ఉగాది పచ్చడి
ముందుగా అందరికీ "శ్రీ మన్మథ నామ" ఉగాది శుభాకాంక్షలు . ఉగాది రోజు చేసుకోవటానికి మామిడితో స్వీట్స్ , పులిహోర వంటివి నేర్చుకున్నాం. అసలు వంటకం గురించి చెప్పుకోకపోతే ఎలా? ఉగాది పచ్చడి సరిగ్గా కుదిరితే సంవత్సరమంతా బావుంటుంది అంటారు కదా... ఏ రుచి ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అందుకే కొలతలతో సహా ఇస్తున్నాం. రుచిగా చేసి ఆరగింపు పెట్టుకోండి.
కావలసిన పదార్థాలు:
మామిడి ముక్కలు ..... పావు కప్పు (చాలా సన్నగా తరగాలి)
కొత్త చింతపండు రసం ..... ఒక కప్పు (మరి చిక్కగా ఉండకూడదు )
బెల్లం తురుము ..... అర కప్పు
ఉప్ప ..... చిటికెడు
కారం ..... చిటికెడు
వేప పువ్వు ..... ఒక చెమ్చా
తయారీ విధానం:
ఆరు రుచులు వచ్చాయి కదా. ఈ రోజున అన్నీ కొత్తవి వాడాలి అంటారు. అందుకే కొత్త చింతపండుని చిన్న నిమ్మకాయ అంత తీసుకుని, ఒక కప్పు నీళ్ళల్లో నానబెట్టాలి. చింతపండు రసం మరీ చిక్కగా కానీ, మరి పలచగా కానీఉండకూడదు. ఆ రసంలో ముందుగా బెల్లం కోరు వేసి బాగా కలపాలి. బెల్లం కరిగాక , వేప పువ్వుని చేతితో చిదిమి వేయాలి. ఇప్పుడు మామిడిముక్కలు, ఉప్పు, కారం, వేసి కలిపితే ఉగాది పచ్చడి తయారు అయినట్టే.
టిప్: ఇప్పుడు మనం చెప్పుకున్నది ఆరు రుచులతో చేసిన పచ్చడి. ఇందులో చాలా మంది అరటిపండు, కొబ్బరి ముక్కలు, గుల్ల శనగపప్పు, వంటివి కలుపుతారు. ఇవన్నీ అదనపు రుచులు. కాబట్టి మీకు నచ్చిన రుచులని చేర్చుకోవచ్చు. ఏవి వేసినా ఎక్కువ కాకుండా చూసుకుంటే చాలు.
ఈ ఉగాది అందరి జీవితాలలో సుఖ సంతోషాలని తీసుకురావాలని కోరుకుంటోంది మీ తెలుగువన్. అందరికీ శ్రీ మన్మథ నామ ఉగాది శుభాకాంక్షలు...
-రమ
