లోకేష్ పాదయాత్ర.. జన ప్రభం‘జనం’

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి  జగన్  రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంట్రీయే అదిరిపోయింది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరులో సాగిన ఆయన పాదయాత్ర ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గం.. అంటే సీఎం వైయస్ జగన్ సొంత మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఇలాకాలో  జోరుగా, ఉత్సాహంతో  సాగుతోంది. అయితే ఏ నియోజకవర్గంలో లోకేశ్ అడుగు పెట్టినా.. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.

అయితే ప్రొద్దుటూరులో హూకిల్డ్ బాబాయి అంటూ తెలుగుదేశం  శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శించడం.. ఆ క్రమంలో లోకేశ్ సైతం వారి వద్ద నుంచి ప్లకార్డను తీసుకొని ప్రదర్శించడం... అధికార వైసీపీ శ్రేణులను కొంత ఇబ్బందికి  చేసింది. అయితే ఒకానొక సమయంలో ఆ ప్లకార్డుల ప్రదర్శన ఆపాలంటూ పోలీసులు రంగంలోకి దిగి... నారా లోకేశ్‌ను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ఆయన ససేమిరా అనడంతో ఇక చేసేది లేక ఖాకీలు వెనక్కి తగ్గారు. దీంతో తెలుగుదేశం   శ్రేణుల్లో  జోష్ పెరిగింది. 

ఇక జమ్మలమడుగు, ప్రొద్దుటూరులోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డిల అవినీతిపై నారా లోకేశ్ విసిరిన పంచ్‌లు.. టపాసుల్లా పేలాయి.  అలాగే జగన్ పాలనలో చోటు చేసుకొన్న విధ్వంసం.. టీడీపీ అధికారంలోకి వస్తే.. ప్రజా సంక్షేమం కోసం చేపట్టనున్న విధి విధానాలను లోకేశ్ ప్రజలకు  స్పష్టం చేస్తూ వస్తున్నారు. 

మరోవైపు రాయలసీమలో ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రలో.. ప్రజల కష్టాలు, కన్నీళ్లు, యువత ఆశలు, ఆశయాలపై  లోకేష్ ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చారని.. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీన కడపలో టీడీపీ అధికారంలోకి వస్తే.. రాయలసీమ ప్రజలకు ఎటువంటి పథకాలు అమలు చేస్తాము.. అలాగే యువత కు కల్పించే  ఉపాధి అవకాశాలు, అదే విధంగా రైతుల కోసం చేపట్టే పలు ప్రాజెక్టుల వివరాలను సైతం నారా లోకేష్ ప్రకటించనున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇంకోవైపు ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో టీడీపీ.. తన మేనిఫెస్టోని ప్రకటించింది. దీంతో ప్రజల్లో   క్లారిటీ అయితే వచ్చింది. ఇక లోకేశ్ రాయలసీమ వాసుల కోసం ప్రకటించే వరాలపై  ప్రజలు ఆసక్తితో ఉన్నారు.

ఇక నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే 1500 కిలోమీటర్లను పూర్తి చేసుకొని..  లక్ష్యం దిశగా వడి వడిగా సాగుతోంది. అలాగే లోకేశ్ విసురుతోన్న పంచ్‌లతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో దడ సైతం  పుట్టిస్తోంది. 

జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర ప్రారంభమైంది. అలా ప్రారంభమైన ఆయన పాదయాత్ర.. ఇటీవల రాజమహేంద్రవరం వేదికగా జరిగిన మహనాడు కోసం జస్ట్ నాలుగు రోజుల విరామం తీసుకున్నారు. అనంతరం నారా లోకేశ్ మళ్లీ.. తన పాదయాత్రను పున:ప్రారంభించారు.  ఆ క్రమంలో కడప జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు ప్రజలు పోటెత్తుతోన్నారు. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర నాలుగొందల రోజుల పాటు.. నాలుగు వేల కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ పాదయాత్రలో భాగంగా లోకేష్ ఇప్పటికే రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి చేసుకొని.. కడపలొ కొనసాగుతోంది. రేపో మాపో..  ఆ జిల్లాలో కూడా పూర్తి చేసుకొని... మరో జిల్లాల్లోకి దూసుకుపోనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu