వచ్ఛ భారత్

  స్వచ్ఛ భారత్ దక్షిణాఫ్రికాలో నల్ల జాతివారికి ఎలాంటి హక్కులూ ఉండేవికావు. "మమ్మల్ని కూడా సమానంగానే చూడాలి" అని అక్కడ గొడవ మొదలుపెట్టాడు గాంధీ. ఆయన పోరాటానికి నేటాలులోని భారతీయులు అనేకమంది మద్దతు పలికారు. ఆ సమయంలో భారతదేశం బ్రిటిష్‌వారి చేతుల్లో ఉండింది. "మాకు హక్కులు ఇవ్వాలి" అని మీటింగులు పెట్టేవాళ్ళు కాంగ్రెస్ నాయకులు. "దక్షిణాఫ్రికా భారతీయుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు బాగుంటుంది" అనుకున్నాడు గాంధీ. కలకత్తాలో జరుగుతున్న కాంగ్రెస్ మహాసభల్లో దక్షిణాఫ్రికా గొంతుని వినిపించాలని ఉత్సాహంగా ఇండియాకు వచ్చాడు. కాంగ్రెస్ మహాసభ ఓ పెద్ద బహిరంగ స్థలంలో జరుగుతూ ఉండింది. సభల్లో పాల్గొనేందుకు దూరదూరాల నుండి ఎవరెవరో మహా నాయకులు వచ్చి ఉన్నారు. వారందరి మధ్యా పిట్టలాంటి గాంధీని ఎవ్వరూ పట్టించుకోలేదు. సభ మొదలయిన కొద్దిసేపటికే గాంధీ ముక్కులు పనిచేయటం మొదలుపెట్టాయి: ఏదో కంపు! మరుగుదొడ్ల కంపు!! సభ కోసం తయారు చేసిన మరుగుదొడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయో చెప్పలేం. కొందరు సభ్యులైతే తమ గదుల ముందే దొడ్డికి పోయారు. వాళ్లకి అడ్డు లేదు. సభల కోసం వచ్చిన వాలంటీర్లను గాంధీ అడిగాడు- "చాలా కంపుగా ఉంది. మరుగుదొడ్లే అనుకుంటాను. అసౌకర్యం కదా? ఏమైనా చేయరాదూ?” అని. "ఓయ్ ఇది మా పని కాదు- పాకీ వాళ్ల పని అది" అన్నారు వాళ్లు. సభలో మాట్లాడేందుకు ఇంకా గాంధీ వంతురాలేదు. చాలా మంది వ్యక్తులు వేదికనెక్కేందుకు పోటీ పడుతున్నారు. అందరూ చెప్పేవాళ్లే తప్ప, వినేవాళ్ళు లేరు. సామాన్యంగా గాంధీ సమయాన్ని వృథా చేసుకోడు. ఆ రోజుల్లో ఆయన సూటూ బూటూ వేసుకొని దర్జాగా ఉండేవాడు. అయినా అప్పటికప్పుడు చాట-పరక చేత పట్టుకొని, సభ కోసం కట్టిన మరుగుదొడ్లను అన్నింటిని పూర్తిగా శుభ్రం చేశాడు. సభకు వచ్చిన వాళ్లంతా ఆయన చేస్తున్న పనిని ఆశ్చర్యంగా చూశారు- కానీ ఒక్కరు కూడా ఆయనకు సహాయం చేసేందుకు ముందుకురాలేదు! తర్వాత అనేక సంవత్సరాలకు- అదే గాంధీజీ కాంగ్రెస్‌కు దారి చూపించే వెలుగు దివ్వె ఐనాడు, శక్తివంతుడైన నాయకుడిగా ఎదిగాడు. అప్పుడిక కాంగ్రెస్ సభలలో "మరుగుదొడ్ల పరిశుభ్రతా బృందాలు" తయారయ్యాయి. ఆ రోజుల్లో అంటరానితనం ప్రబలంగా ఉండేది. 'పరిశుభ్రత' అనేది కేవలం నిమ్న జాతులకే ఉద్దేశించిన పనిగా ఉండేది. గాంధీ చేసేటప్పటికి, అట్లాంటి పనులను కూడా చాలా ఇష్టంగా చేశారు, గాంధీ అనుయాయులు. తర్వాత ఒకసారి హరిపురంలో జరిగిన కాంగ్రెస్ సభల్లో ఏకంగా 2000 మంది టీచర్లు, విద్యార్థులు మరుగుదొడ్లను శుభ్రం చేశారు! "మురికిని, గలీజుని శుభ్రం చేయడం ఒక పవిత్ర కార్యం. పవిత్ర కార్యాన్ని నెరవేర్చేవాళ్ళు అసలు అంటరానివాళ్లు ఎలా అవుతారు, భగవంతుని బిడ్డలౌతారు గాని?!” అని గట్టిగా నమ్మాడు గాంధీ. ఒక్క టాయిలెట్లలోనే కాదు- మన జీవితపు అన్ని రంగాలలోనూ పేరుకుపోయిన మురికిని, చెత్తను ఏరిపారేయటం అసలు ఎవరికి వాళ్ళుగా, మనందరం ఎప్పటికీ చేస్తూ ఉండాల్సిన పని. ఏమంటారు?   Courtesy.. kottapalli.in  

బాబోయ్ టి.వి!

  బాబోయ్ టి.వి!   "అనగనగా వెంకటాపురం అని ఒక ఊరు ఉండేదట. అది పూర్వకాలంలో పచ్చని పంటలతో హాయిగా ఉండేదట. ఈ కాలంలోనైతే ఎన్నో కొత్తవి కనిపెట్టారట వాళ్ళు- రేడియో, టివి, బైక్, కార్ మొదలైనవి. అయితే ఆ వూళ్ళో‌ చాలామంది ముఖ్యంగా టివి వల్ల చెడిపోయినారట- ఎల్లాగ అంటే, ఆ ఊళ్ళో రవి అనే పిల్లవాడు ఒకడు ఉండేవాడు. ఆ బాలుడికి మంచి విజ్ఞానం ఉంది. ఇష్టంగా చదువుకునేవాడు; చక్కగా మంచి మార్కులు తెచ్చుకునేవాడు (-ఇవన్నీ‌ వాళ్ల ఇంటికి టి.వి. రాకముందే). వాళ్ల ఇంటికి మరి టి.వి. ఎలా వచ్చిందంటే, రవికి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు-శివ. ఆ శివకు ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడి పేరు రాము. రాము వాళ్ళ ఇంట్లో టి.వి. ఉంది. రోజూ శివకు తను ఇష్టంగా చూసే టి.వి.ప్రోగ్రాముల గురించి చెబుతుండేవాడు. శివకు కూడా వాటిని చూడాలని ఒక కోరిక కలిగింది. వాళ్ళ నాన్నమీద ఎంతో ఒత్తిడి పెట్టాడు. చివరికి వాళ్ల ఇంటికి టి.వి. రాక తప్పలేదు. శివ తన మిత్రుడు రాము చెప్పిన ప్రోగ్రాంలు చూస్తూండేవాడు. క్రమంగా రవికి కూడా ఆ వ్యాధి సోకింది. వెంటనే తన చదువు పోయింది! రాత్రులు పన్నెండు గంటలవరకు టి.వి. చూడటం, ఉదయం లేట్ గా లేవడం, సోమరిలాగా తయారు కావటం! చూస్తూండగానే రవికి పరీక్షలలో మార్కులు తగ్గాయి. వాళ్ల ఉపాధ్యాయులు అందరూ ఆశ్చర్యపోయారు: అతనిలో ఇంత మార్పు రావటంతో‌అందరూ అతని గురించి రకరకాలుగా ఊహించుకున్నారు. కొంతమంది వాడు ఎక్కువగా ఆడుతున్నాడేమో అనుకునేవాళ్ళు. కొంతమంది వాడు ఎక్కువగా నిద్రపోతున్నాడేమో అనుకునేవాళ్ళు. కానీ అసలు విషయం ఎవ్వరికీ తెలియదు- తను టి.వి. చూస్తున్నాడని. తరువాత కొంతకాలానికి రవి పూర్తిగా టి.వి.మాయలో పడిపోయాడు. టి.వి.లో తనకు ఇష్టమైన ప్రోగ్రాం రాకపోతే ఏడ్చే పరిస్థితికి వచ్చాడు. చివరికి వాళ్ల నాన్న సమస్యను అర్థం చేసుకొని, టి.వి.ని తీసుకెళ్ళి అమ్మేశాడు. 'టి.వి. పోయింది' అనే బాధ రవిని బాగా పీడించింది, కొన్నాళ్ళు. తర్వాత వాడు దాని గురించి మరచిపోయి మళ్ళీ హాయిగా తన పాత లక్షణాలకు తిరిగి వచ్చాడు. టి.వి. మనిషిని ఎన్ని ప్రమాదాలకు గురిచేస్తుందో చెప్పలేము" అని రాస్తున్నాడు, కుంచనపల్లి అరవింద స్కూలు నుండి 8వ తరగతి యోగి! అమ్మానాన్నలు టి.వి.లను అమ్మేస్తే పిల్లలకు దానిమీద కోరిక మరింత ఎక్కువైపోయే ప్రమాదం లేదూ? అందుకని, ఈ సమస్యకు అసలు మందు 'అర్థం చేసుకోవటంలోనే' ఉన్నది. పరీక్షలు దగ్గరపడుతున్నై; అందుకని టి.వి. చూసే అలవాటును తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి పిల్లలందరూ. టి.వి.లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు- వీటిని విజ్ఞానాన్ని ఇచ్చే సాధనాలుగా వాడుకోవాలి తప్ప, ఎవ్వరూ వీటి ఆకర్షణలో పడిపోకూడదు. ఈ విషయంలో చైనా, జపాన్ దేశాల పిల్లలు మనకు ఆదర్శం కావాలి. వాళ్లలాగా మనమూ ఈ వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకొని, వీలైతే వాటిని మరింత నేర్పుగాను, ఉపయోగకరంగాను తయారు చేయటం‌ నేర్చుకోవాలి. ఇంతకూ టి.వి. ఎలా పనిచేస్తుందో‌తెలుసా? అందులో ఏమేం ఉంటాయి? టి.వి. తయారు చెయ్యాలంటే అసలు ఏమేం కావాల్సి వస్తాయి? మరి సెల్ ఫోన్ లోపలి భాగాల్ని ఎలా తయారు చేస్తారు? ఏభాగం ఏం పని చేస్తుంది? పెద్ద ప్రశ్నలే, సమాధానాలు కనుక్కోండి మరి!   Courtesy.. kottapalli.in

