రవ్వపులిహోర (దసరా స్పెషల్)
కావలసిన పదార్ధాలు :
బియ్యం రవ్వ - 1 గ్లాసు
నిమ్మకాయరసం - 4 చెంచాలు
వేరుశెనగగుళ్ళు - 1/4 కప్పు
శెనగపప్పు - 1/2 స్పూన్
మినపప్పు - 1/2 చెంచా
ఆవాలు, జీలకర్ర కలిపి - 1/2 చెంచా
నూనె - 8 లేదా 10 చెంచాలు
కరివేపాకు - 10 ఆకులు
పచ్చిమిరప, ఎండు మిరప కలిపి - 2 లేదా ౩
ఇంగువ - కొద్దిగా
ఉప్పు - 1 చెంచా
పసుపు - 1/2 చెంచా
తయారుచేసే విధానం :
* ముందుగా దళసరి గిన్నె తీసుకుని వేడి చేసి బియ్యం రవ్వ గ్లాసు అయితే 2 గ్లాసుల కొలతల ప్రకారం నీటిని వేడి చేసుకుని అందులో ఉప్పు, పసుపు కొద్దిగా నూనె వేసి ...నీళ్ళు సలసల మరుగుతున్నప్పుడు కొద్దికొద్ది రవ్వ పోస్తూ కలిపి మంట బాగా తగ్గించి మూతపెట్టాలి.
* ౩ నిమషాల తరువాత ఒక్కసారి రవ్వని బాగా కలిపి మరో ౩ ని" మూతపెట్టి ఉడికించాలి. నీటిలో నూనె వేస్తే రవ్వ ముద్ద కట్టకుండా పొడిపొడిగా వస్తుంది. పలుకు లేకుండా ఉడికించుకుని మరో 5ని "మగ్గనివ్వాలి.
* ఈ లోగ బాణలిలో మరోసారి పులిహోర పోపుకు తగినంత నూనెపోసి ముందుగా వేరుశెనగ గుళ్ళు వేసి కొద్దిగా దోరగా వేగే సమయానికి శెనగ, మినపప్పు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఆవగింజలు, జీలకర్ర ఒకదాని తరువాత ఒకటి వేసుకుంటూ దోరగా వేయిస్తూ... మంట ఆపే ముందు ఇంగువ కరివేపాకు వేసి పొయ్యి మీద నుండి మూకుడు దింపి కొద్దిగా చల్లారనివ్వాలి.... ముందుగా ఉడికించిన రవ్వను కొద్ది వెడల్పు గిన్నె (లేదా ) బేసినలో వేసి అందులో నిమ్మరసం కలిపి ఈ పోపును వేసి అట్లకాడతో పొడిపొడిలాడేలా.... తేలికగా కలుపుకోవాలి. ఈ రవ్వ పులిహోర చూడటానికి చాలా బావుంటుంది.
రవ్వ బజారులో దొరుకుతుంది.... కాకపోతే ఇంట్లో బియ్యం కడిగి పలుచని బట్టపై ఆరబెట్టి.... మిక్సీలో తేలిగ్గా తిప్పుతూ ఆపుతూ బియ్యం రవ్వ పదునుగా చేసుకోవచ్చు. చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. రవ్వను ఒక్కసారి జల్లిస్తే మొత్తని పిండి దిగిపోతుంది..... పై రవ్వను వాడుకోవాలి.
