ముల్లంగి - పెసరపప్పు సాంబార్
కావలసిన పదార్థాలు:
ముల్లంగి - ఒకటి
పెసరపప్పు - పావుకప్పు
ఉల్లిపాయ - ఒకటి
టొమాటో - ఒకటి
చింతపండు - నిమ్మకాయంత
బెల్లం తురుము - రెండు చెంచాలు
సాబారు పొడి - రెండు చెంచాలు
ఆవాలు - అరచెంచా
జీలకర్ర - అరచెంచా
ఎండు మిరపకాయలు - రెండు
నూనె - రెండు చెంచాలు
ఇంగువ - చిటికెడు
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
కరివేపాకు - ఒక రెమ్మ
తయారీ విధానం:
చింతపండు నీటిలో నానబెట్టాలి. పెసర పప్పును కుక్కర్ లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. ఉల్లిపాయ, టొమాటోలను ముక్కలుగా కోసుకోవాలి. ముల్లంగిని కాస్త పెద్ద ముక్కలుగా కోసుకుని, నీటిలో వేసి స్టౌ మీద పెట్టాలి. ముక్కలు సగం ఉడికాక ఉల్లిపాయ, టొమాటో ముక్కలను కూడా వేయాలి. ముక్కలన్నీ సాఫ్ట్ గా ఉడికాక పప్పు వేయాలి. రెండు నిమిషాలు ఉడికించాక చింతపండు రసం, ఉప్పు, సాంబారు పొడి, బెల్లం తురుము, పసుపు వేసి కలపాలి. మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీరు పోసి, మూత పెట్టేయాలి. సాంబారు బాగా ఉడికిన తరువాత దించేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. కాగాక ఆవాలు, జీలకర్ర వేయాలి. చిటపటలాడాక ఎండు మిర్చి వేయాలి. రంగు మారిన తరువాత కరివేపాకు, ఇంగువ కూడా వేయాలి. ఓ క్షణం పాటు వేయించి ఈ తాలింపును సాంబారులో వేసి కలిపేయాలి.
- Sameera
