కాజు కాకరకాయ
కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - రెండు
బంగాళాదుంప - ఒకటి
జీడిపప్పులు - పదిహేను
ఎండుమిర్చి - రెండు
ఆవాలు - పావు చెంచా
పచ్చిమిర్చి - ఒకటి
కారం - అరచెంచా
ధనియాల పొడి - అరచెంచా
జీలకర్ర పొడి - అరచెంచా
ఆమ్ చూర్ పౌడర్ - పావు చెంచా
నువ్వులు - ఒక చెంచా
ఎండుకొబ్బరి పొడి - ఒక చెంచా
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
తయారీ విధానం:
కాకరకాయలను చెక్కి, పొడవైన ముక్కలుగా కోసుకోవాలి. గింజలు తీసేసి, ఉప్పు నీటిలో అరగంట పాటు నానబెట్టాలి. తరువాత నీరు తీసేసి ఆరబెట్టాలి. బంగాళాదుంప చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి. వీటిని నూనెలో వేయించి పక్కన పెట్టాలి. కాకరకాయ ముక్కల్ని కూడా అలాగే వేయించి పక్కన పెట్టాలి. పచ్చిమిర్చి, ఎండిమిర్చిలను ముక్కలు చేసుకోవాలి. స్టౌ మీద మరో కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక ఆవాలు వేయాలి. చిటపటలాడాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, జీడిపప్పు వేయాలి. వేగిన తరువాత బంగాళాదుంప, కాకరకాయ ముక్కలు వేసి కలపాలి. ఆ తరువాత నువ్వులు తప్ప మిగతా పదార్థాలన్నిటినీ వేసి బాగా కలపాలి. రెండు మూడు నిమిషాల పాటు వేయించాక నువ్వులు చల్లి దించేసుకోవాలి.
- Sameera
