షర్మిల పార్టీకి వ్యూహకర్తగా పీకే ! పక్కా ప్లాన్ తోనే జగనన్న బాణం 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలన్న  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచింది.  జగనన్న బాణం షర్మిల తెలంగాణలో ఎందుకు పార్టీ పెడుతున్నారు.. షర్మిల కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉందా.. జగన్ తో విభేదించడం వల్లే ఆమె సొంత పార్టీ పెట్టుకుంటున్నారా అన్న చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు షర్మిల పార్టీ వెనుక బీజేపీ హైకమాండ్ ఉందని కొందరు.. కాదు కాదు అంతా కేసీఆర్ డైరెక్షన్ లోనే నడుస్తుందని మరికొందరు వాదిస్తున్నారు. కేసీఆర్ బాణమే షర్మిల అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించగా.. సీఎం కేసీఆర్‌ను కాపాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు..  షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ అన్నారు. గులాబీ నేతలు మాత్రం షర్మిల పార్టీ గురించి స్పందించడం లేదు. మంగళవారం మధ్యాహ్నం వరకు షర్మిలకు వ్యతిరేకంగా కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా... సాయంత్రానికి అంతా గప్ చుప్ అయ్యారు. తాము పెట్టిన పోస్టులను కూడా తొలగించారు. పార్టీ పెద్దల ఆదేశాలతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల విషయంలో  సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. 

ఎవరి వాదనలు ఎలా ఉన్నా  వైఎస్ షర్మిల పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీకి సంబంధించి సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.  2023 ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణలో ఆమె అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్ కు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ .. షర్మిల పార్టీకి కూడా వ్యూహకర్తగా ఉండనున్నారని చెబుతున్నారు. పీకే టీమ్ సేవలను తన కొత్త పార్టీ కోసం షర్మిల తీసుకుంటున్నట్టు సమాచారం. 2019 ఎన్నికలకు ముందు జగన్‌ చేత పాదయాత్ర చేయించడం, జగన్‌ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా కార్యక్రమాలు, సోషల్ మీడియా క్యాంపెయినింగ్  మొత్తం నడిపించింది ప్రశాంత్ కిశోరే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని 2019లో  అధికారంలోకి తీసుకురావడంలో ఆయనదే కీ రోల్ అని వైసీపీ నేతలే చెబుతారు. 
 
ఏపీ తరహాలోనే 2023లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి కూడా ప్రశాంత్ కిశోర్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయనున్నట్టు తెలిసింది.  జనవరి 8వ తేదీన ప్రశాంత్ కిశోర్ ప్రత్యేక విమానంలో వచ్చి అమరావతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆ సందర్భంగానే వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు మీద చర్చించినట్టు తెలిసింది. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న అభిమానులు, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు, కొత్త పార్టీ పెడితే ఎంతవరకు నెగ్గుకు రావొచ్చు, దానికి ఏమేం చేయాలనే అంశాలను పీకే, జగన్, షర్మిల చర్చించినట్టు సమాచారం. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అక్కడ ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగొచ్చని భావిస్తున్నారు. ఆ ఎన్నికలు పూర్తి కాగానే తెలంగాణకు వచ్చేస్తారని, షర్మిల కోసం పనిచేస్తారని తెలుస్తోంది. 

జగన్ తరహాలోనే షర్మిల కూడా తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారు. 106 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 2 వేల కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర ఉంటుందని షర్మిల వెంట ఉన్న తెలంగాణ నేత  కొండా రాఘవరెడ్డి ప్రకటించారు. అంతేకాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడైతే పాదయాత్ర ప్రారంభించారో... అక్కడే చేవెళ్ల నుంచే షర్మిల పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు. తెలంగాణలో పెట్టబోయే పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఎజెండాగా, ‘రాజ్యన్న రాజ్యం’ అనే కాన్సెప్ట్‌కు అనుగుణంగా షర్మిల  అడుగులు వేస్తున్నారు. పార్టీ పేరు, ఎజెండా, గుర్తులను త్వరలో ప్రకటించనున్నారు. మొత్తంగా పీకే టీమ్ డైరెక్షన్ లోనే తెలంగాణలో షర్మిల రాజకీయ గమనం ఉంటుందనేది పక్కాగా తెలుస్తోంది.