పరమానందయ్య గారి శిష్యులు

  పరమానందయ్య గారి శిష్యులు పరమానందయ్య గారి శిష్యులు పదిమంది ఓసారి ఒక నదిని దాటారట. ప్రవాహవేగం ఎక్కువగా ఉందేమో, అందరూ జాగ్రత్తగా దాటవలసి వచ్చింది నదిని. తీరా అవతలి తీరం చేరుకున్న తర్వాత వారికి అనుమానం కలిగింది - `అందరం గట్టున పడ్డామా లేదా?' అని! ఏం చేయాలి? ఇక లెక్కపెట్టక తప్పలేదు. ప్రతివాడూ మిగతావాళ్లందర్నీ లెక్కపెట్టి చూశాడు. అందరూ తొమ్మిదిమందే ఉన్నట్లు లెక్క తేల్చారు. ఉండాల్సినవారేమో పదిమంది. అంకెలేమో తొమ్మిదే వస్తున్నాయి. ప్రతివాడూ తనను తాను ఒదిలి మిగిలిన తొమ్మిదిమందినీ లెక్కపెడుతున్నాడు! చివరికి ఇక అందరూ ఏడవటం మొదలుపెట్టారు - కొట్టుకుపోయిన పదోవాడిని తలుచుకొని. అప్పుడో పంతులుగారు వచ్చారు అటువైపు. తనూ లెక్కపెట్టిచూశారు. పదిమందీ ఉన్నారని నిర్ధారణ చేసుకొని చిరునవ్వు నవ్వారు. ఒక్కొక్కడినీ పిలిచి వీపుమీద బలంగా చరిచారు. దెబ్బపడిన ప్రతివాడినీ తను ఎన్నవవాడో అరవమన్నాడు. ఒకటోవాడినుండీ మొదలెడితే పదోవాడివరకూ అందరూ అరిచారు. పదిమందీ ఉన్నారని అందరూ మహా సంతోషపడ్డారు. అయినా వాళ్లకో సందేహం మిగిలిపోయింది. "పంతులుగారు పదోవాడిని ఎలా రక్షించి తెచ్చారు?" అని. ఈ కథ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా, మనమూ వీళ్లలాగానే ఉంటాం: సమాజం గురించి ఆలోచించేటప్పుడు మనల్ని మనం లెక్కపెట్టుకోం. ’ఆ సమాజంలో మనమూ ఒకళ్లం’ అని మరచిపోతూ ఉంటాం. సామాజిక బాధ్యతని విస్మరించటం చాలా సుళువు. సమాజంలోని ప్రతి చెడువెనకా మనందరి బాధ్యతా ఎంతోకొంత ఉందని గుర్తించగలిగిననాడు మన జీవితాలే కాదు; సమాజం యావత్తూ పురోగమించగలదు. అప్పుడుగానీ మన సమాజంలోని హింసకు సరైన ప్రత్యామ్నాయాలు లభించవు. ఏమంటారు? Courtesy.. kottapalli.in  

పిసినారులు!

  పిసినారులు!   ప్రపంచంలో పెట్రోలు నిల్వలు తగ్గిపోతున్నాయి; దాంతో అమెరికా వారు తమ సొంత సముద్ర తీరంలోనే పెట్రోలు త్రవ్వితీద్దామని ఆలోచిస్తున్నారట. ఈ సంగతి తెలిసాక ఓ కథ గుర్తొచ్చింది.. ఓ రోజున తమ ఇంట్లో క్యాలండర్ తగిలించుకుందామనుకున్నాడట, నసీరుద్దీన్. అయితే ఎంత చూసినా క్యాలండర్‌కు అనువైన స్థలం దొరకలేదు. మంచి గోడ ఉన్న చోట మేకు లేదు. మేకు ఉన్న చోటు క్యాలండర్‌ తగిలించేందుకు వీలుగా లేదు. చివరికి విసుగొచ్చింది. గోడకు కొత్తగా మేకు కొట్టాల్సిందేననుకున్నాడు. మేకు పట్టుకొని స్టూలు మీదెక్కి నిలబడ్డాడు. చూడగా చేతిలో మేకును కొట్టేందుకు సుత్తి లేదు. "ఒరే, చిన్నోడా!ఇటు రా రా, ఓసారి" పిలిచాడు కొడుకుని. చిన్నోడు వచ్చాడు- "పక్కింటికి వెళ్ళి సుత్తి అడిగి తీసుకురా, చిన్నా" చెప్పాడు నసిరుద్దీన్. చిన్నోడు పరుగెత్తుకుంటూ పక్క వాళ్ళింటికి వెళ్ళి, ఖాళీ చేతుల్తో తిరిగొచ్చాడు -"వాళ్ళు అడిగారు- 'చెక్క మేకా, ఇనప మేకా?' అని. 'ఇనప మేకే' అని చెప్పాను. 'అయితే మేం ఇవ్వం. మా సుత్తి పాడైపోతుంది' అన్నారు వాళ్ళు" చెప్పాడు. "పిసినిగొట్టులు! వాళ్ళని అడిగీ ప్రయోజనం‌ ఉండదని అనుకుంటూనే ఉన్నాను. వాళ్ల సుత్తి మనకెందుకు? లోకంలో సుత్తులు కరువా? ఇటు ప్రక్క వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళనడిగి సుత్తి తీసుకురా నాయనా" అన్నాడు నసీరుద్దీన్. పిల్లవాడు అయిష్టంగానే ఇటువైపు వాళ్ళింటికి వెళ్ళి వచ్చాడు, చేతులూపుకుంటూ. "వాళ్ళింట్లో సుత్తి లేదట" అన్నాడు. నసీరుద్దీన్‌కి కోపం వచ్చింది- "ఎందుకు లేదు? నాలుగు రోజుల క్రితం వాళ్ళింట్లో సుత్తిని నా కళ్ళారా చూశాను! ఏవో లెక్కలు వేసుకుంటున్నారల్లే ఉంది- పట్టించుకోకు. మన పని జరగటం ముఖ్యం- రెండిళ్ళ అవతల సుల్తాన్ వాళ్ళింట్లో మంచి సుత్తి ఉంది. అడిగి పట్టుకురా" అన్నాడు. అయితే సుల్తాన్ వాళ్ళూ సుత్తిని ఇవ్వలేదు. "వాళ్ల సుత్తి హ్యాండిల్ విరిగిపోతున్నదట. ఇవ్వమన్నారు" ఉత్త చేతుల్తో తిరిగొచ్చాడు కొడుకు. "వాళ్ళు ఇవ్వకపోతే ఏమిరా, అబ్బాస్‌ మామ ఇస్తాడు మనకు! పోయిరా" అబ్బాస్‌ మామ ఇంటికి పంపాడు కొడుకుని. అబ్బాస్‌ వాళ్ళూ సుత్తిని ఇవ్వలేదు. నసీరుద్దీన్ కొడుకు అట్లా ఓ పది ఇళ్ళు చుట్టుకొని వచ్చాడు. ఎవ్వరూ సుత్తిని ఇవ్వలేదు. మేకు పట్టుకొని, స్టూలు ఎక్కి నిల్చొనీ నిల్చొనీ నసీరుద్దీన్‌కు కాళ్ళు నొప్పి పుట్టటం మొదలెట్టాయి. "పిసినారులు! పిసినారుల ఊరు! ఈ ఊరంతా పిసినిగొట్టులే ఉన్నట్లున్నారు. దీన్ని వదిలేసి వేరే ఊరికి పోతే తప్ప లాభం లేదు! పనికి మాలిన ఊరు, పనికి మాలిన పొరుగువాళ్ళు! ఇంకేం చేస్తాం?! పోరా, చిన్నా, ఇంట్లోకి వెళ్ళి, మన సుత్తే పట్టుకురా పో! పిసినిగొట్టుల ఊర్లో ఇంక వేరే ఏమీ చెయ్యలేం మనం!" మనసారా తిట్టాడు ఉన్న ఊరి జనాలని. నసీరుద్దీన్ ఏనాడో కొని భద్రంగా దాచిన సుత్తి, ఆ విధంగా '-ఊళ్ళోవాళ్ల పిసినారి తనం కారణంగా ' పనిలోకి వచ్చిందట!   Courtesy.. kottapalli.in

అనుమానం

  అనుమానం     బుజ్జిగాడికి బాగాలేదు- చిట చిటలాడుతూ, రుసరుసలాడుతూ చాలా కోపంగా ఉన్నాడు. అంతకుముందు రోజే వాడి కథల పుస్తకం పోయింది- ఎవరు ఎత్తుకెళ్ళారో, ఏమో? పుస్తకం లేకుండా చదువుకునేదెట్లాగ? ఈ రోజున చూస్తే, పెన్సిలు కనబడటం లేదు. తన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు ఎవరో. "ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది కదా, చిన్ని!? అదే తీసుకొని ఉండచ్చు" అనుకున్నాడు: చిన్ని బుజ్జిగాడి చెల్లెలు. దానికి మూడేళ్ళు. "నాతు పుత్తకం కావాలమ్మా!" అంటూ పుస్తకాన్ని ఎత్తి చేతుల్లో పెట్టుకొని, కాలేజికి పోయే పిల్లలాగా పోతుంటుంది. ఇచ్చెయ్యమని ఎంత మొత్తుకున్నా ఇవ్వదు. ఇపుడు పెన్సిలుకూడా ఎత్తుకెళ్ళినట్లుంది- 'పోనీ, తీసుకెళ్ళి చదువుకుంటుందా' అంటే దానికి ఇంకా బొమ్మలు చూడటంకూడా రాదు పూర్తిగా! ఊరికే, అన్నీ పోగు చేసుకుందామని ఆశ. బుజ్జిగాడు వెళ్ళి, పాప సామాన్లన్నీ క్రింద పోసి చూశాడు- పుస్తకం, పెన్సిలు కనబడలేదు అందులో: "మరి, ఎక్కడ పెట్టి ఉంటుందబ్బా?!"- వెళ్ళి ముందుగదిలో పేపర్లు పెట్టే చోట వెతికాడు: అక్కడా లేదు. "ఇది తీసుకెళ్ళి బయట ఎక్కడో పడేసి ఉంటుంది" అనుకున్నాడు బుజ్జిగాడు. వాడికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "తనకు ఎంతో ఇష్టమైన కథల పుస్తకం! తను ఎంతో‌ముచ్చటపడి కొనుక్కున్న గులాబీ రంగు పువ్వుల పెన్సిలు! చిన్నికి బుద్ధి చెప్పాల్సిందే. ఊరుకుంటే లాభం లేదు" బుజ్జిగాడు వెళ్ళి చిన్ని బొమ్మల్లోంచి కుందేలు బొమ్మను బయటికి లాగాడు. ఆ బొమ్మంటే చిన్నికి చాలా ఇష్టం. లోపలికి రాగానే ఇప్పుడు అది ఆ బొమ్మకోసం వెతుక్కుంటుంది. చిన్నికి దొరకకుండా బట్టల అలమారలో దాచి పెట్టేశాడు బొమ్మని. "నా పుస్తకం, నా పెన్సిలు ఇస్తే, దాని కుందేలు బొమ్మ దానికి దొరుకుతుంది. లేకపోతే తను అదెక్కడుందో ఎన్నటికీ చెప్పడు." చిన్ని వచ్చింది- ఎగురుకుంటూ, గెంతుకుంటూ. రాగానే దాని కళ్ళు కుందేలు బొమ్మకోసం వెతికాయి. "ఏయ్, నా కుందేలు బొమ్మ ఏది?" అన్నది. బుజ్జిగాడే తీసి దాచి పెట్టాడని దానికి ఎట్లా తెలిసిందో, మరి! "నాకు తెలీదు. నా పుస్తకం, పెన్సిలే దొరకలేదని నేను ఏడుస్తున్నాను-నువ్వే తీశావు కదూ?!" చిన్ని అడ్డంగా తల ఊపింది- "చిన్ని తీస్కోలేదు. చిన్నికేం తెలీదు" "అబద్ధం!" అరిచాడు బుజ్జి. "నా పుస్తకం, పెన్సిలు నువ్వే తీసుకున్నావు. ఎక్కడ పెట్టావో చెప్పు! ఎప్పుడూ నువ్వే నా వస్తువులన్నీ తీసుకుంటావు. ఇచ్చెయ్, నావి నాకు!" "చిన్ని తీస్కోలేదమ్మా! బుజ్జన్న సామాన్లు బుజ్జన్న దగ్గరే ఉంటాయి" అన్నది చిన్ని. "ఇదిగో చెబుతున్నాను- నా పుస్తకం పెన్సిలు నాకు ఇచ్చెయ్యి. లేకపోతే నీ కుందేలు నీకు ఎప్పటికీ అసలు దొరకనే దొరకదు" చిన్ని లేచివెళ్ళి బుజ్జిగాడి సంచీ తీసింది. అందులోని సామాన్లన్నీ క్రిందికి వంపి, కుప్ప పోసింది. "చూస్కోమ్మా! నీ పుస్తకం, పెన్సిలు నీ దగ్గరే ఉన్నై" అంది. బుజ్జిగాడు ఆశ్చర్యపోయాడు. కుప్పలోనే ఉన్నై, తన పుస్తకమూ, పెన్సిలూ! "మరి అవి తనకెందుకు కనబడలేదు, ఇందాక?" బిక్కమొఖం వేసుకొని వెళ్ళి, బట్టల మధ్యలోంచి కుందేలు బొమ్మను తెచ్చి ఇచ్చేశాడు చిన్నికి. "మా బుజ్జన్న ఎంత మంచిదో చూడు! అన్నీ జాగ్రత్తగా ఎత్తి పెడుతుంది!" అని మురిసిపోయింది చిన్ని, కుందేలును ఎత్తుకుంటూ. చాలాసార్లు మనం పోగొట్టుకున్నవి మనకు కనబడవు. వేరేవాళ్ళెవరో వాటిని పోగొట్టిఉంటారన్న అనుమానం కొద్దీ, మనం సరిగ్గా వెతకం కాబోలు. అనుమానాలు ప్రక్కన పెట్టేసి చూస్తే, వస్తువులు ఉన్నవి ఉన్నట్లు కనబడతాయి. ఏమంటారు? Courtesy.. kottapalli.in

