మనిషి జీవితం ఈ రెండు విషయాల మీదే ఆధారపడి ఉంటుంది!
posted on May 2, 2023 9:30AM
అతి సర్వత్రా వర్జయేత్.. అని పెద్దలు అన్నారు. ఏ విషయంలోనూ అతిగా ఉండకూడదు అని దీని అర్ధం. అతి భాష మతి హాని, మిత భాష ఎంతో హాయి.. అని కూడా అంటారు. అతిగా మాట్లాడితే బుర్ర పాడవుతుంది, అదే తక్కువగా మాట్లాడితే అన్నిటికి మంచిది అని అర్థం. అన్ని వేళలా 'అతి'ని విసర్జించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, మాట్లాడడం ఇలా అవసరాన్ని మించి చేసే ఏ పనైనాసరే ప్రమాదకరం అని గ్రహించాలి. మహాత్ములంతా మౌనంతోనే మహత్కార్యా లను సాధించారు.
మనం ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే 'నోటిని' అదుపులో పెట్టడం నేర్చుకోవాలి. అనవసరంగా మాట్లాడడం కట్టిపెట్టాలి. నోటిని అదుపులో ఉంచుకొంటే మనసును స్వాధీనంలో ఉంచుకున్నట్లే! అతిగా మాట్లాడడం వలన మనలో ఉన్న శక్తి వృథా అవుతుంది. కాబట్టి శక్తిని సమకూర్చుకోవాలి అంటే ఎక్కువ మాట్లాడటం తగ్గించాలి. అతిగా మాట్లాడడం చాలామంది బలహీనత ఖ్నే విషయం తెలిస్తే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. కానీ దానివల్ల కలిగే అనర్థాన్ని గ్రహించినా మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిలో కొందరుంటారు. అతిగా మాట్లాడటం వల్ల కలిగే నష్టాన్ని గ్రహించి దాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన చేస్తే అప్పుడు కొన్ని విషయాలు అందరికీ సహాయపడతాయి.
బలహీనులు 'అదృష్టాన్ని' నమ్ముకుంటారు. బలవంతులు 'ప్రయత్నాన్ని' నమ్ముకుంటారు. మరి మీరు ఈ రెండింటిలో దేన్ని నమ్ముకుంటారో మీరే నిర్ణయించుకోండి. అతిగా మాట్లాడటమే మీ బలహీనత అయితే అప్పుడు మీరు ఏ విషయంలోనూ సరైన ప్రయత్నం చేయలేరు.
నోటిని, మాటను అదుపులోపెట్టుకుంటే మనసును కూడా అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు..
అయితే.. మనసును నియంత్రించడం మానవులకే కాదు. దేవతలకు కూడా ఒక పెద్ద సమస్యే! శ్రీరాముడు కూడా మనసుని నియంత్రించడం ఎలాగో తెలుపమని వశిష్ఠులవారిని ప్రార్ధించాడు.
'నీరు' పల్లానికి పారడం ఎంత సహజమో, 'మనసు' విషయ వస్తువుల వైపు పరుగులు తీయడం అంతే సహజం. నీటిలో తడవకుండా ఈత నేర్చుకోలేం. చెడు ఆలోచనలు రాకుండా మనోనిగ్రహాన్ని సాధించలేం. కాబట్టి మనసులో చెడు ఆలోచనలు వస్తున్నాయని ఆందోళన పడకుండా ఈ క్రింది సూచనలు పాటించాలి.
మనసు తలుపును తలపులు తట్టినప్పుడు ఒక్కసారి ఆలోచించి తలుపు తెరవడం నేర్చుకోండి. అంటే ఏదైనా అనిపించగానే దాన్ని వెంటనే ఆ పని చేయడం, ఆ మాటను విశ్వసించడం చేయకూడదు. ముందు వెనుకా ఆలోచన చేయాలి.
చెడు తలపులు తెచ్చే తంటాలను ఒక్కసారి ఇమేజిన్ చేసుకోవాలి. దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో.. ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో ఊహించుకోవాలి.
మంచి ఆలోచన ఎప్పుడూ ఆరోగ్యకరమైన మనసుకు దోహదం చేస్తుంది. కాబట్టి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. మనసుని ప్రలోభపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. చెడు సావాసం, చెడు మాట, చెడు దారి జీవితంలో వైఫల్యానికి కారణాలు.
◆నిశ్శబ్ద.