ఇవి కూడా యోగాలో రకాలే!
posted on Jun 21, 2019 12:02PM
కాలచక్రం గిర్రున తిరిగి మళ్లీ మొదటికి వచ్చేసింది. ఒకప్పుడు మూఢనమ్మకంగా భావించే యోగాసనాలు వెనక అద్భుతమైన సైన్స్ ఉందంటూ ప్రపంచమంతా ఒప్పుకోక తప్పటట్లు లేదు. నిన్నమొన్నటి వరకూ పతజంలి అందించిన సూచనలకు అనుగుణంగానే యోగా సాగేది. కానీ పాశ్చాత్యులను ఆకర్షించడానికో, మారుతున్న జీవనశైలికి అనుగుణంగానో రకరకాల యోగాలు వస్తున్నాయి. వాటిలో కొన్ని ఇవిగో...
ACRO YOGA
ఏక్రోబయాటిక్స్నీ యోగానూ జతచేసి తయారుచేసిన యోగా ఇది. ఈ యోగాను చేయడానికి ఇద్దరు వ్యక్తులు ఉండాలి. అందులో ఒకరు స్థిరంగా ఉంటే, మరొకరు నేల మీద ఉన్న వ్యక్తిని పట్టుకుని విన్యాసాలు (acrobatics) చేస్తుంటారు. ఎప్పుడో తిరుమలై కృష్ణమాచార్యులవారు సరదాగా ఓ చిన్నపిల్లవాడితో చేసిన ప్రయోగమే ఈ ఏక్రోయోగాకి ఆరంభం అని చెబుతారు. కానీ ఈ ఏక్రోయోగా చాలా కష్టమైంది. ముందుగా శరీరాన్ని ఏక్రోబయాటిక్స్ని అనువుగా మార్చిన తర్వాతే ఇది సాధ్యమవుతుంది. పైగా ఇందులో పట్టుతప్పే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
BIKRAM YOGA
పశ్చిమబెంగాల్కు చెందిన విక్రమ్ చౌదరి తెలివైనవాడు. పాశ్చాత్య ప్రపంచం ఎప్పుడైతే యోగా వైపు చూస్తోందని గ్రహించాడో... ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. దానికి తనదైన ముద్రని జోడించాడు. బిక్రమ్ యోగాలో 90 నిమిషాల పాటు ఓ 26 యోగాసనాలను వేయవలసి ఉంటుంది. అయితే- ఆ సమయంలో గదిలోని వాతావరణం 35-42 డిగ్రీల వరకూ ఉండేలా చూస్తారు. భారతీయ వాతావరణాన్ని అనుసరించేందుకే ఈ ఏర్పాటు అంటాడు విక్రమ్ చౌదరి. అతని చేత సర్టిఫై చేయబడిన యోగా గురువులు మాత్రమే ఈ యోగాను నేర్పేందుకు అర్హులు. అయితే అత్యాచారం దగ్గర నుంచీ దాడి చేయడం దాకా ఈ గురువుగారి మీద చాలా కేసులు ఉండటం కొసమెరుపు.
FORREST YOGA
అమెరికాకు చెందిన ‘అన్నా ఫారెస్ట్’ ఓ ముప్ఫై ఏళ్ల క్రితం రూపొందించిన యోగా ఇది. పాశ్చాత్య యోగానీ, యోగా గురువులైన శివానంద వంటి వారి మార్పులనీ కలబోసి తనదైన శైలిలో ఈ యోగాను రూపొందించారు. ఆధునిక జీవన సమస్యలకు అనుగుణంగా ఈ యోగాకు మరికొన్ని విధానాలను జోడించారు. ఉదాహరణకు కంప్యూటర్ దగ్గర ఎక్కువగా పనిచేయడం వల్ల మణికట్టు, మెడ, భుజాల మీద అధిక భారం పడుతూ ఉంటుంది. ఈ సమస్యలను నివారించేందుకు ఆయా శరీర భాగాలకు సంబంధించి సరికొత్త ఆసనాలను రూపొందించారు.
CHAIR YOGA
యోగా చేయాలంటే శరీరం ఎంతోకొంత సహకరించాలి. దానికోసం నిర్దుష్టమైన సమయం, సందర్భం ఉండాలి. కానీ ఎవరైనా ఎక్కడైనా యోగా చేయలనుకుంటే సాధ్యం కాదా! అనే ప్రశ్నకు సమాధానమే కుర్చీ యోగా! లక్ష్మీ ఓల్కర్ అనే అమెరికన్ రూపొందించిన యోగా ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పండుముసలివారు సైతం యోగా చేసేలా, ఆఫీసులోని ఖాళీ సమయంలోనూ కాసిని ఆసనాలు వేసేలా ప్రేరేపిస్తోంది. ఇందులో ఇటు భారతీయ యోగశాస్త్రంతో పాటుగా అటు చైనా ధ్యాన భంగిమలూ కనిపిస్తాయి. ఈ కుర్చీ ఆసనాలు అన్నింటి మీదా లక్ష్మీగారికి పేటెంటు హక్కులని సాధించడం ఓ కొసమెరుపు-
- నిర్జర.