తెలంగాణాలో వైకాపా పునః ప్రవేశం అంతర్యం ఏమిటో
posted on Dec 8, 2014 7:22AM
రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణా నుండి బయటపడిన వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనే ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో అడుగుపెట్టబోతోంది. అయితే అందుకు అది ఎంచుకొన్న మార్గం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను భుజానికెత్తుకొన్న షర్మిల ఈరోజు నుండి రాష్ట్రంలో పరామర్శ యాత్రలు మొదలుపెట్టబోతున్నారు. మొదటి దశలో మెహబూబ్ నగర్ జిల్లాలో 13 నియోజక వర్గాలలో ఐదు రోజుల పాటు 921 కిలోమీటర్లు పర్యటిస్తారు. ఈ సందర్భంగా 9 నియోజక వర్గాలలో వైయస్స్ రాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు.
ఒక రాజకీయ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలోనయినా నిర్భయంగా తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకొనే స్వేచ్చను రాజ్యాంగం ప్రసాదించింది. అందుకోసం ఇటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు అవలంభించనవసరం లేదు. కనుక వైకాపా తెలంగాణా రాష్ట్రంలో తన కార్యకలాపాలు నిర్వహించుకోదలిస్తే ఆ పని నేరుగానే చేసుకోవచ్చును. కానీ ఆవిధంగా చేయకుండా ఎప్పుడో ఐదారేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను ఓదార్చే మిషతో పార్టీని బలోపేతం చేసుకోవాలనుకోవడం చాలా హాస్యాస్పదం.
ఒక వ్యక్తి చనిపోయిన ఐదారేళ్ళ తరువాత ఇప్పుడు షర్మిల వచ్చి వారిని ఓదార్చాలనుకోవడం, వారి కుటుంబానికి తన సోదరుడు జగనన్న అండగా ఉంటాడని హామీ ఇవ్వడం ఆ కుటుంబాలను పరిహసించడమే తప్ప మరొకటి కాదు. పోనీ చేసే ఆపనయినా మనస్పూర్తిగా చేయకుండా ఆ సాకుతో తెలంగాణాలో అడుగుపెట్టి అక్కడ వైకాపాను బలపరుచుకోవాలనుకోవడం చాలా దారుణమయిన ఆలోచన. ఆ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ షర్మిల చేయబోయే పరామర్శ యాత్రలతో తిరిగి తమ పార్టీ తెలంగాణాలో బలం పుంజుకొంటుందని, వచ్చే ఎన్నికలనాటికి తెలంగాణలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేస్తామని చెప్పడం ఈ పరామర్శ యాత్రల పరమార్ధం ఏమిటో స్పష్టంగా చెపుతోంది. మానవత్వంతో ఆలోచించేవారెవరికీ ఇటువంటి వికృతమయిన ఆలోచనలు కలగవు.
పార్టీని బలోపేతం చేసుకోదలిస్తే, ఆ బాధ్యత పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా తీసుకోవాలి. లేదా పార్టీకి చెందిన సీనియర్ నేతలెవరికయినా ఆ బాధ్యతలు అప్పగించాలి. ఇదివరకు ఆయన జైల్లో ఉన్నందున ఆయన తరపున షర్మిల పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేసారు. అందులో ఆమెను తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడయిన జగన్మోహన్ రెడ్డి బయటే తెలంగాణాకు చెందిన హైదరాబాద్ లోనే ఉన్నారు. అటువంటప్పుడు స్వయంగా ఆయన తెలంగాణాలో పర్యటించి పార్టీని బలపరిచే అవకాశం ఉన్నప్పటికీ, పార్టీతో ఎటువంటి సంబందమూ లేని షర్మిలను ఈ పరామర్శ యాత్రల పేరిట తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి పంపించడం దేనికంటే, బహుశః తెలంగాణా ప్రజల ఆగ్రహం ఎదుర్కోలేననే భయం కావచ్చును. లేదా అధికార తెరాసతో ఉన్న సత్సంబందాలు దెబ్బ తినకూడదనే ఆలోచన కావచ్చు లేదా మహిళ అయిన షర్మిలపై తెరాస, కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు విమర్శలు చేయలేవనే దురాలోచన కావచ్చు లేదా ఇంకేదయినా కావచ్చు. యుద్ధం చేసేందుకు గుండెల నిండా ధైర్యం ఉండాలని అది తనకు పుష్కలంగా ఉందని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి, ఈవిధంగా తన సోదరి షర్మిల ద్వారా తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆలోచించడం మరో దారుణమయిన ఆలోచన.
జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో అడుగుపెట్టేందుకే వెనుకాడుతున్నప్పుడు అతని తరపున షర్మిల ప్రజలకు ఏవిధంగా హామీలు ఇస్తున్నారు? ఏ హోదాతో ఇస్తున్నారు? ఇస్తే వాటిని అతను అమలుచేస్తారా? ఇటువంటి పార్టీని, అందునా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వైకాపాను తెలంగాణా ప్రజలు మళ్ళీ ఆదరిస్తారా అంటే అనుమానమే. అయినా తెలంగాణాలో ఎందుకు పునః ప్రవేశించాలనుకొంటోంది? దాని వెనుక మర్మమేమిటి? అని ప్రశ్నించుకొంటే వైకాపా చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం అవుతుంది.
చిత్తశుద్ధి, నిజాయితీ, మానవత్వం లేని ఇటువంటి ఆలోచనలు, పోరాటాల కారణంగానే వైకాపా తన విశ్వసనీయతను కోల్పోయింది. అయినప్పటికీ గతం నుండి ఎటువంటి గుణపాటాలు నేర్చుకోకుండా తన ధోరణిలోనే ముందుకు సాగిపోతోంది. అయితే అందుకు ఆ పార్టీలో ఎవరినీ నిందించడానికి ఏమీ లేదు. ఈవిధంగా పార్టీకి శల్యసారధ్యం చేస్తున్న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే తప్పుపట్టవలసి ఉంటుంది. అంతే.