యోగా మంచిదే కానీ...

యోగా మంచిదే! ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ప్రతి శాస్త్రానికీ ఉన్నట్లే యోగాను ఆచరించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని కనుక విస్మరిస్తే ఇబ్బందులు తప్పవు. యోగాసనాలు వేయాలనుకునేవారు వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలను కూడా గుర్తుంచుకుంటే మంచిది.

 

గురుముఖత: యోగాసనాలు ఎలా వేయాలో చెప్పేందుకు సవాలక్ష మార్గాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డీవీడీలు, పుస్తకాలు, వెబ్‌సైట్లు, ఆఖరికి లైవ్‌ షోలు కూడా యోగాసనాల గురించి మార్గనిర్దేశనం చేస్తూ ఉంటాయి. కానీ యోగాను ఏదో కాలక్షేపంగా కాకుండా పూర్తి నిబద్ధతతో నేర్చుకోవాలనుకునేవారు మంచి యోగా గురువుని ఆశ్రయించడం మంచిది. దీని వల్ల భంగిమల్లో మనం చేసే చిన్న చిన్న తప్పులను వారు నివారించే అవకాశం ఎలాగూ ఉంటుంది. పైగా మన వ్యక్తిత్వం, జీవనశైలి, ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా గురువులు తగిన యోగాసనాలను వ్యక్తిగత శ్రద్ధతో నేర్పించే అవకాశం ఉంటుంది.

ఆహారం: యోగా నేర్చుకునేటప్పుడు వీలైనంత సాత్విక ఆహారం, మరింతగా మంచినీరు తీసుకోవాలి. శరీరాన్ని త్వరగా స్వస్థత పరిచేందుకు, మలినాలను తొలగించేందుకు ఇది చాలా అవసరం. కానీ భోజనం చేసిన వెంటనే యోగాసనాలు వేయడం ఏమాత్రం మంచిది కాదు. దీనికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి- యోగాసనాలు ఎప్పుడూ కూడా రక్తప్రసారం మీదే ఆధారపడతాయి. భోజనం చేశాక రక్తప్రసారం అంతా కూడా జీర్ణవ్యవస్థ వద్ద కేంద్రీకృతం అవుతుంది కాబట్టి, అసలుకే మోసం వస్తుంది. రెండు- యోగాసనాలలో ఎక్కువ శాతం ఉదరభాగం మీద ఆధారపడి ఉంటాయి కనుక, పొట్ట మీద అదనపు భారం మోపినట్లు అవుతుంది. వజ్రాసనం వంటి ఒకటి రెండు ఆసనాలకే ఇందుకు మినహాయింపు ఉంది.

 

ఆరోగ్యం: కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఆసనాలకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు గుండెజబ్బులు ఉన్నవారు శీర్షాసనానికి దూరంగా ఉండాలి. అలాగే ఆస్తమా, రక్తపోటు, స్పాండిలైటిస్ ఉన్నవారు గురువుల సలహా మేరకే ఆసనాలను వేయాలి. ఇక గర్భిణీ స్త్రీలు, రుతుక్రమంలో ఉన్నవారు, జ్వరంతో బాధపడుతున్నవారు.... ఇలా శరీర స్థితిని బట్టి కూడా ఆసనాల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

 

ప్రాణాయామం: ఆసనాల విషయంలో ఎంత జాగ్రత్తను వహిస్తామో ప్రాణాయామం విషయంలో అంతే జాగ్రత్తను తీసుకోవలసి ఉంటుంది. గాలి, వెలుతురు, వాతావరణం... ప్రాణాయామం చేసేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మన ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా చేయాల్సిన ప్రాణాయామం మారుతుంది. ఉదాహరణకు అధిక రక్తపోటు ఉన్నవారు కపాలభాతిని చేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే!

 

తొందరపాటు: యోగాను నేర్చుకోవడం మొదలుపెట్టగానే త్వరత్వరగా ఆసాంతం నేర్చేసుకోవాలన్న తొందర చాలామందికి ఉంటుంది. అందుకనే శరీరం పూర్తిగా అలవాటు పడకుండానే త్వరత్వరగా ఆసనాలను వేయడం, ప్రారంభంలోనే కష్టమైన ఆసనాలను ప్రయత్నించడం చేస్తుంటారు. వీటి వల్ల కాళ్లు బెణకడం దగ్గర నుంచి వెన్ను దెబ్బతినడం వరకూ ఏ ప్రమాదమైన సంభవించవచ్చు. ‘ఆసనాలు వేశాం కదా, అదే సర్దుకుంటుందిలే’ అని తేలికగా తీసుకోకుండా, వాటిని ఆచరించే సమయంలో ఏదన్నా సమస్య తలెత్తితే వెంటనే వైద్యుని సంప్రదించాలి.

- నిర్జర.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News