కాకి తెలివి

కాకి తెలివి   అనగనగా ఒక అడవిలో ఒక కాకి వుండేది . ఒకసారి అది చుట్టాల ఇంటికి వెళ్ళింది. కొన్ని రోజులు సరదాగా గడిపి, ఇంటికి బయలు దేరింది. కాకులు మామూలుగా ఎక్కువ దూరం పోవు. అయితే ఈ కాకి చాలా దూరం పోయింది గదా, అందుకని దానికి దాహం వేసింది . దగ్గర్లో ఏదైనా చెరువు గాని, కాలువ గాని వున్నదేమోనని వెతికింది. ఎక్కడా నీళ్ళు లేవు! పైపెచ్చు అది ఎండాకాలం- అందుకని చిన్న చిన్న గుంటలన్నీ ఎండిపోయి ఉన్నాయి! కాకికి ఏం చేయాలో తోచలేదు. గొంతు పిడచ కట్టుకపోతోంది. అలాగే కొంత సేపు పోయింది గానీ, కొంత సేపటికి ఇక అది ఎగరలేకపోయింది. నేల బారునే వెతుక్కుంటూ వెళ్ళసాగింది. చివరికి ఒక పొలంలో దానికి ఒక సన్న మూతి కూజా కనిపించింది. పొలంలో పని చేస్తున్న రైతు తెచ్చుకున్నట్లున్నాడు దాన్ని. కాకికి ప్రాణాలు లేచి వచ్చినట్లైంది. గబగబా పరుగెత్తుకొని వెళ్ళి కూజా మీద వాలింది. లోపలికి తొంగి చూసింది: కూజాలో సగం వరకూ ఉన్నై, నీళ్ళు. వాటిని అందుకుందామని ఆశగా వంగింది కాకి. కానీ ఏంలాభం? అవి దాని ముక్కుకు అందలేదు! 'దగ్గర్లోనే నీళ్ళను పెట్టుకొని కూడా దాహానికి చనిపోతానేమో' అనిపించింది కాకికి. అది ఎన్ని సార్లు కూజా మీదికి ఎగిరి ముక్కును లోనికి దూర్చినా ప్రయోజనం కనిపించలేదు! 'ఎలాగబ్బా' అనుకొంటూ చుట్టూతా కలయ చూసిందది. దగ్గర్లోనే దానికి కొన్ని గులక రాళ్ళు కనిపించాయి. వెంటనే దానికి వాళ్ల అవ్వ చెప్పిన కథ కూడా గుర్తుకొచ్చింది. 'అదే సరైన మార్గం' అనుకున్నది అది- సంతోషంగా ఒక్కొక్క గులకరాయినీ తీసుకొచ్చి కుండలో వేయటం మొదలు పెట్టింది . అట్లా ఎన్ని రాళ్ళు వేసినా నీళ్ళు మాత్రం పైకి రాలేదు! కావాలంటే మీరూ వేసి చూడండి- అంత సులభంగా పైకి రావు, నీళ్ళు! కాకి అలోచనలో పడింది: "ఎక్కడో‌ లెక్క తప్పినట్లుంది- ఇప్పుడేం చేయాలి?” అనుకుంది. అంతలో దాని దృష్టి కూజా అడుగు మీద పడింది. నేలమీద మూడు రాళ్ళు పెట్టి, వాటి మీద కూజాను పెట్టుకున్నాడు రైతు: కాకికి వెంటనే ఏం చేయాలో తెలిసిపోయింది! తన కాలి గోళ్ళతో‌ మట్టిని గీకి గీకి- చివరికి ఒక రాయిని వదులు చేసింది. ఆపైన నేర్పుగా ఆ రాయిని బయటికి లాగేసింది! మరుక్షణం కూజా నేల మీదికి ఒరిగింది- దానిలో ఉన్న నీళ్ళు కొన్ని ఒలికిపోయాయి, మిగిలినవి కాకికి అందాయి! కాకి వాటిని తాగింది. సంతోషంగా ఎగురుకొని వెళ్ళి పోయింది. పాత కథల్లో చెప్పిన ఉపాయాలు అన్ని వేళలా అక్కరకు రాకపోవచ్చని దానికి అర్థం అయ్యింది! Courtesy.. kottapalli.in

తుపాకులు

  తుపాకులు   ఆరవ తరగతి పిల్లవాడొకడు ఆ మధ్య వాళ్ళ బడికి ఒక తుపాకీ తీసుకుపోయాడట. ఆ తుపాకీ బొమ్మది కాదు. అందులో బుల్లెట్లు రబ్బరువీ కావు. అది నిజం తుపాకీ! వాళ్ళ నాన్నదిట అది. వాళ్ళ ఇంట్లో మొత్తం రెండు తుపాకులుంటాయట- ఒకటి వాళ్ళ నాన్నది; ఒకటి వాళ్ళ అమ్మది. వాటితో వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. మొత్తానికి ఒక తుపాకీ ఈ పసివాడి చేతిలోకి వచ్చింది. వాడు అప్పటికే చాలా వీడియో గేములూ, కంప్యూటర్ గేములూ ఆడి ఉన్నాడు. తుపాకీతో ఏంచేస్తారో వాడికి బాగా తెలుసు. తుపాకీని గురిపెట్టటం వాడికి చక్కగా వచ్చు. ఎందరో టి.వి. రాక్షసుల్ని పేల్చేసిన అనుభవం ఉన్నది వాడికి. బడిలో తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న కుర్రవాళ్ళు ఇద్దర్ని , పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పడెయ్యటం వాడికి ఏమాత్రం కష్టం కాలేదు. వెయ్యిమంది విద్యార్థుల ఎదుట, విద్య గరపే టీచర్ల సాక్షిగా, వాడు తన తోటి పిల్లల్ని కాల్చి చంపేశాడు. తల్లిదండ్రులనుండి పిల్లలు చాలా సంగతులు నేర్చుకుంటారు. వాళ్ళని ఎంత దూరంగా, బోర్డింగు స్కూళ్లలో ఉంచినా సరే, పిల్లలు తల్లిదండ్రుల అలవాట్లని అంత తొందరగా మర్చిపోరు. తల్లి, తండ్రి తూటాలు, బాంబులు లేకుండా బ్రతకలేని అస్తవ్యస్త జీవితపు ప్రాణులైనప్పుడు, పిల్లలు శాంతసౌహార్ద్ర మూర్తులవ్వటం కాస్తంత కష్టమే. అందుకని, పిల్లలున్న పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ అలవాట్లు, దురలవాట్లు పిల్లలకు సోకకుండా ఉండేందుకు శ్రమించాలి. తండ్రి రోజూ గుప్పు గుప్పున సిగరెట్లుకాలుస్తూ, పిల్లలచేతే వాటిని తెప్పించుకుంటేనూ, త్రాగి రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ పడి దెబ్బలు తగిలించుకుంటుంటేనూ, గూండాగా అందరినీ బెదిరించుకొని బ్రతుకుతుంటేనూ, భార్యలను కొట్టి, గొడవపడుతుంటేనూ పిల్లల మానసిక స్థితి సరిగా ఉండదు. అలాంటి పిల్లలు తల్లిదండ్రుల మాదిరే తుపాకులకు, సెల్ ఫోన్లకు, మోటారు బైకులకూ బానిసలై, తమకు ఇంట్లో దొరకని ప్రేమల్ని వీధుల వెంబడి, సారాదుకాణాల్లోను, పబ్బుల్లోను, డిస్కోథెక్కుల్లోను వెతుక్కుందామనుకుంటారు. పిల్లలు సహజ సౌకుమార్యంతో, సంతోషంగా ఎదిగి, బాధ్యతగల పౌరులవ్వాలంటే, ముందుగా పెద్దలు బాగుపడాలి. "మనం వ్యసనాలకు దూరమైతే తప్ప, మన పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుపడవ"ని గ్రహించాలి- ఏమంటారు? Courtesy.. kottapalli.in

