షాహీ గోబీ
కావలసిన పదార్థాలు:
కాలీఫ్లవర్ ముక్కలు : 2 కప్పులు
కార్న్ ఫ్లోర్ : 1 చెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్ : అర చెంచా
ఉప్పు : తగినంత
మిరియాల పొడి : చిటికెడు
గ్రేవీ కోసం
బాదంపప్పులు : 12
టొమాటోలు : 2
ఉల్లిపాయ ముక్కలు : పావు కప్పు
తరిగిన కొత్తిమీర : 2 చెంచాలు
పాలు : పావు కప్పు
నిమ్మరసం : 1 చెంచా
చక్కెర : 1 చెంచా
నూనె : 1 చెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్ : అర చెంచా
కారం : 1 చెంచా
ధనియాల పొడి : 1 చెంచా
గరం మసాలా : అర చెంచా
పసుపు : చిటికెడు
నీళ్లు : అరకప్పు
తయారీ విధానం
ముందుగా పాలు, బాదం పప్పులు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టొమాటోలను కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓ బౌల్ లో కాలీఫ్లవర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. పది నిమిషాల తర్వాత ఈ ముక్కల్ని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఆపైన స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి మూత పెట్టాలి. రెండు మూడు నిమిషాలు ఉడికాక కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు చక్కెర వేసి కలపాలి. మరో మూడు నిమిషాలు ఉడికించాక పాలు-బాదం పేస్టును వేసి మళ్లీ మూత పెట్టేయాలి.
గ్రేవీ కాస్త చిక్కబడేవరకూ ఉడికించి కాలీఫ్లవర్ ముక్కలు, గరం మసాలా కూడా వేసి పది నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసి కలిపి దించేసుకోవాలి.
- Sameera
