యాంటీబయాటిక్స్‌ వాడితే మతిస్థిమితం తప్పుతుందా!

ఒంట్లో బాగోలేనప్పుడు యాంటీబయాటిక్స్‌ అవసరాన్ని కాదనలేరు. పంటినొప్పి దగ్గర్నుంచీ కేన్సర్‌ వరకూ యాంటీబయాటిక్స్‌ లేకుండా మన చికిత్సా విధానాలే లేవు. ఒకరకంగా చెప్పాలంటే యాంటీబయాటిక్స్‌ మన వైద్యవిధానాన్నీ, దాంతోపాటు మన జీవితాన్నీ కూడా సమూలంగా మార్చేశాయి. యాంటీబయాటిక్స్‌ లేనిరోజుల్లో చిన్నపాటి చెవిపోటుకే మనుషులు చనిపోయే సందర్భాలు ఉండేవి. అయితే రోజులు మారుతున్న కొద్దీ యాంటీబయాటిక్స వాడకం పెరిగిపోతోంది. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్‌ను వాడేయడం, ఒకోసారి డాక్టరుని సంప్రదించకుండానే వాటిని పుచ్చుకోవడం సహజం అయిపోతోంది. ఇలా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ను వాడటం వల్ల లేనిపోని పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. శరీరం తనను తాను బాగుచేసుకునే సహజసిద్ధమైన గుణం ఎలాగూ చెడుతుంది... యాంటీబయాటిక్స్‌ వాడకం వల్ల ఇతరత్రా ప్రమాదాలు కూడా ఉన్నాయంటూ రోజుకో నివేదిక బయటపడుతోంది.


యాంటీబయాటిక్స్‌ను తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుందన్న విషయం తెలియందేమీ కాదు. అయితే ఇలా మంచి బ్యాక్టీరియా నష్టపోవడం వల్ల ఏకంగా మెదడుకే ఎసరు వస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇన్నాళ్లూ శరీరం అనేది ఒక యంత్రం అనీ... అందులో ఈ మూల ఉండే పేగులకీ, ఎక్కడో పైన ఉండే మెదడుకీ అంతగా సంబంధం లేదనీ చాలామంది వైద్యులు సైతం భావిస్తూ వచ్చారు. కానీ జీర్ణవ్యవస్థలో ఉండే కొన్ని పరిస్థితులు మన మెదడుని కూడా ప్రభావితం చేస్తాయని నిదానంగా తేల్తోంది. బహుశా ఈ విషయం రుజువైతే ఆహారానికీ, ఆలోచనకూ సంబంధం ఉందని వేల ఏళ్లుగా ఆయుర్వేద వైద్యులు చెబుతున్న మాట నిజమవుతుందేమో!
 

యాంటీబయాటిక్స్ వాడిన రోగుల్లో మెదడు పనితీరుని గమనించేందుకు పరిశోధకులు దాదాపు 400 మంది వివరాలను పరిశీలించారు. మనం తరచూ వాడే సిప్రాఫ్లొక్సాసిన్‌ సహా 54 రకాల యాంటీబయాటిక్స్ పనితీరుని వీరు గమనించారు. ఈ యాంటీబయాటిక్స్‌ను తీసుకున్న 47 శాతం మందిలో, మానసికమైన వికారాలు ఏర్పడ్డాయట. వీరిలో ఉద్రేకం, భ్రాంతి, అయోమయం, మూర్ఛ వంటి సమస్యలు కలిగాయంటున్నారు బోస్టన్‌కు చెందిన షమిక్‌ భట్టాచార్య అనే పరిశోధకుడు. ఇక యాంటీబయాటిక్స్‌ను తీసుకున్నాక మెదడు పనితీరు ఎలా ఉంటుందో గ్రహించేందుకు EEG తీసిన వైద్యులకీ ఇలాంటి ఫలితాలే కనిపించాయి. యాంటీబయాటిక్స్‌ వాడిన దాదాపు 70 మంది మెదడులో అసహజమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సదరు EEGలు నిర్ధారించాయి.


చాలా సందర్భాలలో యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని ఆపవేసిన వెంటనే రోగులు తిరిగి మామూలు స్థితికి చేరుకున్నారు. కానీ మరికొందరిలో కిడ్నీలు దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తేలింది. ఈ పరిశోధనలన్నీ గమనించిన తరువాత అసలు యాంటీబయాటిక్స్‌ వాడకం గురించే భయం ఏర్పడం సహజం. కానీ యాంటీబయాటిక్స్‌ నిజంగా మన ప్రాణాల్ని కాపాడే ఆయుధాలని గుర్తుంచుకోవాలి. ఆయుధాలని ఎలాగైతే విచక్షణారహితంగా వాడితే ప్రమాదమో యాంటీబయాటిక్స్‌ కూడా అంతే! దీర్ఘకాలికంగా, వైద్యుని పర్యవేక్షణ లేకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా యాంటీబయాటిక్స్‌ను వాడితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు.

- నిర్జర.