భేల్ పూరీ
మా చిన్నప్పుడు ఆకలి అనగానే మరమరాలు ఒక ప్లేట్ లో పోసి ఇచ్చి తినమనేది అమ్మ. ఒకో సారి నాన్న తన సెలవు రోజున ఆ మరమరాలలో ఉల్లిపాయ, టమాట సన్నగా తరిగి , ఉప్పు , కారం వేసి నిమ్మకాయ పిండి ఇచ్చేవారు . ఇది సాయంత్రాలు సరదాగా తినే మా స్నాక్ ఐటమ్. ఇదే కాదు ..ఈ మరమరాలతో ఇంకో మంచి జ్ఞాపకం కూడా ..ముడి పడి వుంది. మా వైజాగ్ లో మూరిమిక్చర్ అని బీచ్ ఒడ్డున అమ్ముతారు . ఆ రుచి భలే వుంటుంది. మరమరాలలో పచ్చి మిర్చి, ఉల్లి పాయ ముక్కలు, కొంచం సన్న కారప్పూస , కలిపి నిమ్మకాయ రసం పిండి ఇస్తారు . ఆ మూరి మిక్చర్ తింటూ , సముద్రం లో వచ్చి పోయే అలలని చూడటం భలే వుంటుంది.
ఇంతకీ ఇంత కథ ఎందుకంటే ..ఇప్పుడు మా పిల్లలు ఆ మూరీలని తినాలంటే వాటిని భేల్ పూరి లా చేస్తే నే తింటారు. పెద్ద తేడా ఏమి లేదు . కొంచం గ్రీన్ చట్ని , స్వీట్ చట్ని కలిపితే అది భేల్ పూరి అయిపోతుంది. అదెలాగో చూద్దామా !
కావలసిన పదార్ధాలు
మరమరాలు -ఒక వంద గ్రాములు
ఉల్లి పాయలు -ఒక మూడు
పుదినా, కొత్తి మీరా - ఒక కట్ట
పచ్చి మిర్చి, -ఒక మూడు
చింతపండు -నిమ్మకాయంత
బెల్లంతురుము -మూడు చెంచాలు
సన్న కారప్పూస -50 గ్రాములు
ఉప్పు -రుచికి తగినంత
చాట్ మసాలా -అర చెంచా
తయారి విధానం
1. ఈ భేల్ పూరీ కి స్వీట్ చట్ని , స్వీట్ చట్ని ముందుగా చేసి పెట్టుకుంటే ఈ భేల్ పూరీ చేయటం క్షణాలలో అయపోతుంది.
2. కొత్తి మీరా , పుదీనా, పచ్చి మిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
౩. చింతపండు ని చిక్కటి రసం తీసి , తురిమిన బెల్లం తో కలిపి ఒక్క అయిదు నిమిషాల సేపు స్టవ్ మీద పెట్టి దించాలి. స్వీట్ చట్ని రెడీ అవుతుంది.
4. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో మరమరాలు తీసుకుని, వాటికి గ్రీన్ చట్ని, స్వీట్ చట్ని , సన్నగా తరిగిన ఉల్లి పాయలు , చాట్ మసాలా, సన్న కారప్పూస , చేర్చి బాగా కలపాలి. అన్ని బాగా కలిసాక ప్లేట్ లో కి సర్వ్ చేసి పయిన సన్నగా తరిగిన కొత్తి మీర వేసి ఇవ్వాలి .
ఇక ఈ భేల్ పూరి కి మీ పిల్లలకి నచ్చే ..కూరలు నుంచి, బూంది ల దాకా ఏమయినా చేర్చి చేసేయండి ..దానికో పేరు పెట్టేయండి. అలా ట్రై చేసినప్పుడు ..అది ఇలా చేసారో ఫోటో తో సహా మాకు రాసి పంపితే ..అందరితో పంచుకోవచ్చు .
..రమ