నేటి తల్లి

  నేటి తల్లి అమ్మ లేనిది సృష్టి అనేది లేదు,  అమ్మ మనసు బిడ్డకి చిన్న దెబ్బ తగిలినా, జబ్బు చేసినా, కలత చెందినా  అమ్మ మనసు గిలగిల లాడుతుంది,  బిడ్డ మాములుగా  అయ్యేదాక కంటి మీద కునుకు  లేకుండా కాపాడుతుంది అమ్మ.  తనకి జబ్బు చేసినా తన బిడ్డలను దృష్టిలో పెట్టుకొని ఆ జబ్బుతో,  మృత్యువుతో  పోరాడి వారు జీవితంలో స్థిర పడేదాక  కనిపెట్టుకొని వుంటుంది అమ్మ.  తను వంటింట్లో వుండి తన బిడ్డలు పెద్ద చదువులు చదివి  వుద్యోగ నిమ్మిత్తం  దేశ విదేశాలకి  తనని వదలి పోతుంటే  తను మాత్రం ఆ యింటి కిటికీలో నుండి చూస్తూ ఆనందభాష్పాలు  రాలుస్తూ నా బిడ్డలు అభివృద్దిలోకి వచ్చారని  మురిసిపోతుంది అమ్మ.  వృద్దాప్యంలో ఒక్కతే వుండాల్సి వచ్చినా పిల్లలు వాళ్ళ సంసారాల్తో,  వుద్యోగాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు నేనేమి వాళ్ళను ఇబ్బంది పెట్టను  అనుకుంటుంది అమ్మ.  ఏనాడు ఒక్కతి వూరు వదలి వెళ్ళకున్నా విదేశాల్లో వున్న కోడలికో,  కూతురికో పురుడు పోయటానికి, కూతురు వుద్యోగానికి వెళ్ళితే చంటి పిల్లల్ని  చూసుకోవడానికి విమాన  ప్రయాణం చేసి భాష రాకున్నా బిడ్డల  అవసరానికి  అక్కరకు రాకపోతే ఎలా? అనుకుంటూ వెళ్ళి  వారికి అన్ని సేవలు చేస్తుంది అమ్మ.  పిల్లలు సంతోషంగా వూళ్ళు చూపిస్తే వెనక్కి తిరిగి వచ్చి అందరికి  ఆనందంగా చెప్పుకుంటుంది అల్ప సంతోషి అమ్మ.  ఒంటరితనం బాధిస్తున్నా, వృద్దాప్యంలో వచ్చే జబ్బులు పీడిస్తున్నా,  అత్మాభిమానంతో అలాగే బ్రతుకీడుస్తున్నది అమ్మ.  ఒకే వూళ్ళో వున్నా వుద్యోగాలకి వెళ్ళి రావడానికి చాలా సమయం  పడుతున్నది అందుకే అక్కడికి దగ్గరలో ఇల్లు తీసుకొని వుంటాము  అప్పుడప్పుడు వచ్చి చూస్తాము అని పిల్లలు అన్నా కూడా మౌనంగా  వుండిపోతుంది అమ్మ.  కొంతమంది తల్లి వృద్దాప్యంలో జబ్బు చేసి ఎందుకూ పనికి  రాకుండా పోయిందని తీసికెళ్ళి రోడ్డు పై వదిలేసి వెళ్ళితే,  ఏం చేయాలో తోచక జీవిత చరమాంకంలో రోడ్డు  పై గడపాల్సి వచ్చినందుకు కుమిలిపోతూ,  తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక,  కన్న బిడ్డలే ముసలితనంలో పనికిరాని నువ్వు మాకు  వొద్దు అని వదిలేసి వెళితే ఆ అవమానం తట్టుకోలేక  ఒడ్డున పడ్డ చేపలాగ కొట్టుకుంటుంది అమ్మ,  ఇలాంటి వృద్దుల కోసం ఆశ్రమాలు పెట్టిన వారితో  వెళ్ళినా తమ బ్రతుకులు ఎందుకు ఇలా అయ్యాయో తెలియక  అయోమయోంలో వున్న వారితో కలిసి వుంటున్నది అమ్మ,  బిడ్డలకు దెబ్బ తగిలితే తల్లడిల్లిపోయిన తల్లికి మానసికంగా,  శారీరకంగా గాయపడినా,  కన్న బిడ్డల ఆత్మీయమైన చూపు కోసం,  వారి మమత కోసం ఎదురుచూస్తూనే కాలం  గడుపుతున్నది అమ్మ.  నా బిడ్డలు ఎదిగేపుడు ఎంతో సంతోషించాను,  వారు ఆనందంగా వుంటే చాలనుకున్నాను,  తన అవసరం ఎవరికి వుందో వారికి సాయం చేసుకుంటూ, ఏదో పోగొట్టుకున్నట్టుగా కాక తన ప్రేమని ఎంతోమందికి పంచుతూ, ధైర్యంగా, స్వతంత్రంగా బ్రతుకుతున్నది నేటి తల్లి. -కనకదుర్గ

మంత్రగత్తె ఏది?

మంత్రగత్తె ఏది? ఉదయం ఎనిమిదిగంటలకు సౌమ్య పుస్తకాల సంచి తీసుకొని బడికి బయలుదేరింది. దారిలో సోము అనే కోతి కలిసింది సౌమ్యను. అది, సౌమ్య ఎప్పటినుండో స్నేహితులు. "మనం అడవిలోకి వెళ్దామా? రకరకాల పండ్లు కోసుకొని తినచ్చు?!" అడిగింది సోము. "సరే, వెళ్దాం. కానీ ఇంటర్వెల్ లో పండ్లరసాలు త్రాగి వచ్చేందుకు చిన్న విరామం ఇస్తారు కదా, అప్పుడు వెళ్దాం!" అని చెప్పింది సౌమ్య. విరామ సమయం అవ్వగానే సౌమ్య అక్కకి చెప్పింది- "నేను నీళ్ళు త్రాగి వస్తానక్కా" అని. "దానిదేముంది, వెళ్ళి త్రాగి రా" అన్నది అక్క. అంతే, సౌమ్య సోముని వెంటబెట్టుకొని అడవిలోకి పరుగెత్తింది. అడవిలో పండ్లను కోసుకుంటూ, తింటూ ఒక కొండమీదికి చేరుకున్నారు సౌమ్య, సోము. అక్కడ వాళ్లకు ఒక పాత గుడి కనబడింది. "అరే, ఈ గుడి ఎక్కడినుండి వచ్చింది?! ఇన్నేళ్ళుగా నేను ఇక్కడే ఉన్నాను; అయినా ఇదిఎప్పుడూ కనబడనే లేదు!" ఆశ్చర్యపోయింది సోము. సౌమ్యకూడా ఆ గుడిని ఎప్పుడూ చూడలేదు. కానీ తనకు అన్నీ తెలిసినట్లు పోజు పెట్టింది. "లోపలికి వెళ్దాం పద!" అన్నది. ఇద్దరూ ఆ గుడిలోకి వెళ్ళారు. గుడి లోపల చాలా చీకటిగా ఉన్నది. దారి అస్సలు కనబడటమే లేదు. దాంతో సోముకి భయం వేసి, వెంటనే బయటకి వచ్చేసింది. సౌమ్యకి కూడా‌ చాలా భయం వేసిందిగానీ, సోము ముందు పోజు కొట్టాలని, అలాగే ముందుకి వెళ్ళింది. గుడి మధ్యకు చేరుకునే సరికి, సౌమ్య కాళ్ళకు ఏదో చుట్టుకున్నది. నడుముకు ఏదో అడ్డం వచ్చింది. చేతులు రెండూ కలిపి కట్టబడ్డాయి! తనకు తెలీకుండానే ఏదో ఉచ్చులో చిక్కుకుంది సౌమ్య. ఆ పాపకు చాలా భయం వేసింది. బిగ్గరగా కేకలు వేసింది. ఆ కేకలు బయట ఉన్న సోముకు వినబడలేదు గానీ, అక్కడ ఉచ్చును బిగించిన మంత్రగత్తెకి మాత్రం బాగా వినబడ్డాయి. ఆ మంత్రగత్తె గబుక్కున అటు తిరిగి వచ్చి, ఉచ్చులో చిక్కుకున్న సౌమ్యని చూడగానే "హ్హ హ్హ హ్హ హ్హ హ్హ" అని బిగ్గరగా నవ్వింది. "నువ్వు చాలా చిన్నగా, లేతగా ఉన్నావు పిల్లా, నిన్ను కొరుక్కొని తింటే చాలా బాగుంటుంది. కానీ నీవల్ల కావాల్సిన పని ఒకటి ఉంది- ఏం చేసేది? ఆ పనైనాక, కావాలంటే అప్పుడు తింటాను నిన్ను" అంది. సౌమ్యకి ఏడుపు వచ్చింది. "అక్కకి అబద్ధం చెప్పి వచ్చినందుకు తగిన శాస్తి అయ్యింది. ఇప్పుడు ఎట్లాగో‌ఒకలాగా తప్పించుకోగలిగితే బాగుండు. ఇంకెప్పుడూ అక్కకి అబద్ధం చెప్పను" అని ఏడిచింది. "ఊరికే ఏడవకు పిల్లా, గుడి లోపలికి పో. అక్కడ అమ్మవారి వేలికి ఒక ఉంగరం ఉంటుంది. దాన్ని నేను సొంతగా తీసుకోలేను- నీలాంటి మంచి పిల్లలే దాన్ని తీయగలరు. దాన్ని తెచ్చి నాకు ఇచ్చావంటే, నిన్ను వదిలేయటం‌ గురించి ఆలోచిస్తాను నేను- జాగ్రత్త, ఇక్కడ అంతా పాములు తిరుగుతున్నాయి- దొంగ వేషాలు వెయ్యకు. నేరుగా లోపలికి పో" అన్నది మంత్రగత్తె. "నేను పోను" అని అరుద్దామనుకున్నది సౌమ్య. కానీ ఏం ప్రయోజనం? వేరే దారి లేదు కదా? అందుకని మారు మాట్లాడకుండా గర్భగుడి లోపలికి పోయింది. అక్కడ అమ్మవారి విగ్రహం పెద్దగా నిలబడి ఉన్నది. సౌమ్య అమ్మవారి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసుకొని తన గుప్పిట్లో పెట్టుకొని వెనుకకు తిరిగింది. అంతలోనే సోము మాటలు వినబడ్డాయి పైనుండి- పైన ఉన్న కన్నంలోంచి చూస్తున్నది అది! "ఏం చేయబోతున్నావు ఉంగరాన్ని?! మంత్రగత్తెకు ఇవ్వకు! దాన్ని రుద్ది, తుడిచి, కడిగి- ఇంకేదైనా చేసి చూడు- దానిలో ఏముందో చూడకుండా ఊరికే మంత్రగత్తెకు ఇచ్చేస్తే ఎలాగ?" గుసగుసగా అన్నది సోము. "అవునవును- దీనిలో ఏదో శక్తి ఉండే ఉంటుంది" అని ఉంగరాన్ని పెట్టుకొని దాన్ని గబగబా రుద్దింది సౌమ్య. వెంటనే ఉంగరంలోంచి పెద్దగా పొగ వచ్చింది. చూస్తూండగానే ఆ పొగలోంచి ఒక భూతం వచ్చింది. "నమస్కారం పాపా! నేను ఈ ఉంగరం భూతాన్ని! నీకు ఏదైనా ఒక మేలు చేస్తాను. అడుగు" అన్నదా భూతం, వంగి సౌమ్యకు నమస్కరిస్తూ. "నన్ను ఈ మంత్రగత్తె నుండి రక్షించి మా బడికి చేర్చు" అడిగింది సౌమ్య. "ఎంత చిన్న కోరిక కోరావు! ఒక్క క్షణంలో నెరవేరుస్తాను. కళ్ళు మూసుకో ఒక్క క్షణం!" అని ఉంగరం భూతం సౌమ్యను అక్కడినుండి మాయం చేసి వాళ్ల బడిలోకి చేర్చి వదిలింది. ఎంతో సేపటినుండి సౌమ్యకోసం వెతుకుతున్నారు వాళ్ల స్నేహితులూ, అక్కానూ. వాళ్లంతా సౌమ్యను చూడగానే తన చుట్టూ‌మూగి ప్రశ్నల వర్షం కురిపించారు- సౌమ్య జరిగిందంతా చెబితే వాళ్లంతా బిగ్గరగా నవ్వారు- "భలే చెబుతున్నావే, కొత్తపల్లి కథలాగా?!" అన్నారు. "కాదు, నిజం! కావాలంటే ఇదిగో చూడండి, ఉంగరాన్ని!" అని మూసి ఉన్న తన గుప్పిటిని తెరిచింది సౌమ్య. అందులో ఉంగరం లేదు! పిల్లలందరూ మళ్ళీ నవ్వారు. "భలే కల వచ్చినట్లుంది సౌమ్యకి!" అన్నారు. "కావాలంటే సోము వచ్చాక అడుగుదాంలే. అయినా ఆ మంత్రగత్తె బెడద తప్పింది- అంతే చాలు" అనుకొని, నవ్వి ఊరుకున్నది సౌమ్య. అయితే పెద్దయ్యాక ఎన్నిసార్లు ఆ కొండ ఎక్కినా మళ్ళీ సౌమ్యకు గుడి కనబడలేదు; మంత్రగత్తె కూడా కనబడలేదు; ఉంగరమూ దొరకలేదు! Courtesy.. kottapalli.in

