మనబడికి ప్రతిష్టాత్మక NATA ఎక్సెలెన్సీ "విద్యాప్రదాయని" పురస్కారం!
గత 10 సంవత్సరాలలో అమెరికా వ్యాప్తంగా 35000 మంది విద్యార్ధులకు తెలుగు భాష నేర్పిస్తూ, తెలుగు భాషని ప్రాచీన భాషనుండి ప్రపంచ భాషగా తరువాతి తరానికి అందిస్తున్న సిలికానాంధ్ర మనబడికి, 'ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా), "విద్యా ప్రదాయని" పురస్కారం అందించింది. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన నాటా మెగా కన్వెన్షన్ వేదిక మీద నాటా అడ్వయిజరీ కౌన్సిల్ ఛైర్మన్ శ్రీ ప్రేం కుమార్ రెడ్డి గారు, అధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ రెడ్డి, తదుపరి అధ్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు తదితరుల చేతులమీదుగా మనబడి ఉపాధ్యక్షులు శ్రీ శరత్ వేట గారు ఈ పురస్కారం అందుకున్నారు.
తెలుగు భాష వ్యాప్తికి, మనబడి కార్యకలాపాలను గూర్చి ప్రత్యేక ఆడియో విజువల్ ని ప్రదర్శించి, మనబడి బృందం చేస్తున్న కృషిని అభినందించారు. తెలుగుభాషాభివృద్ధికై మనబడి సేవలను గుర్తించి ఇంతటి విశిష్ట పురస్కారాన్ని అందించినందుకు శరత్ వేట, NATA కుటుంబానికి మనః పూర్వక ధన్యవాదాలు తెలియజేసి, ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా శరత్ వేట మాట్లాడుతూ, అమెరికా వ్యాప్తంగా 250 పైగా కేంద్రాలలో 1200 మందికి పైగా ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు, భాషా సైనికుల సహకారంతో గత పది సంవత్సరాలకు పైగా అమెరికా, కెనడాలతో పాటు 10 ఇతర దేశాలలో 35,000 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు భాష నేర్పించామని, గత సంవత్సరం 9,000 కు పైగా విద్యార్థులు మనబడిలో నమోదు చేసుకున్నారని తెలిపారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ACS-WASC (Western of Association of Schools and Colleges) వారి గుర్తింపు పొందిన ఏకైక తెలుగు బోధనా విధానం సిలికానాంధ్ర మనబడి అని, భారత దేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన ఈ మనబడి విద్యా విధానానికి అమెరికాలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కు అర్హత కూడా లభిస్తోందని, తెలిపారు.
మనబడి సంచాలకులు ఫణి మాధవ్ కస్తూరి మాట్లాడుతూ సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరపు తరగతులు సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమౌతున్నాయని, నమోదు చేసుకోవడానికి http://manabadi.siliconandhra.org ద్వారా చేసుకోవచ్చని తెలిపారు. 'భాషాసేవయే భావితరాల సేవ ' అనే స్ఫూర్తితో సిలికానాంధ్ర మనబడి రేపటి తరాన్ని తెలుగు భాష సారధులుగా తీర్చిదిద్దడానికి అహర్నిశలూ కృషి చేస్తుందని అన్నారు.