ఏపీలో విద్యార్థులకు లాప్ టాప్..

అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యాశాఖకు సంబంధించిన కీలక అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జగనన్న అమ్మఒడి పథకం కింద 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించడానికి జగన్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఏర్పాటు, విజయనగరం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం జేఎన్టీయూ చట్టం-2008కి సవరణకు అంగీకారం తెలిపింది. మౌలిక సదుపాయల కల్పనకు రూ.5,990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం తెలిపింది. 2021-24 ఐటీ విధానానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్సుల కొనుగోలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఇప్పటికే కార్యాచరణ పూర్తవడంతో త్వరలోనే వెటర్నరీ అంబులెన్సులను కొనుగోలు చేయనుంది. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 28 లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీగా ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను మంత్రివర్గం ఆమోదించింది. టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి ఓకే చెప్పింది. 

కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చింటిన మంత్రివర్గం మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతిచ్చింది. రీసర్వే పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూహక్కు చట్ట సవరణకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. విశాఖ జిల్లా నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కు 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపింది. పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కింద నీటి సరఫరా కోసం తొలిదశ కింద ఎత్తిపోతల, గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారం తెలిపింది. వైద్యశాఖలో మౌలిక సదుపాయల కల్పనపై చర్చించిన మంత్రివర్గం రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News