సమాజంలో మనమూ భాగమే

సమాజంలో మనమూ భాగమే     పరమానందయ్య గారి శిష్యులు పదిమంది ఓసారి ఒక నదిని దాటారట. ప్రవాహవేగం ఎక్కువగా ఉందేమో, అందరూ జాగ్రత్తగా దాటవలసి వచ్చింది నదిని. తీరా అవతలి తీరం చేరుకున్న తర్వాత వారికి అనుమానం కలిగింది - `అందరం గట్టున పడ్డామా లేదా?' అని! ఏం చేయాలి? ఇక లెక్కపెట్టక తప్పలేదు. ప్రతివాడూ మిగతావాళ్లందర్నీ లెక్కపెట్టి చూశాడు. అందరూ తొమ్మిదిమందే ఉన్నట్లు లెక్క తేల్చారు. ఉండాల్సినవారేమో పదిమంది. అంకెలేమో తొమ్మిదే వస్తున్నాయి. ప్రతివాడూ తనను తాను ఒదిలి మిగిలిన తొమ్మిదిమందినీ లెక్కపెడుతున్నాడు! చివరికి ఇక అందరూ ఏడవటం మొదలుపెట్టారు - కొట్టుకుపోయిన పదోవాడిని తలుచుకొని. అప్పుడో పంతులుగారు వచ్చారు అటువైపు. తనూ లెక్కపెట్టిచూశారు. పదిమందీ ఉన్నారని నిర్ధారణ చేసుకొని చిరునవ్వు నవ్వారు. ఒక్కొక్కడినీ పిలిచి వీపుమీద బలంగా చరిచారు. దెబ్బపడిన ప్రతివాడినీ తను ఎన్నవవాడో అరవమన్నాడు. ఒకటోవాడినుండీ మొదలెడితే పదోవాడివరకూ అందరూ అరిచారు. పదిమందీ ఉన్నారని అందరూ మహా సంతోషపడ్డారు. అయినా వాళ్లకో సందేహం మిగిలిపోయింది. "పంతులుగారు పదోవాడిని ఎలా రక్షించి తెచ్చారు?" అని. ఈ కథ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా, మనమూ వీళ్లలాగానే ఉంటాం: సమాజం గురించి ఆలోచించేటప్పుడు మనల్ని మనం లెక్కపెట్టుకోం. ’ఆ సమాజంలో మనమూ ఒకళ్లం’ అని మరచిపోతూ ఉంటాం. సామాజిక బాధ్యతని విస్మరించటం చాలా సుళువు. సమాజంలోని ప్రతి చెడువెనకా మనందరి బాధ్యతా ఎంతోకొంత ఉందని గుర్తించగలిగిననాడు మన జీవితాలే కాదు; సమాజం యావత్తూ పురోగమించగలదు. అప్పుడుగానీ మన సమాజంలోని హింసకు సరైన ప్రత్యామ్నాయాలు లభించవు. ఏమంటారు? Courtesy.. kottapalli.in

సెలవులు

  సెలవులు   నరేషూ, సురేషూ, లక్ష్మి, కళ, సుధ, మహేశ్, కార్తీక్, పండు, జ్యోత్స్న- అందరూ కలిసారు ఓ ఎండ పొద్దున. "ఒరేయ్, అందరం ఇవాళ్ళ ఏదైనా సాహస కార్యం చేద్దాంరా!" అన్నాడు కార్తీక్. "సాహస కార్యాలు చెయ్యాలంటే గుహలు, పాడుబడ్డ కోటలు, దొంగలు, దయ్యాలు- ఇవన్నీ ఉండాలిరా, మన ఊళ్ళో ఏమున్నై?" విచారంగా అన్నది సుధ. "అవి లేకపోయినా సాహసాలు చెయ్యచ్చు. ఉదాహరణకు, మన ఊరవతల మామిడి తోట ఉంది కదా, దానిలోంచి తలా నాలుగు మామిడి కాయలు కొట్టేసుకు రావటం-.." అన్నాడు సురేష్. "ఆ తోటవాళ్ళు చాలా జాగ్రత్త పరులు. మనలాంటి వీరపిల్లలు మామిడి కాయలు కొట్టేయకుండా ఓ ముసలాయనను కట్టెతో సహా కాపలా పెట్టారు. మనం ఆయన కంట పడ్డామంటే అంతే సంగతులు" అంది లక్ష్మి. "అందుకే, అది సాహస కార్యం అని నేనన్నది. మనం కాయలు కొట్టేయాలి; ఆ తాతకి కనబడాలి, తప్పించుకోవాలి- వీరులైన మనలాంటివాళ్ళకు తగిన పని అది!" అన్నాడు సురేష్, ఆలోచిస్తూ. "అవును! అవును!" అన్నారు అందరూ. "మరయితే వెంటనే బయలు దేరదాం. పిల్లలు, స్త్రీలు ఇంట్లోనే ఉండండి. ఇలాంటి సాహస కార్యాలు మగ పిల్లలకే పరిమితం!" అన్నాడు మహేశ్, ఉత్సాహంగా లేచి నిలబడి. "నేనూ వస్తాను!" అని నిలబడ్డది జ్యోత్స్న. జ్యోత్స్నకి ఆరేళ్ళు. అక్కడ చేరిన పిల్లలందరిలోకీ చిన్నది జ్యోత్స్నే. "ఆడపిల్లలూ సాహసాలు చెయ్యగలరు. ఝాన్సీ లక్ష్మీ బాయి గురించి మీకెవ్వరికీ తెలీదేమో. మా సార్ చెప్పారు మాకు!" అన్నది లక్ష్మి. "నేనూ వస్తాను. నాకు మామిడికాయలు కావాలి" అంది జ్యోత్స్న. "మేరీ కోం తెలుసుగా, ఒక్క దెబ్బ కొట్టిందంటే అంతే సంగతులు. వెళ్తే అందరం వెళ్తాం అంతే. ఆడ-మగా అని తేడాలు లేవు-అందరూ సాహస వీరులే, జాగ్రత్త" బెదిరించింది సుధ. "నేనూ వస్తాను! నేనూ వస్తాను!" అంది జ్యోత్స్న మళ్ళీ. "జోషీ, నువ్వొద్దులేవే, మరీ చిన్నదానివి. సరిగ్గా పరుగెత్తటం కూడా రాదు నీకు" అన్నాడు మహేశ్. జోత్స్న ఏడుపు మొదలెట్టింది. "ఇదిగో, మీకు ఏది కావాలంటే అది చేయండి. దాన్ని మటుకు ఏడిపించకండి!" అన్నది జ్యోత్స్న వాళ్లమ్మ, ఇంట్లోంచి బయటికి వచ్చి. వాళ్ళంతా చేరింది జ్యోత్స్న వాళ్ళింట్లోనే, మరి. కొద్ది సేపటికి అందరూ తోట దగ్గరికి చేరుకున్నారు. "అదిగో కాయలు! అదిగో కాయలు!" అరవటం మొదలు పెట్టింది జ్యోత్స్న. "ఉష్.. చప్పుడు చేయకండి. ముందుగా మనందరం తోట లోపలికి దూరాలి. రెండు జట్లుగా విడిపోయి, రెండు వైపులనుండీ చెట్ల మీదికి ఒకేసారి దాడి చేయాలి. కాపలా తాత ఒకవైపుకు పరుగు పెడతాడు. అప్పుడు అటువైపు వాళ్ళు పారిపోవాలి. రెండోవైపువాళ్ళు అందరికీ సరిపడ కాయలు కొట్టుకొని వచ్చేస్తారు!" పధకం వివరించాడు సురేష్. "పుల్ల పుల్లని కాయలు- " పాట మొదలెట్టింది జ్యోత్స్న. వెంటనే ఆ పాప నోరు మూసింది లక్ష్మి. పిల్లలంతా తోటలోపలికి దూరారు. అంతలోనే "ఎవరదీ?!.." అంటూ కట్టెను తడుతూ వచ్చాడు కాపలా తాత. పిల్లలంతా తలొక దిక్కుకూ పరుగు పెట్టారు. ఎవరికివాళ్ళు చేతికందిన రాళ్లనల్లా చెట్ల మీదికి విసిరేసారు. కొన్ని కొన్ని కాయలు రాలాయి అక్కడక్కడా. తాత అరవటం మొదలెట్టాడు- "దొంగ పిల్లల్లారా! మీ పని అయిపోయింది కాసుకోండి- మిమ్మల్ని ఇక్కడే చెట్లకి కట్టేస్తాను" అని ముందుకి దూకాడు. మరుక్షణం తాత చేతికి చిక్కిపోయాడు, కాయలు ఏరుకుంటున్న సురేష్. దొరికీ దొరకగానే బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు తోటంతా వినబడేట్లు. తాత వాడి చేతిని దొరక పుచ్చుకొని- ఇదిగో- పిల్లలంతా మర్యాదగా ఇక్కడికి వచ్చేస్తారా, లేకపోతే వీడిని పట్టుకెళ్ళి పోలీసులకు అప్పజెప్పేదా?" అని అరిచాడు ఉత్సాహంగా. పిల్లలందరూ ఎక్కడివాళ్లు అక్కడ నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఇలా జరగొచ్చనిఎవ్వరూ ఊహించలేదు మరి. సురేష్ ఏడుపు పెద్దదైంది-ముసలాయన బెదిరింపులు కూడా. తర్వాతి ఐదు నిముషాల్లో పిల్లలంతా ఒక్కరొక్కరుగా బయటికి వచ్చి తాతముందు నిలబడ్డారు తలలు వంచుకొని. "అందరూ‌వచ్చేశారా, ఇంకా ఎవరన్నా దొంగలు మిగిలిపోయారా?" అరిచాడు తాత, పెద్ద పోలీసు లాగా. "లక్ష్మి-జ్యోత్స్న ఏరి?" పిల్లలు ఒకళ్ల ముఖాలొకళ్ళు చూసుకున్నారు. అంతలో జ్యోత్స్న గొంతు వినబడింది- "తాతా! మరే, నాకు పది మామిడి కాయలు ఇస్తావా? వీళ్లందరికంటే ఎక్కువ?" అడిగింది జ్యోత్స్న, చెట్ల మరుగునుండి వచ్చీ రాగానే. ఆ పాపని చూడగానే తాత పద్ధతి మారిపోయింది. "ఓఁ..ఇస్తా పాపా! వీళ్లకి ఎన్నెన్ని ఇమ్మంటావు?" అడిగాడు తాత. "రెండు రెండు ఇవ్వు!" రాణీలాగా చెప్పింది జ్యోత్స్న. తాత పిల్లలందరికీ తలా నాలుగు మామిడి కాయలూ ఇచ్చాడు- "ఇంకా కాయలు కావాలంటే ఇంటికి పంపిస్తానులెండయ్యా. అరిచానని ఏమీ అనుకోబాకండి." చెప్పాడు, జ్యోత్స్నను ఎత్తుకొని వాళ్ల వెంటే బయలుదేరుతూ. తాత తమను కట్టేసి పోలీసులకు అప్పజెబుతాడని వణికిపోతున్న పిల్లలంతా నిర్ఘాంత పోయారు. అయినా ఇల్లు చేరాక గానీ వాళ్లకు అర్థం కాలేదు- వాళ్ళు వెళ్ళిన ఆ తోట జ్యోత్స్న వాళ్లదేనని! అయినా పిల్లలందరికీ ఆనాటి సాహసకార్యం చాలా నచ్చింది. ఆ తృప్తిలో సెలవలన్నీ మా గొప్పగా గడిచిపోయాయి! సెలవల్లో మనం చేసే సాహసకార్యాలన్నీ ఇలాంటి అల్లరిపనులే కానక్కర్లేదు. అయితే ఎవరికి వాళ్లం, మనకు గుర్తుండిపోయే పనులేవైనా చేస్తే బాగుంటుంది. అట్లాంటి పని ఒక్కటి చేసినా చాలు- మన సెలవులు అద్భుతంగా గడినట్లు లెక్క. Courtesy.. kottapalli.in

