మన దేశంలో న్యాయానికి ఒక లెక్క ఉంటుంది...

 

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధిలకు డిల్లీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అటువంటి నేరారోపణలు ఎదుర్కోవలసి వచ్చినందుకే సిగ్గుతో తల దించుకోవలసిన వారు, ఏదో ఘనకార్యం చేయడానికి బయలుదేరుతున్నట్లు మంది మార్బలాన్ని వెనకేసుకొని పాటియాలా హౌస్ కోర్టుకి తరలివెళ్ళడం, జైలుకి వెళ్ళవలసిన దుస్థితి కలిగినందుకు చింతించవలసిన వాళ్ళు బెయిలు మంజూరయినందుకు పండుగ చేసుకోవడం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. వారిలో సోనియా గాంధీకి బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా పేర్కొనబడిన మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పూచీకత్తు ఇవ్వడం మరో విశేషం. ఆ కేసులో ఆయన కోర్టులో హాజరు కావలసివచ్చినపుడు, సోనియా గాంధీ తదితరులు పాదయాత్ర చేసి ఆయనకు సంఘీబావం ప్రకటిస్తే, ఇప్పుడు ఆయన ఆ ఋణం తీర్చుకొంటున్నట్లుంది. ఇంత కాలం దేశాన్ని తమ కనుసైగలతో శాశించిన తమ అధిష్టాన దేవతలకి బెయిలు మంజూరు కావడంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకోవడం ఇంకా బాగుంది.

 

అయితే నేటి రాజకీయాలలో ఎంత పెద్ద నేరం చేసినప్పటికీ దానిని రాజకీయ కక్ష సాధింపులు ఖాతాలో వ్రాసుకొనే సదుపాయం ఒకటి ఏర్పడింది కనుక అటువంటి మహా నేతలకి, జననేతలకి వారి పార్టీలు, చివరికి చాలా మంది ప్రజలు కూడా నీరాజనాలు పట్టడం కూడా సర్వసాధారణమయిపోయింది. కనుక జరిగిన ఈరోజు డిల్లీ దర్బారులో జరిగిన ఈ సంఘటనలకి మరీ ఎక్కువగా ఆశ్చర్యపోనవసరం లేదు. డబ్బు, అధికారం, పరపతి, మంది మార్బలం అన్నీ ఉన్నవారు నేరం చేసినా అది ప్రజలకు ఒక వార్త అవుతోందే తప్ప నేరంగా చూడటం లేదు. ఎందుకంటే నేరం నిరూపించబడనంత వరకు మనం ఎవరినీ నేరస్తులనలేము. అలాగే వారి నేరం అప్పటికీ నిరూపించడం మన దేశంలో ఎన్నడూ సాధ్యం కాదు వారందరూ ఆణిముత్యాలే మనకి.

 

పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగా న్యాయంలో ఇటువంటి వారి కోసం "స్పెషల్  న్యాయం" మన దేశంలో అమలవుతున్నందుకు మనం అందరం చాలా సంతోషించాలి. 2జి, బొగ్గు కుంభకోణం, దాణా కుంభకోణం, అక్రమాస్తులు, హిట్ అండ్ రన్ కేసులు వంటి కేసులన్నిటిలో “స్పెషల్ న్యాయం” చేసుకోగలిగాము. ఇంకా మున్ముందు ఇలాగ న్యాయం చేసుకొంటూనే ఉంటామని స్పష్టం అయ్యింది కనుక అందుకు భారత్ ప్రజలందరూ చాలా సంతోషించాలి. తప్పదు.

 

ఎ. రాజా, కనిమోలి, లాలూ ప్రసాద్ యాదవ్ మొదలుకొని జయలలిత, సల్మాన్ ఖాన్ ఇప్పుడు సోనియా రాహుల్ గాంధీల వరకు అందరూ కూడా తమను తాము బాదితులుగానే చెప్పుకొంతున్నారు. ప్రజలు కూడా సవినయంగా అంగీకరిస్తున్నారు. అయితే ఈ బాధితులు అందరికీ న్యాయం చేకూర్చవలసిన బాధ్యత మన న్యాయస్థానాలపైనే ఉంది కనుకనే ఒకవేళ క్రింద కోర్టులో వారికి అన్యాయం జరిగినట్లయితే పై కోర్టులు వారికి న్యాయం చేస్తుంటాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో చివరికి న్యాయమే గెలుస్తుందని సోనియా గాంధీ అందుకే అన్నారేమో?

 

అంత పెద్దవాళ్ళు అంతమంది లాయర్లను అంతమంది అతిరధ మహారధులను కోర్టుకి వెంటబెట్టుకొని వస్తే వారిని ఇబ్బందిపెట్టడం భావ్యం కాదు కనుక కేవలం ఐదే ఐదు నిమిషాలలో బెయిలు మంజూరు చేసేసి సాదరంగా వారిని పంపించేసారు. మళ్ళీ రెండు నెలల వరకు కోర్టు గడప తొక్కనవసరం లేకుండా ఫిబ్రవరి 20వ తేదీకి కేసును వాయిదా వేసేశారు. బహుశః అప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందేమో? ఈ మాత్రం దానికి వాళ్ళని బలవంతంగా కోర్టుకి రప్పించడం దేనికో తెలియదని జనాలు గొణుకొంటే అది వారి అజ్ఞానమే తప్ప మరొకటి కాదని సరిపెట్టుకోవాలి. తప్పదు.