బ్రెడ్‌తో క్యాన్సర్... ఎంతవరకూ నిజం!
posted on Oct 12, 2020 9:30AM
ఏదన్నా ఆహారపదార్థం గురించి వార్త రానంతవరకూ దానిని విచక్షణారహితంగా వాడేయటం, ఏదో ఒక వార్త రాగానే బెంబేలెత్తిపోవడం వినియోగదారులకు ఉండే అలవాటే! దానికి గొప్ప ఉదాహరణగా నూడిల్స్ గురించి చెప్పుకోవచ్చు. మ్యాగీ వంటి ప్రముఖ బ్రాండ్ నూడిల్స్‌లో సైతం MSG అనే ప్రమాదకరమైన రసాయనం ఉందని తెలియగానే దేశం నూడిల్స్ ఉడికినట్లు ఉడికిపోయింది. ఇప్పుడు తాజాగా బ్రెడ్‌ల గురించి కూడా వస్తున్న ఇలాంటి వార్తలు భారతీయులని కలవరపరుస్తున్నాయి.
వివాదం ఏమిటి!
దిల్లీకి చెందిన CSE అనే ఓ సంస్థ చేసిన పరిశోధనే ప్రస్తుత వివాదానికి కారణం. CSE చెబుతున్న వివరాల ప్రకారం, దిల్లీలో సేకరించిన దాదాపు 38 రకాల బ్రెడ్ నమూనాలలో దాదాపు 84 శాతం నమూనాలలో ప్రమాదకరమైన పొటాషియం బ్రోమైట్, అయోడైట్ అనే పదార్థాలు కనిపించాయి. ఈ నమూనాలు ఎక్కడో మారుమూల ఉన్న బేకరీల్లోంచి సేకరించినవి కావు. బ్రిటానియా దగ్గర్నుంచీ KFC వరకూ ప్రఖ్యాత బ్రాండ్లకు సంబంధించిన నమూనాలు కూడా ఈ పరీక్షలో తేలిపోయాయి.
ఎందుకువాడతారు!
బ్రెడ్ కోసం కలిపిన పిండి చక్కగా సాగేందుకు, బ్రెడ్ ఉబ్బెత్తుగా వచ్చేందుకు, మంచి రుచితో ఉండేందుకు ఈ పదార్థాలను వాడతారు. నిజానికి బ్రెడ్ లేదా బేకరీ పదార్థాల తయారీలో వీటిని ఉపయోగించకూడదన్న చట్టమేమీ మన దేశంలో లేదు. కాకపోతే ఒక మోతాదు మేరకే వీటిని వాడాలన్న నిబంధనలు మాత్రం ఉన్నాయి. ఉదాహరణకు బ్రెడ్ తయారీలో 50 PPM వరకూ ఈ పదార్థాలను వాడవచ్చన్న నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారమే తాము బ్రెడ్‌లను ఉత్పత్తి చేస్తున్నామని ఉత్పత్తిదారులు చెబుతున్నారు
సమస్య ఏమిటి!
ఉత్పత్తిదారులు చెబుతున్న మాట వాస్తవమే. బ్రెడ్ తయారు చేసే సమయంలో పొటాషియం బ్రొమైట్‌ను కలపినా కూడా ఉత్పత్తి దశలో అది పొటాషియం బ్రోమైడ్‌గా మారిపోతుంది. బ్రోమైడ్ ఏమంత హానికారక పదార్థం కాదు. కానీ అలా జరగకపోవడమే అసలు సమస్య. CSE అందించిన గణాంకాల ప్రకారం... ప్యాక్ చేసిన బ్రెడ్‌లో కూడా పొటాషియం బ్రోమైట్ ఆనవాళ్లు శుభ్రంగా కనిపిస్తున్నాయి. బ్రెడ్‌ను ఉత్పత్తి చేసే సమయంలో లోపాలు ఉండటం, బ్రెడ్ మరింత ఉబ్బెత్తుగా కనిపించడం కోసం కక్కుర్తి పడి ఎక్కువ పాళ్లు కలపడంతో.... మన చేతిలో ఉండే బ్రెడ్‌లో కూడా బ్రోమైట్ ఉంటోంది.
బ్రోమైట్ ఉంటే ఏంటట!
బ్రోమైట్ గురించిన భయాలు ఈనాటివి కావు. బ్రోమైట్ ఒక క్యాన్సర్ కారకమంటూ దశాబ్దాల తరబడి పరిశోధనలు చెబుతున్నాయి. కిడ్నీ, థైరాయిడ్ వంటి అనేక క్యాన్సర్లను ఇది కలిగించే ప్రమాదం ఉందంటూ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందుకనే ఆస్ట్రేలియా మొదలుకొని బ్రెజిల్ వరకూ దీనిని ఆహారపదార్థాల తయారీలో వాడవద్దంటూ నిషేధించారు. అంతదాకా ఎందుకు? మన పక్కనే ఉన్న శ్రీలంక, చైనాలలో సైతం ఈ నిషేధం అమలులో ఉంది. కానీ నిరంతరం తన నిర్ణయాల కోసం అమెరికా వైపు చూసే మన దేశం మాత్రం, అక్కడిలాగే ఇక్కడ కూడా బ్రోమైట్ గురించి చూసీ చూడనట్లు ఉండిపోయింది. ఇక అయోడైట్ గురించి కూడా ఇలాంటి భయాలే ఉన్నాయి. థైరాయిడ్ పనితీరుని అయోడైట్ దారుణంగా ప్రభావంతం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఇప్పుడేం చేసేది!
బ్రోమైట్ క్యాన్సర్ కారకం అన్న మాట నిజమే కానీ... దానిని ఎలా, ఏ స్థాయిలో తీసుకుంటే క్యాన్సర్ కారకమో అన్న విషయం మీద స్పష్టత లేదు. పైగా ఇక నుంచి బ్రెడ్ ఉత్పత్తిలో బ్రోమైట్‌ను నిషేధిస్తామంటూ Food Safety Standards Association of India (FSSAI) ప్రకటించింది. దీంతో ప్రస్తుతానికి ఈ వివాదానికి తెరపడినట్లే. కానీ మొన్నటి వరకూ నూడిల్స్, ఇప్పుడు బ్రెడ్‌కు సంబంధించిన వివాదాలతో మనకు ఓ పాఠం తెలిసొచ్చినట్లు అయ్యింది. ఆరోగ్యకరమైన, అందుబాటులో ఉండే పళ్లు, కూరగాయల వంటి ఆహారాన్ని కాదని... బద్ధకంతోనో, జిహ్వచాపల్యంతోనో, గొప్ప కోసమో కృత్రిమమైన ఆహారం మీద ఆధారపడితే, అది ఎప్పటికైనా, ఎలాగైనా ఆరోగ్యానికి నష్టం కలిగించక మానదు. మరమరాల దగ్గర్నుంచీ మినప బజ్జీల వరకు మన సాంప్రదాయకమైన ఆహారాలు ఇన్ని ఉండగా పాశ్చాత్య ధోరణుల కోసం పాకులాడితే బొక్కబోర్లా పడకా తప్పదు.