టేస్టీ బాకర్వాడిస్
ఎప్పుడూ జంతికలు, చేగోడీలు, మిక్స్చర్లేనా కాస్త వెరైటీ స్నాక్స్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. అందుకే పిల్లలు సెలవల్లో కాస్త కారం కారంగా, పుల్ల పుల్లగా ఉండే బారక్వాడిలు ఇంట్లోనే చేసి చూడండి. లొట్టలు వేసుకుంటూ మీ పిల్లలు తినకపోతే అప్పుడు చెపుదురు గాని నా పని.
కావాల్సిన పదార్థాలు:
సెనగ పిండి - 2 కప్పులు
గోధుమ పిండి - 1 కప్పు
ఉప్పు పసుపు కారం - కొద్దిగా
స్టఫ్ఫింగ్ కోసం:
జీలకర్ర - 1 స్పూన్
నువ్వులు - 1 స్పూన్
ధనియాలు - 1 స్పూన్
సోంఫు - 1 స్పూన్
గసగసాలు - 1 స్పూన్
మిరియాలు - 1/2 స్పూన్
పంచదార - 1/4 స్పూన్
తురిమిన కొబ్బరి - 2 స్పూన్స్
ఆమ్చూర్ పొడి - 1/2 స్పూన్
ఇంగువ - చిటికెడు
నూనే - సరిపడా
తయారి విధానం:
ఈ బారక్వాడిలు తయారు చేయటానికి ముందుగా ఒక బేసన తీసుకుని సెనగపిండి, గోధుమపిండి వేసి దానిలో ఉప్పు, కారం, ఇంగువ, చిటికెడు పసుపు వేసి, అందులో 3 చెంచాల నూనే వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి. మిక్సి గిన్నెలో జీలకర్ర, నువ్వులు, ధనియాలు, సోంఫు, గసగసాలు, మిరియాలు, పంచదార, తురిమిన పచ్చి కొబ్బరి వేసి పొడిలా ఆడించి పెట్టుకోవాలి. ఆ పొడిలో ఆమ్చూర్ పొడి, ఉప్పు, కొద్దిగా సెనగపిండి కలిపి ఉంచాలి. ఇప్పుడు చపాతి పిండిలా కలిపి పెట్టుకున్న దాన్ని రోటి మేకర్ పై చపాతిలా వత్తుకుని దాని మీద స్టఫ్ఫింగ్ పొడి కొంచం ఎక్కువగా చల్లి చపాతిని రౌండ్ గా రోల్ చేసుకుని అంచుని నీళ్ళతో అంటించుకోవాలి. అలా తయారయిన దాన్ని కాసేపు చేతితో వత్తుతూ ఉండాలి. అప్పుడు లోపల ఉన్న పిండి మిశ్రమం చపాతికి అంటుకుని నూనెలో వేయించేటప్పుడు బయటకి రాకుండా ఉంటుంది. ఆ రోల్ ని చిన్న చిన్న రౌండ్ పీస్ ల్లాగా కట్ చేసుకుని వేయించుకోవాలి. మనకి ఇష్టమైన ఆకారంలో కూడా కట్ చేసుకోవచ్చు. ఎర్రగా వేగిన బారక్వాడిలు రెడీ.
-కళ్యాణి