తీరిన కోరిక

  తీరిన కోరిక రామాపురంలో నివసించే కేసన్న-రత్నమ్మ చాలా పేదవాళ్ళు. వాళ్ళకు ఒక్కడే కొడుకు- బాలు. కేసన్న పూర్వీకులు బాగా బ్రతికారట. అయితే కేసన్న వరకు వచ్చేసరికి వాళ్ళ వంతుకు ఒక కొట్టం తప్ప మరేమీ మిగల్లేదు. కూలటానికి సిద్ధంగా ఉన్న ఆ కొట్టంలో ఉంటూ, భార్యాభర్తలు ఇద్దరూ కూలిపని చేసుకొని పొట్ట పోసుకునేవాళ్ళు. వాళ్ళ సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోయేది కాదు- అందువల్ల బాలుని కూడా పనికి రమ్మని పోరేవాళ్ళు వాళ్ళు. అయితే బాలుకి చదువంటే ఇష్టం. తన వయస్సు పిల్లలంతా బడికి పోతుంటే తనొక్కడే పనికి ఎందుకు పోవాలో అర్థమయ్యేది కాదు వాడికి. అదేమాట వాడు కేసన్నతో అంటే అతను "అవునులే, మీ ముత్తాత సంపాదించి పెట్టాడుగా, ఇప్పుడు నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చో! ఇదిగో చెప్తున్నానొరే, నువ్వు నా మాట ప్రకారం మర్యాదగా కూలిపనికి రాలేదనుకో, ఇంక అప్పుడు నేనేం చేస్తానో చూస్తావు!" అని కేకలు వేసేవాడు. అలాంటప్పుడల్లా రత్నమ్మ కళ్ళలో నీళ్ళు తిరగ్గా "మనకు కొంచెం అమరిందంటే, నిన్నూ బడికి పంపిస్తాంలేరా. అందాకా మా పనిలో సాయం చేస్తా ఉందువు" అనేది. "దేవుడా దేవుడా! ఏదైనా మాయ చెయ్యి దేవుడా! నన్ను బడికి పంపించు" అని రోజూ దేవుడికి మొక్కుకునేవాడు బాలు. ఆ సంవత్సరం వానలు పడలేదు. పొలాలన్నీ బీళ్ళుగా ఉన్నాయి. కేసన్న-రత్నమ్మలకు అంతకు ముందు దొరికిన కొంచెం పని కూడా దొరకకుండా ఉంది. పట్నం వలసపోదామని కేసన్న- వద్దని రత్నమ్మ వాదులాడుకుంటున్నారు. ఊళ్ళో జనాలు గంగమ్మ పూజలు చేస్తున్నారు. రైతులందరూ ఆకాశం కేసే చూస్తూ రోజులు గడుపుతున్నారు తప్ప, మడకలు ముట్టుకున్నవారు లేరు. "దేవుడా దేవుడా! వానలు బాగా పడేట్లు చెయ్యి దేవుడా" అని దేవుడికి మొక్కుకున్నాడు బాలు. అంతలోనే అకస్మాత్తుగా దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు- "బాలూ! రోజూ మొక్కుకుంటున్నావు కదా, నీ కోరిక తీరుద్దామని వచ్చాను. అయితే మరి ఇవాళ్ళ నీ కోరిక మారింది. నేను ఏదైనా ఒక్క కోరికే తీరుస్తాను. చెప్పు" అన్నాడు. "వానలు పడేట్లు చెయ్యి స్వామీ. రైతులందరూ ఎంత కష్టపడుతున్నారో చూడు" అన్నాడు బాలు. "మరైతే నీ చదువు? బడికి పోతానని రోజూ అడిగావే, మరి?" అన్నాడు దేవుడు నవ్వుతూ. బాలు ఏమీ అనలేకపోయాడు. వాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "సరేలే! నీ కోరిక ప్రకారమే వాన పడేట్లు చేస్తున్నాను" అని దేవుడు మాయం అయిపోయాడు. మరుక్షణం ఎక్కడినుండో మేఘాలు వచ్చి కమ్ముకున్నాయి. సన్నగా వాన మొదలైంది. త్వరలోనే వర్షం జోరైంది. పల్లెలోని జనాలంతా ఆనందంగా నాట్యాలు చేశారు. ఎండిన నేలంతా పులకరించింది. చూస్తూ చూస్తూండగానే బాలు వాళ్ళ కొట్టం కూలిపోయింది. వాళ్లకున్న కాసింత ఆసరాకూడా పోయింది. కేసన్న, రత్నమ్మ, బాలు ముగ్గురూ తలమీద చేతులు పెట్టుకొని ఊళ్ళోకి పరుగు పెట్టారు. మరునాడు వాన వెలిశాక, ముగ్గురూ కూలిపోయిన ఇంటిలో కూరుకుపోయిన సామాన్లకోసం వెతుకుతుండగా ఒక దూలం కింద పాతకాలపు కుండ ఒకటి దొరికింది. దాని మూత విప్పి చూస్తే నిండా బంగారం, డబ్బు, నగలు! అవన్నీ వాళ్ళ పూర్వీకులవే, సందేహం లేదు! కేసన్న, రత్నమ్మ సంతోషంతో కొయ్యబారిపోయారు. తేరుకున్నాక, ఆ డబ్బుతో వాళ్ళొక మంచి ఇల్లు కట్టుకున్నారు. ఊళ్ళో బట్టల వ్యాపారం పెట్టుకున్నారు. బాలుని బడికి పంపించి చక్కగా చదివించారు. బాలు కోరిక నెరవేరింది! Courtesy.. kottapalli.in

గుర్రపు పిల్ల రెక్కలు

  గుర్రపు పిల్ల రెక్కలు అనగనగా ఒక ఊళ్ళో ఒక చలాకీ గుర్రపు పిల్ల ఉండేది. దాని పేరు జాకీ. దానికి వేగంగా దౌడు తీయడమన్నా, కొత్త ప్రదేశాలు చూడటమన్నా భలే సరదా. పరిగెడుతూ పోతే ఆకలి మాట కూడా గుర్తుకురాదు దానికి. కానీ వాళ్ళమ్మ దానిని ఊరి పొలిమేరలైనా ఎప్పుడూ దాటనిచ్చేది కాదు- ' పిల్లది దారి తప్పిపోతుందేమో ' అని భయం వాళ్ళమ్మకి. ఒక రోజు పగలంతా బుద్ధిగా ఉండి, మధ్యాహ్నం దాటాక కాస్త చల్లబడగానే ఊరి ప్రక్కనున్న అడవిలోకి వెళ్తానని చాలా బ్రతిమాలింది జాకీ. చివరికి ఒప్పుకున్నది వాళ్ళమ్మ, జాకీ ఆనందానికి హద్దులే లేవు. తనివితీరా అడవినంతా చుట్ట బెట్టే సరికి చీకటి పడబోతూ ఉంది. అప్పటికి గుర్తుకొచ్చింది- "చీకటి పడే లోపే ఇంటికొచ్చేస్తానమ్మా" అని తను అమ్మకిచ్చిన మాట. ఇక ఇంటి వైపుకు శక్తికొద్దీ వేగంగా పరుగెత్తింది జాకీ. అది ఇంటికి చేరేసరికి 'హమ్మయ్య' అనుకున్న వాళ్ళమ్మ, దానికి ఇష్టమైన పచ్చిగడ్డి పెట్టింది. అయితే అప్పటికే అలసట వల్ల కళ్ళు మూతలు పడుతున్నాయి జాకీకి. "ఎంత అందంగా ఉందో అడవి! దాన్ని చూడగానే ఆకలి తీరిపోయిందమ్మా" అని చెప్తూనే నిద్రపోయింది. ఆ రోజున కలత నిద్రలో జాకీకి ఒక అందమైన కల వచ్చింది: తనకు రెండు రెక్కలు వచ్చేసినట్లూ, వాటితో అది ఆకాశంలో ఎగురుతూ ఉన్నట్లూను! అది ఎగురుతుంటే క్రింద ఉన్న పశువులన్నీ తనను వింతగా చూస్తున్నాయంట, అట్లా పైన ఎగురుతూ క్రింద ఉన్న ఊళ్ళని చిన్నవిగా చూడటం భలే తమాషాగా ఉందిట దానికి. క్రొత్త క్రొత్త ప్రదేశాలు రోజూ బోలెడు చూడగల్గుతోందట, ఆ రెక్కల జాకీ. ఆకాశంలో గడ్డి ఉండదు కదా మరి? అందుకని క్రింద ఎక్కడైనా పచ్చటి పచ్చిక కనిపించగానే దిగి, కడుపు నిండా మేసి, చక్కగా ఎగిరిపోతోందిట. ఒక రోజున అది అలా మేస్తోంటే, క్రింద నుంచి దాన్ని రోజూ చూసి ఆశ్చర్యపోయే దూడల గుంపు చుట్టు ముట్టిందట దాన్ని. "నీ రెక్కల రహస్యం మాకూ చెప్పవా, దయచేసి?" అని అడిగాయవి దాన్ని. "ఔను కదా, ఇప్పటి వరకూ నేనూ ఆలోచించ లేదు, నాకీ రెక్కలెప్పుడొచ్చాయబ్బా?" అని కలలో ఆశ్చర్యపోయింది జాకీ. ఎంత ఆలోచించినా తనకు రెక్కలెట్లా వచ్చాయో దానికి గుర్తుకే రాలేదట. "ఉండండి, మా అమ్మ నడిగి చెప్తాను" అని కలలో అనేసి, నిజంగానే "అమ్మా, నాకీ రెక్కలెట్లా వచ్చాయమ్మా, ఎప్పుడు వచ్చాయమ్మా?" అని నిద్రలో కలవరించటం మొదలుపెట్టింది జాకీ. "కడుపు నిండా తిండి తినకుండా నిద్రపోతే రెక్కలైనా వస్తాయి, ఇంకేమైనా వస్తాయమ్మా" అని జాకీని నిద్రలేపి 'గడ్డి' పెట్టింది వాళ్ళమ్మ. - kottapalli.in సౌజన్యంతో

