వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌పార్టీ విజయవాడ లోక్‌సభ అభ్యర్ది దుట్టా?
posted on Jul 13, 2012 2:12PM
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ నియోజక వర్గం నుంచి వై.ఎస్.ఆర్, కాంగ్రెస్‌పార్టీ తరఫున హనుమాన్ జంక్షన్‌కు చెందిన డాక్టర్ దుట్టా రామచంద్రరావు పోటీ చేసే అవకాశం ఉంది. దివంగత వై.ఎస్. రాజశేఖర రెడ్డికి సన్నిహిత మిత్రుడైన దుట్టా రామచంద్రరావుకు ఈ మేరకు జగన్ స్పష్టమైన హామి ఇచ్చినట్లు తెలుస్తోంది. బి.సి. వర్గానికి చెందిన దట్టా రామచంద్రరావు వృత్తి రీత్యా వైద్యుడు. అయితే పేదలకు అతి తక్కువ ధరకే వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు.
నేషనల్ హైవే ` 5 విస్తరణ పనుల వల్ల కృష్ణాజిల్లాలో నివాశ ప్రాంతాలకు, పంటపొలాలకు నష్టం వాటిల్లుతుండడంతో నిరాహార దిక్షలు జరిపారు.స్ధానిక సమస్యలపై ఆయన ఎప్పుడు ప్రజలకు మద్దతుగా ఉండేవారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ తెలుగుదేశంలో ఉన్నప్పటికి ఏదో ఒకరోజు వై,ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం. గత లోక్ సభ ఎన్నికల్లో వంశీ కాంగ్రెస్ అభ్యర్ది లగడపాటి రాజగోపాల్‌పై పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్ళీ విజయవాడ నుంచి పోటీచేయడానికి ఇష్టపడడంలేదు. ఆయన గన్నవరం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో విజయవాడ లోక్‌సభ స్ధానం నుంచి డాక్టర్ దట్టా రామచంద్రరావును రంగంలోకి దింపడానికి జగన్ నిర్ణయించినట్లు తెలిసింది.