గోబీ పరోటా
కావలసిన పదార్థాలు:
పిండి కోసం:
గోధుమ పిండి - 2 కప్పులు
ఉప్పు - ½ టీ స్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
ఫిల్లింగ్ కోసం:
సన్నగా తురిమిన కాలీఫ్లవర్ - 1 కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు - ½ టేబుల్ స్పూన్
వాము - ½ టీ స్పూన్
ఉప్పు - ½ టీ స్పూన్
కారం - ½ టీ స్పూన్
కొత్తిమీర - ఒక కట్ట( సన్నగా తరగాలి)
తయారుచేసే విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో పిండి కోసం తీసుకున్న గోధుమ పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలప్పాలి. తరువాత నూనె కూడా వేసి 5 నిమిషాలు మృదువుగా మర్దించాలి. ఈ పిండిపై తడిగుడ్డ కప్పి, 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
2. తరువాత ఒక గిన్నెలో ఫిల్లింగ్ కోసం తీసుకున్న కాలీఫ్లవర్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వాము, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
3. తరువాత చపాతీ పిండిని నాలుగు భాగాలుగా చేసుకుని, ఒక భాగాన్ని మందపాటి పూరీలా వత్తుకోవాలి. ఈ పూరీకి మధ్యలో గుప్పెడు కాలీఫ్లవర్ తురుము పెట్టి అంచులు మూసివేయాలి. మిగిలిన చపాతీ పిండిని కూడా ఇలాగే ముద్దలు చేసుకోవాలి.
4. తరువాత ఒక చపాతీ పిండి ముద్ద తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా వత్తుకోవాలి.
5. ఇలా వత్తిన పరోటాలను నూనె వేసి రెండువైపులా ఎర్రగా కాల్చాలి. ఈ పరోటాలు పుదినా చట్నీతో గాని, టమాటో సాస్ తో గాని లేదా పెరుగుతో గాని బావుంటాయి.