చదువుల కాలం

  చదువుల కాలం నేను తొందర్లో పెద్దగా ఐపోతానింక. అప్పుడు నీతో‌ మాట్లాడనే మాట్లాడను.." చెబుతున్నది చిన్ని ఎవరితోనో, ముందు గదిలో కూర్చొని. అమ్మ లోపల్నించి విన్నది. "అబ్బ! ఈ పాప నోరు ఊరుకోదు గదా!" విసుక్కున్నది- "ఎవరే చిన్నీ, ఎవరది?" అడిగింది పైకి. "నీ పేరేంటి?" అడుగుతోంది చిన్ని- "పేరేంటంటే ఏమీ చెప్పట్లేదు!" ఫిర్యాదు చేసింది గట్టిగా, అమ్మతో. అమ్మ చేతులు తుడుచుకుంటూ బయటికొచ్చి చూసింది. చిన్ని ఒక సూర్యకిరణంతో‌ మాట్లాడుతున్నది, దాని ప్రక్కనే కూర్చొని. "దీని పేరు సూర్య కిరణం. నాకు తెలుసు" అన్నది అమ్మ. "ఇది వెచ్చగా ఉంటుంది. దీనికి మాటలు రావు." "వచ్చు! ఇది రోజూ నాతో మాట్లాడుతూనే ఉంటుంది!" అన్నది చిన్ని అంత గట్టిగానూ. సూర్యకిరణం‌తనదారిన తను నేలమీద పడి కదలకుండా కూర్చున్నది. అమ్మ ఒక్క క్షణం అక్కడే నిలబడి సీరియస్‌గా చూసింది. మళ్ళీ చేస్తున్న పని గుర్తుకొచ్చి, లోపలికి వెళ్ళిపోయింది. అంతలో ఆ వెలుతురులోకి పాక్కుంటూ‌ వచ్చి కూర్చున్నది, ఒక చిన్న మఖ్మల్ పురుగు. దాని వీపంతా మెరుస్తోంది- మెత్తగా, ఎఱ్ఱగా. "ఓయ్! ఓయ్!పురుగూ!" అన్నది చిన్ని. సంతోషంతో దాని ముఖంలో వెలుగు పదింతలైంది. మెల్లగా, సున్నితంగా రెండు వ్రేళ్లతో‌ఆ ఆరుద్ర పురుగును ఎత్తి అరచేతిలో వేసుకున్నది. "ఏమ్మా! ఎక్కడ, మీ ఇల్లు? తప్పిపోయావా? చలి పుడుతోందా, నీక్కూడా? దుప్పటి కప్పనా?" అడిగింది. "ఉహుఁ..వద్దు. నా బొంత నాకున్నదిగదా, నా వీపు మీద?" అన్నది పురుగు, నవ్వుతూ. "మా ఇల్లు ఇక్కడే, కిటికీ ప్రక్కన పూలచెట్టులో. సూర్యకిరణం దారి చూపిస్తే వచ్చాను, నిన్ను కలిసేందుకే" అన్నదది, ముందుకి రెండడుగులు వేసి. "అవునా, ఊరికే దగ్గరకూర్చున్నట్లు కూర్చొని, ఈ కిరణం ఎంత పని చేసిందో‌ చూడు!" అన్నది చిన్ని, వాళ్ళమ్మ అన్నట్లు యాసపెట్టి. పురుగు నవ్వింది. "నేనైతే కదుల్తాను కదా, అందుకని నీ దగ్గరికి వచ్చాను. పాపం పూలచెట్టు నీకోసం ఎదురుచూస్తూ అక్కడే నిలబడి ఉంది. చెట్టు కదా, కదల్లేదు అది" చిన్ని పురుగును చేతబట్టుకొని గెంతుకుంటూ పూలచెట్టు దగ్గరికి వెళ్ళింది చిన్ని. పూలచెట్టు చిన్నినీ, పురుగునీ చూసి నవ్వింది- "పిల్చుకు రానే వచ్చావు!" అంది. "ఏం లేదు; ఇప్పటివరకూ నేను ఊరికెనే ఉన్నాను కదా, కొన్నాళ్ల తర్వాత పూయటం మొదలెడతాను. ఎన్నెన్ని పూలు ఇస్తానో, నిండుగా!నువ్వు నన్ను మర్చిపోయావా, ఏంటి? ఈమధ్య అసలు నా దగ్గరికే రాలేదు!?" అడిగిందది చిన్నిని. పురుగుని చెట్టు మొదట్లో వదిలి అన్నది చిన్ని-"మాకందరికీ ఒకటో క్లాసు పరీక్షలు కదమ్మా, బాగా చదూకోవాలి. అయినా అమ్మకి చెబుతానులే, మా ఫ్రెండు పూలచెట్టు పక్కన కూర్చొని పద్యాలూ అవీ చెప్పుకుందాం' అని! సరేనా?!" "అదే, నేననేది కూడా. మా దగ్గర కూచొని గట్టిగా చదూకుంటే కొంచెం మాక్కూడా చదువొస్తుంది కదా" అన్నది పురుగు. "వసంతంలో పూలచెట్లు ఎంత మంచి వాసనొస్తాయో తెలుసా? మా దగరకూచొని హాయిగా గడపొచ్చు ఈ చదువులకాలాన్ని!" అన్నది చెట్టు. "సూర్య కిరణమూ, పురుగూ, పూలచెట్టూ దగ్గర ఉంటే అసలు చలే పుట్టదు- చదువు కూడా చాలా బాగా వస్తుందటమ్మా" కేకలు పెట్టింది చిన్ని, బయటినుంచే. అమ్మ బదులిచ్చింది లోపల్నించే "ఎక్కడో ఒకచోట! నువ్వు ఈ నెలంతా చక్కగా చదువుకుంటానంటే నాకు అంతే చాలు!" అని. - kottapalli.in సౌజన్యంతో

పట్టుదల

     పట్టుదల   జాన్ గుటెన్‌బర్గ్ ముద్రణ యంత్రాన్ని కనుగొనక ముందు, ప్రపంచంలో పుస్తకాలన్నిటినీ చేత్తోటే రాయాల్సి వచ్చేది. పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు తమకు నచ్చిన గ్రంధాలను 'వ్రాయసగాళ్ళ' చేత చేత్తో రాయించి, ఆ వ్రాత ప్రతుల్నే తమకు నచ్చిన వాళ్ళకు బహుమతులుగా ఇస్తుండేవాళ్ళు. అయితే ఒకసారి ముద్రణ యంత్రాలు తయారవ్వటం మొదలెట్టాక, అవి ఇంక అన్ని దేశాలలోకీ మెరుపువేగంతో చొచ్చుకొని పోయాయి. దక్షిణాఫ్రికాలో గాంధీగారు పౌరహక్కుల కోసం గొడవ మొదలుపెట్టాక, అక్కడి 'భారతీయుల్ని ఒక్క త్రాటి మీదికి తేవటం ఎలాగ' అని ఆలోచించి, చివరికి 'ఇండియన్ ఓపీనియన్' అని ఓ పత్రికను మెదలెట్టారు. దానికి సంపాదకుడు, ప్రచురణ కర్తా రెండూ గాంధీగారే. అయితే అది పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉండేది. కొంతకాలం దాన్ని పైకి లాగేందుకు ప్రయత్నించిన తర్వాత గాంధీ గారికి అర్థమైంది- "పట్నంలో ఖర్చులెక్కువ- ఇక్కడ ఉంచి నడిపి, దాన్ని కాపాడే అవకాశం ఇంక లేదు" అని. ఆ సమయానికి గాంధీగారి మిత్రులంతా కలిసి జోహాన్నెస్‌బర్గులో 'ఫీనిక్స్ ఆశ్రమం' అని ఒకదాన్ని నడిపించేవాళ్ళు: రోడ్డుకి దూరంగా, ఎక్కడో విసిరేసినట్లు ఉండేదది! తన ప్రెస్సును అక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడు గాంధీ. అక్కడ ప్రెస్సుకు అవసరమైన కరెంటు లేదు; రవాణా సౌకర్యాలు అంతగాలేవు- దాంతో తెలిసిన వాళ్లంతా 'వద్దు' అన్నారు. 'అక్కడికి వెళ్తే శ్రమ మరింత ఎక్కువౌతుందమ్మా' అని చిలక్కి చెప్పినట్లు చెప్పారు. 'శ్రమ ఎక్కువైనా పర్లేదు- ఖర్చు మాత్రం తగ్గాలి' అన్నాడు గాంధీ. వాస్తవ పరిస్థితి కూడా అదే మరి! సరే, ఇంకేం చేస్తారు? అంతా కలిసి పట్నంలో ఉన్న ముద్రణశాలను, అందులోని యంత్రాలు- ఫర్నిచర్‌తో సహా- రవాణా చేసి, ఫీనిక్స్ ఆశ్రమంలో ఓ షెడ్డుకు చేర్చారు. ప్రెస్సును నడిపేందుకు ఓ పెద్ద ఆయిల్ ఇంజనును తీసుకొచ్చారు. దాన్ని ఆనుకొనే, మరో గదిలో గాంధీగారి ఆఫీసు.   ఆ శనివారం నాడు 'ఇండియన్ ఒపీనియన్'ను పోస్టు చేయాల్సి ఉందనగా, శుక్రవారం మధ్యాహ్నానికి గానీ ప్రెస్సులో అక్షరాలు కూర్చటం అవ్వలేదు. ఇక అటుపైన ఆశ్రమంలో ఉన్నవాళ్లు- ముసలీ, ముతకా, పిల్లా-పెద్ద, ఆడ-మగ అంతా పనిలోకి దిగారు. కొందరు అక్షరాలు సవరించే పని, కొందరు ముద్రించే పని- కొందరు కాయితాలను సైజుకి కత్తిరించే పని, పుస్తకాలు పిన్ చేసి, మడిచే పని, మరికొందరు అడ్రసులు రాసే పని, కొందరు మూటలు కట్టే పని- శుక్రవారం రాత్రంతా పని చేశారు అందరూ. అనుకున్నట్లుగానే, అక్కడ ముద్రణ కూడా ఏమంత సులభంగా జరగలేదు. ఆ రోజునే ఆయిల్ ఇంజన్ పాడైంది. ఎవరు ఏం చేసినా అది నడవలేదు! దాంతో గాంధీ గారితో పాటు మరికొందరు బలం ఉన్నవాళ్ళు దాని చక్రాన్ని చెరుకురసం యంత్రాన్ని త్రిప్పినట్లు రాత్రంతా చేతులతో తిప్పుతూ ముద్రణ కొనసాగించారు!    ఇట్లా పని చేసిన వీళ్లెవరూ పత్రిక ఉద్యోగులు కారు; ఎవ్వరికీ జీతాలు లేవు! అయినా అంతా శ్రమించారు; రైలు వచ్చే సమయానికి సంచీలను రైల్వే స్టేషనుకు చేర్చారు! ఆ వారమే కాదు, తర్వాత ప్రతి వారమూ అదే పనైంది: ప్రతి శుక్రవారమూ గాంధీ గారికి జాగరణ అయ్యింది. గాంధీగారు ఇంగ్లాండు చేరాక కూడా దక్షిణాఫ్రికా కష్టాలను మర్చిపోలేదు. ఉత్తరం రాశారు- "ఆశ్రమంలో ఉన్న ఆడవాళ్లంతా రోజూ 'ఫీనిక్స్ ప్రెస్'కి వెళ్తున్నారని ఆశిస్తాను- కనీసం శనివారం నాడైతే వెళ్తున్నారుగా? ఆదివారం నాడు పత్రికని మార్కెట్లో అందించాలి!" అని. తర్వాత మన దేశానికి వచ్చేశాక, మరో మూడు పత్రికలు నడిపారు గాంధీగారు: 'యంగ్ ఇండియా', 'నవ జీవన్', 'హరిజన్'- ఈ మూడు పత్రికలూ ఇదే తరహాలో నడిచాయి!    ఇంత కష్టపడి పత్రికలు ఎందుకు నడపాలి? "అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలువరించాలంటే, అవి వక్రీకరింపబడకుండా ఉండాలంటే, పత్రికలను మనకి మనం  నడిపించుకోవాల్సిందే! లేకపోతే కుదరదు. అవకాశం ఉంది కాబట్టి ముద్రణ శాలను వాడాం. అలాంటి అవకాశమే గనక లేకపోతే ఏం చేసేవాడిని, అన్నిటినీ వేటికవి చేత్తో రాయించి ఉండే వాడిని!" అన్నారు గాంధీగారు. అవసరమయ్యుంటే నిజంగానే అంత పనీ చేయించి ఉండేవాడు పెద్దాయన!  - kottapalli.in సౌజన్యంతో     

చిన్నారిలా ఓ కవిత

  చిన్నారిలా ఓ కవిత   విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ జపాన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిత్రుడి ఇంట ఆయన కవితా గానానికి ఏర్పాట్లు చేసారు. టాగోర్ తన ధోరణిలో కవితలు చదవడం మొదలుపెట్టారు. ఆయన గానం ఓ జలపాతంలా ఉంది.  అక్కడ ఉన్న వాళ్ళందరూ తమను మైమరచిపోయి ఆ కవితాఝరిలో స్నానం చేస్తున్నారు. ఇంతలో అక్కడ ఓ చిన్నారి అటూ ఇటూ పరుగులు తీస్తూ ఆడుకుంటోంది. టాగోర్ దృష్టి ఆ చిన్నారి మీద మళ్ళింది. ఆయన తన కవిత చదవడం ఆపి ఆ చిన్నారినే చూస్తున్నారు. అయితే కవితను వింటున్న ప్రేక్షకులు తమ ఆనందానికి అడ్డుగా వచ్చిన చిన్నారిపై రుసరుసలాడారు. మండిపడ్డారు. కొందరైతే ఆ చిన్నారిని అక్కడినుంచి బయటకు పంపే ప్రయత్నం చేసారు. అందుకు టాగోర్ అడ్డుపడ్డారు. పాపను ఆడుకోనివ్వమని మృదువైన ధోరణిలో చెప్పారు. ఆయన మాటతో ఆ చిన్నారిని ఏమీ చెయ్యలేకపోయారు. టాగోర్ అప్పటికప్పుడు చిన్నారిని దృష్టిలో ఉంచుకుని ఈ కింది కవిత  చదవడం ప్రారంభించారు.... ఓహో ఆ చిన్నారిలాంటి అందమైన ప్రకృతిసిద్ధమైన ఒక కవితను నేను రాయగల వాడినైతే....... అని చదువుకుపోతున్నారు. అంటే ఓ చిన్నారిలాంటి అందమైన సహజసిద్ధమైన ఒక కవితను రాయాలన్నది ఆయన కోరిక. ఆశ. నిజమైన సృష్టి కర్తలో ఉండవలసిన నిజమైన తపనే ఇది. చాలామందిలో ఆ తపన అలాగే ఉండిపోతోంది. ఎందుకంటే అటువంటి కవిత రాయడం అంత సులువైన పని కాదు. చిన్నారి అని అనగానే దానికో అందం ఉంటుంది. ఆ అందం ఎలా వస్తోంది? ఈ అందానికి మొదటి కారణం నవ్యత. ఒక్కో చిన్నారి ఓ నవ్యతను మిళితం చేసుకునే ఈ భూమ్మీదకు వస్తుంది. అందుకే అందం చిన్నారి సొంతం. ఆ తర్వాత చెప్పుకోవలసింది ఆ చిన్నారి చిన్న రూపం. భారీగా ఉండటం కన్నా చిన్నగా ఉండడంలోనే ఓ  అందం ఉంటుంది. పెద్దదాన్ని చిన్నది చేసి ఊహించండి. అందం దానంతట అది వచ్చేస్తుంది. చిన్నారి కూడా "ఓ పెద్ద" దాని తొలి రూపం. అందుకే అది అందంగా ఉంది. చిన్నారి ప్రతి కదలిక అందంగా అనిపిస్తుంది. కారణం అది సహజసిద్ధంగా చేస్తుంది దేనినైనా. అందులో కల్మషం ఉండదు. కపటం ఉండదు. నటన ఉండదు. అన్నీనూ తనకు తోచినట్టు చేసేస్తుంటుంది. చిన్నారి తనకేది కావాలనుకుంటుందో దానికేసి చెయ్యి చాస్తుంది. కానీ పెద్దలం అలా  చెయ్యలేం. కొన్ని కట్టుబాట్లు ఉంటాయి సామాజికంగా. చిన్నారి ఏడుపు వస్తే ఏడ్చేస్తుంది. నవ్వొస్తే నవ్వేస్తుంది. కానీ పెద్దవాళ్ళం చెప్పుకోవడానికి పెద్దోళ్ళమే... మనసారా ఏడవలేం... నవ్వలేం. సమయ సందర్భాలు చూసుకుంటాం. అప్పుడే ఏడవగలం. నవ్వగలం.మరొకటి గమనించవచ్చు. పెద్దలు ఏడుస్తున్నప్పుడు చిన్నారి నవ్వొచ్చు.పెద్దలం కొన్నిసార్లు అబద్దంగా ఏడవ వచ్చు. అలాగే అబద్దపు నవ్వూ నవ్వొచ్చు. కానీ చిన్నారికి అలాంటివి తెలియదు. అయినా వీటన్నింటికన్నా మరొక గొప్ప విషయం వారికుంది. పెద్దవాళ్ళమయ్యే కొద్దీ  మనలో చేరుకుంటూ పోయే మురికి, అసూయ వంటికి చిన్నారిలో ఉండవు. చిన్నారి పువ్వంత స్వచ్చంగా ఉంటుంది. ముత్యమంత స్వచ్చంగా ఉంటుంది. అందుకే దానికున్న అందం చూసేవారికీ హాయిగా ఉంటుంది. ఆ అందాన్నీ టాగోర్ చూసి పరవశించిపోయారు. చిన్నారి వైపే చూస్తూ చదవడం ఆపేశారు. చిన్నారి సహజసిద్ధంగా ప్రకృతిలా ఉంటుంది. పెద్దలలో కృత్రిమపాలు ఎక్కువ. చిన్నారి తనకు తోచినట్టు ప్రవర్తిస్తుంది. స్వతంత్రంగా తాను చెయ్యవలసిన పని చేసుకుపోతుంది. స్వతంత్రతే అందం. స్వతంత్రతే ప్రకృతి. అంతేకాదు. అంతకన్నా మరో మెట్టు పైనే ఉంది చిన్నారి లోకం. చిన్నారి నిష్కపట నవ్వు...అర్ధముందనుకున్న పెద్దల భాషకన్నా ఎంతో గొప్పది. అందమైనది. అందమైన  ఆ చిన్నారి భాషను పూర్తిగా అర్ధం చేసుకోలేకపోతున్నాం. అక్కడే మన లోపం ఉంది. ఆ అందంలో దాగిన రహస్యాలే మనల్ని ఆకట్టుకుంటాయి. కానీ మనం పైపైనే ఆ అందాన్ని ఆస్వాదిస్తున్నాం. పూర్తిగా చూస్తున్నాం అనుకుంటున్నాం గానీ చూడటం లేదు. ఇప్పుడు చెప్పండి. ఒక చిన్నారిలాంటి అందమైన కవితను సృష్టించడం సులభమేనా...కనుక టాగోర్ పెను నిట్టూర్పులో అర్ధముంది. ఓ చిన్నారిలాంటి ఒక కవితను రాయడం ఓ అపూర్వమైన సంఘటన. ఓ చిన్నారిలాంటి అందమైన కవిత పుట్టించాలంటే కవి ఏం చెయ్యాలి. అతను ఆమెగా మారాలి. అందుకు చదవాలి. చదువుతోపాటు ఆ రచనకు ఒక ప్రేమికుడు కావాలి. "ఆమె" అనే కవికి అనుభవమేగా చదువు చెప్పే ప్రేమికుడు. ఆ అనుభవమే కవిత పుట్టిస్తుంది. ఒక స్త్రీ పడే ప్రసవ వేదనలాంటి వేదన కవిత పుట్టుక సమయంలోనూ కవికి ఉండాలి. అప్పుడే కవి మనసు నుంచి పుట్టుకొచ్చే  కవితలోని అందం ఇతరులకీ అందమైన అనుభవాన్ని కలిగిస్తుంది. హాయినిస్తుంది. - యామిజాల జగదీశ్